headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-3 | Issue-12 | November 2022| ISSN: 2583-4797

1. శిల్పకావ్య కావ్యశిల్పం

డా. తుమ్మలపల్లి వాణీకుమారి

ఎం.ఎ.తెలుగు, సంస్కృతం, బి.ఇడి. పి.హెచ్.డి.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం.
సెల్: 7780716753, email: vanikumaritummalapalli@gmail.com

Download PDF


ఉపోద్ఘాతం:

"ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో"

ఈ పాట మా తరం గుండెల్లో మధురంగా మారుమ్రోగింది. ఆ శిల్పాలను చూడాలనే ఉత్కంఠను కలిగించింది.ఏళ్ళు గడిచినా చూడలేకపోయాననే దిగులు మనసు లోపలి పొరల్లోకి వెళ్ళిపోయి ఇదిగో- ఇప్పుడిలా ఆ పొరలను చీల్చుకుని పైకి వచ్చేసింది. ఎందుకంటారా? అందమైన ఆ శిల్పాలను చెక్కిన ఆ మహాశిల్పి జీవనకావ్యాన్ని చదవటం వలన. ఈ వ్యాసంలో సంక్షిప్తంగా ఆ కావ్యంలోని శిల్పాన్ని పరిచయం చేస్తాను.

కవి పరిచయం:

'మహాశిల్పి జక్కన చరిత్రము'- ఈ పద్య కావ్యాన్ని వ్రాసిన కవి డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు. శ్రీదేశికాచార్యులు గారు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా, బల్మూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ గారు రామ తాతాచార్యులు గారు. వనపర్తిలో పాఠశాల విద్యాభ్యాసం తరువాత హైదరాబాదులోని నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. తరువాత కెనడాలోని University of Western Ontario లో పి.హెచ్.డి(Astronomy), MC. Master University లో M.Sc Computer Science పూర్తిచేసారు. న్యూజిలాండ్ లోని University of Canterburyలో పరిశోధకుడిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగాను పనిచేసారు. తరువాత Atomic Energy of Canada లోను, New Flyer Industries లోను Computer Scientist గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసారు. ఇప్పుడు టొరంటోలో నివసిస్తున్నారు.

రచనలు:

అశ్రుమాల, హనుమప్పనాయకుడు. జక్కనచరిత్ర, కవితాస్రవంతి, ఋతుసంహారము, వాణి నా రాణి, బిల్హణీయము మొదలైనవి వీరి రచనలు. వీటిలో మొదటి అయిదు కావ్యాలు కావ్యనందనం పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించబడినాయి. అనేక గేయ, పద్య రూపకాలు 'ఈ మాట' అనే అంతర్జాల పత్రికలో ప్రచురింపబడినాయి. చిత్రలేఖ అనే నవల హిందీ నుండి అనువదించబడింది. ఆపస్తంబ గృహ్యసూత్ర ప్రకారంగా వీరు వైదిక సంస్కార ప్రయోగ గ్రంథాలను రచించారు. అవి- పూర్వప్రయోగ చంద్రికా, అపర ప్రయోగ చంద్రికా,శ్రాద్ధ ప్రయోగః. కంప్యూటర్లో తెలుగు వ్రాసుకునే విషయంలో ఎంతో కృషి చేసారు. తెలుగుకు మొట్టమొదటగా పోతనలిపిని రూపొందించి, పోతన కీబోర్డ్ నిర్మించారు. వేదమంత్రాలు సుస్వరంగా వ్రాసుకోవడానికి వీలుగా వైదిక పోతన ఫాంటును రూపొందించారు. వేమన, శ్రీనాథ అనే ఇతర ఫాంటులను కూడా తయారు చేసారు.

పురస్కారాలు:

దేశికాచార్యులుగారు రచించిన ఋతుసంహారం కావ్యానికి విశ్వనాథ అవార్డు లభించింది. తానా సంస్థ విశిష్ట పురస్కారంతో సన్మానించింది. సాహిత్యం, తెలుగు లిఫులలో వీరు చేసిన కృషికి షికాగోలోని స్వప్నా సంస్థ 'శ్రీ కళాపూర్ణ' బిరుదును ఇచ్చి సత్కరించింది. అమెరికాలోని వంగూరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్, కెనడాలోని వివిధ ఆంధ్ర సాంస్కృతిక సంస్థలు కలిసి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించాయి.

