headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

10. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు: సమత

రఘుప్రోలు శివశంకర్

పరిశోధకులు, తెలుగు సాహిత్యశాఖ,
తెలుగు విశ్వవిద్యాలయం, బాచుపల్లి, హైదరాబాద్.
మేడ్చల్- మల్కాజిగిరి, తెలంగాణ.
సెల్: +91 9441128505, Email: raghuprolu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 17.04.2025        ఎంపిక (D.O.A): 28.04.2025        ప్రచురణ (D.O.P): 01.05.2025


వ్యాససంగ్రహం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపజిల్లా, కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారిమఠం)లో సమాధి నిష్టాగరిష్ఠుడై అశేష భక్తులచే పూజలందుకుంటున్న సమతామూర్తి, సద్గురుడు శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, కాలజ్ఞానిగా మాత్రమే భక్తులు వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శిస్తున్నారు. తప్ప అభ్యుదయ వాదిగా, సంఘసంస్కర్తగా, కులమత భేదరహిత సమాజనిర్మాణానికి కృషిసలిపిన "సమతామూర్తి"గా మాత్రం దర్శించలేకున్నారు. సాటి మనిషిని మనిషిగా మానవతాదృక్పథంతో చూడాలన్నదే వారి ఆశయమని, వారి రచనలు-జీవితచరిత్ర ద్వారా పరిచయం చేయడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం. వీరబ్రహ్మేంద్రస్వామి రచనలైన వీరకాళికాంబ శతకం, హంసకాళికాంబ శతకం, కాళీమకుటకందాలు, సిద్ధార్థశతకం, గోవిందవాక్యాలు, కాలజ్ఞానతత్వాలతోపాటు వారి జీవితచరిత్ర ఆధారంగా ఈ వ్యాసం రూపొందింది. "పోతులూరి వీరబ్రహ్మంగారి జీవితం- రచనల పరిశీలన" (డా. కన్నెకంటి రాజమల్లాచారి), "శ్రీ వీరబ్రహ్మేంద్రుని తాత్వికదార్శనికత" (డా. మూల మల్లికార్జునరెడ్డి), "పోతులూరి వీరబ్రహ్మం సమగ్రపరిశోధన" (డా. యండపల్లి పాండురంగాచార్యులు) వంటి సిద్ధాంతగ్రంథాలు ఈ వ్యాసరచనకు దోహదపడ్డాయి. క్రీ.శ. 17వ శతాబ్ది నాటికి సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, సాంఘికదురాచారాలు, వర్ణవ్యవస్థలోపాలను పారద్రోలడానికి ఆదర్శవంతమైన తనజీవితం, సాహిత్యం ద్వారా సద్గురువుగా, సమతామూర్తిగా, సంఘసంస్కర్తగా వీరబ్రహ్మేంద్రస్వామి చేసిన కృషిని ఈ వ్యాసంలో విశ్లేషించడమైనది.

Keywords: సమతామూర్తి, సమాధి నిష్టాగరిష్ఠుడు, కాలజ్ఞాని, మానవతా దృక్పథం, సామాజిక సమానత్వం, మూఢనమ్మకాలు, సాంఘికదురాచారాలు.

1. ప్రవేశిక

వీరబ్రహ్మేంద్రస్వామి తన రచనల ద్వారా, తానవలంభించిన ఆధ్యాత్మిక, భక్తి మార్గం ద్వారా నాటి సమాజం(క్రీ. శ. 17వ శతాబ్దం)లోని కుల-మత, పేద-ధనిక మొదలైన వర్గాల మధ్య అంతరాలను బాపి, అసమానతలు తొలగించి సామాజికసమానత్వాన్ని స్థాపించేందుకై పాటుపడిన విధానాన్ని, దురాచారాలను, మూఢవిశ్వాసాలను ఖండించి వాటిని రూపు మాపేందుకు చేసిన కృషిని ఈ వ్యాసంలో విశ్లేషించడం జరిగింది.

"వీరబ్రహ్మేంద్రస్వామి క్రీ.శ. 1608 కీలకనామ సంవత్సరంలో జన్మించి, క్రీ.శ. 1693 శ్రీముఖ నామ సంవత్సరంలో సమాధి ప్రవేశం చేశారు” (పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం- రచనలు, పుట 6.).

వీరబ్రహ్మేంద్రస్వామి యోగిగా, కాలజ్ఞానిగా, జగద్గురువుగా సుప్రసిద్ధులు. "బ్రహ్మమంతటి గురువు, సిద్దయ్య వంటి శిష్యుడు లేడు" అనే నానుడి వాడుకలో ఉన్నదని మనందరికీ తెలుసు. కులాలకు గాక గుణాలకు ప్రాధాన్యతనివ్వడం వారి గొప్పతనం. అన్యమతస్థులైన పెక్కు మహమ్మదీయులు, హరిజనుడైన కక్కయ్య, బ్రాహ్మణుడు, కరణాలైన గోవిందయ్య, అన్నాజయ్యలు, రెడ్డి కులస్థులైన అచ్చమ్మ, వెంకటరెడ్డి మొదలైన విభిన్న కులమతాల వారిని తన శిష్యులుగా గ్రహించాడాన్ని బట్టి చూస్తే వీరబ్రహ్మేంద్రస్వామి దృష్టిలో కులాలకు అంతగా ప్రాధాన్యత లేదని స్పష్టమవుతుంది. కులవృత్తులైన వడ్రంగం, కమ్మరం, శిల్పకర్మలను ఆచరిస్తూ తన చెంతకు వచ్చే రైతులకు, ప్రజలకు కావలసిన వస్తు సామాగ్రిని తయారు చేసిస్తూనే వారికి ఆత్మజ్ఞాన బోధలతో పాటు అభ్యుదయ భావాలను ఉపదేశించారు. నాటిసమాజానికి అవసరమైన  హిందూ మహమ్మదీయ సమైక్యత, మహిళాభ్యుదయం, అస్పృశ్యతా నివారణ, మూఢాచారాలను తొలగించుట మొదలైన సమాజోద్ధరణ భావాలను చాటడానికి వీరబ్రహ్మేంద్రస్వామి కవిత్వాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకున్నారు.

