AUCHITHYAM | Volume-07 | Issue-10 | September 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. రాయలసీమ ఆధునిక కథాసాహిత్యం: సామాజికదృక్పథం
మాదారపు హరినాథ్
తెలుగు పరిశోధకులు, తెలుగు & అనువాద అధ్యయనశాఖ,
ద్రావిడ విశ్వవిద్యాలయం, శ్రీనివాసవనం, కుప్పం.
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9493295086, Email: madarapuharinath@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 12.08.2026 ఎంపిక (D.O.A): 28.08.2026 ప్రచురణ (D.O.P): 01.09.2026
వ్యాససంగ్రహం:
తెలుగు వారికున్న నాలుగు భౌగోళిక ప్రాంతాలలో రాయలసీమ ఒకటి. రాయలసీమ ఒకనాడు రత్న గర్భగా, వెలసింది. నేడు రాళ్ళ సీమగా అనేక కష్టనష్టాలకు, ఒడిదుడుగులకు లోనై, ఆ ప్రభావం రాయలసీమ ప్రజలపై పడింది. వారి జీవన విధానాన్ని, శ్రమ జీవన విధానంలో ఉన్న సౌందర్యాన్ని కథా సాహిత్యం వెలుగులోనికి తీసుకువచ్చింది. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ప్రక్రియ కథ. మనిషి నిత్య జీవితంలో నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రపోయేంతవరకు కథ పక్రియను ఏదో ఒక సందర్భంలో చూస్తుంటాడు. రాయలసీమ కవులకు, కళాకారులకు, రాజనీతిజ్ఞులకు, మేధావులకు పురిటి గడ్డ. ఈ ప్రాంతంలో విభిన్నమైన, వినూత్నమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అదేవిధంగా విభిన్న మతాలు, వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అల్లసాని పెద్దన, అన్నమయ్య వంశీయులు, కవి చౌడప్ప వంటి కవులు ఈ ప్రాంతం వారే కావడం విశేషం. ఈ ప్రాంతంలో ఎన్నో ఆధునిక ప్రక్రియలు ఇక్కడ వెలిశాయి. అందులో ప్రజాదరణ పొందినది, ముఖ్యమైనది కథానిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి, చిలుకూరి దేవపుత్ర, కలువకొలను సదానంద, మధురాంతకం రాజారాం, డాక్టర్.ఎం. హరి కిషన్, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, పలమనేరు బాలాజీ, డాక్టర్. వేంపల్లి గంగాధర్, డాక్టర్. వి.ఆర్.రాసాని, ఎం.కే.దేవకి, డాక్టర్. మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, ఎండపల్లి భారతి, మొదలైన కథకులు ఎందరో ఉన్నారు. వీరందరూ, తమ తమ కథల్లో రాయలసీమ సంస్కృతిని, సమకాలీన చరిత్రను, ప్రజల సాంఘిక జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. మరి ముఖ్యంగా ఆధునిక కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక సామాజికాంశాలను,(రైతుల సమస్యలు, దళితుల స్త్రీల సమస్యలు, నిరుద్యోగ కృషి, రైతుల పొలాలను ప్లాట్లుగా మార్చడం, ప్రేమలు ఆత్మహత్యలు మొదలైన) వివిధ ప్రాంతాలలోని ప్రజల జీవన విధానం తమ తమ కథల్లో క్లుప్తంగా చిత్రీకరించారు. ఈ క్రమంలో కొందరు కథకులు రచించిన కథలలోని సామాజిక అంశాలను క్లుప్తంగా వివరించగలను. ఈ కథలను చదవడం ద్వారా సమాజంలో జరుగుతున్న, ఆధునిక పోకడలను, మార్పులను,మోసాలను, సమస్యలను తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు అనేది ఈ వ్యాస సారాంశం. పూర్వ పరిశోధనలు: 1. కె. లింగమయ్య గౌడ్ - ఒక దశాబ్ది రాయలసీమ కథానిక-ఒక పరిశీలన (2001-2010)-యోగి వేమన విశ్వవిద్యాలయం. 2.బి. ఉపేంద్ర -తెలుగు శాఖలో 1981-1990 వరకు రాయలసీమ కథలు- యోగి వేమన విశ్వవిద్యాలయం. 3. తవ్వా వెంకటయ్య -తెలుగు శాఖలో ప్రారంభం నుండి 1980 వరకు రాయలసీమ కథలు సిద్ధాంత వ్యాసం.
Keywords: కథ, రత్నగర్భ, పురిటిగడ్డ, సంస్కృతి, కళ్ళకు కట్టినట్లు, భౌగోళికప్రాంతం, దళితులు, నిరుద్యోగులు, సామాజిక అంశాలు.
1. ప్రవేశిక
రాయలసీమ ప్రాంతం చరిత్రలో హిరణ్యక రాష్ట్రం, రేనాడు, ములికినాడు అనే పేర్లతో పిలువబడింది. 1953 కు పూర్వం రాయలసీమ భూభాగంలో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బళ్లారి జిల్లా కూడా కలిసి ఉండేది. రాయలసీమ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే రాయలసీమ ప్రాంతం 18వ శతాబ్దం నుండి దత్త మండలంగా పిలువబడేది. 16, 17 వ శతాబ్దంలో ఈ ప్రాంతం మట్ల సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది. ఈ కాలంలో వ్రాయబడిన “అభిషక్త రాఘవం” అనే ప్రబంధంలో రాయలసీమ అనే పేరు ఉంది. (చరిత్రలో రాయలసీమ-భూమన్, పుట -34)
ఎన్నో రాజ వంశాల చేత ఈ ప్రాంతం పాలించబడింది. నిజాం నవాబు బ్రిటీష్ వారికి ధారాదత్తం చేసిన రాయలసీమ జిల్లాలలో బళ్లారి, కడప, కర్నూలు మాత్రమే ఉన్నాయి. కానీ 1911లో ఆర్కాట్ నవాబు నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో కడప జిల్లాకు చెందిన కొన్ని తాలూకాలను కలుపుకున్నారు. అలాగే పుంగునూరు జమీందారులను కూడా కలుపుకొని 1911 లో చిత్తూరు జిల్లా ఏర్పాటయింది. తదనంతరం చిత్తూరు జిల్లా రాయలసీమలో ప్రధానమైన స్థానాన్ని సంపాదించుకుంది. రాయలసీమ ప్రాంతం సాహిత్య పరంగాను, రాజకీయపరంగాను విశేషమైన స్థానాన్ని కలిగి ఉంది. రాయలసీమ ప్రాంతాన్ని దత్త మండలం లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్ అని పిలవడానికి చాలామంది జీర్ణించుకోలేక పోయారు. 1928 నవంబర్లో నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు “రాయలసీమ” అన్న పేరు సూచించారు. దీనిని అందరూ ఆమోదించారు. (చరిత్రలో రాయలసీమ-భూమన్, పుట -34)
2. రాయలసీమ కథానేపథ్యం
తెలుగు కథా సాహిత్యంలో గురజాడ అప్పారావు 1910లో రాసిన దిద్దుబాటు కథతో ప్రారంభమైనదని విమర్శకులు పేర్కొన్నారు. అయితే తదనంతర కాలంలో జరిగిన అనేక పరిశోధనల ఫలితంగా గురజాడ అప్పారావు కంటే ముందే తెలుగు కథా సాహిత్యం ఉన్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. 1902 వ సంవత్సరంలో బండారు అచ్చమాంబ రాసిన “ధన త్రయోదశి” కథ గురజాడ అప్పారావు కంటే ముందే వచ్చింది. దీనిని బట్టి తెలుగు కథా సాహిత్యం 1902లోనే ప్రారంభమైందని అర్థం చేసుకోవచ్చు. (హిందూ సుందరి పత్రిక, నవంబర్ 1902)
తెలుగు కథా సాహిత్యంతో పోల్చినప్పుడు రాయలసీమ కథా సాహిత్యం చాలా ఆలస్యంగా ప్రారంభం అయిందని విమర్శకుల అభిప్రాయం. ప్రముఖ సాహితీ విమర్శకులు రాయలసీమ కథా సాహిత్యం 1941లో జి.రామకృష్ణ రాసిన చిరంజీవి కథతో ప్రారంభమైందని చెప్పారు. కానీ పరిశోధనల ఫలితంగా రాయలసీమ కథ 1941 కంటే ముందే ఉందని నిరూపితమైంది. వల్లంపాటి కూడా 1941 లోనే రాయలసీమలో కథానిక పుట్టిందని పేర్కొన్నారు. (విజయవాణి పత్రిక 16/03/1941-జి రామకృష్ణ)
అయితే ఇటీవల జరిగిన పరిశోధనల కృషి వల్ల 1918లో “సౌందర్య వల్లి” పత్రికల్లో వచ్చిన ”కడపటి పైసా” తొలి రాయలసీమ కథ అని తేల్చారు .(గాడిచర్ల రామబాయమ్మ సంపాదకత్వం-రచయిత గాడి చర్ల హరి సర్వోత్తమరావు) కానీ 2015లో వివినమూర్తి సంపాదకత్వంలో వెలువడిన “దిద్దుబాటులు” కథల సంకలనం ద్వారా 1882లో “ఋతు చర్య” అనే కథ వెలువడింది. (జనవినోదిని-1882 జనవరి మాస పత్రిక)
ఈ కథ రాయలసీమ భౌగోళిక ప్రాంతంలో జరిగినట్లు కథలో స్పష్టమైనది. కనుక ఇంతకు పూర్వం రాయలసీమ కథా సాహిత్య అంశాలను పరిశీలించి తర్వాత “ఋతుచర్య” కథా రచయిత పేరు తెలియని రాయలసీమ తొలి కథగా పరిగణించవచ్చు. భారత కథానిధిలో వచ్చిన కథలు, సౌందర్యవల్లి పత్రికలో వచ్చిన కథలను, అలాగే దిద్దుబాటలు సంకలనంలో వెలువడిన కథలను పరిశీలించిన అనంతరం రాయలసీమ నుంచి వచ్చిన తొలి కథ “ఋతుచర్య” అని స్పష్టమైనది. (జన వినోదిని-1882 జనవరి మాసపత్రిక)
3. రాయలసీమ ఆధునిక కథలు-సామాజిక దృక్పథం
3. టీచర్లకు మారు పేర్లు పెట్టిన విద్యార్థులు
నేడు విద్యార్థులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. గురువులంటే గౌరవభావం లేదు. చదువు పట్ల ఆసక్తి లేదు. దాని మూలంగా క్రమశిక్షణ తప్పుతున్నారు. ఈ విషయాన్ని కథకుడు కల్లూరు రాఘవేంద్రరావు ఇలా తెలిపాడు:
“అది కాదే బుజ్జి! ఇది సుమతీ శతక పద్యం. ఇవి మనకు పూర్వం నుండి ఉన్నవే! అంటూ ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ మనవరాలు పరమేశ్వరి ససేమేరా ఒప్పుకోనంది.”మేడం చెప్పింది వేదం”అంటూ వాదించింది. “నీ వెర్రిగానీ కావాలంటే తెలుగు నిఘంటువు చూడు”అంటూ ఆవిడ గబగబా గదిలోకి వెళ్ళి తన పాత పుస్తకాల దొంతరలో నుండి నిఘంటువు తీసి పేజీలు తిప్పి చూపించింది. కానీ ఆ మూడో తరగతి విద్యార్థిని ఒప్పుకోనంది. దాంతో నానమ్మకు విపరీతమైన కోపం వచ్చి, మీ పంతులు ఎవరో గాని, ఆ చిలకమర్తి వారి”గణపతి”ని మించిపోయారు కదే! ఆ మొద్దు గణపతి మాస్టారు పిల్లలకు”శ్రీ రఘురామ చారు తులసీదళదామ…పద్యానికి అర్థం చెబుతూ ఓరే! శ్రీరాములవారికి పైత్యం చేస్తే ఓనాడు చారు కాపించుకున్నారట. కరివేపాకు దొరక్కపోతే అందులోకి తులసీదళాలు వేసి కాచారట. దాంతో కఫం పోయింది అని చెప్పాడట. అలా ఉంది మీ చదువు అంటూ గట్టిగా నవ్వింది కామాక్షమ్మ. దాంతో పరమేశ్వరికి కోపం మండుకొచ్చింది. వెంటనే మాటకు మాట అందుకుంటూ.. “మా మేడం తెలుగు పండిట్ తెలుసా? ఐదో క్లాసు కూడా సరిగ్గా పాసు కాలేదు నీవు. మా టీచర్ కే పేర్లు పెడతావా! అంది కామేశ్వరి, అదోరకంగా చేతులూపుతూ…… ఈ వెటకారానికేం తక్కువ లేదుగానీ, నేను చెబుతాను రాసుకో అంటూ బెత్తం చేత్తోపట్టుకుని విద్యార్థి ముందు కూర్చునే పూర్వపు మాస్టారులా పరమేశ్వరి ముందు కూర్చుంది కామాక్షమ్మ. “అబ్బో! భలే చెప్పొచ్చావులే. నీ అర్థం ఎవరికి కావాలి. అది రాస్తే నాకొచ్చేది జీరోనే….” అంది పరమేశ్వరి మరింత వెటకారంగా” (1. మూడుకాళ్ళ మేక-కల్లూరు రాఘవేంద్రరావు, పుట.75)
ఆనాడు విద్య ఉపాధ్యాయ కేంద్రీకృత ఆధీనంలో ఉండేది. గురువులను విద్యార్థులు తల్లిదండ్రులతో సమానంగా భావించి గౌరవించేవారు, పూజించేవారు. అదేవిధంగా తల్లిదండ్రులు, సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఉండేవి. నేడు విద్య విద్యార్థి కేంద్రీకృత ఆధీనంలో నడుస్తోంది. గురువుల పట్ల విద్యార్థులకు గౌరవ మర్యాదలు లేవు. క్రమశిక్షణ (దుస్తులు, కటింగ్, ప్రవర్తన) రోజురోజుకు తప్పుతున్నారు. దండించిన, శిక్షించిన, విద్యార్థులు కక్ష సాధింపు చర్యగా భావించి ఎదిరిస్తున్నారు. తల్లిదండ్రులతో, సంఘాలతో, మీడియాతో ఎదురుదాడి చేయిస్తున్నారు.
