headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-11 | September 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. ఆచార్య దార్ల ఆత్మకథ "నెమలి కన్నులు": ఏభై ఏళ్ళ సామాజికచరిత్ర

ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి

ఆచార్యులు, తెలుగుశాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం,
వేమన పురం, వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8328296952, Email: eswaryvu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.08.2025        ఎంపిక (D.O.A): 28.08.2025        ప్రచురణ (D.O.P): 01.09.2025


వ్యాససంగ్రహం:

ఈ పరిశోధన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచించిన "నెమలి కన్నులు" ఆత్మకథపై విశ్లేషణాత్మక అధ్యయనం. గత ఐదు దశాబ్దాల సామాజిక పరిణామాన్ని, అట్టడుగు వర్గాల జీవన పోరాటాలను, విద్య ప్రాముఖ్యతను తెలియజెప్పడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. ఈ ఆత్మకథ సమాజంలో నిగూఢంగా ఉన్న కులవివక్ష, ఆర్థికపరమైన దోపిడీ, సాంస్కృతిక వైరుధ్యాలను స్పష్టంగా ఆవిష్కరిస్తుంది భారతీయ తెలుగు సాహిత్యాలలో వెలువడిన పలు ఆత్మకథలను పరిశీలించి, వాటి స్ఫూర్తితోనే దార్ల తన జీవితగాథను అక్షరీకరించారు. ఈ వ్యాసానికి దార్ల వెంకటేశ్వరరావు "నెమలి కన్నులు" ప్రధాన ఆధారం. తదితర ఆత్మకథలు, విమర్శనాత్మకగ్రంథాలు ద్వితీయాకరాలు. విశ్లేషణాత్మక, చారిత్రాత్మక అనుశీలన పద్ధతుల్లో ఈ పరిశోధన వ్యాసం రూపుదిద్దుకుంది. ఈ వ్యాసంలో రచయిత అంతరంగ ఆవిష్కరణ, సామాజిక-సాంస్కృతిక నేపథ్యం, ప్రేరణ కలిగించిన వ్యక్తులు, సాహితీవిలువలు అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమైనది. ఈ ఆత్మకథ కొండకోనలను దాటి, ముళ్ళ కంచెలను తొక్కి విజేతగా నిలిచిన వ్యక్తి స్వీయ అనుభూతి. కోనసీమ లాంటి గ్రామీణ ప్రాంతంలో దళిత-బహుజనులు ఎదుర్కొన్న అణచివేత, వివక్ష, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు ఈ ఆత్మకథలో కనిపిస్తాయి. ఈ రచనలో ఆచార్య దార్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, వారి కథన నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ప్రేరణ కలిగించాయి. ఆయన వచనరచన కవిత్వలక్షణాలతో నిండి, సామాజిక అంశాలను సుందరంగా వ్యక్తీకరిస్తుంది. అణచివేతకు గురైన వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి, విద్యాసాధనకు, సామాజిక చైతన్యానికి ఈ ఆత్మకథ ఒక మార్గదర్శి అని చెప్పవచ్చు. సమాజపు గతాన్ని పునాది చేసుకుని, వర్తమానాన్ని నిలబెట్టి, భవిష్యత్తుకు మార్గం చూపడానికి ఇటువంటి ఆత్మకథల అధ్యయనం అత్యంతావశ్యకం.

Keywords: ఆత్మకథ, దార్ల వెంకటేశ్వరరావు, నెమలి కన్నులు, దళిత సాహిత్యం, సామాజిక పరిణామం, కుల వివక్ష, కోనసీమ, సాహిత్య విమర్శ

1. పరిచయం

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కష్టజీవి. స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకున్న చదువరి. కులం వెక్కిరించినా, పైవర్గం ధిక్కరించినా వెను తిరిగి చూడకుండా ముందుకు నడిచిన పట్టుదలగల వ్యక్తి. భూమి అట్టడుగు పొరల్లోకి తొక్కేసిన ఒక విత్తనం నీటి స్పర్శ తగలగానే రాతిని కూడా చీల్చుకొని మొలకెత్తినట్టు, అలా మొలకెత్తిన విత్తనం మహావృక్షంగా మారినట్టు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మొలకెత్తి ఫలాలను ఇచ్చే వృక్షం అయ్యాడు. తను పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, తనను నిరోధించిన సంఘటనలు ఇలా ఎన్ని జీవితాన్ని అడ్డగించినా తన లక్ష్యాన్ని వదలని విద్యా శ్రామికుడు దార్ల వెంకటేశ్వరరావు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అత్యంత గౌరవప్రదమైన ఆచార్య వృత్తిలోకి ఎదిగి వచ్చిన ఒక వ్యక్తి తన గతాన్ని అక్షరీకరించి అందించడానికి పూనుకోవడమే ఒక పెద్ద ముందడుగు. కొండ కోనల్ని దాటుకొని, ముళ్ళ కంచెల్ని తొక్కుకొని నేను గెలిచాను అని చూపించడం ఒక ఎత్తు అయితే, ఇదిగో ఇదే నా జీవితం అని చెప్పి, అట్టడుగు పొరల్లో నిస్తేజంగా నిలబడి పోయే వారిని ముందుకు నడిపించడానికి ఉపయోగపడే ఒక ఉత్ప్రేరకంగా ఆత్మకథను అక్షరీకరించడం మరో ఎత్తు. భావి తరాలకు ప్రేరణగా నిలిస్తేనే ఏ ఆత్మకథ అయినా సఫలమైనట్టు. అలాంటి ఒక సఫల ప్రయత్నాన్ని మన కళ్ళ ముందు ఉంచేదే ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రాసుకున్న "నెమలి కన్నులు" ఆత్మకథ.

2. ఆత్మకథల ప్రాధాన్యత

ఆత్మకథ తన జీవితానుభవాలను, తన భావోద్వేగాలను, తన కుటుంబానికి, సమాజానికి సంబంధించిన విషయాలను స్వయంగా రాసుకునే గ్రంథం. దీని ద్వారా వ్యక్తి తన జీవితం, ఆలోచనలు, విజయాలు, వైఫల్యాలు, పోరాటాలు, త్యాగాలను సమాజం ముందు ఉంచుతాడు. భారతదేశంలో అనేకమంది మహనీయులు, రాజకీయ నాయకులు, కవులు, సంస్కర్తలు తమ ఆత్మకథలను రాశారు.

భారతదేశాన్ని ప్రభావితం చేసిన ప్రఖ్యాత ఆత్మకథలలో:

  1. "సత్యశోధక మహాత్మా" (జ్యోతిరావు ఫూలే) – సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని వివరించే రచన.
  2. "మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్" (మహాత్మా గాంధీ) – నిజాయితీ, అహింస, స్వాతంత్ర్య పోరాటం గురించి గాంధీజీ స్వీయ అనుభవాలు.
  3. "వేటింగ్ ఫర్ విస్పర్స్" (కస్తూర్బా గాంధీ గురించి రాసిన రచనలు) – గాంధీ కుటుంబ జీవితం.
  4. "టువర్డ్స్ ఫ్రీడమ్" (జవహర్‌లాల్ నెహ్రూ) – భారత స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యం.
  5. "అరుణా’స్ స్టోరీ" (అరుణా ఆసఫ్ అలీ) – స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న తన జీవిత అనుభవాలు.
  6. "అన్‌టచబుల్ లైఫ్" (బి.ఆర్. అంబేద్కర్) – దళితుల జీవిత పరిస్థితులు, తన సామాజిక పోరాటం.
  7. "వింగ్స్ ఆఫ్ ఫైర్" (డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం) – ఒక పేద బాలుడు భారత రాష్ట్రపతిగా ఎదిగిన ప్రేరణాత్మక గాథ.
  8. "ఎక్స్‌పీరియెన్సెస్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్" (మోరార్జీ దేశాయి) – భారత రాజకీయాలు, ప్రజాస్వామ్యంపై తన అనుభవాలు.
  9. "సెల్ఫ్ పోర్ట్రెయిట్" (రాజేంద్రప్రసాద్) – భారత తొలి రాష్ట్రపతి జీవితం.
  10. "మై స్టోరీ" (కమలా దాస్) – స్త్రీ స్వాతంత్ర్యం - మొదలైనవి ప్రసిద్ధి చెందాయి.

తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు రచించిన వారు అనేకమంది ఉన్నారు. 'బూదరాజు రాధాకృష్ణ - విన్నంత కన్నంత', 'కుందుర్తి ఆంజనేయులు - బతుకుమాట', 'సురవరం ప్రతాపరెడ్డి - స్వీయచరిత్ర', 'చలం - నా జీవనయాత్ర', 'కాళీపట్నం రామారావు - బతికిన జీవన కథ', 'నాయని సుబ్బారావు - నా జీవిత కథ', 'కనుపర్తి వరలక్ష్మమ్మ - నా జీవితం' మొదలైనవి ఉన్నాయి. దార్ల గారు చెప్పుకున్నట్టు 'గుర్రం జాషువా 'నా కథ', డా॥ వై. బి. సత్యనారాయణగారి 'మా నాయన బాలయ్య', డా|| ఎం. ఎఫ్. గోపీనాథ్ గారి 'నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం', డా॥ బోయి భీమన్నగారి 'పాలేరు నుండి పద్మశ్రీ వరకు' వంటి ఆత్మకథలు జీవిత కథలు గుర్తింపు పొందాయి. వాటిని చదివినప్పుడు కలిగిన ప్రేరణతో ఆత్మ కథకు శ్రీకారం చుట్టినట్టు రచయితే చెప్పుకున్నాడు. దార్ల ఆత్మకథ విభిన్న అంశాల కలబోత.

3. నెమలి కన్నులు: విభిన్న అంశాల విశ్లేషణ

3.1. అంతరంగ ఆవిష్కరణ

ఆత్మ కథలో రచయిత వ్యక్తిత్వం, మానసిక స్థితి, ఆలోచనా విధానం స్పష్టమవుతుంది. నెమలి కన్నుల్లో దార్ల అంతరంగం కనిపిస్తుంది. చెయ్యేరు అగ్రహారం పక్కన బ్రాహ్మణ 'చెరువుగట్టు'పై గుడిసెలు వేసుకొని, దెయ్యాల కొంపగా ఉన్న నా ప్రాంతాన్ని నివాసయోగ్యంగా మార్చిన సంగతి ఒకటైతే, బ్రాహ్మణ చెరువు కట్టుని బాగు చేసి 'దారి' చేసినందుకు 'దార్ల' వారిగా గుర్తింపు తెచ్చుకుంటే, అదే ఇంటి పేరుగా మారిపోవడం ఒక ఆసక్తికరమైన అంశం.

ఇప్పుడది ఊరికి నడిబొడ్డయి పోయింది. బ్రాహ్మలు వెళ్ళి పోయినా. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుకున్నవాళ్ళు మాత్రం ఆ చెరువు గట్టునే ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. నేనూ ఆచెరువు గట్టు నుండి వచ్చిన వాణ్ణే. ఇంతవరకూ మా ఊళ్ళో ఏ కులంలోనూ నా లాగా డాక్టరేట్ చేసినవాళ్ళు లేరు. మాఊళ్ళో మొట్టమొదటి పిహెచ్.డి. చేసింది నేనే. యూనివర్సిటీలో అధ్యాపకుడుగా ఉద్యోగం పొందింది నేనే. రేడియో, టీ.వి.లలో మాట్లాడింది కూడా నేనే. ఇలా “నేనే మొట్టమొదటి”అని చెప్పుకుంటుంటే నాకు కందుకూరి వీరేశలింగంగారే గుర్తొస్తుంటారు. ఆయన రచనలు గురించి చెప్పుకొనేటప్పుడు ఇలాగే అనేక సాహితీ ప్రక్రియలకు "నేనే ఆద్యుడను..." అని చెప్పుకునే మాటలే గుర్తొస్తాయి. (వెంకటేశ్వరరావు 8)

ఒక మనిషి పడ్డ శ్రమకు, ఆ శ్రమకు లభించిన ఆత్మ గౌరవానికి ఆ మాటలు నిలువుటద్దాలు. కులాల దొంతరలా నిలబడ్డ 'బ్రాహ్మణ చెరువుగట్టు' నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య పదవి దాకా సాగిన ఒక శ్రామికుడి పయనం ఆ ప్రాంతపు గుడిసెల అస్తిత్వాన్ని మోసుకొచ్చింది అంటే అతిశయోక్తి కాదు.

ఆ కాలంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పుట్టిన తేదీ రాయించి పెట్టే విషయంలోనూ, పిల్లలకు పేర్లు పెట్టే విషయంలోనూ శ్రద్ధ చూపేవారు కాదు. అలాంటి కుటుంబాల నుంచి బడిలో చేరడానికి వచ్చిన వారికి అధ్యాపకులు పెట్టిన పేరు, వేసిన పుట్టిన తేదీలు స్థిరపడిపోతాయి. ఈ విషయాన్ని దార్ల తన కోసం రాసుకున్నా, అలాంటి తతంగం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలందరికీ జరిగేది. పుట్టిన తేదీ విషయంలో నాకు కూడా అదే జరిగింది. అయ్యవార్లు పాఠశాలలో చేరడానికి అవసరమైన వయసును నిర్ణయించి దానికి తగువైన తేదీని వేసేవారు.

దార్ల పెద్దన్నయ్య సామ్యూల్ రాజుకు ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశతో కుమ్మన రాజు అనబడే నీలాద్రి రాజు పొలంలో దార్ల కుటుంబం చేసిన ఊడిగం అంతా ఇంతా కాదు. ఆ కష్టం గుర్తొచ్చినప్పుడల్లా కరిగి నీరు అయిపోతాడు. ఆ కష్టం ఎలాంటిదో ఆయన మాటల్లో కనిపిస్తుంది.

వలస పక్షికిప్పుడేదో విరిగిన చప్పుడు, చెట్టునిండా పండ్లు, అయినా కొమ్మల్నీ, రెమ్మల్నీ అలముకున్న ఏకాకులు, పాదలేపనాలు, అగ్నిహెూత్రాలు, మంత్ర మహిమలు యంత్రభూతాలు, హిమాలయాలు, స్వర్గనరకాలు ఏకధాటిగా కురిపించిన రసం ఉక్కిరి బిక్కిరై, చందమామ కౌగిళ్ళలో రసాభాసం తట్టుకోలేకపోతున్నాను. పండిన వెలితి, ఎంత తీయని బంధం, నోట్లో ఊరుతున్న కాకరకాయ రసం! పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు, రైలు దిగినప్పుడు వెన్నెలవుతాడు! కాసేపు మట్టివాసనల్నీ, పైరుగాలినీ పీల్చాలి! ఆవిగో నీటికయ్యల్లో ఎగిరిపడే చేదిపరిగలు నాన్న విసిరిన పువ్వుల్లాంటి వలలో పడే నీటిదండలు, ఆకాశమంత ఎత్తునుండే నాన్న అందించే ముంజికాయలు, 'నమో వేంకటేశా... నమో తిరుమలేశా...'టూరింగు టాకీసులో సినిమా మొదలవుతుంది. నాన్న భుజమ్మీద చంటిపిల్లాడినై పోవాలి, కానీ... అదిగో నాన్న వంట్లో మూలుగులన్నీ పీల్చేసి, చిన్నన్నయ్య జీవితాన్నంతా తాగేసి, కుమ్మనరాజు కొబ్బరితోట దారికడ్డంగా రక్తం తాగే రాక్షసిలా...” (వెంకటేశ్వరరావు 24-25)

కనిపించిన ఆ భూమి దార్ల కుటుంబ కష్టాన్ని దోచుకున్న ఒక పెట్టుబడి దురహంకారానికి గుర్తు. దార్ల చిన్నతనంలో 'తన లేత అరటి ఆకు లాంటి గుండెల్ని ఎవరో చీల్చినట్లు అనిపించిన' సంఘటన తనను చాలా కాలం వెంటాడింది.

ఒకసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేస్తున్న ర్యాలీలో, క్లాస్ లీడర్ అయి ఉండి కూడా జెండాను పట్టుకుని ముందు నడిచే అవకాశాన్ని అధ్యాపకులు దూరం చేశారని దార్ల చాలా బాధపడ్డాడు. ఎంత బాధ పడ్డాడు అంటే 'శత్రువులు ఎవరో పండిన పంటను కాల్చేసినంత, వడ్డించిన అరిటాకు ముందు నుంచి లేపేసినంత, మొవ్వ అరిటాకును ఎవరో మంటల్లో తగల బెట్టేసినంత, లేత ఆకు లాంటి గుండెలని ఎవరో చీల్సేసినంత' వేదన అనుభవించాడు. రగిలిపోతున్న హృదయాన్ని నాన్న ఓదార్పుతో చల్లబరుచుకున్నాడు. నాన్న వెళ్లి మాస్టారుని అడిగినట్టు, ఆయన 'మీ అబ్బాయి పొడవుగా ఉండటం వల్ల వెనక్కి పంపినట్టు' ఆ సమాధానంతో తృప్తి చెందినట్లు దార్ల చెప్పుకున్నాడు. అయినా తన కులం వల్ల వెనక్కి నెట్టేయబడ్డానేమో అన్న సందేహం లేకపోలేదు.

బడికి ఎదురుగా ఉండే ఇంట్లో (కానూరు వారి మిఠాయి కొట్టు) నుండి వచ్చే మిఠాయిల వాసన, బడికి కుడివైపున ఉండే కమ్మరి కొలిమి నుండి వినబడే సుత్తి శబ్దాలు, ఇంటర్వెల్లో 'పూల నుండి తేనెను గోలడానికి పరుగుపెట్టే తుమ్మెదల్లా పరుగులు తీసే విద్యార్థులు, అక్కడ దొరికే జీళ్ళు, జిలేబీలు, జంతికలు, గవ్వలు, లడ్డూలు, మైసూర్ పాక్ ముక్కలు, కారపు బూందీ, కొబ్బరి లౌజు ఉండలు.. ఇలా ఎన్నో అలనాటి బాల్య జ్ఞాపకాలు దార్ల అంతరంగంలో గిరికీలు కొడుతున్నాయి. దార్ల కలగన్న 'జీళ్ళ వర్షం' రాకపోయినా దాని తయారీ పద్ధతిని పూసగుచ్చినట్టు వివరిస్తాడు. బడికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే ధనమ్మ చాలామందికి గయ్యాళిలా కనిపించింది. కానీ ఆమె దార్లపై చూపించిన ప్రేమ 'ఆమె కళ్ళల్లో పొంగే అనురాగ బంధాలేవో తన వైపే ప్రవహిస్తున్నట్టు కనిపించేది. అమ్మతనానికి కులమతాలతో సంబంధమే ఉండదేమో అనిపించింది' దార్లకు.

బాల్యం పంచిన జ్ఞాపకాలను అక్షరాలుగా మార్చుకున్న దార్ల, తన చెల్లి, తమ్ముడితో కలిసి ఒకే దుప్పట్లో దూరి ఏవేవో కథలు చెప్పు కోవడం, నవ్వు కోవడం, గిచ్చు కోవడం, కొట్టు కోవడం, అయినా అదో అద్భుత ప్రపంచం, అదో ఆనంద సముద్రం. దాన్ని అనుభవించాడు. అమ్మ ప్రేమకు, మేనత్త అభిమానానికి మధ్య ఆత్మీయంగా నలిగిపోయిన సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాడు. బాల్యం కొంతమందికి పూలపరిమళం. కానీ, నా బాల్యం అలా సాగలేదు. ఒక్కోసారి నిప్పుల కుంపటి ఒక్కోసారి ముళ్ళకిరీటం (వెంకటేశ్వరరావు 62) గా బాల్యాన్ని హృదయ ఫలకంపై దార్ల నమోదు చేసుకున్నాడు.

హైస్కూల్లో లెక్కల మాస్టారు విద్యార్థులందరినీ ఒక్కొక్కరిగా లేపి మీరు ఏమవుతారు? అని ప్రశ్నిస్తుంటే అందరూ ఐఏఎస్, ఐపీఎస్, అధ్యాపకులు అని సమాధానం చెప్తే, దార్ల మాత్రం ప్రొఫెసర్ అవుతానని చెప్పడం ఆ మాస్టారికి నచ్చలేదు. అంతేకాదు ఆ రోజు నుంచి "పప్పుచారు పప్పుచారు" అని వెక్కిరించడం కూడా ప్రారంభించాడు. అయితేనేమి! వంచించబడిన చోటే తిరిగి మొలకెత్తిన చైతన్య విత్తనం అనిపించుకున్నాడు దార్ల.

వివిధ రకాల కూలి పనులు చేసి ఇంట్లో మెప్పించి ఏడో తరగతిలో సైకిల్ కొనిపించుకున్న సందర్భం, నాన్న అప్పుడప్పుడు కాట్రేనికోనలో జరిగే శనివారం సంతలో కొని తెచ్చిన పాత బట్టలను పిల్లలకు ఇచ్చి కళ్ళను తడి చేసుకోవడం, తాటి పండును రకరకాల పద్ధతుల్లో ఆస్వాదించడం, అమ్మ దైవభక్తి, నాన్న కారుణ్యం, ఊరిలో వేసే నాటకాలు, చెప్పే బుర్రకథలు బోధించిన పాఠాలు, పదవ తరగతి పరీక్ష కొట్టిన దెబ్బలు దార్ల అంతరంగంలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

3.2. సామాజిక-సాంస్కృతిక నేపథ్యం

నెమలికన్నుల్లో చెయ్యేరు అగ్రహారం గట్టు చుట్టూ ఆనాడు అల్లుకున్న అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలు చిత్రించబడ్డాయి. ఊరి మధ్యలో ఉన్న మూడు దేవాలయాలు, రెండు చివర్లలో ఉన్న రెండు రామాలయాలు, అదే ఊరిలో నిర్మితమైన మూడు చర్చిలు మానవ ప్రవర్తనలను నియంత్రించడానికి ఏర్పడ్డాయి. అయినా కులాల వారీగా, మతాలవారీగా విడిపోయి దేవతారాధన చేయడం కనిపిస్తుంది. దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం ఉండీ లేనట్టు కనిపించడం, దళితులందరూ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసుకోవడం వంటి సంఘటనలు సాంస్కృతిక జీవితంలో కనిపించే సామాజిక వైరుధ్యాలు. క్రైస్తవ మతంలో అన్ని కులాల వారు సహపంక్తి భోజనాలు చేయడం, ఎవరైనా చనిపోతే అంత్యక్రియల్ని పాస్టర్ దగ్గరుండి నిర్వహించడం వంటివి ఉన్నాయని, అదే ఒక హిందూ చనిపోతే, అది కూడా దళితేతరులైతే చూడ్డానికి వెళ్లినా, ఆ కార్యక్రమాలు అన్నిటిలోనూ పాల్గొనరని, అదే క్రైస్తవులు చనిపోతే దళితులైనా సరే అందరూ పాల్గొంటారని ఆ ఊరి సంప్రదాయాలను కట్టుబాట్లను గుర్తు చేస్తాడు దార్ల. దహనాలకు, ఖననాలకు మూలాధారమైన రంగరాజు కాల్వ గట్టు చుట్టూ సామాజిక, రాజకీయ విడిపోతలు ఉన్నాయి.

నాకు తెలిసినంత వరకూ గ్రామమంతా కులాల దొంతరగానే ఉంటుంది. ఫలానా వాళ్ళని గుర్తించాలన్నా ఆ కులంతోనే సూచిస్తారు. ఆ పూజారి గారబ్బాయనో, ఆ పంతులుగారనో పిలుస్తారు. ఆ రాజుగారనో, ఆ కోమటాయననో, ఆ కాపు గారనో, ఆ కంసాలోడనో, ఆ మంగలోడనో, ఆ మాలోడనో, ఆ మాదిగోడనో ఇంకా కాస్త స్పష్టంగా తెలియడానికి పేర్లని కూడా జత చేస్తుంటారు. (వెంకటేశ్వరరావు 37)

అంటున్న దార్ల మాటల్లో పాఠశాలల్లో కూడా కులపరమైన వ్యత్యాసాలు తారాస్థాయిలో ఉండేవని తెలుస్తుంది. చివరికి పాఠాలు చెప్పే పంతుళ్ళకు పిల్లల్ని వాళ్ళ కులం పేరుతో తిట్టే అలవాటు కూడా ఉండేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పిల్లల తల్లిదండ్రుల కులాలు, వారి వృత్తులు కూడా ఉపాధ్యాయులకు ముందే తెలిసేవి కాబట్టి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతారా పాఠశాలలో పడినన్ని అవమానాలు దార్ల పడకపోయినా, తన కాలంలో వచ్చిన అంతో ఇంతో మార్పుకు ఈయన అనుభవం ఒక పరిణామ దశను సూచిస్తుంది. అంబేద్కర్ భావజాలం విస్తృతం అవడం, వెనకబడిన వర్గాల వారు విద్యను అందిపుచ్చుకోవడం వంటివి ఊపందుకుంటున్న దశలో దార్ల పాఠశాల విద్య సాగింది.

ఆ నాటికే కోస్తా ప్రాంతంలో దళితుల్లో బాగా చైతన్యం వస్తూ ఉంది. ఒకవైపు క్రిష్టియన్ మిషనరీల వల్ల చాలామంది విద్యావంతులయ్యారు. మరోవైపు కమ్యూనిస్ట్ ఉద్యమాల వల్ల భూమి కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మా ప్రాంతంలో బొజ్జా అప్పలస్వామి, పొలమూరి బాలకృష్ణ, డి.బి.లోక్, ఎన్. ఎమ్. ఋషి వంటి వారు అంబేద్కరిజాన్ని వ్యాప్తిజేస్తున్నారు. అప్పటికే కుసుమ ధర్మన్న రచనలు, ఆది ఆంధ్ర ఉద్యమం, బోయి భీమన్న పాలేరు నాటకం వంటి వాటి వల్ల మాల, మాదిగ కులస్థులు చాలామంది చదువుకోవడం, కావాలనే రావు, శాస్త్రి, రెడ్డి వంటి విశేషణాలతో తమ పేర్లు పెట్టుకోవడం కనిపిస్తుంది.ఆ ప్రభావంతో వచ్చిన పేరే ఆ మాస్టారికి పెట్టిన వెంకటరెడ్డి కావొచ్చు. (వెంకటేశ్వరరావు 39-40)

అంటున్న దార్ల మాటలు ఆనాటి సామాజిక మార్పుకు, వెల్లివిరుస్తున్న దళిత చైతన్యానికి ఉదాహరణలు. దార్ల స్నేహితుడైన రామకృష్ణ చెల్లెలు తన చెల్లెని అవమానించిందనే కోపంతో ఆమెను కొడతాడు. ఆ సమస్య కాస్త ముదిరి పెద్దదయింది. ఆ సందర్భంలో దార్ల దండనకు గురవుతాడు. అయితే నన్ను మాస్టారు కొట్టినందుకు బాధనిపించలేదు. నన్ను తిడుతూ నా కులం పేరు పెట్టి మా వాళ్ళందరినీ కూడా తిట్టారు. ఆ మాట నన్నెవరో నిలబెట్టి, నిలువునా రంపంతో కోస్తున్నట్లనిపించింది. (వెంకటేశ్వరరావు 58)

అని గుర్తుపెట్టుకున్నాడు. అంతేకాదు ఆనాటికే దళిత ఉప కులాల మధ్య ఏర్పడిన అనైక్యత, దార్ల చెయ్యేరులోనే ఉన్న ఉన్నత పాఠశాలలో చేరనివ్వకుండా చేసింది. ఆరవ తరగతి చదువు కోసం ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రేనికోనలోని ఉన్నత పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడ చేరడం వల్ల రోజుకు ఏడు ఏడు 14 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతాడు.

ఆ రోజుల్లో గ్రామాలలోని చేతివృత్తుల వారు దళితులకు పనిచేసేవారు కాదు. అలా ఎవరైనా చేస్తే వారు అగ్రకులాల అగ్రహానికి గురికావాల్సిందే. అందుకు ఉదాహరణ దార్ల జీవితంలోనే ఉంది. ఎగుడు దిగుడుగా ఉండే తన క్రాప్ వల్ల పాఠశాలలో సాటి విద్యార్థులు హేళన చేస్తుంటే తట్టుకోలేక దార్ల "ఈసారి మంగలి దగ్గర క్రాప్ చేయించుకుంటానని" నాన్నతో చెప్తాడు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ నాన్నే వీరికి క్రాప్ చేసేవాడు. ఈ మాట అనగానే వాళ్ళ నాన్నకు కోపం వచ్చి "మనకి మంగలాయన కటింగ్ వెయ్యడానికి రారు. అందుకనే నేను మీకు చేస్తున్నాను.' అన్నాడు మా నాన్న. “మరి మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళింటి కొచ్చి మరీ కటింగ్ వేస్తారట. మనకెందుకు చెయ్యరు?” అని అడిగాను.'అదంతే. మనకి చెయ్యరు. ఎవరైనా మనకి కటింగ్ వేసినట్లు తెలిస్తే ఊరంతా ఆ మంగలిని వెలేస్తారు. అందుకు చెయ్యరు.' కొంచెం కోపంగానే సమాధానం చెప్పాడు చిరాగ్గా. ఆ మాట విని కొంచెం భయమేసిందని దార్ల (వెంకటేశ్వరరావు 69) అంటాడు. అంతేగాక దళితుల బట్టలు ఉతకడానికి, ఇస్త్రీ చేయడానికి కూడా రజకులు ముందుకు రారని, ఆ పనులన్నీ తామే చేసుకోవాలని వాళ్ళ నాన్న తెలియచెప్తాడు. ఒక రజక కుటుంబం వీరికి సన్నిహితంగా ఉన్నప్పటికీ వారితో బట్టలు ఉతికించుకోవడం జరగలేదు. దార్ల వాళ్ళ అన్నయ్య చాటుమాటుగా ఇస్త్రీ చేయించుకోవడం మాత్రం దార్లకు తెలుసు.

ఈ సందర్భంలో దార్ల అభిప్రాయాన్ని తప్పక గమనించాలి.

కుల, మతాలతో మనుషుల్ని చూసే ఎక్కువ తక్కువలన్నీ నాలో అణుకువను, ఆలోచనను, ఆత్మగౌరవాన్ని నేర్పాయి. కేవలం కొన్ని కులాలు, కొన్ని మత కారణాల వల్లనే మనుషులంతా విడిపోతున్నారని గానీ, కలిసి మెలిసి జీవిస్తున్నారని గానీ ఒక నిర్ణయానికి రాగలమా? ఇది నా బాల్యం నన్ను అడుగుతున్న ప్రశ్న. నాకు ఎదురైన అనేక జీవితానుభవాల సారం నుండి వచ్చిన అనుమానం. రకరకాల మానస క్షేత్రాల దర్శనం. కులం మనిషిని ఏకం చేసినట్లు పైకి కనిపిస్తున్నా, అది కనిపించకుండా మనుషుల్ని విడదీస్తుంది. కులం, మతం విషబీజాలతో ప్రతి మనిషినీ విడదీస్తుంది. కులంనుండి మతాన్ని, మతంనుండి కులాన్నీ విడదీసి చూడ్డం అసాధ్యం (వెంకటేశ్వరరావు 173)

అంటాడు. కులం కారణంగా ఈ దేశం ఎంత వెనకబడిపోయిందో దార్ల మాటల్లో అర్థం చేసుకోవచ్చు. హిందువులు ఏర్పరిచిన మతంలో కులం అంతర్భాగమేనని, క్రైస్తవం, ఇస్లాంలో కూడా ఈ మధ్యనే కుల భావన కనిపిస్తోందని ఇవన్నీ హిందూ మత ప్రభావంతో వచ్చినవేనని చెప్తాడు.

అమ్ములు అనే ఒక భూస్వామి ఇంటికి చిన్నన్నకు బదులు పాలేరు పనికి వెళ్ళిన దార్లకు జరిగిన అవమానం అతనిలో తిరుగుబాటు తత్వాన్ని తీసుకొచ్చింది. రోజంతా పనిచేసి, అలసిపోయి ఆకలితో వచ్చిన దార్లకు ఆ ఇంటి యజమానురాలు పెట్టిన పాచిపోయిన బువ్వ నోట్లో పెట్టుకోగానే కక్కు రూపంలో బయటకు వచ్చింది. ఇదేమిటని ప్రశ్నించిందానికి ఆమె చెప్పిన సమాధానం విని, అన్నం గిన్నెను ఆమె ముఖానికి తగిలేటట్టు విసిరేసి బయటికి రావడం, వెంటనే వాళ్ళ పాకలోకి వెళ్లి నిట్రాతికి కట్టి ఉన్న ఆవును, గేదెను విప్పి తరిమేసి ప్రతీకారం తీర్చుకోవడం జరిగిపోయాయి. మరో సందర్భంలో నిజా నిజాలు తెలుసుకోకుండా దండించిన అధ్యాపకుడిపై కత్తితో దాడి చేయడానికి సిద్ధపడటం వంటివి చిన్నప్పుడే దార్లలో మొగ్గ తొడుగుతున్న చైతన్యానికి, తిరుగుబాటు ధోరణికి ఉదాహరణలు. ఇలాంటి సమాజాన్ని కళ్లారా చూశాడు కనుకనే దాన్ని మార్చాలనే కసిని తన కవిత్వంలో చూపిస్తాడు.

3.3. ప్రేరణ

దార్లను చిన్నప్పటినుండి కష్టాలు, అవమానాలు చుట్టుముట్టినా, తనకు తారసపడ్డ కొంతమంది వ్యక్తులు తనలోని ఆశలకు వెలుగునిచ్చారు. అందులో మొదటి వ్యక్తి ఊరందరి చేత 'అబ్బాయి'గా పిలవబడే దార్ల నాన్న గారు. ఆయన అసలు పేరు దార్ల లంకయ్య.

క్రమశిక్షణ విషయంలో చాలా నిబద్ధతతో ఉండే లంకయ్య, పిల్లలు తప్పు చేసినప్పుడు, చెప్పిన మాట విననప్పుడు ఎన్నోసార్లు అతి భయంకరంగా దండించిన సందర్భాలు ఉన్నాయి. అయినా, ఆయన బాధ్యత గల తండ్రిగానే కనిపించాడు దార్లకు. గుది దెబ్బలు, గూటం దెబ్బలు ఎన్ని తిన్నా, నాన్న ప్రేమ ముందు అవి గాలికి కొట్టుకుపోయిన దూది పింజలవుతాయి.

శ్రామిక శతావధానిలా కనిపించే 'అబ్బాయి' పొలం పని చేయడం, కొబ్బరికాయలు దించడం, తాటాకులు కొట్టడం, నాగలి దున్నడం, మూటలు మోయడం, చేపలు పట్టడం, వలలు అల్లడం, చేపల బుట్టల్ని అల్లడమే కాదు, చేతికి దొరికిన ప్రతి పని చేయడంలో ఆయన నిష్ణాతుడు. నాన్న ఇన్ని రకాల పనులలో ఆరితేరి ఉండడం చూసి దార్ల ఆశ్చర్యపోయేవాడు. బోరున కురిసే వర్షంలో కూడా ప్లాస్టిక్ సంచిని తలకు చుట్టుకుని కాలువలో వలేసి చేపలు పడుతుంటే, నాన్న పనితనం చూసి మురిసిపోయేవాడు.

దార్ల అమ్మ గారైన పెదనాగమ్మ సమాజాన్ని తెలుసుకున్న మనిషి. మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకున్న మహిళ. సాటివారితో ఎలా ప్రవర్తించాలో, ఎంత గౌరవంగా మసులుకోవాలో, ఎంత లౌక్యంగా ఉండాలో, ఎంత నిబద్ధతతో ఉండాలో చిన్నప్పటి నుంచి నేర్పించిన మొదటి గురువు. అందుకే నలుగురు పిల్లల్ని మాట పడనీకుండా పెంచ గలిగింది. ఆమె గొప్ప విద్యావంతురాలు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విద్యకు, అక్షరాల నేర్పుతో వచ్చిన పట్టాలకు తేడాను గమనిస్తే, విద్యావంతుల లక్షణం అర్థమవుతుంది. అందుకే అంటున్నాను ఆమె గొప్ప విద్యావంతురాలు. కుటుంబాన్ని సగ పెట్టుకోవడమే కాకుండా ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలో నేర్పింది. దానికి తోడు ఆమెకు అబ్బిన జానపద పరిమళం ఆమెకు మరింత గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఆమె కథన నైపుణ్యం ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులను తెచ్చి పెట్టింది.

మా అమ్మ వరిచేలల్లో ఊడుపులు ఊడ్చేటప్పుడు జానపథ కథలు చెప్పేది. దీన్ని శాస్త్రం చెప్పడమని పిలిచేవారు. రాగం తీస్తూ కథ చెప్తూ, నాట్లు వేస్తుంటే, పనిలో వాళ్ళంతా శ్రద్ధగా వినేవారు. చివరికి ఆ పొలం యజమాని కూడా ఆ కథ అయ్యేవరకు అక్కడక్కడే అటూఇటూ తిరుగుతు వినేవాడు. పని కూడా ఎక్కడా ఆగకుండా జరిగిపోయేది. ఇలా కథ చెప్పడం వల్ల మా అమ్మని పనిలోకి రమ్మని చాలామంది అడిగేవారు. అమ్మతో కలిసి పనిచేయాలని ఎంతోమంది ఆడవాళ్ళు ఉత్సాహపడేవారు. అమ్మ కూడా వచ్చి పనిచేయాలని ఎంతోమంది ఎదురుచూసేవారు. (వెంకటేశ్వరరావు 32-33)

దార్ల అంటాడు. ఆమె చెప్పే అరుంధతి కథ, ఆమె కథన నైపుణ్యానికి ఒక మచ్చుతునక. ఆమె చెప్పే కథలు దార్లకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. "మా అమ్మ కథ చెబితే అది మా మనసులపై శాశ్వతమైన బొమ్మలా ముద్రపడిపోయేది" అన్నంత గొప్ప జానపద కథకురాలు ఆమె. బహుశా ఆమె లోని సృజన దార్లలోకి ప్రవహించి ఉంటుంది. ఇంకో సందర్భంలో భూమి కొన్నప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోరు పెట్టిన ఆ చైతన్యవంతురాలు దార్లకు కూడా అంతే చైతన్యాన్ని ఇచ్చి పంపింది.

దార్లకు స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చిన మరో వ్యక్తి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన వెంకటరెడ్డి మాస్టారు. తన క్యారియర్లో మిగిలిన అన్నాన్ని దార్లకు పెట్టడం మాట అటుంచి, బాగా చదువుకుని పెద్ద పెద్ద పట్టణాలకు, నగరాలకు వెళ్లాలని ప్రోత్సహించేవాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే:

వెంకటరెడ్డి మాస్టారు నన్నెంతో ప్రేమగా చూసేవారు. నన్ను పెద్ద చదువులకోసం కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ వంటి పెద్దపెద్ద పట్టణాలు, నగరాలు పేర్లు చెప్పి, అక్కడకి పంపిస్తాను అనేవారు. 'ఆ పట్టణాల్లో, ఆ నగరాల్లో ఎప్పుడెప్పుడు వెళ్ళి చదువుకుంటానో కదా!' అని కలలు కనేవాణ్ణి. (వెంకటేశ్వరరావు 39)

అంతగా ప్రేరేపించిన వెంకట రెడ్డి మాస్టారు కోరిక నెరవేర్చాడు దార్ల. ఇంకా చెప్పాలంటే అంతకుమించిన స్థాయికి ఎదిగాడు.

తెలుగు పద్యంపై ఇష్టం కలిగించి తెలుగు భాషపై మక్కువ పెంచిన తెలుగు అధ్యాపకులు శ్రీకంఠం లక్ష్మణమూర్తి, హాస్టల్ జీవితంలో విన్న అంబేద్కర్ పై ప్రసంగాలు దార్ల జీవితానికి కొత్తదారులు వేశాయి.

3.4. సాహిత్యవిలువలు

నెమలి కన్నులు ఆత్మకథ సాహిత్య విలువను సంతరించుకుంది. పురాణ కథలను, అమూర్త వస్తువును వదిలి సామాన్య మానవుడే కేంద్రంగా ఆవిర్భవించిన ఆధునిక సాహిత్యంలో సగటు మానవుడి కష్టసుఖాలు సాహిత్య వస్తువులుగా మారిపోయాయి. అంతేకాక, సాహిత్య స్పృహ కలిగిన రచయితలు రాసుకున్న ఆత్మకథల్లో మేలిమి వచనంతో పాటు కవిత్వం కూడా తొంగి చూస్తుంది.

నెమలి కన్నులు పేరుతో ఆత్మకథ రాసుకుంటున్న రచయిత స్వయంగా కవి, విమర్శకుడు. అందువల్ల ఏది రాసినా అది అందమైన పదంగానో, వాక్యంగానో లేదా కవితగానో స్వచ్ఛంగా పరిమళిస్తుంది. మా ఊరి పేరు అగ్రహారం, కోనసీమ ప్రేమ కౌగిలిలో మా ఊరు, నీకు తృప్తిగా తినిపించాలనుంది నాన్నా మొదలైన శీర్షికలలో చిక్కటి కవిత్వం కోనసీమ పైరులా పచ్చగా పరుచుకుని ఉంది. సాధారణ విషయాలను కూడా తన సాహిత్య బలంతో మెప్పించేలా చెప్పగలగడం వల్లే ఆత్మకథకు సాహిత్య విలువ లభించింది. అదే దార్ల ప్రత్యేకత.

నా బాల్యం. నా యౌవనం. నా జీవితం. నా కుటుంబం. నా జాతి. నేను బతకడానికి పడిన కష్టాలు...గాయాలు నా పై ఎక్కడెక్కడో చిరు జల్లుల్లా కురిసిన ఆనందపు క్షణాలు తెరలు తెరలుగా కళ్లముందు కదులుతున్నాయి. నవ్వు, విషాదం, అసహనం అన్నీ ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా కదిలివస్తున్నాయి. ఒక్కసారిగా వాటిని ఒడిసి పట్టుకోవడమెలా? (వెంకటేశ్వరరావు 4)

సాయంత్రం చేపల బుట్ట పట్టుకొని, నీవెనకాలే వచ్చేవాణ్ణి. నువ్వు గబగబా నడుస్తుంటే, నువ్వు గమనించేవాడివో లేదో గానీ, ఆ రంగరాజుకోడు కాల్వంతా నీ అడుగుల్తో పరవశించేది. ఆ కాల్వలో ప్రవహించే నీరు కూడా నీ స్పర్శతో పునీతమయ్యేది (వెంకటేశ్వరరావు 16)

వంటి కవిత్వ గర్బిత వాక్యాలు మనసును చుట్టేసుకుంటాయి. నీలాద్రి రాజు చేలో ఇంటిల్లిపాది చేసిన వెట్టి చాకిరి గురించి రాసిన వాక్యాలు వచన కవితకు ఊపిరి పోస్తాయి. ...అదిగో నాన్న వంట్లో మూలుగులన్నీ పీల్చేసి చిన్నన్నయ్య జీవితాన్నంతా తాగేసి, కుమ్మనరాజు కొబ్బరితోట దారికడ్డంగా రక్తం తాగే రాక్షసిలా...” (వెంకటేశ్వరరావు 25)

అనడంలో దార్ల కుటుంబం పడిన కష్టం, అనుభవించిన వేదన నేరుగా మనసును తాకుతాయి. 'ఆ విషయంలో రజకులే నాకు ఆదర్శం', 'హాస్టలూ అంబేద్కర్ జయంతీ', 'తీర్థం చూడ్డానికి డబ్బులు ఎందుకు?', 'కొత్త వెలుగుల్ని చూపించిన పరీక్షలు' మొదలైన శీర్షికలు కవిత్వంలో తేలుతూ ఉంటాయి.

వాళ్ళు నా ఆశల్ని మొగ్గలోనే తుంచేయాలనుకున్నారు. నేనేమో నా ఆశల్ని ఆకాశమంత ఎత్తుకెగరేశాను. వాళ్ళు నా జీవితాన్ని పాతాళంలోకి తొక్కెయ్యాలనుకున్నారు నేనేమో నేలకు కొట్టిన బంతినై మరింత పైకెళ్ళేలా ప్రయత్నించాను. వాళ్ళు నన్ను లేవకుండా ముళ్ళపొదల్లోకి విసిరేయాలనుకున్నారు. నేనేమో ఆ ముళ్ళ పొదల్నే రక్షణకవచాలుగా చేసుకుని ఓ పూలమొక్కనై పరిమళించా (వెంకటేశ్వరరావు 67)

అంటున్న దార్ల మాటలు రాబోయే తరానికి చైతన్య సూత్రాలు.

ఉపసంహారం

సాహిత్యం సామాజిక మార్పు కోసం అని మనం భావిస్తే, మార్పు మనిషి నుండే ప్రారంభం కావాలి అనుకుంటే, అలాంటి మార్పును, అలాంటి మనిషిని దార్లలో చూస్తాం. దార్ల రాసుకున్న ఈ ఆత్మకథలో 50 ఏళ్ల సమాజం ఉంది. అది తీసుకుంటున్న పరిణామం ఉంది. అట్టడుగు సమాజంలో గుండెను చీల్చుకొని పొంగిన కన్నీళ్లు ఉన్నాయి. భూస్వాముల చీత్కారాలతో పాటు విద్యావంతుల సత్కారాలు ఉన్నాయి. దళిత, బహుజనుల బాధలు ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ లాంటి ప్రాంతంలో గుడిసెలు వేసుకోవడానికి కూడా స్థలాలు లేని అనామకుల చరిత్రలున్నాయి. ముక్కారు పంటలు పండే ప్రాంతంలో నిలువునా ఆకలితో ఎండిపోయిన జీవితాలున్నాయి. కులం, రాజకీయం, అధికార వర్గం చేస్తున్న దౌర్జన్యాలు ఉన్నాయి. ముఖ్యంగా గత యాభై ఏళ్ళ సామాజిక పరిణామ చరిత్ర ఉంది. చరిత్రను పునాది చేసుకుని, వర్తమానాన్ని స్తంభాలుగా నిలబెట్టి, భవిష్యత్తుకు పందిరి వేయాలంటే నెమలి కన్నులు లాంటి ఆత్మకథలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • దార్ల వెంకటేశ్వరరావు "నెమలి కన్నులు" ఆత్మకథ జీవిత ప్రస్థానం, సామాజిక మార్పులపై విశ్లేషణ;
  • ఈ రచన అట్టడుగు వర్గాల అనుభవాలు, కులవివక్ష, సామాజిక కట్టుబాట్లను ప్రతిబింబిస్తుంది;
  • కుటుంబ నేపథ్యం, బాల్య జ్ఞాపకాలు, చదువుకు ఆటంకాలు, వ్యక్తిగత ప్రేరణలు స్పష్టంగా వివరిస్తుంది;
  • సాహిత్యవిలువలతో కూడుకున్న ఈ ఆత్మకథ భావి తరాలకు ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని అందిస్తుంది;
  • యాభై ఏళ్ల సామాజికచరిత్ర అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉపకరిస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. కృష్ణమాచార్య, దాశరథి. ఆత్మకథ. సాహితీ సంఘం, హైదరాబాదు, 1970.
  2. చిదంబర రెడ్డి, సడ్లపల్లి. బతుకు వెతుకులాట. తపన సాహిత్య వేదిక ప్రచురణలు, హిందూపూర్, 2018.
  3. జానకీ రామ్, ఆచంట. నా స్మృతి పథంలో... సాగుతున్న యాత్ర. రాజాచంద్ర ఫౌండేషన్, తిరుపతి, 2013.
  4. నారాయణ దాసు, ఆదిభట్ల. నా ఎరుక: స్వీయ చరిత్ర. మిత్రమండలి ప్రచురణ, గుంటూరు, 2012.
  5. నారాయణ రెడ్డి, రావి. వీర తెలంగాణ: నా అనుభవాలు, జ్ఞాపకాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2010.
  6. నారాయణాచార్యులు, పుట్టపర్తి. నా యానము. త్రివేణి పబ్లికేషన్స్, కర్నూలు, 1965.
  7. వెంకటేశ్వర రావు, దార్ల. నెమలి కన్నులు. కస్తూరి విజయం ప్రచురణలు, హైదరాబాద్, 2023. 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]