AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
8. కోరంగి : చరిత్ర పుటలలో నౌక పట్టణం
డా. చంద్రకాంత్ మునేశ్వర్
సహాయాచార్యులు, చరిత్ర శాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9989538243, Email: departmentofhistorygasc@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.08.2025 ఎంపిక (D.O.A): 28.08.2025 ప్రచురణ (D.O.P): 01.09.2025
వ్యాససంగ్రహం:
కోస్తా సర్కార్ తీరాన కాకినాడ సమీపాన ఉన్న కోరంగి, క్రీస్తుపూర్వం నుండి ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం వరకు వర్తక వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన ప్రాచీన నౌక రేవు పట్టణం. నేడు ఇసుకమేటలతో కప్పబడి, అభయారణ్యంగా పరిచయమైన ఈ ప్రాంతం గొప్ప చారిత్రక వారసత్వాన్ని తన గర్భంలో నిక్షిప్తం చేసుకుంది. "కోరంగి-చరిత్రపుటలలో నౌక పట్టణం" అను ఈ పరిశోధనా వ్యాసం కోరంగి నౌక పట్టణ వైభవం, దాని పతనం కారణాలు, ప్రస్తుత ప్రకృతి పర్యాటక ప్రదేశంగా పరిణామంపై చారిత్రక దృష్టికోణంలో సమగ్ర అధ్యయనం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ అధ్యయనం నేటి తరానికి కోరంగి ప్రాముఖ్యతను తెలియజేయడం ఆవశ్యకం. గ్రీకు రచనలు, ప్లీని 'నేచరల్ హిస్టరీ', మార్కో పోలో 'ది ట్రావెల్స్', కాకతీయుల మోటుపల్లి శాసనం, మెకంజీ కైఫియ్యత్తు, బ్రిటిష్ నివేదికలు, మద్రాస్ డిస్ట్రిక్ట్ గాజీటీర్స్, సాహిత్య గ్రంథాలు, దినపత్రికల కథనాలు వంటి ప్రాథమిక, ద్వితీయ ఆధారాలను సేకరించి, ప్రత్యక్ష క్షేత్రపర్యటన ద్వారా విషయసేకరణ జరిగింది. పరిశోధన విధానం చారిత్రక పద్ధతిని అనుసరిస్తుంది. సమాచార సేకరణలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ, స్థానిక సహకారంతో అధిగమించబడ్డాయి. ఈ పరిశోధన కోరంగి చారిత్రక వారసత్వ పరిరక్షణకు తోడ్పడగలదు. భవిష్యత్ పరిశోధకులు క్షేత్ర అధ్యయనం తప్పనిసరిగా చేయాలని ఈ వ్యాసం సూచిస్తుంది.
Keywords: కోరంగి, నౌక పట్టణం, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం, నౌక నిర్మాణ పరిశ్రమ, డాక్ యార్డ్, తీర రేవు పట్టణం, ఇసుక మేటలు, విధ్వంసం, ప్రకృతి పర్యాటక ప్రదేశం, మడ అడవులు, జీవ వైవిధ్యం, పర్యాటక ప్రగతి, కూరంగేశ్వరా, బంకోలా
1. ప్రవేశిక
కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగి, గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒకనాటి రేవుపట్టణం. క్రీస్తుపూర్వకాలం నుండి 20 వ శతాబ్ద ప్రారంభం వరకూ కోరంగి ఓడరేవుగా, నౌకాపట్టణంగా, నౌకా నిర్మాణ కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది.
2. కోరంగి నామం: స్థలపురాణ విశ్లేషణ
కోరంగి గ్రామ నామం వెనుక గల స్థలపురాణం మెకంజీ కైఫియత్ ద్వారా తెలుస్తుంది (మెకంజీ కైఫియాత్). త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నప్పుడు గోదావరి నది తీరంలో కొంతకాలం నివసించారు. ఒకనాడు సీత ముచ్చట పడిన బంగారు కురంగమును (జింక) పట్టుకోవడానికి చాలా దూరము తరిమి, తన బాణమును ఎక్కుపెట్టి కొట్టారు. బాణం తగిలిన జింక ప్రాణం విడిచిన ప్రాంతంలో ఒక గ్రామము వెలసినది. అలా వెలసిన గ్రామాన్ని ప్రజలు కోరంగి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ స్థల పురాణమును బట్టి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసంలో ఉన్నప్పుడు మాయలేడిని ఇక్కడ వధించిన ప్రదేశం అని పురాణగాథ. కురంగి అంటే సంస్కృతంలో బంగారు లేడి అని అర్థం. కాలక్రమంలో ఇదే కురంగ అపభ్రంశంగా కోరంగిగా మారింది అని తెలుస్తుంది. బంగారు లేడిని వధించిన బాణాన్ని ఇక్కడే, ఇక్కడ ఉన్న నూతిలో కడిగారని ప్రతీతి. 7వ శతాబ్దంలో కురంగిలో కురంగేశ్వర పురం పేరుతో ఒక పట్టణము ఉండేది. నేడు కోరంగి సమీపంలో ఉన్న కురంగిలో రాముడిచే ప్రతిష్ట చేసిన తూరంగేశ్వర ఆలయం కలదు. తురంగేశ్వర కాలక్రమంలో కురంగేశ్వరంగా మార్పు చెంది ఉండవచ్చు. ఇక్కడ ఉన్న కురంగేశ్వర స్వామి దేవాలయంలోని శివలింగం శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగంగా ప్రఖ్యాతి చెందింది.
3. గత వైభవం: ప్రాచీన వాణిజ్య కేంద్రం
సముద్రంలోకి నాలుక ఆకారంలో చొచ్చుకొని ఉన్న భూభాగాన్ని కేప్ (మూలాగ్రము) అని అంటారు. కోరంగి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక కేప్.
3.1. రోమన్ గ్రీకు కాలంలో వాణిజ్యం
క్రీ.శ. మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు ప్లీని గంగానది ముఖం నుండి 625 రోమన్ మైళ్ల దూరంలో కేప్ కాలింగన్ అనే ప్రముఖ రేవుపట్టణం ఉందని పేర్కొన్నాడు. దాన్ని కోరంగిగా కన్నింగ్‌హమ్, ఫెర్గుసన్ వంటి చరిత్రకారులు గుర్తించారు. కాలక్రమేణా తీరము విస్తరించడం, ఇసుక మేటలు వేయడం వల్ల ప్లీని వర్ణించిన కోరంగి రేవుపట్టణం నేడు సముద్ర తీరానికి దూరంగా జరిగింది. ప్లీని వర్ణించిన కేప్ కాలింగన్ నేటి కళింగపట్నం రేవు ఎందుకు కాకూడదని అనిపించవచ్చు. కానీ ఆ అవకాశం లేదు ఎందుకంటే గంగానది ముఖద్వారం నుండి కళింగపట్నం సుమారు 400 రోమన్ మైళ్ళు మాత్రమే ఉండగా (1 రోమన్ మైల్=1.47కిమీ), కోరంగి సుమారు 610 రోమన్ మైళ్ల దూరంలో ఉన్నది. ఇది ప్లీని చెప్పిన 625 రోమన్ మైళ్లకు సరిపోతుంది. అంతే కాక, ఒకప్పుడు కళింగ సామ్రాజ్యం ఒరిస్సానుంచి గోదావరి వరకూ తూర్పు తీరం వెంట విస్తరించి ఉండేది. కోరంగి కళింగ సామ్రాజ్యంలో ఒక భాగం ఆనాడు. కనుక కేప్ కాలింగన్ కోరింగ అనడం సబబుగానే అనిపిస్తుంది.
ఒకటవ శతాబ్దానికి చెందిన ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరత్రియాన్ సి’ అనే గ్రీకు నౌకాయాన గ్రంథంలో ఒక గోదావరి రేవు నుంచి నిత్యం మలయాకు నౌకలు ప్రయాణం చేస్తున్నాయని, దానికి సమీపంలో అల్లోసినె (Allosygne) అనే పెద్ద పట్టణం ఉందని వర్ణించారు. మెక్‌క్రిండిల్స్ అనే చరిత్రకారుడు ఆ రేవుపట్టణం కోరింగ కావచ్చు అని ఊహించాడు (Schoff). కోరంగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆర్యావటం అనే ప్రముఖ బౌద్ధ క్షేత్రం కలదు. బహుశ టొలెమి ‘నేచురల్ హిస్టరీ’లో చెప్పిన అల్లోసినె పట్టణం ఆర్యావటం కావొచ్చు.
కోరంగి రేవుపట్టణం నుండి రోమ్, ఈజిప్టు దేశాలతో భారీగా వర్తకం జరిగేది. ఎక్కువగా సుగంధపరిమళాలు, మిరియాలు, యాలకులు, నీలిమందు, ఉక్కు, వజ్రాలు, ముత్యాలు, పత్తి, ఏనుగు దంతాలు, చందనం ఎగుమతి జరిగేది. సముద్ర వ్యాపారం కారణంగా అపరిమితమైన బంగారం రోము నుండి భారతదేశానికి చేరిపోతుందని ప్లీని, హిప్పాలస్ వంటి చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేసేవారు. కోరంగి రేవు ద్వారా జరిగిన విదేశీ వాణిజ్యానికి గుర్తుగా కోరంగి సమీపంలో గల మట్లపాలెం వద్ద రెండో శతాబ్దానికి చెందిన రోమను నాణెములు లభించాయి ("కోరింగి"). రేవు పట్టణములలో రాజు తరపున సుంకకరణములు అనే రాజోద్యోగులు ఉండేవారు. వీరు విదేశీ ఓడలకు రక్షణ కల్పించినందుకు, వ్యాపారుల మధ్య ఘర్షణలు రాకుండా చూసినందుకు, మోసములు జరుగకుండా ఖచ్చితమైన తూకములు అమలుచేసేందుకు, ఓడదొంగలనుండి కాపాడినందుకు సరుకుల విలువలో నూటికి పది వంతులు చొప్పున రేవు సుంకమును వసూలు చేసేవారు. ఐదవ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యము పతనమయ్యాకా, కొంతకాలం భారతదేశం నుండి జరిగే విదేశీ వాణిజ్యం మందగించింది. ఐతే ఈ ప్రాంత వ్యాపారులు కొత్త వ్యాపార అవకాశాలను వెతుక్కొన్నారు. కోరంగి నుండి చైనా, జపాన్, బర్మా, మలేషియా, జావా, సుమత్రా ఆగ్నేయాసియా తూర్పు దేశాలతో తమ వ్యాపారాలను కొనసాగించారు.
3.2. గోల్కొండ, నిజాం కాలంలో వాణిజ్యం
క్రీ.శ. 10వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన రాజరాజ నరేంద్రుడు వేయించిన నాణెములు బర్మా దేశంలో ఇసుకలో కూరుకుపోయిన ఒక ఓడ శిధిలముల మధ్య లభించాయి. దీనిని బట్టి బర్మతో వ్యాపారం సాగిందని, శిధిలమైన ఓడ కోరంగి నౌకా పరిశ్రమలో తయారు కాబడిన ఆనవాళ్లు ఉన్నందున కోరంగి రేవు ప్రముఖ నౌకా తయారీ వ్యాపారకేంద్రంగా ఉండేదని ఊహించవచ్చు (వెంకట కృష్ణారావు 78). పదమూడవ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ పాలకులు రేవులలో క్లుప్తశుంకమును (ముప్పదింట ఒక వంతు; అంతకుపూర్వం ఇది నూటికి పది వంతులు ఉండేది) వేయడాన్ని బట్టి నౌకా వ్యాపారాన్ని ప్రోత్సహించారు అని తెలుస్తుంది. కృష్ణా, గోదావరి కోస్తా తీర రేవులను ఎక్కువగా ప్రోత్సహించారు (మనోహరి, బిన్నురి 29). ఈ కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపోలో కృష్ణా, గోదావరి రేవుల నుండి పెద్ద ఎత్తున విదేశీ వర్తకము జరుగుతుందని అన్నాడు. అంతే కాక ఇక్కడి ఓడలు చాలా బలమైనవని, పెద్దవిగా ఉన్నాయని, ఒక్కొక్క ఓడ ఐదు ఆరు వేల మలగల (మలగ అనగా ఒక ఎద్దు మోయగల బరువు) మిరియములను మోయగల సామర్థ్యం ఉందని, ఓడను నడుపుటకు మూడు వందలమంది నావికులు ఉండాలని, ఓడ అడుగు భాగమున గదుల వంటి నిర్మాణములు కలవని, రాళ్లు లేదా తిమింగలాల వలన ఏ గదికి దెబ్బతగిలితే ఆ భాగము మాత్రమే చెడిపోతుంది తప్ప ఓడ మునిగిపోయే ప్రమాదము లేదని అన్నాడు (వెంకట కృష్ణారావు 26). మార్కోపోలో కోరంగి అని ప్రత్యేకముగా ప్రస్తావించకపోయినా ఇక్కడ కూడా నౌకా వ్యాపారం జరిగే ఉంటుందని ఊహించవచ్చు. ఆ తరువాత వచ్చిన నిజాం పాలకులు మచిలీపట్నంను ప్రముఖ ఓడరేవుగా ప్రోత్సహించడం మూలంగా క్రమక్రమంగా కోరంగి రేవు ప్రాభవం కొంత మసకబారినా అది ఏనాడూ మూతపడలేదని తెలిపే అనేక ఆధారాలు లభించాయి.
క్రీ.శ. 1619 జూలై నెలలో మచిలీపట్నం నుండి కెప్టెన్ మార్టీన్ ప్లింగ్ నాయకత్వంలో సూరత్‌కు బయలుదేరిన ఒక ఓడ వాతావరణము అనుకూలించకపోవడంతో కోరంగి రేవులో కొన్ని వారాలపాటు నిలిపి ఉంచవలసి వచ్చిందట. ఈ ఉదంతం ద్వారా కోరంగి రేవు అప్పటికి ఓడలకు కొన్ని వారాలపాటు ఆశ్రయం ఇచ్చే ఒక రేవు పట్టణంగా ఉండేదని అర్థం చేసుకోవచ్చు (Faster, The English Factories 1618-1621).
క్రీ.శ. 1666 జూలైలో ఒక ఓడలోని సరుకులు ఎవరికి చెందాలి అనే అంశంపై వచ్చిన ఒక వివాదంలో మచిలీపట్నం వ్యాపారులు బెంగాలులో ఉండే కంపెనీ అధికారులకు వ్రాసిన ఒక లేఖలో కోరింగ ప్రాంతానికి ‘మహమ్మద్ బేగ్ అనే వ్యక్తి సుబేదారుడు’ గా ఉన్నాడని చెప్పడాన్ని బట్టి కోరంగి రేవు గోల్కొండ నవాబు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది (వెంకట కృష్ణారావు 61). (ఈ మహమ్మద్ బేగ్ 1670-1676 సంవత్సరాల మధ్య రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకొని, నిజాం ప్రభువు ప్రతినిధిగా వేంగి రాజ్యాన్ని పాలించినట్లు మెకంజీ కైఫియత్ ద్వారా తెలుస్తుంది.) ఆ తదుపరి కాలంలో నెలకొని ఉన్న రాజకీయ అస్థిరతల వల్ల కోరంగి నుండి జరిగే నౌకా వ్యాపారం క్షీణించింది. సముద్ర ఓడదొంగల దొంగతనాలు దుర్మార్గములు పెరిగిపోవడం వల్ల విదేశీ నౌకలు కోరంగి రేవులను చేరుటకు భయపడే పరిస్థితి వచ్చినది.
3.3. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన
కోరంగికి సమీపంలో ఉన్న ఇంజరం బ్రిటిష్ వారికి ఒకనాటి ప్రముఖ వర్తక కేంద్రం. ఇంజరంలో నివాసముండే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి అయిన జాన్ సాండర్ సన్ క్రీ.శ. 1731 వ సంవత్సరం ఏప్రిల్ 7న వ్రాసిన ఒక ఉత్తరంలో కోరంగికి సమీపంలో డచ్ వారు ఒక స్థావరాన్ని నిర్మించుకోనున్నట్లు తెలిసిందని, మనం కూడా అక్కడ ఏదైనా (గిడ్డంగి) గొడౌన్ నిర్మించుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని తన పై అధికారులకు విన్నవించుకున్నాడు (St, Letters 1731).
క్రీ.శ. 1739 వ సంవత్సరం జూన్ 1న ఇంజరం కంపెనీ ప్రతినిధి రిచ్ ప్రిన్స్ వ్రాసిన ఒక ఉత్తరంలో బ్రిటిష్ వారు ఇంజరంలో కొనుగోలు చేసిన కాటన్ వస్త్రాలను రోడ్డుమార్గం గుండా కోరంగి రేవుకు చేరవేసి అక్కడి నుంచి ఎగుమతి చేయడం ఇబ్బందిగా ఉందని, వర్షాకాలంలో రోడ్డుమార్గంపై సరకులను చేరవేసేటప్పుడు తడిసిపోయి పాడైపోతున్నాయని చెప్పాడు. క్రీ.శ. 1751 వ సంవత్సరం జనవరి 6న ఇంజరంలో నివసించే ఈస్ట్ ఇండియా ప్రతినిధి వెస్ట్ కాట్ (Mr. Westcot) వ్రాసిన ఒక లేఖలో స్థానిక రాజు (పూసపాటి పెదవిజయరామరాజు) కోరంగిని సాలుకు 120 పగోడాలకు గోల్కొండ నవాబు నుండి కౌలుకు తీసుకున్నారని, అదే ధరకో కొంచెం ఎక్కువకో మనం తీసుకోగలిగితే మన వ్యాపారాలకు కోరంగి రేవు ఎంతో ఉపయోగపడుతుందని తనకు అనుమతి ఇస్తే ముందుకు వెళతానని తన ఉన్నతాధికారులకు విన్నవించుకున్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో వ్రాసిన మరో ఉత్తరంలో కోరంగిని కౌలుకు తీసుకోవటం విషయంలో తన ఆలోచనను సమర్థించినందుకు వెస్ట్ కాట్ ధన్యవాదాలు చెప్పినట్లు ఉండటాన్ని బట్టి ఈస్ట్ ఇండియా గవర్నర్ ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఉంటారని భావించాలి.
క్రీ.శ. 1753 వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన వెస్ట్ కాట్ ఉన్నతాధికారులకు వ్రాసిన ఒక లేఖలో రాజుగారి నుండి కోరింగ రేవు పట్టణాన్ని ఏడాదికి రెండు వందల అరవై పగోడాలకు మొత్తానికి కౌలుకు తీసుకున్నానని, కోరంగి రేవును స్వాధీనం చేసుకున్నానని, అంతే కాక ఇక్కడ దిగే ఓడలకు మూడు సంవత్సరాలపాటు సుంకం చెల్లించక్కర్లేదని ప్రకటించానని, అలా చేయటం ద్వారా వివిధ దేశాలకు చెందిన నౌకలు ఇక్కడకు వస్తాయని తద్వారా ఎక్కువ వ్యాపారం చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు (St, Letters 1752-53). కోరంగి రేవుపట్టణాన్ని కౌలుకు ఇప్పించటంలో సహకరించిన వారికి 66 పగోడాల బహుమతులను ఇచ్చినట్లు క్రీ.శ. 1756 వ సంవత్సరం నాటి కంపెనీ జమా ఖర్చులలో ఉండటం ఆనాటి సమాజంలో ఉన్న అవినీతిని పట్టి చూపిస్తుంది (St, Diary). అంతవరకూ ఇంజరంలో ఉంటూ వ్యాపారాలు చేసిన వెస్ట్ కాట్ కోరంగికి తన మకాం మార్చి క్రీ.శ. 1759 వ సంవత్సరంలో కోరంగి గోదావరి పాయ తూర్పువైపున అనేక నూతన భవనాలు, గిడ్డంగులు నిర్మించాడు. వెస్ట్ కాట్ అభివృద్ధి పరచిన ఈ ప్రాంతం కొత్త కోరంగిగా పేరు గాంచింది. కోరంగి గోదావరి పాయ పశ్చిమ ఒడ్డున గల ప్రాచీన కోరంగి పట్టణాన్ని పాత కోరంగిగా ప్రజలు పిలుస్తున్నారు.
