headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-4 | Issue-3 | March 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

13. పాండురంగమాహాత్మ్యకథాకథనవైశిష్ట్యం: గుణ, అలంకార, రసౌచిత్యరీతులు

డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ

తెలుగు సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ, మానవీయశాస్త్రవిభాగం,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం,
శ్రీసత్యసాయి జిల్లా –515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9247859580, Email: psarmarambhatla@sssihl.edu.in
Download PDF


Keywords: ఔచిత్యం, రామకృష్ణుడు, పాండురంగమాహాత్మ్యం, గుణం, అలంకారం, రసం.

1. ఔచిత్యం - ప్రాధాన్యం:

కవిత్వాన్ని విని అందరూ ఆనందిస్తారు. కానీ ఆ ఆనందం దేనివల్ల కలుగుతుందో తెలుసుకునే వాళ్ళు ఆలంకారికులు మాత్రమే. అలంకారశాస్త్రంలో కావ్యానికి శోభనుతెచ్చే లక్షణాల విమర్శ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమయిన ‘కావ్యాత్మ’ ఏది అన్న విషయంలో ఆలంకారికుల్లో అభిప్రాయభేదమున్న విషయం స్పష్టం. రస, ధ్వని, అలంకార, రీతి, గుణ, వక్రోక్తి, అనుమాన సంప్రదాయాలు కావ్యాత్మను విస్తృతంగా నిర్వచించాయి. ఈ మార్గంలో కాశ్మీరుడయిన క్షేమేంద్రుడు కావ్యంలో ఔచిత్యం చాలా ప్రధానమయిందని, ‘ఔచిత్యమే కావ్యాత్మ’ అని ప్రతిపాదించాడు. 

కావ్యానికి రసం జీవితమయితే రసానికికూడా జీవితం ఔచిత్యమని క్షేమేంద్రుడి అభిప్రాయం. ఔచిత్యం లేకపోతే గుణాలు, అలంకారాలు ఎన్నున్నా వ్యర్థమేనని రసచర్వణ కూడా సాధ్యంకాదని ఈయన పేర్కొన్నాడు. ఈ విషయాన్నే ‘ఔచిత్యవిచార చర్చ’ అనే గ్రంథంలో సవిస్తరంగా నిరూపించాడు.

పూర్వ ఆలంకారికులు చెప్పిన రసం, ధ్వని, అలంకారం మొదలయినవన్నీ ఉచితమైన స్థానాల్లో ఉండకపోతే వికారాలుగా కనిపిస్తాయని, తగిన స్థానాల్లో ఉంటే బంగారం మీద రత్నాల్లాగ ప్రకాశిస్తాయని క్షేమేంద్రుడి అభిమతం.. అలంకారాలు శిరస్సుమీద, ఇతరావయవాలమీద, రసం హృదయంలో ఉండవచ్చు. కానీ ఔచిత్యమనేది ప్రాణంలా కావ్యానికి శరీరమంతా వ్యాపించి ఉండాలని ప్రకటించి, నిరూపించడంలో క్షేమేంద్రుడు అసమానప్రతిభను కనపరిచాడు.

‘కుమారభారతి’ బిరుదాంకితుడైన తెనాలి రామకృష్ణుడు రాసిన మహాకావ్యం పాండురంగమాహాత్మ్యం. ఈ గ్రంథారంభంలో కవి ‘‘స్కందపురాణనీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీనందను’’డని దైవస్తుతి చేశాడు. దీన్నిబట్టి కవి కథావస్తువును స్కాందపురాణం నుండి తీసుకొన్నాడని తెలుస్తోంది. ప్రౌఢప్రబంధాల్లో ఈ పాండురంగమాహాత్మ్యం ముఖ్యమైంది.

2. పాండురంగమాహాత్మ్యం - కథాకథనవైశిష్ట్యం:

ఇది క్షేత్రమాహాత్మ్యగ్రంథం. పుండరీకుడనే భక్తుడి పేరుతో ప్రసిద్ధికెక్కిన క్షేత్రమిది. ‘ఈ భూమ్మీద సర్వోత్తమమైన పుణ్యక్షేత్రం, తీర్థం, దైవం కలిసి ఉన్న ప్రదేశమెక్కడ?’ అన్న ప్రశ్నకు సమాధానమే ఈ కావ్యం. ఈ ప్రశ్నకు సమాధానంగా కైలాసంలో పరమేశ్వరుడు పార్వతికీ, కుమారస్వామికీ, ఋషులకూ పుండరీక క్షేత్రంలోని పాండురంగడి కథను చెప్పాడు. ఈ ప్రబంధంలో ఐదాశ్వాసాలున్నాయి.

