AUCHITHYAM | Volume-7 | Issue-1 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. వెలుగులోకి రాని తెలుగు కవి కంచర్ల శరభన
ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి
తెలుగు శాఖాధ్యక్షులు
కాశీ హిందూ విశ్వవిద్యాలయం
వారణాసి, ఉత్తరప్రదేశ్
సెల్: +91 9453884292, Email: sreeramachalla@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.12.2025 ఎంపిక (D.O.A): 25.12.2025 ప్రచురణ (D.O.P): 01.01.2026
వ్యాససంగ్రహం:
కంచర్ల శరభన క్రీ.శ. 15 వ శతాబ్దికి చెందిన తెలుగు సాహిత్యంలో వెలుగులోని రాని తెలుగు కవి.ఈ కవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణాజిల్లా మేడూరు గ్రామ వాసులు. ఇతని ముత్తాతలనుండి పద్యకవిత్వము,ద్విపద రచనలు చేశారు. పండితవంశానికి చెందినవారు. పూర్వీకులు స్థల కరణాలుగా విధులు నిర్వహించారు. శ్రీకాకుళాంధ్రదేవుని శాసనాలలో ఈ కుటుంబీకుల ప్రస్తావనలు లభిస్తున్నాయి. కంచర్ల శరభన తెలుగులో అధ్యాత్మ రామాయణాన్ని మొదటగా అనువదించారు. ఈ పుస్తకం నేటికీ ముద్రితం కాలేదు. బాలకాండ పూర్తిగా, అయోధ్యాకాండలో కొంత భాగం మాత్రమే 1917నాటి కాగిత వ్రాతప్రతిగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలోనే లభిస్తోంది. ఈ కవి కాలం ప్రాంతం, ఆయన రచనలోని విశేషాలు అందించే సమగ్ర పరిశోధనాత్మక వ్యాసం.
Keywords: కంచర్ల, శరభన, అధ్యాత్మ రామాయణం, వ్రాతప్రతి, పరిశోధన
1.0 ప్రవేశిక
కొందరు కవులు రాసిన పుస్తకాల పేర్లు తెలిసినా అవి లభ్యం కావడం లేదు. కొందరు కవుల రచనలు లభిస్తున్నా, వారి కీర్తి వెలుగులోకి రానివారు ఎందరో ఉన్నారు. ఈ రెండవ కోవలో కంచర్ల శరభన కవిని ప్రస్తావించాలి. ఆయన ఆపస్తంబ సూత్రుడు; ఆత్రేయస గోత్రుడు; నియోగి బ్రాహ్మణుడు. ఈ కవి తెలుగులో అధ్యాత్మ రామాయణాన్ని పద్యగద్యోభయ చంపూప్రక్రియలో రచించాడు. ఇది అయోధ్యకాండలో కొంత భాగం మాత్రమే లభిస్తున్న అముద్రిత రచన. ఈ ప్రతి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. (క్రమ సంఖ్య R.313) దీనిలోని వివరాల ప్రకారం, ఈ వ్రాతప్రతి లేఖనకాలం 5-3-1917. దీనిలోని వ్రాత దోషాలు 07-03-1918 వరకు సరిదిద్దినట్టు తెలుస్తోంది. (ఈ వ్యాసరచయుత తెలుగు అధ్యాత్మరామాయణములపై తులనాత్మకపరిశోధన చేసినప్పుడు1988లో వెలికిదీశారు)
అప్పటి కృష్ణాజిల్లాలోని కృష్ణాపురం నివాసి కంచర్ల రామారావు 1916-17 సంవత్సరాల మధ్య అందజేసిన తాళపత్ర గ్రంథం ఆధారంగా, (ఈ తాళపత్ర గ్రంథం పసుమర్తి వేంకటప్పయ్యగారు స్వహస్తాలతో రాసింది) మద్రాసులోని ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం వారు కాగితాలపై ప్రస్తుత వ్రాతప్రతిని తయారు చేయించారు. ఈ ప్రతి మద్రాసు నుండి పైన పేర్కొన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారానికి 17-09-1962న తరలించబడింది. దీని ఆధారంగానే కంచర్ల శరభన కవి వెలుగులోకి వచ్చే అవకాశం దక్కింది.
1. కంచర్ల శరభన నివాసం
1.1. కవి వంశ వర్ణన
తన వంశ మూలపురుషులను కంచర్ల శరభన వర్ణించిన పద్యాన్ని గమనిద్దాం.
సీ. శోభితాపస్తంబ సూత్రు డాత్రేయస - గోత్రుండు కంచర్ల కుల పవిత్రు
డలరు మేడూరి సీమల మూలమున కెల్ల - స్థల కరణం బైన ధన్య చరితు
డిల సప్త సంతానము నిల్పి ప్రఖ్యాతి - గైకొని రాజిల్లె ఘనులు మెచ్చ
నిత్యాన్నదాన నిర్ణిద్రవైభవ సంప - దలు పెంపు బాటింప దనరునట్టి
తే.గీ. దానకర్ణుడు సత్యవ్రతానువర్తి విబుధ -సంస్తూయమానన్వయ వితత కీర్తి
సరస విశ్రుత రామన శంభుమూర్తి - సరవి ముఖ్యుండు ధార్మిక చక్రవర్తి (అధ్యాత్మ రామాయణము –పుట.4)
రామన సప్తసంతానములు నిల్పినాడనుటవల్ల గ్రంథరచనలు కూడా చేశారని చెప్పవచ్చును. ఇతడు మేడూరు స్థల కరణము, కర్ణుని బోలెడు దాతృత్వగుణం కలవాడని తెలుస్తోంది. వీరి వంశీయులు కృష్ణాజిల్లా వాసులని నిర్ణయమైంది. శరభన రాసిన అధ్యాత్మ రామాయణ రచనను అనుసరించి కవి వంశవృక్షం ఇలా తెలుస్తోంది.
1.2. వంశ వృక్షం
Image
శరభన తన తాతగారు, కాశీఖండ ద్విపద అనువాదకుడు అయిన అయ్యనామాత్యుని ప్రతిభ, ఘనతలను ఇలా కీర్తించాడు.
సీ. ఏ మంత్రివాక్ర్పౌఢి సోమశేఖర శేష - భాషాదులను చాల పరిహసించు
యే పుణ్య నిధి దానమై సూన మందార - మేఘములతొ కూడి మేలమాడు
నే ధార్మికుని రూపమిక్షుకోదండ - జయంత వసంతుల పంతగించు
నే మంత్రి కవనంబు సోమ భాస్కర - బాణ కాళిదాసాదుల గరిమ దనరు
అతడు నుతికెక్కి సర్వదిగంతరాళ - పూరితామేయ సత్కీర్తి భూషణుడు
అమిత విభవుండు కంచర్ల యన్వయుండు - మంత్రి మాత్రుండె అయ్యనామాత్ర ఘనుడు.
1.3. అయ్యనామాత్యుని కీర్తి ప్రతిష్ఠలు
అంతేకాకుండా అయ్యనామాత్యుడు పెక్కు దానధర్మాలు కావించాడని, మేడూరు పురమునందు సుబ్రహ్మణ్యేశ్వరాది దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించాడని, మధురాపురమునకు వెళ్లే త్రోవలో వనములు, బావులు ఏర్పాటు చేయించాడని ఇలా కొనియాడాడు.
సీ. కృష్ణాపురమున కీర్తి నానందింప - మేడూరు పురమున బ్రమద మలర
నాగేశ్వరుని సురనాధు మార్కండేశు - స్థిర బుద్ధితోడ ప్రతిష్ఠ జేసి
వనములు, బావులు ఘనముగ వేయించె - మధురాపురము త్రోవ మనుజ కోటి
కృష్ణవేణికి జన కృపనూది రావులు - ప్రేమ నిల్పెను భక్తి వృద్ధిబొంద
కవిత రచనలు గుల్కెడు బల్కులమర - శబ్ద నాటకాలంకార సరణులొప్ప
చెల్వు మెరయ కాశీఖండ మెలమి - ద్విపద జేసె కంచర్ల యయ్యన శ్రీలు బ్రబల
గీ. ఖ్యాతి నీరంకిలో రెండు నూతులొనరు
గరిమ నేయించే నన్న సత్తరవులునిచె
సరవి వడుగులు పెళ్లిళ్లు చాలాజేసే
కంచర్ల అయ్యనామాత్య కవి వరుండు (అధ్యా. రామా. పుటలు. 6, 13)
1.4. కవి వంశ నేపథ్యం
ఈ పద్యాల్లో పేర్కొనబడిన కృష్ణాపురం, మేడూరు, ఈరంకి గ్రామనామాలు శరభన వంశజులు కృష్ణా జిల్లా వాసులని తేటతెల్లం చేస్తోంది. కొండపల్లి, గొల్లపూడి, తంజావూరు పురములందునూ కంచర్ల వంశం వారు నివసించేవారని కవి తన పుస్తకంలో ధృవీకరించాడు. ఇందు తంజావూరు మినహా, మిగిలిన గ్రామాలన్నీ విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్నవే. శరభనగారి ఈ వ్రాతప్రతికి ఆధారభూతమైన తాళపత్ర గ్రంథాన్ని మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయం వారికి అందజేసిన కంచర్ల కుటుంబరావు కూడా కృష్ణా జిల్లాలోని కృష్ణాపురం నివాసి అనే గమనించాలి. ఈ ఆధారాలనుబట్టి కుటుంబరావును ఈ కంచర్ల శరభన వంశం వారేనని తేల్చవచ్చును. (పరమ భక్తాగ్రేసరుడు, రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్నకును, వీరికి బంధుత్వం ఉండనోపును.)
