AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. భారత దేశంలోని కోటల రకాలు : పరిశీలన
డా. చంద్రకాంత్ మునేశ్వర్
సహ-ఆచార్యులు, చరిత్రశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డి,
కామారెడ్డి జిల్లా, తెలంగాణా.
సెల్: +91 9989538243, Email: chandrakanthmuneshwar1980@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 01.04.2026 ఎంపిక (D.O.A): 29.04.2026 ప్రచురణ (D.O.P): 01.05.2026
వ్యాససంగ్రహం:
నలుదిక్కులలో పలు రకాలైన సహజ సిద్ద రక్షణ వ్యవస్థతో పాటు చుట్టూ పటిష్టమైన రక్షణ ప్రాకారాలు, బలమైన గోడ లేదా చెక్క అవరోధం, కంచ రక్షణగా నిర్మించి ఉండి చుట్టూ లోతైన కందకం ఉండి నిరంతరం సైనికులు పహారాకాస్తూ ఉండే భవనం, భవన సముదాయాన్ని సాధారణంగా “కోట” లేదా “దుర్గము” “గడి” అని వ్యవహరిస్తారు.ఇలాంటి ప్రాంతంలోనే నగరము, సంబంధిత రాజ్య రాజధాని ఉంటుంది. ఆ రాజ్యానికి చెందిన సాంస్కృతిక, సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు సైనిక శక్తి సామర్థ్యలు కూడా ఈ “కోట” లేదా “దుర్గం” నిర్మాణంలోని వాస్తు శిల్పకళ శైలి ద్వారా ప్రతిబింబిస్తూ ఉంటుంది.శక్తివంతమైన సైనిక స్థావరాలుగా,రక్షణ వలయాలుగా ఉండి పటిష్టమైన కోటలు ఎన్నో భారతదేశంలో ఉన్నాయి.కోటలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కావు అవి ఆనాటి రాజుల పరాక్రమానికి, వాస్తు శిల్పకళ నైపుణ్యానికి అలాగే రక్షణ వ్యూహాలకు సజీవ సాక్షాలు. మన దేశ చరిత్రలో కోటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రక్షణ కవచాలుగా, పాలన కేంద్రాలుగా, రాజ్య రాజధానిగా,అపురూపమైన వాస్తు శిల్పకళ, చిత్రకళ నైపుణ్యంతో ప్రణాళిక బద్దంగా ఉన్న నిర్మాణం నాటి సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా, చరిత్రకు సాక్షిగా, నాగరికత కేంద్రాలుగా ఈ కోటలను అభివర్ణించవచ్చును. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం కల దేశం.పాలకులు తమ పాలన కేంద్రం ఐన రాజధానిలో శత్రుదుర్భేద్యమైన కోటలను రక్షణ కోసం నిర్మించుకున్నారు.భౌగోళిక అంశాలను ఆధారంగా చేసుకుని కోటలను గిరి,జల,వన, మైదాన దుర్గలని వివిధ రకాలుగా విభజించవచ్చు.కొన్ని కోటలకు ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కూడా వచ్చింది. ప్రస్తుత పరిశోధన వ్యాసం “భారతదేశంలోని కోటల రకాలు: పరిశీలన” అను అంశంపైన కేంద్రికరించబడింది. మన దేశ కోటల పైన ఇప్పటివరకు అనేక పరిశోధనలు జరిగాయి. నా ఈ పరిశోధన పత్రము యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంలోని కోటలు, రకాలు, ప్రాముఖ్యత గురించి నేటి తరానికి తెలియ పర్చడం, ప్రస్తుత స్థితి, సంరక్షణ, నిర్వహణ, పర్యటక దృష్టి కోణంలో చర్చించడం, చారిత్రక,వారసత్వ సంపదను కాపాడుకొని పర్యటక అభివృద్ధికి తోడ్పాడు అంశాలపై అవగాహనా కల్పించడం. పరిశోధన రచన విధానము పరిశోధన పద్ధతి ప్రాథమిక, ద్వితీయ ఆధారాలను ప్రామాణికంగా తీసుకొని పరిశోధన పత్రము సమర్పిస్తాను. అందుబాటులో ఉన్న అనేక రచనలను సేకరిస్తాను,చరిత్రకారుల రచనలు, పురావస్తు అధికారుల నివేదికలు, పరిశోధన గ్రంథాలు, రాజ్యాభిలేక పరిశోధనాలయంలో దొరుకు సమాచారము, ప్రభుత్వ రికార్డులు, ప్రముఖ దినపత్రికలలో అచ్చు అయిన సమాచారము, స్వయంగా కావలసిన విషయాలు సంబంధిత అధికారుల నుండి సేకరించిన ప్రాథమిక సమాచారమును ఆధారంగా చేసుకుని పరిశోధన సాగిస్తాను. నా ఈ పరిశోధన భారతదేశంలోని కోటలపై పరిశోధన, అధ్యయనం చేస్తున్న తోటి పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
Keywords: కోట, దుర్గము, చారిత్రక వారసత్వము, సంస్కృతి, శత్రు దుర్భేధ్యము, సైన్యము, బురుజులు, పహార, కందకము, సింహ ద్వారము, సైనిక శిక్షణ, పరిపాలన భవనాలు, నివాస భవనము, రక్షణ కవచము, యూనెస్కో, రక్షణ, నిర్వహణ, పర్యాటక ఆకర్షణ, సౌకర్యాలు
1. ప్రవేశిక
భారతదేశం అంటే ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుకు వస్తాయి. ఇవి మాత్రమే కాకుండా, దేశ చరిత్రకు ప్రధాన ఆనవాళ్లు వాస్తు శిల్పకళా వైభవం, చిత్రలేఖనం, వారసత్వ సంపద. ఆధ్యాత్మిక నిర్మాణాలైన ఆలయాలు, బౌద్ధ, జైన, సిక్కు, ఇస్లాం, క్రిస్టియన్లకు సంబంధించిన మందిరాలు, చారిత్రక నిర్మాణాలైన కోటలు భారత వారసత్వ సంపదలో ముఖ్యమైనవి. మన ప్రాచీన కోటలు చరిత్రకు శాశ్వత సంపద; గత కాలపు చారిత్రక వైభవానికి సజీవ సాక్షాలు అని భారతీయ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు దేశంలోని వివిధ ప్రాంతాలలో తమకు అనుకూలమైన భౌగోళిక ప్రదేశాలలో కోటలు నిర్మించుకున్నారు. నగరాలు స్థాపించి రాజధానులుగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. ఈ క్రమంలో తమ రక్షణకు శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించుకున్నారు. భారతదేశంలో అనేక చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని చాటుతున్న ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గుర్తుకు వచ్చేవి కోటలు. ప్రాచీన కాలం నుంచి ఈ కోటలను నిర్మించుకోవడం ఆనవాయితీ, ఆచారంగా వస్తుంది. ఈ కోటలు గత చారిత్రక, వాస్తు శిల్ప, చిత్రకళ, సాంస్కృతిక, వారసత్వ వైభవానికి గుర్తులు. ఇవి వారసత్వ సంస్కృతి, పరిపాలన, సైనిక శిబిరాలు, శిల్పకళాక్షేత్రాలుగా వర్ధిల్లాయి. గత కాలంలో నిర్మించిన ఈ కోటలు కొన్ని కాలక్రమంలో శత్రు దాడుల వల్ల నాశనం అయ్యాయి. కొన్ని మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. కోటలను సాధారణంగా భారతీయ భాష సంస్కృతంలో ‘దుర్గ్’ అంటారు. హిందీలో ‘గఢ్’, పర్షియన్ ఉర్దూలో ‘ఖిల్లా’, తెలుగులో ‘కోట’, ‘గడి’, ‘దుర్గం’ అని పిలుస్తారు. సాధారణంగా మనం ‘కోట’ అని సంబోధిస్తాం. కోటలను భౌగోళిక, భౌతిక నిర్మాణ స్వభావాన్ని ఆధారంగా చేసుకుని, ప్రాచీన భారతీయ చారిత్రక లిఖిత రచనల ఆధారాలను బట్టి, పరిపాలన, సైనిక, భూభాగాన్ని ఆధారం చేసుకుని భారతీయ చరిత్రకారులు కొన్ని రకాలుగా విభజించారు. ప్రాచీన కాలానికి చెందిన రాజకీయ, పరిపాలన గ్రంథమైన కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’ ప్రకారం కోటలను ఆరు రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ సాధారణంగా భౌగోళిక, భౌతిక స్వభావాన్ని ఆధారం చేసుకుని జరిగింది. ఈ వర్గీకరణ కౌటిల్యుడి అద్భుతమైన ఆలోచనా దృష్టికి తార్కాణం. ఈ వర్గీకరణ రక్షణ, పరిపాలనను ఆధారం చేసుకుని చేశారు. గత చరిత్రకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్న ఈ పురాతన నిర్మాణాలైన కోటలు, బురుజులను పరిరక్షించుకోవాలి. లేకుంటే అవి తమ ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిశోధన వ్యాసం “భారతదేశంలోని కోటల రకాలు: ఒక పరిశీలన” అనే అంశం చర్చిస్తుంది.
