AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. అంతర్జాలంలో తెలుగు భాష వినియోగం: ఉపాధి అవకాశాలు
డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి
తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజురాబాదు,
హుజురాబాదు, కరీంనగర్, తెలంగాణ.
సెల్: +91 9154690580, Email: mallareddy808@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.09.2024 ఎంపిక (D.O.A): 28.09.2024 ప్రచురణ (D.O.P): 01.10.2024
వ్యాససంగ్రహం:
నేడు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ లో నిర్దిష్ట నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేథా, కంటెంట్ రైటింగ్, ఆన్‌లైన్ ట్యూటరింగ్, వీడియో ఎడిటింగ్, మరియు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో ప్రస్తుతం అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు తెలుగు భాషలో కూడా ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలో ఈ వ్యాసం వివరిస్తుంది. ఆధునిక భాషాసాంకేతికతలను ఉపయోగించి, విద్యార్థులు తమకున్న అవకాశాలను మెరుగుపరచుకోవడమే కాకుండా, విభిన్న రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మార్గం కల్పించగలుగుతారు. తెలుగులో పాఠ్యాంశాల డాటా తయారి, ప్రసరణ మరియు వినియోగం వంటి విభిన్న రంగాలలో తెలుగు భాషా నిపుణుల అవసరం రోజురోజుకు పెరుగుతోంది. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక ఆకరాల సహాయంతో ప్రాంతీయ భాషల్లో బోధన విద్యార్థులకు మరింత అందుబాటులో ఉండేలా నూతన విద్యా విధానం 2020 అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి అవకాశాలు నేటి యువత అందిపుచ్చుకొనే మార్గాలను అన్వేషించడం ఈ వ్యాసం ముఖ్యయద్దేశం కంప్యూటర్ రంగంలో, సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న నూతన విధానాలను తెలుగు భాషకు అనువర్తించే విధంగా పరిశోధన ప్రణాళికలు తయారు చేయనైనది. వివిధ ఉద్యోగ, ఉపాధి కల్పనా రంగాలలో తెలుగు భాషకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా మెరుగు పరిచే పరిశోధనా పద్ధతులు ఎన్నుకోవడం. యువతకు కంప్యూటర్ రంగంలో తెలుగు భాషానైపుణ్యాలను పెంపొందించేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు, తెలుగు భాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించడం, విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రోత్సహించడానికి అవకాశం కల్పించే మార్గాలు వెతకడం. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా కష్టపడితే, సరైన అవకాశాలు సిద్ధమవుతాయి. ఈ పరిశ్రమలు కేవలం ప్రాథమిక కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానాన్ని మించి, విశ్లేషణ, సమస్యలు పరిష్కరించటం, మరియు వ్యాపార దృష్టిని మెరుగుపరచడం వంటి నైపుణ్యాల మెరుగుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. తెలుగు భాషా సంపదను Google వంటి సంస్థల డేటాబేస్‌లలో నిక్షిప్తం చేయడం, విద్యార్థులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా, భాషకు అవసరమైన పదజాలాన్ని అందుబాటులో ఉంచడం. వికీ, సోషల్ మీడియా వంటి వేదికల్లో వ్యాసాలు రాయడం ద్వారా యువతకు అవకాశాలను సృష్టించుకోవడం, కొత్త ఆవిష్కరణలు చేయడం, ఎకానమీని ప్రోత్సహించడం, స్టార్టప్‌లతో తమ వ్యాపార భావనలు సాకారం చేసుకోడం ఈ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడం, ప్రస్తుత మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నైపుణ్యాలను వినియోగించడం వల్ల వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగు భాషా పరిజ్ఞానం కలిగి ఉన్నవారికి నేడు విస్తృత అవకాశాలు ఉన్నాయని సోదాహరణంగా నిరూపించడం.
Keywords: విష్కరణలు, సృజనాత్మకత, మెషిన్ లెర్నింగ్, డేటాబేస్, భాషా నైపుణ్యాలు, భాషాసాంకేతికత, కృత్రిమ మేథా, సామాజిక మాధ్యమాలు.
1. ఉపోద్ఘాతం:
సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేథా, కంటెంట్ రైటింగ్, ఆన్‌లైన్ ట్యూటరింగ్, వీడియో ఎడిటింగ్, మరియు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో ప్రస్తుతం అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తెలుగులో పాఠ్యాంశాల డాటా తయారి, ప్రసరణ మరియు వినియోగం వంటి విభిన్న రంగాలలో తెలుగు భాషా నిపుణుల అవసరం రోజురోజుకు పెరుగుతోంది. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక ఆకరాల సహాయంతో ప్రాంతీయ భాషల్లో బోధన విద్యార్థులకు మరింత అందుబాటులో ఉండేలా నూతన విద్యా విధానం 2020 అవకాశం కల్పిస్తుంది. ఇది యువతకు కంప్యూటర్ రంగంలో తెలుగు భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగు భాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించడం, విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రోత్సహించడానికి అవకాశం కల్పిస్తుంది. తెలుగు భాషా సంపదను Google వంటి సంస్థల డేటాబేస్‌లలో నిక్షిప్తం చేయడం, విద్యార్థులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా, భాషకు అవసరమైన పదజాలాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వికీ, సోషల్ మీడియా వంటి వేదికల్లో వ్యాసాలు రాయడం ద్వారా యువతకు అవకాశాలను సృష్టించుకోవడం, కొత్త ఆవిష్కరణలు చేయడం, ఎకానమీని ప్రోత్సహించడం, స్టార్టప్‌లతో తమ వ్యాపార భావనలు సాకారం చేసుకోడం తెలుగు వారికి లాభదాయకంగా మారింది. తెలుగు అక్షరాలను వెబ్‌సైట్‌లో ఉపయోగించడానికి, ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి నేడు అనేక వనరులు, సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్లాగ్‌ల్లో, వెబ్‌సైట్‌లో సులువుగా తెలుగు టైప్ చేయగలుగుతున్నారు. ఈ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడం, ప్రస్తుత మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా కష్టపడితే, సరైన అవకాశాలు సిద్ధమవుతాయి. ఈ పరిశ్రమలు కేవలం ప్రాథమిక కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానాన్ని మించి, విశ్లేషణ, సమస్యలు పరిష్కరించటం, మరియు వ్యాపార దృష్టిని మెరుగుపరచడం వంటి నైపుణ్యాల మెరుగుకు అవకాశాలు కల్పిస్తున్నాయి . దీని కోసం ఆధునిక భాషాసాంకేతికతలను ఉపయోగించి, విద్యార్థులు తమకున్న అవకాశాలను మెరుగుపరచుకోవడమే కాకుండా, విభిన్న రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మార్గం కల్పించగలుగుతారు. తెలుగులో కంటెంట్ రైటింగ్ వ్యాపారాలు, వెబ్‌సైట్‌ల కోసం రాసే అవకాశం, ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వీడియో ఎడిటింగ్ సామాజిక మాధ్యమం వంటి ప్లాట్‌ఫామ్‌లలో అధిక డిమాండ్ ఉంది. అనువాదకులు భాషా అంతరాలను తగ్గించి, సమాచారాన్ని అందించడానికి, ప్రపంచాన్ని అనుసంధానించడానికి అద్భుతమైన సేవను అందిస్తున్నారు. ఈ నైపుణ్యాలను వినియోగించడం వల్ల వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగు భాషా పరిజ్ఞానంలో ప్రావీణ్యం కలిగి ఉన్నవారికి నేడు విస్తృత అవకాశాలు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో వివిధ పరిశ్రమల ఉద్యోగ నియామకాల్లో గుణాత్మకంగా అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ రంగంలో ప్రాథమికపరిజ్ఞానానికి అధనంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ లో నిర్దిష్ట నైపుణ్యం ఉన్నవారికే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం కంప్యూటర్ సైన్స్ లోనే కాకుండా ఇంజినీరింగులోని అన్ని విభాగాలు మరియూ ఇతర విభాగాల అభివృద్ధికి అత్యాధునిక టెక్నాలజీ ఆలంభనగా నిలుస్తున్నది. ఇంజనీరింగ్ డిగ్రీ కేవలం సాంకేతిక అంశాలనే కాకుండా కార్యనిర్వహణ, వ్యాపార నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సంభాషణానైపుణ్యం వంటివి కూడా నేర్పిస్తుంది. ఇటీవలి కాలంలో ఇంజినీరింగ్ విభాగాల్లోనే కాకుండా సాంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో కూడా ఈ సాంకేతికతలు చేర్చడం ద్వారా ఆ డిగ్రీలు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ఆధునికసాంకేతిక విధానాన్ని జోడించడం ద్వారా ఎలక్ట్రికల్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్స్, కెమికల్ ప్రాసెస్ పరిశ్రమలు, సమర్థ వ్యవసాయం వంటి ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలు ప్రాథమికమైన ప్రోగ్రామింగ్ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తే ఏఐ, డేటా సైన్స్ బిజినెస్ అనలిటిక్స్ వంటివి ఐటీ ఆధారిత అంశాలపై లోతైన పరిజ్ఞానం పెంపొందిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన అంతర్జాలంతో అనేక ఎలక్ట్రానిక్ సాధనాలను అనుసంధానించడం ద్వారా ఇది అపారమైన అవకాశాలున్న రంగంగా విస్తరించింది. విరివిగా పెరిగిన మొబైల్ ఫోన్స్ వాడకంతో పాటు వాటికి ఇంటర్నెట్ అనుసంధానించటంతో అనేక నూతన ఆవిష్కరణలు మొదలయ్యాయి(IBM Granite models-https://www.ibm.com/in-en) దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అంతర్జాలంతో అనుసంధానించి ఉపయోగించడమనేది సర్వసాధారణంగా మారింది. అంతర్జాలం ప్రస్తుతం భారీ డిమాండ్ గల డేటా చోదక శక్తిగా మారింది. దాదాపు అన్ని రంగాల్లోనూ డేటాను వినియోగించి విస్తృతమైన ఉత్పత్తులను అందించడమే కాకుండా డేటా రూపంలో నుండి ఆలోచించే శక్తిమంతమైన యంత్రాలను రూపొందించవచ్చు.
బహుళ భాషలు మాట్లాడే దేశంగా పేరుగాంచిన మనదేశంలో శాస్త్రసాంకేతికత మరియు అంతర్జాలం రమారమీ అన్నిషెడ్యూల్డ్ భాషల్లో విస్తరించాయి. జాతీయ విద్యా విధానం NEP 2020 విద్యలో మాతృభాషల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యత కల్పించింది(పు.17). అంతర్జాలంలో తెలుగు భాషా నైపుణ్యాలు గల వారికి నేడు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాదు భారతీయ భాషల్లో వికీపీడియా వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ ఇంటర్న్షిప్ చేపట్టింది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ సమాచార వినిమయం చేయగల సువర్ణావకాశం కల్పిస్తుంది. తెలుగు వికిలో విజ్ఞాన, శాస్త్రసాంకేతిక అంశాలలో అవసరమైన వారికి తెలుగులో వ్యాసాలు రాయటానికి, వివిధ సాంకేతిక, అనువాద ఉపకరణాల మీద ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తారు. ఈ ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా ఆధునిక పారిశ్రామిక సాంకేతిక యుగంలో విజ్ఞాన సంపదను ఉచితంగా, ఎవరైనా స్వేచ్చగా ఉపయోగించుకోగల, నవీకరించగల సమాచారాన్ని అంతర్జాలంలో వికీ వ్యాసాల రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు.