వ్యాపార నిమిత్తం భారతదేశం వచ్చిన ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్, పోర్చుగీసు వర్తకుల మధ్య పద్దెనిమిదో శతాబ్దంలో విపరీతమైన పోటీ ఉండేది. ఒకరికొకరు బద్ద శత్రువులుగా భావించేవారు. ఆనాటి అరాచక పరిస్థితులను క్రీ.శ. 1789 వ సంవత్సరంలో కోరంగిని సందర్శించిన టిప్పింగ్ అనే బ్రిటిష్ వ్యాపారి కళ్లకు కట్టినట్లు వర్ణించాడు:
“కోరంగిలో ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్, పోర్చుగీసు ఓడలు లంగరు వేసి ఉన్నాయి. చెడు ప్రవర్తన కలవారు ఇక్కడ విపరీతంగా సంచరిస్తున్నారు. ఎవరికీ భద్రత లేదు. రాత్రివేళల మద్యం మత్తులో ఎవరు ఎవరిని హత్యచేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఎవరు దోపిడీ చేస్తారో తెలియని పరిస్థితులు కోరంగిలో నెలకొని ఉన్నాయి”
అంటూ టిప్పింగ్ తనకు రక్షణ కల్పించమని బ్రిటిష్ కంపెనీ అధికారులను కోరాడు (Morris 56). పంతొమ్మిదో శతాబ్దం వచ్చేసరికి ఇంగ్లీషు వారు రాజకీయంగా బలపడడంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొన్నాయి.
3.4. బ్రిటిష్ పరిపాలనలో పునరుజ్జీవనం
బ్రిటిష్ వారు కోరంగి రేవుకు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి ప్రపంచ ప్రసిద్ధ ఓడ రేవుపట్టణంగా అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1802 వ సంవత్సరంలో ఎబెనెజర్ రోబుక్ అనే వ్యాపారి ఓడలు నిలుపుచేసే లంగరు స్థలాన్ని (డాక్‌యార్డ్) నిర్మించాడు. ఎబెనెజర్ రోబుక్ ఒక లండన్ వ్యాపారి; ఇతను వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి కోరంగిలో స్థిరపడి వ్యాపారాలు సాగించాడు. ఇతను నిర్మించిన డాక్‌యార్డ్‌లో 155 అడుగుల పొడవు, 51 అడుగుల వెడల్పు ఉన్న ఆల్బట్రోస్ అనే ఓడకు మరమ్మత్తులు చేయటం అప్పట్లో ఒక రికార్డు. ఎందుకంటే కలకత్తా నుండి శ్రీలంక మధ్యలో ఎక్కడా ఇంత పెద్ద ఓడలను నిలుపుచేసే సౌకర్యం ఉండేది కాదు (వెంకట రమణారావు). క్రీ.శ. 1855 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 62,638 రూపాయిలతో కోరింగ హార్బర్ ను ఆధునీకరించింది. కోరంగి రేవు ద్వారా క్రీ.శ. 1877-78 సంవత్సరాల మధ్య ఎనిమిది లక్షల రూపాయిల వ్యాపారం జరిగింది (Phipps 174). క్రీ.శ. 1845 వ సంవత్సరంలో కోరంగి దీప స్తంభం (లైట్ హౌస్) ను నిర్మించారు. దీని నిర్మాణానికి 73 వేల రూపాయిలు ఖర్చు అయ్యాయి. క్రీ.శ. 1855 వ సంవత్సరంలో దీని ఎత్తు 20 అడుగులు పెంపుచేసి ఎక్కువ దూరంలో ఉన్న ఓడలు కనిపించడం కొరకు లైట్ హౌస్ దీప సామర్థ్యంను పెంచారు. ఈ లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతి సముద్రంలో పద్నాలుగు మైళ్ల వరకూ ప్రసరిస్తూ నౌకలకు దారిచూపేది. క్రీ.శ. 1902 వ సంవత్సరం తర్వాత దీనిని వినియోగించడం నిలిపివేసారు. ప్రస్తుతం ఇది కోరంగి మడ అడవులను సందర్శించటానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఒక టూరిస్టు స్పాట్‌గా ఉంది.
మద్రాసు గవర్నర్ గా పనిచేసిన లార్డ్ కన్నెమెరా 19 డిసెంబరు 1889 వ సంవత్సరం నాడు మద్రాసులో సిర్స అనే ఓడపై బయలుదేరి మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలను సందర్శన చేసారు. ఇతను కోరంగి రేవులో దిగి కాకినాడ వెళ్ళిన వివరాలు ఇలా ఉన్నాయి:
"మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయానికల్లా కాకినాడకు పది మైళ్ల దూరంలో ఉన్న కోరంగి రేవుకు చేరుకొన్నాను. కోరంగి రేవు సందడిగా ఉంది. పెద్ద సంఖ్యలో ఓడలు, పడవలు లంగరు వేసి ఉన్నాయి. దూరం నుంచే యజమానులు తమ ఓడలను గుర్తించేందుకు వీలుగా ఓడలకు వివిధ రకాలుగా రంగురంగుల జండాలు అమర్చిన ఆ జండాలు ఎగురుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ మిస్టర్ పోవర్ వచ్చి ఓడలో గవర్నర్ గారిని కలిశారు. అప్పటికే సిద్ధం చేసిన ఆవిరి పడవ ఎక్కి కాకినాడ చేరుకొన్నాము."
పై వివరాలను బట్టి క్రీ.శ. 1889 వ సంవత్సరం నాటికి కోరంగి రేవు ప్రధాన జలమార్గంగా, ప్రధాన ఓడరేవుగా ఉన్నట్లు అర్థమౌతుంది (Rees). క్రీ.శ. 1901వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం మిస్టర్ ప్రౌన్ అనే ఇంజనీరు ఆధ్వర్యంలో కోరంగి వద్ద తెరుచుకొనే వంతెన (బాస్కూల్ బ్రిడ్జ్)ను నిర్మించారు. ఈ నిర్మాణం ఓడలు వచ్చినప్పుడు ఈ వంతెన రెండుగా తెరచుకొని సుమారు 50 అడుగుల దారి ఇచ్చే విధంగా ఉన్న నిర్మాణం ఆ కాలంలో ఒక అద్భుత నిర్మాణం అనవచ్చు. ఈ వంతెన తలుపులను పైకి లేపటానికి ఎనిమిదిమంది అవసరము అయ్యేవారు (సీతారామయ్య 94).
3.5. ఇరవయ్యో శతాబ్దంలో రేవు పతనం
ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి కోరంగి రేవులో ఇసుక మేటలు వేయటంతో దాని లోతు క్రమేపి తగ్గనారంభించింది. ప్రతి పదేళ్లకు ఒక అడుగు చొప్పున ఇసుక పేరుకుపోయేదట. పెద్ద ఓడలు వచ్చినప్పుడు అవి ఇసుకలో కూరుకుపోయేవి. అందుచేత ఓడల రాక నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడం జరిగింది. క్రీ.శ. 1898-99 సంవత్సరం నాటికి కోరంగి రేవులోకి ఓడల రాక పూర్తిగా నిలిచిపోయింది. కోరంగి తన వైభవాన్ని కోల్పోవటంతో కాకినాడ, మచిలీపట్నం నౌకాశ్రయాలు క్రమేపీ ప్రాభవాన్ని అందిపుచ్చుకొని ప్రధాన రేవుపట్టణాలుగా ఎదిగాయి.
4. కోరంగి: నౌకా నిర్మాణ కేంద్రం
4.1. నౌకా నిర్మాణ పరిణితి
కోరంగి పూర్వం నౌకల నిర్మాణం, మరమ్మత్తుల పరిశ్రమ విషయంలో ప్రపంచవ్యాప్త ప్రాఖ్యాతి గాంచింది. ఘనకీర్తి గడించింది. 500 టన్నుల బరువును మోయగలిగే సామర్థ్యం గల ఓడలు ప్రతీ ఏటా వందకు పైగా తయారయ్యేవి.
అంతే కాక ఈ సంఖ్యకు నాలుగు రెట్ల ఓడలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. నౌకా నిర్మాణానికి ప్రధాన ముడిసరుకు టేకు కలప. గోదావరి జిల్లాలోని అడవులలో టేకు కలప విస్తారంగా కలదు. ఇది ఇతర ప్రాంతాలలో దొరికే టేకు కన్నా తక్కువ ధరకు లభించడం వల్ల కోరంగిలో నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా అభివృద్ధిచెందింది. అంతే కాక కోరంగి నుంచి ప్రతీ ఏటా 2000 నుండి 3000 వరకు టేకు దూలాలు కోరంగి నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి జరిగేది. క్రీ.శ. 1793 వ సంవత్సరంలో హామీల్టన్ అనే ఈస్ట్ ఇండియా వ్యాపారికి కోరంగిలో వెయ్యి టేకు దూలాలను నిలువ చేయగలిగే గిడ్డంగి (గొడౌన్) ఉండేదంటే ఏ స్థాయిలో ఇక్కడ కలప వ్యాపారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు (సుబ్రహ్మణ్యం శర్మ 124). నేటికీ కోరంగిలో వంద గదుల భవనం పేరుతో కొన్ని శిథిలాలను స్థానికులు చూపిస్తారు; అవి ఒకనాడు ఇక్కడ జరిగిన వర్తక వాణిజ్య లావాదేవీలకు జ్ఞాపకంగా మిగిలిన ఆనవాలు.
