headerbanner

అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-02 | February 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. కట్టమంచి రామలింగారెడ్డి జీవితం: సాహిత్యం

ఆచార్య ఎన్. ఈశ్వర రెడ్డి

ఆచార్యులు, తెలుగుశాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం, వేమన పురం,
వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8328296952, Email: eswaryvu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 22.12.2026        ఎంపిక (D.O.A): 25.01.2026        ప్రచురణ (D.O.P): 01.02.2026


వ్యాససంగ్రహం:

ఆధునిక విమర్శకు కొత్త దారి నిర్మించిన సద్విమర్శకుడు, పండితుడు, చతుర వచనుడు, సాహిత్య సేవకుడు,తత్త్వవేత్త, గొప్ప విద్యావేత్త సి. ఆర్. రెడ్డిగా ప్రసిద్ధుడైన ఆచార్యుడు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి. కవిగా, విమర్శకుడిగా, రచయితగా, రాజనీతిజ్ఞుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలి సి.ఆర్.రెడ్డి.19 వ శతాబ్దంలో భారతీయులు ఆంగ్ల విద్యను నేర్చుకొని ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు. ఒకవైపు సంస్థానాధీశులు, మరోవైపు ఆంగ్లేయులు బాగా చదువుకునే వారిని ప్రోత్సహించారు. అలాంటి ప్రోత్సాహం పొందిన వారిలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉన్నారు. భారతదేశ ప్రథమ మహిళా వైద్యురాలు ఆనందీ బాయి జోషి ఉన్నారు. అదే కోవలో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి కూడా ఉన్నాడు. ఈయన కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగే బరోడా సంస్థానాధిపతి శాయాజీ రావు గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడి నుండి తిరిగి వచ్చి బరోడా కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. శాస్త్రీయ దృక్పథంతో అనేక రచనలు చేశాడు. తన విద్యా సామర్థ్యంతో అనేక పదవులు పొందాడు. తెలుగువారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి జీవితం సాహిత్యం గురించి తెలుసుకోవడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.

Keywords: కట్టమంచి, రామలింగారెడ్డి, జీవితం, సాహిత్యం, విమర్శ.

1. ప్రవేశిక

ఆధునిక విమర్శకు కొత్త దారి నిర్మించిన సద్విమర్శకుడు, పండితుడు, చతుర వచనుడు, సాహిత్య సేవకుడు, తత్త్వవేత్త, గొప్ప విద్యావేత్త సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన ఆచార్యుడు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి. కవిగా, విమర్శకుడిగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి సి.ఆర్.రెడ్డి. 19వ శతాబ్దంలో భారతీయులు ఆంగ్ల విద్యను నేర్చుకొని ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసినవారు ఉన్నారు. ఒకవైపు సంస్థానాధీశులు, మరోవైపు ఆంగ్లేయులు బాగా చదువుకునే వారిని ప్రోత్సహించారు. అలాంటి ప్రోత్సాహం పొందిన వారిలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఉన్నారు. భారతదేశ ప్రథమ మహిళా వైద్యురాలు ఆనందీ బాయి జోషి ఉన్నారు. అదే కోవలో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి కూడా ఉన్నారు. ఇతను కూడా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వలెనే బరోడా సంస్థానాధిపతి శాయాజీ రావు గైక్వాడ్ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడి నుండి తిరిగి వచ్చి బరోడా కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. శాస్త్రీయ దృక్పథంతో అనేక రచనలు చేశాడు. తన విద్యా సామర్థ్యంతో అనేక పదవులు పొందాడు. తెలుగువారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి జీవితం అతని రచనల పరిశీలన.

2. బాల్యం విద్యాభ్యాసం

డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి డిసెంబర్ 10, 1880న చిత్తూరు సమీపంలోని కట్టమంచి గ్రామంలో జన్మించాడు. ఇప్పుడు కట్టమంచి చిత్తూరు నడిబొడ్డుగా మారింది. అతని తల్లిదండ్రులు నారాయణమ్మ, సుబ్రహ్మణ్యంరెడ్డి. వీరికి అతను మూడో సంతానం. సంతానహీనులైన అతని చిన్నాన్న రామస్వామిరెడ్డి ఇంటికి దత్తపుత్రుడుగా వెళ్ళాడు రామలింగారెడ్డి.

కట్టమంచి ఇంటి పేరు ఎలా వచ్చిందంటే, ఆ ఊరు ఆనుకుని ఉన్న చెరువు పేరు భోగము దాని చెరువు. కట్ట ఎత్తుగా నిర్మించబడి ఉండటం, అప్పట్లో అక్కడికి వచ్చిన ఆంగ్లేయ కలెక్టర్ వచ్చీ రాని ఇంగ్లీషులో మంచి కట్ట అనడానికి బదులు కట్ట మంచి అని అన్నాడని, చివరికి ఆ మాటే ఆ ఊరికి పేరుగా స్థిరపడిందని ఒక కథ ప్రచారంలో ఉంది (మహాలక్ష్మి 1). రామలింగారెడ్డి ముత్తాత కొళంద రెడ్డి కాలానికే ఈ పేరు స్థిరపడినట్లు తెలుస్తోంది.

2.1. బాల్య క్రీడలు

చిన్నాన్న రామస్వామి రెడ్డి ఇంట్లో రాజ భోగాలు అనుభవించాడు రామలింగారెడ్డి. అల్లరి పిల్లవాడిగా ఉండేవాడు. గాడిదలను వెంబడించి తరిమితే అవి ఓండ్ర పెట్టేవి. వాటి అరుపులు అతనికి ఇష్టం. బొంబాయి మనుషులంటే అతనికి భయం. అల్లరి చేసినప్పుడు బొంబాయి వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు అని ఒక భూతం వలె తయారు చేసి పెట్టారు.