వేదాంతసాహిత్యాలు కొందరి సొమ్మేనని భావించే ఆ రోజుల్లో వాటిని ప్రజాధనంగా మార్చి ప్రజా బాహుళ్యానికి చేరవేస్తూ వేదసాహిత్యాధ్యయనాలకు కుల-మత-వర్గ-వర్ణవిభేదాలు అడ్డురావని చాటిచెప్పిన సమతామూర్తి, సంఘసంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. పద్యాలతోపాటు కందార్థాలు, ద్విపదలు, గేయాలు, తత్వాలురచించి ప్రజాహృదయాలకు చేరువయ్యారు. దేశికవితకు పెద్ద పీటవేశారు. నేటికీ పల్లెటూళ్ళలో నిర్వహించే భజనాది సాంస్కృతిక కార్యక్రమాలలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాలు మారుమ్రోగుతూనే ఉన్నాయి. దేశికవితారీతులతో నాదబ్రహ్మోపాసన  చేయించి, ముక్తితో పాటు భావదాస్య విముక్తిని తన సంకీర్తనల ద్వారా సాధించిన ఋషి సత్తముడు శ్రీ వీరబ్రహ్మేంద్రుడు.

2. క్రీ. శ. 17వ శతాబ్దం నాటి రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు

వీరబ్రహ్మేంద్రస్వామి జన్మించే నాటికి భారతదేశంలో మహమ్మదీయుల పరిపాలన ఉండేది. క్రీ.శ. 1605లో అక్బర్ కుమారుడు జహంగీర్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. నేటి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విజయనగర రాజుల పాలన అంతరించి అక్కడి సంస్థానాలు  నవాబుల ఏలుబడిలో ఉన్నాయి. 17వ శతాబ్దం భారతదేశమంతటా ముస్లిం రాజుల పాలనలో ఉండేదని దేశచరిత్ర వలన స్పష్టమవుతుంది. వీరి పాలనలో భారతీయ సాంఘికచరిత్రలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటి సమాజంలో అజ్ఞానం, సంప్రదాయప్రియత్వం, బహు భార్యత్వం ఉండేవి. శకునాలు, తాయెత్తులు, జాతకాలను నమ్మడం, యోగులు, మతగురువులు మొదలైన వారి పట్ల భక్తిప్రపత్తులు కలిగి ఉండటం ఉండేది. హిందువుల్లో శైవం, వైష్ణవం మొదలైన తెగలున్నట్లుగానే మహమ్మదీయుల్లో సున్నీ, షియా, సూఫి మొదలైన తెగలు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మికధర్మాలు అడుగంటి పోతూ అర్థరహితమైన కర్మకాండ ప్రబలిపోయి స్వార్ధం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఊరి వెలుపల అంటరానివారిగా ఉన్నవారి గతి వర్ణించరానిది. మహమ్మదీయుల పాలనలో హిందూ స్త్రీల మానరక్షణ కూడా ఒక గడ్డు సమస్య అయ్యింది. హిందూ మహమ్మదీయ మతసామరస్యం ఒనగూర్చవలసిన అవసరం ఏర్పడింది. (పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం - రచనల పరిశీలన, రాజమల్లాచారి కన్నెకంటి. పుట. 2)

3. వీరబ్రహ్మేంద్రస్వామి రచనలు

వీర కాళికాంబ శతకం, హంస కాళికాంబ శతకం, కాళీమకుటకందాలు, కాళికాంబా సప్త శతి, సిద్ధా! మకుటంతో ఉన్న అర్థశతకం (సిద్ధార్థ శతకం), హెచ్చరిక వచనాలు లేదా గోవింద వాక్యాలు, కాలజ్ఞానతత్వాలు, వచనరూపంలో ఉన్న కాలజ్ఞానం, సౌజన్యపత్రికలు, ద్విపద కాల జ్ఞానం, జీవైక్యబోధ, కొన్ని సంస్కృతశ్లోకాలలో కాలజ్ఞానం. (పోతులూరి వీరబ్రహ్మం సమగ్ర పరిశోధన, పాండురంగాచార్యులు యండపల్లి, పుట 20)

4. సంఘసంస్కర్తగా, సమతామూర్తిగా, సద్గురువుగా వీరబ్రహ్మేంద్రస్వామి చేసిన కృషి

వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవితగమనమే సంఘసంస్కర్తలకు గొప్ప మార్గదర్శకము. సంఘ సంస్కరణ, సమతా స్ఫూర్తి వంటి అభ్యుదయ భావాలు కేవలం మాటల్లో చెప్తే చాలదని సంస్కర్త స్వయంగా తానాచరించి చూపాలని భావించి కాబోలు స్వామివారు మహమ్మదీయుడైన సిద్ధయ్య ను ప్రియశిష్యునిగా స్వీకరించారు. హరిజనుడైన కక్కయ్యను శిష్యునిగా పరిగ్రహించి షట్చక్ర రహ స్యాలను ప్రబోధించారు. బ్రాహ్మణులైన అన్నాజయ్య గోవిందయ్యలను, రెడ్డి కులస్థులైన గరిమరెడ్డి అచ్చమ్మ, వెంకటరెడ్డి, బ్రహ్మానంద రెడ్లను శిష్యులుగా అనుగ్రహించి భక్తి మార్గాన్ని ప్రబోధించడం ద్వారా సామాజిక సమతామూర్తి అయ్యారు. కులమత బేధాభిప్రాయాలు విస్తృతంగా ఉన్న ఆ కాలంలో అన్ని కులాల వారిని, భిన్న మతాల వారిని కలుపుకొని భక్తి మార్గంలో, అభ్యుదయ పథంలో ప్రయాణించడమంటే అదొక గొప్ప సాహస యాత్ర అని చెప్పవచ్చు. 

కాళికాంబా సప్తశతి పీఠికలో ఆచార్య టి.గౌరీశంకర్ “సాంఘిక పరంగా కందుకూరి, సాహిత్యపరంగా గురజాడల కంటే రెండు వందల ఏళ్ల ముందుగానే బ్రహ్మంగారు సంస్కరణ వాదాన్ని ప్రకటించారు. ఈనాడు పదును, పసగల ప్రతి ఉద్యమానికి మూడు వందల సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు శ్రీకారం చుట్టారు. నేటికంటే వీటికి ఆనాడే బలీయమైన పునాదులు వేశారు. తమ రచనల్లోని భావతీవ్రతతో, పదజాలంతో సాంఘికోద్యమాన్ని కదం తొక్కించారు” అన్నారు. (కాళికాంబ సప్తశతి పీఠిక పుట 25)  ఈ మాటలు అక్షర సత్యాలు.

సహజకవిపంచానన, కవిశేఖర, పూసపాటి నాగేశ్వరరావు రచించిన ఈ పద్యం వీరబ్రహ్మేంద్రస్వామి వారి సామాజికస్పృహను తెలియజేస్తూ స్వామివారిని అవతార పురుషునిగా ప్రజలు ఆరాధించుటకు గల కారణాలను వివరిస్తుంది.

సీ.     హిందూ ముసల్మాను లేకీభవించుట మేలని సిద్ధుని నేలినాడొ
        అస్పృశ్యతాజాడ్య మంతరింపగ జేయఁ దలఁచి కక్కని వీపు దట్టినాడొ
        ప్రజకహింసావ్రత రాజంబు బోధింప నెంచి జంతుబలి వారించినాడొ
        గోమాత నెలయించు గుణము పెంపొందింప నచ్చమాంబిక యాల నరసినాడొ
ఆ.వె. భక్తి ముక్తులకు నమోఘ కర్మజ్ఞాన
        యోగములను జూపసాగినాడొ
        యనుచు నఖిల జనము లైదంయుగీనావ
        తార పురుషు నిన్ను దలచు చుంద్రు (శ్రీ వీరబ్రహ్మేంద్ర చరిత్రము. చతుర్ధాశ్వాసము. ఛత్ర యోగము. ప-12)

వీరబ్రహ్మేంద్ర స్వామికి చిన్నప్పుడు వీరప్పయ్య, వీరనారాయణ, వీరంభట్లయ్య అనే పేర్లు కలవు. ఉపనయనం జరిగిన తర్వాత 12 ఏండ్లకే విద్య పూర్తి చేసుకొని బనగానపల్లెలో గరిమ రెడ్డి అచ్చమ్మ, వెంకటరెడ్డి అను దంపతుల ఇంట్లో ఆవుల కాపరిగా ఉంటూ ఎన్నో అలౌకిక మహిమలను చూపి ఆనాడే భవిష్యత్ కాలజ్ఞానాన్ని వ్రాశారు. బాల్యంలో ఆవుల కాపరిగా ఉంటూ వ్యవసాయం చేయడం మొదలైన కర్మకాండ భారతదేశానికి కృషి, కర్మ యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేయడానికే అని మనం సులభంగా గ్రహించవచ్చు. అందుకే ఆ మహానుభావుడు కర్మయోగి అయ్యాడు.

4.1 బాల్యవివాహాల ఖండించి రజస్వలానంతర వివాహాలను ప్రోత్సహించుట

ఈ బాలయోగి యువకుడైన తర్వాత కడప జిల్లా, బద్వేలు తాలూకాకు చెందిన కందిమల్లయ్య పల్లెకు చేరుకొని కమ్మరం, వడ్రంగం, శిలాశిల్పం చేస్తూ జీవనం సాగించాడు. ఆ సమయంలోనే గోవిందమ్మ అనే యువతిని పెళ్ళాడి ఆదర్శ గృహస్థాశ్రమవ్రతాన్ని స్వీకరించాడు. నాటి ముస్లిం పాలనలో ఆడపిల్లలకు మాన,ప్రాణ రక్షణ ఉండేది కాదు. అందుకే తల్లిదండ్రులు తమ కూతుళ్ళను కాపాడుకునేందుకు బాల్యవివాహాలు చేసేవారు. బాల్య వివాహాల ఆడపిల్లలు అనేక శారీరక, మానసిక రుగ్మతలను ఎదుర్కొనవలసి వచ్చేది. దూరదృష్టవశాత్తు ఆ బాలిక భర్త మరణిస్తే జీవితాంతం విధవరాలిగానే జీవించవలసి వచ్చేది. వీరబ్రహ్మేంద్రస్వామి ఈ దురాచారాన్ని ఖండిస్తూ గోవిందమ్మను రజస్వల అయ్యాకే వివాహం చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. రజస్వలానంతరమే ఆమెను పెండ్లాడి 400 సంవత్సరాలకు పూర్వమే రజస్వలానంతరం వివాహ ప్రాముఖ్యతను చాటి చెప్పి ఆదర్శనీయుడయ్యారు.

4.2 హిందూ మహమ్మదీయ సమైక్యతా ప్రబోధం

వీరబ్రహ్మేంద్రస్వామికి గల అనేక శిష్యులలో మహమ్మదీయుడైన సిద్ధప్ప ప్రియ శిష్యుడు కావడం చారిత్రాకులు ఆసక్తితో గమనించదగిన అంశం. సిద్ధప్పను శిష్యునిగా చేర్చుకోవడం వల్ల వీర బ్రహ్మేంద్రస్వామి అటు బ్రాహ్మణుల కోపానికి, ఇటు ముస్లింల ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఈ విషయమై పుష్పగిరి అగ్రహారంలో బ్రాహ్మణులతో వాదించి వారి కళ్ళు తెరిపించారు. సిద్ధప్ప ఒక హిందూ గురువుకు శిష్యుడు కావటం ఆనాటి కడప, కర్నూలు, బనగానపల్లె, సిద్ధవటం నవాబులకు కంటగింపు అయింది. వీరబ్రహ్మేంద్ర స్వామిని, సిద్దయ్యను తమ ఆస్థానాలకు రప్పించుకొని అనేక బాధలకు, ప్రశ్నలకు గురిచేసి తగిన సమాధానాలను పొంది సంతృప్తులయ్యారు. 

ఆనాడు వారు బోధించిన మతసామరస్యసూత్రాలు, విశ్వమానవ సమతాభావాలు మానవులకు ఆరాధనీయాలు అయ్యాయంటే అతిశయోక్తి లేదు. వీరబ్రహ్మేంద్రస్వామి సామాజికసమతామూర్తి, సద్గురువు అని చెప్పడానికి ప్రముఖమైన ఈ ఒక్క నిదర్శనం చాలు. ఇలా చరిత్రలో హిందూ ముస్లింల ఐక్యతకు కృషిచేసిన ఆధ్యాత్మికవేత్తలు చాలా అరుదు.

4.3 దోపిడీ వ్యవస్థలకు హెచ్చరిక

 “స్వీయ సౌఖ్యములకు వెంపరలాడుచూ
క్రూరముగను పరుల కొల్లగొట్టు
మానవుండు ముందు మార్గమ్ముగానడు
కాళికాంబ హంస కాళికాంబ”.  (కాళికాంబా సప్తశతి. ప. 19)

అని స్వార్థంతో ఇతరులను దోచుకునేవారు రాబోయే కాలంలో ఇబ్బందులకు గురికాక తప్పదని హెచ్చరించారు.

4.4   కులవ్యవస్థ పై తిరుగుబాటు

కులవివక్షతతో నేటికీ మనుషులను దూరంగా పెట్టడం, దగ్గరకు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కులమతాల మత్తు మంచిది కాదనే సత్యాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఆనాడే తన కాళికాంబా సప్తశతిలో ఇలా ప్రబోధించారు.

“కులము కులమటంచు గొణిగెడు పెద్దలు
చూడరైరి తొల్లి జాడలెల్ల
మునుల పుట్టువులకు మూలమ్ము లేదండ్రు" (కాళికాంబా సప్తశతి. ప. 21)

పుట్టుకతో అందరిదీ ఒకటే కులమని, వేదం చదివిన పిదప విప్రులవుతారని, కుల నిర్ణయం పుట్టుకతో గాక విద్యతో, సుగుణాలతో నిర్ణయించబడుతుందని చెప్పారు.

“ఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు
మొదలు శూద్రుడుగను పుట్టునందు
శ్రుతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడౌ"           (కాళికాంబా సప్తశతి. ప. 116)

కుల గోత్రాలు అహంకారాన్ని పెంచక పది మందికి మేలును చేకూర్చేవి కావాలని చెప్పారు.

"కులము గోత్రములను గలుగు మదము
మతము మత్తు గూర్చు మార్గము కారాదు
హితము గూర్చవలయు నెల్లరకును"
"కులము గోత్రమంచు కూసెడి మలపల
కర్మఫలము ముందు కట్టికుడుపు
బ్రహ్మమంద గలరు వర్ణాదులను వీడ"                     (కాళికాంబా సప్తశతి. ప. 19)

కుల మతాలే రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో కులమతాల పట్ల ఇటువంటి సాహసోపేతమైన అభ్యుదయ భావాలను ప్రకటించడం వీరబ్రహ్మేంద్రస్వామివారికి గల సంఘ సంస్కరణాసక్తిని వెల్లడి చేస్తూ ఆయనలో దాగిన సమతా మూర్తిని ఆవిష్కరింపజేస్తున్నాయి.

4.5.   స్త్రీలకు సముచిత స్థానం, మహిళాభ్యుదయం

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పూర్వీకులు చెప్పారు. కానీ క్రీ.శ.17వ శతాబ్దం నాటికి స్త్రీని ఒక ఆట బొమ్మగా, భోగ విలాస వస్తువుగా చూశారే తప్ప వారికి సమాజంలో సముచితమైన స్థానాన్ని ఇవ్వలేదు. విద్యలో, అధికారంలో వారికి భాగస్వామ్యం కొరవడింది. తన భర్త ఎటువంటి వాడైనా సరే స్త్రీ అణిగిమణిగి ఉండే పరిస్థితి ఉండేది. అదే సనాతన భారతీయ ధర్మమని స్త్రీల నోరు మూయించారు.

ఈ దుస్థితి నుండి స్త్రీని విడిపించడానికి వీరబ్రహ్మేంద్రస్వామి తనవంతు కృషి చేశారు. ముందుగా తల్లిని గౌరవించాలని సూచించారు. తద్వారా ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని సందర్శించగల్గుతామనే సత్యాన్ని ప్రబోధించారు. తల్లిని మించిన దైవం లేదనే సత్యాన్ని చెప్పారు-

“జీవులకును “మాతృదేవోభవ” యటంచు
శ్రుతులు స్మృతులు పలికె శుద్ధముగను
మాతృమూర్తి మించు మఱి దైవమే లేదు” (కాళికాంబా సప్తశతి ప. 339)

అంతేగాక స్త్రీల మనసులోనే శివుడు కొలువై ఉన్నాడని, స్త్రీలందరినీ తల్లిగా ఆత్మలో దర్శించినట్లయితే సందేహములన్నీ తొలగిపోతాయని ఇలా చెప్పారు-

“స్త్రీల మనసులోనె శివుని వాసమ్మగు”
“మానినులను తల్లిగా నాత్మనెంచిన
సందియమ్ములెల్ల సమసిపోవు”
“తల్లిప్రేమలోన తగులదు మాలిన్య
మెల్లభంగులను సహించుకొనును
తల్లిపదము విన్న నుల్లమ్ము రంజిల్లు”  (కాళికాంబా సప్తశతి ప. 336)

మాతృ పూజ చేసే మగవారి కంటికి మగువలు తల్లి వలె కనిపిస్తారని, అలా చూడని వారు నరకానికి పోతారని కూడా హెచ్చరించారు.

“మాతృపూజ చేయు మగవారి కెల్లను
అన్యకాంత తల్లియట్ల తోచు
ఎఱుక మఱచువాడు నరకమ్ము పాలౌను” (కాళికాంబా సప్తశతి ప. 221)

యవ్వనము రాగానే కళ్ళకు కప్పిన అజ్ఞానమనే తెర పొరగా మారి కప్పి వేస్తుందని, ఆ తెరలు, పొరలను తెంచుకున్నట్లయితే పరనారి సైతం తల్లివలె కనిపిస్తుందని చెప్పారు.

“యౌవనమ్ము రాగ నజ్ఞాన మనుతెర
  కన్నులకును పొరగ గప్పితీరు
  తెరలు పొరలు తెగిన పరనారి తల్లియౌ” (కాళికాంబా సప్తశతి ప. 203)

తొలి కాలంలో స్త్రీలకున్న వేద విద్యాధికారం భారత రామాయణాల కాలం నాటికి కొంతవరకు క్షీణించింది(1). అనంతర కాలంలో పురుషాధిక్యం ప్రబలి స్త్రీని వంటింటికే పరిమితం చేసి విద్యకు దూరం చేశారు. అయితే స్త్రీకి విద్య అవసరం లేదనే ఈ ప్రబుద్ధులు చదువులకు తల్లి అయిన సరస్వతీ దేవి స్త్రీ అనే సంగతిని మరిచారంటూ చురక వేశారు స్వామివారు. 

వెలదులకును వేదవిద్యాధికారమ్ము
లేదటంచు బ్రహ్మలిఖిత మంచు
నోరుతెఱచి మరచినారు వాణిని నిన్ను
కాళికాంబ! హంస! కాళికాంబ! (కాళికాంబా సప్తశతి ప. 678)

4.6   పలు సామాజికాంశాలు - నీతి ప్రబోధం

వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలికాంబా సప్తశతిలో స్త్రీలను గౌరవించాలని, కులాలన్ని సమానమని, చిల్లర రాళ్ళకు మ్రొక్క వద్దని, సోమరితనం పనికిరాదని, నేల అందరిదని, యవ్వనం లో తప్పులు చేసి ముసలితనంలో బాధపడి లాభం లేదని అస్పృశ్యత అమానుషమని, కూడు తినే దగ్గర కుల భేదం పనికిరాదని మొదలైన సామాజికాంశాలనెన్నింటినో ప్రస్తావించారు. సమాజాభ్యుదయాన్ని ఆకాంక్షించారు.

4.7   అస్పృశ్యతా నివారణ

సాంఘిక దురాచారాలలో అత్యంత నికృష్టమైంది అస్పృశ్యత. ఇది నేటి నాగరిక యుగంలో కూడా ఇంకా మనుగడ కొనసాగిస్తూనే ఉందంటే క్రీ.శ. 17వ శతాబ్దిలో ఎంతటి వికృత రూపంలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

"మాలమాదిగలును మంచి సన్యాసులే
కోర్కు లుడుగువారు గొప్ప యోగు
లాత్మ నిబ్బరించు నందఱు బ్రాహ్మణుల్
కాళికాంబ! వీర కాళికాంబ!" (వీరకాళికాంబ శతకం ప. 110)

మాల, మాదిగలు కూడా మంచి సన్యాసులని, ఉత్తములైన మోక్షగాములని తెలియజేస్తూ కోరికలను చంపుకొని ఆత్మసంయమనాన్ని పొందినవారే సద్బ్రాహ్మణులని చెప్పారు.

అంటి గురుని ధ్యాన మందు తేజము గని
కంటకంబులెల్ల కాల్చివైచి
మాల మాదిగలను బ్రాహ్మలుగా జూడు
కాళికాంబ! వీర కాళికాంబ! (వీరకాళికాంబ శతకం ప. 265)

 ధ్యానం అనేది అష్టాంగ యోగంలో ఒక భాగం. నిర్విఘ్నంగా సాగే ధ్యానం వల్ల దివ్యతేజం గోచరిస్తుంది. ఆ తేజం ఆటంకాలు అనే ముళ్ళను సమూలంగా కాల్చివేస్తుంది. అదిగో అప్పుడు కన్నువిప్పి చూసినట్లయితే లోకం ఏ మాల మాదిగలను అంటరాని వారిగా చూస్తుందో ఆ మాల మాదిగలు బ్రాహ్మణులుగానే కనిపిస్తారు. వారు ఇట్లా కనిపించడానికి నీ సంకల్ప శుద్ధి, దార్శనిక సిద్ధి తోడ్పడతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి హితబోధ చేశారు.

4.8  మూఢవిశ్వాసాల ఖండన

దేహమే దేవాలయం జీవుడే దేవుడ"నే బ్రహ్మ స్వరూప జ్ఞానాన్ని ప్రబోధించే వీరబ్రహ్మేంద్రస్వామి ప్రజలనుసరించే అర్థం పర్ధం లేని విశ్వాసాలను పూర్తిగా నిరసించారు. ఉపవాసాలు ఉండటం వలన ఉపయోగం లేదని ఇలా చెప్తున్నారు.

ఆకలి చంపియు కొందరు
నాకులు తిన్నందు చేత నడివిలో తిరిగే
మేకలకెల్లను మోక్షము
రాకేలను పోయినయ్య రయమున సిద్ధా!  (సిద్ధార్థ శతకం  ప. 33)

"వక్కపొద్దు మాడ్చి వానికేల మోక్షపడి బడును....."
"వక్క పొద్దులని ఎండుచునుంటే వనరుగ చెడుదువు ఒరే ఒరే....."

నీళ్లలో మునిగి మడి కట్టుకొని చేసే జపతపాలు శరీరానికే తప్ప మనసుకు కావని, మనసు నిర్మలంగా ఉండడం ముఖ్యమనీ "నీటిలో మునిగి గొణుగుచునుంటే నిలకడ చెడునుర ఒరే... ఒరే... నీలోనుండే నిర్మల జ్యోతిని నిండుగజూచుట సరే... సరే.." అంటూ మనసును నిర్మలంగా ఉంచుకోలేని వారి ఆచారాలను మతిలేని ఆచారాలు అంటున్నారు.

స్నాన సంధ్య తపము జపముల చేతను
మతియు గతియు లేని వ్రతము చేత
అతడతీత మెరుగడాచారములు తప్ప
కాళికాంబ వీర కాళికాంబ.   (వీర కాళికాంబ శతకము ప. 461)

4.9 పరసతీ వ్యామోహ ఖండనము

పరనారీ వ్యామోహాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి తీవ్రంగా నిరసించారు. ఇతరుల భార్యలపై మోజు పెంచుకొని విచ్చలవిడిగా తిరిగేవారు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరని "అంగ లింగమణచి ఆత్మ లింగము చూడు"మని హెచ్చరిస్తున్నారు.

"కుఱ్ఱ వయసు దాని కుచకుంభముల జూచి
ఎఱ్ఱనైన దాని ఏపు చూచి
విఱ్ఱ వీగు మనసు విశ్వేశు గాంచునే?”. (వీర కాళికాంబ శతకం - ప. 105)

పరపురుషుని భార్యను ఆశించడం వల్లే రావణుడు తన పది తలలను పోగొట్టుకున్నాడని పర స్త్రీలను ఆశించడం పతనానికి హేతువని నాటి సమాజాన్ని హెచ్చరించాడు.

రావణునకునెపుడు రాముడు సరిగాడు
రావణునకు మిగుల ఱంకు వచ్చె
సీత నఱిమి పట్ట చేటు లంకకు వచ్చె
కాళికాంబ హంస కాళికాంబ    (కాళికాంబసప్తశతి ప. 582)

ఇంకా "చక్కని వనితల దగ్గర" (కాళీ మకుట కందాలు ప. 17), “స్త్రీల చిన్నె చూచి చిత్తంబు పొర్లక” (కాళికాంబా సప్తశతి ప. 563), “ఎన్నగ నెముకలు సున్నము” (సిద్ధార్థ శతకం ప. 34), “ఇంతి కానబడిన ఎఱ్ఱగా బుఱ్ఱగా” (వీర కాళికాంబా శతకం 37), “ఎర్ర బట్ట కట్టి బుర్ర చేతను బట్టి” (వీర కాళికాంబ శతకం ప. 36), “కాంత మీద వాంఛ కాసు మీదను వాంఛ” (వీర కాళికాంబా శతకం ప.178) మొదలైన పద్యాలలో పరస్త్రీలపై వ్యామోహం తగదని, పర స్త్రీలను తల్లి వలె భావించి ఆత్మజ్ఞానాన్ని పొందాలని వీరబ్రహ్మేంద్ర స్వామి సూచించారు.

4.10  మతసామరస్యం-సర్వమత సమ్మతం

క్రీ.శ.17వ శతాబ్దపు నాటి చారిత్రక విపత్కర సమయంలో సర్వమానవ సమతాస్ఫూర్తిని నెలకొల్పేందుకై సర్వసమ్మత భావనలతో మతమౌఢ్యాలను తొలగించడానికి విశేషకృషి సల్పినసమతా మూర్తి సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రుడు.

కుల మతాల జాడ్యములలోన దపియించు
దీనజనుల సేద తీర్చువాడ.......“  (కాళికాంబా సప్తశతి ప. 700 )

      సర్వ మతాల సారం ఒక్కటేనని ఐకమత్యంతో సన్మార్గంలో ప్రయాణించాలని ప్రజలను జాగృతపరిచారు.

సర్వమతములందు సారమ్ము గ్రహియించి
ఐకమత్య మార్గమనుసరించి
క్రించుదనము మాని ప్రేమించుకొన మేలు.......”   ( కాళికాంబా సప్తశతి ప. 379)

      మతమనేది మత్తునిచ్చే మార్గం కారాదని, అది అందరికీ హితాన్ని చేకూర్చేదిగా ఉండాలని ప్రబోధించారు.

మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదు;
హితము గూర్ప వలయు నెల్లరకును
హితము గూర్ప లేని మతము మానవలె.........”.    (కాళికాంబా సప్తశతి ప. 694)

          "ఆత్మచింత చేయు "మల్ల అల్లా" యని” (వీర కాళికాంబా శతకం ప. 338), “మనుజులందఱేక మత మంచు తలచుమీ” (వీర కాళికాంబ శతకం ప. 397), “ఎన్ని మతముల గన నేమి కనంబడు” (వీర కాళికాంబా శతకం ప. 404), “సర్వదేవతలను సర్వమతాలను సమముగానెఱుంగు సజ్జనుండు” (కాళికాంబ సప్తశతి ప. 487), “సర్వ మానవులను సమముగా ప్రేమించు కుల మతాల నెంచి కోపపడకు.....” ఇత్యాది పద్యాలలో వీరబ్రహ్మేంద్రస్వామి సర్వమత సమానత్వాన్ని ప్రబోధించి సామాజిక సమతా మూర్తిగా, సద్గురువుగా ఖ్యాతిగాంచారు.

5. రచనా విశేషాలు

వీరబ్రహ్మేంద్రస్వామి తీయనైన జాను తెలుగు పదాలతో తత్వాలు, యాలలు, పాటలు, పద్యాలు మొదలైనవి వ్రాశారు. ఇంచుమించుగా వీరి సాహిత్యమంతా వ్యవహారిక భాషా నిబద్ధమని చెప్పవచ్చు. తాను చెప్పదలుచుకున్న భావాలు నిరక్షరాస్యులైన సామాన్య ప్రజలకు సైతం సూటిగా చేరాలంటే ప్రజల భాషలోనే రచనలు చేయాలని భావించి దేశి కవితలో రచనలు చేసి ప్రజాకవి అయ్యారు. ఉపనిషత్ సూత్రాలను, తర్క కర్కశాలైన భావాలను లలితమైన భాషలో పొదిగి లోకానికి అందించారు. "అహం బ్రహ్మాస్మి" అను మహా వాక్యాన్ని "నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా....." అంటూ తేట తెలుగులోకి తత్వీకరించారు. "చెప్పలేదంటనక పొయ్యేరు", "చిల్లర రాళ్లకు మొక్కుచునుంటే", "ఈ జన్మమిక దుర్లభముర" మొదలైన తత్వ గీతాల్లో స్వామివారు అద్వైత తత్వాంశాలు, యోగ సాధనా విశేషాలు సర్వజనానికి అర్థమయ్యే విధంగా మాత్రా ఛందస్సులో సరళమైన వ్యవహారిక భాషలో సుగమ సుందరంగా రచించారు. "తియ్యని మామిడిపండు- తినబోతే దొరకదు తీపులు మెండు" లాంటి మార్మికమైన వేదాంత తత్వాలు కూడా వ్రాశారు. వీటిలో “ఈ రాతి పువ్వు రంగుల పాలై పోయెను” (కాలజ్ఞానం పుట 20), “గుడి ముందరా నొక్క గుడ్డి ముండున్నాది”(కాలజ్ఞాన తత్వాలు పుట. 17), “చింతమానిమీద చేమంతి పూసెను” (కాలజ్ఞాన తత్వాలు పుట. 38) మొదలైన మరుగు వాక్యాలు ఎన్నెన్నో కనబడుతున్నాయి.

6. ఉపసంహారం

  • వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దం నాటి సమాజంలో అలుముకున్న అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గంలో సంఘసంస్కరణకు పూనుకున్నారు. ఆదర్శాలను వల్లించడంతో ఆగిపోకుండా వాటిని ఆచరించి చూపారు. 
  • స్వామివారు మతసామరస్యాన్ని ప్రబోధించారని, పరమతసహనాన్ని తానాచరించి చూపారని చెప్పేందుకు ప్రబల తార్కాణము మహమ్మదీయుడైన సిద్దయ్యను ప్రియశిష్యునిగా చేసుకోవడమే.
  • సిద్దయ్యను శిష్యునిగా స్వీకరించడాన్ని తన కుమారులు ప్రతిఘటించినప్పటికీ వారి అభిప్రాయాలతో ఏకీభవించక మతం కంటే మనిషి గుణమే ప్రధానమని ప్రబోధించి మహమ్మదీయుడైన సిద్దయ్యను స్వామివారు ప్రియశిష్యునిగా స్వీకరించి హిందూ మహమ్మదీయుల మధ్య సమైక్యతకు కృషి చేశారు. 
  • "మమాత్మ సర్వ భూతాత్మ" అని చెప్పుకుంటూనే సాటి మనుషిని అంటరాని వానిగా చూసే  అమానవీయ చర్యను గర్హిస్తూ వీరబ్రహ్మేంద్రస్వామి హరిజనుడైన కక్కయ్యను తన శిష్యకోటిలో చేర్చుకొని అతనికి షట్చక్ర రహస్యాలను ప్రబోధించి అస్పృశ్యతను అణగద్రొక్కి తన రచనలలో కూడా అస్పృశ్యతా నివారణకు సంబంధించిన సమానత్వ భావనలను సాధికారికంగా చొప్పించారు. 
  • సామాజికస్పృహతో రచనలు చేసి, బాల్యవివాహాలను ఖండించి, మూఢవిశ్వాసాలను నిరసించి, హిందూ మహమ్మదీయ సమైక్యతకు దారులనేర్పరిచి, కులవ్యవస్థ పై తిరుగుబాటును ప్రకటించి, మహిళాభ్యుదయాన్ని కాంక్షించి, అస్పృశ్యతా నివారణకై స్త్రీ పురుష సమానత్వానికై జీవితాంతం కృషి సలిపిన మహనీయుడు, "సమతామూర్తి, సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రుడు" అని ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. 

7. పాదసూచికలు:

  1. సంప్రదాయ సాహిత్యం- స్త్రీవాద దృక్పథం. కాత్యాయనీ విద్మహే. పుట 20.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నాగభూషణదాసు జవంగుల(1930) శ్రీ వీరబ్రహ్మేంద్ర నామ తత్వ కీర్తనలు. ఆర్యవైశ్య ముద్రాక్షరశాల. గుంటూరు
  2. నాగేశ్వరరావు, పూసపాటి. (1973) శ్రీ వీరబ్రహ్మేంద్ర చరిత్ర (పద్య కావ్యము), కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, ఓ.యు. రోడ్డు, విద్యానగర్, హైదరాబాద్ -44
  3. పాండురంగాచార్యులు, యండపల్లి. (2019) పోతులూరి వీరబ్రహ్మం సమగ్ర పరిశోధన, ప్రజాశక్తి బుక్ హౌస్ 27- 30-4 ఆకుల వారి వీధి గవర్నర్ పేట, విజయవాడ. 520 002
  4. మల్లికార్జున రెడ్డి, మూల. (2007) శ్రీ వీరబ్రహ్మేంద్రుని తాత్విక దార్శనికత,సనాతన సాహితి 5 -12 - 220, మంగాపురం కాలనీ, మౌలాలి, హైదరాబాద్ 500 040
  5. రాజమల్లాచారి, కన్నెకంటి. (2018) పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం-రచనల పరిశీలన, సనాతన సాహితి 5 -12 - 220, మంగాపురం కాలనీ, మౌలాలి, హైదరాబాద్ 500 040
  6. లక్ష్మీ నరసింహ సూరి పరవస్తు మాల్యాద్రి (2008)శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి చరిత్ర, నవోదయ ఆఫ్ సెట్ ప్రింటర్స్. చీరాల.
  7. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు, పోతులూరి. (2002) వీర కాళికాంబా శతకము, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిమఠం,      కందిమల్లాయపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా-ఆంధ్ర ప్రదేశ్. 516 503
  8.  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, పోతులూరి. (2004) కాలజ్ఞాన తత్వములు (పరివర్ధిత సంపుటము), శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మఠం, కందిమల్లాయపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా-ఆంధ్ర ప్రదేశ్. 516 503
  9. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, పోతులూరి. (1993) కాళీ మకుట కందములు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిమఠం, కందిమల్లాయపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా-ఆంధ్ర ప్రదేశ్. 516 503
  10. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, పోతులూరి. (2002) కాళికాంబా సప్తశతి, (పరిష్కర్త: కొండవీటి వెంకట కవి),శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, కందిమల్లాయపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా-ఆంధ్ర ప్రదేశ్. 516 503
  11. సుబ్బరామయ్య చిరువెళ్ళ (1991) శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర. సాయిరాం ప్రింటర్స్. కాపు స్ట్రీట్. నెల్లూరు-1

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]