4.2. ప్రాచీన భారత నౌకా పరిశ్రమ
నిజానికి భారతదేశ నౌకాయాన పరిశ్రమ అతి ప్రాచీనమైనది. వేదాలలో నావికా పరిశ్రమ, నౌకా వ్యాపారం గురించి ప్రస్తావనలు ఉన్నాయి. భుజ్యురాజు ఓడ ప్రమాదమునకు గురయినపుడు అశ్విని సోదరులు తమ నూరుతెడ్ల ఓడలో అతనిని సంరక్షించిన కథ వేదరుక్కులలో కలదు. మహాభారతంలో రాజసూయ యాగ సందర్భముగా సహదేవుడు అనేక ద్వీపములను జయించాడని ఉన్నది. వరాహపురాణములో గోకర్ణుడను వర్తకుడు నౌకాయానముచేస్తూ నౌకా భంగానికి గురయినట్లు తెలుపబడింది. నౌకానిర్మాణానికి అనుకూలమైన కలప గురించి, నౌకా లక్షణముల గురించి, వివిధ అవసరాలకు తగినట్లు సుమారు 25 రకాల నౌకల నిర్మాణము, వాటి మంచి చెడ్డల గురించి "యుక్తి కల్పతరువు" అనే గ్రంథంలో మన ప్రాచీనులు విపులంగా వర్ణించారు. మనుస్మృతిలో నౌకా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన కాలములు చెప్పారు. రేవుపట్టణంలో ఉండే రాజప్రతినిధి అయిన నావాధ్యక్షుని విధులు పన్నులు వసూలు చేయడం, నౌకలకు కావలసిన సదుపాయములు కల్పించడం, ఎగుమతి దిగుమతుల్లో అక్రమాలు జరగకుండా చూడడం, ఓడదొంగలనుండి వ్యాపారులకు రక్షణ కల్పించడం వంటి అనేక విషయాలు చాణక్యుని అర్థశాస్త్రంలో చెప్పబడినాయి. శాతవాహన పాలకులు నౌకా చిహ్నాలు ఉన్న నాణాలను అనేకం ముద్రించుకున్నారు (ఆసియాటిక్ సొసైటీ జర్నల్ 410). అంతటి ఘన చరిత్ర కలిగిన భారతీయ నౌకా పరిశ్రమ శాస్త్రీయంగా నిర్మించిన ఓడలను తొలిసారిగా చూసిన యూరోపియన్లు అచ్చెరువొందారు. వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చారు కనుక ఇక్కడ నిర్మించిన నౌకలను విదేశాలకు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేసారు. కోరంగిలో నిర్మించిన నౌకలు దేశ విదేశాలలో క్షణాలలో అమ్ముడు పోయేవి. ఉదాహరణకు క్రీ.శ. 1814 వ సంవత్సరంలో కోరంగిలో నిర్మించబడిన లేడీ హుడ్ పేరు గల ఓడ ఫ్రాన్స్ దేశంలో విక్రయించబడింది. క్రీ.శ. 1816 వ సంవత్సరంలో తయారైన సిటీ ఆఫ్ ఇదినుర్గ్ అనే ఓడను ఇంగ్లాండు వ్యాపారులు కొనుక్కున్నారు. క్రీ.శ. 1818 వ సంవత్సరం నాటి ఇసబెల్లా ఓడను అమెరికాకు పంపించడం జరిగింది ("కోరింగి").
4.3. చార్లెస్ ఈటన్ ఓడ వివరాలు
క్రీ.శ. 1833 వ సంవత్సరంలో కోరంగిలో నిర్మితమైన ‘చార్లెస్ ఈటన్’ అనే ఓడ ఎలా ఉండేదో వివరాలు ఇలా ఉన్నాయి: ‘చార్లెస్ ఈటన్’ 350 టన్నుల బరువును మోయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నది. కోరంగి ఓడరేవు అధికారిగా పనిచేసి క్రీ.శ. 1827 వ సంవత్సరంలో ఇక్కడే మరణించిన చార్లెస్ ఈటన్ పేరును ఈ ఓడకు పెట్టారు. ఈ ఓడ అత్యుత్తమ టేకుతో తయారయినది. రెండు అంతస్థులు కలవు. ఒక్కో అంతస్థు ఎత్తు ఆరున్నర అడుగులు. ఓడ ముందరి భాగము ఎత్తుగా, అందముగా నగిషీలతో ఉన్నది. గదుల మధ్య నడవటానికి పొడవుగా, వెడల్పైన వసారా కలదు. ఓడ వెలుపలి భాగం దృఢంగా ఉండడం కొరకు చెక్కలకు సున్నం, తారులతో రాగిరేకులు తాపడం చేసి ఉన్నవి. ఈ ఓడకు చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ప్రయాణికులు బస చేసే గదులు పెద్ద ఓడలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా, విలాసవంతంగా ఉండి, ప్రతి గదికి ప్రత్యేకమైన మరుగుదొడ్లు కలిగి ఉండడం విశేషం. ఈ ఓడను లండన్ మార్కెట్టులో అమ్మకానికి పెట్టగా గ్లెడ్‌ష్టన్ & కం. అనే కంపెనీ కొనుగోలు చేసింది ("చార్లెస్ ఈటన్").
4.4. నౌకా నిర్మాణదారుల నైపుణ్యం
కోరంగి ఓడలకు ఉన్న డిమాండ్ కారణంగా నౌకా నిర్మాణకారులకు ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి తయారు చేయించుకొనేవారు. ఉదాహరణకు క్రీ.శ. 1854 వ సంవత్సరంలో డెలేకొంబో అనే ఫ్రెంచి వ్యాపారి మాసరయ్య అనే వడ్రంగికి 20 మీటర్ల పొడవైన నౌకను నిర్మించి ఇవ్వటానికి 350 రూపాయిలు అడ్వాన్సుగా ఇచ్చి అగ్రిమెంటు చేసుకున్నాడు ("చార్లెస్ ఈటన్"). పై వర్ణనలను బట్టి కోరంగి నౌకా నిర్మాణ పనివారు అంతర్జాతీయ ప్రమాణాలు గల నైపుణ్యాలను కలిగి ఉండేవారని అర్థమౌతుంది. కోరంగి రేవు వద్దకు అనేక అంతర్జాతీయ నౌకలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. సి.పి.టి. లాప్లేస్ అనే ఒక ప్రపంచ యాత్రికుడు క్రీ.శ. 1830 వ సంవత్సరం జూలై నెలలో కోరంగిలో ఆగి తన 120 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు గల లా ఫేవరెట్ అనే నౌకను మరమ్మత్తు చేయించుకున్న సంగతిని “Voyage autour du Monde” (Travel around the world) అనే పుస్తకంలో ఇలా గ్రంథస్థం చేసాడు:
"కోరంగి వద్ద నైపుణ్యం కలిగిన వడ్రంగులు, కమ్మరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. La Favourite చెడిపోయిన చుక్కాని లోహ అమరికను జాగ్రత్తగా విప్పి, దాన్ని కరిగించి ఎంతో ఖచ్చితత్వంతో, నైపుణ్యంగా పూర్తిగా కొత్తదాని వలె తయారు చేసి తిరిగి ఓడకు బిగించారు. చాలా చవకగా తక్కువ సమయంలో ఓడకు వీరు చేసిన ఇది ఇంకా ఇతర మరమ్మత్తులు నాకెంతో సంతృప్తిని ఇచ్చాయి"
అంటూ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లాప్లాస్ కోరంగి ఓడలు నిర్మించేవారి పనితనం గురించి చేసిన వ్యాఖ్యలు మెచ్చుకోదగ్గవి, విలువైనవి. తుఫానులు, వరదలు, ఉప్పెనల కారణంగా ఏర్పడ్డ ఇసుక మేటల వలన ఇక్కడి నౌకా నిర్మాణ, మరమ్మత్తుల వ్యాపారం కాలక్రమేణా క్షీణించింది. అంతేకాక ఆవిరి ఓడల రాక వల్ల తెరచాపలపై ఆధారపడి నడిచే ఓడలు తమ ప్రాముఖ్యతను కోల్పోవడం కూడా మరో కారణము. గత వైభవానికి చిహ్నంగా కోరంగి సమీపంలో కల తాళ్లరేవులో పడవల నిర్మాణం ఇంకా నేటికీ కొనసాగుతుంది.
5. కోరంగి: ప్రకృతి విలయాలు
5.1. క్రీ.శ. 1787 నాటి ఉప్పెన
కోరంగి తీరప్రాంతంలో ఉండడం వలన ఉప్పెనల తాకిడి ఎక్కువ. టోపింగ్ అనే బ్రిటిష్ ఇంజనీరు క్రీ.శ. 1789 వ సంవత్సరంలో కోరింగని సర్వే చేసేటప్పుడు అతడు స్థానిక ప్రజలను విచారణల ద్వారా క్రీ.శ. 1706 వ సంవత్సరంలో కోరంగిలో వచ్చిన ఒక ఉప్పెన వల్ల స్వల్ప నష్టం జరిగిందని, ఆ తరువాత క్రీ.శ. 1787వ సంవత్సరం మే 20 తారీకు రోజు వచ్చిన ఉప్పెన మహా ప్రళయాన్ని సృష్టించిందని రికార్డు చేసాడు (Hemmingway 211).
ఈ ఉప్పెన వచ్చిన మర్నాడు ఇంజరంలో నివాసం ఉంటున్న ఇంగ్లీషు అధికారి తన పై అధికారులకు వ్రాసిన ఉత్తరంలో:
“ఉప్పెన వల్ల కోరంగి పట్టణం, చుట్టుపక్కల గ్రామాలు నేలమట్టం అయ్యాయి. బంధువులను కోల్పోయిన ప్రజలు అటూ ఇటూ పరుగులెడుతూ రోదిస్తూ తిరుగుతుండటం హృదయవిదారకరంగా అనిపిస్తుంది. నూతులు, చెరువులు ఉప్పునీటితో నిండిపోయాయి. ప్రజలకు తాగునీరు ఎక్కడా లభించడం లేదు. కనీసం ఇరవై వేల మంది ప్రజలు, అయిదు లక్షల పశువులు కనిపించడం లేదు. ఆహారనిల్వలు, పంటలు అన్నీ నాశనం అయ్యాయి”
అంటూ ఆనాటి ఉప్పెన విధ్వంసాన్ని వర్ణించాడు. ప్రపంచ యాత్రికుడు లాప్లాస్ తన పుస్తకంలో ఆనాటి విధ్వంసం గురించి ఇలా చెప్పుకొచ్చాడు:
"తుఫాను ఒక్క రోజులో విలయం సృష్టించింది. తాడెత్తు రాకాసి కెరటం కోరంగిపై విరుచుకుపడింది. ఇరవై వేలమంది ప్రజలు ఆ ఉప్పెనలో కొట్టుకు పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. తుఫాను ముగిశాక కోరంగి పోర్టు ఆఫీసరు ఇల్లు, ఓడలు నిలుపు స్థలము తప్ప సర్వం మట్టిలో కప్పబడిపోయాయి. అంతవరకూ ఇక్కడ అన్ని యూరోపియన్ దేశాలకు చెందిన వర్తక స్థావరాలు ఉండేవి. క్రీ.శ. 1787వ సంవత్సరంలో వచ్చిన ఉప్పెనకు ముందు కోరంగిలో ముప్పై వేల మంది నివసించేవారు. అనేక ఎత్తైన భవనాలు ఉండేవి. ఈ రోజు ఏమీ లేదక్కడ" ("కోరింగి").
క్రీ.శ. 1787వ సంవత్సరం నాటి ఉప్పెనకు కోరంగిలో నిలుపుచేసిన ఓడలు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో గల రాజమండ్రి వరకు కొట్టుకుపోయాయంటే ఎంత ఎత్తులో నీరు వచ్చిందో ఊహించుకోవచ్చు.
5.2. క్రీ.శ. 1839 నాటి తుఫాను
ఆ తర్వాత కాలంలో కోరంగిని రేవును అతలాకుతలం చేసిన అతి పెద్ద తుఫాను క్రీ.శ. 1839వ సంవత్సరం నవంబరు 16, 17 తారీఖులలో వచ్చింది. ఈ తుఫాను అండమాన్ నుంచి మొదలై తక్కువ వ్యాసంతో ఎక్కువ శక్తితో సుడులు తిరిగే గాలులతో కోరంగిని తాకిందని వాతావరణ శాస్త్రవేత్త హెన్రీ పిడ్డింగ్టన్ అభిప్రాయపడ్డాడు. ఈ రకపు తుఫానులకు సైక్లోన్ అనే పదాన్ని సృష్టించి వాడుకలోకి తీసుకొచ్చాడు (Piddington). ఆనాటి రాజమండ్రి కలెక్టర్ జార్జ్ స్మిత్ ఈ తుఫాను గురించి తన మాటలలో:
“16 వ తారీఖు ఉదయం నుంచీ గాలులు తీవ్రంగా వీచటం మొదలైంది. ఆ రాత్రికల్లా సముద్రం అనేక తీరప్రాంత గ్రామాలను ముంచెత్తింది. సుమారు ఐదు వేలమంది మరణించి ఉంటారని అనుకుంటున్నాను”
అంటూ తుఫానుపై తన తక్షణ రిపోర్టును పై అధికారులకు తెలిపాడు (Reid 99).
నవంబరు 27వ తారీఖు మద్రాస్ హెరాల్డ్ అనే పత్రిక ఈ తుఫాను గురించి ఇలా వ్రాసింది:
“పదహారవ తారీఖు రాత్రి పదకొండు గంటల నుండి గాలుల తీవ్రత పెరిగి ఉదయం 4 గంటల వరకూ బీభత్సాన్ని సృష్టించాయి. ఆ సమయంలో కోరంగిలో కాస్త ఎత్తులో ఉన్న ఒకే ఒక పెద్ద బిల్డింగు, ఇంకా మూడు నాలుగు చిన్న ఇళ్ళు మాత్రమే మిగిలాయి. సర్వం ఆ ఉప్పెనలో కొట్టుకుపోయాయి. సుమారు 20000 వేల మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల కుప్పలు భయానకంగా మారాయి. కోరంగికి దానికి నాలుగైదు మైళ్ల దూరంలో ఉన్న ఓనగాలో (Onagalo) ఆలయానికి మధ్య నివాస ప్రాంతాలన్నీ నిర్జనమయ్యాయి. (బహుశా చొల్లంగి ఆలయం కావొచ్చు). లైట్ హౌస్ లాంతరు, కాంతి ఫోకస్ అద్దం పగిలిపోయాయి” (ఆసియాటిక్ సొసైటీ జర్నల్ 410).
క్రీ.శ. 1839వ సంవత్సరం డిసెంబరు 7 వ తేదీ "బాంబే కొరియర్" అనే పత్రిక:
"నవంబరులో వచ్చిన తుఫాను కారణంగా యూరోపియన్, దేశీయుల ఇళ్ళన్నీ నేలమట్టం అయ్యాయి. కోరంగిలో నేడు చూడటానికి ఏమీ లేవు శిథిలాలు తప్ప. ఒక్క ఐదు ఆరు గంటలు మాత్రమే సాగిన విధ్వంసంలో సుమారు 20000 వేల మందికి పైగా మృతి చెందారు. ఎటు చూసినా మృతదేహాలు. పెద్ద పెద్ద ఓడలు నదిలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. వందలాది చిన్న పడవలు గల్లంతు అయ్యాయి."
అంటూ క్రీ.శ. 1839వ సంవత్సరం కోరంగి తుఫాను నష్టాన్ని రిపోర్టు చేసింది. క్రీ.శ. 1839వ సంవత్సరం కోరంగి తుఫాను ఉగ్రత, తీవ్రత, ప్రకృతి విలయం గురించి సమీప ఫ్రెంచి కాలనీ అయిన యానాం అధికారి కోలిన్ డే బార్ పాండిచ్చేరీ గవర్నర్‌కు వ్రాసిన లేఖలలో ఇలా తెలియచేశాడు:
"ఆ రాత్రి 11 గంటలకు తుఫాను గాలులు తీవ్రతరం కావటంతో ప్రజలు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలిపోవటం మొదలుపెట్టారు. నా అధికారిక నివాసంలోకి నీళ్ళు ప్రవేశించి చాలా రికార్డులు కొట్టుకు పోయాయి. నేను కూడా నా నివాసాన్ని విడిచి మన్యం వారి మేడపైకి చేరుకున్నాను. ఫ్రెంచి జెండాను ఎగరేసే జెండా స్థంభం మొదలులోకి విరిగిపడింది. యానాం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలలో సుమారు 130 నౌకలు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. అనేక వందల పడవల ఆచూకీ తెలియలేదు. కొంతమంది వ్యక్తులు, శవాలు తమతమ ఇళ్ళకు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ విసిరివేయబడ్డారు. నాలుగు వందల మంది తలదాచుకున్న ఓ ఇల్లు కూలిపోవటంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు" (బాబా).
కోరంగిలో వచ్చిన ఈ రెండు తుఫానులు ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైనవిగా, గరిష్ట స్థాయిలో నష్టాన్ని కలిగించిన వాటివిగా నేడు గుర్తిస్తున్నారు. క్రీ.శ. 1839వ సంవత్సరం కోరింగ తుఫాన్ (సైక్లోన్)లో మూడు లక్షల మంది చనిపోయారని, ఇది ప్రపంచ తుఫానులలో మూడవ అతి పెద్ద తుఫాను అంటూ అనేక ఇంటర్నెట్ సైట్లలో చెప్పబడుతూ ఉన్నది. కానీ ఈ సంఖ్యలకు సంబంధించిన సరైన చారిత్రక ఆధారాలు కనిపించలేదు.
6. కోరంగి: వలసలు సామాజిక మార్పు
గోదావరి జిల్లాలలో పద్దెనిమిదో శతాబ్దంలో ఆహారపంటలకు బదులుగా ఎక్కువ లాభాలను అందించే నీలిమందు, పత్తి, చెరకు, పొగాకు, మిర్చి, నువ్వులు వంటి వ్యాపార పంటలను సాగు చేసి వాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. అలా సంప్రదాయ వ్యవసాయంలో వచ్చిన మార్పు వలన ఆహారధాన్యాలకు కరువు ఏర్పడింది. వ్యవసాయ కూలీలకు పనులు లేక, తిండి లేక కోరంగి, కాకినాడ లాంటి రేవులలో కూలీలుగా మారి జీవనం సాగించేవారు. అనేకమంది కూలీలు ఇక్కడ విలయతాండవం చేస్తున్న కరువునుండి తప్పించుకోవడం కొరకు రంగూన్, మారిషస్, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయేవారు. అలా వెళ్లిన వారు కొందరు అక్కడే స్థిరపడిపోయారు. ఇలాంటి వలసలు క్రీ.శ. 1830వ సంవత్సరం నుంచి మొదలయ్యాయి. కోరంగి రేవునుంచి రంగూన్, మలేషియా, ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడిన వారిని అక్కడి స్థానికులు నేటికీ కొరంగీలు అని పిలుస్తారు. క్రీ.శ. 1850వ సంవత్సరం తరువాత బ్రిటిష్ అధికారి సర్ ఆర్ధర్ కాటన్ చే ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం జరగడం మూలంగా ఈ ప్రాంతంలో వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు తగ్గాయి. ఆ కాలంలో ఈ ప్రాంతవాసులు మెరుగైన అవకాశాల కొరకు, వ్యాపారం చేయడానికి రంగూన్ వెళ్ళేవారు. అలా వెళ్ళినవారిలో కోరంగి గ్రామానికి చెందిన శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ ఒకరు. వీరు రంగూన్ వెళ్లి వ్యాపారాలు చేసి సంపాదించిన ఎనిమిది లక్షల రూపాయిలతో కాకినాడలో క్రీ.శ. 1919వ సంవత్సరంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసారు. వారి ఆశయాలకు అనుగుణంగా నెలకొల్పిన MSN ఛారిటీస్ విద్యాసంస్థలు నేటికీ నడుస్తూ జిల్లాకి తలమానికంగా నిలిచి వన్నె తెచ్చాయి.