కావ్యరచనా నేపథ్యం:

మహాశిల్పి జక్కనచరిత్రము 1994లో పూర్తయింది. దీనిమీద, ఇతర కావ్యాల మీద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరిగాయి. ఆచార్యులవారు 1992లో భారతదేశానికి వచ్చినప్పుడు జక్కన నిర్మించిన బేలూరు, హళీబేడులలోని ఆలయాలను చూసి అక్కడి శిల్పసౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఈ కావ్యాన్ని ప్రబంధ పద్ధతిలో రాసానని రచయిత చెప్పారు. వర్ణనలకు, పాత్రపోషణకు పాత్రల మనస్తత్వ చిత్రీకరణకు సమాన ప్రాధాన్యాన్ని ఇచ్చారు. పూర్వప్రబంధ ప్రక్రియకు పునరుజ్జీవనాన్ని కల్పించడానికి యత్నించానని రచయిత స్వయంగా చెప్పుకున్నారు. జక్కన చలనచిత్రంలో, దాశరథి గ్రంధంలోనూ ఉన్న వాటికంటే భిన్నంగా ఒకటి రెండు చిన్న చిన్న మార్పులను చేసారు.

రచనారీతి:

దేశికాచార్యుల వారికి సంస్కృతాంధ్రాలలో అపారమైన పాండిత్యముంది. వ్యాకరణ, ఛందశ్శాస్త్రాలలో విశేషమైన పరిజ్ఞానం ఉంది. ఈ ఖగోళ శాస్త్రవేత్త రూపొందించిన నూతన ఛందోరీతులూ ఉన్నాయి. నయాగరా, కైవల్య, సుగతి, మనోరమ, విభావరి, విలాసిని, ప్రభావతి,వసంతకోకిల, వనమయూరము మొదలైన కొత్త కొత్త ఛందస్సులు ఇతర ప్రసిద్ధ వృత్తాలతో పాటు కావ్యమంతటా కనుపిస్తాయి. ఎన్నెన్నో అందమైన కొత్త పదాలను కూడా కవి మనకు పరిచయం చేస్తారు. ఉదాహరణకు చేఁజీరలు, (తువ్వాలులు) రాజప్రస్తరము (చలువరాయి), అనోకహములు (వృక్షాలు), చుట్టుపులుగు (చక్రవాకం) వంటివి.

ఇతివృత్తం:

బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన మహాశిల్పిగా జక్కన సుపరిచితుడు. ఆ మహాశిల్పి జీవితాన్ని, శిల్పకళా నైపుణ్యాన్ని ఆరు ఉల్లాసాలలో ఆచార్య తిరుమల దేశికాచార్యులు గారు రమణీయమైన కావ్యంగా మలిచారు. ప్రబంధ ప్రక్రియ ఈ కవికి ఇష్టమైనది కాబట్టి ఆ పద్ధతిలోనే కావ్య రచన చేసారు. కావ్యాదిలో ప్రాచీన కావ్య సంప్రదాయానుసారంగా దైవ ప్రార్ధన, పూర్వకవిస్తుతి, కుకవినింద, షష్ఠ్యంతాలు మొదలైనవి ఉన్నాయి. ఈ కావ్యాన్ని రచించమని చెన్నకేశవ స్వామి స్వప్నంలో కనుపించి కవిని ఆదేశించాడట.

మహాశిల్పి జక్కన, నర్తకి మల్లిక ఒకరినొకరు చూడటం, పునర్దర్శనంకోసం ఆరాటపడటం, వివాహం చేసుకోవటం, ఆమె నాట్యస్ఫూర్తితో జక్కన మనోహరమైన శిల్పాలు నిర్మించటం, రాజయిన గూళిదేవుడు మల్లికపై మరులుగొని జక్కన లేని సమయంలో ఆమెను బలాత్కరించబోవటం, గర్భవతి అయిన మల్లిక ఉపాయంతో తప్పించుకొని అంధుడైన మామగారు మల్లనతో కలిసి దూర ప్రాంతానికి వెళ్లటం, దారిలో కావేరీనదిని దాటే సమయంలో మల్లిక నదిలో పడిపోవటం, ఆమెను బేచన అనే జాలరి రక్షించటం, కాల క్రమంలో మల్లన, జక్కన ఒకరినొకరు కలుసుకోవటం, జక్కన మల్లిక విషయం తెలిసి శిల్పసన్యాసం చేయటం, సిద్ధాచార్యుడనే వైష్ణవ యోగి జక్కనను ఓదార్చి భగవద్రామానుజుల దగ్గరకు తీసుకొనిపోవటం, రామానుజులు జక్కనకు కర్తవ్యాన్ని ఉపదేశించటం, హొయసల రాజు విష్ణువర్ధనుడు జక్కనను ఆదరించటం, మల్లిక డంకన అనే కుమారునికి జన్మనివ్వటం, ఆ బాలునికి పుట్టుకతో అబ్బిన శిల్పకళా వైదుష్యం, బేచన తల్లీకొడుకులను తీసుకుని జక్కనను చూడటానికి వెళ్లటం, విష్ణువర్ధనుని పట్టపురాణి శాంతలాదేవి నృత్యనైపుణ్యం, జక్కన చెన్నకేశవాలయాన్ని మనోహరంగా నిర్మించటం, భగవద్రామానుజులు ఆలయ ప్రతిష్ఠకోసం రావటం, జక్కనను మెచ్చుకోవటం, విజయనారాయణస్వామి మూల విగ్రహంలో డంకన దోషాన్ని చూపటం, జక్కన తన దోషానికి ప్రాయశ్చిత్తంగా కుడిచేతిని ఖండించుకోవటానికి ప్రయత్నించటం, భగవద్రామానుజాచార్యుల ఆదేశానుసారంగా మరల శ్రీ విజయ నారాయణ స్వామి మూల విగ్రహాన్ని నిర్మించటం, విగ్రహ ప్రతిష్ఠ, శాంతలా మల్లికల నాట్యం– స్థూలంగా కావ్యంలో ఉన్న విషయాలివి.

వర్ణనలు, అలంకారాలు:

"పావనంబగు గంగ నాఫ్లవమునందు

పరమహంస లీల నపరవార్ధియందు

విష్ణుపద చారియును తపోవిభవుడైన

హంసయొక్కడా ప్లావంబునందెనపుడు"

 

"తిరిగి వచ్చిన యినునికై త్వరితగతిని

పద్మిని భువనభవన కవాటములను

తెఱవగా నొదవిన క్రీంక్ర విరుతరీతి

దిక్కులను ద్విజరావముల్ పిక్కటిల్లె"

 

"సమయ కైవర్తుడాకాశ జలధియందు

తారకాఝషములఁబట్టుకొనగఁ

బఱచియుంచిన నల్లని వలయొయనగ

ధ్వాంతమంతట దెసలందువ్యాప్తమయ్యె"

 

"ఏ దెసకుఁ బోవలెనొ మదినెరుగలేక

తిరిగె షడ్పదంబులు కొన్ని తెరవుదప్పి

బహుపదంబులు గల్గిన వారి గతులు

భ్రష్టమౌగాదె ఈ రీతి వసుధయందు"

పై పద్యాలలో వర్ణనలతోపాటు ఉపమ, అర్ధాంతరన్యాస,శ్లే షాలంకారాలు సహృదయవేద్యాలే.

ఔచిత్యపోషణ:

ఈ కావ్యంలో నాయికా నాయకుల సంబంధం పవిత్రమైనదని చెప్పటానికి సందర్భం వచ్చినప్పుడల్లా కవి చక్కని ఉపమానాలను ప్రయోగించారు. మల్లిక జక్కన కంఠంలో వేసిన పూమాల సీత రాముని మెడలో వేసినట్లుందట. మల్లిక తాను సభ్య సమక్షంలో అతనిని సేవించే భాగ్యం కలగటం పార్వతి ఈశుని కొలిచినట్లు, సుభద్ర అర్జునుని కొలిచినట్లుంది అనుకుందట. రాధాకృష్ణుల ప్రేమను జీవాత్మ పరమాత్మల సంయోగంగా భావిస్తారు. నాయిక రాధాకృష్ణుల అనురాగ భావనలను అభినయి‌స్తూ తన్మయత్వాన్ని పొందటం ఆత్మ పరమాత్మ యందు ఐక్యమవటంగా భావించారు. మల్లిక హృదయంలో జక్కన పట్ల ఒక బిందువుగా ఉదయించిన ప్రేమ జలతైల న్యాయంగా సర్వేంద్రియాలకు వ్యాపించిందట. సందర్భానుసారంగా ఇటువంటి న్యాయాలనూ చెప్పారు. రససిద్ధులైన ఇద్దరు కళాకారుల అన్యోన్య దాంపత్యాన్ని గురించి అద్భుతంగా వర్ణించారు. మల్లిక రంగులను కలిపి ఇస్తే జక్కన రమ్యమైన చిత్రాలు వ్రాసాడట. ఆమె నాట్యభంగిమలు చూసి అతడు చక్కని శిల్పాలు మలచాడట. ఆమె గీతాన్ని ఆలపిస్తే అతడు వీణ వాయించాడట. మల్లిక అష్టవిధ శృంగారనాయికల భంగిమలను ప్రదర్శిస్తే ఆమూర్తులను చూసి జక్కన రాతిలో శృంగార కావ్యాన్ని రచించాడట. శిలల్లో కావ్యమల్లాడట.

శాస్త్ర పాండిత్యం:

కవి వృత్తిరీత్యా శాస్త్రవేత్త. అందువల్ల ఏ విషయాన్ని గురించి చెప్పినా కూలంకషంగా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి చెప్పటం కనుపిస్తుంది. త్రిభంగి మొదలైన నాట్య కళా విషయాలను చెప్పినా, పాంచరాత్ర ఆగమానుసారంగా ఆలయ నిర్మాణం జరిగిన విధానాన్ని వివరించినా చక్కని శాస్త్రపాండిత్యం గోచరిస్తుంది.

చెన్నకేశవాలయాన్ని నిర్మించడానికి ముందు విశ్వకర్మను, మహా యంత్రకాళిని అర్చించటం, భూమిని దున్ని బీజాలు నాటి సస్యం పెరగనిచ్చి దానిని గోవృషభాలకు మేపటం, భూమి వాస్తులను అర్చించటం, హోమం చేయటం- ఈ విధంగా శాస్త్రోక్తంగా అన్నిటినీ చేసి విష్ణ్వాలయానికి భూమిని సిద్ధం చేసారట. అలాగే జక్కన ఆలయ నిర్మాణానికి కావలసిన శిలలను  బేలూరు సమీపంలోని విరిమల(పుష్పగిరి) నుండే  గ్రహించాడట. విశ్వకర్మను, బ్రాహ్మిని,విధిని తలచుకుని మంగళతూర్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య ఆ కొండమీద మొదటి రాయిని తీసాడట. ఈ సందర్భంలో ఉద్గాత రామచంద్ర కౌలాచార కృతమైన శిల్పప్రకాశమనే గ్రంథంలోని శ్లోకాలను ఉటంకించారు.

శాస్త్రపాండిత్యంతోపాటు కవి సంస్కృతాంధ్ర భాషా పాండిత్యాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. పలుమార్లు అమరకోశాన్ని ఉటంకించారు. అవసరమైనచోట్ల అర్ధాలను, విశేషాంశాలను తెలియజేస్తూ అధస్సూచికలను ఇచ్చారు. ఆరు పాదాల ఉత్పల మాలికను కూడా వ్రాసారు. శాంతలాదేవి నృత్యం సందర్భంలో కాళిదాసు కుమారసంభవ శ్లోకాలను ఇమిడ్చారు.  కొన్ని అరుదైన పదాలకు నిఘంటుప్రమాణాలను చూపారు. ఉదాహరణకు వావాత (రాజు రెండవ భార్య) అనే పదానికి విక్రాల శేషాచార్యుల వారి సంస్కృతాంధ్రపదార్ణవము ఆధారంగా చెప్పారు.

ముగింపు:

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు. మచ్చుకి కొన్నిటిని మాత్రమే చెప్పటం జరిగింది. చాలామందికి ఈ కావ్యం గురించి తెలియదనే భావన ఈ కావ్యపరిచయానికి కారణం.

ఆధారగ్రంథాలు:

  1. కృష్ణదేశికాచార్యులు, తిరుమల, (2013) కావ్యనందనం, రెండవసంపుటం, పాలపిట్ట బుక్స్, హైదరాబాదు.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]