AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. నాట్యంలో భ్రమరీవిన్యాసాలు: పాశ్చాత్యబ్యాలెట్లో ‘పిరౌట్టు’ చేష్టల ప్రాముఖ్యం
నాగలాపురం హరిప్రియ
నృత్య అధ్యాపకురాలు, సంగీత-నృత్య-లలిత కళల విభాగము,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8309082432, Email: haripriyachakravarthi97@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 17.04.2025 ఎంపిక (D.O.A): 27.04.2025 ప్రచురణ (D.O.P): 01.05.2025
వ్యాససంగ్రహం:
నాట్యంలో ‘భ్రమరీ’ విన్యాసాలకు విశిష్టమైన స్థానం ఉంది. వీటినే ‘చక్కర్లు’ (Spin movements) అని కూడా పిలుస్తాం. నాట్యానికి వన్నె చేకూర్చే పలు అంశాలలో ఇవి ఒకటి. దేశ-భాష- ప్రాంతీయభేదాలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని దాదాపు అన్నిరకాల నృత్యాలలోను మనం ఈ భ్రమరీలను గమనించవచ్చు. పాశ్చాత్య బ్యాలెట్ విధానంలో వీటికే ‘పిరౌట్టు’ (Pirouette) అని పేరు. మన భారతీయ శాస్త్రీయనృత్యాలలో వీటి వినియోగాలు, ఉద్దేశాలు పాశ్చాత్య బ్యాలెట్ రీతులతో పోల్చి చూస్తే భిన్నంగా ఉంటాయి. మన శాస్త్రీయనృత్యాలకు ఏ విధంగానైతే ఎన్నో లక్షణగ్రంథాలు (నాట్యశాస్త్రం, అభినయదర్పణం, నృత్తరత్నావళి, రసకౌముది మొ.,) ప్రామాణికాలుగా ఉన్నాయో, అదే విధంగా పాశ్చాత్యబ్యాలెట్లను వివరిస్తూ అగ్గ్రిప్పినా వగనోవా, గైల్ గ్రాంట్, తమార కర్సావిన, గ్రెట్చెన్ వార్డ్ వారెన్, జేనిఫ్ఫెర్ హోమన్స్, జాక్ ఆండర్సన్ రచించిన గ్రంథాలు ప్రామాణికాలు. భ్రమరీవిన్యాసాలకు నాట్యంలో ఉన్న విశిష్టతను తెలుపుతూ, వాటిని పాశ్చాత్య బ్యాలెట్ నాటకాలలో కథావస్తు నిర్మాణానికి, భావప్రకటనకు ఏ విధంగా వినియోగిస్తున్నారో తెలుసుకోవడం, ఇవి భారతీయశాస్త్రీయ నృత్యాలకంటే ఏ రకంగా భిన్నమైనవో విశ్లేషించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. ఈ పరిశోధనలో గ్రెట్చెన్ వార్డ్ వారెన్ రాసిన ‘క్లాసికల్ బ్యాలెట్ టెక్నిక్’, జేనిఫ్ఫెర్ హోమన్స్ రాసిన ‘అపోల్లో’స్ ఏంజెల్స్: ఏ హిస్టరీ ఆఫ్ బ్యాలెట్’, అగ్గ్రిప్పినా వగనోవా రాసిన ‘బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ క్లాసికల్ బ్యాలెట్’, సీరిల్ బ్యూమోంట్ రాసిన ‘ది బ్యాలెట్ కాల్డ్ గిసేల్లె’, ల్యిన్ గారఫోల రాసిన ‘దయాఘిలేవ్ బ్యాల్లెట్స్ రుస్సేస్’ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశాను. వివిధ ప్రామాణికమైన బ్యాలెట్ వీడియో డాక్యుమెంటరీలను, ఆర్కైవ్లను పరిశీలించి విశ్లేషించాను. ఫలితాంశాలను భారతీయనృత్యాలతో తూచడానికి నందికేశ్వరుడు రాసిన ‘అభినయదర్పణం’, శ్రీకంఠ కవి రాసిన ‘రసకౌముది’, కపిలా వాత్సాయన్ రాసిన ‘ఇండియన్ క్లాసికల్ డాన్స్’, మందాక్రాంత బోస్ రాసిన ‘మూవ్మెంట్ అండ్ మిమెసిస్’, సునీల్ కొఠారి రాసిన ‘కథక్: ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఆర్ట్’, లీల శాంసన్ రాసిన ‘రిథమ్ ఇన్ జాయ్’ గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసాను. ఆండ్రియా షార్లీ, కాథరిన్ హబెర్, ఏ. క్లోస్టర్మాన్ మొదలగువారు ఇప్పటిదాకా ఈ విషయంపై ప్రచురించిన పరిశోధనావ్యాసాలతో పాటుగా ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి పత్రికవ్యాసాలను విశ్లేషించాను. ‘నాట్యంలో పిరౌట్లు కేవలం నయనానందం కోసమే పరిమితం కావు. వీటికి క్లిష్టమైన మానసిక భావాలను సైతం వ్యక్తపరిచే సామర్థ్యం ఉంది’ అనే పరికల్పనతో ఈ వ్యాసం ముందుకు సాగుతుంది.
Keywords: బ్యాలెట్, పిరౌట్టు, భ్రమరీ, భావం, స్పిన్, ఫౌట్టె, స్పోట్టింగ్, అరబెస్కు, ఆటిట్యూడ్.
1. ప్రవేశిక
నాట్యంలో చక్రాకారంలో చేసే కదలికలను
‘భ్రమరీలు’ అని అంటాం. ‘భ్రమర’ అంటే సంస్కృతంలో ‘తుమ్మెద’ అని
అర్ధం. నాట్యంలోని కదలికలు తుమ్మెదలు తిరిగే రీతిని పోలి ఉండటం వలన వీటిని ఆ పేరుతో పిలుస్తాం. మన
శాస్త్రీయ నాట్యాలకున్న ముఖ్యలక్షణాలలో ఇవి ఒకటి. పుండరీక విట్టలుడు రాసిన
‘నర్తననిర్ణయం’లో భ్రమరీలను ఈ రకంగా వర్ణించారు.
‘చక్రభ్రమరికా ఖండసూచ్యర్తే చక్రవదభ్రమాత’ 1 (మూ.మీ. పు.206)
చక్రం తిరిగినట్టు మధ్యలో గిరగిరా తిరగడమే భ్రమరీవిన్యాసం అని దీని అర్థo. శ్రీకంఠ కవి ‘రసకౌముది’లో భ్రమరీలు నృత్యానికి ప్రాణం వంటిదని వివరించారు.
‘రేఖా చ స్థిరతా వేగో భ్రమరీ దృష్టి రస్మయః
|
ప్రీతిర్మేధా వచో గీతం నృత్యే ప్రాణా దశోదితా ||’ 2
(మూ. మీ. పు.182)
నృత్యానికి ఉన్న దశప్రాణాలలో భ్రమరీలకు ఈయన నాల్గవ స్థానాన్ని ఇచ్చాడు. భరతముని నాట్యశాస్త్రంలో ప్రత్యేకించి ‘భ్రమరీభేదాల’ గురించి చెప్పకపోయినప్పటికీ, అవి చేయడానికి అవసరమైన రేచకాలు, చారీలు, స్థానకాలు, మండలాలు వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా వివరించారు. నందికేశ్వరుడు ‘అభినయదర్పణం’లో భ్రమరీలను ఏడు విధాలుగా చెప్పారు.
‘ఉత్ప్లుత భ్రమరీ చక్ర భ్రమరీ
గరుడాభిధా
తథ ఏక పాద భ్రమరీ కుంచిత భ్రమరీ
తథా
ఆకాశ భ్రమరీ చైవ తథంగ
భ్రమరీతిచ
భ్రమర్యః సప్త విజ్జేయా నాట్యశాస్త్ర విశారదైః
||’ 3(అ.ద. పు: 392)
(ఉత్ప్లుత, చక్ర, గరుడ, ఏక పాద, కుంచిత, ఆకాశ, అంగ భ్రమరీలు)
సారంగదేవుడు రాసిన ‘సంగీతరత్నాకర’లో 7 భ్రమరీ విధాలు చెప్పగా, జాయప్ప రాసిన ‘నృత్త రత్నావళి’లో వీటికి భిన్నంగా 13 భ్రమరీ విధానాలను చెప్పాడు. తరువాత కాలంలో రాయబడిన లక్షణగ్రంథాలు మరికొన్ని కొత్త భేదాలను చెప్పినప్పటికీ, వాడుకలో మాత్రం, ‘అభినయదర్పణం’లో నందికేశ్వరుడు చెప్పిన ఏడు విధానాలే ఎక్కువగా కనిపిస్తాయి. మన భారతీయ శాస్త్రీయనృత్యాలలో ఉన్న విధంగానే పాశ్చాత్య బ్యాలెట్ నృత్యాలలో కూడా చక్కర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వారు అనుసరించే విధివిధానాలు మనకంటే భిన్నంగా అనిపిస్తాయి. బ్యాలెట్లోని పిరౌట్ల వివరణ క్రింది ఉపశీర్షికలో చూద్దాం.
2. బ్యాలెట్టులోని పిరౌట్లు
శరీరాన్ని ఒక పాదంపై బ్యాలెన్స్ చేస్తూ, మరొక కాలిని నిర్ణీతస్థానంలో ఉంచి చక్కర్లు తిరుగుతూ పిరౌట్లను చేస్తారు. మన నృత్యాలలో ఏ విధంగా అయితే స్థానకాలు ఉన్నాయో, అదే విధంగా బ్యాలెట్టులో కూడా 5 పాద స్థానకాలున్నాయి (basic feet positions). పిరౌట్లు ఎక్కువగా 3వ, 5వ పొసిషన్స్ నుంచి చేస్తారు. మొదటి పొసిషన్ మన నృత్యాలలోని సమస్థానాన్ని పోలి ఉంటుంది (పాదాలు నేరుగా కాక పక్కలకు తిరిగి ఉంటుంది). రెండవ పొసిషన్ నిలుచున్నటువంటి ‘ప్రేరితం’లా కనిపిస్తుంది. ఇక 3వ, 4వ, 5వ పొసిషన్లలో పాదాలను దూరానికి, దగ్గరకు క్రింద చూపిన విధంగా జరుపుతూ చేస్తారు.

4 (టె.మ్యా.డి.క్లా. పు.సం. 165)
Basic 5 feet positions in ballet
ఒక కాలు పై నిలబడి, మరోకాలిని సగానికి మడిచి ఉంచడాన్ని ‘పాస్సే’ అని పిలుస్తారు. అదే కాలును వెనక్కు ఎత్తిపడితే ‘అరబెస్కు’ అని పిలుస్తారు. ఎత్తిన కాలుని 600 నుంచి 900 మడిస్తే ‘ఆటిట్యూడ్’ అని పిలుస్తారు. ముఖ్యంగా శరీరాన్ని పాదాల బ్రొటను వేలుపై నిలబెట్టడాన్ని ‘ఎన్ పాయింటే’ అని, పాదం ముందు భాగంపై నిలబెడితే ‘డేమి- పాయింటే’ అని పిలుస్తారు. ఇలాంటి ఎన్నో టెక్నికల్ అంశాలు మనకు గెయిల్ గ్రాంట్ రాసిన ‘టెక్నికల్ మ్యానువల్ అండ్ క్లాసికల్ బ్యాలెట్' పుస్తకం ద్వారా స్పష్టంగా అర్థమౌతుంది.

5 (టె.మ్యా.డి.క్లా. పు.సం. 152 & 155)
Arabesques & Attitude variations
కాలును ఎటువైపుకు తిప్పుతున్నామనే అంశంపై ఆధారపడి బేసిక్ పిరౌట్లు రెండు విధాలు.
- ఎన్ డిహోర్స్ (వెలుపలకు)
- ఎన్ డిడాన్స్ (లోపలివైపుకు)

ప్రత్యేకమైన పిరౌట్లు
- ఫౌట్టే పిరౌట్ – కాలును పాస్సే పొసిషన్ నుంచి ఆపకుండా విసురుతున్నట్టుగా ఎన్ డిహోర్స్ లేదా ఎన్ డిడాన్స్ పిరౌట్లు చేయడం.
- చైన్ పిరౌట్ – పాదాలను ‘పాయింటే’కు (pointe) తెచ్చి ఒకదాని తర్వాత మరొకటి మార్చి తిరగటం.
- గ్రాండ్ పిరౌట్- ఇవి పెద్ద స్పిన్లు. ఎక్కువగా మగవారు చేసేవి.
ఇవేకాక, పిరౌట్లు ఆటిట్యూడ్ నుంచి, అరబెస్క్
నుంచి, రేలేవే మొదలగు ఇతర పొసిషన్స్ నుంచి కూడా చేస్తారు. మన నృత్యాల్లోలాగ ఖచ్చితమైన సంఖ్యలో ఫలానా
రీతిలోనే చెయ్యాలి అనే నియమం లేదు. కథానుసారం, సందర్భానుసారం బ్యాలరీనాలు ఏ పిరౌట్లు చేయాలో
నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు చర్చించిన పిరౌట్లు రంగస్థలంపై ప్రదర్శింపబడే బ్యాలెటుల్లో ఏ విధమైన పాత్ర
పోషిస్తుoదో ఇప్పుడు చూద్దాం.
‘స్వాన్ లేక్’ బ్యాలెట్లో
పిరౌట్లు
‘క్లాసికల్ బ్యాల్లెట్’ కోవకు చెందిన ఈ ‘స్వాన్ లేక్’ పాశ్చాత్య రంగస్థలంలో ఎంతో ప్రసిద్ధి. దీనికి ‘పీటర్ ఇల్లిచ్ చైకోవ్స్కి’ సంగీతం అందించగా, ‘జూలియస్ రైసింగర్’ మొదటిగా నృత్యకల్పన చేసారు. తరువాత కాలంలో ‘మరియాస్ పెటిప & లెవ్ ఇవనోవ్’ వంటివారు మార్పులు చేసి మరింత ప్రేక్షకాదరణ పొందేలా చేసారు. ఏ సందర్భాలలో పిరౌట్లను భావవ్యక్తీకరణకు వినియోగించారో తెలియాలంటే, విషాదాంతమైన ఈ బ్యాలెట్ కథాసారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకోవడం అవసరం.
కథాసారాంశం
‘ఒడెట్టే’ అనే అందమైన యువతి,
దుష్ట మాంత్రికుడైన ‘వాన్ రోత్‌బార్ట్’ శాపం వల్ల రోజంతా హంసగా మారి, రాత్రి మాత్రమే
మానవరూపంలో ఉంటుంది. ఈ శాపం నుండి విముక్తి పొందాలంటే, ఎవరైనా ఒక పురుషుడు తనని మనస్ఫూర్తిగా స్వీకరించి
ప్రేమించాలి. ఒకానొక రోజు ‘సిగ్‌ఫ్రైడ్’ అనే రాకుమారుడు రాత్రిపూట సరస్సులో హంసల
సమూహాల కోలాహలాన్ని చూసి అక్కడకు వెళ్ళగా, ఒడెట్టేను చూసి ప్రేమిస్తాడు. ఒడెట్టే శాపం గురించి
తెల్సుకొని, తన పరివారానికి చెప్పి వివాహం చేసుకోదలుస్తాడు. కానీ, వాన్ రోత్‌బార్ట్ అసూయతో తన
కుమార్తె అయిన ఒడిల్ను ఒడెట్టేగా మాయాజాలం చేసి సిగ్‌ఫ్రైడ్ మైమరిచేలా చేస్తాడు. ఒడిల్
నాట్యాన్ని చూసి సిగ్‌ఫ్రైడ్ అది ఒడెట్టేగా భ్రమపడి, వివాహం చేసుకుంటాడు. దీని కారణంగా
ఒడెట్టే శాపం శాశ్వతమైపోతుంది. తరువాత సిగ్‌ఫ్రైడ్ నిజం తెల్సుకొని ఒడెట్టే దగ్గరకు వచ్చి
క్షమాపణ చెప్పినప్పటికీ శాపవిమోచనం కాకపోగా, ఇద్దరు అదే సరస్సులో మునిగి ఆత్మత్యాగం చేసుకొని
ఏకమౌతారు.
పిరౌట్లు
‘మరియాస్ పెటిప & లెవ్ ఇవనోవ్’ కోరియోగ్రఫీ చేసిన ఈ బ్యాలెట్ లో దాదాపుగా 60 హంసలు (బ్యాల్లరినాలు) రంగభూమిపై స్పిన్లు ప్రదర్శిస్తూ కనిపిస్తాయి. తేలికపాటి రేలేవే, అరబెస్క్ కదలికలతో పాత్రల మధ్య జరిగే చేష్టాకృత సంకేతాలను అందంగా చూపుతాయి. సిగ్‌ఫ్రైడ్ ఒడెట్టేను ఆకర్షించడానికి చేసే పిరౌట్లలో తన వీరత్వం, హుందాతనంతో పాటు ఒడెట్టే పై గౌరవం కూడా కనిపిస్తాయి. ఒడెట్టే చేసే నెమ్మదైన పిరౌట్లు (slow, controlled & restricted spins)లో తన ఆత్మస్వచ్ఛత, మనసులోని బాధ వ్యక్తమౌతాయి. ‘ఒడిల్’ ‘ఒడెట్టే’గా మాయాజాలంచేసి ‘సిగ్‌ఫ్రైడ్’ను మైమరిపించడానికి, వేగంగా ఏకధాటిగా ‘32 ఫౌట్టేలు’ చేస్తుంది. ప్రతి రెండు మూడు ఫౌట్టేలకు మధ్యలో ‘స్పాటింగ్’ చేసి ఫౌట్టేను కొనసాగిస్తుంది. ఇవి ‘సిగ్‌ఫ్రైడ్’ను భ్రమింపజేసి, తనలో ప్రేమభావాలు కలిగేలా చేసాయి. నాట్యంలో తనకున్న ఆధిపత్యాన్ని చూపడమే కాక ఒడెట్టేకు అన్యాయం చేయదలపెట్టిన తనలోని కుటిలభావాలు కూడా తెలుస్తాయని ciril. Beaumont -‘The ballet called swan lake’ పుస్తకం ద్వారా తెలుస్తుంది. చైకోవ్స్కి సంగీతానికి ఒడిల్ చేసే ‘32 ఫౌట్టేలు’ జతకలిసినపుడు ప్రేక్షకులు పొందే అనుభూతే ఈ స్వాన్ లేక్ బ్యాలెటును చిరస్థాయిగా చరిత్రలో నిలబెట్టింది అని Gayle. Kassing రాసిన ‘History of Dance’ ద్వారా అర్థమౌతుంది. పిరౌట్లు ఈ కథలో ఎంత ముఖ్యపాత్ర పోషించాయో ‘Tchaikovsky: Swan Lake - The Kirov Ballet’ వంటి వీడియో డాక్యుమెంటరీలు ద్వారా కూడా తెలుస్తాయి.
క్లిష్టతరమైన 32 ఫౌట్టెలు చెయ్యడం ఈ
బ్యాలెటులో ఎంతో ముఖ్యం. రంగంమీద బ్యాలరీనాలకు అది పెద్ద సవాలుతో కూడుకున్నది. ‘అన్నా పావ్లోవా,
అలెగ్జా౦డ్రా డానిలోవా, అలిసియా మార్కోవ వంటి గొప్ప బ్యాలరీనాలు సైతం ఈ ఫౌట్టెలు చెయ్యడానికి బదులు వేరే
మూవ్మెంట్స్ చేసేవారు’ అని జూన్ 17, 2016 రోజున న్యూయార్క్ ఎడిషన్లో ప్రచురించిబడ్డ ‘Swan
Lake and That Whiplash Bravura Turn (a Whopping 32 of Them)’ అనే కథనం ద్వారా
తెలుస్తుంది.
‘నట్ క్రాకర్’ బ్యాలెట్ లో పిరౌట్లు
‘నట్ క్రాకర్’ బ్యాలెట్టుకు
‘పీటర్ ఇల్లిచ్ చైకోవ్స్కి’ సంగీతం అందించగా, ‘మరియాస్ పెటిప & లెవ్
ఇవనోవ్’లు కొరియోగ్రాఫర్లుగా వ్యవహరించారు. 1892లో మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడిన ఈ
బ్యాలెట్లోని కథ, సంగీతం, నృత్య కల్పనలు, చూసే ప్రేక్షకుల్ని మరో మాయాప్రపంచానికి తీసుకెళ్తుంది.
చూస్తున్నంత సేపు రంగం మీద జరిగేవన్నీ నిజాలేమో అన్నంత భ్రాంతిని కలిగిస్తుంది. ఇ.టి.ఏ. హాఫ్మన్ రాసిన
‘ది నట్ క్రాకర్ అండ్ మౌస్ కింగ్’ (2- Acts) కథ ఆధారంగా బ్యాలెట్ రూపొందింది.
కథాసారాంశం
‘నట్ క్రాకర్’ కథ క్రిస్మస్ కాలంలో స్టాల్బాం అనే వారి కుటుంబంలో జరుగుతుంది. ‘క్లారా’ (కొన్ని వెర్షన్లో ‘మేరి’) అనే చిన్న పాపకు తన గాడ్ ఫాథర్ అయిన ‘డ్రోసేల్మేయర్’, ఒక బొమ్మను క్రిస్మస్ బహుమతిగా ఇస్తాడు. దాని పేరు ‘నట్ క్రాకర్’. క్లారా సంబరపడి అర్ధరాత్రి గడియారం కొట్టగానే లేచి ఈ బొమ్మను చూడటానికి వెళ్తుంది. తన బొమ్మల గదిలో జరిగే వింతలన్నింటినీ చూసి క్లార ఆశ్చర్యపోతుంది. తన బొమ్మలన్నీ సజీవంగా కనిపిస్తాయి. గదిలో ఓ వైపునున్న క్రిస్మస్ ట్రీ అమాంతం పెద్దదైపోసాగింది. ఒక పెద్ద ఎలుక ఆకారంలో ఉన్న ‘మౌస్ కింగ్’, తన బొమ్మల సైన్యం నడుపుతున్న ‘నట్ క్రాకర్’తో యుద్ధం చేస్తూ ఉండటం చూసి కంగారు పడిన క్లారా తన కాలి చెప్పును మౌస్ కింగ్ పై విసిరి నట్ క్రాకర్ సైన్యాన్ని గెలిపిస్తుంది. విజయం పొందిన వెంటనే నట్ క్రాకర్ ఓ అందమైన రాకుమారుడిగా మారి క్లారాను తన ‘లాండ్ ఆఫ్ స్వీట్స్’ అనే మాయారాజ్యానికి తీసుకెళ్తాడు. ఆ మాయాప్రపంచంలో క్లార మైమరచిపోయి ఆనందంతో నాట్యం చేస్తుంది. క్లారా మరియు రాకుమారుడికి స్వాగతం పలుకుతూ ‘షుగర్ ప్లం ఫెయిరీ’లు వివిధ నృత్య విన్యాసాలు చేసి అలరిస్తాయి. కొన్ని వెర్షన్లలో క్లార ఆ మాయాజాల ప్రపంచంలోనే రాకుమారిగా ఉండిపోతే, మరి కొన్ని వెర్షన్లలో కలలోంచి మేలుకొని తన బొమ్మలతో ఆడుకుంటుంది.
పిరౌట్లు
రెండు అంకాలుగా ప్రదర్శింపబడే ఈ బ్యాలెట్ మొదటి భాగం మొత్తం ప్రేక్షకులకు కథను పరిచయం చెయ్యడం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మొదటి అంకంలోని కథలో పిరౌట్లుకు ఎక్కువ ప్రాధాన్యతను చూడలేము. డ్రోసేల్మేయర్ నట్ క్రాకర్ బొమ్మను కానుకగా ఇచ్చినప్పుడు తను చేసే ఉత్సాహభరితమైన స్పిన్లలో క్లారాకు కలిగిన ఆనందాన్ని గమనించగలం. ఎంతో సంబరంతో మాయాప్రపంచంలోని ‘snow flakes’ (మంచు బొమ్మలు) ‘En pointe’ మీద చేసే ‘En dehors pirouettes’, క్లారా ‘లాండ్ ఆఫ్ స్వీట్స్’ రాజ్యానికి రాబోతోంది అని సంకేతాన్నిస్తాయి. రెండవ అంకంలో రాకుమారునితో మరో లోకానికి వెళ్తోన్న క్లారా మానసిక భావోద్వేగాలన్ని ‘The Waltz of the Flowers’ (వికసించిన పుష్పాలు) చేసే ‘En dehors మరియు En dedans pirouettes’లో ప్రతిబింబిస్తుందని జే.ఫిషర్ రాసిన ‘ది నట్ క్రాకర్ నేషన్’ అనే పుస్తకంలోని వర్ణన ద్వారా అర్థమౌతుంది.
‘షుగర్ ప్లమ్ ఫెయిరీ’ సోలో
నాట్యంలో ‘En pointe’ మీద గురుత్వాకర్షణను ధిక్కరిస్తున్నట్లు చేసే పిరౌట్లు తన లోకంలో
తనకున్న ఆధిపత్యాన్ని చూపుతాయి. ‘కావలీర్’ మరియు ‘షుగర్ ప్లమ్ ఫెయిరీ’ చేసే
వేగవంతమైన పిరౌట్లు వారిద్దరి మధ్య ఉన్న ఆకర్షణను స్పష్టంగా చూపుతాయి. అరబెస్క్లతో కూడిన పిరౌట్లు
చేస్తున్న ఫెయిరీతో కావలీర్ కలిసి చేసే ‘Pas de deux’ (డ్యూయెట్ డాన్స్)లో వారిరువురి
మధ్యున్న పరస్పరాధీనత మరియు పరస్పరావలంబనం కనిపిస్తాయని సాలీ బేన్స్ రాసిన ‘డాన్సింగ్
విమెన్’ అనే పుస్తకంలోని వర్ణన ద్వారా తెలుస్తుంది.
‘గిసెల్’ బ్యాలెట్లో పిరౌట్లు
1841లో పారిస్ ఓపెరాలో మొదటిసారిగా ప్రదర్శించబడిన ఈ రొమాంటిక్ బ్యాలెటును ‘జూలియస్ పెరోట్ & జీన్ కోరల్లీ’ కలిసి కొరియోగ్రఫీ చేయగా, ‘అడోల్ఫే ఆడం’ సంగీతాన్ని సమకూర్చారు. ఇది రెండు అంకాలలో నడుస్తుంది. ప్రేమలో మోసపోయిన ఓ పల్లెటూరి అమ్మాయి కథ.
కథాసారాంశం
‘గిసెల్’ రెయిన్ లాండ్ అనే
గ్రామంలో నివసించే కల్మషంలేని అమ్మాయి. తనకున్న నీరసమైన గుండె కారణంగా తన తల్లి గిసెల్ను ఎంతో
జాగ్రత్తగా పెంచుతుంది. యవ్వనంలోకి వచ్చిన ఆమెను చూసి ‘ఆల్బ్రెక్ట్’ (Albrecht- ది డ్యూక్
ఆఫ్ సిలేసియా) అనే ఉన్నత వర్గానికి చెందిన యువకుడు ప్రేమిస్తాడు. తన డ్యూక్ గుర్తింపును దాచిపెట్టి
ఆమెకు ‘లాయ్స్’ అనే పేరుతో సామాన్యుడిలా దగ్గరౌతాడు. ఇదివరకే అతనికి వేరే రాజ్యం యువరాణితో
వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని గిసెల్ తెలుసుకోలేక, ఆల్బ్రెక్ట్ ప్రేమలో పూర్తిగా మునిగిపోతుంది. తన
తల్లి ‘బెర్త్’ ఎంత వారించినా పెడచెవిన పెడ్తుంది. అదే రెయిన్ లాండ్ గ్రామానికి చెందిన
‘హిలరియన్’ అనే మరో వ్యక్తి కూడా గిసెల్ను ఎప్పటినుండో ప్రేమిస్తూ ఉంటాడు. అతడు లాయ్స్
గురించి అన్ని నిజాలు బయటపడేలా చేస్తాడు. నిజం తెలియగానే గుండె పగిలేలా రోదించి గిసెల్ మరణిస్తుంది.
స్మశానంలో ఉన్న ఆత్మల రాజ్యం గిసెల్ ఆత్మను తమలో చేర్చుకుంటుంది. ప్రేమలో మోసం చేసిన వారిని ఆ ఆత్మలు
వెంటాడి మరీ చంపుతాయి. అవి ఆల్బ్రెక్ట్ ప్రాణాలు తీయాలని శిక్ష వేస్తే చివరకు గిసెల్ ఆత్మ క్షమించి
కాపాడుతుంది. శాంతించి స్వర్గలోకంలోకి పయనిస్తుంది.
