headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

6. కరోనా నేపథ్యకథలు: వస్తువైవిధ్యం

అప్పన్న ఇనపకుర్తి, డా. ఢిల్లీశ్వరరావు సనపల

పరిశోధకులు, తెలుగుశాఖ,
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం
ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9966338730, Email: appannainapakurthi@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.04.2025        ఎంపిక (D.O.A): 30.04.2025        ప్రచురణ (D.O.P): 01.05.2025


వ్యాససంగ్రహం:

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసిన విపత్కరసంఘటన. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం ఈ విపత్తును స్పందనాత్మకంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా తెలుగులో రచించబడిన చిన్నకథలలో మహమ్మారి నాటి జీవితానుభవాలు, మానవీయవిలువలు, బాధలు, మానసిక సంఘర్షణలు ఆవిష్కృతమయ్యాయి. ఈ వ్యాసంలో కోవిడ్ నేపథ్యంతో రచించబడిన ఆధునిక తెలుగు చిన్న కథలలో ప్రతిఫలించిన మానవీయ అంశాలు, కథావస్తువులు, సామాజిక దృష్టికోణాలను విశ్లేషించబడ్డాయి. శీరంశెట్టి కాంతారావు "కాలం నేర్పిన పాఠం", నమామి సుజనాదేవి "మనుషుల్లో దేవుడు", "దుఃఖనది" వంటి కథల ద్వారా సహానుభూతి, మానవీయ విలువల పునర్నిర్మాణం, వలసకూలీల కష్టాలు వంటి విషయాలు అధ్యయనం చేయబడ్డాయి. ఈ కథలు సమాజంలో చోటుచేసుకున్న మార్పులను ప్రతిబింబిస్తూ, కాలక్రమంలో తెలుగు సాహిత్యంలో మానవీయత భావన ఎలా పరిణామం చెందుతున్నదీ స్పష్టంగా చూపిస్తాయి. ఇటువంటి అసాధారణ పరిస్థితుల పట్ల సాహిత్యంలో చారిత్రాత్మక రచనలుగా కోవిడ్ కథలు నిలుస్తున్నాయని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

Keywords: కరోనా నేపథ్య కథలు, వలస కార్మికులు, సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు, లాక్ డౌన్, క్వారంటైన్, మాస్కులు, వర్క్ ఫ్రం హోం, మనస్సాక్షి, కరోనా కష్టాలు, కరోనా తెచ్చిన మార్పు.

1. ప్రవేశిక

కనీ వినీ ఎరుగని సందర్భం,అనూహ్యమైన విలయం. ఒక ఊరు ప్రాంతమే కాదు. పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మొత్తంగా ప్రపంచమే అతలాకుతలమైపోతున్న భయానక సంక్లిష్ట వాతావరణం.... అభద్రత.... సందిగ్ధత, సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ, మానవజాతి కకావికలమవుతూ, యుగయుగాల పరిణామంలో సంఘజీవిగా ప్రపంచమే ఒక గూటిలోకి ఒదిగిపోయిన ఈ జాతి ఒక్కసారిగా కుప్ప  కూలిపోయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య పరిస్థితుల్లో ఆకస్మాత్తుగా పెను మార్పులు సంభవించినాయి. దీనికి కారణం కరోనా వైరస్. సామాజిక పరిణామానికి సాక్షీభూతమైన సాహిత్యంలో కూడా సమకాలీన విషయాలును ప్రస్తావిస్తూ కోవిడ్ కాలపు నాటి పరిస్థితులు కథాసాహిత్యంలో ప్రతిబింబించిన అంశాలను ప్రస్తావించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

2. కరోనా నేపథ్య కథలు- వస్తు వైవిధ్యం

కరోనా కాలంలో కరోనా నేపథ్యంతో వచ్చిన కథలలో రచయితలు తనదైన శైలిలో వస్తు వివేచన చేస్తూ కథలను వెలువరించారు. ప్రధానంగా మానవ విలువలు, వలస జీవనము, భయానక సంఘటనలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిణామం వంటి వస్తువుతో కూడిన కథలు వెలుపడ్డాయి.

2.1 మానవ విలువలు

పరిస్థితులు మానవ సంబంధాలను విడదీయవచ్చు. కలుపవచ్చు కూడా. కరోనా కాలం మనిషి మానవత్వాన్ని అంచనా వేయగలిగిన ఓ కొలమానమైందని చెప్పవచ్చు. కొందరు కరోనా కాలాన్ని సొంత ప్రయోజనాలుగా మలుచుకుంటే, మరికొందరు మానవతా దృక్పథంతో ఇతరులకు సాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో డాక్టర్లు ,పోలీసులు, రైతులు, చదువు చెప్పే పంతుళ్లతో పాటు అసంఘటిత రంగకార్మికులు ఉన్నారు.కోవిడ్ నేపథ్యంతో మానవ విలువలకు సంబంధించిన కథలు అనేకం వెలబడ్డాయి.

వాటిలో శిరంశెట్టి కాంతారావు “కాలంనేర్పినపాఠం” కథలో-

అర్చకత్వపు వృత్తిని చేపడుతున్న ఆంజనేయ శాస్త్రి కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయినప్పుడు, ఆంజనేయ శాస్త్రిని ఆదుకున్న మార్వాడీలు మానవీయత ఉట్టిపడిన ఉదంతము గోచరిస్తుంది.ఆరోగ్యం బాగు లేని తన తండ్రికి వైద్యం చేయించడానికి డబ్బులు లేని స్థితిలో మార్వాడీలును ఆశ్రయించగా కుబేర్ లాల్, అతని కుమారుడు బన్వర్ లాల్ అరవై వేలు శాస్త్రి చేతికిచ్చి, మార్వాడి సేవా సదన్ వాళ్లు నడుపుతున్న హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించినప్పుడు “మనుషుల్లోని అసలు సిసలు స్వభావాలు బయటపడే సందర్భాలు ఎప్పుడో గాని ఎదురుగావంటూ శాస్త్రి ఆ తండ్రీకొడుకులు ఇద్దరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వెనుదిరిగాడు”. (కాలం నేర్పిన పాఠం-పుట-48).

మానవ విలువలకు మచ్చుతునకగా నిలిచిన మరో కథ నామని సుజనాదేవి రాసిన “మనుషుల్లో దేవుడు”.

ఈ కథలో వలస కార్మికులను ఆదుకోవడంలో కలెక్టర్ గారి ఉదార స్వభావం, మానవ విలువలకు మంచి ఉదాహరణగా నిలుస్తుంది. కరోనా మహమ్మారి ప్రభావానికి గురైన వలస కార్మికులు పట్టణాల నుండి సొంతూరు చేరుకోవడానికి ప్రయాణమై వెళ్ళినప్పుడు, రవాణా సౌకర్యాలు , భోజనాలు లేక చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇంటిల్లపాది నిప్పులు చెరిగె ఎండలో బతుకు బండల్ని భుజాలకెత్తుకొని ఆకలితో అలమటిస్తూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వారిని  అడ్డగించి  లాఠీ ఎత్తాడో పోలీసు, దాన్ని ఆపింది ఒక చేయి. అదే కలెక్టర్ ది. వాళ్లందరికీ భోజనం, రవాణా సౌకర్యం కల్పించి, గమ్యానికి సురక్షితంగా చేర్చే ఏర్పాట్లు చేసి “జేబు నుండి పాప పుట్టినరోజుకు బంగారం లాకెట్ కోసం డ్రా చేసిన డబ్బులు తీసి,కొన్ని లారీ డ్రైవర్ చేతికిచ్చి, రెండు పెద్ద నోట్లు చంటి పిల్లలతో ఉన్న జమిలీకి ఇచ్చాడు”. అప్పుడు వాళ్ళందరూ “అసలు మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా... అని  అందరూ చేతులెత్తి దండం పెట్టారు. జమిలీ సాష్టాంగ నమస్కారమే చేసింది.” (మనుషుల్లో దేవుడు-పుట-255).

