headerbanner

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-07 | Issue-10 | September 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. నేదునూరి గంగాధరం ‘పండుగలు - పరమార్థములు’ ఇతివృత్తం: నేటి స్థితిగతులు

డా. నారగోని సైదులు

తెలుగు అతిథి అధ్యాపకులు
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
మహబూబ్‌ నగర్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9490585645, Email: saidulu645@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.08.2026        ఎంపిక (D.O.A): 30.08.2026        ప్రచురణ (D.O.P): 01.09.2026


వ్యాససంగ్రహం:

ప్రస్తుత పరిశోధన వ్యాసం తెలుగు జానపదసాహిత్యంలో వాఙ్మయోద్ధారకుడుగా పేరుగాంచిన నేదునూరి గంగాధరం రచించిన పండుగలు – పరమార్థములు పుస్తకంలో పేర్కొనబడిన పండుగలు, వాటి పరమార్థములు, ఆచరణలు, పాటల్లోని ఇతివృత్తాన్ని సమగ్రంగా విశ్లేషిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న పల్లె ప్రజలు తరతరాలుగా జరుపుకుంటున్న పండుగలపై క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి, పండుగల అర్థాలు, వాటి వెనకున్న చరిత్ర, పండుగ సమయాల్లో పాటిస్తున్న ఆచరణలు, పాటలను సేకరించి ‘పండుగలు-పరమార్థములు’ పేరుతో 1956వ సంవత్సరంలో నేదునూరి వారు పుస్తకం వెలువరించారు. ప్రాచీనకాలం మొదలుకొని ఈనాటి కాలం వరకు వెలువడిన గ్రంథాలు గానీ, మతాలు గానీ, భాషలు గానీ కాలానుగుణంగా మారుతాయేమో గానీ, ప్రకృతి అందించిన జీవన సాహిత్యం మాత్రం ఆ సూర్యచంద్రుల వలె ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆ జీవన సాహిత్యమే భారతీయులు, తెలుగుప్రజలు జరుపుకునే పండుగలు, వ్రతాలు, ఉత్సవాలని నేదునూరి వారు పండుగల ప్రాధాన్యతను తెలియజేశారు. ప్రాచీనసాహిత్యానికి శాసనాలు సాక్ష్యాలయితే, జానపదసాహిత్యానికి పాశ్చాత్యులు, భారతీయులు, తెలుగు జానపద సాహితీవేత్తలు ఊరూరా తిరిగి సేకరించి ముద్రించిన పుస్తకాలే ఆధార గ్రంథాలు. అటువంటి విలువైన గ్రంథాలను ఎన్నింటినో వెలువరించి తన జీవితాన్ని, ఆస్తిని జానపద సాహిత్య సేకరణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి, పరిశోధకుడు, సాహిత్య జ్యోతి, జానపద వాఙ్మయ భిక్షువు నేదునూరి గంగాధరం గారు. వీరు రచించిన ‘పండుగలు – పరమార్థములు’ ఇతివృత్తం ప్రకారం ఆనాడు పల్లెల్లో నివసించిన జానపదులు పండుగలను ఏ విధంగా జరుపుకునేవారు?, నేడు ఏ విధంగా పండుగలను జరుపుకుంటున్నారు?, ఆ రోజుల్లో పండుగల్లో దాగున్న పరమార్థాన్ని ఎలా వ్యక్తం చేసేవారు?, ఈనాడు పండుగల్లో దాగున్న పరమార్థాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు? అనే తదితర అంశాలను పరిశోధన పూర్వకంగా విశ్లేషించటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. అంతేకాదు జానపద సాహిత్య సేకరణకు నేదునూరి గంగాధరం చేసిన కృషిని సంక్షిప్తంగా పరిచయం చేసి, మాగంటి వంశీ రచయిత 28-04-2010 తేదీన పుస్తకం.నెట్‌లో రాసిన పండుగలు – పరమార్థములు వ్యాసాన్ని, 14-01-2015 తేదీన శోభనాచల పత్రికలో ముద్రితమైన వ్యాసాన్ని, 14-04-2025 తేదీన జానపద పరిశోధక రేడు – బిరుదురాజు రాసిన జాగృతి వారపత్రిక వ్యాసాలతో పాటు ప్రక్రియ కంటే కవిత్వగుణం ముఖ్యం! (2024) పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో ముద్రిమైన వ్యాసం, నేదునూరి గంగాధరం జానపదసాహిత్యం (2014) పుస్తకాన్ని అధ్యయనం చేసి ఈ వ్యాసాన్ని రూపొందించడమైనది. చివరగా పూర్వ పరిశోధనల వివరాలు, విశ్లేషణలు, విమర్శలను ఆకళింపు చేసుకుని, పరిశోధన ఫలితాలను వెల్లడించటమైంది.

