headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-07 | Issue-8 | July 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

5. సుద్దాల అశోక్ తేజ 'శూద్రగంగ' కావ్యం: సమాజం

ఎ. విజయ్ కుమార్

రచయిత, విమర్శకులు,
నల్లకుంట, హైదరాబాద్, తెలంగాణ.
--
సెల్: +91 9573715656, Email: vijaykumaraithagoni@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 02.06.2026        ఎంపిక (D.O.A): 22.06.2026        ప్రచురణ (D.O.P): 01.07.2026


వ్యాససంగ్రహం:

సుద్దాల అశోక్ తేజ రచించిన 'శ్రీ శూద్రగంగ' దీర్ఘ కావ్యంపై విశ్లేషణ ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం. గంగను శూద్రత్వాన ఆపాదించడం ద్వారా సాంప్రదాయిక పౌరాణిక, మతపర భావనలను సవాలు చేస్తున్న ఈ రచన ప్రాముఖ్యతను ఈ పరిశోధన గుర్తిస్తుంది. అణగారిన వర్గాల చారిత్రక అస్తిత్వాన్ని, సామాజిక ఆవశ్యకతను తెలియజేయడంలో ఈ శీర్షిక సమర్థతను వివరిస్తుంది. డా. బి.ఆర్. అంబేద్కర్ 'ఎవరీ శూద్రులు', రొమిలా థాపర్ 'తరతరాల భారత చరిత్ర', క్రిస్టోఫర్ కాడ్వేల్ 'ఇల్యూషన్ అండ్ రియాలిటీ', సివి 'వర్ణ వ్యవస్థ' వంటి ప్రామాణిక గ్రంథాలను ఈ పరిశోధన అధ్యయనం చేసింది. సుద్దాల అశోక్ తేజ కావ్యం ప్రాథమిక వనరు కాగా, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇతర చారిత్రక రచనలు ద్వితీయ వనరులుగా సమాచారాన్ని అందించాయి. పరిశోధన పద్ధతిగా సాహిత్య విశ్లేషణ, సామాజిక-చారిత్రక విమర్శను అనుసరించింది. శూద్రుల మూలాలు, ధర్మశాస్త్రాలలో వారి స్థానం, గంగ చారిత్రక ప్రాముఖ్యత, పౌరాణిక గంగావతరణం వెనుక దాగి ఉన్న కుట్ర కథలు, వాటి సామాజిక నేపథ్యం విశ్లేషిస్తుంది. కావ్యం వర్ణన, అగ్రవర్ణ వివక్షపై గంగ అసహనం, కట్టుకథలపై కవి యుద్ధం, శూద్రుల ఇష్టాలు గంగ ప్రయాణం, భిన్నత్వంలో ఏకత్వం, గంగ ఆహార్య వర్ణన వంటి అంశాలను సవివరంగా చర్చించింది. ఈ పరిశోధన 'శ్రీ శూద్రగంగ' కావ్యం బ్రాహ్మణ ఆధిపత్య కథనాలను ధైర్యంగా తిరస్కరిస్తుందని తేలుస్తుంది. గంగను మట్టి మనుషుల జీవన ప్రవాహంగా పునర్నిర్వచిస్తూ, శ్రమ జీవుల ఆత్మగౌరవాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంది. ఇటువంటి ఆధిపత్య వ్యతిరేక రచనలు రూపొందించడం సామాజిక సవాళ్లతో కూడుకున్నది అని పరిశోధన అంగీకరిస్తుంది. భవిష్యత్ తరాలకు సామాజిక అవగాహన పెంపొందించడానికి ఈ కావ్యాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఒక కీలక సూచన చేసింది.

Keywords: శూద్రగంగ, సుద్దాల అశోక్ తేజ, దీర్ఘ కావ్యం, సామాజిక విశ్లేషణ, కుల వివక్ష, బ్రాహ్మణవాదం, పురాణాల పునర్విశ్లేషణ, శ్రమజీవుల సాహిత్యం, అస్తిత్వం.

1. పరిచయం

తెలంగాణ దుక్కులలో పుట్టి తెలుగు నేలంతా పాటల పరిమళమై అల్లుకున్నవాడు. తెలుగుజాతి గర్వపడేలా జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత అవార్డు అందుకున్న కవి సుద్దాల అశోక్ తేజ, రచయిత కూడా. జీవనవృత్తిలో సినిమా పాటలు రాయడమే ఆయన ప్రధాన పని. కానీ ఆయన ఆలోచనా ప్రవృత్తి సదా సకల జనుల గురించే ఆలోచిస్తుంది. అందుకే ఆయనకు ఎవరూ రాయమని చెప్పకపోయినా ప్రజా పాటలు రాస్తుంటాడు. “నేలమ్మ నేలమ్మ, ఆకుపచ్చ చందమామ, టపటపటప చెమట బొట్లు, రాయి సలాక ఇసుక ఇటుక, కన్నా తల్లి మమ్ముల కన్నప్పటి నుండి” లాంటి పాటలు దీనికి నిదర్శనం. ఇవి ప్రజాకవిగా తనని మన ముందు నిలబెడుతున్నాయి. అశోక్ తేజ కేవలం ఇలాంటి పాటల దగ్గరే ఆగిపోలేదు. మిగతా పాటల రచయితలకు భిన్నంగా కవిత్వం కూడా రాశాడు. అది కూడా మామూలు కవిత్వం కాదు, దీర్ఘ కవిత్వం రాస్తున్నాడు. అలా ఇప్పటి వరకు సామాజిక పరిణామ క్రమానికి శ్రమనే మూలమని చెప్పే ‘శ్రమకావ్యం’; మనుషుల జీవనానికి ప్రకృతే ఆధారమని తీర్మానించిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ అని రెండు దీర్ఘ కావ్యాలు రాశాడు. ఆ పరంపరలో భాగంగానే తన అస్తిత్వ మూలాలను వెతుకుతూ మూడవదిగా “శ్రీ శూద్రగంగ” వచన రూపు కావ్యంతో వచ్చాడు. గంగ శూద్రజాతికి చెందినది అనగా నీరు శూద్రజాతిదే అని చెప్తూ, నీటికి శూద్రత్వాన్ని ఆపాదించి మన ముందు ఉంచాడు. కాబట్టి ఈ శూద్ర అంటే ఏమిటి? శూద్ర అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అనే మూలాలను పురాణేతిహాస, చారిత్రక, రాజకీయ కోణాల ద్వారా దీనిని పరిశీలించాలి.

2. నేపథ్యం

సుద్దాల అశోక్ తేజ ఈ కావ్యానికి ‘శ్రీ శూద్రగంగ’ శీర్షిక పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నా, అది వాస్తవికతకు అద్దం పడుతుంది. ఆ పేరు మనల్ని మూలాల్లోకి తీసుకెళ్లి ఆలోచించేలా పురిగొల్పుతుంది. అలా చూసినప్పుడు మొదటిగా మనం శూద్రుల జాడను వెతకాలి. ప్రపంచంలో ‘శూద్ర’ అనే పదానికి ప్రత్యేక అర్ధం ఏ దేశంలోనో, ఏ భాషలోనో, ఎక్కడో కనిపించదు. ‘శూద్రులు’ అనే వ్యక్తీకరణ భారతదేశంగా పిలువబడుతున్న ప్రదేశంలో వేల ఏళ్ళుగా నివాసముంటున్న భూమి పుత్రులైన ఉత్పత్తి కుల ప్రజలకు ఆపాదించిన పేరు. భారత సామాజిక విప్లవ యోధుడు డా. బి. ఆర్. అంబేద్కర్ అన్నాడు:

“శూద్ర అన్నది ఆనాడు ఒక ప్రజా సమూహానికి ఉన్న పేరు. అయితే అది తర్వాతి కాలంలో ఒక నాగరికత, ఒక సంస్కృతి, ఒక గౌరవం, ఒక సామాజిక హోదా లేని నిమ్న కులాలన్నింటికీ సాధారణీకరించారు.” (అంబేద్కర్ 13)

వేదాలు, పురాణాలు, బ్రాహ్మణాలు, స్మృతులు శూద్రులను సేవకులుగా తీర్మానించాయి. శూద్రులపై ఈ దేశంలో పెద్ద కుట్ర జరిగింది. అత్యధిక ప్రజలను అణచి ఉంచడానికి, బానిసలుగా ఉపయోగించుకోవడానికి, సమాజంపై తమ పెత్తనాన్ని కొనసాగించడానికి బ్రాహ్మణవర్గం ఈ దేశంలోని శ్రామికులకు పెట్టిన పేరు ‘శూద్ర’. ఆ వర్గం వారు వీరికి విలువ, గౌరవం, మర్యాద, సామాజిక గుర్తింపు ఏదీ ఇవ్వలేదు. మనుషులందరూ సమానం అనే భావనే వారికి లేదు. అందుకే శూద్రులను జంతువులకంటే హీనమైన స్థాయికి నెట్టారు. వారిని ఇంతటి స్థితికి దిగజార్చింది ఈ దేశ బ్రాహ్మణత్వం. అందుకే వారు రాసుకున్న పురాణ గ్రంథాలలో శూద్రులను అత్యంత నీచంగా, అన్యాయంగా పేర్కొన్నారు. రుగ్వేదం 10వ మండలం, పురుషసూక్తం 90వ శ్లోకం, 12వ మంత్రం గమనిస్తే “బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు రాగా, చివరికి పాదాల నుంచి శూద్రులు వచ్చారు” అని రాశారు. ఇలా పుస్తకాలలో రాయడమే కాక, ఆ విధంగానే సమాజంలో అంతరాలను అమలు చేశారు. పై వర్ణాలు తమ హక్కుగా శూద్రులచే బండచాకిరి చేయించుకున్నారు. ఇతర దేశాల్లో బానిసలు తిరుగుబాటు చేశారని మనం విన్నాం. కానీ శూద్రులను “మానసిక బానిసలు”గా మార్చారు కాబట్టి ఈ దేశంలోని మానసిక బానిసలకు తిరుగుబాటు అనే ఆలోచనే రాలేదు. అలా రాకుండా ఈ దేశ ధర్మశాస్త్రాలు పకడ్బందీగా శూద్రుల మెదడును కట్టడి చేశాయి.

2.1. ధర్మశాస్త్రాలలో శూద్రులు

ధర్మశాస్త్రాల పేరుతో బ్రాహ్మణులు శూద్రుల గురించి రాసినవి ఇలా ఉన్నాయి:

  1. బ్రాహ్మణాలలో తైత్తిరీయ బ్రాహ్మణం i.2.6.7: “బ్రాహ్మణ కులం - దేవుళ్ల నుంచి పుట్టింది. శూద్రులు - అసురుల నుంచి పుట్టారు.”
  2. వశిష్ఠ ధర్మ సూత్రాలు: అధ్యాయం 18, శ్లోకాలు 11-15. “శూద్ర జాతిని కొందరు వల్లకాడు అని అంటారు. అందువల్ల వేదాన్ని శూద్రుని సమక్షంలో చదవరాదు. దుష్ట జాతి. అది స్మశానంతో సమానం. అందువల్ల శూద్రుడి సమక్షంలో వేదం చదవరాదు.” యముడు ఇలా అన్నాడని కూడా రాసుకున్నారు.

“శూద్రం తు కారయేదాస్యం క్రీతమక్రీత మేవ వా
దాస్యాయైన హి సృష్టో సౌ బ్రహ్మాసస్య స్వయంభువా”

ఈ మనుస్మృతి శ్లోకం తాత్పర్యం: “శూద్రుని సృష్టించడంలో బ్రహ్మ ఉద్దేశం - బ్రాహ్మణునికి సేవచేయడమే! భత్యం పుచ్చుకుని కానీ, భక్తిచేత కానీ శూద్రుడు బ్రాహ్మణ సేవ చేసి తీరాలి” (సుబ్రహ్మణ్యం 321). అంటే ఒక శూద్రుడిని బ్రాహ్మణుడు కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా బానిసగా పని చేయించుకోవచ్చు. బ్రాహ్మణుడికి సేవ చేసేందుకే దేవుడు శూద్రుడిని సృష్టించాడు అని పై శ్లోకాలు, తాత్పర్యం సారాంశం.

2.2. చారిత్రక పరిణామం

భారత చారిత్రక క్రమాన్ని పరిశీలిస్తే క్రీ. పూ. 1500 సంవత్సరాల కాలంలో మధ్యాసియా నుండి ఇండియాకు ఆర్య తెగలు పశువుల కాపరుల వలె వచ్చారు. అలా వచ్చిన ఆర్యులు, స్థానిక సింధూ ప్రాంత ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజల మధ్య కొట్లాటలు జరిగేవి. పంజాబ్ ప్రాంతంలోకి వలస వచ్చిన ఆర్యులకూ స్థానిక తెగలకు మధ్య పెద్దఎత్తున ఘర్షణలు జరిగేవి. ఆ ఘర్షణల్లో ఓడినవారిని బానిసలుగా మార్చారు. ఆర్యులలో వారసత్వంగా కొనసాగిన పూజారి వర్గం ఒకటి ఉండేది. ఆర్యుల రంగు తెలుపు. స్థానిక ద్రావిడ ప్రజలది నలుపు. అందువల్ల రంగు భేదం ఏర్పడింది. ఆ రంగు భేదమే వర్ణంగా మారింది. ఆ తర్వాత సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు. ప్రసిద్ధ భారత చరిత్రకారిణి రొమిలా థాపర్ రాశారు:

“ఆర్యులు మూడు తరగతులుగా చీలిపోయారు. రాజు, అతడి యోధ పరివారం అత్యంత శక్తివంతమైన వర్గం. వీరిని క్షత్రియులు అన్నారు. క్షత్రియులతో సమాన ప్రాధాన్యత పురోహితవర్గం బ్రాహ్మణులకు. వారి దిగువన వృత్తి పనులు, వ్యవసాయం చేసే వైశ్యులు. ఈ మూడు తరగతులు కాక నాలుగో తరగతి అదనంగా చేరింది. వీరు శూద్రులు. శూద్రులంటే దస్యులు. దస్యులతో వివాహాలు ఇతర సంబంధాలు చేసుకున్న ఆర్యులు. ఆర్యులు శూద్రులను హీనంగా చూశారు. ఈ విధంగా ఆర్య సమాజం క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర వర్గాలుగా చీలిపోయింది. సమాజంలో ఒక్కొక్క వర్గానికి వేర్వేరు వృత్తులు, వ్యాపకాలు ఏర్పడ్డాయి.” (థాపర్ 22)

శూద్రులు మొదట్లో ఆర్యులతో వివాహ సంబంధాలు సాగించేవారు. అంతేకాక, తమకు ఇష్టమైన వృత్తులను స్వేచ్ఛగా ఎంచుకునేవారు. కానీ పురోహిత వర్గం బలపడగానే, వారు సమాజంపై పట్టు సంపాదించి అగ్రవర్ణాలుగా తిష్ట వేసుకున్నారు. తదనుగుణంగా, ఇక్కడి ప్రజలతో ఆర్యులు వివాహ సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. మతాన్ని, దైవాన్ని ముందు పెట్టి, ధర్మశాస్త్రాల పేరుతో తమ ఆధిపత్యాన్ని కట్టుదిట్టంగా శాశ్వతం చేసుకున్నారు. అలా ఈ ఆర్యులు సృష్టించిన సామాజిక, సాంస్కృతిక అంతరాల ఆలోచనా విధానాన్ని బద్దలు కొడుతూ, కవి సుద్దాల అశోక్ తేజ వర్ణాల అంతరార్థాన్ని వివరిస్తున్నాడు: “వర్ణమంటే కులము కాదురా పిచ్చోడ/ వాతావరణ, భౌగోళిక మేళనములతో/ సంక్రమించిన మేనిరంగుయే/ వర్ణమని చాటినది గంగ” (అశోక్ తేజ 111). ఈ అవగాహనతో శూద్ర గంగను అర్థం చేసుకోవాలి.

3. గంగ ప్రాధాన్యత

నీరు మానవాళికే కాదు, సకల చరాచరాలకు, అనంత ప్రాణికోటికి జీవనాధారం. ఈ అవనిపై నీరు లేకపోతే జీవి పుట్టుకే ప్రశ్నార్థకం. ప్రపంచం నాది అని విర్రవీగే మానవజాతి సంగతి సరేసరి. అందుకే నీటి ముందు ఏ జీవి అయినా బిందు ప్రాయమే. వర్షం చినుకు పడగానే హిమనీ నదాలు, కొండలు, గుట్టలు, లోయల నుండి ప్రవాహ మార్గాలు ఏర్పర్చుకుంటూ నదులుగా రకరకాల పేర్లతో ఈ భూమండలం అంతటా ప్రవహిస్తోంది గంగ. “శ్రీ శూద్ర గంగ”లో గంగ అంటే కేవలం గంగానదిగా పిలవబడుతున్న గంగానది మాత్రమే కాదు. ఈ భూమ్మీద, భూగర్భంలో ప్రవహిస్తున్న గంగ. కాబట్టి ఇక్కడ గంగ అంటే నీరు (H₂O) అని అర్థం. సకల మానవాళికి ప్రాణవాయువు ఆక్సిజన్ (O₂) ఉత్పత్తికి మూలాధారం కూడా ఈ గంగనే. భూ మండలాన్ని అంతటా సస్యశ్యామలం చేసింది గంగ. యుగయుగాలుగా మానవాళి ఆకలి తీర్చింది గంగ. సమస్త ప్రాణులకు జీవం పోసింది గంగ. దూర దూరాలకు ప్రయాణించి నాగరికతకు పురుడు పోసింది గంగ. నేల నాలుగు దిక్కులా లెక్కలేని కథలను, గాథలను కని, చరిత్రలెన్నిటికో చనుబాలు తాపి పెంచి పోషించింది గంగ. అలాంటి గంగ పుట్టుకను ఆర్యావర్తనం తర్వాత కట్టుకథలు, పుక్కిటి పురాణాలతో కాలుష్యమయం చేశారు. ఆ కాలుష్య కాసారం ఇంకా కొనసాగుతోంది, వ్యర్థాలతో కలుషితమైన గంగానదిలాగే. ఈ చారిత్రక, సాంస్కృతిక కాలుష్యంతో మూగగా రోదిస్తున్న గంగను సుద్దాల అశోక్ తేజ గమనించారు. అందుకే గంగ చుట్టూ అల్లిన కట్టుకథల మాలిన్యాన్ని, కమండల కుట్రల మాలిన్యాన్ని శుద్ధి చేసేందుకు నడుంకట్టాడు. అందుకు తన అక్షర నక్షత్రాలతో, ప్రశ్నల శత్రఘ్నులతో గంగను శ్రీ శూద్రగంగ అని పునర్నిర్వచిస్తున్నాడు.

4. గంగావతరణం – పురాణాలు

కవి అశోక్ తేజ అడుగుతున్నాడు: “భూకాంత/ అయస్కాంతానికి, భారతీయ/ ప్రాంతానికి, పేద ప్రజల/ గ్రామానికి, చెమట స్వర్గ/ ధామానికి వచ్చే బడుగు గంగ/ ఎందుకు మరి భగీరథి అయినది” (శ్రీ శూద్రగంగ 49). ఆ ప్రశ్న వెలుగుల్లో నుండి చూస్తే... రామాయణంలో, మహాభారతంలో, విష్ణు పురాణంలో, భాగవతంలో గంగ పుట్టు పూర్వోత్తరాలను తలా ఒక కోణంలో చెబుతారు. విశ్వామిత్రుడు రాముడికి చెబుతాడు:

“రాముడి పూర్వీకుడు సూర్యవంశం సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తూ వదిలిన యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు. దాన్ని తేవడానికి సగర చక్రవర్తి కుమారులైన 60 వేల మంది సగరులు వెళ్తారు. వారు కపిల మహర్షి ఆశ్రమం వద్దకు వెళ్ళి ఆయనే దొంగిలించాడని నిందించగా, కోపోద్రిక్తుడైన మహర్షి వారిపై హూంకరించడంతో సగర పుత్రులు భస్మమైపోయారు. వారిని వెతుకుతూ వెళ్ళిన సగరుడి మనవడు అంశమంతుడికి గరత్మంతుడు కనిపించి... మీ పినతండ్రులకు దేవలోకంలోని పవిత్ర గంగను తెచ్చి జలతర్పణలివ్వండి అని చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న సగరుడు గంగను తెప్పించలేకపోతాడు. ఆ తర్వాత అంశమంతుడు, అతడి కొడుకు దిలీపుడు ప్రయత్నించినా సాధించలేకపోయారు. కానీ దిలీపుడి కొడుకు భగీరథుడు సాధిస్తాడు. భగీరథుడు మొదట బ్రహ్మ కోసం తపస్సు చేసి గంగను ఇమ్మని అడుగుతాడు. బ్రహ్మ గంగను తట్టుకోవాలంటే శివుడిని కోరమని చెప్పగా, అలా చేసి చివరాకరికి గంగను తీసుకువచ్చి సగరులకు విముక్తి కలిగించాడని రాముడికి విశ్వామిత్రుడు చెబుతాడు. రాముని వంశీయుల గొప్పతనాన్ని చెప్పడానికి గంగానది పుట్టుకను వివరిస్తాడు.” (శ్రీరామచంద్రుడు 103-106)

మహాభారతంలో భీష్ముడి జననం, భీష్ముడి తల్లి గంగ కథను వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతాడు. అదే కథను పోతన భాగవతంలో శుక మహర్షి, పరిక్షిత్ మహారాజుకు గంగావతరణం ఎలా జరిగిందో చెబుతూ భగీరథ తపస్సు గొప్పదనం వివరిస్తాడు. అలాగే విష్ణుపురాణంలో పరాశర మహర్షి, మైత్రేయ మహర్షికి సృష్టి లోకాల నిర్మాణం వివరించే క్రమంలో గంగ పుట్టుకను చెబుతాడు. వామనావతారంలో ఉన్న విష్ణువు బలిని అణచివేయడానికి మూడడుగులు అడుగుతాడు. మొదటి అడుగు బలి నెత్తి మీద పెట్టి, రెండో అడుగు ఆకాశంలో పెట్టగా, అతడి బొటనవేలు బ్రహ్మలోకాన్ని తాకుతుంది. అప్పుడు బ్రహ్మ తన కమండల జలంతో విష్ణువు పాదాన్ని కడుగుతాడు. ఆ జలం నుండే గంగ పుట్టిందని ఒక కథనం ఉంది.

సుద్దాల అశోక్ తేజ ‘శ్రీశూద్రగంగ’ కావ్యం గంగను పుట్టించిన కమండల కథలను పునర్వాఖ్యానిస్తూ రూపుదాల్చింది. “శ్రీశ్రీశ్రీ శూద్రగంగ/ శూద్రావని కొస్తున్నది/ పరమాత్ముని కాళ్లు శూద్ర/ గర్భసంచులైతే/ పరమాత్ముని చరణాలలో/ పురుడు పోసుకున్న/ శుద్ధమైన అసలు - సిసలు/ శూద్రగంగ నంటున్నది” (శ్రీ శూద్రగంగ 43) అని గంగను శూద్రీకరించాడు. దేవలోకం సంకెళ్ళు తెంచి గంగను శూద్రలోకానికి తీసుకువచ్చాడు. ఈ విధంగా ఈ దేశానికి 'శూద్రావని' అని పేరు పెట్టిన మొట్టమొదటి కవి సుద్దాల అశోక్ తేజ అని చెప్పవచ్చు. నేడున్న పరిస్థితుల్లో ఇలా చెప్పడం చరిత్రను తిరగరాసే సాహసమే.

5. గంగ పుట్టుక - వాస్తవాలు

“వక్రీకరించిన పౌరాణిక శిక్షకు/ గురి అయినదా/ పక్షపాత కవుల కట్టుకథలకు/ ఎర అయినదా” (శ్రీ శూద్రగంగ 49) అని అశోక్ తేజ రాసిన ఈ పాదాన్ని చూసినప్పుడు అనేక ప్రశ్నలు చుట్టుముడతాయి. అందువల్ల గంగ చుట్టూ కట్టుకథలు ఎందుకు అల్లబడ్డాయి? అని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే అనేక వాస్తవాలు అర్థమవుతాయి. సమాజ ప్రభావం మనకు తెలుస్తుంది.

5.1. పురాణాల సామాజిక నేపథ్యం

ఇంగ్లీష్ రచయిత, సాహిత్య విమర్శకుడు క్రిస్టోఫర్ కాడ్వేల్ ప్రకారం, పురాణాలు, ఆచారాలు, నాటకాలు కల్పితాలు కావచ్చు, కానీ అవి చెప్పే విషయాలు సామాజికంగా నిజాలు:

“Therefore, the phantastic world of poetic ritual, myth or drama expresses a social truth, a truth about the instincts of man as they fare, not in biological or individual experience, but in associated experience.” (Caudwell 28)

కాబట్టి సమాజంలో జరుగుతున్న పరిణామాలే పరోక్షంగా పురాణాలలో, కళలలో వ్యక్తమవుతాయి. ఇవి పుట్టడానికి సామాజిక వాస్తవికత ఉంటుంది.

5.2. గంగానదిపై ఆర్య ఆధిపత్యం

అలా చూసినప్పుడు ఇండియాలో క్రీ.పూ. 500 వరకు స్థానిక తెగలుగా బతుకుతున్న నాగులు, ఆ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పర్చుకునే దశలో ఉన్నారు. ఆ దశలోనే ఆర్యుల ప్రవాహంతో ఆక్రమణ గంగానది వైపు మొదలయ్యింది. సారవంతమైన నేల, విస్తారమైన మైదానం, అతిపెద్ద నీటి వనరుగా గంగానది ఉండటంతో దానిపై పట్టు, వ్యాపారం కోసం ఆర్యులు - అనార్యుల మధ్య యుద్ధాలు జరిగాయి. రుగ్వేదంలో గంగానది ప్రస్తావన లేదంటే అప్పటికి నదికి ఆర్యులు చేరలేదని అర్థం. రామాయణం క్రీ.పూ. 300ల లోపు రాయబడింది అంటారు. గంగానదిపై పట్టు కూడా ఆ కాలంలోనే వచ్చి ఉండవచ్చు. తదనంతర కాలంలో ఇనుప గొడ్డళ్లు తయారు చేసుకుని వ్యవసాయం చేయడం వల్ల క్రీ.శ 300 నాటికి అదనపు ఉత్పత్తి పెరిగి పెద్ద రాజ్యాలు అవతరించాయి. అందువల్ల గంగానది పరివాహక ప్రాంతంపై పూర్తి పట్టు గుప్తులకు లభించింది. వారి మద్దతుతో సమాజంపై బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగింది. కులభేదాలు విపరీతంగా పెరిగి, కులం పేరుతో శిక్షలు వేయడం మొదలుపెట్టారు. అవి ఘనీభవించడానికి, దోపిడీ నిరంతరం కొనసాగడానికి, శూద్రుల నుండి తిరుగుబాటు రాకుండా ఉండటానికి, కుట్ర కథలను పకడ్బందీగా రచించారు. ఆ కుట్రల్లో నుండి పుట్టిందే వారు చెబుతున్న గంగావతరణం కథ. నది దేవుళ్ళది అని చెబితే బ్రాహ్మణులకు నీటిపై పట్టు నిలుస్తుంది. దేవుళ్ళకు, ప్రజలకు మధ్యవర్తులు బ్రాహ్మణులే కాబట్టి దేనికైనా వీరి అనుమతి తప్పనిసరి. కాబట్టి ఆ పేరుతో శూద్రులను, మొత్తం సమాజాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావడానికి అవకాశం కలిగింది. అందుకు వారే గంగను నేల మీదికి దించినట్లు కట్టు కథలు అల్లి విస్తృత ప్రచారం కల్పించి గంగను చెరబట్టారు. తెలుగు రచయిత సివి బ్రాహ్మణ రచనల గుట్టును బయటపెడతాడు:

“ఈ దగుల్బాజి విజయాలను దైవం పేరిట, ధర్మం పేరిట రామాయణ, భారతాలు, కావ్యాలు, నాటకాలు, పురాణ ప్రబంధాలలో రాసి, జాతి జీవితానికి సంబంధించిన సమస్త అంశాలలో పకడ్బందీగా ఇరికించి వేశారు.” (సివి 45)

5.3. కుట్ర కథల తిరుగుబాటు

ఈ సమాజంలో అగ్రవర్ణాలు ఏది చెబితే అది తలవంచుకుని చేసే దుస్థితి తలెత్తింది. దీనిని మరాఠా ప్రాంతంలో శూద్ర రాజు శివాజీ కొంత మార్చే ప్రయత్నం చేసినా బ్రాహ్మణుల చేతిలో ఓడిపోయాడు. ఆధునిక చరిత్రలో శూద్రులపై బ్రాహ్మణుల పెత్తనాన్ని నిరసిస్తూ భారత సామాజిక విప్లవ తాత్వికుడు మహాత్మా జ్యోతిబాఫూలే మొదటిసారి ఈ పురాణాల గుట్టును విప్పి బలంగా వ్యతిరేకించారు. అతడి స్ఫూర్తిని అందుకొని అంబేద్కర్, పెరియార్ బ్రాహ్మణులు సృష్టించిన కథలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున తిరుగుబాటు చేశారు. అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టారు. పెరియార్ ఇంకొకడుగు ముందుకేసి విగ్రహాలను పగలగొట్టారు. తెలుగు నేలపై వేమన, జాషువా వంటి కొందరు కవులు కుల అసమానతలను వ్యతిరేకిస్తూ కవిత్వం రాశారు. వారి స్ఫూర్తితోనే నేడు సుద్దాల అశోక్ తేజ 'శ్రీ శూద్రగంగ' అనే పునర్ వ్యాఖ్యాన కవిత్వం ద్వారా కల్పిత కథలపై యుద్ధం ప్రకటిస్తున్నాడు. నిజానికి ఇది పెద్ద సాహసమే. ఆధిపత్యవాదుల అధికారబలంతో, అడ్డగోలు ప్రచారాలతో, యావత్ భారతావని నమ్మేలా స్థిరీకరించిన పురాణాలలోకి జొరబడి, వాటి లోపలి నుండి కట్టు కథల పెట్టుగమ్మలను తన కలం పదునుతో పలగజీరుతూ, గంగ మా అక్క అంటున్నాడు. సుద్దాల అశోక్ తేజకు అక్కంటే ఆమె తప్పక శూద్రగంగే అవుతుంది కదా!

6. శూద్రగంగ - కావ్య వర్ణన

గంగ ప్రవాహాన్ని, గంగా ప్రయాణాన్ని వర్ణించాలంటే, 'ఆహా గంగ, ఓహో గంగ, రమణీయ గంగ, రస రమ్య గంగ, రయ్యి రయ్యిమంటూ సుడులు తిరుగుతూ హొయలొలుకుతూ వడి వడిగా అత్యంత సుందరం ఈ గంగ' అని ప్రాచీన కవులు వర్ణిస్తుంటారు. "తరుణీ రూపునఁ జూపట్టెఁ దగ నొయ్యారంపుఁ బయ్యెదన్" అని గంగను వర్ణించిన పోతనను విన్నాం.

6.1. గంగా ప్రవాహ వర్ణన

దానికి భిన్నంగా, కవి సుద్దాల అశోక్ తేజ గంగను నేతపని చేసి జనానికి కప్పుకొనే బట్ట అందించే చేనేతల చెలిమిగా వర్ణిస్తున్నాడు: “ఆ బొంత చేనేత మెత్తందనంగా/ ఆ నేత నానమ్మ కుట్టినవిధంగా/ కమ్మగా చెమ్మగా కదిలింది గంగ” (శ్రీ శూద్రగంగ 100). బ్రాహ్మణులు 'మన్మథుడి కామబాణంలా' అని గంగను వర్ణిస్తే, అశోక్ తేజ “సకల జలచరములకు అమ్మ ఒడిగా” (శ్రీ శూద్రగంగ 105) అని గంగమ్మతనాన్ని గుర్తుచేస్తున్నాడు.

6.2. అగ్రవర్ణ వివక్షపై గంగ అసహనం

“చెమట చుక్కలేని/ కన్నీటి చుక్కరాని/ చుక్కల లోకాల నుండి/ చెక్కేస్తున్నది గంగ/ నీలిరంగు మేడ విడిచి/ నేలతల్లి గూడు వలచి/ అవని చిగురు సాగు కొరకు” (శ్రీ శూద్రగంగ 55) అంటూ ఆకాశమేడను కాదని, పేదవాడి గూడెం వైపు వస్తోంది గంగ. నిజానికి దేవతలు ఎప్పుడూ ఉన్నవారివైపే ఉంటారు. పేదవారి వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ గంగ అలా కాదు. కాళ్లకు మట్టి అంటని లోకంలో, చెమట కన్నీరు రాని లోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని, నేల మీది మట్టి కోసం, మనుషుల కోసం, మట్టి మనుషుల కన్నీళ్లు కడగడం కోసం, పంటలు పండటం కోసం గంగ వచ్చింది అంటున్నాడు కవి.

“భారతాన సురలు - దొరలు/ సృష్టించిన కరువు పైన/ అసహనాన్ని ప్రకటించిన” (శ్రీ శూద్రగంగ 44) అని పైలోకం సురలను, భూమిపైన దొరలనూ ఒకటే జాతి కింద జమకట్టింది గంగ. సురలు అనగా 'సురపానం' తాగేవారు. అంటే దేవతలు. వారు శూద్ర జనాలకు తాగడానికి, సాగు చేసుకోవడానికి నీరు ఇవ్వకుండా గొంతు ఆరిపోయేలా చేసి అడ్డుపడ్డారు. దేవేంద్రుడి వృత్తాంతం అదే. అలా అతడి వలెనే ఇల మీద భూబకాసురలైన దొరలు కూడా బక్క జనాలకు నీరు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టించారు. దివిలో దేవతలు, భువిలో దొరలు ఒకే రీతిన వ్యవహరించడాన్ని చూసిన గంగ, వారిది అగ్రవర్ణ పక్షపాతమని భావించి, అసహనంతో ఇలా నేల మీదికి వచ్చిందని కవి అంటున్నాడు. కవి, “దప్పిక పడే ప్రజల యెదల/ డొప్పలు నింపాలని” (శ్రీ శూద్రగంగ 49) అవని మీదికి గంగ వచ్చిన తీరును వర్ణిస్తూ, ఒకవైపు దేవతల కుట్రను బహిర్గతం చేస్తూనే, మరోవైపు శూద్ర జన దాహర్తి బాధను, వేదనను వెలిబుచ్చుతున్నాడు.

6.3. కట్టుకథలపై కవి యుద్ధం

“శ్రీ ద్రవిడ భూపతి/ రావణ ప్రజాపతికి పది తలలు అతికించిన/ యతిసంగ పరివారమే/ బడుగు గంగవైన నిన్ను/ భగీరథిగ మలిచినది/ దానకర్తయగు బలి/ చక్రవర్తిని క్రూర దానవుని చేసిన/ దౌర్జన్య ముని సంగపరివారమే/నిను భగీరథుని తపః ఫలిత/ పాత్రగా మార్చినది” (శ్రీ శూద్రగంగ 50). అలా మూలవాసులను, యోధులను, దయార్ద్ర హృదయ రాజులను, వన సుందరీమణులను, యోధురాల్లను తప్పుగా, తమకు ఇష్టమొచ్చిన అబద్ధాలతో అసురులని, వికార రూపిణులని ప్రచారం చేస్తూ, వేల ఏళ్లుగా బ్రాహ్మణులు ప్రజలను నమ్మిస్తున్నారు. ఆ కుటిల నీతి పరివారం కుట్రలను శూద్రకవి సుద్దాల అశోక్ తేజ బట్టబయలు చేస్తున్నాడు. గంగపై, ద్రావిడ రాజులపై కట్టుకథలు పుట్టించి, వారిని విలన్ లుగా, రాక్షసులుగా మార్చిన బ్రాహ్మణ, క్షత్రియ పరివారాన్ని శూద్ర అశోక్ తేజ దోషులుగా నిలబెడుతున్నాడు.

6.4. శూద్రుల ఇష్టాలు, గంగ ప్రయాణం

“ఉరుమిష్టమని/ తెలిసిన మన మాలల/ ఉరుము నృత్యమా/ డప్పు చప్పుడిష్టమని/ నిప్పుల దరువై ధ్వనించే/ డప్పు అభిజాత్యమా/ ఏ తాటి మోకుల ధ్వని/ ఏ కొలిమి శ్వాస/ ఏ కుమ్మరి సారి/ ఏ సముద్ర జాలరి/ ఏ రాట్నపు రాగం/ రజకుల హం హం హం/ సబ్బండ జాతి చెమట బొట్ల/ టప టప టప టపనా/ బండ చాకిరీ రెక్కల/ రెప రెప రెప రెపనా” (శ్రీ శూద్రగంగ 47). గంగ దేన్ని ఇష్టపడి భూమ్మీదికి వచ్చింది? గంగకు శబ్దం, నృత్యం, పాట, అమ్మజోలపాట, శ్రమ, చెమట చుక్క, శ్రమలోంచి వచ్చే శబ్దాలు అంటే ఎంతో ఇష్టం. అలా సుద్దాల అశోక్ తేజ తన ఇష్టాల జాబితా పెద్దదిగానే చెప్పినట్లుంది. ఆ జాబితా శూద్రులది కావడం అబ్బురపరిచే విషయం. ఆ ఇష్టాల కోసమే శూద్రావని వైపు గంగ బయలుదేరింది. ఆయన ఇచ్చిన దన్నుతో, స్వేచ్ఛ లేని లోకంలో ఎవరి పాదాల వద్దనో ఉండలేక, ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరిగే ఆత్మగౌరవ లోకంలోకి, శూద్రబంధు లోకంలోకి గంగ ప్రయాణించింది.

గంగ ప్రయాణాన్ని కవిత్వీకరిస్తూ, జీవం లేని, జీవితం లేని ఇతర గ్రహాలకు ఎందుకు వెళ్లలేదో శాస్త్రీయంగా అశోక్ తేజ వివరించాడు. మన దేశంలో పాటు ప్రపంచ దేశాలలో ఆయా గ్రహాల పట్ల ఉన్న మత సారాలు బోధించే ఆధ్యాత్మిక కోణాన్ని ప్రస్తావిస్తూనే, విజ్ఞానదాయక, విశ్లేషణాత్మక వాస్తవిక కోణంలో నిరూపిస్తూ సాహిత్యంలోకి మలిచిన తీరు అత్యద్భుతం. ఇది నేటి విద్యార్థులకు గ్రహాలపై స్పష్టమైన అవగాహన కలగడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అంశాన్ని విద్యార్థులకు తరగతి గదిలో పాఠ్యాంశంగా బోధించే విషయాన్ని ప్రభుత్వాలు తప్పక పరిశీలించాలి.

6.5. భిన్నత్వంలో ఏకత్వం

“తెల్లని గంగమ్మ/ నల్లని యమునతో/ మట్టిలో ప్రవహించు/ చామనఛాయ సరస్వతీ నదితో/ సంగమించి భిన్నత్వమున/ ఏకత్వమును చాటినది” (శ్రీ శూద్రగంగ 111) అంటూ ఇలా నదుల్లో కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అశోక్ తేజకు మానవాళి పట్ల, భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం ఆదేశిస్తున్న ప్రజాస్వామిక వైవిధ్యం పట్ల ఉన్న నమ్మకానికి మచ్చుతునక. నీటికే ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పుడు, మనుషులకు ఎంత ఉండాలో, దేశానికి ఎంత ఉండాలో అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ కవితా పాదాల ద్వారా అశోక్ తేజ నొక్కి చెబుతున్నాడు. ఒకే దైవం, ఒకే మతం, ఒకే తిండి, ఒకే భాష అని చెప్పే కాషాయ కుట్రదారులకు శూద్రగంగ కావ్యం బలమైన సమాధానంగా నిలుస్తుంది.

6.6. గంగ ఆహార్యాలు, అగ్రవర్ణాల తిరస్కరణ

“తేట తెలుపు చీర/ సెలయేటి నురగ రైక/ నీటి వెండి పట్టీలు/ పన్నీటి తడల కడియాలు/ మట్టిదారి జాడలో/ జలపుటందియలు/ ఘల్లుఘల్లుమన/ నడిచొస్తున్నది గంగ/ నగుమోముతో నయగారంగా” (శ్రీ శూద్రగంగ 56) అంటూ నీటిలోని గుణాలను తీసుకుని, గంగకు ఆహార్యాలుగా, ఆభరణాలుగా మలిచి చెప్పడంలో అశోక్ తేజ వర్ణనా నైపుణ్యం ప్రస్ఫుటమవుతుంది. నీటిలోని తేటదనాన్ని చీరగా, సెలయేరు ప్రవాహంలో వచ్చే నురగను జాకెట్టుగా, నీటిని వెండి పట్టీలుగా, నీటి అలలను కడియాలుగా, ఆ అలల చప్పుడును అందెలుగా, మట్టిని జున్నుగా మార్చి, శూద్ర జగతి జానెడు పొట్టకు బుక్కెడు బువ్వ పెట్టడం తనకు ఇష్టం కాబట్టి, నవ్వుతూ నడిచొస్తుంది గంగ. అంతేకాక, ఏ అగ్రవర్ణాల శవాల బూడిదలు తడిపి కడిగేందుకు మాత్రం అస్సలు కాదని సుద్దాల అశోక్ తేజ తీర్మానిస్తున్నాడు. ఈ పుస్తకం ఇచ్చే తీర్పు ఒక్కటి చాలు గంగ శూద్రజాతికి చెందినదని చెప్పడానికి.

ఉపసంహారం

శూద్రగంగ ఈ దేశ మట్టిబిడ్డల గొంతుక. నెర్రలుబారిన నేల పొరలలో నుండి వినిపిస్తున్న జాతీయగీతం. తడి ఆరి పిడుస కట్టుకుపోయిన దేశ నాలుకపై జల ఊట శూద్రగంగ కావ్యం. తరతరాలుగా, యుగయుగాలుగా రాయి-రప్ప, కొండ-కోన, తట్ట-బుట్ట, పార-పలుగు, నాగలి-కర్రు, చేను-చెలుకలతో సహవాసం చేస్తున్న అలుపెరగని కష్టజీవికి నమ్మకాన్నిస్తూ ఈ అవనిపై చేస్తున్న పచ్చని సంతకం శ్రీ శూద్రగంగ. నేటి ఏకచ్ఛత్రాధిపత్య భావజాలపు ఎడారిలో సుద్దాల అశోక్ తేజ తన అక్షర వర్షంతో చేస్తున్న జల సంతకం ఈ శూద్రగంగ. రండి, మీ శూద్రగంగను మీ చేతుల్లోకి తీసుకోండి. సుతిమెత్తని మీ హృదయానికి హత్తుకోండి. మీ ఇంటి గంగలకు అందించండి. ప్రతి ఇంటి గంగను చదివించండి.

  • సుద్దాల అశోక్ తేజ 'శ్రీ శూద్రగంగ' కావ్యం సాంప్రదాయిక భావనలకు భిన్నంగా గంగకు శూద్రత్వాన్ని ఆపాదిస్తుంది.
  • శూద్రుల మూలాలను, వారిపై ఆర్య-బ్రాహ్మణుల కుట్రలను, ధర్మశాస్త్రాల ద్వారా జరిగిన అణచివేతను కవిత్వం ద్వారా ఇది ప్రశ్నిస్తుంది.
  • చారిత్రక, పౌరాణిక కథలను పునరాలోచన చేసి, గంగావతరణం వెనుక ఉన్న సామాజిక, రాజకీయ ప్రయోజనాలను విశ్లేషిస్తుంది.
  • గంగను శ్రమజీవుల, అణగారిన వర్గాల జీవనదిగా వర్ణిస్తూ, ఆమెకు అగ్రవర్ణాలకు అతీతమైన మట్టి సంబంధాన్ని కల్పించింది.
  • ఈ కావ్యం కుల వివక్షను, సామాజిక అసమానతలను సవాలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. అంబేద్కర్, బి.ఆర్. ఎవరీ శూద్రులు, నవోదయ బుక్ హౌస్, హైదరాబాదు, 2018.
  2. అశోక్ తేజ, సుద్దాల. శ్రీ శూద్రగంగ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 2021.
  3. కాడ్‌వెల్, క్రిస్టోఫర్. ఇల్యూషన్ అండ్ రియాలిటీ, అకాడమిక్ పబ్లిషర్స్, చెన్నై, 1978.
  4. థాపర్, రొమిలా. తరతరాల భారత చరిత్ర, నవచేతన పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2015.
  5. సివి. వర్ణ వ్యవస్థ, ప్రగతి ప్రచురణలు, గుంటూరు, 2008.
  6. సుబ్రహ్మణ్యం, శ్రీ భాగవతుల. మనుస్మృతి మానవ సంహిత సవ్యాఖ్యాన ఆంధ్ర తాత్పర్య సంహితము, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి, 2010.
  7. శ్రీరామచంద్రుడు, పుల్లెల. వాల్మీకి రామాయణము యథామూలానువాదము, వెంకట్రామ అండ్ కో, కాకినాడ, 2005.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal