AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. ఆచార్య పేటశ్రీ తిరుపతి కథలు: చారిత్రకాంశాలు
పాగోటి నాగరాజు
పరిశోధకులు, తెలుగు శాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9701905035, Email: nagarajupagoti9@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 18.08.2025 ప్రచురణ (D.O.P): 01.09.2025
వ్యాససంగ్రహం:
ఈ పరిశోధనావ్యాసంలో ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి రచించిన తిరుపతి కథలు సంపుటంలోని మూడు కథలను ఆధారంగా తీసుకుని అందులో ప్రతిబింబించిన చారిత్రకాంశాలను విశ్లేషించడమైనది. వ్యాసశీర్షికలో సూచించినట్లుగా, తిరుపతి ప్రాంతచరిత్ర, ఆలయవ్యవస్థ, రాజవంశాధిపత్యం, స్థానికసాంస్కృతిక పరిణామాల విశ్లేషణే ఈ వ్యాసరచన ప్రధానలక్ష్యం. ఈ అంశం ఎంపిక ఆవశ్యకత ఏమిటంటే.. తిరుపతి ప్రాంతాన్ని గురించి ఇప్పటివరకూ పలు చరిత్రకారులు, విమర్శకులు, సాహితీవేత్తలు పరిశోధనలు జరిపినప్పటికీ, వాటిలో కథారూపంలో నమోదు చేయబడిన చారిత్రకసమాచారంపై అంతగా దృష్టి లేదు. ఈ వ్యాసంలో శాసనాలు, ఆలయాల శిలాశాసనాలు, తిరుమల-చంద్రగిరి ప్రాంత క్షేత్రపర్యటనలు ప్రథమ ఆకరాలు. ద్వితీయ ఆకరాలుగా పురాణాలు, విమర్శగ్రంథాలు, పత్రికావ్యాసాలు, మునుపటి పరిశోధన ఫలితాలు ఆధారమయ్యాయి. పరిశోధన పద్ధతి ప్రధానంగా తులనాత్మక విశ్లేషణాత్మక విధానమే; వ్యాసరచనలో మూడు ఉపశీర్షికలుగా “స్వర్ణముఖి కథ”, “శ్రీవారి పాదపీఠం చంద్రగిరి కథ”, “గోవిందరాజస్వామి గుడి కథ” విభజించి, ప్రతి కథలోని చారిత్రక ప్రామాణికతను, ఇతిహాస–ఐతిహ్యాల సంబంధాన్ని పరిశీలించడమైనది. క్షేత్రపర్యటనలో స్థానికప్రాంత పరిశీలనలు చోటుచేసుకున్నాయి. వ్యాస పరిధిని దృష్టిలో ఉంచుకుని మూడు కథలపై మాత్రమే కేంద్రీకరించాల్సి వచ్చినా, వీటి ఆధారంగా తిరుపతి ప్రాంత చరిత్ర, సాంస్కృతిక అధ్యయనానికి కొత్తదృక్కోణం లభిస్తుందనే ఆశిస్తున్నాను.
Keywords: తిరుపతి కథలు, చారిత్రకాంశాలు, స్వర్ణముఖి నది, చంద్రగిరి కోట, గోవిందరాజస్వామి దేవాలయం, శాసనాలు, పురాణ-ఐతిహ్యాలు, సాంస్కృతిక పరిణామం, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి.
1. ఉపోద్ఘాతం
పాశ్చాత్య విద్యావ్యాప్తి వల్ల అవతరించిన నవల, వ్యాసం వంటి ప్రక్రియల్లాగే కథ, కథానికలు కూడా తెలుగులో అవతరించాయి. ఈ ప్రక్రియ పాశ్చాత్య విద్యాప్రభావం పొందిన ఆంధ్రపండితుల చేతిలో అవతరించినా, అగ్నిపురాణంలో చెప్పిన లక్షణాలను పునాదిగా చేసుకుని, అనేక సంస్కరణలతో, కొత్తపుంతలతో క్రమంగా విస్తరించింది.
తిరుపతి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లే తిరుపతికి రోజు వేలాది భక్తులు తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని వెళ్తుంటారు. పూర్వం వందమంది ఉంటే గాని తిరుమలకి భక్తులు వెళ్లేవారు కారు. అలాంటిది మెల్లగా వందమంది నుండి వందలాదిమంది, వేలాదిమంది ఇంకా చెప్పాలంటే నేడు లక్షల మంది భక్తులు రోజు తిరుపతికి వెళ్తుంటారు. అంతటి మహత్తరమైన తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలను కథలుగా అందించిన రచయిత ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి. ఈ తిరుపతి కథల్ని మూడు సంపుటాలుగా విభజించారు: 1) తిరుపతి కథలు, 2) తిరుమల కథలు, 3) తిరుమల తిరుపతి కథలు. ఒక్కో సంపుటంలో 36 కథలను పొందుపరిచారు. ఈ కథల్లో స్థానిక అంశాలు, సాహిత్యం, జానపద విజ్ఞానం, పురాణాలు వంటి వాటితో పాటు చారిత్రికాంశాలను కూడా చాలా విపులంగా వివరణాత్మకంగా అందించారు. రచయిత అనుభవాలు, అనుభూతులు కూడా ఈ కథలకు కొంత తోడ్పడ్డాయి. తిరుపతిలో పుట్టి పెరిగిన రచయిత, శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 108 కథా పుష్పాలతో అర్చించినట్లుగా కథాసంపుటం ప్రారంభంలో చెప్పుకున్నారు. ఇంతటి విశిష్టమైన ఈ కథా సంపుటంలోని మొదటి 3 కథల్లోనూ ఉన్న చారిత్రక అంశాలను ఈ పరిశోధనా వ్యాసంలో పరిచయం చేసి, విశ్లేషణాత్మక పద్ధతిలో వివరిస్తున్నాను.
2. చరిత్ర నిర్వచనం
చరిత్ర శాసనాది ఆధారాలతో ప్రమాణబద్ధం కావాలి. ఆ ప్రమాణాలు పురావస్తు శాస్త్రజ్ఞుల అంగీకారం పొంది ఉండాలి. కొన్ని సందర్భాల్లో చారిత్రకాంశాలు ప్రమాణబద్ధం అయినా కొన్ని సందేహాలకు తావొసంగే విధంగా అందులోని విషయం లిఖితమై ఉంటుంది. అటువంటి సమయాల్లో ప్రముఖ చరిత్రకారులు ఆ అంశాలను తర్కబద్ధంగా చర్చించి చరిత్ర నిర్మాణం చేస్తారు. ఆయా ఘట్టాల సమకాలిక రాజుల చారిత్రకాంశాలను తులనాత్మకంగా పరిశీలించి సత్యమైన విషయాన్ని తేల్చి చెప్పగల్గుతారు. ఆ విధంగా రూపుదిద్దుకున్న ఈ చరిత్ర వచనరూపంలో ఉంటేనే ఎక్కువ ప్రామాణికతను సంతరించుకుంటుంది. ఈ చరిత్ర కావ్యరూపం దాలుస్తే కవికృత అలంకారాదుల ముసుగులో చారిత్రకాంశాలు అతిశయోక్తులతో, ఉత్ప్రేక్షలతో స్పష్టతను కోల్పోయే అవకాశముంది. కాబట్టి ఏ భాషలోనైనా, ఏ దేశచరిత్ర అయినా వచన రూపంలో సాఫీగా చెప్పుకు పోయినప్పుడే ఆ చారిత్రక విషయం జనులకు సజావుగా అర్థమౌతుంది.
నిన్న జరిగిన విషయాలన్నీ నేడు చరిత్రగా పరిణమించినా అందులో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఘట్టాలే చరిత్ర గ్రంథాల్లో లిఖితమై భావితరాల వారికి సందేశాత్మకంగా నిలుస్తాయి. ఈ ఘట్టాలు వ్యక్తులకు సంబంధించినవి కావచ్చు, ప్రజలకు సంబంధించినవి కావచ్చు. గుడి గోపురాలకు సంబంధించినది కావచ్చు. రాజులకు, రాజకీయాలకూ సంబంధించినవి కావచ్చు. కాని ఈ ఘట్టాలు సమాజంలో సంచలనాత్మకమైనవో, పరిణామాత్మకమైనవో, సందేశాత్మకమైనవో అయి ఉండాలి. ఒక విశిష్టతను సంతరించుకుని ఉండాలి. ఒక కొత్తదనాన్ని ప్రతిపాదింపగల్గి ఉండాలి. కాని సాధారణంగా చరిత్ర అంటే రాజులకు సంబంధించిన విషయం అనే రూఢ్యర్థం లోకంలో నిల్చిపోయింది. చరిత్ర రాజనాయకమని ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం స్థిరపడింది.
3. ఐతిహ్య స్వరూపం
ఐతిహ్యస్వరూపాన్ని పి. వెంకటరామశాస్త్రి తెలుగులో చారిత్రక నాటకాలు అన్న పరిశోధనలో స్పష్టంగా వివరించారు.
చరిత్ర నిర్మాణానికి శాసనాలు, నాణాలు లాగే ఇతిహాసం కూడా ఒక ముఖ్యమైన ఆధారం, ఇతిహాసాన్ని గురించి "ఇతిహాసం పురావృతం" అంటూ అమరసింహుడు పురావృత్తాన్ని చెప్పేదే ఇతిహాసమని ఇతిహాస లక్షణాన్ని బోధించాడు. "ఇతిహ పారంపర్యోపదేశ ఆస్తే అస్మిన్ అస ఆధారే ఘఞ ఇతిహాసః" అని నైఘంటికార్థం. పారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరు చెబుతూ వచ్చిన విషయాలను ఇతిహాసాలంటారు. (వెంకటరామ శాస్త్రి)
అందుకే మౌఖిక ప్రచారంలో కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రజల్లో కొనసాగుతూ వచ్చిన పురాణాలను పురాణేతిహాసాలని పండితులు పేర్కొన్నారు. భారతాది పురాణాల్లో అనేక చారిత్రకాంశాలు చోటుచేసుకుని ఉన్నాయని మాక్స్ ముల్లర్ వంటి పరిశోధకులు తేల్చి చెప్పారు. బయట దొరికిన శాసనాల్లోని విషయాలతో పురాణాల్లో చెప్పబడ్డ రాజవంశాల చరిత్రలను సరిపోల్చి చూశారు. వాటిని వ్యాఖ్యానించి అనేక అమూల్య చారిత్రకాంశాలను లోకానికి అందించారు.
కాబట్టి ఇతిహాసం చరిత్ర కాదని కచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. మౌఖిక ప్రచారంలో ఉండడం వల్ల ఇతిహాసాల్లోని చారిత్రకాంశాలు అనేక రూపాంతరాలను చెందే అవకాశముంది. మహిమలతో, వర్ణనలతో ఈ చారిత్రకాంశాలు మరుగునపడే అవకాశమూ ఉంది. చరిత్ర ఇతిహాసం కాదు. కాని ఇతిహాసం చరిత్ర కాదని చెప్పలేం. అలాగని అన్ని ఇతిహాసాలు చారిత్రకాంశాలను నిక్షిప్తం చేసుకొని ఉండాలనే సిద్ధాంతం ఏమీ లేదు.
ఇతిహాసంలో దాగిన మౌలికమైన చారిత్రకాంశాలు వెలికితీయడం అనే పని పరిశోధకుల తర్కబద్ధమైన వాదనాబలం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఇతిహాసాలు ఎక్కువ చారిత్రకాంశాలనూ అందించవచ్చు. ఈ విధంగా చరిత్ర ఇతిహాసంతో సన్నిహితమైన సంబంధం కలిగిఉంది. చరిత్ర నిర్మాణానికి ఆధారాలన్నీ సిద్ధంగా లభించవు. లభించిన స్వల్పమైన ఆధారాలతోనే చరిత్ర రచన చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత సన్నివేశాలకు సంబంధించిన విషయాలు శాసనాది ప్రమాణాల ద్వారా లభించడం కష్టం. ప్రేమ ఘట్టాలకు సంబంధించిన విషయాలు కూడా అంతే. అటువంటి ప్రసిద్ధమైన చారిత్రక ఘట్టాలు కూడా కొన్ని ఇతిహాస రూపంలోనే ప్రచారంలో ఉన్నాయి. అశోకునికి, అగ్నిమిత్రుడికి సంబంధించిన ప్రేమ ఉదంతాలు ఈ కోవలోకి చెందుతాయి. ఈ అంశాలన్నింటిని చరిత్ర కాదంటూ పూర్తిగా కొట్టి పారెయ్యలేం. బౌద్ధ జాతకాది గ్రంథాల్లో లిఖితమైన అశోకుని ప్రణయగాథల వంటి అంశాలను రచయితలు పరిశోధించి వాటి ప్రామాణికతను నిర్ధారణ చేయవలసి ఉంది.
ఇటువంటి మహత్తర చారిత్రక ఘట్టాలు సాధారణంగా రాజులకు సంబంధించినవై ఉంటాయి. ప్రజలందరకూ ఆదర్శంగా నిల్చి వారందరిని ఒకత్రాటిపై నడిపించిన భక్తులకు సంబంధించిన ఘట్టాలు, మతప్రవక్తల జీవితాలకు సంబంధించిన ఘట్టాలు, వీరులకు, త్యాగశీలురకు, కవులకు, గాయకులకు సంబంధించిన ఘట్టాలు కూడా వీటిలో ఉండచ్చు. అటువంటి ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో ఆ కాలంనాటి రాజుల ప్రమేయం, ప్రభావం కూడా కనబడుతుంది. ప్రజానాయకుడైన రాజు ప్రాధాన్యతను విశదపరుస్తుంది. ఈ విషయాలకు రామదాసు, తుకారం, మీరాబాయి, తాన్సేన్ వంటివారి జీవితచరిత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి (వెంకట రామశాస్త్రి 4).
4. తిరుపతి కథలు- చారిత్రకాంశాలు
స్వర్ణముఖి నది కథతో ప్రారంభమై తిరుపతి హస్తకళలు వరకూ మొత్తం 36 ఉన్న ఈ తిరుపతి కథల్లో చారిత్రిక ప్రధానమైన అంశాలు అన్ని కథల్లోనూ సూచనప్రాయంగా ఉన్నా, చారిత్రక ఘట్టాలనే ప్రధానంగా చిత్రించిన కథలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
4.1. స్వర్ణముఖి కథ
ఈ కథలో స్వర్ణముఖి నది పుట్టిన ప్రదేశము, చారిత్రక ఆధారాలు వంటివి చాలా విపులంగా కథలోని పాత్రల ద్వారా వివరించారు రచయిత. "క్రీ. శ. 1336 నుండి శాసనాల్లో స్వర్ణముఖి ప్రస్తావన ఉంది. అలాగే శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ఈ నది గురించి చాలా చక్కగా వర్ణించాడు" అని చెప్తాడు. అలాగే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాల గురించి చాలా విషయాలను ఈ కథలో వివరించారు. ఈ నది ఒడ్డున తొండవాడ అగస్త్య మహాముని ఆశ్రమం గురించి గోపికృష్ణకు రచయిత వివరించి చెప్తాడు. పల్లవులు సంప్రదాయానుసారం నిర్మించిన అగస్త్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శాసనాలను బట్టి ఆ ప్రాంతాన్ని పల్లవుల తర్వాత చోళ రాజులు, బాణులు, పాండ్యులు, తెలుగు పల్లవులు, తెలుగు చోళ రాజులు, వైదుంబులు, యాదవ రాజులు పరిపాలించారు. క్రీస్తు శకం 1336 నుండి ఈ ప్రాంతం విజయనగరం రాజుల పాలనలోకి వచ్చింది. 13వ శతాబ్దంలోని ఒక శాసనంలో తొండవాడకు తొండపాడిపర్రు, 15వ శతాబ్దంలో తొండవాడి అనే రూపాలు కనిపిస్తున్నాయని రచయిత వివరిస్తారు. అచ్యుతదేవరాయలు తన అన్న మీద గౌరవంతో తొండవాడకు "కృష్ణరాయ పట్టణం" అనే పేరు పెట్టాడు. విజయనగర సామ్రాజ్య పతనంతో కృష్ణ రాయపట్నం పోయి మళ్లీ తొండవాడగా మారింది. అక్కడే దగ్గరగా ఉన్న శానంభట్లు అనే ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తూ "ఒకప్పుడు చంద్రగిరి ముందుండే ఈ ఊరిలో సైన్యం, భటులు విడిది చేసి ఉండేవారు. అందుకని ఈ ఊరికి సైన్యం భటుల పేరు మీదుగా శానంభట్ల అనే పేరు వచ్చిందని" వివరిస్తారు (శ్రీనివాసులు రెడ్డి 17-26).
4.2. శ్రీవారి పాదపీఠం చంద్రగిరి కథ
తిరుపతి కథల్లో రెండవ కథ ఇది. చంద్రగిరి కోట గురించి ఎంతో సమాచారం ఈ కథలో పొందుపరచి అందించారు. "వెయ్యి సంవత్సరాల నుండి సూర్యుడు చంద్రగిరి కోటపై ఉదయిస్తూనే ఉన్నాడు" అనే వాక్యాలు చంద్రగిరి గత వైభవాన్ని ఎంతో చక్కగా చాటి చెబుతున్నాయి. పూర్వం శివుని కోసం చంద్రుడు ఇక్కడి కొండపై ఘోర తపస్సు చేశాడు కాబట్టి దీనికి చంద్రగిరి అనే పేరొచ్చిందంటారు. అదేగాకుండా చంద్రనగము, హేమనగము అనే రెండు శిలా శిఖరాలు ఇక్కడున్నాయి. హేమ నగాన్ని ఆనుకొని ప్రవహించే నదికి స్వర్ణముఖి అనే పేరొచ్చింది. అలాగే చంద్ర నగం కింద ఏర్పడిన ఊరుకు చంద్రగిరి అనే పేరొచ్చింది అని వివరిస్తాడు.
చంద్రగిరి కోట క్రీ.శ. 1000న ఇమ్మడి నరసింహ యాదవ రాయలచే నిర్మించబడింది. ఇతను నారాయణవరంను రాజధానిగా చేసుకుని కార్వేటి నగరాన్ని పాలించేవాడు. ఇమ్మడి నరసింహులు తనకు శత్రు దుర్భేద్యమైన కోట లేకపోయినందుకు తీవ్రంగా మదన పడుతుండేవాడు. ఒకనాడు ఇమ్మడి నరసింహులు తిరుమలేశుని దర్శించుకుని వస్తున్నప్పుడు అతని తలపైనున్న వజ్ర వైఢూర్యాలతో పొదిగిన ఎర్రటి తలపాగాను గ్రద్ద తన్నుకు పోయింది. రాజు గారి భటులు గ్రద్దను వెంటాడుతూ పోయారు. గ్రద్ద తిన్నగా పోయి చంద్రగిరి కొండపై పడేసింది. అక్కడికి వెళ్లిన భటులు ఆ కొండ ప్రదేశాన్ని, చుట్టుపక్కల పరిసరాలను చూసి రాజుకు విన్నవించారు. ఇమ్మడి నరసింహులు తానే స్వయంగా వెళ్లి చంద్రగిరి పరిశీలన చూసి ముగ్ధుడై దాన్ని దైవ సంకల్పంగా భావించి అక్కడ శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించాడు. చంద్రగిరి రాజ్యంగా మారటం, బుక్కరాయలు కొడుకు కంపరాయాల పాలన, ఆ తర్వాత క్రీ.శ 1445-86 ప్రాంతంలో సాళువ మంగు మనవడైన సాళువ నరసింహారాయులు చంద్రగిరి కోటను శక్తివంతంగా తయారు చేయడం, తిరుమల కొండకు సకల సదుపాయాలను ఏర్పరచడం, శ్రీకృష్ణదేవరాయల బాల్య విశేషాలు, అలాగే 1565లో తళ్ళికోట యుద్ధం తరువాత రాజధాని మార్పు, 1585లో చంద్రగిరిలో వెంకటపతి రాయలు పట్టాభిషేకం జరిపించుకోవడం, ఆ తర్వాత మళ్లీ కోట పునర్వైభవం తిరిగి రావడం, తెలుగు సాహిత్యంలో చంద్రగిరి ప్రస్తావనలు, అలాగే క్రీస్తు శకం 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ రాక, 1639లో శ్రీరంగరాయలు దామెర్ల వెంకటాద్రి చేత అనుమతి ఇప్పించడం వంటి ఎన్నో చారిత్రకాంశాలను ఈ కథలో సవివరంగా వివరించారు (శ్రీనివాసులు రెడ్డి 27-36).
4.3. గోవిందరాజస్వామి గుడి కథ
ఆధ్యాత్మికక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతి పట్టణంలో గోవిందరాజుల స్వామి కోవెల అత్యంత వైభవంతో అలరారుతోంది. ఇందులో ఎన్నో విశేషాలు ఈ కథలో పంచుకున్నారు. ముఖ్యంగా క్రీ.శ 1129-30 మధ్యకాలంలో రామానుజాచార్యులు శ్రీ గోవిందరాజు స్వామి ఆలయాన్ని తిరుపతిలో నిర్మించి, స్వామివారిని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. స్వామివారు 24-02-1130న స్వయంభుగా వెలసినట్లు గోవిందరాజస్వామి వారి ఆలయంలో "మంత్రపుష్పం" శ్లోకం కూడా చెప్తోంది. ఈ సంవత్సరం చోళ రాజులు పాలించే కాలంనాటిది. అలాగే గోపురం లోపల లభ్యమయ్యే తొలి శాసనం క్రీ.శ. 1224కు చెందింది. అది వీర నరసింహ దేవయాదవ రాయల పాలనా కాలానికి చెందినది.
రాజగోపురం 1628లో మట్ల అనంతరాజు నిర్మించినది. గోవిందరాజ స్వామి పుష్కరిణి మహా మంత్రి తిమ్మరసు తమ్ముడు గోవిందరాజు నిర్మించాడు. దీనిని కృష్ణ రాయని కోనేరు అని కూడా పిలిచేవారు. ఈ విషయం క్రీ. శ. 1513 శాసనం ద్వారా తెలుస్తోంది. గోవిందరాజుస్వామి గుడిని పూర్తిగా అభివృద్ధి చేసింది రామానుజాచార్యులు శిష్యుడైన యాదవ రాయలు. వీర నరసింహ యాదవ రాయల రాణి క్రీ.శ. 1219లో ఆలయంలో అఖండ దీపాలను వెలిగించడానికి గాను 32 ఆవులను కానుకగా సమర్పించింది. ఈ రాణి 1234లో పైడిపల్లి గ్రామంలోని ఆదాయాన్ని తిరుమల శ్రీవారికి, మిగిలిన సగం ఆదాయాన్ని గోవిందరాజు స్వామికి సమర్పించింది. క్రీ.శ. 1485లో విజయనగరాధీశుడైన సాలువ నరసింహారాయలు ఆలయ అధికారులను, నిర్వహణ బాధ్యతలను కందాడ రామానుజయ్యం గారికి అప్పగించారు. క్రీ.శ 1632లో వెంకటపతి రాయలు ఒక గోపురాన్ని నిర్మించాడు. ఇలా చోళ, మట్ల రాజులతో పాటు విజయనగర చక్రవర్తులు, ఉన్నతాధికారులు గోవిందరాజు స్వామి ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు అని ఈ కథలో చారిత్రక విశేషాలను రచయిత తెలియజేశారు (శ్రీనివాసులు రెడ్డి 37-46).
ఉపసంహారం
- ఈ పరిశోధనా వ్యాసం ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి రచించిన "తిరుపతి కథలు" సంపుటిలోని తొలి మూడు కథలలోని చారిత్రక అంశాలను విశ్లేషించింది. చరిత్ర నిర్వచనం, ఐతిహ్య స్వరూపం వంటి ప్రాథమిక భావనలను చర్చించింది.
- స్వర్ణముఖి నది, చంద్రగిరి కోట, గోవిందరాజస్వామి గుడి వంటి తిరుపతి ప్రాంతంలోని కీలక ప్రదేశాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలను, శాసనాలను, పురాణాలను రచయిత కథల రూపంలో ఎలా పొందుపరిచారో వివరించబడింది.
- ఈ కథలు స్థానిక చరిత్రను, సంస్కృతిని, జానపద విజ్ఞానాన్ని సాధారణ పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందిస్తాయి. సాహిత్య ప్రక్రియ ద్వారా చారిత్రక పరిజ్ఞానాన్ని పెంపొందించే విశిష్ట మార్గాన్ని ప్రదర్శిస్తాయి.
- భవిష్యత్ పరిశోధనలు శ్రీనివాసులు రెడ్డి ఇతర కథలలోని చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాలను లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఈ కథల సాహిత్య విలువ, చారిత్రక ప్రామాణికతపై తులనాత్మక విశ్లేషణలు చేపట్టవచ్చు.
- స్థానిక చరిత్రను ప్రజలకు చేరువ చేయడంలో ఇటువంటి కథా సంపుటాల పాత్రను మరింత అన్వేషించడం తదుపరి అధ్యయనాలకు దోహదపడుతుంది.
ఉపయుక్త గ్రంథసూచి
- అమరసింహుడు. నామలింగాను-శాసనము (అమరకోశం). తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య, పరి. వేమూరు వేంకట కృష్ణమ సెట్టి అండ్ సన్స్, ఆనంద ముద్రాక్షరశాల,
- వెంకట రామశాస్త్రి, పి. తెలుగులో చారిత్రకనాటకాలు. జాతీయసాహిత్యపరిషత్,
- శ్రీనివాసులు రెడ్డి, పేట. తిరుపతి కథలు. ఎమ్మెస్కో.
- సీతారామాచార్యులు, బి. శబ్దరత్నాకరము. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్, 1988.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