చరిత్ర పూర్వ యుగం నుంచి మానవులు తమకు అవసరమైన తిండి, ఇల్లు, బట్ట, ఆవాస ప్రదేశాలు, వనరులు, సంపద, పశుపక్షాదుల సంతతి, నీటి సరఫరా వ్యవస్థలు, తాము సంచరించే మార్గాలు, తాము నివసించే సమాజం – వీటన్నిటికీ రక్షణలు కల్పించుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. సహజ సిద్ధమైన రక్షణలే కాకుండా, తమలోని నవ్య ఆలోచనలు, వైవిధ్యమైన సృజనాత్మకతతో తమకు అవసరమైన కృత్రిమ నిర్మాణాలు నిర్మించడం కూడా చేపట్టారు. తమను తాము స్వయం రక్షణ కల్పించుకోవడం అందులోని ఒక భాగం. రక్షణ కల్పించుకునే క్రమంలో ముళ్లపొదలు, కంచెలు, వెదురు, గట్టి మట్టి, ఇటుకలు, బురద, రాళ్లు, మోర్టార్ గోడలు వంటివి ఉపయోగించుకుంటూ కోటలు, దుర్గాలు, గడులు నిర్మించుకున్నారు. పట్టణ ప్రాంతాలు, ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత సామాజిక వ్యవస్థ, రాజకీయ, ఆర్థిక పరిపుష్టి కలిగిన రాజ్యాలుగా ఏర్పడిన తర్వాత కోటలు, దుర్గాల నిర్మాణం మొదలైంది. కోటలు, దుర్గాలు వివిధ తరహా నిర్మాణాలు, నిర్మాణ శైలులు ఆవిర్భవించడం ప్రారంభమైంది. రక్షిత ప్రాకారాలు, కోటకు రక్షణ ద్వారాలు, నిఘా బురుజులు, కోట కందకం, కోట కందకంలో మొసళ్ల పెంపకం వంటి ఎన్నో వాస్తు శైలులతో కోట నిర్మాణంలో ప్రవేశించాయి. భారత నిర్మాణ వారసత్వంలో కోటలు, దుర్గాలు, ధర్మ ఘంటలు, రాజమందిరాలు, సభా మండపాలు, మెట్లబావులు, చెరువులు, కోట లోపల వాన నీటిని ఒడిసి పట్టుకునే సంరక్షణ ఏర్పాట్లు వంటి విభిన్న కళాత్మక నిర్మాణాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. భారత చరిత్రలో విభిన్న సమయాలలో, విభిన్న రాజవంశాల వారు వివిధ రకాల వాస్తువులతో దుర్గ నిర్మాణాలను నిర్మించుకున్నారు. సింధు నాగరికత కాలపు దుర్గ నిర్మాణం, క్రీ.పూ. 6వ శతాబ్ది పదహారు మహా జనపద కాలపు దుర్గ నిర్మాణం, మౌర్య, కుషాన, శతవాహన, ఇక్ష్వాకు, పల్లవ, చోళ, చాళుక్య, గుప్త, వాకాటక, రాష్ట్రకూట, యాదవ, కాకతీయ, విజయనగర, రాజపుత్ర, ఢిల్లీ సుల్తానుల, మొఘల్, షేర్షా సూర్ కాలపు కోటలు, మధ్య భారతంలోని గోండు రాజుల కోటలు, మరాఠా స్వరాజ్య రాజుల, సిక్కుల, రాజపుత్రుల, కుతుబ్ షాహీల, అస్సాం ప్రాంతంలోని అహోం రాజుల కాలపు పలు ప్రాంతీయ రాజవంశాల అద్భుతమైన కట్టడాలు శత్రుదుర్భేద్యమైన కోటలలో ఉన్నాయి. భారతదేశంలోని కోస్తా ప్రాంతాలలో పోర్చుగీసు, బ్రిటిష్, ఫ్రెంచి యూరోపియన్ల కాలపు నిర్మాణాలు అనేకం కనిపిస్తాయి. ప్రారంభ కాలంలో కోటలు, దుర్గాలు కాకుండా, సాధారణంగా నిర్మించుకునే ఆవాసాల విషయంలో కూడా సాంప్రదాయక ప్రధాన నిర్మాణాలలో మూడు విధానాలను అనుసరించారు. వాటిలో మొదటి విధానం మట్టి కోటలు. సమీపంలో ఉన్న ఎండిపోయిన కందకాలు, చెరువుల నుంచి బంక మట్టిని (స్టియటైట్) తెచ్చి రక్షణ ప్రాకారాలను నిర్మించుకున్నారు. రాళ్లు, మట్టిని ఉపయోగించుకుని ఎత్తుగల ప్రదేశంలో పటిష్టమైన, పొడవైన రక్షణ ప్రాకారాలను నిర్మించుకోవడం రెండో విధానం. ఇక భారీ రాళ్లతో విశాల ప్రాకారాలు, విశాల కందకాలు, విశాల ద్వారాలు, పొడవైన, ఎత్తైన విశాలమైన గోడలు, సైనిక ప్రహరా కొరకు బురుజులు కలిగిన కోటలను నిర్మించుకోవడం మూడో విధానం. అలాగే కోటల నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశం కొండలపై, కనుమలపై, నాలుగు దిక్కుల కొండల మధ్య అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో, వనంలో, విశాల మైదానంలో ఉండేది. నదులు కోటకు సహజ రక్షణను ఇస్తాయి కనుక, కోటల నిర్మాణానికి స్థానికంగా లభించే భారీ శిలలు, రాళ్లను రక్షణ నిర్మాణాలకు వాడుకున్నారు. ఇలాంటి రక్షణ కవచాలు కలిగిన కోటల నిర్మాణం క్రీ.పూ. నాల్గవ శతాబ్ది కాలంలో మగధ సామ్రాజ్య రాజధాని గిరివజ్రం, రాజగృహంలో కనిపిస్తుంది.
2. కోట నిర్వచనం
కోట నిర్వచనాన్ని ఒకసారి పరిశీలిస్తే, చుట్టూ పటిష్టమైన రక్షణ కవచాలు ఉన్న భవనం, భవన సముదాయం లేక బలమైన రక్షణ గోడ కానీ, రక్షణ కవచం ఉన్న చెక్క నిర్మాణ అవరోధం కానీ, లేదా రక్షణకు కంచె నిర్మించి ఉన్న, చుట్టూ లోతైన కందకం తవ్వి ఉండి నిరంతరం బలశాలురైన సైనికులు రక్షణ నిమిత్తం పహారా కాస్తూ ఉండే భవనాన్ని సాధారణంగా “కోట” అని “దుర్గం” అని వ్యవహరిస్తారు. కోటలు ఉన్న ప్రదేశాలలో పలు రక్షణలు ఉంటాయి. ఆ ప్రాంతంలోనే పట్టణం, నగరం లేదా సంబంధిత రాజ్య రాజధాని విశాలమైన భవనాలతో అనేక వసతులతో కూడి ఉంటుంది. ఆ రాజ్యానికి సంబంధించిన రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, సైనిక శక్తి కూడా ఈ దుర్గంపై వాస్తు శిల్ప, చిత్రకళ రూపంలో చిహ్నాల రూపంలో చెక్కబడి దుర్గ నిర్మాణంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో భారీ కోటలు, అనుబంధ కోటలు, చిన్న దుర్గాలు శక్తివంతమైన నిఘా స్థావరాలుగా, పోస్టులుగా, రక్షణ వలయాలుగా, పటిష్టమైన సైనిక, సైనిక శిక్షణ రక్షణ వ్యవస్థ కలిగిన, పరిపాలన, నివాసాలు కలిగిన శత్రు దుర్భేద్యం గల పూర్తిస్థాయి కోటలు ఎన్నో ఉన్నాయి.
3. ప్రాచీన కోటల ఆనవాళ్లు
క్రీ.పూ. 3000 సంవత్సరాల నుంచి క్రీ.పూ. 15వ శతాబ్దాల మధ్య కాలపు చరిత్ర పూర్వ యుగం నాటి హరప్పా సంస్కృతికి చెందిన 1050 ఆవాస ప్రాంతాలలో తొలి పురావస్తు ఆధారాలు కనిపిస్తున్నాయి. (వీటిలో 416 పాకిస్తాన్ ప్రాంతంలో ఉండగా, 625 ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి). ఈ ప్రదేశాలలో దాదాపుగా 100 ప్రాంతాలలో పురావస్తు పరిశోధన తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాలు జరిగిన ప్రధాన ప్రదేశాలు, పట్టణ కేంద్రాలలో లోథల్, రాఖీగడి, ధోలవీర, కాళీబంగన్, హరప్ప, బనవాలి, మిఠాథల్, సూర్కోట్టా, మొహంజోదారో, కోట్ డిజీ, గణేరివాలా, కుంటసిలు ప్రధానంగా ఉన్నాయి. సింధు నాగరికత కాలంలో ప్రతి ప్రదేశంలోనూ ప్రధాన స్థలాలలోనూ ద్వారాలు, బురుజులు, కోటగోడ ప్రహరీల వంటివి రక్షిత ప్రవేశ ద్వారాల నిర్మాణంలో కాల్చిన ఇటుకలు, అలాగే మట్టితో అచ్చులు పోసి కాల్చని ఇటుకలను కూడా వినియోగించారు. ప్రధాన ప్రాకారాలకు లోపల ఉండే వేదికలు, గృహాలు, వీధులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, మురుగునీటి తనిఖీ రంధ్రాలు (మ్యాన్ హోల్) కలిగిన కాలువల నిర్మాణం వంటి వాటితో నగరానికి కోటగోడలు, ముఖ ద్వారం, కందకంతో రక్షణ కల్పించారు. పెద్ద పెద్ద ప్రాంగణాలకు రక్షిత గోడలు నిర్మించారు. (చాన్హుదారోలో కోటకు ఎలాంటి ప్రహరీ కనిపించదు). హరప్పాలో ఇటుకలతో నిర్మించిన అతి పెద్ద కోటగోడ రక్షణ వలయంగా, కోటకు భారీ ముఖ ద్వారం, కందకంతో రక్షణ వలయం ఉంది. కచ్ సింధు శాఖలోని ధోలవీర బండరాళ్ల మధ్య మట్టితో నిర్మించిన భారీ కోటగోడ రక్షణ వలయంగా ఉంది. హరప్పాలోని ఇతర ప్రదేశాలలో ఇంత భారీ కోట కానీ, రాతి స్థంబాల ఆనవాళ్లు కానీ కనిపించలేదు.
