headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

8. ప్రాచీన తెలుగు-కన్నడ వాఙ్మయం: పరస్పర ప్రభావాలు

డా. తత్త్వాది ప్రమోద కుమార్

సహ ఆచార్యులు, తెలుగు విభాగము
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వ), జగిత్యాల
జగిత్యాల జిల్లా, తెలంగాణ
సెల్: +91 9441024607, Email: thatwadi@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 17.04.2025        ఎంపిక (D.O.A): 29.04.2025        ప్రచురణ (D.O.P): 01.05.2025


వ్యాససంగ్రహం:

తెలుగు కన్నడ ప్రాంతాలు ఈ రెండు ప్రాంతాలు ఒకే రకమైన రాజకీయ సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. భాషా లిపుల మధ్య సన్నిహిత సంబంధం కూడా ఉంది. ఈ కారణాల వల్ల ఈ రెండు భాషా సాహిత్యాల మధ్య పరస్పర ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, అర్వీయస్. సుందరం, గడియారం రామకృష్ణ శర్మ, నలిమెల భాస్కర్ మొదలైన తెలుగు పరిశోధకులు, అమరేశ నుగడోణె, లక్ష్మీనారాయణ ఎస్ అరోరా, కె. వి. సుబ్బణ్ణ మొదలయిన కన్నడ పరిశోధకులు, విద్వాంసులు వివిధ వ్యాసాలలో పేర్కొన్నారు. ఆ పరస్పర ప్రభావాలు ఎంత మేరకు ఉన్నాయో దిఙ్మాత్రంగా సూచించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. ఈ వ్యాస రచనకు సంబంధించి విషయ వివరాల సేకరణలో తెలుగువాణి, తెలుగు పరిశోధనాసంపుటాల వ్యాసాలు అంతర్జాల సమాచారం తోడ్పడినాయి. రాజకీయపాలనా విశేషాలతోపాటు భాషా విశేషాలు, ప్రాచీన కావ్యసాహిత్యవిశేషాలు, జానపదసాహిత్య విశేషాలు, మొదలైన శీర్షికలతో ఈ వ్యాసాన్ని విభజించి రాశాను. ఈ వ్యాసం ఆధారంగా రెండు భాషలలో ఆసక్తి కలిగిన పరిశోధకులు వివిధ సాహితీ ప్రక్రియలలో విశేషంగా పరిశోధన చేసే అవకాశం ఉంటుంది.

Keywords: తెలుగు, కన్నడ, భాషా సాహిత్యాలు, పంప కవి, నన్నయ్య, సోమన, వేమన, సర్వజ్ఞ

1. ప్రవేశిక

తెలుగు కన్నడ సీమలను పరిపాలించిన రాజులు తెలుగు కన్నడ భాషలు రెండింటిని సమానంగా ఆదరించారు. రెండు ప్రాంతాలలో ఒకే వంశానికి చెందిన రాచరిక పరిపాలన కొనసాగిన కారణంగా ఆనాటి పండితులకు రెండు భాషల సాహిత్య విశేషాలు పరస్పరం పరిచయమై ఉండవచ్చు. కన్నడ ఆది కవి పంపకవి ప్రభావం తెలుగు భారతం పై ఉన్నదనే అభిప్రాయం ఉంది. అలాగే తెలుగు కావ్యాల ప్రభావం కన్నడంలోనూ కనిపిస్తుంది. పద సాహిత్యంలో కూడా పురందరదాసు అన్నమయ్య త్యాగరాజు రామదాసు మొదలైన వారిలో పరస్పర ప్రభావాలు కనిపిస్తున్నాయి. వేమన, సర్వజ్ఞులలో కూడా ఒకే విధమైన ఆలోచన భావాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని చూస్తే రెండు భాషల మధ్య పరస్పర ప్రభావాలు ఉన్నట్లు మనం సులభంగానే గ్రహించవచ్చు.

2. రాజకీయ పాలనా విశేషాలు

ఆసేతు హిమాచల పర్యంతమైన భారతదేశంలోని దక్షిణ దిశలోగల పీఠభూమిని "దక్కన్" అని పిలుస్తుంటారు. ఫరిస్తా అనే ముస్లిం చరిత్రకారుడు తాను రచించిన చరిత్ర గ్రంథ పీఠికలో హిందూ దేశాన్ని ఒక వ్యక్తిగా భావించి, ఆ మహనీయుని కుమారులలో దక్కన్ ఒకడని ఆ దక్కన్ కు ముగ్గురు కుమారులని వారు మరాఠా, కనహడా, తైలంగులని వర్ణించాడు.1 భౌగోళికంగా దక్కన్ పీఠభూమిని మహారాష్ట్ర కర్ణాటక తెలుగుదేశాలుగా విభజించవచ్చు. చరిత్రకారుడైన ఫరిస్తా పేర్కొన్న కన్హడ, తైలంగులే కర్ణాటక, తెలుగు సీమలు. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్ర కూటలు, కాకతీయులు, బహుమనీ సుల్తాన్లు, విజయనగరరాజులు మొదలైన ఉన్నత రాజవంశీయులు పరిపాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.

ఈ నేలను పరిపాలించిన తొలి రాజులైన శాతవాహనుల కాలంలో తెలుగు కన్నడ పేర్లు ఉపయుక్తం కాకపోవడం గమనించదగిన విషయం. శాతవాహనుల కాలంలోని దాన శాసనాలలో, ఇతరులచే వీరి ప్రస్తావన చేయబడిన శాసనాలలో ఆంధ్ర కర్ణాటక పదాల ప్రసక్తి రాలేదు. క్రీ.శ. 151 లో రుద్రదమనుని శిలాశాసనంలో "దక్షిణాపథ పతే శాతకర్ణి ద్విరపి నిర్వ్యాజ్యమచిత్యావచిత్యా  సంబంధ విదతయ అనుత్ సదనాత్రాప్త మనసా మహా క్షత్రపేన రుద్రధామ్నా"2 అని, గౌతమ బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనాల్లో ఒకదానిలో పథసరో అనే వాక్యం ఉంది దీనిని దక్షిణాపథ సరో అని శాసన పరిశోధకులు నిర్ణయించారు.3 ఈ శాసనాధారాలను పరిశీలించగా చారిత్రికంగా తొలి దశలో ప్రాంతాల సరిహద్దులు లేవని తెలుస్తుంది. ఆంధ్ర శాతవాహనుల వల్ల ఆంధ్రత్వం వచ్చినట్లే శాతకర్ణి శబ్దం నుంచి కర్ణినాడు ఏర్పడి ఉంటుందని, ఈ కర్ణినాడు కాలక్రమంలో కర్నాడు, కన్నాడు, కర్ణాటక శబ్దాలుగా పరిణమించి ఉంటాయని కొందరు పెద్దల అభిప్రాయంగా వేదం వెంకటరాయ శాస్త్రి పేర్కొన్నారు 4.

శాతవాహనుల అనంతర కాలంలో సాలంకాయనులు, విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు,పల్లవులు, కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు మొదలైన వారు ఈ దక్షిణాపథంలోని భిన్న భాగాలను పరిపాలించారు. రాష్ట్ర కూటులు నేటి కన్నడ ప్రాంతాలతో పాటు తెలుగు నేలను కూడా పాలించారు. కన్నడంలో తొలికృతిగా పేరుపొందిన కవి రాజమార్గం రాష్ట్ర కూటుల కాలంలోనే రచింపబడింది. “నృపతుంగ” అనే బిరుదు కలిగిన అమోఘవర్షుని ఆస్థానంలోని శ్రీ విజయుడు అనే పండితుడు ఈ కవి రాజ మార్గాన్ని రచించారు. ఈ గ్రంథంలో-

“కావేరీ యిందమా గో
దావరి వరమిత్త నాడు దా కన్నడ దొల్
భావిసిద జనపదం వసు
ధావలయ విలీన విషాద విషమ విశేషం* 5

(కావేరీ మొదలుకొని గోదావరి వరకు గల దేశం అంతా కన్నడదేశమని) పద్యం ద్వారా తెలిపాడు. అనగా చాళుక్యులు, రాష్ట్రకూటులు పాలించిన దేశానికి కన్నడ దేశమనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. నృపతుంగడు క్రీ.శ. 814-877 సంవత్సరంలో జీవించాడు.7 ఇతని కంటే పూర్వం లేదా సమకాలీనంగా అనగా క్రీ.శ.750-973 మధ్యయుగంలోనే కళ్యాణి చాళుక్యులు నేటి తెలంగాణలోని బోధన్ ను, ఆ తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకుని తెలంగాణను పరిపాలించారు.8 వేములవాడ చాళుక్యులు కన్నడ భాషను ఆదరించారు. కావున కావేరీ మొదలుకొని తెలంగాణ ప్రాంత స్థితంగా ఉన్న గోదావరి మధ్య గల ప్రదేశాన్ని కన్నడ సీమగా నృపతుంగడు భావించి ఉంటాడు.

తెలుగు రాజులైన కాకతీయులు క్రమక్రమంగా తమ రాజ్యాన్ని దక్షిణాపథమంతటా విస్తరింపజేశారు. నేటి కర్ణాటకలోని రాయచూరు ప్రాంతం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరించింది. గుల్బర్గాను రాజధానిగా చేసుకుని దక్కన్ ప్రాంతాన్ని పాలించిన బహుమనీ సుల్తాన్లు కాపయ నాయకుని ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నాడు. గోల్కొండ ను పాలించిన కుతుబ్షాహీలు క్రమక్రమంగా తెలుగు నేలతో పాటు కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా ప్రాంతాలు కూడా వీరు పరిపాలించారు. కుతుబ్షాహీల తదనంతరం పాలించిన అసఫ్జాహీలు తెలుగు నేలతో పాటు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, రాయచూర్ ప్రాంతాలను కూడా పాలించారు.

రెండు ప్రాంతాల ప్రాచీన రాజకీయ చరిత్రను పరిశీలించినప్పుడు నేటి వలే భాషా ప్రయుక్త రాష్ట్రాల సరిహద్దులు కనిపించవు. ఆయా ప్రాంతాలను పరిపాలించే రాజులు సామ్రాజ్య విస్తరణాకాంక్షతో నిరంతరం పొరుగు రాజ్యాలతో యుద్ధాలు కొనసాగించేవారు. దానితో స్థిరమైన సరిహద్దులు ఉండేవి కాదు. తెలుగు కన్నడ ప్రాంతాలు రెండు పరస్పరం తెలుగు కన్నడ రాజుల పాలనలో ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వేషభూషలు, పండుగలు, ఉత్సవాలు మొదలైనవన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ ఒక్క భాషలోనే తేడా కనిపిస్తుంది. చాళుక్యుల కాలం నుంచి బహుమనీ సుల్తాన్ ల వరకు చక్రవర్తులు అందరూ కూడా తెలుగు కన్నడ భాషలు రెండింటిని సమాదరించారు. ఆయా భాష సాహిత్యాలకు రాజాశ్రయాన్ని కల్పించారు. అందువల్లనే భాషలో తప్ప మిగతా సంస్కృతీ సంప్రదాయాలు ఒక్కరూపుగా కనిపిస్తుంటాయి. భాషలు వేరైనా తెలుగు కన్నడ భాషా సాహిత్యాలలో సామ్య భేదాలు కనిపిస్తున్నాయి. పరస్పర ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి.

3. భాషా విశేషాలు

భౌగోళికంగా తెలుగు కన్నడ భాషలు ఇరుగుపొరుగు భాషలు ఈ రెండు భాషల మధ్య పరస్పర సామ్య ధర్మాలను సులభంగా గమనించవచ్చు. లిపిలో కూడా అతి సన్నిహితమైన పోలికలు ఉన్నాయి. ఈ రెండు భాషల ఛందోవ్యాకరణాల్లోనూ సమానమైన అంశాలు అనేకంగా కనిపిస్తున్నాయి. శాతవాహనుల అనంతరం తెలుగు కన్నడ ప్రాంతాలను పరిపాలించిన చాళుక్యులు, కాకతీయులు, విజయనగర చక్రవర్తులు మొదలైన పాలకులు తెలుగు కన్నడ భాషా సాహిత్యాలను సమానంగా ఆదరించారు.

తెలుగు కన్నడ భాషలు రెండు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవే. ఈ రెండు భాషల మూలం మూల ద్రావిడ భాష. ఈ రెండు భాషలపైన సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం ఉన్నది. తెలుగు కన్నడ భాషలు రెండు ద్రావిడ భాషా కుటుంబానికే చెందినప్పటికీ తెలుగు మధ్య ద్రావిడ భాషగా కన్నడ దక్షిణ ద్రావిడ భాషగా ఉపవిభజన పొందాయి. క్రీ.పూ. 300నుంచి క్రీ.శ.  500 మధ్యకాలంలో ఈ రెండు భాషల మధ్య వ్యత్యాసం ఏర్పడి ఉండవచ్చని భాషావేత్తల అభిప్రాయం.23 దేవనాగరలిపితో కూడిన మౌర్యుల బ్రాహ్మీ  లిపియే నేటి భారతీయ భాషల లిపులకు మూలం.  క్రీ. శ. నాలుగో శతాబ్దంలో దక్షిణ భారతంలో దక్షిణ లిపులు ప్రారంభమయ్యాయి. దక్షిణ ప్రాంత మందలి తెలుగు కన్నడ లిపుల యొక్క స్వరూపాల్లో స్వల్ప భేదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి మరికొన్ని ప్రాంతీయ భేదాలతో ఏర్పడి ప్రాచీన పల్లవ, వేంగీ, చాళుక్య, పశ్చిమ గాంగ, కదంబ, బాదామి చాళుక్య శాసనాల్లో కనిపిస్తున్నది. ఈ లిపిని ఆంగ్లేయులు వేంగిలిపిగా పేర్కొన్నారు.24  దీనిని తెలుగు కన్నడ లిపిగా తిరుమల రామచంద్ర పేర్కొన్నారు.25 తెలుగు కన్నడ లిపులు పదవ శతాబ్దం నాటికి మార్పులను పొందుతూ వచ్చి ఆధునిక తెలుగు కన్నడ లిపి గా పరిణమించింది26. క్రీ.శ.14 - 16 శతాబ్దం వరకు చాలా మార్పులు వచ్చాయి. ముద్రణా పద్ధతులు వచ్చిన తర్వాత రెండు భాషల లిపులు పూర్తి ప్రత్యేకతను ఏర్పరచుకున్నాయి.27 అయినప్పటికీ సన్నిహితమైన పోలికలు చాలానే ఉన్నాయి. సాధారణ విద్యావంతులు కూడా ఈ రెండు భాషల లిపులను పరస్పరం చదవగలిగిన పోలికలు కనిపిస్తున్నాయి. భాషా సంబంధము తక్కువైనను ఒకే పాలనలో తెలుగు కన్నడములు ఉండెననుటకు లిపి సంబంధమే దీనికి ప్రబల కారణము. 28

తెలుగులో వలె కన్నడంలో కూడా అచ్చులు 16. హల్లుల్లో మాత్రం కొద్దిపాటి తేడాలు ఉన్నాయి. దంత్యాక్షరాలు అయిన ౘ,ౙ లు కన్నడంలో లేవు. తెలుగులో వలె కన్నడంలో కూడా ప్రత్యేక ధ్వని గలిగిన తమిళ అక్షరం వంటి అక్షరం, రెండు విధాలైన లకారాలు ఉన్నాయి. తెలుగులో గల అర్థాను స్వరం కన్నడంలో కనిపించదు. ప్రాచీన ద్రావిడ భాషలోని పదాలు హలంతాలుగా ఉండేవి. తెలుగు, కన్నడ భాషలలో హలంత శబ్దాలు అజంతాలుగా మారుతాయి. హళ(పాత)కన్నడంలో హలంతాలే ఎక్కువగా ఉన్నా, హొస(కొత్త) కన్నడంలో మాత్రం అజంతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్నడంలోని అజంత పదాల విస్తృతికి కారణం తెలుగు భాషా ప్రభావమే అని భాషా పండితుల అభిప్రాయం. 29 సంస్కృత భాషా ప్రభావం వల్ల మూల ద్రావిడంలో లేని మహాప్రాణాలు, శషసలు తెలుగు, కన్నడ భాషలలో చోటు చేసుకున్నాయి. అరసు (రాజు), హెగ్గడె (ద్వార పాలకుడు), సాకు (చాలు), ఇల్ల (లేదు), దేవర (దేవుడు), రాయరు (రాజు), బిడారు (వర్తక సమూహం), దుడ్డు (డబ్బు), బాడిగ (అద్దె), గండె పెండేరము మొదలైన కన్నడ పదాలు తెలుగులోనికి ప్రవేశించాయి.30 అలాగే కన్నడంలోనూ కూలీనాలి, ఆస్తిపాస్తి, బిక్కిబిక్కి  మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి.

కన్నడ భాషా ప్రభావం తెలుగు నాట ముఖ్యంగా తెలంగాణలో ఉన్నట్లు అనేకమైన ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కొన్ని స్థలనామాల్లో కన్నడ భాషా పదాల ప్రభావం ఉంది భీమదేవరపల్లి, దేవరకొండ మొదలైన గ్రామనామాల్లో దేవర శబ్దం కన్నడ భాషాపదమే. అలాగే ఓరుగల్లు రాయికల్ చలిగల్, భీమ్గల్ పోతుగల్ మొదలైన గ్రామ నామాల్లోని కళ్ళు శబ్దం కన్నడ భాషా పదమే.

తెలంగాణ ప్రాంతంలో ప్రజలు గౌరవంలో గాని బహువచనార్థంలో కానీ రండ్రి, పొండ్రి, చేయుండ్రి, చూడుండ్రి అని రకారయుక్తంగా పలుకుతారు. ఇలా పలకడంపై కన్నడ భాషా ప్రభావం ఉందని బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ పేర్కొన్నారు.31 ఇదే అర్థం కన్నడంలో బన్ఱి, హోగ్రి, మాడ్రి అనే ఉపయోగిస్తారు. కన్నడ భాషా ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉందని పై పదాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తెలుగులో ప్రేరణర్థకంగా ఇంచు కాగమం ఉపయోగిస్తే కన్నడంలో ఇసుకాగమం ఉపయోగిస్తారు. నిజామాబాద్ జిల్లా సమీప గ్రామాల్లో సహించు అనే అర్థంలో సైసు అని పలుకుతారు. ఇది కూడా కన్నడ భాషా ప్రభావమే.32 తద్ధర్మార్థక భావార్థం తెలంగాణలో చేసుడు, చూసుడు, వచ్చుడు మొదలైన రూపాల్లో వ్యవహరింపబడుతూ ఉంది. కన్నడంలో ఈ భావార్థం మాడువుదు, బరువుదు మొదలైన రూపాల్లో వ్యవహరింపబడుతూ ఉంది. కన్నడంలో ఉన్న పదాంత దువర్ణం తెలంగాణలో కనిపించే డువర్ణం ఒక్కటే.

4. సాహిత్య విశేషాలు

ప్రతి భాష ఇరుగుపొరుగు భాషల ప్రభావానికి లోను కావడం అతి సహజం. అందులోనూ ఒకే రాజ్యాధికారానికి లోబడి ఉన్న రెండు భాషలలోని సాహిత్యంలో అనుకరణలు అనువాదాలు మొదలైనవి కనిపిస్తాయి. ఈ విధంగా పరిశీలించినప్పుడు తెలుగు కన్నడ భాషలలోని సాహిత్యం పరస్పరం ఆదాన ప్రదానాలను కలిగి ఉన్నది. సాహిత్య రచనల ప్రారంభం కాలం నుంచి ఈ రెండు భాషల సాహిత్య అనుబంధం అన్యోన్యంగా కొనసాగుతూ వస్తున్నది.  క్రీ. శ. 848-892 మధ్యకాలంలో వేంగీ రాజ్యాన్ని పాలించిన గుణగ విజయాదిత్యుడు వేయించిన శాసనంలో సంస్కృత వృత్తమైన చంపకమాల పద్యం కనిపిస్తుంది. ఈ కాలం వరకు తెలుగులో చంపకమాలవృత్తం ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. అలాగే సంస్కృత భాషా సాహిత్యంలోనూ చంపకమాల ఛందస్సు విస్తృతంగా ఉపయోగించిన దాఖలాలు లేవు. అందువల్ల గుణగ విజయాదిత్య శాసనంలో  చంపకమాలవృత్తం కనిపించడానికి కారణం కన్నడ  ప్రభావమే అని  పరిశోధకుల అభిప్రాయం.33

కన్నడ ఆదికవి పంపకవి కాలంలో ఈ రెండు భాషా సాహిత్యాలు అతి సన్నిహితంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు  పరిపాలించారు. ఆ రోజుల్లో తెలుగు కన్నడ భాషా సాహిత్యాలు రెండింటిని వారు పోషించారు. దీనికి ఉదాహరణగా జినవల్లభుని కురిక్యాల శాసనం (క్రీ.శ. 940) చెప్పుకోవచ్చు. ఈ కురిక్యాల శాసనంలో సంస్కృత భాషతో పాటు తెలుగు కన్నడ భాషలకు చెందిన పద్యాలు ఉన్నాయి. కన్నడ భాషలో చంపకమాల పద్యాలు ఉండగా, తెలుగులో కంద పద్యాలు ఉన్నాయి. అవి

జిన భవనంబు లెత్తించుట
జిన పూజల్సేయు చున్కి జినమునులకు న
త్తిన యన్న దానం బీవుట
జిన వల్లభు బోలంగలరె  జిన ధమ్మపరుల్‌ (1)

దిన కరు సరి వెల్గుదు మని
జినవల్లభు నొట్ట నెత్తు జితకవి నననుం
మనుజు ల్గలరే ధాత్రిం
విని తిచ్చిదు ననియ వృత్త విబుధ కవీంద్రుల్  (2)


ఒక్కొక్కొ గుణంబ కల్గుదు
రొక్కొణ్డిగా కొక్క లక్క లేవెవ్వరికిం
లెక్కింప నొక్కొ లక్కకు
మిక్కిలి గుణ పక్షపాతి గుణమణి గణంబుల్‌ (3) 34

ఇది తెలుగులో వెలువడిన తొలి కందపద్య శాసనం. ఈ శాసనాన్ని వేసిన జినవల్లభుని సోదరుడు కన్నడ ఆదికవి పంపడు. ఈయన రచించిన విక్రమార్జునవిజయంలో నాలుగు కంద పద్యాలు ఉన్నాయి. ఈ ఆధారాలను అనుసరించి తెలుగు కందపద్యం కన్నడ నుంచి వచ్చిందని పరిశోధకులు మలయశ్రీ తెలిపారు.35 పై పద్యాలలోని మూడవ పద్యంలో యతినియమం లేదు. అందుకు కారణం జినవల్లభుడు కన్నడ కవి, తెలుగులో రచన కొత్త అని మలయశ్రీ భావించారు.36 సంకల్పమో, స్ఖాలిత్యమో  తెలియదు కానీ, తెలుగులో కంద పద్యాలు ఆవిర్భావం పై కన్నడ ప్రభావం అధికంగా ఉందని చెప్పవచ్చు.

తెలుగు కన్నడ సాహిత్యల పరస్పర ప్రభావం 11వ శతాబ్దంలోనే ఉన్నదని తెలుస్తుంది.  కన్నడ ఆదికవి పంపకవి ప్రభావం తెలుగులో నన్నయ పై అధికంగా ఉన్నది. పంపకవి రచించిన విక్రమార్జున విజయం అనే భారతం వల్ల నన్నయ ప్రభావితులై ఉంటాడు.39  నన్నయ నారాయణ భట్టు సహవాసం ఆనాటి రాజాస్థానాలు భాషా సాహిత్యాలను అనుసరించి నన్నయ కూడా కన్నడ భాషా సాహిత్యల పరిచయం ఉండి ఉంటుంది.

కరీంనగర్ ప్రాంతానికి చెందిన మడికి సింగన (1420) సంకలనం చేసిన సకలనీతి సమ్మతం లో పేర్కొన్న కవులలో గజాంకుశ కవి పేరు కూడా ఉంది. గజాంకుశ కవి క్రీ.శ. 1000 ప్రాంతం వాడని కన్నడ సాహిత్య చరిత్ర వల్ల తెలుస్తుంది.40  శ్రీధరాచార్యుడు నయసేనుడు దుర్గసింహుడు మొదలైన కన్నడ కవులు ఈ కవిని ప్రస్తుతించారు.41 కానీ ఈ కవి తెలుగులోనూ, కన్నడంలోనూ రచించిన గ్రంథాలు లభించలేదు. మడికి సింగన అవతారికలో పేర్కొన్న భోజరాజు తెలుగుతోపాటు కన్నడంలో కూడా కవిత్వం చెప్పినట్లు తెలుస్తుంది.42

తెలుగులో వెలువడిన తొలి ఛందోగ్రంధం మల్లియ రేచన రచించిన కవిజనాశ్రయం. ఈ కవి జినవల్లభుని ప్రాణ మిత్రుడు ఇదే సమయంలో కన్నడంలో ఛందోంబుధి  అనే చందో గ్రంధాన్ని మొదటి నాగ వర్మ రచించాడు. కన్నడ ఛందోంబుధి ప్రభావమే కవిజనాశ్రయంపై ఉందని కన్నడ విద్వాంసుల అభిప్రాయం. ఇద్దరు కూడా ఒకే కాలంలో ఉన్నందున, ఒకే కాలంలో రచనలు చేసినందున ఎవరి ప్రభావం ఎవరి మీద ఉన్నదో తెలియదు. కానీ, మొత్తానికి రెండు భాషల గ్రంథాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది. కేతన రచించిన ఆంధ్ర భాషా భూషణం, విజ్ఞానేశ్వరీయంపై కన్నడ భాషలోని కర్ణాటక భాషాభూషణం, మితాక్షర గ్రంథాల ప్రభావం ఉంది.   కర్ణాటక భాషా భూషణం పేరుకు సమానంగా ఆంధ్ర భాషా భూషణం అని పేరు పెట్టడంలోని ఆ ప్రభావాన్ని గుర్తించవచ్చు.44 అలాగే కేతన రచించిన దశకుమార చరిత్ర ప్రభావం కన్నడ  చౌండరసకవి (1300) రచించిన అభినవ దశకుమార చరితె మీద ఉందని తెలుస్తుంది.45

12వ శతాబ్దంలో విస్తృత ప్రచారంలోకి వచ్చిన వీరశైవ మత ప్రభావం తెలుగు కన్నడ రచనల్లో ప్రగాఢంగా కనిపిస్తుంది. శివశరణులు  అనేకులు తెలుగు కన్నడ భాషలు రెండింటిలో రచనలు చేశారు. మల్లికార్జున పండితుడు, శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, నన్నెచోడుడు, పాలకుర్కి సోమనాథుడు మొదలైన వారు తెలుగు శివకవులలో ముఖ్యులు. వీరిలో కొందరి పేర కన్నడంలో వచనాలు రాయబడి ఉన్నాయి.46 మల్లికార్జున పండితులు తెలుగులో తాను రచించిన శివతత్వసారమును స్వయంగా కన్నడంలోకి అనువదించాడు. కన్నడంలోని జాణ్ణుడిగళు మార్గ, దేశి మొదలైన కవిత్వపు తీరులు నన్నెచోడుని కుమార సంభవంలో కనిపిస్తుంటాయి. నన్నెచోడుడు పేర్కొన్న జాను తెనుగు కన్నడంలోని జాణ్ణుడిగళ ప్రభావమే. ఇటు తెలుగులోనూ, అటు కన్నడంలోనూ లబ్ధ ప్రతిష్టుడైన కవి పాల్కురికి సోమన. ఈయన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర మొదలైన తెలుగు గ్రంథాలే కాకుండా సద్గురు రగళె, చిన్న బసవరగళె, గంగోత్పత్తి రగళె, శీల సంపాదనె, గణ సహస్రనామ, పంచరత్న మొదలైన కృతులను కన్నడంలో రచించారు. ఇవన్నీ స్తోత్ర పూర్వకమైన రచనలే సోమన తెలుగులో రచించిన బసవపురాణాన్ని భీమకవి (1369), పండితారాధ్య చరిత్రను ఆరాధ్య చరితె అనే పేరుతో నీలకంఠాచార్య (1485) కన్నడలోకి అనువదించారు.47 శివశరణుడు అయిన అల్లమ ప్రభువు గూర్చి చామరసకవి కన్నడంలో 'ప్రభులింగలీలె కావ్యాన్ని రచించాడు. ఈ కావ్య ప్రేరణతో పిడపర్తి సోమనాధుడు తెలుగులో 'ప్రభులింగలీల' అనే పేరుతో ద్విపద కావ్యాన్ని రచించాడు.48 దీనిననుసరించి పిడపర్తి రెండవ బసవకవి పద్యకావ్యాన్ని రచించాడు.49 కన్నడంలో కెరెయ పద్మరసు రచించిన 'దీక్షాబోధ' కృతిని పిడపర్తి బసవన 'వీరశైవదీక్షా బోధ' అనే పేరుతో తెలుగులో రచించాడు.

మహావీరాచార్యుడు రచించిన గణితసార సంగ్రహాన్ని పావులూరి మల్లన తెలుగులోకి అనువదించాడు.50 ఈ అనువాద రచనపై కన్నడరాజు ఆదిత్యుని గణితప్రభావమున్నదని విమర్శకులు అభిప్రాయపడ్డారు.51 అత్తలూరి పాపయామాత్యుడు (1650-1700) తెలుగులో కన్నడ శివశరణుడైన చెన్నబసవన్నను గూర్చి 'చెన్నబసవపురాణము' అనేపేరుతో చంపూకావ్యాన్ని రచించాడు. ఈ రచనకు ముందుగానే కన్నడంలో వార్ధక పట్పదిలో విరూపాక్ష పండితుడు (1584) చెన్నబసవపురాణాన్ని వెలువరించాడు. ఈ కవి ప్రభావం పాపయామాత్యునిపై ఉంది. 1530-80 మధ్యకాలంలో జీవించిన సిద్ధరామకవి తెలుగులో 'ప్రభుదేవర వాక్యం'52 అనే వచన గ్రంథాన్ని రచించాడు. శివశరణుడైన అల్లమప్రభువు ఉపదేశాలే ఈ గ్రంథంలో చోటు చేసుకొన్నాయి. 12వ శతాబ్దంలో కర్ణాటకలోఉన్న అనేక శివశరణులను గూర్చి కన్నడ కవుల కంటె తెలుగు కవులే ఎక్కువగా కావ్యాలు రచించారనే విషయం ప్రత్యేకంగా గమనించదగింది.53 అనగా తెలుగు - కన్నడ సమాజం పరస్పరం సమ్మిశ్రితమై ఉన్నదని తెలుస్తుంది. కన్నడంలో 'జీవంధర చరిత్ర'ను రచించిన భాస్కరకవి పెనుగొండలోను,54 ‘సమయపరీక్ష' 'త్రైలోక్య చూడామణి స్తోత్రం' రచించిన బ్రహ్మశివకవి హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరువులోను నివసించేవారు.55 ప్రసిద్ధ కన్నడ కవి రాఘవాంకుడు (1195) రచించిన 'హరిశ్చంద్ర' కావ్య ప్రభావం గౌరన తెలుగులో రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంపై ఉన్నదని విద్వాంసుల అభిప్రాయంగా శ్రీనివాస పేర్కొన్నారు.56

కర్ణాటక సంగీత త్రయంలో ఒక్కరైన వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన కీర్తనలపై కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసు ప్రభావం ఉన్నది. అలాగే ఈ పురందరదాసుపై ఆంధ్రపదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని ప్రభావం దండిగా ఉన్నది. కన్నడ సాహిత్యంలో దాసవాజ్మయానికి విశిష్టమైన గౌరవం ఉన్నది. ద్వైత మతస్థాపకుడు మధ్వాచార్యుల శిష్యుడైన నరహరి తీర్థులతో ప్రారంభమైన దాససాహిత్యం పురందర దాసుతో పరమోత్కృష్టతను పొందింది. తెలుగువారికి త్యాగరాజు ఎలాంటివాడో కన్నడిగులకు పురందరదాసు అలాంటివాడు. పురందరదాసు గురువైన వ్యాసరాయల కాలంలోనే తెలుగు అన్నమయ్య కీర్తి పొందారు. పురందరదాసుకు అన్నమయ్యపై గౌరవభావాలు ఉన్నాయి. అందుకే అన్నమయ్య కీర్తనల్లోని ఎన్నో పదాలు పురందరదాసు కీర్తనల్లో చోటుచేసుకొన్నాయి.57 పురందరదాసు ప్రభావం త్యాగరాజుపై విశేషంగా ఉంది. పురందరదాసు కర్ణాటక సంగీతాభ్యాసానికి చక్కని ప్రణాళిక ఏర్పరచి, దక్షిణ భారతదేశంలో చిరస్మరణీయుడయ్యాడు. 58

బెంగుళూరు నగర నివాసి అయిన కెంపేగౌడ తెలుగులో 'గంగాగౌరీ విలాసము' అనే యక్షగానాన్ని రచించాడు. మైసూరు రాజు ఆస్థానంలో ఉన్న వీరరాజు తెలుగు వచనంలో మహాభారతాన్ని రచించాడు. "చిక్కదేవరాయ విలాసం" అనే యక్షగానాన్ని తెలుగులో రచించారు. వీరరాజు కుమారుడైన సంజరాజు 'హాలాస్య మహాత్మ్యం' అనే గ్రంథాన్ని తెలుగు కన్నడభాషలు రెండింటిలోను రచించారు. మైసూరు రాజులు కూడా కన్నడంతో పాటు తెలుగు సాహిత్యరచనలకు ప్రోత్సాహమిచ్చారని తెలుస్తున్నది.

విజయనగర చక్రవర్తులు తెలుగు కన్నడ భాషా సాహిత్యాలను అభిమానించారు. ఆదరించారు. వీరు ఆస్థానంలోని కవి పండితులందరు తెలుగు కన్నడాలు రెండింటిని అధ్యయనం చేసి ఉంటారు. అల్లసాని పెద్దనాది ప్రబంధ కవులపైన కన్నడ సాహిత్యప్రభావం ఉన్నట్లు పుట్టపర్తి నారాయణాచార్యులు పేర్కొన్నారు.59 పెద్దన మనుచరిత్రలో పంపకవి భారత భావనలున్నాయి. పెద్దన కవీంద్రుని సుప్రసిద్ధమైన "నిరుపహతి స్థలంబు" పద్యానికి మాతృక కన్నడభాషలోనిదే. కన్నడంలో రుద్రభట్టు రచించిన 'జగన్నాథ విజయం'లోని 'పారిజాతాపహరణ' ఘట్టమే నంది తిమ్మనకు ప్రేరణ కలిగించింది. ఆ ప్రేరణయే పారిజాతాపహరణ కావ్య ప్రబంధంగా రూపుదిద్దుకొంది.

సంఘంలోని మూఢాచారాలను విమర్శిస్తూ, ప్రజలలో చైతన్యభావాలను పురికొల్పించిన తెలుగు, కన్నడ కవులలో వేమన, సర్వజ్ఞుడు పేర్కొనదగినవారు. ఆ ఇద్దరిదీ ఒకేరకమైన ప్రవృత్తిగల జీవితం. ఇద్దరూ ఒకే కాలంలో ఉన్నారో లేదో తెలియదు. వీరి కాలం స్పష్టంగా నిర్ణయం కాలేదు.60 వీరిద్దరిలో ఎవరి ప్రభావం ఎవరిమీద ఉందో లేదో తెలియదు కాని ఇద్దరి రచనల్లోను సన్నిహితమైన పోలికలు చాలా ఉన్నాయి. సర్వజ్ఞుడు ‘’త్రిపది” ఛందస్సులో రచించాడు. వేమన ఆటవెలది పద్యంలోని చివరి మకుటం తొలగిస్తే త్రిపదియే కదా! వేమన పద్యాల్లో వేమన పేర ఎవరో చెప్పినట్లుగానే ఇతరులెందరో సర్వజ్ఞ మకుటంతో పద్యాలను చేర్చారు. "తెలుగువారికి వేమన ఎట్టివాడో కర్ణాటకాదులకు సర్వజ్ఞుడట్టివాడు."61 కలుగోడు అశ్వత్థరావు సర్వజ్ఞుని వచనాలను తెలుగులోకి, వేమన పద్యాలను కన్నడంలోకి అనువదించారు. వేమన పద్యాలను మరొకరు భీమరాజు కూడా కన్నడంలోకి అనువదించారు.

వేమన సర్వజ్ఞుల పద్యాలలో కొన్ని ఒకేరకమైన భావాలతో వ్యక్తీకరించడం విశేషం.

"కల్లుప్పు కర్పురపు సొల్లెరడు ధాతొందు
ఖ్ఖుల నొళ్లిదన రూపొందు, గుణదొళగె
ఎల్ల అంతరపు సర్వజ్ఞ"

(ఉప్పు కర్పూరం రెండు ఒకే ధాతువులై ఉన్నాయి. గుణాలలో మాత్రం అంతా భేదమే) ఇదే భావాన్ని వేమన- "ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా!" అనే పద్యంలో చెప్పాడు.62

ఇలా సామాన్యమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకుని రచింపబడినట్లున్నాయని రాళ్ళపల్లి పేర్కొన్నారు.63 కాని వీరి కాలం సరిగా నిర్ణయింపబడక పోవడం వల్ల ఎవరి ప్రభావం ఎవరిమీద ఉందో స్పష్టంగా తెలుపలేము. ఏది ఏమైనా ఆనాడు వేమన పద్యాలు కన్నడసీమలో, సర్వజ్ఞుని వచనాలు తెలుగునాట ప్రచారంలో ఉండవచ్చు.

ఆదికవి పంపకవి రచించిన భారతం జైనమత ధర్మానుసారం రచింపబడింది. ఇందులో వ్యాస ప్రబోధితమైన వైదిక మత ధర్మాలు ప్రవచింపబడలేదు. 16వ శతాబ్దానికి చెందిన కుమారవ్యాసుడు వైదిక మత ధర్మానుసారంగా కన్నడంలో మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. పదిపర్వాలు రచించి కాలధర్మం చెందాడు. మిగిలిన భాగాన్ని కృష్ణదేవరాయల ఆస్థాన కవి అయిన తిమ్మణ్ణకవి (నందితిమ్మన కాదు) పూర్తిచేసాడు. రాయల కోరికపైన తిమ్మన్న భారత రచన చేపట్టాడు. తిక్కనపై విశేష గౌరవాభిమానాలు కలిగిన తిమ్మణ్ణ కన్నడ భారత రచనపై తిక్కన ప్రభావం ఉంది.64 ఈ భారతం గదుగ భారతం పేరిట కన్నడనాట విస్తృతమైన ప్రచారాన్ని, ప్రశస్తిని పొందింది.

కృష్ణరాయల అనంతరం విజయనగర పాలకులైన అళియరామరాయలు, తిరుమలదేవరాయలు మొదలైనవారు కూడా పూర్వీకుల వలె తెలుగు కన్నడ భాషా సాహిత్యాలను సమాదరించారు. అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, జక్కన మొదలైన కవులు తమ కావ్యాల్లో కన్నడ చక్రవర్తులను కొనియాడారు.

ప్రాచీన తెలుగు కన్నడ సాహిత్యాలను పరిశీలించి చూడగా ఆ రెండు భాషల్లో సాహిత్యం పరస్పరం ప్రేరణ కలిగించాయి. యథాతథానువాదాలు కాకుండా అనుకరణలు వెలువడ్డాయి. ఆధునిక కాలంలో పెరిగిన సమాచార విజ్ఞాన విప్లవాల ఫలితంగా పరస్పర అనువాదాలు పెరిగాయి.

తెలుగు కన్నడ సాహిత్యాలు రెండింటిలోను లబ్ధప్రతిష్టులైన ఆధునికులలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణచార్యులు మొదలైనవారు పేర్కొనదగినవారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తెలుగులో రచించిన "సారస్వతాలోకము"ను "సాహిత్యమత్తుజీవనకలె" అనే పేరుతో, సంగీత సంబంధమైన వ్యాసాలను "గానకతె" పేరుతో స్వయంగా కన్నడంలోకి రచించారు. కన్నడంలో చక్కని చిక్కని వచనశైలికి శర్మగారి గద్యం బాట ఏర్పరిచిందని, వీరి సుందరశైలి ప్రభావం సిద్ధపహళ్లి కృష్ణశర్మ వంటివారిపై ఉందని విమర్శకులు తెలిపారు.65

ఆంధ్రనాటక పితామహుడిగా సుప్రసిద్ధులైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగుతో పాటు కన్నడంలోను నాటక రచనలు చేసారు. వీరు తెలుగులో రచించిన 'ఉషాకళ్యాణాన్ని' కన్నడంలో 'స్వప్నానిరుద్ధ'గాను, 'వామనచరిత్ర'ను 'ఉపేంద్రవిజయం'గాను. రచించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు మరియు బళ్ళారి రాఘవ వీరిద్దరు తెలుగు కన్నడ నాటకరంగాలను ఎంతగానో ప్రభావితం చేసారు.

5. జానపద సాహిత్య విశేషాలు

శిష్ట సాహిత్యంలోనే కాకుండా ఈ రెండు భాషలకు సంబంధించిన జానపద సాహిత్యంలోను సన్నిహితమైన పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండు భాషల్లోని పాటలు దేశీయ గణాలను కలిగి ఉంటాయి. గణవిభజన చేయడం కష్టమే అయినా పాటలలోని రాగఛాయను, నడకను, తీవ్రతను అనుసరించి రెండింటిలో సారూప్యాన్ని గుర్తించవచ్చు.

తెలుగు జానపదుల్లో సుప్రసిద్ధమైన 'శివశివమూర్తివి గణనాథ! నీవు శివుని కుమారుడవు గణనాథ! అనే గీతం వలెనే కన్నడంలోను 'శరణు శరుణవయ్య గణనాయ్క’ అనే గణపతి ప్రార్ధన ఉంది. రెండు పాటలు ఒకే విధమైన రాగతాళాలతో గానం చేయబడడం విశేషం. ఈవిధంగా రాగ తాళలయాదులను అనుసరించి రెండు భాషల్లోను సమానమైన గేయాలను అనేకంగా గుర్తించవచ్చు, ఇవి ఏ భాషనుంచి ఏ భాషలోకి వెళ్ళాయో చెప్పలేము. చారిత్రకంగా సాంస్కృతికంగా ఉండే సన్నిహిత బాంధవ్యమే ఈ రెండు భాషల్లోను ఒకే రకమైన గేయాలు వెలువడడానికి కారణమయి ఉంటుందని ఆర్.వి.యస్. సుందరం పేర్కొన్నారు.66 తెలుగులో సుప్రసిద్ధమైన 'ఊర్మిళాదేవి నిద్ర', 'లక్ష్మణదేవర నవ్వు' వంటి జానపద కథాగేయాలు, కన్నడంలోను సుప్రసిద్ధమై ఉన్నాయి. జానపద కథలను అనుసరించి ప్రచారంలో ఉన్న తెనాలిరామలింగడు' కథలు, 'పరమానందయ్య శిష్యుల కథలు' కన్నడ ప్రాంతంలోను విస్తృత ప్రచారంలో ఉన్నాయి. కథలే కాకుండా సమానార్థకంగా కనిపించే సామెతలు కూడా ఉన్నాయి.

తెలు: నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
కన్న: బాయి బళ్ళెదాదరె ఊరు బళ్ళెదు
తెలు: ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.
కన్న : ఊరు హోగు అంతదే కాడు బా అంతదే.67

యక్షగానకళాప్రదర్శనలో కూడా సమానమైన కథాంశాలే రెండు ప్రాంతాల్లో ప్రదర్శింపబడడం విశేషం. కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, మైరావణ బభ్రువాహన మొదలైన కథాంశాల యక్షగానాలు రెండు ప్రాంతాల్లోను ఉన్నాయి.

6. ఉపసంహారం

 

  • తెలుగు, కన్నడ ప్రాంతాలు ఇరుగుపొరుగునే ఉండడం. 
  • రెండు ప్రాంతాల వారు పరస్పరం రెండు ప్రాంతాలను పరిపాలించడం, ఒకే రాజు ఆధిపత్యంలో ఉండడం. 
  • ఆ రాజు తెలుగు కన్నడ భాషలను సమానంగా ఆదరించడం, రెండు భాషలకు ఒకేరకమైన లిపి గలిగి ఉండడం, మత ప్రచారాలు, ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు ఇరువురికి ఒకే విధంగా ఉన్న కారణంగా సాహిత్యంలోను పరస్పర సంబంధ బాంధవ్యాలు కొనసాగాయి. 
  • తెలుగు శాసన పద్యాలు, ఆదికవి నన్నయ భారతం, శివకవుల సాహిత్యం మరియు శివకవుల పేర్కొన్న జాను తెనుగు పదం, కేతనాది కవుల సాహిత్యం, పెద్దనాది ప్రబంధ కవుల ప్రబంధ సాహిత్యం పై కన్నడ సాహిత్య ప్రభావం కనిపిస్తుంది.·       
  • కన్నడ శివశరణుల సాహిత్యం పై తెలుగు శివ కవుల ప్రభావం, తిమ్మణ్ణ కవి 'గదుగభారతం'పై తిక్కన భారత రచన ప్రభావం, సర్వజ్ఞ త్రిపదుల పై వేమన ఆటవెలదుల ప్రభావం దండిగా ఉంది.
  • కర్ణాటక సంగీత త్రయంలో శిఖరాయమానుడైన త్యాగరాజు పై త్యాగరాజ కీర్తనలపై కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు ప్రభావం, పురందరదాసు కీర్తనలపై ఆంధ్ర పద కవితా పితామహుడు అన్నమాచార్య కీర్తనల ప్రభావం కనిపిస్తుంది. 
  • ఈ పరస్పర ప్రభావాలు పరంపరగా ఆధునిక సాహిత్య ప్రక్రియలోనూ ఉన్నాయి.
  •  తెలుగు కన్నడ భాష మరియు సాహిత్యాల పరిచయం, ప్రవేశం, అభిరుచి కలిగిన పరిశోధకులు ఆధునిక సాహిత్యంలోనూ సూక్ష్మ పరిశోధనలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల పరస్పర ప్రభావాల విషయాలు వెలుగులోకి వస్తాయి.
  • వ్యాసం నిడివి మరియు విషయ సేకరణ ప్రధాన కారణంగా ఆధునిక సాహిత్య విషయాలను గూర్చి ప్రస్తావించలేకపోయాను. ఇది నాకు ఒక రకంగా పరిమితిగా ఏర్పడింది.
  • లోతైన పరిశోధన కోసం వివిధ సాహిత్య ప్రక్రియల్లో కాకుండా ఒకే ప్రక్రియలో వెలువడిన వివిధ రచనలపై పరిశీలన చేసే విధంగా పరిమితులు ఏర్పరచు కోవాల్సి ఉంటుంది. 
  • రెండు భాషల సాహిత్యంలో కృషి చేసిన పరిశోధకులు చాలా అరుదుగా ఉన్నారు. ఇది విషయ సేకరణలో ఆటంకంగా కనిపిస్తుంది. విశ్వవిద్యాలయాలు గ్రంథాలయాలు, సాహిత్య పరిషత్ కార్యాలయాలు సందర్శించడంలో చెప్పుకోదగ్గ సాధకబాధకాలు ఉండవు.
  • రెండు భాషల సాహిత్యాలు పరస్పర ఆదానప్రదానాలతో ఈ సంబంధ బాంధవ్యాలు మరింత పరిపుష్టమైనాయని చెప్పవచ్చు. 

 

7. పాదసూచికలు

  1. బహమనీ సుల్తానులు, తెలుగువాణి, రామానుజరావు దేవులపల్లి, పుట : 38
  2. ఆంధ్ర, తమిళ, కన్నడ త్రిభాషా నిఘంటువు, ఉపోద్ఘాతము, వెంకటరాయశాస్త్రి వేదం, పుట 12
  3. ఎపిగ్రాఫిక్ఇండియా: viii పుట:43,(గంటిజోగి సోమయాజి ఆంధ్రభాషా వికాసము, పుట:14లో ఉటంకితం)
  4. ఆంధ్రభాషా వికాసము, సోమయాజి గంటిజోగి, పుట : 14
  5. కవిరాజ మార్గమత్తు కన్నడ జగత్తు సుబ్బణ్ణ కె. వి, పుట : 12
  6. ఆంధ్రభాషా వికాసము, సోమయాజి గంటిజోగి, పుట: 37
  7. దక్షిణ భారత సాహిత్యములు, రామకృష్ణశర్మ గడియారం, పుట 62
  8. ముంగిలి, నారాయణరెడ్డి డా. సుంకిరెడ్డి, పుట : 45
  9. ఆంధ్రులసాంఘిక చరిత్ర, ప్రతాపరెడ్డి సురవరం, పుట: 5-12
  10. ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి, లక్ష్మీరంజనం ఖండవల్లి, పుట: 268
  11. ముంగిలి, నారాయణరెడ్డి డా. సుంకిరెడ్డి,పుట: 102
  12. ఆంధ్రులసాంఘిక చరిత్ర, ప్రతాపరెడ్డి సురవరం, పుట: 15
  13. అదే: 46
  14. అదే: 47
  15. ఆంధ్ర యోగులు (ప్రథమభాగము), రామరాజు బి, పుట: 2-5
  16. బహమనీ సుల్తానులు, తెలుగువాణి, రామానుజరావు దేవులపల్లి, పుట: 40
  17. హైదరాబాదు కర్ణాటక హాడు- పాడు, అమరేశ నుగడోణె, పుట: 20
  18. ఆంధ్రులసాంఘిక చరిత్ర, ప్రతాపరెడ్డి సురవరం, పుట: 303
  19. బహమనీ సుల్తానులు, తెలుగువాణి, రామానుజరావు దేవులపల్లి, పుట: 30
  20. హైదరాబాదు స్వాతంత్రోద్యము చరిత్ర, మాణిక్యరావు వెల్దుర్తి, పుట: 206
  21. అదే: 328
  22. అదే పుట: 343
  23. అన్యభాషగళమేలె కన్నడద ప్రభావ, లక్ష్మీనారాయణ ఎస్. అరోరా,  పుట : 14
  24. ఆంధ్ర తమిళ, కన్నడ త్రిభాషా నిఘంటువు, వెంకటరాయశాస్త్రి, వేదం పుట:21
  25. లిపి పరిమాణం, తెలుగువాణి, రామచంద్ర తిరుమల, పుట: 88
  26. అదే: 85
  27. ఆంధ్ర తమిళ, కన్నడ త్రిభాషా నిఘంటువు, వెంకటరాయశాస్త్రి, వేదం పుట:21
  28. కన్నడసాహిత్య చరిత్ర, రం. శ్రీ . ముగళి,  పుట: 16
  29. ద్రావిడభాషల పరస్పర సంబంధం, తెలుగువాణి, రాధాకృష్ణశర్మ చల్లా, పుట:118
  30. అదే: 119
  31. బాణం (తెలంగాణ భాషావ్యాసాలు), భాస్కర్, డా. నలిమెల, పుట: 15
  32. అదే: 14
  33. అన్యభాషగళమేలె కన్నడద ప్రభావ, లక్ష్మీనారాయణ ఎస్. అరోరా,  పుట: 15
  34. కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర నుంచి ఉటంకితం, డా. మలయశ్రీ, పుట:7
  35. అదే: 8
  36. కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర, డా. మలయశ్రీ, పుట : 9
  37. అన్యభాషగళమేలె కన్నడద ప్రభావ, లక్ష్మీనారాయణ ఎస్. అరోరా,  పుట: 15
  38. తెలుగువారు-మతాలప్రభావం, తెలుగువాణి, గోపాలకృష్ణమూర్తి శ్రీపాద, పుట: 29
  39. ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి, లక్ష్మీ రంజనం ఖండవల్లి, వుట: 212
  40. కన్నడ సాహిత్య చరిత్ర రం. శ్రీ ముగళి,
  41. ప్రాజ్ఞన్నయ రచనలు, తెలుగువాణి, కోదండరామయ్య, తిమ్మావజ్ఞుల పుట: 147
  42. అదే: 147
  43. తెలుగు కన్నడ సాహిత్యాలలో పరస్పర అనువాదాలు, 'తెలుగువాణి' (1990), శ్రీనివాస, పుట: 5
  44. అదే, పుట: 5
  45. అదే, పుట: 5
  46. అన్యభాషగళమేలె కన్నడద ప్రభావ, లక్ష్మీనారాయణ ఎస్. అరోరా,  పుట: 17
  47. తెలుగుకన్నడ భాషల పరస్పర సంబంధం తెలుగువాణి, నారాయణాచార్యులు పుట్టపర్తి, పుట: 123
  48. అన్యభాషగళమేలె కన్నడద ప్రభావ, లక్ష్మీనారాయణ ఎస్. అరోరా,  పుట: 17
  49. ముంగిలి, నారాయణరెడ్డి డా. సుంకిరెడ్డి,పుట: 295
  50. ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి, లక్ష్మీ రంజనం ఖండవల్లి, వుట: 212
  51. అన్యభాషగళమేలె కన్నడద ప్రభావ, లక్ష్మీనారాయణ ఎస్. అరోరా,  పుట: 17
  52. ముంగిలి, నారాయణరెడ్డి డా. సుంకిరెడ్డి,పుట: 316
  53. తెలుగు కన్నడ సాహిత్యాలలో పరస్పర అనువాదాలు, 'తెలుగువాణి' (1990), శ్రీనివాస, పుట:6
  54. తెలుగుకన్నడ భాషల పరస్పర సంబంధం తెలుగువాణి, నారాయణాచార్యులు పుట్టపర్తి,  పుట: 124
  55. తెలుగుకన్నడ భాషల పరస్పర సంబంధం తెలుగువాణి, నారాయణాచార్యులు పుట్టపర్తి, పుట : 123
  56. తెలుగు కన్నడ సాహిత్యాలలో పరస్పర అనువాదాలు, 'తెలుగువాణి'  (1990), శ్రీనివాస, పుట:6
  57. తెలుగుకన్నడ భాషల పరస్పర సంబంధం తెలుగువాణి, నారాయణాచార్యులు పుట్టపర్తి,పుట: 124
  58. దక్షిణ భారత సాహిత్యములు, రామకృష్ణశర్మ గడియారం, పుట: 103
  59. తెలుగుకన్నడ భాషల పరస్పర సంబంధం తెలుగువాణి, నారాయణాచార్యులు పుట్టపర్తి, పుట: 123
  60. వేమన, అనంతకృష్ణశర్మ రాళ్ళపల్లి, పుట: 101
  61. దక్షిణ భారత సాహిత్యములు, రామకృష్ణశర్మ గడియారం, పుట: 108
  62. వేమన, అనంతకృష్ణశర్మ రాళ్ళపల్లి, పుట: 101
  63. అదే, పుట: 100
  64. తెలుగుకన్నడ భాషల పరస్పర సంబంధం తెలుగువాణి, నారాయణాచార్యులు పుట్టపర్తి, పుట : 124
  65. ఆధునిక కన్నడ సాహిత్యానికి తెలుగు వారిసేవ,తెలుగువాణి(1990), అశ్వత్థనారాయణ ఘట్టమరాజు,పుట : 2
  66. తెలుగు, కన్నడ జానపదసాహిత్యాలు,సారూప్యత, తెలుగువాణి,(1990)సుందరం ఆర్.వి.యస్, పుట: 3
  67. అదే, పుట: 4

8. ఉపయుక్తగ్రంథసూచి

  1. అనంత కృష్ణశర్మ, రాళ్లపల్లి, వేమన, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్
  2. నారాయణరెడ్డి, సుంకిరెడ్డి, ముంగిలి
  3. ప్రతాపరెడ్డి, సురవరం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఓరియంట్ లాఙ్మన్, 2007
  4. భాస్కర్, నలిమెల, బాణం-తెలంగాణ భాషావ్యాసాలు, తెలంగాణ రచయితల వేదిక 2008
  5. ముగళి, ఆర్.ఎస్, అనువాదం మహంతయ్య, కన్నడ సాహిత్యచరిత్ర సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ 1978
  6. రామకృష్ణ శర్మ, గడియారం, కన్నడ కవితా సౌరభం, యువభారతి, సికింద్రాబాద్, 1981
  7. రామానుజ రావు, దేవులపల్లి, 50 సంవత్సరాల జ్ఞాపకాలు, సాహితీ బంధు బృందం, చైతన్య సాహితి, వరంగల్, 1981
  8. లక్ష్మీరంజనం, ఖండవల్లి, బాలేందు శేఖరం, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, బాల సరస్వతి బుక్ డిపో, హైదరాబాద్, 1982
  9. వెంకటరాయ శాస్త్రి వేదము, సి.ఆర్ శర్మ, రామచంద్ర తిరుమల, ఆంధ్ర తమిళ కన్నడ త్రిభాషా నిఘంటువు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్,  1979
  10. వేంకట సత్యనారాయణ మూర్తి బులుసు, తెలుగు కన్నడ భారతముల తులనాత్మక పరిశీలనము, బులుసు హేమలత ప్రచురణ, రాజమండ్రి,1991
  11. తెలుగు వాణి, ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక హైదరాబాద్
  12. తెలుగు వాణి,మూడవ అఖిల భారత తెలుగు  మహాసభల ప్రత్యేక సంచిక బెంగళూరు, తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, 1990
  13. అమరేశ, నుగడోణె, హైదరాబాద్ కర్ణాటక హాడుపాడు, ప్రసారంగ, కన్నడ విశ్వవిద్యాలయ, హంపి 2003 (కన్నడ)
  14. లక్ష్మీనారాయణ, ఎస్ ఆరోరా, అన్యభాషెగళమేలె  కన్నడద ప్రభావ. ఐబీహెచ్ ప్రకాశన, బెంగళూరు, 1978 (కన్నడ)
  15. సుబ్బన్న కె.వి కవిరాజమార్గ మత్తు కన్నడ సాహిత్య, అక్షర ప్రకాశన, హెగ్గోడు, 2000 (కన్నడ)

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]