AUCHITHYAM | Volume-07 | Issue-07 | June 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. వివిధ వైష్ణవసంప్రదాయాలు: అన్నమయ్య విలక్షణపదాలు
డా. వేంపాటి వేంకట సుబ్బారావు
సహాచార్యులు, తెలుగు శాఖ అధ్యక్షులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వ), ఖైరతాబాద్,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9492030012, Email: vvsraovempati@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 07.05.2025 ఎంపిక (D.O.A): 23.05.2025 ప్రచురణ (D.O.P): 01.06.2026
వ్యాససంగ్రహం:
ఈ పరిశోధనాపత్రం తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనా విశ్వంలోని విశాల దృక్పథాన్ని, వివిధ వైష్ణవ వైష్ణవేతర సంప్రదాయాల పట్ల ఆయన కనబరిచిన ఉదారతను విశ్లేషిస్తుంది. పూరీ జగన్నాథ క్షేత్ర దర్శనం, బ్రహ్మవైవర్త పురాణోక్తమైన రాధాతత్త్వం, జయదేవుని గీతగోవింద ప్రభావం అన్నమయ్య సాహిత్యంలో ఏ విధంగా వివర్తనం చెందాయో ఈ వ్యాసం చర్చిస్తుంది. దక్షిణాది వైఖానస, పాంచరాత్ర ఆగమాలతో పాటు ఉత్తరాది గౌడీయవైష్ణవ, స్మార్తసాంప్రదాయాల సమన్వయకర్తగా అన్నమయ్య విలక్షణతను నిరూపించడమే నిర్దేశించబడిన శీర్షిక యొక్క ముఖ్య ఉద్దేశం.పూర్వ పరిశోధనలు పరిమితంగా వున్నాయి. తాళ్లపాక సంకీర్తనల పై తితిదే వారు ప్రచురించిన 29 సంపటాలలో కొంత వివరణ వుంది. ఆచార్య అబ్బూరి గోపాలకృష్ణ గారి పరిశోధనా గ్రంథంలో కొన్ని వివరాలు వున్నాయి.అవి ఈ అంశం యొక్క విస్తృతిని కూలంకషంగా తెల్పుటలేదు.అందువలన ఈ వ్యాసం ద్వారా మరిన్ని వివరాలు విశ్లేషించడమైనది. అన్నమయ్య విలక్షణ, వైవిధ్యమైన, ఉదారవాద భావనలను, తాను కొత్తగా తెచ్చిపెట్టుకున్న వైష్ణవం పూర్తిగా నిరోధించలేకపోయింది. ఆ విధంగా అన్నమయ్య సాధించిన వైలక్షణత విశిష్టమై భాసించింది
Keywords: అన్నమాచార్యులు, వైష్ణవ సంప్రదాయాలు, జగన్నాథపురి, రాధాతత్త్వం, జయదేవుడు, గీతగోవిందం, వైఖానసం, బ్రహ్మవైవర్త పురాణం, విలక్షణ పదాలు, మధురభక్తి
1.0 ప్రవేశిక
అనేకత్వం భారతీయ ఆత్మ. మతాల, అభిమతాల విషయంలో ఇది సత్యం. విష్ణువు ఆధిక్యత ప్రాతిపదికగా వైష్ణవం ఉద్భవించింది. అయితే, తాత్విక చింతన, భక్తి భూమికల ఆధారంగా అది అనేక రూపాలను సంతరించుకుంది. శైవం పరిస్థితి సైతం ఇటువంటిదే.
అనేకత్వం మన నైసర్గిక లక్షణం. ఈ అనేకత్వంలో ఏకత్వం దర్శించిన వైతాళికులకు మన దేశంలో కొదవ లేదు. అందుకే మన ప్రథమ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన భారత దర్శనం (డిస్కవరీ ఆఫ్ ఇండియా)లో 'భిన్నత్వంలో ఏకత్వం' అని ఘంటాపథంగా పేర్కొన్నారు (నెహ్రూ). ఇది అన్నింటా ప్రతిఫలించిన భారతీయ జీవలక్షణం అని నిరూపించేందుకే ఈ పరిశోధనావ్యాసం. పదకర్తగా అన్నమయ్య విలక్షణతను ప్రదర్శించాడు. తాను స్వీకరించిన వైష్ణవ మార్గాన్ని దాటి భిన్న సంప్రదాయ విష్ణు క్షేత్రాలను దర్శించి, ఆయా సంప్రదాయాలను గౌరవించడం ద్వారా తన ప్రత్యేకతను, ఉదారతను ప్రకటించుకున్నాడు. తద్వారా 'కవి నిరంకుశః' అనే ఆర్యోక్తిని నిజం చేసుకున్నాడు. తన భావనా విశ్వం అనంతం అని అన్నమయ్య ప్రవర్తిల్లాడు.
అన్నమయ్య జన్మతః అద్వైత సిద్ధాంతాన్ని నమ్మే కుటుంబానికి చెందినవాడు. బాలునిగా వెంకటాచలం చేరిన అన్నమయ్య వైష్ణవ దీక్ష తీసుకున్నట్లు అతని మనుమడు చిన్నన్న రాసిన తాళ్లపాక అన్నమయ్య చరిత్ర అనే ద్విపద కావ్యం ద్వారా తెలుస్తోంది (చిన్నన్న, తాళ్లపాక అన్నమయ్య చరిత్ర). ఆ తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించాక ఎప్పుడో తన కన్నా వయసులో చిన్నవాడైన శఠకొపయతి ద్వారా నరసింహ మంత్రాన్ని ఉపదేశంగా పొంది, ఆ మంత్రసిద్ధిని పొందినట్లు తెలుస్తోంది. నరసింహ కీర్తనలలో, నరసింహుణ్ణి ఒకచోట 'నమక చమక' సహితంగా పూజ పొందేవాడివి అంటాడు. అది స్మార్త పద్ధతి ఆరాధన. అన్నమయ్యకు అది అతి సహజ ఆరాధన పద్ధతి.
అన్నమయ్య పూర్వీకులు దుర్గా ఆరాధకులు. అన్నమయ్య మనుమలు ఆ ఆరాధనను తామసిక ఆరాధన అనుకున్నా, అన్నమయ్య మనసులో అలా ఉండదు అనేందుకు మనకు కొన్ని ఆధారాలు లభిస్తాయి. లక్ష్మీదేవి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న వడగలై శాఖ వైష్ణవం స్వీకరించాడు అన్నమయ్య. కాత్యాయని, వేద మాతను ప్రస్తావించే కీర్తనలు ఉన్నాయి. 'పురుషకారం' అనే వైష్ణవ సూత్రం ఆధారంగా అలర్మేల్మంగను విస్తృతంగా కీర్తించాడు (చిన్నన్న, తాళ్లపాక అన్నమయ్య చరిత్ర).
1.రామానుజుని మత సిద్ధాంతాలు క్షేత్ర పరంపర
రామానుజుని మతంలో పంచ మూర్తులు ఉంటాయి. అవి వరుసగా: 1) పరము, 2) వ్యూహము, 3) విభవము, 4) హార్దము, 5) అర్చ. వాటిని పర - వాసుదేవ - వ్యూహా - విభవ - అర్చ అని సైతం అంటారు. పన్నిద్దరు ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రాలు 108. వాటిని దివ్యదేశాలు అని అంటారు. ఇవి అన్నీ అర్చా మూర్తులే! అన్ని దివ్యదేశాలు రామానుజుని కట్టడిలోకి రాలేదు. ఆయా స్థాన పరిస్థితులచే అవి పాంచరాత్ర ఆగమానికి లోబడలేదు. రామానుజుని ప్రభావం ఎక్కువగా ఉన్న తిరుమలలో సైతం అర్చక స్వాములు పాటించేది 'వైఖానసం'. ఇది రామానుజుని కన్నా పూర్వం నుండి ఉంది.
అన్నమయ్యకు ఇవి అన్నీ తెలిసినవే! సర్వం వేంకటేశ్వర ముద్ర అంకితం అవడమే అన్నమయ్య పరిమితి. మిగిలిన వాటిలో అనంత ఆకాశమే హద్దు.
2. అన్నమయ్య దేశ సంచారం జగన్నాథ పురి దర్శనం
అన్నమయ్య దేశసంచారం తన జీవితంలో అనేకసార్లు చేశాడని అతని సాహిత్యం ద్వారా తెలుస్తోంది. అన్నమయ్య జగన్నాథ పురిని (పూరి) దర్శించాడు. జగన్నాథ క్షేత్రం రామానుజుని పాంచరాత్ర ఆగమాన్ని ప్రవేశపెట్టలేదు. దానికి ఒక ఐతిహ్యం సైతం ప్రచారంలో ఉంది. శ్రీకూర్మంలో పాంచరాత్ర ఆగమం ఉడయవర్లు ప్రవేశపెట్టారు. ఆ క్షేత్ర కథ భిన్నమైనది.
అన్నమయ్య శ్రీకూర్మాన్ని ప్రస్తుతించిన కీర్తన ఇప్పటి వరకు లభించలేదు. లభించిన కీర్తనలలో జగన్నాధపురి ప్రస్తావన కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నమయ్య సంస్కృత కీర్తనలలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, పురుషోత్తమ వంటి పద ప్రయోగాలు కనిపిస్తాయి. అన్నమయ్య తన బాల్య స్నేహితుడు, సహాధ్యాయి అయిన సాళువ నరసింహుని పంపన ప్రచ్చన్న రాజకీయ రాయబారిగా వెళ్ళాడని మనం ఊహించవచ్చు. ఏ కారణంతో వెళ్ళితేనేమి, ఒక భక్తునిగా పూరీ దేవాలయాన్ని అత్యంత భక్తితో దర్శించాడు. కమలోదరుడైన జగన్నాధుని ప్రాణ పదార్థాన్ని తన్మయత్వంతో అనుభవించాడు. దానినే కీర్తనలుగా వివిధ సమయాల్లో అందించాడు. చిరాయువు ఉన్న అన్నమయ్య ఉత్తర దేశ యాత్రలు చేశాడంటే ఔచిత్య భంగమేమి కాదు. అన్నమయ్య కన్నా వయసులో పెద్దవాడు, అతని సమకాలీనుడు శ్రీనాధుడు సైతం దేశదిమ్మరే కదా!
త్వమేవ శరణం త్వమేవ శరణం
కమలోదర శ్రీ జగన్నాథ… (అన్నమయ్య, సంపుటి 1, కీర్తన 215)
ఈ కీర్తనలో, పురుషోత్తమ, బలభద్ర, సుభద్ర పదాలతో పాటు కమలోదర అని ప్రయోగించాడు. జగన్నాథ స్వామి దారుమూర్తిలో ఉదర భాగంలో అరుణ కమలం చిత్రితమై ఉంటుంది. అలాగే “అరుదరుదు నీ మహిమ అతి మానుషము చూడ పురుషోత్తమును దివ్య పుర జగన్నాథ” అని ఆ జగన్నాథుని కీర్తించాడు. పురుషోత్తమపురి అని పూరీ సంప్రదాయ నామం.
2.1 జగన్నాథ ఆరాధన - సాంస్కృతిక బహురూపత
జగన్నాథ ఆరాధనలో గిరిజన సంస్కృతి నిక్షిప్తం అయి ఉందని పరిశోధకుల నిర్ణయం. బౌద్ధం, శాక్తేయం, తాంత్రిక ఆరాధన పద్ధతులు దాగి ఉన్నాయని చెబుతారు. 'నీలమాధవ' మూర్తిని విశ్వావసు అనే శాబర దొర కొలుస్తూ ఉంటాడు. ఇంద్రద్యుమ్న మహారాజు ఇతివృత్తం మనకు జగన్నాధుడు సంస్కృతీకరణ చెందిన ఘట్టాన్ని తెలియజేస్తుంది. తదనంతర కాలంలో శ్రీకృష్ణచైతన్యులు 'గౌడీయ వైష్ణవాన్ని' ఇక్కడ నిలిపి, జగన్నాధపురిని తూర్పు దేశ భక్తి ఉద్యమ కేంద్రంగా మలిచారు. వారికి పూర్వం జయదేవులు వారి మధుర భక్తికి ఆలంబనగా పూరి క్షేత్రం భాసిల్లింది.
జయదేవుని అష్టపదులలో అష్ట భార్యలతో కులుకెడి జగన్నాథుడు సోదర సోదరీలతో నిలిచి ఉన్నాడు. చైతన్యుల రాధా తత్వం బ్రహ్మవైవర్త పురాణం ఆత్మగా శోభిస్తోంది. రాధయే ప్రాకృతిక శక్తి. ఆమెయే లక్ష్మీ - సరస్వతి - దుర్గ - గాయత్రి వంటి స్త్రీ దేవతలుగా 'వివర్తనం' చెందింది. గోకులమే సర్వోన్నతం. ఆ లోకనాధుడు శ్రీ కృష్ణుడు. అతని వివర్తన రూపాలే వైకుంఠ నాధుడు, శివుడు, బ్రహ్మ వంటి వారు. గోలోకానికి చేరడానికి మధుర భక్తియే ఆలంబన. గోలోకంలో రాధాదేవి రాసేశ్వరిగా, శ్రీ కృష్ణుడు రాసేశ్వరునిగా కనిపిస్తారు. పరస్పరం శాపమచ్చుకోవడం వలన వృషభానుని కూతురుగా రాధ, నందవ్రజంలో పెరిగిన కృష్ణునిగా కృష్ణుడు అవతరించారు. వంగ దేశంలో ఈ బ్రహ్మ వైవర్తం సుప్రసిద్ధం.
2.2 జయదేవుని ప్రభావం రాధా తత్వం
బ్రహ్మ వైవర్తం జయదేవుని కాలానికే ప్రాచుర్యంలో ఉండి ఉంటుంది. జయదేవుని అష్టపదులలో రాధ నాయిక. ఆమె జీవ నాయిక, జీవునికి ప్రతీక. జయదేవుని బాగా వంటబట్టించుకున్న అన్నమయ్య తన సంకీర్తనలలో సైతం ఆ భావనలు పలికించాడు. రాధ రామానుజుని మత సిద్ధాంత గాథలలో అస్సలు కనిపించదు. అది మనం గమనంలో ఉంచుకోవాలి. ఉత్తరదేశ యాత్ర అన్నమయ్యలో రాధాదేవి ప్రస్తావనను వివర్తనం చేసింది అనవచ్చు. అన్నమయ్య కన్నా ముందు కేవలం శ్రీనాధుడు కాశీ ఖండంలో రాధ ప్రసక్తి చేశాడు. అదీ ఒక్కసారి మాత్రమే. ఆయన తర్వాత రాధను స్మరించి కీర్తించిన పదాలు అన్నమయ్యవే! ఆ తర్వాతనే రాధామాధవకవి చింతలపూడి ఎల్ల నార్యుడు.
రాధ అనే పదం 'రాధ సాధ సంసిద్ధౌ' ధాతువు నుండి నిష్పన్నమైనది. వివర్తనం అన్నది రాధకు మరొక పేరు. ఆమె ప్రాణ శక్తికి సంబంధించినది. ప్రాణశక్తి ద్వారా విశ్వం సృష్టించబడుతోంది. ఈ ప్రాణశక్తి రాధకు ఆమె ప్రాణేశ్వరునికి పరస్పరం అనుసూత్యంగా ఉన్నాయి. శ్రీ కృష్ణుడు, రాధ అనే ప్రాణశక్తి అనేక వివర్తనాలు పొంది భగవంతుని సంయోగ, వియోగ, ఆలింగనంగా వివిధ అవస్థలలో విశ్వ కృత్యములకు రాధికగా, సాధికగా అయ్యింది. ప్రాణశక్తి ప్రక్రియ వర్ణన దార్శనిక పరిభాషలో కాక, కామశాస్త్ర పరిభాషలో వేద వ్యాసునిచే చెప్పబడింది. నేటి బెంగాల్, ఒడిస్సా వైష్ణవులకు ఇది శిరోధార్యం కాగా, రామానుజానుయాయులకు గర్హనీయం అయ్యింది (వ్యాసడు, బ్రహ్మ వైవర్త పురాణం).
వ్యాస భాగవతంలో రాధ ప్రసక్తి చాలా సూక్ష్మం. పోతన భాగవతంలో రాధ ప్రసక్తి లేదు. దేవీ భాగవతంలో రాసలీల, రాధ వృత్తాంతం ఉంది. గో అనే శబ్దానికి తేజస్సు అని అర్థం. సృష్టి ఏర్పడే ప్రారంభ సూక్ష్మ స్థితి గోలోకం. రాధికకు హ్లాదిని శక్తి అనే పేరు ఉంది. ఆమె మూల ప్రకృతి ఆనందాంశ. రాధ లేని కృష్ణుడు అనూహ్యుడు.
జయదేవుడు (11 వ శతాబ్దం), లీలాశుకుడు (13వ శతాబ్దం), ఇద్దరూ రాధా మాధవ ప్రణయాన్ని విస్తృతంగా స్తుతించారు. రూప గోస్వామి రాసిన విదగ్ధ మాధవం నాటకంలో సైతం రాధా కృష్ణుల శృంగార వర్ణన ఉంది.
2.3 అన్నమయ్య రాధా తత్వానురక్తి
“రాథ్నోతి సకలాన్ కామం I స్తస్మాద్రాధేతి కీర్తితా” అని ఆర్యోక్తి (తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు, తాళ్లపాక వాజ్మయం, సంపుటి 5, పుట 25). శ్రీ వైష్ణవం అంగరించకపోయినా తన కవితా మాధుర్యంతో దానికి వన్నె కల్పించి, తాను ఏ ఒక్క సిద్ధాంతానికి దాస్యం చేయలేనని తన స్వేచ్ఛను ఇక్కడా ప్రదర్శించాడు అన్నమయ్య. రాధా మాధవ దివ్య తత్వం పై జిజ్ఞాసతోనే అన్నమయ్య అన్వేషణ చేసి ఉంటాడు. జయదేవ లేదా లీలాశుకుల స్తుతి గీతాలు తరచి చూసి ఉంటాడు. కేవలం పూరీలో ఎవరో కొందరి మెప్పు పొందేందుకు ఏదో ఒక సంకీర్తన రాశాడని భావించలేము. ముట్నూరి సంగమేశం గారు అన్నమయ్య “రాధామాధవ రతి చరితం…” (అన్నమయ్య, సంపుటి 5, కీర్తన 166), “అహో సురత విహారోయం…” (అన్నమయ్య, సంపుటి 5, కీర్తన 78) కీర్తనలు అలా ఎత్తుకుని పాడేసి ఉంటాడని భావన చేశారు.
అన్నమయ్య జగన్నాథ దర్శనంలో పులకించాడు. తనకు తానుగానే స్వామి దర్శనం చేస్తూ గానం చేశాడో, ఆలయ మర్యాదలతో సంకీర్తనాచార్యుని ఆహ్వానిస్తే వారి కోరిక మేరకు గానం చేశాడో, కానీ అత్యంత భక్తి శ్రద్ధలను చూపాడని కీర్తన చూస్తే తెలుస్తుంది.
రాధా మాధవ రతి చరితమితి
బోధావహం శ్రుతి భూషణం// పల్లవి//
గహనే ద్వావపి గత్వా గత్వా
రహసి రతిం ప్రేరయతి సతిం
విహరస్తదా విలసంతౌ
విహిత గృహాశౌ వివశౌతౌ // రాధా//
లజ్జా శబళ విలాస లీలయా
కజ్జల నయన వికారణ
హృజ్జ వ్యవహృత ( హిత ?) హృదయారతి
స్సజ్జా సంభ్రమచపలా జాతా // రాధా//
ఇది 13 చరణాల సుదీర్ఘ కీర్తన. ఈ కీర్తన కేవలం కాకతాళీయంగా రాశాడని అనుకోలేము. వేదములకే భూషణం రాధామాధవ రతి చరితం అనడం ఆ రాధా తత్వం లోతుగా అవగతం చేసుకున్నాడని అర్థమవుతోంది. పచ్చి శృంగారం అయితే పద ప్రయోగం అలా ఉండేది కాదు. తెలుగు సాహిత్యంలో శృంగార పదసాహిత్యానికి బాటలు వేసిన అన్నమయ్య, మధుర భక్త్యాత్మక రాధా మాధవ రతి చరిత్ర సర్వ సృష్టి బీజాంకురమైనది అనే భావనతో ఆలపించాడు ఈ కీర్తనను.
పైన పేర్కొన్న కీర్తనలో జయదేవుని ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. జయదేవుడు భిన్న గీతాలలో విరహావస్థలను వర్ణిస్తే, వాటినన్నిటిని ఈ కీర్తనలో ఒక మాలికగా చెప్పిన గడుసుదనం అన్నమయ్యది.
అలాగే అష్టపది సంకేతంగా అష్ట చరణాత్మక మైన కింది సంకీర్తనలో జయదేవుడు అష్టపదుల్లో వాడిన పదబంధాలను, పాత్ర చిత్రణను తలపుకు తెస్తూ సంకీర్తన చేశాడు అన్నమయ్య.
అహో సురత విహారోయం
సహజ పరాజయ శంకా నాస్తి…
యమునానుకూలే సుమలతాగృహే, విమల సైకత, రమతస్తయో, ప్రమదస్య, స్వేద సురభి కాశ్మీర జలం, రాధయో స్పరసరతి సుఖశ్రాంతిర్నాస్తి… వంటి పదాలు, పదబంధాలు గీత గోవింద స్ఫూర్తిని కలిగి ఉన్నాయి. వ్యక్తమైన అనురాగ, ఖేలదనంగఖేద, పరిరంభ, కాశ్మీర వంటి పదాలు, ఈ సంకీర్తనలోని 4 వ చరణంలోని ప్రశ్నాత్మక విరహం, జయదేవుని 7వ అష్టపదిలో వాడిందే.
“పశ్యతి దిశి దిశి రహసి భవంతం” అక్కడ. “గహనేద్వావపి గత్వా గత్వా రహసి రతిం” ఇక్కడ.
మహురనలోకిత మండనలీలా
మధురిపురహమితి భావనలీలా
నాథహరే! జగన్నాథ హరే!
సీదతి రాధా వాస గృహే!
ఇది జయదేవం. “లజ్జా శబళ…” చరణం రాధా మాధవ కీర్తనలోనిది. రాధిక విగళితలజ్జా, రోదితి వాసవ కజ్జా… అన్నమయ్య అవే లేదా తదననుగుణ పదబంధాలు వాడుకున్నాడు.
అన్నమయ్య తన సంకీర్తనా లక్షణంలో 46 వ శ్లోకంలో గీత గోవిందం కర్త జయదేవుని కీర్తించాడు. రాధా మాధవుల గురించి, జయదేవుని గురించి తెలిసి, పూరీ జగన్నాథ దర్శనంతో సార్ద్ర భక్తి తన్మయంతో రాసిన కీర్తనలు అవి.
3. ఇతర ఉత్తర దేశ క్షేత్రాలు గదాధర కీర్తనలు
గయ ఉత్తర దేశ క్షేత్రం. అది గదాధర నామధేయంతో శ్రీ హరి అక్కడ ప్రసిద్ధుడు. అన్నమయ్య గదాధర నామాంకిత కీర్తనలు కనిపిస్తాయి. సాధారణంగా దక్షిణాదిలో ఈ నామం ప్రచలితం కాదు.
సతతం శ్రీ శం
హితం పరాత్పర మీడే
గదాధరం మేఘగంభీరని….
గరుడ గమనం మురగశయనమధికం
పరమ పదేశం పావనం…. (అన్నమయ్య, సంపుటి 1, కీర్తన 112)
మరో కీర్తనలో:
ఆది దేవా పరువూ పరమాతుమా… ……
గదాధర వేంకట గిరినిలయా… (అన్నమయ్య, సంపుటి 1, కీర్తన 25)
ఇది చాలా లఘు కీర్తన. ఈ కీర్తనలన్నీ ఎక్కువగా సంస్కృతంలో ఉండడం, ఆనాటి పండిత అనుసంధాన భాషలో రాస్తూ, ఈ క్షేత్రాలన్నీ దర్శించి ఉంటాడని తెలుస్తుంది.
కరుణానిధిం గదాధరం
శరణాగత వత్సలం భజే.. (అన్నమయ్య, సంపుటి 1, కీర్తన 342)
ఈ కీర్తనలో ఉత్తరాది దివ్య దేశాలను, ప్రసిద్ధ అభిమాన దేశాలను పేర్కొన్నాడు. బదరీ, గయ, ప్రయాగ, పురుషోత్తమ పురి, మధుర, అయోధ్య, నందవ్రజం, పంచవటి, సింహాద్రిని పేర్కొన్నాడు.
ఉపసంహారం
ఈ క్షేత్రాలన్నీ పాంచరాత్ర ఆగమంతో నడుస్తున్నవి కావు. కొన్ని మాధ్వ సంప్రదాయం కలవి. కొన్ని గౌడీయ వైష్ణవ సంప్రదాయం కలవి. బదరీ క్షేత్రం స్మార్త నంబూద్రిలు నిర్వహిస్తారు. కానీ అన్నీ అన్నమయ్యకు ఆప్తమైనవే. అందుకే వివిధ ప్రదేశాల్లో కొలువై ఉన్న గోవిందుని విందుగా చేసి, సూక్ష్మపరిశీలనతో తన్మయత్వంతో సంకీర్తించి, తన విలక్షణ వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడు అన్నమయ్య.
- అన్నమయ్య తన వైష్ణవ నేపథ్యం దాటి, భిన్న సంప్రదాయ క్షేత్రాలను సందర్శించి, వారి ఆరాధనా పద్ధతులను గౌరవించాడు.
- జగన్నాథ పురి, గయ వంటి ఉత్తర భారత క్షేత్రాల దర్శనం అన్నమయ్య భక్తిని విస్తృతం చేసింది.
- జయదేవుని గీత గోవిందం, బ్రహ్మవైవర్త పురాణం ప్రభావంతో రాధా తత్వాన్ని తన సంకీర్తనలలో వినూత్నంగా ఆవిష్కరించాడు.
- ఆనాటి పండిత భాష అయిన సంస్కృతంలో అనేక కీర్తనలు రచించి, తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించాడు.
- అన్నమయ్య ఒకే సంప్రదాయానికి పరిమితం కాకుండా, వివిధ వైష్ణవ సిద్ధాంతాలను, ఆరాధనలను తన సాహిత్యంలో సమన్వయపరిచి, తన విశాల దృక్పథాన్ని ప్రకటించాడు.
ఉపయుక్త గ్రంథసూచి
- అన్నమయ్య, తాళ్లపాక. అధ్యాత్మ సంకీర్తనలు, సంపుటాలు 1-6. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు, 1998.
- అన్నమయ్య, తాళ్లపాక. శృంగార సంకీర్తనలు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు, 1998.
- చిన్నన్న, తాళ్లపాక. తాళ్లపాక అన్నమయ్య చరిత్ర. తితిదే ప్రచురణలు, 1998.
- జయదేవుడు, . జయదేవుని అష్టపదులు. ఠాగూర్ పబ్లికేషన్స్, 1999.
- నెహ్రూ, జవహర్‌లాల్. భారత దర్శనం. (ది డిస్కవరీ ఆఫ్ ఇండియా), The Signet Press, Calcutta, 1946
- సుబ్బారావు, వి. వి. అన్నమయ్య సాహిత్య ప్రస్థానం - భక్తి నేపథ్యం. అముద్రితం, 2014.
- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు. తాళ్లపాక వాజ్మయం, సంపుటి 5. 1998.
- వ్యాసడు, వేద. బ్రహ్మ వైవర్త పురాణం. మోహన్ పబ్లికేషన్స్, 2009.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