7. కోరంగి: సాంస్కృతిక ప్రభావాలు
7.1. గ్రామనామం, స్థలపురాణం
"త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నప్పుడు గోదావరి తీర ప్రాంతంలో కొంతకాలం నివసించారు. ఒకనాడు సీత ముచ్చట పడిన బంగారు కురంగమును (జింక) పట్టుకోవటానికి దానిని చాలాదూరము వెంట తరిమాడు. అది ప్రాణం విడిచిన ప్రాంతములో ఆ పిమ్మట ఒక గ్రామము ఏర్పడినది. దానిని కోరంగి అని ప్రజలు పిలుచుకుంటున్నారు." ఈ కథ కోరంగి గ్రామ నామానికి ఐతిహాసిక సంబంధాన్ని కల్పిస్తుంది. ఏడవ శతాబ్దంలో కోరంగి కురంగేశ్వరపురము పేరుతో ప్రఖ్యాతికెక్కిన పట్టణముగా ఉండెను (వీరభద్రరావు 24). నేడు కోరంగి సమీపములో ఉన్న తూరంగి వద్ద రాముడు ప్రతిష్టించినట్లు చెప్పబడే తురంగేశ్వర ఆలయము ఉంది. తురంగేశ్వర నామం కూరంగేశ్వరగా కాలానుగుణముగా మార్పు చెంది ఉండవచ్చు.
7.2. నౌకాయాన పండుగలు
తూర్పు తీరంపై నవంబరు నుండి జనవరి మధ్య ఉత్తరతూర్పు గాలులు బలంగా వీస్తాయి. భారతీయ పంచాంగం ప్రకారం ఈ రోజులు కార్తీకమాసంలో వస్తాయి. ఈ సమయంలో ఓడలు సరుకులు తీసుకొని తూర్పు దక్షిణ దేశాలకు వ్యాపార నిమిత్తం బయలుదేరేవి. ఓడలపై బయలుదేరి వెళ్ళే పురుషులకు వారి కుటుంబ స్త్రీలు తీరం వద్దకు వచ్చి ఆనందోత్సాహాలతో వీడ్కోలు చెప్పేవారు. తీరప్రాంతాలలో ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూ ఒక పండుగ వాతావరణం ఉండేది. నేటికీ కార్తీక పౌర్ణమి రోజున నౌకాయానంతో సంబంధం ఉన్న ఒరిస్సానుంచి తమిళనాడు వరకూ స్త్రీలు బొమ్మపడవపై దీపాన్ని ఉంచి నదులలోకి విడిచిపెట్టడం ఒక ఆచారంగా పాటిస్తారు. దీనిని ఒరిస్సాలో బాలియాత్రగా, తెలుగు తమిళ ప్రాంతాలలో ఈ పండుగను కార్తీక పౌర్ణమిగా పాటిస్తారు. తెలుగు ప్రాంతాలలో కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయతిగా వస్తుంది.
ఇదే విధంగా నీటిలో దీపం ఉంచిన పడవ బొమ్మలను విడువటం అనే ఆచారం మనవాళ్ళు వలస వెళ్లిన దేశాలలో, మనవాళ్ళు సముద్ర ఓడలలో వెళ్లి ఎక్కడైతే వ్యాపారాలు చేసేవారో అక్కడి దేశాలలో కూడా ఉండటం గమనార్హం. థాయిలాండ్ దేశంలోని స్త్రీలు నీటిలో బొమ్మ పడవలో దీపం ఉంచి విడిచే పండుగను లాయ్ క్రాతోంగ్ (Loykrathong) పేరుతో, బాలి దేశంలో మసకపన్ కే తుకద్ (Masakapan Ke Tukad) పేరుతో ఇప్పటికి జరుపుకొంటారు. ఈ సాంస్కృతిక సారూప్యతను వందల సంవత్సరాల క్రితం జరిగిన సాంస్కృతిక మార్పిడి (Cultural Exchange) అని అనుకోవచ్చు.
కార్తీక మాసంలో ఆడపడుచులు తమ సోదరులకు భగినీ హస్తభోజనం పేరుతో విందు ఏర్పాటు చేసే ఆచారం కూడా తెలుగునాట కనిపిస్తుంది. ఇది బహుశ వ్యాపారాల నిమిత్తం విదేశాలకు బయలుదేరుతున్న సోదరులకు శుభ కాంక్షలు చెప్పడం కొరకు లేదా ఎక్కువ ధనంతో తిరిగి వచ్చి తమకు మంచి బహుమతులు, కానుకలు ఇవ్వవలసి ఉంటుందని తమ బంధాలను అనుబంధాలను దృఢపరచుకోవడం, పదిల పరచుకోవడం బహుశా కావచ్చు. కారణమేదైనా ఈ పండుగలు నౌకలు సముద్రంలో ప్రయాణించే నెలలలో రావటం వెనుక ఉండే చారిత్రక కారణాలను విస్మరించలేం (బొల్లోజు బాబా, మిసిమి చింతనాత్మక సారస్వత మాస పత్రిక 68).
వ్యవసాయ ఉత్పత్తులు ఇంటికి వచ్చే కాలంలో సంక్రాంతి పండుగ జరుపుకోవడం లాంటి ఆచారం ఎలా ఐతే వచ్చి స్థిరపడిందో, తూర్పు తీరంలో నౌకా సముద్ర వ్యాపారాలు జరుపుకొనే ఈ కాలము కూడా పండుగల రూపంలో మన సంస్కృతిలో ఒక భాగమై స్థిరపడటం జరిగింది. ఈ పండుగలు ఒకనాడు ఈ ప్రాంతంలో జరిగిన నౌకా సముద్ర వ్యాపారాల అవశేషంగా భావిస్తారు.
7.3. కాళికాదేవి ప్రతిష్టాపన
శ్రీలంక నుంచి వచ్చిన కాళికాదేవి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శ్రీలంక వ్యాపారి అయినా సుందరం పిళ్లై దీన్ని తన ఓడలో జాఫ్నా నుండి తీసుకువచ్చినట్లు ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. క్రీ.శ. 1809వ సంవత్సరంలో శ్రీలంక నుండి సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువులను తెస్తున్న ఓడలో ఇది వచ్చింది అని చెబుతారు. కాళికాదేవిని తాళ్లరేవులో ప్రతిష్టించి ఆలయం కట్టారు, కొలుస్తున్నారు. క్రీ.శ. 1932వ సంవత్సరంలో వచ్చిన తుఫానులో ఈ ఆలయం శిథిలం కావడంతో తిరిగి ఇదే సంవత్సరం 1932లో పేమ్మడి తాత అబ్బాయి కాళికా ఆలయాన్ని పునర్నిమించారు.
8. కోరంగి: నేటి పర్యాటక కేంద్రం
8.1. మడ అడవులు వన్యప్రాణుల అభయారణ్యం
సముద్ర తీర ప్రాంతాల్లో సహజ రక్షణ గోడలుగా మడ అడవులు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అటువంటి గొప్ప సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉంది. జిల్లాలోని కోరంగి మడ అడవులు (Coringa Mangrove Forests) దాదాపుగా 235 చ. కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No-484 ద్వారా కోరింగను వన్యప్రాణుల అభయారణ్యముగా ప్రకటించింది (ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, వన్యప్రాణుల సంరక్షణ చట్టం). 5-7-1978 నాటి అటవీ గ్రామీణ అభివృద్ధి శాఖ నది ముఖ ద్వారం వద్ద మడ అడవులను సంరక్షించే ఉద్దేశ్యంతో కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ప్రకటించి అభివృద్ధి చేస్తున్నది. మడ అడవులు ప్రపంచంలోని ఉష్ణ మండలం ఇంకా ఉప ఉష్ణ మండల అంతర్వేది ప్రాంతాల ఉప్పు నీటి వృక్ష జాతుల అడవులు. ఈ అడవులు పర్యావరణ వ్యవస్థను కాపాడి జీవ వైవిధ్యాన్ని కాపాడుతాయి. ఇవి సాధారణంగా అధిక నీటిమట్టం ఇంకా సగటు సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల మధ్య రక్షిత తీరాలు, ప్రాథమిక నది ద్వారాలు, టైడల్ ట్విక్స్, బ్యాక్ వాటర్, సరస్సులు, చిత్తడి నేలలు, బురద నేలల వెంట ఉంటాయి.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నచోట మడ అడవులు రక్షిత తీర ప్రాంతాలలో విస్తృతమైన పెరుగుదల ఉండి గుబురు అడవులను వ్యాప్తి చేస్తాయి. మడ అడవులు వైవిధ్య జంతు జాతులకు ఆవాసాలుగా ఉండి అత్యంత ప్రత్యేకమైన మొక్కల సమూహాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడి జంతు జాతులు ఇతర సాధారణ ప్రదేశాలలో పరిస్థితులలో మనుగడ సాగించలేవు, పెరగజాలవు మడ అడవులలో తప్ప. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ, గోదావరి నదుల నది ముఖ ద్వారాలలో మడ అడవులు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 582 చదరపు కిలోమీటర్ల మడ అడవులను కలిగి ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో సహజ రక్షణ గోడలుగా మడ అడవులు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అటువంటి గొప్ప సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లా కాకినాడలో ఉంది. జిల్లాలోని కోరంగి మడ అడవులు (Coringa Mangrove Forests) దాదాపుగా 235 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మడ అడవులు, వివిధ రకాల జంతు, వృక్షజాతులను వీక్షించవచ్చు. ఇక్కడ చేపల్ని వేటాడే పిల్లి (ఫిషింగ్ క్యాట్), నక్క, ఈస్ట్యూరైన్ మొసలి, సముద్ర తాబేలు చూడవచ్చును. ఇక్కడ 35 రకాల మడమొక్కలు, 120 జాతుల అరుదైన పక్షులు, వివిధ జాతుల వృక్షాలకు నిలయం. ఈ అభయారణ్యంలో వైట్ బ్యాక్డ్ వల్చర్, లాంగ్ బిల్ట్ రాబందు, అట్టర్స్, సముద్ర చేపలు, చేపలు పట్టే పిల్లి, చూడవచ్చు.
8.2. పర్యాటక ఆకర్షణలు, సౌకర్యాలు
పడవలో ప్రయాణం కోరింగ అభయారణ్యంలో పక్షులను చూస్తూ, వాటి కిలకిల రావాల పాటలు వింటూ, నిర్మలమైన ప్రాంతంలో చెక్కల మీదుగా నడవవచ్చు. పడవలో ప్రయాణిస్తూ ఒడ్డున ఉన్న పక్షులను గుర్తించడం, సుందరమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అభయారణ్యంలో సిగల్ లు, ఫ్లెమింగోలు, పాండ్ హెరాన్, గ్రే కొంగ, ఇసుక పైపర్, చిన్న ఎ గ్రేట్స్, రెడ్ బాటిల్ ఆఫ్ వింగ్, బ్లూ కింగ్ ఫిషర్, పైడ్ కింగ్ ఫిషర్, బ్రాహ్మిణ్ణి కైట్స్, లిటిల్ కార్మో రెంట్, రిఫ్ హెరాన్, క్రో నెమలి, బ్లాక్ క్యాప్డ్ కింగ్ ఫిషర్, వంటి వివిధ పక్షులను చూడవచ్చు.
దేశంలో రెండో అతిపెద్ద మడ అడవులు కోరింగ మడ అడవులు. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ మడ అడవులు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే కోరింగ మడ అడవులు రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. అందంగా గుబురుగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతలు, ప్రకృతి వైపరీత్యాలనుంచి తీర ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల జలచరాలకు, జంతు సంపదకు అడవులు ఆశ్రయం. దాదాపు 60 వేల ఎకరాల్లో కోరింగ విస్తరించి ఉంది.
కోరింగ పర్యటనలో లైట్ హౌస్ చూడముచ్చటగా ఉంటుంది. కోరింగ లోని మడ అడవులలో వ్యూ పాయింట్ దగ్గర నిల్చోని చూస్తూ ఉంటే సముద్ర తీరం పచ్చని దుప్పటి పరుచుకున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రెండు మూడు రోజులు ఉండాలని ఉంటే సమీపంలోని చొల్లంగి పర్యటన ప్రాంతం వసతి గృహంలో బస చేయవచ్చు. అక్కడి నుండి బోట్ల పైన గంటన్నర ప్రయాణిస్తే బ్రిటిష్ కాలంలో నిర్మించిన లైట్ హౌస్ దగ్గరకు చేరుకోవచ్చు. అదేవిధంగా 18 కిలోమీటర్ల మేర విస్తరించిన హోప్ ఐలాండ్ పర్యాటకుల్ని కట్టిపడేస్తుంది. మడ అడవులను దాటి సముద్రంలో కొంచెం దూరం ప్రయాణిస్తే వచ్చే ఈ ఐలాండ్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ విహరించవచ్చు. మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి గాలం వేసి చేపలు పట్టొచ్చు. మొత్తంగా కోరింగ మడ అడవులు ప్రకృతి అందాలతో మరచిపోలేని మధురానుభూతిని పంచుతాయి. మడ అడవులలో ఉన్న లైట్ హౌస్ ఎంతో ప్రసిద్ధి గాంచింది. క్రీ.శ. 1847వ సంవత్సరం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మితమైన ఈ కట్టడం వర్తక వాణిజ్యానికి దిక్సూచిగా ఉండేది. దాదాపుగా 186 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అటవీశాఖ అధికారులు మళ్ళీ లైట్ హౌస్ కు పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తున్నారు. పర్యాటకులు సందర్శించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
కోరింగ అభయారణ్యంలో మీరు బస చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ వన విభాగం వారి వసతి గృహంలో ఉండవచ్చును. ఈ వసతి గృహంలో ఉండడానికి వన విభాగ పర్యాటక శాఖ వారు నిర్ణయించిన రుసుము రూపాయలు 1000 నుండి 1500 వరకు ఉంటుంది. మంచి సదుపాయాలతో కూడిన గదులు అందుబాటులో ఉన్నాయి. కోరింగ సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్-మే నెలల మధ్య చూడడానికి ఉత్తమ సమయం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శనకు అనుమతిస్తారు. మంగళవారాల్లో ఈ పర్యాటక ప్రదేశం మూసి వేయబడి ఉంటుంది. కోరింగను సందర్శించడానికి అనేక రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా కాకినాడకు చేరుకోవాలి. రైలు లేదా బస్సు మార్గాల ద్వారా కాకినాడకు చేరుకోవచ్చు. కోరింగకు ప్రయాణం కాకినాడ నుంచి కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి బస్సు, ఆటో లేదా ప్రైవేట్ వాహనంలో వెళ్ళవచ్చు.
ఉపసంహారం
- కోరింగ నౌక పట్టణం ప్రాచీన కాలం నుండి క్రీ.శ. 1839 వ సంవత్సరం వరకు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండి దేశ ఆర్థిక ప్రగతిలో భాగమైనది.
- అంతర్జాతీయ వర్తక, వాణిజ్య ప్రగతికి కోరింగ కేంద్రమై వెలిసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
- కోరింగి నాటి యువతకు ఎందరో మంది ప్రజలకు ఉపాధిని కల్పించి ప్రజల జీవనాన్ని మెరుగు పరిచే ఆశ దీపమై వెలుగులు నింపినది.
- పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యింది. మారెందరినో భాగస్వాములను చేసినది.
- భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైనది. భారత సంస్కృతి, ఆచార వ్యవహారాలను, బౌద్ధ మతము, వైదిక మతము, భాషా, సంస్కృతులను ఖండాంతరాలకు వ్యాప్తి చేసి భారత కీర్తిని ఇనుమడింప చేసింది.
- విదేశీ వర్తకులకు కేంద్రమై ఆశ్రయం కల్పించినది; వారి ప్రగతి మూలస్తంభం అయ్యింది.
- ప్రకృతి ప్రకోపానికి, తుఫానుకు, సముద్ర ఉప్పెనకు, రాకాసి అలలకు బలికాబడి సైకాతంలో సమాధి అయ్యి పతనం కావడం నిజంగా దురదృష్టం.
- కోరంగి సెమెటరీలో బ్రిటిష్ అధికారులకు చెందిన ఏడు సమాధులు ఉన్నట్లు List of Inscriptions on Tombs in Madras Vol II లో సమాచారం ఉంది. అవి William Clark (1802), A. Meris (1804), Alexander Woodcock (1816), John Eaton (1819), Charles Eaton (1827), William Charles Eaton (1857) వ్యక్తులవి. వీరు కోరింగలో కంపెనీ అధికారులుగా పనిచేసి ఇక్కడే గతించారు.
- 2009వ సంవత్సరంలో ఈ సమాధులను మొత్తం పెకలించి ఆ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిసింది. వాటిని విక్టోరియా సమాధులు అని స్థానికులు పిలుచుకొనేవారట. స్థానిక మాజీ సర్పంచి శ్రీ బుజ్జి గారి సహాయంతో అతి కష్టం మీద ఎవరో ఔత్సాహికుడు భద్రపరచిన ఒక సమాధి ఫలకం దొరికింది. దానిపై "Sacred to the memory of Alexander Woodcock, Esq, who departed this life on 19th May 1816, aged 46 and Mary Ann, his infant daughter, who died in March, 1810 aged 11 months" అని ఉన్నది.
- ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్ కోరంగి ఒక పెద్ద ఓడరేవుగా, నౌకా నిర్మాణ కేంద్రంగా వెలుగొందిన కాలంలో ఓడరేవు అధికారిగా పని చేసాడు (Master attendant). 1817వ సంవత్సరం నాటి Asiatic society Journal and Monthly Register లో ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్, లార్క్ అనే ఓడపై కోరంగినుండి మద్రాసు వెళుతూ దారిమధ్యలో చనిపోయాడని ఉంది. పైన చెప్పిన ఫలకం మద్రాసులో తయారైనట్లు క్రింద రాసి ఉంది. ఆ ఫలకంపై అలెగ్జాండర్ పేరుతో పాటు అంతకు ఆరేళ్ల క్రితం పదకొండు నెలల వయసులో చనిపోయిన అతని కూతురు Mary Ann పేరు కూడా ఉండటం గమనార్హం. బహుశా అలెగ్జాండర్ మిత్రులో, బంధువులో ఎవరో ఈ ఫలకాన్ని మద్రాసులో తయారు చేయించి ఆ తండ్రి కూతుర్ల జ్ఞాపకార్థంగా పాతించి ఉంటారు.
