headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

2. "ఆంధ్రనాయకశతకము": సామాజికాంశాలు

DrJSPRAO
డా. జాడ సీతాపతిరావు

అసిస్టెంట్ ప్రొఫెసర్
రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిబుల్ ఐటి),
నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9951171299. Email: seethuphd@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆంధ్రనాయక శతకము ప్రజల్ని దుష్టులనుంచి రక్షించిన రాజు కథ. శతకం ముక్తక లక్షణం. కాబట్టి ఒక్కో సంఘటన ఒక్కో రకంగా చిత్రించడం ఈ శతకం ప్రత్యేకత. భట్రాజు వంశానికి చెందిన పుల్లమభట్టు అనే నామాంతరం ఉన్న కాసుల పురుషోత్తమ కవి విజయవాడ 45 కిలోమీటర్లు దూరంలో ఉన్న కృష్ణా నది ఒడ్డున జీర్ణించిన దేవాలయానికి పునర్వైభవాన్ని కాసుల పురుషోత్తమ కవి కాంక్షించారు. చారిత్రక పురుషుడు, భాగ్యవంతుడిగా ఖ్యాతి పొందిన ఆంధ్ర మహావిష్ణువును ప్రశ్నిస్తునే దీనావస్థకు కారణాలను అన్వేషిస్తున్నాడు. భాగంగా పురాణాలు, ఇతిహాసాలు, నాటి బ్రిటిష్ పాలకుల స్థితి, సామాజిక విషయాల్ని సూచించారు. ప్రస్తుతం ఉయ్యారుకు దగ్గరగా ఉన్న శ్రీకాకుళంలో వేంచేసిన విష్ణుమూర్తి అవతారమే ఆంధ్రమహావిష్ణు దేవాలయం. ఆ దేవాలయం జీర్ణావస్థకు వివిధ రకాల కారణాలున్నాయ్. ఈ శతకంలో ప్రస్తావించిన అంశాలలో ప్రజలు పడుతున్న అవస్థలు, దేవాలయంలో కోల్పోయిన వైభవం ప్రస్తావితాలు. బ్రిటిష్ వారి నిర్లక్ష్య బుద్ధి, ఊరేగింపులు, ఉత్సవాలు లాంటి చేసుకోలేని ఆర్థిక పరిస్థితికి ఉన్న కారణాలను కవి చూపడం విశేషం. ఆయా స్థితుల్ని చూసి చలించిన కాసుల పురుషోత్తమ కవి అంతకుముందున్న వైభవాన్ని, ప్రస్తుతం ఉన్న స్థితితో పోల్చి వర్ణించారు. ఇందులో చారిత్రక రాజకీయ కారణాలు మిళితమై వ్యాజస్తుతి, వ్యాజనింద అలంకారాలతో ధ్వని గర్భితంగా చాలా అంశాల ప్రస్తావనలు కనిపిస్తున్నాయ్. పూర్వవైభవ స్మరణ, పౌరాణిక వైభవం చైతన్య తత్త్వం, జన జాగృతి, దోపిడి నుంచి ఎదిరించే స్థితి, తగవరి పంపకం, దేశ, ఆలయ పునరుద్ధరణ, స్నేహధర్మం, కష్టాల అవస్థల, శిక్షల వ్యవస్థలు నాటి సామాజిక స్థితుల్ని తెలుపుతున్నై. కృష్ణుడితో, విష్ణువుతో ఆయా కాలానికి సంబంధించిన సామాజిక స్థితుల్ని అంతర్గతంగా చేస్తూ చెప్పడం మరో విశేషం. ప్రధానంగా బ్రిటిష్ వారి పాలనలో దేవాలయ వ్యవస్థ జీర్ణించిన స్థితిని చూపారు. ద్విపాద మకుటంతో కూడిన సీసపద్య విన్యాసం ఛందోపరమైన విశేషం. కృష్ణుడి చేతివాటం దగ్గరనుంచి పంపకం వరకు, విష్ణువు భక్తుల కథలు వారి స్థితులు ఇలా దేనికదే ఆణిముత్యాలుగా తెలిపే శతకం కాసుల పురుషోత్తమ కవి గారి ఆంధ్రనాయక శతకం.

Keywords: ఆంగ్లేయుల పాలన, దేవాలయాల స్థితి, భారతం, భాగవతం, సామాజిక అంశాలు, జాతీయభావాలు, పూర్వవైభవస్మరణ, నాటి పరిస్థితికి జాగృతి

ఉపోద్ఘాతం:

ఆంగ్లేయులతో నిరంతరం యుద్ధాలు సాగిస్తూ మైసూరు బెబ్బులిగా టిప్పు సుల్తాన్ పేరుపొందాడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన నాల్గవ మైసూరు యుద్ధం (Naravane, M.S. (2014). Battles of the Honourable East India Company)లో (1799) పోరు సలుపుతూ ప్రాణాలు కోల్పోయాడు. రాజ్యం ముక్కలైంది. యుద్ధంలో సహాయం చేసినందుకు గానూ, నిజాం నవాబు అసఫ్ జాహీ, మహారాష్ట్ర పీష్వాలు కొత్త రాజ్యాల్ని పొందారు. కర్ణాటకలోని కొంత భాగం పీష్వాల, ఆంధ్రదేశంలోని కోస్తా రాయలసీమ ప్రాంతాలు నిజాం నవాబు ఏలుబడిలోకి వెళ్ళాయి.