క్రీ.పూ. ఆరవ శతాబ్ది నాటికి భారతదేశంలో నది తీరాలలో భారీ రక్షణ ప్రాకారాల మధ్య జనావాస నివాస ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కనిపిస్తాయి. ఇలాంటి భారీ రక్షణ వలయాలు గల వాటిలో పాటలీపుత్రం, కౌశంబి, ఉజ్జయిని, కాశీ, మధుర, తక్షశిల మొదలైన షోడశ మహా జనపద (16 జానపదాలు) రాజ్యాలు. అదేవిధంగా గణ రాజ్యాలైన వజ్జి, మల్ల, క్షుద్రక మొదలైన రాజ్యాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా గంగా, యమునా పరివాహక ప్రాంతంలో నేటి మధుర నగరం, యమునా నది పరివాహ ప్రాంతంలో ఉన్న పట్టణం. పాటలీపుత్ర గంగా, షోన్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రధాన పట్టణాలలో ఒకటి. “ఉత్తరపథం”గా భావించబడుతున్న ప్రాచీన భారతదేశ ఉత్తర దేశంలోని పురుషపురం (నేటి పెషావర్), గాంధార, తక్షశిల వంటి మహానగరాలలో కూడా ఇలాంటి భారీ ప్రాకారాలు కలిగిన కోటలు, గోడల నిర్మాణాలు కనిపిస్తాయి. “దక్షిణ పథం” అలాగే దక్షిణ ఉత్తర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రదేశాలు, మార్గాలలోను, పశ్చిమ తూర్పు ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రదేశాలు, మార్గాలలోను కూడా ఇలాంటి భారీ రక్షణ వలయాలు కలిగిన కోటలు, గోడల నిర్మాణాలతో ఉన్న అనేక నగరాలు భారత ఉపఖండం అంతటా ఉన్నాయి.
పాటలీపుత్రం, కౌశంబి కన్నా ముందు కాలపు మగధ సామ్రాజ్య రాజధాని రాజగృహంలో కూడా కాల్చిన ఇటుకలతో నిర్మించిన ప్రాకారాలు, రక్షణ గోడలు, కోటకు ద్వారాలు, ప్రధాన ముఖ ద్వారం దర్శనం ఇస్తాయి. ఈ రాజగృహ నగరానికి ఒక కొండ పెట్టని కోటలాగా ఉంది. చంద్రకేతుగడ్‌లో కూడా ఇలాంటి అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి. క్రీ.పూ. 321వ శతాబ్ది కాలపు చంద్రగుప్త మౌర్యుడి రాజధాని పాటలీపుత్ర గురించి గ్రీకు రాయబారి మెగస్థానీస్ తన ఇండికా రచనలో కూడా పాటలీపుత్ర కోట, కోట గోడ, కందకం, నగరానికి చెక్క గోడలతో కూడిన ఒక భారీ కందకం రక్షణ వలయంగా నిర్మించబడి ఉంది అని మెగస్థానీస్ రాసాడు (Megasthenes). ఈ పటిష్టమైన కోటకు 570 బురుజులు, రాతి స్థంబాలు, స్థంబాలపై నిర్మించిన 54 మండప ద్వారాలు ఉన్నాయి అని స్పష్టంగా రాసి ఉంది. ఈ గ్రంథం ప్రముఖ చారిత్రక ఆధారం. కనిష్క పుర లాంటి కోటలకు రక్షణ ప్రాకార గోడ కర్రతో చెక్క నిర్మాణం నిర్మించుకున్నారు అని అశ్వఘోషుడి రచనల ద్వారా తెలుస్తోంది (Ashvaghosha).
ఇప్పుడు ధ్వంసమైన రాజస్థాన్‌కు చెందిన తనోత్ కోట, భారత ఉపఖండంలోని వాయువ్య భాగానికి చెందిన పంజాబ్ సాల్ట్ రేంజ్, భారతీయ థార్ ఎడారి వెంబడి (భారతదేశానికి చెందిన పడమటి, వాయువ్య ప్రాంతాలకు సెంట్రల్ ఆసియా ద్వారా జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించే రేఖ) గల కోటలు క్రీ.పూ. 600 సంవత్సరాల చరిత్రకు సంబంధించినవిగా చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు గుర్తించారు.
కొండలపైన, కొండ వాలు ప్రదేశాలలోనే ఎక్కువ “భారతీయ కోటలు” నిర్మించబడి ఉన్నాయి. ఇంతే కాకుండా భారత ఉపఖండంలో మైదాన ప్రాంతాలలోనూ బలమైన కోటలు, నగరాలు, రక్షణ శిబిరాలు, సైనిక ఛావనీలు, సైనిక శిక్షణ శిబిరాలు, పాక్షిక రక్షణ గల ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని క్రీ.శ. ఏడవ శతాబ్ది నాటి చారిత్రక, పురావస్తు ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం కన్నా ముందు ఆర్యవర్తనంలో మౌర్యుల, గుప్తులకు చెందిన మధ్య భారతదేశంలో వాకాటకులు, పుష్పభూతి రాజవంశపు వారు, దక్షిణ భారతదేశంలో సంగమ యుగం చోళ, చేర, పాండ్య తమిళకం నాటి రక్షణ కోటలు చోళ, చేర, పాండ్య, పల్లవ, చాళుక్య రాజవంశాల వారు భారీ పహారా గల రక్షిత స్థావరాలు మాత్రమే కాకుండా, శక్తివంతమైన ప్రాకారాలతో కూడిన కోటల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
4. మధ్యయుగ కోటలు
క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుంచి భారీ ప్రాకారాలతో కూడిన నిర్మాణాలు, కోటలు, శక్తివంతమైన దుర్గాలు పంజాబ్, సింధు, రాజస్థాన్ ప్రాంతాలలో అధికంగా కనిపిస్తాయి. క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దాల మధ్యకాలంలో శక్తివంతమైన, శత్రుదుర్భేద్యమైన కొత్త రకం కోటల నిర్మాణం అధికంగా మనుగడలోకి వచ్చింది. చిత్తోర్‌గఢ్, రణతంభోర్, కుంభల్‌గఢ్, కాంగ్రా, అంబర్, జైసల్మేర్, మరాఠా కొండ కోటల నిర్మాణ కౌశల్యం, కళా నైపుణ్యం నాటి ఇంజనీరింగ్ వాస్తుకు ప్రతీకలు. ఈ భారీ నిర్మాణాలను ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలుగా గుర్తించింది. జోధ్‌పూర్, గ్వాలియర్, అట్టోక్, రోస్ టాప్ ఖిల్లా, ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, గోల్కొండ, బీజాపూర్, బీదర్, అహమ్మద్‌నగర్, చాందా గఢ్, భల్లార్‌పూర్ గఢ్, రాయ్‌గడ్, విజయనగరం, బొబ్బిలి, చంద్రగిరి, దౌలతాబాద్, పెనుకొండ, వెళ్లూరు, భువనగిరి, చిత్ర దుర్గ్, బాదామి, గండికోట, ఎర్రకోట, ఫతేపూర్ సిక్రి, రాజ్‌గడ్, సింధు దుర్గ్, విజయ్ దుర్గ్, జింజి మొదలైన కోటలను చరిత్రకారులు, పరిశోధకులు భారీ కోటలుగా గుర్తించారు. వీటిలో ఇంచుమించు ఎక్కువ కోటలు కొండ శిఖరాలపైన, చుట్టూ కొండల మధ్య నిర్మించడం విశేషం. ఏడు అలాగే ఎనిమిదవ శతాబ్దాల కాలం నుంచి ఇలాంటి భారీ ప్రాకారాలతో, ద్వారాలతో, కందకాలతో రకరకాలైన అనేక వసతులు కలిగిన కోటలను నిర్మించడం చూస్తాం. మధ్యయుగ కాలపు నిర్మాణాలకన్నా ముందే పటిష్టమైన కోటలు, సైనిక స్థావరాలు కలిగిన నిర్మాణాలు, నగరాలు నిర్మించి ఉన్నాయి. పురాతన కోట స్థావరాల పైన, శిథిల కోటల పైన కూడా పునర్నిర్మిత కోటలు అనేకం ఉన్నాయి. అలాంటి కోటలలో భటిండా ఖిల్లాను ఉదాహరణకు చెప్పవచ్చు. పటిష్టమైన రక్షణ, సైనిక శిక్షణ శిబిర కోటల నిర్మాణంలో కానీ, రక్షణ వలయాలు, ఇతర భద్రతా ఏర్పాట్లలో కానీ స్థానిక భౌగోళిక, వాతావరణ స్వభావం అత్యంత కీలకంగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత ఉపఖండంలో సరాసరి నమోదు చేయబడిన 7,000 వరకు కోటలు, దుర్గాలు ఉన్నాయి. అనుబంధ, రక్షణ దుర్గాలుగా వ్యవహరించే అనేక చిన్న దుర్గాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో 1026 వరకు కోటలు, దుర్గాలను మాత్రమే భారత పురావస్తు, వారసత్వ శాఖ, రాష్ట్రాల పురావస్తు శాఖ వారు రక్షిస్తున్నారు. మిగతా కోటలు రక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల నిర్లక్ష్యం, చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యత అవగాహనా లోపం వల్ల శిథిలావస్థకు చేరుకున్నాయి.
5. కోట నిర్మాణంలో ప్రాచీన భారత వాస్తు శాస్త్రం
భారత ఉపఖండంలో ప్రాచీన కాలం నుంచే వాస్తు, శిల్ప శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని కోటలు, భవనాలు, గృహాలు, ఆలయాలు, గ్రామాలు, నగరాలు నిర్మించడం జరిగింది. వాస్తుశిల్ప, చిత్రలేఖన శాస్త్రం ప్రకారమే శిల్పాలు, చిత్రలేఖన కళ అభివృద్ధిలోకి వచ్చింది. రేఖాగణిత శాస్త్రం ప్రకారం గ్రామ, పట్టణ, నగర నిర్మాణాలు జరిగాయి. భారతదేశంలో వాస్తు శాస్త్రానికి, చిత్ర శిల్ప శాస్త్రానికి చెందిన అనేక ముఖ్యమైన లిఖిత సాహిత్య ఆధారాలు లభించాయి. ఈ వాస్తు, చిత్ర, శిల్ప శాస్త్రాన్ని ఆధారం చేసుకునే నాటి, నేటి నిర్మాణాలైన కోటలు, భవనాలు, ఆలయాలు, శిల్పాలు చెక్కడం, చిత్రాలు గీయడం జరిగింది. నాటి ఈ సాహిత్య లిఖిత రచనలు వాస్తు, శిల్ప, నగర నిర్మాణ సూత్రాలను వివరిస్తాయి. ‘పురాణాలలో వాస్తు శాస్త్ర గ్రంథం విశ్వకర్మ’ అలాగే మయూరుడు, మునులు, ఋషులు, రాజులు రచించిన అనేక వాస్తు శాస్త్ర గ్రంథాలు వాస్తు శాస్త్ర సమాచారం, గృహ, ఆలయ నిర్మాణాలకు మూల గ్రంథాలు.
5.1. ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాలు
భారతదేశంలో ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాలు అనేకం ఉన్నాయి:
- విశ్వకర్మ వాస్తు శాస్త్రం విశ్వకర్మ అనే ఋషిచే లిఖించబడిన రచన అని విశ్వాసం. ఇది వాస్తు శాస్త్రానికి ఒక ప్రామాణిక గ్రంథం.
- మయమతం అనే వాస్తు శాస్త్ర గ్రంథాన్ని మయూరుడు రచించాడు. ఈ రచన ఆలయ, గృహ నిర్మాణం, శిల్పకళపై సమగ్ర సమాచారాన్ని ఇస్తుంది.
- మనసారా శిల్ప శాస్త్రం అనే వాస్తు శాస్త్ర రచనను మనసారుడు రచించాడు. ఇది దేవాలయాలు, శిల్పాల నిర్మాణ ప్రక్రియ గురించి వివరిస్తుంది.
- సమారాంగణ సూత్రధారా అనే వాస్తు శాస్త్ర రచనను రాజా భోజుడు (ధార నగరం) అనే రాజపుత్ర రాజు లిఖించాడు. ఈ గ్రంథం నగర ప్రణాళిక సూత్రాలను అలాగే భవన నిర్మాణ సూత్రాలను గురించి తెలుపుతుంది.
- బృహత్ సంహిత అనే వాస్తు శాస్త్ర గ్రంథాన్ని వరాహమిహిరుడు రచించాడు. ఈ వాస్తు శాస్త్ర గ్రంథంలో ఇల్లు నిర్మాణంలో వాతావరణ పరిస్థితులకు, విశేషాలకు అనుగుణంగా గృహ నిర్మాణ విశేషాలు, ఇతర విషయాలను గురించి సమాచారం ఉంది.
- మత్స్యపురాణం, అగ్నిపురాణం, విష్ణు పురాణం, గార్గి సంహిత, కాశ్యప సంహితలలో కూడా వాస్తు శాస్త్రం, యజ్ఞగుండ నిర్మాణం, గృహ నిర్మాణం, శిల్ప, చిత్రలేఖన విధానం గురించి అనేక అంశాలతో కూడిన రచనలు ఉన్నాయని చెప్పవచ్చు.
పై రచనలు భారతీయ వాస్తు, శిల్ప, చిత్ర, భవన, నగర, పర్యావరణ సమతౌల్యత, శిల్ప, వాస్తు, చిత్రకళా నైపుణ్యం గురించి వివరిస్తాయి.
చారిత్రక, పురావస్తు, వాస్తు నిర్మాణ, లిఖిత రచన సాహిత్యం, చిత్రలేఖన కళ రంగాలకు సంబంధించిన ఆధారాలు అన్నింటిలోనూ నగర, పుర రక్షణలు, దుర్గాల రక్షణలకు, కోట నిర్మాణం, భవన నిర్మాణ వాస్తు శాస్త్రానికి సంబంధించిన సాహిత్య సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉంది. మనసార, శిల్పరత్న, సమారాంగణ సూత్రాధార వంటి గ్రంథాలలో కూడా విభిన్న కాలాలకు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన రక్షణ కోటలు, దుర్గాలకు సంబంధించిన నిర్మాణ ప్రస్తావనలు కోకొల్లలుగా ఉన్నాయి.
కోట నిర్మాణ అవసరం, ఆవశ్యకత, కోటల నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామాగ్రి, కోటల నిర్మాణానికి అనువైన భౌగోళిక ప్రదేశాల ఎంపిక వంటి ఎన్నో విషయాలు ఈ గ్రంథాలలో వివరంగా వివరించారు నాటి వాస్తు శాస్త్ర నిపుణులు. కోటల నిర్మాణంలో ఎన్నో శైలులు, ఉప శైలులు, ఉప సంప్రదాయాలు, నమూనాలను ఉపయోగించారు. దీనికి తోడు సాంచి వద్ద నిర్మించిన నిర్మాణాలు, అజంతా చిత్రాలలో పూర్వకాలపు కోటలు, దుర్గాలలో ఏటవాలుగా నిర్మించి ఉన్న కోటగోడలు, విశాల ద్వారాలు ఉన్న ఆధారాలు మనకు కనిపిస్తాయి.
క్రీ.పూ. మూడవ శతాబ్ద కాలపు కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కోటల వాస్తు నిర్మాణ శైలి, స్వభావాన్ని ఆధారంగా చేసుకుని కోటలు, దుర్గాలను ఆరు రకాలుగా వర్గీకరించారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
6. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం కోటల వర్గీకరణ
6.1. జల దుర్గం
నీటిలో నిర్మించే కోటలను జల దుర్గాలు అంటారు. అవి సముద్రంలో కావచ్చు, నదిలో కావచ్చు, కృత్రిమంగా నిర్మించిన తటాకం లేదా సరస్సులో నిర్మించవచ్చు.
6.1.1. అంతర్ ద్వీప దుర్గం (ద్వీప దుర్గం)
ప్రకృతి సిద్ధమైన నీరు (సముద్ర జలాలు లేదా నది జలం) కోట చుట్టూ రక్షణగా ఉంటాయి. ఉదాహరణకు మురుడ్ గఢ్, జంజీరా దుర్గం, సింధు దుర్గం వంటివి.
6.1.2. స్థల దుర్గము (మైదాన దుర్గము)
మానవ నిర్మిత కృత్రిమ కందకాన్ని లేక ఎత్తైన కొండ పైన చెరువు నిర్మించి, ఆ చెరువు నీటిని కాలువలు, గుప్తమైన మట్టి పైపు ప్రవాహ మార్గం ద్వారా కందకంలో నీటిని నింపడంతో కూడిన నీటిపారుదల వ్యవస్థ రక్షణగా ఉంటుంది. వీటికి ఉదాహరణగా ఘాగ్రాం, దిగ్, లోహగఢ్, దౌలతాబాద్ (దేవగిరి కోట), వెల్లూరు కోట, షేర్‌గఢ్. ఈ కోటలన్ని భారతదేశం అంతటా ఉన్నాయి, ముఖ్యంగా రాజస్థాన్‌లో ఎక్కువ ఉన్నాయి.
6.2. ధవన లేదా మరు దుర్గము
వీటినే ఎడారి కోటలు అని కూడా అంటారు. చుట్టూ ఐదు యోజనాల వరకు, అంటే 73 కిలోమీటర్ల వరకు విస్తరించిన థార్ ఎడారి ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఇలాంటి కోటలకు ఉదాహరణగా జైసల్మేర్ కోట, లోద్రవా దుర్గం, భట్నర్ ఖిల్లా (హనుమాన్‌గఢ్) వంటి వాటిని చెప్పవచ్చు.
6.3. గిరి దుర్గము (కొండ కోట)
గుట్ట పైన, ఎత్తు కొండపైన, కనుమ పైన నిర్మించే దుర్గం లేదా కోటను గిరి దుర్గం అంటారు.
6.3.1. గిరి ప్రాంత దుర్గము
ఏటవాలు కొండ శిఖరాల పై ఇలాంటి దుర్గాలు నిర్మిస్తారు. ఈ దుర్గాలకు ఉదాహరణ చిత్తోర్‌గఢ్ ఖిల్లా, గ్వాలియర్ కోట, నిర్మల్ కోట, రాయ్‌గడ్ కోట వంటి వాటిని చెప్పవచ్చు.
6.3.2. గిరి పార్శ్వ దుర్గము
కొండ శిఖరాలపై కాకుండా, కొండలకు ఏటవాలు ప్రాంతంలో నిర్మించే దుర్గాలు. కొండ దిగువన జనావాస ప్రాంతాలు ఉన్న ప్రదేశాలలో నిర్మించే దుర్గాలు. ఈ దుర్గాలకు ఉదాహరణగా బూంది తారాగఢ్, అజ్మీర్ తారాగఢ్, మెదక్ కోట, పూణే కోటలను చెప్పవచ్చు.
6.3.3. గుహ దుర్గము
చుట్టూ కొండలతో ఉన్న లోయల్లో ఇలాంటి దుర్గాలు నిర్మిస్తారు. చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలు రక్షణ స్థావరాలుగా, కొండ కనుమలను బురుజులుగా (సిగ్నల్ ఇచ్చే టవర్లుగా) సహజ సిద్ధంగా ఉపయోగపడే ఉద్దేశ్యంతో ఇలాంటి కోటలను నిర్మిస్తారు. ఇలాంటి కోటకు చక్కటి ఉదాహరణ ప్రాచీన కాలపు మగధ రాజధాని గిరివజ్రం లేదా రాజగృహం. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ్ కోట, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి కోట, మహారాష్ట్రలోని నళ్ దృక్ కోటలను కూడా ఉదాహరణగా చెప్పవచ్చు.
6.4. వన దుర్గము
కనీసం నాలుగు కోసుల వరకు (14.6 కిలోమీటర్లు) చుట్టూ దట్టమైన అడవి ఉన్న ప్రదేశంలో వన దుర్గాలను నిర్మిస్తారు. వన దుర్గానికి ఉదాహరణకు ఆరావళి అడవిలో నిర్మితమైన రణతంభోర్ కోట, తెలంగాణ రాష్ట్రంలోని కౌలాస్ దుర్గం, ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కోట, మహారాష్ట్రలోని మహుర్ కోటలు, రాయ్‌గడ్ కోట, కొండన కోటలను చెప్పవచ్చు.
6.4.1. ఖంజన దుర్గం
ఖంజన దుర్గాలను చిత్తడి నేలలలో ప్రధానంగా నిర్మిస్తారు. చుట్టూ అడవి, ముళ్ల పొదల చెట్లు మధ్యన చిట్టడవి, పబ్బుచెట్ల పొదలు ఉన్న అడవితో ఆవరించి ఉన్న అడవిలో ఇలాంటి ఖంజన వన దుర్గాలు నిర్మిస్తారు. వీటికి ఉదాహరణ వర్లీ ముంబై లోని కోట, లాంజి కోట, ఢిల్లీ లోని పురాణ ఖిల్లా.