“తెలుగుభాషను పరిరిరక్షించుకోవాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగం భాషాశాస్త్ర విషయంలో కూడా జరగడం అత్యంత ఆవశ్యకం” 1 (డా. లక్ష్మీ నరసింహ మూర్తి, తెలుగు కోసం కొత్త పుంతలు పు. 8)
పైతాన్, డాటా సైన్స్, మెషిన్ లర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్(కృత్రిమ మేథా) వంటి ఆదరణ కలిగిన కంప్యూటర్ కోర్సులు ప్రాంతీయ భాషలతో పాటు తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించిన ఉద్యోగాల్లో రాణించాలంటే భాషా నిపుణుల సహాయం తప్పనిసరి. భాష వ్యాపారాత్మకమైన నాటినుండి తెలుగు భాషా పరిజ్ఞానంగలవారి అవసరం అపరిమితంగా పెరిగింది. న్యూస్ రైటర్, ప్రూఫ్ రీడర్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, ఫీల్డ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వాయిస్ ప్రాసెసర్, లాంగ్వేజ్ మేనేజర్, ఇంగ్లిష్ - తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పెర్ట్, అడ్మిషన్ ఆఫీసర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెలీ కాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, పోలిటికల్ రీసెర్చర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అక్కౌంట్స్ ఎగ్జిక్యూటివ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్, టెక్నికల్ కంటెంట్ రైటర్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, రీజనల్ ఆపరేషన్స్ మేనేజర్, డేటా అనలిస్ట్, లాంగ్వేజ్ అనలిస్ట్ లాంటి ఉద్యోగాలు అన్నీ ప్రాంతీయ భాషలతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి.
“ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన పత్రికలన్నీ ఇంటర్నెట్‌లో యథాతథంగానో, కొంతమేరకు తగ్గించో తమ పత్రికలను ప్రదర్శిస్తున్నారు. 'వెబ్‌సైట్లు”, బ్లాగు” ల వంటి వాటి ద్వారా సినిమాలు, సాహిత్యం వంటి విషయాలపై చర్చలు జరుగుతున్నా ఇలాంటి వాటికి వినియోగించే భాషలో (ప్రత్యేక ప్రమాణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రసార మాధ్యమాలు - భాష” 2 (డి. వెంకట్రామయ్య, తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం(పు. 33).
2. తెలుగులో ఆన్‌లైన్ ఉద్యోగ అవకాశాలు:
కంటెంట్ రైటర్:
విద్యార్థుల రచనా ప్రతిభ అంతర్జాలంలో కంటెంట్ రైటర్ సాధన విజయానికి ఆజ్యం పోస్తుంది. వ్యాపారాలు, ప్రకటనలు మరియు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటింగ్ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నది. Upwork మరియు Fiverr వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అవకాశాలను అన్వేషించండం ద్వారా అభిరుచిని, నైపుణ్యాలను ఉపాధి అవకాశంగా మార్చుకోవచ్చు.
ఆన్‌లైన్ ట్యూటర్:
తెలుగు భాష మాధ్యమం ద్వారా వివిధ ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నిష్ణాతులై, నచ్చిన సబ్జెక్ట్‌లలో నైపుణ్యాన్ని ప్రదర్శించండం ద్యారా ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
వీడియో ఎడిటర్:
నేడు అత్యంత ప్రాచుర్యం పొందిన సామాజిక మాధ్యమం యూట్యూబ్ Adobe Premiere లేదా Final Cut Pro వంటి సాఫ్ట్‌వేర్‌తో వీడియో ఎడిటింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నేడు తెలుగులో అనేక యూట్యూబ్ చానళ్ళ ద్వారా ప్రచార, ప్రసార సాధనాలు పని చేస్తున్నాయి. వీటిలో వీడియో ఎడిటింగ్, యంత్రానువాదం లాంటి ఉపాధి అవకాశాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. YouTube ఛానెల్‌ల నుండి వివిధ వ్యాపారాల ప్రకటన కర్తలు, స్వతంత్ర కంటెంట్ సృష్టికర్తలు మరియు వీడియో ఎడిటర్లుగా పార్ట్-టైమ్ అవకాశాలు ఉన్నాయి.
సోషల్ మీడియా మేనేజ్‌మెంట్:
సోషల్ మీడియా ఆధారితమైన ప్రపంచంలో అనేక వ్యాపారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా మేనేజర్‌గా, ప్లాట్‌ఫారమ్‌లు మరియు ట్రెండ్‌లపై పట్టు సాధించి విజయం పొందవచ్చు. కంటెంట్‌ను రూపొందించడం, పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం మరియు ప్రేక్షకులతో వారి డిజిటల్ అనుభవాన్ని రూపొందించడం వంటి ఎన్నో అవకాశాలున్నాయి.
“ఆర్థిక వృద్ధి: తెలుగులో నిర్వహించబడుతున్న వ్యాపారాలు లక్ష్య ప్రకటనల ద్వారా, పెరిగిన తెలుగు ఆన్లైన్ అస్తిత్వం నుండి ప్రయోజనం పొందుతాయి. ఇది తెలుగు సమాజంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపించగలదు” 3 (కటికెల శ్రీహర్ష కిశోర్, అంతర్జాలంలో తెలుగు (పు. 30).
డేటా ఎంట్రీ ఏజెంట్:
ఏ భాషలోనైనా కంప్యూటర్ పనిచేయాలంటే దానికి కావల్సిన ఇన్ పుట్స్ అందించాలి. తెలుగులో డాటా ఎంట్రీకి సరైన ఇన్పుట్స్ ఇవ్వగలిగిన ఆపరేటర్స్ ఎంతో మంది కావాలి. దీని ద్వారా తెలుగుతో స్ప్రెడ్‌షీట్‌లు లేదా డేటాబేస్‌లలో డేటాను ఇన్పుట్ చేసే ఆన్లైన్ ఉద్యోగ ఉపాధిని పొందవచ్చు. ఇది అత్యంత అన్వేషించదగిన విశ్వసనీయమైన ఆదాయ ప్రవాహంగా చెప్పవచ్చు.