కొత్తగా చేజిక్కించుకొన్న ఆంధ్ర ప్రాంతాలపై అధికారాన్ని సుస్థిరం చేసేందుకు దృష్టినిసారించారు. క్రీ. శ. 1800వ సంవత్సరం అక్టోబర్ 12 వ తేదిన సికింద్రాబాదులోని చొల్లారంలో ఉన్న సైనిక శిబిరంనుంచి గుర్రం పై ఠీవీగా కూర్చొని బయలుదేరిన యువకుడు, బ్రిటీషురాజ్య ప్రతినిధి ప్యాట్రిక్ తన పటాలాన్ని నిజాం నవాబు కోట వైపు నడిపించాడు. చేసేది లేక సంధికి వచ్చాడు నవాబు. అప్పటి గవర్నర్ కారన్ వాలీసు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి అంగీకరించి ఏటా 24 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది(Naravane, M.S. (2014). Battles of the Honourable East India Company). పొరుగు రాజ్యమైన మహారాష్ట్రుల నుంచి భయం లేకుండా చేసేందుకు ఆంగ్ల ప్రభుత్వం తన సైన్యంలో కొంత అతని వద్ద ఉంచింది. దాని ఖర్చులన్నీ నవాబే భరించాలి. చివరికి ఆ ఖర్చులు భరించలేక పోవడంవల్ల ప్యాట్రిక్ తన పటాలంతో ఆ కోటను ఆక్రమించుకున్నాడు. ఇలాంటి చారిత్రకపరిణామాల కారణంగా భారతీయ జమీందారీ పాలకులు దేవాలయపు ఆదాయం లేక, ఆలయ మరమ్మత్తు చేయలేక, ధూపదీపనైవేద్యాలకు దిక్కులేక దయనీయమైన స్థితిలో ఆంధ్రమహావిష్ణువుని “చిత్రచిత్రప్రభావదాక్షిణ్యభావ” అంటూ... నీ లీలల్ని ఎలా గ్రహించాలి స్వామీ అని వ్యాజస్తుతితో కవిగారు శతక మకుటాన్ని ప్రారంభించారు.

ఈ మకుటంలోనే సామాజికాంశాన్ని సూచించారు. చిత్రచిత్రప్రభావ అన్నపుడు ప్రభావ శబ్దానికి కోశబలంవల్ల కలిగిన తేజం, శక్తి (శబ్ద రత్నాకరము: పుట 733) ప్రతాపం, సామర్థ్యమని అర్థాలు. ఇలాంటి శక్తి ఆపదలలో ఉన్న వారిని రక్షించడంకోసం వినియోగించాలి. ఇపుడు ఆంగ్లేయులు చాలా దురాగతాలు చేస్తున్నారు. దాక్షిణ్యభావ - కరుణ కలవాడా! నువ్వు ఇపుడు రాదగిన సమయం అని భగవంతుడిని ఆర్తితో పిలిచే మకుటంగా చూడడం సామాజికకోణం.

నామ సార్థక్యం: 

క అంటే బ్రహ్మ. ఆకులం అంటే నిలయం. బ్రహ్మకు నిలయమై తర్వాత కాకులంగా మారి శ్రీ చేరి “ల” “ళ” గా మారి శ్రీకాకుళం అయ్యింది. దివిసీమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంత ఆంధ్రనాయక స్థితి, వైభవం ఆంధ్రనాయక శతకం.

శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువును దర్శించడం, అతడి కోరికమీదనే ఆముక్తమాల్యదను రాసినట్లు చారిత్రక కథనం. దీవి్సీమ తీర్థ క్షేత్రాలలో మొదటిది శ్రీకాకుళక్షేత్రం. 

చారిత్రక కథనం: 

పూర్వం కృష్ణా తీరంలో అడవీ ప్రాంతంలో నాగ, యక్ష రాక్షస జాతులు ఉండేవి. వాళ్ళు అక్కడ ఉండే మునీశ్వరుల్ని బాధించేవారు. ఈ రాక్షస గణ నాయకుడు నిశుంభుడు. ఇంద్ర కుమారుడైన ఆంధ్ర విష్ణువును శరణువేడారు. భయంకరమైన యుద్ధం తర్వాత నిశుంభుడిని రాజు చంపేశాడు. ఆ రాజే సీముఖుడు. తర్వాత శ్రీముఖ శాతవాహనుడు. ఇతడే మొదటి తెలుగు రాయుడు. 108 దివ్య క్షేత్రాలలో శ్రీకాకుళం 57 వది గా గుర్తింపు ఉంది. 

పూర్వవైభవ స్మరణ :

"శ్రీ మదనంత లక్ష్మీ యుతోరః స్థల!/చతురాననాండ పూరిత పిచండ!
ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త!/నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర!
సకల పావన నదీ జనక పాదాంభోజ!/రమణీయ ఖగకులోత్తమ తురంగ!
మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప!/వరకల్పకోద్యాన వన విహార!
భాను సిత!భాను నేత్ర ! సౌభాగ్యగాత్ర!/యోగిహృద్గేయ ! భువనైక భాగధేయ!
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!/హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!"

