AUCHITHYAM | Volume-5 | Issue-6 | May 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. పరిశోధనలో ఉల్లేఖనపద్ధతి: గ్రంథచౌర్య పరిష్కారం
ఆచార్య వెంకటరామయ్య గంపా
తెలుగు ఆచార్యులు,
ఆధునిక భారతీయభాషలు & సాహిత్య అధ్యయన శాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - 110 007.
సెల్: +91 9958607789, Email: gvramaiah@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
వివిధ రకాలుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, విశ్వవిద్యాలయాలలో జరిగే పరిశోధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకు గల కారణం విశ్వవిద్యాలయాలలో క్రమబద్ధమైన పరిశోధనా విధానాన్ని అనుసరించడం. అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పద్ధతిని ఒక ప్రత్యేకమైన కోర్సుగా బోధిస్తున్నారు. 2020 తర్వాత పరిశోధన పద్ధతితో పాటు రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఎథిక్స్ కోర్సులను తప్పనిసరిగా చదవాలి. సిద్ధాంత గ్రంథాన్ని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో రచించడంతోపాటు గ్రంథ చౌర్య నివారణకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. పరిశోధన పద్ధతిలో శైలీ పత్రాన్ని అనుసరించడం అనేటువంటిది ముఖ్యమైన అంశం. ఆంగ్లంలో వివిధ రకాల శైలీ పత్రాలు అమలులో ఉన్నాయి. తెలుగుకు ఒక్క ప్రత్యేకమైన శైలీ పత్రం లేకపోవడంతో ఆంగ్లంలో ఉన్న శైలీ పత్రాలను తెలుగు పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. శైలీ పత్రంలో ఉల్లేఖాలకు అధిక ప్రాధాన్యత ఉంది. పరిశోధకుడు నిజాయితీని, పరిశోధనా దృక్పథాన్నీ వివరించేవిగా ఉల్లేఖాలుండాలి. సమాచారం ఎక్కడ దొరుకుతుందో సూచించడం ద్వారా, పరిశోధనలో పారదర్శకత జోడించబడుతుంది, నాణ్యతకూ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఉల్లేఖాల వల్ల నాణ్యతకు, గ్రంథ చౌర్య నివారణకు అవకాశం ఉంది. సిద్ధాంత గ్రంథంలో దాదాపు పది శాతం మేరకు పూర్వ పరిశోధకుల లేదా ఇతరుల సమాచారాన్ని పేర్కొనవచ్చు. ఉల్లేఖన పద్ధతిని ఉపయోగించడం వలన వివిధ రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించే సందర్భంలో ప్లేజరిజం సాఫ్ట్వేర్ ద్వారా సిద్ధాంత గ్రంథాన్ని పరిశీలిస్తారు. ప్లేజరిజం సాఫ్ట్వేర్ ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగానే పరిశోధకుడు సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించడానికి అవకాశం ఉంది. తెలుగు పరిశోధనలోనూ గ్రంథచౌర్య నివారణకు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా సిద్ధాంత గ్రంథాన్ని యూనికోడ్ ఫాంట్లలో టైపు చేసి అంతర్జాలంలో ఉంచడం ద్వారా భవిష్యత్తులో ప్లేజరిజం సాఫ్ట్వేర్లు కూడా తెలుగుకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించగలవు. పైవిషయాలన్నీ ఈ వ్యాసంలో వివరించడం జరిగింది.
Keywords: పరిశోధన, శైలీ పత్రం, ఉల్లేఖాలు, గ్రంథచౌర్యం, పాశ్చాత్య పరిశోధన.
1. ఉపోద్ఘాతం:
తెలుగులో సాహిత్యం ప్రారంభమైనప్పుడే పరిశోధన కూడా మొదలైంది. నాటి నుండి నేటి వరకు వివిధ రూపాలలో పరిశోధన కొనసాగుతూనే ఉంది. సాహిత్య ప్రక్రియల విస్తృతి పెరిగే కొద్దీ పరిశోధనా పద్ధతులు కూడా మారుతూ వస్తున్నాయి. వివిధ రకాలుగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, విశ్వవిద్యాలయాలలో జరిగే పరిశోధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకు గల కారణం విశ్వవిద్యాలయాలలో క్రమబద్ధమైన పరిశోధనా విధానాన్ని అనుసరించడం.
“పరిశోధన ఒక Methodology - పద్ధతి క్రమం. పరిశోధక వ్యాస నిర్మాణాంశాలూ, పరిశోధక విషయ సంబంధంగా ఏర్పరచుకొన్న పరిశోధక -భావాలూ, పరిశోధకుడి దృక్పథమూ ఈ పద్దతి క్రమాన్ని రూపొందిస్తాయి.” (జయప్రకాష్, ఎస్. పరిశోధన విధానం. పుట-i). విశ్వవిద్యాలయాలలో ఈ విధంగా పరిశోధన జరుగుతుందని ఒక అభిప్రాయం ఉంది.
పరిశోధన అంటే ఏమిటి? పరిశోధన నిర్వచనాలను ఇప్పటికే చాలామంది పరిశోధకులు పేర్కొని ఉన్నారు.
‘‘నూతన సిద్ధాంతాన్ని నిర్మించేది లేక కళాసృష్టికి దోహదపడేది అయిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, నిగ్గు తేల్చకోవడానికి, సాధారణీకరించడానకి, దొరికిన అంశాలను, భావాలను సంకేతాలను వినియోగించుకోవడమే పరిశోధన’’ అని సామాజిక శాస్త్రాల విజ్ఞాన సర్వస్వం పేర్కొన్నది.’’ (చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం., బ్రహ్మానంద, హెచ్ ఎస్. సాహిత్య పరిశోధన సూత్రాలు. పుట-6)
పరిశోధన అనేది అనేక రూపాలలో ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క పద్ధతిలో కొనసాగుతూవున్నది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలలో ఉన్న పరిశోధనా విధానం గతంలో ప్రాథమిక విద్యా బోధనలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో ప్రాథమిక విద్యకు సంబంధించిన వివిధ బోధనా పద్ధతులను చేర్చారు. ప్రాథమిక విద్యాబోధనకు 1940 మే నెలలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ (Central advisory board) ఏర్పడింది. అందులో ప్రాథమిక విద్యా సంబంధ పలు బోధనా పద్ధతులను చేర్చారు. 1947లో ప్రాథమిక విద్యకు సంబంధించిన చేతి పుస్తకాన్ని (Hand Book) ఉపాధ్యాయులకు అందించారు. అందులోని బోధనా పద్ధతులలో ‘The Project Method' అనే పద్ధతి నుంచి పరిశోధనా విధానాన్ని స్వీకరించినట్లు పేర్కొనవచ్చు.
“యోచన (ప్రాజెక్టు) ఒక సాధారణ రకమైన ప్రదర్శన కాదు, కానీ ఇది సమస్యాత్మక చర్య, దీనికి మానసిక వ్యూహాల చురుకైన వ్యాయామం అవసరం. ఉదా. ఆలోచించడం, రీజనింగ్ చేయడం, మదింపు చేయడం, లెక్కించడం మరియు తీర్పు ఇవ్వడం” (Gaind, D.N., Sharma, R.P. Educational Theories and Modern Trends. p. 219).
ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థి తన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తాడు. ఇది పర్యవేక్షణాత్మక అధ్యయనం పద్ధతిలో కొనసాగుతుంది. ఇందులో విషయ సేకరణ, విషయ విశ్లేషణ, తార్కికమైన ఆలోచన, సంశయాల గుర్తింపు మొదలైన అంశాలే ప్రధానం. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సూచించిన పద్ధతిలో విద్యార్థులు విద్యను అధ్యయనం చేస్తారు. ఇదే విధానం విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న పరిశోధనా విధానంలో కనిపిస్తుంది. విశ్వవిద్యాలయాలలో పరిశోధన ప్రారంభమైనప్పటినుండి పర్యవేక్షకుడి పర్యవేక్షణలోనే పరిశోధన జరుగుతున్నది. కానీ పరిశోధనా పద్ధతులపై ప్రత్యేక శిక్షణా తరగతులు ఉన్నట్లు కనిపించదు. కానీ 1975 తరువాత ప్రత్యేకమైన పరిశోధనం, పరిశోధనా పద్ధతుల తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పద్ధతులకు సంబంధించిన కోర్సు తప్పనిసరిగా పూర్తిచేయాలి.
తెలుగులో జరిగిన పరిశోధన, అది కొనసాగిన విధానాన్ని బట్టి పరిశోధనా పద్దతి మారుతూ వచ్చింది. ఇందులో పలురకాల పరిశోధనావిధానాలను అవలంబించారు. తెలుగులో జరిగిన పరిశోధనను క్రింది విధంగా విభజించవచ్చు.
- "గ్రంథ పరిష్కరణ పరిశోధనా పద్ధతి
- సాహిత్య చరిత్ర రచనా పరిశోధనా పద్ధతి
- అనుశీలనాత్మక పరిశోధనా పద్ధతి
- విశ్వవిద్యాలయాలలో తొలిదశలో జరిగిన పరిశోధనా పద్ధతి (1975కు పూర్వం)
- విశ్వవిద్యాలయాలలో మలిదశలో జరిగిన పరిశోధనా పద్ధతి (1975కు తరువాత 2000 పూర్వం)
- విశ్వవిద్యాలయాలలో సమకాలీన పరిశోధనా పద్ధతి (2000 తరువాత)”
(వెంకటరామయ్య, గంపా. పరిశోధన విధానం పరిణామ క్రమం (వ్యాసం) వ్యాసశ్రీ . సంపాదకులు : శ్రీనివాసరావు, గుండిమెడ. పుట-268)
పై అంశాలకు సంబంధించిన విషయాలను వెంకటరామయ్య గంపా తన పరిశోధన విధానం పరిణామ క్రమం అనే వ్యాసంలో విపులంగా చర్చించారు.
2. విశ్వవిద్యాలయాలలో పరిశోధన : యూ.జి. సి మార్గదర్శకాలు
2020 సంవత్సరం తర్వాత విశ్వవిద్యాలయంలో పరిశోధనకు సంబంధించి యూ.జి.సి కొన్ని నియమాలను రూపొందించింది. అందులో భాగంగా ‘రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ ఎథిక్స్’ కోర్సులను పరిశోధక విద్యార్థులు తప్పనిసరిగా చదవాలి.
ముఖ్యంగా పరిశోధన పద్ధతులతో పాటు పబ్లికేషన్ ఎథిక్స్ అనేటువంటివి ముఖ్యమైనవిగా భావించి యూ.జి.సి వారే పాఠ్య ప్రణాళిక రూపొందించారు. ఆ పాఠ్య ప్రణాళికలో గ్రంథ చౌర్యానికి సంబంధించిన అంశం ప్రధానమైనది.
గ్రంథచౌర్యానికి సంబంధవిషయాలలో పలునియమాలు ఉన్నాయి. గ్రంథ చౌర్యాన్ని అరికట్టడానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ భాషలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండటం వలన గ్రంథ చౌర్యంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
3. గ్రంథచౌర్యం:
భారతీయ అలంకారికులు గ్రంథ చౌర్యాన్ని గురించి పలు సందర్భాలలో చర్చించినట్లు వారి రచనల ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని గురించి ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం గ్రంథంలో, వామనుడు కావ్యాలంకార సూత్ర వృత్తి గ్రంథంలో చర్చించినట్లు వారి రచనల ద్వారా తెలుస్తుంది.
“బాణ తన హర్ష చరిత్రలో "పదబంధాలను సవరించడం ద్వారా, రచనా సంకేతాలను దాచడం ద్వారా, మంచి మనిషిలో గుర్తించబడనివాడు కవి, దివ్యత్వం కలిగిన దొంగ" అని పేర్కొన్నాడు.” (C. R. Devadhar. Plagiarism—Its Varieties and Limits. P-1)
రాజశేఖరుడు రచించిన కావ్య మీమాంస గ్రంథంలో గ్రంథచౌర్యం గురించి విపులంగా చర్చించాడు. కావ్యమీమాంస గ్రంథంలో 11, 12, 13 అధ్యాయాలలో వివిధ రకాలైన గ్రంథచౌర్యాన్ని వివరంగా పేర్కొన్నారు.
“పరకవిప్రయుక్తములగు శబ్దారములను [అనఁగా శబ్దములను ఆర్థములను] స్వగ్రంథమున (తనవిగా) కూ గీర్చుటయే హరిణము. హరణము పరిత్యాజ్య మనియు, అనగ్రాహ్య మనియు ద్వివిధము. ఇందు శబ్దహరణమే మొత్తమున పద, పాద, అర్థ, వృత్త, ప్రబంధాద్ను నుండి యైన భేదములవలన నైదు తెఱఁగులు అగుచునలది. అనఁగా నితరకవుల గ్రంథములనుండి [వదతః హరణము] పదములుగా హరించుట, పాదములుగా హరించుట, అర్థము నక్లేట్లే హరించుట, వృత్తతః (కథనుండి) హరణము ప్రబంధతిః (గ్రంథమునుండి కొంత) హరించుట అని యైదు తెఱఁగుల హరిణము ఉండునని తాత్పర్యము. ఇందు ఏకపదహరణము [ఏదో యొక్క పదమును మాత్రము తీసికొనుట] అంతగా దోషము కాదని ఆచార్యులనిరి. ఇయ్యది ద్వ్యర్థపదేతర స్థలములయందు మాత్రమే అని యాయావరీయుఁడనెను అనంగా రెండేసి యర్థములు గల్గుపదములను హరించుట ఒక్కదానిని హరించినను హరణమే యగునని, తదితర స్థలములలో నది దోషము కాదనియాయావరీయుని భావము.” (రాజశేఖరకవి . కావ్య మీమాంస. పుట-207-208)
ఆంగ్లంలోనూ గ్రంథ చౌర్యానికి సంబంధించి చాలా చర్చ జరిగింది. అనేక నిర్వచనాలు పేర్కొన్నారు.
“సహజత్వాన్ని ఆశించే నేపధ్యంలో ప్రయోజనం పొందడానికి మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా ఆలోచనలు, భావనలు, పదాలు లేదా నిర్మాణాలను ఉపయోగించడం” (Bela Gipp. Citation-based Plagiarism Detection. P.10).
సాధారణ పరిభాషలో ‘ఇతరుల పూర్తి సమాచారాన్ని వారి పేరును ఉపయోగించకుండా పరిశోధకుడు తన స్వంత రచనగా ఉపయోగించుకోవడాన్ని గ్రంథచౌర్యం’ అంటారు.
ఇటీవల కాలంలో అకడమిక్స్ లో ఈ విషయం పైన చాలా చర్చ జరుగుతూ ఉంది. గ్రంథ చౌర్యాన్ని మేధోసంపత్తికి సంబంధించిన దొంగతనంగా పరిగణిస్తున్నారు. కొన్ని సందర్భాలలో పరిశోధకుడు ఇతరుల ఆలోచనలతో ప్రభావితం కావడం, వారిని అనుసరించడం లేదా వ్యతిరేకించడం అనేటువంటిది చాలా సహజమైన విషయం. ఒక రచయితకు సంబంధించిన సమాచారాన్ని వారి అనుమతి లేకుండా యధాతథంగా వాడడం, లేదా కొన్ని విషయాలను కొద్ది మార్పులతో ఉపయోగించడం, కొన్ని సంస్థలకు చెందిన సమాచారాన్ని సొంతంగా ముద్రించుకోవడం, ముద్రితమై ఉన్న సమాచారానికి దగ్గరగా ఉన్న విషయాన్ని ప్రచురించడంలాంటివి గ్రంథ చౌర్యంగా పేర్కొంటారు.
4. పరిశోధన-విశ్వసనీయత:
పరిశోధనలు సమగ్రంగా ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం. పరిశోధనలను పంచుకోలేకపోతే వాటికి విలువ ఉండదు. పరిశోధనలో విశ్వసనీయత అనేది లభిస్తున్న సమాచారం పై ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమయంలో ఆధారాలలో విశ్వసనీయత లేకపోతే తర్కం విఫలమవుతుంది. పరిశోధనాంశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. అందువల్ల, ఏదైనా మంచి పరిశోధనకు కేంద్ర బిందువు పూర్వపు సమాచారం లేదా ఆధారాలు. సమాచారం ఎక్కడ నుండి వచ్చింది? అనేది ముఖ్యమైన విషయం. అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవడం ద్వారా, ఏ ఇతర పరిశోధకుడు అయినా దానిని తిరిగి పరిశీలించవచ్చు. ఇతరులు చెప్పిన నిర్ధారణలను తిరిగి పునఃపరిశీలించవచ్చు. అంతే ముఖ్యంగా, వారు కొత్త విషయాలను పరిచయం చేయడం ద్వారా ఆ నిర్ధారణలను తిరిగి అర్థం చేసుకోగలుగుతారు. మూలాలకు రెఫరెన్సులు ఇవ్వడం, సమాచారం ఎక్కడ దొరుకుతుందో సూచించడం ద్వారా, పరిశోధనలో పారదర్శకత జోడించబడుతుంది. ఆ పారదర్శకత పరిశోధనలో నాణ్యతకూ అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే గతంలో చేసిన అన్ని భిన్న వాదనలు/అభిప్రాయాలు ఎల్లప్పుడూ సత్యం కాదు, అసత్యం కూడా కాదు.
5. పరిశోధనలో ప్రాథమిక, ఆనుషంగిక ఆధారాలు అంటే ఏమిటి?:
పరిశోధనకు స్వీకరించిన ప్రధానమైన అంశాన్ని ప్రాథమిక ఆధారంగా పేర్కొనవచ్చు. పరిశోధనకు మూలమైన రచన, శాసనం, మౌఖిక సమాచారం మొదలైన వాటిని ప్రాథమిక ఆధారాలుగా పేర్కొనవచ్చు. పరిశోధనలో ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్కొసారి అనేక రకాలైనటువంటి ఇతర సమాచారాన్ని ఉపయోగించుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ సమాచారాన్ని ఆనుషంగిక ఆకారాలుగా పేర్కొనవచ్చు. మనం ఉటంకించే అంశాలకు ఆధారంగా ఇతరులు చెప్పిన విషయాలను కొన్ని ఆధారాలుగా ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు ఇతర పరిశోధకుల అభిప్రాయాలతో వ్యతిరేకించడానికీ ద్వితీయ ఆకరాలను ఉపయోగించుకోవచ్చు. పరిశోధనా దృక్పథంతో చూడనంతవరకు ఏవైనా సాధారణమైన అంశాలే. పరిశోధనలో వాటిని విశ్లేషించి, వాటిలో సత్యాన్ని వెలికి తీసినప్పుడే అవి విలువైన సమాచారాలుగా మారతాయి. ఇలా లభించిన ఆధారాలను పరిశోధకుడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనేది చాలా ముఖ్యం.
6. ప్రాథమిక, ఆనుషంగిక ఆధారాలు:
భాషా సాహిత్యాలకు సంబంధించినంత వరకు పరిశోధనకు మూలమైన విషయం ప్రాథమిక ఆధారం అనుకున్నాం. అది లిఖితమైన రూపంలో, లేదా రచన (డాక్యుమెంట్) లేదా భౌతికపరమైన వస్తువో ఏదైనా కావచ్చు. ఇందులో సాహిత్య, సాహిత్యేతర అంశాలు ఉంటాయి. ముఖ్యంగా చరిత్ర రచనకు ఉపయోగపడే విషయాలు ఉంటాయి. ఉదాహరణకు కవిత్వం, నాటకం, నవలలు, సంగీతం, కళ, మౌఖిక రూపంలో నుంచి లిఖిత రూపంలోకి వచ్చిన రచనలు, డైరీలు, యాత్రా చరిత్రలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, వార్తాపత్రిక లేదా పత్రిక వ్యాసాలు, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, రాజులు/ప్రభుత్వం చేసిన చట్టాలు, ఇటీవల కాలంలో అంతర్జాలంలో లభిస్తున్న సాహిత్య సమాచారం మొదలైనవి.
ప్రాథమిక ఆధారాలు మనకు వాస్తవాలను అందిస్తాయి, అవి సందర్భోచితంగా ఉంటూ, ఒక వ్యక్తి యొక్క జీవితం, సాహిత్యాన్ని నిర్మించడానికి పరిశోధకుడు ఉపయోగించగల సమాచారంగా మారతాయి. సమాచార ప్రాముఖ్యతను నిర్ణయించడానికి నిశిత పరిశీలన అవసరం. అప్పుడే వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయవచ్చు.
ఆనుషంగిక ఆకరాలు కొంత భిన్నంగా ఉంటాయి. ప్రాథమిక సమాచారాన్ని పరిశీలిస్తున్నప్పుడు అందుకు సంబంధించినవి లేదా ఆ సమాచారానికి దగ్గరగా ఉన్న పుస్తకాలు, పత్రికా వ్యాసాలు, విమర్శకుల అభిప్రాయాలు మొదలైనవి ద్వితీయ ఆకరాలుగా ఉంటాయి. ద్వితీయ ఆధారాలు ప్రాథమిక సమాచారాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. పరిశోధనకు ప్రాథమిక ఆధారాలు ఎంత ముఖ్యమో ఆనుషంగీక (ద్వితీయ) ఆధారాలు కూడా అంతే ముఖ్యం. పరిశోధన ఎప్పుడు ప్రాథమిక, ద్వితీయ ఆధారాల రెండింటి కలయికపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ మునుపటి పరిశోధనలు లేదా రచనలను వివరించే లేదా సమీక్షించే పత్రిక వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, మౌఖిక సమాచారం మొదలైనవి.
పరిశోధకుడు ప్రాథమిక మరియు ఆనుషంగీక ఆకరాలను ఉపయోగిస్తున్నప్పుడు మూలాల గురించి వివరాలను గుర్తించడం అవసరం. వాటిని తప్పనిసరిగా పరిశోధనా వ్యాసంలో/ గ్రంథంలో పేర్కొనాలి. ఆ సమాచారాన్ని తరువాత పరిశోధకులు/పాఠకులు తిరిగి చేయడానికి అవకాశం ఉంటుంది.
తరవాత పరిశోధకుల దృక్పథం భిన్నంగా ఉంటే లభించిన ఆకరాల సహాయంతో కొత్త అంశాన్ని పరిశోధించడానికి సౌలభ్యం కలుగుతుంది. పరిశోధకుడు వదిలిపెట్టిన సమాచారం దగ్గర నుంచి కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే సౌలభ్యం తర్వాత పరిశోధకులకు ఉంటుంది.
7. గ్రంథ చౌర్యానికి పరిష్కారం - ఉల్లేఖన పద్ధతి:
శాస్త్రీయ పరిశోధన అనేది ఎప్పుడూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. గతంలో ఉన్న పరిశోధనల జ్ఞానాన్ని సేకరించడం, దానిని విషయాన్ని విశ్లేషించడం, అందులోని గుణదోషాలను ఒక క్రమపద్ధతిలో పేర్కొనడం అనేది శాస్త్రీయ పరిశోధనలో చాలా ముఖ్యమైన అంశం. ఉత్తమ పరిశోధన గతంలో లభించిన పరిశోధనలను సరైన రీతిలో అధ్యయనం చేసి అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పరిశోధకుడు పరిశోధన చేస్తున్న అంశం పైన గతంలో వెలువడిన సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషించి క్లుప్తంగా సిద్ధాంత గ్రంథంలో పరిచయం చేయడం అనేది ప్రాథమికమైన అంశం. పరిశోధకుడు తాను చేస్తున్న పరిశోధన ఫలితాలను ఉత్తమ పద్ధతిలో నిరూపించడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఉల్లేఖాలు ఉపయోగపడతాయి.
ఇతరుల అంశాలను తన పరిశోధనలో ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. అందుకోసం వారి అభిప్రాయాలను తన పరిశోధన గ్రంథంలో ఉపయోగించుకున్నప్పుడు ఉల్లేఖన పద్ధతిలో పేర్కొనవచ్చు. సిద్ధాంత గ్రంథంలో దాదాపు పది శాతం వరకు ఉల్లేఖన పద్ధతిలో ఇతరుల అభిప్రాయాలను ఉపయోగించుకోవచ్చు.
7.1 . ఉల్లేఖనం అంటే ఏమిటి?:
ఉల్లేఖనం అనేది పరిశోధకుడు సిద్ధాంత వ్యాసంలో లేదా గ్రంథంలో పేర్కొన్న సమాచారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియజేయడం. మూల విషయం ఎక్కడ ఉంది? మూలంలో రచయిత లేదా విమర్శకుడు నిర్దిష్టంగా చెప్పిన సమాచారం ఏమిటి? అనే అంశాలు పాఠకుడికి లేదా పరిశోధకుడికి తెలియజేస్తాయి. ఉల్లేఖనంలో పేర్కొన్న అంశాలు చాలా ముఖ్యమైన విషయాలుగా పాఠకులు భావిస్తారు. ఉల్లేఖనంలో పేర్కొన్న సమాచారం ద్వారా పాఠకుడికి కొత్త ఆలోచనలు కలగవచ్చు.
పరిశోధకుడు ఇతర రచయితల లేదా విమర్శకుల అభిప్రాయాలను ఉపయోగించుకున్నప్పుడు ఆ సమాచారాన్ని కొటేషన్స్ లో చూపించాలి కొటేషన్ ముగిసిన తర్వాత రచయిత, రచనకు సంబంధించిన విషయాలను ఉల్లేఖన పద్ధతిలో తెలియజేయాలి. పలు శైలీ పత్రాలు వివిధ రకాలైనటువంటి పద్ధతులను పాటిస్తున్నాయి. ఇంటెక్స్, ఫుట్ నోట్స్, ఎండ్ నోట్స్ పద్ధతుల్లో ఉల్లేఖాలను సూచిస్తున్నారు. కొంతమంది ప్రత్యేకమైన సూపర్ స్క్రిప్ట్ పద్ధతి ద్వారా ఉల్లేఖాలన్ని పేర్కొంటున్నారు.
7.2 పరిశోధనలో ఉల్లేఖన ప్రాముఖ్యత – ఉపయోగించే విధానం:
సిద్ధాంత గ్రంథంలో పరిశోధకుడు ఇతరులకు చెందిన రచనలను ఉదహరించడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇతరుల కృషి, ఆలోచనలకు గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశం. పరిశోధకుడు ఇతరుల మాటలను ఉపయోగించినప్పుడు కొటేషన్ గుర్తులు ఉపయోగించాలి.
“జ్ఞాన వికాసం మరియు ప్రసారాన్ని సులభతరం చేయడం ఉల్లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ అభివృద్ధి మరియు ప్రసారం మానవ ప్రయత్నం మరియు కమ్యూనికేషన్ ద్వారా నడుస్తుంది; ఈ కమ్యూనికేషన్ ప్రక్రియలో ఉల్లేఖనం అనేది ఒక అంశం.
- విద్యార్థులు ఉన్నత విద్య ద్వారా పురోగమిస్తున్న కొద్దీ, వారు ఆలోచనలు మరియు సిద్ధాంతాలు మరియు నమూనాలు మరియు అభ్యాసాలలో వాటి అనువర్తనాన్ని మరింత విమర్శిస్తారు. ఈ విమర్శనాత్మక విధానంలో ఆలోచనలను తెలివిగా ఎంచుకోవడం మరియు ప్రదర్శించడం మరియు వాటి మూలాలపై అవగాహన ఉంటుంది; రెఫరెన్సింగ్ అనేది జ్ఞానంతో ఈ నిమగ్నత యొక్క ఆచరణాత్మక వ్యక్తీకరణ.
- ఉల్లేఖనం సాధన యొక్క ప్రామాణికకరణ అనేది ప్రసార ప్రక్రియకు మద్దతు ఇస్తుంది.
- అభ్యాసం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ సమర్పించిన సంకేతాలు మరియు సూత్రాల యొక్క అర్థాన్ని గుర్తించడానికి మరియు అర్థం చేసుకోవడానికి వీలు కల్పించే విధంగా ఉల్లేఖనాలను పేర్కొనాలి”
(Neville, Colin. The complete guide to referencing and avoiding plagiarism. P.8 )
7.3 ఉల్లేఖాల వలన ప్రయోజనాలు:
ఒక రచన పైన లేదా అంశం పైన గతంలో ఎవరెవరు ఏ అంశాల పైన పరిశోధన చేశారు ఏ పద్ధతిలో చేశారు? వారు చేసిన పరిశోధనా పద్ధతిలోని ఫలితాలు ఏమిటి? ఆ తర్వాత పరిశోధకులు ఏ రకమైన మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంది? మొదలైన అంశాలను పరిశోధకులు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
- గతంలో పరిశోధకులు చేసిన ఉత్తమ లేదా లోపభూయిష్టమైన విషయాలను తర్వాత పరిశోధకులు గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది.
- ఒకే అంశం పైన పలు పరిశోధకులు పరిశోధన చేసినప్పుడు భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి అటువంటి సందర్భంలో ఏ పరిశోధకుడైన పక్షపాతంతో వ్యవహరించాడా! అనే విషయాన్ని మిగిలిన పరిశోధకులు తెలియజేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
- కొన్ని సందర్భాలలో పరిశోధకులు అత్యుత్సాహంతో అనవసరమైన విషయాలను సిద్ధాంతాలను పరిశోధన గ్రంథంలో పేర్కొనడం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాలలో సిద్ధాంత గ్రంథానికి అవసరం లేనటువంటి విషయాలు కూడా చర్చకు వస్తాయి. అటువంటి వాటిని తర్వాత పరిశోధకులు గుర్తించి ఉల్లేఖాల రూపంలో పేర్కొనడానికి అవకాశం ఉంటుంది.
- గతంలో జరిగిన పరిశోధనలను అధ్యయనం చేసి, వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను పరిశోధకులు వారి గ్రంథంలో చర్చిస్తున్నప్పుడు వివిధ పరిశోధకుల శైలీ పద్ధతులను అవగతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
- కొన్ని సందర్భాలలో పరిశోధన చేస్తున్నప్పుడు గతంలో లభించిన సమాచారం ప్రస్తుత పరిశోధనకు అనుకూలంగా ఉండదు. అటువంటి సందర్భంలో ఒక కొత్త మార్గాన్ని లేదా పద్ధతిని ఏర్పరచుకొనడానికి ఉల్లేఖన పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది.
- అలాగే కొన్ని సందర్భాలలో గతంలో కొంతమంది పరిశోధకులు తమ పరిశోధనాలలో తప్పుడు ఉల్లేఖాలు పేర్కొన్నప్పుడు వాటిని గుర్తించడానికి కొత్త పరిశోధకులకు ఒక అవకాశం కలుగుతుంది.
- కొన్ని సందర్భాలలో కొంతమంది పరిశోధకులు వాస్తవిక వాదనకు దూరంగా ఉన్న అంశాలను ఉటంకిస్తూ ఉంటారు. వాటిని సరిదిద్దడానికి ఉల్లేఖన పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది.
- పరిశోధకుడి విశ్లేషణ పాఠకులకు తెలియజేయడానికి.
- పరిశోధకుడు ఉపయోగించిన సామాగ్రి/సమాచారాన్ని పాఠకులకు అందించడం, తద్వారా పాఠకులు తరవాత వాటిని పరిశీలించవచ్చు.
- పరిశోధకుడి పరిశోధన సరైనది అని ధృవీకరించడం కోసం, పరిశోధకుడి పరిశోధన ఇతరులకు సవాలు చేయడానికి లేదా /వారు మరింత అన్వేషించడానికి. ఒకే అంశాన్ని అనేక విధాలుగా ఆలోచించడానికి అవకాశం కల్పించడం.
- పరిశోధకుడి పరిశోధన ఇతరులకు సవాలు చేయడానికి లేదా /వారు మరింత అన్వేషించడానికి.
- ఒకే అంశాన్ని అనేక విధాలుగా ఆలోచించడానికి అవకాశం కల్పించడం.
- పరిశోధకుడి పరిశోధన సొంతంగా చేశాడు అని నిరూపించుకోవడానికి.
- నిజాలు/వాస్తవాలను బహిరంగంగా, నిర్మొహమాటంగా పాఠకులకు తెలియజేయడానికి.
- పాఠకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి
- ఉల్లేఖాలు అనేవి నిజాయితీకి సంబంధించినవి. గతంలో పరిశోధకులు పేర్కొన్న ఉల్లేఖాలు నివృత్తి చేయడానికి.
7.4 పరిశోధనలో ఉల్లేఖాల ప్రాముఖ్యత: ప్రాచ్య, పాశ్చాత్య పరిశోధకుల అనుసరణ విధానం:
పరిశోధనలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఉల్లేఖన పద్ధతిని పాటిస్తున్నారు. ఉదాహరణకు ఆంగ్లంలో ఇద్దరు పరిశోధకులు ఆరంభించిన ఉల్లేఖన విధానాన్ని Eric Hayot తన The Elements of Academic Style Writing for the Humanities గ్రంథంలో ఉదాహరణగా పేర్కొన్నారు.
"ఉదాహరణకు, జాక్వెస్ డెర్రిడా మరియు మిచెల్ ఫూకో వంటి ఇద్దరు రచయితల ఉల్లేఖన అభ్యాసాన్ని తొందరగా పోల్చడం అనేది వారి ఉల్లేఖన మరియు సూచన నమూనాలలో విస్తృతమైన వ్యత్యాసాలను బహిర్గతం చేస్తుంది: డెర్రిడా తరచుగా దాని రూపానికి ముందు రాబోయే ప్రాథమిక విషయాలను పాక్షికంగా ఉదహరిస్తారు ; ఫూకో తాను ఉదహరించిన దానికంటే ఎక్కువ ప్రస్తావించడానికి, వ్యాఖ్యానించడానికి మొగ్గు చూపారు; డెర్రిడా సుదీర్ఘమైన ఫుట్ నోట్ లను పేర్కొంటారు, మరియు తనను తాను ఉదహరిస్తాడు, పఠిస్తాడు; ఫూకో అంత కాదు; ఇంకా మొదలైనవి” (Hayot, Eric. The Elements of Academic Style Writing for the Humanities. p. 152).
ప్రపంచవ్యాప్తంగా వివిధ శాఖలు పలు రకాలైన శైలీ పత్రాలను ఉపయోగిస్తున్నారు. ఆంగ్లంలో MLA Style Sheet, Chicago (or Turabian) Style Sheet, APA Style Sheet, AAA Style Sheet CSE Style Sheet, AMA Style Sheet, ACS Bluebook Stylesheet.. ఇలా అనేక రకాలైన శైలీ పత్రాలు ఉన్నాయి.
“భారత దేశంలోని వేరువేరు విశ్వవిద్యాలయాల వారు కూడా పైన చెప్పిన శైలీ గ్రంథాలను పాటిస్తున్నారు. ఇక్కడ జరిగే ఇంగ్లీషు పరిశోధనలలో కూడా పై శైలీగ్రంథాలను అనుసరిస్తున్నారు. ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలను కూడా కలిపితే తెలుగులో పరిశోధన మొదలై సుమారు వంద సంవత్సరాలు.20 కాని ఇప్పటిదాకా మనం ఒక శైలీ గ్రంథాన్ని తయారు చేసుకోలేక పోయాము. ఇది ఒక వ్యక్తి తయారు చేసేది కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన పరిశోధకులు ఒక చోట కూర్చోవాలి. ఎన్నో సమావేశాలు జరుపుకోవాలి. పైన చెప్పినట్లుగా విశ్వవ్యాప్తంగా ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయం ప్రకారం ఈ పనిని ఏదైనా విశ్వవిద్యాలయం వారు చేయాలి. లేదా ఒక విద్యావంతుల సమాజం వారు తయారు చేయాలి. అంటే తెలుగు పరిశోధకులకు సమాజం ఒకటి ఉండి తయారు చేయాలి. కాని ఒక వంద సంవత్సరాల కాలంలో తెలుగు పరిశోధనలకు ఒక శైలీ గ్రంథాన్ని తయారు చేసుకోలేకపోయాం.” సుబ్బాచారి, పులికొండ. పరిశోధనా విధానం సిద్ధాంత గ్రంథ రచన. పుట-91)
పులికొండ సుబ్బాచారి చెప్పిన మాటలు అక్షరసత్యాలు. అయినా తెలుగులో కూడా ఆంగ్లంలో ఉన్న ఏదో ఒక శైలీ పత్రాన్ని అనుసరించి ఉల్లేఖన పద్ధతిని పాటిస్తున్నారు. ముఖ్యంగా MLA, Chicago, APA Style Sheet లను ఉపయోగిస్తున్నారు.
తెలుగులో జరిగిన పరిశోధనకు సంబంధించిన సమాచారం కొంత శోద్ గంగ (shodhganga) వెబ్సైట్లో లభిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా 2000 సంవత్సరం తర్వాత విశ్వవిద్యాలయాలలో తెలుగులో జరుగుతున్న పరిశోధనను గమనించినట్లయితే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అధ్యాపకుల కొరత, పరిశోధకులకు సరైనటువంటి మార్గనిర్దేశనం లేకపోవడం, పరిశోధన పద్ధతిలో పాటించాల్సిన నూతన విషయాలు తెలియకపోవడం మొదలైన అనేక అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి.
అదే సమయంలో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో తెలుగు రచనలపై పరిశోధన జరిగింది. దాదాపు 15కుపైగా సిద్ధాంత గ్రంథాలు తెలుగు రచనల పైన వెలువడ్డాయి. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో జరిగిన పరిశోధన గ్రంథాలను, మన విశ్వవిద్యాలయాలు జరిగిన పరిశోధన గ్రంథాలను తులనాత్మకంగా పరిశీలించినప్పుడు ఉల్లేఖాలకు సంబంధించిన పలు విషయాలు ఆసక్తికరంగా కనిపించాయి.
Srinivas G. Reddy అనే పరిశోధకుడు The Āmuktamālyada of Kṛṣṇadevarāya Language, Power & Devotion in Sixteenth Century South India అనే సిద్ధాంత గ్రంథాన్ని South and Southeast Asian Studies, University of California, Berkeley ఆంగ్ల భాషలో సమర్పించారు. ఈ సిద్ధాంత గ్రంథం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద రచన పైన జరిగిన పరిశోధన. ఒక భిన్నమైన ఆలోచన పద్ధతులతో సిద్ధాంత గ్రంథం సమర్పించారు. ఇందులో కేవలం ఉల్లేఖాలు చూస్తే పరిశోధకుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని అనుసరించినట్లు కనిపిస్తుంది. పరిశోధకుడు గతంలో వచ్చిన పరిశోధనలు పేర్కొనడంతో పాటు తన ఆలోచనలను వివరించే సందర్భంలో అవసరమైన సమాచారాన్ని ఉపయోగించుకున్నారు. ఆ సమాచారాన్ని ఫుట్ నోట్స్ రూపంలో వివరించారు. ఉపయోగించుకున్న సమాచారాన్ని ఉపయుక్తగ్రంథసూచికలో పేర్కొన్నారు. వీటితోపాటు అవసరమైన అదనపు సమాచారాన్ని అనుబంధంలో వివరించారు.
పాశ్చాత్య దేశాలలోని విశ్వవిద్యాలయాలలో తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక అంశాలపై జరిగిన పరిశోధన గ్రంథాలు ఇదే పద్ధతిలో దాదాపు 15కు పైగా సిద్ధాంత గ్రంథాలు ఆంగ్లభాషలో లభిస్తున్నాయి. (పాఠకులకు సమాచారం తెలియజేయడం కోసం అనుబంధంలో ఆయా సిద్ధాంత గ్రంథాల సమాచారాన్ని తెలియజేయడం జరిగింది.) పరిశోధకులు అందరూ ఒక క్రమబద్ధమైన పరిశోధన పద్ధతిని పాటించి ఉల్లేఖాలను పేర్కొన్నారు.
అయితే తెలుగుకు సంబంధించి ఇటీవలకాలంలో వెలువడిన పరిశోధనా గ్రంథాలను పరిశీలించినప్పుడు ఇందుకు భిన్నమైనటువంటి విషయాలు కనిపించాయి. పరిశోధనా నియమాల దృష్ట్యా ఆయా సిద్ధాంత గ్రంథాలను ఇక్కడ పేర్కొనడం లేదు. గత నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో వెలువడిన సిద్ధాంత గ్రంథాలు అన్నీ శోద్ గంగాలో లభిస్తున్నాయి. కొన్నిటిని పరిశీలించినప్పుడు అసలు ఉల్లేఖనం అంటే ఏమిటో తెలియకుండా సిద్ధాంత గ్రంథం కనిపిస్తుంది. ఒకే సిద్ధాంత గ్రంథంలో భిన్న పద్ధతుల్లో ఉల్లేఖాలను పేర్కొనడం గమనించవచ్చు. ఒక సిద్ధాంత గ్రంథంలో దాదాపు 150 పుటలు ఉన్న అధ్యాయంలో ఒక్క ఉల్లేఖనం లేదు. ముఖ్యంగా ఆధునిక సాహిత్య ప్రక్రియల పైన పరిశోధన చేస్తున్నప్పుడు ఆ రచనలకు సంబంధించిన వస్తువును పరిచయం చేస్తూ అధ్యాయాలను పూర్తి చేసిన పరిశోధకుల గ్రంథాలు కనిపిస్తాయి.
8. ముగింపు:
- మంచి పరిశోధనకు ఖచ్చితత్వం అనేది చాలా అవసరం. ఇది ప్రాథమిక మరియు ద్వితీయ వనరులపైన ఆధారపడి ఉంటుంది. సమాచారాన్ని సరియైన పద్ధతిలో ఉల్లేఖించినప్పుడే ఉత్తమ ఉదాహరణ పద్ధతులు అభివృద్ధి చెందుతాయి, పరిశోధన అభివృద్ధి చెందుతుంది.
- ఉల్లేఖాలు లేకుండా వ్యాఖ్యానంతో ఉంటే ఆ పరిశోధనా గ్రంథం పత్రికా వ్యాసంలా మిగిలిపోతుంది. కొన్ని సందర్భాలలో విరుద్దమైన అభిప్రాయాలు కూడా అందులో చేరవచ్చు. ఉత్తమ ఉల్లేఖనా విధానంపై స్పష్టమైన, నిర్దిష్ట మార్గదర్శకాలను అభివృద్ధి చేసి, వాటిని సరిగ్గా అనుసరించడానికి పరిశోధకులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- ఆంగ్లంలో గ్రంథచౌర్యానికి సంబంధించిన పలు సాఫ్ట్వేర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధాంత గ్రంథాలను విశ్వవిద్యాలయాలకు సమర్పించేటప్పుడు ప్లేజరిజం సాఫ్ట్వేర్ల సహాయంతో పరీక్షించిన చేసిన తర్వాత మాత్రమే సిద్ధాంతం గ్రంథాన్ని సమర్పించాలి.
- ఆంగ్లంలో లభిస్తున్న టైపింగు సాఫ్ట్వేర్లు సాధ్యమైనంత వరకు ప్లేజరిజంను గుర్తించడానికి సహకరిస్తున్నాయి. కానీ తెలుగులో రకరకాల టైపింగు సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ముఖ్యంగా అను, శ్రీలిపి ఫాంట్లు మొదలైనవి ప్లేజరిజం సాఫ్ట్వేర్లు గుర్తించడం కష్టమవుతుంది. వీటి స్థానంలో యూనికోడ్ లో టైపు చేసిన సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచడం ద్వారా తెలుగు సాఫ్ట్వేర్లు సంబంధించిన విషయాన్ని కూడా ప్లేజరిజం గుర్తించగలుగుతుంది. ప్రస్తుతం అంతర్జాలంలో తెలుగుకు సంబంధించి యూనికోడ్ ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి.
- ముఖ్యంగా గ్రంథచౌర్యానికి సంబంధించిన విషయాల్లో యూనికోడ్ ఫాంట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
- విశ్వవిద్యాలయాలు కూడా సిద్ధాంతగ్రంథాలను యూనికోడ్లు సమర్పించేలా నియమాలని రూపొందించడం అవసరం.
9. పాదసూచికలు:
- R. Devadhar. Plagiarism—Its Varieties and Limits. Annals of the BhandarkarOriental Research Institute, 1954.
10. ఉపయుక్తగ్రంథసూచి:
తెలుగు:
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం., బ్రహ్మానంద, హెచ్ ఎస్. సాహిత్య పరిశోధన సూత్రాలు. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1997.
- జయప్రకాష్, ఎస్ . పరిశోధన విధానం హైదరాబాద్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 2003.
- రాజశేఖరకవి. కావ్య మీమాంస. (అనువాదం: ఆదినారాయణశాస్త్రి, పంచాగ్నుల). మద్రాసు: ఆర్యభారతి ప్రెస్సు, 1930.
- వెంకటరామయ్య, గంపా. పరిశోధనవిధానం పరిణామక్రమం (వ్యాసం) వ్యాసశ్రీ. సంపాదకులు : శ్రీనివాసరావు, గుండిమెడ. విశాఖపట్టణం: రోషన్ పబ్లికేషన్స్, 2018.
- సుబ్బాచారి, పులికొండ. పరిశోధనా విధానం సిద్ధాంత గ్రంథ రచన. కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయం 2014.
English:
- Bela Gipp. Citation based Plagiarism Detection. Germany: Springer Vieweg, 2014.
- Gand, D.N., Sharma, R.P. Educational Theories and Modern Trends. Agra: Ram Prasad & Sons, 1995.
- Hayot, Eric. The Elements of Academic Style Writing for the Humanities. New York: Columbia University Press, 2014.
- Neville, Colin. The complete guide to referencing and avoiding plagiarism. England: Open University Press, 2010.
Essay:
- C. R. Devadhar. Plagiarism—Its Varieties and Limits. Annals of the Bhandarkar Oriental Research Institute, 1954.
అనుబంధం:
- Amy L. Allocco. Snakes, Goddesses, and Anthills: Modern Challenges and Women’s Ritual Responses in Contemporary South India. Reaserch Advisor: Joyce Burkhalter Flueckiger. Emory University. 2009.
- Darry Dinnell. Samrajyalakshmi peethika: An Imperial Tantric Manual from Vijayanagara. Research Supervisor: Davesh Soneji. McGill University.2011.
- David, Anne Elizabeth Amirthanayagam. Aspects of the syntax and morphology of Telugu: Agreement and negation in verbal projections. Research Advisor: Eric Hamp. Illinois University.1999.
- Genealogies of the Citizen-Devotee: Popular Cinema, Religion and Politics in South India. Research Supervisor: Nicholas Dirks, Columbia University, 2011.
- Goldbergbelle, Jonathan Robert. Performance poetics of tolubommalata; a south indian shadow puppet tradition. Dessertaion advisory committee: Phillip Zarrilli. University of Wisconsin-Madison.1984.
- Govindan, Indira. Building Hindu temples in America: A study of Sri Venkateswara temple at Bridgewater, New Jersey. Research Advisory committee: Prof. Philip Jensen, Wesley Ariarajah, M.G. Prasad. Drew university. 2001.
- Telugu Loanword Phonology. Research Advisor: Dr. Diebold. University of Arizone. 1981.
- Katten, Michael. Category creation and the colonial setting: Identity formation in ninteenth century Telugu-Speaking India. Research Advisory committee: Prof. Eugene Irshhick, Thomas metcalf, Robert Goldmen. University of California.1997.
- Mantena, Rama Sundari. Vernacular futures: Orientalism, history, and language in colonial south India. Doctoral Committee: Prof. Nicholas B. Dirks, Thomas Trautmann, Kali Israel, Aamir Mufti. University of Michigan. 2002.
- Mitchell, Lisa Ann. From medium to marker: The making of a mother tongue in modern south India. Research Advisor: John Pemberton. Columbia university. 2004.
- Modern autobiographical practice in Telugu. Dissertaion Committee: Prof. Vinay Dharwadker, Joseph Elder, Susan Friedman, Kiran Narayan. University of Wisconsin-Madison. 2004.
- Mohammad, Mahboob Ali. Following the Pir: Shared devotion in South India. Dissertation committee: Prof. Charles Hallisey, Donald R Davis, University of Wisconsin-Madison. 2004.
- Pal, Sailaza Easwari. Sexual discourse and Telugu modernity: A reading of Gudipati Venkata Chalams Maidanam. Research Supervisor: Steven Walker. State University of New Jersey. 2002.
- Pelletier, Rosanne Helen. Aspects of the syntax and morphology of Telugu: Agreement and negation in verbal projections. Research Advisor: Larry Horn. yale University. 1994.
- Prabhavati Chitiala Reddy. Reconstructing the mondala symbolism of Siva’s lotus Land: Srisailam’s Place in Religious India. Reesrch Advisory committee: Prof. D Eck, S Jamison. Harvard Univerity. 2000.
- Rajagopal, Vakulabaranam.Self and society in transition: A study of
- Rothgery, Eric John. Generating and mediating religious identities: Islamic healing rituals shared by Hindus and Muslims in the Dargas of Hyderabad, India. Reserch Supervisor: Frederic M Smith. University of Iowa. 2008.
- Showrayya, B.F . Duel with darkness: A Translation of Dasarathi’s Thimiramtho samaram. ResearchSupervisor: Robert B Kamm. Oklahome University.1986.
- Srinivas G. Reddy. The Amuktamalyada of Krishnadevaraya Language, Power & Devotion in Sixteenth Century South India. Research Advisory Committee: Professor George L. Hart, Alexander von Rospatt, Harsha Ram. University of California, 2011.
- Talbot, Cynthia. Gifts to gods and brahmins: A study of religious endowments in medieval Andhra. Research Advisor: A.K.Narain. University of Wisconsin-Madison. 1988.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