పుండరీకుడు వేదాంగశాస్త్రాలను తండ్రి దగ్గర అభ్యసించి, తల్లిదండ్రులకు విధేయుడై, వినయవతి అయిన భార్యను పెళ్ళిచేసుకొని సత్సంతతిని పొందాడు. వారిని సుశిక్షితులుగా చేసి, వృద్ధాప్యంలో ఉన్న  తల్లిదండ్రుల్ని సేవించాడు. తరువాత ఘర్మవీరానదీతీరంలో ఆశ్రమాన్ని కట్టుకొని యోగాభ్యాసంతో తపస్సుచేసుకొంటూ బాలకృష్ణుణ్ణి ఉపాసించాడు. నుడుము మీద చేతులు పెట్టుకొని ప్రత్యక్షమై, వరం కోరుకోమన్న కృష్ణుణ్ణిచూసి- ‘‘నువ్విదేరూపంలో చిరకాలమిక్కడ కొలువై ఉండు, కొలిచిన భక్తుల్ని అనుగ్రహిస్తూ కొంగుబంగారమై నిలబడు’’ అని అడిగాడు. పుండరీకుడి కోరికమేరకు కృష్ణుడు ‘కటిన్యస్తహస్తుడై’ ఇప్పటికీ నిలబడి ఉన్నాడు.

ఆ క్షేత్రంలో ఎందరో భక్తులు తరించారు. మహాపాపాలు చేసిన నిగమశర్మ కూడా మోక్షాన్ని పొందాడు. సుశర్మపాపాలు క్షీణించాయి. ‘సుశీల’ అనే పతివ్రత భర్తతో పాండురంగణ్ణి కొలిచి సశరీరంగా ముక్తిని పొందింది. గుడిలో అప్రయత్నంగా విహరించిన కాకి, చిలుక, హంస, పాము, తేనెటీగలు తర్వాతి జన్మలో - సుశీల బిడ్డలుగా జన్మించి పాండురంగడి భక్తులుగా తరించారు. అగస్త్యుడి శిష్యుల్లో ‘అయుతడ’నేవాడు శాపవశాన కప్పగా జన్మించి, పాండురంగ క్షేత్రంలో ఉన్న నృసింహస్వామి సన్నిధిలో గృహస్థాశ్రమ దీక్షను తీసుకొని శాపవిమోచనంతో తరించాడు. ‘పుండరీకుడు’ తపస్సు చేసిన కాలంలోనే శతగోపుడి కూతురిగా ‘రాధాదేవి’ కృష్ణుణ్ణి ఉపాసించి తాదాత్మ్యం పొందింది.

ఈ కావ్యంలో ‘వస్త్వైక్యం’ ఉందా లేదా అన్న విషయాన్ని గురించి, పునరుక్తమైన కథల గురించి పూర్వ విమర్శకులు చక్కని విశేషాలతో వివరించారు. పుండరీకుడి కథ, ముక్తకేశినీ వృత్తాంతం, త్రిదంష్ట్రుడి వధ, భైమీ తీర్థ ఉదంతం మొదలైన ఆఖ్యానాలు పునరుక్తమయ్యాయి. ఈ పాండురంగ క్షేత్ర మాహాత్మ్యాన్ని ప్రవచించిన కథకుడు శివుడు. పార్వతి, కుమారస్వామి, అగస్త్యుడు, నారదుడు శ్రోతలు. ముందు - పార్వతి, కుమార, అగస్త్యులకు, తరువాత నారదుడికి... ఇలా  రెండుసార్లు ఈశ్వరుడు ఈ కథలను వివరించాడు.

