headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

5. ఆముక్తమాల్యదలో రాజధర్మాల బోధన: సమకాలీనసమన్వయం

డా. గంధం అశోక్ కుమార్

పరిశోధకులు
తెలుగు ఉపాధ్యాయులు, ధర్మవరం,
సత్యసాయి జిల్లా. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9542414559, Email: ak5774747@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 08.04.2026        ఎంపిక (D.O.A): 27.04.2026        ప్రచురణ (D.O.P): 01.05.2026


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో రాజనీతిని బోధించే గ్రంధాలలో మహా భారతం మొదటిది. తరువాత శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యదదే స్థానం. శ్రీకృష్ణ దేవరాయలు యమునాచార్య పాత్ర చేత బోధించిన రాజధర్మాలను నేటి సమకాలీన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, సాహితీకారులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పటి రాచరిక పాలనలో రాజు ప్రజారంజకమైన పాలన ఏవిధంగా కొనసాగించాలో తెలిపిన అంశాల నుంచీ, నేటి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు తెలుసుకోవాల్సిన అంశాలను, పాటించాల్సిన ధర్మాలను, అలవరుచుకోవాల్సిన లక్షణాలను ఈ రాజధర్మాలను గ్రహించేలా వ్యాసం రూపుదిద్దుకుంది. నేటి ఆధునిక సమాజానికి శ్రీకృష్ణ దేవరాయలు బోధించిన ప్రాచీన రాజధర్మాలను తెలియజేసి, సమకాలీన ప్రజా నాయకులకు పాలనా పరమైన మార్గనిర్దేశక సూచనలు ఇవ్వడం ఈ వ్యాస రచనోద్దేశం. ఈ వ్యాసానికి శ్రీ కృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యద ప్రథమ ఆకారం. ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఆముక్తమాల్యదకి రాసిన సౌందర్యలహరీ వ్యాఖ్యానం, కాండూరు వెంగళాచార్యుల “ఆముక్తమాల్యద- ఒక పరిశీలన” అనే పరిశోధన గ్రంధం, కె.వి.ఎస్. రామారావు గారి “శ్రీ కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద”, కొలిచాల సురేష్ గారి “ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయ నవ్య రాజనీతి” వ్యాసాలు ద్వితీయ ఆకారాలు.

Keywords: శ్రీకృష్ణ దేవరాయలు, ఆముక్తమాల్యద, రాజధర్మాలు, యమునాచార్య, ఆధునిక సమాజం, ప్రజాస్వామ్యం, ప్రజలు, ప్రజాప్రతినిధులు.

1. పరిచయం

ఏ దేశమైనా, ఏ కాలమైనా, రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా ప్రజలను దేశ సంక్షేమాన్ని చూసుకుంటూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పాలకులదే. ప్రజల కష్టసుఖాలలో తోడుగా ఉంటూ దేశాభివృద్ధికి పాటుపడటం పాలకుల ధర్మం. పూర్వం రాజుల పాలన కొనసాగింది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు పాలన సాగుతోంది. పరిపాలన సాగించేది ఎవరైనా దేశాభివృద్ది కోసం, ప్రజలు సుభిక్షంగా జీవించడం కోసం కొన్ని ధర్మాలను ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారే ప్రజాక్షేత్రంలో మనుగడ సాధించగలుగుతారు. రాజు పాటించాల్సిన రాజధర్మాల గురించి ఆముక్తమాల్యద ప్రబంధంలో శ్రీకృష్ణదేవరాయలు యామునాచార్యుడి పాత్రతో ప్రబోధించారు. శ్రీకృష్ణదేవరాయలు రాజకవి కావడం ద్వారా రాజుగా ప్రజలను ఏ విధంగా పాలించాలో అనుభవపూర్వకమైన విషయాలను సవివరంగా తాను రాసిన ఆముక్తమాల్యద గ్రంథంలో వివరించారు.

2. ప్రజాక్షేమం

రాజు కర్తవ్యాలలో మొదటిది ప్రజలను క్షేమంగా చూసుకోవడం. వారి కష్ట సుఖాలను చూడగలగాలి. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చి, వారి సమస్యలను తీర్చి, 'మీకు నేనున్నాను' అనే నమ్మకం పాలకుడు ఇవ్వగలిగితే తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్టే. ప్రజలు తమ కష్టాలను చెప్పే సందర్భంలో రాజు ఏ విధంగా ఉండాలో ఈ పద్యంలో చక్కగా వివరించారు.

కం॥ “ఏపట్టున విసువక ర

క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి విపన్నుల్

గూపెట్టిన విని తీర్పుము

కాపురుషులమీద నిడకు కార్యభరంబుల్” (శ్రీకృష్ణదేవరాయలు 4.204)

పాలకుడు తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్లు తనను ఆశ్రయించి, తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని, వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు అని దీని అర్థం.

“శ్రీకృష్ణదేవరాయలు వారు తెల్లవారు జామున గుర్రపు సవారి చేసేటప్పుడు ప్రజలు తమ బాధలు చెప్పుకునే వారని న్యూనిజ్ వ్రాశారు” (తుమ్మపూడి 414). రాచరిక పాలనలోనే ప్రజలు స్వయంగా తమ బాధలు రాజుకే చెప్పుకోగలిగారు అంటే రాచరికంలో కూడా ప్రజారంజక పాలన సాగిందనడానికి ఇది మంచి ఉదాహరణ.

ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఎం.యల్.ఎ.లు, ఎం.పి.లు ప్రజా పాలన సాగిస్తున్నారు. ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తరువాత ఒకలా ఉంటారు. గెలిచే వరకు మీకు ఏ కష్టం వచ్చినా మేముంటాము అని చెప్పి మళ్ళీ ఎన్నికల వరకు కనపడరు. అలా చేయడం వల్ల మళ్ళీ గెలిచే అవకాశాలు కోల్పోతారు. గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలి. విసుగు చెందకుండా ఎంత మంది వచ్చినా వారి బాధలు విని తీర్చే ప్రయత్నం చేయాలి. తానే స్వయంగా అన్ని పనులు చేయలేనప్పుడు ఆ పనులు చేయగలిగిన మంచి వ్యక్తిని నియమించి అతని ద్వారా నెరవేర్చేలా చూడాలి. అలాంటి నాయకుడిని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆ విషయాన్ని కింది పద్యంలో చెప్పారు.

“రాష్ట్ర వర్ధన మెద గోరు రాజు మేలు

రాష్ట్రమును గోరు దాన గార్యమొ యనంగ

రాదు ......” (శ్రీకృష్ణదేవరాయలు 4.205)

దేశాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా క్షేమాన్ని కోరే రాజు ఉంటే ఆ రాజు క్షేమాన్ని కోరే ప్రజలు కూడా ఉంటారు. అందుకే పెద్దలు ‘యథా రాజా తథా ప్రజా’ అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. కావున రాజు నేను పాలకుడిని కదా, పాలితులు ఎలా ఉంటే నాకెందుకు అనుకోకూడదు. పాలితులు క్షేమంగా ఉంటేనే రాజు క్షేమంగా ఉంటాడు. లేకపోతే ప్రజల్లో వ్యతిరేక భావాలు మొదలై తిరుగుబావుట ఎగరేస్తారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఈ విషయాలు గ్రహించాలి. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందాలి. లేకపోతే ప్రజలు ఎన్నికల్లో ఓడించి తమ వ్యతిరేకతను తెలియజేస్తారు.

3. దేశాభివృద్ధి పన్నులు

రాజులు రాజ్య విస్తరణ కావించటానికి ముఖ్య కారణం దేశం ఎంత విశాలంగా ఉంటే అంత ఆదాయం సమకూరి రాజ్యం ఆర్థికంగా బలంగా ఉంటుందనే నమ్మకం. అలాగే సారవంతమైన భూములు గల ప్రాంతాల కోసం నిత్యం యుద్ధాలు జరగడం చరిత్రలో చూశాము. రాజ్యం ఎక్కువ ఉంటే ఎక్కువ ఆదాయం రావటం నిజమే కానీ, చిన్న రాజ్యాలు, ప్రాంతాల పాలకులు ఎలా ఆదాయం పొందాలి అనే అంశాలను రాయలు తెలియజేశారు.

తే॥ “దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల

మిల యొకింతైన గుంట కాల్వలు రచించి

నయము పేదకు నరిఁ గోరునను నొసంగి

ప్రబలఁ జేసిన నర్థ ధర్మములు పెరుఁగు” (శ్రీకృష్ణదేవరాయలు 4.236)

దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను కాలువలను తవ్వించాలి. పేద రైతులు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థికస్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయని చెప్పారు.

“ఇటువంటి దృక్పథం ఉంది కాబట్టే రాయలు వారు తాము ఏయే దుర్గాలు జయించారో వాటిని సమర్థులకిచ్చి, కొన్ని చోట్ల పాతవాళ్ళనే నియమించి వ్యవసాయానికి వసతులు కల్పింపజేసేవారు” (ఆరుద్ర 5: 74). “పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో కాలువలు, చెరువులు, తవ్వించి, నీటి వనరులు కల్పించారు. తన తల్లి పేర నాగలాపురాన్ని నిర్మించారు” (హనుమంతురావు 362). ఇలా విదేశీయులతో కలిసి రైతులకు మెరుగైన నీటి సౌకర్యాలు కలిగించారు.

ప్రస్తుత నాయకులు ఆచరించాల్సిన విషయాలు చెప్పారు. ఒక ప్రాంతంలో అధిక వర్షాలు కురిస్తే మరొక ప్రాంతం కరువుతో అల్లాడుతుంది. వర్షాలు అధికంగా కురిసే ప్రాంతం నుంచి కాలువలు తవ్వి రైతులకు సహాయపడుతూ, వారి ఆర్థికస్థితిని మెరుగు పరచాలి. పంటలు సరిగా పండకపోతే పన్నులు తగ్గించాలి. పేదవారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. ఆ అంశాలను తెలిపే మరొక పద్యాన్ని పరిశీలిద్దాం.

తే॥ “ప్రజల విసి చిన్నఁ బిలువ కప్పుసులఁ గొలుచు

నమ్మి యిండ్లింధనంబున కాయె ననెడు

కలని నక్కైన యధికారి గలనృపతికి

నేడుదీవులు గొన్న సమృద్ధి లేదు”(శ్రీకృష్ణదేవరాయలు 4.237)

ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోయే పరిస్థితులు ఏర్పడితే, అధికారులు పట్టించుకోవాలి. వాళ్ల పంటల సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్లు వదిలి వెళ్లిన పశువులను, ధాన్యాలను అమ్ముకుని, వాళ్ల ఇంటి కలపను వంటచెరుకుగా వాడుకోవచ్చు అని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కుతినే నక్కలాంటివాడు. అటువంటి అధికారులున్న పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలవవు. కావున ప్రజల కష్టాలలో వారికి తోడుగా నిలవాలి. రాయలు వారు కరువు కాటకాల సమయంలో పన్నులు రద్దు చేసి ప్రజలకు తోడుగా నిలిచారు. “1512లో క్రొత్తచెరువన్న గ్రామంలో అధికారి పన్నులు ఎక్కువ వసూలు చేయగా తెలిసిన రాయలు రద్దు చేసినట్లు శాసనముంది. శ్రీ మూష్ణమన్న గ్రామంలో పన్నుల ఒత్తిడికి నిర్మానుష్యం కాగా రాయలవారు 1513 లో చిన్నప్ప నాయకుని పంపి పన్నులు రద్దు చేసి ప్రజలను వెనక్కు పిలిచినట్టు చరిత్ర” (తుమ్మపూడి 431). అలా సమర్థులను నియమించి ప్రజలకు పన్నుల భారాన్ని తగ్గించారు.

ప్రస్తుత కాలంలో వర్షాలు సరిగా పడక రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కరువులు తరచుగా చూస్తున్నాము. ఆ ప్రాంత ప్రజలు బళ్ళారి, బెంగుళూరు లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. అలాంటి ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ, పన్నుల విషయంలో కొంత రాయితీ కల్పించి అండగా నిలవాలి. అలాగే బోరుబావులకు ఉచితముగా కరెంటు కల్పించగలిగితే వారు ఆర్థికంగా స్థిమిత పడతారు. కావున పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలి.

అలాగే ప్రస్తుతం యుద్ధ వాతావరణ కారణాల వల్ల పెట్రోల్, డీజల్ లాంటి ఇంధనాల కొరత ఏర్పడుతోంది. అందువల్ల నిత్య సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ ఇంధనాలపై పన్నులు ఎక్కువ పెంచడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. పేదలు, రైతుల జీవనం కష్టమవుతుంది. పన్నుల విషయంలో ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి.

4. పాలకుడి స్వశక్తి మంత్రి పాత్ర

రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి సొంత అభిప్రాయాలు తీసుకునే ఆలోచన శక్తి, నిర్ణయాధికారం తీసుకునే స్వశక్తి ఉండాలి. మంత్రులు, సామంతులతో చర్చిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేక ఆలోచన శక్తి ఉండాలి. అలా కాదని ప్రతి సారి మంత్రి తెలివైన వాడు అని అతనిపై ఆధారపడితే రాబోయే కాలంలో అతను తలకెక్కి కూర్చుంటాడు. మంత్రులు, సలహాదారులు నియమించుకునే విషయంలో పాలకులు ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ పద్యంలో వివరించారు.

చం॥ “చదివి అధర్మ భీతి నృపశాస్త్ర విధిజ్ఞతలన్ వయస్సు డె

బ్బదిటికి లోను, నేఁబదికి బాహ్యమునై, యరుజాస్వపూర్వువలై

మదమఱి రాజు ప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చు పాఱువా

రొదవిన నంగముల్ మిగుల నూర్జితమౌటకుఁ బూటసాలదే” (శ్రీకృష్ణదేవ రాయలు 4.211)

మంత్రి లక్షణాలు ఏమంటే; చదివి, అధర్మమంటే భయం కలిగి, రాజధర్మవేత్త అయి, వయస్సు యాభై - డెబ్భై మధ్య ఉండి, వంశపరంపరగా వచ్చే రోగాలు లేనివాడై, రాజు ప్రార్థించగానే అంత బరువైన అమాత్య పదవిని అంగీకరించగల బ్రాహ్మణోత్తముడు లభిస్తే సప్తాంగాలు ఒక్క పూటలో పుష్టమవుతాయని చెప్పాడు.

రాయలు వారు అప్పాజీని దృష్టిలో ఉంచుకొని ఈ పద్యం రచించినట్టు అనిపిస్తుంది. అందుకే తుమ్మపూడి వారు “ఈ పద్యం అప్పాజీకి ఎత్తిన నీరాజనం. అప్పటికి ఆయన వయస్సు అరవై - డెబ్బై సంవత్సరాల ప్రాంతం. రాయల వారి తండ్రికే ఆయన మంత్రి గనుక. అగస్త్య బాల భారతానికి వ్యాఖ్యానం వ్రాసిన పండితుడు తిమ్మరుసు. రాయలు ప్రార్థిస్తే అమాత్యతకు అంగీకరించియుంటాడు. సకలాగమ పారావారపారీణుడన్న బిరుదు కలవాడు. కనుక చదివినవాడు. ఆయన రాజధర్మ విధిజ్ఞత లోకవిదితం” (తుమ్మపూడి 418) అని పేర్కొన్నారు. అప్పాజీ లాంటి శాస్త్ర పాండిత్యం, రాజనీతి, అనుభవం.

చదువు, నీతినిజాయితీ, అనుభవం విలువలను రాయలు ఈ పద్యంలో తెలియజేశారని చెప్పవచ్చు. మంత్రి అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు. రాజుకు పాలనలో ముఖ్య సలహాలిస్తూ రాజు క్షేమాన్ని కోరే వాడు కనుక అతనికి పై లక్షణాలు ఉండాలని చెప్పాడు. అప్పటి మంత్రుల పాత్రలను ఇప్పటి ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారుల స్థానంగా చెప్పవచ్చు. పాలనలో రాజుకు అప్పటి మంత్రులు సూచనలు ఇస్తే, ఇప్పుడు ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ లు ముఖ్యమంత్రులకు సలహాలు, సూచనలిస్తూ ఉన్నతమైన పాలనలో ప్రముఖ భాగస్వామ్యులౌతున్నారు.

పైన చెప్పిన లక్షణాలు గల మంత్రి సమకూడకపోతే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా రాయలు తెలియజేశారు. అది కింది పద్యంలో చూడవచ్చు.

శా॥ “నీతిం దాన తలంచి చేయఁ బని గా నీ కాకపోనీ బల

వ్రాతార్థాఢ్యత నెమ్మి నుండ కొరుఁ బ్రోవన్మంత్రి యంచుం గుణా

తీతుం గుమ్మడికాయ యంత యగు ముత్తెంబై మనం బేర్ప న

ట్లే తానాతనిచేతిలో బ్రతుకువాఁడే యౌఁ జుమీ మీఁదటన్” (శ్రీకృష్ణదేవరాయలు 4.213)

రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధన బలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని, ఆధిపత్యం చెలాయించే వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయ అంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండా నైనా రాజ్యం నడుస్తుంది కానీ గుణహీనుణ్ణి మాత్రం చేయకూడదు. గుమ్మడికాయ అంత ముత్యం చూడటానికి బాగుంటుంది. బాగుంది కదా అని ధరిస్తే దానిని మోయలేక ధరించిన వాడు ఎలా బాధపడతాడో, ఆధిపత్య దోరణి ఉన్న గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడని భావన. కాబట్టి రాజు తనకు లోబడి ఉండే అనుభవపూర్వకమైన వ్యక్తిని, గుణసంపన్నుడిని మంత్రిగా నియమించుకోవడం ఉత్తమం. తిమ్మరుసు వంటి మంత్రులు ఉండబట్టే రాయలు ఎన్నో గొప్ప విజయాలు అందుకున్నారు. “మంత్రి తిమ్మరుసు బుద్ధి బలము చేతనే, మంత్ర శక్తి చేతను కృష్ణదేవరాయనికధిక విఖ్యాతి కలిగెనని చెప్పుదురని” (వీరేశలింగం 496) కందుకూరి వారు పేర్కొన్నారు. అందుకే రాయలు మంత్రుల విషయంలో మంచి సూచనలు చేశారని చెప్పవచ్చు.

ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు సలహాదారులను నియమించుకొని వారి సలహాలపైనే పాలన సాగిస్తున్నాయి. వారు ఏం చెప్పిన నిజం అని నమ్ముతూ ప్రజల వ్యతిరేకతను తెలుసుకోలేక ఓటమి పాలవుతున్నాయి. కావున ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ముఖ్య నాయకుడే తెలుసుకోగలగాలి. ఆ విషయాన్ని కింది పద్యంలో చక్కగా వివరించారు రాయలు.

చ॥ “ఎఱుఁగ నగున్ స్వశక్తి నవనీశుఁడు నాలుగుపాళ్ల మూఁడు పా

ళ్లెఱుఁగక మోచినట్టిపని కిష్టసుహృత్తతి దెల్పఁనొక్క పా

లెఱుఁగ నగు న్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుఁడైనఁ జేయు నె

త్తఱి విపదుగ్రదండ పరతంత్రుఁడు గాక చిరంబు రాజ్యమున్” (శ్రీకృష్ణదేవ రాయలు 4.240)

రాజు ఎప్పుడు నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచి పెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు, సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు.

రాయలు మారువేషంలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను రాజ్యంలో జరుగుతున్న విషయాలను స్వయంగా తెలుసుకునేవారని చరిత్ర చెబుతుంది. అందుకు అనుగుణంగానే స్వీయానుభవాన్ని సాహిత్య రూపంలో చేర్చారు. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు గెలిచాక తన ప్రాంత పరిధిలో ప్రజల అభిప్రాయాలను, వారి మనస్తత్వాలను, వారి కష్టనష్టాలను తానే స్వయంగా తెలుసుకుంటూ ఉండాలి. కష్టాలలో తోడుగా ఉన్నప్పుడే ప్రజలు గుర్తుంచుకుంటారు. అలా కాదని ఎవరో ప్రతినిధిని ఉంచి అతను చెప్పిందే నిజం అనుకోకూడదు. తాను పర్యవేక్షిస్తూ ఉండాలి.

5. సన్నిహితుల పట్ల వ్యవహార శైలి

ఎలాంటి వారినైనా ఒకే సారి ఉన్నత పదవుల్లో పెట్టకూడదు. మొదట వారి ప్రవర్తనకు అనుగుణమైన పనిలో ఉంచి వారిని గమనిస్తూ మంచి వారైతే ఉన్నత పదవులు ఇవ్వాలని సూచించారు. మంచివాడని భావించి ఉన్నత పదవినిచ్చి, కొంత కాలానికి చెడ్డవాడని తెలియగానే అతన్ని పదవికి దూరం చేయడం ద్వారా అనర్థాలు కలగవచ్చు. ఆ అంశాన్ని కింది పద్యంలో ఈ విధంగా తెలియజేశారు.

ఆ॥ “మొదలఁ బెనిచి పిదపఁ గుదియింప నెవ్వాఁడుఁ

దనదు తొంటిహీన దశఁ దలంపఁ

డలుగుఁ గాన శీల మరయుచుఁ గ్రమవృద్ధి

బెనిచి వేళవేళఁ బనులుఁ గొనుము” (శ్రీకృష్ణదేవరాయలు 4.208)

ఎంత మంచి వాడిని అయినా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించక, తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్టుగా పనులు చేయించుకోవాలి.

రాయలు వారు అప్పాజీ విషయంలో ఇలాంటి పనే చేశారని ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం వల్ల తెలుస్తోంది. “క్రీ.శ.1523 నుండి అంటే రాయలవారి నలభై తొమ్మిదో సంవత్సరం నుంచి వారి మీద అప్పాజీ ప్రభావం తగ్గుముఖం పట్టింది. అప్పటికి కాశిరఃప్రధాని ముసలివాడు. ఆ పండు ముసలితనంలో అప్పాజీ గోవా పరిసరాలలో యుద్ధం చేశాడు. పోర్చుగీసు వాళ్ల చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో రాయల వారికి అప్పాజీ మీద ఉండే గౌరవం తగ్గుముఖం పట్టినట్టుంది” (ఆరుద్ర 5: 94). అప్పాజీ గారు రాయలు చేసిన అన్ని యుద్ధాలలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తికి ప్రాధాన్యం తగ్గించడం ఆ తరువాత జరిగిన పరిణామాలు కృష్ణదేవరాయల వారిని మానసికంగా కుంగదీసాయి.

ప్రస్తుతం రాజకీయ పార్టీలలో చీలికలు రావడానికి కారణం ఇలాంటిదే. సాధారణ వ్యక్తులకు ఉన్నత పదవులు ఇచ్చి ప్రజలలో వ్యతిరేకత కారణంగా అతడికి మరొక మారు అవకాశం ఇవ్వకపోతే స్వంత పార్టీ పైనే తిరుగుబావుట ఎగరేయడం నిత్యం చూస్తున్న విషయమే. కావున పాలకుడు ఉన్నత పదవుల్లో నియమించే వ్యక్తిని సహనం, ఓర్పు కలిగి పరిస్థితులను అర్థం చేసుకొనే వారిని ఎంచుకోవాలి.

సన్నిహితులు తమకు గిట్టని వారిపై లేదా తమకంటే మంచి పేరు సంపాదించుకునే వారిపై ఎప్పుడు చెడుగా ప్రచారం చేస్తుంటారు. అలాగే రాజుకు కూడా అతడి గురించి చెడుగా చెప్పి పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఎలా నడుచుకోవాలో రాయలు చేసిన సూచన సున్నితంగా ఉంది.

కం॥ “మొదలనె యొరుదల కానిం

జెదరంగా నాడకాత్మఁ జింతింపు పదిం

బదిగ మృష యేని మఱి విడు

ముదస్తుఁగాఁ గాక యుండ నొక్క మతమునన్” (శ్రీకృష్ణదేవరాయలు 4.220)

కొందరు సన్నిహితులు ఎప్పుడూ చాడీలు చెప్పుతుంటారు. వాళ్ళను వెంటనే తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ల మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్లను నియమించి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని చెప్పాడు.

తమకంటే మంచి పేరు తెచ్చుకునే వారిపట్ల కొందరు అసూయ, ద్వేషంతో చెడుగా ప్రచారం చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఆ ప్రచారాలలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని అందుకు అనుగుణంగా పాలకుడు ముందుకు సాగాలి. చెడు ప్రచారం చేసే వాళ్ళని ప్రమాదం లేని చోట నియమించి వారిని గమనిస్తుండాలి. పదవి నుంచి తీసేస్తే వ్యతిరేక శక్తులతో కలిసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కావున వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.

రాజ్య సుభిక్షం కోసం సన్నిహితులతో, మంత్రులతో ఏర్పాటు చేసే చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. వారు తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అలాంటి సందర్భంలో ప్రవర్తించాల్సిన తీరును చక్కగా తెలిపారు.