                                                      (ఆంధ్రనాయక శతకము, ప1)

భారత దేశం సంపాదలకు నిలయం, వేద భూమి, కర్మభూమి. అలాంటి స్థితిని నుంచి డినావస్థను పొందించడానికి కారణం బ్రిటిష్ పాలకులే. నాటి వైభవం, నేటి స్థితిని తులనాత్మకంగా పరిశీలించడం ఈ పద్యంలో చూడొచ్చు. ఈ పద్యంలో చాలా ఆభరణాలు, ఆయుధాలతో లక్ష్మీదేవితో కూడి రమ్మని కవి ఆకాంక్ష. పంచాయుధాలు కలవాడు విష్ణువు: శంఖం (పాంచజన్యం), చక్రం (సుదర్శనం), విల్లు (శార్ఙ్గ౦), గద (కౌమోదకి), ఖడ్గం (నందకం): ఆయుధాలు శత్రునిర్మూలన కారకాలు. అలంకార ప్రియః విష్ణుః అనే ఆర్యోక్తికి తగినట్లుగా అలంకారాతో విరాజిల్లాల్సిన ఆంధ్ర మహావిష్ణువు దీనావస్తను ధ్వనింపజేస్తున్నాడు. బ్రిటిష్ వారిని తరమమనడం సూచన. లక్ష్మిని అంటే సంపదను సాధించాల్సిన అవసరాన్ని గుర్తించడం. భారతదేశపూర్వవైభవస్మరణ ఇవన్నీ సంబోధనపూర్వక సమాసపదాలతోనే వర్ణించడం విశేషం.

"మానుష హర్యక్ష, మార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష, కౌంతేయ పక్ష... !"

                                                      (ఆంధ్రనాయక శతకము, ప3)

ఈ పద్యంలో మానుషహర్యక్ష అనే పదం సామాజికస్పృహను కలిగించేది. హర్యక్ష అంటే సింహం. నారసింహ అవతారసూచకం. సూర్యచంద్రులే నేత్రాలుగా కలవడాని అర్థం. ఇక్కడ కేవలం నరుడుగా కాకుండా నరసింహుడిగా రావాలి. అప్పుడే ఈ భారతదేశాన్ని పాలిస్తున్న వాళ్ళ భరతం పట్టడం వీలవుతుందని తెల్పడం. కౌంతేయపక్ష పదప్రయోగం ద్వారా కృష్ణావతారాన్ని, గజేంద్రుణ్ణి రక్షించిన విష్ణువును స్పురింపజేయడం. ఒకప్పుడు బలవంతంగా చేస్తున్న చాలా దురాగతాలనుండి విభిన్న అవతారాల్లో భక్తులను, జంతువులను రక్షించావు. ఇప్పుడు అలానే బ్రిటీషువారినుంచి భారతీయుల రక్షణబాధ్యతను నిర్వహించమని కాసుల వారి ధ్వని.

పౌరాణిక వైభవం చైతన్య తత్త్వం : 

గోవింద ! ముచికుంద సేవిత పాదార/ వింద! నిత్యానంద ! విశ్వతుంద !
శ్రీమంత ! విజయలక్ష్మీకాంత నిర్మల/ స్వాంత భక్తోద్యాన వనవసంత !
అఘనాశ ! కోటిసూర్యప్రకాశ ! వరేశ !/ విజితాశ ! సన్మనోంబుజ నివేశ !
సద్గుణ గేహ ! వాసవనీల సమదేహ !/ బంధురోత్సాహ ! సువర్ణవాహ !
పండిత స్తోత్ర చారిత్ర ! పద్మనేత్ర !/ మధుర మంజులభాష! సమస్తపోష !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!

                                                           (ఆంధ్రనాయక శతకము, ప4)

భారతదేశంలో నాడు ఈస్ఠిండియా కంపెనీ పాలనే ఉండేది. మత మార్పిడులతో హిందూమతం పై అరాచకశక్తులు దాడి చేస్తున్నాయ్. కేవలం వారిచ్చే తాయిలాలకు ఆకర్షించడం ఇప్పటికీ ఉంది. కులం, మతం దానిని ఆంగ్లేయులు చిచ్చు పెట్టడానికి వాడుకున్నారు. ఒక పౌరాణిక అంశాన్ని తెల్పుతూ కాసుల వారు చైతన్య పరుస్తున్నారు. ఇందులో ఉన్న సంబోధనలు చాలా వరకు భారత దేశ వైభవ స్మరణలు 

ముచికుందుడు/ ముచుకుందుడు ఇక్ష్వాకు వంశపు రాజు. మాంధాత కుమారుడు. అంబరీషుడికి సోదరుడు. ఇక్ష్వాకు వంశమే సూర్యవంశం. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు చక్రవర్తి, శ్రీరాముడు కూడా సూర్యవంశం వారే. 

