headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

9. చంద్రబోస్ గేయాలు :మానవసంబంధాలు

కొప్పిశెట్టి కుశరాజు

పరిశోధకలు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9912806863, Email: rajukoppisetti22@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 17.08.2025        ఎంపిక (D.O.A): 31.08.2025        ప్రచురణ (D.O.P): 01.09.2025


వ్యాససంగ్రహం:

మనిషికి కోపం, ప్రేమ, కరుణ వంటి ప్రతి భావోద్వేగంలో పాట పుడుతుంది. మనిషి పుట్టుక నుండి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి, సన్నివేశానికి పాటే చేదోడు వాదోడు. పాట ఉల్లాసాన్ని, అనిర్వచనీయ అనుభూతుల్ని సొంతం చేస్తుంది. సినిమాలో పాట ఒక భాగమై నిరక్షరాస్యులకు, సామాన్యజనానికి అందుబాటులో ఉండి కాలం, శ్రమ రెండు తెలియకుండా మరిపించి, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాంటి సుమధురమైన గీతాలను సృష్టించి జనబాహుళ్యంలో కీర్తిప్రతిష్ఠలు పొందిన ప్రముఖ సినీగీతరచయిత చంద్రబోస్. చంద్రబోస్ తన కలం ద్వారా సినీ సాహిత్య ప్రపంచానికి ఎన్నో ప్రణయగీతాలు, భక్తిగీతాలు, స్ఫూర్తిగీతాలు, ఆచారసంస్కృతికి సంబంధించిన గేయాలు, మానవసంబంధాలు ప్రతిబింబించే గేయాలు అందించి సినీగేయసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఈ పరిశోధన వ్యాసం చంద్రబోస్ రచించిన మానవసంబంధగేయాల గురించి... ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతలు, భార్యాభర్తల అనుబంధం మొదలుగు అనుభూతుల గురించి చర్చిస్తుంది. చంద్రబోస్ పాటలపై మునిపల్లె కృష్ణారెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 'చంద్రబోస్ సినీ సాహిత్యం పరిశీలన' అనే అంశంపై ఎం.ఫి ల్. వెలువడింది. సినీగీతాలు, వాటిపై వచ్చిన విమర్శవ్యాసాలు, అంతర్జాలవనరులు ఈ వ్యాసరచనకు ప్రధాన ఆకరాలు. నిర్మాణాత్మకమైన పరిశోధనపద్ధతి ద్వారా ఈ పరిశోధనపత్రం రూపుదిద్దుకుంది.

Keywords: చంద్రబోస్, సినిమాపాట, మానవసంబంధాలు, స్నేహం, వాత్సల్యం, సాహిత్యం.

