AUCHITHYAM | Volume-07 | Issue-01 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. నేటి అవధానకవిత్వంలో వ్యాకరణం: సంధి, సమాసవిధానాల పరామర్శ
డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ
పోస్ట్-డాక్టోరల్ ఫెలో (NTS-I, CIIL), తెలుగుశాఖ
ఆంధ్రవిశ్వకళాపరిషత్,
విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9247859580, Email: rpsarma9247@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 29.01.2026 ఎంపిక (D.O.A): 30.01.2026 ప్రచురణ (D.O.P): 31.01.2026
వ్యాససంగ్రహం:
పద్యవిద్యకు కావ్యభాష ప్రాణం. దీనికి వ్యాకరణశాస్త్రజ్ఞానం అత్యావశ్యకమని, బాల-ప్రౌఢ వ్యాకరణాల పరిజ్ఞానం పద్యరచనా ప్రామాణ్యాన్ని నిర్దేశిస్తుందని ఈ వ్యాసం తెలుపుతుంది. "ప్రయోగశరణం వ్యాకరణం" అనే అభియుక్తోక్తి ఆధారంగా నేటి అవధాన పద్యపూరణలలో సంధి, సమాస విధానాలు బాలవ్యాకరణ ప్రాతిపదికన ఎలా ఉన్నాయో పరిశీలించడం ఈ అధ్యయనం ప్రధానలక్ష్యం. చింతామణి వివరణలు, బాలవ్యాకరణ లక్ష్యరూపసాధన విమర్శలు, బాలవ్యాకరణ-సంహితా-సర్వస్వము, నీతిచంద్రిక-బాలవ్యాకరణం వంటి పూర్వపరిశోధనలను గమనించడమైనది. పరిశోధనలో ఇటీవల జరిగిన అవధాన ప్రదర్శనల నుండి సేకరించిన సమస్య, దత్తపది, వర్ణనలు, ఆశువుల పూరణలను ప్రాథమిక ఆధారాలుగా ఉపయోగించి విశ్లేషణాత్మక పద్ధతిలో అధ్యయనం సాగింది. పద్యకవులకు తత్సమతద్భవదేశ్య పదవిజ్ఞానం, ప్రాతిపదిక-ప్రత్యయ విభాగాలపై అవగాహన, సంధి-సమాసఘటనాచాతుర్యం అత్యవసరమని పరిశోధన స్పష్టం చేసింది. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది లాంటి అవధానాంశాలలో తత్సమాచ్ఛిక పదభేదం, పదవిచ్ఛేదం, సంధులు, సమాసాలు కీలకపాత్ర పోషిస్తాయని, శబ్దచమత్కారానికి, అర్థభేద సాధనకు ఈ జ్ఞానం అనివార్యమని తేలింది. అత్వ, ఇత్వ, ఉత్వ, సరళాదేశ, గసడదవాదేశసంధులు, ఆగమసంధులు పద్యనిర్మాణంలో గణనియమాలకు అనుగుణంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తాయని, సంధివిధానాలు అవధానాంశాలలోని సంక్లిష్టతను ఛేదించడంలో సమర్థంగా దోహదపడతాయని వ్యాసం వివరించింది. బాలవ్యాకరణం ప్రకారం సమాసకల్పన, సంస్కృతాచ్ఛిక మిశ్రసమాసాల ప్రయోగం, త్రిక, స్త్రీసమ, ముగంత, ధాతుజవిశేషణ పూర్వపద కర్మధారయాలు తెలుగు సమాసాలకు ప్రాణం పోస్తాయని విశ్లేషణలో వెల్లడైంది. అయితే, ప్రస్తుత అవధానకవిత్వంలో ఉత్వసంధి సడలింపులు, ద్రుతప్రకృతులు-కళల తారతమ్యజ్ఞాన లోపం, అనవసర యడాగమాలు, దుష్టసమాసాల వంటి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని పరిశోధన గుర్తించింది. అవధానకవిత్వంలో వ్యాకరణనిర్దుష్టతను పెంపొందించడానికి పూర్వకవిప్రయోగాల నిరంతరాధ్యయనం, ప్రసిద్ధపూర్వావధాన పద్యాల అనుశీలన, సంస్కృత, బాలవ్యాకరణ గ్రంథాల వ్యాఖ్యాన సహిత సమగ్ర పరిశీలన, కవిప్రయోగాలను సూత్రసమన్వయం చేస్తూ రూపసాధన ప్రక్రియలు, సూత్రాల ఆధారంగా నూతన ఉదాహరణల కల్పన లాంటి అభ్యాసాలు అత్యంత ఆవశ్యకమని ఈ వ్యాసం భవిష్యత్తు పరిశోధకులకు సూచించింది
Keywords: అవధానం, బాలవ్యాకరణం, పద్యకవిత్వం, సంధి, సమాసం, తత్సమాచ్ఛికాలు, ప్రయోగశరణం, తెలుగు వ్యాకరణం, సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి.