గ్రాఫిక్ డిజైనర్:
వ్యాపార రంగంలో గ్రాఫిక్ డిజైనర్లకు ఎనలేని డిమాండు ఉంది. తెలుగులో వ్యాపార రంగాలు విస్తరిస్తున్న కొద్ది వాటి వెబ్సైట్ నిర్మాణాలు, వ్యాపార ప్రకటనలకు తెలుగు డిసైనర్స్ అవసరం ఎంతో ఉంది. Adobe Photoshop లేదా Illustrator వంటి సాధనాలతో సృజనాత్మక నైపుణ్యంతో ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైన్లలో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారాలు, వ్యక్తులు, లోగోల నుండి ఆకర్షించే ఫ్లైయర్‌ల వరకు వారి మార్కెటింగ్ మెటీరియల్‌లలో తెలుగులో ప్రతిభ చాలా ఉపయోగపడుతుంది(Adobe-https://www.adobe.com/uk/products/illustrator.html).
అంతర్జాల వృద్ధికారుడు:
డిజిటల్ యుగంలో వెబ్ అభివృద్ధి చెందుతున్న డొమైన్. వెబ్ డిసైన్ నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే, వెబ్ డెవలపర్‌గా పూర్తికాలం లేదా పార్ట్-టైమ్ అవకాశాలు ఉన్నాయి. ఇందులో కొత్త వెబ్‌సైట్‌లను రూపొందించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న వాటికి మెరుగు పర్చవచ్చు. ఫ్రీలాన్సర్ గా కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు.
కోడర్:
కోడింగ్ అనేది వెబ్ అభివృద్ధి నుండి అనువర్తన సృష్టి వరకు తెలుగులో కోడింగ్ నైపుణ్యాలతో గణనీయమైన పార్ట్-టైమ్ ఆదాయాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి.
అనువాదకుడు:
బహుళ భాషల్లో మాట్లాడగల, రాయగల సామర్థ్యం ఉంటే అనువాదకుడిగా ఈ నైపుణ్యాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. పత్రాలు, వెబ్‌సైట్‌లు లేదా కంటెంట్ ద్వారా భాషా అంతరాలను తగ్గించడం నేటి ఇంటర్‌కనెక్ట్ ప్రపంచంలో ఒక అమూల్యమైన సేవ మాత్రమే కాకుండా అనేక విధాలుగా ఉపాధి కల్పిస్తుంది.
బ్లాగర్:
విలక్షణమైన నైపుణ్యం, అభిరుచిని కలిగి ఉన్నట్లయితే, తెలుగులో స్వంత బ్లాగులను ప్రారంభించడం ద్వారా ఆర్థిక లాభం పొందే మార్గాలున్నాయి. క్రమక్రమంగా బ్లాగింగ్ ప్రపంచం చక్కని ప్రతిఫలమిచ్చే అవకాశం ఉంది.
“బ్లాగు అనేది ఒక అంతర్జాల పుటలా కనిపించే దినచర్య పుస్తకము లేదా జర్నలుగా పేర్కొంటున్నారు. బ్లాగు డిజిటల్ ప్రపంచంలో ఒక విప్లవం. ఇందులో ఛాయాచిత్రాలు, ఏదైనా అంశానికి సంబంధించిన ఈ విషయాన్ని పొందుపరచడం, వివిధ అంతర్జాల సైట్ లకు సంబంధించిన వెబ్ లింక్ లను పొందుపరచడం మొదలైన అంశాలు ఉంటాయి. ఈ బ్లాగులను ఉచితంగా వివిధ వెబ్ సైట్లు అందిస్తున్నాయి. బ్లాగులో వచ్చిన సమాచారాన్ని వివిధ పద్ధతుల్లో మార్చుకోవడానికి పలురకాల సాఫ్ట్ వేర్లు ఉన్నాయి. ఈ సాఫ్ట్ వేర్లద్వారా విషయాన్ని సృష్టించడం, మార్చడం చాలా సులభం” 4 (కంప్యూటరులో తెలుగు వినియోగం, e-gyankosh 2024 (పు 148)
ఆన్‌లైన్ పార్ట్-టైమ్ ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు:
ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లు:
ఉద్యోగ అవకాశాలను కనుగొనడానికి Upwork, Freelancer లేదా Guru వంటి ప్రసిద్ధ ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకొనవచ్చును.
నెట్‌వర్కింగ్:
ఉద్యోగ అవకాశాలను కనుగొనడానికి మరియు జాబ్ మార్కెట్ గురించి అంతర్ద్రుష్టులను పొందడానికి తోటి విద్యార్థులు మరియు నిపుణులతో సహసంబధాలు ఏర్పరచుకొన్నట్లైతే వారి ద్వారా ప్రస్తుత సమాజంలో వస్తున్న సాంకేతిక అనువర్తనాలను తెలుసుకొనవచ్చు.
అప్లికేషన్ ప్రోగ్రామర్:
అప్లికేషన్స్ ప్రోగ్రామర్ అనేది వ్యాపార లక్ష్యాలు మరియు కస్టమర్ల అవసరాలను తీర్చే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను రూపొందించడం. ఈ నిపుణులు సాధారణంగా ప్రాజెక్ట్ నిర్వాహకులు, డిజైనర్లు, వ్యాపార విశ్లేషకులు మరియు ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రాజెక్ట్ పరిధిని నిర్ణయించడానికి, తమ ముందున్న సమస్యలను పరిష్కరించడానికి ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించడానికి పని చేస్తారు(toobler-https://www.toobler.com/blog/what-is-business-application-software). అప్లికేషన్ ప్రోగ్రామర్లు కోడ్ రాయడం, పరీక్షించడం, డీబగ్గింగ్ టూల్స్ మరియు ట్రబుల్షూట్ లోపాలను కూడా చూస్తారు. కొన్నిసార్లు ఇతర సమయాల్లో డెవలపర్‌ల బృందంతో కలిసి పని చేసి సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చు. ఈ రకమైన రంగంలో విజయవంతం కావడానికి బలమైన సాంకేతిక సామర్థ్యాలు, అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండటం అత్యవసరం. తెలుగులో అంతర్జాల వినియోగం విస్తరిస్తున్న కొద్ది వీరి అవసరం తప్పనిసరిగా మారింది.
అప్లికేషన్ ప్రోగ్రామర్‌కు సంబంధించిన ఉద్యోగ అవకాశంగల అంశాలు:
- సాఫ్ట్వేర్ డెవలపర్
- అప్లికేషన్స్ ఇంజనీర్
- ప్రోగ్రామర్
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
- సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్
- సాఫ్ట్‌వేర్ విశ్లేషకుడు
- అంతర్జాల వృద్ధికారుడు
- టెక్నికల్ లీడ్
- పూర్తి స్టాక్ డెవలపర్
- ఫ్రంట్ ఎండ్ డెవలపర్
- బ్యాక్ ఎండ్ డెవలపర్
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పట్ల మక్కువ ఉండి వ్యాపార విజయంపై నిజమైన ప్రభావం చూపాలనుకుంటే తెలుగులో ప్రోగ్రామర్‌లకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మక డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు కేంద్ర మంతివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామ పంచాయతికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు ఎలక్ట్రానిక్ రూపంలో ప్రజలకు అందడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇందుకోసం ఇప్పుడు అమలులోకి వచ్చిన ఆధార్ కార్డు (యూనిక్ ఐడీ), కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ-ప్రమాణ్ ప్రధానమైనవి. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు భరిస్తాయి. ఈ సేవలకు తెలుగులో అనేక ఉపాధి అవకాశాలు రానున్నాయి.
స్మార్ట్ సిటీ:
- ఆధునిక సాంకేతిక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇటీవల నూతనంగా వచ్చిన భావన స్మార్ట్ సిటీ. దీని ప్రాజెక్ట్ నిర్మాణానికి కావల్సిన కార్యాచరణలో ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ అభివృద్ధి చాలా ప్రధానమైనది.
- స్మార్ట్ సిటీని నిర్వచించడానికి ప్రధానంగా ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అవి, స్మార్ట్ గవర్నెన్స్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ బిల్డింగ్, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ హెల్త్ కేర్, స్మార్ట్ సిటిజన్.
స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ నిర్వచనం:
స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ నిర్వచనం ప్రకారం నగరాలకు సంబంధించి అన్ని ప్రధాన కార్యక్రమాల్లో డిజిటల్ టెక్నాలజీ అనుసంధానించినట్లయితే ఆ నగరమే స్మార్ట్ సిటీ(Wikipedia-https://en.wikipedia.org/wiki/Smart_city).
ఐఈఈఈ స్మార్ట్ సిటీస్ వివరణ:
స్మార్ట్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ లివింగ్, స్మార్ట్ గవర్నెన్స్ అనే లక్ష్యాలను సాధించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రభుత్వం, సమాజాన్ని ఒకే చోటకు చేర్చడం.
బిజినెస్ డైరెక్టరీ మాటల్లో:
సుస్థిరవృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యంగా కావల్సింది ఆర్థిక వ్యవస్థ స్థాయి పెంపు. ఈ విషయంలో ప్రగతి సాధించిన పట్టణ ప్రాంతమే స్మార్ట్ సిటీ (David Clark-https://enhancv.com/resume-examples/business-director/#).
పైన పేర్కొన్న స్మార్ట్ సిటీ నిర్మాణంలో తెలుగు ప్రాంతం వారికి ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఉదాహణకు తెలుగులో మీ సేవా, ఈ సేవా, ధరణి పోర్టల్, పట్టణాల గూగుల్ మ్యాపులు, వివిధ వెబ్సైట్లు మొ.
డిజిటల్ మార్కెటింగ్:
ఏదైనా వ్యాపారాణికి ఆన్లైన్ ద్వారా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా వినియోగదారులను కల్పించి వివిధ వస్తువులను ఆన్లైన్ ద్వారా వారికి అందజేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు(Quora-https://te.quora.com/). ఉదాహరణకి ఫేస్ బుక్ లో ఒక ఉత్పాదకత గురించి వివరించి, దానికి సంభందించిన ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి దానికి ఒక అఫిలియేట్ లింక్ ని పేస్ట్ చేస్తే, సహజంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ప్రకటన మీ స్నేహితులందరు గమనించి మీరు పేస్ట్ చేసిన లింక్ ద్వారా ఆ ఉత్పత్తిని ఖరీదు చేసే అవకాశం ఉంది. అంతే కాక ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న గ్రూప్ లలో ఈ లింకులను పేస్ట్ చేయడం ద్వారా మీకు తెలియని వ్యక్తుల ద్వారా కూడ మీ డిజిటల్ మార్కెటింగ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను చాలా సంస్థలు అత్యధిక రుసుముతో మరి కొందరు ఉచితంగా అందిస్తున్నారు. నేడు అమేజాన్, ఫ్లిప్ కార్డ్, మీషో వంటి వ్యాపార సంస్థలు ఆన్లైన్ ద్వారా ఊహించలేనంత టర్నోవర్ సాధిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటె వీరికి భౌతికంగా ఏ ఒక్క వ్యాపార స్థలం కూడా లేదు. అలాగే రవాణా సేవల వ్యాపారంలో సంచలనం సృష్టిస్తూ కోట్ల వ్యాపారం చేస్తున్న ఊబర్, ఓలా, రాపిడో లాంటి రవాణా వ్యాపార సంస్థలకు స్వంతగా ఒక్క వాహనం కూడా లేదనేది నమ్మలేని నిజం. ఒక్క ఐడియా ఈ వ్యాపారాలను నడిపిస్తుంది. అందుకే సృజనాత్మకమైన ఆలోచనలతో తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అద్భుతమైన వ్యాపారాలు చేయవచ్చు.
మొబైల్ మార్కెటింగ్:
మొబైల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ యొక్క వినూత్న మార్గం. ఇది ఈ మధ్య కాలంలో అత్యధిక ప్రాచుర్యాన్ని పొందుతుంది. దీని ద్వారా మొబైల్ ఉపయోగించే జ్ఞానం కలిగిన వ్యక్తులెవరైనా డిజిటల్ మార్కెటింగ్‌తో ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Work from Home ద్వారా మొబైల్ మార్కెటింగ్ చేసి గృహిణులు కూడా డబ్బు సంపాడించడం జరుగుతూవుంది. మొబైల్ ని ఉపయోగించి అతి సులువుగా సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్ చేయవచ్చు.
ఇమెయిల్ మార్కెటింగ్:
ఇమెయిల్ మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ యొక్క వినూత్న మార్గం. దీనిలో ఒక సారి వినియోగదారుల పర్మీషన్ తో మెయిల్ అడ్రస్ లను పోందగలిగితే తరువాత మెయిల్ ద్వారా Affiliate Account link లను వారికి పంపడం ద్వారా డబ్బు సంపాదించ వచ్చు. ఈ మెయిల్ మార్కెటింగ్ లో ఉన్న సౌకర్యం ఏంటంటే కేవలం ఒకే క్లిక్ ద్వారా లిస్ట్ లో ఉన్న అందరు కస్టమర్లకు సమాచారం పంపవచ్చు. వారికి పంపే మెయిల్ లో కంటెంట్ రాయవచ్చు మరియు లింక్‌లతో కూడిన గ్రాఫిక్ కంటెంట్ ని కూడా పంపవచ్చు. ఇది కస్టమర్‌కు సులభంగా కొనుగోలు చేయడానికి సహాయ పడుతుంది. కస్టమర్ యొక్క ప్రతిస్పందన మరియు ఉత్పత్తి మార్కెటింగ్ అంచనా వేయడానికి ఇది సులభమైన మార్గం.
Marketing With Web-Designing:
తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులలో అతి ముఖ్యమయిన విభాగం Web Designing Marketing. వెబ్సైట్ నిర్మాణం చేయడం ద్వారా కూడ ఆదాయం వస్తుంది. ఒక వేళ వెబ్సైట్ నిర్మాణం చేయడం పైన సరియయిన అవగాహన లేకుంటే ఎటువంటి కోర్సులు చేయకుండా Search Engine Optimization (SEO) ద్వారా చాలా సునాయసంగా వెబ్సైట్ లు నిర్మాణం చేసి వ్యాపారంగా మార్చుకోవచ్చు.
తెలుగు ఫాంట్స్:
తెలుగు వెబ్ సైట్ తెలుసుకునే ముందు వెబ్సైట్ లో తెలుగు లిపిని ఎలా టైప్ చేయాలో తెలుసుకునడానికి కావాల్సిన తెలుగు అక్షరాలను కింది డొమైన్ లో ఉచితంగా పొందవచ్చు https://www.telugufont.com. దీనిలో దాదాపు 300 రకాలకు పైగా తెలుగు అక్షరములను ఉచితముగా డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. తెలుగు బ్లాగులలో చాల సులువుగా మామూలు తెలుగు అక్షరాలతో టైప్ చేయవచ్చు. కొన్ని పెయిడ్ వెబ్ హోస్టింగ్ సైట్లలో అందమయిన మరియు ఆకర్శనీయమైన అక్షరాలతో చాల అద్భుతమైన తెలుగు రాయవచ్చు. తెలుగులో అందమయిన మరియు ఆకర్షనీయమయిన అక్షరాలతో వెబ్ సైట్, బ్లాగ్ నిర్మిస్తే సదరు వెబ్ సైట్ కి వీక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు బ్లాగ్ ని, వెబ్ సైట్ ని చివరి వరకు చదవడానికి మక్కువ చూపుతాడు.
Adsense ద్వారా ఆన్లైన్ లో డబ్బు సంపాదన:
Google Adsense ద్వారా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు. Google Adsense అకౌంట్ రెండు విధాలుగా ఉంటుంది. Hosted Google Adsense Account: Google Products అంటే Google Blogspot ద్వారా కాని YouTube ద్వారా కాని Accountని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఉచితంగా Google మీడియాని వాడి వ్యాపారం చేయవచ్చు. ఉదాహారణకు blogger.com లో క్రియేట్ చేసిన బ్లాగుల ద్వారా కాని లేదా YouTube అకౌంట్ ద్వారా కాని Google Adsense అకౌంట్ క్రియేట్ చేయడం. ఈ విధంగా క్రియేట్ చేసిన Google Adsense Account ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది(Google AdSense-https://adsense.google.com/start/).
అంతర్జాలంతో కంప్యూటర్ ఆధారిత నేరాలను అరికట్టడానికి వచ్చిన ప్రత్యేక విభాగమే సైబర్ సెక్యూరిటీ. ఇంటర్నెట్ ఉన్నంతకాలం కచ్చితంగా ఉండే అద్భుతమైన ఉపాధి అవకాశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కోడ్ కంప్యూటింగ్ వంటి అంశాల్లో పట్టు సాధించడం ద్వారా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో మంచి నైపుణ్యం సాధించటం ద్వారా ప్రపంచంలోని అనేక ఉత్తమ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇవే కాకుండా అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సైబర్ నేర విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్ లాంటి వాటిలో అభిరుచి ఉండి గణితంలో కొంత తక్కువ పరిజ్ఞానం ఉన్నా ఈ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
3. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రొఫెషనల్స్ కోసం కెరీర్ చిట్కాలు:
తెలుగులో వెబ్ డెవలపర్, అప్లికేషన్స్ ప్రోగ్రామర్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విజయవంతం కావడానికి, ఈ కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి కొన్ని కెరీర్ నియమాలు పాటించాలి. అవి, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. తాజా సాంకేతికతలు మరియు ప్రోగ్రామింగ్ భాషలతో తాజాగా ఉండాలి తద్వారా సంబంధిత నైపుణ్యాలను కొనసాగించవచ్చు. తాజా ట్రెండ్‌లు మరియు సాంకేతికతలతో నవీకరణ చెందడం ద్వారా ప్రస్తుత కంపెనీలో విలువైన ఉద్యోగిగా లేదా భవిష్యత్తులో యజమానిగా మారడంలో సహాయపడుతుంది. ఇతర నిపుణులతో ఎల్లప్పుడు మాట్లాడడం, వీలైనప్పుడు సహకరించండం ద్వారా నైపుణ్యాలను మెరుగు పరుచుకొనే అవకాశం ఉంది. ఇతర ప్రోగ్రామర్లు మరియు సంబంధిత రంగాలలోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం కెరీర్ మొత్తంలో ఉపయోగపడుతుంది. భాషా, సాంకేతిక నైపుణ్యాలకు పదును పెట్టడానికి ఆన్‌లైన్ కోర్సులు లేదా వ్యక్తిగత సెమినార్‌లలో పాల్గొనాలి.
“ఏ భాషైనా విశ్వవ్యాపితం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి సాంకేతికంగా భాషా వినియోగం మరింత విస్తృతం కావాలని సూచించారు. వీటితో పాటు మారుమూల గ్రామాల నుంచి భాషాపదజాలాన్ని సమీకరించడం, అంతరిస్తున్న పదాలను వెలికి తీసి కాపాడుకోవడం, శాస్త్ర సాంకేతిక పారిభాషిక పదాలను తయారు చేయడం, వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించడం లాంటివి ఆవశ్యకమని తెలిపారు. మాతృభాష పరిరక్షణ కోసం సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాలి” 5 (ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు).
మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులు కావడానికి సోషల్ మీడియా ప్రధాన వేదిక అవుతోంది. ముఖ్యంగా నేటి యువత ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్థిక పరిస్థితులు, విద్యార్హతలతో సంబంధం లేకుండా కుర్రకారు సామాజిక మాధ్యమాలతో మమేకం అవుతోంది. సోషల్ మీడియా ‘సమ్మోహనశక్తికి యువత దాసోసం అవుతోంది. అయితే అవి కబుర్లు చెప్పుకోడానికో, కాలక్షేపానికో కాదు, సోషల్ మీడియాతో కెరీర్‌ను మేలిమలుపు తిప్పుకున్నవారు, సొంత ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్న వారూ ఉన్నారు.
“ఐ.టి., సైబర్ ఫీల్డ్ వంటి కొత్త కొత్త రంగాలు పుట్టుకు వస్తున్నప్పుడు, అందులోని పారిభాషిక పదాలకు సమానార్థకాలైన తెలుగు పదాల సృష్టి జరగాలి. భాషా పరిరక్షణకు నిర్దిష్టమైన చర్యలుండాలి. వాటితో పదకోశాలు, నిఘంటువులు తయారు చేసుకోవాలి. ఈ భాషా కృషిలో ప్రభుత్వం, విద్యావేత్తలు, కవులు - రచయితలు, విద్యాసంస్థలు, వతరం, వారి తల్లిదండ్రులు, ప్రసారమాధ్యమాలు, తెలుగు జర్నలిస్టులు ఇలా... అందరూ శ్రద్ధ తీసుకోవాలి. వ్యాసకర్త, భాషాభివృద్ధిలో ప్రసారమాధ్యమాలది కీలక పాత్ర” 6 (ఆర్ దిలీవ్‌రెడ్డి, తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం(పు 59).
4. ముగింపు:
- ఇటువంటి ఉపాధి అవకాశాలపై కళాశాల స్థాయిలో విద్యార్థులకు, తల్లితండ్రులకు విస్తృత అవగాహన కలిగించి తెలుగును చదివే దిశగా ప్రోత్సహించాలి.
- ప్రాంతీయ భాషల్లో సాంకేతికత వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి.
- విద్యార్థులు స్వయంగా తెలుగులో ఆన్లైన్ కోర్సులను చదివే అవకాశం ఉంది. వీటిపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలి. తెలుగు భాషను ఈనాటి అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి.
- భాషతో వ్యాపారం చేసే గూగుల్ లాంటి సంస్థలకు భాషా సంపద(పదజాలం) కావాలి.
- ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో, స్టార్టప్‌లతో తాము ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి చూపుతున్న వారెందరో ఉన్నారు. అనుకూల వాతావరణం తోడవడంతో ‘అంకుర పరిశ్రమల’ను (స్టార్టప్స్) ప్రారంభించేందుకు యువత ఉత్సాహంతో ముందుకొస్తుంది.
- అరకొర వసతుల మధ్య ప్రారంభమైన స్టార్టప్‌లు అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, ఓలా క్యాబ్స్, పేటీఎమ్ వంటి స్టార్టప్‌లు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. తెలుగు భాషా పండితులు, ప్రేమికులు భాషా సంపదను గూగుల్ డాటాబేస్ లో నిక్షిప్తం చేయాలి.
- విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయాలి. తద్వారా సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాష విరివిగా వాడుకోవడానికి కావాల్సిన పదజాలం అందుబాటులోకి వస్తుంది. వికీలో వ్యాసాలు రాసే దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి.
- విద్యార్థులు ప్రతిరోజూ వార్తా పత్రికల్లో వచ్చే రాజకీయ, ఆర్థిక, క్రీడల విషయాలను సేకరించి సంబంధిత వేదికల ద్వారా విదేశాలకు పంపుతూ ఉపాధిని పొందవచ్చు. అంతర్జాలం ఇటేవలి కాలంలో సామాజికమాధ్యమాలలో చోటు చేసుకుని, నానాటికీ విస్తృతమౌతున్న వ్యవస్థ. అయితే రేడియో, టెలివిజన్ వంటి సాధనాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చినంతగా కంప్యూటర్ ఇంకా రాలేదు. కంప్యూటర్ ద్వారా వెబ్‌సైట్లు, వెబ్ పత్రికలు, బ్లాగులు వంటి సౌకర్యాలను వినియోగించుకోవటమనేది మన దేశంలో విస్తృతస్థాయిలో పెరగాలి.
5. పాదసూచికలు:
- డా. లక్ష్మీ నరసింహ మూర్తి(2023), తెలుగు కోసం కొత్త పుంతలు, బెంగుళూరు.
- డి. వెంకట్రామయ్య, తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం(పు. 33), తెలంగాణ సారస్వత పరిషత్తు (వ్యాస సంకలనం) (2016), ప్రధాన సంపాదకులు, సి. నారాయణ రెడ్డి https://www.jetir.org/
- కటికెల శ్రీహర్ష కిశోర్, అంతర్జాలం లో తెలుగు, (పు. 30), అమ్మనుడి (తెలుగు జాతి పత్రిక, మార్చి, ఎప్రిల్ 2024), డా. సామల లక్ష్మణబాబు(ప్రచురణ కర్త), తెనాలి, గుంటూరు.
- కంప్యూటరులో తెలుగు వినియోగం, e-gyankosh 2024 (పు 148), IGNOU Telugu Notes అధ్యాయం 9, IGNOU Study Material PDF Free Download, https://egyankosh.ac.in/
- ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, Posted on 31st July 2021 by PIB https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1740993
- ఆర్ దిలీవ్‌రెడ్డి, తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం (పు 59), తెలంగాణ సారస్వత పరిషత్తు(వ్యాస సంకలనం)(2016), ప్రధాన సంపాదకులు, సి. నారాయణ రెడ్డి https://www.jetir.org/
6. ఉపయుక్తగ్రంథసూచి:
- కంప్యూటరులో తెలుగు వినియోగం, e-gyankosh 2024 (పు 148), IGNOU Telugu Notes అధ్యాయం 9, IGNOU Study Material pdf, https://egyankosh.ac.in/.
- గణేశ్, గొల్లపెల్లి. (2023), అంతర్జాలంలో తెలుగు భాషాసాహిత్యాలు(పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం, ఉస్మానియా విశ్వవిద్యాలయం), హైదరాబాదు.
- తెలుగు పరిశోధన (Telugu Thesis.com), తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం: http://teluguthesis.com/
- తెలుగు వికీసోర్సు(స్వేచ్ఛా గ్రంథాలయం)2015-16 ప్రణాళిక, తెలుగు వికి పుస్తకాలు-https://te.wikisource.org/wiki/
- నారాయణరెడ్డి సి., జె.చెన్నయ్య(సం.)(2016), తెలుగు పత్రికలు ప్రసార మాధ్యమాల భాషాస్వరూపం, తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాదు.
- పద్మజ జి. (సం.)(2017), అంతర్జాలంలో తెలుగు సాహితీ సౌరభం, యు.జి.సి. జాతీయ సదస్సు పత్ర సంకలనం.
- మధుకర్, వైద్యుల. (9 ఫిబ్రవరి, 2020), అంతర్జాల సాహిత్యం, నమస్తే తెలంగాణ దిన పత్రిక.
- మల్లారెడ్డి, కొత్తిరెడ్డి. (2023), తెలుగు భాషా సహిత్య బోధనకు అంతర్జాలంలో విస్తరిస్తున్న అవకాశాలు, 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సంచిక, అక్టోబర్ 21-22, 2023, తాటిపాముల మృత్యుంజయుడు (ప్రధానసంపాదకుడు), మిల్పీటస్, కాలిఫోర్నియా, అమెరికా.
- రాజు కె. (20 ఫిబ్రవరి, 2013), అంతర్జాలంలో తెలుగు పత్రికలు, అంతర్లోచన బ్లాగ్ స్పాట్.
- లక్ష్మణరావు పి.వి (2015), అంతర్జాలంలో తెలుగు (వ్యాస సంకలనం), మళ్ళెతీగ పబ్లికేషన్స్, విజయవాడ.
- లక్ష్మీ నరసింహమూర్తి, రేమెళ్ళ. (2016), తెలుగు కోసం కొత్త పుంతలు, బెంగుళూరు.
- వికీపీడియా, విజ్ఞాన సర్వస్వం, తెలుగు వికీపీడియా: http://te.wikipedia.org
- వెంకట్రామయ్య డి. (2016), తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం(పు. 33), తెలంగాణ సారస్వత పరిషత్తు (వ్యాస సంకలనం), ప్రధాన సంపాదకులు, సి. నారాయణ రెడ్డి https://www.jetir.org/.
- శ్రీహర్ష కిశోర్ కటికెల (పు. 30), అంతర్జాలం లో తెలుగు, అమ్మనుడి (తెలుగు జాతి పత్రిక, మార్చి, ఎప్రిల్ 2024), డా. సామల లక్ష్మణబాబు(ప్రచురణ కర్త), తెనాలి, గుంటూరు.
- సుజాత టి. (2010), తెలుగు విక్షనరీ, ఉచిత నిఘంటువు 24.09.2010 : http://te.wiktionary.org
- సుబ్బారావు, జడా. (2021), అంతర్జాల మాసపత్రికలు - అవలోకనం, నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ, అంతర్జాతీయ సదస్సు పత్రం.
- హేమలత పుట్ల (సం.)(2017), అంతర్జాలం - సాహిత్య దర్శనం, విహంగ ప్రింటర్స్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రచురణలు, రాజమండ్రి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