1. ప్రవేశిక

సాహిత్యంలో పాట ఒక ప్రక్రియ. పాటకు కవిత్వం లయాత్మక గుణం రెండూ అవసరం. మాటలను అందంగా, అర్థవంతంగా, భావయుక్తంగా, సన్నివేశబద్ధంగా అమర్చి పాడటాన్ని పాట అనవచ్చు. జీవన గమనంలో ప్రతి సందర్భానికి పాట ఓదార్పు, స్ఫూర్తి, చైతన్యపు చెలిమి. జీవితంలో, జీవన గమనంలో ఇంతటి అనుబంధం ఉంది కనుకనే సాహిత్యంలో ఇతర ప్రక్రియల కన్నా పాటకు ఆదరణ అధికం. సర్వకాలాల్లో సర్వజనులను అలరిస్తూ సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకుంది పాట. సినిమాల్లో కథ నేపథ్యాన్ని సంక్షిప్తంగా వివరించడానికి, సన్నివేశాలను తెలపడానికి, పాత్రల అనుభూతులను, అంతరంగిక భావాలను పాటలో అభివ్యక్తీకరించవచ్చు. ఉదాహరణకు ఒకే పాటలో పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, పెద్దవారవ్వడం ఒకే పాటలో కష్టపడటం, విజయం సాధించడం వంటి సుదీర్ఘమైన కథ నేపథ్యాలను నాలుగైదు నిమిషాల్లో చూపించవచ్చు. కథను నడిపే ప్రయోజనం కోసమే పాట సినిమాలో చొప్పించినప్పటికీ, పాటల వల్ల కథకు అందం వస్తుంది. పదేపదే సంభాషణలతో ప్రేక్షకులు విసిగిపోకుండా, సంగీతం సాహిత్యం కూడిన పాట వారిని అలరిస్తుంది. కనుక పాట సినిమాలో అనివార్యం. అలాగే కొన్ని పాటల వల్ల విజయం సాధించిన సినిమాలు కూడ కలవు. దీనిని బట్టి చూస్తే, పాట సినిమాలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో మనం గమనించవచ్చు. కేవలం పాటలు ప్రేక్షకులకు, శ్రోతలకు ఆనందాన్ని కలిగించడమే కాదు వారికి చక్కటి ఉపదేశాన్ని అందించి సన్మార్గంలో నడిపించే మార్గం చూపిస్తాయి. ఇలా సాహిత్య ప్రయోజనాలైన ఆనందాన్ని, ఉపదేశాన్ని పాటలు మనకు అందిస్తాయి. సాహిత్యం సమాజంతో పాటు కలిసి ప్రవహిస్తుంది. సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి ప్రవర్తనలను, వారి మధ్య అనుబంధాలను సాహిత్యం వ్యక్తపరుస్తుంది. మనిషి ఒంటరిగా కాకుండా తనదైన సమాజాన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటూ సంఘజీవి అనిపించుకుంటాడు. అలానే రక్తసంబంధాలు, బంధుత్వాలు, వైవాహిక బంధాలు, స్నేహితులు అంటూ కొన్ని ప్రత్యేకమైన మానవ సంబంధాలను ఏర్పరచుకొని మమతలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు వంటి వాటిని బంధాలకు పునాదులుగా చేసుకుని జీవనం సాగిస్తారు. అటువంటి మానవ సంబంధాల విశిష్టతను, ఆత్మీయతలను, వారి మధ్య అనుబంధాలను అక్షర సుగంధాలుగా చంద్రబోస్ గారు తన పాటలో పరిమళింపజేశారు.

2. రచయిత పరిచయం

సినీ వినీలాకాశంలో విరబూసిన చంద్రుడు చంద్రబోస్. తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న గొప్ప రచయిత కునుకుంట్ల సుభాష్ చంద్రబోస్. ఈయన తెలంగాణలోని జయశంకర్ జిల్లా, చల్లగరిగ గ్రామంలో 10.05.1972 లో తల్లి మదనమ్మ, తండ్రి నరసయ్యలకు జన్మించారు. ఈయన చదివింది ఇంజనీరింగ్ అయినా, సాహిత్యంపై మక్కువతో బాలసాహిత్యం, పత్రికలు, వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి పదసంపదను వృద్ధి చేసుకుని సినీ రంగంలో పాటల రచయితగా స్థిరపడ్డారు. 1995లో తాజ్ మహల్ సినిమాలో ‘మంచు కొండల్లో చంద్రమా’ అనే పాటతో చంద్రబోస్ గారు తన సినీ గేయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. అప్పటినుండి నేటి వరకు సుమారుగా 850 పైగా చిత్రాల్లో 3000కు పైగా పాటలు రచించి ‘సినీగేయ విశారద’, ‘సాహిత్య చిచ్చరపిడుగు’ వంటి బిరుదులను పొందారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ అవార్డులను, పురస్కారాలను అందుకున్నారు. RRR (2022) చిత్రంలో నాటు నాటు పాటను అత్యంత ఆకర్షణీయంగా చెవులకు లయబద్ధంగా మలచడం ద్వారా ఆస్కార్ అవార్డు గెలుపొందారు చంద్రబోస్ గారు. తెలుగు సినీగేయ రచయితలలో ఈ అవార్డు పొందిన ఏకైక తెలుగు సినీగేయకవి, ఒకే ఒక్కడు చంద్రబోస్ కావడం చాలా ప్రత్యేకమైన విషయం. తన పాటల్లో లలితమైన పదాలను ఉపయోగిస్తూ పామరులకు, సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యే విధంగా భావయుక్తంగా రాయడంలో చంద్రబోస్ గారు దిట్ట. చంద్రబోస్ గారి కలం నుండి మౌనంగానే ఎదగమని, చీకటితో వెలుగే చెప్పని నేనున్నానని, తెలుగు భాష తియ్యతనం, పెదవే పలికిన మాటల్లోనే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, చీరలోని గొప్పతనం వంటి చిరస్మరణీయమైన పాటలు జాలువారి ప్రేక్షకుల హృదయాలను అలరించాయి.

