AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. తెలంగాణ పదకోశకర్తలు: ప్రత్యేకతలు
డా. యస్. మహేందర్
తెలుగు సహాయాచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వ),
గజ్వేల్, తెలంగాణ.
సెల్: +91 9642865013, Email: sheelammahender96@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.10.2025 ఎంపిక (D.O.A): 30.10.2025 ప్రచురణ (D.O.P): 01.11.2025
వ్యాససంగ్రహం:
పరిశోధన ఒక భాష పదసంపదను నిఘంటువులు పరిరక్షిస్తాయి. నిఘంటువులనే మనం మరోకార్థములో పద కోశాలుగా పిలుస్తున్నాం. అన్యోన్యాపేక్ష లేనిశ్లోక సముదాయాన్ని కోశమంటారని మన లాక్షణికులు నిర్వచించినారు. “దేశాన్నాయిన చూడు, లేక కోశాన్నాయిన చూడు” అని పెద్దలు అంటుంటారు. ఇక్కడ కోశమంటే పదకోశం. పదాల అర్థాలను తెలిపే గ్రంధం. మన దేశములో ఇప్పటికీ మనకు లభిస్తున్న సమాచారం ప్రకారం అమర కోశమే మొదటి పదకోశంగా లక్షణకారులు గుర్తించినారు. సి.పి. బ్రౌన్ సాహిత్య కృషి వలన తెలుగులో ఇప్పటి ఆధునిక రీతిలో ఉన్న పదకోశాలను మనం నిర్మించుకున్నాం. దాని ఫలితంగానే శబ్దరత్నాకరం బ్రౌణ్యనిఘంటువు, ఆంధ్రనామసంగ్రహం, విద్యార్థికల్పతరువు, సాంబ నిఘంటువు, శ్రీహరినిఘంటువు, తెలుగు విశ్వవిద్యాలయ నిఘంటువు, తెలుగు అకాడమీ నిఘంటువులు మొదలగునవి ఎన్నో తెలుగులో వెలిసినాయి. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రములో జరిగిన అన్యాయాల్లో భాష కూడా ఒకటి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమములో సృజనకారులు ఎన్నో పాటలు, కథలు, నవలలు మొదలగు సాహిత్య ప్రక్రియాలల్లో వారి యాసను, భాషను, పదజాలాన్ని చొప్పించి అస్తిత్వాన్ని చాటుకున్నారు. భాషా వేత్తలు కూడా తమ వంతు కర్తవ్యంగా తెలంగాణ పదజాలాన్ని ఒక చోటుకు తీసుకురావడానికి కృషి చేసినారు. అట్ల కృషి చేసిన వారిలో నలిమెల భాస్కర్, ముదిగంటి సుజాతారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, కాలువ మల్లయ్య, కపిలవాయి లింగమూర్తి, భూతం ముత్యాలు ఎస్. చంద్రయ్య మొదలుగు వారలు కొన్ని పదకోశాలను నిర్మించినారు. వారు నిర్మించిన పదకోశాల ప్రత్యేకతను తెలియజేయడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.
Keywords: నిఘంటువు, పదకోశం, తెలంగాణ, వ్యవహర్తలు, ఆకరాదిక్రమము.
1. ప్రవేశిక
అడిగిన యర్థంబు నంతయు సమకూర్చు - నడిగిన తక్షణం బమరి నిచ్చు
నెవ్వారలడిగిన నేకరీతిగా నిచ్చు- నెప్పుడడిగిన నిప్పడప్పుడనక
గాన నిఘంటువు కల్పతరువు గాదె – కాదెపో తప్పక కామధేను
అట్టి వస్తువు అక్కర లేనట్టి – వారలుందురె ఎట్టి వారికి నిది
లేక యుండుటగును జేయు లేకయుండుట
అంధకారంబునందు అల్లాడు టొప్పో
కామధేనువో కల్ప వృక్షంబొ మనకు
లభ్యములుగా ఆకారాది లభ్యమిలను (శంకర నారాయణ 2)
ప్రముఖ నిఘంటువు కర్త ఆచార్య పాలూరి శంకర నారాయణ కావాల్సిన అర్థాన్ని ఎవరు, ఎప్పుడు, ఏది అడిగిన తక్షణమే ఇచ్చే నిఘంటువు కల్పతరువని, కామధేనువని పోల్చడముతో భాష వ్యవహర్తలకు పాఠకులకు నిఘంటువు ప్రాధాన్యతను ఈ పద్యం ద్వారా తెలియజేశారు.