కాలయవనుడు ముచుకుందుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడుకోట్ల మంది మ్లేచ్ఛసైన్యంతో మధురపై దాడి చేస్తాడు. పెద్ద జడతో నల్లగా ఉండే కాలయవనుడికి యాదవులు ఎవరూ కూడా తనని చంపలేని ఒక వరం ఉంది. నారద మహర్షి మాట విని శ్రీకృష్ణుని మధుర పైకి యుద్ధానికి వస్తున్నాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధం ముగించాడు. ఈ లోగా కాలయవనుడి యుద్ధం ప్రజలకు నష్టం కలిగిస్తుందని విశ్వకర్మ ను పిలిపించి సముద్రగర్భంలో పన్నెండు ఆమడల వెడల్పుతో ద్వారకను నిర్మించాడు. ద్వారకకు కాపలాగా బలరాముడిని ఉంచి తను మధుర నగరానికి చేరుకుంటాడు. 

ముచుకుందుడు దేవతలకు యుద్ధంలో సహాయం చేసి అలసిపోతాడు. దేవతలు ముచుకుందా, నీవు మాకు బాగా సహాయం చేశావు. ఏమైనా వరం కోరుకో మనగానే ముచికుందుడు నేను బాగా అలసిపోయాను నాకు నిద్ర పోవడానికి మంచి చోటు కావాలని ఇంద్రుణ్ణి కోరతాడు. నీకు బాగా నిద్ర వస్తుంది నిన్ను ఎవడైతే నిద్రలో నుండి లేపుతాడో వాడు నీ కళ్ళలో నుండి వచ్చే మంటలో దగ్దమై పోతాడ ఇంద్రుడు వరాన్నిస్తాడు

 కాలయవనుడు నిరాయుధుడైన శ్రీకృష్ణపరమాత్ముని చూసి వీడేనా యాదవ రాజు అని వెంట పడడంతో శ్రీకృష్ణుడు పరిగెడతాడు. అలా ఒక గుహ లోకి వెళతాడు గుహలో గాఢ నిద్రలో ఉన్న ముచికుందుని చూసి, యాదవుడని అనుమానంతో కాలిపై తంతాడు. ముచుకుందుడు నిద్రనుండి లేచి కళ్ళు తెరవగా ఆ కళ్ళనుంచి అగ్ని బయటికొచ్చి కాలయవనుణ్ణి కాల్చేస్తుంది. బూడిదై పోతాడు. ఇలాంటి శక్తులు ఇప్పుడు బ్రిటిష్ వారిమీద ఎందుకు వాడడం లేదని కవి ఈ పౌరాణిక ప్రస్తావన తీసుకువచ్చాడు. 

గర్గలాలు కవి ఉండేది అహోబిలం. కాసులవారిది దివిసీమ. ప్రాంతాలు వేరైనా రాజకీయ పరిస్థితులు ఒక్కటే. నృసింహ పంచవింశతి రచించిన గర్గలాలు క్షత్రియుడు కాబట్టి ‘క్రీస్తు మతజుల చెండుమా కినుక బూని’ అని ధైర్యం గా అహోబిల నారసింహాన్ని ప్రార్ధించాడు. కాని కాసుల పురుషోత్తమ కవి భట్టు కులజుడు. అందునా జమీందారు ప్రాపకంలో ఉన్న వాడు. అందువల్ల ‘హత విమత జీవ’ అంటూ ఆంధ్రదేవుని స్తుతిస్తున్నాడు పురుషోత్తమ కవి.

జన జాగృతి :

"వంచన గాదె దివ్యక్షేత్రపతులలో/ మంత్రార్థకృత్యము ల్మాని యున్న?
నపకీర్తిగాదె లోకాలోకములయందు/ వత్సరోత్సవములు వదలి యున్న?
నగుబాటు గాదె యన్యమతస్థజనులలో/ నిజదాసకోటి మన్నింపకున్నఁ?
బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో/ దేవతామహిమంబుఁ దెలుపకున్న?
నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ/ బాడి దప్పిన బలునిందపాలు గావె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!/ హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!"

                                                       (ఆంధనాయక శతకము ప: 15)

ఇందులో "అన్యమతస్థజనులలో నిజదాసకోటి మన్నింపకున్న" ప్రధాన౦. అన్యమతాల మధ్య స్వీయధర్మాన్ని నిలబెట్టుకోవడం అనడంలో భారతదేశంలో ఉన్న స్థితి, ఉన్నతంగా ఉండడం లేదని, ఇక్కడ ఉన్న వారే ఉద్యోగాల పేరుతో మోసపోతున్నారని చైతన్య పరచాలనే భావన ధ్వనింపజేస్తున్నాడు. జనం ఎప్పుడు చైతన్యాన్ని పొందుతారో అపుడే మోసపోకుండా ఉంటారని కవి కృష్ణుడి నుంచి మోసాలను గుర్తించమని ధ్వనింపజేస్తున్నాడు. దివ్య క్షేత్రాలలో ప్రసిద్ధమైన స్వరూపానికి ఇలా అపకీర్తిని పొందడం నీ భక్తులకు అగౌరవాన్నిస్తుంది. అపుడు అది నీకు కూడా అగౌరవమే కదా అని సూచించడం.