3. చంద్రబోస్ మానవ సంబంధ గేయాలు

ఈ విశాల ప్రపంచంలో కోటానుకోట్ల జీవరాసులు ఉన్నాయి. వాటిలో మానవ జన్మ విశిష్టమైనది. ఇతర జీవులకు లేని బుద్ధి కుశలత, అనుభూతులు, స్పందనలు మనిషికీ ఉంటాయి. ఈ ‘భూమ్మీద మానవుడిగా పుట్టడమే గొప్ప అదృష్టం అంటాడు మాక్సిం గోర్కి. అలా పుట్టిన ఏ మానవుడు కూడ ఇతరులతో సంబంధం లేకుండా తనకు తానుగా జీవించలేడు’ (రుక్మిణీ 228). అందుకే అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని అన్నారు. మనిషిని సమాజాన్ని వేరు చేసి చూడలేము. మనిషి సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన బంధాలను, అనుబంధాలను ఏర్పరచుకుంటాడు. పుట్టినప్పటి నుండి గిట్టే వరకు ఎన్నో బంధాలను తన జీవితంలో భాగం చేసుకుంటాడు. కుటుంబంలోని రక్తసంబంధికులతో ఇతర బంధువులతోనే కాక సమాజంలో భిన్న వ్యక్తులతో కుల, మత, వర్గ, ప్రాంత ప్రమేయం లేకుండా మానవ సంబంధాలను ఏర్పరచుకొని తన జీవనయానం సాగిస్తాడు. తరతరాల నుండి నేటి వరకు కూడ మనుషులు ఒకరికొకరు సుఖదుఃఖాల్లో, కష్టసుఖాల్లో, కలిమిలేముల్లో, ఓటమి విజయాల్లో తోడుగా నిలుస్తూ బంధాలను కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి బాంధవ్యాల గురించి తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితులు, గురుశిష్యులు మధ్య అనుబంధాలను గురించి చంద్రబోస్ గారు తన గేయాల్లో హృద్యంగా రచించారు. వాటిలో కొన్నింటిని కింది గేయాల్లో పరిశీలిద్దాం.

3.1 కుటుంబ వ్యవస్థ

భారతీయ సమాజంలో కుటుంబం ఒక సాంప్రదాయక వ్యవస్థ. వ్యక్తులను బాధ్యతాపరులుగా నడిపించడంలో కుటుంబ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. కుటుంబంలోని అమ్మానాన్న, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, భార్యభర్తలు, పిల్లలు అనే బంధాలు అపూర్వమైనవి, వెలకట్టలేనివి. కుటుంబంలో వ్యక్తుల మధ్య ఆత్మీయతలు, ఒకరి పట్ల మరొకరికి బాధ్యతలు, ఐక్యభావనలు, ప్రేమనురాగాలు చంద్రబోస్ గారి పాటలో వెల్లివిరుస్తాయి. కింది గేయంలో తన అక్షర సేద్యం ద్వారా అనుబంధాల పంటను పండించారు.

గుళ్లో దేవుడు ఎదురై
ఒక వరమే కోరినుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే
అవకాశమే అడిగెనుగా
అలుపే రాని కేరింతలు
తను మురిసి
మరుపే లేని ఈ మమతలు
రుచి తెలిసి
మన రాగాలలో అనురాగాలలో
తను కూడా మనలాగే మురిసి (కునుకుంట్ల, సినీ గీతాలు 2007:268)

పై గేయాన్ని పరిశీలిస్తే... మనం సాధారణంగా దేవుని వరాలు అడగడం సహజం. కానీ ఈ అందమైన కుటుంబాన్ని చూసి దేవుడే ఎదురుగా వచ్చి ఈ కుటుంబంలో భాగమమై జీవించే వరం ఇవ్వమని అడిగాడని బోస్ గారు కుటుంబ ఔన్నత్యాన్ని చమత్కారంగా తన పాటలో రచించారు. కుటుంబంలోని చిన్న పిల్లల లేత నవ్వులు, వారి కేరింతలు ఇల్లంతా సందడి చేస్తాయని, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు వెల్లివిరుస్తాయని, ఆ మమతల రుచి అంతరంగంలో ఆనందానికి కారణం అవుతుందని రచయిత చక్కటి భావుకతతో రచించారు.

ఇందరుండగా ఇరుకైన ఇంటిలో
కష్టాలకు ఇంకా చోటు లేక చేరుకోవుగా
కాంతులు ఉండగా ప్రతి వారి కంటిలో
ఆ రంగు దాటి కంటినీరు పొంగిరాదుగా
సెలవులు లేని సంతోషం
అలకలు ఉన్న అరనిముషం (కునుకుంట్ల, సినీ గీతాలు 2007:269)

పై చరణాలను గమనిస్తే... అందరూ కలిసి ఉండే ఇల్లు అందాల హరివిల్లు. తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అని ఇన్ని బంధాలు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటిలోని కష్టాలు వచ్చి నివాసం ఉండడానికి అవకాశం లేదుగా అని చెప్పడంలో కలిసి ఉంటే కలదు సుఖం అనే వసుధైక కుటుంబ తత్వాన్ని బోస్ గారు ఈ పాటలో ప్రబోధించారు. కుటుంబ సభ్యుల మధ్య విరామమే లేని సంతోషాలు ఉండాలని, ఎప్పుడైనా చిన్న చిన్న కోపతాపాలు ఉంటే అవి కొద్దిపాటి సమయంలోనే సమసిపోతాయని తెలియజేశారు. ఇలా ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ, ఒకరి పట్ల మరొకరు బాధ్యతగా ఉంటూ, అందరూ ఒకటై ముందుకు సాగే ఏ కుటుంబంలోనూ కష్టాలకు, కన్నీటికి అవకాశం లేదంటూ, ఆ కుటుంబాలు రంగుల హరివిల్లై నవ్వుల పొదిరిల్లై వెలుగుతుందని రచయిత అభివర్ణించారు.

అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి
ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిల్లి
అన్నగోపురం వదినమ్మ గుమ్మమై
తమ్ముడేమో కోట గోడ లాంటి కావలి (కునుకుంట్ల, సినీ గీతాలు 2007:269)

ఇంటి ముందు వాకిలి ఇంటికి ఏ విధంగా నిండుతనాన్ని తెస్తుందో అలా అమ్మ ఇంటికి వెలుగు రేఖ అని తెలియజేస్తూ, కుటుంబంలో యజమానిగా భావించే నాన్న లోగిలి అనడంలో, కుటుంబ సభ్యులు నివసించడానికి ఇల్లు (లోగిలి) ఎలా అవసరమో అలా ఇంటిని ముందుకు నడిపించే వ్యక్తి నాన్న కదా! అందుకే ఇంటిని నాన్నతో పోల్చి నాన్న ఔన్నత్యాన్ని చంద్రబోస్ గారు తెలియజేశారు. అలాగే మరొక చరణంలో ఇంటికి ప్రవేశ ద్వారంగా నిలిచే గోపురాన్ని అన్నగా పోల్చి తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని అన్నకు కల్పించారు. హిందూ సంస్కృతిలో గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే గడపను పసుపు కుంకుమలతో ముగ్గులతో అలంకరిస్తారు. అలాంటి లక్ష్మీదేవిని ఇంట్లో వదినమ్మగా, గృహలక్ష్మి స్వరూపంగా అభివర్ణించారు. ఇకపోతే తమ్ముడు ఆ ఇంటికి రక్షకుడై ఉన్నాడని ఉత్తమ కుటుంబం ఎలా ఉండాలో తెలుపుతూ ఇంట్లో వ్యక్తులను అంతః స్వరూపులుగా, ఇంటిని బాహ్య స్వరూపంగా చక్కటి ఉపమానాలతో పోల్చడం జరిగింది. అలా పోల్చడంలో ఆ రెండు అంశాల మధ్య ఎలాంటి అనౌచిత్యానికి అవకాశం లేకుండా చంద్రబోస్ గారు చక్కటి ఔచిత్యాన్ని ఈ పాటలో పోషించారు. ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీలను ఇష్టపడుతున్న కొందరు మనుషులకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని, అవసరాన్ని, ప్రాముఖ్యతను ఈ పాట ద్వారా తెలియజేస్తూ కుటుంబ విలువలను, వారి మధ్య ఆప్యాయత, అనురాగాలను చక్కగా ఈ పాటలో విశదీకరించారు. ఈ విధంగా బోస్ గారి పాటల్లో అక్షర తెరలను తెరిస్తే ఆ భావాలకు తనువు తరించిపోతుంది అనడంలో సందేహం లేదు.

3.2 భార్యాభర్తల అనుబంధం

ఆత్మీయత, అనురాగాలు అల్లుకున్న మధుర సుగంధాలు భార్యాభర్తలు. ఆలుమగలు అనుబంధం కుటుంబ పటిష్టతకు ముఖ్యం. కుటుంబ వ్యవస్థకు వారు ప్రధాన భూమికలు. ఆలుమగల మధ్య హృదయగతమైన ప్రేమ దాంపత్యానికి మూలాధారం. సంసారం అనే బండికి భార్యభర్తలు రెండు చక్రాల్లాంటివాళ్లు. ఆ రెండు చక్రాలు సమానంగా ముందుకు నడిచినప్పుడే సంసారం అనే బండి సాఫీగా సాగుతుంది. ఇరువురు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, పరస్పర అవగాహనతో అన్యోన్యంగా జీవించినప్పుడు ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు అవుతుంది. భార్యాభర్తల మనసు మాట ఒకటైతే దానికి ప్రేమ తోడైతే ఆ బంధం మధురంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న బాంధవ్య మాధుర్యాన్ని బోస్ గారు కింది గేయంలో చక్కగా వర్ణించారు.

సమయానికి తగు సేవలు చేయని... నీ శ్రీవారిని
ఇన్నాళ్లుగా శ్రమించిన ఇల్లాలిని
ఇక సేవించని ఈ శ్రీవారినీ... (కునుకుంట్ల, సినీ గీతాలు 2003:131)

ఇంటికి దీపం ఇల్లాలు. తన భర్త, పిల్లల యోగక్షేమాలే తన పరమావధిగా జీవనం సాగిస్తుంది. అందుకోసం సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని చక్కదిద్ది, పిల్లలకు భర్తకు కావలసిన సపర్యలు చేసి రోజంతా ఇంటి పనుల్లో నిమగ్నమవుతుంది. పతియే ప్రత్యక్ష దైవము అనే భావనతో ఉంటూ తన ఆహార్యాన్ని, ఆరోగ్యాన్ని మరిచి వారి సేవకే పరితపిస్తుంది. మగవాడి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ అతని విజయ సాధనలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తన జీవితం నాలుగు గోడల మధ్య బంధీ అయ్యి, అమావాస్య చీకటిగా మారుతుందన్న విషయం తెలిసి కూడ నిస్వార్థమైన సేవతో భర్త జీవితాన్ని పున్నమి వెన్నెలగా మారుస్తున్న ఎందరో భార్యమణులు ఉన్నారు. అలాంటి వారి సేవలను, శ్రమను, వారు చూపిన ప్రేమను మగవాడు గుర్తించాలని, వారు అందించిన ప్రేమానురాగాలకు తగిన సేవలను చెయ్యాలని భర్త బాధ్యతను బోస్ గారు తెలియజేస్తూ భార్యాభర్తల అనురాగ కాపురానికి గోపురం నిలిపారు.

నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటలతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగల మించి బాహు బంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్య సేవ... (కునుకుంట్ల, సినీ గీతాలు 2003:132)

భర్తకు భార్య దేవుడిచ్చిన చుట్టం వరం. దానిని అపురూపంగా చూసుకోవడంలో భర్త గొప్పదనం దాగి ఉంది. "కార్యేషు దాసీ, కరణేషు మంత్రి రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ భోజ్యేషు మాతా, శయనేషు రంభా" (చుక్కల 15). పై శ్లోకంలో చెప్పినట్టు ఇన్ని విధాలుగా సేవలను అందిస్తూ తన శ్రీవారి సేవలో శ్రీమతి తరిస్తుంది. అలాగే భర్త కూడ తన ధర్మపత్ని పట్ల క్షమ గుణం ఉండాలని, సుఖదుఃఖాలు, మంచిచెడుల్లో భార్యకు మిత్రుని వలె ఉండాలనే అర్థాన్ని, భావాన్ని, భార్య పట్ల భర్త ఉండాల్సిన విధానాన్ని పై చరణాల ద్వారా బోస్ గారు సందేశాన్ని ఇచ్చారు. గురజాడ గారు ‘కాసులు’ గేయంలో ‘మగడు వేల్పు అనేది పాత మాట ప్రాణమిత్రుడు నీకు’ (గురజాడ 9) అన్నట్లు భర్త భార్యను ప్రాణ స్నేహితురాలుగా భావించి, కాస్తంత ప్రేమ, ఆదరణ చూపిస్తే అతని హృదయంలో ఒదిగిపోతుంది. అంతేగాని ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ కట్టడాలు, పెద్ద పెద్ద భవంతులు, ఆస్తులు, అంతస్తులను కోరదు. అంతరంగంలోని కాస్తంత చోటు కోసం పరితపిస్తుంది. ఆ చోటు దక్కిన రోజు మురిసిపోతుంది అని భార్య అంతః స్వరూపాన్ని ఈ పాటలో రచయిత రంగరించారు.

పై చరణాల్లో నాకు నీవు, నీకు నేను అనడం ప్రణయ బంధానికి చిహ్నం. అది తీపి మాటగా రచయిత వర్ణించడం విశేషం. ఆలుమగలు ఇద్దరూ మల్లెతీగకు పందిరి ఆధారం, పందిరికి మల్లెతీగ అందం అన్నట్లుగా ఒకరికి ఒకరు తోడై చిరకాలం కలిసి ఉండే భరోసా ఇచ్చుకుంటూ చెవిలో గుసగుసల ప్రణయ సామ్రాజ్యానికి నాంది పలుకుతూ, వలపు పాటలతో, చిలిపి సరసాలతో సంసారాన్ని, జీవితాన్ని పండించుకోవాలని కవి భావన. శ్రీమతికి చేసే సేవను సుప్రభాత సేవతో పోల్చడం అనేది భార్యను దేవతగా అభివర్ణించడం అనే అంతరార్థం బోస్ గారి రచనలో ధ్వనిస్తుంది. బంగారు నగలను మించి విలువైనవి దాంపత్య జీవితంలో బాహుబంధాలు అని... అలాగే శరీరంలో తాపాన్ని చల్లార్చే చలువ చందనాలు కంటే చల్లని తన కంటి చూపు భార్యకు శ్రీరామరక్షగా ఉంటుందని... అంటూనే తన ఆహార్యాన్ని, అలంకరణ మరిచి రోజంతా భర్త సేవలో మునిగిన అర్ధాంగికి అలంకరణ సేవ చేస్తాను అనడం భార్య పట్ల భర్త బాధ్యతను, అనురాగాన్ని రచయిత తెలియజేశారు. పెళ్లి అనే ఏడు అడుగుల అనుబంధంతో, కట్టిన తాళికి విలువనిచ్చి, తన పుట్టింటి బంధాలను త్యాగం చేసి, భర్తే తన సర్వస్వంగా భావించి అతని వెంట నడిచి వచ్చి మెట్టింటిలో కొత్త జన్మనెత్తిన భార్యకు అమ్మలోని బుజ్జిగింపు, నాన్నలోని ఊరడింపు కలిపి తానే తల్లిదండ్రులై, తన భార్యను చంటిపాపగా లాలించి, నైవేద్య సేవ చేయడం ద్వారా పవిత్ర దాంపత్య ప్రేమను బోస్ గారు అద్భుతంగా వర్ణించి కన్నుల ముందుంచారు. దృశ్య భావోద్వేగానికి అక్షర వారధులు నిర్మించారు.

కలత లేని లోకంలో దిష్టి పడని దీవిలో
చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలో
ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ అనుబంధమే బంధువులై మమతలే ముత్తైదువులై
ఆనంద భాష్పాలే అనుకోని అతిథులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులొ కనురెప్పల వింజామర విసిరేటి గాలితొ
చూలాలికు జరిగేను జోలాలిసేవ.... (కునుకుంట్ల, సినీ గీతాలు 2003:133)

పై చరణాలను గమనిస్తే పర్ణశాలలో సీతమ్మకు జరిగిన చేదు అనుభవం అందరికీ పరిచయం. అందుకే రచయిత కలత లేని లోకం, చెడు జరగని పర్ణశాలగా వర్ణించారు. అలాంటి ప్రశాంత వాతావరణంలో ప్రణయ కాంతకు ఏకాంత సేవ చేయడం ద్వారా ఆలుమగల అనుబంధాన్ని తెలియజేశారు. శ్రీమతికి సీమంతపు వేడుక చేసేటప్పుడు ముత్తైదువులు, బంధువులు సందడి ఉంటుంది కానీ వారు ఎవరూ లేకపోయినా భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం, మమతలు, ఆనందాలే ముత్తైదువులుగా, అతిథులుగా సరిపోల్చి ఆలుమగల అనుబంధానికి, ప్రేమానురాగాలకు అక్షర నీరాజనాలు అందించారు కవి. తన ఎదను భార్యకు సేద తీర్చే నులివెచ్చని శయ్య(పడక)గా, తన కంటి రెప్పలను చల్లని గాలిని అందించే వింజామరులుగా వర్ణించి భార్యకు జోల పాటలు పాడటం ద్వారా అర్ధాంగి సేవలో అనుభూతిని ఆస్వాదించడం అనేది రచయిత ప్రేమ భావుకతను తెలియజేస్తుంది. రచయిత దాంపత్యాన్ని హృదయనేత్రంతో తిలకించి పాట రూపంలో ఆవిష్కరించారు.

శ్రీవారికి ఒక మనవినిసేయని... ఈ ప్రియ దాసిని
కను తెరవగా మీ రూపే చూడాలనీ
మీ కౌగిళ్లలో కనుమూయాలనీ
ఈ కౌగిళ్ళలో కలిసుండాలనీ.... (కునుకుంట్ల, సినీ గీతాలు 2003:133)

భార్య భర్త సేవలో తరించాలి అనుకుంటుంది. కానీ భర్తే తనని సేవించినప్పుడు అతివ తన్మయత్వంతో పులకించిపోతుంది. భర్త చూపే ప్రేమకు, ఆదరణకు అతన్ని దైవంగా భావించి ప్రియదాసిగా, సేవకురాలుగా మారిపోతుందని, భర్తకు అంతటి గౌరవాన్ని ఇస్తుందని చెబుతూ... ప్రతి స్త్రీ సుమంగళిగా భర్త ఒడిలో కనుమూయాలని ఆకాంక్షిస్తారు. దానికి కారణం భర్తపై వారికున్న అపారమైన ప్రేమ, గౌరవం, పతిభక్తి. ఈ విధంగా మగువల అంతరంగాన్ని చంద్రబోస్ గారు అక్షరీకరించారు. చివరిగా కౌగిళ్లలో కనుమూయాలని భార్య అన్నప్పుడు, భర్త కౌగిళ్లలో కలిసి ఉండాలని చెప్పడం ద్వారా వారి దాంపత్య బంధంపై అక్షర సుగంధాలు జల్లి శ్రోతలను ఆనందపారవశ్యంలో ముంచేశారు. ఈ విధంగా బోస్ భార్యాభర్తల అనుబంధాన్ని అద్దములో ఆవిష్కరించారు. ఈ పాటలో ఉన్న భార్యాభర్తల అనుబంధం, భావోద్వేగం మనసుని ఆర్ద్రతకు గురిచేస్తుంది. పాటలో సౌందర్య హరికృష్ణ అభినయానికి బోస్ గారు అక్షరాల ద్వారా జీవం పోశారు. ఇలాంటి పాటలు విన్నప్పుడు పెళ్లి కాని వారికి తన జీవిత భాగస్వామి పట్ల అందమైన కలలను, పెళ్లైన భర్తకు తన శ్రీమతితో అల్లుకున్న ప్రణయానుభవాలను, జ్ఞాపకాలను, తనతో గడిపిన మధురమైన క్షణాలను, తీపి అనుభూతులను ఈ పాట అందిస్తుంది. రచయిత చంద్రబోస్ గారిలో ఉన్న దాంపత్య ప్రేమతాత్వికత, ఆలుమగల మధ్య ఉండే ఆత్మీయత, అవగాహన ఈ పాటల్లో కనిపిస్తాయి.

ఉపసంహారం

  • మానవ సంబంధాలు మానవ మనుగడకు మూలాధారం. బుద్ధిజీవి అయిన మానవుడు ఆ బాంధవ్యాలను కాపాడుతూ తర్వాత తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవ సంబంధాల మధ్య సమతుల్యత లోపించి, సమాజం తప్పుదోవ పడుతుంది. ఇలాంటి తరుణంలో కుటుంబ వ్యవస్థ గురించి, మానవ సంబంధాలు, నైతిక విలువలు గురించి చంద్రబోస్ గారు మొదలైన రచయితలు సామాజిక స్పృహతో గేయాలను రచించడం హర్షించదగ్గ విషయం.
  • చంద్రబోస్ గారి గేయాలు లయాత్మకంగా, శ్రావ్యంగా ఉండటమే కాకుండా సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఆదర్శ భావాలు ఆయన పాటల్లో మనం గమనించవచ్చు.
  • సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. నేటితరం సినిమాలకు ఎక్కువగా ఆకర్షితులవుతూ వాటిలోని సన్నివేశాలను, పాత్రలను ఆదర్శంగా తీసుకుంటారు. కావున గీత రచయితలు కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, నైతిక విలువలను ప్రబోధించే గీతాలను రచించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను తెలుసుకొని వాటిని పాటించడానికి అవకాశం ఉంటుంది.
  • సినిమా పాటల గురించి విశ్వవిద్యాలయాల స్థాయిలో విస్తృతమైన పరిశోధన జరగాలి. పాటలో ఉండే కవిత్వ పరిమళాలు, సామాజిక విలువలు నేటి తరానికి అందించి, శ్రోతల మనసుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపి... వారికి ఉపదేశాన్ని, ఆనందాన్ని తమ పాటల ద్వారా అందించే రచయితలకు సరైన గుర్తింపు లభించాలి అంటే గీత రచయితలపై, వారి పాటలపై పరిశోధనలు తప్పనిసరి.
  • ఈ పరిశోధనా పత్రం చంద్రబోస్ గేయాలలో మానవ సంబంధాల ప్రాముఖ్యతను లోతుగా విశ్లేషించింది.
  • కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల అనుబంధం వంటి ప్రధాన మానవ సంబంధాలను గేయాల్లో రచయిత చిత్రీకరించిన విధానం అద్భుతం.
  • బోస్ గారు తమ పాటల ద్వారా సాంఘిక విలువలను, నైతిక ప్రవర్తనను పెంపొందించే సందేశాలు ఇచ్చారు.
  • ఆయన రచనలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటూ, సాహిత్యంలో పాట స్థాయిని మరింత పెంచుతాయి.
  • చంద్రబోస్ సృష్టించిన పాటలు కేవలం వినోదాన్ని అందించడమే కాదు, ఆలోచింపజేసే సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉన్నాయి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ఆనంద్, చెర్ల. దేవులపల్లి కృష్ణశాస్త్రి చిత్రగీతాలు- సాహితీవిలువలు. 2001. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సిద్ధాంత గ్రంథం.
  2. ఆనందచారి, కె., శరత్ చంద్ర, తిరునగరి. సం.  సినీగీతావరణం. ప్రగతి ప్రింటర్స్, 2022.
  3. కునుకుంట్ల, చంద్రబోస్. సినీ గీతాలు. అముద్రిత గ్రంథం.
  4. గురజాడ. ముత్యాల సరాలు. 9వ పుట.
  5. జయంతి, చక్రవర్తి. వేటూరి పాట. రోహిత్ ప్రింటర్స్, 2017.
  6. చంద్రశేఖర్, బూర్ల. తెలుగు సినిమా పాట ప్రబోధాత్మకత. కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, 2018.
  7. చిన్న పేరయ్య, శింగనమల. దాశరధి సినీ సాహిత్యం- పరిశీలన. 2005. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, సిద్ధాంత గ్రంథం.
  8. చుక్కల, సింగయ్య శెట్టి. నీతిశాస్త్రం. 15వ పుట.
  9. దేవీరెడ్డి, రాధాకృష్ణారెడ్డి. తెలుగు సినిమాపాటలు-సామాజికస్పృహ. 2010. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, సిద్ధాంత గ్రంథం.
  10. పైడిపాల. తెలుగు సినిమా పాట. స్నేహ ప్రచురణలు, 1992.
  11. మునస్వామి, త్యాగదుర్గం. తెలుగు సినిమాల్లో హైందవ భక్తిపాటలు-వైశిష్ట్యం. 2001. సిద్ధాంత గ్రంథం.
  12. రామలక్ష్మి, కె. భువనచంద్ర సినీ గేయ సాహిత్యం పరిశీలన. 2017. మద్రాస్ విశ్వవిద్యాలయం, సిద్ధాంత గ్రంథం.
  13. రుక్మిణీ, మాదాల. తెలుగు సినీ గీతాలు-ఒక పరిశీలన. 2010. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సిద్ధాంత గ్రంథం.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal