AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. బాలవ్యాకరణంలో కారక విధానం: పరిశీలన
డా. పులపర్తి శ్రీనివాసరావు
అతిథి అధ్యాపకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం
విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 8309742248, Email: telugu.bujji@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 02.04.2026 ఎంపిక (D.O.A): 15.04.2026 ప్రచురణ (D.O.P): 01.05.2026
వ్యాససంగ్రహం:
ఆధునిక కాలంలో పరమ ప్రామాణికమైన వ్యాకరణంగా దేన్నైనా అంగీకరిస్తున్నారు అంటే అది ఒక్క ‘బాలవ్యాకరణం’ మాత్రమే. గారడీ వాడిలాగ హఠాత్తుగా ఆకాశం నుండి ఊడిపడ్డది కాదు. దానికి ముందు ఎంతో కృషి ఉంది. పరిణత రూపమైన రచనగా బాలవ్యాకరణాన్ని చెప్పొచ్చు. సూరి ఆ పరిణత రూపకృతి సంతరించటంలో ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొన్నారు. అవే ఆయనన పూర్వరచనలు` తెలుగు వ్యాకరణ రచన. అలాంటి వ్యాకరణం రాసిన చిన్నయసూరి ఎంతో ప్రతిభావంతుడు, పండితుడు. ఎన్నో ప్రయోగాలకు ఈ వ్యాకరణం ఎంతగానో సరిపడుతుంది. అలాంటి వ్యాకరణంలో పదిపరిచ్ఛేదాల్లో అనేక ప్రయోగాలను సాధించడానికి కావలసిన సూత్రాలను ఒక నియమబద్ధంగా, గొప్ప నిర్మాణచాతుర్యంతో కూర్చడం అనేది చాలా గొప్ప విషయం. ఈ వ్యాకరణలో కారకపరిచ్ఛేదం ఒకటి. ఈ పరిచ్ఛేదంలో ఆరు రకాల కారకాలను గురించి వివరించబడింది. ఈ కారకాలలో ఏయే విభక్తులు చేరుతాయో, ఒక్కొక్క సమయాల్లో ఒక విభక్తికి రావలసి ఉండగా దాని స్థానంలో ఏ ఇతర విభక్తులు ఉపయుక్తమో ఈ విభాగం ద్వారా వ్యాకరణకారులు కూడా వివరించారు. దీనినే విభక్త్యర్థక పరిచ్ఛేదమని కూడా అంటారు. నన్నయ ‘ఆంధ్ర శబ్ద చింతామణి’, పుదూరి సీతారామాచార్యుల ‘ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము’, వేదం వేంకటరాయశాస్త్రి ‘లఘువ్యాకరణం’ వంటి వ్యాకరణాల్లో కారకాల గురించి ప్రస్తావన ఉంది. అలాగే పూర్వగ్రంథ పరిశీలనలో భాగంగా ‘బాలవ్యాకరణానికి వచ్చిన సమీపకాలిక వ్యాకరణాలు’ అనే అంశంపై ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో జరిగిన పరిశోధనలో కొంత ఈ అంశం గురించిన ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ కోణంలో కారకపరిచ్ఛేదంలో కారక విధానం ఎలా చెప్పబడిందో ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. అంతేకాకుండా, వివిధ సమకాలీన వ్యాకరణాల్లో ఉన్న విశేషాలను పరిశీలించడం ప్రధాన ఉద్ధేశ్యంగా ఈ వ్యాసం సాగుతుంది.
Keywords: విశేషణాలు, విభక్తులు, సంప్రదానం, అధికరణం, అపాదానం, వ్యాపారాశ్రయము, ఫలాశ్రయము, ధాతువు, ఉక్తార్థం, బహుళము.
1. ఉపోద్ఘాతం
చిన్నయ సూరి రచించిన బాలవ్యాకరణంలోని కారక పరిచ్ఛేదం, ఒక వాక్యంలో క్రియకు కారకాలకు మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తుంది. ఇది విభక్తులను వాటి వాడకాన్ని వివరిస్తుంది. నామవాచకాలు కర్త, కర్మ, సాధనం వంటి రూపాల్లో ఎలా పని చేస్తాయి, విభక్తి ప్రత్యయాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది విశ్లేషిస్తుంది. విశేషణాలు తాము సవరించే నామవాచకం లింగం వచనాన్ని ఎలా అనుసరిస్తాయి, విభిన్న విభక్తులు కొన్నిసార్లు ఇతరులకు బదులుగా ఎలా మారగలవు వంటి సంక్లిష్ట అంశాలను ఈ పరిచ్ఛేదం వివరిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రాతిపదిక ఏయే అర్థాల్లో, ఏయే విభక్తులు చేరుతాయో, వాక్యంలో ఉండే పదాల పరస్పర సంబంధం ఎటువంటిదో కారక ప్రకరణంలో చెప్పబడింది.
సంస్కృతంలో కారక ప్రకరణం చాలా క్లిష్టంగా ఉంటుంది. "సర్వేభగ్నా కారక ప్రత్యయాంతే" అనేది ఒక ఆర్యోక్తి. సంస్కృతంలో కారక ప్రకరణానికి 'విభక్త్యర్థ ప్రకరణం' అని వ్యవహారం ఉంది. వాక్యంలో విభిన్న పదాల క్రియతో అన్వయాన్ని కలిగిస్తుంది. లేదా క్రియాన్వయం కలది కాబట్టి 'కారకం' అనే వ్యవహార నామం కలిగి ఉంది. బాలవ్యాకరణంలో చిన్నయసూరి ఆరు రకాలైన కారకాల గురించి వివరించాడు.
'క్రియాన్వయతీతి కారకం' అంటే క్రియతో అన్వయం కలిగినది 'కారకం' అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రియాన్వయం కలిగించేది 'కారకం'.
విభక్తులు శబ్దాలకు చివర చేరుతాయి. అలా చేరి ఆయా శబ్దాలకు కర్తృ, కర్మ వంటి అర్థాల్లో క్రియాన్వయాన్ని కలిగిస్తాయి.
సీతారామాచార్యులు (కారక.1) "కారకంబులనం గర్మాదులు" అని ప్రౌఢవ్యాకర్త సూత్రీకరించి, కర్త, కర్మము, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము అనే ఆరు కారకాలని తెలియజేశాడు.