6.4.2. స్థంభ దుర్గాలు
అతి పొడవైన చెట్లు, అవి స్థంభం వలె పొడవుగా ఉన్న అడవిలోని చెట్ల మధ్యన ఇలాంటి దుర్గాలు ప్రధానంగా నిర్మిస్తారు. ఈ దుర్గాలకు తగినన్ని జలవనరులు అందుబాటులో ఉండవు. అయితే దుర్గం పైన నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికాబద్ధంగా జల రక్షణకు అనుకూలమైన చోట ఒక కుంటను నిర్మిస్తారు. ఇందులో నిలవ ఉన్న నీరు దుర్గంలో నివసించే వారి అవసరాలను తీరుస్తుంది.
6.5. మహీదుర్గము
వాస్తు పరిశోధకులు, చరిత్రకారులు, పురావస్తు నిపుణులు వీటిని ఈ క్రింది లక్షణాలను ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేశారు. అవి:
6.5.1. మృదుదుర్గం
మృదు దుర్గం చుట్టూ మట్టి ప్రాకార గోడలు ఉంటాయి. గోడలు అతి వెడల్పుగా, అంటే ఆరు మీటర్ల నుంచి పది మీటర్ల వరకు వెడల్పు ఇంక ఎక్కువ కూడా ఉన్నవి ఉండవచ్చు. అలాగే గోడకు ఆనుకొని పెద్ద కందకం, కందకంలో మొసళ్లు నివసించే ఏర్పాటు ఉంటుంది. వీటికి ఉదాహరణగా వరంగల్ కోట (ఏకశిలా కోట), దాని కోట గోడలు మట్టితో నిర్మించి ఉన్నాయి.
6.5.2. పరిఘదుర్గము
కోటకు భారీ ప్రాకార నిర్మాణం, మట్టి కోట గోడతో పాటు అనుబంధ కోట గోడ రాయి, ఇటుకలతో మిశ్రమ కోట గోడలను కలిగిన నిర్మాణం. ఈ గోడలు 5.4 మీటర్ల ఎత్తుతో, గోడ ఎత్తులో సగం వెడల్పు కలిగిన నిర్మాణం ఖచ్చితంగా ఉంటుంది. కోట ప్రాకారం అతి చిన్న కోట గోడ కలిగి, సాధారణంగా 2.7 మీటర్ల వెడల్పు నిర్మాణం ఉన్న కోటను పరిఘ దుర్గం అంటారు.
6.5.3. పంకదుర్గము
పంక దుర్గ నిర్మాణములు సాధారణంగా చిత్తడి భూమిలో నిర్మిస్తారు. చిత్తడి నేల మధ్యలో గట్టి భూప్రదేశం ఉన్న చోట అనుకూలంగా నిర్మిస్తారు. కోట బయట భూమి అంతా చిత్తడి నేలతో ఆవరించబడి ఉంటుంది. ఈ చిత్తడి నేల కోటకు సహజ రక్షణ వలయంగా మలచబడి ఉంటుంది.
6.6. శిలాదుర్గము (పూర్తి కొండ దుర్గం)
శిలా దుర్గ నిర్మాణం సాధారణంగా పూర్తి కొండ శిఖరం పైన లేదా రాళ్ల శిఖరాల పైన, పూర్తి రాయి పైన లేక ఏకశిల పైన నిర్మిస్తారు. రాయినే తొలుచుకుంటూ కోట నిర్మాణం జరుగుతుంది. కోట లోపల రాజ భవనం, దర్బార్ హాల్, సైనిక శిక్షణ శిబిరం, సైనికుల నివాస ప్రదేశం వంటి వివిధ అంశాలతో కూడిన నిర్మాణం అని చెప్పవచ్చు. ఇలాంటి దుర్గాలకు ఉదాహరణ రాయ్‌గఢ్, ప్రతాప్‌గడ్, జింజి, భువనగిరి, గాంధారి ఖిల్లా.
6.7. మానవ దుర్గము
అనుభవజ్ఞులు, శక్తిశాలులైన బలమైన యోధులతో శాశ్వత రక్షణ వలయం ఉన్న నగర దుర్గాలు ఈ వర్గంలోకి వస్తాయి. ఉదాహరణకు నాగ్‌పూర్ దుర్గం వంటివి. ఆయా ప్రాంతాల రాజకీయ స్థితిగతులను బట్టి రక్షణ నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో పలు నిర్మాణాలు కొండలు, కొండ శిఖరాల పైన, రక్షణ కనుమలు, నది పరివాహక ప్రాంతాల వెంబడి ఉన్నాయి. కొన్ని చిన్న కోటలు లేదా దుర్గాలు రక్షణ బురుజులుగా (టవర్లుగా) ఉపయోగపడతాయి. భారతీయ పాలకులు రాజధానులలో, వాణిజ్య ప్రదేశాలలో, పర్యాటక ప్రదేశాలలోని ప్రధాన నగరాలకు దారి చూపే మార్గాల వెంబడి వ్యూహాత్మకంగా అనుబంధ కోటలను నిర్మించారు. అలాగే కోటల నిర్మాణంలో శతఘ్నుల ఏర్పాటు అంటే ఫిరంగుల ఏర్పాటు, తుపాకీతో గురిపెట్టడానికి ప్రత్యేక బురుజుల నిర్మాణం కలిగిన కోటలకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది.
క్రీ.శ. 10వ శతాబ్దం అలాగే క్రీ.శ. 11వ శతాబ్దాల కాలంలో ప్రముఖ రాజ్యాలకు చెందిన రాజధానులు సంపూర్ణ రక్షణలు కలిగిన నగరాలుగానే కాకుండా, శక్తివంతమైన సైనిక భద్రత గల దుర్గాలు, నగరాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ దుర్గాలకు అనుబంధంగా చుట్టూ ఉపదుర్గాలు నిర్మించారు. ఇలా నిర్మించిన ఉపదుర్గాలలో నగరాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఢిల్లీ, ఆగ్రా, లాహోర్, ఓర్చా, పూణే, నాగ్‌పూర్, చంద్రపూర్, గోల్కొండ, వరంగల్, మంగళగిరి, విశాఖపట్నం, బొబ్బిలి, విజయనగరం (హంపి), మైసూర్ పట్టణాలను చెప్పవచ్చు. భారతదేశంలో బయటపడిన అతి పురాతన కాలపు కోటలలో నేటికీ సజీవంగా ఉన్న కోటలలో క్రీ.శ. 100వ సంవత్సరం కాలపు పటిష్టమైన భటిండా కోటలో భాగమైన కోట ముబారక్ ఖిల్లా ఒకటి. కాంగ్రా కోటకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కాంగ్రా కోట నిర్మాణాన్ని అంచలంచెలుగా నిర్మించారు. చిత్తోర్‌గఢ్, కుంభల్‌గఢ్, రణతంభోర్, జైసల్మేర్, అంబర్, జోధ్‌పూర్, మెహర్‌గఢ్, బికనేర్, జునాగఢ్, బూంది తారాగఢ్, అజ్మీర్ తారాగఢ్, గ్వాలియర్ రాజపుత్రుల, మాల్వా సుల్తానుల కాలపు కోటలు రాజపుత్రుల, జాట్ల, ఉత్తర భారతదేశానికి చెందిన ఇతర ప్రముఖుల కోటలలో ముఖ్యమైనవి. జైపూర్‌లోని జంతర్ మంతర్ ఖగోళ వేదశాలను సవాయ్ రాజ జైసింగ్ II నిర్మించాడు. రాజ జైసింగ్ దూరదృష్టికి, సాంకేతిక పరిజ్ఞానానికి అది నిదర్శనం. జంతర్ మంతర్ సూర్య గమన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించారు. అద్భుతమైన వాస్తుకు ఇది నిదర్శనం.
మహమ్మద్ బేగ్డా నిర్మించిన చంపానేర్ పావగఢ్ కోట, అహ్మద్‌నగర్ కోట, జునాగఢ్ ఉపెర్‌కోట్ కోట ముఖ్యమైనవి. మధ్యభారత రాజ గోండులోని రామ్‌గఢ్, నాగ్‌పూర్, చాందా కోట, భల్లార్‌పూర్ కోట, బ్రహ్మపురి కోట, ఆదిలాబాద్ జిల్లా బొక్కగుట్ట గ్రామం దగ్గర ఉన్న గాంధారి ఖిల్లా ముఖ్యమైనవి. ఢిల్లీ సుల్తానుల కాలపు కోటల్లో సిరి కోట, తుగ్లకాబాద్ కోట, జాన్‌పూర్ కోట, ఫిరోజ్ షా కోటలు, దక్కన్ ప్రాంతంలోని దౌలతాబాద్ కోట, అహ్మద్‌నగర్ కోట, గుల్బర్గా కోట క్రీ.శ. 14వ శతాబ్దపువి. బీదర్ కోట, బీజాపూర్ కోట, రాయచూర్ కోట క్రీ.శ. 15వ శతాబ్ద కాలపువి. గోల్కొండ కోట, గండికోట క్రీ.శ. 16వ శతాబ్ద కాలపు కోటలలో ముఖ్యమైనవి.
