headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

9. దాసత్రయం కీర్తనలు: మానసబోధ

కొలుకుల రజిత

తెలుగు అధ్యాపకులు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 7569856191, Email: kolukularajitha@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 10.04.2025        ఎంపిక (D.O.A): 25.04.2025        ప్రచురణ (D.O.P): 01.05.2025


వ్యాససంగ్రహం:

మన తెలంగాణ ప్రాచీన సంకీర్తనకారుల్లో చెప్పుకోదగిన వారు రాకమచర్ల వెంకట దాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు. వీరిని 'దాసత్రయం' అని కూడా అంటారు. పాలమూరు జిల్లాలో హనుమద్దాసత్రయం అనే ముగ్గురు సంకీర్తన కారులున్నారు. వారు రాకమచర్ల వెంకట దాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు.ఈ ముగ్గురు సంకీర్తనకారులు కూడా భక్తి, వైరాగ్యం, మానవీయ విలువలు, సమాజ పోకడలు తెలిపే వస్తు వైవిధ్యం ఉన్న కీర్తనలు రచించారు. ఈ వ్యాసంలో కేవలం వీరు రచించిన ‘మానస బోధ’ కీర్తనలను మాత్రమే అనుశీలిస్తాను. ఈ వ్యాస నిర్మాణానికి రాకమచర్ల వెంకటదాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు కీర్తనలు లభిస్తున్న కీర్తన సంపుటులు: మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు 1990, రాకమచర్ల వెంకట దాసు కీర్తనలు 2002, శ్రీ వేపూరి హనుమద్దాసు రామ కీర్తనలు 2013, ఆర్. రాంబాబు సిద్దాంత గ్రంథం మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు - ఒక పరిశీలన, భాస్కర యోగి రచించిన పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన అనే గ్రంథాల్లో పై (ముగ్గురి) దాసత్రయం వారి మానసబోధ కీర్తనలున్నాయి. వాటి ఆధారంగా ఈ వ్యాసాన్ని కొనసాగిస్తాను. పరిశోధనా పద్ధతి: విశ్లేషణా పద్ధతి. పరిశోధన ప్రణాళిక : దాసత్రయ పరిచయం, దాస్యభక్తి లక్షణం, రాకమచర్ల వెంకట దాసు, మన్నెంకొండ హనుమద్దాసు వేపూరి హనుమద్దాసు మానస భోద కీర్తనలు.

Keywords: మానసబోధ కీర్తనలు, తత్త్వాలు, సంకీర్తనాకారులు, దాస్య భక్తి, ఆభోగం

1. ప్రవేశిక

సనాతన సంప్రదాయంలో మనకందిన జ్ఞాన సంపదలో సంకీర్తన సాహిత్యం ఒకటి. భౌతికంగా భోగాలతో మగ్గిన మానవులకు, వారి మనసులకు బోధ (Teach) చేస్తున్నట్లుగా కొన్ని  సంకీర్తనలున్నాయి. అవి మానవాళికి మంచి మాటను చూపే మార్గదర్శకంగా ఉన్నాయి.

ఎంతోమంది సంకీర్తనకారులు తమ భావాలకు భక్తిని జోడించి మంచి మాటల్ని సుగంధ భరితంగా కీర్తనల్లో పొందుపరిచారు. మంచి గంధం లాంటి భక్తిని మనసుకు పట్టించేలా వారి సంకీర్తనలున్నాయి. నిజానికి మన సంకీర్తన కారులందరూ భారతీయ సనాతన సంప్రదాయానికి ధర్మ కల్ప వృక్ష ఫలాలు. మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ మంచి ఉపదేశాలను తమ కీర్తనల్లో గానం చేశారు.
సాధారణంగా అందరూ చేతులు జోడించి  భగవంతునికి నమస్కరిస్తే ఈ సంకీర్తనాకారులు వారి కీర్తనలను కరములుగా చేసుకునే భగవంతునికి వందనమర్పించారు.  అలాంటి కోవలోకి చెందిన  తెలంగాణ ప్రాచీన సంకీర్తనకారులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకే జిల్లాకి చెందిన సంకీర్తనాకారులు   'దాసత్రయం'వారు కూడ చెప్పుకోదగినవారు.

2. దాసత్రయ పరిచయం

సంకీర్తన సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన తెలంగాణ సంకీర్తనాకారులు  రాకమచర్ల వెంకటదాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు. వీరిని 'దాసత్రయం' అంటారు.వీరు పాలమూరు ప్రాంతానికి చెందిన వారు. పాలమూరు జిల్లాలో హనుమద్దాసత్రయం అనే ముగ్గురు సంకీర్తనకారులున్నారు. వారు రాకమచర్ల వెంకట దాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు.(పి భాస్కర యోగి, పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం - ఒక పరిశీలన, 2011, పుట .60). పి భాస్కర యోగి పాలమూరు జిల్లా వాగ్గేయకారులు గ్రంథం ఆధారంగా:  రాకమచర్ల వెంకటదాసు మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట తాలూకాలోని పెద్దాపురంలో అనంతమ్మ, పురుషోత్తమరావు దంపతులకు క్రీ.శ. 1808లో జన్మించారు.  మన్నెంకొండ హనుమద్దాసు పాలమూరు జిల్లాలోని మన్నెంకొండ ప్రాంతంలో  క్రీ.శ.1814లో కృష్ణాంబ, వెంకయ్య దంపతులకు జన్మించారు. వేపూరు హనుమద్దాసు నాగర్ కర్నూల్ తాలూకాలోని పాలెం గ్రామంలో బాలమ్మ ,అచ్చన్న దంపతులకు జన్మించారు. ఒకే జిల్లాకి చెందిన వీరు 19వ శతాబ్దంలో సంకీర్తనలను గానం చేసిన వాగ్గేయకారులు.  సంకీర్తన సాహిత్యంలో పేరుగాంచినవారు. భగవంతుని ప్రశస్తిని చాటి చెప్పడానికి దాసులుగా మారిన సేవకులు వీరు.

3. దాస్య భక్తి లక్షణం

నవవిధ భక్తి మార్గాలయిన  కీర్తనం, శ్రవణం, స్మరణ, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనాలలో - భక్తుడు భగవంతుని పట్ల  సేవా భావాన్ని చూపిస్తూ అన్ని  భక్తి మార్గాల్లో దాస్య భక్తిని ఎంచుకుంటాడు.

"దాస్యం కర్మార్పణం తస్య కైంకర్య మపి సర్వదా" 183
"కర్మస్వాభావికం భద్రం జపధ్యానార్చనాది చ
ఇతీదం ద్వివిధం కృష్ణే వైష్ణవైర్దాస్య మర్పితమ్"   185

స్వాభావికమైన శుభకర్మ జప ధ్యానాధులు ఈ రెండు విధములగు కర్మలు వైష్ణవులచే కృష్ణునకు సమర్పింపబడినచో దాస్యమని చెప్పబడును. (శ్రీల రూపగోస్వామి పాదులు, శ్రీభక్తి రసామృతసింధువు, 1985,పుట.73-74 ).

యథా పురాణాన్తరే:

"మానసేనోపచారేణ పరిచర్య హరిం సదా
పరే వాజ్మనసా గమ్యం తం సాక్షాత్ప్రతిదిపేదిరే"182

దాస్య భక్తి భామును గూర్చి మరియొక పురాణమిట్లు చెప్పినది:- మానసోపచారములలో నిరంతరము శ్రీహరిని సేవించి కొందరు భక్తులు వాక్కునకు, మనస్సునకు అగోచరుడగు శ్రీహరిని సాక్షాత్తుగా దర్శింపగలిగిరి.(శ్రీలరూపగోస్వామి పాదులు, శ్రీభక్తి రసామృతసింధువు, 1985,పుట.72).

భక్తుడు భగవంతుని పొందడానికి దాసుడుగా మారతాడు. ఈ దాస్య భక్తితో భగవంతుణ్ణి తమ యజమానిగా భావించుకుంటూ భక్తుడు  ఆ స్వామికి సేవకులమని భావిస్తాడు. ఆ భావంతో  దాస్యత్వం చేయడానికి మార్గాలుగా పూజ,  జపము, ధ్యానము ఇవే కాకుండా కీర్తించడం కూడా ఒకటని పై నిర్వచనాల ఆధారంగా తెలుస్తుంది. భక్తి రసామృత సింధువులో వీటిని మనసుతో చేసే ఉపచారములని చెబుతున్నారు.

మానవుని ఆలోచనలు సహజంగా బయటి ప్రపంచానికి సంబంధించి ఉంటాయి. అట్లాగే మానవులు ఆచరించే కర్మలన్నీ కూడా బయట ప్రపంచంలోనే  కనిపిస్తాయి. కానీ, వాటికి కారణమైన భావాలు మాత్రం ఆంతర్యంలో మెదులుతూ ఉంటాయి. అలాంటి అంతరంగాన్ని పవిత్రంగా ఉంచడానికి పూర్వ సంకీర్తన కారులు తమ కీర్తనల్లో వ్యక్తం చేశారు.  ఉదాహరణకు అన్నమయ్య సంకీర్తన,

"భావము లోనా బాహ్యము నందును
గోవింద గోవింద యని కొలువవో మనసా"

అంటూ మనసును పవిత్రంగా పదిల పరచుకోవడానికి మానస బోధ కీర్తనలు ఉపయోగపడతాయి.  పూర్వ సంకీర్తనాకారులు  తమను, శుద్ధి చేసుకోవడానికి వారి వారి మనస్సుల్ని పవిత్రం చేసుకోవడానికి కీర్తనలు పాడుకున్నారు. అవి నేటి తరానికి ప్రేరణ కలిగించేలా, మానసిక ఉల్లాసాన్ని పొందేలా ఉన్నాయి. అలాంటి భావాలతో ‘దాసత్రయం’సంకీర్తనలు కూడా ఉన్నాయి. కీర్తన లక్షణాన్ని కలిగి ఉన్న దాసత్రయం సంకీర్తనల్లో మనసుకు బోధ చేస్తున్న కీర్తనలు ప్రత్యేకమైనవి. పల్లవి, చరణము, సంకీర్తన కారుడి నామముద్ర ఇవి  కీర్తనకుండవలసిన లక్షణాలు. తాళ్ళపాక చిన్న తిరుమలాచార్యులు  తెలుగులో  రాసిన సంకీర్తన లక్షణం ఆధారంగా-

‘మొదలు ఉద్గ్రహము రెండవ
యది మేళాపము తృతీయమగుధ్రువమట పై
గదిసిన యదియంతరమా
తుదినాభోగంబు ముద్రతో జెలువొందున్’ (తాళ్లపాక, చిన్న తిరుమలాచార్యులు, 1935, సంకీర్తన లక్షణం వాల్యూమ్ -1, పుట సంఖ్య144).

ఉద్గ్రహము: ప్రబంధపు(కీర్తన) మొదటి భాగం ఆరంభం దీనినే పల్లవి అని  కూడా అంటారు
ధ్రువము: ప్రభంధపు(కీర్తన) ముగింపు.  చివరి చరణం
మేళాపము: ఉద్గ్రహ ధ్రువాలను కలిపేది మేళాపము అంటే  పల్లవి, చివరి చరణాలను కలిపేది. ఇది మధ్య చరణం.
ఆభోగము: ప్రబంధ(కీర్తన ) రచయిత నామముద్రతో , లేదా  అంకితమిచ్చే దేవత నామముద్ర కలిసిన చివరి భాగం.

తాళ్లపాక చిన్నన్న సంకీర్తన లక్షణంలో ఉన్న పై నాలుగు లక్షణాలు దాస త్రయం మానస బోధ కీర్తనల్లో ఉన్నాయి. ఈనాడు దాసత్రయం వారి కీర్తనలే ఇవి అనడానికి ‘ఆభోగం’ అంటే, సంకీర్తన కారుడి నామముద్ర ప్రమాణం.

దాసత్రయంగా పేరుగాంచిన ఈ ముగ్గురు సంకీర్తనాకారులు కూడా భగవంతుని కృప  పొందడానికి, భగవంతుణ్ణి కీర్తిస్తూ, భక్తి, వైరాగ్యం,మానవీయ విలువలు, సమాజ పోకడలు తెలిపే వస్తు వైవిధ్యం ఉన్న కీర్తనలు రచించారు.వాటితో పాటు  మనసును స్థిర పరిచే విధంగా  కీర్తనలు రాశారు(పాడారు). వీరి సంకీర్తనల వల్ల ఎంతో మంది పాఠకులు వారి మనస్సును ఆహ్లాదపరచుకొని ,ప్రేరణ పొందుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.అయితే, ‘మనసా’అనే సంబోధన కొన్ని కీర్తనల్లో పల్లవిలో ఉంటే మరికొన్ని కీర్తనల్లో చరణంలోఉంది.  ఈ వ్యాసంలో కేవలం వీరు రచించిన ‘మానస బోధ’  కీర్తనలను మాత్రమే అనుశీలిస్తాను.

4. రాకమచెర్ల వెంకటదాసు మానస బోధ కీర్తనలు

ఏక తాళం

చ :     తను తాపములు మాని - ధైర్యంబు లోబూను మనవే - మాట వినవే
అనయమ్ము అద్వైత - మును జెందు తెరువిది సుమ్మి మేలుకొమ్మి
కనికరమ్మున జూచి శౌరిని గలసి పరవశ మెల్ల మానెవె
ఒనర రాకమచర్ల నిలయుని ఒక రహస్యము నందు గనవే..... (వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు పుట .1)

మనసా! శరీరానికి వచ్చే బాధలకు సమస్యలకు దిగులు చెంది అధైర్య పడకు అంటూ మనసుకు, తన మానసిక స్థితికి ధైర్యం నూరిపోస్తున్నాడు. సాధారణంగా ప్రతీ మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఈ కీర్తన కనిపిస్తుంది. జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా దాటుకుంటూ మనసును, శరీరాన్ని రెంటిని సమానంగా తీసుకుంటూ ఎంతటి కష్టం వచ్చినా ధైర్యం వీడకు, నా మాట విను మనసా! అంటూ బోధ చేస్తూనే, అద్వైత రూపుడైన భగవంతుణ్ణి చేరుకో అంటున్నాడు. నిస్సారమైన ప్రపంచంలో పడి పరవశిస్తూ కరుణామూర్తి అయినా పరమాత్మను దూరం చేసుకోకు మనసా అంటూ మనసుకు శిక్షణ ఇస్తున్నాడు.

అటతాళం  

ప : మనసా శ్రీహరిని పిలవవమ్మ మనవి చే కొమ్మ
    అను వైరాగ్యంబున మోదింపుచు
    వనజ దళాక్షుని వశముగ జేసుక. ..  (వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు - పుట .179 )

ఈ సంకీర్తనకారుడు ‘ఓ మనసా శ్రీ హరిని పిలువు’అని తన మనసుతో భగవంతుడిని హృదయ పూర్వకంగా ఆహ్వానించమంటున్నాడు. భగవంతునిపై భక్తిని మనం బయట చూపించడం కాదు మన హృదయపూర్వకంగా మన మనసుతో భగవంతుడిని పిలవాలని చెప్పే ఒక భావ పూర్వక పిలుపు ఇది. అలా పిలుస్తూ ఓ మనసా ! ఆయనతో మనవిని వినిపించు అంటున్నాడు. అంటే, మన హృదయంలోని ప్రార్థనను, విన్నపాన్ని ఆయనకు వినిపించు అని చెబుతూ తన మనసును భగవంతుని వైపు మరలేలా చేస్తున్నాడు. పద్మ రేకుల వంటి కన్నులు గల భగవంతుణ్ణి తనవశం చేసుకోమ్మని మనసుకు చెబుతున్నాడు. ఇక్కడ మనిషి అనేక పనులను వివిధ రకాలుగా చేస్తూ ఉండిన బుద్ధిలో, మనసులో ఆ పనుల పట్ల ఎలాంటి ఆలోచన లేకుండా భగవంతుడే పరమగతిగా భావించి మనసు నడుచుకునేలా చెబుతున్నాడు.

చ :    హరి తోడనాదు మనవి దెలుపు నా మాట నిలుపు
        కరిరాజ వరదు నన్ను గలుపు
        స్థిర చిత్తంబున -  బొరయుచు సరగున
        నరహరి నిప్పుడె  దరిశన మిమ్మని..

మనసా హరితో నా మనవి తెలుపు అంటున్నాడు.  నా కోరికను, నా అభ్యర్థనను ఆ శ్రీహరికి తెలుపు కరివరదుడు ఆయన. ఆ కరిని ఏలిన వాడితో నన్ను కలుపు. మొత్తానికి ఆ శ్రీమన్నారాయణునితో నా అభ్యర్థన చెప్పు. నా విన్నపం వివరించు. అని భగవంతునికి తనకు మధ్య ఈ సంకీర్తన కారుడు మనసును ఒక మీడియేటర్ గా వాడుకుంటూ మనసును పరమాత్ముని చెంతకు పరుగు పెట్టిస్తున్నాడు. తన చిత్తంలో నిరాశ ఆందోళన లేకుండా, సడిచప్పుడు లేకుండా, హరిని గురించే ఆలోచించే బుద్ధిని, మనసును ఇమ్మని ఈ సంకీర్తన కారుడి అభ్యర్థన.  చివరికి తను మనసుతో భగవంతునికి సందేశం పంపుతూ, దర్శనం ఇవ్వమంటున్నాడు . ఆ విష్ణువు ప్రతిబింబంలో మనసుని ముడి పెట్టుకొని ఉండాలని మనసుకు సూచన చేస్తున్నాడు. దర్శనం అంటే ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూడటం. ఆయన్ని చూసే దృష్టి మనకు ఉండాలి.  అని మనసుతో భగవంతుడే శాశ్వతమైన వాడని పరమ శాంతి కోసం ఆయన్ని సేవించడం తప్ప మరో మార్గం లేదని ఈ సంకీర్తనకారుడు బోధ చేస్తున్నాడు.

అటతాళం

ప:  ఆనంద మొందవే మనసా
    అనుమాన మెందుకే మనసా
    ధీనిధియగు వసుదేవ కుమారుని
  పూని చిత్తమున - ధ్యానము సేయుచు.. (వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2014- శెట్టి బుక్ షెల్లర్-ప్రింటింగ్ హైదరాబాద్, పుట.62 ).

ఈ కీర్తనలో రాకమచర్ల వెంకట దాసు మనసుకి ధైర్యాన్ని చెబుతున్నాడు. ధైర్యానికి సంపద అయిన వాసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడిని నీవుగా చేసుకొని, కాదు కాదు నీవే తానైపో అనే బోధ చేస్తున్నాడు.

చ . శ్రీకరమైనది   మనసా
    చెలువొంది నుతియించు మనసా
    చేకొని రాకమ - చెర్ల నివసుడు
    ప్రాకటముగ పరి - పాలన సేయగా.

శుభ పరిణామాలను కలిగించే భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించమంటూ రాకమచర్ల వెంకట దాసు తన మనసుకు భగవంతుని నామాన్ని పట్టిస్తున్నాడు. చివరికి తన 'ఆభోగం' (నామముద్ర)తో ప్రతి కీర్తనలో ముగించాడు.

5. మన్నెంకొండ హనుమద్దాసు మానస బోధ కీర్తనలు

ఏక తాళం 

ప:   రాముడే దైవాము తెలుయు సుమీ! పరం
  ధాముని సన్నిధి గలయు సుమీ
చ:    హరినామ కీర్తన మరువాకుమీ  దూ
      స్తరమైన మార్గము నడువాకుమీ దుష్ట
  నరుల సంగతి నోటనుడు వాకుమీ యితర
      పర వార్తలకు నెల్ల పరువెత్త బోక శ్రీ...
చ :   మనసు సంకల్పము బాయుసుమీ యను
      దినము భద్రాదీశు గనుము సుమీ  యీ
      తనువు దైవా దీనంసేయు సుమీ  శ్రీ
     హనుమద్దాసుని పాలి ఘన పరంధాముడౌ ( మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు 1990,  పుట. 49).

మనసుకు ప్రేరణ కల్పిస్తున్న కీర్తన ఇది. నిరంతరం భగవన్ నామ స్మరణ మరువకు దుస్తరమైన మార్గం అంటే తప్పుతోవ పట్టకు అంటూ మనసుకు హెచ్చరిక చేస్తున్నాడు మన్నెంకొండ హనుమద్దాసు. మనసుకు మంచి మార్గానికి ప్రేరణ కలిగిస్తూనే, పెడదోవ పట్టకుండా హెచ్చరిస్తున్నాడు.  తనను తాను పవిత్రంగా మార్చుకోవడానికి ఈ సంకీర్తన కారుడు ఇతరుల గురించి ముఖ్యంగా చెడు ఆలోచనలు గల వ్యక్తుల గురించి మాట్లాడకు అని సూచన చేస్తున్నాడు.  సాధారణంగా ఇతరుల మంచి, చెడులను గురించి మాట్లాడటం మానవ నైజం. కానీ, ఈ సంకీర్తనాకారుడు ఇతరుల గురించి మాట్లాడటం వల్ల వారి స్వభావం మనపై కూడా ప్రభావం చూపుతుందని మనసుకి చింతింప చేస్తున్నాడు. తనను తాను పరిసరాల చెడు ప్రభావాలనుండి కాపాడుకోవడానికి మంచి మార్గంలో తీసుకెళ్లేందుకు మనసుకు  ఈ సంకీర్తన ద్వారా ప్రేరణ  కల్పిస్తున్నాడు.  పరుల వార్తలు అంటే ఇతరుల విషయాలు అనవసరమని అవి మన ప్రశాంతతను దూరం చేస్తాయని వాటికి దూరంగా ఉండి ధర్మజీవనం గడపాలని ఈ సంకీర్తనకారుడి మానస భోద కీర్తన.

ఏక తాళం 

ప : శ్రీరామ భజరే మనసా
    తారకనామ సుధామయ రూపం
    దాశరథం సౌందర్య కలాపం మనసా (మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు 1990, పేజి.20)

మనసులో రాముని నిలుపుకొని కీర్తిస్తూ ఆ రాముని స్మరణలోనే కాలం గడుపమని  చెబుతున్న కీర్తన. అమృతమయమైన నామం రామనామం. మనసుకు ఉల్లాసం ఇచ్చేది. అంటూ, భగవన్ నామ వైభవాన్ని మనసుకు పట్టిస్తున్న కీర్తన ఇది.

చ: సాధు సజ్జనసేవ సల్పు సుమీ గురు
  బోధానంద మాలించు సుమీ మది
  క్రోధ వికారము దృంచుసుమీ  హరి
  శ్రీ ధార గోవింద సీతారామ శ్రీ...

మనసా సద్గుణాలే సంపదగా  కలిగిన గురువుల సేవ చేయడం వల్ల మనం వ్యక్తిగత అభివృద్ధిని సాధించవచ్చు అనే కోణంలో ఈ సంకీర్తనకారుడు మనసుకు మంచి లక్షణాలు అవగతం చేస్తున్నాడు.  గురువు బోధన ఆలకించి మనం ఉన్నతి  సాధించాలి అంటూ దానివల్ల మనసులో, మనలో క్రోదం అంటే, అతి కోపం దానివల్ల ఏర్పడేవి. మనసులో ఉన్న కోపము దానివల్ల వచ్చే వికారాలు అరికట్టాలి‌  ఆ లక్షణాల్ని పారద్రోలాలి అంటూ మనసుకి గైడ్ చేస్తున్న కీర్తన ఇది.

6. వేపూరి హనుమద్దాసు మానస బోధ కీర్తనలు

అట తాళం
       ప :    కామాది గుణములు విడుతమా - -సీతా
              రాముని ఆజ్ఞలో నడుతమా
      చ:      చాలగా హరిసేవ జేతమా
              మల్లెపూల దండలు మెడన వేతమా
      చ :      ఆత్మజ్ఞానము నొంది తలుతమా
                వేపూరు హనుమంత వరదూని గొలుతమా.. (శ్రీ వేపూరి హనుమద్దాసు, హనుమద్దాసు రామ కీర్తనలు, 2013 పుట.100).

వేపూరి హనుమద్దాసు మనసా! కామాదులు వదిలేద్దామా? తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఇవి వ్యక్తి స్వభావాన్ని, సంబంధాన్ని, మనోబలాన్ని ప్రభావితం చేసేవి . కామ, క్రోధ,లోభ ,మద, మోహ మాత్సర్యాలు వీటిని సమూలంగా మన నుంచి దూరం చేద్దామా మనసా! అని ఈ సంకీర్తనకారుడి ఉద్దేశం .ఈ అరిషట్ వర్గాలు సుఖదుఃఖాలకు హేతువవుతాయి. వీటిని నియంత్రిస్తే మానవుడికి స్థితప్రజ్ఞత కలుగుతుంది అని ఈ సంకీర్తనకారుడి మనోభావన.

ఈ సంకీర్తన కారుడు తన మనసుకు బోధచేస్తూ ఆత్మజ్ఞానం  పొందుదాం అంటున్నాడు. అంటే  శరీరం, ఆత్మ వీటి పట్ల అంతరంగంలో అవగాహన పొందడం‌. మనం ఎవరో, మన సహజ స్వభావం ఏమిటో అనే ప్రశ్నతో మొదలై ఆత్మజ్ఞానం సాధించడానికి మనకు శక్తి సరిపోదని మనసులో నిరంతరం భగవంతుని తలుతమా! అని మనసును స్థిరపరుస్తున్నాడు. మరో ఆలోచన లేకుండా భగవంతుని  నామమే నువ్వు చెప్పు అనే ఉద్దేశంతో ‌ ఇక్కడ తలుతమా - తలవడం అంటే స్మరణ చేయడం.  దీనివల్ల మనసును తన ఆధీనం లోకి తెచ్చుకుంటూ ప్రశాంతంగా ఉంచడం వల్ల ఎదుటివారిలో కూడా అలాంటి ఆత్మనే  అంటే, పరమాత్మనే చూడగలుగుతుంది అని ఈ సంకీర్తన కారుడి ఉద్దేశం. చివరికి తన నామముద్రతో వేపూరి హనుమంత వరదుని 'కొలుతమా' అంటూ తనకు వరములని ఇచ్చిన భగవంతుణ్ణి నిత్యం కొలుద్దామా మనసా అంటున్నాడు.

ఏక తాళం

ప :    మాయాలోకమిది మనసా- గురు
         రాయు నీడకుము హమేషా -ము
         పాయలేని మది బద్ద పారమరము
         ద్రోయబోక అన్యాయమయ్యెదవు ॥ మా (శ్రీ వేపూరి హనుమద్దాసు, హనుమద్దాసు రామ కీర్తనలు, 2013 పుట.156).

వేపూరి హనుమద్దాసు ఈ కీర్తనలో మనసును మాయా ప్రపంచంలో పడిపోకు అంటూ దీనికి భిన్నమైన మార్గం ఒకటుంది అది గురువు చూపే మార్గం. దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు అని  మనసుకి బోధిస్తున్నాడు.

ఏక తాళం

ప : మనసా వినవే నాదూ మాటా ॥కను ॥
    గొనజాలరు బూటకులు వరముబాటా
  జనులు నడకలన్నీ జూటా ॥ కాని ॥
  మనదేశీకులు దెల్పు మార్గము తేటా ॥ మన ॥  (శ్రీ వేపూరి హనుమద్దాసు, హనుమద్దాసు రామ కీర్తనలు, 2013 పుట.84 ),

'జనుల నడకలన్నీ జూట'  మనసా మనుషుల మాటలు యదార్థాలు కావు. కేవలం ఊహలు మాత్రమే. వారి ప్రవర్తనలు పైకి ఒకలా  అంతరంగంలో ఒకలా ఉంటాయి.  అందువల్ల వారి మాటలు కాకుండా 'దేశికులు' గురువులు తెలుపు మార్గము 'తేట'  అని సంకీర్తనలో చెబుతున్నాడు. దేశికులు అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఆచార్యులు. వీరు చూపే మార్గం సుప్రసిద్ధమైన మార్గం. వీరు సరైన మార్గంలో వెళ్లి తరించారు. మనకు మార్గదర్శకులు వారినే మనం అనుసరించాలి అని బోధ చేస్తున్నాడు . ఈ గురువులు మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి మనకు మంచి మార్గం వేశారు . ఆ దారిలోనే మన గమ్యం చేరాలి మనసా! అని ఈ సంకీర్తన కారుడు తనకు తన మనసుకు పరమాత్మను చేరడానికి కారణమైన వారి బాటలో నడుద్దాం అని దారి వేసుకుంటున్నాడు.

7. ఉపసంహారం

  • దాసత్రయంగా పేరుగాంచిన పై ముగ్గురు సంకీర్తనకారుల్లోని మనసుకు బోధ చేస్తున్న కీర్తనల్లో వారి భావాలను గమనిస్తే,  రాకమచర్ల వెంకట దాసు, తన మనసుకు చెబుతున్నాడు.
  • మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా మన గమ్యం ఒకటే ఉండాలి. అది భగవంతుణ్ణి పొందడం అని మనసుకు ప్రేరణ కలిగిస్తున్నాడు. 
  • అట్లాగే ఈ లోకంలో కనబడే బాహ్య సుఖాలకు పరవశించి పరమాత్మకు దూరం కాకు.  అని మనసుకు శిక్షణ ఇస్తున్నాడు. 
  • చిత్తశుద్ధితో మంచి భావాలు మనలో నింపుకొని భగవంతుడు నాలోనే ఉన్నాడు అనే స్థాయికి వెళ్లాలని మనసుకి పట్టిస్తున్న ప్రేరణాత్మకమైన భావాలు, మనసుకు శిక్షణ ఇస్తున్న సందర్భము, అదే సమయంలో వైరాగ్యాన్ని వంట పట్టిస్తున్నట్లుగా రాకమచర్ల వెంకటదాసు మానస భోద కీర్తనలున్నాయి.
  • మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనల్లో నిరంతరం భగవంతుని నామస్మరణ చేయమని మనసును హెచ్చరిస్తున్నాడు. ఇతరుల గురించి మాట్లాడకూడదని కూడా మనసుకి చెబుతున్నాడు. 
  • సాధు సజ్జనుల, గురువుల మార్గాన్ని మనం ఆచరించి మనలో ఉన్న చెడు లక్షణాల్ని దూరం చేసుకోవాలని మనసుకి గైడ్ చేస్తున్నాడు. నిరంతరం రామ నామాన్ని స్మరించు మనసా! అని మన్నెంకొండ హనుమద్దాసు మనసును స్థిరపరిచే కీర్తనలున్నాయి.
  • వేపూరి హనుమద్దాసు మనలో ఉన్న అరిషట్ వర్గాలు దూరం చేసుకుందాము అని మనసుకు తెలుపుతూ, జీవాత్మయే పరమాత్మ అనే ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలని మనసుకు బోధిస్తున్నాడు.  మాయా ప్రపంచంలో పడిపోకు మనసా! భగవంతుని నామాన్ని పట్టుకొని గురువులు చూపిన మార్గంలో మనం పయనించాలి మనసా! అంటూ మనసును తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కీర్తనలున్నాయి.
  • ఈ సంకీర్తనకారుల మానస బోధ కీర్తనలు  వాస్తవాలను మనస్సుకు తెలుపుతున్నాయి. ఈ బోధ వలన అలవాటు లేకపోయినా మంచి ఆలోచన చేసేందుకు మనస్సు ప్రయత్నిస్తుంది . 
  • ఒక మంచి ఆలోచన బ్రతుకులో శాంతిని, ఓదార్పును మహిమాన్వితంగా తెచ్చిపెడుతుందనే విధంగా  వీరి కీర్తనలున్నాయి.  మూడునాల్ల  జీవితంలో విపరీతమైన ఆలోచనలు సాగించడం మానుకొని సద్భావాలను చేయమని  ఈ సంకీర్తనాకారులు మనసుకు పట్టిస్తున్నారు. 
  • చెడు ఆలోచనల వలన దుష్ఫలితాలు వస్తాయనే విషయాన్ని జ్ఞానపూరితంగా మనసు గ్రహించేలా బోధిస్తున్నారు. పొరపాట్లు మనిషి అలవాట్ల ప్రతిరూపాలే కనుక సహజం. మొండి మనసుతో బిగుసుకుపోయి కాలంలో దుర్భర పరిస్థితులలో చిక్కిపోవడం కాకుండా పొరపాట్లను మనసారా అంగీకరించి జీవితాన్ని మలుపు తిప్పుకునేందుకు విశాల హృదయంతో ఆలోచింప చేసే విధంగా వీరి మానస భోద కీర్తనలున్నాయి.

8. పాదసూచికలు:

  1. పి భాస్కర యోగి, పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం - ఒక పరిశీలన, 2011, పుట .60
  2. శ్రీల రూపగోస్వామి పాదులు, శ్రీభక్తి రసామృతసింధువు, 1985,పుట.72 
  3. శ్రీల రూపగోస్వామి పాదులు, శ్రీభక్తి రసామృతసింధువు, 1985,పుట.73-74 
  4. తాళ్లపాక, చిన్న తిరుమలాచార్యులు, 1935, సంకీర్తన లక్షణం వాల్యూమ్ -1, పుట సంఖ్య144
  5. వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2014- శెట్టి బుక్ షెల్లర్ - ప్రింటింగ్ హైదరాబాద్, పుట .1
  6. వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2014- శెట్టి బుక్ షెల్లర్ - ప్రింటింగ్ హైదరాబాద్, పుట .62 
  7. వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు - 2014- శెట్టి బుక్ షెల్లర్ - ప్రింటింగ్ హైదరాబాద్, పుట .179
  8. మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు 1990, , లక్ష్మి ప్రింటర్స్ మహబూబ్ నగర్ పుట. 20
  9. మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు 1990,, లక్ష్మి ప్రింటర్స్ మహబూబ్ నగర్  పుట. 49
  10. శ్రీ వేపూరి హనుమద్దాసు, హనుమద్దాసు రామ కీర్తనలు, 2013 పుట.84
  11. శ్రీ వేపూరి హనుమద్దాసు, హనుమద్దాసు రామ కీర్తనలు, 2013 పుట.100
  12. శ్రీ వేపూరి హనుమద్దాసు, హనుమద్దాసు రామ కీర్తనలు, 2013 పుట.156

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. భాస్కరయోగి పి. పాలమూరుజిల్లా సంకీర్తనసాహిత్యం - ఒక పరిశీలన 2011 - తుర్లపాటి పౌండేషన్, సికింద్రాబాద్.
  2. మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు. 1990, లక్ష్మి ప్రింటర్స్ మహబూబ్ నగర్ 
  3. రాంబాబు, ఆర్. మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు - ఒక పరిశీలన, 1991. నల్లగొండ 
  4. వెంకటదాసు రాకమచర్ల- రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు. 2002.  అన్నమ రాజు భాస్కర్ రావ్ప్రింటింగ్ ప్రెస్ శంకరంపేట
  5. వెంకటదాసు రాకమచర్ల. రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు. 2014. శెట్టి బుక్ షెల్లర్-ప్రింటింగ్ హైదరాబాద్.
  6. హనుమద్దాసు, వేపూరి. హనుమద్దాసు రామ కీర్తనలు, 2013.శ్రీకర్ పబ్లికేషన్స్, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]