కారకం అత్యంత ప్రధానమైనదని క్రియా ప్రధానమైన సంస్కృత భాషను పరిశీలిస్తే అర్థం అవుతుంది. వాక్యరచనకు కారక జ్ఞానమే జీవమంటారు. కావుననే సంస్కృత భాషలో కారక వివరణ కోసం అనేక గ్రంథాలు వెలువడినట్లు ఆ భాషా వ్యాకరణ వాఙ్మయాన్ని బట్టి తెలుస్తుంది. అయితే తెలుగులో ఇంతటి విస్తృతమైన కారక ప్రణాళిక లేదు. అయినప్పటికీ, తెలుగును ‘వికృతి’ అనడం వల్ల "ప్రకృతి వద్వికృతిః" అనే న్యాయాన్ని అనుసరించి, సంస్కృతంలోని అనుసరణ తెలుగులోనూ కనిపిస్తుంది.
1.1. పూర్వ వ్యాకరణకారుల అభిప్రాయాలు
నన్నయ, ప్రథమాచార్యుడు (హలన్త.15) "సర్వ విభక్తి స్సంస్కృతతుల్యా" అని ఆంధ్రశబ్ద చింతామణిలో ఆదేశించడం గమనించవచ్చు. ఇలా ఆదేశించినప్పటికీ, ఏయే విభక్తులు ఏయే అర్థాల్లో ఉపయుక్తాలు అవుతాయో తెలుపలేదు. బహుశా తెలుగులో కారకాలను సంస్కృత కారక విధానాన్ని అనుసరించి ఏర్పరచాలనేది ఈయన ఉద్దేశం అయి ఉండవచ్చు.
వికృతి వివేక కర్త, ద్వితీయాచార్యుడు అథర్వణాచార్యుడు అజన్త ప్రకరణంలో ఈ విధంగా తెలియజేశాడు:
‘’శబ్దాయేచ సముత్పన్నా ఆద్యాయామత్రతే ఖిలాః
కధితా వైకృతైశ్మబ్దెర్భవంతి సదనుగ్రహాత” (ఆచార్యుడు, అజన్త.17)
ఈ శ్లోకాన్ని గమనిస్తే, సంస్కృతంలో ఉపయుక్తమైన అన్ని శబ్దాలను అనుసరించి తెలుగులో దానికి సమానమైన శబ్ద ప్రయోగాలను విద్వదనుగ్రహం వలన కావించాలనేది ఈయన అభిప్రాయంగా గ్రహించవచ్చు.
బాలవ్యాకరణానికి అటు ఇటుగా వచ్చిన వ్యాకరణాలను పరిశీలిస్తే, శాస్త్రి (1819) తన తెనుగు వ్యాకరణములో ప్రత్యేకించి కారక ప్రకరణాన్ని ఎక్కడా వివరించలేదు. కానీ ఈ వ్యాకరణంలో విశేష్యప్రకరణంలలో 'దేశశబ్దములు విభక్తులు' అనే శీర్షికలో కొంతవరకు కారకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు.
లఘువ్యాకరణం రాసిన వేంకటరమణశాస్త్రి కారకాల వివరణ కోసం ప్రత్యేకించి 'విభక్త్యర్థ ప్రకరణం' అనే దాన్ని ఏర్పరచి సవివరంగా విశ్లేషించి, "విభక్త్యర్థ ప్రకరణమనగా బ్రథమ మొదలగు విభక్తులయర్థమును, వాని లక్ష్యములను వివరించునట్టిది" (వేంకటరమణశాస్త్రి, 38) అని ప్రథమ మొదలుకొని సప్తమి వరకు ఉన్న విభక్తుల అర్థాలు ఏయే వాటికి చేరుతాయో తెలిపారు.
పుదూరి సీతారామాశాస్త్రి ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణంలో గాని, పట్టాభిరామశాస్త్రి 'పట్టాభిరామ పండితీయం'లో గాని కారక పరిచ్ఛేదాన్ని వివరించలేదని గమనించాలి.
2. కారకాలు, వాటి రకాలు, విశ్లేషణ
వ్యాకరణాలను పరిశీలిస్తే, కారకాలు మొత్తం ఆరు విధాలని తెలుస్తుంది. వాటిని ఒక్కొక్కటిగా సవివరంగా, క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఒక్కొక్క కారకాన్ని బాలవ్యాకరణంలో ఎలా వివరించారు? ఏవిధంగా లక్ష్యలక్షణ సమన్వయం చేయబడింది? ఇతర వ్యాకర్తల అభిప్రాయాలు ఇందులో విశ్లేషించబడింది.
2.1. కర్మ కారకం
'ఫలాశ్రయః కర్మః' (కౌండభట్ట) అని నిర్వచనం. నిజానికి క్రియతో సూటిగా సంబంధం కలిగి ఉండటం వల్ల అన్ని కారకాల కన్నా కర్తృకారకానికే కారకమనే సంజ్ఞ పూర్తిగా అన్వయిస్తుంది. మిగిలిన కారకాలన్నీ కర్తృత్వానికి సంబంధించిన సహాయాంశాలే. కాబట్టి కర్తృకారకమే స్వతంత్రమైనది. మిగిలిన కారకాలు పరతంత్రాలు.
పాణిని "అనభిహితే" (పాణిని, 2-3-1), "కర్మణి ద్వితీయా" (పాణిని, 2-3-2) అని అష్టాధ్యాయిలో పేర్కొన్నారు. అనగా తిఙ్గదుల చేత అనుక్తమైన కర్మను బోధించే ప్రతిపదికకు ద్వితీయా విభక్తి వస్తుందని ఈ సూత్రార్థం. అయితే నన్నయ (అజన్త.1) తన ఆంధ్రశబ్ద చింతామణిలో "కూర్చి, ల, ను, న యోభవే ద్ద్వితీయాతు" అని పేర్కొన్నాడు. అంటే ఈయన ని, ను, ల, కూర్చి అనేవి ద్వితీయా విభక్తులుగా నిర్ణయించాడనేది స్పష్టం. అయితే దీనికి ఉదాహరణలుగా చోళునింజేకొని, భీమరాజును, విధాత్రుంగానబోయిన (ఏనుగు లక్ష్మణ కవి, 24) వంటి ప్రయోగాలను చూపారు.
ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణంలో కర్మార్థంలో ద్వితీయ వస్తుందని తెలిపి, సీతారామాశాస్త్రి (49) "కూర్చి ద్వితీయయే యర్థమునందు వచ్చును?" అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ, కర్మ ప్రవచనీయార్థమునందు వచ్చును. దానికి:
జపముం గూర్చి వర్షించెను
అని పేర్కొన్నారు. అంతే కాకుండా, జడవాచకాల మీద తృతీయార్థంలో కూడా ద్వితీయ వస్తుందన్న విషయాన్ని తెలుపుతూ, ‘హేతిని (చేత) నరికెను’ అనే ఉదాహరణ చూపడం గమనించవచ్చు. ఇంతే కాకుండా, సప్తమ్యర్థంలో కూడా ద్వితీయ వస్తుందని 'ద్వారకనున్నవాడు' అనే ఉదాహరణ ఇచ్చాడు.
చిన్నయ సూరి "కర్మంబున ద్వితీయ యగు" (సూరి, కారక.2) అనే సూత్రంలో దీని గురించి ప్రస్తావించారు. 'ధాత్వర్థ ఫలాశ్రయంబు కర్మంబు నాబడు' అని వివరణ ఇచ్చాడు. ధాతువు అర్థం ధాత్వర్థం. ధాత్వర్థం ఫలం ధాత్వర్థ ఫలం. దానికి ఆశ్రయమైనది కర్మ. కర్మ అంటే ధాత్వర్థ ఫలాశ్రయం. ధాతువు అంటే క్రియ మూలరూపం.
ఉదాహరణకు, దేవదత్తుడు వంటకమును వండెను అనే వాక్యంలో 'వండెను' అన్నది క్రియాపదం. 'వండు' అన్నది ధాతువు. సాధారణంగా ధాతువుకు ఫలం, వ్యాపారం అనే రెండు అర్థాలు ఉంటాయి. వండు అనే ధాతువు ఫలం వంటకం. అంటే దేవదత్తుడు వండడానికి ఉపక్రమించి పూర్తిచేయగా ఫలంగా లభించింది వంటకం. ధాతువుకు గల ఫలం, వ్యాపారం అనే రెండర్థాల్లో ఫలాన్ని ఆశ్రయించి ఉన్నది కర్మ అనిపించుకుంటుంది.
సూరి (కారక.2) "ధాత్వర్థ ఫలాశ్రయంబు కర్మము నాంబడు" అని నిర్వచనం ఇచ్చాడు. సూరి చెప్పిన రీతిని "కర్మంబున ద్వితీయ యగు" (సూరి, కారక.2) అనే వృత్తి ప్రకారం 'వంటకమును' అని ద్వితీయా విభక్తి చేరింది. ఈ విధంగా కర్మ కారకానికి ద్వితీయా విభక్తి చేరుతుంది.
ఒకవేళ ఆ కర్మ వాచకం ఉక్తార్థంలో గాని ఉంటే "ప్రాతిపదిక సంభోదనోకార్థంబులం బ్రథమ యగు" (సూరి, కారక.1) అనే సూరి సూత్రం ప్రకారం వు ప్రథమా విభక్తికి చేరుతుంది. ఆ వాక్యం కర్త్రర్థకము అవుతుంది.
ఉదాహరణకు, 'రామునిచే రావణుడు సంహరింపబడియె' అనే ప్రయోగాన్ని ఉదహరించడం గమనించదగ్గ విషయం.
2.2. కర్తృ కారకం
'ధాత్వర్థ వ్యాపారాశ్రయః కర్తా' (కౌండభట్ట) అని వ్యుత్పత్తి. అలాగే పాణిని (2-3-18) "కర్తృకరణయోస్తృతీయా" అని అష్టాధ్యాయిలో పేర్కొన్నాడు. దీన్ని బట్టి తిఙాదుల చేత అనుక్తమయిన కర్తను గాని, కరణాన్ని గాని బోధించే ప్రాతిపదికకు తృతీయా విభక్తి వస్తుందని గ్రహించాలి.
పాణిని (1-4-42) "సాధకతమమ్ కరణమ" అనే నిర్వచనాన్ని బట్టి వ్యాపార నిర్వహణలో కర్తకు తోడ్పడే సాధకానికి కరణమని తెలుస్తుంది. సూరి 'ధాత్వర్థ వ్యాపారాశ్రయంబు కర్తనాబడు' అని కర్త అంటే వివరించి, 'చేత వర్ణకంబు కర్తకగు' (సూరి, కారక.3) అని కర్తృవాచకానికి 'చేత' అనే ప్రత్యయాన్ని విధించాడు. ధాతువుకు అర్థాలు రెండు: 1. ఫలము, 2. వ్యాపారము. దీనిలో వ్యాపారాశ్రయము కర్త.
నన్నయ (అజన్త.6) "టాసశ్చేతః" అని, (అజన్త.7) "తోడసహార్థేటాసః" అనే తృతీయార్థ విభక్తులను తెలిపాడు. అలాగే (అజన్త.1) 'తో, చేత, తోడ, చే, చ తృతీయాః' అని తృతీయార్థంలో వచ్చే విభక్తులను తెలియజేశాడు. అయితే, ఇలాంటి తృతీయ విభక్తులు ఏ అర్థంలో వస్తాయో తెలుపుతూ సూరి, కొంత అనుసరణగా "చేత వర్ణకంబు కర్తకగు" (సూరి, కారక.3) అనే సూత్రంలో ప్రస్తావించాడు. అంటే కర్తను బోధించు శబ్దమునకు 'చేత' ప్రత్యయం అవుతుందని వివరణ. ధాతువు అర్థాలలో రెండోదైన వ్యాపారాన్ని ఆశ్రయించిన దానికి కర్త అనే సంజ్ఞ కలుగుతుంది అని అర్థం.
