AUCHITHYAM | Volume-06 | Issue-2 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. “అన్ టచ్ బుల్ నిర్భయాస్ ఆఫ్ ఇండియా: అండ్ వన్ బిలియన్ రైసింగ్” నవలలో సామాజికవర్గీకరణాంశాలు: విమర్శనాత్మక పరిశీలన
ద్విభాష్యం సాయి వెంకట రాజేశ్వర అనురాగ్
పరిశోధకులు, సోషియాలజీ శాఖ, మానవీయ & సామాజికశాస్త్రాల విభాగం,
భారతీయసాంకేతికవిజ్ఞానసంస్థ (IIT) (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్), ధన్‌బాద్.
ధన్‌బాద్ జిల్లా, జార్ఖండ్.
సెల్: +91 7680009068, Email: 24dr0159@iitism.ac.in
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.01.2025 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
ఈ వ్యాసం భారతీయ సమాజనిర్మాణంలో కులం, లింగం, ఇంకా వర్గాల ఆధారంగా ఏర్పడిన అసమానతలను విశ్లేషించడమే ప్రధానలక్ష్యంగా రూపొందించబడింది. ఈ అధ్యయనం డా. శామ్ పసుమర్తి రచించిన “అన్ టచ్ బుల్ నిర్భయాస్ ఆఫ్ ఇండియా: అండ్ వన్ బిలియన్ రైసింగ్” నవల ఆధారంగా, వ్యక్తుల జీవితాలను శాసించే కులవ్యవస్థ, లింగ వివక్ష, మతాల మార్పిడుల వంటి అనుభవాలను సామాజికశాస్త్రపరంగా పరిశీలిస్తుంది. సమాజంలో వీటి నిర్మాణాత్మక పాత్రను అర్థం చేసుకోవటానికి ఆటో-ఎథ్నోగ్రఫీ ఇంకా విమర్శనాత్మక విశ్లేషణ పద్ధతుల సమ్మేళనాన్ని ఉపయోగించడమైనది. భారతీయసమాజంలో కులవ్యవస్థ ఎలా వ్యక్తిగత జీవన అనుభవాలను ప్రభావితం చేస్తుందో, మతాలమార్పిడులు సామాజికమైన గుర్తింపులో మార్పులకు ఎలా దారితీస్తాయో, లింగవివక్ష మనుగడను ఎలా కొనసాగిస్తుందో ఈ అధ్యయనం విశదీకరిస్తుంది. కేవలం వ్యక్తిగత అనుభవాల పరంగా కాకుండా, సామాజికశాస్త్రదృక్పథంలోనూ ఈ అంశాలను విశ్లేషించడం ద్వారా, అసమానతల నిర్మాణాన్ని బహుముఖీనంగా అర్థం చేసుకోవచ్చు. కుల, లింగ, ఆర్థిక అసమానతలను సామాజికశాస్త్ర దృష్ట్యా అనుశీలించడం ఈ వ్యాస పరిధి. ఈ నవలలో రచయితే కథానాయకుడుగా తన అనుభవాలను ప్రథమపురుషులో చెప్పుకుంటూ వస్తాడు. స్వీయ-జాతివృత్తాంతం (autoethnography), విమర్శనాత్మకప్రతిబింబం (critical reflection) వంటి పద్ధతులుపాటిస్తూ, రచయిత పేర్కొన్న అట్టడుగువర్గాల జీవితానుభవాలను సంపన్నవర్గాల ప్రత్యక్ష అనుభవాలతో పోల్చి విమర్శనాత్మకంగా అధ్యయనం చెయ్యడం ఈ వ్యాసంధ్యేయం. అంటరానితనం, మతాలమార్పిడి, అంగవైకల్యం, వర్గభేదం వంటి అంశాల వివేచన ఇందులో ప్రధానవిషయం. యోగేంద్రసింగ్, డేవిడ్ గ్రస్కీల పరిశోధనల ఆధారంగా “ఎలైట్ మేకింగ్” (elite-making) అనే ప్రక్రియను గ్రామీణ పట్టణసంబంధాల మధ్య “సంస్కృతీకరణ” (sanskritisation) ప్రక్రియతో పోలుస్తూ ఈ పరిశోధనా వ్యాసం సాగుతుంది. ఈ వ్యాసం ప్రపంచీకరణ (globalization)లో భాగంగా భారతదేశ సామాజికవర్గీకరణలో చోటుచేసుకున్న మార్పులను, అంతర్జాతీయ వ్యవస్థలతో బేరీజు వేస్తుంది. సంపన్నవర్గాల అనుభవాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఇటువంటి పై తరగతులకు చెందిన వ్యక్తుల స్వీయ-జాతివృత్తాంతరచనలను ప్రోత్సహించవలసిన అవసరాన్ని ఈ పరిశోధనవ్యాసం తెలియజేస్తుంది.
Keywords: ఎలైట్-మేకింగ్, సంస్కృతీకరణ, స్వీయ-జాతివృత్తాంతం, సామాజిక వర్గీకరణ, ప్రత్యేకాధికారము
1. ఉపోద్ఘాతం:
చరిత్రను పరిశీలిస్తే, ఏ సమాజంలో అయినా ఆయా సామాజిక వ్యవస్థలు నిష్పక్షపాతంగా ఉండవని మనకు అర్థం అవుతుంది. హక్కుల ద్వారా లభించే లాభాలు, బాధ్యతలు, సంఘంలోని వివిధ సభ్యుల మధ్య అసమానంగా పంపిణీ జరుగుతున్న విషయం సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటినుండో అర్థం చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే! మనం ఏ సమాజాన్ని పరిశీలించినా, అక్కడి సంస్థలు అందరికీ సమానంగా లాభాలు అందించకుండా కొందరికి ఎక్కువ ప్రయోజనం కలిగిస్తూ మరి కొందరికి నష్టాలను కలిగించే విధంగా వ్యవహరించటం కనిపిస్తుంది. కొందరికి మాత్రమే అవకాశాలన్నీ లభిస్తూ ఉంటే మరికొందరు అణిచి వేయబడతారు. అలా విధించబడిన వర్గీకరణ విధానాలు చారిత్రకంగా ఎక్కువ కాలం కొనసాగి కాలక్రమేణా వివిధ ప్రాంతాల్లో అంతర్గత విధానాలుగా మారిపోయాయి. అటువంటి వర్గీకరణ విధానాలు వ్యవస్థలో వికృతమైన అసమానతను నెలకొల్పుతుంది. తద్వారా వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని సంపాదన పెంచుకునే అవకాశాల మీద ఎన్నో పరిమితులు విధించబడతాయి. (Oyekola, 2020).
మన సమాజ శాస్త్రాలలో ఇటువంటి సామాజిక వర్గీకరణను అర్థం చేసుకునేందుకు అనేక సిద్ధాంతాలు ఇంకా అనేక విశ్లేషణ విధానాలు అభివృద్ధి చేయబడ్డాయి. మార్క్స్, వెబర్ మొదలైన శాస్త్రవేత్తలు ఈ సామాజిక వర్గీకరణ “ఎలా ఏర్పడింది?” ఇంకా “ఎలా కొనసాగుతోంది?” అనే అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగా, ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు వర్గీకరణను వివిధ రకాలుగా అధ్యయనం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించారు. వారు ఉద్యోగస్థులు మొదలైన సామాజిక తరగతుల వారి ప్రవర్తన, హోదా, జాతి, లింగ అసమానత్వం, లైంగికత, విద్య మొదలగు అనేక అంశాలు సామాజిక వర్గీకరణకు ప్రాముఖ్యత కలిగిన అంశాలుగా గుర్తించారు. (Anderson, 2011)
సమాజ శాస్త్రాల్లో ఇటువంటి అంశాలను శోధించేందుకు అన్వేషణాత్మక పరిశోధనలు (ఎథ్నోగ్రఫీ / Ethnography) ప్రధానం. సమాజంలోని దిగువ తరగతులకు చెందిన పరిశోధకులు కొంతమంది తమ స్వీయ-అన్వేషణాత్మక (ఆటో-ఎథ్నోగ్రఫీ/auto ethnography) పరిశోధనలను రూపొందించారు. అయితే సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్న ప్రాధాన్యత గల వర్గాల నుండి ఇటువంటి సామాజిక వర్గీకరణ విధానాలపై విమర్శనాత్మక పరిశోధనలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి!