1.1 నిఘంటువుల ప్రాధాన్యత
భాష పదసంపదను నిఘంటువులు పరిరక్షిస్తాయి. నిఘంటువులనే మనం మరో అర్థంలో పదకోశాలుగా పిలుస్తున్నాం. అన్యోన్యాపేక్ష లేని శ్లోక సముదాయాన్ని కోశమంటారని మన లాక్షణికులు నిర్వచించారు. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం ఆనందమయం వంటి వాటిని ‘పంచకోశాలని’ పిలుస్తారు. వీటిలో నాల్గవది విజ్ఞానమయం అనే దానిని పదకోశం అని కూడా పిలుస్తారు. మనిషికి విజ్ఞానం పెరగాలంటే “దేశాన్నైనా చూడు, లేదా కోశాన్నైనా చూడు” అని పెద్దలు అంటుంటారు (పాలపిట్ట మాసపత్రిక, పుట. 12, అక్టోబర్, 2010). ఇక్కడ కోశమంటే పదకోశం, పదాల అర్థాలను తెలిపే గ్రంథం.
1.2 తెలుగు నిఘంటువుల అభివృద్ధి
మన దేశంలో ఇప్పటికీ మనకు లభిస్తున్న సమాచారం ప్రకారం అమర కోశమే మొదటి పదకోశంగా లక్షణకారులు గుర్తించారు. ఇది సంస్కృతంలో శ్లోకాల రూపంలో ఉంది. ఆంగ్ల భాష ప్రభావం, సి. పి. బ్రౌన్ సాహిత్య కృషి ఫలితంగా తెలుగులో ఆధునిక రీతిలో ఉన్న పదకోశాలను మనం నిర్మించుకున్నాం. దాని ఫలితంగానే శబ్దరత్నాకరం, బ్రౌణ్యనిఘంటువు, ఆంధ్రనామసంగ్రహం, విద్యార్థికల్పతరువు, సాంబనిఘంటువు, శ్రీహరినిఘంటువు, తెలుగు విశ్వవిద్యాలయ నిఘంటువు తెలుగు అకాడమీ నిఘంటువులు వంటి ఎన్నో తెలుగులో వెలిశాయి.
1.3 తెలంగాణ పదకోశాల ఆవశ్యకత
తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాల్లో భాష కూడా ఒకటి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సృజనకారులు ఎన్నో పాటలు, కథలు, నవలలు వంటి సాహిత్య ప్రక్రియలలో తమ యాసను, భాషను, పదజాలాన్ని చొప్పించి అస్తిత్వాన్ని చాటుకున్నారు. భాషా వేత్తలు కూడా తమ వంతు కర్తవ్యంగా తెలంగాణ పదజాలాన్ని ఒక చోటుకు తీసుకురావడానికి కృషి చేశారు. అట్లా కృషి చేసిన వారిలో నలిమెల భాస్కర్, ముదిగంటి సుజాతారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, కాలువ మల్లయ్య, భూతం ముత్యాలు వంటి వారలు కొన్ని పదకోశాలను నిర్మించారు. వారు నిర్మించిన పదకోశాల ప్రత్యేకతను తెలియజేయడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.
1.4 పూర్వపరిశోధన సమీక్ష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుఅకాడమీ వారు ప్రామాణికభాషలో నిఘంటువులకు లిఖిత భాష పదాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, జిల్లాల వారీ మాండలిక పదకోశాలను నామమాత్రంగా రూపొందించారు. కానీ ఇందులో లిఖిత మైన పదాలకు మాత్రమే పదకోశాలను తయారు చేశారు. జనవ్యవహారంలో ఉన్న యాస, మాండలిక పదాలకు నిఘంటువులలో చోటు లభించలేదు.
2. పదకోశకర్తలు
తెలంగాణ పదకోశకర్తలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందున్న పదకోశకర్తలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్న పదకోశకర్తలు. ఆచార్య పేర్వారం జగన్నాథం, ఆచార్య రవ్వా శ్రీహరి, డాక్టర్ నలిమెల భాస్కర్ వంటివారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న పదకోశకర్తలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, కాలువ మల్లయ్య వంటివారు వచ్చారు. సాధారణంగా నిఘంటువులు రామాయణాల లాగా కర్తల పేర్లతో రూపొందించబడడం ఒక పద్ధతి కూడా ఉంది. ఉదాహరణకు సాంబ నిఘంటువు, శ్రీహరి నిఘంటువు. కానీ తెలంగాణలో వచ్చిన నిఘంటువులన్నీ ఎక్కువ పదకోశాల పేరుతోనే నిఘంటువులుగా రూపొందించబడ్డాయి.
2.1 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు పదకోశకర్తలు
వీరంతా తెలంగాణ భాష మీద ఉన్న మమకారంతో కానీ, తమ స్వంత కుల భాషను, ప్రాంతీయ భాషను పరిరక్షించుకోవాలనే తపనతో ఉద్యమంతో సంబంధం లేకుండా పదకోశాలను రూపొందించారు.
2.1.1 ఆచార్య రవ్వా శ్రీహరి
తెలుగు సంస్కృతాచార్యులు, ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వఉపకులపతి, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. వీరు తెలంగాణ ప్రాంతంలో మొదటి నుండి నిఘంటు నిర్మాణానికి ఎంతో సేవ చేసినవారు. వీరు ఆరు నిఘంటువులను రూపకల్పన చేశారు: 1. శ్రీహరి నిఘంటువు, 2. అన్నమయ్య పదకోశం, 3. సంకేత పదకోశం, 4. వ్యాకరణ పదకోశం (బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి), 5. నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం, 6. తూము రామదాసు కవి పద్యాకార ధ్యానానుక్రమణిక పదకోశం. వీరు తెలంగాణ పదకోశ కర్తలలో ఎక్కువ పదకోశాలను రూపొందించిన వారిగా ప్రత్యేకతను చాటుకున్నారు. అన్నమయ్య, తూము రామదాసు వ్యక్తుల సాహిత్యానికి సంబంధించిన పద కోశాలను తయారు చేయడం విశేషం.
2.1.2 పేర్వారం జగన్నాథం
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పూర్వఉపకులపతి, కవిగా, పరిశోధకుడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతిగాంచిన చేతనావర్తన కవి వీరు. ‘ఆరెభాష నిఘంటువు’ పేరుతో ఒక పదకోశాన్ని నిర్మించారు. ఆరె కులస్తులు పూర్వం మరాఠా రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వాళ్లు. ఆరె కులస్తులకు ప్రత్యేకమైన ఒక భాష ఉంటుంది. ఆచార్య పేర్వారం జగన్నాథం అదే కులానికి చెందినవారు కనుక ఆరె భాష నిఘంటువు అనే పేరుతో ఒక పదకోశాన్ని రూపొందించి, ఆ భాషా పదజాలాన్ని కొంతవరకు కాపాడే ప్రయత్నం చేశారు. ఒక కులానికి సంబంధించిన పదకోశాన్ని నిర్మించిన వారిలో వీరిని తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేకతగా చెప్పవచ్చు.
2.1.3 నలిమెల భాస్కర్
మొదటినుండి తెలంగాణ భాషకు విశేష సేవలందిస్తున్న బహుభాషా వేత్త, తెలుగు అధ్యాపకులు నలిమెల భాస్కర్. వీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడు. వీరు చాలా కాలంగా తెలంగాణ భాష పైన, వాక్య నిర్మాణం పైన అపారమైన పరిశోధనలు చేస్తూ, ‘తెలంగాణ పదకోశం’ పేరుతో నిఘంటువు నిర్మించారు. దాదాపుగా వ్యవహారంలో ఉన్న 7 వేల తెలంగాణ పదజాలంతో ఈ నిఘంటువు రూపొందించబడింది. ఇప్పటివరకు వచ్చిన నిఘంటువులన్నీ లిఖిత రూపంలో ఉన్న పదాలతో ఏర్పడిన నిఘంటువులు. కానీ నలిమెల భాస్కర్ రూపొందించిన ఈ తెలంగాణ పదకోశం సామాన్య జన వ్యవహారంలో వ్యవహర్తలు మాట్లాడే పదాలను తీసుకొని నిఘంటువు రూపొందించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇది 2003లో ప్రథమ ముద్రణా, 2010లో ద్వితీయ ముద్రణ పొందింది. అంతే కాకుండా వీరు ‘తెలంగాణ భాష – దేశ్య పదాలు’ 2017లో, ‘తెలంగాణ భాష - సంస్కృత పదాలు’ 2020లో మరో రెండు పద కోశాలను రూపొందించారు.
2.1.4 భూతం ముత్యాలు
దళితకవిగా, కథకుడిగా ప్రఖ్యాతిగాంచిన నల్గొండ జిల్లా వాస్తవికులు. భూతం ముత్యాలు ‘మాండలీకం’ పేరుతో తెలంగాణ కుల వృత్తి పదకోశాన్ని 2013లో రూపొందించారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తర్వాత కులవృత్తి పదకోశం తెలంగాణ రాష్ట్రంలో రావడం ఈ పదకోశం ప్రత్యేకత. నల్గొండ జిల్లా మాండలిక పద కోశం ఇప్పటికే రవ్వా శ్రీహరి నిర్మించడం వలన వీరు కుల వృత్తి పదకోశాన్ని నిర్మించారు.
2.2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదకోశకర్తలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష పైన ప్రత్యేకమైన మమకారం, తెలంగాణ ఉద్యమ ఫలితంగా కొత్తగా రాష్ట్రం ఏర్పడటంతో నిఘంటువుల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధతో పదజాలాన్ని నిక్షిప్తం చేయడానికి ప్రయత్నించారు.
2.2.1 కపిలవాయి లింగమూర్తి
శతాధిక గ్రంథకర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ‘పాలమూరు మాండలిక పామర సంస్కృతం’ పేరుతో ఒక నిఘంటువును రూపొందించారు. ఈ నిఘంటువు ప్రత్యేకత ఏమిటంటే పాలమూరు మాండలిక పదాలన్నిటిని ఏర్చి కూర్చిన నిఘంటువు రూపొందించారు. తెలంగాణ ప్రాంతంలో పాలమూరు జిల్లా భౌగోళికంగా విస్తీర్ణంలో చాలా పెద్దది. ఆ ప్రాంతంలో ఆ భాష మాండలిక పదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కావున ఉమ్మడి పాలమూరు మాండలిక పదాలన్నింటిని ఒక పదకోశంగా రూపొందించి, మాండలిక పదకోశంలో మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు.
2.2.2 ముదిగంటి సుజాతారెడ్డి
ప్రముఖ కథకురాలు, విమర్శకురాలు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి ‘తెలంగాణ వ్యవహార పదకోశం’ పేరుతో నిఘంటువును రూపొందించారు. ఈ పదకోశం తెలుగు విశ్వవిద్యాలయం నవచేతన పబ్లిషింగ్ హౌసింగ్ సంయుక్త ఆధ్వర్యములో 2018లో రూపొందించబడింది. ఈ పదకోశానికి సుజాతారెడ్డి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ఒక వ్యవస్థతో/సంస్థతో కలిసి ఒక వ్యక్తి సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ పదకోశంగా దీనిని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
2.2.3 కాలువ మల్లయ్య
కథకులుగా, నవలాకారుడిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ కాలువ మల్లయ్య ‘గుమ్మి’ పేరుతో తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. ‘తెలంగాణ వాడుక భాషా పలుకులు, పలుకుబడులు’ ఉప శీర్షికతో ఈ పదకోశ నిర్మాణం జరిగింది. ధాన్యం నిల్వ ఉంచే దానిని గుమ్మి అని అంటారు. ధాన్యం అనేది నిత్యం వాడుకునే ఆహార దినుసు. భాష కూడా నిత్యం వ్యవహరించేదే. అందుకే ఈ పదకోశానికి గుమ్మి అని పేరు పెట్టడం జరిగింది. 15 వేల పదాలతో తెలంగాణ వాడుక పదాలను గుమ్మి 2016లో ప్రచురించబడింది. పదకోశం అని దీనికి నామధేయంగా పెట్టకపోవడం ఈ పదకోశం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
2.2.4 తెలంగాణ సాంస్కృతిక పదకోశం
తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణలో ఎస్. చంద్రయ్య సంపాదకత్వములో ఇమ్మడి మహేందర్ సహసంపాదకత్వములో ఈ పదకోశం రూపొందించబడింది. తెలంగాణ రాష్ట్రం కొన్ని సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలల్లో, సంస్కృతిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. అవి పండుగలు, పబ్బాలు, జాతరలు, ఉత్సవాలు వంటివి కావచ్చు. ఇలాంటి సందర్భాలలో మాండలిక పరంగా కొన్ని ప్రత్యేక పదజాలాన్ని వ్యవహర్తలు వాడుతుంటారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నపుడు, కాలం మారుతున్న కొలది కొన్ని ఆచార వ్యవహారాలు మారుతుంటాయి. అలా మారుతున్నపుడు పాత పదజాలం పోయి కొత్త పదజాలం వచ్చి చేరుతుంది. ఇట్లా కనుమరుగవుతున్న పదజాలాన్ని పరిరక్షించే పనికి ఈ ఇరువురు పూనుకున్నారు. ఈ నిఘంటువు తెలంగాణలో జరుపుకునే పండుగలు, జాతరలు సందర్భాలలో వాడే ఈ ప్రత్యేక పదజాలాన్ని ఒక నిఘంటువుగా తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
2.2.5 విశ్వవిద్యాలయాల సేవ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘తెలంగాణ నిఘంటువు’ పేరుతో ఒక పదకోశాన్ని నిర్మించారు. వ్యక్తుల సంపాదకత్వములో కాకుండా ఒక సంస్థ ఆధ్వర్యములో నిఘంటువు రూపొందించడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
2.2.6 అంతర్జాల సేవలు
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత చాలా మంది వ్యవహర్తలు, భాషా వేత్తలు చరవాణీలు, డెస్క్ టాపులు, ల్యాప్ టాపులు వినియోగంలోకి రావడంతో అంతర్జాలంలో కూడా తెలంగాణ పదకోశాలను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో వసుంధర అక్షర జాలం వారు దాదాపుగా 1400 తెలంగాణ వ్యవహారంలో ఉన్న వాడుక పదాలను ఒకచోట పేర్చి అందరికీ అందుబాటులో ఉంచారు. దీనికి పదకోశమనో, లేదా నిఘంటువు అనో కాకుండా అక్షరజాలం పేరుతో అంతర్జాలంలో మనకు లభ్యమవుతుంది. ఇది ఆకారాది క్రమంలో లేకపోవడం వలన పాఠకులకు కొంత అసౌలభ్యంగా అనిపించవచ్చు.
2.2.7 డిగ్రీ విద్యార్థుల సంకలనం
ఆంధ్ర మహిళా సభ కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు అలివేణి మబ్బు సంపాదకత్వంలో ‘తెలంగాణ పద నిఘంటువు’ పేరుతో ఒక సంకలన నిఘంటువును తయారుచేశారు. ఇది విద్యార్థినుల చేత అంతరించిపోతున్న తెలంగాణ పదజాలాన్ని సేకరించి రూపొందించిన నిఘంటువుగా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క విద్యార్థిని 50 పదాలు తమ తమ ఊర్లో వాడుతున్న పదాలను వృద్ధులను, పెద్ద మనుష్యులను కలిసి సేకరించారు. కథాసంకలనం, కవిత్వ సంకలనం, పద్యసంకలనం, వ్యాస సంకలనం లాగా నిఘంటు సంకలనం తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
2.2.8 తెలంగాణ పదకోశానికి ఇతరుల సేవలు
వేముల పెరుమాళ్ ‘తెలంగాణ జాతీయాలు’ పేరుతో ఒక నిఘంటువును, సిరిగాద శంకర్ నమస్తే తెలంగాణ ఆదివారం సంచిక బతుకమ్మలో తెలంగాణ యాస పదాలను వారం వారం ప్రచురించడం, పరిశోధక విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, తెలుగు దిన పత్రికలు వంటివి నిఘంటువులు కాకపోయినప్పటికీ ఇక్కడి భాషకు సేవ చేస్తున్న వారే.
పైన పేర్కొన్న పదకోశాలే కాకుండా ముద్రితమై, ఆముద్రితమై ఉన్న పదకోశాలు కొన్ని ఉండవచ్చు. నా పరిశోధన పరిమితి, పరిధి మేరకు ఇక్కడ వివరించగలిగాను.
ఉపసంహారం
భాష అభివ్యక్తీకరణకు ఒక సాధనం. భాష ఒక జాతి సంపద. భాష ఒక దేశ వారసత్వ సంపద. అలాంటి వారసత్వ సంపదను భావితరాలకు అందజేసే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. నిఘంటువు భాషకు ప్రతిరూపం. ఇప్పటికే మన దేశంలో లిపి లేని ఎన్నో భాషలు కనుమరుగై జాతి సంపదను పొగొట్టుకున్నాం. నేడు అత్యంత వేగముతో సాంకేతిక పరిజ్ఞానం, దేశ కాల పరిస్థితులు ఎంతో మార్పుకు లోనవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ పరిస్థితులకు దేశ ప్రజల జీవన విధానంలో మార్పు చోటుచేసుకుంటుంది. భాషకు అభివ్యక్తీకరణతో పాటు ఎన్నో సాంస్కృతిక అంశాలు ముడిపడి ఉంటాయి. భాష ఒక సాంస్కృతిక అంశం. భాష కనుమరుగైతే భాషతో పాటు ముడిపడియున్న సంస్కృతి, సంప్రదాయాలు అన్ని కనుమరుగై అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
అన్ని జిల్లాలలోని జన వ్యవహారంలో ఉన్న వాడుక పదాలను పదకోశాలుగా రూపొందించాలి. తెలంగాణలోని సబ్బండ కులాల వృత్తి పదకోశాల రూపకల్పనకు ప్రణాళికలు చేయాలి. ముఖ్యంగా తెలంగాణ అంతటికీ ఒక ప్రామాణిక నిఘంటువును అన్ని జిల్లాల సమన్వయముతో విశ్వ విద్యాలయాలతో, అధికార భాషా సంఘంతో, సాహిత్య అకాడమీలతో సహకారంతో రూపొందించాలి. తెలంగాణ భాష పదాలు ఇతర భాష వ్యవహర్తలకు అర్థమవ్వడానికి ద్విభాషా నిఘంటువులను తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మన తెలంగాణ పదాలను భవిష్యత్తరాలకు అందజేసినవారమవుతాం.
- తెలంగాణ భాషా పదజాలాన్ని పరిరక్షించడంలో నిఘంటువులు కీలక పాత్ర పోషిస్తాయి.
- రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తర్వాత అనేక మంది రచయితలు పదకోశాలను రూపొందించారు.
- రవ్వా శ్రీహరి, పేర్వారం జగన్నాథం, నలిమెల భాస్కర్, భూతం ముత్యాలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు కృషి చేశారు.
- కపిలవాయి లింగమూర్తి, ముదిగంటి సుజాతారెడ్డి, కాలువ మల్లయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ వంటివారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిఘంటు రచనకు తోడ్పడ్డారు.
- వాడుక భాషా పదజాలానికి, కుల వృత్తులకు, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ పదకోశాలు రూపొందాయి.
- అంతర్జాల వేదికలు, డిగ్రీ విద్యార్థుల సంకలనాలు నిఘంటు నిర్మాణానికి కొత్త మార్గాలను చూపుతున్నాయి.
- తెలంగాణ పదజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత.
ఉపయుక్త గ్రంథసూచి
- అలివేణి, మబ్బు. తెలంగాణ పద నిఘంటువు. అలివేణి మబ్బు స్వీయ ప్రచురణ, హైదరాబాద్, 2024.
- చంద్రయ్య, ఎస్., సంపాదకుడు. తెలంగాణ సాంస్కృతిక పదకోశం. తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, 2024.
- జగన్నాథం, పేర్వారం. ఆరె భాషా నిఘంటువు. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 1995.
- భాస్కర్, నలిమెల. తెలంగాణ పదకోశం. నయనం ప్రచురణలు, సిరిసిల్లా, 2003.
- మల్లయ్య, కాలువ. గుమ్మి. ఫెయిర్ మీడియా ప్రచురణ, హైదరబాద్, 2018.
- ముత్యాలు, భూతం. మాండలీకం. గుంపు మాండలిక సంస్థ, నల్గొండ, 2013.
- ముదిగంటి, సుజాతారెడ్డి. తెలంగాణ వ్యవహార పదకోశం. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2018.
- లింగమూర్తి, కపిలవాయి. పామర సంస్కృతం. మార్నింగ్ ప్రచురణలు, మహబూబ్ నగర్ జిల్లా, 2016.
- శంకర నారాయణ, పాలూరి. ఆంధ్ర వాచస్పత్యం. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1990.
- శ్రీహరి, రవ్వా. శ్రీహరి నిఘంటువు. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2004.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