"ధాత్వర్థ వ్యాపారాశ్రయ కర్తా" సంస్కృత వ్యాకర్తల నిర్వచనం. కర్మార్థంలో చేత వర్ణకం కర్తకు రావడాన్ని "దేవదత్తుని చేత వంటకము వండుబడియె" అనే వాక్యంతో సూరి నిరూపించాడు. 'వండడం' అనే వ్యాపారం దేవదత్తుని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి దేవదత్త అనే ప్రాతిపదికకు కర్తృసంజ్ఞ కలిగింది. కర్తకు తృతీయా విభక్తికి చెందిన 'చేత' అనే విభక్తి చేరుతుంది. కాబట్టి 'దేవదత్తుని చేత' అనే రూపం ఏర్పడింది. ఈ విధంగా 'చేత' అనే విభక్తి ప్రత్యయాన్ని విధించే కారకం కర్తృకారకం అనిపించుకుంటుందని సూరి వివరణగా అర్థమవుతుంది. అయితే పాణిని (2-3-18) "కర్తృకరణయోస్తృతీయా" అని ఉన్నప్పటికీ, కర్తృపదాన్ని ఇలా అన్యపదంతో కలపడం తెలుగుభాషా స్వభావానికి పూర్తిగా సరిపడదు. కావుననే కర్తకు 'చేత' రావడానికి సూరి ఒక సూత్రాన్ని రచించాడు.
తరువాత సూత్రంలో సూరి (కారక.4) "చేత వర్ణకంబు హేతుకరణంబులకు గ్రహ్యాది యోగజంబగు పంచమికిని బహుళంబుగా నగు" అని పేర్కొని, 'ఖడ్గంబు చేత ఖండించె' అనే ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఇక్కడ హేతు కరణాలకు, గ్రహ్యాది యోగజమైన పంచమికి 'చేత' వర్ణకం బహుళంగా వస్తుందని అర్థం.
2.3. కరణ కారకం
పాణిని (2-3-18) "కర్తృకరణయోస్తృయా", (2-3-19) "సహయుక్తే 2ప్రధానే", (2-3-76) "తుల్యార్థెరతులోపమాభ్యాం తృతీయాన్య తరస్యామ" అనే సూత్రాలతో పాటు, నన్నయ (అజన్త.7) ఆంధ్రశబ్ద చింతామణిలో చెప్పబడిన "తోడ సహార్థేటాసః" సూత్రాన్ని అనుసరించి చిన్నయసూరి "కరణ సహార్థ తుల్యార్థ యోగంబులం దృతీయకుం దోడ వర్ణకంబగు" (సూరి, కారక.5) అని సూత్రీకరించాడు.
'తోడ, తో' అనే విభక్తులను గురించి వేదం వారు, చిన్నయసూరి ఒకేలా సూత్రించారు. అయితే లఘువ్యాకర్త అయిన వేదం వారు మాత్రం బాలవ్యాకర్త చెప్పిన "తుల్యార్థ యోగంబున షష్ఠియునగు" (సూరి, కారక.5) అనే విషయాన్ని ప్రస్తావించలేదనే విషయం గమనించదగ్గది.
ఇదే క్రమంలో బాలవ్యాకర్త సూరి "వచ్యర్థాముఖ్యకర్మంబునకుఁ దోడఁ కువర్ణకంబులు ప్రాయికంబుగా నగు" (సూరి, కారక. 6) అని సూత్రీకరించి, ఆ సూత్రం దగ్గర "ప్రాయికంబనుటచే నొకానొకచో ద్వితీయయునగు" అనే వృత్తినిచ్చాడు.
దీని ప్రకారం, 'మైత్రుండు చైత్రుని తోడ నిట్లనియె' అని వ్యవహారంలో తృతీయయే విశేషంగా ఉపయోగించడం గమనించదగ్గ విశేషం.
తరువాత పాణిని (1-4-29) "ఆఖ్యాతోపయోగే" అనే సూత్రాన్ని అనుసరించి సూరి "ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడ వర్ణకంబగు" (సూరి, కారక.7) అనే సూత్రాన్ని తెలిపాడు. అంతేకాకుండా 'నియమపూర్వక విద్యా స్వీకారం బుపయోగం బనంబడు' అనే వృత్తిని వివరణగా ఇవ్వడం గమనించవచ్చు.
సూరి సూత్ర విశేషాలు పరిశీలిస్తే, 'క్రియా సిద్ధిం బ్రకృష్టోపకారంబు కరణంబు' (సూరి, కారక.4) అనే నిర్వచనాన్ని సూరి సిద్ధాంత కౌముదిలోని 'క్రియాసిద్ధౌ బ్రకృష్టోపకారకం కరణ సంజ్ఞం స్యాత్' అనే దాని నుండి గ్రహించాడు. క్రియా సిద్ధిలో మిక్కిలి ఉపకరించిన సాధనం 'కరణం' అని అర్థం.
వ్యాపారం సిద్ధించడంలో ఎక్కువగా ఉపకరించే సాధనానికి కరణం అని వ్యాకరణ శాస్త్ర వ్యవహారం. కరణ సంజ్ఞ కలిగిన దానికి తృతీయా విభక్తికి చెందిన 'చేత' గాని 'తోడ' గాని చేరుతుందని సూరి ఇలా సూత్రించాడు:
"కరణ సహార్ధ తుల్యార్ధ యోగంబులం దృతీయకుం దోడ వర్ణకంబగు" (సూరి, కారక.5)
ఉదాహరణకు, కోలతోడఁ గూలనేసె. కూలనేయడంలో ఎక్కువ ప్రధానంగా ఉపకరించిన సాధనం 'కోల'. కాబట్టి దానికి కరణ సంజ్ఞ తృతీయా ప్రత్యయమైన 'తోడ' ప్రత్యయం చేరగా 'కోలతోడ' అనే రూపం సిద్ధించింది. ఈ విధంగా కరణ కారకానికి తృతీయా విభక్తిలోని తోడ అనేది చేరుతుందని గమనించాలి.
2.4. సంప్రదాన కారకం
పాణిని (2-3-13) "చతుర్థీ సంప్రదానే" అని తెలిపిన నిర్వచనం. సంప్రదానంలో చతుర్థి ప్రత్యయం వస్తుందని దీని అర్థం. అలాగే 'దానస్య కర్మణా యమభిప్రైతి స సంప్రదానమ' అని సిద్ధాంతకౌముది నిర్వచనం. అంటే, త్యాగము ఎవరికి చేయనుద్దేశింతుమో ఆ వ్యక్తి సంప్రదానము అనబడుతుంది. ఇదే తరహాలో వేంకటరమణశాస్త్రి లఘువ్యాకరణంలో "చతుర్థీ విభక్తి సంప్రదానంబునందగు" అని నిర్వచించి:
"సంప్రదానంబునఁదన వ్యాపారముచేత సంబంధించుటకుఁకోరఁబడు పదార్థము" (వేంకటరమణశాస్త్రి, 40)
అని సూత్రీకరించారు. దీనికి 'వరుని కొఱకు గన్యకనిచ్చే' వంటి లక్ష్యాలతో నిరూపించారు. ఇలా బాలవ్యాకరణానికి అటు ఇటుగా వచ్చిన వ్యాకరణాలలో చతుర్థీ అనేది సంప్రదానానికి వస్తుందనేది స్పష్టమైన విషయం. అయితే ప్రథమాచార్యుడు నన్నయ (అజన్త.1) "కొఱకు, కై(కయి) చతుర్థ్యాఃస్తః" అని ఆంధ్రశబ్ద చింతామణిలో చతుర్థీ విభక్తి ప్రత్యయాల గురించి తెలియజేశాడు. ఈ విధంగానే సూరి (తత్సమ.4) "కొఱకు, కయి`చతుర్థి" అని చతుర్థీ విభక్తి ప్రత్యయాల గురించి తెలిపాడు. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం, సూరి పూర్వ వ్యాకర్తలు 'కై' అని తెలిపితే, వారికి భిన్నంగా 'కయి' అని తెలియజేశాడు. 'కై' అని తెలిపిన వారిలో శాస్త్రి (29) తెనుగు వ్యాకరణము రాసిన రావిపాటి గురుమూర్తి, సీతారామాశాస్త్రి (49) ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం రాసిన పుదూరి వారు ఉన్నారు.
మొత్తానికి సంప్రదానమునకు చతుర్థి అవుతుందని గ్రహించవలసిన అంశం. ఈ క్రమంలో బాలవ్యాకరణంలో కారక పరిచ్ఛేదంలో సూరి (కారక.8) "సంప్రదానంబునకుం జతుర్థియగు" అని సూత్రీకరించాడు.
ఏదైనా ఒక వస్తువు ఎవరిని ఉద్దేశింపబడి ఇవ్వబడుతుందో ఆ వ్యక్తికి సంప్రదాన సంజ్ఞ కలుగుతుంది. సూరి (కారక.8) "త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాఁబడు" అని నిర్వచనం ఇచ్చాడు. సంప్రదాన సంజ్ఞ కలదానికి బాలవ్యాకరణం సూత్రం ప్రకారం చతుర్థి విభక్తి ప్రత్యయం చేరుతుంది.
ఉదాహరణకు, "జనకుండు రాముని కొఱకు గన్య నిచ్చెను".
అనే వాక్యంలో కన్యా త్యాగం రాముని ఉద్దేశించి చేయబడింది. కాబట్టి 'రామ' అనే ప్రాతిపదికకు సంప్రదాన సంజ్ఞ, చతుర్థి విభక్తి కలగడం చేత 'రాముని కొఱకు' అని అయింది. 'రాముని కొఱకు' అనేది సంప్రదాన కారకంలో ఉందని గమనించాలి.
చిన్నయసూరి చతుర్థీ విభక్తులను పేర్కొన్నప్పటికీ, ఈ చతుర్థీ విభక్తికి బదులుగా షష్ఠీ విభక్తి పరమవ్వడాన్ని ప్రయోగాల్లో గుర్తించి, సూరి (కారక.8) "చతుర్థికి మాఱుగా షష్ఠియే తఱచుగాఁ బ్రయోగంబులఁగానం బడియెడి" అని సూత్ర వృత్తిగా తెలపడం విశేషంగా చెప్పవచ్చు.
ఈ కోవలో సీతారామాచార్యులు (కారక.9) "చతుర్థికిం బొంటె వర్ణకంబునగు" అని సూత్రీకరించి, 'కార్య సంప్రయోగము పొంటె అని భారత ప్రయోగాన్ని ప్రౌఢవ్యాకరణంలో చూపించారు.
చతుర్థీ విభక్తికి బదులుగా షష్ఠీ విభక్తి పరమవ్వడమే తెలుగు భాషా స్వభావం. అయితే తెలుగులో చతుర్థికి, షష్ఠికి భేదం లేకపోయినా, సంస్కృతంలో మాత్రం ఒకదానికి బదులు ఇంకొకటి ఉపయోగించరాదని నిర్దేశించబడింది.
2.5. అపాదాన కారకం
పాణిని (2-3-13) "అపాదానే పఞ్చమీ", (1-4-23) "ధ్రువమపాయేపాదానమ" అని పంచమీ విభక్తి అనేది అపాదాన వాచకానికి వస్తుందని చెప్పబడింది. దీన్ని ఆధారంగా చేసుకుని నన్నయ (అజన్త.2) ఆంధ్రశబ్ద చింతామణిలో అసలు పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏమిటని తెలిపే ప్రయత్నం చేశాడు: "పట్టి, వలన, కంటె ఇతి పంచమీ". ఈ ప్రత్యయాల్లో 'పట్టి' అనేది క్త్వార్థక రూపంగా పేర్కొన్నాడు. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్యానమైన బాలసరస్వతీయంలో (అజన్త.7) "పట్టీ తి చ పఞ్చమీ గుణే హేతౌ" అని పేర్కొన్నాడు. ఈ సూత్రం కింద ఉదాహరణగా, "గుణముం బట్టి ధన్యుడు" (ఏనుగు లక్ష్మణ కవి, 25) అని తెలిపి, గుణం హేతువైనప్పుడు 'అగు' పంచమికీ 'పట్టి' వస్తుందని వివరించడం గమనించవచ్చు.
పుదూరి సీతారామాశాస్త్రి వికృతి వివేకాన్ని అనుసరించి, అపాదానార్థంలో పంచమీ వస్తుందని తెలియజేసి, 'పట్టి' అనే పంచమీ విభక్తి ప్రత్యయం గుణరూపమైన హేతువును చెప్పే శబ్దం మీద వస్తుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా దీనికి 'జ్ఞానమును బట్టి ముక్తుండు' అనే లక్ష్యాన్ని ఉదాహరణగా చూపించి నిరూపించడం గమనించదగ్గ విషయం.
బాలవ్యాకరణంలో సూరి కారక విశ్లేషణ పరిశీలిస్తే, ఒక వస్తువు దేని నుండి విడిపోవుటను పొందుతుందో దానికి అపాదాన సంజ్ఞ కలుగుతుంది అని వివరించాడు. ఆ అపాదాన సంజ్ఞ కలదానికి బాలవ్యాకరణంలో పంచమీ విభక్తి విధింపబడింది. దానికి 'వలన' వర్ణకం చేరుతుందన్నాడు. అయితే, పాణినీయ సూత్రాలను, వార్తికాలను ఒక మహా సూత్రంలో కూర్చి సూరి (కారక.9) ఒక విశేష రచన చేయడం గమనించదగ్గ విషయం:
"అపాయ భయ జుగుప్సా పరాజయ ప్రమాద గ్రహణ భవన త్రాణ విరామాంతర్థి వారణంబు లెద్దాన నగు దానికి వలన వర్ణకంబగు"
దీని ప్రకారం ఈ సూత్రంలో ప్రస్తావించిన అపాయం, భయం, జుగుప్స, పరాజయం, ప్రమాదం, గ్రహణం, భవనం, త్రాణం, విరామం, అంతర్థి, వారణం అనే వాటికి 'వలన' వర్ణకం వస్తుంది.
- అపాయంబునకు: మైత్రుండు రాజ్యంబు వలన భ్రష్టుండయ్యె
- భయంబునకు: చోరుని వలన భయపడియె
- జుగుప్సకు: పాపంబు వలన నేవగించె
- పరాజయమునకు: అధ్యయనము వలన డస్సె
- ప్రమాదంబునకు: పాడి వలనం పరాకువడియె
- గ్రహణంబునకు: మైత్రుని వలన ధనంబు గొనియె
- భవనంబునకు: మనువు వలనం ప్రజలు పుట్టిరి
- త్రాణంబునకు: చోరుని వలనం గాచె
- విరామంబునకు: భోగంబుల వలన విరమించె
- అంతర్ధికి: కృష్ణుండు తల్లి వలన దాగె
- వారణంబునకు: శోకంబు వలన వారించె
ఉదాహరణకు, మైత్రుండు రాజ్యంబు వలన భ్రష్టుడయ్యె. ఈ ఉదాహరణను గమనిస్తే, మైత్రుడు రాజ్యం నుండి విడిపోవుట సంభవించింది కాబట్టి 'రాజ్య' అనే ప్రాతిపదికకు పంచమీ విభక్తికి చెందిన 'వలన' అనే ప్రత్యయం చేరింది. ఇట్లే మిగిలిన ఉదాహరణలు గ్రహించాలి.
నన్నయ (అజన్త.8) ఆంధ్రశబ్ద చింతామణిలో చెప్పిన "కంటె2న్యార్థాదేః" అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని సూరి "కంటె వర్ణకం బన్యార్థాది యోగజంబగు పంచమికగు" (సూరి, కారక.19) అని పంచమీ విభక్తి ప్రత్యయమైన 'కంటె' వర్ణకం గురించి సూత్రించాడు. అయితే బాలవ్యాకర్త దీన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించకుండా, అన్యాదులనే ఒక ఆకృతి గణాన్ని ఏర్పాటు చేసి వాటితో యోగమున్నప్పుడు 'కంటె' వర్ణకం వస్తుందని ఆదేశించాడు. ఇక్కడ అన్యార్థాదులాకృతి గణం అనగా, అన్యము, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము వంటివి అన్యాదులని పేర్కొని, ఇందులోనే, దక్షిణము, దూరము, సమీపము వంటి తత్సమాలే కాకుండా, లాఁతి, పెఱ, దవ్వు, దగ్గఱ, తూర్పు, పడమర వంటి ఆచ్ఛిక శబ్దాలను కూడా చేరుతాయని తెలియజేశాడు.
ఆధునిక వ్యవహార భాషను గమనిస్తే, 'కంటె' అనే దానికి బదులు 'కన్నా' అనేది ఎక్కువ వ్యవహారంలో ఉంది. దీనిని గమనించిన సూరి (కారక.13) "కంటె వర్ణకండు నిర్ధారణ పంచమికగు" అని సూత్రీకరించి, ఈ సూత్రం కింద "ఎచట నిర్ధార్యమాణబు జాత్యాదులచే భేదంయె కలిగియుండు నచటం బంచమియగు" అని వృత్తి వివరణ వాక్యమిచ్చాడు. దీన్ని బట్టి అన్యార్థాది యోగానికి, నిర్ధారణార్థంలోనూ ఈ 'కంటె' వర్ణకం వస్తుందని గ్రహించాలి. అయితే ఆధునిక వ్యవహారంలో ఈ రెండు సందర్భాల్లోనూ 'కంటె' శబ్దం కంటే 'కన్నా' శబ్దమే వాడుకలో కనిపిస్తుందనేది గమనించాల్సిన విషయం.
2.6. అధికరణ కారకం
సప్తమీ విభక్తికి అధికరణ కారకం అని పేరు. పాణిని (2-3-36) "సప్తమ్యధికరణేచ" అని, (1-4-45) "ఆధారోధికరణమ" అని నిర్వచించాడు. వ్యాపారం జరిగే ప్రదేశం అధికరణమని పేర్కొన్నాడు. 'అధికరణంబు నా నాధారంబు' అని వివరణ. 'అధికరణం' అంటే ఆధారం లేదా ఆశ్రయం అని అర్థం. ఆధారార్థంలో సప్తమీ విభక్తి వస్తుందని చెప్పబడింది. మరి ఏవి సప్తమీ విభక్తి ప్రత్యయాలు అని పరిశీలించినపుడు, ప్రథమాచార్యుడు నన్నయ (అజన్త.2) "అంద్విందు నాస్తు సప్తమీతు" అని అందు, ఇందు, న అనేవి సప్తమీ విభక్తి ప్రత్యయాలుగా పేర్కొన్నాడు. అయితే 'ఇందు' అనేది సప్తమ్యంతంలో వస్తుందని పేర్కొన్నప్పటికీ, తరువాత వచ్చిన వ్యాకర్తలెవరూ దీన్ని గుర్తించలేదనే విషయాన్ని గమనించాలి.
అలాగే, శాస్త్రి (29) తెనుగు వ్యాకరణంలో "అందు`న`లో`లోపల` విషయము`నిమిత్తము` ఇవి సప్తమీ విభక్తి" అని తెలిపి, షష్ఠీ విభక్తి ప్రత్యయాలైన లో, లోపల అనేవి సప్తమీలో కలిపి చెప్పారు. అంతేకాకుండా, 'విషయము`నిమిత్తము' అనే వాటిని ఇక్కడ ప్రత్యయాలుగా చూపడం కూడా విశేషమే. దీన్ని తరువాతి వ్యాకర్తలెవరూ అంగీకరించలేదు. వీరికంటే ముందు, పుదూరి సీతారామాశాస్త్రి విషయనిమిత్తాద్యర్థాలందు సప్తమీ వస్తుందని, దానికి ఉదాహరణగా 'చర్మము నిమిత్తము పులిని జంపెను' అనే ఉదాహరణను పేర్కొనడం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈయన ఎక్కడా 'అందు' అనే ప్రత్యయాన్ని ప్రయోగాలలో చూపలేకపోవడం గమనార్హం.
బాలవ్యాకర్త సూరి 'అందు, న' అనే వాటినే సప్తమీ విభక్తి ప్రత్యయాలుగా పేర్కొన్నాడు. సూరి (కారక.17) "అధికరణంబున సప్తమి యగు" అని సూత్రం ఇచ్చాడు. అధికరణ వాచకమునకు సప్తమీ విభక్తి అవుతుందని సూత్రార్థం. ఇది సూరి (కారక.17) "ఔసశ్లేషికంబు వైషయికం బభి వ్యాపకంబని యాధారంబు త్రివిధంబు" అని 'ఔపశ్లేషికో వైషయికో 2 వ్యాపకశ్చేత్యాధార స్త్రీధా' అనే సిద్ధాంత కౌముదిని అనుసరించి పేర్కొన్నాడు. ఆధారం 3 విధాలని చెప్పబడింది:
- ఔపశ్లేషికం
- వైషయికం
- అభివ్యాపకం
ఈ విధంగా 3 విధాలైన ఆధారానికి సప్తమి విభక్తి చేరుతుందని, అంటే అధికరణమునకు సప్తమి విభక్తి చేరుతుందని సూరి సూత్రార్థం.
ఔపశ్లేషికం అంటే మిక్కిలి సామీప్య సంబంధం కలిగినది.
ఉదాహరణకు, ఘటమందు జలమున్నది. నీటికి ఘటం (కుండ) ఔపశ్లేషికమైన ఆధారం.
'వైషయికం' అంటే విషయ సంబంధమైంది.
ఉదాహరణకు, మోక్షమందిచ్చ గలదు. మోక్ష విషయమైన ఇచ్చ గలదని అర్థం. ఇది వైషయికం.
'అభివ్యాపకం' అంటే అంతటా వ్యాపించి ఉండేది.
ఉదాహరణకు, 'అన్నిటి యందీశ్వరుడు గలడు'. ఈశ్వరుని అభివ్యాప్తికి సమస్త వస్తు సముదాయం ఆధారమే.
ఈ 3 వాక్యాలు మూడు విధాలైన ఆధారానికి లక్ష్యాలు. అలాగే ఆధారాధేయాలు అయిన ఘటము జలము అన్నవి కలిసి ఉన్నాయి. కాబట్టి ఔపశ్లేషికం అనిపించుకుంటుంది. 'ఘట' అనే ప్రాతిపదికకు అధికరణ సంజ్ఞ. సప్తమీ విభక్తి కలగగా 'ఘటమందు' అని ఏర్పడింది.
లక్ష్యభేదమైన విషయం మోక్షం కాబట్టి మోక్షం వైషయికమైన ఆధారం. దానికి సప్తమి చేరి 'మోక్షమందు' అని ఏర్పడింది.
సర్వావయవములందు వ్యాపించి ఉండే ఈశ్వరునికి ఆధారం అవడం చేత 'అన్నిటియందు' అని అన్నదానికి సప్తమి చేరింది.
'న' వర్ణకం గురించి పరిశీలించినపుడు, చిన్నయసూరి (కారక.18) "ఉకారాంత జడంబునకు నవర్ణకంబగు" అని 'న' వర్ణకాన్ని తెలియజేశాడు.
అయితే, అధికరణార్థంలో వచ్చే సప్తమీ విభక్తులలో 'అందు' అనే దాన్నే ఎక్కువ మంది వ్యాకరణకారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఉకారాంత జడవాచకాలకే 'న' చేరుతుందని తెలిపారు.
ఈ విధంగా అధికరణ కారకానికి సప్తమి విభక్తి చేరే విధానం చెప్పబడింది.
3. ఉపసంహారం
ఈ విధంగా 6 విధాలుగా చెప్పబడిన కారకాలు బాలవ్యాకరణంలో ఒక ప్రత్యేకతను కలిగిన కారకపరిచ్ఛేదంలో విపులంగా చెప్పబడ్డాయి. విభక్త్యర్థంలో చెప్పబడే ఈ అన్వయాన్ని సూరి అద్భుతంగా నిర్వహించాడని గ్రహించవచ్చు. అసలు కారకం అనేది సంస్కృతభాషలో అత్యంత కష్టమైందని, ప్రధానమైందని తెలుస్తుంది. అలాగే పాణినీయం వంటివి పరిశీలించాక సంస్కృతంలో ఉన్నంత విస్తృత కారకవిధానం తెలుగులో లేదని గ్రహించవచ్చు. దేన్ని అనుసరించి రచించినప్పటికీ, వాక్యరచనకు ఈ కారకజ్ఞానమే ప్రధానమని తెలుస్తుంది. కారకవిధానం పరిశీలించాక, కారకపరిచ్ఛేదంలో ఏ విభక్తి ఏయే అర్థాలలో చేరి క్రియలలో అన్వయించునో స్పష్టంగా వివరించబడింది. నన్నయాదులు మార్గ సాహిత్యాన్ని అనుసరించినట్లే, మార్గ వ్యాకరణాన్ని కూడా అనుసరించారు. అందుకే నన్నయ తన వ్యాకరణానికి ఎక్కువ మూలం పాణినీయం అని తెలుస్తుంది. ఆ కోణంలో పరిశీలన జరిగినపుడు ఈ వ్యాసం ద్వారా తెలియజెప్పే అంశాల్లో ప్రధానంగా, బాలవ్యాకరణాన్ని పక్కకు పెడితే, మిగిలిన వ్యాకర్తలు కొందరు కారక పరిచ్ఛేదాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తే మరికొందరు విభక్తి ప్రకరణం వంటి పేర్లతో పరిచ్ఛేదాలను నిర్మించి వివరించారని తెలుస్తుంది. కొందరు వ్యాకర్తలు సంస్కృత కారక విధానాన్ని అనుసరించిన వారుంటే, మరికొందరు తెలుగు స్వభావాన్ని అనుసరించి కారకవిధానాన్ని తెలియజేయడం గమనించవచ్చు. నిజానికి చిన్నయసూరి తనకు సన్నిహితమైన వ్యాకరణాలను అనుసరించి కారక పరిచ్ఛేదాన్ని రచించాడని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ పూర్వ వ్యాకర్తల వ్యాకరణాలను ఆదర్శంగా గ్రహించి వీటికి కొంత తెలుగు కారకపద్ధతులను కొంత వివరణాత్మకంగా రాసి, తన నిర్మాణ చాతుర్యాన్ని చాటడమే కాకుండా, తరవాతి వ్యాకర్తలందరికీ మార్గదర్శకుడయ్యాడని చెప్పవచ్చు.
- బాలవ్యాకరణంలోని కారక పరిచ్ఛేదం, తెలుగు వ్యాకరణంలో క్రియకు కారకాలకు గల సంబంధాన్ని వివరిస్తుంది.
- చిన్నయసూరి కారకాలను, వాటి విభక్తులను సంస్కృత వ్యాకరణ విధానాలను ఆధారం చేసుకుని, తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా వివరించాడు.
- పూర్వ వ్యాకరణకారులు కారకాలకు సంబంధించిన వివరణలను వివిధ పద్ధతులలో అందించారు; కొందరు ప్రత్యేకంగా కారక ప్రకరణాన్ని రూపొందించగా, మరికొందరు విభక్తి ప్రకరణంలో వాటిని చర్చించారు.
- నన్నయ వంటి ప్రథమాచార్యులు సంస్కృత వ్యాకరణ ప్రభావంతో తెలుగులో కారక విధానాన్ని సూచించినా, చిన్నయసూరి వాటికి మరింత స్పష్టమైన వివరణ ఇచ్చాడు.
- ప్రతి కారకం (కర్మ, కర్తృ, కరణ, సంప్రదాన, అపాదాన, అధికరణ) విభక్తి ప్రత్యయాల వాడకంతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది అనేది ఉదాహరణలతో సహా స్పష్టంగా తెలుపబడింది.
- చిన్నయసూరి తన కారక పరిచ్ఛేదం ద్వారా తెలుగు వ్యాకరణానికి ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరచి, తర్వాతి వ్యాకరణకారులకు ఆదర్శప్రాయుడయ్యాడు.
ఉపయుక్త గ్రంథసూచి
- అథర్వణాచార్యుడు. వికృతి వివేకము (అథర్వణకారికావళి). కవిజనమండన సహితము, వావిళ్ళప్రతి, 1955.
- గురుమూర్తిశాస్త్రి, రావిపాటి. తెనుగు వ్యాకరణము. వావిళ్ళవారి ప్రచురణలు, మద్రాసు,1836
- చిన్నయసూరి, పరవస్తు. బాలవ్యాకరణము. స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పబ్లిషర్స్, నరసారావుపేట, 1911.
- నాగభూషణం, అంబపూడి. బాలవ్యాకరణము. అర్థదీపికావ్యాఖ్య, మోహన్ పబ్లికేషన్స్, కోటగుమ్మం, రాజమహేంద్రవరం.
- ప్రవీణ, దొడ్డి. బాలవ్యాకరణానికి సమీపకాలిక వ్యాకరణాల పరిశీలన (సిద్ధాంత గ్రంథం) ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగుశాఖ, విశాఖపట్నం, 2012
- మోహనరావు, సజ్జా. అధర్వణుని కృతులు- సమీక్ష.(సిద్ధాంత గ్రంథం) లావణ్య ప్రచురణలు, విశాఖపట్నం, 1992.
- రామకృష్ణారావు, వంతరాం. బాలవ్యాకరణ ఘంటాపథము. (12వ ముద్రణ), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2014.
- రామస్వామిశాస్త్రులు, వావిళ్ల. అండ్ సన్స్ వారిచే ప్రకటితమణి. ఆన్ధ్రశబ్ద చిన్తామణి (సటీకము), 1937.
- వెంకటరమణశాస్త్రి, దువ్వూరి. రమణీయం. ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, వాల్తేరు, 1964.
- వెంకటేశ్వర్లు, బూదాటి. సంప్రదాయ తెలుగు వ్యాకరణాలు. తెలుగు అకాడమి ప్రచురణ,2014.
- వేంకటరమణ, వాడిబోయిన(సం.). పాణినీ ప్రణీత అష్టాధ్యాయి. దివ్య ప్రచురణలు, అనకాపల్లి, 2014.
- శ్రీరామచంద్రుడు, పుల్లెల. లఘు సిద్ధాన్త కౌముది (ఆంధ్రభాషా వ్యాఖ్య). దక్షిణ భారత ప్రెస్, ఖైరతాబాద్
- సీతారామాచార్యులు, బహుజనపల్లి. ప్రౌఢవ్యాకరణము. విశాలాంధ్ర పబ్లిషర్స్, విశాఖపట్నం,1999.
- సీతారామాశాస్త్రి, పుదూరి. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము. కళానిధి అను ముద్రాక్షరశాల,1859.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

