AUCHITHYAM | Volume-07 | Issue-10 | September 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. సింగారమైన సిక్కోలు (శ్రీకాకుళం) యాస - విశేషత
కీలు ఖగపతి
పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయన శాఖ,
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9502223570, Email: kkhagapathi@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 15.08.2026 ఎంపిక (D.O.A): 24.08.2026 ప్రచురణ (D.O.P): 01.09.2026
వ్యాససంగ్రహం:
శ్రీకాకుళం ప్రాంతం తన ఉద్యమ చరిత్రకు, విశిష్ట భౌగోళిక భాషా వైవిధ్యానికి పేరుగాంచింది. ఈ ప్రాంతంలో తెలుగుతో పాటు ఒడియా, సవర సామంత, గదబ వంటి అనేక భాషలు ప్రచారంలో ఉన్నాయి. ప్రత్యేకించి, ఇక్కడి గ్రామీణ జనాభాపరిశ్రమల వెనుకబాటుతనం స్థానిక శ్రీకాకుళం మాండలిక ఉనికిని నిత్య వ్యవహారంలో పదిలం చేసింది. ప్రస్తుత పరిశోధన శ్రీకాకుళం మాండలిక భాషా లక్షణాలను, దానిపై ఇతర భాషల ప్రభావాలను, పరిరక్షణకు ఉన్న సవాళ్లను సమగ్రంగా విశ్లేషించడం ప్రధానోద్దేశం. డా. బూదరాజు రాధాకృష్ణ "తెలుగు మాండలికాలు-శ్రీకాకుళం జిల్లా" వంటి ప్రామాణిక గ్రంథాలు, బద్రి కూర్మారావు రచనలు పరిశోధనకు ప్రాతిపదిక. గరిమెళ్ళ సత్యనారాయణ, సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, కాళీపట్నం రామారావు వంటి ప్రముఖులు తమ రచనల ద్వారా ఈ యాస సాహిత్యాభివృద్ధికి దోహదపడ్డారు. ఈ అధ్యయనం మాండలిక వ్యవహర్తలలో కనిపించే భాషా స్వరూపాలను, ఉచ్చారణా భేదాలను క్షేత్ర పరిశీలన ద్వారా విశ్లేషిస్తుంది. వర్ణ నిర్మాణం ("స" వర్ణం "త"గా మారడం), ధ్వని మార్పులు (పదమధ్య వర్ణ లోపాలు), వ్యాకరణ అంశాలు (విభక్తి ప్రత్యయాలలో ప్రత్యేకతలు), భాషాభాగాలు (నామపదబంధాలు, సర్వనామాల ప్రత్యేక రూపాలు), పదజాలం (అవశిష్ట రూపాలు, నిఘంటు అర్థాలకు సంబంధం లేని పదాలు) వంటి విశేషాలు గుర్తించబడ్డాయి. భౌగోళిక సామీప్యం వలసల కారణంగా ఒడియా ఇతర భాషల ప్రభావం సిక్కోలు యాసపై అధికం. ప్రస్తుత సామాజిక పరిస్థితులు, సాంకేతిక పురోగతి, వలసలు, జానపద కళారూపాల క్షీణత, సినీరంగంలో యాసను హాస్యాస్పదంగా చిత్రించడం వంటి అంశాలు మాండలిక వ్యవహర్తల సంఖ్య తగ్గిస్తున్నాయి. యాస పరిరక్షణకు పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు కృషి, ప్రభుత్వాల సహకారం, వలసలను నివారించే చర్యలు, సాంప్రదాయిక కళాకారుల ప్రోత్సాహం, స్థానిక మాండలికాలకు ప్రాధాన్యమిస్తూ సాహిత్య సదస్సుల నిర్వహణ అవసరం. చలనచిత్రాలలో యాస ఔన్నత్యాన్ని కాపాడాలి. సాంకేతికతను సద్వినియోగం చేసుకుని యాసను సేకరించి, నమోదు చేసి, భవిష్యత్తు తరాలకు అందించాలని ఈ అధ్యయనం సూచిస్తుంది. తెలుగు భాష మాండలికాల సంరక్షణకు విస్తృత చైతన్యం, సామాజిక మాధ్యమాల వినియోగం ప్రస్తుత ఆవశ్యకత.
Keywords: శ్రీకాకుళం మాండలికం, తెలుగు యాస, భాషా పరిరక్షణ, మాండలిక లక్షణాలు, ఒడియా ప్రభావం, జానపద కళలు, సామాజిక భాషాశాస్త్రం.
1. ప్రవేశిక
"ఓరి పండా! బేపిలొచ్చేగలవు సూత్తుండు రా,
బోది మీద కొబ్బిరి బద్దలు ఎండేసున్నాను.
నేను లచ్చిమమ్మమ్మ ఇంటికెళ్ళి బేగొత్తాను.
ఓలే లచ్చిమప్ప! ఇంతరవ్వా సోడిపిండి ఉంతే ఇత్తావా…!
మా గుంటడు సోడిపిండి సక్కు సేయమని ఒకటే గొల్లు.
ఇవాళ ఇస్కూలు నేదు, పెందిలప్పుడు పకాలి తినేసి ఎల్లిపోనాడు అలబొద్దికొచ్చినాడే.
మారు చెప్పినమాట ఇనడే, సేన కచ్చమ్మ గండడు.
ఈలమ్మ నంజి ఈడికి నాకొదిలేసి సచ్చింది. ఈడేమో సాధించేతన్నాడే,
ఏటని చెప్తానే లచ్చిమప్ప! ఈడితోని నాకు తోలుము నాస్తా…!” (శ్రీకాకుళం జానపదగేయాలు)
పై మాటలు ఏదో భాషకు తెలుగు అనువాదం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అవి మన తెలుగు భాషకు చెందిన, శ్రీకాకుళం(సిక్కోలు) యాసకు చెందిన సహజమైన పలుకులు. ఇది తెలుగుభాష మాట్లాడే ప్రాంతమైనప్పటికీ, ఇక్కడి యాస ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చును. ప్రాంతాలను బట్టి భూస్వరూప-స్వభావాలలో వైవిధ్యతలు ఉన్నట్లే, తెలుగు భాష కూడా ప్రాంతాలవారీగా, వర్గాల వారీగా ఎన్నో వైవిధ్యతలు కలిగి ఉంది.ఏదైనా ఒక ప్రాంతం లేదా మండలంలో ప్రజలు మాట్లాడే భాష మాండలికంగా పిలవబడుతుంది.యాస అనేది ఈ మాండలికానికి పర్యాయపదంగా పిలవబడుతుంది." ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు" అని మాక్స్ ముల్లర్ అన్నట్లు మాండలికమనేది ప్రత్యేక భాష కానప్పటికీ ప్రధాన భాషలో అంతర్భాగ భాషగా ఉంటుంది.
డా. భద్రిరాజు కృష్ణమూర్తి గారి ప్రకారం తెలుగునాట నాలుగు మాండలిక ప్రాంతాలు ఉన్నప్పటికీ 2014 సం.లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్లో “మధ్య మండలం, దక్షిణ మండలం, పూర్వ మండలం” అనే మూడు ప్రధాన మాండలిక ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. అందులో పూర్వమండలంగా పేర్కొంటున్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా(సిక్కోలు) మాండలికం/యాస మరెన్నో వైవిధ్యతలను కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన కళింగ రాజులు, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు వలన ఇక్కడ భాష, అందులో ప్రధానంగా ఇక్కడి యాస విభిన్నతను కలిగి ఉన్నది. ఒకప్పుడు వ్యవహారిక భాషకు పెద్దపీట వేస్తూ వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు ఈ ప్రాంతవాసి కావడం వలన ఇక్కడి వ్యవహారిక భాషకు వక్తలు అధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయం మనకు అర్థం అవుతుంది. ఎంతో వైవిధ్యమైన పదసంపద, వ్యవహార శైలితో సింగారతను సంపాదించుకున్న ఈ సిక్కోలు యాస ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకుంది.కానీ ప్రస్తుత కాలంలో బయట ప్రాంతం వారిచే తక్కువగా,నవ్వు తెప్పించేదిగా చూడబడుతున్నందున ఈ శ్రీకాకుళం ప్రాంత వాసులు కూడా కొన్ని సందర్భాలలో తమ మాతృయాసను లోలోపల దాచుకొని, సాంప్రదాయ యాసలో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.ఇక్కడి జానపదులలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం, ఇక్కడి ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు మిగతా ప్రాంతాల కంటే తక్కువ స్థాయిలో ఉండడం,”నాడు కనీ-పెంచి, జీవితాన్ని ఇచ్చిన ఊర్లు నేడు చుట్టం అవుతున్నాయి, నేడు జీతం ఇస్తున్న ఊర్లు సొంతూళ్లు అవుతున్నట్లు ఇక్కడి పల్లె ప్రజలు జీవనం కోసం పట్టణాలకు తరలిపోవడం చేత,అక్కడి ప్రజలతో మమేకం అవడానికి తమకు ఇష్టం లేకపోయినా సిక్కోలు యాసను వదిలి,సహజత్వాన్ని కోల్పోతున్నారు.ప్రపంచీకరణ పేరిట నేటి సమాజం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, సాంకేతిక ఉన్నతీకరణకై ప్రయత్నాలు కొనసాగుతున్న నేటి కాలంలో ఆంగ్ల భాషపట్ల మోజు పెరిగి, తెలుగు భాష పట్ల ఆదరణ తగ్గుతున్న పరిస్థితుల్లో భాష మనుగడలో మాండలికాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, వాటి పరిరక్షణకై పరిశోధనలు గావించి, అందుకు కారణమైన పరిస్థితులను పరిశీలించి,శ్రీకాకుళం యాస గొప్పదనాన్ని వర్ణిస్తూ, దాని పరిరక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి లోతుగా విశ్లేషించి ఈ వ్యాసాన్ని తీసుకురాగలిగాను.
ఒకప్పుడు ఉద్యమాలకు పర్యాయపదంగా మారిన ప్రాంతం శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళం అనే పదానికి మారుపేరైన “సిక్కోలు” బ్రిటిష్ కాలం నాటి “చికాకోల్” మాట నుండి ఉద్భవించింది. ఈ ప్రాంత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ప్రాచీన మహాజనపదాల కళింగ రాజ్యంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. బొబ్బిలి యుద్ధం అనంతరం ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఇది గంజాం జిల్లాలోని చికాకోల్, ఇచ్చాపురం, కాశింకోట అనే మూడు భాగాలుగా ఉండేది. 1936 సం.లో చెన్నై రాష్ట్రం నుండి ఒరిస్సా విభజన తర్వాత గంజాం జిల్లా దక్షిణ భాగమైన ఇచ్ఛాపురం, చికాకోల్ మద్రాస్ రెసిడెన్సి విశాఖజిల్లాలో చేర్చబడ్డాయి. తర్వాత 1950 సం.లో విశాఖ జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేశారు. 1979 సం.లో శ్రీకాకుళం జిల్లా నుండి కొన్ని తాలూకాలను విభజించి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ విభజన పరిణామాల మధ్య తెలుగు మాట్లాడే కొన్ని ప్రాంతాలను కోల్పోవడం జరిగింది. గిడుగు రామ్మూర్తి వంటి ప్రముఖులు ఆ ప్రాంతాల కొరకు పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రాంతం ఉత్తరాంధ్రలోనే భిన్నమైన సంస్కృతిని కలిగి ఉంది. భాషాపరమైన వైవిధ్యం కూడా ఇక్కడ విశేషం. ఈ ప్రాంతంలో తెలుగుతోపాటు ఒడియా, సవర సామంత, గోడగలి, పైడి, సవర, ఎరుకల భాషలు కలవు (కూర్మారావు 40).
వీటితోపాటు ఇక్కడి ప్రజలు “ఒల్లారి” అని పిలవబడే గిరిజన ద్రావిడ భాషను కూడా మాట్లాడతారు. ఈ ఒల్లారినే “గదబ” అని కూడా అంటారు. ఈ విధంగా ఎన్నో భాషలకు నిలయమైన ఈ ప్రాంతం భౌగోళిక, భాషాపరమైన వైవిధ్యతను కలిగి, ప్రత్యేకమైన యాసను మాండలికాన్ని కలిగి ఉంది.
2. శ్రీకాకుళం యాస – మాండలిక విశేషాలు
శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా వెనుకబడటం, అధిక శాతం ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించడం, పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండటం, అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులు అధికంగా ఉండటం వలన ఈ మాండలికం/యాస నిత్య వ్యవహారంలో ఉంది. “జనంలోంచి వచ్చిన జనపదాలే నా పాటలకు మూలం” అని వంగపండు ప్రసాదరావు గారు అన్నట్లు, ఇక్కడి యాసకు ప్రధాన మూలాధారం గ్రామీణ జనపదులే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ప్రజలకు కొంగు బంగారం లాంటి ఈ సిక్కోలు యాస వినడానికి వినసొంపుగా ఉండటమే కాదు, మాట్లాడే వారి ముఖ కవళికలు, ఆంగికాభినయంతో సింగారంగా ఉంటుంది. అటువంటి ఈ యాస విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం.
2.1. వర్ణ నిర్మాణం
ఈ మాండలిక పదాలలో "స" వర్ణానికి బదులు "త" వర్ణం ఎక్కువగా ఉచ్చరించబడుతుంది.
- వస్తావా - వత్తావా
- ఇస్తావా - ఇత్తావా
కొన్ని సమయాలలో నిరక్షరాస్యులలో “క” వర్ణం మీది “అ” కారం “ఓ” కారంగా ఉచ్చరితమవుతుంది. అప్పుడు ఆధరోష్ట్యా “వ” కారం ఆగమంగా వస్తుంది.
- కోడలు - క్వోడలు
- కోక - క్వోక (రాధాకృష్ణ 6)
2.2. ధ్వని మార్పులు
ఈ ప్రాంతంలో సాధారణంగా పదమధ్య వర్ణాలు లోపిస్తాయి.
- బాగానే - బానే
- ఏమిటి - ఏటి
- ఇంకొకటి - ఇంకోటి
2.3. వ్యాకరణ విభాగం – విభక్తులు
అన్ని వర్గాల వారిలోనూ ద్వితీయ విభక్తిలో చతుర్ధి విభక్తి ప్రత్యయం చేరుతుంది.
- నన్ను రమ్మన్నారు - నాకు రమ్మన్నారు
- దేవుణ్ణి ఎంత ప్రార్ధించినా - దేవుడికి ఎంత ప్రార్ధించినా
సప్తమివిభక్తిలో "లో, లోను, లోన, న" ప్రత్యయాలు చేరుతాయి. నిరక్షరాస్యులలో “న” అనే ప్రత్యయం ఎక్కువగా కనిపిస్తుంది.
- ఊరు - లో
- బస్సు - లోను
- రాజ్యా - న (రాధాకృష్ణ 8)
2.4. భాషాభాగాలు
2.4.1. నామపదబంధాలు
ఒకే అర్థం కలిగిన రెండు మాటలతో కూడిన పదబంధాలు అదే అర్థంలో వ్యవహరించడం తెలుగు భాష వ్యవహర్తలలో సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఇటువంటి పదబంధాలు ఈ ప్రాంత యాసలో అధికంగా కనిపిస్తాయి. ఇటువంటి పదబంధాలలో సాధారణంగా ఒకటి “దేశ్యం” కాగా, ఇంకొకటి “అన్య దేశ్యం”గా ఉంటుంది.
- సిగ్గు షెరమ్ (తెలుగు-హిందీ)
- పేపర్ కాగితం (ఆంగ్లము-తెలుగు)
- సాల్ట్ ఉప్పు (ఆంగ్లము-తెలుగు)
- దాల్ పప్పు (హిందీ-తెలుగు)
2.4.2. సర్వనామాలు
ప్రథమ పురుషలో “అతడు, ఆమె” వంటివి ఇక్కడ వాడుకలో చాలా తక్కువగా కనిపిస్తాయి. “ఆయన” అనే సర్వనామం కేవలం భర్తను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో మాత్రమే వాడుతారు. అంతేకాకుండా ఇక్కడ సర్వనామాల్లో “ల” కార దిత్వాలు ‘ల్ల, ల్లి’ వంటివి సాధారణంగా కనిపిస్తాయి.
- అది - అల్లది
- ఇది - ఇల్లిది
- ఇతను - ఇల్లిడు
- అతను - అల్లడు
2.4.3. క్రియలు
పిలుచు, కలుసు క్రియలు కొందరు వ్యవహారంలో వ్యతిరేకార్థకప్రత్యాయములుగా “పిల్, కల్”గా ఉంటాయి.
- పిలవలేదు - పిల్ లేదు
- కలవలేదు - కల్ లేదు
- కలవలేను - కలను
- పిలవద్దు - పిలను
- కలవద్దు - కలొద్దు
2.5. పదజాలం
ఈ శ్రీకాకుళం యాసలో అవశిష్ట రూపాలు కూడా ఉంటాయి.
- నూలు - నువ్వులు
- మట్టు - తొక్కు
ఇక్కడ వ్యవహారంలో ఉన్న కొన్ని పదాలు/మాటలు నిఘంటువు అర్థాలకు ఏ కొద్ది సంబంధం లేకుండా ఉంటాయి.
ఇక్కడ వాడబడే “అడ్డా” అనే పదం ప్రామాణిక తెలుగులో ఒక కొలత విశేషమైనప్పటికీ, ఉత్తర మాండలికమైన తెలంగాణ ప్రాంతంలో ఆటో అడ్డా, సైకిల్ అడ్డా వంటి స్థలాన్ని సూచించినప్పటికీ, ఇక్కడ మాత్రం “అడ్డా అంటే లైట్ చిమ్నీ”గా వ్యవహారంలో ఉంది.
అంతేకాకుండా ఈ శ్రీకాకుళం యాసలో అన్యదేశ పదాలు ఎక్కువగా కనిపించినప్పటికీ, ఈ ప్రాంతం భౌగోళికంగా ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉండటం వలన ఈ ప్రాంత యాసపై ఒడియా భాష ప్రభావం అధికంగా ఉంటుంది.
2.6. శ్రీకాకుళం మాండలికంపై ఒడియా భాష ప్రభావం
గతంలో ఈ ప్రాంతం కళింగ రాజ్యంలో ఉండటం, నైసర్గిక స్వరూపం దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాకు పశ్చిమోత్తరంగా ఒడిస్సా రాష్ట్రం సరిహద్దుగా ఉండటం, తూర్పున కూడా ఒరిస్సా రాష్ట్ర గజపతి జిల్లాతో సరిహద్దును కలిగి ఉండటం వలన శ్రీకాకుళంలోని ఒరిస్సా సరిహద్దు మండలాలైన ముఖ్యంగా “ఉద్దాన ప్రాంతం”గా పిలవబడే ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపు కొత్తూరు మండలాలలో నివసించే ప్రజల వ్యవహారిక భాషలో ఈ ఒడియా భాష ప్రభావం అధికంగా ఉంటుంది.
అంతేకాకుండా ఇక్కడ ప్రజలు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతో పోల్చుకుంటే ఒరిస్సా రాష్ట్ర పట్టణాలైన బరంపురం, పర్లాకిమిడిలతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి రాకపోకలు సాగించడం, వివాహ సంబంధాలు ద్వారా ఇరు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మధ్య సామాజిక నడతను ఏర్పాటు చేసుకోవడం, ఒడిశా రాష్ట్రానికి చెందిన “బెంతొరియా అనే జాతి ప్రజలు శ్రీకాకుళం జిల్లాలో అధికంగా ఉండటం” వంటి కారణాల వలన ఇక్కడి యాసలో ఒడియా భాష ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ‘జాదువ, పకాలి, దద్ద, బుగత, కంబారి, బెసారు, పుత్రా కొడుకు, పుత్రా కూతురు’ వంటి పదాలు ఈ సిక్కోలు యాసలో అధికంగా కనబడే ఒరియా పదాలు.
2.7. శ్రీకాకుళం మాండలికంపై ఇతర భాషల ప్రభావం
ఒడియా భాషతోపాటు ఈ శ్రీకాకుళం యాసలో అన్యదేశ పదాలు అధికంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని అన్య భాషకు చెందిన ప్రభువులు, బ్రిటిష్ వారు పాలించడం వలన, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం అండమాన్, బెంగళూరు, బొంబాయి, గాంధీధామ్, సూరత్, అహ్మదాబాద్ వంటి పొరుగు రాష్ట్ర ప్రాంతాలతో పాటు రంగం(బర్మా), ఇండోనేషియా, మలేషియా, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్లి రావడం వలన ఇక్కడ యాసలో కన్నడ, మరాఠీ, గుజరాతి, హిందీ, ఇంగ్లీష్ పదాలు కూడా సందర్భానుచితంగా వ్యవహరించబడుతుంటాయి.
2.8. శ్రీకాకుళం యాస – ప్రస్తుత పరిస్థితి
ఏదైనా ప్రాంత సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాత తరాలకు పదిలంగా అందించడంలో సాహిత్యం ఎంత ముఖ్యమో, ఆ సాహిత్యాభివృద్ధిలో భాషతోపాటు ఆ భాషకు ఆయుపట్టు లాంటి యాసలు/మాండలికాల మనుగడ అంతే ముఖ్యం. ఒకనాటి పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు సిక్కోలు యాస వ్యవహర్తలు తగ్గుతున్నరన్న మాట వాస్తవం. ఈ ప్రాంతానికి చెందిన భాషావేత్తలు, కళాకారులు, వ్యవహర్తలలో ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. స్వాతంత్రోద్యమకాలం నుండే గరిమెళ్ళ సత్యనారాయణ, సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు వంటి ప్రముఖులు తమ రచనలు ద్వారా ఇక్కడ సాహిత్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. వీరితోపాటు ఈ ప్రాంతానికి చెందిన కాళీపట్నం రామారావు మాస్టారు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు. అంతేకాకుండా సుబ్బారావు పాణిగ్రహి, ఛాయిరాజ్ వంటి రచయితలు నాటి శ్రీకాకుళం జీవన పరిస్థితులను ప్రస్ఫుటీకరించేలా, ఇక్కడి జనం కొరకు నిలబడి తమ నైజాన్ని మరవకుండా ఒక నిజం మీద నిలబడి భావోద్వేగంతో కావ్యాలు, రచనలు రాయడం జరిగింది. ఈ రచనలు ద్వారా ఇక్కడ ప్రజలు చైతన్యం పొంది ఉద్యమాలు చేపట్టడం ఆనాడు ఉమ్మడి రాష్ట్రాన్ని సైతం నివ్వెర పరిచింది. వీరితోపాటు శ్రీకాకుళం పరిస్థితులు, ఇక్కడి ఉద్యమకారులు, భూస్వామ్య వ్యవస్థ నడుమ ఇక్కడ ప్రజల అవస్థలు, ఈ ప్రాంత సాహిత్య సంపద గురించి అనేక మంది రచయితలు, కళాకారులు తెలుగు సాహిత్య ప్రపంచానికి చేరువ చేశారు. రావిశాస్త్రి, గడ్డపు సత్యం, దూసి ధర్మారావు, బలివాడ కాంతారావు, రోణంకి అప్పలస్వామి, వెలమల సిమ్మన్న, అట్టాడ అప్పలనాయుడు, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి వంటి రచయితలతోపాటు దూసి బెనర్జీ భాగవతార్ (హరికథా కళాకారులు), ఎడ్ల గోపాలరావు, టంపా రాములు, సుబ్బారావు పాణిగ్రాహి వంటి జముకుల పాట కళాకారులు, గంగిరెద్దుల వాళ్ళు, ఎరుకల వాళ్ళు, జంగాలు, దాసరులు, పగటివేషగాళ్లు వంటి ఎంతోమంది ఈ ప్రాంత వాసులు తమ రచనలు, కళలు ద్వారా ఈ ప్రాంత సాహిత్య సంపదను, యాస భాషలను పరిరక్షిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వీటికి భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యాసకు చెందిన కొన్ని వ్యవహార పదాలు ఈ ప్రాంతంలోనే ఉన్న కొద్దిమంది యువతకు పరిచయం లేకపోవడం, ఈ యాసను ప్రజలకు చేరువ చేసే సాంప్రదాయ రచనలు చేయకపోవడం, ఈ ప్రాంతానికి చెందిన కొన్ని ప్రాచీన జానపద కళారూపాలు అంతరించి పోతుండటం వంటి అంశాలు గతం కంటే ఈ యాస పట్ల మక్కువ తగ్గిందనే విషయాన్ని తెలియపరుస్తున్నాయి.
నేటి కాలంలో టీవీ, సినీ, సాంకేతిక రంగాల ప్రభావం వలన సదరు ప్రాచీన కళలకు ఆదరణ తగ్గి, ఈ యాస-భాషలను పరిరక్షించే కళాకారులకు సరైన ఆదరణ లేక వారి జీవన పరిస్థితులు దుర్భరంగా మారడం వలన వారు కూడా పొట్టకూటి కోసం సాంప్రదాయేతర వృత్తుల పట్ల ఆసక్తి చూపడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకప్పుడు శ్రీకాకుళం ఉద్యమకారులు/ సాహిత్యకారులు గురించి, ఇక్కడి భాష, యాస, సాహిత్య సంపద గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస బయట వారికి సైతం మెండుగా ఉండేది. ఉదాహరణకు ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో మారుమూల జిల్లా అయిన నిజామాబాద్ కు చెందిన డాక్టర్ కె ముత్యం గారు ఇక్కడి సాహిత్యకారులైన సుబ్బారావు పాణిగ్రాహి వంటి వారి జీవిత చరిత్రను అధ్యయనం చేసి సాహిత్య ప్రపంచానికి అందించినప్పటికీ, ఇక్కడి ప్రజలు సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి, అక్కడి వారి భాషను తమ యాసతో మిళితం చేసి సంభాషించడం వలన అసలైన తమ మాతృయాసను కోల్పోతున్నారు.
2.9. శ్రీకాకుళం యాసపై సినీరంగ ప్రభావం
“గణేష్ పాత్రో” లాంటి సినీ రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసినప్పటి నుండి అనేక సందర్భాలలో ఈ ప్రాంత యాస హాస్యాస్పదంగా, కేవలం నవ్వించడానికి మాత్రమే వినియోగించడం ద్వారా హేళనకు గురవుతుంది. అయితే ఇటీవల కాలంలో ధమాకా (పల్సర్ బైక్ మీద రాను బావ), కోటబొమ్మాలి పిఎస్ వంటి పలు చిత్రాలలో ఇక్కడి స్వచ్ఛమైన యాసలో ఉన్న జానపద గేయాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం శుభపరిణామమైనప్పటికీ, ఇందులో కేవలం అభిమానులను అలరించాలనే ఉద్దేశంతో తప్ప ఆ మాండలికపు సాహిత్యాన్ని ఆదరించాలనే సదుద్దేశం లేకపోవడం కొంత బాధాకర అంశం. ఏది ఏమైనా ఈ ప్రాంతానికి చెందిన దివంగత కొండవలస లక్ష్మణరావు (సినీ నటుడు), షకలక శంకర్ (జబర్దస్త్ ఫేం హాస్యనటుడు) వంటివారు సినిమాలలో కూడా వారి సాంప్రదాయ యాసనే కొనసాగించడం, అలా వైకుంఠపురం చిత్రంలో "సిత్తరాల సిరపడు" అనే పాట ద్వారా తన శ్రీకాకుళం యాసను ఉపయోగిస్తూ పాట రాసిన బల్ల విజయ్ కుమార్ వంటి ప్రముఖుల ప్రయత్నాలు ఈ యాస పరిరక్షణకు, ప్రచారానికి తార్కాణాలుగా భావించవచ్చు. అంతేకాకుండా మూకీ (మూగ) చిత్రాల నుండి టాకీ (మాట్లాడే) చిత్రాలుగా ఉన్నతీకరణ జరిగిన తరువాత సినిమారంగం అనేది భాషతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంది. కనుక ఈ సినిమారంగం అనేది కూడా భాష పరిరక్షణలో తన వంతు పాత్రను పోషించడం ఆవశ్యకం.
ఉపసంహారం
నేటి సమాజం సాంకేతిక పురోభివృద్ధికై పరితపిస్తున్న పరిస్థితులలో, శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటికి అవసరమయ్యే పలు పరిశోధనలు, కార్యచరణ ప్రణాళికలు అన్ని ఆంగ్ల భాష చుట్టూ కేంద్రీకృతం అవుతున్న నేపథ్యంలో మన మాతృభాష తెలుగుతోపాటు తెలుగు భాష మనుగడకు ఊతమిచ్చే యాసలను పరిరక్షించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని కొరకు పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు, వ్యవహర్తలు మొదలు వ్యవహారాలు సక్కపెట్టే నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సి ఉంది. తెలుగునాట వ్యవహారంలో ఉన్న అనేక యాసలలో శ్రీకాకుళం యాసకు ఒక ప్రత్యేకమైన స్థానం కలదు. తెలుగు భాషా పదాలతో పోల్చుకుంటే ఇక్కడ వ్యవహారంలో ఉన్న కొన్ని పదాలలో వైవిధ్యత కనిపిస్తుంది. స్వాతంత్రోద్యమ కాలంలో మాకొద్దీ తెల్ల దొరతనము అని రచనలు చేసి జైలు జీవితం అనుభవించిన తొలి తరం నాయకుడైన గరిమెళ్ళ సత్యనారాయణ, విప్లవ భావజాలంతో ఉద్యమాలకు ఊపిరి పోసిన సుబ్బారావు పాణిగ్రాహి, తన యాసలో పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచిన వంగపండు ప్రసాదరావు, వ్యవహారిక భాషకు ప్రాధాన్యతనిస్తూ వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నడిపిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు వంటి ప్రముఖులను అందించిన నేలలో నేడు వ్యవహారిక భాషకు వక్తలు తగ్గుతుండటం, శ్రీకాకుళం యాస కొంత అపహాస్యంగా, చులకనగా చూడబడటం, అలా అని దీనిని ఎవరూ బహిరంగంగా అగౌరపరచకపోయినా, ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇక్కడి యాసను ఉపయోగించే పాతతరపు వక్తలు సంఖ్య నానాటికీ తగ్గిపోవడం, ఈ యాస ఆధారంగా ప్రదర్శనలు ఇచ్చే టంప రాములు వంటి సంప్రదాయ జానపద కళాకారులు కాలం చెల్లించుట వలన, వారితో పాటు ఈ యాసలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి ఈ భాష-యాస రీతులను సేకరించి, వాటిపై పరిశోధనలు గావించి, వాటిని పదిల పరచి, భవిష్యత్తు తరాలకు అందించడం, స్థానిక మాండలికాలలో రచనలు చేసిన వారిని ప్రోత్సహించడం, జానపద కళాకారులను/వృత్తి కళాకారులను ప్రోత్సహించేలా, ఇక్కడ ప్రజలు వలస పోకుండా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, అందుకు తగిన చర్యలు తీసుకోవడం, భాష అభివృద్ధికి, మాండలికాల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం, స్థానిక మాండలికాలలో సాహితీ సదస్సులను నిర్వహించడం, శ్రీకాకుళం యాస వంటి పలు యాసల పట్ల ఉన్న చులకన భావనను రూపుమాపడం, చలనచిత్రాలలో కూడా సదరు యాసను హేళనాపరంగా, హాస్యాస్పదంగా మాత్రమే ఉపయోగించకుండా భాష ఔన్నత్యాన్ని పెంచే విధంగా, మాండలికాల మర్యాదను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి.
ఏ సాంకేతికత కారణంగా నేడు తెలుగు భాషకు, మాండలికాలకు ఆదరణ తగ్గుతున్నదని భావిస్తున్నామో అదే సాంకేతికతను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు చెందిన యాస-భాషలను సేకరించి, తర్వాత తరాలకు ఉపయోగపడేలా వాటిని రికార్డ్ చేసి, అంతర్జాతీయ వేదికల యందు వాటిని విరివిగా ఉపయోగించేలా, అంతర్జాల ఆధారిత సేవలను వినియోగించుకోవాలి. ప్రాథమిక స్థాయి నుండే తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, సవర, కోయ లాంటి ప్రత్యేకమైన భాష-యాస కలిగినటువంటి వారికి ప్రత్యేక పాఠ్యపుస్తకాలు అందించాలి. అంతేకాకుండా విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఈ మాండలికాల పట్ల పరిశోధనకు ప్రాధాన్యతనివ్వాలి. వారితోపాటు నేటి తరపు కళాకారులు కూడా వారు ప్రదర్శించే కళారూపాల యందు పాశ్చాత్య సంస్కృతిని విడనాడి, వారి ప్రదర్శనలలో అన్య భాషా పదాలకు బదులు సాంప్రదాయ యాస-భాషలను ఉపయోగించాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాష మనుగడ కొరకు, అందులో ఉన్న పలు మాండలికాల ఉనికి కొరకు ఉన్నతంగా ఆలోచించి, ప్రత్యేకమైన పరిరక్షక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి భాషా పరిరక్షణకు, అందులోని యాసల సంరక్షణకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, వ్యవహర్తలలో భాషా చైతన్యాన్ని తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. శాస్త్ర సాంకేతిక విపణిలో దినదినాభివృద్ధి చెందుతున్న అధునాతన పద్ధతులను, సాంకేతిక విధానాలను ఉపయోగించి భాష-యాసలను సంరక్షించి, వాటిని సుభిక్షంగా తర్వాత తరాలకు అందిస్తారని ఆశిస్తున్నాను.
- శ్రీకాకుళం యాస చరిత్ర, భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలను కలిగి, ఒడియా ఇతర భాషల ప్రభావానికి లోనవుతుంది.
- మాండలికంలో వర్ణ నిర్మాణం, ధ్వని మార్పులు, వ్యాకరణ విభక్తి ప్రత్యయాలు, భాషాభాగాలు, పదజాలం ప్రత్యేకతను చూపుతాయి.
- ప్రస్తుతం, సినీ ప్రభావం వలన యాస హాస్యాస్పదంగా మారడం, వ్యవహర్తలు తగ్గడం, యువతకు పరిచయం లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది.
- యాస పరిరక్షణకు పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు కృషి, స్థానిక రచనలకు ప్రోత్సాహం, జానపద కళాకారులకు మద్దతు అవసరం.
- సాంకేతికతను ఉపయోగించి యాసను నమోదు చేయడం, ప్రాథమిక స్థాయిలో ప్రత్యేక పాఠ్యపుస్తకాలు, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు అందించాలి.
- ప్రభుత్వాలు, సామాజిక మాధ్యమాలు భాషా చైతన్యం కల్పించి, యాసను గౌరవించే వాతావరణాన్ని సృష్టించాలి.
ఉపయుక్త గ్రంథసూచి
- అప్పలస్వామి, వంగపండు. ఉత్తరాంధ్ర (చరిత్ర, సంస్కృతి). ప్రగతిసాధనసమితి, విశాఖపట్నం 2003.
- కూర్మారావు, బద్రి. కళింగాంధ్ర జానపద గేయాలు; పల్లే పాటలు. విజయనగరం, బద్రి అప్పన్న స్మారక కళా పీఠం & సిక్కోలు బుక్ ట్రస్ట్, 2015.
- కూర్మారావు, బద్రి. ఉత్తరాంధ్ర జానపద కళలు. విజయనగరం, గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం బద్రి అప్పన్న స్మారక కళాపీఠం, మొదటి ముద్రణ, 2005.
- జయధీర్, తిరుమలరావు. ముందుమాట. కళింగాంధ్ర జానపద గేయాలు, విజయనగరం, బద్రి అప్పన్న స్మారక కళా పీఠం & సిక్కోలు బుక్ ట్రస్ట్, 2015,
- రాధాకృష్ణ, బూదరాజు. తెలుగు మాండలికలు- శ్రీకాకుళం జిల్లా. హైదరాబాదు, తెలుగు అకాడమీ, ఏడవ ముద్రణ, 1984.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