దోపిడి నుంచి ఎదిరించే స్థితి:

చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి/ గొల్లయిల్లాండ్రను గొల్లగొనఁగ?
మెక్కంగఁ దగునె ము న్పెక్కిండ్లలో నుట్ల/ కెక్కి పాల్వెన్నలు డొక్క నిండ?
మ్రుచ్చిలఁ దగునె మళ్ళుచ్చి జలక మ్మాడు/ మచ్చెకంటుల కోక లిచ్చకముగ?
మ్రొక్కంగఁ దగునె ముం దొక్కపువ్వునకుఁ దాఁ/ గక్కసించినయాలి కక్కజముగ
నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ/ జేసినాఁడవు మంచిప్రసిద్ధకుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!

                                                         (ఆంధనాయక శతకము ప: 17)

శ్రీకాకుళాంధ్రదేవా! వ్యాపారం కోసం వచ్చినవాళ్ళు ఆంగ్లేయులు. కానీ ఇక్కడ పాలకులుగా మారి ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూడమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా తిరుగుబాటు చేయకపోతే ఎంతకాలం ఈ దీనావస్థ. ఏదో చిన్న ఆకర్షణలు లొంగిపోతే బలమైన పెద్ద ఆకర్షణ బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 

రేపల్లెలో అమాయకులైన గొల్ల వనితల్ని లొంగదీసుకున్నావన్న అపప్రధను ఏ రకంగా సమర్ధించు కుంటావయ్యా! (నువ్వు లోక నాథుడివి కాబట్టి ఇది నీకు సులువే). పరాయి వాళ్ళ ఇళ్ళలో దూరి దొంగ చాటుగా ఉట్లలోని పాలు, వెన్నల్ని దొంగలించుకుపోవడం ఏం న్యాయం అంటావు. భగవంతుడికి దొంగా అని పేరు (శివార్చణలో నమఃచోరాయ అని నమకంలో చెప్పారు) (అలా దొంగతనంగా వచ్చి వారి మనస్సుల్ని దొంగలాడుతారు) అవసరమా? బట్టల్ని గట్టు మీద పెట్టుకొని కొలనులో స్నానమాడుతున్న ఆడవారి బట్టల్ని ఎత్తుకెల్లడం ఏం సబబు. శారీరక వాంఛల కన్నా, మోక్ష మార్గాన్ని అన్వేషించమని, వయస్సు౦డగానే దానిపైకి (మోక్షం )వలపు పెంచుకోమనడం. 

ఓ కృష్ణా అప్పుడు నువ్వు గోపికలకు మోక్షాన్ని ప్రసాదించావు, ఈ బాసిన తత్త్వం నుంచి ఎపుడు బయటపడే మోక్షాన్ని ఇస్తావని, అలాంటి సమయం ఎప్పుడు వస్తుందని కాసుల వారు కృష్ణ తత్త్వం, భారతీయుల తిరుగుబాటు తత్త్వాన్ని సూచించే ప్రయత్నమిది.
రేపల్లె అంటే భారతదేశం. అమాయకులైన గోపికలు భారతీయులకు ప్రతీకలు. నీది విలాసం. ఆంగ్లేయులది దోపిడి. నీ లీలలు వల్ల తెలివైనవాళ్ళుగా మారారు. జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇక్కడ అవకాశం లేదు. పట్టపగలు చాలా రూపాల్లో దోచుకు పోయినా ఏమీ చేయలేని అసమర్థత. నీవే రక్షించాలి అంటూ ధ్వని, సామాజిక వాస్తవం.

తగవరి పంపకం:

"నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది/ పంచాయుధము లీవు పట్టినావు
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి/ గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి/ కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి/ జున్ను బాల్‌ పెరుఁ గీవు జుఱ్ఱినావు
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె/ తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!”

                                                        (ఆంధ్రనాయక శతకము, ప: 36)

అన్నదమ్ములు ఆస్తుల్ని ఎలా పంచుకున్నారో చెప్తూ, కృష్ణుడు వాటాలు వేసే తీరు రసమయంగా చూపారు, కాసుల వారు. ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వానికి వాటాలు వేసుకున్న స్థితిని సూచిస్తున్నాడు. దొంగలు దొంగలు ఊర్లను పంచుకున్నట్లు ఉంది భారతదేశ స్థితి. పై తగువు తీర్చడానికి ఎవరు వస్తారు. ఇంటి తగువు ఈశ్వరుడు కూడా తీర్చడాయే.

నాగలి రోకలి - అన్న బలరాముడికి; శంఖం, చక్రం- కృష్ణుడికి
తాటిచెట్టు ధ్వజం - బలరాముడికి; గరుడ ధ్వజం- కృష్ణుడికి
నల్లని వస్త్రాలు(విలువలేనివి)- బలరాముడికి; బంగారు వస్త్రాలు (విలువైనవి)- కృష్ణుడికి
మద్యం- బలరాముడికి; జున్ను, పాలు, పెరుగు - కృష్ణుడికి

పాండవుల కౌరవుల తగువు తీర్చడానికి నువ్వే తగవరివి అంటూ వ్యంగ్యంగా చెప్తూనే కృష్ణ బలరామావతారాల స్వరూప స్వభావాలను స్పష్టంగా చెప్తూ, నారాయణుడికి, ఆంధ్రనాయకుడికి అభేదం చూపడంతో ఇది రూపకం. ఇక్కడ ఆస్తిని పంపకంలో చిన్న వాడికి ప్రాధాన్యం ఉంటుంది అనే లోక సామాన్య అంశాన్ని స్పురింపజేస్తున్నాడు. పెద్దవాళ్ళు చిన్న వాడిపట్ల ఉండే వాత్సల్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అంశాలు పట్టించుకోని పెద్దరికాన్ని ధ్వనింపజేస్తున్నాడు.

దేశ, ఆలయ పునరుద్ధరణ:

"కఠిన స్తనంబుల ఘట్టించి దట్టించి/జడలచే మోది నున్దొడల నదిమి
పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా/యువతీ సహస్రంబు లుపరతాది
బంధనంబుల నిన్నుఁ బైకొని తమి రేచి/రమియింప నిదురింప రాక నాఁటి
బడలిక దీర నాపఁగ రాని సుఖనిద్ర/బవళించియున్నట్టి భావ మిచటఁ
దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష!/మేల్‌ బళా! యింత జా గేమి మేలుకొనవె!
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్యభావ !/హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!

                                                    (ఆంధనాయక శతకము ప: 46)

మొదటి వరుస - సంభోగ దృష్టి,
రెండో వరుస చుంబన సౌఖ్యం,
మూడో వరుస - కౌగిలింతలు,
నాలుగో వరుస – నిద్రాభావం,
ఐదో వరుస- లేవడానికి నేపథ్య/ కారణాలు.

ఆంధ్రదేవా! రాత్రంతా యువతీ సహస్ర ఉపరతాది బంధనాలతో నిన్ను పైన వేసుకొని కోరికతో క్రీడిస్తూ అలసి పోయి నిద్రలేక, ఇప్పుడు సుఖనిద్ర పోతున్నావా.(వెటకారం) లేకపోతే మేలుకొని, నీ భక్తులను ఏలుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు స్వామీ! చైత్యన్య పరచటం కవిత్వం లక్ష్యం. ఒక కార్య కారణ సంబంధాన్ని కవి అన్వేషించాడు. ఆంధ్ర విష్ణువుకు నిద్ర లేకపోవడానికి కారణం శృ౦గార సుఖమట.

ప్రస్తుతానికి వర్తిస్తే ఆంగ్లేయులు చాల రకాలుగా భారతీయ స్త్రీలను హింసిస్తున్నారు. నువ్వు చూస్తూ ఉంటావా? అంటూ జనాల్ని చైత్యన్య పరచడం ధ్వని. ఇంకోరకంగా చెప్పాలంటే ఆ దేవాలయం వివిధ రకాల శృ౦గార సుఖాలకు విటులు (దేవదాసీ వ్యవస్థ) వాడేస్తున్నారు. దానిని మేల్ భళా అని మెచ్చుకోవాలా? ఇంకా పునరుద్ధరణకు దేవాలయం నోచుకోదా? అని నిలదీస్తున్నాడు కవి.
భక్తుల్ని ఏలుకోవడానికి ఆలస్యం ఎందుకు? : భక్తులు పడుతున్న ఇబ్బందుల్ని చూడడం. ఆలస్యానికి కారణాలు అన్వేషణ. భక్తుల మనసులతో భారతీయ పీడితులను చేర్చి నివేదన.

స్నేహధర్మం:

"కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో/ ముచ్చటించెద వేమి పుణ్యమూర్తి
సాటిగా వెలిగొండ వీటి జంగముచెల్మిఁ/ బచరింతు వేనాఁటి బాంధవుండు
వెలి పాపపాన్పుపై వేడ్కతోఁ బవళింతు/ వది యేమి భోగిభోగాంతరంబు
పొరుగిండ్ల కేప్రొద్దుఁ బో రాఁ దలఁచు నింతిఁ/ బాయకుండెద వేమి భాగ్యలక్ష్మి
మంచి సహవాసములు గల్గె నెంచి చూడ/ నీకె తగు నట్టివారితో నెనరు నెఱప
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!"

                                                       (ఆంధ్రనాయకశతకము ప: 52)

శ్రీకాకుళాంధ్రదేవ! మహతి వీణ తీగె ను మీటుకుంటూ తిరిగే సన్న్యాసి ఆ నారదుడితో ఎంతో అభిమానంతో ఎప్పుడూ ఏఏవో ముచ్చట్లాడతావు. ఆయన చేసిన పుణ్యమేమి? వెండికొండ మీద నివసించే జంగమయ్య(శివుడి)తో స్నేహం చేస్తావు. అతనేమైనా నీకు పాత చుట్టమా? తెల్లని శేషపాన్పు మీద విలాసంగా శయనిస్తావు. అదేమైనా నీకు విశేషభోగమా స్వామీ? ఎవరి ఇంటా నిలవకుండా ఎంతసేపు పొరుగు ఇళ్ళకు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది నీ ఇల్లాలైన లక్ష్మీదేవి.(చెంచు లక్ష్మి) అయినా ఆమెను నీవు వక్షస్ధల౦లో నిలుపు కొని ఏలుకొంటున్నావు. ఆలోచిస్తుంటే ఎంత మంచిస్నేహాలయ్యా నీవి. ఇలాంటి వారితో స్నేహం చేయడం నీకే తగింది ప్రభూ. తంతెగొట్టు= వీణావాద్యగాడు. శివ శక్తుల క్రీడావల్ల విష్ణువు పుట్టాడు. (శివపురాణం)

కృష్ణుడు కూడా కుచేలునితో స్నేహం. ద్రోణుడు, ద్రుపదునితో స్నేహం. కానీ, ద్రోణ ద్రుపదులు ఎలాంటి స్నేహం చేయకూడదో మనకు చెబితే; కుచేల కృష్ణులు స్నేహమంటే ఎలా ఉండాలో చెబుతారు. స్నేహంలో హెచ్చుతగ్గులుండవు. ఒకరికి లేకుంటే వారు అడగలేదు కదా అని ఇవ్వకుండా ఉండలేరు నిజమైన స్నేహితులు. ఈవిషయాన్ని చెప్పటానికే కృష్ణుడు కుచేలుడు అడగకపోయినా ఆయన దారిద్య్రంనుంచి దూరమవడానికి సంపదను ఇచ్చాడు. ఒక్క మనదేశంలోనే కాదు ‘స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు’ అని- రెవస్థ్ ఛొవ్దరీ, ‘మాటలకే పరిమితమయ్యే మిత్రుడెప్పుడు నీ మిత్రుడుగా ఉండలేడు’ అని లియోటాల్ స్టాయ్, ‘అహంకారి కి మిత్రులుండరు’ అని అస్కార్ వైల్డ్ (https://te.wikipedia.org/wiki/స్నేహం) తెలిపారు.
 

కష్టాల అవస్థల, శిక్షల వ్యవస్థలు:

"కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ/ బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ/ నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన/ మారీచుఁ డొనరించె మాయ లెన్ని
నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప/ వానియిల్లా లెంత వగచి తిట్టె
స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య/ కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ"

                                                       (ఆంధనాయక శతకము ప: 72)

ఆంధ్రదేవా! నీ చిన్నతనంలో ఆడుకుంటూ నిన్నెత్తుకున్న పనిమనిషి మంథరను కాలితో తన్నావు అన్న కోప౦తో సమయంకోసం ఎదురుచూసి నీవు పెద్దవాడవైన తర్వాత నీ పట్టాభిషేక సమయంలో కైకేయిద్వారా తన పగను తీర్చుకొని నిన్ను అడవుల పాలు చేసింది. బలవంతంగా ఆనాడు శూర్పణఖ ముక్కుచెవులు కోయిస్తే, ఆ రాక్షసి పగబట్టి తన అన్న రావణుని ఎగద్రోసి ఎన్ని కష్టాలపాలు చేసిందో కదా! విశ్వామిత్రుని యాగ సంరక్షణ సమయంలో మారీచుని చంపక వదిలివేయడంతో వాడు మాయలేడిగా వచ్చి నిన్ను ఎన్ని కష్టాలకు గురిచేశాడో కదా! నిరపరాధి యైన వాలిని సంహరించి నప్పుడు ఆతని ఇల్లాలు బాధలో నిన్ను ఎన్ని మాటలందో కదా! నీవు ప్రభువువై ఉండి కూడ తెలియనట్లు ప్రవర్తించావు. అందుకే చిన్నచిన్న కార్య కారణాల మూలంగా ఎన్నెన్ని కథలు పుట్టాయో కదా!

ప్రతి చిన్న పొరపాటుకు కఠినమైన శిక్షలు వేయడం, ఉద్యమాలను అణచివేయడం బ్రిటిష్ వారి సహజ గుణంగా మారింది. “వందేమాతరం” అనడానికి “దొండ కాయల దగ్గరకు వచ్చి, గట్టిగా వందేమాతరం” అని, ఈలోగా బ్రిటిష్ పోలీస్ వస్తే వంద ఏమాత్రం అని అడుతున్నానని చెప్పాల్సిన స్థితి నాటి భారతదేశంలో ఉన్న ఆంధ్రులది. చిన్న పొరపాటుకే మంధర అంత శిక్ష విధిస్తే ఇపుడు బ్రిటిష్ వారిపై ఎలాంటి శిక్షలు భారతీయులు వేయాలో సూచించమని, ఆలోచించమని కాసుల వారి కావ్య స్ఫురణ.

  • కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ/ బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
    = జానపద రామాయణంలో చిన్నప్పుడు వంకర కాళ్లమీద రాముడు చిన్న కర్రపుళ్లతో కొట్టాడట. పగవల్ల అడవుల పాలు: మంథర
  • బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ/ నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
    = ఆడదానికి అవమానం చేయడంలో దిట్ట: ఆమె అన్న రావణుడి దగ్గరికి వెళ్ళి నీ విషయం చెప్పింది 
  • జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన/ మారీచుఁ డొనరించె మాయ లెన్ని
    = మారీచుడిని విశ్వామిత్ర యాగంలో వధ చేయక వదలడం: సీతాపహరణ
  • నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప/ వానియిల్లా లెంత వగచి తిట్టె
    = కారణం అడిగింది: రాజుగా తన ధర్మాన్ని నిర్వహించడం: తమ్ముడికి ఇవ్వాల్సిన విషయంలో మాట తప్పడం 
  • స్వామివై యేమి యెఱుఁగవు స్వల్పకార్య/ కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
    = స్వల్ప కార్యం- శబరి ఎంగిలి. కానీ ఆమెను మెచ్చుకున్నావు. ఉడుతనుకూడా. 

చిన్న తప్పు చేసినా పెద్దకుటుంబంలోని వాళ్ళను గుర్తుంచుకుని వారికి అపకారం చేసే వాళ్ళు ఉంటారు. అలానే చిన్న వల్ల విషయంలో పెద్దవాళ్ళు కూడా. అందుకే అపకారం చేయకుండా ఉండాలి. అపుడే మనకు అందరూ మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది.
శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్న దాక్షిణ్యంతో తిన్నాడు. కుబ్జ అందించిన గంధాన్ని కరుణతో తీసుకున్నాడు. పాంచాలి వేడుకోగా దయావేణువుని ఊదాడు. గోపమ్మ చనుబాలు తాగిన కృపా గుణం కలవాడు. మాలికుడిచ్చిన పూల దండల్ని దాల్చిన ప్రేమ, పేద బ్రాహ్మణుడు చింకి ఉత్తరీయంలో ముక్కిన అటుకులు కట్టుకు వచ్చిన తీసుకున్న నీ ఆత్మీయత, అమాయకత్వంతో పాదాల్ని కడగటానికి వచ్చిన వాడికి నువ్విచ్చిన చనువు (గుహుడు), ఉడుత సాయానికి అందించిన ప్రేమ, వీటన్నిటినీ ఒక్కసారి తల్చుకొని, నా ఉడుత భక్తినంగీకరించి, వచ్చి రాని మాటలతో కొడుకున్ తండ్రి ఆదరించినట్లు అర్భకుడైన నన్ను నా శతకాన్ని స్వీకరించు, అంకితం తీసుకో అంటూ ఆంధ్ర నాయకుడికి అంకితం చేసిన అశేష శేముషి, కృషీవలుడు కాసుల పురుషోత్తముడు.

ముగింపు:

మాటలాడే ఒడుపు, మన్నించమనే సమయస్ఫూర్తి, పదాలలో ఒంపు సొంపులు, రామాయణ భారతభాగవతాల పాండిత్యాల కలబోత, స్వప్రాంతాభిమానం, భక్తి పారవశ్యం, భక్తుడ్ని ముక్తుడిగా చేయమనే భగవత్ సాక్షాత్కారం వెరసి ఆంధ్రనాయక శతకం. బ్రిటిష్ వారు భారతీయ ప్రజల్ని బానిసలుగా చూసే వైనం, దేవాలయ జీర్ణోద్ధరణ, మత మార్పిడులు, మతాలమీద చిచ్చు రేపే వైనం, భారతీయ ఆర్థిక స్థితిని కొల్లగొట్టే కుట్ర లాంటివన్నీ చూసి, నిరుత్తరుడై తన కవితా కాలాన్ని ఝళిపించారు కాసుల వారు. మనిషి మనీషిగా మారుతూ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనే దశలో సేవకుడిగా కర్తవ్యనిర్దేశనం చేసుకుంటూ యుక్తాయుక్తవిచక్షణ మరవకుండా భక్తిశిక్తమైన సేవా సాక్షాత్కారాన్ని భగవంతుడి పేరుతో కోరుకునే అదృష్టవంతుడు కేవల నామమాత్రమైన కాసుల వారు.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. గర్గలాలు: శ్రీనృసింహ పంచవింశతి:1845: తేజస్విని వ్యాఖ్య 2016: ముత్తెవి రవిప్రసాద్: అంతర్జాలం, mutteviraviprasad.blogspot.com
  2. పాండురంగారావు, ఇలపావులూరి: రామాయణ పరమార్థం:1999, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ. 
  3. పురుషోత్తమకవి, కాసుల: ఆంధ్రనాయకశతకము: పాతకమిత్ర వ్యాఖ్య: 2020: శ్రీనివాస్, అద్దంకి: ఎస్ ఆర్ పబ్లికేషన్స్, విజయవాడ. 
  4. పౌలా రిచ్మన్: అనేక రామాయణాలు: తెలుగు అనువాదం:2018: పి. సత్యవతి: హైదరబాద్ బుక్ హౌస్. హైదరాబాదు. 
  5. సీతారామాచార్యులు, బహుజన పల్లి: శబ్దరత్నాకరము: 2009: ఆసియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, న్యూ ఢిల్లీ. 

ఆంగ్ల గ్రంథాలు: 

  1. Naravane, M.S.:2014: Battles of the Honourable East India Company. A.P.H. Publishing Corporation. 
  2. Siva Rao, D.V.: The British Rule in India: 1938: ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల, బెజవాడ.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal