AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. శ్రీశ్రీ సినిమా పద్యాలు: కవితాసౌందర్యం
డా. పైడిపాటి ఉమానాథశర్మ
ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్,
కె.ఎల్.ఇ.ఎఫ్. (కె.ఎల్.యూనివర్సిటి),
వడ్డేశ్వరం,గుంటూరుజిల్లా,ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9491109984, Email: umanadha31612@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.08.2025 ఎంపిక (D.O.A): 28.08.2025 ప్రచురణ (D.O.P): 01.09.2025
వ్యాససంగ్రహం:
శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) సమాజంలోని సామాన్యుడి వేదనను తన కవిత్వానికి కేంద్రంగా చేసుకున్న ప్రజాకవి. అభ్యుదయ విప్లవ కవితా ప్రస్థానాన్ని నడిపిన ఆయన సాహితీ ప్రస్థానానికి పునాది పద్యరచన. శ్రీశ్రీ లబ్ధ ప్రతిష్ఠుడైన అభ్యుదయ విప్లవ కవిగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఆయన సినీ సాహిత్య పద్య రచనపై ప్రత్యేకంగా పరిశోధనలు జరగలేదు. శ్రీశ్రీ సినీ పద్యసౌరభాన్ని విశ్లేషించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. ఇది శ్రీశ్రీ కవిత్వానికి మూలం పద్యమే అన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది. పూర్వ కవులైన నన్నయ్య, అల్లసాని పెద్దన, వేమన, శ్రీనాథుడు, తిరుపతి వేంకట కవుల పద్యాలతో శ్రీశ్రీ సినీ పద్యాలను పోలుస్తూ, ఆయన శైలిని వివరిస్తుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన శ్రీశ్రీ సినిమా పాటల రెండు సంపుటాలు ప్రాథమిక ఆధారాలుగా ఉపకరించాయి. ఆయన వర్ణనలు, సామాజికత, భార్యాభర్తల సంబంధాలు, హాస్యపద్యాలు, చాటుపద్యానుకరణ పద్యాలపై విస్తృత విశ్లేషణ నిర్వహించబడింది. శ్రీశ్రీ సినీ పద్యాలలో అశ్లీలతకు తావులేని సఖి వర్ణనలు, సామాజిక అన్యాయాలపై శివాజీ ప్రార్థన రూపంలో నిశిత విమర్శ, హాస్య రసం నిండిన భార్యాభర్తల అనుబంధ పద్యాలు, మీసాల హాస్యం, ప్రాచీన చాటు పద్య అనుకరణ కన్పిస్తాయి. ముఖ్యంగా, ఆయన ఛందోబద్ధ కవిత్వంలో నైపుణ్యం, యతి ప్రాసల సృజనాత్మక ప్రయోగం, దుష్కర ప్రాస రచనలు పరిశోధనలో వెలుగు చూశాయి. సినిమా పద్యరచనను కేవలం "ఉదరపోషణార్థమే" అని శ్రీశ్రీ పేర్కొన్నప్పటికీ, ఆయన సినీ పద్యాలు సైతం ఛందో వ్యాకరణాలపై ఆయనకున్న పట్టు, తెలుగు పద్య రచనపై గల అవ్యాజానురాగం చాటుతాయి. ఈ పరిశోధన శ్రీశ్రీ కవితావికాసంలో పద్యం పాత్రను పునర్మూల్యాంకనం చేయడానికి, భవిష్యత్ పరిశోధనలకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది.
Keywords: శ్రీశ్రీ, పద్య సాహిత్యం, సినిమా పద్యాలు, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, ఛందోబద్ధ కవిత్వం, సామాజికత, తెలుగు సాహిత్యం, హాస్యం.
1. ప్రవేశిక
"సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం"
అంటూ, "సర్వే జనాస్సుఖినో భవంతు" అనే భారతీయ విశాల ధర్మ ప్రబోధాన్ని మానవ లోకానికి సందేశంగా అందించిన మహాకవి, ప్రజాకవి శ్రీరంగం శ్రీనివాస రావు. ఆయన 1910లో విశాఖపట్నంలో జన్మించి, గోదావరయ్య బడిలో ఓనమాలు దిద్దారు. ఇది ఇంగ్లాండులోని ప్రఖ్యాతమైన ఈటెన్ స్కూలు లాంటిదని శ్రీశ్రీ ప్రగాఢ విశ్వాసం (శ్రీరంగం, అనంతం 33). తన ధ్యాస అంతా సమాజంలో అట్టడుగున బ్రతుకుబండిని అమాయకంగా ఈడుస్తున్న సామాన్యుడి వేదన గురించే. వారిని తన కవితల ద్వారా జాగృతం చేసి, వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి, వారు మనుషులుగా బ్రతకడానికి కావలసిన మానసిక ధైర్యాన్ని నింపడమే లక్ష్యంగా శ్రీశ్రీ సాహితీ ప్రస్థానం నడిచింది. సామాన్యుడికి తన ఆవేదన తెలియాలంటే వ్రాసే భాష, మాట, పలుకు, పాట సరళంగా ఉండాలని భావించి, దానికి అనుగుణంగా సాహితీ సేద్యం సాగించిన కవితా శ్రామికుడు శ్రీశ్రీ. అయితే, ఈ మహాకవి సాహితీ మహా ప్రస్థానానికి పునాది మాత్రం పద్యమే.
1.1 శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానం
పంచమహాకావ్యాలు, ఛందోవ్యాకరణం వంటి ప్రాచీన శాస్త్రాల అధ్యయనంలో నిష్ణాతులు కాబట్టి శ్రీశ్రీ పద్యరచన నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ద్రాక్షాపాకంలా సాగింది. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు, ఈ శతాబ్దం నాది అని ధైర్యంగా అనగలిగిన కవితా ధీరుడు శ్రీశ్రీ.
"శ్రీరంగం శ్రీనివాసరావు రెండు శ్రీకారాలకు ప్రతీక. ఒక శ్రీకారం అభ్యుదయ ప్రస్థానానిది. మరో శ్రీకారం విప్లవ ప్రస్థానానిది"
అని ఆచార్య డా. జి.వి. సుబ్రహ్మణ్యం పలికారు. ఈ పలుకులకు ఒక చిన్న కూడిక ఏమంటే, ఈ మహాకవి పేరు ముందు గౌరవ వాచకం 'శ్రీ' చేర్చినట్లయితే, ఆ మొదటి శ్రీకారం పద్యకవితా ప్రస్థానానిది అనడంలో అతిశయోక్తి లేదు.
1.2 పద్యరచన ప్రాముఖ్యత
పద్యరచన గురించి శ్రీశ్రీ స్వయంగా ఇలా పలికారు (శ్రీరంగం, సినిమా పాటలు 23):
"పద్యం తెలుగు వాడి ప్రత్యేకత. గోంగూర పచ్చడిలా, ఆవకాయలా. మన స్టేజి నటులు పద్య పఠనాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళారు. సినిమా పాటల్లో సాహిత్యాన్ని సంగీతం మింగేసే ప్రమాదం ఉంది. పద్యం అలా కాదు. ఎటువంటి సంగీతాన్ని మిళాయించకుండా పద్యం స్వతంత్రంగా బ్రతుకగలదు. పద్యాన్ని చదవడం అంటారు కానీ పాడటం అని ఎవరూ అనరు. అసలు పద్యరచనకు కావలసిన డిసిప్లేను వేరు. ఆ డిసిప్లేను ఉన్నప్పుడే పద్యం రాణిస్తుంది."
దీన్ని బట్టి పద్యం పట్ల ఆయనకు గల అవ్యాజానురాగం మనకు స్పష్టంగా తెలుస్తుంది.
1.3 తొలి పద్య రచనలు అధ్యయన లక్ష్యం
తన ఎనిమిదో ఏటనే పొడుగు, పొట్టి పదాలతో కంద పద్యాన్ని, చిన్న వయసులోనే "సావిత్రీ సత్యవంతుడు" అనే పద్య నాటకాన్ని రచించారు. తన పదిహేనవ ఏట, అంటే 1925లో, స్థానిక పత్రిక "స్వశక్తి"లో ప్రచురణార్ధం "విశ్వరూప సందర్శనం" అనే గీతమాలికను వ్రాశారని, అదే ఆయన మొదటి పద్య రచన అని ఆరుద్ర పేర్కొంటారు (ఆరుద్ర, సమగ్రాంధ్ర సాహిత్యం 814). వీరి సాహిత్యం అంతా ఒక ఎత్తయితే, సినిమా సాహిత్యం మరొక ఎత్తు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన శ్రీశ్రీ సినిమా పాటల రెండు సంపుటాలు ఈ వ్యాసానికి ప్రధాన ఆధారం.
ఈ మహాకవి సినిమాల కోసం రచించిన పద్య సౌరభం గురించి ఇంతకుముందు ప్రత్యేకంగా వ్యాసాలు రచింపబడలేదని చెప్పాలి. అభ్యుదయ, విప్లవ కవిగా శ్రీశ్రీ ప్రఖ్యాతి పొందినా, దానికి పునాది వారి పద్యరచనే అని వివరించడం వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. వర్ణనలు, సామాజికత, భార్యాభర్తల సంబంధాలు, హాస్య పద్యాలు, చాటుపద్యానుకరణం అనే ఉపశీర్షికలతో ఈ వ్యాసం సాగింది.
2. శ్రీశ్రీ సినిమాపద్యాలు
2.1 వర్ణనలు
శ్రీశ్రీ రచించిన ప్రభవ మొదలైన పద్య కావ్యాల జోలికి వెళ్ళకుండా, కేవలం సినిమాల కోసం వారు వ్రాసిన పద్య సాహిత్య సౌరభాన్ని మాత్రమే స్పృశించే ప్రయత్నం జరుగుతుంది.
పద్య సాహిత్యంలో స్త్రీ వర్ణన ఆదికావ్యం నుండి కొనసాగుతూనే ఉంది. ఆ మాట కొస్తే, దేవతా స్తోత్రాలు, స్తుతులలో కూడా ఆ రకమైన వర్ణనలు మనకు తారసపడుతూనే ఉంటాయి. దైవ, మానవ స్త్రీ వర్ణనలలో మనం చూసే చూపు, చేసే భావనలో మాత్రం మార్పు. ఆదికవి నన్నయ్య మహాభారతంలో శంతన మహారాజు గంగాపులినతలంబున మణిమయాలంకరణోజ్వల వేష అయిన ఒక కన్యకను చూసి ఇలా అనుకున్నారు (నన్నయ్య, 145):
"కని వనకన్యయో, దనుజ కన్యకయో, భుజగేంద్ర కన్యయో
యనిమిష కన్యయో, యిది వియచ్చర కన్యకయో, యపూర్వ మీ..."
ఆమెను - ఆమె రూప లావణ్య విలాసాలను బట్టి వనకన్య, రాక్షస కన్య, నాగకన్య, దేవతాకన్య అని మాత్రమే అనుకున్నారు. కానీ ప్రబంధాల వద్దకు వచ్చేసరికి నాయికా వర్ణన కొద్దిగా శ్రుతి మించినది. శరీర అవయవ వర్ణన ప్రారంభమైనది. నాయికల ముఖం, కళ్ళు మాత్రమే కాకుండ నడుము, నాభి, స్తనములు, ఊరువుల వర్ణన చేశారు ప్రబంధ కవులు. ప్రవరుడు చూచిన వరూధిని గురించి పెద్దన ఇలా వర్ణిస్తారు (అల్లసాని, 25):
"అతడావాత పరంపరాపరిమళ వ్యాపార లీలన్ జనా
న్వితమిచ్చోతని జేరబోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాశ్య చక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్||"
ఈ రెంటికీ విరుద్ధంగా, ఎంతో సొంపుగా సఖి రూపాన్ని రమణీయంగా చెప్తారు శ్రీశ్రీ. శ్రీరంగనాథ దాసు అనే దర్శకుడి సారధ్యంలో చిత్రీకరించబడిన సినిమాలో శ్రీశ్రీ ఒక అద్భుతమైన పద్యం రచించారు. సినిమా పేరు జ్ఞాపకం లేదని రచయితే స్వయంగా చెప్పుకున్నారు. ఎలాంటి అసభ్యత, అశ్లీలాలకు తావు లేకుండా వారు వ్రాసిన చంపకమాల పద్య రత్నం ఇది (శ్రీరంగం, పాడవోయి భారతీయుడా 19):
"హృదయమిదే హరించెనుకదే సఖి రూపము శక్రచాపమో
వదనము వారిజాతమొ సువాసన లీనెడు పారిజాతమో
కుదురగు శ్రోణి అందమగు క్షోణీయొ వేణీ చలత్త్రివేణియో,
మదనుని దంతియో చెలియ మల్లెల దొంతియొ, వైజయంతియో||"
తన హృదయాన్ని దోచుకున్న సఖి రూపాన్ని ఇంద్రధనస్సుతో, వదనాన్ని పద్మం, పారిజాతంతో, కుదురగు శ్రోణిని క్షోణితో, వేణీచలాన్ని త్రివేణిగా ఊహించటం ప్రధానాంశంగా వ్రాయబడిన సినిమా పద్య సౌందర్యం అనన్యసామాన్యం. మదనుని దంతిగా, మల్లెల దొంతిగా, వైజయంతిగా నాయికను వారు చేసిన ఊహా చిత్రం కడు రమణీయంగా సాగింది.
2.2 సామాజికత
సమాజంలో అనైతిక ప్రవర్తన గల మనుషులను పెరగనివ్వకూడదు. వారి వల యువతరం అంతా పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అందువలననే, సహజంగా శివాజీ అనగానే జ్ఞాపకానికొచ్చే మహమ్మదీయ పాలకులను గాని, మతాన్ని గానీ ప్రస్తావించకుండా, మానవ ప్రవర్తనను గురించి మాత్రమే పేర్కొంటూ, పంతులమ్మ సినిమాలో అద్భుత పద్యం వ్రాశారు శ్రీశ్రీ. నవతా ఆర్ట్స్ వారు కృష్ణం రాజు గారి నిర్మాణ సారథ్యంలో సుమారు 1977లో విడుదలచేసిన రంగనాథ్, లక్ష్మి, దీప ప్రధాన పాత్రధారులుగా సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా పంతులమ్మ. గర్వంతో కళ్ళు మూసుకుపోయినవారు, అనవసర ఆర్భాట సంరంహులు, స్వార్థపరులు ఘోరాలు చేస్తూ భరతమాతకు కీడు కలిగిస్తున్నారు. అలాంటి వారిపై సింహం వలె జృంభించి, సంహరించే శక్తిని ప్రసాదింపుమంటూ ఆ పరాశక్తిని శివాజీ ప్రార్థించే నాటక సన్నివేశంలోనిది ఈ పద్యం. ఆమె ఖడ్గం ప్రసాదించగానే జగజ్జనని, భవాని నమో నమః అంటూ ఛత్రపతి శివాజి చెప్పిన కృతజ్ఞతాపూర్వకమైన మాటలతో ఈ సన్నివేశం ముగుస్తుంది (శ్రీరంగం, పాడవోయి భారతీయుడా 62):
"అం హో దుర్భరమాయె భారతము-గర్వాంధుల్--దురార్భాట సం
రం హుల్, స్వార్ధపరుల్ చరింతురిట! వీరల్ సేయు ఘోరాలపై
సిం హంబో యన లేచి, నేనిక మహా క్ష్వేళా ధ్వనిన్ వీరలన్
సం హారం బొనరించు శక్తిని జగన్మాతా! ప్రసాదింపుమా!"
ఇందులోని తుది పాదంలో యతి భంగమైనదని ఒక సందేహం నవతా కృష్ణం రాజుగారే లేవనెత్తారట. నాల్గవ పాదంలో "సం" తో "న్మా" యతి కుదరదు అనుకుని. దానికి ముందు పాదంలోని "వీరలున్" లో ఉన్న "న"కారపు పొల్లుతో "న్మా" కి యతి కుదిరిందని శ్రీశ్రీ వివరించారు. ఇటువంటి ఛందో రహస్యాలు చాలామందికి తెలియవు. దీర్ఘాక్షరంతో ప్రారంభమైన కంద పద్యంలో నాలుగవ పాదంలో "జగణం" వేయకూడదని చాలా మందికి తెలియదు. అలాగే దుష్కర ప్రాస కూడా. బిందు పూర్వక హకారాన్ని ప్రాస స్థానంలో ఉంచి పద్యరచన గావించడమంటే సామాన్యం కాదు. ఇది దుష్కర ప్రాస. కవిసమ్రాట్ విశ్వనాథ వారు తన విశ్వేశ్వర శతకంలో "అహోవారణ కుంభ" అని ప్రారంభమయ్యే పద్యంలో నాలుగవ పాదంలో "నచాహం హంతవ్య" అని ప్రాసస్థానంలో సంస్కృతాన్ని వాడారని, సంస్కృతంలో వారు ప్రాస వాడితే నేనెందుకు ఇంగ్లీషులో వాడకూడదని, అందువలన తాను కూడా ప్రాస స్థానంలో ఆంగ్లాన్ని వాడతానని చెప్పి, చమత్కారంగా ఈ క్రింద పద్యం వ్రాశారు (శ్రీరంగం, పాడవోయి భారతీయుడా 62):
"సిం హాలకు "జూ" (ZOO) లుండును- సం హారమె సృష్టి యగును సామాన్యముగా
అం హ స్పె యగును పుణ్యము- "సమ్హౌ" (SOMEHOW) మన కవనధార స్రవయించుమహిన్"
2.3 భార్యా భర్తల సంబంధాలు
లోకంలో భార్యాభర్తలిరువురూ చివరిదాకా కలిసే ఉండటం అనూచానంగా వస్తున్న భారతీయ సంస్కృతి. అయితే వెక్కిరింపులు, చీదరింపులు, అలగడాలు, ఆక్రందనలు, సాధింపులు, సన్నాయినొక్కులు లేని సంసారాలు అరుదే. ప్రాచీన కాలం ఎలా ఉన్నా, ప్రజాకవి వేమన కాలం నుండి కూడా భార్య బాధితులు ఉన్నారేమో అనిపిస్తుంది. వేమన అఖండ పద్యరాశిలో, భర్తను నానాయాగీ చేసే భార్యతో వేగడం సామాన్యమేమీ కాదని వ్రాసిన పద్యం ఇలా ఉంది (వేమన, 4304):
"వాడకుఱికితిట్టు వలదన్న మొఱవెట్టు-మగనినెత్తికొట్టు మందుబెట్టు
యిట్టియాలితోడనెట్టువేగెదరొకో-విశ్వదాభిరామ వినురవేమ!"
సరిగ్గా ఇలాంటి భావాన్ని భార్యాభర్తలు చిత్రంలో ఒక సన్నివేశానికి శ్రీశ్రీ వ్రాసిన పద్యం వ్యక్తపరుస్తుంది. 1961వ సంవత్సరంలో ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై శ్రీ ఏ.వి. సుబ్బారావ్ నిర్మాణ సారథ్యంలో కె. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో శ్రీ అక్కినేని నాగేశ్వర రావు-కృష్ణకుమారి నాయక-నాయికలుగా విడుదలైన సినిమా "భార్యా-భర్తలు". ఇందులో భార్య పెట్టే బాధలు భరించలేని భర్త కాశికి వెళ్ళడమే నయం అనుకుంటున్న సందర్భంలో శ్రీశ్రీ వ్రాసిన సీస పద్యం అలతి, అలతి పదాలతో రమ్యంగా, హాస్య ప్రియత్వంగా సాగుతుంది (శ్రీరంగం, 63):
"ఇంతపాతివ్రత్యమెవడుభరిస్తాడు-ఇంతికాదిది దంతి ఇనుప బంతి
పతిభక్తియనరాదు,హతవిధీ! దీనిని పతిహింస యనుచు చెప్పడమె లెస్స
ఈయమతో బ్రతుకిహలోకనరకమే!ఈ యిల్లు వదలడం హాయి హాయి
సతి వద్దు!సంసార సంకటమే వద్దు!సన్యాసి ఒక్కడే ధన్య జీవి!
కనుక మతిచెడిపోవకమునుపే ముద్దులొల్కు సిల్కు కాషాయములొగిధరించి
పరుగు తీసెద కాశికి వడి వడి వడి-శపథమిది,సత్యమిది,సునిశ్చయము నిదియె -"
2.4 హాస్య పద్యాలు
నవరసాలలో హాస్యానికి ప్రముఖ స్థానం ఉంది. ఆనందానికి, ఆరోగ్యానికి మూలమైన రసం ఇది. అందువలననే చాలా మంది ప్రాచీన, అర్వాచీన తెలుగు కవులు తమ రచనలలో దీనికి తగిన స్థానం కల్పించారు. అనేకమంది పద్యకవులు తాము పెంచుకున్న మీసం గురించి చెప్పిన పద్యాలు మనకు కనపడతాయి.
అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలుగా ప్రశంసింపబడిన ప్రముఖ పద్యకవులు, అవధాన శిఖామణులు తిరుపతి వెంకటకవులు మీసం గురించి ఇలా పద్యం చెప్పారు. సంస్కృతాంధ్ర భాషల్లో మేమే కవీంద్రులమని తెల్పడానికి వీటిని పెంచామని వారు అంటారు (వెంకటకవులు, 242):
"దోసమటంచెరింగియు దుందుడుకొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా
రోసము కలిగినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసముతీసి మీ పద సమీపములం తలలుంచి మ్రొక్కమే?"
బహుశా దీని వలెనే శ్రీశ్రీ కూడా మీసం గురించి ఒక సినిమా పద్యం వ్రాశారు. కారుమబ్బుల బారుతో, మృగరాజు జూలుతో, గండుచీమల దండుతో మీసాలను పోల్చి, చివరకు మామ మీసాలే భువికి శ్రీరామ రక్ష అంటూ సాగుతుంది పద్యం. ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ వారి "కులగోత్రాలు" సినిమా కోసం శ్రీశ్రీ చే వ్రాయబడిన హాస్యరసస్పోరకమైన పద్యం ఇది. మరొక పాత్ర (జోగారావు) అంటుంది (శ్రీరంగం, పాడవోయి భారతీయుడా 70):
"కారుమబ్బుల బారు సేరు నేలెడు తీరు- కోర మీసము పొందు కోరుకొందు
మృగరాజు జూలునే తెగనొడజాలు నీ ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భార--మాది శేషుడా! కూర్మమా! కాదు, కాదు!
అష్టదిగ్గజ కూటమా! అదియు కాదు!—(మరేదయ్యా అంటే) --మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష"
2.5 చాటుపద్యానుకరణము
తెలుగు సాహిత్యంలో మహాకవులనేకులు కేవలం కావ్య రచనలోనే కాక ఆయా సందర్భాలలో, సమయాలలో తమ భావనా వీచికలకు అక్షర రూపాన్ని అందించారు. వారిలో అగ్రగణ్యుడు కవిసార్వభౌముడైన శ్రీనాథ మహాకవి. తన చరమాంకంలో కృష్ణవేణమ్మకు వరదలొచ్చి, తను కౌలుకు తీసుకున్న ప్రాంతమంతా కొట్టుకుపోయిందని, ఏడు వందల శిస్తు ఎలా చెల్లించాలని బాధ పడుతూ చెప్పిన చాటు పద్యం ఇలా సాగింది (శాస్త్రి, 167):
"కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము-బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లను గొడ్డేరి మోసపోతి-నెట్లు చెల్లింతు టంకంబు(సుంకంబు) లేడు నూర్లు"
శ్రీశ్రీ కూడా ఆస్తి అంతా హరించుకుపోయిందని, అద్దె ఎలా చెల్లించాలని బాధపడుతూ చెప్పిన పద్యం ప్రాచీన పద్య సాహిత్యం పట్ల వారికి గల అవ్యాజానురాగం మనకు ద్యోతకమవుతుంది (శ్రీరంగం, రెండవ సంపుటి 107):
"కాసు రాబట్టు మార్గమే కానరాదు-వెళ్ళిపోయెడి దారులు వేనవేలు
ఆస్థి హరియించుకొని పోయె-అప్పుమిగిలె -ఎట్లు చెల్లింతు ఇంటద్దె ఏడు పదులు"
ఉపసంహారం
"ప్రతి మనిషి మరొకరిని దోచుకునేవాడే-తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే"- స్వార్థమే అనర్థ కారణం- అది చంపుకుంటే క్షేమదాయకం" అంటూ శ్రీశ్రీ సినీ సాహిత్య గీతాలు సాగినా, కమ్యూనిజం, సామ్యవాదం ఊపిరిగా అభ్యుదయ, విప్లవ కవితా ప్రస్థానాన్ని సాగించినా, ఈ ప్రజాకవి కవితా మూలం మాత్రం పద్యం అని, భావన మాత్రం దోపిడీకి తావులేని మానవత అని అనడం నిస్సందేహం. సినీ పాటలే కాదు, ప్రాచీన తెలుగు సాహిత్యానికి అది ఏ ప్రక్రియ అయినా, జీవగర్రగా ఉన్న పద్య రచనలో కూడా శ్రీశ్రీ సిద్ధస్తులు అనడం నిస్సందేహం. సినిమాలకు పద్యరచన చేసినా, లెక్కకుమిక్కిలి పాటలు వ్రాసినా అది కేవలం ఉదరపోషణార్ధమే అంటూ తాను సమాజకవి, ప్రజాకవిగా ఉండటానికి ఇష్టపడతానని చెప్పిన శ్రీశ్రీ మాటలతోనే ఈ వ్యాసాన్ని ముగిస్తాము. "తెలుగు సినిమా కవినని చెప్పుకోవటం సిగ్గుచేటు. సినిమా కవికి సినిమా నిర్మాణంలో తనదిగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే సినిమా రంగం తిమింగలాలతో నిండిన సముద్రం అన్నాను. ఉదరపోషణకు ఏదో ఒక వృత్తి చెయ్యాలి కదా!" (శ్రీరంగం, రెండవ సంపుటి 6).
- శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానానికి పద్యరచన పునాదిగా నిలిచింది.
- ఆయన పద్యాలు సరళమైన భాషతో సామాన్యులను జాగృతం చేయడమే లక్ష్యంగా సాగాయి.
- శ్రీశ్రీ సినిమా పద్యాలలో స్త్రీ వర్ణన, సామాజిక విమర్శ, భార్యాభర్తల సంబంధాలు, హాస్యం, చాటుపద్యానుకరణం వంటి వైవిధ్యభరితమైన అంశాలను స్పృశించారు.
- ఆయన సామాజిక దృక్పథం, మానవతా విలువలు పద్య రచనలలో స్పష్టంగా ప్రతిబింబించాయి.
- సినిమా రచనను కేవలం జీవనోపాధిగా చూస్తూ, సమాజ కవిగా, ప్రజా కవిగా తన గుర్తింపును నిలుపుకోవాలని శ్రీశ్రీ అభిలషించారు.
ఉపయుక్త గ్రంథసూచి
- తిరుపతి, వెంకటకవులు. నానారాజ సందర్శనము. కాకినాడ ముద్రాక్షర శాల,
- నన్నయ్య, నన్నయ్యభట్టు. ఆంధ్ర మహాభారతం. ఆదిపర్వం, చతుర్ధ అశ్వాసము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి,
- పెద్దన, అల్లసాని. మనుచరిత్ర. ద్వితీయాశ్వాసము, వి.రామస్వామి శాస్త్రులు&సన్స్,
- వేటూరి ప్రభాకర, శాస్త్రి. చాటుపద్యమణిమంజరి. సాహిత్య అకాడెమి, n.d.
- వేమన. వేమన పద్యములు. తెలుగు విశ్వవిద్యాలయం, n.d.
- శంకరశాస్త్రి భాగవతుల, ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం. సంపుటం 4, తెలుగు అకాడెమి,
- శ్రీరంగం, శ్రీనివాస రావు. అనంతం. Unknown Publisher, n.d.
- శ్రీరంగం, శ్రీనివాస రావు. పాడవోయి భారతీయుడా: సినిమాపాటలు. విశాలాంధ్రా పబ్లిషింగ్ హౌస్,
- శ్రీరంగం, శ్రీనివాస రావు. సినిమా పాటలు. Unknown Publisher, n.d.
- సరోజా, శ్రీశ్రీ, సంకలనం. శ్రీశ్రీ సినిమా పాటలు- ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల. విశాలాంధ్రా పబ్లిషింగ్ హౌస్, 2001.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