శివుడు వీళ్ళందరికీ చెప్పిన కథాసారాంశమొక్కటే అయినా చెప్పిన విషయ వైఖరిలో కొంత భేదముంది. ముందు చెప్పిన కథలో పుండరీకుడు మాతాపితలకు సేవకుడిగా, ఉత్తమగృహస్థుడిగా కన్పిస్తాడు. తరువాత చెప్పిన కథలో పుండరీకుణ్ణి కవి ప్రధానంగా భక్తుడిగా, మంత్ర, యోగశాస్త్రవేత్తగా  ఆవిష్కరించాడు. మొదట చెప్పిన కథలకు శ్రోతలు - కుమారస్వామి, అగస్త్య దంపతులు, పార్వతీదేవి కాబట్టి వాళ్ళ అవసరానికి తగినట్లు మాతాపితృభక్తి, గృహస్థధర్మ ప్రసక్తి, దైవభక్తి ప్రధానంగా శివుడు పుండరీకుణ్ణి నిరూపించాడు. రెండోసారి చెప్పిన కథలకు ఆజన్మబ్రహ్మచారి, మహాజ్ఞాని, భక్తుడైన నారదుడు శ్రోత. యోగాభ్యాసం బ్రహ్మచారికి సాధ్యమైనంత తొందరగా సంసారికి చిక్కదు. అంటే బ్రహ్మచర్యాశ్రమమే యోగాభ్యాసానికి చక్కని అనుకూలసమయం కాబట్టి బ్రహ్మచారి అయిన నారదుడికి యోగిగా, భక్తుడిగా పుండరీకుణ్ణి పరమేశ్వరుడు పరిచయం చేశాడు.

ఈ విధంగా ముక్తకేశినీవృత్తాంతం మొదలైన కథాభాగాల్లోకూడా తగిన వివేచనతో  తెనాలి రామకృష్ణుడు కథాకథన కౌశలాన్ని ప్రదర్శించి, ఈ పుండరీక క్షేత్రమాహాత్మ్యాన్ని ఔచిత్య సంభరితంగా మనకందించాడు.

3. గుణౌచిత్యం:

తుంగభద్రానది కృష్ణానదికి ఉపనది. కాబట్టి సరాసరి ఈ నది సముద్రంలో కలవడంలేదు. అందువల్ల తుంగభధ్రానదీసాంగత్యసుఖాన్ని సముద్రుడు ఎరుగడన్న విషయాన్ని తెనాలి రామకృష్ణకవి ఎంతో అందంగా వర్ణించాడు. ఈ సందర్భంలో విశేషంగా ఆవృతమైన ‘బిందుపూర్వక సరళాక్షరాలు’ పద్యానికి సౌకుమార్య గుణంతో చక్కని ఔచిత్యాన్ని చేకూరుస్తున్నాయి.

                  శా॥   గంగాసంగమ మిచ్చగించునె మదింగావేరి దేవేరిగా

                         నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే

                        రంగత్తుంగ తరంగ హస్తముల నా రత్నాకరేంద్రుండు నీ

                       యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రానదీ! (1వ ఆశ్వా. 139వ పద్యం)

ఈ బిందుపూర్వక సరళాక్షరాలవల్ల ప్రవహించే నది వినసొంపైన అలల చప్పుడు ధ్వనిస్తోంది. ఈ సరళాక్షరాల అమరికతో అర్థసౌందర్యంతో పాటు, సాగరసంగమం కోసం అత్యంతవేగంగా ప్రవహించే నదీ తరంగాల శబ్దసౌందర్యం కూడా మరింతగా తేటతెల్లమవడంతో ఇక్కడ సౌకుమార్యగుణం ఔచిత్య వంతమైంది.

4. అలంకారౌచిత్యం:

రామకృష్ణుడు ప్రబంధయుగానికి చెందిన కవి కావడంతో క్షేత్రమాహాత్మ్య కావ్యంలో కూడా ప్రబంధోచితాలైన వర్ణనల్ని ప్రవేశపెట్టి ఈ కావ్యానికి ప్రబంధ సౌందర్యాన్ని కల్పించాడు. ఈ సౌందర్యం ప్రధానంగా వర్ణనల్లోని అలంకారాలను  ఆధారంగా చేసుకొని ఉంది. కాశీపురవర్ణనతో ప్రారంభమైన ఈ కావ్యంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి ఈ కింది పద్యంలో ఒక తెల్లనితుమ్మెదగా ఆరోపించి చెప్పడంలోని రూపకాలంకారం ఔచిత్యవంతంగా ఉంది.

                  శా॥  ప్రాలేయాచలకన్యకావదనశుంభత్పద్మ సౌరభ్యముం

                        గ్రోలం గల్గియుఁ దుష్టిలేక ముని హృత్క్రోడాబ్జ సౌగంధ్య లీ

                        లా లాలిత్యముఁ గోరు నొక్క సితరోలంబంబు నైజాకృతిన్‌

                 డాలొందించుఁ బరాసులన్‌ భ్రమరకీటన్యాయరీతిం బురిన్‌. (1వ ఆశ్వా. 100వ పద్యం)

‘‘పార్వతీదేవి ముఖపద్మం నుండి వచ్చే సుగంధాన్ని ఆస్వాదించగలిగి కూడా తృప్తి చెందకుండా, మునుల మన:పద్మాల సువాసనామనోహరత్వాన్ని కోరుకొనే తెల్లనైన తుమ్మెద (శివుడు), భ్రమరకీటన్యాయాన్ని అనుసరించి ఆ కాశీపట్టణంలో మరణించినవారిని తన ఆకారానికి సంబంధించిన ఆకారంతో (సారూప్య మోక్షంతో) ప్రకాశింప జేస్తుంది’’ అని భావం. ఇది రూపకాలంకారం.

                  శ్లో॥    విషయ్యభేద తాద్రూప్య రంజనం విషయస్య యద్‌ ।

                        రూపకం తత్త్రిధాధిక్య న్యూనత్వానుభయోక్తిభి: ॥ (చంద్రా. 12వ శ్లోకం)

అలంకారలక్షణగ్రంథంలో రూపకాలంకారం ప్రధానంగా రెండు రకాలని ఉంది. ఉపమాన,  ఉపమేయాలకు అభేదాన్ని ఆరోపించి చెప్తే అభేదరూపకం. తాద్రూప్యాన్ని ఆరోపించి చెప్తే తాద్రూప్యరూపకం. ఈ రెండు భేదాలు - అధికోక్తి, న్యూనోక్తి, అనుభయోక్తి అనే వాటివల్ల మళ్ళీ మూడేసి భేదాలను పొందుతున్నాయి. అందువల్ల అధికాభేదరూపకం, న్యూనాభేదరూపకం, అనుభయాభేదరూపకం, అధికతాద్రూప్య రూపకం, న్యూనతాద్రూప్యరూపకం, అనుభయతాద్రూప్యరూపకం అని రూపకాలంకారంలో మొత్తం ఆరు భేదాలు కనిపిస్తున్నాయి.

ఈ పద్యంలో తెల్లతుమ్మెదను ఈశ్వరుడిగా కవి చెప్పాడు. తుమ్మెద వేరు. ఈశ్వరుడు వేరు. అయినప్పటికీ తుమ్మెదకు ఈశ్వరత్వారోపం జరుగుతోంది. ‘‘ఆరోపయతి రూప యుక్తం కరోతీతి రూపకం’’ అన్న నిర్వచనాన్ని బట్టి రూపకం సార్థకమౌతోంది. ఇక్కడ విషయమైన తుమ్మెదకు ఈశ్వరత్వారోపం చేత ఇది ‘తాద్రూప్యరూపక’మౌతోంది. అలాగే ఉపమానోపమేయాలకు కవి అధికత్వంకానీ, న్యూనత్వం కాని చెప్పకపోవడంతో ఇది ‘అనుభయతాద్రూప్య రూపకం’.

పద్యంలోని ‘నైజాకృతిన్‌ డాలొందించు’ అనే మాటలు సారూప్యమోక్ష సూచకాలు. మోక్షంలోని భేదాలు నాలుగున్నాయి. భగవంతుడు నివసించే లోకంలో ఉండడం ‘సాలోక్యమోక్షం’. భగవంతుడికి దగ్గరగా ఉండడం ‘సామీప్యమోక్షం’. భగవంతుడితో సమానమైన రూపాన్నిపొందడం ‘సారూప్య మోక్షం’. ఆయనలో ఐక్యమవడం ‘సాయుజ్యమోక్షం’. వీటిలో ‘భ్రమరకీటన్యాయం’ సారూప్యమోక్షప్రతిపాదన చేస్తుంది.

తుమ్మెద ఒక కీటకాన్ని తెచ్చి తన గూటిలో ఉంచి రొదచేస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తుందనీ ఆ కారణంగా కీటకం నిరంతరం భ్రమరాన్నే ధ్యానిస్తూ ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు కొంతకాలానికి ఆ కీటకంకూడా భ్రమరం ఆకారం దాలుస్తుందని విశ్వాసం. శైవుల విశ్వాసం ప్రకారం ముక్తి అంటే శివాకారం ధరించడమే. అదే సారూప్య మోక్షం. కవి ఈ చక్కని పద్యంలో రూపకాలంకారంలో శివుడనే తెల్ల తుమ్మెద కాశీపురిలో మరణించిన వారికి తన ఆకారాన్ని ప్రసాదించి, అంటే సారూప్యమోక్షాన్నిచ్చి ఎలా వెలుగొందింపజేస్తుందో భ్రమరకీటన్యాయపరంగా వర్ణించాడు. ఈ విధంగా ఈ పద్యంలోని అలంకారం ఔచిత్యవంతమైంది.

5. రసౌచిత్యం:

అయుతనియుతుల కథలో భాగంగా వాధూలమహర్షి గురించి ప్రస్తావన ఉంది. అగస్త్యుడి మాటను తిరస్కరించిన అయుతుడు కఠోర తపస్సు చేస్తాడు. మాయామౌని రూపంలో ఇంద్రుడు అయుతుడి దగ్గరకి అతిథిగా వచ్చి విషయమంతా తెలుసుకొంటాడు. గృహస్థాశ్రమధర్మాన్ని, గొప్పదనాన్ని తెలియ జేస్తాడు. అయినా అయుతుడు మనస్సు మార్చుకోకుండా బ్రహ్మచర్యమే సర్వోత్కృష్టమని కపటముని వేషంలో ఉన్న ఇంద్రుడి మాటను కూడా కాదంటాడు. అప్పుడు ఇంద్రుడు తనతో తెచ్చిన కామధేనువును అక్కడ విడిచి పెట్టి వెళ్ళిపోతాడు. ఆ ధేనువు రోగగ్రస్తురాలైనదిగా నటిస్తూ ఆ అయుతుడి తపస్సును సాగనివ్వకుండా చేస్తుంది. ఆ గోరక్షణలోనే ఉంటూ అయుతుడు తపోహీనుడౌతాడు. ఆ ధేనువు మహాతపస్వి అయిన వాధూలమహర్షి ఆశ్రమం వైపు వెళ్ళి ఆయనకు తపోభంగాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం అయుతడని అనుకొని వాధూలమహర్షి కోపోదగ్రుడై అయుతుణ్ణి శపిస్తాడు. ఈ సందర్భంలోని  ఈకింది పద్యంలో రౌద్రరసం ఔచిత్యవంతంగా ఉంది.

             మ॥    కసువుందీవలు దావపావక శిఖౌఘంబున్‌ ప్రకాశింప, వె

                      క్కసమై తోఁచిన కొండచందమున దీర్ఘశ్మశ్రుచంచజ్జటా

                      విసరక్రోధరసోగ్రమూర్తి యగుచున్‌, వృద్ధవ్రతిశ్రేష్ఠుడా

                త్మ సమీపస్థితుహస్తముక్తసురభిన్‌ దద్వర్ణినీక్షించుచున్‌. (5వ ఆశ్వా. 250వ పద్యం)

ఈ పద్యంలో క్రోధరసోగ్రమూర్తి అయిన వాధూలమహర్షి వర్ణన ఉంది. ‘‘వృద్ధుడైన వ్రతిశ్రేష్ఠుడతడు. ఆశ్చర్యాన్ని కలిగించే పర్వతంలాగ ఉన్నాడు. పొడవైన మీసాలు, గడ్డంతో, పొడవైన జడతో ఉన్న వాధూలమహర్షి, కార్చిచ్చు మంటల్ని స్ఫురింపజేసే లతలతో కూడిన పర్వతంలా ఉన్నాడు’’ అని భావం.

తపోభంగమైన వాధూలమహర్షి, అందుకు కారణమైన సురభిని విడిచి పెట్టింది ఎదురుగా ఉన్న అయుతుడని భ్రమించి వెంటనే అతణ్ణి ‘కప్ప’ రూపాన్ని పొందుతావని శపిస్తాడు. ఈ శాపానికి కారణం వాధూలమహర్షి నిశ్చలమైన తపస్సుకు భంగం కలగడమే. అందుకే శాంతమూర్తి అయిన ఆయనలో రౌద్రం విజృంభించింది. తత్కారణంగా ఉప్పతిల్లిన కోపంతో అయుతుణ్ణి శపించాడు. ఆయన తపస్సు తీవ్రత వృద్ధవ్రతిశ్రేష్ఠుడు, పర్వతస్వరూపుడు, పొడవైన మీసం,గడ్డం, జడలున్నవాడు అనడంతో వ్యక్తమౌతోంది. ‘‘దావపావకశిఖౌఘంబున్‌ ప్రకాశింప’’ అన్న వాక్యంతో మహర్షిని కార్చిచ్చుతో ఉపమించడంతో అతనిలో పెల్లుబికిన కోపం ఆవిష్కారమౌతోంది. ఈ విధంగా ఈ పద్యంలో శాపకారణమైన తపోభంగం రౌద్రరసాన్ని సూచిస్తూ ఔచిత్యవంతంగా ఉంది.

6. ముగింపు:

  • పాండురంగవిభుని పదగుంభనం ఔచితీమంతమని స్పష్టమైంది.
  • తెనాలి కవి సంతరించిన ప్రబంధరాజంలో క్షేమేంద్రుడు పేర్కొన్న ఔచిత్యరీతులు కొలువుతీరి ఉన్నాయని సోదాహరణంగా నిరూపించబడింది.
  • పద, వాక్య, ప్రబంధార్థ ఔచిత్యాల లాగానే గుణ, అలంకార, రసౌచిత్యాలను రామకృష్ణుడు చక్కగా పాటించేడని అర్థమౌతోంది.
  • లోకప్రసిద్ధమైన గంగాసంగమ అనే తుంగానది పద్యం వెనుక ఉన్న మాధుర్యం గుణప్రభావమేమని అవగతమౌతోంది.
  • అలంకారప్రయోగాల్లో పాండురంగమాహాత్మ్యం విశేషమైన ఔచిత్యసంప్రదాయాన్ని మూటగట్టుకుందని తేటతెల్లమైంది.
  • క్షేత్రమాహాత్మ్యకావ్యమైనా, భక్తి ప్రధాన ఇతివృత్త సంభరితమైన, సందర్భానుసారం ఔచిత్యవంతంగా తెనాలి కవి పోషించిన నవరసాదులు ఈ కావ్యానికే వన్నెతెచ్చేవిగా ఉన్నాయని ద్యోతకమౌతోంది. 

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. రామకృష్ణారావు, వంతరాం. పాండురంగమాహాత్మ్యము. సంజీవినీ వ్యాఖ్యానసహితము. ఐదుభాగాలు. రాజమండ్రి.1985-1989
  2. వేంకటరమణయ్య, బులుసు (టీక). కావ్యాలంకారసంగ్రహం. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.
  3. శ్రీరామచంద్రుడు, పుల్లెల (వ్యా). ఔచిత్యవిచారచర్చా, కవికంఠాభరణమ్, సువృత్తతిలకమ్. సురభారతి, హైదరాబాద్, 1983.
  4. సత్యనారాయణ, కాశీభొట్ల. ఆంధ్రకవుల ఔచిత్యవిచారణ. నవజ్యోతి ప్రెస్, నర్సాపురం.
  5. సుబ్బారావు, కొండా. పాండురంగమాహాత్య్మము – రచనాసౌందర్యము, గుంటూరు, 1994.
  6. సుబ్రహ్మణ్యశర్మ, జి. పాండురంగమాహాత్మ్యము (వచనం). జయంతి పబ్లికేషన్స్, విజయవాడ, 2014.
  7. సూర్యనారాయణశాస్త్రి, వెంపరాల (పీఠిక). మనుచరిత్రము. వెంకట్రామా అండ్ కో. హైదరాబాద్, 1969.
  8. స్ఫూర్తిశ్రీ, చంద్రాలోక సమున్మేషము. వికాస్ ప్రెస్, గుంటూరు, 1981.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]