నేడు ఉపాధ్యాయ వృత్తి కత్తి మీదసాములా తయారయింది. వీటికి తోడు విద్యార్థుల చేతిలో చరవాణి అందుబాటులో ఉండడం. క్రమశిక్షణ తప్పడం. సమాజం, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, మీడియాలకు భయపడి విద్యార్థులను దండించడం ఉపాధ్యాయుడు దాదాపుగా మానుకుంటున్నాడు. తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యలో భాగస్వాములై ఉపాధ్యాయులతో సహకరించినప్పుడే విద్యార్థుల అభ్యున్నతి సాధ్యమవుతుందని, మరి ముఖ్యంగా కేవలం ఉపాధ్యాయుడు విద్యార్థి మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం కలిసి విద్యార్థి భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరాన్ని సామాజిక దృక్పథంతో ప్రతిబింబిస్తుంది. దేశ భవిష్యత్తు నాలుగు గదుల లోపే ఉంటుందని దేశ ప్రప్రథమ ప్రధాని నెహ్రూ గారు పేర్కొన్నారు. కనుక విద్యార్థుల క్రమశిక్షణను అదుపు చేయకపోతే సమాజం చెడు మార్గంలో పయనిస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
4. రంగురాళ్ళు ఏజెంట్లు
కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో పొలాల్లో దొరికే రంగు రాళ్ళ కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. వారి దగ్గర రంగురాళ్లు కొనడానికి ఏజెంట్లు వస్తున్నారు. వారి వ్యవహారాలను కథకుడు డాక్టర్. వేంపల్లి గంగాధర్ ఇలా తెలిపాడు.
ఏజెంటు. పల్లెలోకి జీపు వస్తాండేది దూరం నుంచి చూసినాడు కదిరప్ప. ఈ ఏజెంట్లతో ఇదే చావు. చెబితే వినరు. అనుమానం సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. దౌర్జన్యం చేస్తారు. పోనీ దొరికిందని ఇస్తే మాత్రం రెండువేలో, నాల్గువేలో చేతిలో పెట్టి ఇది ఇంతకంటే ఎక్కువ ధర పలకదని చేతులు దులుపుకుంటారు. వాళ్ళు మాత్రం లక్షల్లో దాన్ని అమ్మేసుకుంటారు. ఎన్ని చూడలేదు? జీపు వచ్చి కదిరప్ప ఇంటి ముందు ఆగింది. బాగా చూసిన ముఖం. నువ్వేనా…. ఒక వెటకారపు నవ్వు. అవునన్నా…. నులక మంచం పైన దుప్పటి పరిచి కూర్చోమన్నాడు కదిరప్ప. గరుడ పచ్చ దొరికిందని పల్లెల్లో అందరూ అనుకుంటా వుండారు. నిప్పు లేనిదే పొగరాదు కదా. చూపిస్తే ధర మాట్లాడుకుందాం.. తేల్చి పారేస్తూ అడిగేశాడు ఏజెంట్. కదిరప్ప ఏం మాట్లాడలేదు… నిశ్శబ్దం…. యల్లయ్య తనచెవి పైన దాచుకున్న సగం తాగిన బీడీ వెలిగించుకోవడానికి సన్నద్ధమవుతున్నాడు.
“చూపించు కదిరప్ప. నీకు నష్టం జరగదు. మంచి ధర ఇస్తాను. నా మాట విను మళ్లీ అడిగాడు ఏజెంట్. అతడి గొంతులో ఎప్పుడెప్పుడు గరుడ పచ్చ రాయిని చూడాలని ఆత్రుత కూడా కనిపిస్తోంది” (1. గంగమ్మ పూలు- డాక్టర్ వేంపల్లి గంగాధర్, పుట.49)
ఆ రాళ్ళు ఏరువాక లోనే బయటపడతాయి. వాటిలో కొన్ని విలువైన రాళ్లు కూడా ఉన్నాయి. ఈ అంశంలో రంగురాళ్ల సేకరణ వెనుక ఉన్న శ్రమ, పేదరికం, ఆశ, దళారీ వ్యవస్థ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు విలువైన రాళ్లు దొరుకుతాయనే ఆశతో ప్రజలు కష్టపడుతుంటే, వాటిని మరోవైపు కొనుగోలు చేసే ఏజెంట్లు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అక్కడికి ఒత్తుంటారు. రాయలసీమ ప్రాంతీయ జీవితములోని వృత్తి, ఆర్థిక సంబంధాలు, శ్రమజీవుల ఆశలు, మధ్యవర్తుల పాత్రలను వాస్తవికంగా ప్రారంభించే సామాజిక అంశంగా భావించవచ్చు.
5. ప్లాట్ల కోసం రైతుల పొలం కొనుక్కునుట
దాదాపుగా, రెండు దశాబ్దాల నుంచి పొలాలను ప్లాట్లుగా మలచి అమ్మి వేసి లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తమ పొలాలను తక్కువ ధరకు అమ్మి రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కథకుడు రాచ పూటి రమేష్ ఇలా తెలిపాడు.
“నాదముని చిన్నగా నిట్టూర్చి మేము పుట్టినప్పటినుంచి ఈడనే తలో గంజో తాగి బతకతా వుండాం. ఈ జాగాను ఎట్లా అమ్ముకుంటాము నాయనా”అన్నాడు చిరాగ్గా. “ముసిలాయప్పా, నీకు ఏమీ తెలీదు. మీ పిలకాయలా ఏడనో, వాళ్ళ బతుకులు వాళ్లు బతుకుతా ఉండారు. వాళ్లకి జాగా పని లేదని నాకు తెలుసు. ఈ మారుమూల పల్లెల్లో రోగం వస్తే చూసే దిక్కే లేక నానా చావు చస్తావుండావు. నా మాట విని టౌనుకొచ్చేయి. నీకు మంచి బాడిగిల్లు చూసి పెడతా. డాక్టరుని మాట్లాడి నీ రోగాన్ని ఫ్రీగా నయం చేయిస్తా. డబ్బులు బ్యాంకులో వేసుకొని హాయిగా ఉండండి”గుప్పున పొగ వదిలి చెప్పాడు చలపతి. నాదముని ఆ పొగాకు అల్లాడుతూ, ఈ విషయాలన్నీ నా భార్య మునెమ్మ చూసుకుంటాది. ఆమె ఇప్పుడు లేదు. ఆమె ఉండే టైంలో రాండి అన్నాడు. పట్టా కూడా ఆమె పేరుతోనే ఉండాది”అని మరో బాంబు పేల్చాడు. చలపతి ఆత్రంగా ఆమెప్పుడేడుంది? ఇప్పుడే ఆమెతో మాట్లాడేస్తాం అన్నాడు. కుర్చీలోంచి లేస్తూ, ముసలాయన దగ్గు తెరతో కాసేపు ఉక్కిరిబిక్కరవ్వడంతో, అంతవరకు వారి సంభాషణ మౌనంగా వింటున్న భాషా మంచినీళ్లు చెంబులో నుంచి ఓ గ్లాసులో నీళ్లు వంచి నాదమునికి ఇచ్చాడు. నాదముని నీళ్లు తాగి స్థిమిత పడి”నా భార్య స్థిరాస్తి రైతుబజారులు అమ్మేదానికి కాకరకాయలు, చిక్కుడుకాయలు ఎత్తుకోని పూడ్సుండాది. సాయంకాలనికి గాను ఇంటికి రాదు”అన్నాడు. “సరే, ఆడ్నే పోయి ఆమెతో మాట్లాడుతాం. నువ్వు మాత్రం పట్టా కాయితాలు వెతుక్కోని రెడీగా ఉండు” అని చలపతి చెప్పులు వేసుకుని సహాయకుడితో పాటు ఆ గుడిసె బైటకు నడిచాడు. (వారధి-రాచపూటి రమేష్. పుట.54)
కథకుడు రాచపూటి రమేష్. ఈ రియల్ ఎస్టేట్ అన్నది రైతుకు పట్టిన మరో దుర్గతి. తరతరాలుగా రాయలసీమలో వర్షాలు సరిగా కురవకపోవడం, పైగా పంటలు వర్షాలపై ఆధారపడడం వలన ఈ ప్రాంతం కరువు నేలగా ప్రసిద్ధి పొందినది. ఇక్కడ ప్రజలు తమ అవసరాలను, కోరికలను తీర్చుకోవడానికి రైతులు పొలాలను అమ్ముతున్నారు. దీనివలన వ్యవసాయ భూములు క్రమంగా నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. పట్టణీకరణ పెరగడంతో గ్రామాల్లోని భూములు ఎక్కువ ధర పలుకుతున్నాయి. రైతులు తమ భూమికి ఎక్కువ ధర లభిస్తుందని ఆశతో తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కొందరు రైతులు భూములను విక్రయిస్తున్నారు. అయితే భూమి అమ్మిన తర్వాత స్థిరమైన ఆదాయవనరు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. మరి ముఖ్యంగా రైతే రాజు అనే నినాదం ప్రకారం…రైతు కష్టపడితేనే దేశంలోని ప్రజలందరూ భుజిస్తున్నారనేది అక్షర సత్యం. అయితే ఇలా భూములు పెద్ద ఎత్తున ప్లాట్లుగా మారడం వలన సాగు భూమి విస్తీర్ణం తగ్గి ప్రజలందరికీ కావాల్సిన గింజలు (ఆహారం) దొరకని పరిస్థితి ఏర్పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. కనుక పంటలు పండే సాగు భూములను ప్లాట్లుగా మార్చకూడదనేది నా అభిప్రాయం.
6. దళితుల స్త్రీల దోసిట్లో నీళ్ళు పోసి తాగమనుట
తరతరాల నుంచి దళితులు వివక్షకు గురవుతున్నారు. వారికి నీళ్లు దోసిట్లో పోస్తున్నారు. ఈ విషయాన్ని కథకురాలు ఎండపల్లి భారతి ఇలా తెలిపారు.
“ఆ కాపోల్లామె మల్లా బాయికాడికి వచ్చింది. మాయమ్మ మల్లా ఆమెని”తల్లి రవన్ని నీళ్ళు పోయ్యమ్మా. బాగాలేని బిడ్డమ్మా. గొంతు ఎండిపోతుందంటమ్మా”అని బతిమాలుకుంది. ఆ అమ్మపాటికి ఆయమ్మ నీళ్లు చేది బింది నింపుకొని ఇంటికి ఎత్తుకుని పోనుగా ఉండాది కానీ మాయమ్మ మాటల్ని పట్టించుకునే లేదు. అట్లా నాలుగైదు బిందే లు ఎత్తుకొని పోయినంక అప్పుడు మా పక్కకి చూసింది. నీళ్లు చేదుకుని మా దగ్గరకు వచ్చింది. నేను దోసిలి పట్టి వంగితే నా దోసిట్లో నీళ్లు పోసింది. నీళ్లను గుక్కనిలపకుండా అదరాబాదరగా మింగుతా ఉంటే నా గుడ్లు పైకొచ్చినాయి. నీళ్లను నాలుగు దోసిల్లు తాగినంక నాకు ఊపిరి నిలిచినట్లయింది. మా యన్నా అమ్మా కూడా తాగిరి. మాయమ్మ మమ్మల్ని ఎగించుకుని రాయలపేటకు పోయింది. రాయలపేటలో ఉండే వైదిగుని కాడికి నన్ను తోడుకుని పోయింది. ఆ వైదిగుడు నాకు నీళ్లు మంతరించి ఇచ్చినాడు. అవి తాగేసరికి నాకు కొంచెం చేరుకున్నట్లు అనిపించింది. మమ్మల్ని ముగ్గురిని తోడుకొని రాయల్ పేట బస్టాండుకు వచ్చి అక్కడ కూర్చోబెట్టింది మాయమ్మ. బస్టాండులో తట్టల్లో మామిడి పండ్లు పెట్టి అమ్ముతా ఉండారు. నేను గుడ్లు ఆరవకుండా మామిడిపండ్లనే చూస్తా ఉండాను. అది చూసిన మాయమ్మ “అయ్యో నా బిడ్డ అన్నం తిని నెల పైనే అయింది. ఒక మామిడిపండు అయినా కొనిస్తే తింటాడేమో” అనుకున్నట్లు ఉంది. అమ్మ దగ్గరుండే డబ్బులు అంతా పెట్టి ఒక మామిడిపండును కొని నా చేతికిచ్చి తిని బిడ్డా అనింది. మా చెల్లెలేమో పసిబిడ్డ కదా, అందుకే అది అడగలేదు. కానీ మాయన్న నాకు కూడా కావాలంటూ…. నసకు ఎత్తుకున్నాడు. “నాయనా, ఇంకా నాకాడ డబ్బులు లేవురా. ఏడ్నుంచి ఇట్లే మీ అవ్వోళ్ళూరికి పోదాము మీ అవ్వ మీకు చానా తీసిస్తాది. దానికి ఒళ్ళు బాగాలేదు కదా. తిన్నీలే నాయనా”అనింది. ఇంకా మా అన్న ఏమీ పలకలేదు.”అట్ల కూర్చొని తిను బిడ్డా”అనేసి మాయమ్మ ఇంకొక పక్కకు తిరుక్కొని కూర్చుని మా చెల్లెల్ని ఒళ్ళో పెట్టుకొని ఉండాది. మా అన్న కూడా మాయమ్మ దగ్గరే కూర్చున్నాడు.” (ఎడారి బతుకులు-ఎండపల్లి భారతి, పుట.30)
