headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-07 | Issue-8 | July 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. యయాతిచరిత్రలో కొన్నిపదప్రయోగాలు: ప్రసిద్ధవ్యాకర్తల దృక్పథం

బొమ్మిశెట్టి రామాంజినేయులు, ఆచార్య పి. వారిజారాణి

పరిశోధకుడు, తెలుగుశాఖ,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
హైదరాబాద్. తెలంగాణ.
సెల్: +91 6304784388, Email: bommisettyramanjineyulu123@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 09.06.2026        ఎంపిక (D.O.A): 28.06.2026        ప్రచురణ (D.O.P): 01.07.2026


వ్యాససంగ్రహం:

సాహిత్యంలో ప్రబంధ యుగం తర్వాత అనేక ప్రయోగాలు జరిగాయి. ఈ ప్రయోగాలలో భాషాపరమైన ప్రయోగం, రచనాశైలి ప్రయోగం, ప్రక్రియలలో వచ్చిన ప్రయోగం. ఈ విధంగా మూడు విధాలైన వైవిధ్యం కనిపిస్తుంది. భాషా ప్రయోగాలలో ద్వ్యర్తి, త్ర్యర్తి కావ్యాలు, ఆ తర్వాత అచ్చతెలుగు కావ్యాల ప్రయోగం కనిపిస్తుంది. అచ్చతెలుగు కావ్యాలు భాషాపరమైనటువంటివి. సంస్కృత పదాలను అసలే ఉపయోగించకుండా అచ్చతెలుగు పదాలతో రాసిన కావ్యాలు. దీని తర్వాత మరింత ప్రయోగంతో నిరోష్ఠ్య కావ్యాలు మొదలైనవి వచ్చాయి. ఈ ప్రయోగ వైవిధ్యంలో అచ్చతెలుగు కావ్యాలలో ప్రతి పదాన్ని తెలుగులో వెతకలేం కాబట్టి కవులు సంస్కృత పదాలను తద్భవ, ప్రాకృత పదాలుగా మార్చుకున్నప్పుడు కొంత కృత్తకంగా కనిపిస్తుంది. ఇలా వచ్చిన కావ్యాలను ఆధారంగా చేసుకుని వ్యాకరణాలను రూపొందిస్తారు. ఇలాంటి కావ్యాల్లో ఉన్నటువంటి కవుల ప్రయోగాలు వ్యాకరణాలలో ఎంతవరకు అవి చర్చించబడ్డాయో, అవి ఎప్పుడు మనకు తెలుస్తాయంటే ఈ వ్యాకరణాలతోని ఈ అచ్చతెలుగు కావ్యాలను సమన్వయం చేస్తున్నప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఎంతవరకు కవుల ప్రయోగాలను పట్టుకుని ఆ ప్రయోగాలను గురించి సూత్రీకరించడం జరిగింది. అలాగే ఆయా పదాలను నిరూపణ చేయాలంటే వ్యాకరణాలు ఎంతవరకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. అలాంటి అచ్చతెలుగు కావ్యమైన యయాతి చరిత్రలో తృతీయాశ్వాసంలోని ఆచ్ఛికపదాల నిర్మాణం బాలవ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, సంగ్రహవ్యాకరణం, వ్యావహారిక భాషావ్యాకరణాలలోని ఆచ్ఛికపరిచ్ఛేదాలను తులనాత్మకంగా పరిశీలించి వ్యాకరణ సూత్రాలకు పొసిగిన, పొసగని పదాలను పరిశీలించడం ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం. అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు, కూచిమంచి తిమ్మకవి జీవితము-రచనలు ఒక పరిశీలన, కూచిమంచి తిమ్మకవి సింహాచల మహాత్మ్యం ఒక పరిశీలన వంటి అచ్చతెలుగు కావ్యాలపై జరిగిన పరిశోధనలను గమనించడమైంది. అచ్చతెలుగు కావ్యమైన యయాతి చరిత్రపై సమగ్రమైన పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కావ్యంలోని అచ్చతెలుగు పదాలను వ్యాకరణకారులు ఆచ్ఛిక పరిచ్ఛేదంలో నిర్దేశించిన నియమాలకు ఏ విధంగా ఇమిడాయో చూపడం జరిగింది. కవులు ప్రయోగించిన పదాలను వ్యాకరణం ఏ విధంగా శోభను చేకూర్చుతుందో చూపడం జరిగింది.

Keywords: వ్యాకరణం, ఆచ్ఛికపదాలు, సూత్రాలు, తెలగనార్యుడు, తద్భవాలు, దేశ్యాలు, ప్రాకృతభవాలు

1. యయాతి చరిత్ర కావ్య వైశిష్ట్యం

పొన్నగంటి తెలగనార్యుడు రచించిన ఈ యయాతి చరిత్ర అచ్చతెలుగు కావ్యాలలో మొదటిది. పొన్నగంటి తెలగనార్యుడు సంస్కృతభాషా పదాలను వదిలేసి, దేశ్య, తద్భవ పదాలను మాత్రమే ప్రయోగించి ఈ కావ్యాన్ని రచించాడు. సంస్కృత పదాలను అచ్చ తెలుగు పదాలుగా రూపొందించుకున్నాడు.

ఉదాహరణకు, పంచవదనుడును ఐదు మోముల వేల్పు అనీ, వాల్మీకిని కనువినుకలి తావుచూలి అనీ, బ్రహ్మను నీటి పుట్టువు అనీ, హిమవంతుడును మరుమేపు కందోక మామగారు అనీ ఈ విధంగా అచ్చతెలుగు పదాలను తయారు చేసుకొని కవి స్వచ్ఛమైన తెలుగులో రచించాడు.

పొన్నగంటి తెలగనార్యుడు తర్వాత చాలా అచ్చతెలుగు కావ్యాలు ఆయన్ను అనుకరిస్తూ రచింపబడినాయి. అతని పేరు తెలగన కావడంతో, అచ్చతెలుగు కావ్యం రాయడం వలన అతడికి ఆ పేరు వచ్చిందా అనేది స్పష్టం కాదు. ఈ కావ్యాన్ని రాసిన పొన్నగంటి తెలగనార్యుడు అచ్చతెలుగు కావ్యాలకు ఆదికవిగా కీర్తి పొందాడు. ఆదికవి అని అనడానికి కారణం ఏమంటే, వాల్మీకి కన్నా ముందే ఛందోబద్ధమైన శ్లోకాలు లోకంలో ఉన్నా, సంస్కృతంలో వాల్మీకి ఆదికవి అని చెప్పుకుంటాం. అలాగే నన్నయకు పూర్వమే తెలుగు పద్యాలు చాలా శాసనాలలో కనబడుతున్నా కూడా, తెలుగులో ఆదికవి నన్నయ అనే చెప్పుకుంటాం. అదే విధంగానే అచ్చతెలుగు పద్యాలు పూర్వమే కావ్యాలలో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నా కూడా, నామవాచకాలు మాత్రమే కాకుండా కావ్యం మొత్తం అచ్చతెలుగు పదాలతో యయాతి చరిత్ర లిఖించిన పొన్నగంటి తెలగనార్యుడు నిస్సందేహంగా అచ్చతెలుగు కావ్యాలకు ఆదికవి అని చెప్పవచ్చు. ఈ కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మెదక్ జిల్లాలోని పొట్లచెరువు (నేటి పటాన్‌ చెరువు) పాలకుడైన అమీన్‌ఖాన్‌కు అంకితంగా ఇచ్చాడు.

ఈ కావ్యాన్ని కుతుబ్ షా కాలంలో పాలకుడైన అమీన్ ఖాన్ అనే ముస్లిం అధికారికి పొన్నగంటి తెలగనార్యుడు అంకితం ఇచ్చాడు. ఇది ఆ కాలంలోని హిందూ, ముస్లింల మధ్య ఉన్న సాంస్కృతిక సమైక్యతకు, మత సామరస్యానికి నిదర్శనం. సంస్కృత సమాసాలు లేకుండా కథను రక్తి కట్టించడం కవులకు కష్టమైన పని. కానీ పొన్నగంటి తెలగనార్యుడు తన పద ప్రయోగాలతో, అచ్చతెలుగు పదాలతోనే కావ్యాన్ని అద్భుతంగా రచించి తన భాషా పాండిత్యాన్ని నిరూపించుకున్నాడు.

ఇది మహాభారతం, భాగవతంలోని చంద్రవంశరాజు యయాతి కథ ఆధారంగా గ్రహించి రాయబడిన కావ్యం. కథాకవితార్థయుక్తి, అక్షరరమ్యత వంటి ప్రబంధ లక్షణాలు ఈ కావ్యంలో కనిపిస్తాయి. అచ్చతెలుగులో కూడా వర్ణనలు ఎంత అందంగా చేయవచ్చో ఈ కావ్యం నిరూపిస్తుంది. ఈ విధంగా యయాతి చరిత్ర అచ్చతెలుగు కావ్యాలలో ఆదికావ్యమై, తరువాతి కవులకు మార్గాన్ని చూపినదై, దిశానిర్దేశం చేసినదై, అట్టివాటిలో కూడా ఉత్తమమైనదిగా నిలిచిన ఈ కావ్యం అన్ని విధాలుగా కూడా విశిష్టత కలిగినది.

2. ఆచ్ఛిక పరిచ్ఛేదం - వ్యాకరణ విశ్లేషణ

"సంస్కృత సమేతరంబయినయీభాష యచ్ఛయనంబడు" (చిన్నయసూరి, ఆ-1) అని చిన్నయసూరి ఆచ్ఛిక పదం గురించి సూత్రీకరించాడు. సంస్కృత సమేతరము అంటే సంస్కృత సమమగు తత్సమ శబ్దాలు కాక తద్భవ, ప్రాకృతభవ, ప్రాకృతసమదేశ్య శబ్దాలు కలిగినది 'ఆచ్ఛికం' అంటారని సూత్రార్థం. తెలుగులో పదాలు తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, అన్య దేశ్యాలు అని నాలుగు విధాలుగా వజ్ఝల వేంకటేశ్వర్లు తన ఆధునిక ప్రామాణికాంధ్ర వ్యాకరణం గ్రంథంలో విభజించాడు. వీటిలో తత్సమ పదాలు కాక మిగిలిన మూడు 'ఆచ్ఛికములు' లేదా 'అచ్చతెలుగు' పదాలు అంటారు. 'అచ్ఛ' అనే ప్రాతిపదిక నుంచి 'ఆచ్ఛిక' శబ్దం ఏర్పడింది. 'అచ్ఛ' శబ్దానికి వికృతి పదం 'అచ్చము'. నిజానికి దేశ్యములైన పదాలే అచ్చతెలుగు పదాలు అని చెప్పవచ్చు.

"ఆచ్ఛిక శబ్దంబు లెల్లందఱుచుగ స్త్రీసమంబులు గ్లీబసమంబులయి యుండు" (చిన్నయసూరి, ఆ-2) అన్న చిన్నయసూరి సూత్రం ప్రకారం ఆచ్ఛిక శబ్దములు అంటే అచ్చతెలుగు పదాలన్నీ స్త్రీలింగ సమములుగానీ, నపుంసకలింగ (క్లీబము) సమములుగానీ ఉంటాయని అర్థం. స్త్రీ సమత్వం చెప్పడం వలన ప్రథమైకవచన లోపాలు కలుగుతాయి. అన్న, మిన్న, జాణ, ఓడ మొదలైనవి స్త్రీసమాలు. వీటికి 'అన్నడు' మొదలైన రూపాలు రావు. నపుంసకలింగ సమములైనపుడు 'ము ప్రత్యయం' చేరుతుంది. బియ్యము, నెయ్యము మొదలైనవి నపుంసక సమాలకు ఉదాహరణలు. ముప్రత్యయం చేరకుండా 'బియ్య' వంటి రూపాలు ఉండవు. తరచుగా అనడంచేత పుంలింగ తుల్యాలు కూడా ఉంటాయని గ్రహించవచ్చు. ఉదాహరణకు, చందురుడు, జముడు మొదలైనవి. ఈ విధమైన ఆచ్ఛిక పదాలను పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రలో ఏ విధంగా ఉపయోగించాడో చూడడంతో పాటు, చిన్నయసూరి చెప్పిన ఆచ్ఛిక పదాల రూపసాధనను ఈ కావ్య పదాలతో సాధించడం ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం.

3. ఆచ్ఛిక పరిచ్ఛేదం - తులనాత్మక విశ్లేషణ

3.1. 'డుఙ్' ప్రత్యయం చేరు విధానం

'డుఙ్' ప్రత్యయం చేరే విధానంలో చిన్నయసూరి "మహత్తులగు మగాదులకుం గయిరాదులకును డుఙ్ఙగు నుత్వంబుగాదు" (చిన్నయసూరి, ఆ-4) అని మగడు, మనుమడు మొదలైన రూపాలను ఉదహరించాడు. సాధారణంగా మనుమడు శబ్దాన్ని మనువడు అని కూడా ఉచ్ఛరిస్తూ ఉంటాము. ఈ శబ్దాన్ని చిన్నయసూరి, బహుజనపల్లి సీతారామాచార్యులు, కందుకూరి వీరేశలింగం కూడా వివరించలేదు. కానీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య తన వ్యాకరణ గ్రంథంలో "మనుమ తుది మకారానికి వకారం నువర్ణ ఉత్వానికి అత్వం విభాషగా వస్తుంది" (గోపాలకృష్ణయ్య, శబ్ద-209) అంటూ మనుమడు, మనువడు, మనవడు రూపాలను సాధించాడు.

3.2. 'ఇయ' ప్రత్యయం ఉన్న శబ్దాలు

'ఇయ' ప్రత్యయం ఉన్న శబ్దాల విషయంలో బాలవ్యాకర్త "ఇయకు మాఱుగా నామాంతంబున కెత్వంబు బహుళంబుగానగు" (చిన్నయసూరి, ఆ-23) అని కన్నియ, కన్నె వంటి ఎత్వ రూపాలను మాత్రమే చెప్పాడు. దానికి పూరణగా ప్రౌఢవ్యాకర్త "ముత్తియ శబ్దేతరంబంలయందును దఱచుగ నిత్వలోపంబు గానంబడడియెడి" (సీతారామాచార్యులు, శబ్ద-9) అని కన్నియ, కన్య, దివ్వియ, దివ్య, వీడియము, వీడ్యము మొదలైన రూపాలు కూడా వస్తాయని చూపాడు. ఇదే విషయాన్ని వడ్లమూడి గోపాలకృష్ణయ్య కూడా గ్రహించి సూత్రీకరించాడు. చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం పంతులు విషయాన్ని పూర్తిగా తెలపకపోవడం విచారం.

3.3. ఔపవిభక్తులు

ఔపవిభక్తుల విషయంలో బాలవ్యాకర్త చిన్నయసూరి "ఇ - టి- తి వర్ణంబులు వక్ష్యమానంబు లౌపవిభక్తికంబులు" (చిన్నయసూరి, ఆ-28) అని ఇ, టి, తి వర్ణాలు ఔపవిభక్తులుగా చెప్పాడు. ఈ మూడింటిని ప్రౌఢవ్యాకర్త స్వీకరించాడు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులు తన సంగ్రహ వ్యాకరణం గ్రంథంలో "నామంబుల తుదనుండు రు,లు,డు,ను,యి మొదలైన వానికి ద్వితీయాద్యేకవచనంబులు పరమగునపుడు కొన్నియెడల ఆదేశముగానూ కొన్నియెడల ఆగమముగానువచ్చు ఇ,టి,ంటి,తి వర్ణము లౌపవిభక్తులు" అని చెబితే వడ్లమూడి గోపాలకృష్ణయ్య "ఇత్వలోపమైతే బిందుపూర్వకమైన ఔపవిభక్తిక టివర్ణ సంయుక్త లోషష్ఠి లకారానికి లోపం వైకల్పికం" అని కన్ను - కంటి, పన్ను - పంటి, ఇంటిలో - ఇంట్లో అంటూ బిందుపూర్వక టి వర్ణాన్ని ఔపవిభక్తికాలలో అదనంగా చేర్చడం కనబడుతుంది.

3.4. ఏకవచనం, బహువచనం

ఏకవచనం గురించి బాలవ్యాకర్త తత్సమ పరిచ్ఛేదంలో "డు-ము-వు-న లేక వచనంబులు" అని, ఏకత్వ సంఖ్యను బోధించు ప్రత్యయం బేకవచనంబు అని చెప్పాడు. బహువచన విషయంలో "లువర్ణకంబు బహువచనంబు" అని బహుత్వ సంఖ్యను బోధించు ప్రత్యయంబు బహువచనంబు అని ఏకవచనం, బహువచనం చెప్పాడే తప్ప నిత్యైకవచనం, నిత్యబహువచనం గురించి చెప్పలేదు. బాలవ్యాకరణానికి పూరణ గ్రంథమైన ప్రౌఢవ్యాకరణంలో, వ్యావహారిక భాషా వ్యాకరణంలో కూడా నిత్యబహువచనం గురించి చెప్పలేదు.

కానీ కందుకూరి వీరేశలింగం పంతులు వీటి గురించి చెప్పాడు. ఆయన "వస్తు స్వభావమును బట్టి కొన్ని శబ్దములకు బహువచనం లేదు" అని పైడి, వెండి, కేలు, నిన్న, మొన్న మొదలైనవి నిత్య ఏకవచనాలుగా ఉదహరించాడు. అలాగే "ఈలాగుననే మఱికొన్ని శబ్దముల కేకవచనము లేదు" అంటూ ఇరులు, కురులు, వడ్లు, పెసలును నిత్యబహువచనాలుగా తెలిపాడు.

4. యయాతిచరిత్రలోని పదాలు- వ్యాకర్తల దృక్పథాలు

4.1. 'చేతి' శబ్దం విశ్లేషణ

గ్రక్కున లక్ష్మణుని చేతి విల్లుగొని యెక్కడి.. (తెలగనార్య, 3-9)

ఇందులో 'చేతి' శబ్దాన్ని గమనిస్తే ఈ శబ్దంలో 'చేయి' ప్రాతిపదిక. ఈ ప్రాతిపదికకు ఔపవిభక్తులు చేరాలి. చిన్నయసూరి "ఇ - టి- తి వర్ణంబులు వక్ష్యమానంబు లౌపవిభక్తికంబులు" (చిన్నయసూరి, ఆ-28) అని ఇ, టి, తి వర్ణాలు ఔపవిభక్తులుగా చెప్పాడు. కందుకూరి వీరేశలింగం పంతులు తన సంగ్రహవ్యాకరణంలో "నామంబుల తుదనుండు రు,లు,డు,ను,యి మొదలైన వానికి ద్వితీయాద్యేకవచనంబులు పరమగునపుడు కొన్నియెడల ఆదేశముగానూ కొన్నియెడల ఆగమముగానువచ్చు ఇ,టి,ంటి,తి వర్ణము లౌపవిభక్తులు" అని బిందుపూర్వక టి వర్ణాన్ని ఔపవిభక్తికాలలో అదనంగా చేర్చడం కనబడుతుంది. ఈ సూత్రం ప్రకారం 'చేయి' శబ్దం 'చేతి'గా మారుతుంది. బాలవ్యాకరణంలో "విభక్తి పరంబగునప్పుడు గోయిప్రభృతుల తుదియక్షరంబు తివర్ణంబగు" అను సూత్రాన్ని బట్టి 'చేయి + లోని' అవుతుంది. ఇక్కడ షష్ఠీవిభక్తి బహువచనం పరముకాగా చివరున్న యివర్ణము ఈ సూత్రంచే 'తి' ఆదేశమై చేతి + లోని = చేతిలోని అవుతుంది. సాధారణంగా ఔపవిభక్తులు ద్వితీయాది విభక్తులందు ఏకవచనములైన శబ్దాలకు ముందే చేరుతాయి. కానీ పూర్వం దీర్ఘం కలిగిఉండి యివర్ణాంతాలైన శబ్దాలకు బహువచనమునందు కూడా తివర్ణమాదేశంగా చేరుతుందని చిన్నయసూరి ఈ సూత్రం ద్వారా స్పష్టపరిచాడు.

ఇక్కడ 'చేయి' శబ్దంతో పాటు ఔపవిభక్తులు ద్వారా ఏర్పడిన రూపాలను కూడా ఏ విధంగా సాధించవచ్చు, సాధించిన వాటిని ఏ విధంగా కవులు ప్రయోగిస్తున్నారో మనకు అర్థమవుతుంది.

4.2. 'పండ్లు' శబ్దం విశ్లేషణ

మదిలోఁగిన్కను బండ్లు గీఁటుకొనుచు, మరీచుఁడేతేర… (తెలగనార్య, 3-11)

ఈ పద్యపాదంలో 'పండ్లు' అనే శబ్దాన్ని పరిశీలిద్దాం. ఈ శబ్దానికి 'పండు' ప్రాతిపదికగా చేసుకొని చిన్నయసూరి "బహువచనము పరంబగునప్పుడు డ - ల - ట - ర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగానగు" (చిన్నయసూరి, ఆ-12) అను సూత్రం ద్వారా 'పండు + లు' లో 'డు'లోని ఉత్వం లోపించి పండ్ + లు = పండ్లు అను రూపం వస్తుంది. బహుళం అన్నాడు కాబట్టి ఉత్వం లోపించని సమయంలో 'పండులు' అని ఉంటుంది.

ఇదే శబ్దానికి వడ్లమూడి గోపాలకృష్ణయ్య వ్యావహారిక భాషా వ్యాకరణంలో "కన్ను పన్నులు పల్లువంటివి" (గోపాలకృష్ణయ్య, శబ్ద-225) అంటూ పన్ను, పండ్లు, పళ్లు, పన్నులు ఉదాహరణలు చెప్పాడు. వీటిలో 'పన్ను' శబ్దం 'దంత' శబ్దానికి పర్యాయపదమే కానీ 'కప్పానికి' పర్యాయపదం కాదని చెప్పాడు.

కందుకూరి వీరేశలింగం పంతులు సంగ్రహ వ్యాకరణంలో "బహువచనము పరమగునప్పుడు డు, లు, టు, రు వర్ణముల ఉకారమునకు లోపము వైకల్పికముగా గలుగును" అని సూత్రం చెప్పాడు (వీరేశలింగం పంతులు, సంగ్రహవ్యాకరణం-10). బాలవ్యాకర్త ఉత్వానికి లోపం బహుళంగా చెప్పాడు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులు ఉత్వానికి లోపం వికల్పంగా చెప్పారు. అప్పుడు 'పండు' శబ్దానికి బహువచనం 'లు' పరమైనప్పుడు పండు, పండులు, పండ్లు అనే రూపాలు వరుసగా వస్తాయి.

ఇక్కడ 'పండు' అనే శబ్దానికి బాలవ్యాకర్త ఒక విధంగా, వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఒక విధంగా, కందుకూరి వీరేశలింగం పంతులు ఒక విధంగా సూత్రాలు చెప్పడం గమనించవచ్చు.

4.3. 'చెలియలు' శబ్దం విశ్లేషణ

కానకుఁజని యుండఁగ రావణుని చెలియ లొగిఁ గలయికకై… (తెలగనార్య, 3-16)

'చెలియలు' శబ్దాన్ని చిన్నయసూరి ఆల్వాదులలో చేర్చి "ఆల్వాదుల బహువచన లకారంబునకు రేఫంబును ముందటిలు వర్ణంబునకు బిందు పూర్వక డకారంబునగు" (చిన్నయసూరి, ఆ-11) అని సూత్రీకరించాడు. అంటే 'చెలియలు + లు' ఇక్కడ బహువచన లకారానికి పై సూత్రం ద్వారా రేఫం రాగా 'చెలియలు + రు' అవుతుంది.

ఇప్పుడు లుకారానికి బిందు పూర్వక డకారం రాగా చెలియ + ండ్+ రు = చెలియండ్రు అనే రూపం వస్తుంది. ఈ రూపసాధనలో బహువచన లకారానికి రేఫం ఆదేశంగా రావడం, ఆ రేఫానికి ముందున్న చెలియలు శబ్దంలోని లువర్ణానికి బిందు పూర్వక డకారం ఆదేశంగా రావడమనే రెండు కార్యాలు నిత్యంగా కలుగుతున్నాయి.

కందుకూరి వీరేశలింగం పంతులు 'చెలియలు' శబ్దాన్ని ఏకవచనంగా తీసుకొని ఈ శబ్దానికి బహువచనం చేరే విధానాన్ని "మఱికొన్ని శబ్దములకుబహువచనము నానావిధములుగఁగలుగును" (వీరేశలింగం పంతులు, సంగ్రహవ్యాకరణం-18) అని సూత్రీకరించి ఏకవచనంగా 'చెలియలు', బహువచనంగా 'చెలియండ్రు' అను రూపాలు ఉదహరించాడు. ఈ వివరణ బాలవ్యాకర్తతో పోలిస్తే కొంచెం అస్పష్టంగా కనిపిస్తుంది. చిన్నయసూరి అక్షర లోపాలు, అక్షర ఆదేశాలు ప్రతిదీ సూత్రాల ద్వారా స్పష్టంగా ఉదహరించాడు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులు కేవలం ఏకవచన రూపమని, బహువచన రూపమని మాత్రమే చెప్పాడే తప్ప రూపసాధన వివరించలేదు.

వడ్లమూడి గోపాలకృష్ణయ్య 'చెలియలు' శబ్దానికి బహువచన రూపం తేవడానికి "చెలియాదుల బహువచన లకారానికి రేఫం ముందరి లువర్ణానికి బిందు పూర్వక డకారం విభాషగా వస్తుంది" (గోపాలకృష్ణయ్య, శబ్ద-212) అని సూత్రీకరణ చేశాడు. చిన్నయసూరి చెలియలు శబ్దాన్ని ఆల్వాదులలో చేర్చడాన్ని వడ్లమూడి గోపాలకృష్ణయ్య అనుకరించలేదు. 'చెలియలు' శబ్దాన్ని చెలియాదులుగా గ్రహించాడు.

పై ముగ్గురి వివరణలలో పరవస్తు చిన్నయసూరి 'చెలియలు' శబ్దాన్ని ఆల్వాదులలో చేర్చి చేసిన రూపసాధనే సమంజసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పదం లోపించి ఏ పదం చేరుతుందో చిన్నయసూరి సూత్రాల ద్వారా స్పష్టంగా తెలిపారు. ఆ స్పష్టత మిగిలిన రెండు వ్యాకరణ గ్రంథాలలో కనిపించదు.

4.4. 'ఱేఁడు' శబ్దం విశ్లేషణ

దనరు రక్కసుల ఱేఁడు తనకవిలోనం… (తెలగనార్య, 3-51)

ఈ పాదంలోని 'ఱేఁడు' శబ్దానికి వ్యాకరణ కర్తలు చెప్పిన విశేషణాన్ని పరీశీలిద్దాం.

'ఱే' శబ్దాన్ని ప్రాతిపదికగా తీసుకొని పరవస్తు చిన్నయసూరి "ఱే ప్రభృతుల బహువచనమునకు ముందు డుఙగు" (చిన్నయసూరి, ఆ-8) అను సూత్రం ద్వారా ఱే మొదలైన శబ్దాలకు బహువచన లు వర్ణకం పరమైనప్పుడు ఆ లువర్ణానికి ముందు డుఙ చేరునని అర్థం. అంటే ఱే+లు = ఱేడుఙ+లు అగును. "ఙిత్తు బిందుపూర్వకంబగు" (చిన్నయసూరి, తత్సమ-19) సూత్రంచే ఱేండులు అని రూపం రావాలి. కానీ "దీర్ఘము మీద సాధ్యపూర్ణం లేదు" అన్న నియమాన్ని అనుసరించి 'ఱేఁడులు' అన్న రూపం మాత్రమే సిద్ధిస్తుంది.

ఱేఁడులు అన్న శబ్దానికి "సమాస పదంబునందు సంయోగము పరంబగునపుడెల్లచో ఖండబిందువనకుం బూర్ణంబగు" (చిన్నయసూరి, ఆ-15) అన్న సూత్రంచే అర్ధబిందువు నిండుసున్నగా మారి 'ఱేండ్ + లు = ఱేండ్లు అను రూపాలు చిన్నయసూరి సాధించారు.

కందుకూరి వీరేశలింగం పంతులు ఈ శబ్దాన్ని గురించి "పుంలింగ బోధకమగు డువర్ణకము బహువచనం పరమగునపుడు లోపించును" (వీరేశలింగం పంతులు, సంగ్రహవ్యాకరణం-10) అని సూత్రీకరించి రాముడు, రాములు, గురుడు, గురులును ఉదహరించాడు. కానీ ఱేఁడు శబ్దంలోని డువర్ణం లోపింపదు అని చెప్పాడు. కందుకూరి వీరేశలింగం పంతులు ఉద్దేశ్యంలో 'ఱేఁడు' శబ్దానికి బహువచనం పరమై 'ఱేఁడులు' గానే ఉండునని అర్థం.

వడ్లమూడి గోపాలకృష్ణయ్య 'ఱేఁడు' అన్న శబ్దానికి "పూర్ణబిందు పూర్వక డు వర్ణక ఉత్వానికి లోపం మీది బహువచన లకారానికి రేఫ నిత్యం - రే ప్రభృతులకు రాదు" (గోపాలకృష్ణయ్య, శబ్ద-205) అని సూత్రీకరించి రేడులు, రేండ్లు, రేళ్లుగా తెలిపాడు. ఇతడు కూడా కందుకూరి వీరేశలింగం పంతులు సూత్రాన్ని అనుసరించి "బహువచనం పరమైతే రేప్రభృతుల డువర్ణానికి లోపం రాదు" (గోపాలకృష్ణయ్య, శబ్ద-206) అని చెప్పి 'రేడులు' అని ఉదహరించాడు.

ఇక్కడ వడ్లమూడి గోపాలకృష్ణయ్య పై ఇద్దరు ప్రయోగించిన శకటరేఫాన్ని వదిలేసి ఆయన సాధురేఫంలో ప్రయోగించడం విశేషంగా చెప్పవచ్చు.

4.5. 'కూతురు' శబ్దం విశ్లేషణ

అతని కూతురు శర్మిష్ట యనగ నొప్పు… (తెలగనార్య, 3-52)

ఈ పద్యపాదంలోని 'కూతురు' శబ్ద నిర్మాణాన్ని గురించి వ్యాకరణ నియమాలను అనుసరించి తెలుసుకుందాం.

'కూతురు' శబ్దానికి చిన్నయసూరి "కూతు శబ్దము ప్రథమైకవచనంబునకు రువర్ణంబగు" (చిన్నయసూరి, ఆ-9) అని సూత్రీకరించి కూతురు, కూతులును ఉదహరించాడు. అంటే ప్రథమా ఏకవచనంగా ఉన్న 'కూతు' శబ్దానికి రువర్ణం ఆదేశంగా వస్తుందని అర్థం. బహువచనానికి గాని ఇతర విభక్తులకు గాని ఈ రువర్ణం రాదని అర్థం. 'కూతురు' ఇది ప్రథమా ఏకవచన రూపం. 'కూతులు' బహువచన రూపం. బహువచనమున రువర్ణం రాదు కాబట్టి 'కూతురులు, కూతుళ్లు' వంటి రూపాలు రావని, వాటిని గ్రామ్యాలుగా చిన్నయసూరి చెప్పాడు.

కందుకూరి వీరేశలింగం పంతులు సంగ్రహ వ్యాకరణంలో "మఱికొన్ని శబ్దములకు బహువచనం నానావిధములుగ కలుగును" (వీరేశలింగం పంతులు, సంగ్రహవ్యాకరణం-18) అని 'కూతురు' శబ్దాన్ని ఏకవచనంగా, 'కూతులు' శబ్దాన్ని బహువచనంగా చెప్పాడు. ఆ శబ్దానికి కందుకూరి వీరేశలింగం పంతులు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.

వ్యావహారిక భాషా వ్యాకరణంలో వడ్లమూడి గోపాలకృష్ణయ్య 'కూతు' శబ్దాన్ని ప్రథమైకవచనంగా తీసుకొని "కూతు శబ్దం ప్రథమైకవచనానికి రువర్ణం వస్తంంది" (గోపాలకృష్ణయ్య, శబ్ద-210) అని చిన్నయసూరి భావాన్నే సూత్రీకరించాడు. చిన్నయసూరి చెప్పిన గ్రామ్య పదాలను వడ్లమూడి గోపాలకృష్ణయ్య పట్టించుకోలేదు. దానికి "కూతురు ప్రథమైకవచనం మీదనే ప్రథమా బహుత్వాదులు" (గోపాలకృష్ణయ్య, శబ్ద-211) కలుగుతాయని కూతురులు, కూతుర్లు, కూతుళ్లు, కూతురును, కూతురిని, కూతుర్ని మొదలైన గ్రామ్య పదాలను అగ్రామ్యంగా గ్రహించాడు.

చిన్నయసూరి కావ్యభాషకు వ్యాకరణం రాశాడు కాబట్టి, ప్రాచీన కవులు కూతుర్లు, కూతురిని, కూతుర్ని వంటి పదాలను వాడకపోవచ్చు. అందుకని చిన్నయసూరి అక్కడ ఆ శబ్దాలను గ్రామ్యాలుగా గ్రహించి ఉంటాడు. వడ్లమూడి గోపాలకృష్ణయ్య వ్యావహారికానికి వ్యాకరణం రాస్తున్నాడు కాబట్టి మనం సహజంగా నా కూతుర్ని, నా కూతురిని వంటి పదాలను వాడుతూ ఉంటాం కాబట్టి వడ్లమూడి గోపాలకృష్ణయ్య వాటిని అగ్రామ్యములుగా గ్రహించడంలో తప్పులేదని నా భావన.

5. వ్యాకరణ నియమాలకు పొసగని పదాలు

లాక్షణికులు, వ్యాకరణవేత్తలు ఒక కొత్త అంశాన్ని ప్రతిపాదించేటప్పుడు ప్రామాణికంగా ఒక కావ్యాన్ని మూలంగా గ్రహించి నియమాన్ని ఏర్పాటు చేస్తారు. అలాంటప్పుడు సహజ రూపంలో లేదా వాడుక రూపంలో ఉన్న పద స్వరూపాలను వదిలేసి ఉంటారు. యయాతి చరిత్ర అచ్చతెలుగు పదాలతో నిర్మించిన ప్రబంధ కావ్యం.

కాబట్టి ప్రతి పద్యంలో ఎన్నో పదాలు వ్యాకరణ నియమాలకు పొసగవు. అన్ని పదాలను ఇక్కడ విశ్లేషించడం వీలుకాదు కాబట్టి తృతీయాశ్వాసంలో కొన్ని పదాలను మాత్రమే విశ్లేషించడం జరిగింది.

5.1. 'అట్ల' శబ్దం

జాటింపు మానవుడు నతండట్ల చేసిన మఱునాడు…. (తెలగనార్య, 3-27)

ఇక్కడ 'అట్ల' అనే పదాన్ని గమనిస్తే 'అటు + లు'. "బహువచనము పరంబగునప్పుడు డ, ల, ట, ర, ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగానగు" (చిన్నయసూరి, ఆ-12) అను సూత్రం ద్వారా 'అట్లు' అను రూపం రావాలి. కానీ దానికి విరుద్ధంగా 'అట్ల' అను రూపం వచ్చింది. ఈ రూపాన్ని ప్రౌఢవ్యాకర్త కూడా గమనించలేదు. ప్రౌఢవ్యాకర్త "కొన్ని యవ్యయంబులు బహువచనాంత తుల్యంబులు నగు" (సీతారామాచార్యులు, శబ్ద-34) అంటూ అట్లు, ఇట్లు మొదలైన శబ్దాలు ఏకవచనంతాలైన అవ్యయాలు. కాబట్టి వీటిలో లింగ, విభక్తి, వచనం ఇవేవీ ఉండవు. అందువల్ల అవి బహువచనాలు కావని తెలిపాడే తప్ప 'అట్ల', 'ఇట్ల' మొదలైన రూపాలు వస్తాయని గమనించలేదు.

5.2. 'తోటలు' శబ్దం

యచ్చెలువం గనిన యుబ్బనం గొబ్బునం బొంగి సింగారపు తోటలు… (తెలగనార్య, 3-24)

ఇక్కడ 'తోట' శబ్దానికి బహువచనం లు పరమైనప్పుడు తోట + లు = తోటలు, బహువచనానికి ముందరి హ్రస్వం లోపిస్తే 'తోట్లు' లోపించకపోతే 'తోటలు' అను రూపాలు వస్తాయి. చిన్నయసూరి బహువచనం పరమైనప్పుడు డ, ల, ట, ర లకు ఉత్వానికి మాత్రమే లోపం వస్తుందని చెప్పాడే తప్ప హ్రస్వానికి కూడా లోపం వస్తుందని గ్రహించనేలేదు. ఈ విషయాన్ని ప్రౌఢవ్యాకర్త కూడా చెప్పలేదు. ఇలాంటి రూపమే యేడు కొండలుఁ దివక రండు (తెలగనార్య, 3-35) అను పద్యంలో 'కొండ' శబ్దానికి కూడా జరుగుతుంది (కొండ + లు = కొండలు, కొండ్లు).

5.3. 'కల్వలు' శబ్దం

చందంబున బెల్లుగాఁ గల్వలు తల్లడిల్లఁబూని … (తెలగనార్య, 3-64)

ఇక్కడ 'కలువ' శబ్దానికి బహువచనం పరమైనప్పుడు 'కలువ + లు' అగును. వ్యాకరణ కర్తలు బహువచనం పరమైనప్పుడు దాని ముందరి వర్ణాల మార్పును గురించి మాత్రమే చర్చించారు. పదమధ్య వర్ణ లోపాల గురించి చర్చించడం కనిపించదు. ఈ మార్పును భాషావేత్తలు పూర్వముఖ వర్ణసమీకరణం అన్నారు. పరముఖ వర్ణసమీకరణానికి బాలవ్యాకరణంలో సూత్రాలు కనిపిస్తాయి.

ఉపసంహారం

వ్యాకరణ ఆవశ్యకతను గుర్తించి కావ్యానికి, కావ్యభాషకు ఎంతగా దోహదపడుతుందో గుర్తించడం. అచ్చతెలుగు కావ్యాలలోని పదాలను వ్యాకరణాలలో ఉన్న ఆచ్ఛిక పరిచ్ఛేద నియమాను సారంగా రూపాలను సాధించడం. ఒక కావ్యానికి రసాలంకారాలు ఏ విధంగా శోభను కలిగిస్తాయో అదే విధంగా వ్యాకరణం కూడా కావ్యాలకు శోభను చేకూర్చుతుంది.

సంస్కృత శబ్దాలను తెలుగులోకి మార్చడం వలన అచ్చతెలుగు పదాల అర్థాలను మనం నిఘంటువుల ద్వారా తెలుసుకోవాలి.వ్యాకరణ వేత్తలు ఆచ్ఛిక శబ్దాలను సాధించిన రూపాలలో కవులు ఉపయోగించిన శబ్దాల అర్థభేదాన్ని గుర్తించాలి.

  • యయాతి చరిత్ర అచ్చతెలుగు కావ్యాలలో తొలి రచనగా, తెలుగు భాషా సాహిత్యానికి పొన్నగంటి తెలగనార్యుడు చేసిన కృషిని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
  • తెలగనార్యుడు సంస్కృత పదాలు లేకుండా స్వచ్ఛమైన తెలుగులో కావ్యాన్ని రచించడంలో ప్రదర్శించిన భాషా నైపుణ్యం విశదమైంది.
  • చిన్నయసూరి బాలవ్యాకరణంలోని ఆచ్ఛిక పరిచ్ఛేద నియమాల ప్రామాణికతను, యయాతి చరిత్రలోని పదాలకు వాటి అనువర్తనాన్ని విశ్లేషించడం జరిగింది.
  • వివిధ వ్యాకరణ కర్తలైన చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం పంతులు, వడ్లమూడి గోపాలకృష్ణయ్యల వ్యాకరణ సూత్రాల మధ్య ఉన్న భేదాలను, సారూప్యతలను తులనాత్మకంగా పరిశీలించడం జరిగింది.
  • యయాతి చరిత్రలో కొన్ని పదాలు ప్రచలిత వ్యాకరణ నియమాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి, వాటి భాషా స్వరూపంపై లోతైన విశ్లేషణ అందించబడింది, తద్వారా కావ్యభాషాపరిణామంపై అవగాహన పెంపొందించబడింది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. గోపాలకృష్ణయ్య, వడ్లమూడి. వ్యావహారికభాషావ్యాకరణం. రాజఫణి వడ్లమూడి. హైదరాబాద్.
  2. చిన్నయసూరి, పరవస్తు. బాలవ్యాకరణం (ఘంటాపథ వ్యాఖ్య). నవచేతన పబ్లిషింగ్ హౌస్. హైదరాబాద్.
  3. తెలగనార్య, పొన్నగంటి. యయాతి చరిత్ర (సుగమ వ్యాఖ్య). పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్.
  4. ప్రవీణ, దొడ్డి. (సిద్ధాంతగ్రంథం). బాలవ్యాకరణానికి సమీప కాలిక వ్యాకరణాల పరిశీలన. PND పబ్లికేషన్స్.
  5. లలిత, జి. తెలుగు వ్యాకరణముల చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. హైదరాబాద్.
  6. వీరేశలింగం పంతులు, కందుకూరి. సంగ్రహవ్యాకరణం. రోహిణి పబ్లికేషన్స్. రాజమండ్రి.
  7. వెంకటరమణ శాస్త్రి, దువ్వూరి. రమణీయం. ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్. వాల్తేరు.
  8. వేంకటేశ్వర్లు, వజ్ఝల. ఆధునిక ప్రామాణికాంధ్ర వ్యాకరణం. సరస్వతీ పవర్ ప్రెన్సు. రాజమండ్రి.
  9. సీతారామాచార్యులు, బహుజనపల్లి. ప్రౌఢవ్యాకరణం(ఘంటాపథ వ్యాఖ్య). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. విజయవాడ.
  10. సీతారామశాస్త్రి, పూదూరి. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. మద్రాస్.
  11. సీతారామాచార్యులు, బహుజనపల్లి. శబ్ద రత్నాకరం. శ్రీ చైతన్య ఆఫ్‌సెట్ ప్రింటర్స్. విజయవాడ.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal