headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-07 | Issue-9 | August 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. గురజాడ ‘దిద్దుబాటు’ - శ్రీశ్రీ ‘ఆనంద మందిరం’ కథలు: తులనాత్మక పరిశీలన

డా. పులపర్తి శ్రీనివాసరావు

అతిథి అధ్యాపకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 8309742248, Email: telugu.bujji@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 01.07.2026        ఎంపిక (D.O.A): 20.07.2026        ప్రచురణ (D.O.P): 01.08.2026


వ్యాససంగ్రహం:

తెలుగు కథా సాహిత్య చరిత్రలో తొలి కథానిక అయిన ‘దిద్దుబాటు’ కథను రాసింది గురజాడ వేంకట అప్పారావు. వీరు రాసిన ఈ కథ ‘ఆంధ్ర భారతి’ పత్రికలో 1910, ఫిబ్రవరిలో ప్రచురితమైంది. సంఘసంస్కరణవాద దృక్పథంతో రాయబడిన ఈ కథ ఆనాటి కాలంలో సంఘాన్ని పరివర్తన వైపు మళ్లించింది అనడంలో సందేహం లేదు. అలాగే శ్రీశ్రీ రాసిన ‘ఆనందమందిరం’ అనే తొలి కథ 1926 చివరలో తన 16వ ఏట రాశారు. ఇది విజయనగరం నుండి వెలువడే ‘శారద’ పత్రికలో ప్రచురితమైంది. ఈ రెండు కథలో కథాంశం వేరై ఉండొచ్చు. కానీ, అందులో చెప్పిన వస్తువును పరిశీలిస్తే రెండిటి లక్ష్యం ఒకటే అని తెలుస్తుంది. ఈ రెండు కథలు కూడా భర్తల చెడు నడవడికను భార్యలు తమ తెలివితేటలు, సమయస్ఫూర్తితో సరిదిద్ది, వారిలో నిజమైన మార్పును తీసుకురావచ్చనే చక్కటి సందేశాన్ని ఇచ్చాయి. అయితే, పైకి కనిపించేది భర్తలను సరిదిద్దుకోవడమే అయినప్పటికీ అంతర్గతంగా సంఘసంస్కరణ కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు కథల్లో సంఘాన్ని సంస్కరించాలనే రచయితల దృక్పథంలో సారుప్యత ఉంది. ఈ కోణంలో గురజాడవారి ‘దిద్దుబాటు’, శ్రీశ్రీ ‘ఆనంద మందిరం’ కథలను తులనాత్మక చేయాలనే ఉద్దేశ్యంతో సాగినదే ఈ పరిశోధన వ్యాసం

Keywords: దిద్దుబాటు, సంఘసంస్కరణ, సారుప్యత, ప్రమాణం, మూఢనమ్మకాలు, దురాచారాలు, మద్యపాన నిషేధం, వేశ్యాలోలత్వం, జోగినీ వ్యవస్థ, కన్యాశుల్కం, సతీసహగమనం.

1. ఉపోద్ఘాతం

భారతదేశం వలస పాలనలో మగ్గుతున్న సమయంలో, సంఘంలో అనేక దురాచారాలు ప్రబలినాయి. ప్రజలు మూఢవిశ్వాసాలతో మగ్గిపోతూ కనీస జీవన ప్రమాణాలు లేకుండా జీవితాలు దర్భురమయ్యాయి. ఇలాంటి సందర్భంలో అనగా 19, 20 శతాబ్దాల సంధి కాలంలో సంఘసంస్కరణ ఆవశ్యకత గురించిన చర్చ మొదలైంది. సంఘ సంస్కరణ అంటే సమాజంలో ఉన్న చెడు ఆచారాలు, మూఢనమ్మకాలు, అసమానతలను తొలగించి, సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకురావడమే. సమాజం ఆరోగ్యంగా, ప్రగతిశీలక పంథాలో సాగడానికి అవసరమైన మార్పులను ఆశించడమే ఈ సంఘ సంస్కరణ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది (శ్రీరామ అప్పారావు, పోణంగి.). ఆనాటి కాలంలో సమాజానికి హాని కలిగించే సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ వంటి ఆచారాలను అంతం చేయడం ప్రధాన లక్ష్యం అయింది. అంతేకాకుండా, కుల నిర్మూలన, అంటరానితనం తొలగింపు ద్వారా మనుషులందరికీ సమాన హక్కులు కల్పించడం, స్త్రీవిద్యకు ప్రాముఖ్యతనివ్వడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, ఆస్తి హక్కులు కల్పించడం వంటి సంస్కరణలు అత్యంత అవసరమయ్యాయి. మరోవైపు మూఢనమ్మకాలను నమ్మకుండా, ప్రజల్లో హేతుబద్ధమైన ఆలోచనలను పెంపొందించడం కోసం మరి కొందరు సంస్కర్తలు కంకణం కట్టుకున్నారు.

తెలుగు సమాజంలో ప్రముఖ సంఘసంస్కర్త ‘ఆంధ్ర వైతాళికుడు’ అని పిలవబడే కందుకూరి వీరేశలింగం పంతులు. ఈయన, తెలుగు ప్రాంతంలో 1881లో మొదటి వితంతు వివాహం జరిపించడమే కాకుండా, స్త్రీ విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఇదే తరహాలో సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని గురజాడ అప్పారావు తన రచనల ద్వారా ‘కన్యాశుల్కం’, మద్యపాన నిషేధం, బాల్య వివాహాలపై నిరసన గళాన్ని వినిపించారు. ఈ సాంఘిక దురాచారాల్ని తీవ్రంగా ఖండించారు. ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మసమాజ భావాలతో అంటరానితనంపై, దేవదాసి వ్యవస్థపై పోరాటం చేయడమే కాకుండా, దేశమంతా ఆ ప్రభావం కనబడేలా ప్రచారం చేశారు.