1. ప్రవేశిక
పద్యవిద్యకు కావ్యభాష ప్రాణం. శబ్దశక్తి ప్రధానమైన ఈ భాష పద్యభాషగా పేర్కొనదగింది. సంప్రదాయపద్ధతిలో పద్యరచన చేసేవారికి తగిన పదసంపద, పర్యాయపద-నానార్థకోశజ్ఞానం ఉన్నప్పటికీ, ఈ పద్యరచనాసామర్థ్య- సముపార్జనకు వ్యాకరణశాస్త్రజ్ఞానం అత్యావశ్యకం. లక్షణప్రధానంగా చూస్తే బాల, ప్రౌఢవ్యాకరణాల తెలివిడి ఈనాటి పద్య- రచనాప్రామాణ్యాన్ని నిర్దేశిస్తుందనడం నిర్వివాదాంశం. తత్సమ, తద్భవ, దేశ్య, పదవిజ్ఞానం, ప్రాతిపదిక-ప్రత్యయ విభాగాలపై అవగాహన, సంధి - సమాసఘటనాచాతుర్యం పద్యకవులకు అవసరం. అయితే, “ప్రయోగశరణం వ్యాకరణం” అనే అభియుక్తోక్తి ద్వారా లక్షణం కన్నా ప్రయోగ పరిచయం ఎంతో ముఖ్యమని తెలుస్తోంది. కవుల కష్టసుఖాలు తెలుపుతూ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు ఒక అనుభవపూర్వక సందేశం ఇచ్చారు:
యెంతసేపూ మీరు లక్ష్యజ్ఞానానికే ప్రయత్నించండి. లక్షణజ్ఞానం యెంత వున్నా చాలును (వేంకట శాస్త్రి 226).
తెలుగు, సంస్కృతాల్లో సంధి – సమాస విధానాలు ఎలా ఉండాలో, ఒక అవధాన సభలో జరిగిన సంఘటనను ఉదాహరిస్తూ పేర్కొన్నారు. “గొప్ప గొప్ప లక్షణజ్ఞులందరూ చివరకు మహాభాష్యకారులు సహా లక్ష్యజ్ఞానానికే గౌరవాన్ని సూచించారు” అనే చెళ్ళపిళ్ల వారి ఉపదేశం ఆధారంగా ఈ వ్యాసంలో అవధాన పద్య పూరణల్లోని వ్యాకరణ ప్రాముఖ్యాన్ని పరిశీలించడమైనది.
చింతామణికారుని హృదయాన్ని అధర్వణాచార్యులు, అహోబలపండితుడు తగిన ఉదాహరణలతో సముచితంగా ఆవిష్కరించారు. అదేవిధంగా వివిధవ్యాఖ్యానాలు, సమీక్షలు బాలవ్యాకరణంలోని లక్ష్యరూపసాధన విధానాన్ని విమర్శించాయి. బాలవ్యాకరణ-సంహితాసర్వస్వము, నీతిచంద్రిక – బాలవ్యాకరణం లక్ష్యలక్షణ సమన్వయం వంటి పూర్వపరిశోధనలు బాలవ్యాకరణంలో సూత్రీకరించిన లక్షణాలకు, లక్ష్యసమన్వయం చేసి చూపించాయి. సూర్యనారాయణీయము కూడా ఈకోవలో చేరవల్సినదే. ఉండుట-ఉంట మొదలు- అంట, వింట, కొంట, కంట వంటి నన్నయభారతేతరప్రయోగాలను తిక్కనాదులు ప్రయోగించారని చెప్తూ –
“కొన్ని యెడల లాక్షణికుల దారి వేఱు, కవుల దారి వేఱు ననుట కిదియొక దృష్టాంతము. శిష్టలోకమును గవులును, కవులను లాక్షణికులు ననుసరించుట సంప్రదాయము. కాని లాక్షణికులును గొందఱు నిరంకుశులై సూత్రించిరి”
అని మల్లాది సూర్యనారాయణశాస్త్రి అన్నారు (పుట. 265).
ప్రస్తుతపరిశోధనావ్యాసం నేటిఅవధానకవిత్వంలో సంధి, సమాసవిధానాలను బాలవ్యాకరణపరంగా పరామర్శిస్తుంది.
2. తత్సమ-ఆచ్ఛిక శబ్దపరిజ్ఞానం
2.1. వర్గీకరణ పరిచయం
తత్సమం (రాముడు, విద్య, హరి, ధేనువు; అగ్గి, కారము, గారవము, రాణి), తద్భవం (ఆకసము, గోడ, అగ్గి), దేశ్యం (ఊరు, పేరు, ఇల్లు, ముల్లు, కోట, పేట, తావి, మోవి), గ్రామ్యాలను (వస్తాడు, తెస్తాడు, కఱకంఠుడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ) సూరి స్పష్టంగా నిర్వచించి, ఉదాహరణలు ఇచ్చాడు. సంస్కృత సమేతరాలు ఆచ్ఛికాలని, అవి స్త్రీసమాలు (అన్న, మిన్న), క్లీబసమాలు (బియ్యము, నెయ్యము), కొన్ని పుంలింగతుల్యాలు (కొమరుడు, చందురుడు) అని పేర్కొన్నాడు.
పదసంపద సంపాదించడం ఒక ఎత్తైతే, అవి ఏయే కోవలకు చెందినవి తెలుసుకొని, ప్రయోగించగలిగి ఉండడం కవులకు చాలా అవసరం. పదభేదాలను గుర్తించే మార్గాన్ని బాలవ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం (సూ. 19-23) పేర్కొంది. సంస్కృతసమాలను (సంజ్ఞా. సూ. 4, 9, 10, 16, 17), అచ్చతెనుగు పదాలను గుర్తించే విధానాన్ని అదేపరిచ్ఛేదం (సంజ్ఞా. సూ. 3, 9, 14) వివరిస్తోంది. సామాన్యశబ్దదృష్టితో పాటు కృదంత, తద్ధితరూపాల నిష్పాదనపై మంచి అవగాహన అవసరం. క్రియల (ధాతువుల) నుండి నామపదోత్పత్తి, వివిధార్థాలలో వేరు వేరు ప్రత్యయాలు చేరి ఏర్పడే తద్ధితరూపాల కల్పనలపై అవధానులకు నిశిత దృష్టి ఉండాలి.
2.2. అవధానకవిత్వంలో తత్సమ - ఆచ్ఛికపదాల ప్రయోజనం
అవధానాలలో ప్రతి అంశంలోనూ వీటి ప్రయోజనం ఎంతో ఉంది. ముఖ్యంగా నిషిద్ధాక్షరిలో పూరణ ప్రారంభంలో అవధాని చెబుతున్న అక్షరాలన్నీ కలుపుతుంటే మొదట అదొక తత్సమపదంగా భ్రాంతి కలిగించినా, నిషేధాల తరువాత ఆచ్ఛికపదంగా అది పరిణమించడం అందరినీ అలరిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యాంశాలలోని పదాలు తత్సమాలుగా అనిపిస్తున్నప్పటికీ, జాగ్రత్తగా పరిశీలిస్తే అవే ఆచ్ఛికపదాలుగా స్ఫురించి, అర్థభేదంతో తృటిలో సమస్యలోని చిక్కు విడిపోతుంది. దత్తపదిలో శబ్దచమత్కారచిత్రణకు, వర్ణనల్లో శ్లేషచమత్కారవిన్యాసానికి ఈ తత్సమాచ్ఛికాల భేదం తెలుసుకొని ఉండడం అవధానికి చాలా అవసరం.
3. సంధి విధానం
3.1. పద్యరచనలో సంధి ప్రాధాన్యం
పద్యరచనలో అచ్చులకు సంధి చేయడంలో ఎన్నో సౌకర్యాలు, ఇబ్బందులు ఉన్నాయి. పదప్రారంభ, పదాంతాలలో అచ్చులున్నప్పుడు; పాదారంభ, పాదాంతాల్లో అచ్చులున్నప్పుడు ఈ కష్టసుఖాలు స్పష్టంగా తెలుస్తాయి. కొంతమంది కొన్ని పద్యాలలో సంధిగతపదాలను అర్థస్పష్టత కోసమో, అపార్థాలు రాకుండా ఉండాలనో విడగొట్టి రాయడం, పలకడం చేసినా, గణనియమానుసారం పద్యాలలో సంధి పాటించాల్సిందే. యతిస్థానాల్లో కూడా అచ్చులకు అంతే ప్రాధాన్యం ఉంది. అచ్చులతో ప్రారంభమయ్యే పాదాల్లో, యతిస్థానంలో కూడా అచ్చులతో ప్రారంభమయ్యే పదాలను ఉంచాల్సి వచ్చినప్పుడు పదవిచ్ఛేదం, సంధుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది.
3.2. అవధానంలో సమస్యల పరిష్కారంలో సంధిపాత్ర
అవధానాల్లో ఇచ్చే సమస్యల్లో చాలావరకు శబ్దార్థచమత్కృతులు ఉంటాయి. ఒక్క పదవిచ్ఛేదాన్ని పట్టుకుంటే.. అంటే, సంధిగతంగా ఉన్న పదాలను జాగ్రత్త విడగొట్టుకోవడంతోనే, ఆ సమస్యల్లోని చిక్కుముళ్ళు విడిపోయి, పరిష్కారాలు ద్యోతకమవుతాయి. ఇటీవల అనంతపురం శంకరమఠంలో జరిగిన అవధానసప్తకంలో (రెండు రోజుల్లో ఏడు అష్టావధానాల నిర్వహణం) ఇచ్చిన సమస్య- పదవిచ్ఛేద ప్రాధాన్యానికి పరమోదాహరణం.
మదవిభ్రాంత వివేకశీలునకు సంప్రాప్తించు మోక్షంబిలన్.
దీనికి పృచ్ఛకులు ఊహించిన విరుపు – శ్రీమత్ + అవిభ్రాంత అని. అలాగే అవధానవిద్య గ్రంథంలో పేర్కొన్న కొన్ని సమస్యలను పరిశీలిద్దాం.
శునకమ్మయ్యెను విష్ణుదేవుడు ... కీర్తింపగన్
పూరణలో ఈశునకు+ అమ్ము+అయ్యెను అని విరుపు. సమస్యకు ముందు ‘ఈ’ అనే అక్షరం చేర్చడం మాత్రమే కాక, ఇక్కడ తరువాత జరిగిన ఉత్వ సంధుల ప్రాధాన్యాన్ని కూడా గమనించాలి.
అక్షప్రౌఢిమ మీఱ ఆ శకుని లంకాధీశుతో పోరెడిన్
అనే సమస్యకు – “హర్యక్షప్రౌఢిమ..” అని పూరణ.
రాతికి మ్రొక్కినన్...
అనే సమస్యలో “దానవారాతికి మ్రొక్కినన్...” అని పూరణ. ఇందులో దానవ+అరాతికి అనే విరుపులో సంధి ప్రాధాన్యం గమనార్హం.
ఈ మధ్యనే రాజమహేంద్రవర అవధానంలో ఒక అవధానికి ఇచ్చిన సమస్య:
ఆరింటను నారు దీయ నారే కాదా?
ఇందులో ద్రుతం ఎక్కడ, అచ్చులు ఎక్కడ ఉన్నవి చూసుకుని అర్థం చేసుకుని పూరించుకోవాలి. ఈ విధంగా సమస్యల్లో సంధులు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి.
సమాస భరితంగా చెప్పే పద్యాలలో సంధుల పాత్ర అనిర్వచనీయం. అవి సంస్కృతసంధుల ప్రవాహంతో అందగిస్తాయి. కానీ వ్యస్తపదాలతో (విభక్తులు చేర్చి) పద్యం చెప్పి మెప్పించడం కొంత గహనమైన విషయం. ఈ ధోరణిలో అత్వ-ఇత్వ సంధుల్లో బహుళ-వికల్పత్వాలు కవులకు, అవధానులకు ఎంతో సహాయకారులుగా ఉంటాయి. ఉత్వసంధి విధిని దాటడం అవధాన విద్యాభ్యాసకులకు కొంత కఠినంగా ఉండవచ్చు కానీ, చేయి తిరిగిన అవధానులకైతే ధార ప్రధానంగా చూస్తే ఈ ఉత్వసంధి ఎంతో మేలు చూస్తూ ఉంటుంది.
3.3. ద్రుతాన్ని గుర్తించి పదవిచ్ఛేదం చేయగలగడం
అచ్చులతో పాటు, ద్రుతం కూడా పద్యరచనలో... అందులోనూ ఆశు కవిత్వం చెప్పాల్సిన అవధానపద్యాలలో ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది.
సమస్య: ఆరింటను నారుదీయనారేకాదా? (రాజమహేంద్రవరం అవధానం, 23.2.25)
కం॥ వైరులు నార్గురు జనులకు,
వారిని 'కులపథము' నుండి బయటకు పంపన్,
మీరగ సాధన మెయిలోన్
ఆరింటను నారు దీయ నారే కాదా?
(కులపథము= షట్చక్రమార్గము, వైరులు ఆర్గురు = అరిషడ్వర్గము)
తెలుగుభాషలో రెండు రకాల పదాలున్నాయని వ్యాకరణం చెబుతోంది. అవి ద్రుతప్రకృతికాలు, కళలు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకోవడం అవధాని ప్రాథమికకర్తవ్యం. తద్వారా ద్రుతసంయుతంగా, రహితంగా సంధులుచేసి శబ్ద- సాధుత్వాన్ని ప్రదర్శించవచ్చు. “దృతప్రకృతికముల కచ్చుపరమగుచో సంధిజరుగదు. యడాగమము రాదు. పొల్లు నకారము మీది యచ్చుతోఁ గూడి యక్షరమగును. ఉత్వవిశిష్టమయిన నకారము ద్రుతమన్నచో ఉత్వసంధి ప్రవర్తిల్లును” (పురుషోత్తం, వికాసవ్యాఖ్య. పుట. 16) అని “న్”, “ను“లను ద్రుతాలుగా పరిగణిస్తే సంధివిధానం పేర్కొన్నారు.
4. సమాసవిధానం
4.1. సమాసలక్షణం
సమర్థంబు లగుపదంబు లేకపదం బగుట సమాసంబు (చిన్నయసూరి, బాలవ్యాకరణం, సమాస. పరి., సూ. 1)
అనే సూత్రం ప్రకారం, సామర్థ్యమున్న పదాలు ఒకే పదంగా ఏర్పడ్డం సమాసమని సూరి వివరించారు. అయితే ఆ సామర్థ్యం ఏమిటి? సమాస కల్పనంలో పూర్వోత్తర పదాలు ఏవై ఉండాలి? ఆచ్ఛిక పదాలన్నీ తమలో తాము కలిసి సమాసాలవుతాయా? వంటి సూక్ష్మాలను వ్యాకర్తలు, విమర్శకులు చర్చించారు. వేరువేరు అర్థాలు ఒకే అర్థాన్ని పొందటమే సామర్థ్యం అని... (ఏకార్థీభావంబు సామర్థ్యంబు) సూరి ముందుగా చెప్పి, వాక్యాలలో ఉండే వ్యపేక్షా సామర్థ్యము (ఆకాంక్షవల్ల పదాలకు పరస్పరాన్వయం, ఘంటాపదం, పుట. 328) అనే సామర్థ్య భేదాన్ని కూడా పేర్కొన్నారు. “తొలిది అర్థ సమ్మేళనమని, మలిది శబ్ద సమ్మేళనమని రెండును కుదిరిన కానీ సమాసం ఏర్పడదని” అని వికాసవ్యాఖ్య (పుట. 251) పేర్కొంది. రెండు పదాలు కలిసి సమాసమైందంటే ఏక పదమైందని అర్థం. అలాంటి ఏక పదం ఇంకొక పదంతో కలిసినా ఏక పదమే అవుతుంది. సమాస పరిజ్ఞానానికి ముందుగా పదజాల విభాగ జ్ఞానం అవసరం. తత్సమ శబ్ద సిద్ధిని తెలుసుకోవడం, ఆచ్ఛికాల ఉపయోగం, గ్రామ్యాల పరిహరణ అవధాన కవిత్వానికి అత్యావశ్యకం.
4.2. బాలవ్యాకరణం ప్రకారం సమాసవర్గీకరణ
సంస్కృతాచ్ఛిక మిశ్ర సమాసాల ప్రయోగ కౌశలం అవధాన పద్యాలలో ముఖ్యం. బాలవ్యాకరణంలో సంజ్ఞా, సంధి, తత్సమ, ఆచ్ఛిక, సమాసపరిచ్ఛేదాల వల్ల ఈ జ్ఞానం మరింత పటిష్టమవుతుంది. రాజాజ్ఞ, తటాకోదకము, లక్ష్మీవల్లభుడు సిద్ధ సమాసాలుగాను, రాజు నాజ్ఞ, తటాకంబు నుదకము, లక్ష్మి వల్లభుడు సాధ్యసమాసాలుగాను సూరి ఉదాహరించారు. తత్సమాలను సిద్ధింపచేసుకునే డు-ము-వుప్రత్యయాంత రూపనిష్పత్తిని సూర్యనారాయణీయము పేర్కొంది (సూర్యనారాయణీయము, పుటలు. 125-146). ఱేనియానతి, చెఱువు నీరు, సిరి చెలువుఁడు ఆచ్ఛిక సమాసాలుగానూ, రాజు ముదల, చెఱువు నుదకము, సిరి వల్లభుడు మిశ్ర సమాసాలుగా పేర్కొన్నారు. తత్పురుషాదులలో వ్యధికరణానికి ఉదాహరణలుగా దొంగ భయము, రాముని బాణము, మాట నేర్పరి; కర్మధారయానికి ఉదాహరణలుగా తెల్ల గుఱ్ఱము, మంచి రాజు; ద్విగువుకు – ముజ్జగములు, ముల్లోకములు; బహువ్రీహికి- ముక్కంటి, చలి వెలుగు; ద్వంద్వానికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు లక్ష్యాలను సూచించారు. చిగురుఁగేలు, జుంటి మోవి ఉపమాన పూర్వపద కర్మధారయాలని, సంస్కృత సమాస లక్షణానికి భిన్నంగా ఏర్పడు సమాసానికి ఉదాహరణగా చెప్పి, ముఖ పద్మము, చరణ కమలములు ఉప. ఉ.పద కర్మధారయాలని, వాటిని త్రిప్పి పద్మ ముఖము, కమల చరణాలు అనకూడదన్నారు. కేవల సంస్కృత శబ్దాలు (అనేక, అల్ప) – అచ్చ తెనుఁగు శబ్దాలతో సమసింపవని ‘అనేక మాఱలు’, ‘అల్పదండు’ వంటివి దుష్ట సమాసాలని నిర్దేశించారు. వీటిని అనేక పర్యాయాలు, పెక్కుమాఱులు అనో; అల్పసమూహము, చిన్నదండు అనో అంటే సరిపోతుంది. కేతన పేర్కొన్న పదార్థ ప్రాధాన్యమున్న చతుర్విధసమాసవిభాగము సూరి గుర్తించలేదని... ‘క్రేగన్ను’, ‘పెడతల’ వంటివి పూర్వపదప్రాధాన్యం గల అవ్యయీభావ-సమాసాలని అహోబలపండితుని ఉటంకిస్తూ బాలవ్యాకరణవికాసవ్యాఖ్యాకారుడు పేర్కొన్నారు (బాలవ్యాకరణ వికాసవ్యాఖ్య 254-255).
4.3. ఆచ్ఛికసమాస నిర్మాణనియమాలు
ముఖ్యంగా ఆచ్ఛిక సమాస కల్పనకు నియమాలను సమాస పరిచ్ఛేదం (సూ. 5-7) స్పష్టం చేస్తోంది. తెలుగు కర్మధారయ సమాసాలలో పూర్వపదం- 1) ‘త్రికం’, (ఆచందము, ఈచిందము, ఏబృందము) 2) ‘స్త్రీసమం’ (వాడి మాట, పోడి పాడ) 3) ‘ముగంతం’ (బెడిదపుటడిదము) లేక 4) ‘ధాతుజ విశేషణం’ (మడిసెడు దడములు) అయి ఉండాలని సూరి శాసనం. ఆఈఏలు అనే సర్వనామాలు త్రికాలని సూరి కల్పన. ప్రథమైకవచనం లోపించిన అచ్చతెనుగు పదాలు స్త్రీసమాలు. ముగంతము అంటే మువర్ణకాంతము అయిన (ముగాగమ) పదం - బెడిదము. ధాతువుకు ‘ఎడు’ వంటి ప్రత్యయాలు చేరి ఏర్పడు విశేషణాలే ధాతుజ విశేషణలు (మడిసెడు).
పుంలింగతుల్య పదాలలో సమాసం కాదని నిషేధించారు. “బల్లిదుడు మల్లుడు”, “కావలుడు రావణుడు” వంటి వాటిలో పూర్వ పదాలు పై నియమాలలో ఒదగక పోవడం వల్ల బల్లిద మల్లుడని, కావల రావణుడని సమాసాలు కావని సూచించారు. ఇదే విధంగా స్త్రీసమాలతో బహువ్రీహి సమాసం (ముక్కంటి, వేగంటి, చలి వెలుగు, వే వెలుగు), ఆచ్ఛిక శబ్దాలతో స్త్రీసమాలు కలిసి ద్వంద్వ సమాసం (అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఊరు వల్లెలు, ఆలు మగలు) అవుతాయి. ఈ విధంగా తెలుగులో సమాస విధానం, సమాస ప్రక్రియలు తెలుసుకొని ఉండడం అవధాన కవిత్వానికి చాలా అవసరం.
4.4. అవధానపద్యపూరణలలో సమాసప్రయోగాలు
ఒక అష్టావధానంలో దత్తపది- శక్తి, భక్తి, రక్తి, ముక్తి అంశాలు. బాలాత్రిపురసుందరి ప్రార్థన. అవధాని పూరణలోని సమాసాలు గమనిద్దాం.
ఉ. భక్తిని నిల్పుచున్ లలితపాదములన్ స్మరియించు రక్తితో
శక్తిని నాకొసంగుడని సర్వము నీవె యటంచు నెంచి యా-
సక్తిని పెంచి నీపయి నచంచలరక్తిని గూర్చి పిమ్మటన్
ముక్తినొసంగుడంచు కయిమోడ్చి భజించెద నిన్ను సుందరీ.
ఈ పూరణలోని అచంచలరక్తి, లలితపాదములు సిద్ధసాధ్య సమాసాలకు ఉదాహరణలు.
ఇదే అవధానంలో ఇచ్చిన వర్ణనాంశం గమనించండి. పిల్లల పరీక్షల సమయంలో అందరికీ విజయం లభించాలని సరస్వతీ ప్రార్థన. అవధాని పూరణ:
ఉ. నీవె కదా సమస్తధరణీతలమందున జ్ఞానదాత్రివై
నావని ప్రస్తుతించె దరనారతమున్ కడుభక్తితోడ వి-
ద్యావినయమ్ము మాకొసగి తథ్యము నేటి పరీక్షలందు దే-
వీ! విజయమ్ము మాకిడుమ వేగమ గొల్తుము నిన్ సరస్వతీ.
ఈ పూరణలో సమస్తధరణీతలము, జ్ఞానదాత్రి, విద్యావినయమ్ము మొదలైన సాధ్య సమాసాలను, కడుభక్తి అనే మిశ్ర సమాసాలను గమనించవచ్చు.
అనంతపురం శృంగేరీ శారదాపీఠంలో జరిగిన అవధాన సప్తకంలో మరో అవధానంలో దత్తపదిని చూద్దాం. వాణి, వేణి, శ్రేణి, శ్రోణి - పరీక్షా కాలంలో విద్యార్థులపై దయ చూపమని సరస్వతీ ప్రార్థన చేయాలి. అవధాని పూరణ:
శా. వాణీ! నీ పదపంకజంబులను నే ప్రార్థింతు సద్భక్తితోన్
వీణానాదవినోదబంభరలసద్వేణీ! దయన్ జూపవే
నీ నామంబె శరణ్యమౌ మొదటిశ్రేణిన్ నిల్పు విద్యార్థులన్
క్షోణీపండితవంద్యమానపులినశ్రోణీ! నినున్ గొల్చెదన్.
పద పంకజ, వీణానాదవినోదబంభరలసద్వేణీ, క్షోణీపండితవంద్యమానపులినశ్రోణీ!, మొదటిశ్రేణిన్ వంటి సంస్కృత సిద్ధ సమాస ప్రయోగాలతో పాటు, ఆచ్ఛిక సమాస ఘటనం ఈ పూరణలో గమనించవచ్చు.
చాలా అవధానాలలో పొరపాటున దుష్టసమాసాలు రావడం, సంస్కృతసమాసాల్లో లింగవ్యవస్థ పరంగా అవగాహనలోపించడం వంటివి గమనించవచ్చు. బహువ్రీహి ప్రయోగాల్లో తడబాట్లు, మిశ్రసమాసాల్లో సమాసప్రక్రియ చెయ్యడంలో లోటుపాట్లు కనిపిస్తుంటాయి.
4.5. ప్రయోగశరణం – గ్రహణవిధానం
వ్యాకరణం ప్రయోగాలను బట్టే వీటిని తెలుసుకోవాలి కానీ, అన్నీ లక్షణ రూపంగా తెలుసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది.
నిక్కలాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు (చిన్నయసూరి, బాలవ్యాకరణం, సమాస. 20)
మగటిమ్యాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు (చిన్నయసూరి, బాలవ్యాకరణం, తద్ధిత. 8)
...మహత్ప్రయోగంబుల నెఱుంగునది (చిన్నయసూరి, బాలవ్యాకరణం, తద్ధిత. 28)
యథావ్యవహారంబుగా గ్రాహ్యంబులు (చిన్నయసూరి, బాలవ్యాకరణం, కృదంత. 1)
...మహాజనవ్యవహారానుసారిగా నెఱుంగునది. (చిన్నయసూరి, బాలవ్యాకరణం, కృదంత. 1, వృత్తి)
తక్కుంగల విశేషంబులు నార్యవ్యవహారంబులఁ దెలియుట శ్రేయంబు. (చిన్నయసూరి, బాలవ్యాకరణం, ప్రకీర్ణక. 25)
వంటి ప్రస్తావనలు కవి ప్రయోగాల ఆధారంగా లక్షణాన్ని గ్రహించాలనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
“దృష్టం కి మపి లో కేస్మి న్న నిర్దోషం న నిర్గుణమ్,
అవృణుధ్వ మతో దోషాన్ వివృణుధ్వం గుణాన్ బుధాః”
ఉపసంహారం
- అవధానకవిత్వంలో బాలవ్యాకరణసూత్రాలు, వాటి ప్రయోగాల ప్రాముఖ్యాన్ని గుర్తించాలి. తత్సమ, ఆచ్ఛికశబ్దాల పై సరైన అవగాహన, వాటిని అవధానపద్యపూరణలలో వినియోగించడం అవధాని శైలికి వన్నె తెస్తుంది.
- సంధివిధానం, ముఖ్యంగా అచ్చు సంధులు, ద్రుతసంధులు, పద్యపూరణకు సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. సమాసవిధానాలపై పరిజ్ఞానం, వాటి వర్గీకరణ, నిర్మాణనియమాలు పద్యరచనా- నైపుణ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.
- శబ్దార్థచమత్కారాలను సృష్టించడంలో సంధి, సమాసనియమాలకు ప్రత్యేకస్థానం ఉంది. వ్యాకరణం కేవలం నియమబద్ధం మాత్రమే కాదని, ప్రయోగాల ద్వారానే పరిపూర్ణంగా తెలుసుకోదగిందని తేటతెల్లమైంది.
- కవిత్వంలో చమత్కారానికి పదభేదజ్ఞానం ఎంతో అవసరం. సంస్కృతశబ్దాన్ని తెలుగుగా, తెలుగుపదాన్ని సంస్కృతంగా భ్రమింపజేస్తూ అర్థభేదాన్ని సాధించే విన్యాసాలకు అవధానంలో ఎక్కువ అవకాశం, ప్రయోజనం ఉంటాయి. కాబట్టి అవధానాలలో తత్సమ, ఆచ్ఛికపద, పదార్థభేదాలు తెలుసుకుని ఉండడం ఎంతో అవసరం.
- వివిధచ్ఛందస్సుల్లో గణనియమాలను అనుసరించి తెలుగు పద్యనిర్మాణంలో ఉత్వ, అత్వ, ఇత్వ, సరళ-గసడదవాదేశాలు, ఆగమసంధులు ప్రముఖపాత్ర వహిస్తాయి. కలపడం, విడగొట్టడం, అక్షరాలలో కలిగే మార్పులు వంటి సంధివిధానాలు అవధానాంశాలలోని సంక్లిష్టను దాటడానికి అవధానికి ఎన్నో ఉపాయాలను కల్పిస్తాయి.
- అవధానంలో పృచ్ఛకులడిగే అంశాలలో వివిధభావాలకు తగ్గట్టు పద్యం చెప్పే సందర్భంలో సామాన్యశబ్దాలు, పూర్వప్రయోగాలు వాడుతూనే... నూతనపదనిష్పాదన, సమాసకల్పనలు చెయ్యడం అవధానికి అవసరం. సిద్ధ, సాధ్యసమాసాలు విరివిగా చేసినా, తెలుగుసమాసప్రయోగాలలో లక్షణజ్ఞానం నిర్దుష్టతని కలిగిస్తుంది.
- నేటి అవధానకవిత్వంలో సంధివిధానాల్లో ఉత్వసంధికి అక్కడక్కడా సడలింపులు కనిపిస్తున్నాయి. ద్రుతప్రకృతులు – కళల తారతమ్యం తెలియకపోవడం, అనవసరమైన యడాగమరూపాలు చెయ్యడం, దుష్టసమాసాలు వంటివి కనిపిస్తున్నాయి.
- కేవలసంస్కృతశబ్దాలు తెలుగుపదాల సమాసాలు ఎక్కువయ్యాయి. సమాసంలో విభక్తికే లోపముండడం, లడాగమానికి విధించకపోవడం గమనించవలసిన విషయాలు. పద్యాలలో ఇవి తప్పక చూసుకోవాలి.
- గణనియమాలకు కట్టుబడి పదాలను సాగదీయ్యడం, అనుచితంగా విరవడం, రాని వృద్ధులు, గుణాలు కల్పించడం, నిత్యత్వానికి వికల్ప, బహుళత్వాలను ఆపాదించడం, ప్రాథమికమైన సంధిస్వరూపాన్ని పాటించకపోవడం వంటివి అవధానాభ్యాసకులలో కనిపిస్తున్న వ్యాకరణాతిరిక్తధోరణులు.
- క్రియల నుండి నామాలను నిష్పాదించడంలో వ్యాకరణనియమభంగాలు కనిపిస్తున్నాయి. తద్ధితలను రూపకల్పనలో కూడా తన, ఱిక, ఇమి, న, వంటి భావార్థ, స్వార్థ, మతుబర్థక ప్రత్యయాల ప్రయోగాల్లో ఏ ఏ గణాలకు ఏఏ ప్రత్యాయాలు చేరుతాయన్నది పూర్వప్రయోగజ్ఞానం ద్వారా తెలుగుకోవలసిన అవసరం ఉంది.
- క్రియాపదలోపం, అన్వయలోపాలు, కాలబోధక, వచన ప్రత్యయాల ప్రయోగాల్లో లోటుపాట్లున్నాయి.
- అవధానకవిత్వంలోని సంధి, సమాసావిధానాలలో నిర్దుష్టతకు కొన్ని శాబ్దికవ్యాయామాలు ఉపయోగపడతాయి. పూర్వకవిప్రయోగాల నిరంతరాధ్యయనం; ప్రసిద్ధపూర్వావధానపద్యానుశీలన; సంస్కృతవ్యాకరణం, బాలవ్యాకరణాలను వ్యాఖ్యాన-సహితంగా సమగ్రంగా పరిశీలించడం; కవిప్రయోగాలను సూత్రసమన్వయం చేస్తూ రూపసాధనప్రక్రియల ద్వారా సాధించడం; సూత్రప్రతిపాదితమైన నియమాల ఆధారంగా మరికొన్ని ఉదాహరణలను సొంతంగా ఊహించగలడం మొదలైన అభ్యాసాలు అవధాన కవిత్వంలో వ్యాకరణస్థాయిని తగ్గించకుండా కాపాడుతాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- అవధానపుష్కరిణి పత్రిక. డిశంబరు, 2025 (సంపుటి-1 సంచిక-4). అవధానవిద్యావికాసపరిషత్, భాగ్యనగరం, 2025
- అవధానసప్తకం వీడియోలు, ఆరాధ్య – స్త్రోత్రనిధి యూట్యూబ్ ఛానల్. లింక్, 01.2026.
- పురుషోత్తం, బొడ్డుపల్లి. చిన్నయసూరి బాలవ్యాకరణము (వికాసవ్యాఖ్య). స్టూడెంట్సు ఫ్రండ్సు, సరసరావుపేట. 1977.
- రామకృష్ణారావు, వంతరాం. బాలవ్యాకరణఘంటాపథము. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2016
- వేంకటశాస్త్రి, చెళ్ళపిళ్ళ. కథలు - గాథలు. వేంకటేశ్వర పబ్లికేషన్సు, కడియము. 1958.
- సుబ్బన్న శతావధాని, సివి. అవధానవిద్య. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1987
- సూర్యనారాయణశాస్త్రి, మల్లాది. సూర్యనారాయణీయము (ప్రథమ-ద్వితీయభాగములు). ఆంధ్రభాషానుశాసనము నాల్గవకూర్పు. 1926.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

