headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

3. . అంతర్జాల తెలుగు భాషాసాహిత్యవికాసం: వికీపీడియా పాత్ర

డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి

తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుజురాబాదు,
కరీంనగర్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9154690580, Email: mallareddy808@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 16.08.2025        ఎంపిక (D.O.A): 28.08.2025        ప్రచురణ (D.O.P): 01.09.2025


వ్యాససంగ్రహం:

తెలుగు భాషాసాహిత్ వికాసానికి వికీపీడియా ఉపయోగం, వికీపీడియా కంటెంట్ వినియోగం ద్వారా తెలుగు భాషాసాహిత్యాలను మెరుగుపరచడానికి సహాయపడగల సాధనాల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. వికీపీడియాలో కొత్త రచనలు చేర్చడం కోసం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ రూపొందించడం వంటి విస్తరణ అంశాల గురించి తెలియజేస్తుంది. తెలుగు వికీపీడియాపై ప్రాథమిక అవగాహన కలిగిస్తూ ఉత్సాహవంతులను దీనిలో సభ్యులుగా చేరేవిధంగా, వారు వ్యాసాలు రాసేవిధంగా ప్రోత్సహించడం ద్వారా తెలుగు వికీపీడియా విస్తరించేవిధంగా చేయడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం. తెలుగు వికీపీడియా(తెవికీ) 2003 డిసెంబరు 10న ప్రారంభించబడి, వికీమీడియా ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. 2025 జనవరి 1 నాటికి తెలుగు వికీపీడియాలో వివిధ అంశాలకు చెందిన 1,02,353 వ్యాసాలు చేర్చబడ్డాయి. సాహితీవేత్తలు వికీలో, పీర్ సమీక్షలో పాల్గొని, సమిష్టిగా నిర్మించిన జ్ఞానాన్ని, రచన, భాషా అభ్యసనాలకు వినియోగించిన విషయాలను ఈ వ్యాసంలో విశ్లేషించడం జరిగింది. వికీపీడియా ప్లాట్‌ఫామ్‌లు, విస్తృత ప్రాప్యతగల సమాచార రిపోజిటరీలు, వివిధ అంశాల అవలోకనం, హైపర్‌లింక్‌ల ద్వారా పరస్పరం అనుసంధానించబడిన సమాచారం, భాషసాహిత్య అంశాల్లో వికీల అసైన్‌మెంట్‌లు, సహకార ప్రాజెక్టుల మెటీరియల్‌, ఆన్‌లైన్ వనరులు, ఇతర గ్రంథాల ద్వారా సేకరించి పరిశోధన నిర్వహించడం జరిగింది. తెలుగులో వికిపీడియా వినియోగం, తెలుగు వికీపీడియా(తెవికీ)వికాసం, తెలుగు భాషా సాహిత్యవికాసంలో వికీలప్రాముఖ్యత, విద్యా వికాసంలో వికీలపాత్ర మొదలైన అంశాలను గురించి ఇందులో విపులంగా వివరించడం జరిగింది. భాషా అభ్యాసంలో వికీల ప్రభావాన్ని మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. వికీ సాధనాలు బోధనాభ్యసనలో విద్యా వనరులుగా విద్యా అనువర్తనాలకు, పరిశోధన వ్యాసాల సమీక్ష మరియు విశ్లేషణనుకు తోడ్పడుతాయి. విద్యావేత్తల వృత్తిపరమైన అభివృద్ధికి, ఇతర విద్యావేత్తలతో అనుసంధానం కావడానికి ఉపయోగ పడుతాయి. వికీ రచనలు భాషా ప్రావీణ్యం మెరుగుపరచడం, విమర్శనాత్మక అక్షరాస్యతను అభివృద్ధి చేయడం డిజిటల్ నాలెడ్జ్ బేస్‌ను పెంపొందించడం ద్వారా భాషసాహిత్య వికాసానికి డైనమిక్ వాతావరణాన్ని అందిస్తాయి.

Keywords: భాషాసాంకేతికత, వికీపీడియా, సమాచార రిపోజిటరీలు, వికీమీడియా ఫౌండేషన్, వికీమీడియా ప్రాజెక్టు, పీడియాప్రెస్, మీడియావికీ, వికీమీడియా, డిజిటల్ నాలెడ్జ్.

1. ప్రవేశిక

1.1. వికీపీడియా ఆవిర్భావం దాని నిర్మాణం

వికీపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, ఉచిత, సహకార, బహుభాషా ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా. ఇది ఎవరైనా సవరించగల నిర్దిష్ట ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్న విజ్ఞాన సర్వస్వం ఇది. అందరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉండే విజ్ఞాన వనరులు సృష్టించాలనే లక్ష్యంతో దీనిని 2001 జనవరి 15న జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ కలిసి ప్రారంభించారు. స్వచ్ఛంద సేవకులు కంటెంట్‌ను చేరుస్తూ నిర్వహించే సహకార ప్రాజెక్టు ఇది. వికీమీడియా ఇతర సంబంధిత ప్రాజెక్టులతో పాటు వికీపీడియాకు మద్దతునిస్తూ హోస్ట్ చేసే సంస్థ. సరళంగా చెప్పాలంటే, వికీపీడియా ఒక వెబ్‌సైట్; వికీమీడియా ఆ వెబ్‌సైట్‌ను నిర్వహించే ఫౌండేషన్, దానితో సంబంధం గల ఇతర సభ్యులను సూచిస్తుంది. వికీమీడియా ఫౌండేషన్, "వికీమీడియా ప్రాజెక్టులకు" మద్దతు ఇచ్చే లాభాపేక్షలేని సంస్థ.

వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో ఉన్న వికీపీడియా సంఘాలతో కలిసిపనిచేస్తుంది. అంతేకాకుండా ప్రపంచంలోని కొన్ని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగుల ద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. ("వికీపీడియా")

1.2. వికీపీడియా వికీమీడియా మధ్య వ్యత్యాసం

వికీపీడియా, వికీమీడియా మధ్య ప్రధాన భేదం ఏమిటంటే వికీపీడియా ఒక వెబ్‌సైట్. వికీమీడియా సమాచార ప్రాప్యతను సాధ్యం చేసే సంస్థ. వికీపీడియా ప్రధాన దృష్టి జ్ఞానాన్ని సృష్టించడం, పంచుకోవడం అయితే, వికీమీడియా ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు వనరులను కల్పిస్తుంది. మీడియావికీ, వికీపీడియా ఇతర వికీమీడియా ప్రాజెక్టులకు ఊతమిచ్చే ఉచిత ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్.

1.3. వికీ సాంకేతికత వికీబుక్స్ వివరాలు

వికీ టెక్నాలజీని ఉపయోగించే వికీపీడియా ఆన్‌లైన్ ప్రాజెక్టు 2001లో ప్రారంభమై ("Britannica"), ప్రజల సహకారంతో అభివృద్ధి చెందింది. వికీ అనేది ఒకదానికొకటి అనుసంధానించబడిన వెబ్ పేజీల కలయిక. హవాయీ భాషలో "వికివికి" అనగా వేగంగా, చకచక అని అర్థం. ఈ పదం అంతర్జాలంలో విషయం సులభంగా మార్పులు చేయగలిగే వికీపీడియా వేదికగా రూపొందించబడింది. వికీమీడియా ఫౌండేషన్ (WMF) 2003లో స్థాపించబడిన లాభాపేక్షలేని సంస్థ. ఇది వికీపీడియాను నిర్వహిస్తుంది. WMF ప్రధాన లక్ష్యం వికీపీడియా దాని అనుబంధ కార్యక్రమాలకు సహాయపడటం. వికీమీడియా ఫౌండేషన్, విరాళాల ద్వారా నిధులు సమకూర్చుకొని ఈ ప్రాజెక్టుల నిర్వహణకు తోడ్పడుతుంది. వికీ దాని వినియోగదారులు నిర్మాణ సహకారంతో కంటెంట్ చేర్చడానికి, మార్చడానికి అనుమతినిస్తుంది. ఇది సమాచార నిల్వ, ప్రసారానికి తోడ్పడే హైపర్‌టెక్చువల్ వ్యవస్థ. వికీలోని ప్రతి పేజీ వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించి వెబ్ ద్వారా సృష్టించబడుతూ విషయాన్ని బట్టి సవరించబడుతుంది.

వీకీబుక్స్ ("Wiki books") అనేది ఆన్‌లైన్‌లో ఎవరైనా సృష్టించగల, సవరించగలిగే ఉచిత కంటెంట్. ఇది వ్యాఖ్యానించడానికి అనుకూలమైన ఓపెన్-సోర్స్ పాఠ్యపుస్తకాలు ఇతర పుస్తకాలను రూపొందించడానికి అంకితమైన ప్రాజెక్టు. వ్యాసాలను "పుస్తకం" నిర్మాణంలోకి సమీకరించడానికి వికీపీడియాలోని బుక్ క్రియేటర్ సాధనాన్ని ఉపయోగించవచ్చు. దీనిని పీడియాప్రెస్ వంటి బాహ్య సేవల ద్వారా ఎగుమతి చేయడమే కాకుండా ముద్రించవచ్చు. వికీపీడియా కంటెంట్ సాధారణంగా క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్అలైక్ (CC BY-SA) లైసెన్స్ కిందకు వస్తుంది.

1.4. వికీపై పూర్వ పరిశోధనలు

2009లో ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్ వికీపీడియాలోని జియోట్యాగ్ చేయబడిన కథనాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనాల ఆధారంగా వికీపీడియాలో భౌగోళిక కవరేజ్ అసమానంగా ఉందని, ఉత్తర అమెరికా, యూరప్ తూర్పు ఆసియా ప్రాంతాల్లో దీని వాడకం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. విద్యార్థుల వికీపీడియా వాడకంపై చేసిన అధ్యయనంలో ప్రధానంగా పరిశోధన ప్రారంభ దశలలో దీనిని ఎక్కువగా ఉపయోగించారని నిర్ధారించారు. 2010లో యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ మొదటిసారి వికీపీడియాపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికలో పాఠకులు 68.25%, సహాయకులు 31.75% మాత్రమే ఉన్నారు అని పేర్కొంది. వికీపీడియా వాడకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ఆర్థిక సహాయం పెంచాలని ఆ నివేదిక సూచించింది ("Wikipedia Survey"). 2001 2010 మధ్య, పరిశోధకులు ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా గురించి 1,746 పీర్-రివ్యూడ్ కథనాలను ప్రచురించారు. 2005 నుండి 2007 వరకు జరిగిన అధ్యయనాలు మైనారిటీ ఎడిటర్లు వికీపీడియాలో అత్యధిక సవరణలు చేశారు అని చూపించాయి. మిన్నెసోటా విశ్వవిద్యాలయం 2007లో చేసిన ఒక అధ్యయనంలో సెప్టెంబర్ 2002 అక్టోబర్ 2006 మధ్య వికీపీడియా కమ్యూనిటీలోని 0.1% (4,200 మంది ఎడిటర్లు) 44% వర్డ్ వ్యూలను సృష్టించినట్లు తేలింది. 2012లో పూణేలో Linux/Unix యూజర్ గ్రూప్ (PLUG) సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ & రీసెర్చ్ (SICSR) నిర్వహణలో వికీపీడియా వర్క్‌షాప్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రాంతీయ భాషలలో వికీపీడియా ఎడిటింగ్‌పై అవగాహన కల్పించారు. బోధనాభ్యసన ప్రక్రియకు ఎంతో తోడ్పడే వికీపీడియాను అవగాహన లోపం, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కేవలం 16% మంది మాత్రమే వినియోగిస్తున్నారు.

2. వికిపీడియా వినియోగం

2.1. వ్యాస రచన నియమాలు మార్గదర్శకాలు

వికీపీడియాలో కొత్త వ్యాసం సృష్టించడానికి కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. మొదట, వికీపీడియా ఖాతా తెరువాలి, తదుపరి వ్యాసం కోసం పరిశోధన చేయాలి. ప్రయోగశాల (సాండ్‌బాక్స్) లో వ్యాసాన్ని రాయాలి. వ్యాసం రాసేటప్పుడు వికీపీడియా శైలిని తప్పక అనుసరించాలి (Tardy 20). చివరిగా, వ్యాసాన్ని సమీక్షకు పంపడం, ప్రచురించడం లాంటి సూచనలు పాటించాలి. ఈ ప్రక్రియలో నిబంధనలతో కూడిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా వ్యాసాలు రాయడం ముఖ్యమని గమనించాలి.

2.2. అనువాద ప్రక్రియ పరికరాలు

ఇతర భాషల వ్యాసాలను అనువదించడానికి వికీపీడియాలో యాంత్రిక అనువాద సాధనమైన విషయ అనువాద పరికరం (Content Translation tool) అందుబాటులో ఉంది ("Wikipedia: Content translation tool"). ఇందులో గుగ్ల, యాండెక్స్, మింట్ వంటి అనువాద యంత్రాలు ఉన్నాయి. ఈ పరికరం అనువాద ప్రక్రియను వేగవంతం చేస్తుంది, అయితే యాంత్రిక అనువాదం కొంత అసహజంగా ఉండవచ్చు. అందువల్ల, అనువాదం చేసిన తరువాత సవరించడం అవసరం.

2.3. సమాచార సమర్పణ నిర్ధారణ

వికీపీడియా సమాచారాన్ని స్వేచ్ఛగా అందరికీ ఉచితంగా అందించడానికి, పంచుకోవడానికి తోడ్పడే ఒక ప్రత్యేక వేదిక. ఇది పరిశోధన పత్రాలు వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచురించడానికి కాదు. అనేక విషయాలపై జ్ఞానాన్ని సమీకరించి, విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా ప్రతిబింబించడానికి కట్టుబడి పని చేస్తుంది. వికీపీడియాలో ఎప్పటికప్పుడు కొత్త సభ్యులను ఆహ్వానించడం ప్రాధానం. వ్యక్తిగత దూషణలు ఇక్కడ నిషిద్ధం. వ్యాసాలు నిర్దిష్టమైన రూపంతో ఉంటాయి. వాటిలో చర్చా పేజీలు, చరిత్ర లింకులు ఉంటాయి. సమాచారాన్ని విభజించి అందించడానికి ప్రత్యేక పద్ధతులున్నాయి. వికీపీడియాలో సమాచారాన్ని ధ్రువీకరించడానికి, ఆ సమాచారాన్ని సేకరించిన మూలాలను సూచించడం అవసరం. ఇది పాఠకులకు సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. వ్యాసాలను విషయం ఆధారంగా వర్గీకరించడం ద్వారా, ఒకే రకమైన వ్యాసాలను ఒకచోట చూడవచ్చు. ఉదాహరణకు, ఒక మండలంలో ఉన్న గ్రామాల వ్యాసాలు, 1973లో జన్మించిన వ్యక్తుల వ్యాసాలు ఒకే కోవకు చెందినవిగా వర్గీకరించబడతాయి.

2.4. వికీల సహకార స్వభావం ప్రాముఖ్యత

వికీపీడియాలో ఎవరైనా కంటెంట్‌ను జోడించడం ద్వారా సహకరించవచ్చు, ఎడిటింగ్ కమ్యూనిటీలో చేరవచ్చు. ఈ సేవలు తమ స్వంత వికీపీడియా పేజీని సృష్టించడానికి ఇప్పటికే ఉన్న వికీపీడియా పేజీలకు ఎడిటింగ్ సేవలు అందించడానికి అనుమతిస్తాయి. వికీపీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లతో సహా వికీలు, వాటి సహకార స్వభావంతో, భాగస్వామ్య జ్ఞాన సృష్టిని సులభతరం చేస్తాయి. వికీ సాధనాలు బోధనాభ్యసనలో విద్యా వనరులుగా, నమ్రత (flexibility) కారణంగా భాష, సాహిత్యంలో విలువైన సాధనాలుగా తోడ్పడతాయి. వికీలు సహకార రచన, పీర్ సమీక్ష, పరస్పరం అనుసంధానించబడిన కంటెంట్ అభివృద్ధికి తోడ్పడతాయి.

3. తెలుగు వికీపీడియా వికాసం

3.1. తెలుగు వికీపీడియా ఆవిర్భావం ముఖ్య వ్యక్తులు

తెలుగు వికీపీడియా(తెవికీ) 2003 డిసెంబరు 10న ప్రారంభమైంది. వికీమీడియా ఫౌండేషన్ దీనిని నిర్వహిస్తుంది. ఇది ఎవరికైనా ఆన్‌లైన్‌లో తెలుగులో రచనలు చేయగలిగే అవకాశం కల్పిస్తుంది. ఉచితంగా చదువుకునే అవకాశం కూడా ఉంది. 2025 జనవరి 1 నాటికి తెలుగు వికీపీడియాలో వివిధ అంశాలకు చెందిన 1,02,353 వ్యాసాలు చేర్చబడ్డాయి. సమాచార సాంకేతిక నిపుణుడు వెన్న నాగార్జున తెలుగు వికీపీడియా అభివృద్ధికి కీలక పాత్ర పోషించాడు. ఆయన రూపొందించిన పద్మ అనే లిప్యంతరీకరణ పరికరం (ఇంగ్లీషు కీబోర్డుతో తెలుగు రాసే పరికరం) తెలుగు భాషా అనువాదానికి మైలురాగింది. ఇది తెలుగు భాషాభిమానులను ఆకర్షించింది.

బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్‌లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబరు 10న ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియా మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత ఆయనదే. ("తెలుగు వికీపీడియా")

3.2. తెవికీ పురోగతి విస్తరణ

2004 ఆగస్టు తర్వాత నాగార్జున రచ్చబండ వంటి సమాచార సమూహాల ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టి, విద్యాధికుల సహకారంతో తెవికీ అభివృద్ధికి కృషి చేశాడు. ఈ క్రమంలోనే, అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి వంటి వ్యాసాలు వాడుకరులను ఆకర్షించగా, 2005లో ప్రాంతీయ సమాచారాన్ని అందించే ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. మాకినేని ప్రదీప్ వంటి వ్యక్తుల కృషితో, పాఠకులకు మరింత సమాచారాన్ని అందించగలిగారు. తెలుగు వికీపీడియా అభివృద్ధిలో భాగంగా వివిధ వ్యక్తుల కృషి, ముఖ్యమైన వ్యాసాలు అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వాకా కిరణ్, చావాకిరణ్‌, వైజాసత్య, మాకినేని ప్రదీపు, చదువరి వంటి వారి సహకారంతో తెవికీ ముందుకు సాగింది. వైజాసత్య, చదువరి జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో అందించారు. 2005 సెప్టెంబరులో 'విశేషవ్యాసం', 'మీకు తెలుసా', 'చరిత్రలో ఈ రోజు' వంటి శీర్షికలు ప్రారంభమయ్యాయి. తెవికీ రూపురేఖలు సుందరంగా తీర్చిదిద్దడంలో వీవెన్ ఎంతో కృషి చేశారు. వైజాసత్య, కాజా సుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ వంటి బ్లాగర్ల సాయంతో తెలుగు చిత్రరంగ వ్యాసాలు, బ్లాగేశ్వరుడు, విశ్వనాథ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలు, చంద్ర కాంత రావు ఆర్థిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించారు. విక్షనరీలో కృషి చేసిన టి.సుజాత ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై, దేవా చిట్కాలు, ప్రకటనలపై, అహ్మద్ నిసార్ ఉర్దూ భాష వివరాలపై కృషి చేశారు.

3.3. వివిధ రంగాల నిపుణుల భాగస్వామ్యం

2007 నుండి బ్లాగర్ల సహకారంతో, వైద్యులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఇతర రచయితలు కూడా వికీపీడియా వృద్ధికి కృషి చేస్తున్నారు. 2010లో తెవికీ వార్త ప్రారంభమైంది, కానీ 8 సంచికల తరువాత ఆగిపోయింది. వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు 2011లో హైదరాబాదులో జరిగాయి. తెలుగు వికీమీడియా 11వ వార్షికోత్సవాలలో, గత పది సంవత్సరాల్లో వికీమీడియా ప్రాజెక్టులకు కృషి చేసిన వ్యక్తులను కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారంతో సత్కరించారు. 2015లో తిరుపతిలో జరిగిన వేడుకల్లో తెలుగు వికీపీడియాలో కృషికి గుర్తింపుగా పలువురు వ్యక్తులకు పురస్కారాలు అందించబడ్డాయి. ప్రణయ్ రాజ్, యర్రా రామారావు వంటి వారు ప్రత్యేక అభినందనలు పొందారు.

3.4. సాంకేతిక పురోగతి సేవలు

2011లో ప్రారంభించిన తెలుగు వికీపీడియా మొబైల్ రూపం, స్మార్ట్ ఫోన్లలో చిన్న తెరలకు అనుగుణంగా రూపొందించబడింది. 2018లో అందుబాటులోకి వచ్చిన కార్టోథిరియన్ అనబడే ఓపెన్‌స్ట్రీట్‌మాప్ (OSM) ఆధారిత గతిశీల పటాలు వాడటం ప్రారంభమైంది.

ఓపెన్ స్ట్రీట్ మేప్ (OSM) అనేది స్వేచ్ఛగా సవరించగలిగే, స్వేచ్ఛగా వాడుకొనగలిగే ప్రపంచ పటాలను రూపొందించడానికి ఒక సహకార ప్రాజెక్టు. ("ఓపెన్‌స్ట్రీట్‌మేప్")

3.5. ప్రస్తుత స్థితి భవిష్యత్ కార్యక్రమాలు

తెలుగు వికీపీడియా 2019 డిసెంబరు వరకు 93 లక్షల పేజీ వీక్షణలను నమోదు చేసింది, 243 కొత్త సభ్యులు చేరారు. తెలుగు వికీపీడియాకు సంబంధించిన మేటా-వికీ, వికీసోర్స్, వికీకామన్స్, వికీబుక్స్, విక్షనరీ వికీకోట్ లాంటి అనేక సోదర ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి వివిధ అంశాలకు సంబంధించిన సాహిత్య, భాషాంశాల సమాచారాన్ని భద్రపరుస్తూ వడుకరులకు అందిస్తున్నాయి. తెలుగు వికీపీడియా, ఎంతో ఉత్సాహంతో ప్రపంచ వికీపీడియా వ్యాసాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2021లో జరిగిన 'వికీపీడియా పేజెస్ వాంటింగ్ ఫొటోస్' (Wikipedia Pages Wanting Photos - WPWP) ("Wikipedia Pages Wanting Photos") పోటీలో, తెలుగు వికీపీడియన్లు 28,605 వ్యాసాలకు ఫొటోలు చేర్చడం ద్వారా మూడో స్థానంలో నిలిచారు. 2022 డిసెంబరుకు 80,000 పైగా వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రామాలు, మండలాలు, సినిమాలకు సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి. వికీపీడియా అభివృద్ధి గురించి వివిధ అంశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

3.6. వార్షిక కార్యక్రమాలు శిక్షణ

వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సభ్యులతో తిరుపతిలో 21వ వార్షిక 'తెలుగు వికీపీడియా పండగ 2025' కార్యక్రమం ఫిబ్రవరి 14-16 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షిక కార్యక్రమంలో వికీమీడియా ఉద్యమం, ప్రాజెక్టుల పరిచయం, ప్రత్యేక శిక్షణ తరగతులపై చర్చలు జరిగాయి. 'తెలుగు వికీపీడియాలో చేరండి-అందరికీ విజ్ఞానం పంచండి' అనే నినాదంతో 'తెలుగు వికీపీడియా విస్తరణ మార్గాలు', 'వ్యాస రచన నైపుణ్యాల మెరుగుదల', 'వికీడేటా, కామన్స్ పరిచయం' వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు నిర్వహించారు. ఉదయ్ కిరణ్, మారుమూల గ్రామంలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్న యువకుడు, కంప్యూటర్ సదుపాయం లేకపోయినా సెల్‌ఫోన్ ద్వారా 500కి పైగా వికీపీడియా వ్యాసాలు రాశాడు.

 

4. తెలుగు భాషా సాహిత్య వికాసంలో వికీల పాత్ర

4.1. వెబ్ 2.0 సాంకేతికత సాహితీవేత్తల భాగస్వామ్యం

నేటి అక్షరాస్యత అవసరాలు తీర్చగల సామాజిక ఆధారిత వెబ్ 2.0 టెక్నాలజీకి వికీ ఒక ఉదాహరణ. వికీ అనేది సామూహికంగా రూపొందించబడిన వెబ్‌సైట్. దీనిలో ఎవరైనా కంటెంట్‌ను జోడించడానికి, మార్చడానికి తొలగించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు. వికీలు యాక్సెస్ చేయడానికి ఉచితం, ఉపయోగించడం చాలా సులభం. కాబట్టి భాషా సాహిత్య వికాసంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాహితీవేత్తలు సహ రచయితలుగా, పీర్ సమీక్షలో పాల్గొనడానికి, సమిష్టిగా ఆన్‌లైన్‌లో విజ్ఞానం నిర్మించడానికి, రచన, భాషా అభ్యసనానికి మరింత సామాజిక, ఇంటరాక్టివ్ విధానాన్ని పెంపొందించడానికి వికీలు ఒక వేదికను అందిస్తున్నాయి.

4.2. వికీపీడియా విస్తృత సమాచార వనరులు

ముఖ్యంగా వికీపీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లు, ప్రాథమిక పరిశోధన కోసం విస్తృతమైన, ప్రాప్యత చేయగల సమాచార రిపోజిటరీలుగా పనిచేస్తాయి. వివిధ అంశాలపై విస్తృత అవలోకనాన్ని అందిస్తాయి. హైపర్‌లింక్‌ల ద్వారా పరస్పరం అనుసంధానించబడిన ఆలోచనల అన్వేషణను సులభతరం చేస్తాయి. వికీలు భాష, సాహిత్య పాఠ్యాంశాల్లో అసైన్‌మెంట్‌లు, సహకార ప్రాజెక్టుల కోసం సాధనాలుగా, మెటీరియల్‌ను పంచుకోగల ఆన్‌లైన్ వనరుల వేదికలుగా పరిశోధకులకు తోడ్పడతాయి. తద్వారా భాషా అభివృద్ధి మెరుగుపడుతుంది. విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడం ద్వారా వికీల సహకార, బహిరంగ స్వభావం విమర్శనాత్మక నిశ్చితార్థాన్ని విభిన్న దృక్కోణాల మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. భాషా సముపార్జన, విదేశీ భాషల అభ్యాసానికి సాధనంగా వికీ భాషా సామగ్రిని అందిస్తుంది.

వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు... చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు... ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. లక్షా ముప్పై వేలకు పైగా వాడుకరులు (యూజర్లు) లక్షకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్క గ్రామానికి సంబంధించిన విలువైన సమాచారం తెవికీలో లభిస్తుంది. మరే ఇతర వెబ్‌సైటులోనూ ఒకేచోట ఇంత సమాచారం లభించదు (తెలుగు వికీమీడియన్స్ యూజర్‌ గ్రూప్ 13). శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం మొదలైనవి వికీసోర్స్‌లో ఉన్నాయి. కన్యాశుల్కము, కోనంగి, రాజశేఖర చరిత్రము, గోన గన్నారెడ్డి, గణపతి వంటి ప్రసిద్ధ గ్రంథాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అనేక జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు సేకరించి ఉంచారు. (తెలుగు వికీమీడియన్స్ యూజర్‌ గ్రూప్ 36)

4.3. సాంస్కృతిక విమర్శనాత్మక ఆలోచన అభివృద్ధి

వికీలు సాంస్కృతిక అవగాహనను, దానిపై అధ్యయనాలను పెంపొందిస్తాయి. స్వయంప్రతిపత్తి అభ్యాసం, విచారణ అభ్యాసం విమర్శనాత్మక ఆలోచనలో వికీల పాత్ర ఎంతో కీలకంగా మారింది. వికీలు ప్రాథమిక భాషా నైపుణ్యాలు వ్యాకరణాంశాలమీద దృష్టి పెడతాయి. వినియోగదారుల సౌలభ్యం మేరకు అసమకాలిక చర్చ జరగడానికి వికీలు ఒక ఫార్మాట్‌ను అందుబాటులో ఉంచుతాయి. సాహితీకారులు వికీ ద్వారా ఏ ప్రదేశంలోనైనా, ఎప్పుడైనా ఒకరికొకరు ప్రతిస్పందించవచ్చు. సంభాషణలు పేరు, విషయం, తేదీ సమయం ద్వారా ట్రాక్ చేయవచ్చు. వికీ, "సరళమైన ఆన్‌లైన్ డేటాబేస్" ఇప్పటికే ప్రముఖ ఆన్‌లైన్ జ్ఞానస్థలాలలో వాడబడుతుంది.

4.4. సులభమైన యాక్సెస్ సహకార రచన

చాలా వరకు వికీ హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉచితంగానే లభిస్తాయి. కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వికీలను సృష్టించడం, సవరించడం చాలా సులభం, యూజర్ ఫ్రెండ్లీ. వాటికి HTML ఇతర ప్రోగ్రామింగ్ భాషలు అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఎవరైనా ఎక్కడి నుండైనా వికీలను యాక్సెస్ చేయవచ్చు, నిర్వహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీకారులు, భాషావేత్తలు విద్యావేత్తలు ఒకే డాక్యుమెంట్‌పై పరస్పరం సహకరించుకుంటూ పని చేయవచ్చు. వికీలను ఎవరైనా సవరించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ వీటి ద్వారా తక్షణ, తాజా సమాచారం పొందవచ్చు. సాంకేతికేతర వినియోగదారులు కూడా సులభంగా కంటెంట్‌ను సృష్టించవచ్చు, ప్రచురించవచ్చు.

4.5. ఆధునిక సాహిత్యంలో వికీల ప్రభావం

సాహితీ క్షేత్రంలో వికీలు కొత్త సాధనం వలె అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వికీలు రచనల్లో సహకారాన్ని ప్రోత్సహించడానికి, వాడుకరుల స్వయంప్రతిపత్తిని మెరుగుపరచడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనాలుగా మారాయి. వినియోగదారులను దగ్గరగా కలిపి, కంటెంట్ పంచుకోవడానికి, చర్చలు జరపడానికి వీలు కల్పిస్తాయి. వికీలు డాక్యుమెంట్ మోడ్, థ్రెట్ మోడ్ వంటి రెండు పరస్పర చర్యలకు మద్దతునిస్తాయి, రచనా నైపుణ్యాలు పెంపొందిస్తాయి. అత్యాధునిక సాహితీ యుగంలో రచయితలు ఆన్‌లైన్ కార్యకలాపాల ద్వారా సాహిత్య వ్యాసాల విశ్లేషణలకు వికీలను ఉపయోగించడానికి ప్రభావవంతమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. వికీలు రచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, ప్రేరణను పెంచడానికి సహాయపడతాయి. వికీలు సృజనాత్మకత, సహకారం డిజిటల్ కాంటెంట్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వికీలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, వివిధ ఫార్మాట్‌లలో ప్రదర్శించవచ్చు. వికీని సవరించడం ద్వారా, తమ రచనలను మెరుగుపరచడంలో సహాయపడే ఆడిట్ ట్రయల్‌ను ఉపయోగించి పురోగతిని ట్రాక్ చేయవచ్చు. ఈ ప్రక్రియ ఆన్‌లైన్ కంటెంట్‌ను సవరించడానికి సహాయపడుతుంది.

4.6. బహుభాషా మద్దతు నైపుణ్య వికాసం

వికీపీడియా అనేక భాషా ఎడిషన్లలో అందుబాటులో ఉంది. ఇది వివిధ భాషల్లో కంటెంట్‌ను అన్వేషించే అవకాశాన్ని కల్పిస్తుంది. భాషా-నిర్దిష్ట వనరులు, పదజాల విస్తరణ, భాషా వైవిధ్యాలు, సాహితీ, భాషావేత్తల కౌశల వికాసానికి సహాయపడతాయి. వికీలు ఆన్‌లైన్ ద్వారా భాషా సాహిత్య వికాసానికి సమర్థవంతమైన సాధనాలుగా పనిచేస్తాయి. ఇవి సహకార రచన, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయి. వికీలు సహకార వేదికలుగా పనిచేస్తాయి. వాడుకరులు కలిసి పనిచేయడం, సమాచారాన్ని పంచుకోవడం, సమాజ భావాన్ని పెంపొందించడం ద్వారా ఒకరి నుండి ఒకరు పరస్పరం నేర్చుకొనే వీలు కలుగుతుంది. అంతే కాకుండా వికీ రచనలు భాషా ప్రావీణ్యం మెరుగుపరచడం, ప్రేరణను పెంచడం, విమర్శనాత్మక అక్షరాస్యతను అభివృద్ధి చేయడం, డిజిటల్ నాలెడ్జ్ బేస్‌ను పెంపొందించడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

5. విద్యా వికాసంలో వికీల పాత్ర

5.1. విద్యా రంగంలో వికీ అనువర్తనాలు

విద్యా రంగంలోని అనేక అనువర్తనాలకు వికీని ఉపయోగించవచ్చు. విద్యావేత్తలు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆన్‌లైన్ ఉనికిని ప్రోత్సహించడానికి వికీ మరింత ప్రభావవంతమైన మార్గం. విద్యావేత్తలు వికీని ఆన్‌లైన్ రిసోర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించవచ్చు. అక్కడ వారు ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించిన అనేక లింక్‌లను పంచుకోవచ్చు. విద్యార్థులు ఇక్కడ తమ పరిశోధనలు కూడా సూచించవచ్చు. విద్యావేత్తలు తమ తరగతి గది వికీలో విద్యార్థులకు పత్రాలు, మీడియా PDF ఫైల్‌లను అందించవచ్చు. విద్యార్థులు, విద్యావేత్తలు వికీలను ఉపయోగించి వారి ప్రెజెంటేషన్‌లను పంచుకోవచ్చు.

5.2. విద్యార్థుల నైపుణ్యాల పెంపుదల

విద్యార్థులు రాసిన ఆలోచనలు, అభిప్రాయాలను చాలా మంది వ్యక్తులు వీక్షిస్తారు. కాబట్టి క్రమంగా విద్యార్థులు వారి రచన, అభ్యాసం, కమ్యూనికేషన్ పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి వికీ తోడ్పడుతుంది. ప్రతి వ్యాసానికి చర్చాపేజీ ఉంది. అందులో అభిప్రాయాలు, ప్రశంసలు, సందేహాలు పంచుకోవచ్చు. రచ్చబండ, సభ్యుల అభిప్రాయవేదికగా పనిచేస్తుంది.

మీరు ఇక్కడ కొత్త గ్రంథాలు చేర్చవచ్చు, లేదా వివిధ గ్రంథాలను చేర్చుటకు జరుగుతున్న కృషిలో పాల్గొనవచ్చు. ఈ విషయమై ఏదైనా సహాయము కూడా తీసుకొనవచ్చును. ("వికీసోర్స్: రచ్చబండ")

5.3. సహకార అభ్యాసం వృత్తిపరమైన అభివృద్ధి

విద్యార్థులు ఇతర విద్యార్థులతో కలిసి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, అన్వేషించడానికి ఒకరికొకరు సహకరించవచ్చు. విద్యావేత్తలు వృత్తిపరమైన అభివృద్ధి కోసం వికీలను ఉపయోగించవచ్చు. ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాల నుంచి ఇతర విద్యావేత్తలతో అనుసంధానం కావడానికి, ఒకరికొకరు చర్చించడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగ పడుతుంది.

5.4. రచనా నైపుణ్యాలు అభ్యాసకుల ప్రేరణ

వికీలు విద్యార్థుల సహకారాన్ని ప్రోత్సహించి, రచనా ప్రక్రియను సులభతరం చేస్తాయి. సాంప్రదాయ తరగతులతో పోలిస్తే, వికీలను ఉపయోగించడం అభ్యాసకుల రచనా నైపుణ్యాలను మెరుగుపరచడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని అధ్యయనాలు సూచిస్తాయి. ఈ విధంగా, వికీలు విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ అధ్యయనం వికీలను ఉపయోగించడం ద్వారా భాషా అభ్యాసకుల ప్రేరణ, అవగాహన విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. వికీలు రాయడం, చదవడం, మాట్లాడటం వంటి భాషా నైపుణ్యాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. వివిధ వయసుల విద్యార్థులకు వికీల ఉపయోగం ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రత్యేకించి పీర్-కరెక్షన్ ద్వారా భాషా సముపార్జనను మెరుగుపరచడంలో సహాయపడుతుందని కనుగొనబడింది. వికీలు విద్యార్థుల స్వయంప్రతిపత్తి, విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

5.5. విద్యా వ్యవస్థలో వికీపీడియా విస్తరణ

విద్యా అనువర్తనాల కోసం వికీపీడియా అందించే విశేషమైన సమాచారం, చిత్రాలు, వినియోగదారులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. వికీపీడియా విద్యా అనువర్తనాలను పరిశీలిస్తుంది, పరిశోధన వ్యాసాల సమీక్ష, విశ్లేషణను అందిస్తుంది. ఈ విశ్లేషణలో విద్యార్థులకు కేటాయించిన పనులు, అభ్యాస ఫలితాలు, జ్ఞాన రంగాలు, అభ్యాస జోక్యాల విషయాలు ఉంటాయి. వికీపీడియా విద్యా రంగానికి అనేక అవకాశాలు అందించింది, ముఖ్యంగా విమర్శనాత్మక ఆలోచన సహకార సామర్థ్యాలను పెంపొందించడంలో విద్యావ్యవస్థలో నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

6. భావి పరిశోధనకు సూచనలు

  • వికీపీడియాకు తోడ్పడటానికి, అందులో ఖాతా సృష్టించడానికి, ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి, ఉన్న పేజీలను మెరుగుపరచడానికి, నమ్మకమైన అనులేఖనాలను జోడించడానికి, వికీమీడియా కామన్స్ ద్వారా మీడియాను అప్‌లోడ్ చేయడానికి కమ్యూనిటీకి సరైన అవగాహన కల్పించాలి.
  • స్థానిక భాషలో వికీపీడియా అభివృద్ధికి ఇతర వికీపీడియాల నుండి కథనాలను అనువదించే పద్ధతులు నేర్పించాలి.
  • ప్రాంతీయ అంశాలపై దృష్టి పెడుతూ వికీప్రాజెక్ట్‌లు, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాల ద్వారా కమ్యూనిటీని ప్రోత్సహించాలి.
  • విద్యార్థులకు వ్యాసాలు రాయడం లేదా మెరుగుపరచడం, పీర్-రివ్యూ ప్రోత్సహించడానికి విద్యా రంగంలో వికీపీడియాను ఉపయోగించాలి.
  • విద్యార్థులకు డేటా సేకరణ, ఆన్‌లైన్‌లో పొందుపర్చడం, విశ్లేషించడం సవరించడం ద్వారా వ్యాసాలను మెరుగుపరచడానికి వికీపీడియా నైపుణ్యాలు నేర్పించాలి.
  • ప్రోగ్రామ్‌లు, శిక్షణ, ఎడిటర్ల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, కంటెంట్ అనువాదం, వికీమీడియా సమావేశాలు, హ్యాకథాన్‌లు స్థానిక అధ్యయనాల ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని సాధించవచ్చు.

ఉపసంహారం

భాషా అభ్యాసంలో, సాహితీ పరిశోధనలో వికీల ప్రభావం మరింత శోధించాల్సిన అవసరం ఉంది. భారతదేశం వికీమీడియా కార్యకలాపాలు 2011 నుండి ప్రారంభించింది, కానీ నిధుల కొరత, చట్టపరమైన ఇబ్బందుల కారణంగా 2019లో గుర్తింపు రద్దయింది.

2019లో ఐఐఐటి హైదరాబాదు ఆధ్వర్యంలో తెలుగువికీ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని ద్వారా వికీపీడియాలో తెలుగు వ్యాసాలను 30 లక్షలకు పెంచాలనేది దాని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌లో యూజర్లకు శిక్షణనివ్వడం, యంత్ర సహాయంతో వ్యాసాలు చేర్చడం వంటి ఎన్నో వైవిధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

వికీపీడియాలో సభ్యులు స్వచ్ఛందంగా చేరాలి, పరస్పర గౌరవంతో పనిచేయాలి. వారి అభిప్రాయాలు, దృష్టికోణాలు వేరుగా ఉండవచ్చు, కానీ చర్చల సమయంలో వ్యక్తులపై కాకుండా విషయాలపై వాదించడం ముఖ్యం. ఇతరుల అభిప్రాయాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి, తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలి. చర్చలలో మర్యాదను పాటించడం, అభినందించడం ముఖ్యం. పరోక్ష విమర్శలు చేయరాదు.

దీనిలో సాంకేతిక వివరణలు, విధానాలు అందుబాటులో ఉన్నాయి, తద్వారా కొత్త సభ్యులకు సహాయం అందించబడుతుంది. తెలుగు వికీపీడియా సభ్యుల రచనలకు నాణ్యత, వాస్తవికత, నిష్పాక్షికత ప్రధానమైనవి. సభ్యులు అనుమతులు లేకుండా ఇతరుల రచనలను ప్రచురించలేరు, కానీ అనువాదాలు సమర్పించవచ్చు. కొత్త సభ్యులను ప్రోత్సహించడం, వారికి సహాయం అందించడం, స్నేహపూరిత వాతావరణం కల్పించడం ద్వారా తెలుగులో వికీపీడియా అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుంది.

  • వికీపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత, సహకార, బహుభాషా ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాగా విస్తృత జ్ఞానాన్ని అందిస్తుంది.
  • వికీమీడియా ఫౌండేషన్ వికీపీడియాకు మద్దతు ఇచ్చే లాభాపేక్షలేని సంస్థ. ఇది జ్ఞాన ప్రాప్యతను సులభతరం చేస్తుంది.
  • వెన్న నాగార్జున వంటి కీలక వ్యక్తుల కృషితో 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా, సాంకేతిక ఆవిష్కరణలు, విస్తృత వాడుకరుల భాగస్వామ్యంతో వృద్ధి చెందుతోంది.
  • వికీలు భాషా, సాహిత్య రంగాలలో సహకార రచనలకు, విమర్శనాత్మక ఆలోచనలకు, సాంస్కృతిక అవగాహనకు ఒక వేదికగా నిలుస్తాయి.
  • విద్యా రంగంలో వికీల పాత్ర గణనీయమైనది. ఇవి విద్యార్థుల రచన, అభ్యాసం, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచడంలో, విద్యావేత్తల వృత్తిపరమైన అభివృద్ధిలో సహాయపడతాయి.
  • భవిష్యత్తులో వికీపీడియా అభివృద్ధికి కమ్యూనిటీ అవగాహన, శిక్షణ, స్థానిక కంటెంట్ అనువాదం, విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలు, డిజిటల్ నైపుణ్యాల పెంపొందించడం చాలా ముఖ్యం.
  • తెలుగు వికీపీడియా నిరంతరం వాడుకరులను ప్రోత్సహిస్తూ, నాణ్యమైన, నిష్పాక్షికమైన కంటెంట్‌ను అందిస్తూ, భాషా వికాసానికి తోడ్పడుతూ ముందుకు సాగుతోంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. Bharat, etv. "Wikipedia Telugu: వికీపీడియాల్లో 'తెలుగు'కు మూడో స్థానం - వికీపీడియాల్లో తెలుగు ర్యాంకు." etv Bharat, Telangana, 7 Sept. 2021, https://www.etvbharat.com/telugu/telangana/bharat/telugu-ranks-third-in-wikipedia/na20210907070445217.
  2. Britannica. "Wikipedia, encyclopaedia, Encyclopedia Britannica, online reference to read and write." Britannica.com, https://www.britannica.com. Accessed 25 April 2024.
  3. Christensen, Tyler Booth. "Wikipedia as a Tool for 21st Century Teaching and Learning." International Journal of Digital Society (IJDS), vol. 6, no. 2, June 2015, pp. 1042-1047.
  4. డెస్క్, ఎడిటోరియల్. "తెలుగుకు సాంకేతిక వెలుగు." ఈనాడు తెలుగు దినపత్రిక, 24 ఫిబ్రవరి 2024.
  5. తెలుగు, వికీపీడియా. "తెలుగు‌‌ వికీపీడియా." వికీపిడియా, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం, https://te.wikipedia.org/ తెలుగు‌‌_వికీపీడియా. Accessed 25 April 2024.
  6. తెలుగు, వికీపీడియా. "ఓపెన్‌స్ట్రీట్‌మేప్ (OSM)." వికీపిడియా, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం, https://te.wikipedia.org/wiki/ ఓపెన్‌స్ట్రీట్‌మేప్. Accessed 25 April 2024.
  7. తెలుగు, వికీపీడియా. "వికీపిడియా, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం." https://te.wikipedia.org/wiki/. Accessed 25 April 2024.
  8. తెవికీ, దిశ దినపత్రిక. "తెలుగు వికీపీడియా@20." 23 డిసెంబర్ 2022.
  9. వికీమీడియన్స్ యూజర్‌ గ్రూప్, తెలుగు. వికీపీడియా గురించి మీకు తెలుసా? స్వచ్ఛందంగా రాయడం, ఉచితంగా చదువుకోవడం. ప్రథమ ముద్రణ, తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూప్, డిసెంబర్ 2024.
  10. Mattus, Maria. "Wikipedia - Free and Reliable? Aspects of a Collaboratively Shaped Encyclopedia." Nordicom Review, vol. 30, no. 1, 2009, pp. 183-199.
  11. మోహన్, కోడీహళ్లి మురళీ. "తెలుగు వికీపీడియా పండగ, ఒక నివేదిక (తెలుగు వికీపీడియా 21 వ వార్షిక సమావేశం)." సంచిక (తెలుగు సాహిత్య వేదిక, తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక), 23 ఫిబ్రవరి 2025.
  12. Oxford University Press. "Online Style Guide." New Oxford Style Manual. Oxford, UK, 2016.
  13. Tardy, Christine M. "Writing for the World: Wikipedia as an Introduction to Academic Writing." English Teaching Forum, United States, 2010.
  14. వికీమీడియా, WIKIMEDIA META-wiki. "Wikipedia Pages Wanting Photos." META-wiki, in 7 languages, https://meta.wikimedia.org/wiki/Wikipedia_Pages_Wanting_Photos. Accessed 25 April 2024.
  15. Wiki books. "Wiki books, Free textbooks, Open books for an open world." https://en.wikibooks.org/wiki/Main_Page. Accessed 25 April 2024.
  16. Wikipedia. "Wikipedia: Content translation tool." Wikipedia, available in 26 Languages, https://en.wikipedia.org/wiki/Wikipedia:Content_translation_tool. Accessed 25 April 2024.
  17. Wikipedia Survey-Overview of Results. United Nations University, UNU-MERIT, March 2010.
  18. వికీసోర్స్. "వికీసోర్స్: రచ్చబండ." వికీ సోర్స్, స్వేచ్ఛా గ్రంథాలయం, https://te.wikisource.org/wiki/ వికీసోర్స్: రచ్చబండ/. Accessed 25 April 2024.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]