2. తెలుగు కథా సాహిత్యం, సంఘసంస్కరణ

తెలుగు సాహిత్యంలో సంఘ సంస్కరణ కథా సాహిత్యం సమాజ మార్పునకు అద్దం పట్టింది. మూఢనమ్మకాలు, అంటరానితనం, స్త్రీ అణచివేత వంటి సామాజిక పిశాచాలను ఎదిరిస్తూ రచయితలు తమ కలాలను ఆయుధాలుగా మలచుకున్నారు. ఆ కోవలో చాలా వరకు విజయం సాధించారు కూడా. ఆధునిక తెలుగు సాహిత్యంలో సంస్కరణ ఉద్యమానికి పునాది వేసింది కందుకూరి అనేది జగమెరిగిన సత్యం. సంఘంలో వితంతు వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిరోధానికి రచనలను సాధనంగా ఉపయోగించుకున్నారు (శ్రీరామ అప్పారావు, పోణంగి.). గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం సంఘ సంస్కరణ కోణంలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే సంఘసంస్కరణను ప్రజల్లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళడంలో అత్యంత ఉపయోగపడిన సాహిత్య ప్రక్రియ కథా ప్రక్రియ. సంస్కరణాభిలాషను సమాజంలోని రుగ్మతలను సులువుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ ప్రక్రియ ప్రధాన మాధ్యమంగా మారింది. కుల వ్యవస్థ, పేదరికం, జమిందారీ దోపిడీ, మూఢనమ్మకాలపై కథలు వెలువడ్డాయి. దీనికి తోడు అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావంతో కథలు మరింత విప్లవాత్మక రూపాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యమైన ఇతివృత్తాలు స్త్రీల అభ్యుదయం, వారిని చైతన్య చేసే కథలు, కుల నిర్మూలన, అంటరానితనం, సామాజిక అసమానతలపై తిరుగుబాటు భావనలు, ఆర్థిక దోపిడీపై పోరాటం వంటి అనేక సమస్యలను ఉటంకిస్తూ ప్రజల్లో పరివర్తన తీసుకురాగలిగారు కథా రచయితలు.

3. సంఘ సంస్కరణ నేపథ్య కథలు

తెలుగు సాహిత్యంలో సంఘ సంస్కరణ నేపథ్యంతో అనేక కథలు వచ్చాయి. అత్యాధునిక కాలంలో అంటే 21వ దశకంలో ఈ రకమైన వస్తువుతో వచ్చిన కథలు చాలానే కనిపిస్తున్నాయి. మొదటిగా చెప్పుకోవలసింది, ‘దిద్దుబాటు’. ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి చిన్న కథగా గుర్తింపు పొందింది. భర్త వ్యసనాలను, పరస్త్రీ వ్యామోహాన్ని భార్య తన తెలివితేటలతో ఎలా దిద్దిందో చూపిస్తుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన కథల ద్వారా బ్రాహ్మణ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, ఆచారాలను తీవ్రంగా నిరసించారు. ఇలాంటి ఇతివృత్తంతో రాసిన కథ ‘దివ్యదర్శనం’. వితంతువుల పట్ల సమాజం చూపే వివక్షను, మడి-ఆచారం పేరిట చేసే అక్రమాలను ఈ కథ ప్రశ్నిస్తుంది. శృంఖలాలను తెంచుకుని స్త్రీలు ఎలా ముందుకు సాగాలో ఇందులో చూపించారు. ఇక దళితవాద కథల్లో ఒక విప్లవాత్మక సంచలనం ‘ఊరబావి’. కొలకలూరి ఇనాక్ విరచితమైన ఈ కథ దళిత సాహిత్యంలో, సామాజిక సమానత్వ ఉద్యమంలో అత్యంత కీలకమైనది. మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాన్ని సంస్కరణ దృక్పథంతో అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది. అలాగే గుడిపాటి వెంకటచలం రాసిన కథ ‘భార్యా రూపవతీ శత్రుః’. స్త్రీ స్వేచ్ఛ, వారి అంతరంగ చైతన్యం కోసం కలం పట్టిన విప్లవాత్మక రచయిత చలం. భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీలకు ఇచ్చే స్థానాన్ని, వారిని భోగవస్తువుగా చూసే సమాజ తీరును ఎండగట్టిన విధానం చూడొచ్చు. మహిళల ఆలోచనా విధానంలో మార్పు తేవడానికి చలం కథలు ఎంతో దోహదపడ్డాయి. ఇంకా కరుణకుమార రాసిన ‘గండపెండేరం’ కథ గ్రామీణ జీవితంలో ఉన్న సామాజిక రుగ్మతలపై, సమాజంలో అణచివేతకు గురవుతున్న అట్టడుగు వర్గాల ప్రతిభను, వారికి దక్కాల్సిన గౌరవాన్ని కుల వివక్ష ఎలా అడ్డుకుంటుందో కళ్ళముందు ఆవిష్కరించింది. ఇలా పలు కథలు నాటి నుండి నేటి వరకూ సంఘ సంస్కరణ దృక్పథంతో రాయబడి, సమాజంలో మార్పును తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు.

4. దిద్దుబాటు, ఆనంద మందిరం కథల పరిచయం

4.1. దిద్దుబాటు కథా పరిచయం

గోపాలరావు, అతని భార్య కమలిని, సేవకుడు రాముడు. గోపాలరావు వేశ్యాలోలుడు. వారి వ్యామోహంలో పడి, రాత్రుళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు. ఒకరోజు రాత్రి ఒంటిగంటకు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉండటం, భార్య కమలిని మంచంపై లేకపోవడం చూసి కంగారుపడతాడు. సేవకుడైన రాముణ్ణి నిలదీయగా, అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోయారని చెప్తాడు. బల్లపై కమలిని రాసిన ఉత్తరం గోపాలరావుకు దొరుకుతుంది. అందులో, తన భర్త మీటింగులకు వెళ్తున్నానని అబద్ధాలు చెప్తూ రాత్రుళ్ళు తిరుగుతున్నాడని తనకు పది రోజుల ముందే తెలిసిందని, తన వల్ల భర్త అబద్ధాలు ఆడవలసిన అవసరం లేకుండా ఉండేందుకే తాను పుట్టింటికి వెళ్ళిపోతున్నట్లు రాస్తుంది. ఆ ఉత్తరం చదివిన గోపాలరావు పశ్చాత్తాపంతో కుంగిపోతాడు. తనను తాను పశువుగా నిందించుకుంటాడు. వెంటనే రాముడికి డబ్బులిచ్చి, కమలిని వద్దకు పంపిస్తూ... తనకి బుద్ధి వచ్చిందని, ఇకపై చెడు పాటలు విననని, రాత్రి పూట ఇల్లు వదిలి వెళ్ళనని గట్టిగా ఒట్టు వేసుకున్నట్లు ఆమెకు చెప్పి, వెంటనే తిరిగి తీసుకురావాలని పురమాయిస్తాడు.

4.2. ఆనంద మందిరం కథాపరిచయం

మన్మథరావు, అతని భార్య మాలతి, మిత్రుడు జస్పంతరాయ్. పూనా నగరానికి చెందిన ఉన్నతోద్యోగి, మహా ధనవంతుడైన మన్మథరావు స్నేహితుల ప్రోత్సాహంతో మద్యం సేవించడం అలవాటు చేసుకుంటాడు. క్రమంగా పూనాలోని ‘ఆనంద మందిరము’ అనే తాగుబోతుల స్థావరానికి బానిసై, తన ఆరోగ్యాన్ని, సంపదను, చివరికి ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. అతని భార్య మాలతి హెచ్చరించినా వినకుండా మద్యపాన వ్యసనంలో మునిగిపోతాడు. చివరకు అతని ప్రాణస్నేహితుడైన జస్పంతరాయ్ మరణించడం, అతని జ్ఞాపకార్థం నిర్మించ తలపెట్టిన స్మారక చిహ్నానికి కనీసం రెండు వందల రూపాయల చందా కూడా ఇవ్వలేని దయనీయ దరిద్ర స్థితిలో తాను ఉన్నానని గ్రహించడం మన్మథరావులో తీవ్ర పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. తన పతనానికి మద్యపానమే కారణమని గ్రహించి, భార్య పాదాలపై పడి ఇకపై ‘ఆనంద మందిరం’ ముఖం చూడనని, మద్యం ముట్టనని ప్రమాణం చేస్తాడు. ఆ సమయంలో మాలతి నవ్వి, ఇదంతా అతనిని మార్చడానికి తాను ఆడిన నాటకమని బయటపెడుతుంది. వారి ఆస్తులు, డబ్బు అంతా సురక్షితంగానే ఉన్నాయని, సేవకులు ఇల్లు విడిచి వెళ్ళిపోవడం కూడా తన ప్రణాళికలో భాగమేనని చెప్తుంది. తన తప్పు తెలుసుకున్న మన్మథరావు పూర్తిగా మారిపోతాడు. చివరికి ఆనందమందిరమే మద్యపాన నిషేధ సభలు జరుపుకునే వేదికగా మారగా, దానికి మన్మథరావే అధ్యక్షుడవుతాడు (శ్రీనివాసరావు, శ్రీరంగం.).

5. సంఘ సంస్కరణకు పునాదిగా కమలిని, మాలతి పాత్రలు

దిద్దుబాటు, ఆనందమందిరం కథల్లోని ప్రధాన స్త్రీ పాత్రలు కమలిని, మాలతి. ఈ రెండు పాత్రల ఆలోచనా విధానం ఒక్కటే. వారి సమయస్ఫూర్తి కూడా ఒక్కటే. శ్రీశ్రీ ‘ఆనంద మందిరము’, గురజాడ ‘దిద్దుబాటు’ కథలలోని మాలతి, కమలిని పాత్రల సమయస్ఫూర్తిని, వారు అనుసరించిన వినూత్న వ్యూహాలను పోల్చి చూసినప్పుడు ఇంచుమించు ఒకేరకమైన ఆశయంతో ఈ పాత్రలను మలిచారనిపించింది.

6. కమలిని, మాలతి పాత్రల సారుప్యత

గురజాడ అప్పారావు గారి ‘దిద్దుబాటు’ కథలోని కమలిని, శ్రీశ్రీ గారి ‘ఆనంద మందిరము’ కథలోని మాలతి పాత్రలు ఇద్దరూ తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక స్త్రీ చైతన్యానికి, సమయస్ఫూర్తికి అద్భుతమైన ప్రతీకలుగా నిలుస్తాయని ఆ పాత్ర చిత్రణ, ఆ పాత్రల లక్ష్యం గమనిస్తే అర్థమవుతుంది. విద్యావంతులు, ఉన్నత సంస్కారం కలిగిన మహిళలుగా తీర్చిదిద్దబడ్డారు. మాలతి పూనా నగరానికి చెందిన సుప్రసిద్ధ న్యాయవాది అయిన మాధవరావు కుమార్తె. ఆమె ఎంతో సంస్కారవంతురాలు, వివేకవతి. కమలిని కూడా ఆధునిక విద్యాసంస్కారాలు కలిగిన యువతి. ఆమెను భర్త గోపాలరావే స్వయంగా ‘గుణవతి, విద్యావతి, వినయ సంపన్నురాలు’ అని కొనియాడటం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