- 1915వ సంవత్సరంలో గోదావరి జిల్లా చరిత్ర వ్రాసిన హెమ్మింగ్ వే "నేడు సముద్రంలో తీరానికి ఒక మైలు దూరంలో జాలరుల వలలకు ఏవో నిర్మాణాలు తగులుకొంటున్నాయి, పాటు సమయంలో అనేక ప్రాచీన నాణాలు బయటపడుతున్నాయి, సముద్రం లోపల ఏదో మునిగిపోయిన పట్టణం ఉండే ఉంటుంది" అంటూ ఈ ప్రాంత ప్రాచీనతకు సముద్రాన్ని సాక్ష్యం చేస్తాడు. భారతదేశ చరిత్రలో జగజ్జేయమానంగా వెలుగొందిన ఒకనాటి కోరంగి, తుఫానులు, సునామీలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పదుల అడుగుల ఇసుక క్రింద కప్పడిపోయింది, కొంత సముద్రంలో కొట్టుకుపోయింది. ఏమో నేటి కోరంగి మట్టిపొరల క్రింద ఒకనాటి ఆంధ్రదేశ ఔన్నత్యాన్ని చాటే ఏఏ ఆధారాలు నిద్రిస్తున్నాయో! కానీ పైకి కనిపిస్తూ గత వైభవాన్ని సూచించే ఏ చిహ్నాలూ నేడు ఇక్కడ లేవు. సెమెటరీని కూడా ఇటీవలే పాడుచేసుకోవటం దురదృష్టకరం.
- ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద మన వైభవోపేతమైన నాగరికతకు నిదర్శనం.
- కోరింగ నౌక పట్టణ చారిత్రక వారసత్వాన్ని, చరిత్ర ఆనవాళ్లను కాపాడి, అవశేషాలను భద్రపరచి రాబోవు భావి తరానికి సురక్షితంగా అందివ్వ వలసిన అవసరం ప్రభుత్వము ప్రజల బాధ్యత.
- ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన విలువైన వారసత్వ సంపద క్రీ.శ. 1839వ సంవత్సరంలో వచ్చిన తుఫాను మూలంగా కోరంగి సైకాతములో నిక్షిప్తమై పరిశోధన ఆధారణకు నోచుకోకపోవడం శోచనీయం.
- కోరింగ ఒకప్పటి చారిత్రక వైభవము, వారసత్వ సంపద గల నౌక పట్టణము. వారసత్వ సంపదను వెలికి తీసే క్రమంలో చరిత్రకారుల పరిశోధనలు, పరిశోధక విద్యార్థుల పరిశోధన ప్రయత్నాలు అతి తక్కువ ఉన్నాయి.
- కోరింగ చారిత్రక వారసత్వ సంపదను వెలికి తీసే పరిశోధకులకు ఉత్సాహన్ని కలిగించే విధంగా ఔత్సాహిక పరిశోధన కార్యక్రమాలు నిర్వహించి తగు ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశోధన అవకాశాలు కల్పించి కోరంగి నౌక పట్టణంపై విస్తృత పరిశోధనలు ఇంకా జరిగే విధంగా చూడాలి.
- కోరంగి నౌక పట్టణంపై పరిశోధన చేసే ఔత్సాహిక పరిశోధకులకు ప్రభుత్వము, పరిశోధన సంస్థలు, చరిత్రపై మక్కువ ఉన్నవారు చొరవ చూపి ప్రోత్సాహకాలను ఇచ్చి విస్తృత పరిశోధన అన్వేషణలు గావిస్తే చారిత్రక, వారసత్వ సంపద చరిత్ర కాలగర్భం నుండి వెలికి తీస్తే అనేక విషయాలు ప్రపంచానికి తెలియపరచిన వారలము కాగము.
- కోరింగ ప్రకృతి పర్యాటకమును ఇంకా అభివృద్ధి పరచినట్లు అయితే ప్రభుత్వమునకు ఆదాయము రావడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జీవనం ఇంకా మెరుగు అవుతుంది.
కోరంగి ఒకప్పుడు వర్థిల్లుతున్న ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం, ప్రపంచ వాణిజ్యానికి ఒక ముఖ్యమైన గమ్యం. ఈ పట్టణం అనేక సహజ విపత్తులు, రాజకీయ మార్పులు, ఆర్థిక పరివర్తనలను చవిచూసింది. అయినప్పటికీ, దాని సాంస్కృతిక వారసత్వం మడ అడవులు, పర్యాటక ఆకర్షణల ద్వారా నేటికీ సజీవంగా ఉంది. కోరంగి గత వైభవం ప్రస్తుత ప్రాముఖ్యత భవిష్యత్ పరిరక్షణకు, విస్తృత పరిశోధనలకు స్ఫూర్తినిస్తున్నాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, G.O.Ms. No. 484. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 1978.
- బాబా, బొల్లోజు. ప్రెంచి పాలనలో యానాం. కాకినాడ, 2012.
- బాబా, బొల్లోజు. "యానాం ఆంధ్రలో ఎందుకు విలీనం కాలేదు?" మిసిమి చింతనాత్మక సారస్వత మాస పత్రిక, జులై 2012, పే. 68.
- వెంకట కృష్ణారావు, బావరాజు. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము. జాతీయ సారస్వత నిలయము, రాజమహేంద్రవరం, 1923.
- మనోహరి, బిన్నురి. "కాకతీయ శాసనాలు - సమగ్ర పరిశీలనం." డెక్కన్ ల్యాండ్ సామాజిక, రాజకీయం మాసపత్రిక, సెప్టెంబర్ 2022, పే. 29.
- మెకంజీ, కైఫియత్. కోరంగి కైఫియాత్.
- సుబ్రహ్మణ్యం శర్మ, సాదు. బంకోలా. పల్లవి పబ్లికేషన్స్, 2020.
- సీతారామయ్య, కర్రీ. భారత నౌకాపరిశ్రమ.
- వీరభద్రరావు, చిలుకూరి. ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము. ఆనందముద్రాక్షలయము, 1910.
- "చార్లెస్ ఈటన్, ఫార్మర్ పోర్ట్ మాస్టర్ కోరింగ." వేక్ ఫర్ ది మెలాన్‌కలీ షిప్‌రెక్ - ఆస్ట్రేలియన్ మారిటైమ్ హిస్టరీ.
- "కోరంగి…. మూగబోయిన సారంగి." ఆదివారం ఆంధ్ర జ్యోతి, 23 నవంబర్ 2014.
- ఏసియాటిక్ సొసైటీ జర్నల్. జర్నల్ ఆఫ్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. కలకత్తా, బిషప్స్ కాలేజ్ ప్రెస్, 1840.
- ఈటన్, చార్లెస్. ఫార్మర్ పోర్ట్ మాస్టర్ ఆఫ్ కోరింగ. వేక్ ఫర్ ది మెలాన్‌కలీ షిప్‌రెక్ - ఆస్ట్రేలియన్ మారిటైమ్ హిస్టరీ.
- ఫాస్టర్, విలియం. ది ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా 1618-1621: ఏ కాలెండర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ది ఇండియా ఆఫీస్, బ్రిటిష్ మ్యూజియం అండ్ పబ్లిక్ రికార్డ్ ఆఫీస్. లండన్, ఆక్స్‌ఫర్డ్ కాలెండర్ ప్రెస్, 1906.
- ఫాస్టర్, విలియం. ది ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా 1665-1667. ఆక్స్‌ఫర్డ్ కాలెండర్ ప్రెస్, లండన్, 1925.
- హెమ్మింగ్ వే, ఎఫ్.ఆర్. మద్రాస్ డిస్ట్రిక్ట్ గెజెట్టియర్స్, గోదావరి వాల్యూమ్ I. మద్రాస్, రీప్రింటెడ్ బై ది సూపరింటెండెంట్, గవర్నమెంట్ ప్రెస్, 1915.
- మెక్‌క్రిండిల్స్. ఏన్షియంట్ ఇండియా ఆఫ్ టోలెమి. ట్రూబ్నెర్ & కో, లండన్, 1885.
- మోరిస్, హెన్రీ. ఏ డిస్క్రిప్టివ్ అండ్ హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ ది గోదావరి డిస్ట్రిక్ట్. లండన్, ట్రూబ్నెర్ & కో., లుడ్‌గేట్ హిల్స్, 1878.
- ఫిప్స్, జాన్. ఏ కలెక్షన్ ఆఫ్ పేపర్స్ రిలేటివ్ టు షిప్ బిల్డింగ్ ఇన్ ఇండియా. పబ్లిష్డ్ స్కాట్, 1840.
- పిడ్డింగ్టన్, హెన్రీ. సైలర్స్ హార్న్-బుక్. విలియమ్స్ అండ్ నార్గేట్, హెన్రిక్ట్ స్ట్రీట్, లండన్, 1860.
- రీస్, జె.డి. నరేటివ్స్ ఆఫ్ టూర్స్ ఇన్ ఇండియా. మద్రాస్, పబ్లిష్డ్ బై ది సూపరింటెండెంట్, గవర్నమెంట్ ప్రెస్, 1891.
- రీడ్, విలియం. ది ప్రోగ్రెస్ ఆఫ్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది లా ఆఫ్ స్టామ్స్ అండ్ వేరియబుల్ విండ్స్. లండన్, పబ్లిష్డ్ జె. వీల్, 1849.
- షోఫ్, విల్ఫ్రెడ్ హెచ్. ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరత్రియాన్ సీ. లాంగ్‌మాన్స్ గ్రీన్ అండ్ కో. ఫోర్త్ అవెన్యూ అండ్ 30త్ స్ట్రీట్, న్యూయార్క్, లండన్, 1912.
- సెంట్, జార్జ్. డైరీ అండ్ కన్సల్టేషన్ బుక్ 1756. వాల్యూమ్ 85. (పబ్లిక్ డిపార్ట్‌మెంట్). ఫర్గాటెన్ బుక్స్, 2019.
- సెంట్, జార్జ్. లెటర్స్ టు ఫోర్ట్ 1681-1731. మద్రాస్ (ఇండియా స్టేట్) వాల్యూమ్ 20 (1731). ప్రింటెడ్ బై ది సూపరింటెండెంట్, గవర్నమెంట్ ప్రెస్, 1943.
- సెంట్, జార్జ్. లెటర్స్ టు ఫోర్ట్ 1752-53. మద్రాస్ రికార్డ్ ఆఫీస్ వాల్యూమ్ 33. లాగర్ స్ట్రీట్ ప్రెస్, 2021.
- వెంకట రమణారావు, ఎ.వి. ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 1766-1957. పాపులర్ బుక్ డిపో, 1958.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

