AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. రావిశాస్త్రి కథల్లో న్యాయవ్యవస్థ : వివిధ దృక్పథాలు
డా. పులపర్తి శ్రీనివాసరావు
బోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్రవిశ్వవిద్యాలయం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8309742248, Email: telugu.bujji@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 17.08.2025 ఎంపిక (D.O.A): 28.08.2025 ప్రచురణ (D.O.P): 01.09.2025
వ్యాససంగ్రహం:
రావిశాస్త్రి కథల్లో న్యాయవ్యవస్థ వివిధ కోణాలను ఈ పరిశోధన విశ్లేషిస్తుంది. సమాజంలో న్యాయం ధర్మం ఆవశ్యకత ఉన్నా, డబ్బు అధికార బలం ఉన్నవారికి అనుకూలంగా పనిచేసే ప్రస్తుత వ్యవస్థ లోపభూయిష్టమైనదని ఈ శీర్షిక సమర్ధిస్తుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాక్షులు, నేరస్తులు, పోలీసులు వంటి వివిధ వర్గాల దృక్పథాలు కథల్లో ఎలా చిత్రీకరించబడ్డాయో పరిశీలించడమే ఈ వ్యాస ప్రధాన లక్ష్యం. స్వదేశీ రాజ్యాలు కూలి విదేశీ పాలన తరువాత ఏర్పడిన న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రానంతరం కొనసాగుతూ, కాలక్రమేణా సంపన్నులకు కొమ్ముకాస్తున్న తీరును రచయిత తన కథల ద్వారా విమర్శనాత్మకంగా దర్శింపజేశారు. రావిశాస్త్రి రచించిన కథలను ప్రాథమిక ఆధారంగా తీసుకుని ఈ విశ్లేషణ జరిగింది. ఆయన రచనా సర్వస్వం, రచనా సాగరం, సాహితి వంటి సంకలనాలు ద్వితీయ ఆధారాలు. రావిశాస్త్రి కథలలోని పాత్రల సంభాషణలు, సంఘటనల ద్వారా న్యాయవ్యవస్థ లోపాలను, వివిధ వర్గాల మనస్తత్వాలను గుర్తించే పద్ధతిని ఈ పరిశోధన అనుసరించింది. న్యాయమూర్తి, న్యాయవాది, సాక్షి, నేరస్తుడు, పోలీసుల దృక్పథాలను విడివిడిగా పరిశీలించి, వాటి వాస్తవికతను నిరూపించడం వ్యాస నిర్మాణం. ఈ పరిశోధన రావిశాస్త్రి కథాకాలం నాటి న్యాయవ్యవస్థ స్థితిగతులను చిత్రించింది. కథన ఆవశ్యకత దృష్ట్యా వ్యవస్థ లోపాలను ప్రధానంగా చూపినా, నేటికీ ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండటం గొప్ప విషయంగా వ్యాసం అంచనా వేస్తుంది. న్యాయమూర్తులు వేగవంతమైన తీర్పులు ఇవ్వకపోవడం, మానవతా దృక్పథాన్ని విస్మరించడం, న్యాయవాదులు ధనార్జన లక్ష్యంగా పనిచేయడం, సాక్షులు అబద్ధపు సాక్ష్యాలు పలకడం, పోలీసులు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడటం వంటి లోపాలు కథల్లో స్పష్టంగా బయటపడ్డాయి. నేరస్తులలో కొందరు పరిస్థితుల ప్రభావంతో ఆ దారిలోకి వెళ్ళిన అమాయకులని, వారి పశ్చాత్తాపాన్ని రచయిత సూక్ష్మంగా చూపారు. ఈ కథలు సమాజంలో మార్పు ప్రక్షాళన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. "ఉన్నోడికో న్యాయం, లేనోడికో న్యాయం" అనే సామాజిక అసమానతలు నేటికీ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పరిశోధన భవిష్యత్తు అధ్యయనాలకు ఆలోచనలు అందిస్తుంది. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు ఆశించిన రావిశాస్త్రి రచనలు, మానవ స్వభావాలు వృత్తి ధర్మానికి అడ్డుపడకుండా ప్రక్షాళన అవసరాన్ని ఘాటుగా గుర్తుచేశాయి.
Keywords: రావిశాస్త్రి, న్యాయవ్యవస్థ, కథా సాహిత్యం, సామాజిక విశ్లేషణ, అవినీతి, న్యాయమూర్తి, న్యాయవాది, సాక్ష్యం, నేరం, పోలీసు.
1.0. ఉపోద్ఘాతం
నిర్దిష్టమైన జీవన విధానానికి న్యాయం ధర్మం అవశ్యకం. అవి వ్యక్తుల విధిలో భాగాలు కావాలి. అయితే మానవుడు స్వార్థజీవి. తనకోసం మాత్రమే ఆలోచించే జీవనశైలికి అలవాటు పడి, చెడు నడతలు నేర్చి, దుష్టమార్గాలలో పయనిస్తున్నాడు. ఈ విధంగా తప్పులు చేస్తున్న వ్యక్తులను సరైన దారిలో పెట్టడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి న్యాయవ్యవస్థ ఏర్పడింది. ఇది అన్యాయం జరగకుండా చూస్తూ, సమన్యాయాన్ని సమాజంలో నెలకొల్పి, ఎవరూ నష్టపోకుండా బాధపడకుండా చూడాలి. పూర్వం రాజుల కాలంలో కూడా ఈ వ్యవస్థ ఉండేది. దాని అధికారులు, అమలుపరిచే తీరు, శిక్షల ఖరారు అన్నీ ఒకే నియమానుసారంగా జరిగేవి. స్వదేశీ రాజ్యాలు కూలిన పిదప వ్యాపారం పేరిట అడుగుపెట్టిన విదేశీయులు స్వదేశీ రాజకీయాలలోని బలహీనతలను అడ్డం పెట్టుకొని ఈ గడ్డపై పాలనాధికారాన్ని చేజిక్కించుకున్నారు. వారి హయాంలో ఏర్పరిచిన న్యాయవ్యవస్థనే స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. ఏలికలకు అధికారులకు అనువుగా ఏర్పడిన వ్యవస్థ ఆ తదనంతరం కూడా అలాగే కొన్ని మార్పులకు లోనైంది. సంపద సింహాసనం ఉన్నవారికి న్యాయం చట్టం చుట్టాలయ్యాయి. ఫలితంగా ధర్మశాస్త్రాల లొసుగులతో పెద్దవారు తెలివిగా తప్పించుకోగా, బలహీనులు బలవంతుల చేతిలో పావులయ్యారు.
దేశంలో రాజ్యాంగబద్ధంగా కేంద్ర రాష్ట్ర న్యాయవ్యవస్థలు ఏర్పడ్డాయి. అందులో సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, మున్సిపల్ కోర్టులు ఉండగా, న్యాయమూర్తులు, న్యాయవాదులు, గుమాస్తాలు, సిబ్బందిని నియమించారు. శాంతిని పరిరక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఏర్పడింది. సంఘవిద్రోహాలను, మోసాలను, అవినీతి అన్యాయాలను చేస్తున్న వారిని సవ్యరీతిలో నడిపించాల్సిన న్యాయవ్యవస్థ డబ్బు అధికారానికి కొమ్ముకాయడం మొదలైంది. నిర్భాగ్యులపై మాత్రం చట్టాలను రుద్దించి సమర్థించుకోవడం అక్కడ నెలకొన్న వ్యవస్థాగత లోటుపాట్లకు నిదర్శనం. వివిధ స్థాయిల అధికారులు, సహాయకులు, బాధితులు, నేరస్థులు, సాక్షులు వారి మనోరీతులలోని భావాలను రచయిత తన కథలలో ఎలా విశదపరిచారో ఈ వ్యాసంలో పరిశీలించడమైంది.
1.1. న్యాయమూర్తుల దృక్పథాలు
భారతదేశ ప్రజాస్వామ్యానికి తగిన స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థను పలు వివాదాల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ పద్ధతిని కాపాడటానికి న్యాయ విభాగానికి అధికారాన్ని కేటాయించారు. అలాగే అర్హతలను అనుసరించి వివిధ కోర్టులలో న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. న్యాయశాస్త్రబద్ధంగా వివిధ రికార్డుల ప్రకారం న్యాయమూర్తి వివిధ అంశాలపై తన తీర్పులనిస్తాడు. ఇక్కడ ఆయన వివిధ పరిధులకు లోబడి, తన సొంత నిర్ణయాలను తీర్పులపై రుద్దకుండా వ్యాజ్యాన్ని, వాద ప్రతివాదాలను, సాక్ష్యాలను పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనేక సంవత్సరాలు న్యాయవాద వృత్తిని చేపట్టి ఆ తదనంతరం తగిన స్థాయిలో న్యాయమూర్తులుగా ఎదుగుతారు. అనుభవసారం ధర్మబద్ధత విషయంలో అసిధారవ్రతాన్ని చేబూని విచారణ ద్వారా సత్యాసత్యాలను వెలికితీస్తారు. ధర్మపునాదిపై తీర్పులను ఇవ్వాల్సిన నిబద్ధతను చూపించాలి. న్యాయస్థానంలో ప్రధానాధికారిగా తగిన దృక్పథాన్ని ప్రదర్శిస్తూ నీతిని నిలిపే బాధ్యత న్యాయమూర్తులది.
న్యాయ నిర్ధారణను చేసే వ్యక్తి సత్యదర్శనాన్ని తగిన హేతువుల సాయంతో చేస్తూ, సమానత్వాన్ని పాటిస్తాడు. దీనికై ఆయన చదివిన చదువు, న్యాయవాదిగా ఉన్నప్పటి వాస్తవజ్ఞానం, పూర్వపు వ్యాజ్యాలు తీర్పులు అవగాహనను అందిస్తాయి. రాజ్యాంగ, న్యాయ, ధర్మబద్ధతలతో రాటుదేలుతారు. అప్పుడు జడ్జి సింహాసనాన్ని ఎక్కిన పిదప అతని దృక్పథం వ్యక్తిగతమైనది కాక ఒక తూకం మీద విచారణను పరిశీలించాలి. ఇలాంటి విషయంలో సొంత జీవితం కష్టమయమైన సందర్భాలను, పడిలేస్తూ నడిచిన సమాజాన్ని దర్శించిన న్యాయమూర్తి అనుభవసారం గొప్పది. ఇవేవీ ఎరుగక సాఫీగా ఉన్న జీవనాన్ని కలిగి, లోకం పోకడలను గమనించకుండా తనవరకు వ్యక్తిపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ఒక గీతను గీసుకొని సుఖంగా బతికే న్యాయమూర్తికి వ్యవహరణ తీరులో చాలా తేడా కనిపిస్తుంది. స్పందించే గుణంలోనూ, కేసులోని వ్యక్తుల ప్రభావంలోనూ చిక్కుకునే సందర్భాలు ఎదురవుతాయి. కష్టమన్నా కన్నీరన్నా తెలియని, డోలాయమాన జీవితపు లోతులు చూడని యువ జడ్జిగారి పాత్ర ‘న్యాయం’ కథలో చిత్రించబడింది. ‘వెళ్తున్న దారి సరైన దారేనా? అనే అనుమానం ‘తగిలిన వాళ్ళా ఉన్నాడతను’ అని రచయిత ఆ అధికారి పరిచయ వాక్యాలలో చెప్పడం చూస్తే సంశయం అనుభవలేమి స్పష్టమవుతున్నాయి. ఒక వేశ్య కేసు విషయంలో ‘ఏం అమ్మాయ్ ఏం పని చేస్తావ్’, ‘ఏం కంపెనీ అది’ అని అడిగిన ప్రశ్నలలోనే అతని వైఖరి తెలుస్తోంది. వేశ్య అయిన ఆ అమ్మాయి పట్ల వ్యక్తిగత అసహ్యం అతనికి కలిగింది. లోకాన్ని చదివిన వారికి పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు. జీవితాల లోలోతుల్ని స్పృశించని వారికి బతుకు తెరువుల అవసరాలు అర్థం కావు. ఒక ముద్దాయిని జడ్జి ఎదుటివారి కోణంలోనే చూడాలి గానీ, తన కోణంలోని స్పందనలు చూపకూడదు. అన్నింటినీ సరైన దిశగా అర్థం చేసుకోవాలి. ప్రపంచ జ్ఞానం ఒక ఉన్నతాధికారికి అవసరం. దాంతోపాటు తటస్థ వైఖరిని నేరస్థుల విషయంలో అనుసరించాలి. ఒక సంప్రదాయమైన వ్యక్తికి ‘వ్యభిచారం’ పట్ల విముఖత ఉండవచ్చు. కానీ ఆమె సారా వ్యాజ్య ఆరోపణతో న్యాయస్థానానికి రాబడినది. ఇష్టం లేకున్నా వేశ్యరికం ఆమె వృత్తి. అమాయకంగా మోసపోయి కొందరి వలన ఒళ్ళుని అమ్ముకునే స్థితికి దిగజారింది. కానీ ఆమె కూడా మనిషే. ఆమె బతుకు పట్ల ఆమెకు విరక్తి ఉంది. ఆమె ‘ప్రొహిబిషన్ యాక్ట్’ ప్రకారం సారా కేసులో ప్రవేశపెట్టబడిందని తెలిసినా, న్యాయమూర్తి ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఛీదరించుకున్నాడు. ఇలాంటి దృక్పథం ఆ స్థాయికి తగదని చెప్పడమే ఇక్కడి ఉద్దేశ్యం.
నేరస్తులు వచ్చిన కారణాలు, వారి తప్పుల నిర్ధారణ మాత్రమే తీర్పుకు అవసరం. ముద్దాయి సొంత జీవితం పట్ల అవగాహన కూడా అవసరమే. ఆమె ఎలాంటిదో నిర్ణయించేందుకు ఆమె ఉనికి ఉపయోగపడుతుంది. వివిధ నేరాలు చేసిన నేరస్తులపై తమ స్వంత అభిప్రాయాలు కూడదని ఒక అనుభవశాలికి అర్థమైనంతగా మరొకరికి తెలియదు. ప్రతి విషయం పట్ల ఒక సంపూర్ణ అవగాహన జడ్జికి అవసరం. అలా లేకుంటే ఆ దృక్పథం కింది అధికారులకు లోకువతనాన్నిస్తుంది. ‘చాదస్తపు ముండాకొడుకు’ అని ప్లీడర్లు కథలోని జడ్జిని అనుకోవడం అగౌరవంతోనే ఇన్‌స్పెక్టర్, హెడ్ వంటి వారు కూడా అతనితో అతిచనువుని చూపడానికి అనువు అనుమతి లభించినట్లు అయింది. కోర్టు సమయం చాలా విలువైనది. లక్షలాదిమంది ప్రజలకు న్యాయవేదిక కాబట్టి త్వరత్వరగా తీర్పులు ముగించాల్సి ఉంటుంది. అలా లేకుంటే పట్టువిడుపులు లేనివారిగా తేలిపోతారు. అనవసర కాలయాపన కూడా ముఖ్యమైన తీర్పుకు అడ్డుపడుతుంది. లోతుగా అధ్యయనం చేయాలి గానీ ఇలాంటి దృక్పథాలు తగవు. అలాగే సంశయాత్మక ధోరణి డోలాయమానానికి సూచిక. సూటిగా కావలసినమేర వెళ్లి అనవసరాలకు లోబడకుండా తీర్పును చేపట్టాలి. జీవితాలను చదవాలి, అనుభవ విశ్లేషణలు జోడించాలి. వ్యక్తులను కాకుండా తమ వ్యవస్థ విధిని స్థిరంగా నిర్వహించాలని కథా కాలంనాటి న్యాయవ్యవస్థను రచయిత తప్పుబట్టడంలో ఆనాటి పరిస్థితుల దృష్ట్యా సమంజసమనిపిస్తుంది.
న్యాయమూర్తిగా ఉన్నవారు వేగంగా విచారణ జరపాలి. పెరిగిన జనాభాకు తగినన్ని కోర్టులు లేవు. కానీ నేరాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. అన్నీ త్వరగా తెలిస్తేనే సత్వర న్యాయం జరుగుతుంది. అలా లేకుంటే వాయిదాలు, పెండింగ్ తీర్పులతో వృధాగా సమయం ముగుస్తుంది. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కేసులను తేలుస్తుంటే, వందలాదిగా నమోదవుతున్న వాటి పరిస్థితి ఏంటనే ఆలోచన చేయాలి. అలా లేకుంటే న్యాయం పట్ల న్యాయస్థానాల తీరు తీర్మానాలు ఆలస్యమైతే నేరస్థుల పోషణాభారాలు ప్రభుత్వంపై అదనంగా పడటం వంటివి కూడా ఈ వ్యవస్థకు సవాళ్లుగా మారతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవశీలి అయిన న్యాయమూర్తి చేత ‘న్యాయం’ కథలో జడ్జిలు వేగవంతంగా పనిచేయాలని చెప్పిన మాటలు పరిశీలించదగ్గవి.
‘‘నీ కోర్టులో నెలకి ఎన్ని కేసులు? కనీసం అయిదు వందల కొండ కొండా చెప్పిన అయిదు వందల కొండలు తవ్వాలంటే తప్పు. దీనికి నీకు శక్తుంటే ఉండవచ్చు. కానీ టైముంటుందా? ఆలోచించు’’ (రావిశాస్త్రి 47)
పై మాటలను గమనిస్తే కథాకాలం నాటికి కోర్టుకు నెలకి ఐదువందల కేసులు వచ్చేవన్న అంచనా. కానీ ఇప్పుడు వేలు దాటాయి. అలాంటప్పుడు వేగవంతమైన విచారణ చేసే దృక్పథంతోనే జడ్జి స్థానంలోని వ్యక్తి ఆలోచించాలి. వాయిదాలు వేయడం, అనవసర విషయాలను చర్చకు తెస్తున్న న్యాయవాదులను ఖండిస్తూ, పూర్వపరాలు వ్యాజ్యానికి ఎంత అవసరమో అంతే తెలుసుకోవాలి. ఈ విషయంలో న్యాయమూర్తి సత్వర నిర్ణయాలు కీలకం. ఆనాడు సివిల్, క్రిమినల్ దేశద్రోహ కేసులెన్నో ఒకే గొడుగు కింద ఉండేవి. తేల్చడం ముఖ్యం గానీ నాన్చడం ఉండకూడదు. దీన్ని పాటించని ఓ జడ్జి తీరు చూసి న్యాయస్థానంలోని వారంతా ‘ఈ కేసుతో తెల్లారిపోతుంది కాబోలు’ అనుకోవడంలో తప్పులేదు. అలా ఉండటం న్యాయపదానికి తగనిదనే అభిప్రాయాన్ని గ్రహింపజేయడానికి కార్యచరణలో త్వరితగతిన ఉండటం ముఖ్యమనే హితవును ఈ కథలో జడ్జి పాత్రద్వారా వెల్లడించడం గమనించదగ్గ విషయం.
పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టం చెబుతుంది. కానీ అలాగని మీనవేషాలు లెక్కించుతూ ఒక్క కేసుతోనే ఊగిసలాడటం న్యాయమూర్తుల నిబద్ధత సమయపాలన ప్రశ్నార్థకం అవుతుంది. నేరస్తులు వివిధ కారణాలతో బందీలు కాబడతారు. వారు నేరం చేశారా లేదా అనే నిజాన్ని నిగ్గు తేల్చడంపై మాత్రమే కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇది కొరవై నేడు కుప్పలుతెప్పలుగా పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. విచారణ కోసం ఎదురుచూస్తున్న వ్యాజ్యాలలో చాలావరకు చిన్న తీర్పు కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నవారు కొందరైతే, న్యాయ విచారణ పూర్తికాకుండా రిమాండ్ పేరుతో కటకటాలలో మగ్గిపోతున్నవారు మరెందరో ఉన్నారు. ఇలాంటి తరుణంలో న్యాయమూర్తుల దృక్పథం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని రచయిత, స్వయంగా న్యాయవాది అయిన రావిశాస్త్రి ఆయా కథల ద్వారా పేర్కొనడం ఆలోచన కలిగించడం కోసమేనని గ్రహించవచ్చు.
1.2. న్యాయవాదుల దృక్పథాలు
న్యాయం కోసం బాధితుల తరఫున నిలబడి తన గొంతుకతో వాదించేవాడు న్యాయవాది. వారు వాది ప్రతివాదుల తరఫున నిలబడి వారి తప్పొప్పులు ఆ వ్యాజ్యంలో ఏ విధంగా ఉన్నాయో చూడాలి. దోషికి శిక్ష పడేలా వాదించాలి. వివాదాలు సివిల్ క్రిమినల్ అనే రెండు రకాలుగా ఉంటాయి. ఆయా రకాల వాటిని ఆయా న్యాయవాదులే వాదిస్తారు. న్యాయశాస్త్రంలో పట్టు సాధించి బార్ అసోసియేషన్‌లో సభ్యత్వాన్ని పొంది వాక్పటిమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ తనను నమ్మిన వారిని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తారు. తిమ్మిని బమ్మిని చేయడం బమ్మిని తిమ్మిని చేయడం అంతా వీరి ప్రతిభను అనుసరించి ఉంటుంది. అలాగే లాయర్ నేరస్తుని వైపు నిల్చొని అతడిని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేయవచ్చు. దీనివలన దోషి తప్పించుకునే అవకాశం కూడా ఒక్కోసారి ఏర్పడుతుంది. న్యాయమూర్తి విచారణ సాక్ష్యాలు నిరూపణను అనుసరించి ఉంటుంది. కనుక న్యాయవాది దానికి సంబంధించిన కసరత్తు మీదనే ఉంటాడు. వృత్తిధర్మాన్ని అనుసరించి కర్తవ్య నిర్వహణను చేస్తుంటాడు. వీరిలో కనిపించే పలు దృక్పథాలను చూపే పాత్రలు రావిశాస్త్రి కథల్లో చిత్రించబడ్డాయి.
న్యాయవాదులలో రెండు రకాలవారుంటారు. ఒకరు బతకనేర్చిన వారైతే, మరొకరు బతుకునిచ్చేవారు. ధర్మపీఠానికి నేరస్తులు వస్తారు అమాయకులు వస్తారు. ఒకరు నేరం చేసినవారైతే మరొకరు ఏ పాపం తెలియనివారు. న్యాయవాది ఎవరి తరఫునైనా నిలబడవచ్చు. అతని పని తనను నమ్మినవాడెవరైనా సరే నిర్దోషిగా నిరూపించి, గెలిపించి, తనకు రావలసిన ఫీజు రాబట్టుకుంటాడు. అందుకే తమ తమ లాయర్ల వద్ద వాది ప్రతివాదులెవరైనా నిజాన్ని దాచకుండా చెప్తారు. తమ తప్పును ఏమాత్రం దాచరు. అప్పుడే వారిని ఏ పాపం తెలియని వారిగా న్యాయ విచారణలో తేల్చేందుకు సదరు వకీలు ప్రయత్నాలు చేస్తాడు. అంటే వివాదం ఏదైనా గెలుపును మాత్రమే కోరి ప్రయత్నిస్తే హస్తవాసిగల వాడిగా పేరు వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాన్ని కొందరు వదులుకోరు. మరికొందరు న్యాయం వైపు మాత్రమే నిలబడి ధర్మవాదనను చేస్తారు. ‘మాయ’ కథలోని అనుభవజ్ఞుడైన న్యాయవాది తన శిష్యుడికి చేస్తోన్న బోధను చూస్తే ఒక తరహా లాయర్ల దృక్పథం ఎలా ఉంటుందో పసిగట్టవచ్చు. బతకనేర్చడం అనే విధిని మాత్రమే పాటించమని చెప్తోన్న ఆ గురువుగారి మాటల సారం పరిశీలించదగ్గది.
‘‘నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకొనుండాలి. మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కానీ, మూడు గంటలాట సినిమా, మరోటి మరోటి బిజినెస్ అనే చెక్కర్లు కొడితే కొట్టవచ్చు. కొడితే మాత్రం బాగుపడవు. అది ఖాయం. నేననుభవం మీద చెప్తున్నాను. కోర్టంటే ఏమిటో తెలుసా? పెద్ద అడివి! హయినాకి తెలుగు పేరు తెలుసా? దుమ్ములగొండి అది అడవిలో మనిషి నవ్వినట్టు అరుస్తుంది. నువ్వు విని వెళ్తే నమిలి మింగేస్తుంది. మనం కోర్టుకొచ్చిన పార్టీలని ఆకర్షించాలి. వృత్తిధర్మం అది ఏం చేస్తాం’’ అంటూ చిన్నగా నవ్వాడు. (రావి శాస్త్రి 30)
ఈ వాక్యాల్ని సూక్ష్మదృష్టితో గమనిస్తే, కోర్టును కనిపెట్టుకొని వచ్చే ప్రతి కేసునీ దగ్గరకు రప్పించుకునే యత్నాలు చేయగలిగిన వాడికి రెండు చేతులా ఆర్జన ఉంటుందని తెలుస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టి విధి నిర్వహణలో మునిగితే డబ్బు, పేరు, అనుభవం వాటంతటవే సొంతమవుతాయంటున్న మాటలు న్యాయవాదుల నైజాన్ని తెలియజేస్తున్నాయి. న్యాయమైనా అన్యాయమైనా గెలవాలన్నా ఓడించాలన్నా బతకడంలో భాగంగా చెప్పడం కనిపిస్తోంది. విజయం మాత్రమే ప్రధానం. కానీ న్యాయాన్ని నిరూపించి పరిరక్షించాలన్న బోధ ఇక్కడ కానరావడం లేదు. కోట్లకు పడగలెత్తుతున్న లాయర్ల ఐశ్వర్యం ఇలాంటిదేనని చెప్పకనే చెబుతున్నారు. అధర్మం అవినీతి నల్లకోటుకి చేరితే దోషి నిర్దోషి కావచ్చు. అలాగే నిర్దోషి దోషి కావచ్చు. సాక్ష్యాలు వాదనలతో డబ్బు గడించాలన్న కొందరి ప్రవృత్తి ఇది. దీన్ని న్యాయవాది పాత్ర ద్వారా బట్టబయలు చేసిన రచయిత ఆనాటి న్యాయవ్యవస్థలోని లోపాలు న్యాయవాదుల దృక్పథం అర్థం చేసుకోవచ్చు.
ప్రజలకు అవసరమైన సన్నిహితమైన వృత్తుల్లో న్యాయవాద వృత్తి ఒకటి. ఎలాంటి గొడవలు పరిష్కారమైనా, ఏ విధమైన న్యాయాన్ని దక్కించుకోవాలన్నా ప్లీడర్ సాయం తప్పనిది. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, దొంగతనాలు, హత్యలు రాజకీయాలు అన్నీ మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో న్యాయస్థానాల గడపను తొక్కిస్తున్నాయి. దీంతో లాయర్ల సహాయంతో బయటపడడానికి కేసును బట్టి ఫీజులతో నిత్య బేరసారాలతో వాణిజ్య మార్కెట్‌కు న్యాయవాదులే సారధులవుతున్నారు. దీన్ని అవకాశంగా చేసుకొని ఎడతెగని వాజ్యాలతో న్యాయార్జనలు కొందరివైతే, అక్రమార్జనలు మరికొందరివి అవుతున్నాయి. ఏ మార్గంలో వెళ్లాలోనన్నది వారి వ్యక్తిగతమైనది. న్యాయాధిపతులు వారి వాదోపవాదాలను పట్టించుకుంటారు గానీ, వాది ప్రతివాదులను కాదన్న విషయాన్ని ఈ కథలో స్పష్టంగా అవగాహన కల్పించారు రావిశాస్త్రి. అలాగే తాము ఎదగడానికే వృత్తిని అడ్డం పెట్టుకున్న న్యాయవాదుల దృక్పథం ఎలా ఉంటుందో కళ్లకు కట్టడంలో రావిశాస్త్రి కథలు నిలిచాయి. ఇదే కథలో మరోచోట కూడా ఇలాంటి సందర్భాన్ని చెప్పడాన్ని చూడవచ్చు.
న్యాయవాది న్యాయ శిక్షకుడిగా విధి ధర్మానికి మారుపేరుగా ఉండాలి. కానీ మడికట్టుకు కూర్చుంటే సంపాదన పెరగదు. డబ్బు మీది వ్యామోహంతో ధర్మాన్ని అమ్ముకుంటూ క్లయింట్ల ఫీజుల పునాది మీద అవినీతి భవనాలు లేపేవారికి ఆధునిక కాలంలో కొదవలేదు. నేరాలు పెరగడం, దాంతో నేరస్థుల సంఖ్య హెచ్చి తప్పించుకోవాలన్న ఆరాటంతో అధిక మొత్తాలను చెల్లించడానికి సిద్ధపడటం న్యాయవాదుల్లో ఆశాబీజాన్ని నాటింది. నేడు అది పెరిగి న్యాయాన్యాయాలను ఆర్జన కిందకు జమకట్టే బతకనేర్చిన నల్లకోటులెన్నో ఉన్నాయని కథా ముఖంగా చిత్రించడంలో వాస్తవాన్ని అంగీకరించవచ్చు.
1.3. సాక్షుల దృక్పథాలు
కోర్టుకు వచ్చే ఏ రకమైన వివాదంలోనైనా వాద ప్రతివాదులకు సంబంధించిన సాక్షులను వారి వాంగ్మూలాలను న్యాయమూర్తి పరిగణనలోనికి తీసుకుంటాడు. ముద్దాయి నేరస్థుడా కాదా అనే దిశలో అభియోగంలోని వాస్తవ అవాస్తవాలను నిర్ధారించాలి. రాతపూర్వక రుజువులతోపాటు వ్యక్తిపూర్వక సాక్షులే కీలకంగా మారుతుంటారు. వీటిని అనుసంధానించుకునే న్యాయవాదుల వాదనలతో తమ తరఫు వాది ప్రతివాదుల వకాల్తాని పుచ్చుకొని పూర్వపరాల పరిశీలనలతో ముందుకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన పెద్ద కేసులలో సాక్షులకు ప్రాణహాని ఉండటం, చివరి వరకు కోర్టులో వారిని ప్రవేశ పెట్టకపోవడం కూడా జరుగుతుంది. దీన్నిబట్టి వివాదం విషయంలో గానీ, సంబంధిత వాదనలు తీర్పుల్లో సాక్షులు చెప్పే వివరాలెంత మలుపు తిప్పి నిజాన్ని నిగ్గు తేల్చేవో అర్థమవుతుంది. అలాంటి సాక్షుల దృక్పథాలెలా ఉంటాయో కొన్ని కథలలో ప్రతిఫలింపచేశారు రచయిత రావిశాస్త్రి.
కోర్టు తీర్పులెప్పుడూ సాక్ష్యాలను అనుసరించి ఉంటాయి. అది సహజమైనదో లేదా చెప్పించబడినదో కోర్టుకు అవసరం లేదు. నమ్మించేవిగా విచారణకు ఓ ముగింపునిచ్చేవిగా ఉంటే చాలు. దీన్ని ఆసరాగా తీసుకొని వాది ప్రతివాదులు వారి వకీళ్లు ఎలాంటి సాక్ష్యం తమకు అవసరమో గుర్తిస్తారు. దీంతో యదార్థాల కన్నా ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధంచేసి తీర్పును తమ పరం చేసుకోవాలని యత్నిస్తుండటం న్యాయానికి తగిలే మొదటి దెబ్బ. ఇలాంటి వాటి వైనాలెలాంటివో రావిశాస్త్రి కథా పాత్ర అయిన అక్షర జ్ఞానం లేని బాధిత ముత్యాలమ్మ మాటల్లో వింటే కోర్టుల మూసపోసిన నిర్ణయ విధానాల్లో వీటి జాడలెలా ఉంటాయో తెలుస్తోంది.
‘‘ఈ సాచ్చిదార్లు వొక రెనక వొకరూ బోనెక్కినా ముందిద్దరూ కూడబల్కునే యెక్కుతారు. ఆ యనక వొరండాల గుమ్మంవోరన నిలబడి బోనెక్కినోడికి సేతులూపుతూనే ఉంటాడు. దూరంగా పొమ్మంటే ఆళ్ళ మనిషి మరోడు ‘ఆల్లో’ నిలబడి సాచ్చికం బాగాయిని యెల్లి రెండో సాచ్చిదార్తో సెప్పొస్తాడు. అంచేత బాబూ, కోర్‌ట్లాంట అన్నేయాలు నిలబడిపోతాయి’’ అని నిర్వేదంగా పలికింది. (రావి శాస్త్రి 38)
ముత్యాలమ్మకు కోర్టు అంశాలకు సంబంధించి కొంత అవగాహన ఉంది. ఆమెకు కోర్టు విషయాలలో సాక్షుల ప్రవర్తనలు, వారి ప్రాముఖ్యత వంటి అన్ని వివరాలు తెలుసు. ఆమె మాటలను బట్టి సాక్షుల నడుమ సన్నిహిత సంబంధాలతోపాటు ఎవరేం చెప్పారో ముందుగానే నిర్ణయించుకుని రావడం జరుగుతుందని తెలుస్తోంది. వాది ప్రతివాదులున్న వ్యాజ్యాలు కొన్నయితే, పోలీసులు సారా కేసుల్లో మాటువేసి పట్టుకున్నవి, కావాలనే కేసులో ఇరికించినవి కొన్ని ఉంటాయి. ఇలాంటివి జరిమానాలు జైలు శిక్షల్లో ఉంటాయి. పోలీసుల సాక్ష్యాలు కూడా వీటిలో ముఖ్యమైనవి. సాక్ష్యులు ఒకరి తరుపున ఏం చెప్తున్నారో విని మరోవైపు సాక్షులు ఏం మాట్లాడాలో కూడా అక్కడికక్కడ నిర్ణయించుకుంటారనేది లోగోట్టని పాత్ర ముఖంగా తెలపడంలో నిజాన్ని గ్రహించవచ్చు. ఇది న్యాయవాది గుమాస్తాల పర్యవేక్షణలోనే జరగడం న్యాయస్థానాల్లో సారా కేసుల విచారణ తీరును తెలుపుతుంది. సాక్షుల అవతలి పార్టీ వకీలు ప్రశ్నలకు ఏ మేరకు సమాధానాన్నివ్వాలో కూడా తెలియపరచడం మ్యాచ్‌ఫిక్సింగ్‌ని తలపించేలా ఉంటున్నాయి. అందుకే కోర్టులో అన్యాయాలే నిలబడిపోతున్నాయని ముత్యాలమ్మ సామాన్యులు అనుకోవడంలో విచిత్రం లేదంటున్నారు. పేదలకు అమాయకులకు అర్థమైన ఈ సత్యం సాక్ష్యాలే కీలకం అని వాదనలు తీర్పులు ఇచ్చేవారికి తెలియకపోవడం శోచనీయం అనేది కథాకర్త భావనగా అర్థం చేసుకోవచ్చు.
సాక్షి చెప్పే సమాచారం ముఖ్యం కనుక ఆ స్థానంలో విచారణకు వచ్చినవారిలో నిబద్ధత ఉండాలి. తాము చెప్పబోయే మాట నిమిషంగా భావించకుండా, ఆ నిజంపై కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయన్న స్పృహ బాధ్యతలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాల కీలకతను పసిగట్టిన న్యాయవాదులు లేనివాటిని సృష్టిస్తున్నారంటే నేటి వ్యవస్థపై నమ్మకం పోక తప్పదు. దీనిని ప్రత్యేక ఆదాయమార్గంగా కొందరు ఎంచుకున్నారని చెప్తున్న దాఖలాల గుట్టురట్టవుతోంది. న్యాయాన్ని తలక్రిందులు చేయగల శక్తులు ఇలా స్వార్థంతో స్వలాభాలకు వెంపర్లాడటం వలన ఎందరో అవినీతిపరులు నీతిమంతులుగా చెలామణి అవుతున్నారు. సాక్షి చెప్పే మాటలను మాత్రం పట్టించుకొని నిజానిజాలను గాలికి వదిలేస్తున్నారు. సాక్ష్యాలను మాత్రమే విశ్వసించే న్యాయమూర్తులు ఉన్న పాతబడిన ధర్మాసనాల తీరును సంస్కరించలేకపోవడం తప్పిదం. ఇలాంటి అవినీతి సాక్ష్యాలు న్యాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని రచయిత ముత్యాలమ్మ పాత్ర మాటల్లో తేల్చి చెప్పారు. సాక్ష్యాలనే కాకుండా మానవతావాదం సామాజిక కోణాలలో వ్యాజ్యాలను కొన్నింటిని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. తీర్పులు సాక్ష్యాలనే కాక కూలంకష పరిశీలనలో ఉండాలనే హితబోధ ఈ కథ ద్వారా చేయడం గమనించదగ్గ విషయం.
తీర్పులలో ప్రధాన పాత్ర వహించేవి సాక్ష్యాలు. అవి చూసిన, విన్న, ప్రత్యక్ష పరోక్ష సమాచారాన్ని అందిస్తాయి. వ్యాజ్యంతో ముడిపడి ఉన్న సంబంధాన్ని, సమాధానాలను విచారణలో పరిగణనలోనికి తీసుకుంటారు. ఇలాంటి వారిలో కొందరు నిజమైనవారు కాగా, మరికొందరు అక్రమమార్గంలో సృష్టింపబడి కేసును గెలిపించడానికి ఏర్పాటు చేసుకున్న అబద్ధపు సాక్షులు ఉంటారు. రావిశాస్త్రి కథలను పరిశీలిస్తే, ఆనాటి వ్యాజ్యాలలో సాక్షుల మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది. ఈ కథలోని సాక్షుల గురించి చర్చిస్తే వారి దృక్పథాలు బయటపడతాయి. కేవలం కోర్టును తప్పుదారి పట్టించి, తీర్పును వారి అనుకూల పరులవైపు రప్పించడానికి డబ్బుకు ఆశపడే వారే అసత్యపు సాక్షులు. వీరి దృష్టిలో వారు ఆ పనిని కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే చేస్తారు. ‘కోర్టుకు రాని సాక్షులు’ కథలో పురోహితుడు, పెళ్లికొచ్చిన పెద్ద మనుషులు సాక్షాలుగా జరగని పెళ్లిని జరిగినట్లు సృష్టించారు. ఓ ధనవంతుడికి అడ్డుగా ఉన్న అతడు అక్రమంగా భార్యను కొడుకుని వదిలించే ప్రయత్నంలో లేని పెళ్లిని సృష్టించారు. కేవలం డబ్బు కోసం ఆమెను రోడ్డుపైకి తేవడంలో సాక్షులే కీలకంగా మారారు. ధనం సంపాదించడమే ధ్యేయంగా చేస్తున్న అన్యాయాన్ని, కూలుతున్న జీవితాలను పట్టించుకోని సాక్షుల దృక్కోణం ఎక్కడ కనిపిస్తుంది? వారి గురించి చెప్తూ వారిలోనే పగడ్బందీతనం, అబద్ధపు సాక్ష్యాలు, న్యాయాన్ని పాతిపెట్టడం లాంటివి ఎలా ముందస్తు పథకం అయిపోయిందో ఈ కింది మాటల్లో దర్శించవచ్చు.
‘‘వాళ్లలో ఏ ఒక్కడు కూడా తొనక లేదు, బెనక లేదు, తొట్రిపాటు పడలేదు నీళ్లు నమల్నేలేదు.’’ (రావి శాస్త్రి 240)
ఇలా అంటున్న రచయిత మాటలను బట్టి ఎంతటి నటనను దొంగ సాక్షులు ప్రదర్శిస్తారో అర్థమవుతుంది. చదువుకున్న న్యాయవాదుల న్యాయమూర్తుల ముందు నిలబడి నటిస్తూ ఒక అబద్ధాన్ని నిజం చేసి ఫలానా సమయంలో కళ్ళముందు జరిగినట్లుగా చెప్పడం ఒక ఎత్తు. లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్‌లో కంగారు పడకుండా విశ్వాసాన్ని కల్పించడం మరో ఎత్తు. పైగా ప్రతివాది ఖండనలు, నిజాన్ని కోర్టువారు నమ్మని రీతిలో తామే సత్యమని అబద్ధపు సాక్షులు నిరూపించుకోవడం ఎంతో పెద్ద ఘట్టం. ఇవన్నీ దాటడానికి అనుభవం, చాకచక్యం అవినీతిగా అంకితమైపోయిన కుత్సితాలుండాలి. అవతలివారు అన్యాయమైపోతున్నారని తెలిసినా కరగని రాతి గుండెలను ప్రదర్శించి కేవలం ఆర్జన మార్గానికి మరులుతారు. ఇది వారి కఠిన దృక్పథానికి, ధనాశకు సూచకాలు. అంతమందిని మాయచేయగలుగుతున్న కేటుగాళ్లు న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారనే వాస్తవాన్ని చిత్రించి, కథలోని కోర్టులో ఇలాంటి సాక్ష్యం వల్ల ఓ స్త్రీ ఆమె కొడుకు నిరాశ్రయులైన తీరును ఉదహరించి ఆనాటి న్యాయవ్యస్థ లోపాన్ని ఎత్తిచూపారు రావిశాస్త్రి.
1.4. నేరస్తుల దృక్పథాలు
మనిషి సామాజిక జీవి. అతని కార్యచరణలన్నీ ఇతరులతో న్యాయబద్ధంగా ఉండాలి. విలువలు ధర్మాలతో నిండాలి. అలా కాక తప్పుడు పనులను, ఇతరులకు నష్టాన్ని కష్టాన్ని కలిగించే విపరీత ఉన్మాదాలను ప్రదర్శించేవారు నేర స్వభావులుగా పిలవబడతారు. సామాజిక బాధ్యత, సాటివారి పట్ల సౌభ్రాతృత్వాన్ని పాటించక ఇతరుల ధన, మాన, ప్రాణాదులకు హానిని తలపెట్టడంతోపాటు మరెన్నో వైపరీత్యాలున్నాయి. ప్రతి సంవత్సరం పెరుగుతున్న జనసాంద్రత రక్షణ న్యాయవ్యవస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పుట్టుకతో ఎవరు నేరస్తులు కారు. అలాగే ఒక నేరగాడికి జన్మించిన వారు మహోన్నతులు గానూ ఉండవచ్చు. సమాజంలో కొన్ని నేరాలు అక్రమార్కులవైతే, కొందరి వృత్తి జీవనోపాధికై చిన్న నేరాలు చేస్తుంటారు. చేసే పనిని బట్టి నేరం చిన్నదా పెద్దదా అనే భావనను కలిగిస్తుంది. నిషేధిత ప్రవర్తనను కలిగి ఉండటమే నేరంగా పరిగణించవచ్చు.
నేరస్థులనగానే హంతకుడో దోపిడీదారుడో అనేంత భీకరార్థంలో కొన్ని నేరాలలో కనిపిస్తారు. మరికొందరు తప్పనిసరై ఓ రొంపిలోకి దిగి బయటపడే మార్గం లేక అందులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాటిలో సారా అమ్మకం ఒకటి. కథాకాలం నాటికి బహిరంగ సారా అమ్మకాలపై నిషేధాలుండటం చేత ఎవరు అమ్మినా పోలీసులు అరెస్టు చేసేవారు. ఈ రకపు వ్యాపారంలోకి స్త్రీలు కూడా దిగడం, ఎంతో కొంత రాబడులతో జీవనం గడిచిపోతుందని అనుకోవడం జరిగేది. కానీ దందాలు మామూళ్లను మరిగిన పోలీసులను ధిక్కరించినప్పుడు కోర్టు గుమ్మాలను ఎక్కక తప్పేది కాదు. అలాంటిది ముత్యాలమ్మ మాటల్లో ఆమె వేదనతోపాటు, నేరస్తులు సాధారణ వ్యక్తులేనన్న వాదన ఉంది. పరిస్థితుల ప్రభావం నేరాల ఊబిలోనికి నెట్టినప్పుడు వారి దృక్పథాలెలాంటివో ఆమె మాటల్లో అర్థమవుతుంది. అలాంటి దృక్కోణం ఆమె భావనలోంచి వ్యక్తమవుతోన్న విధానం వాస్తవ రీతిలో ఉంది. బతికే దారిని వెతుక్కుంటూ చేస్తున్నది నేరమని ఆ అమాయక దీనులకు తెలిసినా, ఒప్పుకునే ఆత్మసాక్షి గొప్పది.
‘‘బాబూ నాలాంటి బతుకు బతికేకంటే సవ్వడం నయం. ఈ యేపారంలోకి దిగినాక మరీ నీచెం బత్కుజూయిస్సినాను. సిన్నప్పుడయితే కూలికి పోయేదాన్ని. అందల డబ్బు దొక్కదు. కాని యింత నీచెం నేదందల. డబ్బాశెపడి ఇందులోకి దిగినాను. కానీ ఏటి బావుకున్నాను? ఊరోళ్ళనీ, పోలీసోళ్ళనీ పెంచడం అయింది తప్ప మరోట్నేదు. సేతల కాణి మిగల్లేదు. సారా అమ్మకానికి దిగి తాగేవాళ్ళని సెడిపేను, నాను సెడ్డాను. అన్ని యిదాలా సెడ్డాను.’’
(రావి శాస్త్రి 35)
మూర్తితో పలికిన మాటల్లో నేరస్థురాలైన ముత్యాలమ్మలోని పాపభీతి బయటపడుతుంది. ఆమెని నేరస్థురాలిగా చేసిన స్థితిని కారణాలను చెప్పడంతోపాటు, తను చేసిన పనికి చాలా పశ్చాతాపాన్ని చెందుతోందని తెలుస్తోంది. తినడానికి తిండి కూడా లేని ఆమె, నెల మామూలుని పోలీసులకు సమయానికి అందివ్వలేకపోవడంతో ఆ కోపంతో సారా కేసులు పెట్టారు. ఆ పేదరాలిని అరెస్టు చేశారు. ‘ఇలా చాలాసార్లు కోర్టుకొచ్చాను’ అని ఆమె అనడంలో నేరం చేయకుండానే నేరస్తురాలను చేయబడటాన్ని చూడవచ్చు. సంసారాన్ని నడిపి బిడ్డలను పోషించుకోవాలని చాలామంది నిషేధిత సారాను ఆ రోజుల్లో తయారుచేయడం, లేదా ఎక్కడినుండో తెచ్చి అమ్మడం వంటివి చేసేవారు. చట్టవిరుద్ధ పనులతో నేరమేదో తెలియకనే జైలుకెళ్ళడం కథాకాలంనాటి చాలామంది దుస్థితికి అద్దం పడుతుంది. అంతస్సాక్షి తప్పు చేస్తున్నానని హెచ్చరించినా చేయక తప్పని పరిస్థితుల సృష్టికి ముత్యాలమ్మలాంటి వారి విలవిలలు ఆమెలోని నీతికి నిదర్శనం. తప్పు చేసినా చేయకున్నా ఒకసారి నేరస్తులు అనిపించుకుంటే ఎప్పటికీ ఆ బతుకు ఊబిలోనే కూరుకుపోయి మునిగిపోక తప్పదు. ఆ సమయంలో దిక్కులేని పేదల కష్టాలు చెప్పదగ్గవి కానివని అర్థమవుతుంది. ఆ మార్గంలోకి ‘ఎందుకొచ్చానా’ అని వారు పడే వేదనను మించిన శిక్ష మరొకటి ఉండదని రచయిత స్పష్టంచేయడంలో ఆనాటి సమాజాన్ని దగ్గరుండి పరిశీలించారని తెలుస్తుంది. బతికే తెన్నులేక ఏదో సంపాదనలకై చిన్నా చితకా నేరాలు చేసేవారి విషయంలో నేరస్తులనే ముద్ర తప్ప వారు బాగుపడేదేం లేదని ఆనాటి పేద నేరస్తుల పట్ల దయాగుణాన్ని వెల్లడించడంలో రచయిత దృక్పథం తెలియవస్తుంది.
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసి నేరస్తులను అనిపించుకున్న పిదప, పడిన ముద్ర అంత సులువుగా చెరిగిపోదు. బతికేందుకు ఏదో ఒక పనిని నమ్ముకుంటే అది తప్పై నేరగాళ్లను గేలి చేయిస్తుంది. అదే మద్యాన్ని ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి మరీ అమ్మిస్తే అది నేరం కాకుండా పోయింది. నేరస్తురాలిగా ఆమెను కోర్టుకి తీసుకురాబడితే, ఏ న్యాయస్థానం శిక్షిస్తుందో తెలియదు. అధికారులు సామాన్యులపై జులుం చలాయించగలరు. కానీ గవర్నమెంట్‌కి దాసులు. జీవనోపాధిని చూపలేని ప్రభుత్వ వైఖరి నేరస్తులను తయారు చేస్తుంది. బతకడానికి ఏదో ఒక పని అనే తీరు నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. లాయర్ ఫీజును కూడా ఇచ్చుకోలేనని ముత్యాలమ్మ తన తరఫున వాదిస్తే నీ ఇంట్లో పాచిపని అయినా చేసి రుణం తీర్చుకుంటానని మూర్తితో అంటుంది. నిస్సహాయత, పేదరికం, బతుకుపై ఆశ కొందరిని నేరస్తులుగా నిలబెడుతుంది. అందులోనే కొనసాగాల్సి రావడం వారి దురదృష్టమని నేరస్తులలోనూ బాధ్యత, పాపభీతి అనేవి ఉంటాయన్న దృక్పథాన్ని ఆమె పాత్ర ద్వారా పరికింపజేయడంలో రావిశాస్త్రి పేదల పక్ష న్యాయవాదిగా గుర్తించవచ్చు.
దాదాపు ఇలాంటి వేదననే మరో మార్గం లేక ఒళ్ళు అమ్ముకుంటున్న వేశ్య పాత్ర దృక్పథం ‘న్యాయం’ కథలో ఉంది. ఈ మానవ సమాజంలో ఎక్కడైనా ఒక తప్పు జరిగితే అందరూ ఆ వైపునే వేలెత్తి చూపుతారు. దాని వెనుక ఉన్న కారణాన్వేషణను చేయక కించపరుస్తారు. అందులోనూ కోర్టు గుమ్మం ఎక్కిన యువతిని నేరస్తురాలిగా, హేళనగా, నీచంగా మాట్లాడటం చూస్తుంటాం. ఈ లోకంలో తానూ ఒక భాగమేనని దిక్కులేని వారిని చేసిన సాటివారి మీద ఈమెకు నిర్లక్ష్యం. స్వతంత్రించి ఏమీ అనలేక తన ఈ గతికి అందరూ కారణమేనన్న ఆవేశం ఆవేదన రూపంలో వెల్లువెత్తుంది. ఆ నేరస్తుల మాటలే సాక్ష్యమైన తీరును గమనిస్తే:
‘‘చచ్చిపోతే యెవరేడవాలి? మీరేడుస్తారా? యెవరేడవాలి? తల్లా? తండ్రా? తోబుట్టువా? ఎవరున్నారు? అందరూ వుంటే ఈ బతుకెందుకు బతకాలి?. అందరూ వుంటే మీ కడుపున ఆడకూతుర్లందర్లాగానే నేనూ బతుకుదును. ఈ కుక్క బతుకెందుకు బతకాలి?” (రావి శాస్త్రి 48)
వేశ్యగా, తాగడం అనే నేరం చేసి తప్పుడు దారిలో బతకాలని ఎవరూ అనుకోరు. ఆ మార్గానికి వెళ్తున్నా మిన్నకుండిపోయిన జనులంతా ఆ తర్వాత వేలెత్తి చూపడాన్ని వారు సహించలేరు. అనాధలా వదిలేసినప్పుడు తను ఏమైపోతే ఏంటనే ప్రశ్న ఆమెది. అప్పుడు లేని న్యాయాన్యాయాలు విచక్షణలు ఇప్పుడెందుకని కోర్టు వారినే నిలదీయడం, ఏదారీ లేక ఆ దారికి వచ్చిన ఆమె వేదనకు సాక్ష్యం. తమ జీవితాన్ని నిలబెట్టలేని వారికి దండించే హక్కు ఎక్కడ ఉంటుందని నిలదీయడంలో బాధ్యతను గుర్తు చేసింది. ఆ బాధలో తిరుగుబాటు ధోరణిని కథాకర్త కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. సుఖంగా సంతోషంగా జీవించాలని నేరం చేసి కోర్టు గుమ్మాల ముందు నిలబడాలని ఎవరూ కోరుకోరు. కానీ నేరస్తులను ఆ తప్పుడు దారికి వెళ్ళనీయకుండా రక్షణను కల్పించినప్పుడు అలాంటి తప్పులు దొర్లాల్సిన పనిలేదని ఈ కథల ద్వారా వెల్లడించారు రచయిత.
1.5. పోలీసుల దృక్పథాలు
సమాజంలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పడినదే రక్షకభట వ్యవస్థ. సంఘంలో శాంతిభద్రతలను కాపాడటానికి వ్యక్తుల మధ్య ఏర్పడే వివిధ రకాల తగవులు, దోపిడీలు, హత్యలు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు కారకులైన వారిని అదుపులోనికి తీసుకునే విధిని ఈ వ్యవస్థ నిర్వర్తిస్తుంది. నేరస్తులను విచారణ నిమిత్తం కోర్టులకు పంపుతారు. అక్కడ విధింపబడిన శిక్షలను అమలుపరిచి ఖైదీలలో మార్పుకు కృషి చేస్తారు. నిస్సహాయులకు ఎలాంటి కష్టం వచ్చినా రక్షక భటశాలకు ఆసరా కోసం పరుగులు తీస్తారు. చట్టాన్ని పరిరక్షించే పోలీస్ వ్యవస్థ ఉన్నతమైనది. ప్రజాజీవనంలో శాంతిరక్షణకై ఈ నిలయాలు భాగం అయ్యాయి. వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ యంత్రాంగపు సేవలు చట్టబద్ధంగా అవసరం అవుతాయి. నేర ఛేదనలో, ధర్మ పరిరక్షణలో వీరి పాత్ర ముఖ్యమైనది. నేరస్తులతో అక్రమార్కులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం వలన వీరి దృక్పథాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. వీటిని దగ్గరగా పరిశీలించిన రావిశాస్త్రి కొన్ని కథల్లో మక్కికి మక్కి పాత్రల ద్వారా కళ్ళముందు ఆవిష్కరించారు.
ఆనాటి పోలీసులకు పూర్తి స్వాతంత్ర్యం అధికారం కావాలని ఆరాటం ఉండేది. బ్రిటిష్ కాలంలో పరాయి పాలనకు, వారి వ్యాపారాలకు స్వదేశీయుల అడ్డులేకుండా భయపెట్టి అణచివేసేందుకు పోలీస్ వ్యవస్థకు లాఠీలిచ్చింది. వ్యతిరేకులను కొట్టినా చంపినా పర్వాలేదన్న భరోసానివ్వడంలో వారు అడ్డుఅదుపు లేనంత దర్పాన్ని వెలగబెట్టారు. అందుకే స్వాతంత్య్రానంతరం కూడా ముందురోజులే బాగున్నాయని దృక్పథం వారిలో ఏర్పడింది. ఇదే విషయాన్ని ఒక హెడ్ కానిస్టేబుల్ అభిప్రాయంగా ‘న్యాయం’ కథలో జడ్జితో జరిపిన సంభాషణ సమయంలో వెలువరించారు రచయిత. పోలీసులు తమ చేతిలోనే సర్వాధికారాలు కేంద్రీకృతం అవ్వాలని కోరుకుంటారనే భావనను అతని మాటల్లో పలికిస్తూ:
‘‘ఆ టైములో ఒక చిన్న జవాను కాదు, యింకా ట్రైనింగు పూర్తవని రిక్రూట్ వైపైనా సరే ఎవడైనా కన్నెత్తి చూస్తే చాలు బాబుగారూ! వెంట్నే తెచ్చి కొట్టులో వేసిడమే! శిశుపాలుడి పరిపాలన! తన్ని పరిపాలించాడు తెల్లబాబు. అందుకే అంత హాపీగా వెళ్ళిపోయింది.’’ అని పాత రోజుల్ని నెమరేసుకున్నాడు.’’ (రావి శాస్త్రి 46)
పరికించి చూస్తే పోలీస్ నైజం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నట్లు ఉంది. కిందిస్థాయి నుండి పై స్థాయివరకు అందరి మధ్య ఈ వ్యవస్థలోని అంచెలవారి సమన్వయం నెలకొంది. రక్షకభటుల పేరు వింటేనే జనం వణకాలన్న ప్రయత్నం వారిది. భయాన్ని కలిగిస్తే బాధ్యతగా ఉంటారన్న దృష్టికోణం ఆనాటి నుండీ అలవడింది. తెల్లోళ్ళ నియంతత్వం తర్వాత ఏర్పడిన ప్రజాస్వామ్యంలో కొంతమేరకు పరిధి అధికారాలు కుదింపబడినట్లయింది. దీంతో వీరిలో అసంతృప్తి బయలుదేరిందనడంలో సందేహం లేదు. ఆనాడు ఘోరాలు, దౌర్జన్యాలు, దుష్టతలు అన్నీ వీరి చేతుల మీదుగా జరిగినవే. పాలక ఆజ్ఞలతో ఎందరో స్వాతంత్య్రకారులను ఉక్కు పాదాల కింద పురుగులను చేశారు. జలియన్ వాలాబాగ్ వంటి దుశ్చర్యే ఇందుకు సాక్ష్యం. నిజాం పాలనలోనూ అలాంటి సందర్భాలు యధేచ్ఛగా సాగి ప్రజల రక్షణను కాక, వారి ధన, మానప్రాణాదులకు ముప్పు వాటిల్లింది. కానీ ఆధునిక కాలంలో చాలా వరకూ ఈ వ్యవస్థ విచ్చలవిడితనం నుండి క్రమబద్ధీకరణకు కొంత తావిచ్చింది. అయినప్పటికీ పూర్వపు పెత్తనాన్ని గొప్పగా తలిచేవారు. అందుకనే ఈ కథలో జడ్జితో ఓ పోలీస్ మాటలను రుజువుగా చూపించి పోలీసుల దృక్పథాన్ని వెల్లడించారు రచయిత.
శాంతిభద్రతలను కాపాడాల్సిన వారి నుండి ఏదైనా విఘాతాలెదురైతే వారిపై కేసు పెట్టే అధికారాన్ని పౌరులకు పోలీస్ యాక్ట్ ఆఫ్ 1861 కల్పించింది. ఇది పోలీస్ నియంత్రణ చట్టం (www.humanrightsininative.org) ఆధునిక కాలంలో మరిన్ని మార్పులతో ఈ పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కేసును వేసే వెసులుబాటును ఇచ్చింది. ఒకప్పుడు పేల్చిన తూటాలు రక్తసిక్తమైనవి కాగా, ఇప్పుడు వాటికి ఒక లెక్క ఉంది. కొన్ని నిబంధనలు నియంత్రణల ప్రకారమే ఆయుధ వినియోగం జరుగుతుంది. ఇవన్నీ వారికి నచ్చినవే అయినా, ఉద్యోగ ధర్మం తప్పనిదిగా పాటిస్తున్నారు. అరెస్టు చేయడంలోనూ, ఆ తర్వాత కోర్టుకు ముద్దాయిలను పంపడంలోనూ కొన్ని నిబంధనల ప్రకారం వారు నడుచుకోవాల్సి రావడం స్వతంత్రతకు అడ్డుగా ఆ వ్యవస్థ భావిస్తోంది. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణి పోలీస్ యంత్రాంగంలో కలగకుండా చూడటం శాంతిభద్రతల సంరక్షణలో భాగమేనని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. అందుకే నియంతృత్వాన్ని ఆస్వాదించినట్లుగా ప్రజాస్వామ్యంలోని నిబంధనలు వారికి రుచించలేదని రచయిత తన అభిప్రాయంగా తెలియవస్తుంది. అంటే పోలీస్ వ్యవస్థ అంతా దౌర్జన్యపూరితం అని కాదు. కథాకర్త కాలంలో చాలామంది రక్షకభటుల తీరును మాత్రమే ఈ ప్రస్తావనలో ఉందని అర్థం. పోలీస్ వ్యవస్థ సమాజాన్ని చట్టబద్ధంగా నడుచుకునేలా చేస్తూ, అందరిని దారిలో పెట్టగలగాలి. అలాగే శాంతిభద్రతలను కాపాడటంలో నిష్పక్షపాతంగా కొనసాగడాన్ని విధిగా నిర్వర్తించాలి. కానీ పాలక, కార్యనిర్వాహక వర్గాల కనుసన్నల్లో నడిచే సైన్యంగా ప్రవర్తిస్తుంది. అలాగని ఈ వ్యవస్థ దుర్మార్గమైనది కాదు. దీని లక్ష్యాలు, ధ్యేయాలు, విధులు అన్నీ ఉన్నతమైనవి. కానీ అవినీతికి లోనుచేసే శక్తుల ప్రభావం రక్షకభటులపై పడటంతో వారు వ్యంగ్యంగా పిలవబడుతున్నారు. వీటన్నిటినీ ఆయా కథల్లో కళ్ళకు కట్టినట్లు చిత్రించి ఆనాటి పోలీస్ వ్యవస్థ తీరును ఎండగట్టడం గమనించదగ్గ విషయం.
సారా చట్టాల అమలు, సారా నిషేధకార ఇతివృత్తాలు రావిశాస్త్రి కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పైగా ఆనాటి సమాజంలో ఈ వ్యవస్థలోని కొందరు ఉద్యోగుల తీరు సమర్థనీయం కాదని కూడా ఎద్దేవా చేయడం కథల్లో కనిపించింది. అది ప్రశ్నార్థకమై పోలీస్ ఉనికిని కొంత వ్యతిరేక ధోరణితో ఆనాటి సమాజంలోని సామాన్యులు, సంస్కర్తలు, సాహితీకారులు చూడటంలో అతిశయం లేదు. కొన్ని సందర్భాలు అలాంటివి. వీటి ప్రస్తావనలు చూసి రావిశాస్త్రి పోలీస్ యంత్రాంగాలకు వ్యతిరేకి అన్న భావన తగదు. రచనా కాలంనాటి సాహితీవేత్తగా, సామాన్యుల కష్టాలు సూక్ష్మ పరిశీలన చేసిన వ్యక్తిగా వారి భావనలను స్వీకరించాలి. పైగా రచయితలు ఎవరు దారితప్పినా విమర్శించి సమాజాన్ని అప్రమత్తం చేయడానికి, నిజ నిర్ధారణలు చేయించడానికి యత్నిస్తారు. ఆ యత్నంలో భాగంగా నిర్ద్వందంగా కొన్ని వాస్తవాలను కథనాల ద్వారా ఆలోచింపజేయడంలో రావిశాస్త్రి కృతార్థులయ్యారని చెప్పుకోవచ్చు.
కొందరు రక్షకభటుల దృక్పథంలో తమకు ఎదురొచ్చిన, ఎదురు చెప్పిన వారిపై అధికార దుర్వినియోగం చేస్తూ కేసుల్లో ఇరికిస్తుండటం చూస్తున్నాం. అక్రమ సంపాదనకై నెల మామూళ్లకు పాల్పడి వ్యాపారస్తుల వద్ద డబ్బును వసూలు చేయడం తెలిసిందే. తప్పు చేసేవారు తమను చూసీ చూడకుండా వదిలేయమని, అరెస్టులను తప్పించుకోవాలని ఎంతో కొంత ముట్టజెప్పడం పరిపాటి. ఈ మధ్య నిషేధం అమలులో ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన చట్ట వ్యతిరేక పనుల విషయంలో కొన్ని అవకతవకలున్నాయి. అక్రమ సారా అమ్మకందారుల వద్ద మామూళ్లు లంచాలు సరైన సమయంలో అందుకున్నా, అరెస్టు చేసి కోర్టుకు పంపి కక్ష తీర్చుకునే పోలీసులు కూడా ఉండేవారు. ప్రతిదాన్ని అధికారంతో ముడిపెట్టి అనుకున్నది సాధించే వారికి ముత్యాలమ్మ పాత్ర లాంటి బడుగులే లక్ష్యాలు. న్యాయం కథలో హెడ్ కానిస్టేబుల్ లాయర్ మూర్తితో చెప్పిన మాటలు గమనించదగ్గవి.
‘‘అవును బాబూ! అబద్ధం కేసే అనుకోండి. కానీ, ఆవేళ నన్నెంత లేని మాటలన్నదో తమరు విన్లేదు. కనీసం, పొగకైనా మర్యాదా చూపించింది కాదు. అందుచేత మరి ఈ చురక తగిలించేను.’’ (రావి శాస్త్రి 37)
ఈ వాక్యాలను గమనిస్తే డబ్బు కోసం నీచానికి దిగజారే ధోరణిని పోలీస్ హెడ్ కనబరిచాడు. ఒక పేద స్త్రీ పరిస్థితి తెలిసీ ఆమె నుండి అందాల్సిన తాయిలాల కోసం కక్ష సాధింపు చర్యకు పాల్పడడాన్ని చూడగలం. తనకి తన టోపీకి విలువివ్వలేదని, లేని సరుకు దొరికిందని కేసు పెట్టడం దుర్మార్గం. చేసే పని సరైనది కానప్పుడు గౌరవాన్ని విలువను ఎదుటివారి నుండి ఆశించకూడదు. అధికారాన్ని చూపి భయపడితే అలాంటి అవమానం పునరావృతం కాకుండా మామూలు సమర్పించుకుంటారనే ఉద్దేశ్యం మంచిది కాదు. లంచాలు ఇవ్వకుంటే రూపాయికి 100 కోల్పోవలసి వస్తుందని బెదిరించి దారిలోకి తెచ్చుకునే సాధింపు చర్యల్లో ఫలితాలిలా ఉంటాయి. దీన్నిబట్టి కొందరు పోలీసువాళ్ళు వైఖరి ధనార్జన మీదే కానీ, ప్రజా పరిరక్షణ మీద కాదనే ఆనాటి దృక్కోణం అర్థమవుతుంది.
ఎర్రటోపీతో పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తాడనేది సాధారణ జనుల మాట. దాన్ని నిజం చేసే సంఘటనలను చూసి వారిపట్ల సదాభిప్రాయం కలగదు. ఇప్పట్లో మీడియా ద్వారా కొన్ని దురాగతాలు బయటికి వచ్చి ఆ వ్యవస్థ మీద గౌరవ స్థానంలో భయమో అసహ్యమో కలగక మానదు. ప్రజా నమ్మకాన్ని చూరగొని వారితో మెలగాల్సిన వారే ద్రోహులుగా మిగలడం మంచిది కాదు. ఇలాంటి నైజాన్ని పునాది చేసుకుని నేరస్తులు అవినీతిపరులు డబ్బు కట్టలతో ఖాకీల నోర్లు మూయించి ఇష్టారాజ్యాన్ని ప్రదర్శిస్తారు. నిరుపేదలను వదలని వారు దుష్టుల పంచచేరి కొమ్ముకాస్తే అనేక విపరీతాలు చోటుచేసుకుంటాయి. న్యాయం ఇలా కొరవైపోతుందని అనడంలో పునరాలోచన రాదని రచయిత పరోక్షంగా హెచ్చరించారనిపించింది. సంఘవ్యతిరేక కార్యకలాపాల పుట్టుక పోలీస్ వారి అలసత్వం, బలహీనతలు అనే దృక్పథాల మీదే పునాదులు వేసుకుంటాయి. అలా కాకుండా పోలీస్ వారికి సామాజిక బాధ్యతే వారి వృత్తి నిర్వహణ అనే విషయం అర్థం చేసుకోమని హితవు పలకడం ఈ కథల్లో కనిపించింది. తద్వారానే రక్షకభటుడు అనే అసలైన నమ్మికను అందరూ పొందగలుగుతారు. డబ్బును అవినీతిని కాకుండా విధిని ప్రేమిస్తే ఈ సమాజ ప్రక్షాళనకు చట్టాలు ఉపయోగపడతాయి. రచయిత ఆకాంక్ష కూడా అదే కనుక రావిశాస్త్రి తన కథల్లో తప్పులను ఎత్తిచూపుతూ మార్పును ఆశించారని అర్థం చేసుకోవచ్చు.
ఉపసంహారం
రావిశాస్త్రి కథలలోని వివిధ దృక్పథాలు ఆనాటివి కనుక ఆనాటి సామాజిక స్థితిగతులను అనుసరించి ఉన్నాయి. వాటిలో కొన్ని నేటికీ సరిపోలి ఉన్నాయి. కారణం మన న్యాయవ్యవస్థ అలనాటి బ్రిటీష్ కాలం నాటిది. కొత్త చట్టాలు కాలానుగుణంగా చేయబడుతున్నప్పటికీ అన్నిటికి పరిధులున్నాయి. జనసంఖ్యకు తగినంతగా లేని తీర్పు పెద్దగా మార్పులను ఆస్వాదించదు. ఈ తరహా సామాన్య ప్రజాజీవితాలలోని బాధను, వాస్తవాలను వెల్లడిస్తున్న కథలుగా ఆలోచింపజేశాయి. ఆనాటి కష్ట కారకమైన న్యాయవ్యవస్థలోని దృక్కోణాలనే అధికంగా చూపవలసి రావడంతో అందులోని లోపాలే వాస్తవరీతిలో ఎక్కువగా కానవచ్చాయి. కథనానికి సంబంధించి అలా చూపక తప్పదు. కానీ నేటికీ న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉందంటే చాలా గొప్పతనంగా చెప్పుకోవాల్సిందే అనిపించింది. అలా చట్టం న్యాయం కలిసి పనిచేస్తే సమాజ రక్షణ శాంతిభద్రతలు కాపాడబడతాయి.
సమాజం కొన్ని నీతి సూత్రాలను, పటిష్టతలను, వ్యవస్థాగతమైన ఏర్పాట్లను అనుసరిస్తుంది. అవి వ్యక్తుల జీవన క్రమాలను సరైన దారిలో పెట్టేవిగా ఉంటాయి. అలాంటి వాటిలో న్యాయ వ్యవస్థ ఒకటి. జనుల తప్పులను గుర్తించి దండనలను విధిస్తుంది. అలాగే హక్కులను పరిరక్షిస్తూ బాధితులను కాపాడుతుంది. నేరాలను అదుపు చేస్తూ, సంఘంలో శాంతిభద్రతల పట్ల న్యాయపూరిత భరోసాను అందించిన న్యాయస్థానాల పట్ల గౌరవం నెలకొంది. ఎక్కడైనా అంతా సవ్యంగా ఉంటే అస్సలు ఏ గొడవ లేదు రాదు. కానీ మనిషి వర్తనలు న్యాయాన్యాయాల విచారణల్ని కోరుతాయి. అలాంటప్పుడు న్యాయమూర్తులు న్యాయవాదులు తమ వంతు కర్తవ్యాలను విలువలతో నిర్వర్తించాలి. ఇక సాక్షులు నేరస్తులు కూడా న్యాయస్థానాలకు రాబడతారు. అలాగే రక్షకభటులు తమ విధులను నిర్వర్తిస్తూ న్యాయవ్యవస్థకు చట్టబద్ధ కార్యనిర్వాహకులుగా సంధానించబడతారు. అలాంటప్పుడు వీరందరి దృక్పథాలు ఎలా ఉంటాయో తెలపడం వల్ల ఆనాటి వ్యవస్థ ఎలా ఉందో ఎలా ఉండేదో రావిశాస్త్రి కథల్లోని పాత్రలను గమనిస్తే తెలిసింది. ఎలాంటి దాపరికం లేక కథల ద్వారా ఉన్నది ఉన్నట్లు చెప్పే క్రమంలో మంచి చెడుల విచక్షణలను అంచనాలు వేసిన తీరు నిశిత దృష్టికి నిదర్శనంగా ఉంది.
న్యాయవ్యవస్థ పరిధిలోనికి వచ్చే ప్రతి అంశాన్నీ చర్చించే క్రమంలో దృక్పథాలు క్రమాలు ముఖ్యమైనవి. న్యాయమూర్తులు వేగవంతంగా పనిచేయకుంటే సత్వర న్యాయాలు సాధ్యం కావు. అలాగే ఒక్కోసారి నేరాన్నే కాక మానవతను తీర్పుకై పరిగణనలోనికి తీసుకోవాలి. వృత్తిపట్ల అంకితభావం, విధి పట్ల నిబద్ధతలు ఉండాలి. రచయిత వీటిని వివరించి చూపుతూ ఇవి లేనివారు ధర్మపీఠంపై ఉంటే న్యాయం ఎలా అభాసుపాలవుతుందో తెలిపే పాత్రల దృక్పథాలను వివరించారు. అలాగే న్యాయవాదుల్లో డబ్బు ప్రధానమైతే న్యాయ విచారణలూ నిరూపణలూ గతి తప్పుతాయి. అలా జరిగితే బలహీనులు, పేదలు, అమాయకులు బలవుతారన్న విషయాన్ని కథలో తెలిపిన విధానంలో న్యాయవాదుల దృక్పథాలు తేటతెల్లమయ్యాయి. న్యాయవాదులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలిపిన వైనాలు ఉన్నాయి. ఇక సాక్షులు సాక్ష్యాలు న్యాయ నిర్ధారణలో కీలకాలు. అవి తీర్పును ప్రభావితం చేసే విషయంలో స్వార్థత్వాలను, ఆ ప్రభావాలను వివరించారు. సత్యబద్ధత ఉన్న సాక్ష్యాలు ఎంత అవసరమో తెలిపి, ఆయా దృక్కోణాలు ఎలాంటివో విశదపరిచారు. నేరస్తుల దృక్పథాలను తెలుపుతూ నేరం చేసే వారి దుష్ట వైఖరులు తెలియజేస్తూనే నేరంలో తెలిసీ తెలియక చిక్కుకునే అమాయకులను కళ్ళ ముందుంచారు. వారి హృదయాంతరాళాలను తరచి చూపడంలో యదార్థవాదిని చేసిన తీరు ఆలోచనాత్మకంగా ఉంది. ఇక రక్షక భటుల దృక్పథాల విషయంలో కథాకర్త కాస్త తీవ్రంగానే స్పందించారు. అవినీతితో బలహీనులను కాలరాసే దృక్పథాలు ఎలాంటివో తేటతెల్లం చేశారు. మానవత్వం లేని విధి ప్రకాశించదంటూ చట్ట పరిధుల్లోని వ్యక్తుల వర్తనలను వాస్తవరీతిలో తెలిపారు. అలా కథల్లో పేర్కొన్నవి కథాకాలం నాటి సారా వ్యాజ్యాలతో ముడిపెట్టి దాష్టీకాలను ఎండగట్టడం గమనార్హంగా ఉంది. ప్రతీ కథలోనూ దీనుల పక్షపాతిగా వారు ఎలా బతుకు బాటలో నలిగిపోతున్నారో చెప్పడంలో శాస్త్రిగారి దృక్పథమూ అవగతమయ్యింది.
సమాజంలోని న్యాయాన్ని సత్యాన్ని శోధించే క్రమంలో నిజాలను నిర్భయంగా చెప్పగలగాలి. ఈ వ్యాసం ప్రతి కథలోని పలు పాత్రల, వారి విధుల దృష్టాంతాలలో చెప్పిన వైనాలు ఆనాటి సమాజాన్ని ముందుంచాయి. న్యాయబద్ధత అనేది ఏ మేరకు ఉందో, న్యాయం ఎలాంటి తీరులకు బలవుతుందో నిస్సంకోచంగా వివరించారు. అవే దృక్పథాలు నేటికీ కొనసాగుతూ న్యాయవ్యవస్థ డొల్లతనానికి ఎంతగా దోహదమవుతున్నాయో పోల్చుకోవడానికి ఉపయోగపడతాయి. సమాజంలో న్యాయం కళ్ళు మూసుకుంటే చిన్నాభిన్నమవడం తప్పు కాదు. అదే విషయాన్ని చాలా కథల్లో బలహీనుల తరఫున నిలిచి గళాన్ని విప్పారు రావిశాస్త్రి. వీరి కలం సంస్కరణలను కోరి ప్రక్షాళన అవసరం అని తేల్చింది. అయినా నేటికీ మార్పు లేకపోగా మరింతగా దిగజారిన దృక్పథాలున్నాయని తెలుస్తుంది. న్యాయవ్యవస్థలో బలవంతులు కొమ్ముకాస్తూ అవినీతిని చిందిస్తున్నాయి. వీటికి బలి అయిపోయేది పేదలు అమాయకులే. న్యాయం వీరికి వర్తించి శిక్షించినంతగా అధికారాలున్నవారికి సంపన్నులకు చెల్లట్లేదు. అన్నిచోట్లా అసమానతలు ఉన్నట్లే ఉన్నవారికో న్యాయం, లేనివారికో న్యాయం అనే కోణాన్ని ఆనాటి ఈ కథల్లో ఆవిష్కరించారు రావిశాస్త్రి. అదే తీరు నేటికీ కొనసాగుతూ చట్టం న్యాయం అనేవి ఎలా వాటి విధి ధర్మాన్ని కోల్పోతున్నాయో చెబుతూనే ప్రక్షాళనను కోరి సృష్టించబడిన కథలు ఆశయం నెరవేరని కారణాలను, తదనుగుణ సమస్యల్ని రాసే క్రమంలో రచయిత ఉద్దేశాదుల్నే అనుసరించాను. ఇక్కడ న్యాయంపైన నమ్మకం లేదనడాన్ని సమర్థించకున్నా, మానవ నైజాలు వృత్తికి అంటుకుంటే విధులు అభాసుపాలవుతాయి. ఈ విషయం కొంత ఘాటుగా చెప్పినా, ప్రక్షాళనను ఆశించే రచనలు చేశారని చెప్పక తప్పదు. సున్నితాంశాలను కూడా తెగువతో చెప్పినప్పుడే ఏదైనా చర్చించే తీరుకి అనువు ఏర్పడుతుంది. అందుకే మార్పు పురోగమనం వైపు ఉండాలని కోరి తిరోగమనం వైపు ఉండకూడదన్న దిశలోనే పరిశీలించడమైంది.
ముఖ్య సూత్రాలు
- న్యాయ వ్యవస్థ పనితీరు, దానిలో భాగమైన వివిధ వ్యక్తుల దృక్పథాలను రావిశాస్త్రి తన కథల ద్వారా విశ్లేషించారు.
- న్యాయమూర్తులు సత్వర న్యాయాన్ని అందించడం, మానవతా దృక్పథంతో వ్యవహరించడం ప్రధానం.
- న్యాయవాదులు వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలి; డబ్బు వ్యామోహంతో న్యాయాన్ని వక్రీకరించకూడదు.
- సాక్షులు నిజాన్ని మాత్రమే వెల్లడించాలి; స్వార్థంతో అసత్య సాక్ష్యాలు ఇవ్వడం న్యాయానికి హానికరం.
- నేరస్తులను మానవతా కోణంలో అర్థం చేసుకోవాలి, వారి నేరాలకు దారితీసిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి.
- పోలీస్ వ్యవస్థ ప్రజా రక్షణకు, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి; అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు.
- రావిశాస్త్రి కథలు ఆనాటి సమాజంలో న్యాయవ్యవస్థ లోపాలను, అసమానతలను స్పష్టంగా తెలియజేశాయి.
- న్యాయ వ్యవస్థలో అవినీతిని తొలగించి, పేదలకు అమాయకులకు న్యాయం అందాలనే ఆకాంక్షను రచయిత వ్యక్తం చేశారు.
ఉపయుక్త గ్రంథసూచి
- కృష్ణాబాయి., ప్రసాద్, చలసాని., సంపాదకులు. రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనా సర్వస్వం. నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్, 2015.
- కె.వి.యన్.డి., వరప్రసాద్., సంపాదకులు. రావిశాస్త్రి సాహితి. సంహిత పబ్లికేషన్స్, రాజమహేంద్రవరం, 2022.
- రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనా సర్వస్వం. నవోదయ బుక్ హౌస్, 2015.
- వి.వి.న., మూర్తి., ఎం.వి., రాముడు., సంపాదకులు. రావిశాస్త్రి రచనా సాగరం. మనసు ఫౌండేషన్, నెల్లూరు, 2007.
- శ్రీకృష్ణ, తాటి. రావిశాస్త్రి నవలానుశీలన. బసవపూర్ణ పబ్లికేషన్స్, విజయవాడ. 1997.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