Keywords: జానపద సాహిత్యం, తెలుగు పండుగలు - ఆచారాలు, నేదునూరి గంగాధరం, పండుగలు – పరమార్థములు, పండుగలు – పాటలు

1. ప్రవేశిక

జానపద సాహిత్యాన్ని ప్రజల సాహిత్యం అంటారు. సమాజంలో అక్షర జ్ఞానంలేని గ్రామీణులు, సామాన్యులు ఏనాడో అప్రయత్నంగా అలవోకగా సృష్టించుకున్న పాటలు, కథలు, గాథలు, కళలు, పండుగలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మౌఖికంగా ఒక తరం నుంచి మరొక తరానికి అందించారు. ఈ సాహిత్యం అచ్చు యంత్రాలు వాడుకలోకి రానంతవరకు గ్రంథరూపం దాల్చలేదు. ఎన్నో ఏండ్లుగా అలిఖితంగా వాగ్రూపంలోనే ఉంటూ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి అనుశ్రుతంగానే ప్రచారం అయ్యింది. ఇంతటి చరిత్ర కలిగిన జానపద సాహిత్యాన్ని సేకరించి, పుస్తకాల రూపంలో వెలువరించే ప్రక్రియ ఆధునిక యుగంలోనే ప్రారంభమైంది. జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ పుట్టిందని గానీ, ఈ సాహిత్యాన్ని సృజించిన కర్తలెవరు అని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కాని మానవుడు ఏనాడు భూమిపై జన్మించాడో, ఏనాడు తన ఊహ విప్పుకుందో ఆ రోజునే జానపద సాహిత్యం పుట్టిందని సాహితీవేత్తలు, పరిశోధకులు నిర్ధారించారు. జానపద సాహిత్యాన్ని ఇంగ్లీషులో ఫోక్ లిటరేచర్ అంటారు అని, ఈ సాహిత్యం దేశి సాహిత్యానికి సంబంధించింది అని సాహితీవేత్తలు పేర్కొన్నారు.

వ్యాపారం నిమిత్తం కంపెనీ ఉద్యోగులుగా, క్రైస్తవ మతాచార్యులుగా భారతదేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు భారతదేశాన్ని రాజకీయంగా బంధించినప్పటికి, కొంతమంది పాశ్చాత్యులు భారతీయ భాషల్ని నేర్చుకుని నిస్వార్థంతో, స్నేహ భావంతో ప్రజాహితాన్ని కోరుతూ ఆయా సాహిత్యాల్లో మౌఖికంగా అందించబడిన జానపద సాహిత్యాన్ని సేకరించేందుకు నడుంకట్టారు. అలా తెలుగులో జానపద సాహిత్య సేకరణకు శ్రీకారం చుట్టిన ప్రప్రథముడు సి.పి. బ్రౌన్ దొర గారు. తెలుగు భాషా సాహిత్యాల గొప్పతనాన్ని, జానపద సాహిత్య విశిష్టతను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతేకాదు, జానపద గేయాలపై దృష్టి పెట్టి- బొబ్బిలి కథ, కుమార రాముని కథ, కామమ్మ కథ, పల్నాటి వీరకథలతోపాటు పాటలు, యక్షగానాలను సేకరించాడు. ఆ తరువాత చార్లెస్ ఇ. గోవర్, జె.ఏ. బోయల్, కార్ వంటి పాశ్చాత్యులు ఊరూరా తిరిగి మొంతమోరు పాటలు, శృంగార గీతాలు, సర్వాయి పాపని వీరగాథలను అనగా మొదటి చారిత్రక గేయాలను సేకరించి పుస్తకంగా వెలువరించారు. అలా సి.పి. బ్రౌన్తో ప్రారంభమైన తెలుగు జానపద సాహిత్య సేకరణ ఈనాడు మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు సాగుతుంది.

1.1 జానపద సాహిత్య సేకరణ – నేదునూరి గంగాధరం కృషి

సుకృతాత్ములు రససిద్ధులు
సుకవీంద్రులు విజయనధులు సుమ్ము తదీయా
ధికకీర్తీశరీరంబులు
ప్రకటజరామరణజన్మ భయరహితంబుల్
(పెద్ద బాలశిక్ష, ద్వితీయ భాగం, పుట.458)

భర్తృహరి చెప్పిన పై మాటలను అక్షరాల నిజం చేస్తూ- జానపద సాహిత్య సేకరణకు తన ఆస్తిని, జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి, తెలుగు వాఙ్మయపు వెలుగు, గొప్ప పరిశోధకుడు నేదునూరి గంగాధరం. వీరు 1904 జూలై 4వ తేదీన రాజమండ్రికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న కొంతమూరులో జన్మించారు. 1930లో రాజమండ్రి ఎలిమెంటరీ స్కూలు టీచర్‌‌గా విధులు చేపట్టారు. కొన్ని వందల సంవత్సరాలుగా జనం నోట్లో నానుతూ వస్తున్న జానపద పాటల్లోని గొప్పదనాన్ని తెలుసుకొని, వాటిని సేకరించి ముందు తరాలకు అందించాలని సంకల్పించారు. ఇరవై ఎనిమిది ఏళ్లపాటు శ్రమించి, లెక్కలేనన్ని ఊర్లు తిరిగారు. ఆ పరంపరలో మేలుకొలుపులు (1949), మంగళహారతులు (2 సంపుటాలు, 1951), సెలయేరు (1955), వ్యవసాయ సామెతలు (1956), పసిడి పలుకులు (1960), స్త్రీల వ్రతకథలు (2 సంపుటాలు, 1960), జానపద గేయవాఙ్మయ వ్యాసావళి (1960), ఆటపాటలు (1964), మిన్నేరు (1968), మున్నీరు (1973) మొదలైన ఎన్నో విలువైన పుస్తకాలను వెలువరించారు. వివిధ పత్రికల్లో జానపద పాటలకు సంబంధించి వందలకొద్ది వ్యాసాలు రాశారు.

జానపద సాహిత్య సేకరణలో భాగంగా నేదునూరి గంగమాంబ అనగా నేదునూరి గంగాధరం భార్య భర్త అడుగుజాడల్లో నడుస్తూ- బంగారం, విలువైన చీరలతో పాటు ఆఖరికి తన మెడలో ఉన్న పుస్తెను తృణప్రాయంగా ఇచ్చేసిన మహాసాధ్విగా చరిత్రకెక్కారు. ఇంతటి సాహిత్య కృషి చేసిన నేదునూరి గంగాధరంపై లెక్కలేనంత మంది పరిశోధనలు చేసి వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో వానపల్లి నూకరాజు గారు నేదునూరి గంగాధరం పథమంతా జానపదం, తెలుగు వాఙ్మయపు వెలుగు తెలిపినట్టి దిట్టలలో, చూడంగా గంగాధరం మేరువురా గంగాధరం అన్న మాటలు సాహితీలోకంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. నేదునూరి గంగాధరం గారి విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడే విషయమేమంటే- భారతదేశంలో జానపద సాహిత్యానికి సంబంధించిన రెండే రెండు గ్రంథాలయాలు ఉన్నాయి. ఒకటి పంజాబ్ రాష్ట్రంలో దేవేంద్ర సత్యార్థిగారిది అయితే, రెండవది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నేదునూరి గ్రంథాలయం.

2. నేదునూరి గంగాధరం గారి పండుగలు – పరమార్థములు

జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం గారు 1956వ సంవత్సరంలో తెలుగు నేలకు అందించిన విలువైన పుస్తకం పండుగలు – పరమార్థములు (పల్లెటూరి పాటలతోబాటు). ఈ పుస్తకం అప్పటి మున్సిపాల్ కౌన్సిలర్, ఆశ్రిత కల్పద్రుమ బిరుదాంకితులైన జిల్లా సుబ్బారావు శ్రేష్టి సహాయంతో ముద్రించబడింది. పండుగలు – పరమార్థములు పుస్తకంగా వెలువడడానికి గల నేపథ్యాన్ని కృతజ్ఞతలు శీర్షికలో- పల్లెటూరి పండుగలు అనే అంశంపై రేడియోలో ప్రసంగించడానికి నాకు అవకాశం కల్పించాలని అప్పటి ఆలిండియా రేడియో హైదరాబాద్ డైరెక్టర్, మద్రాసు రేడియో స్టేషన్ డైరెక్టర్లు విజయవాడలో ఉన్న రేడియో స్టేషన్ డైరక్టర్ గారికి సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు అనుగుణంగా జానపదుల సంప్రదాయాలు, విజ్ఞానాలు, గేయాలను సేకరించేందుకు పరిశోధన ప్రారంభించిన సమయంలో చాలామంది చెప్పిన అంశాలను, పాటలను వ్యాసాలుగా రాశారు. వాటిన్నింటిని కలిపి పండుగలు – పరమార్థములు (పల్లెటూరి పాటలతోబాటు)గా ముద్రించాను అని నేదునూరి వారు పేర్కొన్నారు.

పండుగలు - పరమార్థములు పుస్తకంలో నేదునూరి గంగాధరం గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల ప్రాధాన్యతను ప్రథమ భాగంగా పేర్కొన్నారు. ప్రతి ఏడాది నాలుగు పండుగలను జరుపుకునే సమయాల్లో జానపదులు పాడుకునే పాటలను, ఆచరించే సంప్రదాయాలను తెలియజేశారు. ముందుగా పండుగల చరిత్రను సంక్షిప్తంగా తెలియజేసి, ఆ తరువాత ఏయే పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాలను 78 పుటలలో వివరించారు. ముందుగా పండుగల ప్రాధాన్యత గురించి గంగాధరం గారు పేర్కొన్న విషయాన్ని వివరించి, రెండు పండుగల గురించి ప్రస్తావిస్తాను.

2.1. పండుగలు – ప్రాధాన్యత

ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా మనుష్యులందరినీ ఒక్కచోటకి చేర్చేవి పండుగలు. ఇవి ప్రజలను ఐక్యం చేస్తాయి. సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా, మతాల పరంగా విభేదాలను మరచిపోయేలా చేస్తాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరికీ ఆనందాన్ని పెంపొందిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అందమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి. జానపదుల మనస్సులలో ఆనందాన్ని, ముఖాల్లో చిరునవ్వును తెస్తాయి. ఉద్యోగాల రీత్యా, వివాహాల రీత్యా, బంధువుల రీత్యా దేశ - విదేశాలకు వలస వెళ్లినవారిని పుట్టిన ఊరికి రప్పిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పండుగల గురించి నేదునూరి గంగాధరం గారు పండుగలు పరమార్థములు పుస్తకంలో లోతైన అంశాలను చర్చించారు.

పండుగల వల్లనే భారతదేశం ఆధ్మాత్మికంగా, భౌతికంగా వృద్ధి చెందుచున్నది అనటంలో సందేహం లేదు. పూర్వం నుండి నేటి వరకు మనం క్రియా రూపంగా దేశ చరిత్రను, దేశ గౌరవాన్ని ధ్యానిస్తున్నాము. మహామహుల చరిత్రలను తలుచుకుంటూ వారిని పూజిస్తున్నాము. ఇవే కదా పండుగ దినాలు!. వీటిని పబ్బములని, పర్వములని వచింతురు. పండుగలే సజీవములైన చారిత్రక గ్రంథాలు. ఒక దేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి అంటే చరిత్ర గ్రంథాలే ఆధారములు. ఒక జాతి యొక్క విజ్ఞానాన్ని, నాగరికతను, మతాన్ని, ఆచారాలను, సభ్యతను తెలుసుకోవాలి అంటే పర్వదినాలే పుస్తక రూపంగా తెలుపుతున్నాయి. (పండుగలు - పరమార్థములు, పుట. 5)

అని నేదునూరి వారు పేర్కొన్నారు. అంతేకాదు-

చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఒక్క సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభవ నుంచి అక్షయ వరకు ఒక్కొక్క శకాన్ని లెక్కిస్తున్నాము. ఆకాశంలో ఉండే గ్రహాలు, తొలకరలు, సేద్యానికి సంబంధించిన అనుకూల కాలాలు, కోతలు, కుప్పనూర్పులు మొదలైన వాటికి శాస్త్రాలను, గ్రంథాలను చదివి తెలుసుకుంటున్నాము. దేశ కళ్యాణం కోసం జరుపుకునే ఈ పండుగలు మన ప్రాచీన కాలంలోని నీతులను, రీతులను తెలియజేస్తాయి. పల్లెటూళ్ళలో చెక్కుచెదరకుండ నిలిచి ఉన్నాయి. ప్రాచీన భారతీయ గౌరవాన్ని నిల్పుచున్న ఈ పండుగలలో ఉత్సవాలు కూడా జరుపుతారు. ఈ ఉత్సవాలు లేనిదే మానవ జీవితము సార్థకము కాదు. నిండుతనము ఉండదు. (పండుగలు - పరమార్థములు, పుట. 6)

అని పండుగలు, ఉత్సవాల ప్రాధాన్యాన్ని వివరించారు.

2.2. సంవత్సరాది లేదా ఉగాది

సంవత్సరాదినే ఉగాది అని పిలుస్తారు. ఈ దినాన్ని సంవత్సర ఫలిత సూచక దినంగా వ్యవహరిస్తారు. సంవత్సరాది అంటే సంవత్సరం మొదటి దినం అని అర్థం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాచీన కాలం నుంచి ఈనాటి వరకు చాంద్రమాస సంవత్సరం మొదటి దినాన్ని చైత్రశుద్ధ పాడ్యమిగా, సంవత్సరాదిగా గ్రహిస్తున్నారు. ఉగాది రోజున జానపదులు ఆచరించే ఆచారాలు ప్రధానంగా 1. వేప పువ్వు పచ్చడి 2. పంచాంగ శ్రావణం 3. మిత్రుల దర్శనం 4. ఆర్యపూజనము 5. గోపూజ 6. ఏరువాక వంటివి పాటిస్తారని, ఉగాది పండుగ సమయంలో ఏరువాక జానపద గేయాలు, పల్లెటూరి పాటలు, సంవత్సరాది సంబరం పాటలు, దేశవాళీ ఆటలు – పాటలు, చిన్నీ బిన్నీ ఆట-పాటలను పాడుకుంటారని పేర్కొన్నారు.

2.2.1. వేప పువ్వు పచ్చడి

ఉగాది పండుగ రోజున షడ్ రుచులు అనగా వేప పువ్వు పచ్చడి తినే ఆచారం ఉంది. షడ్ రుచులు అంటే వేప పువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి, ఉప్పు, కారముతో కలిపిన పానీయం. ఉగాది రోజున దీన్ని భక్షిస్తే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉంటుందని, త్రిదోషాలు హరిస్తాయని, శరీరతత్వం మారి అందమైన ఆరోగ్యం కల్గుతుందని జానపదులు నమ్ముతారు.

2.2.2. పంచాంగ శ్రవణము

ఉగాది పండుగ రోజున ఆచరించే మరొక ప్రధానమైన సంప్రదాయం పంచాంగ శ్రవణము. పల్లెల్లో ఉండే బ్రాహ్మణుల వద్దకు వెళ్లి ఆ సంవత్సర పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షాలు, పంటలు, ధరలు, పేరు బలములు, ఆదాయం, వ్యయం, దేహారోగ్యానికి సంబంధించిన విషయాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు.

2.2.3. మిత్ర దర్శనము

ఉగాది పండుగ రోజున పల్లెలో ఉండే యువతీయువకులు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని, ఒకరి బాగోగులను మరొకరు తెలుసుకుంటూ ముచ్చటించుకుంటారు. దీన్నే మిత్ర దర్శనం అంటారు.

2.2.4. ఆర్యపూజనము

ఆర్యపూజనము అంటే పెద్దవాళ్లను పూజించటం లేదా నమస్కరించటం అని అర్థం. ఉగాది రోజున కుటుంబంలో ఉండే తాత – నాయనమ్మలు, తల్లిదండ్రులు, అక్కలు – అన్నలను చిన్నవారు వారి కాళ్ళకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు.

2.2.5. గోపూజ

గోవులు అనగా ఎద్దులు, ఆవులు పరమ పవిత్రమైన జంతువులు. వీటి వల్ల రైతులు పంటలను పండించుకోవటం, పాలను పితికి అమ్ముకోవటం వంటివి చేస్తారు. కనుక ఉగాది రోజున గోవులను శుభ్రంగా కడిగి పాల భాగానికి, పాదాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. దీనినే గోపూజ అంటారు.

2.2.6. ఏరువాక

రైతులు ఏరువాకను దుక్కి దున్నుటకు శుభ ముహుర్తంగా భావిస్తారు. దీనిని దొంగ ఏరువాక అని, ముహూర్త ఏరువాక అని రెండు రకాలు. దొంగ ఏరువాక అనగా తెల్లవారితే సంవత్సరాది రోజున రైతులు ఎవ్వరికి చెప్పకుండా తెల్లవారుజామునే లేచి ఎద్దులను పూజించి ఏరువాక సాగిస్తారు. ఇక ముహూర్త ఏరువాక రోజున నూనె పూసిన పులగమును ఎడ్లకు పెట్టి, ఎడ్లకు పూలు – దండలు వేసి తొలి దుక్కు దున్నుతారు.

2.2.7. సంవత్సరాది సంబరము – పాట

ఆనాటి కాలం నుంచి ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజున బాలబాలికలు ఆనందపరవశులై పాడుకునే జానపద పాటను నేదునూరి వారు సేకరించి ఈనాటి తరానికి అందించారు.

ఉగాది పండుగ వచ్చింది ఊరికి అందం తెచ్చింది దేవుడి గుడిలో బాజాలు బాజాలయ్యాక పూజలు ఊరేగింపులు జరిగాక పంచాంగాలను చదివించి మంచీ చెడ్డలు విన్నాము. (పండుగలు – పరమార్థములు, పుట. 17)

అయితే, నేదునూరి గంగాధరం కాలం నాటి ఉగాది పండుగకు, ఈనాడు పల్లెల్లో, పట్టణాల్లో జరుగుతున్న ఉగాది పండుగకు చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆనాడు ఉగాది అంటే పల్లె జీవన విధానానికి, వ్యవసాయ ఆధారిత సంస్కృతికి, కుటుంబ సంబంధాల పునరుద్ధరణకు ప్రతిబింబంగా నిలిచేది. కాని ఈనాడు ఉగాది రోజున షడ్రుచులకు బదులు మద్యాన్ని సేవిస్తున్నారు. పంచాంగ శ్రవణం పక్కనబెట్టి ఇతర ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిత్రదర్శనాన్ని విస్మరించి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఆ రోజుల్లో ఉగాది పండుగ రోజున పెద్దలు - పిల్లలు సంబరాల పాటలు పాడితే, ఈ రోజుల్లో ఉగాది రోజున సినిమా పాటలను పాడుతున్నారు. నేటి యువత టెక్నాలజీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో తేలియాడుతూ ఉగాది పండుగ పరమార్థాన్ని తెలిసుకోలేకపోతున్నారు.

3. సంక్రాంతి

భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగల్లో సంక్రాంతి పండుగ ప్రధానమైనది. సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం. అంటే సం కలిపి క్రమణము అనగా సూర్యుడు ముందుండే రాశిని విడిచి మరొక రాశిలో ప్రవేశించుటనే సంక్రాంతిగా పిలుస్తారు. ఈ పండుగ సూర్యుడిని ఉద్దేశించి చేసే పండుగ. సంక్రాంతి రోజులలో సంక్రమణ పురుషుడు ప్రతీ ఏటా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాడు. ఆయన నామం, వేషం, ధారణ సముదాయం, వాహనాలను బట్టి దేశంలో శుభాశుభములు సంభవిస్తాయని పెద్దలు చెప్తుంటారు. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది. దీన్ని గొబ్బెమ్మ పండుగ అని కూడా అంటారు. గొబ్బెమ్మ అంటే గోపునకు తల్లి. గోపు అంటే గోపాల బాల కృష్ణుడు అని అర్థం. అందుచేత తల్లిగొబ్బి, పిల్లగొబ్బి అని రెండు రకాలుగా చెప్తారు. సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పంజాబ్ మొదలైన ప్రాంతాల్లో కూడా మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ కారణంగా సంక్రాంతి అంటే మూడు రోజుల ముచ్చటైన పండగగా ప్రసిద్ధికెక్కింది. మొదటి రోజు- భోగి మంటలు వేసి, వాటి దగ్గర చలి కాచుకుంటారు. చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు. రెండో రోజు- రంగురంగుల ముగ్గులతో వాకిలంతా నింపేసి, కొత్త బట్టలు, చక్కెర పొంగలి, పిండివంటలు, పతంగులతో సందడి చేస్తారు. మూడవ రోజు- పండుగ హడావిడి ఏమాత్రం తగ్గకుండా కనుమ జోరును కొనసాగిస్తారు.

3.1. భోగి పండుగ

భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఇంద్రపొంగలిని పాలు, అన్నముతో తయారు చేస్తారు. ఎందుకంటే ఇది ఇంద్రునికి ప్రీతికరమైన వంటకం అని పురాణాల్లో రాయబడింది. రాబోవు వేసవి తీష్ణతను తగ్గించి త్వరలో తొలకరిని ప్రసాదించే దినంగా భోగిని చేస్తారు. తెల్లవారు జామున ఇంటి ముందర, కూడళ్లలో భోగిమంటలు వేస్తారు.

3.2. పెద్ద పండుగ లేదా సంబరాల పండుగ

మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైన పండుగ పెద్ద పండుగ లేదా సంక్రాంతి. ఈరోజున పల్లెటూళ్ళలో జానపదులు ఉదయాన్నే లేచి సూర్యనమస్కారాలు చేస్తారు. ఎందుకంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజేనే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేస్తారు. స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తయిదువులకు పూలూపండ్లను వాయనంగా ఇస్తారు.

3.3. కనుమ లేదా పశువుల పండుగ

సంక్రాంతి మరుసటి రోజు జరుపుకునే పండుగ కనుమ. ఇది పశువుల పండుగ. ఈరోజున రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రం చేస్తారు. ఆ తరువాత కుంకుమ బొట్లు అద్ది, పూల హారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి, కొంత పశువులకు తినిపించి, మిగిలినదాన్ని పొలాల్లో జల్లుతారు. పశువులతో పాటు నాగలికీ పూజ చేస్తారు. కనుమ రోజున ఎవ్వరు పనికి వెళ్లరు, ప్రయాణం కూడా చేయరు. ఇలా మూడు రోజులపాటు ఆనందోత్సాహాలతో జరుపుకునే సంక్రాంతి పండుగ బంధాలను బలపరుస్తుంది, ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది.

3.4. గొబ్బెమ్మ పాటలు

సందె గొబ్బెమ్మా! శుభములివ్వాలే తామరపువ్వంటి! తముణ్ణివ్వాలే చేమంతి పువ్వంటి! చెల్లెల్నివ్వాలే (పండుగలు – పరమార్థములు, పుట. 55)

3.5. కోలాట పాట

గొల్లవారి వాడలకు కృష్ణమూర్తీ నీవు యేమిపనులకు వచ్చినావు కృష్ణమూర్తీ పాలుకొన వచ్చినానే గొల్లభామా మంచి పాలుపోసి నన్ను బంపు గొల్ల భామ కొత్తకోడలనయ్యా కృష్ణమూర్తీ మా అత్తగారి నడుగయ్య కృష్ణమూర్తీ కొత్తకోడలైతేనేమి గొల్లభామా నా రొక్కమిచ్చి పుచ్చుకొంటే గొల్ల భామ నీరొక్కము నాకొద్దయ్య కృష్ణమూర్తీ నీవు రొంపుసేయక పోవయ్య కృష్ణమూర్తీ (పండుగలు – పరమార్థములు, పుట. 57)

అంటూ గొల్లభామా, కృష్ణమూర్తీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన పాటలను పాడుకుంటారని 70 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంక్రాంతి పండుగ పద్ధతులను, అందులోని పరమార్థాన్ని నేదునూరి గంగాధరం చక్కగా వివరించారు.

అయితే, ఈనాడు 70 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున పాటించిన పద్ధతులు పాటిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి!. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు జరుగుతున్న సంక్రాంతి పండుగను ఒకసారి పరిశీలిస్తే- ఆనాడు కోడి పందాల ఆట సరదా కోసం ఆడితే, ఈనాడు జూదంగా మారింది. పందాల పేరుతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. అంతేకాదు సాయంత్రవేళ రికార్డిండ్ పేరుతో పెద్ద పెద్ద డీజేలు పెట్టి, ఇతర నృత్యాలను ప్రోత్సహిస్తున్నారు. ఎంతో పవిత్రంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి పండుగను పాడు పనుల పండుగగా మార్చివేస్తున్నారు. ఒకప్పుడు జానపద పాటలతో విలసిల్లిన గొబ్బెమ్మ, కోలాట ఆటలు నేడు అర్థంలేని సినిమా పాటలతో కొనసాగుతున్నాయి.

ఉపసంహారం

  • ఒక దేశం యొక్క ప్రాచీన చరిత్ర మరియు అక్కడి సంస్కృతిని తెలుసుకోవడానికి జానపదులు శతాబ్దాలుగా ఆచరిస్తున్న పండుగలే ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి.
  • భారతీయ కవులు మరియు పరిశోధకులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన జానపద పాటలు, ఆచారాల వివరాలు అరుదైన సాహిత్య సంపదను అందించాయి.
  • నేదునూరి గంగాధరం రచించిన పండుగలు పరమార్థములు గ్రంథం తెలుగువారి సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతోంది.
  • కాలక్రమేణా టెక్నాలజీ పెరుగుదల కారణంగా పండుగలను జరుపుకునే విధానాలలో మరియు సామాజిక మానసిక స్థితిగతులలో గణనీయమైన మార్పులు వచ్చాయి.
  • నేటి కాలంలో పండుగలు సామూహిక వేడుకలుగా కాకుండా ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయి, సాంప్రదాయ కళలు కనుమరుగవుతున్నాయి.
  • పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థులకు తెలుగు పండుగల పరమార్థాలపై అవగాహన కల్పించి, క్షేత్ర పర్యటనల ద్వారా సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. గంగాధరం, నేదునూరి. పండుగలు – పరమార్థములు, స్వీయ ప్రచురణ, రాజమండ్రి, 1956.
  2. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష, 2వ సంపుటం, నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి, 1983.
  3. మోహన్, జి.ఎస్. జానపద విజ్ఞానాధ్యయనం, శ్రీనివాస పబ్లికేషన్, బెంగళూరు, 2001.
  4. రామరాజు, బిరుదురాజు. తెలుగుజానపదగేయసాహిత్యము, జానపదవిజ్ఞానప్రచురణలు, హైదరాబాద్, 1958.
  5. సైదులు, నారగోని. ముకుంద రామారావు సాహిత్యం – ఒక పరిశీలన, రేణుశ్రీ ప్రచురణలు, హైదరాబాద్, 2025.
  6. సత్యనారాయణ, గాజుల. పెద్ద బాలశిక్ష (రెండవ భాగము), వనజ ఆఫ్‌సెట్ ప్రింటర్స్, విజయవాడ, 2011.
  7. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర బుక్‌హౌస్, విజయవాడ, 2023.
  8. సుజాతరెడ్డి, ముదిగంటి. మన తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు అకాడమి, హైదరాబాద్, 2018.
  9. సుందరం, ఆర్వీయస్. ఆంధ్రుల జానపద విజ్ఞానం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2018.
  10. శాస్త్రి, ద్వా.నా. తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్, 2014.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image