AUCHITHYAM | Volume-06 | Issue-13 | November 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. శ్రీరఘురామ శతకము: భక్తి, సామాజికాంశాలు
ఎం. వేణుగోపాల్ శర్మ
సహాయాచార్యులు, తెలుగుశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మెదక్, తెలంగాణ.
సెల్: +91 9032528684, Email: venugopalsharma@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.10.2025 ఎంపిక (D.O.A): 30.10.2025 ప్రచురణ (D.O.P): 01.11.2025
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్య చరిత్రలో శతక ప్రక్రియ వినూత్న స్థానం పొందింది. ఎన్నో కవితా వస్తువులను స్వీకరిస్తూ, ప్రాచీన మార్గాన్ని అనుసరించి సమాజంలోని అంశాలపై నూతన కవులు స్పందిస్తూ నూతన శతక రచనలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ లక్షణం ఒకే విధంగా ఉన్నా, కవి ఎంచుకున్న ఇతివృత్తం భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది. రంగన్నగారి సాయులు 2002లో రచించిన "శ్రీ రఘురామ శతకం" వైష్ణవ భక్తి తత్వ ప్రధానమైంది. 108 కంద పద్యాలతో "శ్రీ రఘురామా" మకుటంతో కూడిన ఈ శతకంలో భక్తి, వ్యక్తిత్వ, సామాజిక, నైతిక విలువలు విశదమవుతాయి. ప్రస్తుత పరిశోధన ఈ శతకంలోని భక్తి, నీతి, సామాజిక అంశాలను ఎంపిక చేసిన పద్యాల ద్వారా విశ్లేషిస్తుంది. శతకాలు నీతి, దైవ భక్తి, సామాజిక శ్రేయస్సు, దేశభక్తి ప్రబోధకాలుగా నిలుస్తాయి. తరాలు మారినా వీటి ఆదరణ తగ్గదు, విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడతాయి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలపై పరిశోధనలు విస్తృతంగా జరిగినా శతక సాహిత్యంపై మరింత కృషి అవసరం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శతక సాహిత్య పరిశోధనలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాలను సందర్శించి, పలువురు శతక కవులను కలిసి 73 శతక రచనలు సేకరించడమైనది. శ్రీ రఘురామ శతకం వాటిలో ఒకటి. డా. గోపాల కృష్ణారావు రచించిన "ఆంధ్రశతకసాహిత్యవికాసము" శతక పరిశోధనలకు ప్రామాణికంగా నిలుస్తుంది. ప్రస్తుతవ్యాసం విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించి, శతక లక్షణాలు, వర్గీకరణ, సామాజిక ప్రయోజనాలను వివరించింది. పరిశోధన ఫలితాలు శతకసాహిత్యం ప్రాధాన్యతను, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అది అందించగల వికాసాన్ని నిరూపిస్తాయి. శతకశైలి సరళంగా ఉండి, ఆత్మాశ్రయ కవితా ధర్మం ఉండటం వల్ల విద్యార్థి మనస్సులో సులభంగా నాటుకుంటుంది. వేమన, సుమతి, భాస్కర శతకాలు నాటి తరాలను ప్రభావితం చేసినట్లే, ఈ ప్రక్రియను ముందు తరాలకు మరింత ప్రభావవంతంగా అందించాలి. కవి తన శతకంలో భక్తి తత్వానికి మానవీయ విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, సమాజ స్థితిగతులను లోక వ్యవహారాలను చాటి చెప్పిన పద్య రత్నాలను అందించారు. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సంఘ శ్రేయస్సు గొప్పదని చాటే నడవడికను అలవరచుకోవాలని ఈ పరిశోధన సూచిస్తుంది. భవిష్యత్తులో శతక సాహిత్య ప్రక్రియపై మరిన్ని లోతైన పరిశోధనలు జరగాలని ఈ వ్యాసం ఆకాంక్షిస్తుంది.
Keywords: శ్రీరఘురామ శతకం, భక్తి సాహిత్యం, నీతి, సామాజిక విలువలు, కందపద్యం, రంగన్నగారి సాయులు.
1. ప్రవేశిక
తెలుగు సారస్వతంలో శతక ప్రక్రియ వినూత్నమైనది. ఎన్నో కవితా వస్తువులను స్వీకరిస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు సాహిత్యంలో శతక నిర్మాణం విస్తృతస్థాయిలో రూపుదిద్దుకుని, ఉన్నత స్థితిలో ఉంది. నేటికీ నూతన కవితా వస్తువులను ఉగ్గడిస్తూ, ప్రాచీన కవుల మార్గాన్ని వదలకుండా, సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల నూతన కవులు స్పందించి కొత్త శతకాలను రాసి, సమాజానికి అందించే మార్గంలో నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ శతక ప్రక్రియ లక్షణం అన్ని శతకాలకు ఒకే విధంగా ఉన్నప్పటికీ, కవి ఎంచుకున్న ఇతివృత్తం భిన్నత్వాన్ని చూపుతోంది. కొందరు భక్తి మార్గం, కొందరు సామాజిక కోణం, మరికొందరు రాజకీయ కోణం మొదలైన పంథాలలో ఆలోచనలు చేస్తూ శతకాలను రాస్తున్నారు.
1.1 శతక కర్త పరిచయం - పరిధి
కామారెడ్డి పట్టణానికి చెందిన రంగన్న గారి సాయులు శతక రచన ఆసక్తితో ఈ రచన మొదలుపెట్టారు. 2002లో ఈ శతక రచనను పూర్తి చేశారు. "శ్రీ రఘురామ శతకం" వైష్ణవ భక్తి తత్వపూర్వకంగా రంగన్న గారి సాయులు కందపద్య ఛందస్సులో "శ్రీ రఘురామా" అనే మకుటాన్ని ఎన్నుకొని 108 పద్యాలతో ఈ శతకాన్ని రాశారు. భక్తి పారవశ్యంతో దీనిని తీర్చిదిద్దారు. ఇందులో భక్తితో పాటుగా, వ్యక్తిత్వ, సామాజిక, నైతిక విలువలున్న ఎన్నో పద్య రత్నాలు మనకు వ్యక్తమవుతున్నాయి. కవి ఈ శతకాన్ని తన ధర్మపత్నికి అంకితం చేసినట్లుగా ఒక పద్యంలో చెప్పుకున్నారు. ఈ పరిశోధనా వ్యాసం శ్రీ రఘురామ శతకంలోని 108 పద్యాల నుండి భక్తి, నీతి, సామాజిక అంశాల పద్యాలను విశ్లేషిస్తుంది.
2. క్షేత్రపర్యటన - విషయసేకరణ
ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శతక సాహిత్యంలో సామాజిక అంశాలపై పి.హెచ్.డి. కోసం, నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్ వాడ, ఆర్మూర్, బోధన్, బీబీపేట, దోమకొండ, మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల, ఎల్లారెడ్డి మొదలైన ప్రాంతాలను పర్యటించి, శతకకర్తలను కలిసి 73 శతక రచనలను సేకరించగలిగాను. ఆ రచనలలో రంగన్నగారి సాయులు శ్రీరఘురామ శతకం ఒకటి. ఈ శతకంలోని భక్తి, నీతి, సామాజిక అంశాలను విశ్లేషిస్తాను.
3. శతక లక్షణాలు - వర్గీకరణ
తెలుగు శతకాల మూలాలు పరిశీలిస్తే, అవి సంస్కృత భాష నుండి లక్షణాలను స్వీకరించాయి. అయితే తెలుగు కవులు అంతకు మించిన నియమాలను అనుసరించి తమ ప్రతిభను చాటుకున్నారు. యతి, ప్రాసలను గమనిస్తే సంస్కృత, కన్నడ భాషల నియమాలను స్వీకరించినప్పటికీ, వాటిని మరింత కఠినతరం చేసి తెలుగు పద్యాలకు మెరుగు దిద్దినట్లు కనిపిస్తుంది. మకుట నియమాన్ని సంస్కృత, కన్నడ భాషలు అక్కడక్కడా పాటించాయి. తెలుగులో మాత్రం దీనిని విధిగా పాటించడం చాలా ప్రధానం. మొత్తం పద్యాలు ఒకటే వృత్తంలో ఉండాలన్నది మరొక నియమంగా భావించారు. ఇప్పటివరకు దాదాపుగా తెలుగులో ఈ నియమాలను ఖచ్చితంగా పాటించారు. తెలుగు శతకాలలో ప్రధానంగా పాటించిన లక్షణాలు- సంఖ్యానియమం, మకుట నియమం, ఛందో నియమం, రస నియమం, ఆత్మాశ్రయ కవితా ధర్మం.
శతక సాహిత్య పరిశోధకులు డా. గోపాల కృష్ణారావు పరిశోధన ప్రకారం శతక సాహిత్యాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు: భక్తి శతకాలు, తాత్విక శతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు, హాస్య శతకాలు, ప్రకీర్ణ శతకాలు, వివిధ వస్తు శతకాలు, చారిత్రిక శతకాలు, కథాత్మక శతకాలు, అనువాద శతకాలు, వైరాగ్య శతకాలు, శృంగార శతకాలు.
శతకాలు నీతి, దైవభక్తి, సామాజిక శ్రేయస్సు, దేశభక్తి ప్రబోధకాలుగా ప్రధానమైనవి. తరాలు మారినా ఏమాత్రం వన్నె తగ్గని సాహిత్య ప్రక్రియ ఇది. కాలాలు మారినా, ఇవి నిత్య నూతనాలుగా ఆదరించబడతాయి. కాబట్టి, ఈ ప్రక్రియను విద్యార్థి దశలోనే పరిపూర్ణంగా అందించగలిగితే విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడతాయి. తెలుగు సాహిత్యం అన్ని ప్రక్రియలలో విశేష పరిశోధనలు జరిగినా, శతక సాహిత్య ప్రక్రియపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.
4. పూర్వ పరిశోధనలు
శతక సాహిత్యంపై ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో డా. గోపాల కృష్ణారావు ఆంధ్ర శతక సాహిత్య వికాసము ప్రధానం, ప్రామాణికం. శతక సాహిత్య పరిశోధనలకు ఆయన పరిశోధనా గ్రంథం ఒక దిక్సూచిగా నిలిచింది. అలాగే నిజామాబాద్ జిల్లా శతక సాహిత్యంపై కూడా పరిశోధన కొనసాగుతోంది.
5. శ్రీ రఘురామ శతకంలో కవితా విశ్లేషణ
శ్రీ రఘురాముని గురించి కంచర్ల గోపన్నతో మొదలుపెట్టి అనేకమంది తమ అంతరంగాన్ని మదించి, రామునిపై భక్తి భావాలను, స్నేహ, మూఢ, మధుర, దాస్య, సఖ్యాది భక్తి రూపాలతో శతకాలను వెలువరించారు. ఈ కోవకు చెందిన ఇతివృత్తాన్ని రంగన్న గారి సాయులు గ్రహించి, తమ హృదయంలో ఉన్న రామునిపై భక్తిని శ్రీ రఘురామ శతకంగా ఆధునిక కాలంలో అందించారు. రంగన్న గారి సాయులు నేటి సమాజ తీరుతెన్నులు తెలిసినవారు కాబోలు. అందుకే తమ కవిత్వంలో జాతీయాలను, సామెతలను, పలుకుబడులను ప్రయోగిస్తూ, భాషా ప్రయోగంలో సరళతను పాటించారు. సాధారణ జనజీవనశైలిలో శతక రచన చేశారు. అందరికీ తమ పద్యం అర్థమయ్యే రీతిలో మృదు మధురంగా తమ భక్తి ఆవేదనను, లోక తీరును, సూటిగా, చక్కగా ఆయా పద్యాలతో వెలువరించారు.
5.1 భక్తి తత్వం
ఈ శతక ప్రారంభం శ్రీకారంతో మొదలుపెట్టి ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థించిన తీరు భక్తి పూర్వకంగా కనిపిస్తుంది:
శ్రీరామ సత్కృపామృత
మే రస రమ్యత నొసంగి మెలమెల్లగనా
లో రచనాసక్తిని పెం
చేరీతుల తేట పరచే శ్రీ రఘురామా ! (సాయిలు ప. 1)
ఓ రామా! నీ దయామృతం నాలో మెలమెల్లగా రసరమ్యతను సంతరించి, మంచి రచనకు అవసరమైన ఆలోచనాసక్తిని పెంచే విధంగా అనుగ్రహించు అని రామునిపై భక్తి, తన ఉదార గుణాలను చాటి చెప్పుకున్నారు. ఇక్కడ తన కవితా వ్యాసం కొనసాగడానికి దయ సర్వస్వమని భావించాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను, భారతావని, ఇలవేల్పును కొనియాడిన పద్యం భక్తితత్వాన్ని ప్రస్తావించింది. తల్లిదండ్రులను, చదువు నేర్పిన గురువులను, భారతావనిని ప్రార్థించడం సామాజిక బాధ్యతను సూచిస్తుంది.
తలచెద తల్లిని తండ్రిని
తలచెద నిను నన్ను కన్నధాత్రిని యెపుడున్
కొలిచెద గురువును వేల్పును
చెలువంబగు మెప్పులంది శ్రీ రఘురామ ! (సాయిలు ప. 2)
పై పద్యం తల్లిదండ్రులను, పుడమితల్లిని, చదువు నేర్పిన గురువును, ఇలవేల్పును నిరంతరం స్మరించాలని అంటుంది. కవి భక్తి భావనతో పాటు, సామాజిక జనజీవనంలో తల్లిదండ్రులను విస్మరించరాదని, భరతమాత కీర్తి ప్రతిష్టలను, విశిష్టతను దేశ నలుమూలల ప్రజలకు వ్యక్తమయ్యే విధంగా గౌరవ భక్తి భావాలను కలిగి ఉండాలని ఉపదేశించారు. గురువులను చిరకాలం గుర్తుంచుకుని వారిని నిరంతరం ఆరాధ్య దైవాలుగా భావించాలి. ఇలవేల్పులపై చులకన భావం లేకుండా భక్తితో ఉండాలి అని నేటి సమాజానికి జ్ఞానోదయం చేశారు. ఈ పద్యం చదువు చెప్పిన వారిని ఎల్లవేళలా ఆరాధించాలని గుర్తు చేస్తుంది. నేటి సమాజంలో ప్రజలలో భక్తి భావన సన్నగిల్లుతోంది. ఈ సమయంలో సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపించాలంటే ఇలాంటి పద్యరత్నాలను చదివి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
కలమే కవ్వము కాగా
తలపోతల త్రాడుచుట్టి దండిగ యెదలో
తులలో త్రిప్పుచునుండగ
చెల్లువంబగు వాణి పుట్టె శ్రీ రఘురామా ! (సాయిలు ప. 4)
ఈ పద్యంలో కవిత్వం పుట్టుక ఎలా ఉంటుందో తెలుపుతూ, దానికి సొబగులు అద్దాడు. కలాన్ని కవ్వంగా చేసి, ఆలోచనల తాటితో తన మనసు లోతులో మదిస్తూ ఉంటే కవిత్వం అనే మీగడ తయారవుతుందని అంటారు. అలా కవి తన హృదయ స్పందనను, కవిత్వం ప్రాదుర్భావాన్ని పద్యం ద్వారా సుందరంగా వర్ణించారు.
కవి ఆలోచన చేసిన అంశాన్ని లేదా సన్నివేశాన్ని ఉద్దేశించి ఇలా ప్రస్తావించారు: "అంజలి చేయుచునుంటిని, రంజిత మగు పదములొసగి రక్షింప గదే, మంజులమగు భావంబులు......." (సాయిలు ప. 5) పద్యంలో "నేను నీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు ఉత్తేజితమైన, రమ్యమైన భావనలు తోచే విధంగా పదాల వరాలను ప్రసాదించి, శింజితములై మ్రోగే విధంగా రక్షించు అని రామునిపై భక్తితో మొరపెట్టుకొని వేడుకున్నట్లు అనిపిస్తుంది. భక్తుడు ఏ పని చేసినా భగవదనుగ్రహం తప్పకుండా ఉండాలని ఈ పద్యం చెబుతుంది.
శతక ప్రక్రియ ప్రధాన లక్ష్యం నైతిక, వ్యక్తిత్వ, సామాజికాది విలువలను, కవి అనుభవాలను, అనుభూతులను ప్రజలకు అందించడం. ఈ విలువలు ఉన్న శతకాలను పఠిస్తే, మనిషి మనీషిగా, మానవత్వంతో, సజ్జన ప్రవర్తనతో సమాజంలో మెలుగుతాడు. తన బుద్ధిని మందమతిగా కాకుండా, మంచి సౌశీల్యత ఉన్న మనిషిగా ఎదగడానికి అవి దోహదపడతాయని గ్రహించాలి.
నాలో ఉన్న దురిత లక్షణాలను తొలగించి, సిరిసంపదలు ఇచ్చి కాపాడుమని శ్రీరాముని శరణు వేడుకున్నారు కవి. పవిత్ర దయకు నీవు నిధి అని, శ్రీరాముని అపార సిరిసంపదలను, ఆయన ఉదార గుణాన్ని చాటి చెప్పారు. అట్లాంటి నీకు నేను శరణుతో తలవంచి నమస్కరిస్తున్నానన్నారు. ఇది భగవంతుడిపై భక్తుడికున్న నిరంకారాన్ని చక్కగా తెలుపుతుంది.
శరణని తలవంచితి నా
దురిత గుణ సమూహమెల్ల తొలగించుమయా
పరమ దయానిధివై బహు
సిరిసంపదలిచ్చి కావు శ్రీరఘురామ. (సాయిలు ప. 8)
ఆ పరంధాముడైన దశరథ రాముడిని 'రారా! శ్రీరామ!' అని నోరారా పిలిచిన వెంటనే అది నోటిమాటై పిలుపులోనే నా ఇంటికి మిక్కిలి వేగంగా రావయ్య! ఓ శ్రీ రఘురామా! అని రాముడిని అతిశయమైన భక్తితో పిలిచిన తీరు ఈ క్రింది పద్యంలో చూడవచ్చు:
రారా! శ్రీ రామ యనుచు
నోరారగ పిలిచినంత నోటికి నుడుగై
నేరుగ నా ఇంటికి దరి
చేరగ కడువేగ రమ్ము, శ్రీ రఘురామ! (సాయిలు ప. 10) అని స్తుతించారు.
క్షేమము గూర్పెడు వాడవు
క్షామంబును గలుగనీకు కాపాడగ, వే
రే మాకు దిక్కెవరు, లే
రే మా మొరనాలకింపు శ్రీ రఘురామా ! (సాయిలు ప. 16)
ఈ పద్యంలో "ఓ రామ! మాకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలిగించేవాడవు. క్షామం కలుగనీయకుండా కాపాడే వాడివి. మమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకునేవారు, దిక్కు మొక్కు ఎవరూ లేరు. మా మొరను ఆలకించి రక్షించుమయ్యా" అని పద్యభావం. ఇందులో చెప్పిన విషయ సారాంశాన్ని పరిశీలించినట్లయితే, తన ప్రాణానికి ఎలాంటి హాని చేకూరకుండా, దుఃఖం దరిచేరకుండా చూసుకునేవాడు భగవంతుడే అని, ఆయన కృప లేనిదే ఏ పని ముందుకు సాగదని, దీనజనులకు దిక్కుగా నిలిచిన ఆ శ్రీరాముడే రక్ష అని, మరొకరు కాదని దైవభక్తిని చాటారు. భూమిపై ప్రాణి ఉనికి దైవాంశ సంభూతమేనని గ్రహించాలి. ఆ పరాత్పరుడి కృప లేనిదే ప్రకృతిలో ఏదీ లేదనే ఆంతర్యాన్ని ఈ శతకంలోని భక్తి భావన వ్యక్తం చేస్తుంది.
సర్వము నీవై యుండగ
నిర్వీర్యం బేల కలిగె నీ బలమే నా
సర్వస్వంబని నమ్మియు
చెర్వొడ్డున చేప నైతి శ్రీ రఘురామా ! (సాయిలు ప. 17)
ఓ రామ! అంతట నీవే ఉన్నావు అని నమ్మాను. నాకు నీవే రక్ష అనుకున్నాను. కానీ నాకు ఈ నిర్వీర్యం ఎందుకు కలిగినదో అవగతం కావడం లేదు. నీ బలం నా సర్వస్వం అని నమ్మాను. నీ దయా దాక్షిణ్యం లేక నేను చివరకు చెరువుగట్టున చేపనయ్యాను అని వాపోయారు. ఈ పద్యంలో "చెర్వొడ్డున చేప నైతి" అనే సామెతను ఉపయోగించారు. నమ్ముకున్న వారికి కటాక్షం లేనప్పుడు లేదా ప్రారంభించిన పని విఫలమైనప్పుడు ఈ సామెతను వాడతారు.
రంగన్న గారి సాయులు జనపదంలో, జనజీవనశైలిలో తమ బ్రతుకుతెరువును కొనసాగించిన పండిత శిఖామణి అని అర్థమవుతుంది. ఆయా సందర్భాలలో అవసరానికి అనుగుణంగా సామెతలను, జాతీయాలను తమ కవిత్వంలో భావానుకూలంగా అల్లడం జరిగింది. వీటి ద్వారా కవిత్వానికి సొగసు, రమ్యత ఏర్పడతాయి.
భగవంతుడిపై భక్తితత్వంతో కవి ఇలా అంటారు: లక్ష్మీదేవి భర్త అయిన వాడా, ఇదిగో చక్కటి అక్షరమాలికలను అల్లాను. నీ చక్షువులు తెరువు. నీ శిక్షణే నాకు ఇంత అద్భుతమైన శక్తినిచ్చింది. ఈ శిక్షణ ద్వారా మంచి పరిపక్వ బుద్ధిని అలవర్చుకున్నాను అని అంటారు. మంగళకరమైన కాంతులు భాసిల్లగా మంగళ గీతాలు పాడి, నా మనసులో ఆనందకరమైన అనుభవాన్ని నింపుకున్నాను. ఇవే నాకు మంగళ శ్రీ అని, నీ సన్నిధి లేదా నీ చెంగట పడి మొక్కుతానని శ్రీరామునికి నమస్కరించారు.
కవి ఈ శతకంలో తన ఉదార స్వభావాన్ని, కవిత్వంపై మమకారాన్ని ఈ క్రింది పద్యంలో వ్యక్తం చేశారు:
లెమ్ము కడువేగ రమ్మిక
నెమ్మనమున నిన్ను కొలువ నీవే నిజమౌ
కమ్మని దయారసము విర
జిమ్మగ వెనుకాడనేల ? శ్రీ రఘురామా ! (సాయిలు ప. 75)
ఓ రామ! ఎటు చూసినా నీవే దిక్కని, వ్యాపార లోకాలకు నీవే అధిపతివని తలచుచున్నాను. నీ మహిమలను పటుతరంగా కనుగొని నేను చిటికె వేయగా చూడమని ప్రస్తావించారు.
ఎంతగ నిన్నే దలచిన
కొంతైనను బ్రోవవేమి ? కోపమే నాపై
పంతంబులు సడలించుచు
చింతల నెడబాపుమయ్య శ్రీ రఘురామా ! (సాయిలు ప. 95)
నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్న నాకు నీ కరుణాకటాక్షాలు దక్కలేదు. భక్తిలో లీనమైన భక్తుడిపై నిరాసక్తత ఇందులో కనబరిచారు కవి. భగవంతుని దర్శన స్పర్శ లేకపోయేసరికి "ఏమైనా నీకు నాపై కోపం ఉందా? ఉంటే కోపాన్ని వదిలిపెట్టి నా చింతలను దూరము చేయుమయా" అని శ్రీరాముని వేడుకొనే తీరు ఈ పద్యంలో దర్శనమిస్తుంది.
5.2 నీతి, సామాజిక అంశాలు
తలవ్రాతల తలచుకొనుచు
తలవంచుక తిరుగుచున్న తాపము కలుగున్
తలలెత్తుక నిలుచుండిన
శిలలైనను పూజ లొందు శ్రీ రఘు రామా! (సాయిలు ప. 27)
దరిద్రస్థితిలో ఉన్న మానవులు తమ తలరాత ఇంతేనని నిరంతరం బాధపడుతుంటారు. దానికి పరిష్కారం ఏమిటో కనుక్కోరు. ఏ పనిలో ముందడుగు వేయక తలరాతను తలచుకుంటారు. అలా ఆలోచిస్తే, అది దినదినం మరింత తాపాన్ని కలిగిస్తుంది గానీ సమసిపోదు. అలా కాకుండా తలలెత్తుకొని, సమాజంలో తిరిగితే, విగ్రహంగా మారిన శిలల వలె వారు కూడా గౌరవప్రదమైన బ్రతుకుతెరువును కొనసాగిస్తారని కవి శ్రీ రఘురామ శతకంలో ప్రస్తావించారు.
అండగ నీవుండగ, నా
గుండెయె ఒక నిండుకుండ కొండంతటి దా
ఉండగ గుండాలను, నే
చెండాడెద భూమి నిండ శ్రీ రఘురామా ! (సాయిలు ప. 36)
దుష్ట లక్షణాలున్న మానవులను దరిచేరనివ్వద్దు. వారి వల్ల సమాజం అంతా భ్రష్టు పడుతుంది. మంచి, మానవీయ విలువలు ఉండవు. కాబట్టి "ఓ రామా! నీవు నాకు అండగా ఉంటే, నా గుండెను ఒక నిండుకుండగా మార్చుకొని, కొండంత అండ నీవు ఉంటే ఎలాంటి గుండాలనైనా ఎదుర్కోగలనని" రచయిత ఈ శతకం ద్వారా సమాజంలో మానవీయ విలువల గురించి ఆక్రోశించారు.
కర్మాచరణం బందున
ధర్మంబును విడువరాదు దలతెగి పడినన్
మర్మ మరసి నడచిన బ
హిర్ముఖుడై పూజలందు శ్రీరఘురామా ! (సాయిలు ప. 54)
మనిషి భూమి మీద జన్మించినప్పుడు చేయాల్సిన నిత్య కర్మలు ఏమిటో తెలుసుకోవాలి. కర్మాచరణను ధర్మబద్ధంగా ఆచరించాలి. ఎన్నడూ కూడా ధర్మాన్ని విడవకూడదు. శిరస్సు తెగినా సరే ధర్మాచరణను నిరంతరం పాటించాలి అని ఈ పద్యంలో తెలిపారు. ఈ పద్యం మనం చేయాల్సిన పని మీద ఎంతటి అకుంఠిత దీక్షతో ఉండాలో తెలుపుతుంది. ధర్మం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్లాలని సూచిస్తుంది.
6. పరిశోధనా ఫలితాలు
ఈ పరిశోధనా వ్యాసంలో శతక సాహిత్యం ప్రాధాన్యత ఎంతటిదో తెలిసింది. శతక సాహిత్యం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా వికాసం కలిగిస్తుందో నిరూపితమైంది. ఇవి శైలిలో సులభంగా ఉండటం, ఆత్మాశ్రయత్వాన్ని కలిగి ఉండటం వల్ల విద్యార్థుల మనసులో దృఢంగా నాటుకుంటాయి. వేమన శతకాలు, సుమతి శతకాలు, భాస్కర శతకం లాంటివి నాటి తరాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో మనందరికీ తెలుసు. కాబట్టి, ఈ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.
ఉపసంహారం
ఈ శతకం భక్తి తత్వానికి, మానవీయ విలువలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. సమాజ స్థితిగతులను, లోక వ్యవహారాలను చాటి చెప్పిన ఎన్నో పద్యాలు ఈ శతకంలో కనిపిస్తాయి. కవి సమాజ శ్రేయస్సు కోరి కవిత్వం రాస్తాడు; రాయాలి కూడా. తాను ఎంచుకున్న కవితా వాగ్ధారలే చాలా మేలు చేస్తాయి. సమాజానికి అవి భక్తి పూర్వకమైనవి కావచ్చు, నైతిక, సామాజిక, వ్యక్తిత్వ, మానవీయ విలువలు కావచ్చు. ఈ విలువలు ఉన్న అంశాలను ప్రజలకు అందజేస్తే, అవి వారికి శుభకరమై విరాజిల్లుతాయి. వారు మంచి నడవడికతో మెలుగుతూ, సమాజంలో మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా ఎదుగుతారు. ఎంతైనా వ్యక్తిగత శ్రేయస్సు కంటే సంఘ శ్రేయస్సు గొప్పది. అందుకే పూర్తిగా వ్యక్తిగతంగా కాకుండా, సమాజం కోసం పాటుపడమని పెద్దలు చెప్పారు. "సొంత లాభం కొంత మానుకు, పొరుగు వారికి పాటుపడవోయ్" అన్నట్లుగా నడవడిక ఉండాలని ఈ శతకం తెలుపుతుంది.
- శ్రీ రఘురామ శతకం భక్తి, నీతి, సామాజిక విలువలతో కూడిన పద్యాలను అందిస్తుంది.
- రంగన్న గారి సాయులు తమ రచనలో సరళ భాషను, సామెతలను, జాతీయాలను ఉపయోగించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చేశారు.
- శతక లక్షణాలను పాటిస్తూనే, కవిత్వంలో నూతనత్వాన్ని, లోకజ్ఞానాన్ని నింపారు.
- ఈ శతకం భగవంతుడిపై అనన్య భక్తిని చాటడంతో పాటు, సామాజిక బాధ్యతలను, వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తుంది.
- ఇటువంటి శతకాలు విద్యార్థుల మానసిక వికాసానికి, సజ్జన ప్రవర్తనకు దోహదపడతాయని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.
పాదసూచికలు
- కృష్ణారావు, కే. గోపాల. ఆంధ్ర శతక సాహిత్య వికాసము. పుట 9-14.
- సాయిలు, రంగన్నగారి. శ్రీ రఘురామ శతకము. ప. 1, 2, 4 (పుట 1).
- పైదే. ప. 5, 8, 10 (పుట 2).
- పైదే. ప. 16, 17 (పుట 4).
- పైదే. ప. 27 (పుట 6).
- పైదే. ప. 36 (పుట 6).
- పైదే. ప. 54 (పుట 14).
- పైదే. ప. 75 (పుట 16).
- పైదే. ప. 95 (పుట 20).
ఉపయుక్త గ్రంథసూచి
- గంగాప్రసాద్, ఎనిశెట్టి. సాహితీసౌరభాలు-పద్యసుమాలు. సాహితీసమాలోచనంప్రచురణ, హైదరాబాద్,2020.
- గోపాల కృష్ణారావు, కే. ఆంధ్ర శతక సాహిత్యము. ప్రతిభ ఆర్ట్స్ ప్రింటర్స్, హైదరాబాద్,1976.
- నటేశ్వర శర్మ, అయాచితం. నవ్యనీతి శతకము. ప్రాచ్య విద్యాపరిషత్తు, ప్రాచ్య కళాశాల విద్యార్థుల బృందము ప్రచురణ, కామారెడ్డి, 1995.
- మురళి, పబ్బ. పబ్బ మురళి మాట పసిడి మూట. పబ్బ పబ్లికేషన్స్, బోధన్, నిజామాబాద్ జిల్లా, 2018.
- రవీందర్, ఘనపురం. కవన ఘనుని శతకం. హరిదా రచయితల సంఘం ప్రచురణ, నిజామాబాద్, 2016.
- లక్ష్మణ కవి, ఏనుగు. భర్తృహరి సుభాషిత రత్నావళి. జే.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2006.
- శాస్త్రి, ద్వా.నా. తెలుగు సాహిత్య చరిత్ర. ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2001.
- సత్యనారాయణ, సుప్పని. సుప్పని శతకము. శ్రీ రాఘవేంద్ర ప్రింటర్స్, కాప్రా, మేడ్చల్ జిల్లా, 2022.
- సాయులు, రంగన్నగారి. శ్రీ రఘురామ శతకము. చైతన్య ఆర్ట్స్ ప్రింటర్స్, కామారెడ్డి, 2002.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