"ఆరేడేండ్ల పిల్లలు ఆడే ఆటలన్నీ రెడ్డిగారు ఆడారు. బంతాట. ఉప్పుపెట్టె, చెండాట, బచ్చాలాట, కండ్లా మూసి, గడ్డివాములు చెంత ఆడిన ఆటలు జీవితంలో మధుర స్మృతులు వీరికి. పెరిగి పెద్ద అయిన తర్వాత అరుదైన విరామ సమయంలో పాత జ్ఞాపకాలను డైరీలో వ్రాసుకున్నారు" (మహాలక్ష్మి 3).

2.2. కథలు - పఠనాసక్తి

అతనికి అక్క వరుస అయిన అమ్మాయమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె కథలు చెప్పేది. అలాంటి ఆమెకు రామలింగారెడ్డి బాల్యంలోనే భారతాన్ని చదివి అర్థం చెప్పేవాడు. ఆమె నుంచి గురుదక్షిణ కూడా తీసుకున్నాడు. పెద్దయ్యాక ఆమె రాసిన వరదరాజ శతకానికి పీఠిక రాశాడు. అతనికి గుండ్లపల్లి నరసమ్మ చెప్పే కథలంటే కూడా చాలా ఇష్టం.

సి.ఆర్.రెడ్డిని 1885లో ఐదేళ్ళ వయసులో వీధి బడిలో చేర్చారు. అది పూర్తి కాగానే 1890లో చిత్తూరులోని బోర్డు ఉన్నత పాఠశాలలో మొదటి ఫారం (ఆరో తరగతి) ప్రారంభించాడు. చిన్న వయసులోనే భారత రామాయణాలను, సంస్కృత వ్యాకరణ గ్రంథమైన అమరాన్ని కూడా అభ్యసించాడు.

3. బాధ్యతలు

3.1. విద్యాసంబంధబాధ్యతలు

బరోడా సంస్థానాధిపతి శాయాజీ రావు గైక్వాడ్ సహకారంతో 1907లో విద్యా విషయం పరిశీలన కోసం అమెరికాలో పర్యటించాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. బరోడాలో ఉండగానే మైసూర్‌కు వెళ్లి విద్యా సంస్కరణలకు సంబంధించి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. మైసూర్ మహారాజా వారు అతని ప్రతిభను గుర్తించి ఆచార్య పదవి అలంకరించమని కోరారు.

1909లో మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్యుడిగా చేరి, అధ్యక్షుడిగా, విశ్వవిద్యాలయ ప్రణాళిక కర్తగా పనిచేశారు. మైసూరులోని మహారాజా విద్యాలయం 1915లో విశ్వవిద్యాలయంగా మారింది. 1916 నుండి 1918 దాకా మైసూర్ మహారాజా కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. సంస్థానంలో 1919-20 మధ్యకాలంలో విద్యాశాఖాధికారిగా పనిచేశాడు.

1920లో బ్రాహ్మణేతరులకు విద్యా సదుపాయాలు కల్పించడానికి తన అధ్యక్షతన రెడ్డి జన సంఘం అనే పేరుతో ఒక సంఘాన్ని స్థాపించాడు.

మద్రాసులో శాసన సభ్యుడిగా ఉంటూనే ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవిర్భావానికి కృషి చేశాడు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 1930 వరకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేసే రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం, హింసకు పాల్పడటం వంటి దుశ్చర్యలకు నిరసనగా విశ్వవిద్యాలయ పదవికి రాజీనామా చేశాడు. రెండో విడత 1936 నుండి 1949 వరకు సుమారు 13 సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. మొత్తానికి 18 సంవత్సరాలు ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి ఒక రికార్డు సృష్టించారు. 1949లో మైసూర్ విశ్వవిద్యాలయానికి ప్రో-ఛాన్స్‌లర్‌గా వెళ్ళాడు.

1921లో అఖిలభారత విద్యా శాఖలో సభ్యత్వం తీసుకోవడం, 1937లో అఖిలభారత అంతర్ విశ్వవిద్యాలయ సంఘానికి అధ్యక్షుడు కావడం విశేషం. అదే సంవత్సరం డి.లిట్ పొందాడు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ‘సర్’ బిరుదునిచ్చి గౌరవించింది.

3.2. రాజకీయబాధ్యతలు

కట్టమంచి 1921లో మైసూర్‌ను వదిలి మద్రాసుకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. మద్రాసులోని జస్టిస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. 1922లో శ్రీనివాస్ అయ్యంగారి స్థానంలో శాసన మండలి సభ్యుడిగా రామలింగారెడ్డి నిలబడి గెలిచాడు. మాంటేగు సంస్కరణలకు వత్తాసు పలికిన అతను తర్వాత అవి పనికిరావని తెలిసి తిరస్కరించాడు. స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వాలని, అణగదొక్కబడిన కులాలకు సహాయం చేయాలని, విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు అధిక వ్యయం చేయాలని వాదించాడు. మద్రాసు విశ్వవిద్యాలయ పునర్నిర్మాణ బిల్లుకు పూర్తి మద్దతునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవిర్భావానికి కృషిచేసి సాధించారు.

1923లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. జస్టిస్ పార్టీ మంత్రివర్గం ఏర్పరచుకుంటూ ప్రతిపక్ష సభ్యుడి హోదాలో తనను ఆహ్వానించలేదని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు. అలా శాసన సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా రామలింగా రెడ్డి నిలబడతాడు.

4. మతాతీతభక్తి

కట్టమంచి రామలింగారెడ్డికి దైవభక్తి అధికమే. చిన్న వయసులోనే భారత రామాయణాది పురాణ ఇతిహాసాలను అవగతం చేసుకున్న అతను, మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరిన తర్వాత బైబిల్‌ను చదవడం కాకుండా, బైబిల్ పై పెట్టిన పోటీలో నెగ్గి బంగారు పథకాన్ని అందుకున్నాడు. ఏసుక్రీస్తు మీద అభిమానం పెంచుకున్నాడు. వీలైన చోట క్రీస్తు సిద్ధాంతాలను కూడా ప్రస్తావించేవాడు. చిన్న వయసు నుండి వేదాంత ధోరణులు అతనిలో ఉన్నాయి. తండ్రి మరణం, పినతండ్రి మరణం అతనిలో మానసిక అలజడికి కారణమయ్యాయని విశ్లేషకులు భావించారు. ఆ రోజుల్లో బౌద్ధమత ప్రభావం కూడా అతనిపై కొంత ఉంది. వయసు మళ్ళిన రోజుల్లో స్నానం చేసి నొసట విభూది రేఖలు ధరించి, భారత భాగవత పద్యాలను వల్లివేసేవాడని, అలాగే సంగీతమంటే చాలా ఇష్టపడేవాడని, జయదేవుని అష్టపదులు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మచే పాడించుకుని మైమరిచే వాడు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద తత్వాన్ని వివరించగలిగిన స్థాయికి అతను ఎదిగాడు. ఇది ఒట్టి నాస్తికులకు సాధ్యమయ్యే పని కాదు.

అతను తన అన్న కొడుకు రామస్వామి రెడ్డిని వినాయక గుడి పునరుద్ధరణకు పురమాయించాడు. అతనికి పూజలకంటే భజనపై మక్కువ ఎక్కువ. అందరూ భజనల కోసం కూటములుగా చేరడం వల్ల ప్రజల్లో ఐకమత్యం, సాంఘిక అవగాహన ఏర్పడుతుందని భావించాడు. కట్టమంచిలోని భజన మందిరాన్ని బాగు చేయించి ఒక పూజారిని నియమించి ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం డబ్బులు పంపేవాడు.

5. రచనావ్యాసంగం

కట్టమంచి రామలింగారెడ్డి రచనా వ్యాసంగంలో కొత్త పుంతలు తొక్కాడు. అతని పూర్వీకులు హిందూ సంప్రదాయబద్ధమైన కావ్యాలతో కాలక్షేపం చేశారు. అదే దారిలో రామలింగారెడ్డిని నడిపించారు. అయితే రామలింగారెడ్డి పెరిగిన వాతావరణానికి భిన్నంగా ఆధునిక భావాలతో రచనా వ్యాసంగం ప్రారంభించాడు.

5.1. ముసలమ్మ మరణం

కట్టమంచి రాసిన ముసలమ్మ మరణం కావ్యం తెలుగు కావ్య ప్రపంచంలో కొత్త దారి ఏర్పరిచింది. చారిత్రకంగా లభించిందని చెప్పుకునే కథ ముసలమ్మ మరణం. అందులో ముసలమ్మ అనే యువతి చెరువు కట్ట తెగిపోకుండేందుకు ప్రాణత్యాగం చేయడం ముఖ్యం. కట్టమంచి ముసలమ్మను వివాహిత స్త్రీగా మార్చి, ఆమెకు బిడ్డలు కూడా ఉన్నట్టు కల్పించాడు. తెలుగు కావ్యాలలో సుఖాంతాలు ఎక్కువ. ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ కావ్యాన్ని దుఃఖాంతం చేశాడు. ఇది ఒక కొత్త ముగింపు. "ఒక విధంగా కావ్యం ఆధునికాంధ్ర సాహిత్యోధ్యానంలో తొలి పుష్పమై నూతన సౌరభ్యాన్ని వెదజల్లుతుంది" (మహాలక్ష్మి 14) అంటున్న వెంకటప్పయ్య శాస్త్రి మాటలు నిజమయ్యాయి.

'నారాయణస్వామి అనే ఒక మిత్రుడి ఇంట్లో దొరికిన పుస్తకాన్ని చదివినప్పుడు ఈ విషయం (ముసలమ్మ మరణం కథ) తనకు అమితాశ్చర్యాన్ని కలిగించిందని కట్టమంచి చెప్పుకున్నాడు'. లభిస్తున్న మూల కథలో ముసలమ్మ చెరువు కట్టకు పడిన గండిలోకి దిగబడి, నెర్రెలోకి దూరిందని, కట్టపైన ఉన్నవారు ఆమెపై మన్ను, రాళ్లు వేసి ఆ గండెను పూడ్చారని తద్వారా ఆ కట్ట నిలిచిందని ఉంది.

గ్రామాన్ని, అశేష జనాన్ని కాపాడేందుకు తనకు తానుగా ప్రాణత్యాగానికి తెగించి ముందుకు వచ్చిన మగువపై మట్టి రాళ్లు వేసి పూడ్చడం మానవత్వానికే మచ్చగా నిలుస్తుందని, అలా చేయడానికి ఎవరూ ఇష్టపడరని, ఒకవేళ అలా చేస్తే ప్రజలందరూ స్వార్థపరులుగా మిగిలిపోతారని, అలాంటి అపవాదు రాకుండా ముసలమ్మ తనకు తానుగా జల ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసినట్టు మార్చి ముసలమ్మ త్యాగానికి మరింత ఔన్నత్యాన్ని కూర్చాడు రామలింగారెడ్డి.

ముసలమ్మ జలప్రవేశంతో ఆత్మ త్యాగం చేసినంత మాత్రాన ఆమె శవమై తేలకుండా ఉంటుందా? తిరిగి ఆమెను భూమిలో పాతి పెట్టడం లేదా ఖననం చేయాల్సి ఉంటుంది కదా! అందువల్ల ముసలమ్మను జలప్రవేశం చేయించడం కావ్య ఔచిత్యానికి భంగం కలిగిందని, కాబట్టి ముసలమ్మను భూస్థాపితం చేసిన మూల కథే సహజంగా ఉందని కటివరపు వెంకటరామయ్య విమర్శ చేశారు. ఈ కావ్యంలో అశరీరవాణి ద్వారా పలికించిన మాటలు అందుకు సమాధానంగా నిలుస్తాయి:

"బసిరెడ్డికి గడ గోడలు
ముసలమ్మ యనంగా నొప్పు పూత చరిత తా
వెసబలి గా బోయిన మీ
కి సుమంతయు గష్ట మెన్న డేలా కలుగున్" (ముసలమ్మ మరణము పద్యం 26)

అంటూ... ముసలమ్మ ఆత్మబలిని కోరిన గంగాదేవి ముసలమ్మను తన గర్భంలో దాచుకోకుండా, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బయట పడేసినట్టు ముసలమ్మను పడవేయదని, అలా చేస్తే అశరీరవాణి మాటలకు విలువ ఉండదని విమర్శకులు తేల్చి చెప్పారు.

ముసలమ్మ మరణాన్ని ఒక కావ్యంగా భావించి, ఒక కావ్యానికి ఉండాల్సిన లక్షణాలన్నిటినీ ఇందులో ఉండేటట్టు చూశాడు కట్టమంచి. వర్ణనలు, రసం, ఔచిత్యం వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టాడు. శృంగార రసం పక్కనపెట్టి, కరుణ రసాత్మకంగా కథాకల్పన చేశాడు. ఆనాటి సాంఘిక ఆచారాలు, నియమాలు, కుటుంబ పరిస్థితులు ప్రతిబింబించే విధంగా కథను మలుచుకున్నాడు. ఈ కావ్యానికి సంప్రదాయ పద్ధతిలో తనకు ఇష్టమైన కవులను స్మరించుకున్నాడు:

"కవి కులబ్రహ్మఁ దిక్కన గణనజేసి
సూర నార్యుని భావంబు సొంపుఁ పొగడి
వేమన మహాత్ము సహజ విద్యామయాత్ము
మ్రొక్కి, కవన మొనర్పఁ బూనినాఁడ" (ముసలమ్మ మరణము కావ్యారంభం)

అంటాడు. అతని ఇష్ట కవులలో తిక్కన, పింగళి సూరన, వేమన ఉన్నారు.

హాలికుడు కవిగా మారితే, కలం చిత్రించే వ్యవసాయ క్షేత్రం ఎలా ఉంటుందో కట్టమంచి పద్యంలో చూడవచ్చు:

"నెండ్రకాయల కొఱ కేతెంచి గుంటిపై
మెక్కి కూసెడు గుంట నక్కగములు
బుడును బక్కలు గాక కడుపార దిని పంది
గున్నలతో రాము గొఱియ పిండుఁ
బొలముల లేఁబచ్చికల మేసి బియ్యచే
నిగనిగలాడు గో నికరములునుఁ
గలకలారావముల మీఱ గలసి జొన్న
చేలపై వ్రాలు గువ్వం చెఱువుఁ గలిగి
పైరుపచ్చల నొప్పు నాపల్లె ..........." (ముసలమ్మ మరణము 24)

'ఎండ్రకాయల కోసం వచ్చి, గుండెక్కి కూసే నక్కలు, కడుపార తిన్న పంది గున్నలు, పొలాల్లో పచ్చిక మేస్తూ నిగనిగలాడే ఆవులు, జొన్న చేలపై వాలి తినే గువ్వలు అతని కలం కంటిలో పడ్డాయి. అత్యంత సహజ వర్ణనకు ఈ పద్యం ఒక ఉదాహరణ. వ్యవసాయ క్షేత్రం చుట్టూ కనిపించే ప్రాకృతిక చిత్రాలు అందరికీ కనిపించవు. ఆ వ్యవసాయ భూమితో, అక్కడి వాతావరణంతో ఒక బంధాన్ని కలిగిన వారికి మాత్రమే ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. అలాంటి బంధం కవికి ఉంది.

ముసలమ్మ రూప వర్ణన పక్కన పెట్టి, ఆమె గుణాలను వర్ణించడంలోనే అతని సాహిత్య దృక్పథం అర్థమవుతుంది. వరలక్ష్మి వంటి ముసలమ్మ బీద సాధలను ఆదరిస్తూ, కడుపార భోజనం పెట్టే తల్లి వంటిది. వ్యాధిగ్రస్తులను వెయ్యి కళ్లతో చూసే గొప్ప ఇల్లాలు. ఆమె పరాయి బిడ్డల్ని కూడా తన బిడ్డల్లా చూసుకునే గొప్ప తల్లి. ఆవుకు దూడలను మళ్లించి, పాలు పితికే పల్లె పడతి. బొండు మల్లెల తోటలో పూలు కోసే వరలక్ష్మి వలె ఉంటుంది ఆమె. వినయ విధేయతలు కలిగిన గుణసంపన్నురాలు. ఇలాంటి స్త్రీని సృష్టించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదని వర్ణించడం విశేషం.

కట్టమంచికి తిక్కన ఇష్టమైన కవులలో ఒకడు. అందుకే ముసలమ్మ మరణములో తిక్కన శైలిలో ప్రౌఢతను ప్రదర్శిస్తూ రాసిన పద్యాలు ఉన్నాయి. బుక్కరాయసముద్రాన్ని వర్ణిస్తూ...

"చల దుత్తుంగ మహోగ్ర భంగపటలీ సంఘట్ట నారావ, ము
జ్జ్వల కూలాగ్ర నటత్తరంగ రవ, మంచన్మధ్య భాగ్భూమి భృ
త్కుల సంపాతి మహార్మి కానికర నిర్దోషంబునుం, గూడఁగా
నలరున్ ఘోరసరస్సు దిగ్విదళన వ్యాపార పారీణమై” (ముసలమ్మ మరణము 24)

అని వర్ణిస్తాడు. మెరుస్తూ కదిలే పొడవైన అలలు తీరాలికి తాకినప్పుడు ఏర్పడే శబ్దాన్ని, భీకరమైన అలలు పరస్పరం ఢీకొన్నప్పుడు ఏర్పడే శబ్దాన్ని, పర్వత సమూహాల మధ్య ఉధృతంగా ప్రవహించే నది దిక్కులను పగలగొట్టుకుని పోతున్నట్టుగా ఉందని నిండు చెరువును వర్ణించాడు కవి.

ముసలమ్మ మరణంలో ముసలమ్మ, ఆమె భర్త, అత్తామామలు, సామూహిక జనం ఈ నాలుగు పాత్రలతోనే ఆ కావ్యాన్ని రక్తి కట్టించాడు. మనిషి పుట్టుక నలుగురికి సహాయం చేయటంలోనే సార్ధకత పొందుతుందని ముసలమ్మ ద్వారా కవి చెప్పిస్తాడు. 'పుట్టి పుట్టగానే నా తల్లిదండ్రులు పోయారు. మీరే తల్లిదండ్రులై నన్ను పెంచారు. మీ అందరి సుఖం కోరి నేను ఈ పని చేస్తున్నాను. ఏ సహాయము చేయకుండా పెంచిన శరీరాన్ని ఏమి చేసుకుంటాం. పొయ్యిలో వేసుకుంటామా? అందుకే ఈ శరీరాన్ని మీ అందరి కోసం త్యాగం చేస్తున్నాను' అని ముసలమ్మతో చెప్పిస్తాడు. ‘చావు పుట్టుక కానే కావు జీవితం, పదిమందిని బతికిస్తేనే సార్ధకం’ అన్న ఒక కవి మాటలను ఈమె నిజం చేసింది.

కట్టమంచి, గురజాడ మధ్య కొన్ని సామ్యాలు, కొన్ని భేదాలు ఉన్నాయి. అమలిన శృంగారానికి, స్త్రీ హృదయానికి ఇరువురూ ప్రాధాన్యతనిచ్చారు. గురజాడ పూర్ణమ్మ సంఘ దురాచారాన్ని తిరస్కరించడానికి ఆత్మార్పణం చేసుకుంటే, కట్టమంచి ముసలమ్మ తన ఊరు కాపాడేందుకు ఆత్మార్పణం చేసుకుంటుంది. చీడ పట్టిన సంప్రదాయాలను తిరస్కరిస్తూ పూర్ణమ్మ ధిక్కార స్వరాన్ని ప్రకటిస్తుంది. ముసలమ్మ సంప్రదాయాలను గౌరవిస్తూ తన ఊరి కోసమే ఆత్మార్పణ చేస్తున్నట్టు చెప్పుకుంటుంది. ముసలమ్మ మరణంలో గంగమ్మ తల్లి చెప్పిన మాటలు, దానికి అనుగుణంగా ముసలమ్మ ఆత్మార్పణ చేసుకోవడం శాస్త్రీయతకు లొంగని అంశం.

5.2. భారత అర్థశాస్త్రం (1912)

కట్టమంచి రాసిన భారత అర్థశాస్త్రం ‘సార్వకాలీన, సార్వజనీన పఠనావశ్యకత ఉంది. అర్థార్జన అనర్థం అనుకునే రోజుల్లో, నిష్కామత్వంలో నీరు గారే ప్రజలు పురుషార్థాలు సాధించలేరని, మూఢ భావాలతో మనసుకు మసిబూసుకొని దేశానికి ద్రోహం చేయకూడదని, శాస్త్ర జ్ఞానం అలవరుచుకొని ఆర్థికాభివృద్ధికి తోడ్పడమని చెప్పడం ఈ రచన ఉద్దేశ్యం.

"నరులారా! మీకు మీ తర
తరముల వారికిని భారత భువికిని శుభం
బరసియ తెగించి వ్రాసితి
బరుషములైనను గణింపవలయు విషయముల్.

పలికితి నే చేదు మాటల
బలికితి నే హితము కాని పలుకుల నొకచో
బలికితిని పో ననుం గృప
దెలియమి యాని మనుపరయ్య ధీర ప్రవరుల్." (మహాలక్ష్మి)

అశోకుడి కాలంలో చాణిక్యుడు రాసిన అర్థశాస్త్రం రాజ్యపాలన ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి కట్టమంచి సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్థశాస్త్రాన్ని రాయాల్సి వచ్చిందని చెప్పుకున్నాడు. మతం, ఆచారాలు, నమ్మకాలు, సోమరితనం వంటివి వదలకపోతే మనం అభివృద్ధి చెందలేమని అందులో వివరిస్తాడు. ఇది కావ్య శైలిలో ఉండటం మరో విశేషం.

5.3. కవిత్వ తత్వ విచారము (1913)

కట్టమంచికి సాహిత్య చరిత్రలో చెరిగిపోని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన రచన కవిత్వ తత్వ విచారము. ఇది ఆధునిక విమర్శకు ఒక పునాది వంటిది. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో కవుల గుణ దోషాలు, గద్య పద్య భేదాలు, భావన శక్తి విషయాలలో వేమన సహజ కవిత్వ లక్షణాలు వివరించాడు. అనవసర అలంకారాల వల్ల కథనం దెబ్బతింటుందని, కథలో లోపం ఉన్నప్పుడే అలంకారాల సంఖ్య పెరుగుతుందని తగేసి చెప్పాడు. పాత్రల గుణాలు విలక్షణ వ్యక్తిత్వాలతో ఉండాలని, అప్పుడే అవి సజీవ పాత్రలు అవుతాయని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా వర్ణనలు సందర్భోచితంగా ఉండాలే తప్ప కాలయాపన కోసం ఉండకూడదు అంటాడు.

రెండో ప్రకరణలో ప్రబంధాలను గురించి చెబుతూ వసుచరిత్రను అనుసరించి మిగతా ప్రబంధాలు పుట్టాయని, అలాంటి వాటిని పిల్ల వసుచరిత్రలు అనవచ్చునని చమత్కరించాడు. ప్రబంధాలలో నాటకీయత లోపించిందని, ఒకే మూసలో పోసిన బొమ్మల వలె ఉండటానికి ఆనాటి సాంఘిక పరిస్థితులే కారణమని వివరించాడు.

మూడో ప్రకరణంలో కళాపూర్ణోదయంలో కనిపించే ప్రతిభ ప్రభావతీ ప్రద్యుమ్నంలో పరాకాష్టకు చేరిందని పింగళి సూరన గొప్పతనాన్ని విశదీకరించాడు.

ప్రబంధాలలో కచ కుచాది వర్ణనలు మన సంస్కార హీనతకు అద్దం పడతాయన్నాడు. విమర్శకులు మంచి, చెడులను వేరుచేసి చూపే న్యాయమూర్తులుగా ఉండాలని చెబుతాడు.

‘ఆలంకారిక విమర్శను పక్కనపెట్టి, కవుల ప్రతిభను తెలపడం, వర్ణనల కంటే భావనా శక్తి ముఖ్యమనడం, పాత్రల స్వభావాలను వివరించాలని చెప్పడం, కావ్యంలోని సంఘటనలను అందులోని ఉచితా నుచితాలను పరిశీలించ మనడం, రచనలో రీతిని, శైలిని, కథాంశాల్లోని నవ్యతను, కథను కూర్చిన విధానంలోని ప్రతిభను, కథలో కేంద్రీకృతమైన ముఖ్య ఉద్దేశాన్ని, కవిత్వ వైశిష్ట్యాన్ని తరచి చూస్తే విమర్శనా విధానంలో ఎన్నో నూతన అంశాలు ప్రత్యక్షమవుతాయి’ అని భావించాడు.

5.4. నవ యామిని (1933)

కట్టమంచి రామలింగారెడ్డి 'నవయామిని' కావ్యాన్ని బిల్హణ చరిత్ర ఆధారంగా రచించాడు. బిల్హణ చరిత్ర పచ్చి శృంగార కావ్యంగా ప్రసిద్ధి. చెపల చిత్తయైన యామినిని గుణసంపన్నురాలుగా తీర్చిదిద్ది, ఆమె చేతనే బిల్హణుడికి నీతి బోధ చేయిస్తాడు కట్టమంచి. అతనిని ఆవరించిన కామ కోరికలను వదలగొట్టిస్తాడు.

బిల్హణ చరిత్రలో యామిని పూర్ణ తిల, రాజకుమారి, యువరాణి. ఆమెకు సకల శాస్త్రాలు నేర్పించాలని తలచిన రాజు, పండితుల సూచన మేరకు యుక్త వయసులో ఉన్న బిల్హణుని గురువుగా నియమించుకుంటాడు. బిల్హణుడికి యామినికి మధ్య అనుబంధాలు ఏర్పడకుండా ఉండేందుకు, వారిద్దరి మధ్య రాజు తెర కట్టిస్తాడు. బిల్హణుడిని గుడ్డివాడని యామినికి చెప్పి, యామినిని కుష్టి రోగి అని బిల్హణుడికి రాజు తెలియజేస్తాడు. తద్వారా, ‘గుడ్డివాడిని చూడరాదు’ అని యామినికి, ‘కుష్టు రోగిని చూడరాదు’ అని బిల్హణుడికి నిబంధనలు విధిస్తాడు.

ఇన్ని చేసినా, రాజు ఆలోచనలు తప్పవుతాయి. బిల్హణుడు చంద్రోదయ వర్ణన అద్భుతంగా చేసే సందర్భంలో, 'గ్రుడ్డివాడు ఎలా చూస్తున్నాడు?' అనే అనుమానంతో యామిని తెర తొలగిస్తుంది. బిల్హణుడు యామిని పరస్పరం చూసుకుంటారు. ఒకరికి ఒకరు ఆకర్షితులై మోహాంధకారంలో మునిగిపోతారు. రాజుకి ఈ విషయం తెలిసి బిల్హణుడిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. తప్పు చేసింది ఇద్దరూ అయినప్పటికీ, శిక్ష మాత్రం బిల్హణుడికే విధిస్తాడు. తనను శిక్షించే ముందు బిల్హణుడు చెప్పిన మాటలను చారుల ద్వారా విన్న రాజు, తనపై విధించిన శిక్షను రద్దు చేస్తాడు. ఈ కథలో అనుచితం ఉంది. కూతురును అప్రతిష్టపాలు చేసిన బిల్హణుడిని రాజు శిక్షించేటప్పుడు విచారణ చేయడు. అది వ్యవస్థలోని లోపాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ పరువు కోసం శిక్ష విధించినా, అప్పుడు నిందితుడి కోరికను తీర్చడు. ఇక్కడ బిల్హణుడిని చెప్పే నీతిని యధాతధంగా రాజుకు చెప్పి, ఆ రాజు శిక్ష నుంచి విముక్తుణ్ణి చేసేదాకా ఆ భటులు వేచి ఉంటారా? అని విమర్శకుల ప్రశ్న. అలాంటి ఈ కథను కట్టమంచి కొంత మార్చి యామినిని 'నవయామిని'గా తీర్చిదిద్దాడు.

తనను మోహించిన గురువుకు బుద్ధి చెప్పే సందర్భంలో, యామిని ఇలా అంటుంది (మహాలక్ష్మి 96):

నీవు మనోజ్ఞమూర్తివి; వి
నిర్మల కీర్తివి జ్ఞాన మందు వి
ద్యా వినయంబునందు, బర
మాద్భుత శక్తివి నాకు జూడఁగా
దైవముఁ దండ్రియున్ గురువు
దల్లియు నీవ సుఖండవున్ సదా
కావున సాహసించితిని
కర్మము ధర్మము పూని తెల్పుఁగన్

గురువులోని గుణాలు, గురువు ఉండాల్సిన తీరును ఆమె చెప్పడం వల్ల అతని ఆలోచనలో మార్పు వస్తుంది. అంతేకాకుండా, ఈ మోహం క్షణికమని, అది సూర్యుడిని పట్టిన గ్రహణం వంటిది, అది ఎక్కువ కాలం ఉండదని తెలియజేస్తుంది:

క్షణికంబు నీ యీ మోహం
బనఘా, నిక్కంబ కాద యని, యెఱుఁగుదు సూ
ర్యుపార్శ్య గ్రహణము కాం
తిని మూయునే? చాలసేపు నిలుకడఁ గనునే?

(మహాలక్ష్మి 96). ఈ విధంగా మార్పులు చేయడం ద్వారా గురువుకు, శిష్యురాలికి అపప్రద కలగకుండా చూసి, కట్టమంచి కావ్య ఔచిత్యాన్ని కాపాడాడని విమర్శకులు అంటారు.

5.5 కట్టమంచి రచనలు: పద్య-వ్యాస రీతులు

కట్టమంచికి పద్య రచనపట్ల గొప్ప ఆసక్తి ఉంది. ఆయన అర్థశాస్త్రం రాస్తూ అంకిత పద్యాలు రచించాడు. భగ్న ప్రేమికుడిగా ప్రియ సఖిని మరువలేక విరహ పద్యాలు రాసుకున్నాడు. విద్యార్థి దశలో రాసిన పార్వతీ స్తుతి, సూర్యోదయ ప్రకృతి వర్ణనలు, భారత ప్రశంసలో భాషా కన్యను చేపట్టి ఆనందాన్ని పొందుతానని తెలియజేసిన సందర్భాలు పద్య రూపంలోనే ఉన్నాయి.

కట్టమంచి వ్యాసరచనలోనూ కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. గతంలో కవులు కావ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాని, పీఠికకు ఇవ్వలేదు. ఈ కారణంగా కవుల కాలాలు, ఆనాటి సాంఘిక పరిస్థితులు తెలియడం కష్టంగా మారింది. దీనిని తిరస్కరించి, కట్టమంచి శాస్త్రీయ విమర్శనా దృక్పథానికి మార్గం సుగమం చేశాడు. కవి చరిత్ర, రచన కాలం, కావ్యంలోని మంచి-చెడు అంశాలను వివరించడం ద్వారా పీఠిక స్వరూపాన్ని ఆయన మార్చాడు. అందుకు ఉదాహరణలుగా "లఘు పీఠికా సముచ్ఛయము", "వ్యాసమంజరి" అనే వ్యాస సంపుటాలు నిలుస్తాయి. పంచమి పేరుతో 1954లో వచ్చిన సంపుటిలో ఆయన రాసిన వ్యాసాలు శాస్త్రీయ దృక్పథంతో, విమర్శనాత్మకంగా ఉన్నాయి.

6. రచయితలకు ప్రోత్సాహం

కట్టమంచి రామలింగారెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన రచనలు, విమర్శ, హాస్య చతురత, జీవిత విశేషాల గురించి సుమారు 20 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

ఆయన స్వయంగా రాసిన రచనల కంటే, ప్రోత్సహించి రాయించినవి అనేకం ఉన్నాయి. కనుమూరి భాగ్యలక్ష్మిని ప్రోత్సహించి సావిత్రి చరిత్రను ముద్రణకు తీసుకువచ్చాడు. వేదం వేంకటరాయ శాస్త్రికి ముద్రణా ఖర్చులను సమకూర్చి, ఆముక్తమాల్యద వ్యాఖ్యానాన్ని ప్రచురితం చేయించాడు. గిడుగు రామమూర్తితో ఆంధ్ర భాషాను శాసనం, మల్లంపల్లి సోమశేఖర శర్మతో రెడ్ల చరిత్ర, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మతో తెలుగు రఘువంశం, వేటూరి ప్రభాకర శాస్త్రితో తిరుప్పావై, కైలాసంతో కన్యాశుల్కం, వంగూరి సుబ్బారావుతో ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర, గుండ్లపల్లి నరసమ్మతో రాఘవేశ్వర శతకం, వరదరాజ శతకం, తన తండ్రి కట్టమంచి సుబ్రహ్మణ్యం రెడ్డితో భారత సార రత్నావళి, భాగవత సార ముక్తావళి రాయించడానికి లేదా ముద్రించడానికి తగిన ప్రోత్సాహం అందించాడు. మానవల్లి రామకృష్ణ కవి వెలుగులోకి తెచ్చిన నన్నెచోడుడి కుమారసంభవం సవరణలో కట్టమంచి సూచనలు ఉన్నాయి.

అంతేకాకుండా, అనేకమంది రచయితలు తమ రచనలను కట్టమంచికి అంకితం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ అనువదించిన తెలుగు ఋతువులు (ఋతుసంహారమ్ అనువాదం), నందిరాజు చలపతిరావు రాసిన పారితోషికం, రాయప్రోలు రాసిన జడకుచ్చులు, ఆర్. సత్యనారాయణ రాసిన My Town in Andhra Desh, ఆర్. సచ్చిదానంద మూర్తి రాసిన Hinduism and its development వంటి గ్రంథాలను ఎంతో గౌరవంతో కట్టమంచికి అంకితం ఇచ్చారు.

7. హాస్యచతురత

చిత్తూరు బోర్డు హైస్కూల్లో చదువుతున్నప్పుడు, కుప్పనయ్యంగారు ఈయనకు తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు. ఆయన 80 ఏళ్ల వయసులో అత్తరు పూసుకుని తరగతికి వచ్చేవారట. 'మీ తరగతి ఎంత మంచి సువాసనగా ఉంది!' అని రామలింగారెడ్డి చనువుగా అడిగితే, 'ఇది మాతృభాష పరిమళం సుమండీ' అని ఆ గురువు సమాధానం చెప్పాడట. నాటి గురు-శిష్య సంబంధానికి ఇది చక్కటి ఉదాహరణ. రామలింగారెడ్డి హాస్య చతురత ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సందర్భోచితంగా, భాషలోని చమత్కారాలను ఆయన అద్భుతంగా ఉపయోగించేవాడని, ఆయనపై పరిశోధనలు చేసిన విమర్శకులు తమ గ్రంథాలలో నమోదు చేసిన సన్నివేశాలు, చమత్కారాల ద్వారా తెలుస్తోంది.

ఉపసంహారం

కట్టమంచి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మతో మాట్లాడుతూ 'తాను పెళ్లి చేసుకుంటే, తన భార్య ద్రౌపదిలాగా రాజసం ప్రదర్శిస్తే, తన రాజసం పోతుందని, అందుకే తాను పెళ్లి చేసుకోలేదని; నువ్వు కూడా పెళ్లి చేసుకుని బంధంలో చిక్కుకుపోయి నాశనం కావద్దు' అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పురుషులకు పెళ్లి చేసుకోవద్దని చెప్పే ఆయన, స్త్రీల విషయంలో అలా చెప్పేవారు కాదు. తండ్రి లేని తన అన్న బిడ్డలను దత్తత తీసుకున్నాడు. కుటుంబంలోని వారికి చదువు ఖర్చులను భరించాడు. అడిగిన వారికి అప్పులు ఇచ్చాడు. తన వద్ద అప్పు తీసుకున్న రాజగోపాల్ అనే వ్యక్తి అప్పు తీర్చకుండానే మరణిస్తే, ఆ భారం అతని కుటుంబంపై పడకుండా మాఫీ చేశాడు. ఆయన దయగల హృదయం కలవాడని ఆయన రాసిన కుటుంబ సంబంధిత ఉత్తరాలు తెలియజేస్తాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు మైసూరు విద్యాలయంలో అధ్యాపక పదవి ఇప్పించడంతో పాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి అయిన తర్వాత, రాళ్లపల్లితో వేమనపై ఉపన్యాస పరంపరను ఏర్పాటు చేశాడు. ఆయన సాహిత్య సేవలను గురించి వివరించాలంటే, మరో వ్యాసమే రాయవలసి వస్తుంది. రామలింగారెడ్డి 1951 ఫిబ్రవరి 24వ తారీఖున అనారోగ్యంతో మద్రాసులో మరణించాడు.

  • కట్టమంచి రామలింగారెడ్డి 'నవయామిని' కావ్యంలో బిల్హణ చరిత్రకు నైతికమైన, సామాజికమైన ఔచిత్యాన్ని కల్పించారు.
  • పద్య రచనపై ఆయనకు గల అపారమైన ఆసక్తి ఆయన విద్యార్థి దశ నుండి అనేక పద్య రూప రచనల ద్వారా వ్యక్తమైంది.
  • వ్యాస రచనలో శాస్త్రీయ విమర్శనా దృక్పథాన్ని ప్రవేశపెట్టి, పీఠికలకు కొత్త రూపాన్ని ఇచ్చి, పరిశోధనలకు మార్గం సుగమం చేశాడు.
  • అనేకమంది రచయితలను, వారి రచనలను ప్రోత్సహించి, తెలుగు సాహిత్య అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందించారు.
  • ఆయన హాస్య చతురత, దయగల గుణం, కుటుంబ బాధ్యతలు, సామాజిక సేవకు ఆయన వ్యక్తిత్వం నిదర్శనం.
  • వ్యక్తిగత త్యాగాలతో పాటు, ఇతరుల ఉన్నతికి, సాహిత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేశారు.

ఉపయుక్త గ్రంథసూచి

  1. అనంత కృష్ణ శర్మ, రాళ్లపల్లి. సరస్వతాలోకం. ప్రచురణకర్త తెలియదు, 1966.
  2. మహాలక్ష్మి, కట్టమంచి. సి.ఆర్.రెడ్డి జీవితం సాహిత్యం. ప్రచురణకర్త తెలియదు, 1991.
  3. రామలింగారెడ్డి. కట్టమంచి,  ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు. ప్రచురణకర్త తెలియదు, 1954.
  4. పైదే. భారత అర్థశాస్త్రం. ప్రచురణకర్త తెలియదు, 1882.
  5. పైదే. కట్టమంచి రామలింగారెడ్డి కృతులు. ఆంధ్ర గ్రంథాలయం, విజయవాడ, 1927.
  6. పైదే. వ్యాస మంజరి. ప్రచురణకర్త తెలియదు, 1947.
  7. వెంకట రెడ్డి, ఎం. కట్టమంచి రామలింగా రెడ్డి రచనలు. ప్రచురణకర్త తెలియదు, 1979.
  8. హనుమచ్చాస్త్రి, జానమద్ది. మా సీమ కవులు. ప్రచురణకర్త తెలియదు, 1973.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image