భర్తల వ్యసనాలపై చేసిన పోరాటంలో వీరిద్దరూ ఒకే రకమైన నిశ్శబ్ద వ్యూహం అనుసరించారు. వీరిద్దరి భర్తలూ చెడు అలవాట్లకు లోనవుతారు. మన్మథరావు స్నేహితుల ప్రోత్సాహంతో తీవ్ర మద్యపాన వ్యసనంలో మునిగిపోగా, గోపాలరావు పరస్త్రీల వ్యామోహంలో పడి భార్యకు అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటాడు. అంతేకాదు, ఈ ఇద్దరు భర్తలూ తమ తప్పులను ఒప్పుకోకుండా సమర్థించుకుంటారు. అయితే మాలతి గానీ, కమలిని గానీ వారిపై కేకలు వేయడం, నిందించడం, ఇతరుల ముందు గొడవ పడటం వంటి పాత పద్ధతులను అనుసరించకుండా, చాలా చాకచక్యంగా, అత్యంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తమ తెలివితేటలతో తమ భర్తలను మార్చడానికి వ్యూహాలు పన్నడం గమనించవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ప్రత్యేకత, వారు అనుసరించిన నాటకీయమైన వ్యూహాలు. మాలతి వ్యూహం, తన భర్త వ్యసనం వల్ల ఆస్తి మొత్తం హరించుకుపోయిందని, తాము దరిద్రులమయ్యామని నమ్మిస్తూ, చివరకు ఇంట్లో పనిచేసే సేవకులను కూడా తానే పంపించేసి, తీవ్రమైన కరవు పరిస్థితులను సృష్టిస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, కమలిని వ్యూహం మరొక రకంగా ఉంటుంది. భర్త రోజుకో అబద్ధం చెప్తూ ఇంటికి ఆలస్యంగా వస్తుండటం గమనించి, అతని అబద్ధాలకు తావు లేకుండా చేయడానికి తానే పుట్టింటికి వెళ్ళిపోతున్నట్లు బల్లపై ఒక ఉత్తరం రాసి పెట్టి నాటకమాడుతుంది. ఆకలితో ఉన్న భర్త ఒంటరిగా మిగిలి, తన తప్పును తాను తెలుసుకోవాలనేది ఆమె వ్యూహంగా అర్థమవుతుంది. ఇలా ఈ రెండు పాత్రల వ్యూహాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం, ఒకరిని వేశ్యాలోలత్వం నుండి బయటపడేయడానికి, మరొకరికి మద్యపానం అంటే అసహ్యం కలిగించడానికి అని స్పష్టంగానే తెలియవస్తుంది.

ఈ పాత్రల స్వభావం రెండు రకాలుగా అవగతం చేసుకోవచ్చు. ఒకటి తమ భర్తలను చక్కదిద్దుకోవడం అయితే, మరొకటి వారు చేసే చెడు పనులను అంతం చేయడం. పరోక్షంగా రచయిత ఉద్దేశ్యం కూడా ఇదే. మొదటి అంశంలో తమ కుటుంబాలను సక్రమంగా చేసుకోవడం కనిపించినా, గురజాడ, శ్రీశ్రీల అసలు దృక్పథం సమాజంలో వేళ్లూనుకుపోయిన మద్యపానాన్ని, వేశ్యావృత్తిని నిర్మూలించడమేనన్నది గ్రహించాల్సిన అవసరముంది. ఈ కోణంలో భర్తలలో నిజమైన పశ్చాత్తాపం కలిగించడం ఈ పాత్రల మొదటి లక్ష్యాలుగా కనిపిస్తుంది. మాలతి పన్నిన వ్యూహానికి మన్మథరావు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. స్నేహితుడు చనిపోతే కనీసం రెండు వందల రూపాయల చందా కూడా ఇవ్వలేని దయనీయ స్థితికి చేరానని గ్రహించి, భార్య పాదాలపై పడి శోకిస్తూ ఇకపై మద్యం ముట్టనని గట్టిగా ఒట్టు పెట్టుకుంటాడు. ఒక కమలిని రాసిన ఉత్తరం చదివిన గోపాలరావు కూడా తీవ్రమైన పశ్చాత్తాపంతో కుంగిపోతాడు. తనను తాను నిందించుకుంటూ, ఇకపై ఎన్నడూ రాత్రిపూట ఇల్లు వదలనని, చెడు వ్యసనాలు, వేశ్యాపాటలు విననని ఒట్టు పెట్టుకుంటాడు.

ఈ రెండు పాత్రల్లో చిత్రించబడిన మరో అంశం, ప్రతీ స్త్రీ ఎవరి సంసారాన్ని వాళ్ళు చక్కదిద్దుకుని నిలబెట్టుకోవాలనే తపన కనిపించడం. యావత్ సమాజంలో ప్రతీ స్త్రీ ఈ పాత్రలను ఆదర్శంగా తీసుకోవల్సిన అవసరముంది. భర్త తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడగానే మాలతి నవ్వి, ఇదంతా తన నాటకమని బయటపెట్టి, డబ్బు అంతా భద్రంగానే ఉందని చెప్తుంది. భర్తను సంస్కరించి, సంసారాన్ని తిరిగి ఆనందమయం చేస్తుంది. కమలిని కూడా భర్తకు బుద్ధి చెప్పి తన సంసారాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించింది. ఆమె రాసిన ఉత్తరం భర్తను బాధ్యతాయుతమైన మార్గంలోకి తీసుకురావడంలో కీలకంగా మారింది.

ఈ విధంగా, ఇద్దరు రచయితలూ ఈ పాత్రల ద్వారా స్త్రీలు బాధితులుగా మిగిలిపోకుండా, తమ బుద్ధిబలంతో పురుషుల నడవడికను ‘దిద్దుబాటు’ చేయగలరని నిరూపించారు. ఈ పాత్రల లక్ష్యాలు సారుప్యత కలిగి ఉండటం గమనిస్తే, బహుశా గురజాడ వారిని శ్రీశ్రీవారు అనుసరించారేమో అనిపించింది. ఎందుకంటే దిద్దుబాటు రాయబడిన 16 సంవత్సరాలకు ‘ఆనందమందిరం’ కథ రాయబడింది. ఏది ఏమైనా కథల్లో ప్రధాన ఇతివృత్తం విజయం సాధించడంలో ఈ రెండు పాత్రల రూపకల్పన ఒకేలా ఉండటం, ఒక లక్ష్యంతో ముందుకు నడినట్లు అనిపించడం చూస్తే రచయితల ఆలోచనా దృక్పథం ఆనాటి కాలానికి అనుగుణంగా ఒకేలా ఉందని ఊహించవచ్చు.

గురజాడ అప్పారావు గారి ‘దిద్దుబాటు’ కథలోని కమలిని, శ్రీశ్రీ గారి ‘ఆనంద మందిరము’ కథలోని మాలతి తాము ప్రేమించే భర్తలను సంస్కరించుకోవడానికి ప్రయోగించిన అస్త్రాలు కోపతాపాలు కోసం అయితేకాదని స్పష్టంగా తెలుస్తుంది. వారిద్దరూ అత్యంత తెలివిగా ప్రణాళిక వేసుకుని ప్రదర్శించిన విధానంలో సారుప్యతలు వెతకొచ్చు. అందులో మొదటిది కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించడం. ఇద్దరు భర్తలూ తమ తప్పులను సులభంగా ఒప్పుకునే స్థితిలో లేకపోవడాన్ని గ్రహించి, ఇద్దరు భార్యలూ వారి జీవితాల్లో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడిందనే భ్రమను కల్పించారు. ఒక్కడే సగం వాళ్ళు విజయం సాధించేశారు. అయితే ఇద్దరూ ఒకే రకమైన ఆలోచన చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం. మరో అంశం, ఇద్దరి భార్యలలో ఒకే రకమైన సంస్కారవంతమైన ప్రవర్తన కనిపిస్తుంది. సాధారణంగా భర్తలు దారి తప్పినప్పుడు గృహాల్లో జరిగే పెద్ద పెద్ద గొడవలు, ఏడుపులు, నిందారోపణలు ఉంటాయి. అయితే ఇలాంటి వాటికి ఈ ఇద్దరు భార్యలూ దూరంగా ఉండటం విశేషం. మాలతి తన భర్తను ఎప్పుడూ కఠినంగా నిందించదు. భర్త తాగే మద్యం మోతాదును తానే స్వయంగా నియంత్రిస్తూ, అనుకూల సమయం కోసం వేచి చూసి తన ప్రణాళికను అమలు చేయడంలో ఫలితాన్ని పొందింది. అలాగే కమలిని కూడా భర్త అబద్ధాలు చెప్తున్నాడని తనకు పది రోజుల ముందే తెలిినా, అతనితో వాదించదు. భర్త తనవల్ల అబద్ధాలు ఆడవలసిన అవసరం లేకుండా ఉండేందుకే తాను తప్పుకుంటున్నట్లు ఎంతో గౌరవప్రదంగా లేఖ రాసి తన పన్నాగంలో పడేలా చేసుకోవడం ఆమెలో ఉన్న తెలివికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఈ ఇద్దరి నాటకాల ముఖ్య ఉద్దేశం భర్తలను శిక్షించడం కాదు, వారిలో అంతర్మథనాన్ని, పశ్చాత్తాపాన్ని కలిగించడం అని వారి ప్రణాళికలు విజయవంతమయ్యాక తెలుస్తుంది. అలాగే ఈ రెండు కథలో భర్తల చేత ప్రమాణాలు చేయించడం ఒకేవిధంగా ఉంటుంది. ఈ క్రమంలో వారి వారి తప్పులు తెలుసుకున్నాక, భార్యలిద్దరి నాటకాలూ భర్తల చేత శాశ్వతమైన మార్పు కోసం మనస్ఫూర్తిగా ప్రమాణాలు చేయించడంలో వంద శాతం విజయం సాధించాయని చెప్పవచ్చు. మన్మథరావు భార్య పాదాలను పట్టుకుని “ఇదిగో విశ్వేశ్వరుని సాక్షిగా చెబుతున్నాను. నేటి నుండి ఆనందమందిరమున మొగము చూపను! త్రాగుడు పూర్తిగా మానివేసెదను” (శ్రీనివాసరావు, శ్రీరంగం, పుట: 12) అని శపథం చేస్తే, గోపాలరావు కూడా తన సేవకుడైన రాముడితో “పంతులికి బుద్ధి వచ్చింది... మరి ఎన్నడూ చెవులపాట వినడు. గట్టి ఒట్లు వేసుకున్నాడు... ఎన్నడూ రాత్రిళ్లు ఇల్లు కదలడు” (చలసాని, పుట: 13) అని కమలినికి చెప్పి, ఆమెను వెంటనే తీసుకురమ్మని కోరతాడు. ఇది భర్తలలో వచ్చిన మార్పు.

7. సంసారాల పునరుద్ధరణ

భర్తలలో మార్పు రాగానే ఇద్దరు భార్యలూ తమ నాటకాన్ని ఎంతో ఆనందంగా ముగించి, సంసారాన్ని చక్కదిద్దుకోవడం ఈ కథలో చూడొచ్చు. మాలతి నవ్వుతూ తన భర్తతో ఇదంతా తన తంత్రమని, తమ సంపద అంతా భద్రంగానే ఉందని చెప్పి అతనిలో నూతనోత్సాహాన్ని నింపితే, కమలిని కూడా గోపాలరావు పశ్చాత్తాపపడి రాముడిని పంపించగానే తిరిగి వచ్చి, సంసారాన్ని దిద్దుబాటు చేసుకుంది.

8. కమలిని, మాలతి పాత్రల మధ్య భేదం

కథలో మాలతి ఆడిన నాటకం సుదీర్ఘమైనది, ప్రణాళికాబద్ధమైనది. ఆమె భర్తకు తెలియకుండా చాలా కాలం పాటు డబ్బును దాచిపెడుతూ, దాసీలను తొలగిస్తూ భర్త కళ్ళు తెరిపించడానికి ఒక నాటక రంగాన్ని సృష్టించింది. కమలిని ఆడిన నాటకం తక్షణమైనది, తీవ్రమైనది. ఆమె ఒకే ఒక్క రాత్రి లేఖ రాసి, ఇల్లు వదిలి వెళ్ళడం ద్వారా భర్తలో క్షణాల మీద మార్పును తీసుకువచ్చింది. ఈ ఒక్క భేదం మినహాయిస్తే రెండు పాత్రల మధ్య ఉన్న లక్ష్యం, దృక్పథం, వ్యక్తిత్వం ఒకే పోలికతో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.