ఈ కథలో కలెక్టర్ మానవీయత మరువనిది. అలాగే “గంపగుత్త” కథలో మానవ విలువలు పతనమైన పరిస్థితిని కంటికి కట్టినట్లు చెప్పారు రచయిత శిరంశెట్టి కాంతారావు. పల్లెలో ఒంటరిగానే జీవనం సాగిస్తున్న గుణమ్మ కరోనా సమయంలో పక్షవాతం బారిన పడి రాత్రి నిద్ర పోయి ఉదయం లేవలేదన్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఇండ్ల వాళ్లంతా ముఖాలకు మాస్కులు పెట్టుకుని పరిగెత్తుకొచ్చారు. వెంటనే హైదరాబాదులో ఉంటున్న గుణమ్మ బిడ్డ ధనమ్మకు లక్ష్మీనరసయ్య ఫోన్ చేసి గుణమ్మ విషయమంతా ఎరికిపరిచి ఎమ్మటే బయలుదేరి రా! అన్నప్పుడు ధనమ్మ “అమ్మో! హైదరాబాదు నిండా కరోనా కేసులు బాబాయ్! మీ అల్లునికి అసలే ఒంట్లో మంచిగలేదు. నాకు మోకాళ్ళ నొప్పులు, అడుగుదీసి అడుగెయ్యలేకపోతున్న. ఏదన్నజేసి మీరే ఎట్లనో గట్ల వైద్యం చేయించండి.”(గంపగుత్త-పుట-22) అనడంలో ధనమ్మ సొంత తల్లిని కూడా పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. కోవిడ్ కాలంలో మానవ విలువలు పతనానికి ఇదొక మచ్చుతునకగా  చెప్పవచ్చు.

2.2 వలస జీవనం

మానవ పరిణామ క్రమంలో వలస సహజం. కొంతమంది ఉన్న ఊర్లో ఉపాధి లేక పొట్ట చేత బట్టుకొని వలస బాట పడతారు. మరికొంతమంది మెరుగైన జీవితం కోసం, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడం ఒకరకంగా చైతన్యంలో భాగం.పల్లెల్లో ఉపాధి లేక తినడానికి తిండి లేక వలస వెళ్లేవారి సంఖ్యేఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా ప్రకోపం ప్రాభవం చూపుతున్న సందర్భంలో... వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి “ మూల్గే నక్క మీద తాటికాయ పడ్డట్టు”గా మారింది. ఈ సమయంలో వలస కార్మికులుకు తిండి,వసతి కరువై, సొంతూరుకు పోదామన్నా వాహన సౌకర్యం లేక వందలాది మైళ్ళ ప్రయాణానికి కాలినడకనే ఎంచుకోక తప్పలేదు. ఇటువంటి దృశ్యాలు కరోనా నేపథ్య కథలలో మెండుగా కనిపిస్తాయి.

ఉదాహరణకు డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ రాసిన “దుఃఖ నది” కథలో-

ఇంటి దగ్గర పిల్లలను, తల్లిని విడిచిపెట్టి హైదరాబాదు నుండి బొంబాయికి వలస వెళ్లిన నాగన్న శాంతమ్మ దంపతులు కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడం తో ఇంటి ముఖం పట్టిన వాళ్ళు నాలుగు రోజులుగా రోడ్డు మీద నడుస్తుంటే కాళ్లు బొబ్బలు ఎక్కి అవి పగిలి రక్తాలు కారుతున్నాయి. మధ్యరాత్రి అయ్యే సరికి తెలంగాణ సరిహద్దుకు చేరుకున్నారు. ఆకలి మంటలు తట్టుకోలేని నాగన్న చెమటలు పట్టి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. “ఏమయ్యా.. ఏమయ్యా! అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది శాంతమ్మ, శవాన్ని ఒడిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటు రోదించింది ఒంటరిగా”. (దుఃఖనది-పుట-51)

మార్గమధ్యంలో భర్తను కోల్పోయి, ఆకలి మంటలతో ఎదురుచూస్తున్న బిడ్డలకు నిస్తేజంగా కనిపించిన శాంతమ్మ పాత్రలో వలస కార్మికులను కరోనా రక్కసి బలిగొన్న తీరు కనిపిస్తుంది.

అలాగే “మనుషుల్లో దేవుడు” కథలో-

రచయిత్రి నామని సుజనాదేవి వలస జీవన విధానాన్ని కంటికి కట్టినట్లుగా చిత్రీకరించారు.నెత్తిన మూట, కడుపులో బిడ్డ, చంకలో బిడ్డ, వేలు పట్టుకున్న మరో కొడుకుతో.. దారి బత్తెం లేక ఆకలి దప్పులతో, శక్తికి మించిన నడకతో, క్వారంటైన్ జీవితం గడుపుతూ,గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు మధ్యలో అడ్డగించి, కరోనా సమయంలో బయటకు వెళ్ళకూడదని తెలియదా అంటూ కొట్టడానికి లాఠీ ఎత్తినప్పుడు“సారుకనికరించండిసారు... చిన్నపిల్లలు సారు.. కడుపు కాలుతున్నా నడుస్తున్నామంటే అర్థం చేసుకోండి సారూ.. మమ్మల్ని పోనీయండి సారూ.. బతికుంటే మా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తాం సారూ..”(మనుషుల్లో దేవుడు-పుట-254). ఇలా హృదయవిదారక కన్నీటి దృశ్యాలు అగుపిస్తాయి.

2.3 భయానక సంఘటనలు

వరదలు, ఉప్పెనలు, తుఫానులు, వ్యాధులు, కరువు కాటకాలు వంటి ఉపద్రవాలు మానవజాతి మొత్తం మీద ఒకసారి కాకుండా కొన్ని ప్రాంతాలను, దేశాలను ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని ఉపద్రవాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితం మీద దాడి చేస్తాయి. అలా చేసిన మహమ్మారి కరోనా.సమస్త మానవాళిని ఎన్నో భయానక సంఘటనలకు గురిచేసిందని అనేక కరోనా నేపథ్య కథలలో రచయితలు పేర్కొన్నారు.

ఉదాహరణకు రావుల కిరణ్మయి “ క్వారంటైన్” కథలో-

కంటికి కనిపించని ఒక సూక్ష్మ క్రిమి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ మృత్యఘంటికలు మోగిస్తున్నవేళ, వేటగాడు విసిరిన వలలో చిక్కిన ప్రాణుల్లా వైరస్ దాడిలో ఉపాధి కోల్పోయి విలవిలలాడుతున్న ప్రజలను ఆదుకోవాలని “పరోపకారమే పరమధర్మమని”, “ మానవసేవే మాధవ సేవ” అని దృఢంగా నమ్ముతూ ఈ తరుణంలో నగరములో పెద్ద పేరు మోసిన డాక్టర్ సమరస ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నఆలోచనతో తన బిడ్డను స్నేహితులకు అప్పగించి వైద్యసేవలు చేస్తున్నప్పుడు తనకే వైరస్ అంటుకోవడంతో “తడిసిపోయినిశ్శబ్దంగాక్వారంటైన్ లో గడుపుతుంది”. (క్వారంటైన్-పుట-105)

అమ్మ, నాన్న ఉండి కూడా అనాథలా ఉన్నతన బిడ్డను తలచుకుంటూ బిక్కు బిక్కు మంటూ జీవించడం ఇక్కడ అగుపిస్తుంది.

అలాగే శిరంశెట్టి కాంతారావు గారి “ఆ నలుగురు” కథలో-

భవననిర్మాణ పనులకు వలస వెళ్లిన కార్మికులు లాక్డౌన్ ప్రకటించడంతో తిరుపతి నుండి ‌సొంతూరుకి వచ్చిన వారంరోజులకు నలుగురుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో “గవర్నమెంట్ ఆసుపత్రి వాల్లొచ్చి వాళ్లను పట్టుకుపోయి ఐసోలేషన్ లో పెట్టారు. దెబ్బకు ఊరంతా భయంతో బెంబేలెత్తిపోతుంది”. (ఆ నలుగురు-పుట-37).

కరోనా భయానికి ప్రజలు చిగురుటాకుల్లా వనికి పోయారని చెప్పవచ్చు.

కాంతారావు మరొక కథ గంపగుత్తలో-

గుణమ్మ రాత్రి పడుకొని తెల్లవారి నిద్ర లేవ లేదన్న వార్త మంగమ్మ పిలిచినప్పుడు ఆవులింత తీసినంత సేపట్లో విషయం  ఊరంతా తెలిసిపోయింది. అయితే గుణమ్మను చూడ్డానికి మాత్రం ఎవరూ రాలేదు. ఎవరికి వాళ్లు కరోనాకు భయపడి “ఆ ఏం పోతాంలే?అనుకుంటూ ఇండ్లల్లోనే ఉండిపోయారు తప్ప బైటికి కూడా ఎల్లలేదు”.(గంప గుత్త-పుట-21). ఎవరికైనా సహాయం చేయాలన్న చేయకుండా ఇలా కరోనా మహమ్మారి ప్రజలును భయానక సంఘటనలకు గురిచేసిందని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.

