headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. పదకోశాలలో చేరే సాహిత్యవిమర్శపదజాలం

(ICSSR మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ 2023-24)

DOI

డా. సిహెచ్. లక్ష్మణచక్రవర్తి

అసిస్టెంట్ ప్రొఫెసర్ & ప్రాజెక్టు డైరెక్టర్,
తెలుగు అధ్యయన శాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్పల్లి,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 9849714261
Email: chakravarthy.hyd@gmail.com

డా. జాగర్ల మహేందర్

రీసెర్చ్ అసిస్టెంట్ (ICSSR - ప్రాజెక్టు)
తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్పల్లి,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 8008252967
Email: jmrhcu143@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.01.2025        ఎంపిక (D.O.A): 28.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

ఆంగ్ల సాహిత్యప్రభావంతో తెలుగులోకి అనేక ప్రక్రియలు వచ్చాయి. అందులో సాహిత్యవిమర్శ కూడా ఒకటి. ఇటీవలి కాలంలో ఆంగ్లభాష ప్రభావానికిలోను కాని భాష లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తెలుగులోకి ఆంగ్ల సాహిత్యవిమర్శ పదజాలంకూడా వచ్చి చేరింది. ఇలాంటి సాంకేతిక పదాలు విమర్శ ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగపడతాయి. ఇటీవలి దశాబ్దాలలో అకడమిక్ లిటరరీ థియరీ అభివృద్ధి ద్వారా ఉత్పన్నమైన అనేక పదాలను చేర్చడానికి అవకాశాన్ని పదకోశాలిచ్చాయి. వీటితోపాటు సాహిత్యవిమర్శ, సాహిత్యచరిత్ర, తెలుగులో ప్రక్రియలుగా వచ్చిన సాహిత్యం, సామాజికశాస్త్రాలు, మనోవిజ్ఞాన, తత్వశాస్త్రాలు, పర్యావరణం, మానవీయశాస్త్రాలు, ప్రకృతిశాస్త్రం, అలంకారశాస్త్రం నుండి వందలాది పదాలు సాహిత్యవిమర్శలో కనిపిస్తున్నాయి. సాహిత్యవిమర్శ పదజాలాన్ని ఈ కింది రీతులుగా వర్గీకరించవచ్చు. 1.Concepts/Ideas – భావనలు- చింతనలు, 2. Genres – ప్రక్రియలు, 3.Theories – సిద్ధాంతాలు, 4. Literary trends and isms - సాహిత్యధోరణులు, వాదాలు. నాటకపరిభాషా నిఘంటువులలో పనిముట్లు కూడా పరిభాషగా కనిపిస్తాయి. ఇతర కళలలో పనిముట్లు పరిభాషగా ఉండే స్థితి ఉంది. ఏది సాహిత్యవిమర్శ పదమవుతుందన్నది, పరిభాష అవుతుందన్నది నిర్ణయించుకుంటే ఆ అధ్యయనం తెలుగు సాహిత్యవిమర్శపదజాలానికి తోడ్పడుతుంది. జరగవలసిన కృషిని చెప్పడానికి అవకాశం ఇస్తుంది. తెలుగు సాహిత్యవిమర్శ ప్రారంభమై 150 సంవత్సరాలు గడుస్తున్నా సాహిత్యవిమర్శ పరిభాష విషయంలో ఒక అస్పష్టత ఉంది. సాహిత్యవిమర్శకులు ఒకే భావనకు రెండు పరిభాషపదాలు ఉపయోగించడం, పరిభాష సరైన రీతిలో సాహిత్యవిమర్శ సమాజంలోకి చొచ్చుకొని పోకపోవడం వంటి అంశాలు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించడానికి ఏది సాహిత్యవిమర్శ పదమో అవగాహనలోకి తెచ్చుకోవాలి. దానిని వివరించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. సాహిత్యవిమర్శ పరిభాష నిఘంటువులు, పదకోశాలు తయారు చేయాలంటే దానికి తగిన నిర్మాణరీతులను అవగాహన చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఏవి పరిభాషలు అవుతాయో తెలుసుకోవడం అంతే ముఖ్యం. అందుకు సాహిత్యవిమర్శ పదకోశాల్లో చేరే పదాలు ఏవి అన్న అవగాహనను తేవడంలో ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావించవచ్చు. ఏవి సాహిత్యవిమర్శ పదాలు అవుతాయో వివరించడంలో విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించింది. అయితే ఆ విశ్లేషణకు అనుగుణంగా కొన్ని పదాలను నమూనాగా నిఘంటు పద్ధతిలో కూర్చడం జరిగింది. నిఘంటువు, విశ్లేషణ పద్ధతి ఈ వ్యాసంలో అనుసరించిన పద్ధతి. భారతీయసాహిత్య- అలంకార శాస్త్రం మొదలు పాశ్చాత్యసాహిత్యవిమర్శ పరిణామవికాసాల వరకు మనం గమనించినప్పుడు భావనలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు, ఉద్యమాలు, ధోరణులు, సాహిత్యయుగాలు వంటివి పరిభాష గౌరవాన్ని పొందాయి. తెలుగు సాహిత్యవిమర్శ పదంగా అర్హత సాధించగల పదాల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మిగతాశాస్త్రాలకు ఉన్నంత స్పష్టత సాహిత్యవిమర్శకు లేకపోవడానికి కారణం దీనిని కొందరు శాస్త్రంగా, కొందరు కళగా భావించడమేననిపిస్తుంది. కళను గురించి మాట్లాడవలసిన పరిస్థితులలో అది కొన్ని భావనలనూ, సిద్ధాంతాలను ఏర్పరుస్తుంది. ఈ అవగాహన స్పష్టంగా ఉన్నప్పుడు ఏది పరిభాష అవుతుంది అన్న అనుమానానికి, సందిగ్ధతకు తావు లేదు. అయినా సాహిత్యవిమర్శ పదాలుగా గతంలో, వర్తమానంలో చేరిన వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చేరబోయే పదాలను గురించి స్పష్టతను తెచ్చుకోవచ్చు.

Keywords: Ideas, Concepts, Theories, Genres, Literary Trends and Isms. Literary Criticism, భావనలు, పిద్ధాంతాలు, ప్రక్రియలు, ఉద్యమాలు,ధోరణులు, వాదాలు, సాహిత్యవిమర్శ.

1. ఉపోద్ఘాతం:

సాహిత్యం ఎలా ఉండాలి? దాని స్వభావం ఏమిటి? అని చెప్పే క్రమంలోనే సాహిత్యశాస్త్రం రూపుదిద్దుకుంటుంది. ఇదే స్థితి శాస్త్ర, సాంకేతికరంగాలకు, సామాజికశాస్త్రాలకు కూడా వర్తిస్తుంది. ఇవి ఎదుగుతున్న క్రమంలో వివిధభావనలను చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. వాటిని సూక్ష్మంగా వివరించడానికి పరిభాషను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. పదకోశాలలో చేరే సాహిత్యవిమర్శ పదజాలం ఏది? పదకోశాలలోకి చేరే అర్హతను ఏ పదాలు పొందుతాయి? అనేవి ఇప్పటికే తెలుగులో వచ్చిన పదకోశాల ఆధారంగా నిర్ణయించవచ్చు. సాహిత్యపరిణామాన్ని గుర్తించడానికి సాహిత్యవిమర్శ పదజాలం కూడా అంతే ఉపయోగపడుతుంది.

2. సాహిత్యవిమర్శ పదజాలం:

సాహిత్యవిమర్శలో భావనలు, యుగాలు, ప్రక్రియలు, ప్రక్రియభేదాలు సిద్ధాంతాలు, సాంకేతికంగా ఒక అర్ధాన్ని వివరించేవి పరిభాషగా వాడుతున్నాం. భాషాశాస్త్రం, వ్యాకరణం వంటివి ప్రత్యక్ష సాహిత్యవిమర్శలు కాదు. కానీ అందులో కూడా సాంకేతికమైన అంశాలుంటాయి. అవి సాహిత్యవిమర్శ భావనను అర్థం చేసుకోడానికి తోడ్పడుతూ ఉంటాయి. సాహిత్యవిమర్శలో సాంకేతిక పదాలంటే భావనలు, సాహిత్యసిద్ధాంతాలు, ఉద్యమాలు, ధోరణులు, వాదాలు, ప్రక్రియలు. ఇవి సాహిత్యవిమర్శ పరిభాష పదాలుగా కనిపిస్తాయి. స్థూలంగా సాహిత్యవిమర్శ పదకోశాలలో ఈ కింది అంశాలు పరిభాషగా కనిపిస్తుంటాయి.
1)భావనలు 2) ప్రక్రియలు 3) సిద్ధాంతాలు 4 ) ఉద్యమం-వాదం-దృక్పథం-ధోరణి.

2.1 Concepts/Ideas – భావనలు- చింతనలు:

సాహిత్యంలో భావన అంటే ఆలోచన. సైన్స్ ఫిక్షన్ కథలలో ఆ భావనలు ఊహాజనిత అంశాలు, కల్పనలు కావచ్చు. కాల రంధ్రాన్ని చూడటం లేదా సమయ ప్రయాణాన్ని అనుభవించడం వంటి దృగ్విషయాలను కూడా భావనలుగా వర్ణించవచ్చు. విజువలైజేషన్ అని పిలువబడే సాహిత్యపరికరం కథా వాతావరణాన్ని వివరిస్తుంది.

మనం స్టార్వార్స్ని(ఎ న్యూ హోప్) ఉదాహరణగా ఉపయోగిస్తే, ఈ కథలోని ఒక అంశం; కమింగ్ ఆఫ్ ఏజ్;లూక్ కేవలం ఎగరాలని కోరుకుంటాడు. కానీ, సామాజిక స్పృహ కలిగి ఉండటానికి నిస్వార్థంగా మంచికి సేవ చేయడానికి ఆలోచిస్తాడు కాబట్టి ఇదొక వస్తువు. ఇందులో సత్యసేవ, ధర్మబుద్ధి అన్న రెండు భావనలున్నాయి. అవి వివరించే సందర్భంలో యువత, స్వార్థం, ఆత్మన్యూనత, పరిపక్వత అన్నవి కూడా భావనల స్థాయిని పొందుతాయి.