9. భర్తల్లో వచ్చిన మార్పులు – సారూప్యత

కథల ముగింపులో భర్తల పశ్చాత్తాపం వారి అంతరాత్మను కదిలించేలా ఉంది. తమ తప్పులను గ్రహించిన తరుణంలో వారిద్దరిలో కలిగిన మార్పు, పశ్చాత్తాపాలు యావత్ సమాజాన్ని ఆలోచింపచేస్తాయి. మన్మథరావు తన మద్యపాన వ్యసనం వల్ల సర్వస్వం కోల్పోయి దరిద్రుడనయ్యాననే భ్రమలో ఉన్నప్పుడు, అతని ప్రాణస్నేహితుడైన జస్పంతరాయ్ మరణవార్త వింటాడు. అతని జ్ఞాపకార్థం నిర్మించ తలపెట్టిన స్మారక చిహ్నానికి చందా కూడా ఇవ్వలేని స్థితిలో తాను ఉన్నానని గ్రహించినప్పుడు అతని గుండె పగిలిపోతుంది. తన దురవస్థకు మద్యపానమే కారణమని గ్రహించి తీవ్ర దుఃఖానికి లోనవుతాడు. తరవాత భార్య మాలతి పాదాలపై పడి, “మాలతీ! ఓ మాలతీ! కష్టపరంపరల కారణమున నిదివఱకే మొద్దుడైన యీప్రాణిని నీ మృదుహృదయస్పర్శ కీలం చే భస్మీపటల మొనర్ప జూడకుము!” (శ్రీనివాసరావు, శ్రీరంగం, పుట: 12) అని విలపించాడు అంటే, అతనిలో వచ్చిన పశ్చాత్తాపం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక దిద్దుబాటు కథలో, సానుల పాటల వ్యామోహంలో పడి భార్యకు అబద్ధాలు చెబుతూ తిరిగే గోపాలరావుకు, ఇల్లు వదిలి వెళ్తూ కమలిని రాసిన ఉత్తరం ఒక పెద్ద కొరడా దెబ్బలా తగులుతుంది. ఆ ఉత్తరంలో తన భర్త అబద్ధాల నైజాన్ని కమలిని ఎండగట్టిన తీరు అతని మనస్సాక్షిని నిద్రలేపుతుంది. ఉత్తరం చదవడం పూర్తికాగానే గోపాలరావు తీవ్ర పశ్చాత్తాపంతో కుంగిపోతాడు. తన తప్పును తెలుసుకుని, తనను తాను “నేను పశువును... శుద్ధ పశువును” (చలసాని, పుట: 13) అని నిందించుకోవడంలోనే అతని పరివర్తన గమనించవచ్చు. అలాగే, కమలిని తన తప్పును సరిదిద్దిన తీరును ప్రశంసిస్తూ... “గుణవతి, విద్యావతి, వినయ సంపన్నురాలు, నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసింది” (చలసాని, పుట: 13) అని ముక్తకంఠంతో ఒప్పుకుని క్షమాపణలు కోరతాడు.

ఈ విధంగా, ఇద్దరు భర్తలూ తమ భార్యల వ్యక్తిత్వం ముందు తాము ఎంత చిన్నబోయామో గ్రహించి, నిజాయితీగా పశ్చాత్తాపపడ్డారు. మన్మథరావు మద్యం వదిలేస్తానని భార్య పాదాల వద్ద శపథం చేయగా, గోపాలరావు తన పరస్త్రీ వ్యామోహాన్ని, అబద్ధాలను వదిలివేస్తానని సేవకుడి ద్వారా శపథం చేసి భార్యను బతిమిలాడుకున్నాడు.

10. గురజాడ - శ్రీశ్రీల సంస్కరణ దృక్పథం

గురజాడ ‘దిద్దుబాటు’, శ్రీశ్రీ ‘ఆనంద మందిరం’ కథలు కుటుంబ వాతావరణానికి పరిమితమైన కథలు కావు. అవి తమ కాలం నాటి సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన విమర్శనాత్మక అస్త్రాలుగా దర్శనమిస్తాయి. ఈ రెండు కథల్లోని సంఘ సంస్కరణ దృక్పథాల మధ్య ఉన్న పోలికలను, వాటి వెనుక ఉన్న సామాజిక తాత్వికతను తులనాత్మకంగా విశ్లేషించినపుడు పలు విషయాలు ద్యోతకమవుతాయి.

11.1. సామాజిక రుగ్మతలపై పోరాటం

సామాజిక రుగ్మతలపై ప్రత్యక్ష సమరం ప్రధాన లక్ష్యంగా కనబడింది. రెండు కథలూ ఆనాటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న రెండు వేర్వేరు సామాజిక వ్యసనాలను ప్రధానాంశాలుగా తీసుకుని, వాటి నిర్మూలన కోసం పనిచేసాయి. ఆనాటి సమాజంలో పురుషులు వివాహబంధాన్ని విస్మరించి, ‘సానుల వ్యామోహం’ వైపు మళ్లడాన్ని గురజాడ తీవ్రంగా నిరసించి సంస్కరణకు పూనుకున్నారు. అయితే, ‘ఆనంద మందిరం’లో పట్టణాల్లోని ధనిక, చదువుకున్న యువత మద్యానికి బానిసై తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో శ్రీశ్రీ చూపించడమే కాకుండా, మద్యపానాన్ని నిషేధించడం తన సంస్కరణ దృక్పథంగా కథను నడపడం విశేషం.

11.2. గృహ సంస్కరణ

అన్నిటికంటే ముందు గృహ సంస్కరణే సంఘ సంస్కరణకు పునాది అని ఈ రెండు కథలూ తెలియజేశాయి. ఈ ఇద్దరు రచయితల సంస్కరణ దృక్పథంలో ఒక గొప్ప పోలిక ఉంది. అది ‘వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు రాకుండా, సంఘంలో మార్పు రాదు. గృహ సంస్కరణే సంఘ సంస్కరణకు మొదటి అడుగు’ వీరి కథా చిత్రణను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత, నైతిక ప్రవర్తన లేకపోతే సమాజం బాగుపడదని గురజాడ నమ్మారు. భర్త అబద్ధాలు విడిచిపెట్టి, గృహోన్ముఖుడై భార్యను గౌరవించినప్పుడే నిజమైన సంస్కరణ జరుగుతుందని గోపాలరావు మార్పు ద్వారా నిరూపించారు. ఇక వ్యక్తిగత పరివర్తన ఏ విధంగా సామాజిక పరివర్తనగా మారుతుందో శ్రీశ్రీ అద్భుతంగా చూపించారు. ఒకప్పుడు తాగుబోతుల స్థావరంగా ఏది అయితే ఉండేదో, అదే భవనం మద్యపాన నిషేధ సభలు జరుపుకునే వేదికగా మారడం గృహ సంస్కరణ సామాజిక ఉద్యమంగా ఎదిగిన తీరుకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.