2. శరభన కవి కాల నిర్ధారణ
ఈ కవి కాలాదికాలు తెలియడం లేదు. అయితే ఈ శరభన తాతగారి తాత, వీరి వంశ మూలపురుషుడు అయిన రామనామాత్యుని కాలాన్ని తెలిపే శిలాశాసనం ఒకదాన్ని అధ్యాత్మ రామాయణ కవి శరభన తన పుస్తకంలో వివరించాడు. ఇది వీరప్రతాపదేవరాయల కాలంలో, ఆ రాయలవారికి పుణ్యలోకావాప్తి లభించు నిమిత్తం, రంగారాయనింగారు శ్రీకాకుళంలో ఆంధ్రవల్లభ దేవునకు, పన్నెండు పుట్ల విత్తనములు చల్లుటకు చాలినంత భూమిని ఈనాముగా ఇస్తూ వేయించిన శిలా శాసనం. ఈ నియమం సక్రమంగా జరిగేటట్లు చూడడానికి గాను, ఈ భూమిని సత్య సంపన్నుడైన కంచర్ల రామన్న గారి వశం చేశారని, శరభన వివరించిన పద్యం ఇలా ఉంది:
2.1. శిలాశాసన వివరణ
సీ. శకవత్సరంబులు శశి ఋతుగణ - చంద్రులగు క్రోధానాబ్దంబునందు
భాద్రపద శుద్ధ ద్వాదశి భానువారం - బున భూపతి వీర ప్రతాప దేవ
రాయలకును బుణ్య మాయతంబుగ - గొండ పలికెస్తనడి యలుకేమి తెలిపి
*రనుచు వీరెనని రంగ రాయని గారు - యీనామొసంగిరి భూనుతముగ
తే.గీ. నెలమి శ్రీకాకుళంబున వెలయు తెలుగు - వల్లభుస్వామికతి భక్తి వర్ధిలంగ
సమురుపడి పిన్న తిరువడి ఘములకును - అంగరంగ వైభవముల కమర
కం. రామానుజ కూటంబున - కా మీదట నృత్య గీత యాచక తతికిన్
దోమాలికకున్ భోగము - భామలకును నిత్య వాద్య పారీణులకున్
సీ. మేడూరి పొలము లోడ్కు యష్ట భో- గాతి తేజ స్వామ్య మలరు నట్టి
స్థల కరణం బైన సత్య సంపన్నుడు- కంచర్ల రామన్న గారి వశముగా
సర్వ మాన్యముగను మణ్గు నాటిని- పొలుపు నాటిని పండ్రెండ్లు పుట్లు విత్తు
లొగి బారుమేర బాగుగ నా చంద్ర- తారార్కమై దనరు చుండు
తే.గీ. ననుచు రాతిపై నలరు శాసనంబు- ప్రఖ్యాతి జగతి విడంబమయ్యె
గజపతీశ్వరు డేలెడి కాలమందు- నిట్టి మర్యాద వర్తిల్లె నెట్టణముగ (అధ్యా. రామా. పుట.12)
* కాగిత వ్రాత ప్రతి (క్రమ సంఖ్య R 313) లో స్పష్టత లేదు.
2.2. విమర్శకుల అభిప్రాయాలు
చాగంటి శేషయ్య ఈ దాన శాసన కాలాన్ని శాలివాహన శకము 1361 అని, క్రీ.శ.1438 అనీ నిర్ధారించారు (ఆంధ్రకవితరంగిణి సంపుటం10-పుటలు.22, 23). ఆయన అలా నిర్ణయం కావించి, రామన మునిమనవడూ, కాశీఖండం ద్విపద రచయిత అయిన అయ్యనకు 15వ శతాబ్ది చివరి భాగమునగానీ, 16వ శతాబ్ది ప్రథమార్ధమునగానీ జీవించి ఉన్నట్లుగా భావించారు (శేషయ్య 10). తరమునకు 25 సంవత్సరంల చొప్పున లెక్కిస్తూ నిర్ధారింపబడని కవుల కాల నిర్ణయం చేయడం తెలుగు విమర్శకుల సంప్రదాయం. దీన్ని కందుకూరి వీరేశలింగం పంతులు కూడా బలపరిచారు. శరభన, పై శాసనంలోని రామనకు 5వ తరము వాడు. అలా 125 సంవత్సరాల తరువాత వానిగా లెక్కించి కంచర్ల శరభన క్రీ.శ.1563 నాటికి యువకుడని భావించుట సముచితమన్నారు. ఈ లెక్కింపు శరభన తాతగారి శాసన కాలానికి, చాగంటి శేషయ్య అభిప్రాయానికి సరిపోతుంది. అంతేకాకుండా శరభన తన అధ్యాత్మ రామాయణంలో కావించిన పూర్వ కవి స్తుతికి, శరభన కాల నిర్ణయానికి అనుకూలంగా ఉంటుంది. ఆ పద్యం చూడండి:
సీ. కాళిదాసుని మాఘ కవిని, బాణ, - మయూర, - భారవి, ప్రముఖుల బ్రస్తుతించి
భవభూతి, దండుల ప్రస్తుతి గావించి - వరరుచి భీముల దలచి వేడి
ఘనముగా శ్రీహర్ష కవివరుగొని యా - నన్నయభట్టుని సన్నుతించి
సొంపుగా తిక్కన సోమయాజిని వేడి - భాస్కరు బినవీరు భక్తి గొల్చి
తే.గి. నవకవీంద్రుల ... శ్రీనాధు పోత - రాజు పింగళి సూరపరాజు నల్ల-
సాని పెద్దన తిమ్మన సరస రామ - లింగకవి రామభద్రుల లీల దలతు (అధ్యా. రామా. పుట.3)
ఇందు శ్రీనాథాదులను ప్రత్యేకంగా నవకవులని పేర్కొనడం గమనించాలి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులను ప్రస్తుతించాడు. వీరందరూ ఇంచుమించుగా క్రీ.శ.1550 ప్రాంతానికి ముందువారనే వాఙ్మయ చరిత్రకారులు చూపుతున్నారు. వీరందరకూ కొద్ది సంవత్సరముల తరువాత వాడు కావున, కంచర్ల శరభన వీరిని నవకవీంద్రులన్నాడు. ఈ ఆధారాన్నిబట్టి కూడా శరభన కవిని క్రీ.శ 1563 నాటికి నూనూగు మీసాల యువకుడని నిర్ధారించడం సముచితం.
ఆచార్య నిడుదవోలు వెంకట్రావు ఈ కవి కుంజరుడు క్రీ.శ.16వ శతాబ్ది వాడని తెలుపగా (ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక సంపుటి 10 పుట.38), ఆచార్య బిరుదురాజు రామరాజును సమర్థించారు (పండరినాథ రామాయణము. భారతి మే1961, పుట.4). ఈ ఆధారాలన్నీ కంచర్ల శరభనకవి క్రీ.శ.16వ శతాబ్ది తృతీయ పాదం నాటికి యువకుడని బలపరుస్తున్నాయి.
3. శరభన కవి గురువులు
మౌద్గల్య గోత్ర విభ్రాజితులు అయిన రమణ రాజేంద్రులు, అన్నమారాధ్యులు శరభనకు గురుదేవులు. తల్లి నరసమాంబ, భరద్వాజస గోత్రీకులైన ములుగూరు బాపనమంత్రి సంతతికి చెందినవారు. ఈ సంగతుల వలన శరభన పండిత వంశానికి చెందిన వాడని గమనించగలం. కానీ ఈ కవి వంశ మూలపురుషుడు అయిన రామన రచనలేవీ లభించడం లేదు. అయ్యన రచించినట్లు తెలుస్తున్న కాశీఖండ ద్విపద రచన కూడా అలభ్యమే. వీరి వంశీయుడిగా భావిస్తున్న కంచర్ల కుటుంబరావు చలువ వలన, శరభన అధ్యాత్మ రామాయణ రచన నేటికీ సాహితీ ప్రేమికుల చేతికి తిరుపతిలో వ్రాతప్రతిగా కన్నుల పండుగ చేస్తున్నది.
4. అధ్యాత్మ రామాయణ రచన నేపథ్యం
4.1. రచనకు ప్రేరణ
శరభన తన అధ్యాత్మ రామాయణ రచనకు ప్రేరణ విషయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు.
కం. భవబంధ ముక్తి కొరకై
కవనము రచయింపబూని కనుమూసినచో
నవకంజనేత్రుడొక్కడు
చెవిలో నాకిట్లు బలికె చిత్తంబలరన్.
“అధ్యాత్మ రామాయణ మాంధ్ర భాషాయామ్
కురు ప్రకాశం భవ బంధ ముక్తయే” (అధ్యా. రామా. పుట.3)
వచనం. అనంతరమబున మేల్కాంచి, స్వప్న ప్రకారంబు విచారించి, ప్రసాదంబున కార్య సాకల్యంబగునని
నిశ్చయించి, ఒక్క శుభ ముహూర్తంబున, మామక వంశావతారం బవధరించెద. (అధ్యా. రామా. పుట.4)
దీనిలో గ్రంథ రచన లక్ష్యం తెలుస్తోంది. దేవుని పలుకులు సంస్కృత శ్లోక రూపంలో సందర్భోచితంగా ఉన్నట్టుంది. భవబంధ విముక్తి నిమిత్తమై అధ్యాత్మ రామాయణాన్ని ఆంధ్ర భాష యందు రచించడానికి పూనుకున్నాడు. భక్త పోతన తాను భాగవతాన్ని రచించడానికి పూర్వకవులలెవరూ దీన్ని అనువదించలేదని సంతోషించినట్లుగానే, శరభన కూడా అదే బాణిలో గీత పద్యాన్ని రచించారు.
గీ. సంస్కృతాలెల్ల నాంధ్ర భాషను రచించి
రందు యధ్యాత్మ రామాయణంబు
నిలువ కవుల నేరమి గాదిల కరుణ నన్ను
ధన్యుగావింప దలచిన తలపుగాని (అధ్యా. రామా. పుట.12)
సంస్కృత గ్రంథాలను తెనిగిస్తూ, పూర్వ కవులెల్లరూ అధ్యాత్మ రామాయణాన్ని స్పృశించకపోవడమనేది, తనపట్ల కరుణ చూపడమే. తాను ఈ రచన ప్రారంభించి ధన్యుడనవుతానని ఆనంద పారవశ్యం పొందాడు. ఈ పద్యంలో శరభన వ్యక్తిత్వం, ఔన్నత్యం, భక్తితత్వం తెలుస్తోంది.
4.2. తొలి రచనగా అధ్యాత్మ రామాయణం
శరభన తొలి కృతి అధ్యాత్మ రామాయణమే. ఇది తొలి అనువాద రచన. ఇతని గ్రంథం అయోధ్యాకాండంలోని లక్ష్మణుని కోప ప్రకటన వరకు లభ్యమవుతుంది. శరభన సంస్కృత అధ్యాత్మ రామాయణ కర్తగా విశ్వామిత్రుని గుర్తించడం విశేషం. (అధ్యా. రామా. పుట.61) ఈ రచన అయోధ్య వాసి అయిన దశరధరామునికే అంకితమిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో లభిస్తున్న వ్రాతప్రతిని లేఖకుడు, ఇంకా వ్రాయడానికి ప్రయత్నించినట్టు మనకు తెలుస్తోంది. దీనికి ఆధారంగా ఆ వ్రాతప్రతి గ్రంథాంతంలో “సీ” అని ఉంది. సీస పద్యం వ్రాయడానికి ప్రయత్నించి కారణాంతరాల వలన తర్వాత వ్రాయలేదేమో అనిపించింది. ఇతర వివరాలు తెలియరావడం లేదు.
5. అధ్యాత్మ రామాయణ పద చర్చ
5.1. రామాయణ పుట్టుక
భారతీయ సంస్కృతీ వల్లరికి మూలకందాలు వేదాలు. ఈ వేదాలలోని భాష, భావం బాగా ప్రాచీనమైనదవడంవల్ల పండితులు కూడా సమగ్రంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన మహర్షులు వేదాల్లో చెప్పిన నీతి, ధర్మ, తత్త్వాదులు సమాజంలో అందరికీ తేలిగ్గా అర్థం కావడానికి లౌకిక సంస్కృత భాషలో కథోపాఖ్యానం కలిగిన గ్రంథాలు రాయడం ప్రారంభించారు. ఇక్కడ వేదాల్లో చెప్పిన భావాలే కావ్యరూపంగా తెలపడమే ఉద్దేశం. ఈ పద్ధతిలో సంస్కృత భాషలో మొదట వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం రచించారు. కొంతకాలం తర్వాత అధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం, జ్ఞానవాసిష్ఠం, శతకంఠ రామాయణం, యోగవాశిష్ఠం, ప్రసన్న రాఘవం మొదలైన కావ్యాలు సంస్కృతంలో వచ్చాయి. వీటన్నింటికీ వాల్మీకి రామాయణ కథా బలమే ఆధారం.
5.2. ఆధ్యాత్మ రామాయణ ప్రాముఖ్యత
అధ్యాత్మ రామాయణంలో కొన్ని ప్రత్యేక విశేషాలు గమనించాలి. దేవదేవుడు అయిన శ్రీరాముని తత్వాన్ని “ఆత్మానం మానుషం మన్యే” అనే నిగూఢ రీతిగా రామతత్త్వం వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ఇక్కడ శ్రీరాముడు మానవ మాత్రునిగానే భావించబడ్డాడు. కానీ అధ్యాత్మ రామాయణంలో వేదాంతబోధలు, తత్త్వబోధలు, సన్నుతులు, ఉపదేశాలు, స్తవములు వంటి ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువ. రామాదుల పరతత్త్వం లోకానికి తేలిగ్గా తెలియజేయాలనే తపనకు రూపకల్పనే ప్రాతిపదిక. శ్రీరామాదుల యదార్థ స్వరూపం ప్రజలందరికీ తేలిగ్గా తెలియజేయడమే అధ్యాత్మ రామాయణ మూలసూత్రం. ఇది ఉత్తరకాండతో కలిపి సప్తకాండలుగా, 65 సర్గలతో, 4 వేలకు పైగా శ్లోకాలతో ప్రకాశిస్తోంది.
5.3. 'అధ్యాత్మ రామాయణం' పదవ్యుత్పత్తి
అధ్యాత్మ రామాయణం అనే పదబంధాన్ని పరిశీలిద్దాము. అధి + ఆత్మ = అధ్యాత్మ లేక ఆధ్యాత్మ. ఈ అధ్యాత్మ పదాన్ని తద్ధిత రూపంగా చెప్పవచ్చును. ఆత్మని లేక ఆత్మనః అధ్యాత్మం. అనగా ఆత్మకు సంబంధించినది, ఆత్మ విషయమైనది అని అర్థం – ఆత్మ పరమైనదని భావం.
అందరికీ తెలిసినట్టుగానే రామస్య అయనం రామాయనం. సంస్కృత వ్యాకరణ శాస్త్ర నియమాలచే న-కారం, ణ-కారంగా వచ్చి, రామాయణం అవుతుంది. రామచరిత్రకు నిలయమైనదని అర్థం. ఆత్మనః అధికృత్య కృతం అధ్యాత్మం. అధ్యాత్మం చ తత్ రామాయణం చ అధ్యాత్మ రామాయణం అని దీని వ్యుత్పత్తి. ఆత్మను అనుసరించి శ్రీరాముని చరిత్రను వర్ణించు గ్రంథం, కావున దీనికి అధ్యాత్మ రామాయణం అనే పేరు సార్థకమవుతున్నది.
తెలుగు భాషలో అధ్యాత్మ రామాయణాన్ని వివిధ ప్రక్రియల్లో దాదాపు 36మందికి పైగా అనువదించారు. సంస్కృత భాషలోని రచనలు తెలుగు భాషలో అనువదించడానికి ఆదికవి నన్నయ చంపూ ప్రక్రియ ఉత్తమమని తన ఆంధ్ర మహాభారత రచన ద్వారా జాతికి తెలియజేశారు. ఆయన చూపిన దిశానిర్దేశమే ఉత్తమ మార్గం అని అనంతర కవులు అనుమోదించారు.
అధ్యాత్మ రామాయణాన్ని తెలుగున చంపూ ప్రక్రియలో రచన చేసిన మహనీయుడు కంచర్ల శరభన. ఇదే తెలుగు సాహిత్యంలో మొదటి అధ్యాత్మ రామాయణం. ఇది నేటికీ ముద్రించబడలేదు. బాలకాండ పూర్తిగాను, అయోధ్య కాండలో కొంత వరకు మాత్రమే కాగిత వ్రాత ప్రతి రూపంలోనే, నేటికీ తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో అందుబాటులో ఉందని గతంలో తెలుపుకున్నాము. ప్రస్తుతం కంచర్ల శరభన అధ్యాత్మ రామాయణ రచనా సౌందర్యాన్ని అవలోకిద్దాము.
6. శరభన కవి రచనా సౌందర్యం
అధ్యాత్మ రామాయణ ప్రారంభంలోని మాహాత్మ్యం నుండి కంచర్ల శరభన తమ రచన ఆరంభించారు. “ప్రాప్తే కలియుగే …….” అని సంస్కృత అధ్యాత్మ రామాయణంలోనుండగా, శరభనగారి అనువాదం “మహా ఘోరంబైన కలియుగంబు రాగలదు, అందు తరచుగా …….” అని యథానువాదం కావించారు. (కంచర్ల శరభన- వ్రాతప్రతి పుట.15) మూలంలోని శ్లోక భావాలు శరభన రచనలో వచన రూపం సంతరించుకున్నాయి. శరభన పూర్తి గ్రంథం లభించకపోవుట సాహిత్యాభిలాషాలకు విచార హేతువు. లభించినంతవరకు శరభన అధ్యాత్మ రామాయణ అనువాద రచన మూలానుసారిగనే సాగింది. అధ్యాత్మ రామాయణ మూల గ్రంథమున నారదుడు బ్రహ్మ దేవుని ప్రశ్నించడంతో ప్రారంభమైంది. లోకమున దురాచారములు ప్రబలినందుకు చింతించిన నారదుడు, భ్రష్టులు అయిన జనులకు మోక్ష సాధనోపాయాన్ని వివరించమని ప్రజాపతిని కోరాడు. ఇందుకు బ్రహ్మదేవుడు, అధ్యాత్మ రామాయణ పఠన శ్రవణ ఫలాలను, దాని మాహాత్మ్యాన్ని వివరించారు. దీనివలన జనులు తరిస్తారని వాణీపతి నారదమహర్షికి విశదపరచినట్టుంది. ఈ బ్రహ్మ-నారద సంవాద రూపమైన మాహాత్మ్యం, అరువది శ్లోకాలలో సంస్కృతాధ్యాత్మ రామాయణంలో విస్తృతంగా వివరింపబడింది. తర్వాత బాలకాండము నుండి గ్రంథ కథా భాగము ప్రారంభమైంది. ఈ మాహాత్మ్యాన్ని కంచర్ల శరభన యథాతథంగా అనువదించారు. కానీ చాలామంది చంపూ ప్రక్రియ అనువాద కవులు ఈ భాగాన్ని అనువాదంలో వదిలేశారు. దశరధుడు రాముని వనవాసానికి వెడలుమన్నాడని తెలుసుకున్న లక్ష్మణుడు కోపగించుకుని రామునితో “స్థిరముగ రాజ్య మేలుటకు సేయుము యత్నము....” అని సూటిగా మాట్లాడినట్లు కనిపిస్తుంది.
గ్రంథము పూర్తిగా లభించలేదని బాధే కానీ, కంచర్ల శరభన గారి రచన అనన్య సామాన్యమైనది. అహల్యా సౌందర్య వర్ణనలో శరభన కవితా శక్తి సాహితీ లోకానికి తెలిసింది. సందర్భశుద్ధితో పాటు, ధారాశుద్ధి కూడా ఈ కవి రచనలో గోచరిస్తుంది. సందర్భానుసారంగా విపుల వర్ణనలు కావించిన ఘనత శరభనకే దక్కుతుంది. కావ్య రచనలో దుర్వాసుల రామయామాత్యుని తర్వాత, వర్ణనలు కావించిన అధ్యాత్మ రామాయణ రచన చేసిన వారిలో కంచర్ల శరభననే ముందుగా పేర్కొనాలి.
7. రసానుగుణ పద్య రచన
7.1. కవిత్వంలో కైశికీ వృత్తి
రసానుగుణ పద్య రచన కావించుట కవుల సహజ లక్షణం. ఇది ఆయా తావుల్లో భావాన్ని పాఠకులు అవగతం చేసుకోవడంలో సహాయకారి అవుతుంది. ఇందు ఆలంకారికులు చూపిన వృత్తులు, రీతులు అనే శబ్దార్ధ సౌందర్యాన్ని కవులు ఆశ్రయిస్తారు. వీటిలో ఎక్కువ అవాంతర భేదాలున్నాయని కొందరు పండితుల భావన. ఉదాహరణకు కోమలములగు శృంగార, కారుణరస భావాలు వర్ణించే సందర్భంలో కైశికీ వృత్తి, మిక్కిలి మృదు పదాలతో, అల్ప సమాసాలుగానీ, అసమాసాలుగానీ ఉన్న రచనలు వైదర్భీరీతి అని నిర్దేశించారు. రసానుగుణ పద రచనా విన్యాసాన్ని పాటించిన వారిలో కంచర్ల శరభన దిట్ట.
7.2. అహల్యా సౌందర్య వర్ణన
రామలక్ష్మణులతో మిథిలా నగరానికి వెడుతున్నప్పుడు, విశ్వామిత్రమహర్షి మార్గంలో గౌతమాశ్రమ వృత్తాంతం వారికి తెలిపారు. ఇక్కడ శరభన గారి ఇంద్రుడు చూసిన అహల్యా సౌందర్యాన్ని వర్ణించిన తీరు మధురాతి మధురం. శృంగార రసానుగుణ సంభరితం. మచ్చునకు:
చం. కమలము మీద కూర్మమతి గాఢముగా బవళించెనంచు నా
కమలజు నాయకుండు నిజకార్ముక దక్షిణ తత్పదంబునన్
అమర నిషంగ యుగ్మమున యా కమఠంబున గృచ్చెనోయనన్
రమణికి పాద గుల్భములు రమ్య సుజంఘిక యుగ్మత యొప్పెడిన్ (అధ్యా రామా. బాలకాండ- పద్యం. 42)
ఈ పద్యంలో శరభన కల్పనా చమత్కృతి అసమానము. శృంగార రసపోషణకు అనుగుణమైన పదగుంభనము. శివధనుర్భంగము కావించిన రాముని పుష్ప మాలాలంకృతుని చేయుటకు వెడలుచున్న సీతను వర్ణించుటకు ప్రయోగించిన పదాలు సుందర తర శోభితములు.
7.3. సీతాదేవి సౌందర్య వర్ణన
సీ. నవరత్నమయ విభూషణమయ విభూషితాంగ - కాంతి దిక్కులు వెలుగంగ జేయ
శుభ ముఖాలంకార సూచిత దరహాస - కళల వేవెన్నెలల్ గాయుచుండ
మంజు ఝణత్కార మంజీర - రవములు మేఖలావళితో మేలమాడ
మౌక్తిక గురుహార మణిమయ తాటంక - సరుల సౌందర్యంబు గరిమనలర
తే.గీ. తరుణి సౌందర్యమలరు నిబ్బరము మెరయు - చతుర గుణశాలి సీత భూజాత యపుడు
కనక హారము రాముని కంఠమందు - వేసి నవ్వుచు నేగెను వేడ్కతోడ (అధ్యా. రామా. బాలకాండ- పుట.16)
ఈ సీస పద్యములోని సౌందర్యం సాహిత్యాభిలాషులకు సంతోషం కలిగిస్తుంది. “నవ్వుచు నేగెను వేడ్కతోడ” అనే పదములు ఒక ఎత్తు కాగా, మిగిలిన పదప్రయోగములన్నీ మరొక ఎత్తు. ఇంతటి సుందరాంగి అయిన సీత, ప్రేమపూరిత చిరునగవులు చిందించి, రాముని తన్మయుని కావించింది. ఇది శృంగార రస గుణానికి తొలిమెట్టు. ఇక్కడి పదగుంభనం పద్య భావానికి మరింత అందాన్ని పెంచింది. ఇది కంచర్ల శరభన ప్రతిభ.
8. అక్షర యోజన
8.1. అక్షర యోజన ప్రాముఖ్యత
మాలాకారుడు పువ్వులను సంపాదించి, ఏయే రంగుల పువ్వుల పిదప ఏయే పూవులను చేర్చి పూలమాల నిర్మాణం కావించితే మనోహరాకృతి అవుతుందో ఆలోచించి అలా పుష్పమాలా నిర్మాణం కావించడం పరిపాటి. అలాగే కవి అందగించే పదాలను చొప్పించి పద్యం రచన కావిస్తే, ఆ గ్రంథంలో అక్షర యోజన జోడింపు ఉన్నదని చెప్పాలి. కవులు అందమైన పదాలను ప్రయోగించి పద్య నిర్మాణం కావించడం విశేష గుణం అవుతుంది. పద్యము మొదటి నుండి చివరిదాకా ఒకే పద్ధతిని సమతూకంగా నడపడాన్ని పద్య శిల్పమని పేర్కొంటారు. ఇలాంటి కళ అధ్యాత్మ రామాయణ అనువాదకులు చక్కగా పోషించారు. దీంట్లో దూర్వాసుల రామయామాత్యుడు పోషించిన పద్య రచనా శిల్పపద్ధతి బాగుంటుంది. ప్రస్తుత కవి కంచర్ల శరభన పద్య శిల్పాన్ని ప్రదర్శించిన విధానం తెలుసుకుందాము.
8.2. శరభన కవి అక్షర యోజన
రామాదుల పరిణయార్థం, బంధు పరివారయుతుడు అయిన దశరథుడు మిథిలా నగరానికి వెడుతున్న సందర్భంలో కంచర్ల శరభన వర్ణించిన తీరు:
“……. బంధు మిత్ర పుత్ర కళత్రాది నిఖిల బంధు సమేతుండైన భేరి శంఖ మృదంగ వేణు వీణా పటహాది వాద్యంబులు చెలంగ నెడనెడ గీత నృత్యాది వినోదంబులు చూచుచు….(శరభన బాల.వచనం.53)
ఈ వచనంలో శరభన కవి గూర్చిన అక్షరముల పొందిక ఆకర్షణ కలిగిస్తుంది. ఇందుకు ముందుగా ఇంద్రుని భావనలో అహల్య సౌందర్యము నఖశిఖ పర్యంతము వర్ణితమైంది. ఈ సందర్భంలోనే నాసికా వర్ణనా నైపుణ్యం అవలోకిద్దాం:
గీ. కుముద పారిజాత కుసుమంబులకు
మధ్య నాయకుడు గాను నలిన భవుడు
చక్కగానుకూర్చె చంపక కుసుమంబు
ననగ నాసికంబు నతివ కమరె
ఇలాగే “నాసికాభూషణాస్తి తావి నవ్య మౌక్తి, కడు బారెడు బారెడు గదలు చుండు...(శరభన బాల. 42-43 పద్యాలు.)” కర్ణాభరణాలు వర్ణించడంలో అక్షర యోజన ఎంతో రమ్యంగా ఉంది. తన గ్రంథారంభంలో శరభన కావించిన రామసన్నుతిలో రామతత్త్వం ప్రస్ఫుటమైంది.
కం. రాముని యోగీంద్రమనో
రాముని భక్తాంబు రాశి సోముని సుత సు
త్రాముని సన్నుని పావన
పాముని సీతామనోభిరాముని గొల్చున్. (అధ్యాత్మ రామాయణము, బాలకాండ- పద్యం. 53)
శరభన షష్ఠ్యంత పద్యములోని శైలితో పాటు, ద్విప్రాస, అక్షర కూర్పు వంటి లక్షణాలు గుర్తించే వీలున్నది. “సంసార దావాగ్ని సంతప్తులకు సుధాస్తోమవర్ష నియుక్తి రామభక్తి” అనే సీస పద్యంలో కూడా పదగుంభనం, అక్షరాల పొందిక, పద్య రచన శిల్ప నైపుణ్యాలు తెలుసుకోవచ్చును. శరభన తన రచనలో పంచచామరము, మత్తకోకిల, మాలిని, సీసము, తేటగీతి, ఆటవెలది, కందము వంటి పద్య ఛందస్సులను ఉపయోగించారు. వీలునిబట్టి వచన వినియోగం మామూలే.
9. ఆధ్యాత్మికత
అధ్యాత్మ రామాయణం వేదాంత చింతనతో పరిఢవిల్లుతుంది. ఇది ముముక్షు జన సంసేవ్యం. నాయకుడు అయిన శ్రీరాముడు అనుభవించిన సుఖదుఃఖాలు కేవలం లీలామాత్రమే. అతడు సీతా లక్ష్మణులతో అనుభవించిన వనవాసం, సీతా వియోగం వల్ల జనించిన విలాపాదులు రామచంద్రుని నాటకాలు మాత్రమే. కావుననే ఈ గ్రంథంలో చెప్పిన సుఖదుఃఖాలు రాముడు అనుభవించలేదు. అనుభవించినట్లు భ్రమ మాత్రమే.
రామో న గచ్ఛతి న తిష్ఠతి నానుశోచ
త్యా కాంక్షతే త్యజతినో నకరోతి కించిత్,
ఆనంద మూర్తి రచలః పరిణామహీనో
మాయా గుణాననుగతో హి తథా విభ్రాంతి.
ఇది సీతామాత ఆంజనేయునకు ఉపదేశించిన శ్రీరామతత్త్వం – అధ్యాత్మ రామాయణానికి ఆత్మవంటిది. సీతామాత తనను గూర్చి వాయుపుత్రునకు:
“మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యంతకారిణీమ్,
తస్య సన్నిధి మాత్రేణ సృజామీద మతంద్రితా”
అని వివరించారు. జానకి ప్రకృతి స్వరూపిణి అనీ, సృష్టికి కారకురాలు అనీ తెలుస్తుంది. సీతారామాదులు సుఖదుఃఖాతీతులు. ఈ రచనలోని తత్త్వ బోధలు, ఉపదేశాలు, హితబోధలు వంటివాటివల్ల అధ్యాత్మ రామాయణం అనే పేరు సార్ధకమైంది. శ్రీరామగీత పేరుతో సాగిన ఆధ్యాత్మిక బోధ అధ్యాత్మ రామాయణానికే ప్రాణ ప్రదం. ఈ పేరుతో ప్రత్యేక రచనలూ వెలువరించారు.
పరశురామ పంతుల లింగమూర్తి గారి సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథ రచనకు, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి శ్రీరామకథామృతము అనే ప్రసిద్ధ రచనకు, మళయాళ భాషలో ఎళుత్తచ్చన్ కవి రాసిన రామాయణానికి అధ్యాత్మ రామాయణమే మూలం. హిందీ భాషలో క్షేత్రీయ అవధి భాషలో సంత్ తులసీదాస్ రాసిన రామచరితమానస్ లోను అధ్యాత్మ రామాయణ భావాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంతటి మహత్తర అధ్యాత్మ రామాయణాన్ని సంస్కృత భాష నుండి తెలుగులో రాసిన వెలుగులోకి రాని తెలుగు మొదటి కవి, సాహిత్యంలో స్వాతి ముత్యం కంచర్ల శరభన.
ఉపసంహారం
- కంచర్ల శరభన 16వ శతాబ్దానికి చెందిన నియోగి బ్రాహ్మణ కవి. ఆయన రచించిన అధ్యాత్మ రామాయణం తెలుగులో చంపూ ప్రక్రియలో వెలువడిన తొలి రచన.
- కవి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మేడూరు. రచనలోని మాహాత్మ్య, రసానుగుణ పద్య, అక్షర యోజన వంటి అంశాలు శరభన కవితా ప్రతిభను తెలియజేస్తాయి.
- ఈ అముద్రిత రచన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో వ్రాతప్రతి రూపంలో లభ్యం.
- అధ్యాత్మ రామాయణం తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన, ఆధ్యాత్మిక విలువలు గల రచనగా నిలిచింది.
ఉపయుక్త గ్రంథసూచి
- ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక, సంపుటి
- మహర్షి వాల్మీకి. అధ్యాత్మరామాయణం (సం-హిం అనువాదం). మునిలాల్ (అను.) గీతాప్రెస్, ఘోరక్ పూర్. 2013.
- శంభుప్రసాద్, శివలెంక. (సంపా.) భారతి సాహిత్యమాసపత్రిక. మే, 1961. సంపుటం 38, సంచిక. 5.
- శరభన, కంచర్ల. అధ్యాత్మ రామాయణము. వ్రాతప్రతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం, తిరుపతి.
- శేషయ్య, చాగంటి. ఆంధ్ర కవితరంగిణి సంపుటం 10. హిందూ ధర్మశాస్త్ర గ్రంథ నిలయం. కపిలేశ్వరం. 1953.
- శ్రీరామచంద్రమూర్తి, చల్లా. అధ్యాత్మ రామాయణము: తులనాత్మక పరిశీలన. (పరిశోధన గ్రంథం)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