తే॥ “కార్య మొక్కఁడు గనిన మాత్సర్యమున నొ

కండు గాదని ఖండించుఁ; గన్నెఱింగి,

యిరువురను గా దనక కొల్వు విరిసి, మీఁద

నల్లవాఁ డెన్నినది సేయ నగు శుభంబు.” (శ్రీకృష్ణదేవరాయలు 4.227)

రాజ్యాంగ మంత్రాలోచన వేళ సభలో ఒకడు ఒక ఉపాయం చెప్పగా మరొకడు అసూయతో దానిని ఖండిస్తాడు. అది అసూయతో పలికిన మాటని తెలిసినా ఇద్దరినీ కాదనకుండా సభ అనంతరం ఆలోచించి మొదటివాడు చెప్పింది మంచిదైతే అది చేయటం శుభప్రదం.

దేశంలో జరుగుతున్న మంచి చెడులను సమీక్షించుకోవడం కోసం నేడు కూడా మంత్రుల సమావేశాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. అక్కడ పాలన పరమైన విధానాలలో మార్పులు చేర్పుల గురించి చర్చ సర్వసాధారణం. అక్కడ ఒకే పార్టీకి చెందిన వారైనా కూడా తమలో తమకు అంతర్గత కలహాల కారణంగా ఒకరు సూచించిన సలహాను ఒకరు ఎత్తిపొడవడం జరుగుతుంటుంది. కావున అలాంటి అంశాలను గమనిస్తూ నాయకుడు ఎవరిని తక్కువ చేయకుండా అన్ని అంశాలను విని ఏది ఉచిత సలహానో గ్రహించి చివరగా తానే నిర్ణయం తీసుకోవాలి.

6. అధికారుల పట్ల ప్రవర్తన

రాజ్య పాలన ఎటువంటి ఆటంకాలు కలుగకుండా రాజ్యంలో చివరి ప్రాంతం వరకు పాలన సాగాలంటే అధికారుల పాత్ర ముఖ్యమైనది. అధికారుల పట్ల పాలకుడు ఉదార భావంతో ఉంటూ పాలన సాగించాలి. ప్రజలను క్షేమంగా పాలించాలంటే అధికారుల పని తీరు ఎనలేనిది. అలాంటి వారితో ఎలా ఉండాలో ఇక్కడ పరిశీలిద్దాం.

కం॥ “ధనముఖ్యము కేవల మే

పనికిన్ రా దాస్థ గలిగి పలువురు ప్రభువుల్

పని సేయక తద్వశ్యం

బునకు నలోభానృశంస్యముల్ ఋతము జెలుల్” (శ్రీకృష్ణదేవరాయలు 4.215)

ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు, అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి, మిత్రత్వం కలిగి ఉండాలి. “రాయలు తన ఆదాయం 65 లక్షలలో 25 లక్షలు మాత్రం సొంతానికి వినియోగించి మిగిలిన మొత్తం ఏనుగులు, గుర్రాలు కొనేవాడని న్యూనిజ్ రాశాడు. కాబట్టి ఆదాయంలో అధిక భాగం సైన్య పోషణకే ఖర్చయ్యేది” (హనుమంతురావు 388). నాటి పరిస్థితుల్లో అది తప్పనిసరని చెప్పనక్కరలేదు. అలాగే రాయలు స్వయంగా జీతమిచ్చి పోషించే కైజీతసైన్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి వారికి నెల నెలా జీతాలిచ్చే వారు. అలా ధనముతో చేయాల్సిన పనులు చేస్తూనే తన దగ్గర ఉన్న వారి పట్ల సన్నిహితంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలిగేవారు రాయలు. అందుకే రాయలు మరణించాక అల్లసాని పెద్దన గారు ఇలా బాధ పడ్డారు.

తే.గీ. “ఆంధ్ర కవితా పితామహ! అల్లసాని

పెద్దన కవీంద్ర యని నన్నుఁ బిలుచునట్టి

కృష్ణరాయలతో దివికేఁగ లేక

బ్రతికి యున్నాఁడ జీవాచ్ఛవంబు నగుచు!” (లక్ష్మీకాంతం 373)

అంటూ విలపించారు. రాయలు వారు ఎంత ప్రేమ, వాత్సల్యం, అభిమానాలు చూపించింటే పెద్దన గారు ఇంత బాధ పడింటారు.

ప్రస్తుత నాయకులు కూడా ఇలా పాలనలో ప్రముఖ పాత్ర గల అధికారుల పట్ల పిసినారిగా వ్యవహరించక సన్నిహితంగా ఉంటూ ఆప్యాయత, అనురాగాలు పంచగలిగితే అధికారుల పనితనం మెరుగుపడే అవకాశం ఉంటుంది. వారితో పనిచేయించుకుంటూ సరైన సమయాలలో జీతభత్యాలు చెల్లిస్తుండాలి. సమయానికి జీతాలు చెల్లించకుండా ఉంటే వారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు దండగ అని మాట్లాడిన వారిని అధికారం నుంచి దించడం కూడా ప్రస్తుత రాజకీయాలలో చూస్తున్నాం. కావున ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ పాలన సాగించాలి. అలాగే వారికి రావాల్సిన బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ పనులు చేయించుకోవాలి. అలాగే ఉన్నతమైన పనితీరును కనబరచిన వారికి గుర్తించాలి. ఆ విషయాన్ని ఇలా వివరించారు....

ఆ॥ “పాత్రభూతు లెస్సఁ బరికించి యతఁ డడు

గకయు నొకఁడు సెప్పకయు మునుపుగఁ

బనసపండ్లు దిగిన పరిగ స్వప్నము గన్న

నెఱిగ నొసఁగి వెఱఁగు పఱుచు టొప్పు” (శ్రీకృష్ణదేవరాయలు 4.274)

చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే అధికారిని, హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఇచ్చి, ఒక్కసారిగా అతడు కలగన్నట్లుగా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి.

రాయల కాలంలో సాహిత్యానికి స్వర్ణయుగం. అష్టదిగ్గజాలను పోషించి కవితాస్త్రీలోలుడిగా పేర్కొనబడ్డాడు. అష్టదిగ్గజ కవులకు తిప్పలూరు అగ్రహారం దానం చేశాడు. ప్రత్యేకించి అల్లసాని పెద్దనకు కూడా కోకటం అగ్రహారం దానంగా ఇచ్చారు.

మంచి కవిత్వం చెప్పడమే కాక మంత్రాంగంలో కూడా పెద్దన్న గారు పాల్గొంటూ ఉండేవారు పెద్దన్న గారి సలహాకు సాహిత్యానికి మెచ్చిన రాయలవారు ఒక అగ్రహారం దానం చేశాడు అది అల్లసాని పెద్దన్న గారి జన్మస్థలం కోకటమే” (ఆరుద్ర 5: 132).

తన ఆస్థానంలో ఉన్న కవులకు, కళాకారులకు రాయలు ఎన్నో దానాలు చేసి వారు ఆశ్చర్యానికి లోనయ్యేలా చేశారు.

పనిపట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించే రాజోద్యోగులకు (ప్రభుత్వ ఉద్యోగులకు) రాజు గుర్తిస్తే సంతోషిస్తారు. అలాంటి వారిని మరికొంత మంది ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన సేవలకు శ్రీకారం చుడతారు. నాయకుడు ప్రజలకు అందించాల్సిన సంక్షేమాన్ని మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమైనది. వారికి ఆనందం కలిగేలా, ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండేలా స్థాయికి తగ్గ జీతభత్యాలను అందిస్తుండాలి.

7. హితాహితుల గుర్తింపు

రాజాస్థానంలో పనిచేయడం నీతి, నిజాయితీలతో కూడిన వ్యక్తులకు స్వర్గధామం లాంటిది. అలాంటి చోట నమ్మకమైన వారిని నియమించుకొని వారిని హితులుగా చూడాలి. ప్రలోభాలకు లొంగుతూ రాజుకు అప్పుడప్పుడు చెడు కోరే వారు ఉంటారు. అలాంటి హితులు, హితాహితులు, అహితుల గురించి వివరించడం జరిగింది. వాటిని పరిశీలిస్తే,

కం॥ హితులు హితాహితులు సదా

హితులునునై రాజు నెడల నిటు త్రివిధమునన్

క్షితి ననుచరు లుందురు సం

తతమున్ మఱి వారిఁ దెల్పెద విను మనఘా”(శ్రీకృష్ణదేవరాయలు 4.272)

రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు. ఒకరు హితులు. వీరు ఎప్పుడూ రాజు మేలు కోరుతారు. రెండవ వారు హితాహితులు. వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతర ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. మూడవ వారు అహితులు. వీళ్లెప్పుడూ రాజు మేలు కోరరు.

ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే ఈ మూడు లక్షణాలు ఉన్న వారు ఉన్నారు. తమ నాయకుడి కోసం నిస్వార్థతతో పనిచేసే సాధారణ కార్యకర్తలందరూ హితులుగానే చెప్పవచ్చు. వీరితో ఎలాంటి ప్రమాదం ఉండదు. రాజకీయ మనుగడ కోసం వచ్చి కాలం గడిపే వారిని హితాహితులుగా చెప్పవచ్చు. ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు’ అంటే ఇలాంటి వారే. వీరు అధికారం కోసం ఎంతటి శతృత్వాన్ని అయినా వీడి కాలానుకూలంగా మారిపోతారు. అలాగే తమ పార్టీలోనే ఉంటూ, తమ ప్రభుత్వంలో ఉంటూ వ్యతిరేకతను చూపే వారు అహితులుగా భావించవచ్చు. అలాంటి వారిని అధికారిక కార్యకలాపాలకు దూరం చేసి తొలగించడం ఉత్తమం.

8. శత్రువుల పట్ల అప్రమత్తత

శత్రువుల వ్యూహాలు తెలుసుకుంటూ వారి ఎత్తులకు చిక్కకుండా ప్రజా పాలన ఏ విధంగా సాగించాలో తెలియజేశారు రాయలు. ప్రజారంజకంగా పాలన సాగిస్తూనే శత్రువుల కదలికలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.

తే ॥ “కన్నొకటి నిద్రవోఁ బెఱకంట జాగ

రంబు గావించు భూరుహాగ్రంబు మీఁది

యచ్ఛభల్లంబుగతి భోగ మనుభవించు

నెడను బహిరంతరరులపై దృష్టివలయు” (శ్రీకృష్ణదేవరాయలు 4.241)

రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద పడుకొని, ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదే విధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయటా ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి.

రాయలు సూచించిన ‘బహిరంతరరుల’ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే బయట శత్రువులు అలాగే మనలో ఉండే అంతర్గత శత్రువులను అదుపు చేసుకోవాలి. అరిషడ్వర్గాలే అంతర్గత శత్రువులు. ఈ కామ, క్రోధ, మద, మాత్సర్యాలపై అదుపు లేకపోతే నాయకుడు ఎక్కువకాలం పదవిలో కొనసాగలేడు.

అనేక మంది నాయకులు అక్రమ సంబంధాలు నెరిపి తమ వ్యక్తిత్వాలను కోల్పోతున్నారు. అలాగే ధన దాహంతో అక్రమార్జన చేసి కటకటాల పాలవుతున్నారు. ప్రజలను పట్టించుకోక అధికార మదంతో పేట్రేగిపోతున్నారు. గెలిచిన గర్వంతో గొప్పలకు పోయి బొక్క బోర్లా పడుతున్నారు. కావున అధికారం అన్నది శాశ్వతం కాదని గుర్తుంచుకొని ప్రజా క్షేమాన్ని కోరి పాలన సాగించాలి. అప్పుడే ప్రజల మనసుల్లో స్థానం పదిలంగా ఉంటుంది.

తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇస్తూనే వారి ప్రాధాన్యాన్ని తగ్గించాలి. అలాగే సరైన సమయం వరకు వేచి చూసి శిక్షించాలి. ఆ విషయాన్ని కింది పద్యంలో చూడవచ్చు.

ఆ॥ “హదను వచ్చుదాఁక నపరాధిపై రోష

మాఁగి చెఱుపవలయు హదను వేచి

లక్ష్యసిద్ధిదాఁక లావున శర మాఁగి

కాఁడ విడుచు వింటి వాఁడు వోలె” (శ్రీకృష్ణదేవరాయలు 4.246)

రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడువకూడదు. గురి కుదిరిందో లేదో సరిగ్గా చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి. రాయలు హదను వచ్చు దాకా అపరాదిపై రోషమాపవలే నని చెప్పాడు కానీ తన కొడుకు తిరుమల రాయలు విషయంలో తిమ్మరుసు తప్పు చేశాడని ఇతరులు చెప్పడంతో అతన్ని బంధించి శిక్షించాడు.

క్రీ.శ.1524 లో రాయల వారు తమ ఆరేళ్ల కుమారునికి పట్టాభిషేకం చేశారు. తిరుమల దేవరాయలకు పట్టం కట్టారో లేదో కొద్ది కాలానికి ఆ బాలుడు మరణించాడు. కిట్టని వాళ్ళు అప్పాజీ విషం పెట్టించాడన్న పుకారు లేవదీశారు. రాయలవారు నమ్మి చేయకూడని అఘాయిత్యం చేశారు” (ఆరుద్ర 5: 94).

రాయలు వారు చేసిన దండయాత్రలలో విజయబావుటా ఎగరేయడంలో అప్పాజీ పాత్ర కీలకమైనది. అలాంటి వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు నమ్మి శిక్షించడం రాయలు వారికి మనసులో ముల్లులా మెదులుతూ, అందుకు తోడు కొడుకు మరణం మరింత కుంగదీసింది.

అధికారం ఉంది కదా అని తప్పు చేసిన వారి పట్ల పదే పదే కక్ష సాధింపులకు పోకూడదు. నిజనిరూపణ కోసం వేచి చూడాలి. అవకాశం కోసం వేచి చూసి తప్పు చేసిన వారిని పదవుల నుంచి తొలగించడమో, శత్రువులకు శిక్ష వేయడమో చేయాలి.

9. పాలకుడి ఆరోగ్యం దేశసంక్షేమం

దేశ సంక్షేమమే పరమావధిగా, ప్రజల అభీష్టము మేరకు పాలన సాగించే రాజుకు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే పైవన్నీ చేయగలం. దేశ సంక్షేమంతో పాటు తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేశారు రాయలు. చరిత్రలో చాలా మంది రాజులు యుక్త వయసులోనే అస్తమించడం కనపడుతుంది. మంచి పోషకాహారం, వ్యాయామం చేస్తూ దృఢంగా ఎలా ఉండాలో కింది పద్యంలో పరిశీలించవచ్చు.

సీ॥ “తజ్ఞ మండలిఁ గూర్చి ధాతువుల్ దెలిపి హేమాదులఁ గొని ప్రకృత్యనుగుణాల్ప

జీవనాహృతులచేఁ జెలఁగి మహాబలోద్రేకంబు మర్దన రిత్తఁ జేసి

స్నేహార్ద్రుఁ డగుచు నశేషంబుఁ బోషించి, సరవర్ణముల తప్పు సరణు లుడిపి

సతతద్విజ ప్రతిష్ఠాశాలియై బలియించుపట్టులు బలియించి పలుచ

తే ॥ జేయ పట్టులు పలుచఁగాఁ జేసి వలయు

మొసగ శోధన మఱవక యొసగ వలయు

సాంగ రాజ్య మొకెత్తుగ స్వాంగ రాజ్య

మొక్క యెత్తుగ నృపతి యాయుష్య పరత” (శ్రీకృష్ణదేవరాయలు 4.270)

రాజు సుఖ పరిపాలనార్థం తెలిసినవారి నుండి లోహాదుల ఉనికిని పసిగట్టి, స్వర్ణాదులను గ్రహించి, ప్రజల ఆదాయం నుండి కొంచెంగా పన్ను గ్రహించి, బలవంతులైన శత్రువులను దండిస్తూ, ప్రజల పట్ల దయ కలిగి అందరినీ సమానంగా పోషిస్తూ, వర్ణాశ్రమధర్మ పరిరక్షణ చేస్తూ, ఉత్తమ ద్విజుల ఉనికిని కాపాడుతూ, జనం లేని చోట్ల జన సమ్మర్థం కల్పించి ఎక్కువైన చోట్ల తగ్గించి జాగ్రత్తగా పాలించాలి. ఆయుర్వృద్ధి కోసం ధాతువులు తెలిసిన వైద్యులను కూర్చి స్వర్ణాదిభస్మాలను సేవిస్తూ దేహానికి పుష్టి కల్గించుకుంటూ, బలిపించుకోదగ్గ వక్షోభుజాలను దృఢం చేసుకొంటూ, తగ్గించుకోదగ్గ ఉదరాదులను కృశింపజేసుకొంటూ వ్యాయామం చేస్తూ దేహశుద్ధిని ఏమారక శరీరాన్ని కాపాడుకోవాలి.

రాయలు రాజ్య భారం వహించక మునుపు తన అన్న వీర నరసింహరాయలు అనారోగ్యంతో మంచాన పడటం వల్ల రాయలు ఈ ఆరోగ్య సూచనలు చేశాడేమో అనిపిస్తుంది.

వీర నరసింహారాయులు పరిపాలనను సుస్థిరం చేయడానికి కృష్ణదేవరాయలు ఎంత పాటుపడిన అన్నగారు అదృష్టహీనుడు. మూడేళ్లు మాత్రమే రాజ్యం చేశాడు. క్రీ.శ 1509 జూలైలో అతడు మంచానపడ్డాడు. మహా ప్రధాని తిమ్మరుసయ్యకు తన అంతిమ కోరికను చెప్పి మరణించాడు” (ఆరుద్ర 5: 66).

సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన సేనలు ఉండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే తన అన్న గారిలాగే అకాల మరణం సంభవిస్తుందని రాయలు ఆరోగ్య విషయాలను కూడా తన రాజధర్మాలలో చేర్చారేమో అనిపిస్తుంది.

ఆరోగ్య విషయాలను కేవలం గ్రంథరూపానికే పరిమితం చేయక వేకువజామునే లేచి రోజువారీ కార్యకలాపాలను రాయలు వారే స్వయంగా పర్యవేక్షించుకునే వారు.

పట్టం కట్టుకున్నాక రాయలు ఒక ఖచ్చితమైన దినచర్య ఏర్పాటు చేసుకున్నారు. నిద్రలేవగానే ఒక జాము సేపు వైద్యులతోనూ, జ్యోతిష్యులతో ముచ్చటించేవారు. సుఖంగా నిద్ర పట్టిందా? అని కుశల ప్రశ్నలు వేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వైద్యులతో తెల్లవారకముందు సల్లాపించడంలో రాయల వారి జాగ్రత్త కనబడుతుంది. పొద్దెక్కాక మంత్రులతో, సామంతులతో సంప్రదింపులు చేసి ధనార్జన యుక్తులైన కాయస్థులతో గోష్ఠి చేసి రాజ్యంలోని ఆదాయవ్యయాల లెక్కలు వినేవారు. తర్వాత అంగమర్ధనం, మల్లులతో వ్యాయామం చేసేవారు. వంటవాళ్లతోటి వేటకాళ్లతోటి మాట్లాడేవారు. వేటగాళ్లు తెచ్చే మాంసం ఎలా వండాలో వంట వాళ్లకు పురమాయించే వారు. ఏ మాంసాలు తీసుకురావాలో వేటగాళ్లకు చెప్పేవారు” (ఆరుద్ర 5: 66).

రాయలు ఆహార, వ్యాయామ విషయాలలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి రోజు వైద్య బృందం సలహాలు తీసుకోవడం మనం గమనించవచ్చు. నాయకులు ధన దాహంలో మునిగి ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు. ఎంత డబ్బున్న ఆయుస్సును కొనలేమనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రతి ఒక్కటి కల్తీ మయమవుతున్న ప్రస్తుత కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిత్యం ప్రయాణం చేస్తూ, ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటిని తీర్చే క్రమంలో పాలకులకు తీరిక ఉండదు. కావున ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తుండాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోజు వ్యాయామం చేయాలి. పై పద్యం రాజు రాజ్యాన్ని ఎలా చూసుకుంటాడో తన శరీరాన్ని అలాగే పరిరక్షించుకోవాలి అని చెప్పటంతో అప్పట్లో రాజులు తమ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చే వారో అర్థం అవుతుంది. అలాగే వ్యాయామం ద్వారా దేహాన్ని బలంగా ఉంచుకోవాలని సూచించడం వ్యాయామ ప్రాముఖ్యం ఇక్కడ గమనించాల్సిన అంశం.

ఉపసంహారం

శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. ఆయన పాలనా కాలంలో ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవనాన్ని కొనసాగించారు. అందుకే రాయల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. మంత్రి తిమ్మరసుతో కలిసి మారువేషంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేవారు. అందుకే ప్రజారంజకమైన పాలన కొనసాగించగలిగారు. తన స్వానుభవం ద్వారా ఎదురైన విషయాలను రాజకవి అయి సాహిత్య రూపంలో అందించారు. అప్పటి పరిస్థితులకు, కాలానికి అనుగుణంగా రాయలు రాజధర్మాలను లిఖించడం జరిగింది. ప్రస్తుతం ప్రజా పాలనలో నాయకులు, పాలకులు అందులో నుంచి చాలా అంశాలను గ్రహించగలిగి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలుగుతారని ఈ వ్యాసాన్ని రచించడం జరిగింది. ప్రజల కష్టాలను రాజు ఏ విధంగా వినాలి, అలాగే సలహాదారులు మంత్రుల విషయంలో పాలకుడు ఏ విధమైన మార్గం అనుసరించాలి, అలాగే మనిషి బయటి శత్రువులే కాక మనిషిలో ఉన్న అంతర్గతమైన అరిషడ్వర్గాలనే శత్రువుల ద్వారా కూడా పాలకుడికి ముప్పు ఉంటుందని తెలియజేశారు. దేశ సంక్షేమంతో పాటు, ఆరోగ్య సంక్షేమాన్ని నిలుపుకున్న నాయకుడు సుదీర్ఘమైన పాలన సాగించగలడు.

  • శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద గ్రంథం సమకాలీన పాలనా సూత్రాలకు మార్గదర్శకం.
  • ప్రజా క్షేమం, దేశాభివృద్ధి, పన్నుల విధానాలపై రాయలు సలహాలు ప్రస్తుత నాయకులకు ఉపయోగకరమైనవి.
  • పాలకుడు స్వశక్తి కలిగి ఉండటమే కాకుండా సమర్థవంతమైన, విశ్వసనీయ మంత్రులను నియమించుకోవాలి.
  • సన్నిహితులు, అధికారుల పట్ల వ్యవహరించే విధానాలు, శత్రువుల పట్ల అప్రమత్తత నేటి రాజకీయాలకు వర్తిస్తాయి.
  • పాలకుడి వ్యక్తిగత ఆరోగ్యం, దేశ సంక్షేమం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని రాయలు నొక్కి చెప్పారు.
  • ప్రజల కష్టాలను విని, వారి సంక్షేమం కోసం పాటుపడే నాయకులే సుదీర్ఘకాలం గుర్తుండిపోతారు.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం. 5వ సంపుటి, ప్రజా శక్తి బుక్ హౌస్, విజయవాడ, 1989.
  2. కోటేశ్వరరావు, తుమ్మపూడి. ఆముక్తమాల్యద సౌందర్యలహరీవ్యాఖ్యానం. ప్రథమద్వితీయభాగాలు, మలయకూట పబ్లికేషన్స్, హైదరాబాద్, 2001.
  3. దేవరాయలు, శ్రీకృష్ణ. ఆముక్తమాల్యద. ఎమెస్కో ప్రచురణ, విజయవాడ, 2009.
  4. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష- (రెండవ సంపుటం). నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి, 2003.
  5. లక్ష్మీ కాంతం, పింగళి. ఆంధ్ర సాహిత్య చరిత్ర. నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2018.
  6. రామస్వామి శాస్త్రులు, వావిళ్ళ (సంపా.). ఆముక్తమాల్యద ఆంధ్రవ్యాఖ్యాన సహితము. సరస్వతీ నిలయ ముద్రాక్షర శాల, చెన్నపట్నం, 1907.
  7. వీరేశలింగం, కందుకూరి. ఆంధ్ర కవుల చరిత్రము. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2006.
  8. వెంకటరాయ శాస్త్రి, వేదము. సంజీవని వ్యాఖ్య. పమ్మి పొన్నయ్య శెట్టిగారి చంద్రికాముద్రాక్షర శాల, మదరాసు, 1964.
  9. వెంగళాచార్యులు, కాండూరు. ఆముక్తమాల్యద - ఒక పరిశీలన. సాహితీ మంజూష.
  10. హనుమంతు రావు, బి.యస్.యల్. ఆంధ్రుల చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2012.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]