11.3. మహిళా సాధికారత

ఈ కథల ఆధారంగా, స్త్రీలను ‘సంస్కర్తలుగా’ నిలబెట్టడం ఈ రచయితల వంతుగా గమనించవచ్చు. ఆనాటి సంస్కరణోద్యమాల్లో పురుషులు స్త్రీల కోసం పోరాడేవారు. కానీ, ఈ ఇద్దరు రచయితలూ స్త్రీలే స్వయంగా తమ జీవితాలను, భర్తలను సంస్కరించుకునే చైతన్యాన్ని ప్రదర్శించగలరని చాటి చెప్పడం విశేషం. గురజాడ కమలినిని అత్యంత స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీగా చూపించడమే కాకుండా, భర్త తప్పులను ప్రశ్నిస్తూ ఆమె రాసిన ఉత్తరం ఆనాటి పురుషాధిక్యతపై ఒక తిరుగుబాటుగా చూపించారు. విద్యనేర్చిన స్త్రీ సృష్టిలోనే అత్యున్నతమైనదని, ఆమె భర్తకు దాసి కాదు ‘బెటర్ హాఫ్’ అని గురజాడ ఈ కథ ద్వారా ప్రతిపాదించారు. అలాగే, మాలతి తన భర్త పతనాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ, అతనిని రక్షించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఆమె నిరసన కోపతాపాలతో కూడినది కాదు, చతురతతో కూడినది. భర్తకు తెలియకుండా ఆస్తిని కాపాడి, అవసరమైన సమయంలో అతని కళ్లు తెరిపించి కుటుంబ సంస్కర్తగా నిలుస్తుంది.

11.4. పరివర్తన, శాశ్వత మార్పు

ఉపదేశాలు, చట్టాలు లేదా దండనల కంటే మనుషులలో కలిగే అంతరాత్మ ప్రబోధం ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని ఇద్దరూ విశ్వసించారు. కమలిని రాసిన ఉత్తరం చదివి గోపాలరావు బాహ్య ఒత్తిడి వల్ల కాకుండా, తన మనస్సాక్షి నిలదీయడం వల్ల తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడటంతో అతనిలో అంతర్గత సంస్కరణ మొదలవుతుంది. మన్మథరావు కూడా తన దరిద్ర స్థితిని గ్రహించి, కుంగిపోయి, స్వయంగా పశ్చాత్తాపంతో మనస్సాక్షికి లొంగిపోయాడు.

12. మన్మథరావు ప్రసంగం

ఇక ప్రత్యేకించి చెప్పుకోవలసింది ‘ఆనందమందిరం’ కథలోని మన్మథరావు ప్రసంగం. మద్యపాన నిషేధంపై ఈ పాత్ర చేసిన ప్రసంగం ఆలోచన కలిగించేలా శ్రద్ధ తీసుకున్నారు శ్రీశ్రీ. స్వీయ పతనాన్ని అంగీకరిస్తూ, “సభ్యులారా! ఈ రోజు మనమంతా సమావేశమైన ఈ స్థలం నాకు కొత్తది కాదు. ఒకప్పుడు నేను ఇక్కడే మద్యదేవతకు పూర్తిగా దాసుడినై నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. నా స్నేహితుల ప్రోత్సాహంతో మొదటి చుక్క తాగిన నేను, క్రమంగా నా బుద్ధిని, వివేకాన్ని కోల్పోయాను. గొప్ప ఉద్యోగం, అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్న నేను ఈ మద్యం మహమ్మారి వల్ల నా ఉద్యోగాన్ని కోల్పోయాను, నా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాను. మద్యం ఎలా మనిషిని పశువుగా మారుస్తుందో చెప్పడానికి నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.” (శ్రీనివాసరావు, శ్రీరంగం, పుట: 14) అని మాట్లాడతాడు. ఇలా ఈ పాత్ర చేత మాట్లాడించి, ఆనాటి సమాజంలో మద్యపానం వల్ల ఎదురయ్యే సమస్యలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించి సమాజంలో, ముఖ్యగా పురుషులలో మార్పుతీసుకొచ్చారు శ్రీశ్రీ.

13. కాలం నాటి పరిస్థితులు

1910లో గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’, 1926లో శ్రీశ్రీ ‘ఆనంద మందిరం’ రాయబడిన కాలం నాటి ఆంధ్రదేశం, భారతీయ సమాజంలో చాలా బలంగా సంఘ సంస్కరణోద్యమాలు సాగుతున్నాయి. ఆనాటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న రెండు ప్రధాన సామాజిక రుగ్మతలైన వేశ్యాలోలత్వం, మద్యపాన వ్యసనాలపై ఈ రెండు కథలు సామాజిక విమర్శను గుప్పించాయి. ఆనాటి రోజుల్లో సమాజంలో చదువుకున్న, ఐశ్వర్యవంతులైన పురుషులు వేశ్యల ఇళ్లకు వెళ్లడం, వారి పాటల కచేరీలు వినడం ఒక గొప్ప ఫ్యాషన్‌గా, సామాజిక హోదాగా భావించేవారు. ఆరోజుల్లో భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నా పట్టించుకోకుండా, సానుల సాంగత్యానికి ప్రాధాన్యతనిచ్చేవారు. అంతేకాదు, ఆనాటి పురుషులు తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సమాజ సేవను, ఆధునిక సమావేశాలను ముసుగుగా వాడుకునేవారని ఈ కథ స్పష్టం చేసింది. వేశ్యాలోలత్వాన్ని నిరసిస్తూ సాగిన ‘కన్యాశుల్కం’ వంటి రచనల బాటలోనే గురజాడ ‘దిద్దుబాటు’లో కూడా దీనిని తీవ్రంగా ఖండించారు.