సాహిత్య, సామాజిక సిద్ధాంతాలు ఏర్పడే క్రమంలో ఆ సిద్ధాంతాన్ని వివరించేందుకు వాటి ఉపభేదాలను చెప్పేందుకు భావనలు (concepts) అవసరమవుతాయి. ధ్వని అన్న ఆనందవర్ధనుని సిద్ధాంతంలో ధ్వనిభేదాలు, వక్రోక్తి సిద్ధాంతంలో వక్రోక్తిభేదాలు, ఉప విభాగాలు, ఔచిత్య సిద్ధాంతంలో ఔచిత్యబేధాలు భావనల వంటివే. సిద్ధాంతంలోని ఉపభేదాలు భావనలే.
ఫిక్షన్ అన్న ఒక విషయంలో కథనం పాత్ర వంటివి భావనలు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వస్తుకళ, భావకళ, రచనాకళ అన్న రచనారీతులను భావనలుగా ప్రవేశపెట్టారు. ఇవి ‘కళ’ అన్న పెద్ద విషయంలో సాహిత్యానికి సంబంధించినవి. రాళ్లపల్లివారు నన్నయ, తిక్కన, నాచన, సోమనల రచనలను ఆధారంగా చేసుకొని ఈ భావనలను ప్రవేశపెట్టారు. శ్రీశ్రీ శుద్ధకవిత్వం, ఉపయోగ కవిత్వం రసన వంటివి భావనలే. భావనలు ఆయా అంశాలను వివరించే క్రమంలో ఏర్పడేవిగా కూడా ఉంటాయి.

ఉదాహరణ:

రాళ్లపల్లి చెప్పిన వస్తు, భావ, రచన కళలు. చేకూరిరామారావు వ్యూహం, అరిస్టాటిల్ చెప్పిన త్రివిధ ఐక్యతలు, ఐ.ఏ.రిచర్డ్స్ కవిత్వ విశ్లేషణలో ప్రవేశపెట్టిన Sence, Feelings, Tone, Intention వంటివి అన్నీ భావనలే.

వర్తమాన కవిత్వంలో వైవిధ్యం ప్రధానంగా నాలుగు అభివ్యక్తి విధానాల ద్వారా వస్తున్నది. అవి 1. Metaphor, 2. Metagnomy, 3. Synecdoche, 4. Paradox. వీటిని Tropesగా విమర్శకులు వ్యవహరిస్తున్నారు. Tropes అన్నది ఒక భావన.

భావనల రూపంలోని సాహిత్యవిమర్శ పదాలు:

S. No

ENGLISH

TELUGU

TELUGU

1

Alienation

పరాయీకరణ

పరాయితనం, అన్యథాకరణ, పృథక్కరణ

2

Ambiguity

అస్పష్టత

సందిగ్ధత

3

Archetype

ప్రాగ్రూపం

మూలరూపం

4

Catharsis

భావశుద్ధి

క్షాళన, ప్రక్షాళన, ఆత్మప్రక్షాలనం, తాదాత్మ్యస్థితి, మమేక స్థితి, భావోద్రకం

5

Conceit

అసాధారణ పోలిక

ఆలంకారిక ఊహ, అసంగతకల్పన

6

Context

పాఠ్యసందర్భం

సందర్భం

7

Convention

సంప్రదాయం

ధర్మి, నియమం, రూఢులు, కవిసమయాలు

8

Deconstruction

వినిర్మాణం

వినిర్మాణవాదం

9

Denotation

అభిధ

వాచ్యార్థం, ముఖ్యార్థం

2.2 Genres – ప్రక్రియలు:

సాహిత్యం, సారస్వతం, వాఙ్మయం అన్న మాటలను ఒకదానికొకటి పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నాం. నైఘంటికార్థంలో వీటికి అర్థభేదం ఉన్నా ఇంచుమించుగా వీటిని సమానార్థకాలుగానే వాడుతున్నాం. విషయం వస్తువుగా మారడం వెనుక కళాత్మక విలువలు కారణంగా నిలుస్తాయి. వస్తువు + కళాత్మక విలువలు = రచన అవుతుంది. రచన వస్తురూప, శిల్ప, నిర్మాణాలకు సంబంధించింది. వస్తురూపాల నిర్మాణాన్నే స్థూలంగా ప్రక్రియ అంటారు.
ప్రక్రియ శబ్దాన్ని ‘Genre’ అన్న ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా ఉపయోగిస్తున్నాం. రాజశేఖరుడు-విభాగం అన్న అర్థంలో ప్రక్రియా శబ్దాన్ని ప్రయోగించారు. తెలుగు నిఘంటువులలో ఈ మాటకు “మేలైన కార్యము, అధికారము శబ్దరూపం కలిగిన విధము కావింపదగిన కార్యము, కార్యవిధానము అన్న అర్థాలు కనిపిస్తున్నాయి” అని (శబ్దరత్నాకరము, 2018: 1074) బహుజనపల్లి సీతారామాచార్యులు స్థూలంగా నిఘంటువులు; విధానం; అన్న అర్థాన్ని చెబుతున్నాయి. ఈ అర్థాలలోని కార్య శబ్దానికి రచనాకార్యం అని అర్థం చెప్పుకోవచ్చు.

ఒక కవిదర్శనం నుండి ఒక సమగ్ర అనుభూతిని సామాజికులకు అందించాలనే ప్రయోజనంతో రచనారూపంలో అభినవంగా అవతరించే సాహితీమూర్తిమత్వం ప్రక్రియ. ఒక రచన సృజింపబడుతున్నప్పుడే దాని స్వభావాన్ని అదే అభివ్యక్తం చేసుకుంటుంది. అలా అభివ్యక్తమయ్యే కావ్యస్వభావం తర్కబద్ధంగా ఉంటుంది. దీనిని అంగీకరిస్తే గతితర్కాన్ని ఆశ్రయించి ఒక స్వరూప స్వభావాన్ని సంతరించుకున్న రచన ఒక వర్గంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లీషులో ఈ వర్గాలనే Mode, Kind, Type అంటారు. అయితే “ఈ తార్కిక వివేచన విధానానికి కూడా ఒక స్వయం సమగ్ర లక్షణభావం ఉండాలి. అటువంటి తార్కిక వ్యవస్థ గల రూప భావానికి ప్రక్రియ పేరు” అని (సాహిత్యచరిత్రలో చర్చనీయాంశాలు,1992:228) జి.వి. సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

రూపం, రచన, విషయం వంటి ఉమ్మడి లక్షణాలు గల సాహిత్యరచనను ప్రక్రియ అంటారు. స్వరూపమంటే వ్యక్తీకరణ పద్ధతి. దీన్నే రూపం అంటారు. స్వభావం అంటే చెప్పిన విషయం. ఈ వస్తువులో రచయిత, ఉద్దేశం, లక్ష్యం, సందేశం ఉంటాయి. రూపంలో శైలి, నిర్మాణం వంటివి ఉంటాయి. కాబట్టి వస్తురూపాలు నిర్మించబడ్డ పద్ధతి ద్వారా ఒక రచనను ప్రక్రియగా గుర్తిస్తున్నాం. పాశ్చాత్యులు Mode, Kind, Type అన్న అంశాల ఆధారంగా ప్రక్రియా వివేచన చేస్తారు. వీటినే తెలుగులో మనం విషయం, వ్యక్తీకరణ పద్ధతి, రూపం అనవచ్చు. ఈ మూడంశాల సమాహార నిర్మాణమే ప్రక్రియ, ప్రక్రియా భేదాలకు మూలం. ఈ ప్రక్రియలను విభజించటానికి గుర్తించడానికి 1. నిర్మాణ వైవిధ్యం 2. వస్తు వైవిధ్యం 3. కథాసూత్ర వైవిధ్యం 4. అభివ్యక్తి వైవిధ్యం అన్న నాలుగంశాలు అవసరమని పాశ్చాత్య విమర్శకులు అభిప్రాయపడ్డాడు.

ప్రక్రియ రూప భావానికి సంబంధించినదని భావిస్తున్నాం. ఈ రూప భావానికి చెందిన ప్రక్రియలో నిర్మాణం,వస్తువు, కథాసూత్రం, అభివ్యక్తి అన్నవి ప్రాథమిక లక్షణాలు. ఈ అంశాల ఆధారంగానే రచనను ప్రక్రియగా గుర్తిస్తున్నాం. ఒక ప్రక్రియలో భేదం ఏర్పడడానికి ఈ నాలుగింటిలో ఏదో ఒకటి కారణం అవుతుంది. నిర్మాణాన్ని బట్టి నవల - నవలిక, వస్తువును బట్టి పురాణం, క్షేత్రమాహాత్మ్యం, కథాసూత్రాన్ని బట్టి కథాకావ్యం- కావ్యం, అభివ్యక్తి భేదాన్ని బట్టి సంకీర్తన, పదం, కృతి, ప్రబంధం, శ్లేషకావ్యం వంటివి ప్రక్రియలుగా పరిగణింపబడుతున్నాయి.

భారతీయ కావ్యశాస్త్రం, ఆలంకారికులు అనేక ప్రక్రియలను చెప్పకుండా శ్రవ్యం, దృశ్యం అని కావ్య ప్రక్రియను పేర్కొన్నారు దృశ్యకావ్యపదిభేదాలు, శ్రవ్యకావ్య ప్రక్రియలో మధుర, విస్తర, ఆశు, చిత్ర కవిత్వాలన్న చతుర్విధభేదాలు చెప్పారు. మధురకవిత్వం సంకీర్తన, గేయాలకు సంబంధించింది. విస్తర కవిత్వమంటే కావ్యప్రబంధాలు. ఆశుకవిత్వంలో ఏకపాద, త్రిపాద, కఠినప్రాసవంటి నిషేధాక్షర రచనలు, చాటువులు, అవధానాలు చేరుతాయి. చిత్రకవిత్వం ఒక వృత్తంలో మరోవృత్తం వచ్చేట్లు చెప్పడం. శ్రవ్యకావ్యం చతుర్విధ కవిత్వభేదాలను పొందింది. మధుర కవితాశాఖకు చెందిన రచనా రీతులు దృశ్యకావ్యంలోకి చేరి యక్షగానాలు, గేయనాటికలు, సంగీతరూపకాల వంటి మిశ్రప్రక్రియలు తయారయ్యాయి. అందువల్ల ప్రక్రియలను శుద్ధప్రక్రియలు, ప్రక్రియాభేదాలు, మిశ్రప్రక్రియలు అని మూడుగా విభజించవచ్చు.

వస్తువును బట్టి : ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం

నిర్మాణం : గద్యం, పద్యం, చంపువు - వీటిలో అనుసరించిన నిర్మాణాన్ని బట్టి సంకలన కావ్యం, దండకం, ఇతిహాస కావ్యం అన్నవి ఉంటాయి.

అభివ్యక్తి : మధుర, విస్తర, ఆశు, చిత్ర కవిత్వాలు

కథాసూత్రాన్ని బట్టి : స్మృతికావ్యం, హితోపదేశ కావ్యం, కర్షక కవిత్వం, వర్ణనాత్మక కావ్యం, కథాత్మక కావ్యం.

ప్రక్రియ ప్రాథమిక లక్షణాలనుంచీ ఈవిధంగా అనేక విభాగాలు చేయవచ్చు. ప్రాథమికమైనవి ప్రక్రియలుగా, తర్వాతవి ప్రక్రియాభేదాలుగా గుర్తించబడతాయి. ఒక ప్రక్రియకు సంబంధించిన రచనలో మరోప్రక్రియను అన్వయించినపుడు, రెండు భిన్న ప్రక్రియలను సమ్మిశ్రణం చేసి కొత్త ప్రక్రియను సృష్టించినట్లయితే దానిని; మిశ్ర ప్రక్రియ; అంటారు. అందువల్ల మూలప్రక్రియ అన్న అర్థంలో చెప్పినపుడు ప్రక్రియల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రక్రియాభేదాలలోని విలక్షణతను ఒప్పుకుంటే ప్రక్రియల సంఖ్య పెరుగుతుంది.

ప్రాచీన సాహిత్యప్రక్రియలలో అధికభాగం సంస్కృతవాఙ్మయం నుండి రాగా, కొన్ని స్థానికంగా పుట్టినవి. ఆధునిక సాహిత్యప్రక్రియలలో అధికభాగం పాశ్చాత్య సాహిత్యం నుండి వచ్చినవి. తెలుగు సాహిత్యప్రక్రియలను స్థూలంగా చూసినప్పుడు అరువు తెచ్చుకున్నవనిపిస్తుంది. ఇది లిఖిత సాహిత్యానికి సంబంధించిన విశ్లేషణ. జానపదసాహిత్యవిషయానికి వచ్చినప్పుడు దేశీయమైనవి ఎక్కువ అని తెలుస్తుంది. అయితే లిఖితసాహిత్యప్రక్రియలలో కూడా కొన్ని సంస్కృతం నుండి స్వీకరించినా కొన్ని దేశీయ లక్షణాలు కనిపిస్తాయి. సంస్కృతంలో కావ్యం సాధారణంగా ఒకే వృత్తంలో నడుస్తుంది. తెలుగులో అనేక వృత్తాలను వాడడం సంప్రదాయం. సంస్కృతంలో పద్యకావ్యమంటే కేవలం ఛందోబద్ధమైన పద్యరచన. అదే తెలుగులో పద్యకావ్యమంటే చంపూరచన. అందువల్లే ద్విపద, నిర్వచన కావ్యాలను ప్రత్యేకంగా పేర్కొనవలసి వస్తుంది. రెండర్థాల కావ్యం ద్వ్యర్థి కావ్యం, మూడర్థాలయితే త్య్రర్థి, నాలుగర్థాలయితే చతురర్థి కావ్యం. వీటిని విడివిడి ప్రక్రియలుగానూ పేర్కొనవచ్చు. అన్నీ కలిపి అనేకార్థక కావ్యం అని ఏక ప్రక్రియగానూ చెప్పవచ్చు. ప్రక్రియల సంఖ్య తరగడానికీ పెరగడానికీ ఈవిధమైన ప్రమాణాలు కారణమవుతాయి.

ప్రక్రియల రూపంలోని సాహిత్యవిమర్శ పదాలు:

S.No.

ENGLISH

TELUGU

TELUGU

1

Comedy

మోదరూపకం

-

2

Closet Drama

పఠనీయ నాటకం

శ్రవ్యనాటకం

3

Elegy

శోకకావ్యం

స్మృతికావ్యం

4

Epic

ఇతిహాసం

-

5

Epic Theater

మహానాటకం

కావ్యనాటక రంగం

6

Folk Drama

జానపదనాటకం

గ్రామీణనాటకం

7

Folksong

జానపదగేయం

జానపదగీతం

8

Free Verse

వచనకవిత

స్వేచ్ఛాకవిత

9

Heroic Poetry

మహాకావ్యం

వీరఛందం

10

Heroic Drama

వీరనాటకం

ఉదాత్త నాటకం

2.3 Theories – సిద్ధాంతాలు:

సాహిత్యసిద్ధాంతం సాహిత్యపఠనంలో మనం ఉపయోగించే ఆచరణాత్మక ఆలోచనా పద్ధతి. సాహిత్యసిద్ధాంతం ద్వారా మనం సాహిత్యార్థాన్ని కాకుండా సాహిత్యానికి అర్థం ఏమిటో వెల్లడించే సిద్ధాంతాలను సూచిస్తాం. సాహిత్యసిద్ధాంతం సాహిత్యచింతన, ఆలోచన, మీమాంసల పాఠశాల. సాహిత్యవిశ్లేషణ శైలి. ఇది సాహిత్యపు ఆలోచనలు సూత్రాలను విమర్శించడానికి పాఠకులకు మార్గాన్ని ఇస్తుంది. సాహిత్యసిద్ధాంతానికి మరొక పదం హెర్మెనిటిక్స్, ఇది సాహిత్యవివరణకు వర్తిస్తుంది. సాహిత్యసిద్ధాంతం ఒక నిర్దిష్ట యుగం, భౌగోళికస్థానం లేదా నిర్దిష్ట నేపథ్యాలు, గుర్తింపులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది.

భరతుడి నాటి నుంచి జగన్నాథ పండితరాయల దాకా సాహిత్యానికి సంబంధించి ఈ దేశంలో సాగిన ఆలోచనాధార, విచార విధానం, వివిధాంశాల ప్రతిపాదనలు చర్చలు, సిద్ధాంతాలూ మొదలైన ఈ సమస్తాన్నీ భారతీయ సాహిత్యసిద్ధాంతాలంటారు. కావ్యానికి శరీరం, గుణం, ఆత్మ, జీవితం ఉన్నాయని చెబుతూ కావ్యసౌందర్యానికి కారణమైన అంశాలను, దాని జీవితాన్ని మనముందు నిలిపింది. కావ్య ఆత్మగా ధ్వని, జీవితం వక్రోక్తి, ఔచిత్యంతో కూడి ఉండడం వల్ల మాత్రమే గాక పాఠకుడికి రసానుభూతి కలుగుతుందని భారతీయ సాహిత్యసిద్ధాంతం భావించింది. అందుకే రసం ఎవరిలో ఉంటుదన్న దృష్టితో సాహిత్యవివేచన జరిగింది. కావ్యాత్మ చర్చలోని అలంకారం, గుణం, రీతి, ధ్వని, రసం, వక్రోక్తి, ఔచిత్యం అన్నవి భారతీయ సాహిత్యసిద్ధాంతాలయ్యాయి. ఇవి ఆలంకారికులు ప్రతిపాదించినపుడు వాదాలు కాగా, తర్వాతి అనుసరణలు, వాదంలోని మౌలికతల వలన సాహిత్యసిద్ధాంతాలయ్యాయి.
ఒకే రకమైన సాహిత్యరచనలలో సారూప్యతలు, వ్యత్యాసాలు, స్త్రీవాద సిద్ధాంతంతో సహా అనేక రకాల సాహిత్యసిద్ధాంతాలు ఉన్నాయి. పోస్ట్-మాడర్నిస్ట్ సిద్ధాంతం, పోస్ట్-స్ట్రక్చరలిస్ట్ సిద్ధాంతం వంటివి ఇందుకు ఉదాహరణలు. సాహిత్యం చదివేటప్పుడు పాఠకులు లోతైన అవగాహన పొందడానికి సిద్ధాంతం సహాయపడుతుంది.

సిద్ధాంతాలు రూపంలోని సాహిత్యవిమర్శ పదాలు:

S. No.

ENGLISH

TELUGU

1

Critical Theory

విమర్శనా సిద్ధాంతం

2

Cultural Theory

సాంస్కృతిక సిద్ధాంతము

3

Baconian Theory

బేకనియన్ సిద్ధాంతం

4

Reader Response Theory

పాఠక ప్రతిస్పందన విమర్శ

5

Radical Sceptical Epistemology

మౌలిక సంశయవాదం జ్ఞాన సిద్ధాంతము

6

Queer Theory

విపరీత సిద్ధాంతము

7

Racial Choice Theory

జాతి ఎన్నిక సిద్ధాంతము

8

Rational Choice Theory

హేతుబద్ధ ఎన్నిక సిద్ధాంతము

9

Reader Response Theory

పాఠక ప్రతిస్పందన సిద్ధాంతము

10

Religious Epistemology

మతజ్ఞాన సిద్ధాంతము

4. Literary Movements trends and isms – సాహిత్య ఉద్యమాలు ధోరణులు, వాదాలు:

నిర్దిష్టమయిన భూమికతో కూడినది వాదం, ఆ వాదానికి సైద్ధాంతిక స్వభావాన్ని కలిగించే దృక్పథమూ ఉంటాయి. ఇది ఒక సమష్టి కార్యాచరణ రూపంలోకి వెళ్ళినప్పుడు ఉద్యమంగా పరిణమిస్తుంది. ఇంగ్లీషు సాహిత్యంలో నేషనలిజం, మార్క్సిజం, రియలిజం, ఫెమినిజం అన్నవాటిని తెలుగులో జాతీయవాదం, మార్స్కువాదం, వాస్తవికవాదం, స్త్రీవాదం ఉపయోగించుకుంటున్నాం. ఇందులోని ఇజమ్ను వాదంగా ఉపయోగిస్తున్నాం. వీటికి అనుగుణమైన సూత్రీకరణలు సైద్ధాంతిక అంశాలను ఏర్పరచడం ద్వారా దానికి ఐడియాలజీ అంటే దృక్పథస్థాయి ఏర్పడుతుంది. ఈ సైద్ధాంతిక భూమికతో కూడిన దృక్పథాన్ని సమూహంలోకి తీసుకు వెళ్లడానికి సంఘం కావాలి. తెలుగులో అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి వాటిని చూడవచ్చు. తమ వాదాన్ని దృక్పథంతో మేళవించి తద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ఉద్యమం అయితే దానికి సాహిత్యాన్ని మాధ్యమం చేసుకుని, సామాజిక ప్రయోజనాన్ని లక్ష్యంగా కలిగి ఉండేది సాహిత్యోద్యమం అని తెలుస్తుంది. దీన్ని బట్టి సాహిత్యోద్యమానికి సామాజిక రాజకీయ సిద్ధాంతం అవసరం అని తెలుస్తుంది. అంటే వాదాన్ని భావనగా ఈ భావనకు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలు దోహదం దృక్పథంగా, దృక్పథంగల సమూహం సంఘంగా, సంఘం యొక్క సమష్టి కార్యాచరణ ఉద్యమం అని తెలుస్తుంది.

మూమెంట్ అన్న ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా తెలుగులో ఉద్యమం అన్న మాటను ఉపయోగిస్తున్నాం. ఉద్యమం అన్న మాటకు నిఘంటువులు గట్టి పూనిక, గట్టి ప్రయత్నం, కృతనిశ్చయం అన్న అర్థాలు చెబుతున్నాయి. సమానమైన ఆలోచనలు ప్రత్యేక లక్ష్యంతో సంఘటితంగా జరిగే కృషిని ఉద్యమం అనవచ్చు.

మూమెంట్ అన్న మాటకు ఇంగ్లీష్ నిఘంటువులు ఈ క్రింది విధంగా వివరణలు ఇచ్చాయి. నిర్దిష్ట లక్ష్యంతో క్రమబద్ధంగా చేసే కార్యకలాపాల సమాహారం అని ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడం కోసం జనం సామూహికంగా చేసే ప్రయత్నం అని దీనికి వివరణలు కనిపిస్తున్నాయి.

సామాజిక రాజకీయ సాంస్కృతిక సాహిత్యఉద్యమాలు వేటి లోనైనా ఈ క్రింది అంశాలు ఉంటాయి.

1. ఉద్యమ ఉద్దేశ్యాలు, 2. సిద్ధాంతం లేదా దృక్పథం, 3. ఉద్యమ కార్యక్రమాలు, 4. ఉద్యమ వ్యవస్థ లేదా సంస్థ, 5. ఉద్యమ మేనిఫెస్టో.

భిన్నవ్యవస్థల మధ్య, ఆలోచనల మధ్య, తరాల మధ్య, సంఘర్షణగా ఉద్యమాలు ఉద్భవిస్తాయి” అని (కె కె ఆర్ రచనలు. 1, 2022: 693) కె.కె. రంగనాథాచార్యులు పేర్కొన్నారు.

సామాజిక సాహిత్యఉద్యమాలకు రెండింటిలోనూ పైన పేర్కొన్న అంశాలు ఉన్నా సాహిత్యఉద్యమంలో సాహిత్యం అదనంగా చేరుతుంది. సామాజిక ఉద్యమానికి వ్యక్తుల, సిద్ధాంత అభిమానుల కార్యాచరణ ఉంటే సాహిత్యఉద్యమానికి సాహితీవేత్తల రచనాత్మక కార్యాచరణ ఉంటుంది. సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాల తో ఏదో ఒక విధమైన సంబంధాన్ని సాహిత్యఉద్యమాలు కలిగి ఉంటాయి.

‘సాహిత్యధోరణులు’ అనే పదం ఒక నిర్దిష్ట కాలం నుండి సాహిత్యాన్ని వర్ణించే ప్రబలమైన ఆలోచనలు, వస్తు రూపాలను సూచిస్తుంది. సాహిత్యం రచనల స్వభావానికి సంబంధించినది. శాశ్వతమైన సార్వత్రిక ఆసక్తికి సంబంధించిన ఆలోచనలకు సంబంధించి వ్యక్తీకరణ రూపం సాహిత్యం. సాహిత్యధోరణులు అనే పదానికి సాధారణ నిర్వచనాన్ని రూపొందించడానికి ఈ రెండింటినీ కలపవచ్చు. సాహిత్యధోరణి అనేది రచయిత ఎన్నుకున్న రూపం, భావజాలాలు, ఇతివృత్తాలు వ్యక్తీకరణలకు కట్టుబడి ఉండే విషయం, ఇది వారు వ్రాస్తున్న కాలం వలన, సమానాంశాల వలన సాహిత్యధోరణిగా గుర్తింపు పొందుతుంది. దీనిని బట్టే దిగంబరకవితా ధోరణి, అనుభూతివాద కవితా ధోరణి, భావకవితా ధోరణి, అభ్యదయ ధోరణి వంటివి ఉపయోగిస్తున్నాం. Dadaism, Dark age, Deconstruction, Rationalism వంటివి వాదాలకు సంబంధించిన పదాలు. Subjectivism, Surrealism అన్న వాటిని ఆత్మాశ్రయధోరణి, అధివాస్తవికతధోరణి, లేదా వాదంగా Marxism, Marxist Theory, Feminism, Feminist Theory మార్క్సువాదం, మార్క్సిస్టు దృక్పథం, స్త్రీవాదం, స్త్రీవాద దృక్పథం అని తెలుగులో ఉపయోగిస్తున్నాం.

సాహిత్యవిమర్శకు సంబంధించిన ఆంగ్లము, తెలుగు పదకోశాలలో వాదాలకు, ధోరణులకు, ఉద్యమాలకు సంబంధించిన పదాలు అకారాదిగా ఈ క్రింది రీతులలో కనిపిస్తాయి.

ఉద్యమాలు, ధోరణులు, వాదాలకు చెందిన సాహిత్యవిమర్శ పదాలు

S. No.

ENGLISH

TELUGU

TELUGU

1

Classicism

ప్రామాణిక రచనావాదం

సంప్రదాయవాదం

2

Dadaism

డాడాయిజం

పరమస్వాతంత్ర్యవాదం

3

Guild socialism

వర్గ సమాజవాదం

శ్రేణిమూలసమాజవాదం

4

Hedonism

సుఖవాదం

స్వయంసుఖవాదం

5

Idealism

భావవాదం

ఆదర్శ వాదం

6

Imagism

భావచిత్రవాదం

ప్రతిమ వాదం

7

Impressionism

అనుమూర్తవాదం

అభిరుచివాదం

8

Medievalism

మధ్యయుగీనత

మధ్యయుగవాదం

9

Mysticism

రహస్యవాదం

మార్మికవాదం

5. ముగింపు:

  • భారతీయ సాహిత్యఅలంకార శాస్త్రం మొదలు ప్రాచాత్య సాహిత్యవిమర్శ పరిణామ వికాసాల వరకు మనం గమనించినప్పుడు భావనలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు, ఉద్యమాలు, ధోరణులు, సాహిత్యయుగాలు వంటివి పరిభాష గౌరవాన్ని పొందాయి. 
  • తెలుగు సాహిత్యవిమర్శ పదంగా అర్హత సాధించగల పదాల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మిగతా శాస్త్రాలకు ఉన్నంత స్పష్టత సాహిత్యవిమర్శకు లేకపోవడానికి కారణం దీనిని కొందరు శాస్త్రంగా, కొందరు కళ భావించడమేననిపిస్తుంది. 
  • కళను గురించి మాట్లాడవలసిన పరిస్థితులలో అది కొన్ని భావనలనూ, సిద్ధాంతాలను ఏర్పరుస్తుంది. ఈ అవగాహన స్పష్టంగా ఉన్నప్పుడు ఏది పరిభాష అవుతుంది అన్న అనుమానానికి, సందిగ్ధతకు తావు లేదు. 
  • అయినా సాహిత్యవిమర్శపదాలుగా గతంలో, వర్తమానంలో చేరిన వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చేరబోయే పదాలను గురించి స్పష్టతను తెచ్చుకోవచ్చు.

Acknowledgement:

The Author would like to acknowledge the Indian Council of Social science Research (Ministry of Education) for the financial support (FNOJCSSR/RPDMN/2023-24/G/154) to carry out this project work. Special thanks to the Vice Chancellor, Telangana University for his continued support during the Project.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. తిరుపతిరావు, బి. (2008). మానవీయశాస్త్రాల పరిభాష. ద్రావిడ విశ్వవిద్యాలయం. కుప్పం.
  2. నళిని, ఎస్.ఎస్. (1999). సాహిత్యవిమర్శ పదాల డిక్షనరీ.రమేష్ పబ్లికేషన్స్. హైదరాబాద్
  3. రంగనాథాచార్యులు, కే.కె. (2022). కె కెఆర్ రచనలు-1.ఎమెస్కో, హైదరాబాద్.
  4. రంగనాథాచార్యులు, కే.కె. (2022). కెకెఆర్ రచనలు-2.ఎమెస్కో, హైదరాబాద్.
  5. రామకృష్ణ, మిరియాల. రామారెడ్డి, ముకురాల. (1978). సాహిత్యపదకోశము. తెలుగు అకాడమి. హైదరాబాద్
  6. లక్ష్మణచక్రవర్తి, వారిజారాణి, విజయకుమార్. (సం) (2004). ఆధునిక సాహిత్యవిమర్శ రీతులు.
  7. వెంకటేశం, బొద్దుల. (2013). ఆంగ్లసాహిత్యశాస్త్రపదకోశం. సరోజా ప్రచురణలు, కరీంనగర్.
  8. శివశంకర్, పాపినేని (1996). సాహిత్యం–మౌలికభావనలు.పాపినేనిప్రచురణలు, గుంటూరు
  9. సుబ్రహ్మణ్యం, జి.వి. (2012). సాహిత్యచరిత్రలో చర్చనీయాంశాలు. తెలుగు అకాడమి: హైదరాబాద్.
  10. సుబ్రహ్మణ్యం, జి.వి. (1996). ఆంధ్రసాహిత్యవిమర్శ - ఆంగ్లప్రభావం. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం షష్టిపూర్తి ప్రచురణలు :హైదరాబాద్.

ఇంగ్లీషు రచనలు:

  1. Abrams, M.H,Harpham,G.G.(2022). A Glossary of literary Terms:Canada.
  2. Baldick, chris.(2015).Dictionary of Literary Terms.Oxford University Press:UK.
  3. Martin, gray.(1992).A DICTIONary of literary Terms.Longman York press. UK.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]