పిరౌట్లు
మొదటి అంకంలో గిసెల్ తన గ్రామంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుతూ పాడుతూ చేసే ‘పెటిట్ జేటే’ పిరౌట్లలో అమాయకత్వం చూస్తాం. లాయ్స్ చేసే ‘పిరౌట్టే లా ఎల్’ సెకండే’లలో గిసెల్ దృష్టిని ఆకర్షించడానికి తను చేసే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. గిసెల్ లాయ్స్ ప్రేమలో పడి అతడితో కలిసి చేసే ‘పాస్ డి ద్యుక్స్’లో చేసే పిరౌట్లు వారిరువురి మధ్యగల బంధాన్ని, శృంగార భావాల్ని చూపుతాయి. వేగంగా చేసేటువంటి ‘అల్లెగ్రో’ లాంటి మూవ్మెంట్స్ వీరి భావాలను బలపరుస్తాయి. హిలరియన్ కారణంగా నిజం తెలుసుకొని మనస్తాపంతో ‘మ్యాడ్ సీన్’లో గిసెల్ చేసే విపరీత కోణాలలోని పిరౌట్లు మరియు తేలికపాటి ‘చైనే’ స్పిన్లు తన మనసులో కలిగిన వ్యథ, అయోమయం, చెప్పలేని దుఃఖం కనిపించడంతో పాటు, ప్రేక్షకుల్లో గిసెల్ గుండెకున్న బలహీనత కారణంగా ఏమౌతుందో అనే ఉత్కంతను కలిస్తాయి అని ‘ఐవర్ గెస్ట్’ రాసిన ‘రొమాంటిక్ బ్యాలెట్ ఇన్ పారిస్’ పుస్తకం ద్వార తెలుస్తుంది. (‘మారీ టాగ్లియోనే’ చేసిన గిసెల్ ప్రదర్శన గురించి ఐవర్ గెస్ట్ తన పుస్తకంలో చేసిన వర్ణన ద్వారా తెలుసుకోగలిగాను).
రెండవ అంకంలో విలీస్ (ఆత్మలు) స్మశానంలో చేసే పిరౌట్లు భయానకంగాను, ప్రేమించి మోసం చేసి ఇతరుల మరణానికి కారణమైన వారిని వదలకుండా వెంబడించి మరీ ప్రాణం తీయాలనే వారి ధృడ నిశ్చయం కనబడుతాయి. అవి చేసే ఆటిట్యూడ్ మరియు అరబెస్కులతో కూడిన పిరౌట్లలో పరలోకపు చాయలు, అతీంద్రియ శక్తులు తెలుస్తాయి. హిలరియన్ చేత ఆత్మలు బెదిరించి చేయించే నాట్యంలో భీతి కనిపిస్తుంది. చివరిలో ఆల్బ్రెక్ట్ను విడిచి గిసెల్ స్వర్గలోకానికి చేసే పయనంలోని పిరౌట్లులో ఎంతో శాంత స్వభావం తెలుస్తుంది. వేగాన్ని సమతుల్యంలో ఉంచుతూ, బ్యాలెన్సుతో చేసే గిసెల్లోని స్పిన్లు (controlled, balanced & focused spins) కథలోని భావోద్వేగాలను ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసాయి అనడం ఎంతో సబబు. స్మిత్ రాసిన ‘బ్యాలెట్ ఇన్ ది ఏజ్ అఫ్ గిసెల్’, ‘కరోల్ లీ’ రాసిన ‘బ్యాలెట్ ఇన్ వెస్ట్రన్ కల్చర్’ పుస్తకంలోని (జులేస్ పెర్రోట్ పై మరియు రొమాంటిక్ బ్యాలెట్ల పై రాసిన) అంశాల ద్వారా ఈ బ్యాలేట్లోని టెక్నికల్ డాన్స్ మూవ్మెంట్స్ గురించి మనకు వివరంగా తెలుస్తాయి.
3. పాశ్చాత్య బ్యాలెట్లలోని పిరౌట్లు - భారతీయశాస్త్రీయ నృత్యాల్లోని భ్రమరీలు – తులనాత్మక దృష్టి
భారతీయ శాస్త్రీయనృత్యాల్లో ఎటువంటి కదలికైనా శరీరంలోని నాభీసూత్రం (point of equilibrium) పై ఆధారపడి ఉంటుంది. దీనినే ‘బ్రహ్మసూత్రం’ (Vertical meridian) అని కూడా అంటాం.
మొదలయ్యే ప్రతి భంగిమ లేదా కదలిక ‘సమం’ స్థానం నుండి మొదలయ్యి తిరిగి మళ్ళీ సమానికి చేరుతుంది. బ్యాలెట్లలో మూవ్మెంట్స్ సమం నుండే మొదలుపెట్టాలి అని నియమం లేదు. బేసిక్ ఒకటి నుండి అయిదు స్థానాలలో (5 basic feet positions) ఏదో ఒక స్థానం నుంచి మొదలు పెట్టవచ్చు. ఇది పిరౌట్లకు కూడా వర్తిస్తుంది. ఉదా: నట్ క్రాకర్లో షుగర్ ప్లమ్ ఫెయిరీ, మంచు బొమ్మలు చేసే పిరౌట్లు.
‘Indian dance concerns itself with the movement of the human form in direct relation to the pull of gravity. Such a conception accounts for the absence of great leaps and gliding movements in the air, so characteristic of the Western ballet’- కపిలా వాత్సాయన్ 6 (ఐ.సి.డి. పు.సం.14).
కపిలా వాత్సాయన్ వివరించినట్లు, పాశ్చాత్య బ్యాలేట్లలోని స్పిన్లు జేటే, గ్రాండ్ జేటే, అరబెస్కు, ఆటిట్యూడ్ మొదలైన మూవ్మెంట్స్ తో సందర్భానుసారం జత కావడం వలన చూడటానికి బ్యాలరీనాలు గాల్లో అలవోకగా సాగిపోతూ, ఎగురుతున్నట్ట్లుగా (airy movements) అనిపిస్తుంది. అదే, మన నృత్యాలలో చేసే భ్రమరీలలో స్పిన్లు ఒక పరిమిత పరిధిలోనే సాగుతుంది. గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టినప్పటికీ, బ్యాలేట్లలో ఉన్న విధంగా పెద్ద పెద్ద అడుగులతో విపరీత కోణాలలో అవిరామంగా చేసే మూవ్మెంట్స్ లా ఉండవు. బ్యాలేట్లలో బ్యాలరీనాలు భూ గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తున్నట్లుగా అనిపిస్తే, మన నృత్యాలలో దీనికి విరుద్ధంగా అనిపిస్తుంది.
‘Except for certain aspects of Kathakali and the Chlau forms, none of the Indian dance styles use large leaps’ కపిలా వాత్సాయన్ 7(ఐ.సి.డి. పు.సం.14). కపిలా వాత్సాయన్ వివరించినట్లు, కథాకళి, చౌ లాంటి కొన్ని నృత్య నాటకాలలో మాత్రమే పెద్ద పెద్దగా చేసే భ్రమరీలను చూస్తాము తప్పించి, మిగిలిన నృత్యాలన్నింటిలో భ్రమరీలు చిన్నవిగా, ఉన్న పరిమిత పరిధిలోనే చెయ్యడం గమనిస్తాం.
‘The pirouettes or the chakkar, as they are known in popular terminology, are usually the finale of a dance sequence. They are usually grouped together in a series of three, as in the aridis of Bharatanatyam.’ కపిలా వాత్సాయన్ 8 (ఐ.సి.డి. పు.సం.90). కథక్ నృత్యంలో చక్కర్లు మామూలుగా ప్రదర్శనను ముగించే సమయంలో చేస్తారు. ఇవి భరతనాట్యం వర్ణాలలో లయ-తాళానికి అనుగుణంగా మూడుమార్లు రిపీట్ అయ్యే ‘అరిది’తో (ప్రతి జతి ముగిసేటప్పుడు చేసేది) పోలి ఉంటుంది. భరతనాట్యంలోని జతిస్వరాలు, తిల్లానాలవంటి వాటిలో నృత్యాన్ని సుందరీకృతం చెయ్యడానికి చేస్తారు. దీన్ని సునీల్ కొఠారీ గారు కూడా తన రాసిన భరతనాట్యం పుస్తకంలో ఇలా సమర్దించారు.
‘The outstretched arm positions, leg extensions, the bhramaris, the pirouettes give the tillanas a certain dynamic quality’ 9 (బి.ఎన్. పు.సం.102). వీటి ద్వార మనం ఒక విషయాన్ని గ్రహించగలం. పాశ్చాత్య బ్యాలెట్లో పిరౌట్లు కథలో అంతర్భాగామైతే, మన నృత్యాలలో ‘నృత్తాంశాల’ను సుందరీకృతం చేయడానికే ఎక్కువగా వినియోగిస్తున్నాము. మణిపురీలోని రాధామాధవుల రాసలీల వంటి కొన్ని సందర్భాల్లో తప్పించి అభినయంలో ప్రత్యేకించి వీటి వాడకం తక్కువగానే ఉంటుంది.
పాశ్చాత్య బ్యాలెట్లో పిరౌట్లు సంగీతానికి తగినట్టు సాగిపోతూ ఉంటే, మన నృత్యాలలో అవి జతులు, గతులు మరియు తాళానుసారంగా విరుపులు, కూడికలతో సాగుతాయి అని వీడియో డాక్యుమెంటరీలను పోల్చి చూస్తే అర్థమౌతుంది.
4. ఉపసంహారం
- ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్న అంశాలు క్రింది విషయాలను స్పష్టం చేస్తాయి.
- కథలోని పాత్రల యొక్క స్వభావాలను మరింత ధృడంగా ఆవిష్కరించడానికి పిరౌట్లు ఎంతగానో దోహదపడ్డాయి.
- స్వాన్ లేక్ వంటి కథలో, ఏకధాటిగా చేసే 32 ఫౌట్టెలు బ్యాలరీనాల శారీరక, మానసిక సమతుల్యతలతో పాటుగా ఎన్నో సంవత్సరాల కొద్దీ చేసే సాధనను సూచిస్తుంది.
- మానసికంగా స్పష్టమైన భావాలతో పాటుగా క్లిష్టమైన ద్వంద్వ భావాలను కూడా ఈ పిరౌట్లు సమర్థవంతంగా తెలుపగలవు అనుకున్న పరికల్పన సబబే అని తెలుస్తుంది. ఉదా: గిసేల్లోని ‘మ్యాడ్ సీన్’
- కేవలం భావనలను మాత్రమే కాక, రంగస్థలం పై ఎన్నో ఇతర అంశాలను కూడా ఈ పిరౌట్లు సమర్థవంతంగా ప్రేక్షకులకు చేరవేసాయి. ఉదా: నట్ క్రాకర్ బ్యాలెట్లో ‘లాండ్ ఆఫ్ స్వీట్స్’ రాజ్యపు ఊహాలోకాన్ని ఆవిష్కరించడానికి, అలాగే గిసేల్లో విలీస్ (ఆత్మలు) స్మశానపు లోక వాతావరణాన్ని చూపడం వంటివి.
- భారతీయ నృత్యాలతో పోల్చి చూస్తే బ్యాలెట్ పిరౌట్ల భావవ్యక్తీకరణ భిన్నం అని తెలుస్తుంది.
5. పరిమితులు
- నాట్యంలో భావవ్యక్తీకరణ సమర్థవంతంగా జరగాలంటే సరైన పాత్రల ఎంపిక, సరైన సంగీతం, రంగ స్థలంపై సందర్భానుసారం ఉపయోగించబడే ప్రాపర్టీస్ వంటి ఎన్నో అంశాల అవసరం కూడా ఎంతో ఉంటాయి. కేవలం పిరౌట్ల కారణంగానే భావవ్యక్తీకరణ జరుగుతోంది అంటే ఏకపక్ష వాదన అవుతుంది. పై చెప్పబడిన అన్నింటిలోను పిరౌట్ల పాత్ర అధికమాత్రo అని చెప్పగలం.
- పై చర్చించిన బ్యాలేట్లకు తరువాత కాలంలో ఎందరో బ్యాలెట్ దిగ్గజులు కళాత్మకమైన మార్పులు చేర్పులు చేసుకుని తమదైన శైలిలో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. కావున, ఈ అధ్యయనం కొరకు ఒరిజినల్ కొరియోగ్రఫీలనే ఎంచుకోవడం జరిగింది. ఇతర వెర్షన్లలో కొన్ని తేడాలు ఉండవచ్చు.
6. పాదసూచికలు
- మూవ్మెంట్ అండ్ మిమేసిస్: ది ఐడియా ఆఫ్ డాన్స్ ఇన్ ది సంస్క్రిటిక్ ట్రెడిషన్, పుట: 206
- మూవ్మెంట్ అండ్ మిమేసిస్: ది ఐడియా ఆఫ్ డాన్స్ ఇన్ ది సంస్క్రిటిక్ ట్రెడిషన్, పుట: 182
- అభినయ దర్పణం, పుట: 392
- టెక్నికల్ మ్యానువల్ అండ్ డిక్షనరీ ఆఫ్ క్లాసికల్ బ్యాలెట్, పుట: 165
- టెక్నికల్ మ్యానువల్ అండ్ డిక్షనరీ ఆఫ్ క్లాసికల్ బ్యాలెట్, పుట: 152 & 155
- ఇండియన్ క్లాసికల్ డాన్స్, పుట: 14
- పైదే.
- ఇండియన్ క్లాసికల్ డాన్స్, పుట: 90
- భరతనాట్యం, పుట: 10
7. ఉపయుక్తగ్రంథసూచి
- అప్పారావు, P.S.R. (1957), నాట్యశాస్త్రము, నాట్యమాలా పబ్లికేషన్స్, హైదరాబాదు.
- అప్పారావు, P.S.R. (1987), అభినయ దర్పణం, నాట్యమాలా పబ్లికేషన్స్, హైదరాబాదు.
- కోఠారీ, సునీల్. (2000), భరతనాట్యం, మార్గ్ పబ్లికేషన్స్, ఇండియా.
- గెస్ట్, ఐవర్. (1966), రొమాంటిక్ బ్యాలెట్ ఇన్ పారిస్, లొవె & బ్రైడన్ ప్రింటర్స్, లండన్.
- గ్రాంట్, గెయిల్. (1982), టెక్నికల్ మ్యానువల్ అండ్ డిక్షనరీ ఆఫ్ క్లాసికల్ బ్యాలెట్, డోవర్ పబ్లికేషన్స్, న్యూయార్క్.
- పలిక్, కాథరిన్, E. (2011), వాగానోవా టుడే: ది ప్రిసర్వేషన్ అఫ్ పెడోగోగికల్ ట్రెడిషన్, యూనివర్సిటీ ప్రెస్ ఆఫ్ ఫ్లోరిడా, USA.
- ఫిషర్, జెన్నిఫర్. (2003), నట్ క్రాకర్ నేషన్ : హౌ ఏన్ ఓల్డ్ వరల్డ్ బ్యాలెట్ బికేం క్రిస్మస్ ట్రెడిషన్ ఇన్ ది న్యు వరల్డ్, ఏల్ యూనివర్సిటీ ప్రెస్, లండన్.
- బోస్, మందాక్రాంత. (1991), మూవ్మెంట్ అండ్ మిమేసిస్: ది ఐడియా ఆఫ్ డాన్స్ ఇన్ ది సంస్క్రిటిక్ ట్రెడిషన్, స్ప్రింగర్ సైన్సు + బిసినెస్ మీడియా పబ్లికేషన్స్, కెనడా.
- లీ, కరోల్. (2002), బ్యాలెట్ ఇన్ వెస్ట్రన్ కల్చర్: ఏ హిస్టరీ ఆఫ్ ఇట్స్ ఆరిజన్ అండ్ ఎవోల్యుషన్, రౌట్లేడ్జ్ పబ్లికేషన్స్, న్యూయార్క్ & లండన్.
- వాకర్, మార్గరెట్. E. (2014), ఇండియాస్ కథక్ డాన్స్ ఇన్ హిస్టారికల్ పర్స్పెక్టివ్, ఆష్గేట్ట్ పబ్లికేషన్స్, ఇంగ్లాండ్.
- వాత్సాయన్, కపిల. (1997), ఇండియన్ క్లాసికల్ డాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ పబ్లికేషన్స్, ఇండియా.
- విలే, ఆర్,జే (1985). చైకోవ్స్కే బ్యాలేట్స్: స్వాన్ లేక్, స్లీపింగ్ బ్యూటీ, నట్ క్రాకర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, న్యూయార్క్
- వేణుగోపాలరావు, పప్పు & థాకోర్, యశోద. (2013), నృత్త రత్నావాలి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, వరంగల్.
- స్మిత్, మరియాన్. (2000), బ్యాలెట్ అండ్ ఓపెరా ఇన్ ది ఏజ్ అఫ్ గిసెల్, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్, న్యు జెర్సీ.
- హోమన్స్, జెన్నిఫర్. (2010), అపోల్లో’స్ ఏంజెల్స్: ఏ హిస్టరీ ఆఫ్ బ్యాలెట్, ది రాండం హౌస్ పుబ్లిషింగ్ గ్రూప్, న్యూయార్క్.
- Dance Squad by Zotov, ‘BALLET - THE NUTCRACKER | Gergiev | PETIPA | TCHAIKOVSKY |’, ‘youtube’, Dec 1, 2021, https://youtu.be/_smhJKjsukQ?si=ungNKpkCrXc83sE-
- WarnerClassics, ‘Tchaikovsky: Swan Lake - The Kirov Ballet’, ‘youtube’, Mar 7, 2012, https://youtu.be/9rJoB7y6Ncs?si=oBdYz4CmYltCvoWJ
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

