AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
10. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం సాహిత్యోత్సవ ప్రత్యేక సంచికలు: సామాజిక, చారిత్రక, సాహిత్య పరిస్థితులు
బి. లింగరాజు
పరిశోధకులు, తెలుగు అధ్యయనశాఖ,
తెలంగాణ విశ్వవిద్యాలయం,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 9640346316, Email: lingarajub3366@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 15.08.2025 ఎంపిక (D.O.A): 31.08.2025 ప్రచురణ (D.O.P): 01.09.2025
వ్యాససంగ్రహం:
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిజాం రాచరిక పాలనలో తెలంగాణ ప్రజలలో ఆత్మగౌరవం, మాతృభాషాభిమానం పెంపొందించేందుకు 1901లో ఆవిర్భవించిన ఒక మహాసంస్థ. ఈ పరిశోధన భాషానిలయం ప్రచురించిన రజతోత్సవ (1927), సువర్ణోత్సవ (1955), వజ్రోత్సవ (1963), అమృతోత్సవ (1975), శతాబ్ది ఉత్సవ (2002) ప్రత్యేక సంచికలలోని సాహిత్య, చారిత్రక, సామాజిక, వైజ్ఞానిక విశేషాంశాలను విశ్లేషించడం ప్రధానోద్దేశం. పూర్వ పరిశోధనలు సంస్థ చరిత్రను సాధారణంగా సమీక్షించగా, ప్రస్తుత వ్యాసం ఈ ప్రత్యేక సంచికలను ప్రాథమిక ఆధారాలుగా స్వీకరించి, వాటిలోని నిర్దిష్ట వ్యాసాలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది. విశ్లేషణాత్మక పద్ధతిలో నిర్వహించిన ఈ అధ్యయనం, నాటి రచయితల వ్యాసాలలో గల విలువలను నేటి తరానికి అందించడం ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. భాషానిలయం కేవలం గ్రంథాలయంగానే కాక, తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి, సామాజిక-సాంస్కృతిక చైతన్యానికి, జాతీయ పునరుజ్జీవనానికి ఒక శతాబ్దం పాటు నిరంతరాయంగా కృషి చేసిన శక్తివంతమైన కేంద్రంగా నిలిచిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిరంకుశ పరిస్థితులలో గ్రంథాలయాలు ప్రగతిపథగాములకు నిలయాలుగా, జాతీయ భావాలను ఉద్దీపింపచేసే కేంద్రాలుగా, స్వాతంత్ర్య సమరయోధులను తీర్చిదిద్దే శిక్షణా కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి. ఈ పరిశీలన భవిష్యత్తులో ఒక్కొక్క ప్రత్యేక సంచికను ఎన్నుకొని మరింత లోతైన పరిశోధన చేయడానికి ఆధారభూమికగా నిలుస్తుంది.
Keywords: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, గ్రంథాలయోద్యమం, ప్రత్యేక సంచికలు, తెలుగు సాహిత్య వికాసం, తెలంగాణ సాంస్కృతిక చైతన్యం.
ఉపోద్ఘాతం
నిజాం రాచరిక పాలనలో తెలంగాణ ప్రజలలో ఆత్మగౌరవం, మాతృభాషాభిమానం కొరకు ఉద్భవించిన ఒక మహాసంస్థగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం చరిత్రలో నిలిచింది. నాటి నిర్బంధ, నిరంకుశ రాచరిక వ్యవస్థకు ధీటుగా, అపూర్వ సామాజిక చైతన్యానికి ఇది ప్రేరణనిచ్చింది. భాషానిలయం తెలుగుసీమ అంతట, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించింది. 1901 సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈ సంస్థ ఆవిర్భవించింది. కొందరి వ్యక్తుల పుట్టుక, కొన్ని సంస్థల స్థాపన చరిత్రకు మహత్తర పరిణామాలను, ఉద్యమాలను, వినూత్న నిర్మాణాన్ని అందిస్తాయి. ఈ కోవకు చెందినదే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. నాటి ఆసఫ్ జాహీ పాలనలో, రాజధాని హైదరాబాద్ నగరంలో, తురుష్క సంస్కృతి ప్రాబల్యం ఉన్న వాతావరణంలో ఒక తెలుగు భాషానిలయం స్థాపన సంకల్పం కలగడమే ఒక సాహసం.
(సోర్స్: నమస్తే తెలంగాణ, ఆదివారం, ఆగష్టు 28, 2016)
ఈ భాషానిలయం తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావడానికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలైన సభలు, సమావేశాలు, సదస్సులు, కవి సమ్మేళనాలు, సంగీత గాత్ర కచేరీలు, నాటక ప్రదర్శనలు, సారస్వత సప్తాహాలు, కావ్య ఆవిష్కరణలు, కావ్య గానాలు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనంలో నిర్విరామ కృషి చేస్తూ, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ప్రస్తుతం 125వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సంస్థ తన ప్రస్థానంలో అనేక ఉత్సవాలను (రజతోత్సవం, సువర్ణోత్సవం, వజ్రోత్సవం, అమృతోత్సవం, నవ దశాబ్ది ఉత్సవం, శతాబ్ది ఉత్సవాలు) జరుపుకుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవం, కాళోజీ నారాయణరావు షష్టిపూర్తి ఉత్సవం వంటి సాహితీ ప్రముఖుల ఉత్సవాలను కూడా నిర్వహించింది. ఈ ఆయా సందర్భాలలో, భాషానిలయం సాహిత్యోత్సవ ప్రత్యేక సంచికలను ప్రచురించింది. ఈ ప్రత్యేక సంచికలలోని సాహిత్య విశేషాంశాలను పరిశీలించి, వాటిని నేటి తరానికి అందించడం ఈ వ్యాసం ప్రధానఉద్దేశం.
పరిశోధన పద్ధతి
ప్రస్తుతవ్యాసం విశ్లేషణాత్మక పద్ధతిలో నిర్వహించబడింది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ప్రచురించిన రజతోత్సవ ప్రత్యేక సంచిక (1927), సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక (1955), వజ్రోత్సవ ప్రత్యేక సంచిక (1963), అమృతోత్సవ ప్రత్యేక సంచిక (1975), శతాబ్ది ఉత్సవ ప్రత్యేక సంచిక (2002) వంటి సాహిత్యోత్సవ ప్రత్యేక సంచికలు ఈ పరిశోధనకు ప్రాథమిక ఆధారాలు (primary sources). ఈ సంచికలలోని నాటి రచయితలు రాసిన వ్యాసాలలో గల సాహిత్య, చారిత్రక, సామాజిక విశేషాంశాలను పరిశీలించి, వాటిని క్రోడీకరించి, విశ్లేషించడం ముఖ్య లక్ష్యం. ఈ విశేషాలు నేటి తరం సాహితీకారుల రచనానైపుణ్యానికి, పరిశోధకులకు గణనీయమైన తోడ్పాటును అందిస్తాయి.
పూర్వ పరిశోధనల సమీక్ష
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం చరిత్ర, కృషిపై ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పరిశోధనలు జరిగాయి. వీటిలో మూడు ప్రధాన గ్రంథాలు:
- డా॥ అక్కిరాజు రమాపతిరావు రచించిన “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం శరదశ్శతం” అనే పుస్తకాన్ని భాషానిలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2001 మే 30వ తేదీన ప్రచురించింది. ఈ గ్రంథంలో భాషానిలయం నిర్వహించిన సాహిత్యోత్సవాలు, నూరేళ్ల చరిత్రను క్లుప్తంగా విశ్లేషించారు.
- ఆచార్య ఎస్.వి. రామారావు రచించిన “నూటపది వసంతాల శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం” అనే చిన్న పుస్తకాన్ని 2010లో భాషానిలయం ప్రచురించింది. ఈ పుస్తకం భాషానిలయం నూటపది సంవత్సరాల చరిత్రను రేఖామాత్రంగా పేర్కొంది.
- దేవులపల్లి ప్రభాకరరావు రచించిన “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం - సాంస్కృతిక చైతన్య మహోద్యమం” అనే పుస్తకాన్ని 2011లో సి. పి. బ్రౌన్ అకాడమీ ప్రచురించింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నూటపది సంవత్సరాల చరిత్రను, ముఖ్య సంఘటనలను వివరించారు.
ఈ పూర్వ పరిశోధనలు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం దీర్ఘకాల చరిత్రను, దాని విస్తృత ప్రభావాన్ని సాధారణంగా సమీక్షించాయి. అయితే ప్రస్తుత వ్యాసం ఈ సంస్థ ప్రచురించిన ప్రత్యేక సాహిత్యోత్సవ సంచికలను ప్రధాన ఆధారాలుగా తీసుకొని, వాటిలోని నిర్దిష్ట వ్యాసాలలో పొందుపరచబడిన సాహిత్య, చారిత్రక, సామాజిక, వైజ్ఞానిక విశేషాంశాలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఈ సంచికలలోని విలువలను నేటి తరానికి అందించవలసిన ఆవశ్యకతను ఈ పరిశోధన నొక్కి చెబుతుంది. ఈ విధంగా, నాటి సాహిత్య వికాసాన్ని, సంస్థ కృషిని ప్రత్యేక సంచికల ద్వారా అధ్యయనం చేయడం ఈ వ్యాసం ప్రత్యేకత, ఇది భవిష్యత్తులో ఒక్కొక్క ప్రత్యేక సంచికను ఎన్నుకొని మరింత లోతైన పరిశోధన చేయడానికి ఆధారభూమికగా నిలుస్తుంది.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం తన సుదీర్ఘ ప్రస్థానంలో జరుపుకున్న ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికలలో వివిధ అంశాలపై విలువైన వ్యాసాలు పొందుపరచబడ్డాయి. వీటిని పరిశీలించడం ద్వారా నాటి సామాజిక, సాహిత్య, చారిత్రక పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
1. రజతోత్సవ ప్రత్యేక సంచిక (1927)
నిజాం నిరంకుశ పాలనలో అనేక ఆంక్షలు, అవరోధాలు, నిర్బంధాలను అధిగమించి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రచురించబడిన ఈ సంచిక ఒక విజ్ఞానపేటిక. ఇది భాషానిలయంలో ప్రత్యేక సంచికలను ప్రచురించే సంప్రదాయానికి నాంది పలికింది. ఈ సంచికలో వాఙ్మయ, చారిత్రక, పరిశోధన సంబంధమైన విశేషాంశాలతో పాటు నాటి నిజాం రాష్ట్రాంధ్రపాలనా విషయాలను తెలియజేస్తూ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.
1.1. విజయనగర సామ్రాజ్యం - వైభవం, పతనం
గాడేపల్లి సూర్యప్రకాష్ రావు రాసిన “కృష్ణదేవరాయల విద్వత్సభ” అనే వ్యాసం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలోని హంపి నగర వైభవాన్ని అత్యంత సుందరంగా వర్ణించింది. కృష్ణదేవరాయల కాలంలో హంపి నగరం అల్లసాని పెద్దన్న వంటి అష్టదిగ్గజ కవులతో విలసిల్లిందని, వారి కవితా గానమాధుర్యం ఉన్నతంగా భాసిల్లిందని పేర్కొన్నారు. ఆనాడు లెక్కలేని మణిరాశులతో హంపి నగర వీధులు ఐశ్వర్యంతో తులతూగాయని, భారతమాత యొక్క హారానికి వేలాడుతున్న అమూల్యమణి లాగా హంపి నగర వైభవాన్ని చిత్రించారు. అయితే, విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత హంపి నగరం తన ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని కోల్పోయిందని, భర్తను కోల్పోయి వైధవ్యాన్ని పొందిన స్త్రీ లాగా ఉందని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వజ్ర వైడూర్యాలను కుప్పలుగా పోసి అమ్మిన వీధులలో వ్యాసం రాసిన నాటికి కేవలం రెండు దుకాణాలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా మరమరాలు, ఉప్పు, మిరపకాయలను అమ్మేవని కలత చెందారు. వేలాది మంది జనంతో కళకళలాడిన నగరంలో నేడు కేవలం యాభై మంది మాత్రమే ఉన్నారని, రాజ రాజులు ఊరేగిన పురవీధులు మృగరాజుల స్వేచ్ఛా విహారాలకు ఆటపట్టులైనట్లుగా పేర్కొన్నారు. కవి గాయక ప్రసంగాలతో ప్రతిధ్వనించిన చోట కాకుల అరుపులు కూడా వినబడటం లేదని, అక్కడి దేవాలయాలు దయ్యాలకు, గర్భాలయాలు గబ్బిలాలకు ఆలవాలమైనాయని విచారం వ్యక్తం చేశారు. ఒకప్పటి ఇళ్ళు, వాకిళ్లు పాడుబడిన దిబ్బలుగా, జొన్న పొలాలుగా మారాయని ఆవేదన చెందారు. (రజతోత్సవసంచిక పుట. 17)
1.2. నిజాం రాష్ట్ర ఆంధ్రకవుల సాహితీకృషి
“నిజాం రాష్ట్ర ఆంధ్ర కవులు” అనే వ్యాసం తెలుగు కవుల గొప్పతనాన్ని, ప్రశస్తిని తెలియజేసింది. శేషాద్రి రమణ కవులు చందవోలు, అమరావతిలో మత చర్చలలో బౌద్ధ మతస్థులను ఓడించారని, శైవమత ప్రచారకుడైన మల్లికార్జున పండితారాధ్యులకు బౌద్ధులను శైవ మతస్తులుగా మార్చిన ఘనత దక్కిందని పేర్కొన్నారు. మల్లికార్జున పండితారాధ్యులను నిజాం రాష్ట్ర ప్రధమాంధ్ర కవిగా, ఆయన రచించిన "శివతత్వసారము"ను నిజాం రాష్ట్రంలో లభించిన ప్రధమాంధ్ర గ్రంథంగా పేర్కొన్నారు. పాల్కురికి సోమనాథుడు, సంస్కృత కవి రామేశ్వర దీక్షితుడు, పురుషార్ధ సారము రచించిన విశ్వేశ్వరకవి, చందస్సును తెలుగులో రాసిన గోకర్ణుడు, మార్కండేయ పురాణం రచించిన మారన వంటి ప్రముఖ కవులను ఈ వ్యాసంలో ప్రస్తావించారు. తెలుగు సాహిత్యంలో మొదటి రామాయణంగా పేరు గాంచిన రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డిని, ఆయన కుమారులు కాచవిభుడు, విఠలనాథులను వివరించారు. రామాయణం ద్విపదలో రచించడంతో, ద్విపద జన్మస్థానం నిజాం రాష్ట్రమే అయ్యిందని రచయిత పేర్కొన్నారు. తెలుగులో మొదటి చంపూ రామాయణం అయిన భాస్కర రామాయణం కర్తలైన హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుల ప్రతిభా విశేషాలను ప్రత్యేకంగా కొనియాడారు. నృత్య రత్నావళిని రాసిన జయపసేనాని, విక్రమార్క చరిత్రను రాసిన భల్లటుడు, బాల భారతాన్ని రాసిన అగస్తేశ్వరుడు, విద్యానాథుడు వంటి సుప్రసిద్ధ సంస్కృత కవులను తెలియజేశారు. అంతేకాకుండా, రుద్రభట్టు, మంచన పండితుడు, శివదేవయ్య, కాసె సర్వప్ప, మళ్లీనాథసూరి, బమ్మెర పోతన, గౌరన, బొప్పరాజు గంగన్న, ఏల్చూరి సింగన, హరిభట్టు, మడికి సింగన, ఏలకూచి బాలసరస్వతి, చరిగొండ ధర్మన్న, మల్లారెడ్డి, రాజగోపాలరావు, అద్దంకి గంగాధరకవి, పొన్నగంటి తెలగన్న, నాచనసోముడు, పిల్లలమర్రి వీరభద్రుడు, సారంగుతమ్మయ్య, భీమకవి, పిడిపర్తి బసవన్న, మరిగంటి సింగరాచార్యులు మొదలైన నిజాం రాష్ట్ర కవులను, వారి తెలుగు సాహిత్య సేవను ఈ వ్యాసంలో వివరించారు. (రజతోత్సవసంచిక పుట. 24)
1.3. చారిత్రక, పురావస్తు పరిశోధనలు
శిరుగూరి హనుమంతరావు రాసిన “నిజాం రాష్ట్రంలోని చారిత్రక పరిశోధన” అనే వ్యాసం నిజాం రాష్ట్రం దక్షిణా పద రాజకీయ విభాగాలతో సంబంధం కలిగి ఉందని పేర్కొంది. ఇక్కడ ఆంధ్రులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, యాదవులు, కాకతీయులు రాజ్యపాలనలో చూపిన ప్రతిభను కొనియాడారు. నిజాం రాష్ట్రంలోని పురాతన సామాగ్రిని సంరక్షించడానికి 1914వ సంవత్సరంలో నిజాం రాజు చరిత్ర పరిశోధక శాఖను ఏర్పాటు చేశారని, దానికి "యాజ్ దాని" గారిని డైరెక్టర్ గా నియమించారని తెలిపారు. ఈ శాఖ పురాతన సామాగ్రిని రక్షించడమే కాకుండా భూపరిశోధన, శాసన పరిశోధన, నాణేల పరిశోధన, వస్తు ప్రదర్శనశాల స్థాపన వంటివి నిర్వహిస్తుందని అన్నారు. అజంతా చిత్రాలు పాడైపోకుండా ఉండటం కోసం 1920లో ఇద్దరు ఇటాలియన్ కళాకోవిదులను రప్పించి తగు ఏర్పాట్లు చేసిన విషయాలను రచయిత గుర్తుచేశారు. ఓరుగల్లులోని వేయి స్తంభాల దేవాలయం, పాలంపేట రామప్ప దేవాలయం, ఉప్పరపల్లి దేవాలయాలు, బీదర్, గుల్బర్గా, హైదరాబాద్ వంటి ప్రదేశాలలో పురాతన సామాగ్రిని రక్షించారని అన్నారు. భూపరిశోధనలో హైదరాబాద్ ప్రాంతంలో కేరన్, క్రాంలేష్ లు అని పిలవబడే రాక్షస గుళ్లు బయలుపడినట్లు పేర్కొన్నారు. ఈ శాఖకు పశ్చిమ చాళుక్యుల మూడు శాసనాలు, కాకతీయ రాజుల నాలుగు శాసనాలు, కొలనుపాకలో కొన్ని చాళుక్య శాసనాలు లభించాయని అన్నారు. నిజాం రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతంలో లభించిన అశోకుని శిలాశాసనం ద్వారా అశోకుని సామ్రాజ్యం దక్షిణ పదం వరకు వ్యాపించి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆంధ్ర నాణేములు, దేవగిరిలో యాదవ రాజుల నాణెములు, విజయనగర రాజుల నాణెములతో పాటు గుల్బర్గాలో ఇండో-గ్రీకు, ఇండో-పర్షియన్, కుషాను, ఢిల్లీ సుల్తాను, మొగల్ చక్రవర్తులకు సంబంధించిన నాణేములు లభించినట్లు వివరించారు, ఇవి భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు. (రజతోత్సవసంచిక పుట. 31)
1.4. తెలంగాణలోని ఆంధ్ర సంస్థానాలు
సురవరం ప్రతాపరెడ్డి రాసిన “నిజాం రాష్ట్రంలోని ఆంధ్ర సంస్థానముల చరిత్ర” అనే వ్యాసం పాల్వంచ, వనపర్తి, గద్వాల, పాపన్నపేట, దోమకొండ, జటప్రోలు, అమరచింత వంటి తెలుగు సంస్థానాలను వివరించింది. ఇవి మొదట కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలలో కలిసిపోయి, ఆ తర్వాత నిజాం రాజ్యంలో సామంత సంస్థానాలుగా ఉన్నాయని అన్నారు. ఈ సంస్థానాలు అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ బాహుబలంచే సంపాదించిన చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విలసిల్లాయని, నిజాం కాలంలో పూర్వ వైభవాన్ని కోల్పోయినప్పటికీ, గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. (రజతోత్సవసంచిక పుట. 39)
1.5. అష్టదిగ్గజ కవులు – ప్రతిభ
“శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజముల ప్రతిభ” అనే వ్యాసం ఈ సంచికలో ప్రత్యేకంగా నిలిచింది. అల్లసాని పెద్దన "అల్లికజిగిబిగి"ని రాయప్రోలు వెంకటరామ సోమయాజులు, ముక్కుతిమ్మన "ముద్దుపలుకు"ను ప్రకాశం, అయ్యలరాజు రామభద్రుడి "ధారా శుద్ధి"ని చింతలపాటి బుచ్చి వెంకటేశ్వర శర్మ, మాదయగారి మల్లన "రసముల్ చిప్పలు బళిబళి"ని ఖండవల్లి లక్ష్మీ రంజనం, తెనాలి రామకృష్ణుడి "పదగుంఫనము"ను శేషాద్రి రమణ కవులు, ధూర్జటి "అతులిత మాధురి మహిమ"ను ధూర్జటి కుమార్, రామరాజ భూషణుడి "సాహిత్య రస పోషణము"ను పి.జయరావు, పింగళి సూరన "ఉదంచెద్వైఖరి”ని పింగళి లక్ష్మీకాంతం వివరించారు. (రజతోత్సవసంచిక పుట. 67)
1.6. శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్రలు
శేషాద్రి రమణ కవులు రాసిన “శ్రీకృష్ణదేవరాయల విజయయాత్ర” అనే వ్యాసంలో శ్రీకృష్ణదేవరాయలు 1515-19 మధ్యకాలంలో కళింగ, అమరావతి, కొండవీటిపై జరిపిన దాడులను పేర్కొన్నారు. నిజాం రాష్ట్రంలోని అర్సపల్లి, జల్లిపల్లి, కందికొండ, కప్పలకొండ, నల్లగొండ, ఖమ్మంమెట్టు, కనిగిరి, శంకరగిరి వంటి దుర్గాలను శ్రీకృష్ణదేవరాయలు లోబర్చుకోవడం వంటి విశేషాంశాలు ఇందులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు "తెలంగాణ్యాము” అని వ్యవహరించేవారని, యవన రాజులు పేరు పెట్టకముందే నిజాం రాజ్యంలోని తెలుగు ప్రాంతం "తెలంగాణమనే" వ్యవహారంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు ప్రతి దిగ్విజయ యాత్రకు వారి భార్యలతో ప్రయాణమయ్యేవారని ఈ వ్యాసంలో వివరించారు. (రజతోత్సవసంచిక పుట. 40)
1.7. గ్రంథాలయోద్యమం - బాలలు, స్త్రీల భాగస్వామ్యం
శ్రీమతి పందిటి సత్యవతి బాయి “గ్రంథాలయ ఉద్యమము బాలురు - స్త్రీలు” అనే అంశంపై వ్యాసం రాశారు. సంఘోద్ధరణ భారం గ్రంథాలయంపై ఉందని, గ్రంథాలయాలు కేవలం పురుషులకు మాత్రమే గాకుండా బాలలను కూడా ఆకర్షించగలవని ఆమె అన్నారు. బొమ్మలతో కూడిన నీతిదాయక కల్పనా కథల పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచాలని సూచించారు. గ్రంథాలయాలు బాలల శక్తి యుక్తులను అభివృద్ధి పరచే విధంగా ఉండాలని, సంఘంలో అర్థ భాగమైన స్త్రీల విద్యాభివృద్ధి కోసం గ్రంథాలయాలలో స్త్రీలు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. స్త్రీల కొరకు ప్రత్యేకంగా వ్యక్తిని నియమించి గృహాలకు పుస్తకాలు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని, చదువురాని గృహిణుల కోసం విద్యావంతులైన స్త్రీలను నియమించి గ్రంథాలను చదివి వినిపించేటట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. (రజతోత్సవసంచిక పుట. 67)
1.8. చారిత్రక ప్రదేశాలు - సాహిత్య జన్మస్థలాలు
బుర్ర శేషగిరిరావు “ఓరుగల్లు, ఒంటిమిట్ట, ఏకశిల” అనే వ్యాసంలో పోతన జన్మస్థలం విషయాలను పేర్కొన్నారు. పోతన భాగవతంలో పేర్కొన్న ఏకశిలా నగరం నిజాం రాజ్యంలోని వరంగల్లు అని ఎక్కువ మంది అంగీకరించారని, కొందరు మాత్రం కడప మండలంలోని ఒంటిమిట్టగా భావించారని అన్నారు. కాకతీయుల రాజధాని నగరమైన ఓరుగల్లుకే ఏకశిలా నగరం అనే నామం ఉందని అనేక శాసన ఆధారాలు నిరూపిస్తున్నాయని రచయిత పేర్కొన్నారు. కొమ్మవరపు సుబ్బారావు “నిజాం రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశములు” అనే వ్యాసంలో బౌద్ధులచే నిర్మించబడి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అజంతాను గూర్చి ప్రస్తావించారు. ఔరంగాబాద్, అంతూరు, అలంపూర్, ఉదయగిరి, ఎల్లోరా, కందహార్ వంటి నిజాం రాష్ట్రంలోని అనేక చారిత్రక ప్రదేశాలను, వాటి విషయాలను తెలియజేశారు. (రజతోత్సవసంచిక పుట. 71)
1.9. భాషానిలయం ప్రస్థానం - ఇతరాంశాలు
అప్పటి భాషానిలయం కార్యదర్శి బూర్గుల రామకృష్ణారావు భాషానిలయం 25 సంవత్సరాల ప్రస్థానానికి దర్పణంగా ఒక దీర్ఘ వ్యాసం రాశారు. వేలూరు రంగధామ నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, శేషాద్రి రమణ కవులు, దేవులపల్లి వెంకటాచలపతి రావు, సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి రాసిన పద్యాలు ఈ సంచికలో ఎంతో ప్రశస్తమైనవి. నిజాం సర్కారు ఆర్కియాలజికల్ డిపార్టుమెంట్, మద్రాసు ఆంధ్ర పత్రికా కార్యాలయం, బొంబాయి తెలుగు సమాచార్, బెజవాడ విజ్ఞాన చంద్రికా మండలి, రెడ్డిరాణి పత్రికాధిపతి వంటి సంస్థలు చిత్రపటాలను అందించాయి. కె. రామాచార్యులు రజతోత్సవ సంచిక ముఖపత్రాన్ని అందించగా, వేలూరి రంగధామ నాయుడు అష్టదిగ్గజముల చిత్రపటాన్ని చిత్రించారు. వేలూరి రంగధామ నాయుడు, సురవరం ప్రతాపరెడ్డి, గాడేపల్లి సూర్య ప్రకాశరావు, మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు వంటి ప్రముఖులు ఈ సంచిక ప్రచురణకు కృషి చేశారు.
2. సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక (1955)
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 1952 సెప్టెంబర్ 1 వ తేదీన సువర్ణోత్సవం జరుపుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో సంచికను ప్రచురించలేకపోయింది. తర్వాత, వడ్లకొండ నరసింహారావు భాషానిలయం అధ్యక్షులుగా, కె.వి.భూపాల్ రావు కార్యదర్శిగా ఉన్న సమయంలో 1955 సెప్టెంబర్ 1వ తేదీన భాషానిలయం 55వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఈ సువర్ణోత్సవ ప్రత్యేక సంచికను ప్రచురించింది. కె.వి. భూపాలరావు ఈ సంచికకు చక్కని పీఠిక రాశారు.
2.1. గ్రంథాలయ ఉద్యమ ప్రభావం - పత్రికలు, సంస్థలు
బూర్గుల రామకృష్ణారావు చేసిన “అధ్యక్షోపన్యాసము”లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం విశేషాలను పేర్కొన్నారు. స్థాపించిన కొద్ది కాలంలోనే తెలంగాణలో అనేక ప్రాంతాలలో గ్రంథాలయాల స్థాపనకు, గ్రంథాలయ ఉద్యమ ఆరంభానికి భాషానిలయం కారణంగా నిలిచిందని అన్నారు. దీని ఫలితంగానే హితబోధిని, తెలుగు పత్రిక, నీలగిరి, ఆంధ్రాభ్యుదయము, గోల్కొండ పత్రిక, సుజాత, ఆంధ్రశ్రీ, దేశబంధు, తెలుగుతల్లి, విభూతి - దివ్యవాణి, ఆంధ్రవాణి, తెలంగాణా, మీజాన్, శోభ, తరణి వంటి మాస - వార - అర్ధవార - దిన పత్రికలు వెలిశాయని వివరించారు. గోల్కొండ, కిన్నెర, దివ్యవాణి, కాకతీయ, వీరేశలింగం కంఠాభరణ, విజ్ఞాన ప్రచారిణీమండలి, అణా గ్రంథమాల, దేశోద్ధారక, సాహితీ మేఖల, సాధన సమితి వంటి సంస్థలు స్థాపించారని అన్నారు. భాషానిలయం మొదటి నుంచి సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, హరి కథా కాలక్షేపాలు, నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేసిందని, ప్రజలలో విజ్ఞానం, వినోదం కలిగించడంతో పాటు తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడిందని పేర్కొన్నారు. వడ్లకొండ నరసింహారావు రాసిన “సువర్ణోత్సవోదంతము” అనే వ్యాసం భాషానిలయం స్థాపన, సారస్వత సప్తాహాలు, సంపూర్ణ రామాయణ, హరికథా కాలక్షేపాలు, విశిష్ట కార్యక్రమాలు, మందిర విస్తరణ, ఉపన్యాస సభలు, ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం, భాషానిలయ పాలన వంటి విషయాలను పేర్కొంది. నాయని వెంకట రంగారావు చేసిన “స్వాగతోపన్యాసం” భాషానిలయం స్థాపనకు కారణమైన సంఘటనలను, భాషానిలయం అభివృద్ధి కోసం పాటుపడిన వేలూరి రంగధామ నాయుడు, ఆదిపూడి సోమనాధ రావుల కృషిని తెలిపారు. భాషానిలయం స్థాపన, రజతోత్సవం, సువర్ణోత్సవం వేడుకల్లో స్వాగతం పలికే భాగ్యం తనకే లభించిందని చెబుతూ ఉప్పొంగిపోయారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 23)
2.2. గ్రంథాలయోద్యమ లక్ష్యాలు - అక్షరాస్యత ప్రాముఖ్యత
గాడిచర్ల హరిసర్వోత్తమరావు “గ్రంథాలయ మహాసభ” విశేషాలను ఈ సంచికలో ప్రచురించారు. మొట్టమొదటి జాతీయోద్యమం వందేమాతర ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. ఈ జాతీయోద్యమం ఆంధ్ర దేశంలో గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమం అనే రెండు రూపాలను దాల్చిందని అన్నారు. గ్రంథాలయాలలో కేవలం పుస్తకాలను పెట్టడం, ప్రత్యేక సంచికలు వేయించడం మాత్రమే సరిపోదని, ఆంగ్ల భాషలో తట్టలు, బుట్టల అల్లికకు, చేతి పనులకు సంబంధించిన వేలకొలది పుస్తకాలు ఉన్నాయని అన్నారు. తెలుగులో అనేక వృత్తులకు సంబంధించిన పుస్తకాలను రాయవలసిన అవసరం ఉందని, గ్రంథాలయోద్యమానికి మొదటి మెట్టు అక్షరాస్యతనే అని ఆయన సూచించారు. కొండ వెంకటరంగారెడ్డి చేసిన ఉపన్యాసం “గ్రంథాలయ మహాసభ” అనే పేరుతో ప్రచురించబడింది. చీకటి గ్రామంలో జ్యోతి ఉంటే ఏ విధంగా వెలుగు ప్రసరిస్తుందో అదే మాదిరిగా గ్రామంలో గ్రంథాలయం ఉంటే ప్రజలలో విజ్ఞాన వ్యాప్తికి అవకాశం ఉంటుందని అన్నారు. గ్రంథాలయాలు పాఠశాలలకు బదులుగా విజ్ఞాన ప్రచారానికి పని చేస్తాయని, పూర్వకాలపు గ్రంథాలు కాకుండా ఆధునిక కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు పెట్టాలని ఆయన సూచించారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 15)
2.3. వైజ్ఞానిక, సామాజిక చైతన్యానికి గ్రంథాలయాల పాత్ర
యం. చెన్నా రెడ్డి చేసిన “అధ్యక్షోపన్యాసం” తృతీయ సమావేశంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను వేరువేరుగా గాక ఒకే ప్రాంతంగా భావించాలని అన్నారు. ఒక భాష మరొక భాషకు తోడ్పడేటట్లు ప్రోత్సహించాలని, భాషలకు విచ్ఛిన్నం కలగకుండా వాటి అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వంటి సంస్థలు తోడ్పడాలని అన్నారు. ఆర్థిక దుస్థితి వల్ల అనేక గ్రంథాలయాలు మూసివేయబడ్డాయని, దీనికి ప్రభుత్వ సహాయం లేకపోవడమే ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. యస్. భగవంతం చేసిన “అధ్యక్షోపన్యాసం” తృతీయ సమావేశంలో సామాన్య వైజ్ఞానిక దృష్టి లేనందున ప్రజల్లో అజ్ఞానం నెలకొని ఉందని, దీనివల్ల మనో దౌర్బల్యం, సమస్యలను పరిష్కరించలేకపోవడం వంటివి ఏర్పడుతున్నాయని అన్నారు. విద్యా వ్యాప్తి, విజ్ఞాన వ్యాప్తి అవసరమని, దీని కోసం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. మాటేటి రామప్ప ప్రచురించిన “భక్త్యంజలి” అనే వ్యాసంలో వాఙ్మయ సంస్థల జీవిత ప్రమాణం అత్యల్పమని పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం మొదటిదని, నిద్రాణమైన ఆంధ్రులను మేల్కొల్పి, భావి జీవిత భాగ్యరేఖలను తీర్చిదిద్దిన మహాసంస్థ భాషానిలయమని అన్నారు. ఇది భాగ్యనగర ప్రజల జీవిత ప్రవాహంలో అంతర్వాహినిగా ప్రవహించి సాంఘిక, రాజకీయ, వైజ్ఞానిక ప్రగతిబాటలో పయనింపజేసిందని వివరించారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 33)
2.4. స్త్రీల విద్యాభివృద్ధి - కార్యదక్షత
అనంత లక్ష్మీదేవి “స్త్రీల సభ” అనే వ్యాసం రాశారు. శతాబ్దాల తరబడి నిజాం రాజుల పీడన నుండి విముక్తి చెందినప్పటికీ, ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక వెనుకబాటుతనం ఇంకా ఆవరించి ఉందని అన్నారు. స్త్రీలలో ముఖ్యంగా స్వయం సహాయక సిద్ధాంతంపైన పనులను నిర్వర్తించుకునే కార్యదక్షత ఉంటుందని, అటువంటి మహిళలు పదిమంది ఉన్నా తెలంగాణమంతా స్త్రీల సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. శ్రీమతి సత్తిరాజు రాజ్యలక్ష్మి దేవి “స్త్రీలు ఉన్నత విద్య” అనే అంశంపై వ్యాసం రచించారు. విద్య పురుషునికెంత అవసరమో స్త్రీకి కూడా అంతే అవసరమని, స్త్రీలకు విద్య లేకపోతే మానవ కుటుంబంలో అర్థ భాగం అంధకారంలో మునిగిపోయినట్లేనని ఆమె అన్నారు. విద్యాక్షేత్రంలో, వైద్య క్షేత్రంలో, కళా క్షేత్రంలో, శాంతి క్షేత్రంలో కూడా స్త్రీయే ఎక్కువ అర్హురాలని ఆమె బలంగా వాదించారు. పాశ్చాత్య దేశాల్లో ఈ అంశాన్ని గుర్తించి ప్రాథమిక విద్య స్త్రీల బాధ్యతగా చేశారని అన్నారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 37,45)
2.5. తెలంగాణలో తెలుగు భాషా వికాసం
మాడపాటి హనుమంతరావు రాసిన “అర్థ శతాబ్ది భాషాసేవ” అనే వ్యాసం ఈ సంచికలో ఉంది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించే నాటికి తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషకు ఏమాత్రం తావు లేదని, తెలుగు పత్రికలు ఉన్నవనే విషయం కూడా ప్రజలకు తెలియదని అన్నారు. హైదరాబాద్ లో భాషానిలయం స్థాపన అనంతరం అనేక తెలుగు పత్రికలు బయలుదేరాయని, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో రెండు వందలకు పైగా గ్రంథాలయాలు స్థాపించబడ్డాయని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రైమరీ, లోయర్ కండరీ, సెకండరీ, హైయ్యర్ సెండరీ స్థాయిలలో మాతృభాష తెలుగులో చదువుకోవడానికి అవకాశం ఏర్పడిందని, దీనికి భాషానిలయం కృషి కొంత కారణమని ఆయన పేర్కొన్నారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట.38)
2.6. తెలుగు సాహిత్యం - పద్యం, వచనం, జానపద సాహిత్యం
“దాశరథి కవితా స్వరూపం” అనే వ్యాసంలో శబ్దార్ధాలు, ధ్వని, అలంకారాలు వచనంలో పద్యంలో సమానంగా ఉన్నప్పటికీ, వచనం కన్నా పద్యంలో ప్రత్యేకత ఉందని రచయిత అన్నారు. శబ్దాలు చెప్పలేని కొన్ని విచిత్ర అర్థాలను వాటి లయ బద్ధమైన నడక చెబుతుందని, ఆ నడకకు మానవుని గుండె కదలికకు సంబంధం ఉందని పేర్కొన్నారు. అందుకే పద్యం మనసును పట్టుకుంటుందని, వచనం అంతగా పట్టదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పల్లా దుర్గయ్య “పొడుపు కథలు” అనే అంశంపై వ్యాసం రచించారు. జానపద సాహిత్యంలో పొడుపు కథలు ఒక ప్రత్యేక శాఖ అని, ఇవి నిజానికి కథలు కావని, 'దీని భావమేమి తిరుమలేశ' అనే పద్ధతికి చెందిన చిన్న వాక్య గుచ్చం గల ప్రశ్నలని అన్నారు. ఛందోనియమాలు వీటికి సర్వత్ర లేకపోయినా యతియో, ప్రాసయో, అంత్యప్రాసయో సాధారణంగా గోచరిస్తాయని పేర్కొన్నారు. ప్రశ్న వేయడాన్ని "పొడుపు" అని, ఉత్తరం చెప్పడాన్ని "విడుపు" అని తెలుగులో వ్యవహారం ఉందని, తెలంగాణలో వీటిని "శాస్త్రములు", "తట్లు” అని వ్యవహరిస్తారని తెలిపారు. ఈ పొడుపు కథలు సభ్యములని, అసభ్యములని రెండు విధాలుగా ఉంటాయని, ఇవి శిష్ట సాహిత్యంలోని శ్లేష, వక్రోక్తుల తెగకు చెందినవని ఆయన పేర్కొన్నారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 87)
2.7. ప్రాచీన గ్రంథాలయాలు, తాళపత్ర గ్రంథాలు
చొల్లేటి నృసింహశర్మ కవి “గ్రంథాలయములు - వాటి ఇతిహాసము” అనే వ్యాసం రచించారు. ప్రపంచంలో మొదటి గ్రంథాలయం ఈజిప్టు దేశంలో 35 వేల ఏండ్లకు పూర్వమే వెలిసిందని, అది ఒక గొప్ప గ్రంథాలయమని అన్నారు. క్రీస్తుకు పూర్వం 4 వేల సం.లకు ముందు బాబిలోనియాలో ఇటుకలు, రాళ్లు మొదలైన వాటిపై రచనలు చేసిన మందిరాలు ఉండేవని తెలిపారు. భారతదేశంలో పూర్వం నుండి గ్రంథాలు రాయబడినట్లు ఆధారాలు ఉన్నా, ఆ గ్రంథాలయాలు ఉన్న జాడ తెలియరాలేదని అన్నారు. మొదటగా మగధ సామ్రాజ్యాధీశ్వరుడైన మహాపద్మనందుడు సొంత గ్రంథాలయం స్థాపించుకున్నాడని, అది మౌర్య చంద్రగుప్తుని కాలంలో చాణుక్యుని సంరక్షణలో ఉండేదని మెగస్తనీస్ పేర్కొన్నాడని వివరించారు. బుద్ధుని కాలంలో భారత దేశంలో అనేక గ్రంథాలయాలు ఉండేవని, చైనా యాత్రికుడు పాహియాను 5 వేల గ్రంథాలను చైనా దేశానికి తీసుకొని వెళ్లాడని అన్నారు. నలంద విశ్వవిద్యాలయంలో వేలకొలది గ్రంథాలు ఉండేవని, వాటిని చదువడానికి దూరదేశాల పండితులు వచ్చేవారని, విక్రమాదిత్యుడు దేవాలయాలలో కూడా గ్రంథాలయాలు స్థాపించారని పేర్కొన్నారు. ఆదిరాజు వీరభద్రరావు “తాళ్లపత్ర గ్రంథములు” అనే వ్యాసం రచించారు. తెలుగు భాషలో గ్రంథ రచన వెయ్యి సంవత్సరాలకు ముందే ప్రారంభమైందని, కానీ నన్నయకు పూర్వం రచించిన గ్రంథాలు లభించడం లేదని అన్నారు. లభించిన అనేక ప్రాచీన గ్రంథాలు తాటి ఆకుల మీద రాయబడ్డాయని, తాటిచెట్ల పెంపకం పవిత్రమైన కార్యమని, తాటిచెట్టు ప్రాచీనాంధ్రుల నాగరికతకు జీవగర్రగా వర్ణించారని పేర్కొన్నారు. జాబునకు "కమ్మ" అనే పేరు తాటియాకు నుంచి వచ్చిందని అన్నారు. లక్ష్మణరాయ పరిశోధక మండలి అనేక తాళపత్ర గ్రంథాలను సంపాదించిందని, తెలంగాణలో ఇంకా చాలా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని, “శాలలీకంద నందనందన విలాసము, దశరథరాజ నందన చరిత్రము, శ్రీకృష్ణ శతానందీయము” వంటి అముద్రిత తెలుగు, సంస్కృత తాళపత్ర గ్రంథాలను గూర్చి తెలియజేశారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 62)
2.8. గణిత శాస్త్రానికి భారతీయుల సేవలు
వి.పి.వెంకటాచారి “గణిత శాస్త్రమునకు భారతీయుల కానుక” అనే వ్యాసంలో గణిత శాస్త్రంలోని సంఖ్యామాన పద్ధతి, దశాంశ గణనాపద్ధతి, పద సంఖ్యలు, కుట్టక విశ్లేషణము, త్రిభుజ మితి వంటి వాటిలో భారతీయులైన ఆర్యభట్ట, బ్రహ్మ గుప్తా, వరాహమిహిరుడు, భాస్కరాచార్యులు, రామానుజన్ వంటి మహనీయులు అందించిన కానుకలను శాస్త్రీయంగా వివరించారు. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 48)
2.9. చారిత్రక విషాద గాథలు, సత్య ధర్మ నిబద్ధత
కె.వి. భూపాలరావు “మరవబడిన సామ్రాజ్యములో మరుగుపడిన విషాధగాధ” అనే వ్యాసం రచించారు. చరిత్రకందని మానవ, దానవ సమాజాన్ని ఒప్పుకోనని విజయనగరం రాజైన మూడవ రంగరాయలు అన్నారని, భార్యా పిల్లలను చంపి, ఆ రాజు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ఉదంతంలో కనిపిస్తుందని తెలిపారు. ఈ గాథతో పాటుగా హరిశ్చంద్రుడు మొదలైన రాజుల సత్య ధర్మ కార్యదక్షత వంటి విషయాలు ఈ వ్యాసంలో చోటుచేసుకున్నాయి. (సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక పుట. 80)
3. వజ్రోత్సవ ప్రత్యేక సంచిక (1963)
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 1962లో జరిగిన వజోత్సవాల సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించాలని భాషానిలయ వర్గం, ఆహ్వాన సంఘం నిర్ణయించింది. ఈ పనిని నిర్వహించడానికి కోదాటి నారాయణరావు, పోతుకూచి సాంబశివరావు, బిరుదురాజు రామరాజు, దాశరథి, ఆదిరాజు వీరభద్రరావు వంటి ప్రముఖులు సభ్యులుగా ఒక ఉపసంఘం ఏర్పాటు చేయబడింది. ఈ ఉపసంఘం ఈ సంచికను రూపొందించి, 1963 మార్చిలో వజ్రోత్సవ ప్రత్యేక సంచికను ప్రచురించింది.
3.1. సాహిత్య దర్శనం - కవి, కావ్యం, సహృదయుడు
చాడ సుబ్రహ్మణ్య శాస్త్రులు “సాహిత్య దర్శనం” అనే వ్యాసం రచించారు. దర్శనశాస్త్రంలో స్రష్ట - సృష్టి - ద్రష్ట అనే అంశత్రయం లాగా, సాహిత్యశాస్త్రంలో కూడా కవి - కావ్యము - సహృదయుడు అనే అంశత్రయం కలదని అన్నారు. గంగా, యమునా, సరస్వతుల కలయికయే త్రివేణీ సంగమం వలె, వాఙ్మయరంగంలో కవి - కావ్యము - సహృదయ సమ్మేళనమే సాహిత్యం పేరిట రూపొందిందని తెలిపారు. కవి, కావ్యము, సహృదయుల స్వరూపం విభిన్నంగా కనిపించినా, వాటి మధ్య అవినాభావ సంబంధం కలదని, కవి లేనిదే కావ్యం లేదని, కావ్యం లేనిదే సహృదయుని అవసరం లేదని ఈ వ్యాసంలో విశ్లేషణాత్మకంగా వివరించారు. (వజ్రోత్సవ సంచిక పుట. 2)
3.2. కళలు, సంస్కృతి - నిత్యజీవితంలో ప్రాముఖ్యత
శ్రీవాత్సవ “నిత్యజీవితంలో కళలు” అనే అంశంపై రాసిన వ్యాసం ఇందులో ఉంది. 'అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం' ఇదే భారతీయుల పరమ లక్ష్యం అని, అందాన్ని అందజేసే కళలు కేవలం ఇంద్రియాసక్తులను తీర్చడంతో భారతీయులు తృప్తిపడరని అన్నారు. భౌతికమైన ప్రపంచ వాసనలు విడిచి దూరంగా కొనిపోయే పారమార్థిక సాధన వంటిది కళ అని పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎంతో అందం ఉన్నా, మనం దానిని గమనించడం లేదని, పల్లెటూళ్ళలో, పండిన చేలల్లో, నిండిన నదీనదాల్లో, వికసించిన పూలమొక్కల్లో, విరగపూసిన కొండలోయల్లో ఎంత అందముందో చూచి ఆనందించడం లేదని వాపోయారు. నేటి యాంత్రిక యుగంలో వేగానికి అలవాటు పడిన మనుషులు, కృత్రిమమైన అభిరుచులకు, సినిమాలు, రేడియో, చెత్త రకం పత్రికలు నేర్పే చౌకబారు రుచులకు లొంగిపోతున్నారని అన్నారు. మన చిత్రకళలో, సంగీతంలో, సాహిత్యంలో, అంతర్గతమై ఉన్న విశిష్ట సంస్కృతి చిహ్నాలను మరచిపోతున్నారని, వీటిని తిరిగి ఉద్ధరించి, ఉత్తమ సంప్రదాయాలను గుర్తించే సదభిరుచులను ప్రజలలో మళ్ళీ ప్రబోధించవలసిన అవసరం ఉందని ఈ వ్యాసంలో పేర్కొన్నారు. (వజ్రోత్సవ సంచిక పుట. 11)
3.3. గ్రంథాలయోద్యమ పరిణామం - సార్వజనీన గ్రంథాలయాలు
వెలగా వెంకటప్పయ్య “విశాలాంధ్రలో గ్రంథాలయోద్యమ వికాసం” అనే వ్యాసంలో విశాలాంధ్రావనిలో అతి ప్రాచీన కాలం నుంచి గ్రంథాలయాల ఉనికి కనిపిస్తుందని అన్నారు. చారిత్రక ఆధారాలు దొరికినంత వరకు తత్త్వ జిజ్ఞాసతో యుగయుగాలను ఉర్రూతలూగించిన నాగార్జునునిదే తొలి గ్రంథాలయం అని అన్నారు. తెలంగాణకు సంబంధించిన తొలి గ్రంథాలయాన్ని చాళుక్య ప్రభువగు రాయ నారాయణ రాజు కొలువులో, సేనా నాయకుడిగా ఉన్న మధుసూదనుడు, వారికి సమీపంలో ఉన్న నాగారంలో స్థాపించాడని తెలిపారు. ఈ ప్రాచీన గ్రంథాలయాలు అనేకం కనిపిస్తున్నప్పటికీ, అవి సార్వజనీన గ్రంథాలయాలు కావని, ప్రాపకం ఉన్న కొందరు వ్యక్తులు, పండితుల కోసం ఉద్దేశించినవేనని అన్నారు. ప్రజాసామాన్యం కోసం ఆంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో 1886వ సంవత్సరంలో మంతిన ఆది నారాయణ మూర్తి అనే ప్రాథమికోపాధ్యాయునికి తొలి గ్రంథాలయం స్థాపించిన గౌరవం దక్కింది1. ఆ తర్వాత అనేక ఆంధ్ర ప్రాంతాలలో గ్రంథాలయాలు నెలకొల్పబడినవని ఆయన అన్నారు. తెలంగాణలో స్థాపించబడిన తొలి సార్వజనీన గ్రంథాలయం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అని, ఆ తర్వాత తెలంగాణలో అనేక గ్రంథాలయాలు స్థాపించడంతో గ్రంథాలయ ఉద్యమానికి దారులు పడ్డాయని ఈ వ్యాసంలో వివరించారు. (వజ్రోత్సవ సంచిక పుట. 15)
3.4. ఆంధ్రదేశపు రాజకీయోద్యమ చరిత్ర
మాదల వీరభద్రరావు “అరువదేండ్ల ఆంధ్రదేశపు రాజకీయోద్యమ సంగ్రహ సమీక్ష” అనే వ్యాసంలో 1900 నుండి 1960 వరకు ఆంధ్ర రాజకీయోద్యమ పరిణామంలో భాగంగా జరిగిన ఆంధ్ర జాతీయ పునరుజ్జీవనం, స్వరాష్ట్ర వాంఛ, కాంగ్రెస్ సత్యాగ్రహాలు, పల్నాటి అడవి పుల్లరి సత్యాగ్రహం, పెదనందిపాడు సత్యాగ్రహం, మన్యం తిరుగుబాటు, సైమన్ కమీషన్ బహిష్కరణ గురించి తెలియజేశారు. 1930-32 ఉప్పు సత్యాగ్రహం, నిర్మాణ కార్యక్రమాలు, సోషలిష్టు ఉద్యమం, సంస్థాన రాజకీయోద్యమం, 1942 ఆగస్ట్ ఉద్యమం, పోలీస్ యాక్షన్ హైదరాబాద్ ఇండియన్ యూనియన్ లో విలీనం గురించి తెలిపారు. ఆంధ్రరాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ అవతరణ, జనరల్ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయ పార్టీలు, అస్థిరమైన రాష్ట్రమంత్రివర్గాలు, జాతీయ సమైక్యత మొదలైన రాజకీయ కార్యక్రమాలను ఈ వ్యాసంలో విశ్లేషణాత్మకంగా వివరించారు. (వజ్రోత్సవ సంచిక పుట. 21)
3.5. 20వ శతాబ్దంలో ఆంధ్ర సాహితీ పరిణామాలు
అమరేంద్ర “ఇరవైలో అరవై” అనే తన వ్యాసంలో ఇరవయ్యో శతాబ్దంలో ఆంధ్రసాహిత్యంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయని తెలియజేశారు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, కథానిక, నవల, నాటక రచన, జీవిత చరిత్రలు, వ్యాస రచన, సాహిత్య విమర్శ మొదలైన అనేక ప్రక్రియలు తెలుగులో ఆవిర్భవించాయని అన్నారు. విశ్వ సాహిత్యంలో ఏ కొత్త పోకడ బయలుదేరినా ఆంధ్ర రచయితలు ఆకళింపు చేసుకొని, విశాల హృదయంతో స్వీకరించి అనుసరిస్తారని, తెలుగు రచయిత హృదయంలో నీది నాది అనే సంకుచిత తత్వం అంతరించి, మానవ సంస్కృతి అంతా మనదే అనే విశాల భావం అవతరిస్తుందని ఈ వ్యాసంలో వివరించారు. (వజ్రోత్సవ సంచిక పుట. 33)
3.6. ఆంధ్రప్రదేశ్ లో సాంఘిక సంస్కరణలు
కోదాటి నారాయణరావు “ఆంధ్రప్రదేశ్ లో 20వ శతాబ్దంలో సాంఘిక పరిణామం” అనే వ్యాసంలో ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, దివ్యజ్ఞాన సమాజం వంటి సంస్థలలో ఉద్యమాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ ఉద్యమాల ఫలితంగా ఆంధ్రదేశంలో స్త్రీ విద్య, బాల్య వివాహ నిషేధం, వితంతు పునర్వివివాహాలు ప్రచారంలోకి వచ్చాయని అన్నారు. అస్పృశ్యతానివారణ కోసం కొంత ప్రయత్నం జరిగిందని, స్త్రీలు ఆంగ్ల విద్యను అభ్యసించడం, భోజనాలలో వర్ణవివక్షతలను వదలివేయడం ప్రచారంలోకి వచ్చాయని, వీటి ప్రభావం సంఘసంస్కరణోద్యమానికి చాలా దోహదం చేశాయని ఈ వ్యాసంలో పేర్కొన్నారు. (వజ్రోత్సవ సంచిక పుట. 37)
3.7. కుతుబ్ షాహీల కాలంలో తెలుగు సాహిత్యం
ఆదిరాజు వీరభద్రరావు “గోలకొండ కుతుబ్ షాహీ సుల్తానుల కాలములో తెలుగు సాహిత్యము” అనే వ్యాసంలో కుతుబ్ షాహీ వంశంలో ఏడుగురు సుల్తానులు, గోలకొండను రాజధానిగా చేసుకొని 1512 నుండి 1687 వరకు 175 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారని వివరించారు. వీరి పాలనా కాలంలో ఆంధ్ర సాహిత్య రంగంలో తెలంగాణలో కృషి సలిపిన చరిగొండ ధర్మన్న, హరిభట్టు, పిడపర్తి బసవప్ప, అద్దంకి గంగాధర కవి, ఆసూరి మరిగంటి సింగరాచార్యుడు, కందుకూరు రుద్రకవి, పొన్నగంటి తెల్లగన్న, కాకునూరి అప్పకవి, చరిగొండ నరసింహ కవి, నెల్లుట్ల నారాయణ కవి, ఎలకూచి బాలసరస్వతి, సారంగు తమ్మయ్య, కామినేని మల్లారెడ్డి, కామినేని ఎల్లారెడ్డి, సురభి మాధవరాయ కవి, మల్లారెడ్డి దేశాయి, కృష్ణమాచార్య కవి, కేసనమల్లన, కంచర్లగోపన్న మొదలైన కవుల గురించి, వారు రచించిన గ్రంథాలను తెలిపారు. (వజ్రోత్సవ సంచిక పుట. 45)
3.8. శ్రీకృష్ణదేవరాయల రాజనీతి - పరిపాలన
ఖండవల్లి లక్ష్మీరంజనం “శ్రీకృష్ణదేవరాయలు - రాజనీతి” అనే వ్యాసంలో ఆంధ్ర వాఙ్మయంలో రాజ్యతంత్రం గురించి చెప్పగలవారు కవిబ్రహ్మ తిక్కన సోమయాజి, శ్రీకృష్ణదేవరాయలు అని అన్నారు. వీరిలో విజ్ఞానంలో తిక్కనయే ఘనుడని, అనుభవంలో రాయలు మిన్న అని అన్నారు. రాజనీతిపై రాయలు వ్యక్తపరచిన భావాలను 1. నృపుడు 2. అమాత్యులు 3. ఉద్యోగులు, భృత్యులు 4. రాష్ట్రము-ప్రజలు 5. దుర్గములు-విప్రులు 6. అడవులు-ఆటవికులు 7. శత్రువు 8. ఆదాయము-వ్యయము 9. వాణిజ్యము -విదేశవ్యాపారము 10. నృపధర్మ సమర్థనము అనే పది విధాలుగా ఈ వ్యాసంలో వివరించారు. కుందూరి ఈశ్వరదత్తు “శ్రీకృష్ణదేవరాయలు - మంత్రులు - దండనాథులు” అనే వ్యాసంలో శ్రీకృష్ణదేవరాయల మంత్రులు - దండనాధులైన సాళువ గోవిందరాజు, నాదిండ్ల అప్పమంత్రి, నాదిండ్ల గోపమంత్రి, దేచమంత్రి, రెంటూరి చిట్టమంత్రి, రాయసము కొండమరసు, త్రియంబిక దేవుడు గురించి, రాయల కాలంలో కర్ణాటకాంధ్ర సంబంధాల గురించి సవివరంగా వివరించారు. (వజ్రోత్సవ సంచిక పుట. 51, 59)
3.9. శాసన కవులు, చారిత్రక ప్రాముఖ్యత
దివాకర్ల వేంకటావధానులు రచించిన “కొందరు సంస్కృతాంధ్ర శాసన కవులు” అనే వ్యాసం రాజులు, మంత్రులు, సంపన్నులు కీర్తి కాంక్ష చేతనో, తమ పుణ్య వీరకార్యాలు ఇతరులకు ఆదర్శములై కార్యాచరణకు ప్రేరేపించే ఉద్దేశం చేతనో, మానవోద్ధరణ కార్యాశక్తి చేతనో శాసనాలను వేయించేవారని వివరించింది. అవి సాధారణంగా దేవబ్రాహ్మణులకు చేయబడిన అగ్రహారాది దానాలకు సంబంధించి, దేవాలయ తటాక నిర్మాణ పునరుద్ధరణ గురించి, రాజులు, వీరులు విజయ వీరావదాన వర్ణనలకు సంబంధించి ఉంటాయని తెలిపారు. అనేక భాషలలో ఆదిమ వాఙ్మయం ప్రాయకంగా శాసనాల రూపంగానే కనిపిస్తున్నాయని, వాటిని బట్టి ఆ భాషలలోని ఆరంభ వాఙ్మయ స్వరూపాన్ని, వాఙ్మయ పరిణామ క్రమాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. శాసనముల గురించి, వాటిని రచించిన కవుల గురించి ఈ వ్యాసంలో వివరించారు. (వజ్రోత్సవ సంచిక పుట. 79)
3.10. ఇతర సాహిత్య, గ్రంథాలయ సేవలు
నిడదవోలు వెంకటరావు తన “రాయలవారి ఆంధ్రవాఙ్మయ సేవ" అనే వ్యాసంలో సాహితీ సమరాంగణ సార్వభౌముడి స్వర్ణ యుగాన్ని గూర్చి వెల్లడించారు. ఈ వ్యాసం నిడదవోలు వారి బహుముఖీన పరిశోధన ప్రతిభా పాటవాన్ని ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఎస్. ఆర్. రంగనాథన్ ఆంగ్లంలో రచించిన వ్యాసం భారతదేశంలో గ్రంథాలయోద్యమ వికాసాన్ని గూర్చి వివరించి, వజ్రోత్సవ సంచికకు వజ్ర భూషణంగా నిలిచింది. (వజ్రోత్సవ సంచిక పుట. 67)
4. అమృతోత్సవ ప్రత్యేక సంచిక (1975)
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం తన అమృతోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించింది. ఈ సంచికలో భాషానిలయం స్వర్ణోత్సవ సందర్భంగా ఆనాటి ప్రముఖ వ్యక్తులు, భాషానిలయంతో సన్నిహిత సంబంధం గల పెద్దలైన రాజా నాయని వెంకట రంగారావు, రజతోత్సవ కాలానికి భాషానిలయం కార్యదర్శి, స్వర్ణోత్సవ సమయానికి భాషానిలయ అధ్యక్షులు అయిన బూర్గుల రామకృష్ణారావు, భాషానిలయాన్ని అనేక విధాల వృద్ధిలోకి తెచ్చిన మాడపాటి హనుమంతరావు, తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్రలో నాటి యువతరం ప్రతినిధులైన వల్లూరి బసవరాజు, డా. ఎం. చెన్నారెడ్డి వంటి వారి అభిభాషణలను, నివాళులను సంపాదకులు తిరిగి ముద్రించారు.
4.1. భాషానిలయం ప్రస్థానం: 75 ఏళ్ల చైతన్య కృషి నాటి భాషానిలయం కార్యదర్శి ఎం.ఎల్. నరసింహారావు 75 సంవత్సరాల భాషానిలయం చరిత్రను ఈ అమృతోత్సవ సంచికలో సంక్షిప్తంగా వెల్లడించారు. ఈ వ్యాసం ద్వారా 75 సంవత్సరాలుగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం చేపట్టిన చైతన్య కృషి అవగతమవుతుంది. (అమృత్సవ సంచిక పుట. 71)
4.2. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి అక్కిరాజు జనార్ధనరావు “ఆంధ్రుల చరిత్ర” అనే వ్యాసంలో ఆంధ్రుల సంస్కృతి వికాసానికి తోడ్పడిన కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజుల చరిత్ర - సంస్కృతిని వివరించారు. (అమృత్సవ సంచిక పుట. 6)
4.3. ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయోద్యమ వికాసం శ్రీకాంత్ రచించిన “ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయోద్యమం” అనే శీర్షికతో ఉన్న వ్యాసం పరిశోధనాత్మకంగా ఉంది. పందొమ్మిదో శతాబ్ది చివరి దశకాలలో, 20వ శతాబ్దపు పూర్వార్థంలో అఖిలాంధ్ర దేశంలో జరిగిన గ్రంథాలయోద్యమ వికాసాన్ని వ్యాసరచయిత ఈ సంచికలో పొందుపరిచారు. నాటి అధికార భాషా సంఘం అధ్యక్షులు వావిలాల గోపాలకృష్ణయ్య ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. (అమృత్సవ సంచిక పుట. 19)
5. శతాబ్ది ఉత్సవ ప్రత్యేక సంచిక (2002)
అత్యున్నతమైన నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయపు శతాబ్ది ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవ ప్రత్యేక సంచికను విశేష రూపంలో ప్రచురించింది. పి.వి. నరసింహారావు, నారా చంద్రబాబు నాయుడు, బండారు దత్తాత్రేయ, సి.హెచ్. విద్యాసాగరరావు, టి. దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు, కరణం రామచంద్రరావు, మండవ వేంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సి.హెచ్. విపి. మూర్తి రాజు, జస్టిస్ ఆవుల సాంబశివరావు, కాళోజీ నారాయణరావు, సి. నారాయణ రెడ్డి, జెల్లా మార్కండేయ, ఎన్. గోపి, పేర్వారం జగన్నాథం, కోదాటి నారాయణరావు, రాంభట్ల కృష్ణమూర్తి, బిరుదురాజు రామరాజు, పోతుకూచి సాంబశివరావు, పొత్తూరి వేంకటేశ్వరరావు, పిరాట్ల వేంకటేశ్వరరావు, ఆచార్య ఎం. కులశేఖర రావు, వెలగా వెంకటప్పయ్య, బి. ఎన్. శాస్త్రి, దాశరధి రంగాచార్య, జె. బాపురెడ్డి వంటి అనేకమంది ప్రముఖుల సందేశాలు భాషానిలయం విశిష్టతను తెలియజేశాయి.
5.1. తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయ వికాసం
ఎ. వి. జనార్ధన రావు రచించిన “రాష్ట్రంలో గ్రంథాలయాల క్రమ వికాసం” అనే వ్యాసం ఈ సంచికలో ఉంది. 1886లో సరస్వతీ నిలయం అనే గ్రంథాలయాన్ని మంతెన ఆదినారాయణ మూర్తి విశాఖపట్టణంలో స్థాపించడంతో ఆంధ్ర ప్రాంతంలో గ్రంథాలయాల స్థాపన ప్రారంభమైందని అన్నారు. 1889లో పులివెందుల గ్రామంలో సరస్వతీ విలాసము, 1890లో ఒంగోలులో సి.వి.ఎన్. లైబ్రరీ, రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయం, విజయవాడలోని రాంమోహన్ రాయ్ గ్రంథాలయం (1911), వేటపాలెంలోని సారస్వత నికేతనం (1922), సత్తెనపల్లిలోని శారదా నిలయం (1925) అనే గ్రంధాలయాలు నెలకొల్పడంతో ఆంధ్ర ప్రాంతమంతటా ఎన్నో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయని వివరించారు. అదేవిధంగా 1901లో హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణదేవయాంధ్ర భాషానిలయం అనే గ్రంథాలయం స్థాపనతో తెలంగాణలో గ్రంథాలయాల స్థాపన ప్రారంభమైందని పేర్కొన్నారు. 1904లో హనుమకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించబడింది. ఆ తరువాత 1905లో సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధనీ గ్రంథాలయం, 1911లో ఎర్రుపాలెంలో మహబూబియా గ్రంథాలయం, 1917లో సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన గ్రంథాలయం, 1918లో నల్లగొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం వంటి అనేక గ్రంథాలయాలు తెలంగాణ ప్రాంతంలో వరుసగా స్థాపించబడ్డాయని అన్నారు. ఈ గ్రంథాలయాలు పాఠకులకు కేవలం పుస్తకాలు, పత్రికలు అందించడమే గాక సభలు, సమావేశాలు, కవితా గోష్ఠులను నిర్వహించాయని, వివిధ సంస్థల వార్షికోత్సవాలకు కూడా ఉపయోగపడి తెలంగాణ, ఆంధ్ర ప్రజలలో జాగృతిని కలిగించి ప్రజలలో రాజకీయ అభిప్రాయాలు వ్యాపింపచేశాయని ఈ వ్యాసంలో వివరించారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 53)
5.2. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు - రాజకీయ, సామాజిక ఉద్యమం
జి. వెంకట రామారావు “నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు” అనే వ్యాసంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర కేంద్ర జనసంఘం స్థాపన గురించి పేర్కొన్నారు. 1923లో హైదరాబాద్, 1924లో నల్లగొండ, 1925లో మధిర, 1928లో సూర్యాపేట లో జరిగిన ఆంధ్ర జనసంఘం సభలు, వాటిలో జరిగిన తీర్మానాలను తెలియజేశారు. 1930లో జోగిపేట, 1931లో దేవరకొండ, 1934లో ఖమ్మం, 1935 లో సిరిసిల్ల, 1936లో షాద్ నగర్, 1937లో నిజామాబాద్, 1938 లో మల్కాపురం, 1941లో నల్లగొండ, 1942లో వరంగల్, 1943లో హైదరాబాద్, 1944లో భువనగిరి, 945లో మడికొండ, 1946లో మెదక్, ఇంకా ఇతర ప్రాంతాలలో జరిగిన13 ఆంధ్ర మహాసభలను పేర్కొన్నారు. వీటితో పాటు మహిళా సభలు, నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల నిర్వహణను గూర్చి ఈ వ్యాసంలో వివరణాత్మకంగా పేర్కొన్నారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 56)
5.3. ఆస్థాన కవులు - తెలుగు భాషాభివృద్ధికి వారి సేవలు
ఎ. పండరీనాథ్ “తెలుగు భాషకు వన్నె తెచ్చిన ఆస్థాన కవులు” అనే వ్యాసంలో రాజులు, సంస్థానాధీశులు అంతరించిన తరువాత అంటే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కళలను, సాహిత్యాన్ని పోషించే బాధ్యత ప్రజా ప్రభుత్వం మీద పడిందని వివరించారు. ఈ ఉద్దేశ్యంతోనే 1949వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలను పోషించి గౌరవించడానికి ఆస్థానకవి పదవిని ఏర్పాటు చేశారని, ఆ పదవిలో కవి పండితులను నియమించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తెలుగు భాషకు ఆస్థాన కవులుగా నియమించబడిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణమాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి గూర్చి తెలిపారు. వీరు తెలుగు భాషలో కావ్యాలు, నవలలు, నాటకాలు, కథానికలు, జీవిత చరిత్రలు మొదలైన సాహిత్య ప్రక్రియలలో అనేక గ్రంథాలు రాసి తెలుగు భాషకే వన్నె తెచ్చారని అన్నారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 63)
5.4. తెలుగు అకాడమీ పాత్ర - భాషాభివృద్ధి, ప్రచురణలు
ఎ. మంజులత “తెలుగు భాషాభివృద్ధిలో తెలుగు అకాడమీ” అనే వ్యాసంలో స్వాతంత్ర్యానంతరం ప్రాంతీయ భాషల అభివృద్ధికి రాష్ట్ర సంస్థలను స్థాపించాలనే సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం వహించిందని వివరించారు. ఇందుకు గాను 1966లో కేంద్ర ప్రభుత్వానికి కొఠారీ కమీషన్ ఒక నివేదిక సమర్పించిందని, దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జె.పి.ఎల్. గ్విన్ అధ్యక్షతన నిపుణుల సంఘాన్ని నియమించిందని తెలిపారు. వీరి సిఫారసుల మేరకు ప్రభుత్వం 1968 ఆగష్టు 6న రాష్ట్ర భాషా సంస్థగా తెలుగు అకాడమీని స్థాపించిందని2 ఆమె అన్నారు. తెలుగు భాషా అభ్యున్నతి కొరకు తెలుగు సాహిత్య పదకోశం, వ్యాకరణ పదకోశం, ఛందః పదకోశం అనే మూడు నిఘంటువులను, పాఠ్య గ్రంథాలను, రిఫరెన్సు గ్రంథాలను, జనరంజక గ్రంథాలను, మోనోగ్రాఫ్ లను ప్రచురించిందని అన్నారు. పరిపాలన రంగంలో తెలుగు భాష అమలు కోసం, తెలుగు రాని ఉద్యోగుల కోసం, ద్వితీయ భాషా వ్యవహర్తల కోసం అకాడమీ పరిచయ కోర్సులను, ఉన్నత కోర్సులను నిర్వహిస్తుందని, ఇప్పటి వరకు 38 పరిచయ కోర్సులను, 30 ఉన్నత కోర్సులను, 4 అనుక్రమ కోర్సులను నిర్వహించిందని అన్నారు. ప్రభుత్వోద్యోగులకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను పరిపాలన న్యాయపదకోశం అనే గ్రంథాన్ని ప్రచురించి, అన్ని రంగాలలో తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీ చేసిన సేవను ఈ వ్యాసంలో సవివరంగా పేర్కొన్నారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 76)
5.5. జాతీయ జాగృతికి గ్రంథాలయాల ప్రాధాన్యత
సి. హెచ్. ఆచార్య “జాతీయ జాగృతికి ప్రాతిపదికలు” అనే వ్యాసంలో నిజాం పాలనా కాలంలో పత్రికలు చదవడం అటుంచి అసలు గ్రంథాలయాలంటేనే ఎవరికి తెలియదని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు సాంస్కృతిక, రాజకీయ వికాసానికి అసలే నోచుకోలేదని అన్నారు. ఆనాడు తెలుగు పత్రికలు దొరకడమే అతి కష్టమని, పుస్తకాలు అసలే దొరికేవి కావని, దొరికినా వాటిని చవడం నేరమని, వార్తలను, రాజకీయ పరిణామాలను చర్చించుకోవడం మరీ నేరమని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితులలో గ్రంథాలయాల స్థాపనకు కృషి జరగడమంటే అత్యంత సాహసోపేతమైన చర్యగా భావించవచ్చని అన్నారు. గ్రంథాలయాలు ప్రగతిపథగాములకు నిలయాలు, జాతీయ భావాలను ఉద్దీపింపచేసే కేంద్రాలని విశ్లేషించారు. విజ్ఞానపు కాంతిపుంజాలను వెదజల్లి వ్యక్తిలోని విజ్ఞానాన్ని భావనాశక్తిని పదును ఎక్కింప చేస్తాయని, స్వాతంత్ర్య సమరయోధులను తీర్చిదిద్దటానికి, సుశిక్షితులైన యోధులను తయారుచేసే శిక్షణా కేంద్రాలుగా ఉపయోగపడిన గ్రంథాలయాల విశిష్టతను ఈ వ్యాసంలో వివరించారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 80)
5.6. నిజాం రాజ్యంలోని తెలుగు పత్రికలు
కంచి వాసుదేవరావు “నిజాం రాజ్యములో తెలుగు వెలుగులు విరజిమ్మిన కొన్ని పత్రికలు” అనే వ్యాసంలో 1920 నుంచి 2002 వరకు ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచురింపబడి చరిత్ర సృష్టించిన ప్రముఖ పత్రికల గురించి వివరణాత్మకంగా తెలిపారు. ప్రముఖ పత్రికలైన తెలుగు పత్రిక, నీలగిరి, గోలకొండ, సుజాత, దివ్యవాణి, విభూతి, తెలుగు తల్లి, శోభ, భాగ్యనగర్, మీజాన్ పత్రిక, కాకతీయ వారపత్రిక స్రవంతి, ఆంధ్ర జనతా, ఆంధ్రభూమి, ఈనాడు, మూసీ, రసమయి పత్రికలు తెలుగు భాష, సాహిత్యాలకు చేసిన కృషిని ఈ వ్యాసంలో వివరించారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 86)
5.7. హైదరాబాద్ విమోచన, దాని నేపథ్యం
దేవులపల్లి ప్రభాకరరావు “త్యాగాలు, సమరాల ఫలంగా తరతరాల రాజరికం తలవంచిన వేళ” అనే వ్యాసంలో హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ రాచరిక వ్యవస్థ శృంఖలాల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి కారణమైన ఆపరేషన్ పోలో గురించి, దానికి దారి తీసిన నేపథ్యం గురించి ఎంతో గొప్పగా వివరించారు. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 92)
5.8. ఇతర పరిశోధనలు - భాషానిలయం ప్రగతి పథం
టి. ఉడయవర్లు రచించిన “ఆంధ్రుల కథా కమామీషు” అనే వ్యాసం ఈ సంచికలో ప్రచురించబడింది. క్రీస్తుపూర్వం 600 ప్రాంతానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో మొదటగా ఆంధ్రుల ప్రస్తావన కలదని ఆయన ఈ వ్యాసంలో పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో ఆంధ్ర శబ్దం దేశ వాచకంగా వాడబడిందని, భాగవతంలో మాత్రం బలికుమారులు ఆరుగురిలో అంధుడనేవాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించినట్లు ఉందని అన్నారు. ఆంధ్రుల చరిత్ర మాత్రం శాతవాహనుల నుండి లభిస్తుందని, అనంతర కాలంలో అనేక శాసనాలలోను ఆంధ్ర శబ్దం కనిపిస్తుందని అన్నారు. ఆంధ్ర దేశాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, వాకాటకులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, పద్మ నాయకులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తాన్లు, నిజాం ప్రభువులు తదితరులు పాలించిన చరిత్రను ఈ వ్యాసంలో సుదీర్ఘంగా వివరించారు. ఆర్. మాధవరావు “అభివృద్ధిపథంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం” అనే వ్యాసంలో నూరు సంవత్సరాల క్రితం నిజాం నిరంకుశ పరిపాలన నిరాఘాటంగా సాగిపోతున్న రోజులలో తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి ఏ మాత్రం గౌరవం, ఆదరణ లేని రోజుల్లో 1901వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడిందని పేర్కొన్నారు. స్థాపన నాటి నుంచి తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి వికాసానికి, జాతీయ పునరుజ్జీవనానికి ఒక శతాబ్దం పాటు నిరంతరాయంగా కృషి చేస్తూ, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అభివృద్ధి పథంలో పురోగమిస్తుందని అన్నారు. ఎం.ఎల్. నరసింహారావు రచించిన "శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నూరేళ్ల చరిత్ర" అనే వ్యాసం శతాబ్ది ఉత్సవ సంచికలో పరమోత్తేజకరంగా ఉంది. (శతాబ్ది ఉత్సవ సంచిక పుట 49)
ఉపసంహారం
- శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, నిజాం కాలం నుండి నేటి వరకు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక మహాసంస్థ. ఈ సంస్థ రజతోత్సవం, సువర్ణోత్సవం, వజ్రోత్సవం, అమృతోత్సవం, నవ దశాబ్ది ఉత్సవం, శతాబ్ది ఉత్సవాలు వంటి అనేక వార్షికోత్సవాలను విజయవంతంగా జరుపుకుంది. అంతేకాకుండా, శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవం, కాళోజీ నారాయణరావు షష్టిపూర్తి ఉత్సవం, మాడపాటి హనుమంతరావు శత జయంతి ఉత్సవం, బూర్గుల రామకృష్ణారావు శతజయంతి ఉత్సవం వంటి సాహితీ ప్రముఖుల జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించింది. ఈ ఆయా సందర్భాలలో, భాషానిలయం విలువైన సాహిత్యోత్సవ ప్రత్యేక సంచికలను ప్రచురించింది.
- ఈ వ్యాసంలో, రజతోత్సవ ప్రత్యేక సంచిక (1927), సువర్ణోత్సవ ప్రత్యేక సంచిక (1955), వజ్రోత్సవ ప్రత్యేక సంచిక (1963), అమృతోత్సవ ప్రత్యేక సంచిక (1975), శతాబ్ది ఉత్సవ ప్రత్యేక సంచిక (2002) లను లోతుగా పరిశీలించడం జరిగింది.
- ఈ సంచికలలోని నాటి ప్రముఖ రచయితలు రాసిన వ్యాసాలలో గల సాహిత్య, చారిత్రక, సామాజిక, వైజ్ఞానిక విశేషాంశాలను వివరంగా తెలియజేయబడింది. ఈ విశ్లేషణల ద్వారా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కేవలం ఒక గ్రంథాలయంగానే కాకుండా, తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి, సామాజిక-సాంస్కృతిక చైతన్యానికి, జాతీయ పునరుజ్జీవనానికి ఒక శతాబ్దం పాటు నిరంతరాయంగా కృషి చేసిన శక్తివంతమైన కేంద్రంగా నిలిచిందని స్పష్టంగా అవగతమవుతుంది. నాటి నిరంకుశ పరిస్థితులలో కూడా గ్రంథాలయాలు ప్రగతిపథగాములకు నిలయాలుగా, జాతీయ భావాలను ఉద్దీపింపచేసే కేంద్రాలుగా, స్వాతంత్ర్య సమరయోధులను తీర్చిదిద్దే శిక్షణా కేంద్రాలుగా ఉపయోగపడ్డాయని గుర్తించబడింది.
- ఈ పరిశీలన ద్వారా వెలుగులోకి వచ్చిన సాహిత్య విశేషాలు, నేటి తరం సాహితీకారుల రచనా నైపుణ్యానికి, పరిశోధనలకు విలువైన తోడ్పాటును అందిస్తాయి. అంతేకాకుండా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అందించిన సాహితీ సంపదను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, ఒక్కొక్క ప్రత్యేకసంచికను ఎన్నుకొని పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఈ వ్యాసం అందుకు ఆధారభూమికగా నిలుస్తుంది.
సూచికలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రంథాలయశాఖ - చరిత్ర. "ప్రభుత్వ గ్రంథాలయాల చరిత్ర". 2024 జూన్ 20న https://libraries.ap.gov.in/history
- తెలుగు అకాడమీ (Telugu Academy) - గురించి. "తెలుగు అకాడమీ చరిత్ర మరియు లక్ష్యాలు". 2024 జూన్ 20న https://teluguacademy.telangana.gov.in/history-aboutus/
ఉపయుక్తగ్రంథసూచి
- అంజయ్య, పుట్టపాక. (1996). నూరేండ్ల ఆంధ్ర భాషానిలయం రాజ రాజ నరేంద్ర భాషానిలయం. హనుమకొండ. వరంగల్లు: రాజ రాజనరేంద్ర భాషానిలయం ప్రచురణ.
- ఉడయవర్లు, టి. (సం.) (2009). శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవ సంచిక. హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రచురణ.
- జితేంద్రబాబు, కె. (2005). నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, మొదటి సంపుటి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ప్రచురణ.
- జితేంద్రబాబు, కె. (2005). నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, రెండవ సంపుటి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ప్రచురణ.
- నరసింహశాస్త్రి, మైలవరపు. (2022). శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ప్రవర్ధమాన చరిత్ర, హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ప్రచురణ.
- నరసింహారావు, ఎం. ఎల్. (సం.) (1975). శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అమృతోత్సవ సంచిక. హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రచురణ.
- నరసింహారావు, ఎం. ఎల్. (సం.) (2002). శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం శతాబ్ది ఉత్సవ సంచిక. హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రచురణ.
- నారాయణరావు, కోదాటి. (సం.) (1963). శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వజ్రోత్సవ సంచిక. హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ప్రచురణ.
- ప్రతాపరెడ్డి, సురవరం. (సం.)(1927). శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం రజతోత్సవ సంచిక, హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రచురణ.
- హనుమంతరావు. మాడపాటి. (సం.) (1955). శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం సువర్ణోత్సవ సంచిక. హైదరాబాద్: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రచురణ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