క్రీ.శ. 16వ శతాబ్దంలో శతఘ్నులు వంటి ఆయుధ సామాగ్రిని మోహరించడానికి అవసరమైన భారీ కోటల నిర్మాణం మొదలైంది. కోటల వాస్తు నిర్మాణంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మందుగుండు సామాగ్రితో ఫిరంగుల అమరిక, భారీ శతఘ్నుల మోహరింపు ప్రవేశంతో గోడలు మరింత మందంగా, దృఢంగా, పటిష్టంగా, భారీ వెడల్పుతో నిర్మించడం ప్రారంభించారు. ఫిరంగులు బురుజుల వెలుపలకి కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మధ్యలో కోట నిర్మాణం, కోట గోడకు, కోటకు మధ్యన విశాలమైన ప్రదేశం వదలడం జరుగుతుంది. ఇలాంటి కోటలకు ఉదాహరణ గోల్కొండ కోట, బేరర్ కోట ప్రధాన లక్షణాలు. ఏనుగులు లోపలికి వెళ్లడానికి వీలుగా భారతదేశంలోని కోటలకు చాలా ఎత్తైన, విశాలమైన ద్వారాలను అమర్చారు. కోట సింహద్వారపు తలుపులకు బలమైన సూది మొన లాంటి ఇనుప చీలలు, చువ్వలు అమర్చుకోవడం సాధారణంగా గమనించవచ్చు. కోట తలుపులకు అమర్చిన సూదిమొన లాంటి చీలల వల్ల శత్రు సైన్యాలు తలుపులను పగలగొట్టడానికి ఏనుగులను ఉపయోగించడం అసాధ్యం అవుతుంది అనే భావనతో ఈ ఏర్పాట్లను తలుపులకు చేశారు.
అలాగే కోట లోపల ముఖ ద్వారం లోపలి పక్కన కోట గోడ పై ఆముదం నూనెను వేడి చేయడానికి విశాలమైన ప్రదేశం ఉంచి, ఆ విశాల ప్రదేశంలో నూనె పెద్ద కడాయిలో వేడి చేయడానికి పొయ్యిలా ఏర్పాటు, కోట సింహ ద్వారం పై నుంచి కిందికి శత్రు సైన్యంపై పడే విధంగా నిర్మాణాల ఏర్పాటు, కోట లోపల ఉన్న రాజు కుటుంబం, ప్రజల అవసరాలు తీర్చడానికి కోట గోడల వెంట గోడకు ఆనుకొని నీటి సరఫరా పైపులు, బందిఖానా, ధాన్యాన్ని నిల్వ చేయడానికి పెద్ద గదులు, పాలనా కార్యాలయ అధికారుల ఇళ్లు, పాలనా ఉద్యోగుల భవనాలు, ప్రభుత్వ కార్యాలయం, సైనికులకు శిక్షణ ఇవ్వడానికి సైనిక ఛావనీలు, సభా మండపం, దర్బార్, ఆలయాలు - ఇలా అనేక వసతులు కోటను నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్రం ఆధారంగా నిర్మించారు. కోటల నిర్మాణంలో ప్రకృతి సిద్ధమైన కొండ రాళ్లను ఉపయోగించడం సాధారణం కనుక, సాధారణంగా కోట గోడలు లోపలి వైపు తక్కువ ఎత్తు, వెలుపలి వైపు అధిక ఎత్తు కలిగిన నిర్మాణాన్ని నిర్మించుకున్నారు. కోట వెలుపలి గోడ తక్కువ ఎత్తు నిర్మాణం సైనికుల పహారాకు అనుకూలంగా ఉంటుంది. బయటి గోడ ఎత్తు ఎక్కువ ఉండడంతో బయటి వ్యక్తులకు సైనికులు కనిపించరు. అందుకే ఇలాంటి నిర్మాణం జరిగింది. ఇలాంటి నిర్మాణం వల్ల కోట గోడలు ఎత్తుగా ఉన్నాయనే భ్రమ శత్రువులకు కలిగించడంతోపాటు, లోపల వైపున పూర్తిగా ప్రకృతి సిద్ధమైన కొండ రాళ్లు ఉండడం వల్ల శత్రు సైన్యాలకు చెందిన ఏనుగుల నుంచి పూర్తి రక్షణ కోటకు ఏర్పడుతుంది.
ఆగ్రా, ఢిల్లీ ఎర్రకోట వంటివి ఎర్రరాతితో నిర్మించడం మరో విశేషం. 2.5 కిలోమీటర్ల నిడివి కలిగి ఉండి, కోట చుట్టూ ఆవరించి ఉన్న గోడలు మొఘల్ పాలకుల రాజధానికి రక్షణ కల్పించేలా ఉన్నాయి. వాటిలో షాజహాన్ నిర్మించిన జహంగీర్ ప్యాలెస్, హాజ్ మహల్, దివానీ-ఇ-ఆమ్, దివానీ-ఇ-ఖాస్ వంటి సభా మండపాలు, రెండు మసీదులు ఢిల్లీలోని ఎర్రకోట ప్రముఖమైనవి. ఎర్రకోట నిర్మాణం, పటిష్టమైన నిర్మాణ ప్రణాళిక, బద్ధమైన భవనాలు, ఉద్యానవనాలు, పండ్ల తోటల నిర్మాణ ఏర్పాటు నాటి వాస్తు శైలి భారత ఉపఖండంలో ఆ తర్వాత నిర్మించిన కోటల నిర్మాణాన్ని ఎంతో ప్రభావితం చేసింది. అలాగే ఎర్రకోట సముదాయం బ్రిటిష్ మిలిటరీ ఆక్రమణ దశను కూడా ప్రతిబింబిస్తుంది. కొత్త భవనాలు, సైనిక రక్షణ విధులతో గతంలోని మొఘల్ కాలపు కోటలకు నేడు ఒక కొత్త రూపం వచ్చింది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ చక్రవర్తుల, దక్కన్ ముస్లిం సుల్తానుల వాస్తు శైలి, శిల్ప, చిత్రకళ ఇండో-పర్షియన్ నిర్మాణాలు.
మరాఠాల సైనిక శిక్షణకు చెందిన భూ, సముద్ర కోటలు, కొండ కోటలు సమున్నత చారిత్రక వారసత్వం కలిగి నేటికీ కూడా పటిష్టంగా ఉన్నాయి. అలాగే ఖిల్లా ముబారక్, పటియాల కోట బురుజులు, భవనాలు, రక్షణ గోడలతో కూడిన కోట నిర్మాణం సిక్కుల చరిత్రను, వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తూర్పు భారతదేశానికి చెందిన అహోం కొండదుర్గాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోస్తా ప్రాంతంలోని భూ కోటలు తమదైన వాస్తు నిర్మాణ ప్రాధాన్యతను చాటుతున్నాయి. ఇంతే కాదు, యూరోపియన్ వలస పాలకుల కాలంలో నిర్మించిన కోటలలో డయ్యు, డామన్, సూరత్, బేసిన్, బొంబాయి, మర్మగోవా, గోవా, హుగ్లీ, చిన్సూరా, ఫోర్ట్ లూయిస్, ఫోర్ట్ విలియం, చంద్రనగర్, సేరాంపూర్, విశాఖపట్నం, మచిలీపట్నం, పాండిచ్చేరి, యానాం కోటలు ప్రముఖమైనవి. యూరోపియన్ వలస పాలకులు నిర్మించిన ముఖ్యమైన కోటలకు ఇవి ఉదాహరణలు.
పోర్చుగీస్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ దేశస్థుల వ్యాపార కంపెనీ, యూరోపియన్ల అనుబంధ కోటల వాస్తు నిర్మాణ శైలి ఇండో-యూరోపియన్ వాస్తు శైలి నిర్మాణం. దుర్గాల నిర్మాణం పైన ప్రత్యేకంగా యూరోపియన్ వాస్తు శైలి ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా భావించవచ్చు. యూరోపియన్ దేశస్థుల వాస్తు శైలి భారతదేశంలో నిర్మించిన కోటలపై ప్రత్యేక ప్రభావం కలిగి ఉంది. చాలా కోటగోడలపై చిత్రాలు, శిల్పాలు, స్థంబాల నిర్మాణం పైన చూడవచ్చు. యూరోపియన్ కోటల గోడలు, బురుజులపై ఉన్న పిట్ట కోట గోడలకు శత్రు సైన్యాలపై కాల్పులు జరపడానికి వీలుగా మధ్య మధ్యలో శిఖరాల వంటి నిర్మాణాలు, శతఘ్నుల గొట్టాలు బయటకు రావడానికి వీలుండే అమరిక రంధ్రాలు కలిగిన నిర్మాణం అద్భుతమైనది. భారతదేశానికి చెందిన కోటగోడల శిఖరాలు ప్రత్యేక వాస్తు శైలికి అనుగుణంగా ఉన్న రాయి అమరిక, వర్తులాకారంలో పైభాగం మొనదేలి నిర్మించడం సాధారణంగా కనిపిస్తుంది. పిట్ట గోడలు పటిష్టంగా ఉంటూ ఈ శిఖరాలు వెలుపలి నుంచి చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఉదాహరణకు చంద్రగిరి కోట, చిత్తోర్‌గఢ్ కోట. కోటలపై ఈ శిఖరాలు సుదూర ప్రాంతాల వీక్షణకు వీలుగా అవకాశం కలిగి ఉంటాయి. కొన్ని కొన్ని రాతి శిఖరాలు రెండు లేదా మూడు రంధ్రాలు కలిగిన నిర్మాణం ఉండి ఉంటాయి. మరికొన్ని అడ్డం లేదా నిలువు విభజనతో రెండేసి లేదా మూడేసి రంధ్రాలు కలిగిన పిట్టగోడల నిర్మాణాలను కలిగి ఉంటాయి.
బ్రిటిష్ పాలకులు కోస్తా ప్రాంతంలో వారి వర్తక, వాణిజ్యానికి వీలుగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి స్థావరం దగ్గర రక్షణ కోసం కోటలు నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న వాటిలో బొంబాయి కోట, కలకత్తాలో నిర్మించిన ఫోర్ట్ డేవిడ్ కోట, మద్రాసులో నిర్మించిన ఫోర్ట్ సెయింట్ విలియం కోటలు ప్రధానమైనవి. బ్రిటిష్ వారు తొలి దశలో నిర్మించిన ఈ కోటల్లోని లోపాలు ఫ్రెంచి వారితో బ్రిటిష్ వారు చేసిన కర్ణాటక యుద్ధ పోరాట సమయంలో బయటపడ్డాయి. బ్రిటిష్ వారు తర్వాత దశలో నిర్మించిన కోటలను కంపెనీ ప్రభుత్వం తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు గాను, మరింత సంరక్షణ కలిగిన, సంక్లిష్టమైన వాస్తుతో కోటలను నిర్మించారు. ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోట డిజైనింగ్ వాస్తు తయారీలో ఫ్రెంచి ఇంజనీర్ వౌబర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పోర్చుగీస్ వారి కోట నిర్మాణాలు గోవాలో చూడవచ్చు. ఫ్రెంచి వారి కోట, నిర్మాణాలు పాండిచ్చేరిలో, యానాంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో భారతీయులు భారతదేశంలో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కోటలను నిర్మించారు.