దీనిని బట్టి చూస్తే దళితులు ఎంత దుర్భరంగా జీవించారో తెలుస్తున్నది. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు ఎంత లోతుగా ఉండేవో తెలుస్తున్నది. నీటిని తాగడం వంటి సహజమైన అవసరంలో కూడా మనుషుల మధ్య కులం ఆధారంగా బేధం చూపడం వారి ఆత్మ గౌరవం దెబ్బతీసే చర్యగా భావించవచ్చు. ముఖ్యంగా దళిత స్త్రీలు కులముతో పాటు లింగ వివక్షను ఎదుర్కొన్న పరిస్థితి ఈ సంఘటన ద్వారా నేను గ్రహించాను. వీటిని విద్య, సామాజిక చైతన్యం, రాజ్యాంగ విలువలు పై అవగాహన కల్పించడం ద్వారా ఇటువంటి వివక్ష ఆచారాలను రూపుమాపి ప్రతి వ్యక్తి గౌరవంతో జీవించే సమానత్వ సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి అసమానతలు రూపుమాపడానికి ఒకే ఒక ఆయుధం విద్య.. ఇప్పటికే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా, ఈ వర్గాలకు చెందిన పిల్లలు మధ్యలోనే చదువుకు దూరం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో వీరి సమస్యలేమిటో గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను చూపించి, ఈ వర్గాలకు చెందిన పిల్లలందరూ ఉన్నత విద్యలభ్యచించేలా ప్రభుత్వం చేయగలిగితే, సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడ ఉన్న కొన్ని అసమానతలు తొలగిపోతాయనేది నా అభిప్రాయం.
7. ప్రకటనలూ - బహుమతులు
నేటి సమాజం మొత్తం వ్యాపారం మీద ఆధారపడి నడుస్తున్నది. అది పోటీ సామ్రాజ్యమైంది. ఈ క్రమంలో ఖాతాదారులను ఆకర్షించుటకు బహుమతులు ప్రకటిస్తున్నారు. అలాంటి ప్రకటనల ప్రాధాన్యతను కథకుడు కల్లూరి రాఘవేంద్రరావు ఇలా తెలిపాడు.
“ఇటు చూడండి! ఈ సబ్బులు మూడు కొన్నందుకు ఒకటి ఫ్రీగా ఇచ్చాడు. ఈ కంపెనీ సబ్బులో గోల్డ్ కాయిన్ వుంటుందంట. ఇలాంటివి పదికొంటే ఒక మగ్గు ఫ్రీ ఇచ్చాడు. ఈ రెండు వందల గ్రాముల టూత్ పేస్టులు అరడజను కొంటే డజన్ టూత్ బ్రష్లు ఇచ్చారండి! ఈ షాంపూ సీసాలు పది కొంటే…. అని కామాక్షి సాగదీస్తూ ఉంటే ఒంటిమీద తేలు, జర్రులు పాకినట్లు అయింది. “ఇదిగో! ఇప్పుడే చెబుతున్నా! ఇవన్నీ ఏ షాపులో కొన్నావో వెంటనే పోయి వాపసిచ్చిరా! లేకుంటే నీకీరోజుతో మూడిందనుకో! అంటూ కళ్ళు పెద్దవి చేసి నిప్పులు కురిపించాను. “షాపులో కాదండి! ఇంటిముందుకే సేల్స్ బాయ్స్, గర్ల్స్ వస్తారు కదా! వాళ్ళ వద్దే కొన్నాను. వాళ్లు నాకు బెస్ట్ కూడా ఇచ్చారండి! రేపటి టీవీ యాడ్లో నే కనిపిస్తానండి. చూద్దురుగాని. ఈ పిక్ పిక్ క్లీనర్ అరవై సెకండ్లలో క్రిములను చంపి టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుందంట”…అంది కామాక్షి, నవ్వుల పూలు నాపై రూపుతూ. “అరవై కాదే…ఆరు సెకండ్లలో నన్ను చచ్చేలా చేస్తున్నావు కదే! ఏ పనీ పాట లేని వాళ్లకు అంతో ఇంతో ఇచ్చి వీధిలోకి తోలుతున్నారే ఆ కంపెనీ వాళ్లు. వాళ్ల తీపి మాటలకు ఉబ్బిపోయే నీలాంటి వాళ్లకు ఏవేవో ఆశలు చూపి బుట్టలో వేసుకొని నెత్తికి సీకాయి వేస్తారే!ఇంతకు ఇన్ని సబ్బులు పేస్టులు ఎప్పుడు రుద్దుకుంటావో నీవే చెప్పు,”... అంటూ నెత్తి కొట్టుకున్నాను ఆక్రోశంగా” (1. మూడు కాళ్ళ మేక- కల్లూరు రాఘవేంద్రరావు, పుట.12)
అని యజమాని బాధపడతాడు. ఈ ప్రకటనలు బహుమతులు ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా వినియోగదారును ఆకర్షించి వస్తువుల అమ్మకాలను పెంచుకోవడం నేటి వ్యాపార సంస్కృతిలో ఒక ముఖ్యమైన ధోరణిగా మారింది. తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయనే ఆశతో ప్రజలు కొనుగోళ్లకు మొగ్గుచూపడం, బహుమతులు వస్తాయని ఆకర్షణతో అవసరంలేని వస్తువులను కూడా కొనడం వంటి పరిస్థితులను నేను గ్రహించాను. దీని ద్వారా వ్యాపారులు వినియోగదారుల ఆశలను వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధానం తెలుస్తోంది. సామాజిక ఆర్థిక అసమానతలు, పేద ప్రజల కొనుగోలు సామర్థ్యం మొదటి ప్రజల ఆకాంక్షలను కూడా ప్రతిబింబిస్తున్నది.
8. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు
రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరువులు, ఎరువుల ధరలు, కరెంటు కోతలు, గిట్టుబాటు ధర లేకుండుట వంటి కారణాలతో రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కథకుడు డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి ఇలా తెలిపారు.
“కారెక్కాను. తంబళ్లపల్లె రైతులు కొందరు కారు వద్ద వీడ్కోలు పలికారు. మోహన్ రెండు చేతులెత్తి నమస్కరించాడు. కార్లో నా మెదడు ఆలోచనల తుట్టెను తట్టింది. ప్రజలకు పట్టడన్నం పెట్టేవాడు రైతు. దేశం సుభిక్షంగా ఉండటానికి పట్టుకుమ్మయిన రైతుకు పుట్టెడు కష్టాలా? కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు…. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని పైరు చేతికొస్తే గిట్టుబాటు లేని ధరలు దళారి వ్యవస్థ మధ్య నలిగిపోతూ…. అప్పులు, బ్యాంకు రుణాల చెల్లింపు పై ఒత్తిడి. ప్రభుత్వ సహాయం కేవలం ప్రకటనలకే పరిమితం. పోనీ పరిహారం చెల్లించిన అది రైతుకు అందుతున్నదా? ఆన్ని స్థాయిలలో కమిషన్లు పోగా చివరికి రైతుకు దక్కేదంతా? సన్న కారు రైతులకు చివరికి చావులే శరణ్యమా?... కారు రేడియోలో……”తుఫాను వల్ల పంటలను, ప్రాణాలను కోల్పోయిన రైతుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి పర్యటన.త్వరలో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు రాక ప్రధాని పర్యటన వాయిదా పడింది. వచ్చేవారం మంత్రివర్గం భేటీ..వరద బాధితులకు నష్టపరిహారం,పంట రుణాల మాఫీ,కూలిన ఇండ్లు,రహదారుల పునరుద్ధరణ.ఎజెండా జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రతిపక్షాలు.నష్టపరిహారం చర్యకు వారం రోజుల్లో మంత్రి వర్గం భేటీ” (1. చీకటి దారి - డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి, పుట.61)
అవుతుందని తెలిపాడు డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి. రైతులు దేశానికి వెన్నుముక లాంటివారు. వారు లేకపోతే దేశానికి తిండి లేదు. అయితే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు సకాలంలో కురువకపోవడం, సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు రోజురోజుకు పెరిగిపోవడం, గంటలకు తెగుళ్లు, రాజులు రావడం, దిగుమతి తగ్గడం, దళారి వ్యవస్థ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, పంటలను నిలువ చేసుకోవడానికి తగిన గిడ్డంగులు, పవన సౌకర్యాలు లేకపోవడం వలన రైతులు నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబం విధిపాలు కావడం చూస్తూనే ఉన్నాం. కనుక రైతుకు నిరంతరం కరెంటు సదుపాయాలను, నాణ్యమైన విత్తనాలను, సబ్సిడీ రుణాలను కల్పించి పండిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే కొనే విధంగా ముందుకు రావాలి. పూర్తిగా దళారీ వ్యవస్థ రద్దు కావాలి. మండల కేంద్రాలలో గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ పద్ధతుల పైన నిపుణులతో అవగాహన కల్పించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చాలి అనేది నా అభిప్రాయం.
9. నిరుద్యోగి కృషి
ఒక పేద అభ్యర్థి డిగ్రీ వరకు చదువుకుంటాడు. ఆ వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తాడు. చాలాకాలం వరకు అతని ప్రయత్నాలు ఫలించలేదు. అయినా అతడు నిరాశ చెందలేదు. సుందరం అనే అతను ఆ యువకుడ్ని ప్రోత్సహిస్తాడు. అతని ప్రోత్సాహముతో పట్టు వదలకుండా కృషిచేసి విజయం సాధిస్తాడు. ఆ విజయాన్ని కథకుడు రాచపూటి రమేష్ ఇలా తెలిపాడు.
“సుందరం కఠోర దీక్షతో సాధన చేసేవాడు ఉదయం నాలుగున్నరకు లేచి,కాల కృత్యాలు తీర్చుకొని ఐదింటికల్లా గ్రౌండ్లో ఉండేవాడు.పావుగంట ఎక్సర్సైజులు చేశాక అరగంటసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు.మళ్లీ ఇంకో అరగంటలో స్కూలు వాళ్ళు ఏర్పాటుచేసే వ్యాయామానికి హాజరయ్యేవాడు పుష్టికరమైన ఆహారం మాత్రం హాస్టల్లో విద్యార్థులందరికీ లభించేది. నూరు మీటర్ల పరుగు,రిలే 400 మీటర్ల పరుగు,మారథాన్ రేసుల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న సుందరాన్ని ఫైనల్ ఇయర్ లో ఉండగా అథ్లెటిక్స్ టీం కెప్టెన్గా ఎంపిక చేయక తప్పలేదు. ఆ స్కూల్ యాజమాన్యానికి చండీగఢ్లో జరిగిన స్పోర్ట్స్ స్కూళ్ల మీట్లో సుందరం నాయకత్వంలోని స్కూల్ టీం ఒక బంగారు పతకం,రెండు వెండి పతకాలు సాధించింది. ఆఫ్ మారధాన్లో బ్రాంచ్ పతకం సాధించాడు సుందరం. స్కూల్ యాజమాన్యం సుందరాన్ని అభినందనలతో ముంచెత్తింది. డిగ్రీ తీసుకుని బయటకు వచ్చిన సుందరం వెంటనే ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అతని తల్లి చంద్రమ్మ గుండె జబ్బుతో మంచం పట్టింది. స్పోర్ట్స్ కోటాలో ఓ రైల్వే ఆఫీసులో ఎల్టిసి ఉద్యోగం లభించింది. సుందరం తల్లిని తీసుకొని గుంతకల్ వెళ్లిపోయాడు. తామున్న ఇల్లు ఆఫీసుకు దూరంగా ఉండడంతో పొద్దున్నే వంట చేసుకుని, తల్లికి మందులిచ్చి ఆఫీసుకు వెళ్లి పోయేవరకు ప్రాక్టీసుకు సమయం ఉండేది కాదు సుందరానికి. ఆఫీసులో పని రాక్షసుడైన ఆఫీసర్ ఉండడంతో అతని క్రీడాసక్తులకు ఊతం లభించలేదు. ఆటలకు సమయం వెచ్చించడం పనికిమాలిన పని అని ఆ ఆఫీసులో చాలామంది అభిప్రాయం… సుందరం ఉబలాటం కొద్దీ జిల్లా స్థాయిలో జరిగే కొన్ని సెలక్షన్లుకు వెళ్లేవాడు. అప్పుడు మాత్రం ఉదయం కొంతసేపు ప్రాక్టీస్ చేసేవాడు. రాజకీయాలు, లంచగొండితనం, సిఫారసుల వంటి కారణాలతో అతనిది చాలా కాలం అవకాశం లభించలేదు. సుందరం వెన్ను తట్టి ప్రోత్సహించింది మాత్రం శోభనాద్రే,....” (వారధి - రాచపూటి రమేష్, పుట.13)
అంటూ సంతోషం వ్యక్త్స చేశాడు. అలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఎలాంటి వారైనా విజయం సాధిస్తారని చెప్పవచ్చు.
9.1. నేటి నిరుద్యోగ సమస్య - విశ్లేషణ
ప్రస్తుతం నిరుద్యోగ సమస్య రోజుకు తీవ్రమవుతున్నది. నేటి యువత పీజీ వరకు కష్టపడి చదివినా ఉద్యోగాలు రావడం లేదు. చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ప్రవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉండడం, పోటీతో పాటు నైపుణ్యాలు లేకపోవడం వంటి కారణాలవల్ల వెంటనే ఉద్యోగం రావడం లేదు. దీంతో వారు నిరాశకు గురై తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సందర్భాలలో వీరికి తోడుగా తల్లిదండ్రులు నిలిచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. వారిని మానసికంగా దెబ్బ తీయకూడదనేది నా అభిప్రాయం.
నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం గల కోర్సులు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వము, పరిశ్రమలు కలిసి కొన్ని రకాల ఉద్యోగ అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు కల్పించాలి. సరైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షణ, అవకాశాలు లభిస్తే నిరుద్యోగ యువత తన ప్రతిభను ఉపయోగించుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోగలరని నా అభిప్రాయం.
10. ప్రేమలు - ఆత్మహత్యలు
కొందరు యువతీ యువకులు కుల మతాల పట్టింపులు లేకుండా ప్రేమించుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులు అంగీకరించరు. దాంతో వారు తల్లిదండ్రులను ఎదిరించలేక, స్వతంత్రంగా జీవించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల పూర్వ పదాలను గూర్చి కథకుడు సడ్లపల్లె చిదంబరెడ్డి ఇలా తెలిపాడు.
“ఈ మానవజన్మే ఒక అపురూపమైన పుట్టుక. దాన్ని చివరిదాకా అనుభవించడమే బతుకంటే ఆ బతుకు నిర్మాణంలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. అందాలనుకున్న కొన్ని అందమైన రంగులు చేతి నుండి జారిపోవచ్చు. అంతటితో ప్రయత్నాన్ని ఆపివేయడం పిరికివారి లక్షణంగా ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాల్లో అమ్మాయిలే ఎందుకు సమిధలవుతున్నారో అంతు చిక్కని ప్రశ్న. మనసులు కావచ్చు. శరీరాలు కావచ్చు. కలుపుకోవడంలో ఇద్దరిదీ సమాన పాత్ర ఉంది. అనుకోని సమస్యలతో తిరస్కరణకు గురైనప్పుడు అమ్మాయిలు తమకు తాము శిక్షించుకోవడం అది స్త్రీ హృదయాల బలహీనతగా తోస్తుంది. ఈ పద్ధతి మారాలి. మోసం చేసిన వారిని దోషులుగా సమాజం ముందు నిలబెట్టడమే కాక దాన్ని గుణపాఠంగా మార్చుకుని మరింత ధైర్యంగా, జాగ్రత్తగా బతకడం నేర్చుకొని ఈ ఆత్మహత్యలకు చరమగీతం పాడాలని నా హృదయం ఘోషిస్తూ ఉంది ఈ మగ పిల్లలది కూడా బాధ్యత లేని మృగాలు వంటి ప్రవర్తన అని నా మనసు ఆశిస్తూ ఉంది…” (మట్టి మొగ్గలు - సడ్లపల్లె చిదంబరెడ్డి, పుట.150)
10.1. ప్రేమ వివాహాలు - సామాజిక దృక్పథం
నేడు కులమత బేధాలతో సంబంధం లేకుండా కొందరు యువతీ యువకులు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అయితే ఆనాటి కాలంలో ఉన్న కులమత బేధాలు లేనప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు ఈ ప్రేమ వివాహాలను హర్షించడం లేదు. ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు కులం, మతం, ఆర్థిక స్థితి, కుటుంబ గౌరవం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ఈ వివాహాలను అంగీకరించడం లేదు. దీంతో యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ మరోవైపు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత కోల్పోతూ ఈ రెండింటి మధ్య సంఘర్షణతో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలతో కలిసి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలనేది నా అభిప్రాయం. అంతేగాని ఆత్మహత్యలు సమాధానం కాదు.
ప్రేమ వివాహం విషయంలో తల్లిదండ్రులు, యువతీ యువకులు పరస్పరం మాట్లాడుకుని, ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకొని, కుటుంబ గౌరవం కన్నా ఒక వ్యక్తి ప్రాణం, భవిష్యత్తు ఎంతో విలువైనవి అని గుర్తించాలి. సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా మధ్యవర్తుల ద్వారా తల్లిదండ్రులతో సంప్రదించి చర్చించడం వంటి మార్గాలు చేయాలి. మగపిల్లల్లాగా ఆడపిల్లలు కూడా ధైర్యంగా తల్లిదండ్రులతో తమ సమస్యలను విన్నవించుకోవాలి. ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని గ్రహించాలనేది నా అభిప్రాయం.
11. జేజమ్మను ఆకర్షించుట
నేటి పిల్లలు, యువత కుటుంబ సభ్యులను పెద్దలను గౌరవించడం లేదు. అయితే కొందరు మాత్రం కుటుంబములోని వృద్ధులను గౌరవిస్తున్నారు. అలాంటి ఒక సన్నివేశాన్ని కథకుడు మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి ఇలా తెలిపాడు.
“మాటలకందని ఆమె అనురాగం, కవిత్వానికి అంతుపట్టని ఆమె ప్రేమ, ఆలోచనలకు అతీతమైన ఆదరణ అన్నీ నా కళ్ళ ముందు…. నా గుండె లోతుల్లో నుంచి గొంతు సవరించుకున్నాను. మా అత్తగారిని నేనెప్పుడూ అత్తమ్మా ! అని పిలవలేదు. నా పెళ్లయిన అర్థ శతాబ్ద కాలం నుండి ఆమెను అమ్మా అనే పిలుచుకుంటున్నాను. నా పెండ్లికి ముందే మా అమ్మ దివంగతురాలైనారు. నా పెళ్లి తర్వాత అత్తమ్మే …అమ్మ. ఆమె అందరితో అంటుంటారు మా అల్లుడు, నాకు మావారికి పెద్ద కొడుకు లాంటివారు. ఆయన కూడా మమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి మా యోగక్షేమాలు చూస్తున్నారు. మావారు గతించిన తర్వాత నాకు ఆయనే ఊత కర్ర. మా అబ్బాయిని కూడా ఆయన సొంత తమ్ముడి లాగానే చూస్తారు. ఆమె మాటల్లో నేను నా మాతృమూర్తిని దర్శించుకుంటున్నాను. గత నాలుగేళ్లుగా ఆమె ఆరోగ్యం సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో మేము ఆమెకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఆ అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె మునిమనవళ్ళు, ముని మనువరాళ్లు ఏడుగురు కలిసి ఈ దినం ఒకరికొక్కరుగా నృత్యం, గిటార్, వయోలిన్, కీబోర్డులో వివిధ వాయిద్య సమ్మేళనం. అలా బృందగానంగా సాంస్కృతిక కార్యక్రమాలు సమర్పిస్తారు. వారికి ఆ కలల పట్ల ఆసక్తి కలగడానికి ఆమె స్ఫూర్తి. మన సంస్కృతి, సాంప్రదాయాలను మరవకుండా మా పిల్లలు వారి సంతానానికి ఆయా కళల్లో అభినివేశం కల్పించడం శిక్షణ ఇప్పించడం….. నిజంగా నేను గర్విస్తున్నాను. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం, అమ్మకు సత్కారం ఆమె ఆశీర్వచన సంభాషణలు ఉంటాయి అందరం కలిసి ఆనందిద్దాం.” (చీకటి దారి - డాక్టర్. మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, పుట.90)
వీల్ చైర్ లో వచ్చి కూర్చుని అమ్మ మూడు గంటలకు పైగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. జేజమ్మకు పాదాభి వందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. గ్రేట్ గ్రాండ్ చిల్ద్రెన్ అంటూ, జేజమ్మ ఆశీస్సులు ఇస్తుంది. పెద్దల ఆశీస్సులు పిల్లల పురోగతి హేతువని గట్టిగా చెప్పవచ్చు.
ప్రస్తుతం సమాజంలో యువత జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులను నేర్పిన గురువులను కూడా గౌరవించే స్థితిలో లేరు. అలాంటివారు కుటుంబంలోనే వృద్ధులను గౌరవిస్తారు అనుకోవడం అతిశయోక్తి. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వలన పిల్లలు అవ్వ తాతల దగ్గర ఎన్నో మంచి విలువలను తెలుసుకునేవారు, మంచి మంచి కథలు చెప్పడం, రామాయణ భారతాలలోని నీతి అంశాలను బోధించడం వలన ఆనాడు పెద్దవారిని గౌరవించేవారు. నేడు చిన్న కుటుంబాలు ఉండడం, పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపకపోవడం, సామాజిక మాధ్యమాలకు బానిస కావడం వలన వారిలో నైతిక విలువలు లోపించి పెద్దలను గౌరవించలేకపోతున్నారు. కనుక పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు కొన్ని విషయాలు తెలియజేసి వారిలో మార్పు తీసుకురావాలనేది నా అభిప్రాయం.
ఉపసంహారం
- రాయలసీమ ఆధునిక కథాసాహిత్యం ఆ ప్రాంత ప్రజల జీవన వాస్తవికతకు అద్దం పడుతూ, సామాజిక మార్పులను సున్నితంగా చిత్రించిన సాహిత్య ప్రక్రియగా నిలిచింది.
- రాయలసీమలో కరువు, పేదరికం, రైతుల సమస్యలు, దళిత స్త్రీల సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక సామాజిక అంశాలు కథల్లో ప్రధాన ఇతివృత్తాలుగా కనిపిస్తాయి.
- ఈ కథలు కేవలం సమస్యల చిత్రణకే పరిమితం కాకుండా, వాటి వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక కారణాలను పాఠకుల ముందుకు తీసుకువస్తాయి.
- రాయలసీమ ఆధునిక కథా సాహిత్యం కేవలం వినోదాన్ని అందించే ప్రక్రియ కాకుండా, సమాజాన్ని పరిశీలించే సామాజిక దర్పణంగా, ప్రశ్నించే చైతన్య స్వరంగా, మార్పును ఆకాంక్షించే సృజనాత్మక సాధనంగా నిలుస్తుంది.
- కాలక్రమేణా రాయలసీమ సమాజంలో వచ్చిన మార్పులను, ప్రజల ఆలోచనా విధానంలో చోటు చేసుకున్న పరిణామాలను కథకులు తమ రచనల్లో ప్రతిబింబించారు.
- రాయలసీమ ఆధునిక కథా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక ప్రాంతపు సాహిత్య వికాసంతో పాటు ఆ ప్రాంత సామాజిక పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఉపయుక్త గ్రంథసూచి
- గంగాధర్, వేంపల్లి. గంగమ్మ పూలు ఆరవ కథా సంపుటి, నవోదయ బుక్స్ హౌస్, హైదరాబాదు, 2024.
- చిదంబర రెడ్డి, సడ్లపల్లె. మట్టి మొగ్గలు కథా సంపుటి, తపన సాహితీ వేదిక పబ్లికేషన్స్, [స్థలం లేదు], 2021.
- నారాయణ, సింగమనేని. సింగమనేని నారాయణ కథలు, పబ్లికేషన్స్, హైదరాబాదు, 2005.
- భారతి, ఎండపల్లి. ఎడారి బతుకులు కథల సంపుటి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాదు, 2018.
- భూమన్. చరిత్రలో రాయలసీమ, కేఎస్ రూరల్ మీడియం, రాయలసీమ ఆర్ట్ థియేటర్స్, [స్థలం లేదు], 2008.
- రాఘవేంద్రరావు, కల్లూరి. మూడు కాళ్ళ మేక కథ సంపుటి, [ప్రచురణసంస్థ లేదు], అనంతపురం, 2013.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. రాయలసీమలో ఆధునిక సాహిత్యం, సామాజిక, సాంస్కృతిక విశ్లేషణ, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- వేణుగోపాల్ రెడ్డి, మల్లెమాల. చీకటి దారి, [ప్రచురణసంస్థ లేదు], కడప, 2014.
- శ్రీధర్, వెల్దుండి. తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం, తెలుగు అధ్యయన శాఖ, సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కర్నూలు, 2015.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