2.4 ఆర్థిక పరిస్థితులు

కరోనా సమాజంలో భిన్న వర్గాలపై బిన్న ప్రభావాలు చూపింది. శ్రామికులు గా ఉన్నవారిలో కొందరు పూర్తిగా పనిని, ఆదాయాన్ని కోల్పోయారు. చేతివృత్తుల వారికి, చిరు వ్యాపారులకు, రైతులకు, ప్రైవేటు ఉద్యోగులకు దీని ప్రభావం తీవ్రంగా చూపించింది. వారిలో కొందరు వృత్తులు, వ్యాపారాలు మార్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా కరోనా మనిషి జీవనవిధానంలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చింది. కొత్త జీవన శైలులు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఆర్థిక అసమానతలు మరింతగా బలపడ్డాయని తెలియ జేసే అనేక కరోనా నేపథ్య కథలు వెలువడ్డాయి.

కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నతీరును శాంతి శ్రీ బెనర్జీ “ఆత్మస్థైర్యం”కథలో సుస్పష్టం చేశారు.

సూరిబాబుది  నెల్లూరు దగ్గర అల్లిపురం. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం పదిహేనేళ్ళ కూతురుతో హైదరాబాదు వచ్చి  ఆటో నడపడం మొదలుపెట్టాడు. అంతా బాగుందనుకుంటే ఒకరోజు ఆటో ప్రమాదానికి గురై పూర్తిగా చెడిపోవడమే కాకుండా సూరిబాబుకి కాలు విరగడం వల్ల ఆపరేషన్ చేసి మూడు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్లు. “ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం”లా ఇదే సమయంలో కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. దీంతో పట్టణంలో ఇంటికి అద్దె, కరెంట్ బిల్లు కట్టుకోలేక సూరిబాబు ఆర్థికస్థితి దుర్భరంగా మారింది. ఈ సమయంలో కూతురు మల్లేశ్వరి తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని, ఒక పూట తిని ఒక పూట తినక, భోజనం చేయవలసిన చోట టీ తాగుతూ “ఉన్న కాసిని పైసలు భోజనానికి ఖర్చు పెట్టడంఎందుకని టీ తాగుతున్నారు వాళ్ళు”(ఆత్మస్థైర్యం-పుట-36.)

ఇలా ఆర్థికంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటూ స్వగ్రామానికి తండ్రిని సైకిల్ తో తీసుకొచ్చిన మల్లేశ్వరి ఆత్మస్థైర్యంను బహుచక్కగా చిత్రీకరించారు.

అలాగే శిరంశెట్టి కాంతారావుగారు రాసిన “అల్లం మురబ్బా”కథలో-

లాక్ డౌన్ కారణంగా జీవనోపాధిని కోల్పోయి కుటుంబపోషణ కష్టమైనస్థితిలో కొత్త ఉపాధిని పొందుతూ, నూతన జీవన శైలుల ఏర్పాటు చేసుకోవడం సావిత్రమ్మ పాత్రలో కనిపిస్తుందని చెప్పడానికి ఈ కథ చక్కటి ఉదాహరణ. రోజు రైలు బండిలో పల్లీలు అమ్ముకొని జీవితాన్ని నెట్టుకొస్తున్న సావిత్రమ్మ లాక్ డౌన్ కారణంగా రైళ్లు నిల్చుపోవడంతో ఉపాధి కోల్పోయింది. భర్త మరణించడం వల్ల కుటుంబ పోషణ సావిత్రమ్మకు తలకు మించిన భారమైపోతుంది. వృత్తి మారాలనుకున్న సమయంలో “ ఒకరోజు మంచం మీద కూర్చుని ‘యు’ట్యూబ్ ఓపెన్ చేసి “ఇగోచూడు” అంటూ ఫోన్ సావిత్రమ్మ చేతికిచ్చాడు మహేష్. పావుగంట పాటు ‘అల్లం మురబ్బా’ తయారీని ఒకటికి రెండుసార్లు మనసుపెట్టి చూసి నేర్చుకుంది”(అల్లం మురబ్బా-పుట-66). అల్లం మురబ్బా అమ్మడం ద్వారా సగానికి సగం మిగులుబాటు కనిపించడంతో “ఈ కరోనా పున్యాన నాకో కొత్త బత్కుదారి దొరికింది”(అల్లం మురబ్బా-పుట-70) అని సంతోషంగా పలికింది సావిత్రమ్మ. తిరిగి ఇలా ఉపాధిని పొందిన సావిత్రమ్మ జీవితంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చు.

మరొక రచయిత్రి నిదానకవి నీరజ రాసిన “కరోనా కష్టాలు” కథలో-

“రెక్కాడితే కానీ డొక్కాడని” రాములమ్మ రంగయ్య కుటుంబం పడిన వేదన ఆర్థిక పరిస్థితులకు మచ్చుతునకగా చెప్పవచ్చు. రాములమ్మ రంగయ్య దంపతులు జీవనాధారమైన నాలుగు చక్రాల బండి మీద టిఫిన్ వ్యాపారం చేస్తూ, సంపాదించిన డబ్బును పొదుపుగా వాడుకుంటూ, నలుగురు పిల్లలను పోషించుకుంటూ బ్రతుకుబండిని భారంగా లాక్కొస్తున్న సమయంలో, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి “లాక్ డౌన్” విధించారు. ఈ పరిస్థితిలో ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు “అమ్మ ఆకలి, అమ్మ ఆకలి” అని అలమటించడం చూసి రాములమ్మ ఎంతో కుమిలిపోయింది”(కరోనా కష్టాలు-పుట-608).

ఈ చేతులతో ఎంతోమంది ఆకలిని తీర్చాను కానీ ఇప్పుడు కడుపున పుట్టిన పిల్లల ఆకలి తీర్చలేక పోతున్నాను. అని రాములమ్మ పలికిన మాటల ద్వారా కరోనా కాలంలో ప్రజలు అనుభవించిన దుర్భర పరిస్థితులను కంటికి కట్టినట్లుగా రచయిత్రి ఈ కథలో చిత్రీకరించారు.

2.5 సామాజిక పరిణామం

ఆకస్మిక లాక్ డౌన్ జనాల ప్రణాళికను తారుమారు చేసింది.మనిషి సంఘజీవైనప్పటికీ మనిషికి మనిషికి మధ్య దూరం పెంచి, ఒంటరి జీవిగా మార్చింది. అత్యవసర ప్రయాణాలను రద్దు చేసింది. పెద్దవాళ్లను పిల్లల నుండి విడదీసింది. యువతరం కాన్పులకు, కష్టాలకు పెద్దల అండ లేకుండా చేసింది. ఊరు విడిచి వెళ్లిన వాళ్ళు తమ సొంత గూడు చేరుకోవడం గగనమైంది. అనారోగ్యాలు, చావుల సందర్భలలో కూడా బంధుమిత్రుల ఆత్మీయుల పలకరింపులకు దూరమై ఆదుకునే వాళ్ళు లేక నానా యాతనలు పడ్డారు. సామాజికంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పే కరోనా నేపథ్య కథలు చాలా వెలువడ్డాయి.

వాటిలో “కాలం నేర్పిన పాఠం” కథలో-

కాంతారావు కరోనా కాలం నాటి సామాజిక పరిస్థితులను మనసుకు హత్తుకునేలా చెప్పారనడం సమంజసం. గుడిలో అర్చకత్వపు వృత్తిచేపడుతున్న ఆంజనేయ శాస్త్రికి లాక్ డౌన్ కారణంగా జీతంలేక ఇబ్బందులు పడుతున్న శాస్త్రి బతుకు బండినిలాగించడానికి హఠాత్తుగా ఓ కొత్త ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతికి, గుడి ప్రాంగణంలోనే కూరగాయలు పండించి అమ్ముతూ కృషీవలుడుగా మారాడు.అడపా దడపా ఆ రోడ్డున వెళుతున్న వాళ్లంతా “ఇదేంటి పూజారి గారు సొరకాయలమ్ముతున్నాడు?!అనుకుంటూ ఆశ్చర్యంగా చూడసాగారు”(కాలం నేర్పిన పాఠం-పు-49).పూజారి కృషీవలుడుగా మారి కుటుంబాన్ని ఆదుకున్నాడని చెప్పవచ్చు.

మరొక ఉదాహరణగా ఇంద్రగంటి జానకీబాల రాసిన “భయం- భయం”కథలో-

అవసరం (ఆకలి) మనిషిచేత ఏపనైనా చేయిస్తుందని చెప్పువచ్చు. చిన్ననాటి స్నేహితులైన మల్లేష్ (సాఫ్ట్ వేర్ ఇంజనీర్), శ్రీకాంత్ (ప్రైవేట్ కాలేజీ లెక్చరర్) ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి,ఉపాధి కూలీలుగా మారి “ ఉపాధి హామీ పథకం. రోజుకి 237 రూపాయల కూలి. అదే అపురూపంగా భావించి ఇద్దరూ యువకులు పనిలోపడ్డారు”(భయం-భయం-పుట-27).

ఇలా కరోనా పెట్టిన పరీక్షకు సామాజిక పరిస్థితులు తారుమారయ్యాయని తెలియజేస్తూ.......

“చిత్రమైనది విధినడక..... విధిని గెలుచుట ఎవరి తరము?-దాని వెంట నడుచుటయేగాని” (భయం- భయం-పుట-29). ప్రకృతి యొక్క ప్రకోపానికి తలవంచి నడవడమే తప్ప ఎవరూ, ఏమీ చేయలేమని బహుచక్కగా చిత్రీకరించారు రచయిత్రి.

3. ఉపసంహారం:

  • ఒక మనిషి, ఒక మానవ సమూహం, ఒక సామాజిక వ్యవస్థకు చెందిన నిజ జీవితాన్ని సంక్షోభ కాలంలో నిశితంగా గమనించి చేసిన సాహితీ సృజన ప్రయోజనం కొలవలేనిది.
  • కరోనా కాలం నాటి పరిస్థితులలో అనేక కోణాలను, వాస్తవాలను ఈ  కథలు ఆవిష్కరించాయి. మొత్తంగా ఇంతకు మించిన పరిస్థితులు ఉండవేమో అన్నంతగా రచయితలు కలాలు కదిలినాయి.
  • ఈ నేపథ్యంలో మానవ జీవితాన్ని వర్ణిస్తూ వచ్చిన సాహిత్యం జనజీవాలతో కూడి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాయి.. కొన్ని కథలు ప్రశ్నలను సంధిస్తే, మరికొన్ని కథలు పరిష్కారాన్ని చూపినవి. ఇంకొన్ని సమాచారాన్ని ఇచ్చినవి.
  • ఇలా కరోనా నేపథ్య కథలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, మానవీయ ,విద్య, వైద్య పరమైన అంశాలతో కూడిన వస్తు వైవిధ్యమును పరిశీలించవచ్చు.

4. పాద సూచికలు:

  1. కాలం నేర్పిన పాఠం-పుట -46.48.49.
  2. మనుషుల్లో దేవుడు-పుట-254.255.
  3. గంపగుత్త-పుట-21.22.
  4. దుఃఖ నది-పుట-51.
  5. లొల్లి-పుట-59.
  6. క్వారంటైన్ -పుట-105.
  7. ఆ నలుగురు-పుట-37.
  8. ఆత్మస్థైర్యం-పుట-36.
  9. అల్లం మురబ్బా-పుట-66.70.
  10. కరోనా కష్టాలు-పుట-608.
  11. భయం- భయం-పుట-27.29.

5. ఉపయుక్త గ్రంథ సూచి:

  1. కాంతారావు, శిరంశెట్టి. కాలం నేర్పిన పాఠం (కథాసంపుటి) శ్రీ శ్రీ ప్రింటర్స్, 2021.
  2. రజిత అనిశెట్టి, కొమర్రాజు రామలక్ష్మి, బండారు సుజాత. (సంపా.) కరోనాకాలం కథలు (శతాధిక రచయిత్రుల కథలు, కథనాలు) దీప్తిప్రింటర్స్, 2020.
  3. సుధాదేవి, తెన్నేటి. (సంక.). కొత్త (కరోనా) కథలు-4 కథా సంకలనం. వంశీ ప్రచురణ జూన్ 2021.
  4. శాస్త్రి, ద్వానా. తెలుగు సాహిత్యచరిత్ర. ప్రగతి పబ్లిషర్స్-1998.
  5. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్యవిమర్శసిద్ధాంతాలు. 2005.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]