7. భారతీయ కోటల పర్యాటక ప్రాముఖ్యత
భారతదేశంలోని చారిత్రాత్మక కోటలు, ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (హైదరాబాద్), ఢిల్లీ రాష్ట్రాలలో ఉన్నవి, ఉదాహరణకు గండికోట, చిత్తోర్‌గఢ్, జైసల్మేర్, రాయ్‌గఢ్, మైసూర్, గోల్కొండ కోట మొదలైనవి పర్యాటక ఆకర్షణలు. కోటలు, కోటల సముదాయం పర్యాటక రంగానికి వెన్నుముక. భారతదేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి, శిల్పకళా వైభవానికి కోటలు నిదర్శనాలు. దేశీయ, విదేశీయ పర్యాటకాన్ని ఇవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కోటల పర్యాటకం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రాంతీయ అభివృద్ధిని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్రను ఇవి వహిస్తాయి అనడంలో సందేహం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భూమికను కోటల పర్యాటకం నిర్వహిస్తుంది. కోటలు దేశ పర్యాటక రంగానికి వెన్నెముక. భారత ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి ప్రణాళికల ద్వారా ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారత ప్రభుత్వం విదేశీ పర్యాటకానికి ఊతం ఇవ్వడానికి విదేశీ పర్యాటకులకు వీసాల జారీని సులభతరం చేసింది. పర్యాటకులకు అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. కోటలు భారతదేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి, శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. కోటలను సందర్శించడం ద్వారా చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని, కోటల ప్రాచీనతను, నాటి రాజుల రాజవంశాల చరిత్రను, వారి శౌర్యానికి ప్రతీకలైన చిహ్నాలను, వాస్తు శిల్పకళకు నిదర్శనమైన శిల్పాలను, నాటి వాస్తు శిల్పకళ, చిత్రకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే అనేక అంశాలను తెలుసుకోవచ్చు. కోటల పర్యాటకం ద్వారా నాటి చరిత్రను, సంస్కృతి వారసత్వాన్ని, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను తెలుసుకోవచ్చు. భారతదేశ భిన్న ప్రాంతాలలో ఉన్న కోటలలో భిన్న సంస్కృతులు, ఆచార సంప్రదాయాలను తెలుసుకోవచ్చు. ఇవి దేశ భిన్నత్వంలో ఏకత్వానికి తోడ్పాటును ఇవ్వడంలో కారణభూతం కాగలవు. భారతదేశ కోటలు ప్రపంచ పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు రాజస్థాన్‌లోని కోటలు, మహారాష్ట్రలోని కోటలు. కోటల పర్యాటకం ద్వారా ఆర్థిక అభివృద్ధి, భారతదేశ ఆదాయం పెరుగుతుంది. భారతదేశంలోని 100కు పైగా స్మారక కట్టడాల ప్రవేశ రుసుముల ద్వారా పర్యాటక రంగం నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఇదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు అనేకం లభిస్తున్నాయి. కోటల సంరక్షణకు ఆదాయం సమకూరుతుంది. కోటల పర్యాటకం వల్ల హోటళ్లు, రవాణా రంగాల వారికి మంచి ఆదాయ వనరు, గైడ్‌లకు ఉపాధి, అలాగే స్థానిక కుటీర పరిశ్రమలలో ఉత్పత్తి అయిన వస్తువులకు గిరాకీ లభించడం, స్థానిక చేతిపనుల వారి ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఉపాధి లభించడం, ఆదాయం సమకూరడం జరుగుతుంది. పర్యాటకులకు పర్యాటక అనుభవం, గొప్ప అనుభూతి, ఆనందం, జ్ఞానం కూడా పెరుగుతుంది. గండికోట, దౌలతాబాద్, ఎర్రకోట, గోవా కోట, భువనగిరి కోట వంటి కొన్ని కోట ప్రదేశాలు సాహస పర్యాటకానికి పెట్టింది పేరు. ఈ కోటల ద్వారా ట్రెక్కింగ్ చేసి తమ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే కోటలపై వెళ్లినప్పుడు సుందరమైన దృశ్యాలను మనసారా పర్యాటకుడు చూడవచ్చు. జైపూర్‌లోని జంతర్ మంతర్ పర్యాటకం ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ అద్భుతమైన కట్టడాలు, కోటలు భారతదేశ పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలపడానికి దోహదపడతాయి.
8. భారతదేశ కోటలకు యునెస్కో గుర్తింపు
భారతదేశంలోని కోటలకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఇందులో భాగంగానే గత సంవత్సరం జూలై 2025 నాటికి భారతదేశ అనేక వారసత్వ ప్రదేశాలకు, చిహ్నాలకు, కొండలకు, అడవులకు, అలాగే భారతదేశంలో ఉన్న కోటలకు “యునెస్కో” ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు లభించింది. పారిస్‌లో జరిగిన 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఛత్రపతి శివాజీ కాలపు 12 మరాఠా కోటలకు అంతర్జాతీయ గుర్తింపు అయిన “యునెస్కో వారసత్వ సంపద” జాబితాలో చేర్చింది. వీటికి ముందు రాజస్థాన్ రాష్ట్రంలోని జంతర్ మంతర్ కోటకు, గుజరాత్‌లోని చంపానేర్ పావగఢ్ కోట ఉద్యానవనానికి, ఎర్రకోటకు, ఆగ్రా కోటకు, ఫతేపూర్ సిక్రి కోటకు, ధోలవీర కోటకు, చిత్తోర్, కుంభల్‌గఢ్, సవాయి మాధోపూర్, ఝాలావర్, జైసల్మేర్ కోటలకు యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును ఇచ్చింది. ఈ కోటలు నాటి సైనిక వ్యూహాలకు, వాటి నిర్మాణ వాస్తు శైలికి, నాటి నిర్మాణ కౌశల్యానికి, వాస్తు శాస్త్రానికి, శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. యునెస్కో గుర్తించిన మహారాష్ట్ర కోటలు శివనేర్ జున్నార్ కోట (పూణే, శివాజీ జన్మస్థలం), రాయగఢ్ (స్వరాజ్య రాజ్య రాజధాని), రాజ్‌గఢ్ కోట (ఛత్రపతి శివాజీ మొదటి రాజధాని), ప్రతాప్‌గడ్ (మరాఠా వీరుల చారిత్రక విజయానికి ప్రతీక), సింధు దుర్గ్ (జలదుర్గపు వాస్తు శైలి నిర్మాణానికి ప్రతీక), సల్హౌర్, లోహగడ్, జంజీరా గఢ్, ఖండేరి గఢ్, పన్హాలా గఢ్, పార్వతి గఢ్, జింజి కోటలు ఇవి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇతర ముఖ్యమైన కోటలు రాజస్థాన్ కొండ కోటలు (Hill Forts of Rajasthan) – చిత్తోర్‌గఢ్, కుంభల్‌గఢ్, రణతంభోర్, ఘాగ్రౌన్, అంబర్ కోట, జైసల్మేర్ కోట. ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ఢిల్లీలోని ఎర్రకోటకు క్రీ.శ. 2007వ సంవత్సరంలో ఉత్తమ వాస్తు శైలికి, పరిపాలనా భావనలకు, కళా నైపుణ్యానికి గాను గుర్తింపు వచ్చింది. అలాగే ఆగ్రా కోట మొఘల్ వాస్తు, శిల్పకళ, చిత్రకళా నైపుణ్యానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ కోటలు భారతదేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదకు, రక్షణ రంగానికి సంబంధించిన వ్యూహాలకు, ఉన్నతమైన వాస్తు, శిల్పకళా శైలికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుకు నిదర్శనం. మన దేశ కోటలు, దుర్గాలు ఘన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి.
ఉపసంహారం
- భారత చరిత్రలో పూర్వ యుగం నుంచి ఆధునిక కాలం వరకు అనేక కోటలు, దుర్గాలు, గడులు నిర్మించారు.
- ప్రాచీన కాలపు గిరివజ్రం, రాజగృహం, అనుపు, కోట లింగాల, వరంగల్ మట్టి కోట, భువనగిరి, వరంగల్, గాంధారి ఖిల్లా శిలా కోటలు, సింధు దుర్గ్ లాంటి జలదుర్గాలు, పాటలీపుత్ర, కనిష్క పుర లాంటి కోటలకు రక్షణ ప్రాకార గోడను కర్రతో నిర్మించారు.
- మధ్యయుగ కోటలు భటిండా, అంబర్, చంద్రగిరి, చిత్ర దుర్గ్, ఎర్రకోట, గ్వాలియర్, గోల్కొండ, అనేక ఇతర దుర్గాలు అంతర్గతంగా పటిష్టమైన రక్షణ ప్రాకార గోడలు, రక్షణ కవచాలను నిర్మించుకుని పాలించారు.
- కొన్ని కోటలలో లోపల దేవాలయాలను కూడా నిర్మించుకున్నారు. ఉదాహరణకు త్రివేండ్రం, పూరి, కాంచీపురం వంటి కోటల మధ్యలో సాంస్కృతిక సంబంధమైన దేవి, దేవతలకు దేవాలయాలను నిర్మించుకొని పూజించారు.
- బలమైన గోడలు, ప్రాకారాలు కలిగిన నిర్మాణాలు, విశాలమైన సింహ ద్వారాలు గల ఆధునిక యుగానికి ముందు కాలపు నగరాలు ఈ కోటలతో ముడిపడి అభివృద్ధి చెందాయి. వీటిలో ప్రధానంగా ఆగ్రా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలను ప్రపంచ వారసత్వ సంపదలో ముఖ్యమైనవిగా భావిస్తున్నారు.
- భారతదేశంలో ఉన్న అనేక కోటలను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. జైపూర్, రాయగఢ్ లాంటివి ప్రధానమైనవి. ఇక్కడ పేర్కొన్న కోటలే కాకుండా, భారతదేశం అంతటా అనేక వందల కోటలు నిర్మించబడి ఉన్నాయి. మొత్తానికి భారతదేశ కోటలు, దుర్గాల విషయంలో భారతదేశానికి గల సమున్నతమైన, వైవిధ్యభరితమైన వారసత్వ సంపద మనందరికీ ఒక గర్వకారణం.
- భారతదేశంలోని కోటలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కావు; అవి మన దేశ శతాబ్దాల నాటి చారిత్రక వైభవానికి, శౌర్యానికి ప్రతీకలు, అద్భుతమైన వాస్తు శిల్పకళతో నిర్మించబడిన సజీవ సాక్షాలు.
- ప్రతి కోటకు ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. ఈ కోటలు అలనాటి రాజుల సైనిక వ్యవహారాలకు, శిక్షణకు, రక్షణ వ్యవస్థకు, అలాగే వారి కాలపు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులకు, శిల్పకళ, చిత్రకళ కేంద్రాలుగా ప్రతిబింబిస్తున్నాయి.
- ప్రాచీన భారత కోటల వాస్తు పూర్తి భారతీయ వాస్తు నిర్మాణాలు.
- జైపూర్‌లోని జంతర్ మంతర్ ఖగోళ వేదశాలను సవాయ్ రాజ జైసింగ్ II నిర్మించాడు. రాజ జైసింగ్ దూరదృష్టికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఇది నిదర్శనం.
- జంతర్ మంతర్ కోట సూర్య గమన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించారు.
- ఢిల్లీ సుల్తానులు, దక్కన్ సుల్తానులు, మొఘల్ కాలపు కోటల వాస్తు నిర్మాణాలు ఇండో-పర్షియన్ శైలిలో జరిగాయి.
- ఆధునిక కాలంలో పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్ కోట నిర్మాణాల వాస్తు ఇండో-యూరోపియన్ శైలి నిర్మాణాలు.
- భారతదేశంలోని కోటలు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. ఎర్రకోట, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రి, మైసూర్ కోట వంటి అనేక కట్టడాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ ఉన్నాయి. ఈ సాంస్కృతిక వారసత్వ సంపదను, కోటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- నేడు ఎన్నో కోటలు శిథిలావస్థకు చేరుకుని ఉన్నాయి. ఈ కోటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ప్రజలపై ఉంది. ఈ కోటల వారసత్వ సంపదను, సంస్కృతిని రాబోయే భావితరాలకు వీటి గొప్పతనం గురించి తెలియాలంటే వీటిని సంరక్షించుకోవాలి.
- గొప్ప చారిత్రక, వారసత్వ సంపదను కాపాడడానికి భారత పురావస్తు శాఖ, ప్రజలు కలిసి వీటిని సంరక్షించుకోవాలి. ఇది వారి బాధ్యత కూడా.
- చారిత్రక నిర్మాణాలైన ఈ కోటలు భారతీయ ఆత్మకు ప్రతీకలు. వీటిని కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని, ఘనమైన గత చరిత్రను గౌరవించుకోవడమే అవుతుంది.
- శిథిలావస్థకు చేరిన కోటలను ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందినవారు ఉమ్మడిగా అభివృద్ధి చేసి, కాపాడి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు.
- కోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పర్యాటక అభివృద్ధి వల్ల స్థానికులకు ఉపాధి కలగడమే కాకుండా, జాతీయ ఆదాయం, ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
- భారతదేశంలోని కోటలు దేశ చరిత్ర, సంస్కృతి, సైనిక వ్యూహాలకు నిలువెత్తు సాక్ష్యాలు.
- ఈ కోటలు పూర్వకాలపు ఇంజనీరింగ్, వాస్తుశిల్ప నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
- కాలంతో పాటు వివిధ పాలకుల ప్రభావంతో కోటల నిర్మాణ శైలిలో మార్పులు వచ్చాయి. ఇది ఇండో-పర్షియన్, ఇండో-యూరోపియన్ శైలుల సమ్మిళితానికి దారితీసింది.
- యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తించడం ద్వారా ఈ కోటల ప్రాముఖ్యత ప్రపంచానికి చాటిచెప్పబడింది.
- పర్యాటకం ద్వారా ఈ కోటలను సంరక్షించవచ్చు, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందించవచ్చు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.
- కోటల పరిరక్షణ మన చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక గుర్తింపును భావితరాలకు అందించడం ద్వారా జాతీయ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది.
సూచికలు:
- Yojana Special Issue; A Development Monthly, June 2024 p 8-12 and p61-70.
- Toy Sidney; Stronghold of India. First Edition 1957. Williams Heinengann L.T.D. 99 Great Russell Street London. Printed in Great Britain by Butler and Janner L. M. D. London.
- MCRHRD Institute of Telangana. Medieval Forts.
- Diwan. H. D. Research in Nine Ancient Hindu Forts of India (Geoheritage, Histo-Archeology, Architecture and Defense Studies) Ghaad Series. Vol-I. 2023. Publisher Aditi Publications, Raipur, chattisgadh.
- Masahiko Mita- A Focus on Indian Fort History., Project Insights; Japan Science for the Promotion of Science. (JSPS), KAKENHI. Nagoya University.
- Martin Hurliman; Delhi, Agra, Fatehpur Sikri., 1965., Thames and Hudson-London.
- Amrit Verma., Forts of India-1985. Published by The Director Publications Division Ministry of Information and Broadcasting Government of India Patiala House New Delhi.
- Frank Penny., Fort St. George Madras. A Shot History of Our First Possession India-1900., London Swan Sonnenchein and Co. L.M.D.
- Ramrao Namdev Bansode and Kalpana Chaturvedi., History of the Origin and Development of the Concept of Fort and Fortifications., International Advance Journal of Engineering Science and Management (IAJEEM) July-December. 2023.Vol-20 Issued.
- Herman Kulke and Dietmar Rothermund., A History of India., 3rd Edition -1998., Rout Ledge Toylar and Francis Group., London &New.
ఉపయుక్త గ్రంథసూచి
- Yojana Special Issue; A Development Monthly, June 2024 p 8-12 and p61-70.
- Toy Sidney; Stronghold of India. First Edition 1957. Williams Heinengann L.T.D. 99 Great Russell Street London. Printed in Great Britain by Butler and Janner L. M. D. London.
- MCRHRD Institute of Telangana. Medieval Forts.
- Diwan. H. D. Research in Nine Ancient Hindu Forts of India (Geoheritage, Histo-Archeology, Architecture and Defense Studies) Ghaad Series. Vol-I. 2023. Publisher Aditi Publications, Raipur, chattisgadh.
- Masahiko Mita- A Focus on Indian Fort History., Project Insights; Japan Science for the Promotion of Science. (JSPS), KAKENHI. Nagoya University.
- Martin Hurliman; Delhi, Agra, Fatehpur Sikri., 1965., Thames and Hudson-London.
- Amrit Verma., Forts of India-1985. Published by The Director Publications Division Ministry of Information and Broadcasting Government of India Patiala House New Delhi.
- Frank Penny., Fort St. George Madras. A Shot History of Our First Possession India-1900., London Swan Sonnenchein and Co. L.M.D.
- Ramrao Namdev Bansode and Kalpana Chaturvedi., History of the Origin and Development of the Concept of Fort and Fortifications., International Advance Journal of Engineering Science and Management (IAJEEM) July-December. 2023.Vol-20 Issued.
- Herman Kulke and Dietmar Rothermund., A History of India., 3rd Edition -1998., Rout Ledge Toylar and Francis Group., London &New York.
- Remay S.K., Fortifications Through Time: Exploring Kerala’s Defensive Heritage., Heritage Journal of Multi-Disciplinary Studies in Archaeology 11.1(2023-24).
- Hemani Singh., Recovering Delhi’s Red Fort Present of Past in the Present-2010.Faculty of Architecture, Building and Planning, Technology University. Eindhoven.
- Ansuya Kumar Singh, Abhishek Maji and Ajay Kumar Sharma., Hill Fort of Rajasthan. MCRHRD Institute of Training Center, Hyderabad.
- Guthrie MRS., My Year An Indian Fort in Two., Vol-I and Vol-II., 1877. London Hurst and Blackitt Publishers 18 Great Mari Borough Street-London.
- యోజన, సంచిక 10 ఆగస్టు 1999.తెలుగు భాషా హైదరాబాద్.
- హనుమంతరావు బి. యస్. ఎల్., భారతీయ సంస్కృతి ఒక పరిశీలన., 1994., కళ జ్యోతి ప్రెస్ లిమిటెడ్. ఇఫ్టేకార్ మార్షల్ రోడ్, ఆర్. టీ. సి. క్రాస్ రోడ్ హైదరాబాద్.
- Vivek Abhayankar., The Indian Fort a Structural Engineering Marvel-NBM&CW. March 2022.
- Sujith T. S and Jisha M. K., Tourism in India:Opportunities and Challenges.
- The Travels of Dean Mahomet an Eighteenth Century Journey Through the India., University of California Press, Berkeley Los Angels London., 1997., The Regent of the University of California.
- నమస్తే తెలంగాణా, నిపున 7 మే 2023., శీర్షిక ‘సెలవుల వేళ చోసోద్దాం’.
- Burton. J., A Study of Fortification in the Indian subcontinent from the Thirteenth to the Eighteenth-Century AD. Bulletin of the School of Oriental and African Studies. University of London, Vol-23.no.3. (1960) pp. 508-522.
- Awasthi A.D.., A Study of Forts and Fortification From 7th Century AD to 18th Century AD with Special Reference to Madhya Pradesh.
- Rambharos Agarwal., Garha Mandla ke Gond Raja., Gondi Public Trust, Mandla. (MP).
- Koushik Roy,.Military Transition in Early Modern Asia 1400-1750 AD., Bloomsbury Publications.
- Ali Athar., Siege Craft Techniques of the Delhi Sultans During 13th-14th Century. Proceedings of the Indian History Congress. Vol-51 (1990). pp. 217-226.
- The Military Engineering in India E. W. C. Sandesh. Vol-I., Institution of Royal Engineering's., Chatam.
- Koushik Roy.,2015., Warfare in India:Pre-British India 1500 BCE to 1740 CE.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