ఇక శ్రీశ్రీ గారి ‘ఆనంద మందిరం’ కథ రాయబడే నాటికి, పాశ్చాత్య నాగరికత ప్రభావంతో పట్టణాలలోని ధనిక, చదువుకున్న యువత మద్యానికి ఎంతగా బానిసలవుతున్నారో చెప్పబడింది. ఆ కాలంలో చదువుకున్న ఉన్నత వర్గాల వారు మద్యాన్ని ఒక సామాజిక అలవాటుగా మార్చుకున్నారు. మద్యం తాగకపోతే నాగరికత లేని మొద్దులుగా జమకట్టేవారు. మన్మథరావును అతని మిత్రులు ‘మద్య సేవనం చేయనివాడు మనుజుడే కాదని’ బలవంతంగా తాగిస్తారు. ఈ కథలో భారతదేశానికి విదేశాల నుండి దిగుమతి చేయబడిన విలువైన విదేశీ మద్యం ఉన్నత వర్గాల చేతుల్లో విచ్చలవిడిగా సాగిపోతుండేవని పేర్కొనబడింది. మద్యం వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా, ఉద్యోగాలు ఊడిపోయేలా, సేవకులు ఇల్లు విడిచి వెళ్లేలా కుటుంబాలను రోడ్డున పడేసేదని ఈ కథలో చెప్పబడింది.

14. స్త్రీ చైతన్యం, సంస్కరణోద్యమ ప్రభావం

ఈ రెండు కథలూ ఆ కాలంలో నడిచిన సామాజిక ఉద్యమాల ప్రతిరూపాలే. గురజాడ కమలిని పాత్ర ద్వారా వేశ్యా నిరోధక సందేశాన్ని ఇస్తూ, భర్తతో ‘మరి ఎన్నడూ చెవులపాట వినను’ అని ఒట్టు వేయిస్తే, శ్రీశ్రీ మాలతి పాత్ర ద్వారా మద్యపాన నిషేధ ప్రచారాన్ని చేస్తూ, చివరకు ఆనంద మందిరాన్నే ‘మద్యపాన నిషేధ సభ’ గా మార్చి, ప్రజల చేత మద్యపానాన్ని మానిపించారు. మొత్తానికి ఈ రెండు కథలు ఆనాటి సమాజంలో వేళ్లూనుకున్న వ్యసనాలపై స్త్రీల చైతన్యాన్ని అస్త్రంగా ప్రయోగించి విజయం సాధించిన తీరును అద్భుతంగా చిత్రించారు అన్నది వాస్తవం.

ఉపసంహారం

గురజాడ అప్పారావు గారి ‘దిద్దుబాటు’, శ్రీశ్రీ గారి ‘ఆనంద మందిరం’ కథలను తులనాత్మకంగా అధ్యయనం చేయడం ద్వారా ఒక స్పష్టమైన, ప్రగతిశీలమైన సామాజిక మార్పును గమనించగలం. అలాగే ఈ అధ్యయనం ద్వారా నేటి సమాజానికి కూడా వర్తించే ఎన్నో విలువైన పాఠాలను, అంశాలను తెలుసుకోవచ్చు.

  • ఏదైనా ఒక సామాజిక దురాచారాన్ని లేదా వ్యసనాన్ని చట్టాల ద్వారా గానీ, కఠినమైన శిక్షల ద్వారా గానీ అణచివేయడం కంటే వ్యక్తిగత పశ్చాత్తాపం, కుటుంబ పరిధిలో జరిగే దిద్దుబాటు ద్వారానే శాశ్వతంగా నిర్మూలించవచ్చునని ఈ కథలు నిరూపించాయి.
  • స్త్రీలు సామాజిక రుగ్మతలకు బలయ్యే నిస్సహాయ బాధితులు కాదని, తమ వివేకం, ఓర్పు, సమయస్ఫూర్తితో భర్తలను, తద్వారా సమాజాన్ని సంస్కరించే శక్తివంతమైన సంస్కర్తలుగా నిలబడగలరని ఈ కథలు చాటిచెప్పాయి.
  • హృదయ పరివర్తనయే శాశ్వత మార్పుకు దారి అని, బెదిరింపుల కంటే మనిషి తన తప్పును తానే స్వయంగా గ్రహించి పశ్చాత్తాపపడినప్పుడే నిజమైన మార్పు వస్తుందని ఈ కథలు తెలియజేశాయి.
  • భర్తలు దారి తప్పినప్పుడు గృహాల్లో గొడవలు పెట్టుకోవడం, కోప్పడటం కంటే సంస్కారవంతంగా, సాలోచనగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి వారి కళ్లు తెరిపించవచ్చని భార్యల పాత్రలు నిరూపించాయి.
  • వ్యక్తిగత ప్రవర్తన బాగుపడి కుటుంబాలు చక్కదిద్దబడినప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఈ కథలు వెల్లడించాయి.
  • భార్య భర్తకు లొంగి ఉండే దాసి కాదు, సంసారాన్ని దిద్దే అర్ధాంగి అని ఈ కథలు స్పష్టం చేశాయి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ఈశ్వరరావు,శెట్టి,(పరిష్కర్త) గురజాడ రచనలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ,
  2. ప్రసాద్ చలసాని, శ్రీశ్రీ కథలు, అనువాద కథలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ,
  3. శ్రీరంగం శ్రీనివాసరావు, చరమరాత్రి, విరసం ప్రచురణ, 1999

పత్రికలు:

  1. కథాకేళి మాసపత్రిక, జనవరి, 2009
  2. లలిత మాసపత్రిక, డిశెంబరు, 1926

వెబ్‌సైట్స్:

  1. కథానిలయం డాట్ కామ్, వీక్షించిన తేది: ఆగస్టు, 26, 2026

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal