headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797

1. ఆదిశంకరుల అయిదు ప్రకరణాలు: పరిభాష

“ఆచార్యసార్వభౌమ” డా. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి‌

ఎం.ఏ., తెలుగు పిహెచ్.డి., ఎం.ఏ., సంస్కృతం పిహెచ్.డి.,
విశ్రాంతాచార్యులు, తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490084217. Email: acharyavedula@yahoo.com

Download PDF


Keywords: జగర్గురు, శంకరాచార్య, పరిభాష, ప్రకరణగ్రంథం, ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి, శ్రీదక్షిణామూర్తిస్తోత్రం, అపరోక్షానుభూతి, మహావాక్యదర్పణం, వేదుల

ఉపోద్ఘాతం:

"ఆత్మా వారే ద్రష్టవ్యః శ్రోతవ్య: మంతవ్యః నిదిధ్యాసితవ్యః" అని ఉపనిషద్వాణి. ఓయి! ఆత్మ చూడదగ్గది. వినదగ్గది. మననం చేసుకోదగ్గది. స్థిరంగా నిల్పుకోదగ్గది అని భావం. ఆ ఆత్మతత్త్వాన్ని అద్వైతపరంగా ఉపదేశించడంకోసం కైలాసాధివాసుడైన శంకరుడే జగద్గురు శ్రీ శంకరభగవత్పాదులుగా అవతరించినట్లు పండితుల విశ్వాసం. "శంకరః శంకరః సాక్షాత్" అని ప్రసిద్ధి.

ఈశ కేన కఠాది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అనే మూడింటికీ ప్రస్థానత్రయమని వ్యవహారం. ఈ ప్రస్థానత్రయానికి శంకర భగవత్పాదులు వివిధ శాస్త్ర సంప్రదాయలతో అద్వైతపరంగా భాష్యాన్ని రచించేరు. అది విద్వాంసులకు ఉద్దేశింపబడినది. ఆ భాష్యంలో తాము నిరూపించిన అద్వైతసిద్ధాంతసారాన్ని మధ్యమాధికారుల కోసం కొన్ని లఘుకృతులలో విశదీకరించేరు. వాటికి ప్రకరణ గ్రంథములని వ్యవహారం. శాస్త్రంలోని ముఖ్యమైన సారాన్ని ప్రతిపాదిస్తూ ఇతర శాస్త్ర సమన్వయంతో రచింపబడిన గ్రంథాన్ని ప్రకరణం అంటారు.

శాస్త్రైకదేశ విషయం శాస్త్రకార్యాంతరే స్థితమ్

ఆహు: ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చితః

శంకరభగవత్పాదులు రచించిన ప్రకరణగ్రంథాలలో ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి అనే మూడు అత్యంత విశిష్టమైనవి. ఒకే ఒక్క శ్లోకంలో అద్వైతసారాన్ని నిరూపించిన రచనకి ఏకశ్లోకి, కొంచెం విపులంగా పది శ్లోకాలలో రచించిన రచనకి దశశ్లోకి, అంతకంటే మరికొంత విపులంగా బహువిధములైన ఉపపత్తులతో నూరు శ్లోకాలలో నిరూపించిన రచనకి శతశ్లోకి అని నామకరణం ఏర్పడింది. జిజ్ఞాసువుల సామర్థ్యానికి అనుగుణంగా ఆదిశంకరులు ఆ గ్రంథాలని రచించేరు.

ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి అనే వరుసలోగాని, శతశ్లోకి, దశశ్లోకి, ఏకశ్లోకి అనే క్రమంలోగాని అవి అధ్యయనం చేయదగ్గవి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం కేవలం పదిశ్లోకాల రచన మాత్రమే. కాని ఆ రచన అద్వైత సిద్ధాంత సర్వస్వసంగ్రహం అనదగ్గది. తత్త్వ జిజ్ఞాస గలవారికి అది పారాయణ గ్రంథంగా బహుళ ప్రచారంలో ఉన్నది.

జగద్గురువుల ఇతరప్రకరణ గ్రంథాలు అన్నింటిలో వివేకచూడామణి, అపరోక్షానుభూతి, మహావాక్యదర్పణం అనేవి ప్రశస్తములైనవి. “మహావాక్యదర్పణం భగవత్పాదవిరచితం అన్నది సర్వసమ్మతం కాదు. ప్రామాణికులు దాన్ని భగవత్పాదకృతంగా స్వీకరించలేదు. దాని స్థానంలో అపరోక్షానుభూతిని చేరిస్తే సమంజసంగా ఉంటుంది” అని శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మాహాసంస్థానం, శృంగేరి శ్రీచరణులవారు అనుగ్రహించారు. ఈ ఆదేశంతో అపరోక్షానుభూతి, ఆత్మబోధల వాఖ్యానం ప్రత్యేక గ్రంథరూపం దాల్చింది. "మహావాక్యదర్పణం" అంటే మహావాక్యార్ధాన్ని విశదీకరించడంలో అద్దంవంటిది అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే నాలుగు శ్రుతివాక్యాలకి మహావాక్యాలు అని పేరు. శంకరగురుచరణులు ఛాందోగ్యోపనిషత్తుకి చెందిన “తత్త్వమసి” అనే మహావాక్యానికి మాత్రమే వివరణగా మహావాక్యదర్పణ రచనని సంతరించినట్లు గ్రంథాన్ని నిశితంగా సమీక్షించినప్పుడు స్పష్టమవుతుంది. ఇందులో ఇతర మహావాక్యాలు కూడా గ్రహింపబడ్డాయి. ఈ ప్రకరణాలలో ప్రయోగింపబడిన ప్రధాన పరిభాష పదాలను అవసరమైన చోట ఉపపత్తుల్ని చూపిస్తూ వివరించడం ఈ పరిశోధనవ్యాసం ఉద్దేశం.

ప్రధాన పారిభాషిక పదవివరణం:

అజ్ఞానం: పరబ్రహ్మముకంటె వేరొక వస్తువు ఉన్నదని భావించడం. దేహాదులు నేనే అని తలంచడం. జగత్తు నిత్యమని విశ్వసించడం. రజ్జువునందు సర్పత్వం చూడడం. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనం అనే రెండింటికంటె వేరైనదని భగవద్గీతావచనం.

అధికారి: అధికారం అంటే యోగ్యత. అదిగలవాడు అధికారి. ఆత్మదర్శనమందు మేధావి విద్వాంసుడు ఊహఅపోహ అనేవానిని వివేచింపగలవాడు సాధన చతుష్టయ సంపన్నుడు అయిన పురుషుడు అధికారి.

అధిష్టానం: దేనియొక్క అజ్ఞానంవల్ల భ్రాంతి కల్గుతుందో ఆ వస్తువు. ఈ జగత్తుకి పరబ్రహ్మము. రజ్జసర్పభ్రాంతిలో సర్పానికి రజ్జువు.

అధ్యాస: ఒక వస్తువునందు మరియొక వస్తువుని ఆరోపించడం. “అతస్మిన్‌ తద్చుద్ధిః” రజ్జువుని సర్పంగా భావించడం అనాత్మయైన దేహాదికమందు నేను అనే భావాన్ని పొందడం.

అనాత్మ: స్థూల శరీరం ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు అహమాదులు సుఖాలు ఆకాశాది పంచభూతాలు అన్నమయాది పంచకోశాలు సమస్తవిశ్వం మహత్తు నుండి దేహపర్యంతం.

అనిర్వచనీయం: సత్తుగాను అసత్తుగాను చెప్పడానికి వీలుకానిది. భ్రాంతి సిద్ధమైన వస్తువు. సత్తు అయితే బాధింపబడకూడదు. ఎలా అంటే బ్రహ్మము. అసత్తు అని చెప్పలేము. అసత్తు అయినప్పుడు కనబడకూడదు. అసత్తు అయిన వంధ్యాపుత్రాదులు కనబడడం లేదుగదా. అందుచే భ్రాంతిసిద్ధమైనది. అనిర్వచనీయం అని చెప్పదగినది.

అనుబంధచతుష్టయం: నిత్యానిత్యవస్తువివేకం, ఇహాముత్రఫలభోగవిరాగం, శమాదిష్కటం, ముముక్షుత్వం అనే నాల్గు. వీటికే సాధనచతుష్టయం అని కూడా పేరు. మోక్షప్రాప్తికి ఆవశ్యకములైన నాలుగు పరికరాలు అని భావం.

అనైకాంతికత్వం: అనియతమైన రూపాన్ని పొందడం. జాయతే అస్తి మొదలైన షడ్భావ వికారాలు కలిగిన రూపంలో ఉండడం.

అన్నమయకోశం: స్థూలశరీరం. అన్నం నుందే ఉద్భవించినది. అన్నంతోనే జీవిస్తున్నది. అన్నం లేకపోతే నశిస్తుంది. కాబట్టి దానికి అన్నమయకోశం అని వ్యవహారం ఏర్పడింది.

అభ్యాసం: శారీరకం మానసికం అని రెండు విధాలు. పద్మాసనం మొదలైన ఆసనాలు శరీరానికి సంబంధించిన అభ్యాసం. ప్రపంచభావం పూర్తిగా లయం అవడం మానసికాభ్యాసం. సర్వం (బ్రహ్మమే అనే అనుభవం కల్గడం.

అమనస్కత్వం: వీడు నేను ఇది అనే జ్ఞానమే మనస్సు. అది లేకపోవడం అమనస్కత్వం. కేవలం ఏకం అద్వయం అయిన బ్రహ్మముగా ఉండడం అని తాత్పర్యం.

అవస్థాత్రయం: జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేవి.

అవిద్య: అవ్యక్తం అనే పేరుగల పరమేశ్వరుని శక్తి. సత్త్వరజస్తమోగుణాలతో గూడినది. ఇదే మాయ. దీనినుండియే విశ్వం సమస్తం ఆవిర్భవిస్తోంది. ఇది పండితునిచే కార్యాన్ని బట్టి ఊహింపదగ్గది.

అవ్యక్తం: ఇదే అవిద్య మాయఠఅని వ్యవహారంలో ఉంటోంది. సత్త్వరజస్తమో గుణాత్మకం. ఇది ఆత్మకు కారణశరీరం.

అసత్తు: మూడు లోకాలలోను ఉండనిది. కుందేలు కొమ్ము. గొడ్రాలి పుత్రుడు.

అహంకారం: నేను నాది అనే అభిమానం. నేను కర్మని చేస్తున్నాను. నేను కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను అనే అభిమానం గలది. ఈ అహంకారమే సంసారానికి హేతువు అనదగ్గవాటిలో మొదటివికారం.

అంతఃకరణం: లోపలి ఇంద్రియం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాల్లింటికీ అంతఃకరణం అని పేరు. ఈ నాల్లింటికీ అంతఃకరణ చతుష్టయం అనికూడా వ్యవహారం.

ఆకాశం: పంచమహాభూతాలలో ఒకటి. శుద్ధం నిర్మలం సర్వవ్యాపకం నిరంజనం మొదలైన ధర్మాలుగలది. ఆత్మయొక్క నిత్యత్వానికీ సర్వవ్యాపకత్వానికీ ఉదాహరణంగా చెప్పబడేది. వస్తువునిబట్టి మటాకాశం పటాకాశం అని వ్యవహారం.

ఆత్మ: అతతి సంసరతి ఇతి ఆత్మా అని వ్యుత్పత్తి. ఎప్పుడూ సంచరించేది అని అర్ధం. అత్తి స్వకర్శఫలమ్‌ అని కూడ వ్యుత్పత్తి. తన కర్మఫలాన్ని అనుభవించేది అని అర్ధం. పరమాత్మ అని భావం. జీవుడు మనస్సు అనే అర్భాలలో కూడా ప్రయోగింపబడుతుంది. “ఆత్మావా౭రే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః అని బృహదారణ్యకోపనిషత్తు ఉపదేశిస్తోంది. ఆత్మయే చూడదగ్గది వినదగ్గది మననం చేసుకోదగ్గది స్థిరంగా నిల్పుకోదగ్గది అని భావం. ఇది నిరాకారం నిరంజనం నిష్కియం నిరవయం శుద్ధం బుద్ధం చైతన్యాత్మకం... అని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి.

ఆత్యంతికముక్తి: జీవన్ముక్తుడు దేహపాతానంతరం పొందు ముక్తి.

ఆభాసం: ఉన్నట్లు కనబడుతూ లేనిది. జగత్తు. జీవాత్మ.

ఆనందమయకోశం: ఆనందంయొక్క ప్రతిబింబంతో గూడిన సూక్ష్మమైన అంతః కరణప్రవృత్తి. ప్రియము మొదలైన గుణాలుగలవి. ఇష్టమైన వస్తువు లభించడం వల్ల కల్గుతుంది. శరీరమాత్రంచే పుణ్యాత్ములు అప్రయత్నంగా దీన్ని అనుభవిస్తారు.

ఆవరణశక్తి: ఆవరణం అంటే కప్పివేయడం. ఇది తమోగుణం యొక్క ప్రభావం. దీనివల్ల వస్తువు పూర్తిగా కప్పబడుతుంది. పురుషుడు సంసారాన్ని పొందడానికి ఆధారమైనది. విక్షేపశక్తి ప్రవర్తించడానికి ఇదే కారణం.

ఆశ్రమాలు: బ్రహ్మచర్యం గార్హస్థ్రం వానప్రస్థం సన్వ్యాసం అని నాలుగు.

ఇంద్రియాలు: “ఇంద్రస్య ఆత్మనః లింగమింద్రియమ్‌” అని వ్యుత్పత్తి. ఆత్మకు జ్ఞాపకమైనది అని అర్ధం. జ్ఞానేంద్రియాలు ఐదు. కర్మేంద్రియాలు ఐదు.

ఈశ్వరుడు: మాయ ఉపాధిగాగలవాడు. సర్వభూతముల హృదయంలో ఉంటూ తన మాయచే సర్వజీవులని నియమించువాడు అని భగవద్వచనం.

ఉపరతి: చిత్తవృత్తిని బాహ్య విషయాలపై ప్రసరించకుండా ఉంచడం.

ఉపాధి: ఆధారం. ఈశ్వరునికీ మహదాదులకీ కారణమైన మాయ ఉపాధి. జీవనికి అన్నమయాది కోశాలు అయిదూ ఉపాధి.

కర్మ: ఇంద్రియాల వ్యాపారం. “క్రియతే ఇతి కర్మ” అని వ్యుత్పత్తి. సంచితం ప్రారబ్ధం ఆగామి అని మూడు విధాలు. పెక్కు జన్మలనుండి సంక్రమించినది సంచితం. సంచితాన్ని ఈ జన్మలో అనుభవించడం ప్రారబ్ధం. ఈ జన్మయే ప్రారబ్ధం. ఈ జన్మలో చేసినదాని ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించడం ఆగామి. నిత్యకర్మలు కామ్యకర్మలు నైమిత్తిక కర్మలు ప్రాయళ్చిత్తకర్మలు ఉపాసనలు నిషిద్ధకర్మలు అని తత్త్వాన్ని బట్టి ఆరు విధములని మరియొక విధమైన విభాగం. చేయకపోవడంవల్ల ప్రత్యవాయం కల్గించే సంధ్యావందనాదులు నిత్యకర్మలు. ఇష్టప్రాప్తికోసం చేయబడే జ్యోతిష్టోమాది కర్మలు కామ్యకర్మలు. పుత్రజన్మ మొదలైన సందర్భాలలో చేయబడే జాతకర్మ మొదలైనవి నైమిత్తిక కర్మలు. పాపక్షయంకోసం చేయబడేవి ప్రాయశ్చిత్తకర్మలు. వివిధ దేవతల ఆరాధనరూపమైనవి ఉపాసనలు. హింసతోగూడినవి నిషిద్ధకర్మలు. మనస్సు ద్వారా వాక్కులద్వారా శరీరంద్వారా చేయబడే కర్మలు మానసికం వాచికం కాయికం అని మూడు విధాలు అని మరియొక విధమైన విభాగం.

కర్మేంద్రియాలు: నోరు చేతులు కాళ్లు గుదం జననేంద్రియం అనే అయిదు. వాక్కు మాట్లాడడంలోను. చెయ్యి గగ్రహించడంలోను, ఇవ్వడంలోను పాదం గమనంలోను పాయువు ఉపస్థ అనేవి మలవిసర్జనలోను సుఖాన్ని ఈయడంలోను ప్రవర్తిస్తాయి.

కారణశరీరం: సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి ఆత్మకు కారణశరీరం అవుతుంది. సమస్త ఇంద్రియాల యొక్కయు బుద్ధియొక్కయు ప్రవృత్తి ప్రత్యగాత్మయందు లయం కాగా కలిగే సుషుప్తి అవస్థ ఈకారణశరీరానికి చెందిన స్థితియే.

కూటస్థుడు: బంగారంతో ఆభరణాలు చేసేటప్పుడు పనివాళ్లు వాడే ఇనుపదిమ్మకు కూటం అనే పేరు. దానివలె స్థిరంగా అసంగంగా ఉండడం వల్ల ప్రత్యగాత్మకి కూటస్టుడు అనే వ్యవహారం స్థిరపడింది. “కూటవత్‌ తిష్ఠతి ఇతి కూటస్థ:” అని వ్యుత్పత్తి. “కూటస్థోక్షర ఉచ్యతే” అని భగవద్గీత.

కోశములు: కోశం అంటే ఒర. అన్నమయం ప్రాణమయం మనోమయం విజానమయం ఆనందమయం అని కోశములు అయిదు. ఇవన్నీ అనాత్మగా పరిగణింపదగ్గవి.

చిత్తం: “చేతయతీతి చిత్తమ్‌” అని వ్యుత్పత్తి. తెలుపునది అని అర్ధం. రూపం రనం మొదలైన విషయాలని నిరంతరం చింతనచేసే ధర్మం గలది. “స్వార్థానుసంధాన గుణేన చిత్తమ్‌”.

చిదాభాసుడు: చిత్‌ అంటే చైతన్యం. పరమాత్మ. అభాసుడు అంటే ప్రతిబింబం. చిదాభాసుడు అంటే బుద్ధియందు ప్రతిబింబించిన చైతన్యం. ఇతడే జీవుడు.

జహదజహల్లక్షణ: పదానికి సంకేతికమైన అర్థం కుదరకపోయినప్పుడు దానికి సమీపంగా ఉండే అర్ధాన్ని గ్రహించడం లక్షణావృత్తి అనిపించుకొంటుంది. అది జహత్‌ అజహత్‌ జహదజహత్‌ భేదాలచే మూడు విధాలు. అద్వైతవేదాంత సంప్రదాయంలో మాత్రమే జహదజహల్లక్షణావృత్తి సమన్వయాన్ని పొందుతోంది. ఎప్పుడో ఎక్కడో చూసిన దేవదత్తుణ్ణి చాలకాలం తర్వాత మళ్లీ ఎక్కడో చూసి ఆ దేవదత్తుడే వీడు అని తలంచినప్పుడు కాలం దేశం రూపంవంటివి భిన్నములైన అంశాలు. వాటిని తొలగిస్తేనే దేవదత్తధర్శం సమానం అవుతుంది. అప్పుడే ఆదేవదత్తుడే వీడు అనడం సాధ్యపడుతుంది. పరమాత్మ సర్వజ్ఞుడు. జీవుడు కించిద్‌జ్ఞుడు. మాయ ఉపాధిగాగలవాడు పరమాత్మ. అవిద్య ఉపాధిగాగలవాడు జీవుడు. కించిద్‌జ్ఞత్వ సర్వజ్ఞత్వాది ధర్మాలు తొలగిస్తే చైతన్యమాత్రాన్ని గ్రహిస్తే ఈశ్వరుడే జీవుడు, ఇద్దరు అభిన్నులు అనే అద్వైత స్థితి కల్గుతుంది. విరుద్ధాంశాలు విడిచి సమానంగాఉండే అంశాలు గ్రహించి సన్నిహితమైన అర్ధాన్ని సమన్వయించడం జహదజహల్లక్షణ. జీవేశ్వరుల అద్వైతాన్ని నిరూపించడంలో ఇది ఆధారమైనది.

జాగ్రదవస్థ: మెలకువస్థితి. స్థూల శరీరంతో జీవుడు (విశ్వుడు) పదార్థాల అనుభవాన్ని పొందే స్థితి.

జిజ్ఞాస: తెలుసుకోవాలన్న కోరిక. “జ్ఞాతుమిచ్చా జిజ్ఞాసా” అని వ్యుత్పత్తి.

జీవన్ముక్తి: జీవిసూనే సంసారబంధంనుండి నిర్లమించిన స్లితి.

జీవన్ముక్తుడు: జీవేశ్వరులు అభిన్నులు ఒక్కరే అనే అనుభవంలో మునిగి నిర్వికల్పంగా చిన్మాత్రంగా ఉండే చిత్తవృత్తికి ప్రజ్ఞ అని వ్యవహారం. నిత్యమూ అట్టి ప్రజ్ఞగలవాడు జీవన్ముక్తుడు. జీవిస్తూ సంసారబంధాల నుండి ముక్తుడైనవాడు అని తాత్పర్యం. ఆవరణశక్తితో గూడిన అజ్ఞానం నశింపగా ప్రారబ్ధకర్శతో జీవించేవాడు జీవన్యుక్తుడు. దేహమందు దేహధర్మమందు భార్యాపుత్రాదులందు అహంకారాదులు లేనివాడు. నిత్యం అహం బ్రమ్మా౭స్మి అనే అనుభవం పొందుతూ ఉందేవాడు.

జీవాత్మ: చిత్తుయొక్క ప్రతిబింబానికి జీవుడు జీవాత్మ అని పేరు. జీవుడు అనాదిగా ఉందేవాడు. అహంకారస్వభావుడు. సమస్త వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటాడు. పూర్వవాసనలు అనుసరించి కర్మ ఆచరిస్తాడు. పుణ్యపాప  కర్మలఫలాన్ని అనుభవిస్తాడు. విచిత్రములైన యోనులందు జన్మిస్తూ ఊర్ధ్వ అధో లోకాలకి వెళ్తూ వస్తూ ఉంటాడు. జాగ్రత్‌స్వప్న సుషుప్తి అవస్థలు గలవాడు. ఆ మూడింటిలో వరుసగా విశ్వుడు తైజసుడు ప్రాజ్ఞుడు అని వ్యవహరింపబడతాడు.

జీవుడు: జీవాత్మనే జీవుడు అంటారు.

జ్ఞానేంద్రియాలు: రూప రస గంధాది విషయాలు ఐదింటిని బాగా తెలుసుకొంటాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు అనే వ్యవహారం ఏర్పడింది. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు అనేవి.

తత్త్వమసి: ఇది ఛాందోగ్యోపనిషత్తుకి చెందిన మహావాక్యం. తత్‌ త్వమ్‌ అసి అని పదవిభాగం. తత్‌ అనగా ఈశ్వరుడు (పరమాత్మ) త్వమ్‌ అంటే నీవు. అసి అంటే అయితివి అని అర్ధం. పరమాత్మ జీవుడు అభిన్నులు అని తాత్పర్యం.

తమోగుణం: అజ్ఞానం నుండి కల్గుతుంది. మోహాన్ని పుట్టిస్తుంది. ఇదే జీవనికి సంసారాన్ని కల్గిస్తుంది. విక్షేపశక్తి వ్యాపించడానికి ఇదే కారణం. మరపు సోమరితనం నిద్ర అనే వాటిచే ఇది ఆత్మని బంధిస్తుంది.

తాపములు: ఆధ్యాత్మికం ఆధిభౌతికం ఆధిదైవికం అని మూడు విధాలు. శోక మోహాదులవల్ల మనస్సు పొందే దుఃఖం ఆధ్యాత్మికం. సర్పం, వ్యాఘ్రం మొదలైనవాటివల్ల కలిగే దుఃఖం ఆధిభౌతికం. అగ్ని పిడుగుపాటు, అతివృష్టి మొదలైన వాటివల్ల కలిగే దుఃఖం అధిదైవికం.

తితిక్ష: “తేజితుమిచ్చా తితిక్షా” అని వ్యుత్పత్తి. సమస్త దుఃఖాలనీ ప్రతీకారవాంఛ లేకుండా చింతగాని, విలాపంగాని పొందకుండా సహించడం.

త్రిపుటి: జ్ఞాత జ్జేయం జ్ఞానం, ద్రష్ట దృశ్యం దృక్కు వంటి మూడింటికి త్రిపుటి అని వ్యవహారం. విశ్వవ్యాప్తమైన బ్రహ్మము ఏకం. అద్వితీయం. ఈ త్రిపుటి అజ్ఞానంచే ఏర్పడుతోంది. ఇది లయమైనప్పుడే ఆత్మానుభూతి లభిస్తుంది.

తైజసుడు: జీవుడు స్వప్పదశలో తైజసుడు అని వ్యవహరింపబడతాడు.

దమం: బాహ్యేంద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియాలనీ, కర్మేంద్రియాలనీ వాటి వాటి విషయములందు ప్రవర్తింపకుండా చేసి తమతమ స్థానాలలో స్థిరంగా నిల్చ్బడం.

దృశ్యం: కనబడేదని అర్థం. స్థూలదేహం, విశ్వంసర్వం దృశ్యమే. దృశ్యమైనది సమస్తమూ నశిస్తుంది. “యద్దృశ్యం తన్నశ్యమ్‌”.

ధ్యానం: ధ్యేయమైన పరమాత్మయందు ప్రవాహరూపంగా చిత్తవృత్తి ప్రవర్తించడం.

నిత్యా౭నిత్య వస్తువివేకం: బ్రహ్మసత్యమైనది జగత్తు మిథ్య అనే నిశ్చయం.

నిదిధ్యాసనం: బ్రహ్మముకంటె వేరైనదిఇంకొకటి ఉన్నది అనే భావాన్ని తిరస్కరిస్తూ బ్రహ్మమునందే మనః'ప్రవృత్తిని ప్రవాహరూపంలో స్థిరంగా నిల్చ్బడం.

నిర్వికల్పసమాధి: ఇంద్రియ వ్యాపారాలని నిరోధించి మనస్సుని సంకల్పరహితంగా చేసుకొని పరమాత్మ (ప్రత్యగాత్మ) యందు స్థిరంగా నిల్చ్బడం.

పరబ్రహ్మము: ఏకం అద్వితీయం సత్యం జ్ఞానం అనంతం అయినది. దీనినే పరమాత్మ అని కూడా అంటారు.

పంచకోశాలు: అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయం అనే అయిదు. ఇవి ఆత్మకంటె భిన్నమైనవి. అనాత్మగా పరిగణింపదగ్గవి.

పంచభూతాలు: భూమి నీరు తేజస్సు గాలి ఆకాశం అనే అయిదు. వీటికే పంచమహాభూతాలు అనికూడా ప్రసిద్ధి.

పంచీకరణం: ఒక వస్తువుని ఐదు భాగాలుగా చేయడం. పృథివి నీరు మొదలైన భూతాలు అయిదూ ఒక్కొక్కటీ ఇతరభూతాలతో కలిసి మహాభూతాలుగా ఏర్పడడం. పృథివిలో సగభాగంలో ఇతరములైన జలం తేజస్సు వాయువు ఆకాశం అనే నాలుగూ సమపాళ్లలో 1/8 చొప్పున సగభాగంగా మిగిలిన పృథివితో కలిసి పృథివీ మహాభూతం ఏర్పడుతుంది. (పృథివి 1/2 + జలం మొదలైనవి నాలుగు1/8+1/8+1/8+1/8=1) ఇట్లే తక్కిన మహాభూతాలు ఏర్పడతాయి. ఈవిధంగా పంచీకరణం పొందిన పంచమహాభూతాలు స్థూలశరీరంగా పరిణమిస్తాయి.

ప్రజ్ఞ: జీవుడు ఈశ్వరుడు అభిన్నులు ఒక్కరు అనే భావప్రవాహంలో మునిగి మనస్సుయొక్క వృత్తి నిర్వికల్పంగా చిన్మాత్రంగా ఉండడం ప్రజ్ఞ.

ప్రత్యగాత్మ: “ప్రతి ప్రతిశరీరం అంచతి ప్రాప్నోతి ఇతి ప్రత్యగాత్మా” అని వ్యుత్పత్తి. ప్రతి శరీరంలోను ప్రవేశించేది. “ప్రతి సర్వతః ప్రాప్నోతి” అని కూడా నిరుక్తి. అంతటా ప్రవేశించేది అని భావం. పరమాత్మ జీవుడు అని రెండు అర్భాలనీ బోధిస్తుంది.

ప్రత్యయం: “ప్రతీతత్వాత్‌ ప్రత్యయః” అని వ్యుత్పత్తి. జ్ఞానం అని అర్ధం.

ప్రాగభావం: అభావం అంటే లేనిస్థితి. కుండ యొక్క ఉత్పత్తికి ముందు ఉండే స్థితి. కుండ యొక్క ప్రాగభావం అనిపించుకొంటుంది.

ప్రాజ్ఞుడు: శరీరబద్భుడైన జీవుడు. సుషప్తిదశలో జీవునికి ప్రాజ్ఞుడు అని వ్యవహారం.

ప్రాణమయకోశం: వాక్కు మొదలైన పంచకర్మేంద్రియాలతో గూడిన ప్రాణం ప్రాణమయకోశం. దీనిచేతనే అన్నమయంకోశం అన్నంతో నిండినదై సకల కర్మలయందు ప్రవర్తిస్తోంది. ఇది అనాత్మ.

ప్రాణములు: ప్రాణం ఒక్కటే. కాని అది శరీరంలో భిన్నస్థలాలలో ఆచరిస్తున్న కర్మలు ఆధారంగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనే పేర్లు పొందింది.

ప్రేయస్సు: ప్రీతికి ఆస్పదమైనది. ఇది కామ్యప్రేయస్సు ఆత్యంతిక పప్రేయస్సు అని రెండువిధాలు. భార్యాపుత్రాదులయందలి ప్రేమ కామ్యప్రేయస్సు. ఆత్మయందలి ప్రేమ ఆత్యంతిక ప్రేయస్సు.

భావవికారాలు: వస్తువుయొక్క వికారాలు. ఇవి ఆరు. “జాయతే అస్తి విపరిణమతే వర్ధతే అపక్షీయతే నశ్యతి” అనేవి. పుట్టడం ఉండడం మార్పుపొందడం వృద్ధిపొందడం క్షీణించడం నశించడం అనే వికారాలు. ఇవి ఆత్మకు లేవు. అనాత్మ ధర్మాలు మాత్రమే.

భ్రాంతి: ఇదే అధ్యాస. ఒక వస్తువుని మరియొక వస్తువుగా తలంచడం. త్రాడుని చూసి పాము అని నిశ్చయించడం. అనాత్మయెన దేహాదికాన్ని తాను అని భావించడం. మననం విన్నవిషయాన్ని ఉపపత్తులతో చింతించడం “శ్రుతస్యా౭_ర్థస్య ఉపపత్తిభిశ్చిం తనమ్‌”.

మనస్సు: సంకల్ప వికల్ప రూపమైనది.

మనోమయకోశం: త్వక్కు చక్షువు మొదలైన జ్ఞానేంద్రియాలు ఐదూ మనస్సుతో గూడి మనోమయకోశం అనిపించుకొంటుంది. నాది నేను మొదలైన వికల్పాలకి ఇదే. హేతువు. దీనికి ముందున్న ప్రాణమయకోశమునందు వ్యాపించి విజ్బంభిస్తుంది. ఇది అనాత్మ.

మహత్తు (మహత్తత్వం): అహంకారానికి కారణమైనది. విజ్ఞానమయం అనే పేరుగల బుద్ధి. అదే వివిధ కర్మలు ఆచరిస్తూ ఉంటుంది. నేను చేస్తున్నాను. అనే కర్తృత్వం పొందుతూ ఉంటుంది. సర్వసంసారాన్నీ నిర్వహిస్తుంది.

మహావాక్యం:  బ్రహ్మతత్తాన్ని ప్రతిపాదించే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మా౭స్మి, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే శ్రుతివాక్యాలకి మహావాక్యాలు అని వ్యవహారం.

మాయ: “యా మా సా మాయా” అని వ్యుత్పత్తి. ఏది యథార్థం కాదో అది మాయ. ఇది పరమేశ్వరుని శక్తి అనాది. సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి. అవ్యక్తం అవిద్య అని కూడా దీనికి పేర్లు. కార్యాన్ని బట్టి పండితునిచే తెలియదగ్గది. ఈ మాయయే విశ్వాన్ని ఉద్భవింపడేస్తుంది. అనిర్వచనీయమైనది. మహదాదులకు కారణమైనది. ఈ మాయయే ఈశ్వరునికి ఉపాధి.

మిథ్య: లేనిది ఉన్నట్లు భాసించడం. త్రాడు పాముగా కనబడడం. ఎండమావియందు జలం భాసించడం. బ్రహ్మమునందు విశ్వం స్ఫురించడం.

మిథ్యాజ్ఞానం: దేహాదులందు నేను అనే భావం. జగత్తు సత్యమైనదని భావించడం. ఇది సమ్యగ్‌ జ్ఞానంచే నాశనమవుతుంది.

మిశ్రసత్త్వం: సత్త్వగుణ ప్రధానంగా ఉంటూ రజస్తమోగుణాలు స్వల్పంగా కలిస్తే ఏర్పడుతుంది. ఇదే లింగశరీరానికి ఆధారం. స్వమానిత్వం అదాంభిత్వం మొదలైన గుణాలు, యమం మొదలైన నియమాలు, శ్రద్ధ భక్తి మోక్షేచ్చ, దైవీసంపద, అసత్తైన దేహాదికం నేను కాదని మరలుట అనేవి మిశ్రసత్త్వ ధర్మాలు.

ముక్తి: బలంకలిగి అనాదిగా ఉంటూ సంసారానికి హేతువైనవాసనలని వదల్చు కోవడమే ముక్తి.

ముక్తికి కారణం: సంసారంనుండి మోక్షం పొందడానికి “అహం బ్రహ్మాస్మి” అనే అనుభవం కారణం అవుతుంది.  దీనిచేతనే పండితులు ఆనందరూపమైన బ్రహ్మమును అనుభవిస్తారు.

ముముక్ష: “మోక్తుమిచ్భా ముముక్షా”. సంసారబంధాన్ని విడిచిపెట్టాలనే కోరిక.

ముముక్షువు: “మోక్తుమిచ్చుః ముముక్షు:” అని వ్యుత్పత్తి. సంసారబంధాన్ని విడిచిపెట్టాలనే కోరికగలవాడు.

మూలప్రకృతి: సత్త్వరజస్తమోగుణాలతో కూడినది. జగత్తు యొక్క ఆవిర్భావానికి ఆధారమైనది.

మోక్షం: అవిద్యవల్ల హృదయాన్ని ఆవరించియున్న ముడి విడిపోవడం. “అవిద్యా శత హృదయగ్రంధి మోక్ష మోక్షః”. దేహాన్ని విడిచిపెట్టడం కాదు. దండ కమండలాలు విడిచిపెట్టడం అంతకంటె కాదు.

యతి: ఇంద్రియ మనోవ్యాపారాలు నిరోధించుకొన్నవాడు.

యోగ: “యోజయతీతి యోగళొ అని వ్యుత్పత్తి. కలిపేది అని అర్ధం. మనస్సుని పరమాత్మతో కలిపేది అని భావం. “యోగశ్చిత్తవృత్తి నిరోధః” అని పతంజలి యోగసూత్రం. మనస్సు యొక్క వ్యాపారాన్ని అరికట్టడం అని భావం.

రజోగుణం: పురుషుడు వివిధకర్మలు ఆచరించడానికి క్రేరకమైనది. కామక్రోధ లోభాలు రజోగుణధర్మాలు. రజోగుణం సంసారబంధానికి హేతువు. “రజోరాగాత్మకం విద్ధి” అని భగవద్గీత.

రజ్జు సర్పభ్రాంతి: మసకమసక చీకటివేళ త్రాడుని చూసి పాము అని భ్రాంతిపడడం. ఆ భ్రాంతికి మూలం అజ్ఞానం. యథార్థ వస్తువు తెలిసినప్పుడు ఆ భ్రాంతి తొలగుతుంది. సర్పత్వం నాశనమవుతుంది. అది ్రాడుగానే కనబడుతుంది. దేహాదికమందు నేనుఅనేభావం భ్రాంతివల్లనే కల్గుతుంది. ఆత్మదర్శనం అయినప్పుడు ఆ భ్రాంతి తొలగుతుంది. దేహాదికం నేనుకాదు అని స్పష్టమవుతుంది. దీనికి రజ్జుసర్పభ్రాంతి ఉత్తమ నిదర్శనం.

లింగశరీరం: సూక్ష్మశరీరానికే లింగశరీరం అని పేరు. పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు పంచభూతాలు అంతఃకరణ చతుష్టయం అవిద్య కామం కర్మ అనే ఎనిమిదింటికీ లింగశరీరం సూక్ష్మశరీరం అని వ్యవహారం. ఇది పంచీకరణం పొందని పంచభూతాలచే ఏర్పడుతుంది. పూర్వజన్మవాసనలు గలది. సుఖదుఃఖ రూపమైన కర్మఫలాన్ని అనుభవించడానికి ఆధారమైనది ఈ లింగశరీరమే. అజ్ఞానంవల్ల ఇది జీవునికి ఉపాధియైనది. మోక్షప్రాప్తి వరకు ఇది ఉంటుంది. “లింగ భంగో హి మోక్షవొ అని శాస్రోక్తి.

వర్ణధర్మాలు: బ్రాహ్మణ క్షత్రియాది నాల్గువర్జాల వారికి చెందిన ధర్మములు.

వాసనలు: సంస్కారాలు. పువ్వుకి సహజమైనవి. పువ్వులు మొదలైనవాని సంపర్మం వల్ల బట్టలు మొదలైనవాటికి కలిగేగుణం. జీవునికి వాసనలు పూర్వజన్మల నుండి సంక్రమిస్తాయి. లోకవాసన శాస్త్రవాసన దేహవాసన అని మూడు విధములు. వాసనలనుండి విడువడడమే ముక్తి. జ్ఞానప్రాప్తికి ఈ వాసనలు ప్రతిబంధకాలు.

లోకవాసనయా జంతోః శాస్త్రవాసనయాపి చ

దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే

వాసనాశరీరం: సూక్ష్మశరీరానికే వాసనాశరీరం అని కూడా పేరు.

విక్షేపశక్తి: మనస్సుని పరిపరివిధాల కదల్చేది. సమస్తకర్మల ఆచరణకి ఆధారమైనది. ఇది రజోగుణానికి చెందుతుంది. మనస్సుయొక్క వికారములైన రాగాదులు దుఃఖాదులు నిత్యమూ ఈ విక్షేపశక్తి వల్లనే కల్గుతాయి.

విజ్ఞానమయకోశం: జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అనే మూడింటియందు ప్రవర్తించే చైతన్యం యొక్క ప్రతిబింబశక్తి. ఇది ప్రకృతియొక్క వికారం. దీనికే జీవుడు అని వ్యవహారం. దేహం ఇంద్రియాలు మొదలైన వాటి విషయంలో ఎల్లప్పుడు “నేను పదార్థాల విజ్ఞానం గలవాడను. ఈ కర్మను నేను ఆచరిస్తున్నాను” అని విజ్ఞానమయకోశం అయిన జీవుడు అభిమానాన్ని కల్గియుంటాడు.

విదేహముక్తి: దేహం నశించిన తరువాత కల్గు బ్రహ్మైక్యానుభవం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నాశనం కాగా కలిగే బ్రహ్మానుభూతి.

వివర్తం: మార్పు. మట్టి యొక్క వివర్తం కుండ. కాబట్టి కుండ మట్టికంటె వేరు కాదు. మట్టితో అభిన్నమైనదే. అట్లే జగత్తు బ్రహ్మముయొక్క వివర్తం. కాబట్టి బ్రహ్మమే. బ్రహ్మము కంటె భిన్నమైనది కాదు.

విశ్వుడు: జాగ్రద్దశలోని జీవునికి విశ్వుడు అని పేరు.

విషయాలు: చర్మం కన్ను చెవి నాలుక ముక్కు అనే అయిదు జ్ఞానేంద్రియాలు ప్రవర్తించడానికి ఆధారమైనవి. అవి స్పర్శ్భరూప శబ్ద రస గంధములు అనేవి. జ్ఞానేంద్రియాలు అయిదూ ఈ విషయాలపై ప్రవర్తించడంవల్ల ఆత్మని దర్శించడానికి ప్రతిబంధకం ఏర్పడుతుంది. విషయాల నుండి ఇంద్రియాలని మరల్చి వాటి వాటి స్థానాలలో ఆ ఇంద్రియాలని నిల్చుకోగలిగినప్పుడు ఆత్మానుభూతి లభిస్తుంది.

వైరాగ్యం: రాగం అంటే కోరిక. అది లేనివాడు విరాగుడు. ఆతని ధర్మం వైరాగ్యం. “విగతః రాగః విరాగః తస్య భావః వైరాగ్యమ్‌”. దేహంతో ఆరంభించి కార్యబ్రహ్మ పర్యంతంగల సమస్త వస్తువూ అనిత్యమైనది. అనుభవింపదగ్గ ఆ అనిత్య వస్తువు యొక్క దర్శనం శ్రవణం మొదలైన వాటియందు కోరికను విడిపెట్టడం వైరాగ్యం.

ఈ వైరాగ్యం నైర్వేద్యం జ్ఞానగర్భం అని రెండు విధాలు. నిర్వేదం అంటే దుఃఖం. దానివల్ల కలిగే వైరాగ్యం నైర్వేద్య రూపమైన వైరాగ్యం. పుత్రుడు స్నేహితుడు ఐశ్వర్యం కోరికలు మొదలైన వాటిని పొందలేకపోయినప్పుడు కలిగిన దుఃఖంవల్ల కలిగే వైరాగ్యం నైర్వేద్య వైరాగ్యం అనిపించుకొంటుంది. ఇంచుమించు ఇది తాత్కాలికం. గురువు గావించిన జ్ఞానోపదేశంవల్ల కలిగే వైరాగ్యం జ్ఞానగర్భ వైరాగ్యం. ఈ వైరాగ్యం కల్లినప్పుడు ఇల్లు పుత్రుడు స్నేహితుడు మొదలైన వాటిని అన్నింటినీ వాంతివలె భావిస్తాడు. అసహ్యించుకొంటాడు. జుగుప్పతో వాటిపై ఏమాత్రమూ ఆసక్తి పొందడు.

శబల బ్రహ్మ: హిరణ్యగర్భ బ్రహ్మము.

శమం: మనోనిగ్రహం. రూపరసగంధాది విషయాలు దోషభూయిష్టములని భావిస్తూ వాటిపై గల అనురాగాన్ని పూర్తిగా విడిచిపెట్టి తన లక్ష్యమైన ప్రత్యగాత్మయందు మనస్సుని స్థిరంగా నిల్చడం శమం.

శమాదిషట్కం: శమం దమం ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనే ఆరింటికీ శమాదిషట్కం అని వ్యవహారం.

శరీరత్రయం: స్థూలశరీరం సూక్ష్మ (లింగ) శరీరం కారణశరీరం అనే మూడు.

శుద్ధసత్త్వం: రజస్తమోగుణాలు స్వల్చంగా కూడా కలియని సత్త్వగుణం. ప్రసన్నత తనదైన ఆత్మరసాన్ని అనుభవించడం పరమశాంతి తృప్తి హర్షం పరమాత్మయందు నిష్ట అనేవి శుద్ధసత్త్వ్రగుణ ధర్మాలు. వీటిని పొందినవాడు ఆనందాన్ని అనుభవిస్తాడు.

శ్రద్ధ: వేదంలో చెప్పబడినదీ గురువు ఉపదేశించినదీ సత్యమే అని నిశ్చయాత్మకముగా విశ్వసించే బుద్ధి. దీనిచేతనే ఆత్మానుభూతి లభిస్తుంది. “శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానమ్‌” అని భగవద్గీత. (శ్రద్ధగల వానికే జ్ఞానప్రాప్తి అని భావం.)

శ్రవణం: ఉపక్రమోపసంహారాలచే వేదాంత వాక్యాలకి అద్వితీయ పరబ్రహ్మమునందు తాత్పర్యాన్ని నిర్ణంయించడం వేదాంతసంప్రదాయంలో శ్రవణం అనిపించు కొంటుంది. “షడ్విధయుక్తిభిః వేదాంత వాక్యానామద్వితీయ బ్రహ్మణి తాత్పర్య నిశ్చయః శ్రవణమ్‌” అని శాస్త్రోక్తి. ఉపక్రమోపసంహారాలు అభ్యాసం అపూర్వత ఫలం అర్ధవాదం ఉపపత్తి అనే ఆరింటిచే వేదాంతవాక్యాలకి అద్వితీయమైన బ్రహ్మమునందు తాత్పర్యాన్నినిర్ణయించడం శ్రవణం అని భావం.

శ్రేయస్సు: సుకృతానికి ఇది సాధనం. ఇది కామ్యం ఆత్యంతికం అనిరెండు విధాలు. ఫలాన్నిఉద్దేశించి చేయబడేకర్మ కామ్యశ్రేయస్సు. ఉపవాసం మొదలైనవి. మోక్షసాధనమైనది ఆత్యంతిక శ్రేయస్సు.

షడ్భావవికారాలు: వస్తువుపొందే ఆరువిధాలైన మార్చులు. పుట్టడం ఉండడం మార్ప్చుపొందడం పెరగడం క్షీణించడం నశించడం అనేవి.

“షడ్భావవికారాః భవంతీతి వార్షాయణిః జాయతే

అస్తి విపరిణమతే వర్ధతే అపక్షీయతే వినశ్యతి ఇతి” అని శాస్త్రోక్తి.

షడ్విధ లింగములు: లింగం అంటే దాగొనిన అర్ధాన్ని పొందించేది అని అర్థం. “లీనమర్థం గమయతి” అని వ్యుత్పత్తి. ఉపనిషద్వాక్యాలకి బ్రహ్మమునందు తాత్పర్యాన్ని నిర్ణయించడంలో ఆధారమనదగ్గ ఉపక్రమోపసంహారాలు అభ్యాసం అపూర్వత ఫలం అర్ధవాదం ఉపపత్తి అనే ఆరింటికీ షడ్విధలింగములు అని శాస్త్రవ్యవహారం.

“ఉపక్రమోప సంహారావభ్యాసో౭పూర్వతాఫలం

అర్ధవాదోపపత్తిశ్చ లింగం తాత్పర్య నిర్ణయే”.

సత్తు: మూడు కాలాలలోను ఉందేది.

సత్త్వగుణం: మూడు గుణాలలో ప్రధానమైనది. ఆత్మానుభూతికి అత్యంతముఖ్యమైనది. “సత్వ్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌” అని భగవద్గీత. సత్త్వగుణంనుండి జ్ఞానం కల్గుతుందని భావం. ఇది శుద్ధసత్త్వం మిశ్రసత్త్వం అని రెండు విధాలు.

సన్న్యాసం: “సమ్యక్‌ న్యాసః సన్న్యాస:” చక్కగా విడిచిపెట్టడం అని భావం. కామ్య కర్మలని విడిచిపెట్టడం సన్వ్యాసం అని భగవద్గీత చెప్తోంది.

“కామ్యానాం కర్మణాం త్యాగః సన్న్యాసం కవయో విదుః"

సన్న్యాసం వివిదిషాసన్వ్యాసం విద్వత్‌ సన్యాసం అని రెండు విధాలు. తత్త్వాన్ని తెలుసుకోవాలన్న దృఢమైన నిశ్చయంవల్ల స్వీకరించిన సన్యాసం వివిదిషాసన్న్యాసం. తత్త్వజ్ఞానం పొందిన అనంతరం గ్రహించిన సన్న్యాసం తత్త్వజ్ఞాన సన్న్యాసం.

సమాధానం: శుద్ధమైన బ్రహ్మమునందు (ప్రత్యగాత్మయందు) బుద్ధిని స్థిరంగా ఎల్లప్పుడు నిల్చ్బడం.

సమాధి: ధ్యాత ధ్యానం అనే రెండింటిని విడిచి క్రమంగా ధ్యేయమైన పరమాత్మయందు మనస్సుని గాలిలేనప్పుడు కదలకుండాఉందే దీపంవలె స్థిరంగా నిల్చ్బడం.

సమ్యగ్‌ జ్ఞానం: బ్రహ్మము ఆత్మ ఒక్కటే గాని రెండు కావు. అవి అభిన్నములు అని నిశ్చయంగా తెలిపే జ్ఞానం.

స్వప్నావస్థ: కల. జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండడం. తాను మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. జాగ్రదవస్థలో ఇంద్రియాలు ఆచరించేపనులు అన్నింటినీ స్వప్నావస్థలో బుద్ధి ఒక్కటే స్వయంగా నిర్వహిస్తుంది. కర్షృత్వాన్ని పొందుతుంది.

సాధన చతుష్టయం: నిత్యానిత్యవస్తువివేకం ఇహాముత్రఫలవిరాగం శమాదిషట్కం ముముక్షుత్వం అనే నాలుగు.

స్వాప్నికదేహం స్వప్నానుభవానికి కారణమైనది. దీనికే సూక్ష్మశరీరం అని కూడా వ్యవహారం.

సుషుప్తి: గాఢనిద్ర. ఇంద్రియములయొక్కయు బుద్ధియొక్కయు వృత్తులు అన్నీ అంతః కరణమునందు లీనమై ఉందేస్థితి. ఇదే కారణశరీరం. సర్వవిధములైన వస్తుజ్ఞానం శాంతిస్తుంది. బుద్ధిమాత్రం బీజమాత్రంగా ఉంటుంది. సుషప్తిని పొందినవాడు “కొంచెంకూడా తెలియని సుఖాన్ని అనుభవించేను” అని అంటాడు.

సూక్ష్మశరీరం: దీనికే లింగశరీరం అనికూడ పేరు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రాణవాయువులు పంచభూతాలు అంతఃకరణ చతుష్టయం అవిద్య కామం కర్మ అనే ఈ అన్నింటికీ సూక్ష్మశరీరం అని పేరు. ఇది పూర్వజన్మవాసనలు కల్గియుంటుంది. పుణ్యపాపకర్మల అనుభవానికి ఇదే ఆధారం. వాసనాశరీరం అని కూడా దీనికి వ్యహారం.

సూత్రాత్మ: అంతటా వ్యాపించియున్నది. సర్వప్రాణులనీ విశ్వాన్నీ నిలిపేది. హిరణ్యగర్భ బ్రహ్మము.

స్థూలశరీరం: మజ్జ ఎముకలు మేదస్సు మాంసం రక్తం చర్మం త్వక్కు అనే సప్తధాతువులతోను పాదాలు తొడలు వక్షస్థలం భుజాలు ప్ప ష్టం అనే అవయవాలతోను కూడినది. నేను నాది అనే మోవోనికి ఆధారమైనది. పంచీకరణం పొందిన పంచభూతములతో ఏర్పడేది.

సేతువు: అదానం క్రోధం అశ్రద్ధ అసత్‌ అనే నాల్లింటికీ వేదాంతశాస్త్రంలో సేతువు అని సంజ్ఞ, ఈ నాలుగూ సంసారబంధాన్ని కల్గిస్తాయి. బ్రవ్మార్చణం అనే భావన లేకుండా చేసేదానం అదానం అనిపించుకొంటుంది.

హిరణ్యగర్భ బ్రహ్మ: సమస్త విశ్వానికీ ఆత్మయైనది.

ముగింపు:

జగద్గురువులు ఇతరప్రకరణ గ్రంథాలు అన్నింటిలో వివేకచూడామణి, మహావాక్యదర్పణం అనే రెండూ ప్రశస్తములైనవి. "మహావాక్యదర్పణం" అంటే మహావాక్యార్ధాన్ని విశదీకరించడంలో అద్దంవంటిది అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే నాలుగు శ్రుతివాక్యాలకి మహావాక్యాలు అని పేరు. శంకరగురుచరణులు ఛాందోగ్యోపనిషత్తుకి చెందిన “తత్త్వమసి” అనే మహావాక్యానికి మాత్రమే వివరణగా మహావాక్యదర్పణ రచనని సంతరించినట్లు గ్రంథాన్ని నిశితంగా సమీక్షించినప్పుడు స్పష్టమవుతుంది. కాని సిద్ధాంత సమన్వయంలో ఇతర మహావాక్యాలు కూడా గ్రహింపబడ్డాయి.

"జ్ఞానాదేవ హి కైవల్యమ్” అని ఉపనిషద్వాణి. తత్త్వాన్ని తెలియడంచేతనే అజ్ఞానగ్రంథి విడుతుంది. సంసారబంధం తొలుగుతుంది. ఆత్మానుభూతి కల్గుతుంది. కాబట్టి జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది ఏదీ లేదు. "న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" అని భగవద్గీత ఉపదేశిస్తోంది. ఆర్ష సంప్రదాయంలో ముక్తికి సాధనమనదగిన జ్ఞానాన్ని ఉపదేశించేవాడే గురువు. "తద్విజ్ఞానార్ధం గురు మేవాభిగచ్ఛేత్, ఆచార్యవాన్ పురుషో వేద" అని ఉపనిషత్తు శాసిస్తోంది.

కీ॥శే॥ శ్రీగంటి లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వ వ్యవసాయశాఖ (A.P. Govt. Agricultural Dept.) లో చిరకాలం ఔద్యోగిక జీవితాన్ని గడిపినవారు. అది వారి లౌకికజీవితానికి సంబంధించిన విషయం. ఆధ్యాత్మికంగా వారు అధ్యయన అధ్యాపనాలతో శ్రీశంకరభగవత్పాదుల ప్రస్థానత్రయ భాష్యానికి వరివస్యగావించిన మహాత్ములు. నాకు ఆబాల్యపరిచితులు. అభ్యర్ధించగానే పరమవాత్సల్యంతో బ్రహ్మ తత్త్వోపదేశం గావించిన గురూత్తములు. నిత్యస్మరవ్యులు, ఆ గురుచరణుల అనుగ్రహం చేతనే జగద్గురు శ్రీశంకర భగవత్పాదుల ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, మహావాక్యదర్పణం వంటి అయిదు రచనలు తెలుగులో వివరింపబడ్డాయి. గురు ఋణం తీరనిదే. అయినప్పటికీ "సుధాసూతేశ్చంద్రోపల జలలవైరర్ఘ్యరచనా" అనే రీతిని వారి చరణపద్మాలకు సమర్పించుకొంటూ నా భక్తిని నివేదించు కొంటున్నాను. "గురోరధీతం గురవే నివేదితమ్" అని సంతృప్తిపొందుతున్నాను. జిజ్ఞాసువులు ఈ పరిభాషను అర్థచేసుకుని మూలగ్రంథాలను చదివి తత్త్వాన్ని ఆస్వాదించి తరింతురుగాక!

గుణదోషౌ బుధో గృష్ణాన్నిందుక్ష్వేదా వివేశ్వరః
శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్ఛతి.

శుభం భూయాత్

ఉపయుక్త గ్రంథసూచి:

  1. శతశ్లోకీ, ఆనందగిరిటీక
  2. రాధాకృష్ణదాస గోస్వామి, (1982). దశశ్లోకీభాష్యం, శ్రీగదాధరగౌరహరి ప్రెస్, మధుర, ఉత్తరప్రదేశ్
  3. మాణిక్యశాస్త్రి, మద్దులపల్లి, ఏకశ్లోకీ, తత్త్వరహస్యప్రభ వ్యాఖ్యానం
  4. విద్యానృసింహ భారతీస్వామి(అను.), సుబ్రహ్ణణ్యశాస్త్రి, జనస్వామి (పరిష్కర్త), శ్రీదక్షిణామూర్తి స్తోత్రం, పుష్పగిరి మహాసంస్థానం, తెనాలి
  5. మహావాక్యదర్పణం (1921) వ్రాతప్రతి
  6. అప్పన్నశాస్త్రి, బులుసు. (1941). భగవద్గీత శంకరభాష్యతత్త్వబోధిని, శ్రీశారదా ముద్రణాలయము, భట్నవిల్లి, అమలాపురం
  7. బృహదారణ్యకోపనిషత్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]