పరిశోధనేతర వృత్తుల్లో ముఖ్యంగా కళాకారుల ద్వారా; సంగీతం, నృత్యం ,చిత్రకళ, సాహిత్యం, కవిత్వం వంటి ఎన్నో కళారూపాల ద్వారా సామాజిక వర్గీకరణను వివరిస్తూ ఎందరో కళాకారులు, రచయితలు, కవులు చేసిన ప్రయత్నాలు విరివిగా ఉన్నాయి. అయితే ఈ కళలపై ప్రామాణికంగా పరిశోధన చేసిన పత్రాలు మాత్రం బాగా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిశోధనాపత్రాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, సమాజంలోని ఉన్నత వర్గాల వారి రచనను పరిశీలించేందుకు చేసిన చిరు ప్రయత్నమే ఇది!
ఈ పరిశోధనావ్యాసం డాక్టర్ శామ్ పసుమర్తి రచించిన ఆంగ్ల నవల “Untouchable Nirbhayas of India and One Billion Rising” పై ఒక విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో రాయబడింది. ఈ నవల పూర్తిగా కల్పిత కథే అయినప్పటికీ, రచయిత తన జీవితంలోని అనుభవాలను ఆధారంగా చేసుకుని ఇందులోని పాత్రలను, సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని చిత్రించారు.
రచయిత తన జీవితంలో ఎదురైన సంఘటనలను ఆధారంగా చేసుకుని నవల రాసానని పేర్కొన్నప్పటికీ ఇది స్వీయ చరిత్ర మాత్రం కాదు. కానీ ఇందులోని సంఘటనలు, పాత్రలు, వాటి నేపథ్యం నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో దీనిని సామాజిక వర్గీకరణను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే ఒక ముఖ్య రచనగా పరిగణించవచ్చు. (1)
2. పరిశోధన నేపథ్యం:
ఈ నవల ఒక వైద్యుని యొక్క జీవిత ప్రయాణం! ‘అతడు సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి ఎలా చేరుకున్నాడు?’ అంటూ వివరించేటటువంటి చక్కటి కథ ఈ నవలలో ఉంది. అయితే సామాజిక శాస్త్రాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని మరింత లోతుగా విశ్లేషించే అవకాశం ఉంది. ఈ నవల లో పేర్కొనబడిన సామాజిక వాస్తవాలు, వర్గీకరణ విధానాలు మొదలైన వాటిని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని భావించి ఈ పరిశోధనా వ్యాసం రాశాను.
ఈ నవలపై పరిశోధన చేయడానికి నన్ను ప్రేరేపించిన కొన్ని వ్యక్తిగత అనుభవాలను ముందు చెప్పవలసిన అవసరం ఉంది. నా 13వ ఏటనే, ఈ నవల ప్రచురణకు ముందే, ఈ నవలతో నాకు పరిచయం ఏర్పడింది! ఎలాగంటే, మా తాతగారు ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఆంగ్ల రచయిత శామ్ పసుమర్తికి ఈ నవలను తీర్చిదిద్దటంలో కొంత సహాయపడ్డారు. అంతేకాదు, ఈ నవలను ‘అంటరాని దేవతలు’ పేరుతో తెలుగులోకి అనువదించి ప్రచురించారు. అయితే ఈ నవలను అధ్యయనం కోసం ఎంచుకోవడం వెనుక మరింత లోతైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ నవలా రచయిత, మా తాతగారు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. బ్రిటిష్ వారి అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ లోని, అంటే, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా, ఎలమంచిలి గ్రామానికి చెందినవారు. వారిద్దరూ గ్రామంలోని బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో కేవలం భౌగోళిక నేపథ్యం మాత్రమే కాకుండా, గ్రామంలోని సామాజిక స్థాయిలోనూ ఒకే తరహా స్థానంలో ఉన్నవారు.
ఈ నవలను మొదటిసారి చదివినప్పుడు నేను కేవలం పాఠశాలకు వెళ్లే ఒక విద్యార్థిని మాత్రమే. అయినప్పటికీ ఇప్పుడు దీనిని నేను ఒక సమాజ శాస్త్ర పరిశోధకుడుగా చదవడం వల్ల నా దృష్టి కోణం పూర్తిగా మారిపోయింది! ఈ పఠనంతో ఈ నవలలోని సామాజిక విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎంతైనా నా మీద ఉంది.
ఈ నవలలో ప్రతిబింబించిన సామాజిక వర్గీకరణ వ్యవస్థలను సామాజిక శాస్త్ర దృష్టితో విశ్లేషించే ప్రయత్నం ఈ నా వ్యాసంలో చేస్తున్నాను. రచయిత ప్రస్తావించిన విషయాలను కేవలం సాధారణ దృష్టితో అర్థం చేసుకునే స్థాయిని మించి, సమాజంలోని అసమానతలను లోతుగా అధ్యయనం చేయడానికి ఈ నవల ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను.
ఉన్నత వర్గాలకు చెందిన వారు తమ స్వీయ అనుభవాలను ఆధారంగా చేసుకుని స్వీయ-అన్వేషణాత్మక పరిశోధనా పద్ధతిని చేసిన పరిశోధనలు చాలా తక్కువని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఉదాహరణకు జెన్నీ మెక్ మొహన్ (McMahon et al., 2011; McMahon et al., 2012; McMahon et al., 2017) అనే పరిశోధకుడు ఈత (swimming) సంస్కృతి, శారీరక శిక్షణ అంశాలను ఒక మెటా- ఆటో-ఎథ్నోగ్రఫిక్ విధానంలో విశ్లేషించాడు. అతడు స్వయంగా ఒక ప్రముఖ ఈతగాడు అయినందున ఆ అనుభవాలను ఒక పరిశోధనగా రూపొందించాడు. ఆస్ట్రేలియాలోని ఈత సంస్కృతిలో ఉన్న నియంత్రణ విధానాలను, శారీరక మరియు సామాజిక అంశాలను వివిధ పరిశోధనల ద్వారా వివరించాడు. అయితే ఇటువంటి పరిశోధనలు చాలా తక్కువ. ముఖ్యంగా మన భారతదేశంలోని జాతి మత లింగ సమానత్వం వంటి అంశాలను సృజిస్తూ, ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తుల స్వీయ అనుభవాల ఆధారంగా అధ్యయనం చేసిన సందర్భాలు చాలా తక్కువ.
ఇంకా ముందుకు వెళ్లే లోపు ఈ వ్యాసంలో చెప్పబడ్డ ‘ప్రాధాన్యత’ అనే పదానికి సామాజిక శాస్త్ర దృష్టి కోణంలో అర్థం చేసుకొనే అవసరం ఉంది.
ప్రాధాన్యత (privilege) - అంటే సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా లభించే అవకాశాలు, లాభాలు, గౌరవం లేదా హోదా! వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయత్నం లేకుండానే, కేవలం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందినందుకుగాను ఈ ప్రత్యేకతలు అన్నీ లభిస్తాయి. అయితే వారు తమకు లభించిన ఈ సౌకర్యాలను పెద్దగా గుర్తించరు. ఎందుకంటే వారి జీవితంలో వాటిని కోల్పోయే పరిస్థితి ఏనాడూ ఎదురవదని వారు భావిస్తారు. ఒక వ్యక్తి, ప్రాధాన్యత గల వ్యక్తిగా మారడానికి తన స్వయంకృషి కారణం కాదు కానీ అతని సామాజిక నేపథ్యమే దీనికి ప్రధాన కారణం. ఈ వ్యాసంలో ఇటువంటి అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తూ సామాజిక అసమానతలను అర్థం చేసుకోవడం; ముఖ్యంగా, ఉన్నత వర్గాల్లో ఈ అంశాలు ఎలా పనిచేస్తాయో చూడడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. (Research guides: Privilege and intersectionality: What is privilege?, n.d.).
3. పరిశోధన విధానం:
సామాజిక విమర్శనాత్మక పరిశీలన ఇంకా ఆటో-ఎథ్నోగ్రఫీ అనే రెండిటి సమ్మేళనంతో ఈ పరిశోధనా వ్యాసం రూపొందించబడింది. క్రిస్టియన్ మార్ఫి (Christine Morphy, 2008) అభిప్రాయ పడినట్లు సామాజిక విమర్శాత్మక పరిశీలన అనేది మన అవగాహన లోని అనూహ్యమైన భావాలను విశ్లేషించి, అవి సమాజంలోని అసమానతలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకునే ప్రక్రియ. మనం అనాలోచితంగా సమాజంలోని కొన్ని అన్యాయ వ్యవస్థలను ఎలా సమర్థిస్తామో అన్వేషించడం అనే లక్ష్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఈ విధానం ద్వారా మనం ‘ఏం తెలుసుకోవాలి?’ ‘ఎలా తెలుసుకోవాలి?’ అనే ప్రశ్నలను పునః పరిశీలించడం జరుగుతుంది. కేవలం వాస్తవాలను వివరించడమే కాకుండా వాటి నిర్మాణతలోని అంతరార్థం మరియు సమాజంపై అవి చూపే ప్రభావం, వీటిని విశ్లేషించడం ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సామాజిక అసమానతలను ఇంకా శక్తి సంబంధాలను సమర్ధించకుండా, వాటిని విశ్లేషించి కొత్త కోణాలలో వృధ్ధి పరచటానికి సహాయపడుతుంది.
ఆటో-ఎథ్నోగ్రఫీ అనేది పరిశోధకుడి వ్యక్తిగత అనుభవాలను సామాజిక పరంగా విశ్లేషించే పరిశోధనా విధానం. క్లార్క్ (Clarke, 2018, Spry, 2007 ని ఉద్దేశిస్తూ) యొక్క అభిప్రాయాలను ఉదాహరిస్తూ ఆటో-ఎథ్నోగ్రఫీని ‘అణిచివేయబడిన భావజాలాలను పక్కనపెట్టి, పరిశోధకుడు స్వీయ అనుభవాలను సామాజిక సందర్భాల్లో అన్వయించడం అనే విమర్శనాత్మక విశ్లేషణ పద్ధతి’ అంటూ నిర్వచించారు. కాబట్టి ఆటో-ఎథ్నోగ్రఫీ సాంప్రదాయ పరిశోధనా పద్ధతులకు భిన్నమైనప్పటికీ అది వ్యక్తిగత అనుభవాలకు తగిన గుర్తింపునిచ్చి ప్రాపంచిక పరిస్థితులను విశ్లేషించడానికి వ్యక్తిగత అనుభవాల ద్వారా ఒక సామాజిక అర్ధాన్ని నిర్మించేందుకు దోహదపడుతుంది.
ఈ విధంగా ఈ రెండు పరిశోధనా విధానాల సమ్మేళనాన్ని ప్రస్తుతం ఈ నవల అధ్యయనానికి ఉపయోగించడం జరిగింది. సంఘ పరిస్థితులను సామాజిక శాస్త్రీయంగా విశ్లేషించేందుకు యోగేంద్ర సింగ్ (Yogendra Singh, 1980) మరియు డేవిడ్ గ్రుస్కీ (David Grusky, 2012) యొక్క సిద్ధాంతాలు నాకు తోడ్పడ్డాయి.
నవల లో పేర్కొన్న వివిధ సామాజిక స్థలాలను అక్కడ నెలకొని ఉన్న సామాజిక అసమానతలను విశ్లేషించేందుకు ఈ ఇద్దరి పరిశోధనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
4. నవల పరిచయం - కథాంశం:
1942 ఏప్రిల్ నెల. రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు విశాఖపట్నం నౌకాశ్రయ నగరంపై కమ్ముకున్నాయి. వైమానిక దాడి హెచ్చరికలు మార్బ్రోగుతుండగా జపాన్ యుద్ధ విమానాలు తీర ప్రాంతం పై చక్కర్లు కొట్టాయి! పరిస్థితులకు భయపడిన డాక్టర్ దుర్గాప్రసాద్, తన కుటుంబాన్ని కూడగట్టుకుని దగ్గర లో ఉన్న తన స్వగ్రామమైన ఎలమంచిలి వెళ్లిపోవడానికి రైల్వే స్టేషన్ కు బయలుదేరారు.
ఆ ప్రయాణ సమయంలో డాక్టర్ ప్రసాద్ కుమారుడు శివప్రసాద్ చక్రవర్తి తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ తొలిసారిగా తాను చూసిన పాకీ పనులు చేసే యువతి నూకి తో పరిచయమైన అనుభవాన్ని తలుచుకుంటాడు. నూకి ద్వారా, భారతదేశంలో అనాది నుంచి కొనసాగుతున్న దారుణమైన కుల వ్యవస్థ అతనికి మొదటిసారిగా గోచరించింది. ఆమె జీవితంలో తనకు జరిగిన రెండు పెళ్లిళ్లు ఉదంతాలను తెలియజేస్తూ ఆ వ్యవస్థ ప్రభావాన్ని అర్థం చేసుకునేలా చేసింది.
కుటుంబం ఎలమంచిలిలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వెంటనే డాక్టర్ శివప్రసాద్ శివను, మాదిగ కులానికి చెందిన పనిమనిషి కొడుకు కృష్ణతో కలిసి ఆడుకోవాలని ప్రోత్సహిస్తాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు. కొంతకాలం తర్వాత కృష్ణ క్రైస్తవ మతంలోకి మారిపోయి క్రిస్టఫర్ అనే పేరు పొందుతాడు. శివ బాగా చదువుకుని వైద్య విద్య పూర్తి చేసుకుని లండన్ లో డాక్టర్ గా స్థిరపడతాడు. క్రిస్టోఫర్ కూడా అంతకుముందే అమెరికాలో స్థిరపడటం జరుగుతుంది. అయితే అనుకోకుండా తండ్రి మరణంతో శివ భారతదేశానికి తిరిగి వచ్చి, ఎలమంచిలి గ్రామంలో తండ్రి ప్రాక్టీస్ ని కొనసాగిస్తాడు. అప్పుడు మళ్లీ చిన్ననాటి నూకి అతనికి అక్కడ తారసపడుతుంది. అప్పటికే ఆమెకు రెండు విఫలమైన పెళ్లిళ్లు జరిగి దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటుంది. అక్కడ ఆ గ్రామంలో ఉన్న అంట రానితనాన్ని రూపుమాపి, అక్కడ దళిత వర్గాలకు సహాయ పడటానికి శివ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వారితో మమేకమై సంచరిస్తాడు. వారికి వైద్య సహాయం అందిస్తాడు. ఆ ప్రయత్నాలలో అతడు, అతడి కుటుంబం ఎదుర్కొన్న అవరోధాలు, వాటిని వారు అధిగమించిన తీరు ఈ నవలలో మనకు దర్శనమిస్తాయి’
శారీరక అంగవైకల్యాలు, ఇతర సామాజిక పరిమితుల వల్ల వ్యక్తులు ఎదుర్కొనే అసమానతలను కూడా ఈ నవల ప్రస్తావిస్తుంది. బాల్యపు అమాయకత, యుక్త వయసును సంతరించుకునే సమయంలో కనే కలలు, వీటిని భిన్న సామాజిక వర్గాల పిల్లలు ఎలా అనుభవిస్తారో తెలియజేసే అంశాలు కూడా ఈ నవలలో స్పష్టంగా వ్యక్తమవుతాయి. ఈ నవల కేవలం భారతీయ సమాజంలోని సామాజిక అసమాన తలకే పరిమితం కాకుండా, విదేశాలకు వలస వెళ్లిన వారు అక్కడి సమాజంలో ఎదుర్కునే వర్ణ వివక్ష గురించి కూడా సున్నితంగా ప్రస్తావిస్తుంది.
ఈ నవల అంటరానితనం, వన్ బిలియన్ రైసింగ్ అనే ప్రపంచ మహిళా ఉద్యమం మరియు నిర్భయ ఘటన వంటి సామాజిక ఘటనల నుండి స్ఫూర్తిని పొంది రాసినది. ‘ఎడిన్బర్గ్ ఫెస్టివల్’ లో ప్రదర్శించిన ఒక నాటకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్షత పై ‘సాటివారు వహించే మౌనం చాలా అవమానం!’ అంటూ ఆ సంస్కృతిని ప్రశ్నించే ప్రయత్నం చేసినట్లే; అంటరానితనం అనే సమస్యను ఈ నవల భిన్న కోణాల్లో విశ్లేషిస్తుంది. (1)
అయితే నవల అంతా కథానిక రూపంలో ఉండడం వల్ల, ఇందులో కనిపించే వర్గీకరణ సూచికలు అన్ని అధికంగా కథానిక రూపంలోనే ఉండడం వలన ప్రతి అంశాన్ని గూర్చి చెప్పడం వీలు కాని విషయం. కాకపోతే నవలలు మనకు సామాజిక శాస్త్ర దృక్కోణంలో కనిపించే చాలా విషయాలను గమనించే ప్రయత్నం చేస్తాను.
5. కులం, సామాజికచలనశీలతపై (social mobility) విమర్శనాత్మక విశ్లేషణ:
యోగేంద్ర సింగ్ విశ్లేషణ ప్రకారం ఈ నవలలోని సామాజిక వర్గీకరణ యొక్క అధ్యాయం ముఖ్యంగా నాలుగు ప్రక్రియలు చుట్టూ తిరుగుతుందని మనం గమనించవచ్చు. ఇవి ‘differentiation’, ‘evaluation’, ‘ranking’ మరియు ‘rewarding patterns’. వీటి ద్వారానే సమాజంలో మనిషి స్థానం నిర్ణయించబడుతుంది. సమాజంలో కొందరు తొందరగా ఉన్నతంగా పైకి ఎదుగుతారు, మరికొందరు కిందికి జారిపడతారు అనేది మనం గమనిస్తూ ఉంటాం! ‘ఇలా ఎందుకు జరుగుతుంది?’ అనే ప్రశ్నకు సమాధానం పొందడానికి, అసలు ఈ అసమానతలను సంఘం ఎలా పెంచి పోషిస్తుందో మనం అర్థం చేసుకోవాలి.
మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ సామాజిక వర్గాల మధ్య కొన్ని సున్నితమైన గీతలు ఉంటాయి. కొన్ని వర్గాలు ఒక దానితో మరొకటి కలిసిపోతాయి. మరికొన్ని మరింత దూరంగా వెళ్లిపోతాయి! కొందరికి పైకి ఎదగడానికి మార్గం కనిపిస్తే, మరి కొందరు ఏదో ఒక కారణంతో వెనుకబడి పోతారు. ఈ విధంగా కొత్త సామాజిక స్థాయిలు, ఇంకా వర్గాలు ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ అసలు సమస్య ఏమిటంటే, ఒకప్పుడు ఒక వర్గాన్ని వ్యతిరేకించిన వాళ్ళు తమకున్న సామాజిక హక్కులు, సౌకర్యాలు, వారసత్వంగా లభించిన ప్రత్యేక అవకాశాలు ఆధారంగా చివరకు మరో కొత్త వర్గంగా మారిపోతారు. ఈ విధంగా ఒక కొత్త వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ మార్పులన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నప్పటికీ మనం వాటి లోతైన ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.
ఈ నేపథ్యంలో ఈ నవల అటువంటి స్తరీకరణను అర్థం చేసుకునేందుకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. సమాజంలోని స్థిరమైన సాంప్రదాయపు కట్టుబాట్లు మాత్రమే కాకుండా అవి ఎలా మారుతాయో కూడా ఈ నవల చూపిస్తుంది. వర్గ నిర్మాణం , దానికి అవసరమయ్యే సామాజిక పాత్రలు మొదలైనవన్నీ చాప కింద నీరులా ఎలా పనిచేస్తాయో అన్న విషయాలు ఈ రచనలో మనకి దర్శనమిస్తాయి. లోతుగా గమనించినట్లయితే కులం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, అది మనుషులను శాసించే ఒక విధమైన వ్యవస్థగా మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ నవలలో మనం స్పష్టంగా గమనించవచ్చు!
ఈ నవలలో మనం మరో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటాం. కులం తో పాటు తద్వారా వచ్చే కట్టుబాట్లు కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. బౌగల్ (Bougle,1968) చెప్పినట్లు కులం వ్యక్తుల మధ్య పరస్పర దూరం (mutual repulsion) అనే భావనను పెంచుతుంది. అంటే ఒక కులం మరొక కులంతో మమేకం కాకుండా తమ మధ్య ఏదో తెలియని అగాధం అడ్డంగా ఉందనుకుని పరస్పరం దూరంగా ఉంటూ ఉంటాయి. ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారమే కాదు, సమాజంలో నిర్మితమైన నిత్యం మన జీవితాలను ప్రభావం చేసే ఒక వ్యవస్థగా గుర్తించవచ్చు.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ‘ఒక వర్గాన్ని ఎలా నిలబెట్టాలి? ఎలా పరిమితులు విధించాలి? ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలి?’ అనే వ్యవస్థీకృత నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అవి విరుద్ధంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి వినడానికి ఒకింత అసహజంగా అనిపించినా, ఇవి కొన్ని సామాజిక మార్పులకు తలుపులు తెరుస్తాయి. అయినప్పటికీ ఈ వ్యవస్థ తన ప్రాథమిక లక్షణాలను వదులుకోకుండా తిరిగి కొత్త రూపాల్లో మళ్లీ పునరావృతం అవుతూనే ఉంటుంది.
కుల నిర్మాణం అనే అంశాన్ని మనం ఇంకొంచెం లోతుగా పరిశీలించినట్లయితే కుల నిర్మాణంలో ఉండే వైవిధ్యత, అంటే, స్ట్రక్చర్ (structure), ప్రధానంగా సమాజంలో పై స్థాయికి చేరాలని పడే ఉబలాటాల మూలంగా ఉత్పన్నమవుతుంది. ఈ ఉబలాటాల యొక్క ప్రేరణతో జరిగే మార్పులను శ్రీనివాస్ (1962) సంస్కృతికరణ, అంటే sanskritisation అని పేర్కొన్నాడు. అంటే కింది కులాలు పై కులాల సంస్కృతిని అనుసరించేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో భారతీయ సాంప్రదాయ జీవన విధానాన్ని పూర్తిగా విస్మరించకపోవచ్చు లేదా పూర్తిగా వదిలేయక పోయినా కొన్ని అంశాలను స్వీకరించడానికి మోగ్గుచూపుతారు.
ఈ నవలలో ఈ అంశం మనకు చాలా స్పష్టంగా చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామంలోని దళితులు శివుడిని తమ దైవంగా కొలుస్తారు కానీ వారు కొలుస్తున్న గుడిలోకి ప్రవేశించే హక్కు మాత్రం వారికి లేదు. అదే సమయంలో అందరికీ నూకాలమ్మ గుడికి మాత్రం ప్రవేశించే హక్కు ఉంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రామంలోని పై కులాల ప్రజలు నూకాలమ్మ గుడి కి స్వయంగా వెళ్లకుండా తమ అంటరాని సేవకుల ద్వారా నైవేద్యం పంపిస్తారు. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే పై కులాల వారు తమ సామాజిక హోదాను పరిరక్షించుకుంటూనే, ప్రత్యక్షంగా వ్యతిరేకంగా కనిపించకుండా ఉండేందుకు ఇటువంటి మార్గాలు అనుసరిస్తారు. (2)
సింగ్ యొక్క విశ్లేషణ ప్రకారం కులం యొక్క నిర్మాణాత్మక రూపం segmental మరియు organic అనే రెండు విధాలుగా అర్థమవుతుంది. మొదటి రూపంలో కులాల మధ్య పరస్పర దూరం, అసమ్మతి, సామాజిక అడ్డుగోడలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే అదే సమయంలో రెండవ రూపంలో కులాలు పరస్పరంగా ఆర్థిక, అంటే economic, ఇంకా సామాజిక, అంటే social reciprocity ద్వారా అనుసంధానమై ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా మనకి కనిపించినప్పటికీ, కుల వ్యవస్థలో సహకారం మరియు పోటీ రెండూ ఒకేసారి అనుభవానికి వచ్చేలా చేస్తాయి.
ఈ సందర్భంలో reference group అనే భావన నవలలు కనిపించే సామాజిక చలనశీలతను అంటే social mobility ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లించ్ (Lynch, 1969) యొక్క పరిశోధనల ప్రకారం సామాజిక వర్గీకరణ వ్యవస్థలు చలన శీలతను అర్థం చేసుకోవడానికి మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మొదటిది motivational structure. వ్యక్తులు తమ సామాజిక స్థాయిని మెరుగుపరుచుకోవాలనే తపన ఎలా ఉంటుందో తెలిపేది. రెండు opportunity structure. ఎవరు పైకి వెళ్తారు, ఎవరు వెనకబడతారు అని అర్హతలు మరియు అనర్హతలు ఎలా నిర్ణయించబడతాయో తెలిపేది. మూడు communication structure. వ్యక్తులు తమకు ఉన్న సామాజిక లోటుపాట్లను ఎలాంటి పరిచయాల ద్వారా తెలుసుకుంటారో, ఎవరితో సరిపోల్చుకుంటారో తెలిపేది. ఈ మూడు అంశాల ఆధారంగా నవల లోని పాత్రలు తమ సామాజిక స్థితిగతులను ఎలా అర్థం చేసుకుంటారో, పై స్థాయికి చేరుకోవడానికి ఏ మార్గాల్లో నడుస్తారో లేదా ఏ అడ్డంకులు ఎదుర్కొంటారో, లోతుగా అధ్యయనం చేయవచ్చు.
6. “ఎలైట్” (elite) యొక్క భావనపై గమనిక:
జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నవల మొత్తంలోనూ ‘ఎలైట్’ అనే భావన ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సాధారణంగా ఎలైట్ అంటే పాలకవర్గం అని మనం అనుకుంటాం కానీ సమాజ శాస్త్రం యొక్క దృష్టిలో చూసినట్లయితే ఇది మరింత విస్తృతమైనది. ప్రధానంగా ‘ఈ ఎలైట్ యొక్క ప్రభావం ఆధునీకరణ మరియు సామాజిక పురోగతికి ఎలా దోహదపడింది?’ అనే కోణంలో చూడవచ్చు. అయితే ఇక్కడ ఎలైట్ అనే వర్గం ఏదైనా చట్టపరంగా లేదా అధికారికంగా గుర్తింపబడిన వర్గానికి మాత్రం పరిమితం కాదు. వారు ప్రాథమికంగా సమాజంలోని వివిధ స్థాయిలలో ప్రభావం చూపగల వ్యక్తులు. వీరు సామాన్య ప్రజానీకం నుంచి భిన్నంగా, చారిత్రకంగా విశిష్ట హోదాను పొందిన వారే. ఈ స్థానం కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఒక రకంగా వారిని charismatic వ్యక్తులుగా పిలుస్తారు. ఇప్పటివరకు ఉన్న సామాజిక సిద్ధాంతాలను పరిశీలించినట్లయితే వర్ణవ్యవస్థ ప్రకారం; పై కులం వారు జాతి సిద్ధాంతం ప్రకారం, ప్రభావశీలమైన కులాల వారు వివక్ష సిద్ధాంతం ప్రకారం, శ్వేత జాతి వారు ఈ ఎలైట్ హోదాను సాధించిన వారిగా కనిపిస్తారు. నవల చదువుతూ ఉంటే ఎటువంటి వారు ఎటువంటి ఎలైట్ స్థానాలు పొందుతారో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. (3)
ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పై కులంలోకి చేరాలని కోరుకునేవారు - ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు-తమ సామాజిక స్థాయిని మెరుగుపరుచుకునే మార్గంగా దీనిని భావిస్తారు. నవలలో శివ మిత్రుడు కృష్ణ , అతని మామ బిల్స్ సుందర్ రాజ్, కలెక్టర్ గ్విల్ దొర తో సాన్నిహిత్యం-వీరి జీవితాలను పరిశీలిస్తే ఈ క్రైస్తవీకరణ ఇంకా ఎలైట్ స్థానం మధ్య ఉన్న సంబంధాన్ని మన స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తీరప్రాంతాల్లోని దళితులలో ఇది ప్రబలంగా ఉండడం గమనించదగ్గ విషయం. (4)
ఈ విశ్లేషణ ద్వారా కనిపించే ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎలైట్ వర్గం ఎప్పుడు సామాజిక స్తరీకరణలోని పై పొరల నుంచి వస్తుంది.
వారి ఆలోచన విధానం మతపరమైన ఇంకా జాతిపరమైన నేపథ్యం ఏదైనా కావచ్చు కాని వారందరిలోనూ ఆధునీకరణ అనే భావన ఒకేలా కనిపిస్తుంది. ఈ కోణంలో ఎలైట్ ని విభజించాలి అంటే religious elites, political elites, case elites, business elites, professional and bureaucratic elites, ఇంకా intellectual elites గా విభజించవచ్చు (Singh, Y, ibid.).
ఇక్కడ ఇంటలెక్చువల్ ఎలైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. వీరు ప్రొఫెషనల్ ఎలైట్ వర్గంలోనూ భాగంగా ఉన్నప్పటికీ వారికి ప్రత్యేక హోదా ఉంటుంది. వీరు సామాజిక సేవ ,సృజనాత్మక రచనలు మరియు పరిశోధనాల ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. వీరు వైద్యులు, రచయితలు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు మొదలగువారు (3).
పై కులాల్లోని మధ్యతరగతి నుండి వచ్చిన వారిలా కనిపిస్తారు. వీరు పాశ్చార్య సంస్కృతిని స్వీకరించినప్పటికీ భారతీయ సాంప్రదాయాలతో కలిసి పోయేలా ఒక మధ్య వర్తిత్వ పాత్రను పోషిస్తారు. వీరు సాంప్రదాయ సమాజం మరియు ఆధునిక పౌర వ్యవస్థల మధ్య ఒక వారధిగా నిలుస్తారు. అంతే కాకుండా సామాజిక ఇంకా రాజకీయ సంఘర్షణలను స్వయంగా పరిష్కరించే స్థాయికి ఎదిగిన వారు. లేదా కనీసం వాటికి మార్గ నిర్దేశం చేసే సామర్థ్యం కలిగిన వారు. నవలలో శివ తండ్రి పాత్ర కూడా ఈ కోణంలో ముఖ్యమైనటు వంటిది. ఈ విధంగా భారతదేశంలోని ఎలైట్ వర్గం ముఖ్యంగా పై కులాల నుండి వచ్చినప్పటికీ, సమాజంలోని అన్ని వర్గాల నుండి ఒక విధమైన అంగీకారం పొందే విధంగా తమన మలుచుకున్న తీరు, ఆసక్తికరమైన పరిశోధన అంశంగా మనకు కనిపిస్తుంది.
7. నవలలో సామాజిక వర్గీకరణ గుర్తులపై సంక్షిప్త విశ్లేషణ:
ఇప్పుడు నేను నవలలో కనిపించే వివిధ సామాజిక వర్గీకరణ సూచికలు గురించి సంక్షిప్తంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికోసం నవల లోని సంభాషణలు, దృశ్యాలు మరియు సంఘటనల నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా చెప్పినట్లుగానే ప్రతి చిన్న అంశాన్ని వివరించడం వీలుకాదు కనుక, రచయితలాగే నేను కూడా అదే సామాజిక ఆర్థిక నేపథ్యానికి చెందిన వాడిని కాబట్టి, నా సొంత అనుభవాలతో కొంత ముడిపడి ఉన్న అంశాలను ముందుకు తెస్తాను.
మొదటిగా నవల మొదటి అధ్యాయంలోనే భీమయ్య అనే పెట్టిబండి తోలుకునే వ్యక్తి యొక్క పాత్ర గమనించ తగ్గది. ఇతడు దళితుడు. అతనికి ఉబ్బస రోగం ఉంది. ఒకానొక సన్నివేశంలో శివ తండ్రి అయిన వైద్యుడు బండి బాడుగగా తనకు డబ్బు ఇవ్వబోతే, అది తీసుకోవడానికి నిరాకరించి, బదులుగా ఆయన పాదాలను తాకి నమస్కరిస్తాడు. ఇది సమాజ శాస్త్రం ప్రకారం కేవలం ఆచార పరమైన గౌరవ ప్రదర్శన మాత్రమే కాదు! ఒక కులపరమైన మరియు వర్గపరమైన శక్తి సమీకరణానికి ఒక ప్రతీక! పైగా మరొక సన్నివేశంలో, ‘భీమయ్య తమతో ఎందుకు రావటం లేదు?’ అని అడిగినప్పుడు శివ తల్లి అతన్ని మందలింపు ధోరణితో చూసే విధానం కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఒక్క దృశ్యమే కులం మరియు వర్గం మధ్యనున్న ద్వంద్వ స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. (5)
తదుపరి భాగంలో ‘గ్రామీణ ఇళ్ళలో మరుగుదొడ్లు ఎలా ఏర్పాటు చేయబడ్డాయో’ ప్రస్తావించబడింది. పురుషులు మరియు మహిళలకు కట్టబడిన వేరువేరు మరుగుదొడ్లు, అవి కట్టిన విధానం చూడగానే ఇది సాధారణ విధంగా అనిపించవచ్చు. కానీ దీని వెనుకనున్న సామాజిక స్తరీకరణను గమనిస్తే, మల విసర్జనను కూడా ఏ విధంగా లైంగిక పరమైన విభజనగా, ఎలా మార్చామో గమనించవచ్చు. (6) అదేవిధంగా నవలలో మహిళల గురించిన ప్రస్తావించిన తీరు సామాజిక నిర్మాణాలను ప్రతిబింబించేలా ఉంది. ఉదాహరణకి వారి ఇంట్లో ఉండే తీరు, నడవడం, కబుర్లాడే విధానం, పిల్లలతో ఆటలు ఆడే విధానం మొదలైనవి చాలా ఆసక్తి కలిగించే విషయాలు. ముఖ్యంగా వితంతువులు వయసు పెరిగినప్పుడు ఇంట్లో అధికారం పొందడం మనం గమనించవచ్చు. ఇది ఇళ్లలో స్త్రీల హోదా సామాజికంగా ఎలా నిర్మించబడుతుందో స్పష్టం చేస్తుంది. ‘కుటుంబ వ్యవస్థల్లో మహిళలు సామాజికంగా ఎలా ప్రవర్తించాలి?’ అన్నది ఒక నిర్దిష్ట వ్యవస్థగా రూపొందించబడింది అన్న విషయం మనం గమనించవచ్చు. ఇంటి పురుషులతో అవతల వారికి జరిగే సంభాషణలను మహిళలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా కేవలం గవా క్షం నుండి చూడడం, వినడం వంటి తీరు నవలలో చాలా చక్కగా చూపించారు. ఇవి వారికి చిన్నప్పటినుండి నేర్పబడే సామాజిక నియంత్రణను, అలాగే లింగపరమైన స్తరీకరణను ప్రతిబింబించే విషయాలు. (7)
అదేవిధంగా వ్యక్తులు యొక్క శారీరక లక్షణాల ఆధారంగా కులాల మధ్య ఉన్న సంబంధాలను, అలాగే వృత్తి స్థాయిలలో సామాజిక ఎదుగుదలలు వేదికగా ‘వారు ఎంత ముందుకు వెళ్ళగలరు?’ అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. తెలుపు ,నలుపు, చామన చాయ మొదలగు శరీరపు రంగులకు సంబంధించిన ఆలోచనలు, ఇతర శరీర లక్షణాలు సామాజిక స్తరీకరణ ఇంకా సాంస్కృతిక అనుబంధాలను తెలియజేస్తాయి. పుస్తకంలో “నలుపు బ్రాహ్మణుడిని ఎప్పటికీ నమ్మకూడదు” (8) అనే జాతీయాన్ని ఉపయోగించడం ద్వారా, సామాజికంగా గౌరవప్రదమైన స్థాయిని పొందడంలో తెలుపు చర్మం ఉండడం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఒక సంకేతం. దీనికి మరికొన్ని ఉదాహరణలు, శివ మొదటిసారి ఒక తెల్ల దొరని చూసినప్పుడు “బ్రాహ్మణులు మాత్రమే తెల్లగా ఉంటారు” అని అనుకునే సన్నివేశం (9); “డాక్టర్ గారి అబ్బాయి తో ఈ నల్ల కుర్రాడు ఎవరు” అని ఒక దుకాణదారుడు అడగడం (10); పెంటయ్య అనే వ్యక్తికి ఒక ఆడపిల్ల దొరికినప్పుడు తను వారందరి కంటే తెల్లగా ఉండడం వల్ల ఒక పైకులానికి చెందినదేమో అని అనుకోవడం (11); నలుపు రంగుతో ఉన్న దళిత విద్యార్థులని దూరంగా వెళ్లి ఒక మూలం నుంచోమని అడిగి, “ఇవాళ మిగిలిన నల్ల రంగు కుర్రాళ్ళు ఇంకెవరూ రాలేదా” అని శివ పాఠశాల హెడ్మాస్టర్ అడగడం(12) వంటి ఎన్నో సన్నివేశాలు మనకు ఈ నవలలు కనిపిస్తాయి. అదే విధంగా దుస్తులు కూడా ఎలా స్తరీకరించబడ్డాయో అన్న విషయం ఆసక్తికరమైనది. ఉదాహరణకు పంచ, పైవాటు ధరించడం బ్రాహ్మణ సంప్రదాయం అయితే కిర్రు చెప్పులు ధరించడం దళితులకు సూచన. అయితే ఈ కర్రి చెప్పులు గురించి గనక ఆలోచించినట్లయితే అవి అంటరాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చెప్పులు అని అర్థమవుతుంది. ఉన్నత కులాలకు వ్యక్తులు వాటి శబ్దాన్ని వింటే ఇళ్ల తలుపులు మూసుకుని లోనికి వెళ్ళిపోతారు (13) (14).
నవలలో సూచించబడిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సైన్యం లేదా నర్సింగ్ రంగాలలో ప్రవేశించటం ద్వారా తమ సామాజిక స్థితిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం వారి సామాజిక లక్ష్యాలను చూపిస్తాయి. అయితే అదే సమయంలో భారీ సామాజిక కులసంబంధాలు వారి ఇంటి పరిసరాల్లో కొద్దిగా మారినా, వారు చేరిన కొత్త సామాజిక పరిసరాల్లో పరిస్థితులు మారకపోవడం వారికి నిరాశ కలిగిస్తుంది. (15).
మరొక ముఖ్యమైన అంశాన్ని గమనించినట్లయితే సమాజంలో వర్గీకరణ అనేది నివాస స్థలాలు ఇంకా పని స్థలాల యొక్క సామాజిక నిర్మాణంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు పాఠశాల, ఆఫీసర్స్ క్లబ్, క్రికెట్ మైదానం మొదలగు ప్రదేశాలు కూడా కుల ఆధారంగా వర్గీకరింపబడతాయి. బస్తీలలో కూడా వివిధ వృత్తుల ప్రకారం అనగా వ్యవసాయదారులు చేనేత పనివారు, లేదా వ్యవసాయ కార్మికుల హోదా ఆధారంగా ఇంటి యొక్క నిర్మాణ శైలి, నిర్మాణం నిర్ణయించబడుతుంది. కొంతమంది ఇల్లు పక్కా సిమెంట్ స్తంభాలతో ఉంటే ,మరికొంతమంది తాటి ఆకుల కప్పులతో గుడిసెలు కట్టుకొని ఉంటారు. వీటికి వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హరిజనవాడలు లేదా మాదిగల కాలనీలు మరింత లోతైన వర్గీకరణను చూపిస్తాయి. వీటిని కాలువ గట్టుతో వేరు చేస్తారు. వాటి చుట్టూ పందులు తిరుగుతూ ఉంటాయి. (16).
మతమార్పిడుల అంశానికి వస్తే నవల చివరి భాగంలో ఒక ఆసక్తికరమైన వివరణ ఉంది. “... వారిలో కొందరు కుల వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి బయటపడడానికి అలాగే ఆర్థిక ప్రేరణలతో ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి మారారు. అయితే కొత్త సామాజిక సాంస్కృతిక వ్యవస్థలో కూడా వారు మళ్లీ దీనస్థాయిలోనే కొనసాగుతారు...” ఈ విధమైన వివరణకు సమాజ శాస్త్ర పరిశోధనలో బలమైన ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు “దళితులు క్రైస్తవ మతంలోకి మారడం కుల వ్యవస్థ నుండి తప్పించుకోవాలనే ఆకాంక్షను తెలియజేస్తుంది” అంటూ ‘c/o కంచరపాలెం’ అనే సినిమాపై చేసిన సమీక్షలో తమలపాకుల సౌజన్య (Tamalapakula, S., 2018) పేర్కొన్నారు. కాకపోతే రచయిత చెప్పినట్టు వారి మతం మార్చుకున్నప్పటికీ సామాజికంగా మరియు సాంస్కృతికంగా ఎక్కువ లాభాలు పొందలేరు. మతం మార్చుకున్న అగ్రకులాల వాళ్లు వారి దళితత్వాన్ని ఎప్పటికీ అంట గట్టి ఉంచే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు వారు పుట్టుకతో క్రైస్తవులైనా అంటరానితనాన్ని దూరం పెట్టలేరు. దీనికి ఉదాహరణలు శివ మిత్రుడు కృష్ణ క్రిస్టఫర్గా మారినా కూడా సమాజంలో మరియు శివ కుటుంబంలో అందరూ అతనిని ఒక దళితుడు గానే చూడడం; అలాగే గ్విన్ దొర అనే ఆంగ్లేయుడు విశాఖ సబ్ కలెక్టర్ గా శివ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారి ఇంట్లో ఆయన వెళ్లిపోయిన వెంటనే ఇంటిని శుద్ధిచేసి, “తెల్లవారైనా అంటరానివారే” అని చెప్పే మొదలగు దృశ్యాలు ఆలోచించదగినది (4).
‘పరిపాలన దృష్టి కోణంలో సామాజిక వర్గీకరణ ఎలా పరిణమిస్తుంది?’ అనే ప్రశ్నకు నవల లో చూపించిన గ్రామ పంచాయతీ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. కుల ప్రధానులు ఒక ఎత్తైన చోట కూర్చోవడం అలాగే ఉన్నత కులానికి చెందిన పెద్ద మనసున్న వైద్యుడికి ప్రత్యేకంగా ఓ కుర్చీ ఏర్పాటు చేయడం; అణగారిన వర్గాల మధ్య కూడా అంతర్గతంగా వర్గీకరణ కొనసాగుతున్న తీరును వర్ణిస్తుంది.
అదే విధంగా ఈ పంచాయతీ సన్నివేశం వికలాత్వాన్ని కూడా ఒక సామాజిక వర్గీకరణ సాధనగా ఎలా ఉపయోగిస్తారో కూడా మనకు ఈ నవలలో ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో చూపించినట్టు నూకి మాజీ భర్త నూకయ్య కుష్టు రోగం బారిన పడటం వలన సమాజం నుండి పూర్తిగా బహిష్కరింపబడటం, అదేవిధంగా నూకి మేనమామ భీమరాజు దృఢంగా శక్తివంతంగా ఉండినప్పటికీ తన వంకర కాలు కారణంగా రాత్రి గస్తీదారుడుగా మాత్రమే అవకాశం పొందడం; ఇటువంటి వికలత్వానికి చెందిన వర్గీకరణ ఎలా జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది (17).
మనదేశంలో ఇటువంటి అనేక దృష్ట్యాంతాలు మనకి కనబడుతూనే ఉంటాయి. అయితే ఈ వర్గీకరణ వ్యవస్థ విదేశాల్లో కూడా మనలను ఎలా సాధిస్తుందో చూడటం చాలా ఆసక్తికరమైన విషయం! ప్రముఖంగా విదేశాల్లో స్థానిక, విదేశీ వర్గీకరణ అదే విధంగా రంగు ఆధారంగా జరుగుతోంది! తెల్ల చర్మం గలవారు తమకు వైద్యం చేయడానికి తెల్ల చర్మం గల వైద్యులే కావాలని కోరుకోవడం, నల్ల చర్మ వైద్యులను నిరాకరించడం; ఇవన్నీ అక్కడ కూడా సామాజిక వర్గీకరణ ఎంత దృఢంగా కొనసాగుతుందో అన్న తీరుకు అద్దం పడతాయి (18).
8. ముగింపు:
- ఈ వ్యాసం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సామాజిక శాస్త్రాల్లో ముఖ్యంగా వర్గీకరణ అధ్యయనాల్లో ఆటో ఆటో-ఎథ్నోగ్రఫిక్ పద్ధతుల్లో రూపొందించబడిన రచనలు విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- ఇందులో ముఖ్యంగా ప్రివిలేజ్ మరియు ఎలైట్ వర్గానికి చెందిన వ్యక్తుల నుంచి వచ్చిన స్వీయ రచనలు ఒక ప్రివిలేజ్ అందించగలుగుతాయి. సామాజిక వర్గీకరణ అధ్యయనాలు సాధారణంగా అణిచివేయబడిన, అణగారిన వర్గాలు చుట్టూ మాత్రమే నడుస్తాయి. అయితే ఈ ప్రాధాన్య వర్గానికి చెందిన వ్యక్తుల జీవన అనుభవాలను, వారి పరిశీలనలను, వారి ప్రపంచాన్ని అధ్యయనం చేయడం ద్వారా కూడా వర్గీకరణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.
- ఎలైట్ వర్గాలకు చెందినవారు వర్గీకరణ వ్యవస్థను ఎలా సమర్థిస్తారు? ఎక్కడో వారి అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు అది అవసరం అనే వాదనలను మన ముందుకు తీసుకొస్తారు. అలాగే అదే సమయంలో మానవతా దృక్కోణంలో తమను తాము ఎంతవరకు సంసిద్ధులను చేసుకోగలుగుతారు మొదలైన ప్రశ్నలపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇటువంటి ‘ఆటో-ఎథ్నోగ్రఫిక్’ పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయి.
కాబట్టి విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు అలాగే సామాజిక శాస్త్ర రంగాలన్నీ వర్గీకరణ అధ్యయనాల్లో కొత్త కోణాలు అన్వేషించడానికి ‘ఆటో-ఎథ్నోగ్రఫిక్’ పద్ధతులు మరింత ఇష్టంతో అంగీకరించవలసిన అవసరం ఎంతగానో ఉంది! వాస్తవానికి ఈ దృష్టిలో మనం చూడగలిగితే, ప్రతిపక్ష వర్గాల అనుభవాలు మాత్రమే కాకుండా అధికార వర్గాల అనుభవాలను కూడా అధ్యయనం చేసే వీలు సమగ్రమైన సామాజిక విశ్లేషణకు దారితీస్తుందనటంలో సందేహం లేదు.
9. సూచికలు:
- ఇక్కడ పేర్కొనబడిన విషయాలను రచయిత నవల లోని ఉపోద్ఘాతం 1వ పేజీలో వర్ణించారు.
- దీనికి సంబంధించిన ఘటనలను 7వ అధ్యాయం, పేజీలు 41, 43; పదవ అధ్యాయం, 62వ పేజీ; 13వ అధ్యాయం 72వ పేజీల లో కథానికంగా వర్ణించారు.
- నవలలు ఇటువంటి charismatic హోదాను ముఖ్యంగా శివ తండ్రి యొక్క పాత్రను ప్రేరేపించే విధంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీటి ఉదాహరణలు కనిపించే సన్నివేశాలు నవల లోని 14వ అధ్యాయం, 76వ పేజీ; 17వ అధ్యాయం 105వ పేజీ; 21వ అధ్యాయం 131వ పేజీ; 28వ అధ్యాయం 175 వ పేజీలలో చూడవచ్చు.
- మతమార్పిడి వల్ల వచ్చే సామాజిక మార్పులను వెల్లివేసే సన్నివేశాలను మనం నవల లోని 6వ అధ్యాయం 31వ పేజీ; 12వ అధ్యాయం 70వ పేజీ; 16వ అధ్యాయం 95వ పేజీ; మరియు ముగింపు 220వ పేజీలలో పేర్కొనబడ్డాయి.
- ఈ సన్నివేశాన్ని 1వ అధ్యాయం 5వ పేజీలో మనం చూడవచ్చు.
- దీనికి సంబంధించిన అంశాలు మనం 2వ అధ్యాయం 7వ పేజీ మరియు 4వ అధ్యాయం 19వ పేజీలలో చూడవచ్చు.
- మహిళల యొక్క సామాజిక నిర్మాణాన్ని చూపించే సన్నివేశాలను మనం 1వ అధ్యాయం 8వ పేజీలో మరియు ఐదవ అధ్యాయం 28వ పేజీలలో కథా నిర్మాణ సైనిలో మనం గమనించవచ్చు.
- ఈ సన్నివేశం మనం 7వ అధ్యాయం 38వ పేజీలో చూడవచ్చు.
- ఈ సన్నివేశం మనం 4వ అధ్యాయం 20వ పేజీలో చూడవచ్చు.
- ఈ సన్నివేశం మనం 4వ అధ్యాయం 25వ పేజీలో చూడవచ్చు.
- ఈ సన్నివేశం మనం 5వ అధ్యాయం 27వ పేజీలొ చూడవచ్చు.
- ఈ సన్నివేశం మనం 6వ అధ్యాయం 31వ పేజీలో చూడవచ్చు.
- ఈ గిరి చెప్పులు గురించి పేర్కొన్న సన్నివేశం మనం 2వ అధ్యాయంలోని 49వ పేజీలో చూడవచ్చు.
- మంచి దుస్తుల ద్వారా సామాజిక వర్గీకరణ ఎలా ఉంటుంది అనే సన్నివేశాలు మనం 4వ అధ్యాయం 19, 21వ పేజీలలో మనం చూడవచ్చు.
- దీనికి సంబంధించిన విషయాన్ని మనం 2వ అధ్యాయం 11, 12 పేజీల్లో చూడవచ్చు.
- నివాసి స్థానాల ద్వారా వర్గీకరణ గురించి తెలియజేసే సన్నివేశాలు మనం 6వ అధ్యాయం 29వ పేజీ, అలాగే 7వ అధ్యాయం 35వ పేజీ మొదలగు సన్నివేశాలలో చూడవచ్చు.
- ఈ సన్నివేశాన్ని నవల లోని 7వ అధ్యాయంల 36వ పేజీలో చాలా వివరంగా వర్ణించడం జరిగింది.
- ఈ సన్నివేశాన్ని మనం 25వ అధ్యాయం 161వ పేజీలో చూడవచ్చు.
10. ఉపయుక్తగ్రంథసూచి:
- Andersen, R. (2011). Social stratification. Oxford Bibliographies Online Datasets. https://doi.org/10.1093/obo/9780199756384-0053
- Bougle, C. (1968). The Essence and Reality of the Caste System. Contributions to Indian Sociology, 2, 7-30.
- Grusky, D.B., & Ku, M.C. (2012). Gloom, Doom, and Inequality.
- Jenny McMahon & Maree Dinan-Thompson (2011) ‘Bodywork—regulation of a swimmer body’: an autoethnography from an Australian elite swimmer, Sport, Education and Society, 16:1, 35-50. DOI: 10.1080/13573322.2011.531960
- Jenny McMahon, Dawn Penney & Maree Dinan-Thompson (2012) ‘Body practices—exposure and effect of a sporting culture?’ Stories from three Australian swimmers, Sport, Education and Society, 17:2, 181-206. DOI: 10.1080/13573322.2011.607949
- Lynch, O., (1969). The Politics of Untouchability: Social Mobility and Social Change in a City of India. New York: Columbia University Press.
- McMahon, J., & McGannon, K. (2017). Re-Immersing Into Elite Swimming Culture: A Meta-Autoethnography by a Former Elite Swimmer, Sociology of Sport Journal, 34:3, 223-234. https://journals.humankinetics.com/view/journals/ssj/34/3/article-p223.xml
- Morley, C. (2008). Critical Reflection as a Research Methodology. In Liamputtong, P. & Rumbold, J. (Ed.), Knowing Differently: Arts-Based and Collaborative Research Methods. 265–280. Nova Science Publishers, Inc.
- OYEKOLA, I. A. (2020). Social Stratification. In E. J. OYEYIPO (Ed.), Introductory Sociology, 125–126. Obafemi Awolowo University Press Limited.
- Pasumarthi, S. (2016). Untouchable ‘Nirbhayas’ of India: & One Billion Rising. Partridge Publishing India.
- Research guides: Privilege and intersectionality: What is privilege? What is Privilege? - Privilege and Intersectionality. (n.d.). Research Guides at Rider University. https://guides.rider.edu/privilege
- Singh, Y. (1980). Social Stratification and Change in India. India: Manohar.
- Spry, T. (2007). Performing autoethnography. Paper presented at the Mixed Methods Conference, Homerton School of Health Sciences, Cambridge, UK. Quoted from Clarke, Z. S. H. (2018). Autoethnography --- researching the self as a method of socially critical inquiry. Parkmore Institute. http://www.parkmoreinstitute.org/autoethnography-researching-the-self-as-a-method-of-socially-critical-inquiry/
- Srinivas, M.N. (1962). Caste in Modern India. Bombay: Asia Publishing House.
- Tamalapakula, S. (2018). ‘C/O Kancharapalem’ and the Politics of Unspeakability of Caste. The Wire (Web Publication). Retrieved from https://thewire.in/film/c-o-kancharapalem-and-the-politics-of-unspeakability-of-caste
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

