headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

6. కరుణశ్రీ కవిత్వం: సందేశం

డా. తలారి వాసు

సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9949294254, Email: vasutalari@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.08.2025        ఎంపిక (D.O.A): 28.08.2025        ప్రచురణ (D.O.P): 01.09.2025


వ్యాససంగ్రహం:

జంధ్యాల పాపయ్య శాస్త్రి 'కరుణశ్రీ' కలంపేరుతో సుప్రసిద్ధులు. తెలుగుబాల శతకం, పుష్పవిలాపం వంటి రచనలు ఆయనను పాఠశాల విద్యార్థులకు సైతం చేరువ చేశాయి. పద్య నాటకం, కథ, జీవిత చరిత్ర, నవలిక, అనువాద కావ్యం, వ్యాఖ్యానం, గేయం, శతకం ఇలా దాదాపు 80 గ్రంథాలు రచించి తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించారు. ఈ పరిశోధన కరుణశ్రీ కవిత్వంలో నిబిడీకృత సందేశాలను విశదపరచడం లక్ష్యంగా కొనసాగింది. ఆధునిక కవిత్వం కేవలం ఆనందం మాత్రమే కాక, సామాజిక ప్రయోజనాలు కూడా అందించాలి అన్న సిద్ధాంతానికి కరుణశ్రీ రచనలు చక్కటి ఉదాహరణలు. ప్రాచీన, ఆధునిక విమర్శకులు కవిత్వ ప్రయోజనాలు చర్చించిన తీరు పరిశీలిస్తూ, కరుణశ్రీ సందేశాత్మక ధర్మం నిరూపణ ఈ వ్యాసం ఆవశ్యకత. కరుణశ్రీ సమగ్ర రచనలపై డి.ఎస్వీ. సుబ్రహ్మణ్యం పీహెచ్డీ, డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు 'కరుణశ్రీ కవితాసౌరభం' వంటి పూర్వ పరిశోధనలు ఉన్నాయి. అయినా, ఆయన కవిత్వం లోతైన సందేశాలు విశ్లేషించే ప్రయత్నం ప్రస్తుత వ్యాసం చేపట్టింది. విషయసేకరణకు కరుణశ్రీ మూల రచనలు, వివిధ విమర్శనా గ్రంథాలు, మాసపత్రికల వ్యాసాలు ఆధారమయ్యాయి. పరిశోధనా పద్ధతి వివరణాత్మకం, విశ్లేషణాత్మకం. ఈ సాహిత్య విశ్లేషణ ఆయన కవితాఖండికలు, కావ్యాలను అధ్యయనం చేసింది. పరిశోధన ఫలితాలు ఆయన కవిత్వంలోని స్పష్టమైన సందేశాలను వెలికితీశాయి. కరుణశ్రీ తన తొలి కవిత 'పాకీపిల్ల'లో మానవత్వాన్ని, విశ్వప్రేమను చాటారు. అందరూ చీదరించుకునే పాకీపిల్లలో జగన్మాతను దర్శించి, ఆమె సేవలు సమాజానికి ఎంత ముఖ్యమో తెలియజేశారు. 'విజయశ్రీ' కావ్యం ద్వారా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించారు. మహాభారత నేపథ్యం ఉపయోగించుకొని ఆంగ్లేయుల పాలనలో బానిస జీవితం విడిచి, స్వేచ్ఛను ఆస్వాదించమని భారతీయులకు పిలుపునిచ్చారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో విద్రోహులను నిర్మూలించి, స్వతంత్ర భారత పతాకం ఎగురవేయాలి అని ప్రబోధించారు. 'కరుణశ్రీ' అనే స్వంత కావ్యంలో బుద్ధ భగవానుని జీవితగాథను ఇతివృత్తం చేసి, అహింసావాదం, దయాగుణం ప్రాముఖ్యతను నిరూపించారు. దేవదత్తుడు బాణంతో కొట్టిన హంసను సిద్ధార్థుడు రక్షించిన సంఘటన ద్వారా కరుణామయుడైన బుద్ధుని గొప్పతనం అద్భుతంగా చిత్రించారు. 'ఉదయశ్రీ' సంపుటిలో 'తెలుగుతల్లి' ఖండిక ద్వారా సుప్తమైన తెలుగుజాతిని జాగృతం చేసే వైతాళిక గీతాన్ని అందించారు. కాకతీయ, విజయనగర, పల్నాటి వీరుల చరిత్ర స్మరిస్తూ, ఆంధ్ర పౌరుషం తిరిగి నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 'పుష్పవిలాపం' ఖండిక పూల మౌనభాషను ఆవిష్కరిస్తూ, మానవుల స్వార్థాన్ని ప్రశ్నించి, జీవకారుణ్యం కలిగి ఉండాలి అని సందేశం ఇచ్చింది. 'అమర్ ఖయామ్' అనువాద కావ్యం ద్వారా జీవితం ఒక రంగస్థలంపై నటించే పాత్ర వంటిదని, భగవంతుడే సూత్రధారి అని తాత్విక సందేశం అందించారు. చైనా దురాక్రమణ లాంటి సమకాలీన దేశీయ సమస్యలపై సైతం ఆయన తన కవిత్వం ద్వారా విమర్శనాత్మక సందేశాలు అందించారు. ఈ విధంగా కరుణశ్రీ కవిత్వం సద్యఃపరనివృత్తితో పాటు లోతైన సామాజిక, తాత్విక సందేశాలను అందించినట్లు ఈ పరిశోధన తెలియజేస్తుంది. ఆయన సాహిత్య సేవ విస్తృతమైనది; భవిష్యత్ పరిశోధనలకు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి.

Keywords: కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఖండకావ్యాలు, సామాజిక సందేశం.

1. పరిచయం

తెలుగు బాలశతకం ద్వారా పాఠశాల పిల్లలకు సైతం పరిచయమైన కవి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాలశతకం, పుష్పవిలాపం, బుద్ధదేవుని పునరాహ్వానం వంటి కవితా ఖండికలతో విద్యార్థులకు ఆయన బాగా పరిచయమైన కవి.

తెలుగుదనమువంటి తీయందనములేదు
తెనుగు కవులవంటి ఘనులులేరు
తెనుగుతల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల తెలుగుబాల. (కరుణశ్రీ కావ్యమాల 8)

కరుణశ్రీ ఎన్నో రచనలు చేశారు. నన్నయ మహాభారత రచనలోని ఎనిమిది ఉపాఖ్యానాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ "ప్రసన్నకథావిపంచి" పేరుతో ప్రసిద్ధ రచయితలతో వ్యాఖ్యానాలు రాయించింది. అందులో రురూపాఖ్యానం, ఆస్తీకోపాఖ్యానం, అజగరోపాఖ్యానాలకు కరుణశ్రీ వ్యాఖ్యాన సౌరభాన్ని అందించారు. ప్రఖ్యాతమైన సంస్కృత శ్లోకాలకు, తెలుగు పద్యాలకు వ్యాఖ్యానాలనందిస్తూ "కళ్యాణకల్పవల్లి" తయారు చేశారు. గేయనాటికలు, ఖండకావ్యాలు, లలిత గీతాలు, నాటికలు, కావ్యాలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలు, బాలసాహిత్యం ఇలా 75 పుస్తకాలకు పైగా రాశారు కరుణశ్రీ. ఆయన శ్రీ సత్యసాయి భక్తులు. సత్యసాయీశ్వరునిపై ఎన్నో పద్యాలు రాశారు. అవి సనాతన సారథి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

మన దేశంపై చైనా దురాక్రమణ చేసిన సందర్భంలో చైనా వైఖరి గురించి కరుణశ్రీ చెప్పిన పద్యాన్ని ఒకసారి చూడండి.

మొదలే తానొక పిచ్చికోతి మరి నిప్పుల్ ద్రొక్కె కల్ ద్రావె
ఆ పిదపం తోకకు తేలుకుట్టె పయి నావేశించె నేభూతమో
అదిరా చెప్పెడిదేమి యాకలకలం బాపోకలాకేకలా
గదమాయింపులు దొంగ తంతులనుయాగల్లంతు లాగంతులన్ (స్ఫూర్తి మాసపత్రిక)

అసలే పిచ్చికోతి. నిప్పులు త్రొక్కింది. కల్లు తాగింది. తోకకు తేలు కుట్టింది. అంతేకాదు దెయ్యం పట్టుకుంది. ఇంక అది చేసే వీరంగం మామూలుగా ఉంటుందా? అలా ఉంది చైనా వ్యవహారం అని కవి ఉద్దేశం.

కరుణశ్రీ కవితా వైభవానికి సంతోషించిన సాహిత్య సంస్థలు "కవితా కళానిధి, కవికులాలంకార" బిరుదులను ఇచ్చి సత్కరించాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిని గౌరవ డి.లిట్ తో సత్కరించింది. తెలుగు అకాడమీ అందించిన పురస్కారం సహా సుమారుగా 20 పురస్కారాల్ని వారు అందుకున్నారు. శతాధిక సన్మానాలలో గౌరవాన్ని అందుకున్నారు.

తన రమణీయమైన కవితతో అర్థ శతాబ్ది పాటు తెలుగు ప్రజలను అలరించిన, ఆంధ్రావళి అధరాల మీద నర్తించిన మధురాక్షర చక్రవర్తి, సాహితీ మూర్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి.

2. సంస్కృతాంధ్ర కవిత్వంలో సందేశం

కవిత్వంలో సందేశం ధార్మికతతో మొదలై సామాజిక దృక్పథం వైపు ఎలా అడుగులు వేసిందో ఆచార్య వీరభద్రయ్య లోతుగా చర్చించారు (ముదిగొండ).

భారతి మాసపత్రికలో ఆచార్య సుదర్శనం ఇలా అన్నారు: "కవిత్వ ప్రయోజనం సందేశం, ఆనందం అని పాశ్చాత్య విమర్శకులు, హితం 'కాంతా సమ్మితం' అని మనవారు తేల్చిచెప్పే ఉన్నారు. ... భావ కవిత్వంలో (కాల్పనికవాద కవిత్వంలో) 'సందేశం, ఆనందం రెండూ ఉంటాయి. అనుభూతి కవిత్వంలో 'అనుభూతి' ద్వారా సిద్ధించే ఆనందమే ఉంటుంది, సందేశం ఉండదు!" (సుదర్శనం 40). ప్రాచీన, ఆధునికులు కావ్య ప్రయోజనాన్ని గురించి చర్చించిన దాన్ని బట్టి ఆధునిక కవిత్వంలో కూడా సందేశం ప్రధానాంశంగా కనిపిస్తుంది. సద్యఃపరనివృత్తితో పాటు సామాజిక సందేశాలను అందించే స్థాయికి ఆధునిక కవిత్వం చేరుకుందని చెప్పవచ్చు.

సాహిత్యం ఎందుకు అధ్యయనం చేయాలో తిరుమల శ్రీనివాసాచార్య ఇలా స్పష్టం చేశారు: "కావ్యం వల్ల కలిగే ఆరు ఉపయోగాలలో యశస్సు, ధనం, అనర్థనివారణం అనే మూడు ప్రధానంగా కవికి చెందుతాయి. ఆనందం, వ్యవహారజ్ఞానం, ఉపదేశం మిగిలిన మూడు సహృదయ పాఠకులకు చెందుతాయి. ... ప్రయోజనాలు ఎన్ని ఉన్నా, అవి ఏవైనా, కావ్య ప్రయోజనాలలో ఆనంద సందేశాలు ప్రధానమైనవిగా భావించవచ్చు. ఈ రెండిటిలోనూ ఆనంద ప్రదానత్వమే ప్రధానం; ఉపదేశం ఆనుషంగికం (అంటే అప్రధానం) అని లాక్షణికులు అంగీకరించారు. సహృదయ పాఠకునికి ఆనందానుభూతిని కలిగించి, అతణ్ని క్రమంగా కర్తవ్యోన్ముఖుని చేయగల్గడమే కావ్యానికి పరమ ప్రయోజనం. ఆనంద సంధానమే కవిత్వ ధర్మం. ఈ రెండు ప్రయోజనాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి" (శ్రీనివాసాచార్య 12).  ఈ విధంగా ఈ రెండు సందేశాత్మక ధర్మాలను కరుణశ్రీ సాహిత్యంలో కనిపించేలా వెలికితీసి, ఈ వ్యాసంలో పరిశీలించి, సోదాహరణంగా వివరిస్తాను.

3. పూర్వ పరిశోధనలు

కరుణశ్రీ సమగ్ర రచనలపై 1980లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజమండ్రి నివాసి డి.ఎస్వీ. సుబ్రహ్మణ్యం పీహెచ్డీ పరిశోధన చేశారు. ఇదికాక ఎం.ఫిల్స్, కావ్య సమీక్ష గ్రంథాలు ఎన్నో వచ్చాయి. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు "కరుణశ్రీ కవితా సౌరభం" పేరుతో విమర్శ గ్రంథాన్ని ప్రచురించారు.

4. కరుణశ్రీ కవిత్వంలో సందేశాత్మకత

కరుణశ్రీ కవిత్వంలో సందేశం ప్రతి పద్యంలో తొణికిసలాడుతూ ఉంటుంది. ఖండకావ్యాలలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే-

4.1. ఖండకావ్య రచన: ఒక ప్రత్యేకత

"ఏక వాక్యత అంతస్సూత్రంగా ఖండకావ్యాల సంపుటినే మహాకావ్యంగా మలిచి మెప్పించిన పద్యకవిత్రయం పింగళికాటూరులు, విశ్వనాథ, కరుణశ్రీ. వచన కవితా కవిత్రయం - గుంటూరు శేషేంద్రశర్మ, సి. నారాయణ రెడ్డి, కె. శివారెడ్డి. కరుణశ్రీ ఒక కొమ్మకు పూచిన చిటారిపువ్వు!" (సుబ్రహ్మణ్యం 125) అని సుబ్రహ్మణ్యం ఖండకావ్య రచనలో కరుణశ్రీ ఏ కోవకు చెందినవారో వక్కాణించారు. అలాంటి ఖండికావ్యాలలో సందేశాన్ని పరిశీలిద్దాం.

4.2. పాకీపిల్ల: మానవత్వ విలువలు

గాంధీ మహాత్ముని ప్రభావంతో పాపయ్య శాస్త్రి తమ 16వ ఏట 1928లో రాసిన పద్య ఖండిక "పాకీపిల్ల." ఒక చేత చీపురు, ఒక చేత చింపిరి గంప పట్టుకొని, అసహ్యం అనేది లేకుండా తన దినచర్యను పరమ పవిత్రంగా నిర్వహించే పాకీ పిల్లను చూచి ఆర్ద్ర హృదయంతో పలికిన కవిత్వమిది. కరుణశ్రీగా పరివర్తన పొందుతున్న సమయంలో, హృదయ సాగర మథనంలో నుంచి ఆవిర్భవించిన తొలి కవిత ఇది. పాకీ పిల్లను కావ్య నాయికను చేసి, ఆమె వ్యక్తిత్వానికి నివాళులర్పించి, విశ్వప్రేమను చాటారు. పాకీపిల్లకు విశ్రాంతి, సాంత్వనం దొరికింది కరుణశ్రీ చల్లని కవిత్వంలోనే. అందరూ చీదరించుకుని, అసహ్యించుకునే పాకీపిల్లలో జగన్మాతను దర్శించారాయన.

ఆకల్పాంతము నీ పవిత్ర దినచర్యన్ నిత్య నిర్నిద్ర వి
శ్వైక ప్రేమ మహాగమమ్మునకు "తూచా"పోని వ్యాఖ్యానముల్
"
పాకీదానిగ" నాడిపోసికొను ఈ పాపిష్ఠి లోకమ్ము నీ
"
బాకీ" తీర్చుకొనంగ లేదు జగదంబా! జన్మజన్మాలకున్. (కరుణశ్రీ కావ్యమాల 17)

నగర సౌందర్యానికి, సమాజ శ్రేయస్సుకు పాకీపిల్ల సేవలు గణనీయమైనవి. ఒక్క రోజు కనుక ఆమె వీధుల్ని ఊడ్వకపోతే పట్టణాల సొగసు ఎంత గొప్పదో బయటపడుతుంది. "పాకిదేగద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ!" అని కవి ఆమెలో తల్లిని దర్శించి ఆమెకు అంజలి ఘటిస్తారు.

కవితా మహాప్రపంచంలో కరుణశ్రీ ఒక తేజోవంతమైన కిరణశ్రీ. పుష్పవిలాపం, సాంధ్యశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అమర్ ఖయ్యాం వంటి మహాకావ్యాలకు తోడు మరికొన్ని కవితామృత కలశాలు కరుణశ్రీ కలం నుండి జాలువారగా ఘంటసాల గళం నుండి గానామృతమవ్వడం తెలుగు రసజ్ఞుల పుణ్యఫలం. అందులో పుష్పవిలాపం ఖండికను ఘంటసాల వారు పాడిన సందర్భంలో ఆ రోజుల్లో పూల మొక్కల దగ్గరకు వెళ్లి పూలు కోయకుండా తిరిగి వచ్చిన సందర్భాలు చాలా తెలుగు ప్రజల జీవితాల్లో జరిగాయంటే ఆ ఖండిక ఎంత ప్రభావాన్ని చూపించిందో, గానం చేసిన ఘంటసాల, రచన చేసిన పాపయ్యశాస్త్రి ప్రజల హృదయాల్లో మమేకమై "ఘంటసాల పాపయ్యశాస్త్రి"గా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయట. సినిమా నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు అయితే ముచ్చటపడి తమ అమ్మాయిలకు విజయశ్రీ, ఉదయశ్రీ అని పేర్లు పెట్టుకున్నారట. అక్కినేని నాగేశ్వరావు ఒక సందర్భంలో "మనసు బాగా లేనప్పుడు కరుణశ్రీ పద్యాలు చదివినా, విన్నా హాయిగా ఉంటుంది" అన్నారట.

తెలుగు పద్యాన్ని రమణీయంగా, కరుణాత్మకంగా నడిపిన కవి ఆయన. ఉదాత్తభావం, ఉజ్వల పదం అద్వితీయంగా సాగిపోయే పద్య శైలి కరుణశ్రీ కలం ప్రత్యేకత. ఆయన కలంపేరు కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆయన అసలు పేరు. పుట్టింది గుంటూరుజిల్లా కొప్పర్తి (4.8.1912), పెరిగింది కొమ్మూరు. సంస్కృతాంధ్ర హిందీ భాషల్లో ప్రవీణులు. కుప్పా ఆంజనేయశాస్త్రి, భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ వంటి ఉద్దండ పండితుల దగ్గర వ్యాకరణ కావ్యాలంకార శాస్త్రాలు అభ్యసించి ఎనిమిదేళ్లు ఉన్నత పాఠశాలల్లో, పాతికేళ్ల పైబడి కళాశాలల్లో గుంటూరులోనే విశేషమైన అధ్యాపక సేవలు అందించారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన పోతన భాగవతం ప్రాజెక్టుకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. బహుశా కరుణశ్రీ చేపట్టని కవితా ప్రక్రియ లేదనవచ్చు. పద్యం, నాటకం, కథ, జీవిత చరిత్ర, నవలిక, అనువాద, ఉదాహరణ కావ్యం, వ్యాఖ్యానం, గేయం, శతకం ఇలా అన్ని ప్రక్రియల్లో సుమారుగా 80 గ్రంథాలు వారు రచించారు. అన్ని రచనలు ప్రచురణలోకి వచ్చి ఆంధ్రదేశంలో అందరినీ ఆనందింపజేశాయి. రచనలు కాక ఆయన ఉపన్యాసాలు సమకాలీన సమాజాన్ని ఉర్రూతలూగించాయి.

4.3. విజయశ్రీ: జాతీయోద్యమ స్ఫూర్తి

ఎన్నిసార్లు చదివినా తనివి తీరని గ్రంథం మహాభారతం. అందులోని అనేక అంశాలు వివిధ కావ్యాలుగా, కవితా ఖండికలుగా తిరిగి ఆధునిక సాహిత్యంలో రచింపబడ్డాయి. అది కేవలం కౌరవ పాండవ ఇతిహాసం కాదు. వీర భారత గాథ. కరుణశ్రీకి భారతం గురించి పాఠం చెప్పే రోజుల్లోనే కుప్పా ఆంజనేయ శాస్త్రి అర్జునుని మీద విశేషమైన ఆధరాభిమానాన్ని కలిగించారట. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు కరుణశ్రీలో ప్రతిధ్వనించిన "ఆతడజాతశత్రుడు మహాత్ముడు శాంత తపస్వి" అన్న హృదయ స్పందనను గుర్తించి ఆ రాత్రే "విజయశ్రీ" అంకురార్పణ జరిపించారట కరుణశ్రీ మిత్రులు నండూరి రామకృష్ణమాచార్యులు. విజయశ్రీ వీరరస ప్రధానమైన కావ్యం. ధర్మాధర్మాల పోరాటం. చివరికి ధర్మమే జయిస్తుంది. ఇది మహాభారత రచనగా పైకి కనిపిస్తుంది గాని, అంతర్లీనంగా అద్భుతమైన జాతీయోద్యమ రచన ఇది. 1980 ప్రాంతాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకు విజయశ్రీ పాఠ్యగ్రంథంగా ఉంది. మహాభారతం మానవ ఇతిహాసం. జాతీయోద్యమ నేపథ్యాన్ని భారత ఇతిహాసానికి ముడిపెడుతూ మంత్రాలోచనము, స్కంధావారము, విషాదము, ప్రబోధము, విజృంభణము అని ఐదు శీర్షికలుగా రచించారు. ఒక ప్రక్క స్వాతంత్ర్య కాంక్ష నాలుకలు చాచుకొని ఆవేశంతో అనర్గళంగా ముందుకు తోసుకొని వస్తుంటే, మరో ప్రక్క స్వార్థపరత్వం, సామ్రాజ్యతృష్ణ మేడలు కట్టుకొని, గోడలు పెట్టుకుని తలుపులు బిగించుకొని కూర్చుంటుంది. కురు ప్రభువు గురించి "అదెక్కడి రక్కసి రాజ్యకాంక్షయో!" అన్నారు. ఈ మాట ఆంగ్లేయుల గురించే.

శ్రీకృష్ణుని చేత మాతృ సందేశాన్ని ఇప్పిస్తూ...

స్వచ్ఛంద ప్రియ భావి జీవన సుధాస్వాదంబు గావింతురో!
స్వేచ్ఛా లక్ష్మికి స్వస్తి చెప్పి పరులన్ సేవించి జీవింతురో!

స్వేచ్ఛ అనే అమృతాన్ని ఆస్వాదించాల్సింది భారతీయులు. ఆంగ్లేయులను సేవిస్తూ బానిస జీవితాలను ఎన్నాళ్లు కొనసాగించాలని కవి ప్రశ్న. లెమ్ము ధనంజయా! తల్లి పిలుపు వినరా! శంఖము పూరింపరా! అని శ్రీకృష్ణుని చేత విజయునికి మంత్రణం (కౌన్సిలింగ్) ఇప్పించారు. ఇక్కడ విజయుడు భారతీయుడు. అందుకని...

ధర్మక్షేత్రము, క్షాత్ర మండల పవిత్రమ్మో "కురుక్షేత్ర"మున్
కర్మక్షోణి స్వధర్మ నిర్వహణ దీక్షందాల్చి విద్రోహులన్
నిర్మూలించి "స్వతంత్ర భారత భవానీ వీర సంతానమై"
మార్మ్రోగింపుము దిగ్దిగంతముల యుష్మద్దేవదత్తధ్వనుల్ (కరుణశ్రీ కావ్యమాల 59)

దేవ దత్తాన్ని పూరించాలి. స్వాతంత్ర్య పోరాట ఉద్యమ శంఖారావాల్ని జాతి ప్రజలకు వినిపించాలి. భారతీయులందరిలో జాతీయోద్యమ స్ఫూర్తిని నింపాలి. అది అన్ని దిక్కులకు ప్రసరించాలి. ఇది ధర్మక్షేత్రం. ధర్మ యుద్ధం. ధర్మమే జయించాలి. విద్రోహాల్ని నిర్మూలించాలి. దేశభక్తులు, పోరాట యోధులు స్వతంత్ర భారతమాతకు వీరసంతానంగా నిలవాలి. నిద్రాణమైన భారత జాతికి నవనవోన్మేషాన్ని చేకూర్చాలి. స్వతంత్ర భారత పునర్నిర్మాణం జరగాలి. మూడు రంగుల భారత జాతీయ పతాకం రెపరెపలాడాలి.

జెండా జాతికి జీవగఱ్ఱ! సమతాచిహ్నమ్ము! సర్వస్వమీ
జెండా వంపు సహింపజాలని శిరశ్చేదమ్ము; లే లెమ్మికన్
జెండాడన్ వలె శాంతి ఘాతుకుల! జేజేలెల్ల జేజేలతో
గొండాడన్ వలె విశ్వవిశ్రుత భవత్ కోదండ పాండిత్యముల్. (కరుణశ్రీ కావ్యమాల 60)

దానికి విజయుడైన భారతీయుడు లేచి నిలబడి ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సంపత్తికి స్వస్తిచెప్పి "నవభారత వీరపతాకనెత్తెదను" అంటాడు.

విజయశ్రీ కావ్యం 'ఐనవి సంధి సంబరములు...' అని మొదలవుతుంది. స్వాతంత్ర్య పోరాటానికి జాతి ప్రజలంతా ఏకోన్ముఖం కావాలి. అందుకు జాతీయోద్యమ ప్రబోధం కావ్యమంతా అంతర్లీనంగా నిండి ఉంటుంది. కావ్యంలో చివరి పద్యం 'శ్రీమంతంబగుగాక భారతము...' అని పూర్తవుతుంది.

భారతీయుడైన పార్థుడు గాండీవాన్ని ఎక్కుపెట్టి సమరానికి సిద్ధమయ్యాడు. మహాత్ముడైన మధుసూదనుడు రథాన్ని ముందుకు కదిలించాడు. ఉద్యమ పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆ జగన్నాథ రథ చక్రాలు ముందుకు పరిగెత్తుకు పోతున్నాయి. తప్పదు ధర్మమే జయిస్తుంది, నరుడు విజయుడౌతాడు. విజయశ్రీ వీరగీతాలతో భారతమాతకు నీరాజనాలనిస్తుంది.

4.4. కరుణశ్రీ (కావ్యం): అహింసా సిద్ధాంతం

కరుణశ్రీ కావ్యం దయాసంపదకు నిలయం. ప్రపంచం కరుణామయం. కవి "బుద్ధుడు నా ప్రభువు. నా ప్రేమ మూర్తి. నా ఆశాజ్యోతి. నా ఆరాధ్య దైవం" అన్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ మహాశయుడు బుద్ధుని చరిత్రను 'లైట్ ఆఫ్ ఆసియా'గా రచించారు. తిరుపతి వేంకట కవులు బుద్ధ చరిత్రగా, పింగళి కాటూరి కవులు సౌందర్యనందంగా రచిస్తే పాపయ్య శాస్త్రి కరుణ రస నిష్యందంగా కరుణశ్రీ కావ్యాన్ని రచించారు. కరుణశ్రీ అంటే బుద్ధుడని కవి నిర్వచనం. శ్రీ రామచంద్ర శుక్లజీ "బుద్ధచరిత్", అనూపశర్మాజి "సిద్ధార్థ" ఈ కావ్యరచనకు కవికి దోహదం చేశాయి.

బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీ అంధకార బంధురమైన ప్రపంచంలో అహింసా జ్యోతి వెలిగించిన అమరమూర్తులు. అఖండమైన త్యాగంతో, అనన్య సామాన్యమైన ఆత్మార్పణతో, అచంచలమైన కర్తవ్య దీక్షతో విశ్వాన్ని పులకింపజేసిన త్రిమూర్తులు. బుద్ధుని కన్నుల్లోని అశ్రుధార, క్రీస్తు గుండెల్లోని రక్తధార, గాంధీజీ కంఠంలోని అమృతధార కలిసి జగత్ కాలుష్యాన్ని కడిగి మానవ జాతిని పునీతం చేశాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో అహింసా సిద్ధాంతం కొత్త వెలుగు దారులు చేసుకుని అవతరించింది. గాంధీ యుగంలో అహింస చైతన్య రూపం దాల్చింది. నవ్య భారత జాతీయ పతాకంపై బుద్ధ భగవానుని ధర్మచక్రం సాక్షాత్కరించింది. బుద్ధచరిత్రమే కరుణశ్రీ కావ్య పరమార్థం.

ఈ కావ్యానికి నండూరి రామకృష్ణమాచార్యులు ఉపశ్రుతినిస్తూ కవి గురించి ఇలా రాశారు: "చాలామంది కవులు లలితంగా వ్రాస్తారు. మరి కొందరు మనోజ్ఞతను సాధిస్తారు. ఎవరో అద్భుతత్వాన్ని ఆవిష్కరించుకుంటారు. కానీ విశ్వ సాహిత్య ప్రపంచంలో ఉదాత్తతను ఉపాసించి సిద్ధహస్తులైన వారు వేలిమీద లెక్కపెట్టదగినవారు. అందులో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒకరు."

రాగమయమైన ప్రకృతి సామ్రాజ్యమందు
ప్రతి పదంబును రసవైభవమ్ము నిలుచు
రసమయంబైన సుకవి సామ్రాజ్యమందు
ప్రతిపదంబున రాగసంపదలు నిలుచు (కరుణశ్రీ కావ్యమాల 8)

కరుణశ్రీ కావ్యంలోని "అనుకంప" ఖండికలోని పద్యమిది. చదివిన పద్యాన్ని తిరిగి చదివేలోగా తగిలే విద్యుద్ఘాతం పఠితను మరో ప్రపంచంలోనికి తీసుకొని పోయి భావితాంతఃకరణ ప్రవృత్తిని కల్పిస్తుంది.

దేవదత్తుడు బాణంతో కొట్టిన హంసను సిద్ధార్థుడు రక్షించాడు. హంస తనదంటాడు దేవదత్తుడు. దాని ప్రాణం నిలిపి కాపాడాను కాబట్టి ఇది నాదంటాడు సిద్ధార్థుడు. రాచకొలువులోకి వెళ్ళింది ఈ వివాదం. కొలువులోని ధర్మమూర్తులు రత్నపీఠంపై హంసనుంచి దానికి కొద్ది దూరంలో అటు ఇటు సిద్ధార్థ దేవదత్తులను ఉంచారు. ఇద్దరినీ పిలువమన్నారు. దేవదత్తుడు 'ఖగమా! యిటురా! యిటురా!' అని కటుక రవాలతో, చటుల స్వరంతో పిలిచాడు.

ఆతని రూపుగాంచి భయమందెనొ! టక్కరి చూపు గాంచియే
భీతిలెనో! కరాన కనిపించు ధనుస్సునకున్ మనస్సుతో
గాతర భావముంగనెనొ గాని! నృశంసు స్పృశింపబోని సం
గీతముభంగి వెన్క కొదిగెన్ కలహంసము కుంచితాంసమై. (కరుణశ్రీ కావ్యమాల 90)

దేవదత్తుడు భక్షకుడు. అందుకని హంస భయపడింది. అదిగో రక్షకుడు చందమామరావె, జాబిల్లి రావె అన్నట్టుగా అమ్మ లాలిత్యంతో గౌతముడు ఇలా పిలిచాడు.

చెల్లిరావె! మంచిమల్లిరావే! కల్ప
వల్లిరావె! పాలవెల్లి రావె!
చక్కదనములీను చక్కదనాల జా
బిల్లిరావె! అంచతల్లి రావె! (కరుణశ్రీ కావ్యమాల 90)

రివ్వుమని రాయంచ సిద్ధార్థుని హస్తాంచలముల మీద వ్రాలింది. సభలో జయజయ నినాదాలు వినిపించాయి. ఈ కావ్యంలో పాపయ్య శాస్త్రి అహింసావాదాన్ని సముచితంగా నిరూపించారు. కరుణామయుడై అహింసా జ్యోతిని వెలిగించి మానవ లోకంలో వెలుగు వెల్లువలు విరబూయించిన బుద్ధుని జీవిత గాథను ఇతివృత్తంగా తీసుకుని "కరుణశ్రీ" పేరుతో ఒక మనోజ్ఞ కావ్యాన్ని చిత్రించారు.

4.5. ఉదయశ్రీ: తెలుగుజాతి ప్రబోధం

ఆయన కవిత్వం వలె నిత్యజీవితం కూడా ఒక మధుర మనోజ్ఞ కావ్యం. అందువల్లనే కరుణశ్రీకి తమ హృదయాలలో వెన్నెల దేవళాన్ని కట్టి ఆరాధించిన సమకాలీనులున్నారు. పదలాలిత్యం, శయ్యా సౌకుమార్యం, సనాతన వైదిక సౌశీల్యవర్చస్సు, సాహితీ సమారాధన, ప్రియభావుకత్వం కరుణశ్రీ సహజ లక్షణాలు. 160 ఖండికలతో 5 భాగాలుగా "ఉదయశ్రీ" రచించారు. "ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం. నా హృదయంలో ఒక ఉదయశ్రీ" అన్నారు. సుప్తమైన తెలుగు జాతిని జాగృతం చేయడం కోసం సుప్రభాతంగా వైతాళిక గీతాన్ని "తెలుగుతల్లి" ఖండికగా రచించారు.

సీ. కనిపింపదే నేడు! కాకతీయ ప్రాజ్ఞ సామ్రాజ్య జాతీయ జయపతాక
వినిపింపదే నేడు! విద్యానగర రాజ సభలోని విజయదుందుభుల మ్రోత
చెలగదే నేడు! బొబ్బిలికోట బురుజుపై తాండ్ర పాపయ తళత్తళల బాకు
నిప్పచ్చరంబయ్యెనే నేడు! వీర పల్నాటి యోధుల సింహనాదలక్ష్మి
చెక్కుచెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడధ్వాన్నమయ్యె
మరలనొక మాటు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ! బిడ్డల, తెలుగుతల్లి! (కరుణశ్రీ కావ్యమాల 103)

పద్యాన్ని మాటగా, పాటగా, సూక్తిగా, స్ఫూర్తిగా మలచిన చతురులు కరుణశ్రీ. తెలుగు జాతి జీవనాడి స్పందించే తీరు పోతన తరువాత కరుణశ్రీ కవిత్వంలోనే కనబడుతుందని పండితుల ప్రశంసలందుకున్న కవి వతంసులు కరుణశ్రీ. కవిత్వం ఎలా ఉండాలో తెలుపుతూ 21 పాదాల ఉత్పలమాలికను కూడా రాశారు.

"ఉదయశ్రీ"లో పుష్పవిలాపం, అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, కుంతీ కుమారి వంటి ఖండికలు హృద్యమైన పద్య రచనకు ఉదాహరణలు. భావకవితా శాఖలో విశేషంగా కనిపించే ఆత్మాశ్రయ రీతికి ఉదాహరణ పుష్పవిలాపం ఖండిక. పుష్పాల మౌనభాషను పద్యాలలో ఆవిష్కరించారు. ఆయువు కలిగిన నాలుగు గడియలు కనిపెంచిన తీవ తల్లి చెంతనే ఉండి, ఆ ఆయువు తీరగానే తల్లి పాదాల దగ్గర పడి ఉండే మమ్మల్ని గొంతులు కోసి తీసుకుని వెళ్లి భగవంతునికి సమర్పిస్తే మీకు మోక్షం ఎలా వస్తుందని పుష్పాలు తమను కోసుకునేందుకు వచ్చిన భక్తుణ్ణి ప్రశ్నిస్తాయి. అవి పలికే ప్రతి మాటకు కవి మనసు తల్లడిల్లుతుంది. కవి ఏ సమాధానాన్ని ఇవ్వలేకపోతాడు. ఊలు దారాలతో గొంతులకు ఉరిబిగించి గుండెల్లోంచి సూదులు గ్రుచ్చి దండలుగా చేసుకునే మీకు అలంకారమే ముఖ్యంగాని మా వేదన అర్థంకాదా అని ప్రశ్నిస్తాయి. వెలకట్టలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితం పుష్పాలది. మానవుల కోసం త్యజించి, కృశించి, నశించిపోతున్నామని వేదన చెందాయి. బుద్ధ దేవుని భూమిలో పుట్టిన మీకు సహజమైన ప్రేమ ఎందుకు చచ్చిపోయిందని ప్రశ్నించాయి. భక్తుడైన కవి పుష్పాలకు ఏ సమాధానం చెప్పకుండానే వాటిని కోయకుండానే తిరిగివచ్చి భగవంతునికి ఈ వృత్తాంతాన్ని నివేదించడం ఈ ఖండికలోని ఇతివృత్తం. హిందీలో కూడా అనేకమంది కవులు పుష్పాల గురించి కవిత్వాన్ని అల్లినా హృదయాన్ని కదిలించిన ఖండిక కరుణశ్రీది.

మనతో కవి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది కరుణశ్రీ పద్య కవిత్వం. అవి పద్య పాదాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చిత్రం కంటికి కనిపిస్తున్నట్లు ఉంటుంది. కవిత్వాన్ని బొమ్మ కట్టించడం అంటే ఇదేనేమో. కవిత్వంలో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కవి ఒక చిత్రంగా రూపు కట్టిస్తాడు. కుంతీకుమారి ఖండికలోని ఈ పద్యం చూడండి.

అది రమణీయ పుష్ప వనమావనమందొక మేడ,మేడపై
నదియొక మారుమూలగది, ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జం
కొదవెడి కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్. (కరుణశ్రీ కావ్యమాల 51)

ఈ పద్యం ఒక చలచ్చిత్రం. కవి కూడా మనతోనే ఉన్నాడు. కుంతీ కుమారి మెట్లు దిగిరావడం తాను మనతోనే కలిసి చూస్తున్నట్లుగా కలం కుంచెతో ఖండికను చిత్రించారు కవి. ఈ మూడు ఖండకావ్యాలు అద్భుతమైన రస రంజితమైన పద్య నిధులు. విజయశ్రీ ఆయన శీర్షం. ఉదయశ్రీ ఆయన హృదయం. కరుణశ్రీ ఆయన జీవితం.

4.6. అమర్ ఖయామ్: తాత్విక చింతన

ఉమర్ ఖయ్యాం రుబాయిల్ని రాయప్రోలు వారు "మధుకలశం", దువ్వూరి రామిరెడ్డి "పానశాల" పేర్లతో తెలుగు చేశారు. ఆదిభట్ల నారాయణదాసు, మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి, చిలుకూరి నారాయణరావు కూడా రుబాయిల్ని తెలుగులోకి తెచ్చారు. కరుణశ్రీ "అమర్ ఖయామ్" పేరుతో రాశారు. ఇది మంచి ప్రచారాన్ని పొందిన అనువాద కావ్యం. మానవ జీవితం అనే మన పాత్రను ఈ విశాలమైన లోకపు రంగస్థలంపై జాగ్రత్తగా పోషించవలసి ఉంది. అలా పోషించకపోతే మన పాత్ర అపకీర్తిని పొందుతుందని ఉమర్ ఖయ్యాం చెప్పిన మాటల్ని కరుణశ్రీ ఇలా రాశారు:

వేసమువేసి పంపితివి వేదిక మీదకు, పాడువేళ నా
మీసములూడిపోయి విషమించె పరిస్థితి, ప్రేక్షకుల్ పరీ
హాసము సేయుచుండిరి రహస్యముగా తెరవేయుమంచు నీ
కోసము చూచితిన్ కసరుకొంటివిదెక్కడి దర్శకత్వమో! (కరుణశ్రీ కావ్యమాల 66)

అనవసరమైన నటన ఆయాసాన్ని మిగులుస్తుంది. అపకీర్తిని తెస్తుంది. వేదిక మీద నటుడు తగిన విధంగానే నటించాలి. ఒక దుర్యోధన పాత్రధారి వేదిక మీద అధికంగా నటించడంతో పెట్టుడు మీసం ఊడిపోయింది. ప్రేక్షకులంతా పరిహాసం చేశారు. ఆ నటుడు దర్శకుని వైపు చూసి తెరదించమని సైగ చేశాడు. దానికి దర్శకుడు కసరుకున్నాడు. అవమాన భరితమైన ఆ నటుడు 'ఇదెక్కడి దర్శకత్వమో' అని ఆశ్చర్యపోయాడు. దర్శకుడు భగవంతుడు. పాత్రధారి మానవుడు. మధ్యలో తెరవేయడం కుదరదు మరి. జీవం ఉన్నంతవరకు మన పాత్రను మనం పోషించాల్సిందే. ఇవన్నీ భగవంతుని లీలా విలాసాలు. భగవంతుడే విచిత్ర నటనా సూత్రధారి. "కరుణశ్రీ పద్యాలు అనువాదాలుగా అనిపించవు. మూలమా అనిపించేటంత సొగసుగా నడుస్తాయి. అత్యంత మనోహరంగా ఉన్న కరుణశ్రీ అమర్ ఖయామ్ పునఃపునః పఠనీయం" అంటారు మహాకవి దాశరథి.

ఉపసంహారం

  • తెలుగు బాలశతకం ద్వారా పాఠశాల పిల్లలకు సైతం పరిచయమైన కవి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి, తన కవిత్వంలో సందేశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కరుణశ్రీ కవిత్వం అందించిన ప్రధాన సందేశాలను ఈ క్రింది విధంగా సంగ్రహించవచ్చు.
  • ఆయన తొలి కవితలలో ఒకటైన "పాకీపిల్ల" ఖండిక, సమాజంలో చీదరించుకునే పాకీపిల్లలో జగన్మాతను దర్శించి, ఆమె సేవలను గణనీయమైనవిగా గుర్తించి, ఆమె వ్యక్తిత్వానికి నివాళులర్పించడం ద్వారా విశ్వప్రేమను, మానవత్వ విలువలను చాటింది.
  • "విజయశ్రీ" కావ్యం పైకి మహాభారత ఇతిహాసంగా కనిపించినా, అంతర్లీనంగా అద్భుతమైన జాతీయోద్యమ రచనగా నిలిచింది. శ్రీకృష్ణుని చేత మాతృ సందేశాన్ని ఇప్పిస్తూ, భారతీయులు స్వేచ్ఛను ఆస్వాదించి, ఆంగ్లేయులను సేవించే బానిస జీవితాన్ని విడనాడాలని కవి ప్రశ్నించారు. ఈ కావ్యం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో విద్రోహులను నిర్మూలించి స్వతంత్ర భారత భవాని వీరసంతానంగా నిలవాలని, జాతీయ పతాకాన్ని ఎత్తాలని భారతీయులలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, ధర్మ విజయాన్ని నింపింది.
  • "కరుణశ్రీ" కావ్యం దయాసంపదకు నిలయం. బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీ వంటి అహింసా జ్యోతిని వెలిగించిన అమరమూర్తుల త్యాగాలను స్మరిస్తూ, బుద్ధుని జీవిత గాథను ఇతివృత్తంగా తీసుకుని అహింసావాదాన్ని, కరుణను సముచితంగా నిరూపించారు. హంసను రక్షించిన సిద్ధార్థుడి కథ ద్వారా కరుణామయుడైన బుద్ధుని గొప్పతనాన్ని కవి చిత్రించారు.
  • "ఉదయశ్రీ" ఖండకావ్య సంపుటి, సుప్తమైన తెలుగు జాతిని జాగృతం చేయడం కోసం "తెలుగుతల్లి" ఖండికగా వైతాళిక గీతాన్ని రచించింది. కాకతీయ, విజయనగర, పల్నాటి వీరుల ఘన చరిత్రను స్మరిస్తూ, ఆంధ్ర పౌరుషాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని తెలుగుతల్లిని కవి ప్రబోధించారు. "ఉదయశ్రీ" లోని "పుష్పవిలాపం" ఖండిక, పూల మౌనభాషను ఆవిష్కరిస్తూ, మానవుల స్వార్థాన్ని ప్రశ్నించి, సహజమైన ప్రేమను, జీవకారుణ్యాన్ని కలిగి ఉండాలని సందేశం ఇచ్చింది.
  • "అమర్ ఖయామ్" అనువాద కావ్యం ద్వారా మానవ జీవితం ఒక రంగస్థలంపై నటించే పాత్ర వంటిదని, జీవిత పాత్రను జాగ్రత్తగా పోషించాలని, భగవంతుడే ఈ లీలావిలాసాలకు సూత్రధారి అని తాత్విక సందేశాన్ని అందించారు.
  • చైనా దురాక్రమణ వంటి సమకాలీన దేశీయ సమస్యలపై కూడా కరుణశ్రీ తన కవిత్వం ద్వారా తీవ్ర విమర్శనాత్మక సందేశాలను అందించారు.
  • తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జంధ్యాల పాపయ్య శాస్త్రి, తన మధురాక్షరాలతో అర్థ శతాబ్ది పాటు తెలుగు ప్రజలను అలరించిన మధురాక్షర చక్రవర్తిగా, సాహితీ మూర్తిగా చిరస్మరణీయులు. ఆయన కవిత్వం సద్యఃపరనివృత్తితో పాటు సామాజిక సందేశాలను అందించే ఆధునిక కవిత్వ లక్షణాలను సంపూర్ణంగా నిరూపించింది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. పాపయ్య శాస్త్రి, జంధ్యాల. కరుణశ్రీ కావ్యమాల (పద్యకావ్యాలు). జనరల్ ప్రింటర్స్, గుంటూరు,
  2. వీరభద్రయ్య, ముదిగొండ. తెలుగు కవిత: సాంఘిక సిద్ధాంతాలు. శ్రీ అరవిందసొసైటీ, హన్మకొండ,
  3. వెంకటరామ నరసింహం, కాకర్ల. ఆధునికాంధ్ర కవితాసమీక్ష. గంగాధర పబ్లికేషన్స్, విజయవాడ,
  4. శ్రీనివాసాచార్య, తిరుమల. సాహిత్యం ఎందుకు చదవాలి?. యువభారతి, హైదరాబాద్,
  5. సుదర్శనం, ఆర్.ఎస్. "అనుభూతి కవిత్వం". భారతి మాసపత్రిక, అక్టోబరు 1989, సంపు. 66, సంచి. 10.
  6. సుబ్రహ్మణ్యం, జి.వి. కొలమానమ్. "కరుణశ్రీకావ్యకళ". యువభారతి, హైదరాబాద్,
  7. సుబ్రహ్మణ్యం, డి. ఎస్వి. కరుణశ్రీ సమగ్ర సాహిత్య పరిశీలనము. పరి. గ్రంథం. రాజమహేంద్రవరం (అము.)
  8. సుమన్ బాబు, జంధ్యాల. కరుణశ్రీ కవితాసౌరభం. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్,
  9. స్ఫూర్తి మాసపత్రిక.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]