headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. శ్రీనాథుని కవిత్వం: పదపరార్థ వక్రత

డా. వేముల శరణ్య

తెలుగు అధ్యాపకురాలు
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్మూర్,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 9493613830, Email: vemulasharanya11@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.04.2025        ఎంపిక (D.O.A): 28.04.2025        ప్రచురణ (D.O.P): 01.05.2025


వ్యాససంగ్రహం:

తెలుగు సాహితీచరిత్రలో శ్రీనాథుడు అజరామరుడు. అతని కవిత్వం ప్రగాఢమైన ముద్రను వేసింది. ఒక యుగానికి యుగకర్తను చేసింది. అంతటి ప్రతిభాభాస్వంతుని కవితా మార్గచర్చ, దానిపై వాదోపవాదాలు జరిగాయి. ప్రాచీన కవుల కవితా గుణాలను పాటిస్తూ నా కవిత్వం వక్రోక్తిని కలిగి ఉంటుందని తనకు తానుగా శ్రీనాథుడు " హరచుడా హరిణాంక వక్రత" అనే పద్యంలో చెప్పుకున్నాడు. కొర్లపాటి శ్రీరామ మూర్తి, కుందూరి ఈశ్వర దత్తు లాంటి వారు శ్రీనాథుని కవిత్వం వక్రతా వ్యాపారాన్ని పాటించిందని చెప్పారు. శ్రీనాథుని కవితా మార్గ నిర్దారణలో భాగంగా పెద్దల అభిప్రాయాలను అనుసరించి, శ్రీనాథుని కృతులైన శృంగారనైషధం, కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రిమహాత్మ్యం, చాటువులు ఆధారంగా చేసుకొని కవిత్వాన్ని పరిశీలించి శ్రీనాథుని కవితామార్గం వక్రోక్తిగా భావించడమైంది. అది నిరూపించే ప్రయత్నంలో భాగంగా కుంతకుని ఆరు రకాల వక్రతల్లో భాగమైన మూడవ వక్రత భేదంగా చెప్పబడ్డ పదపరార్థ వక్రతను శ్రీనాథుని పద్యాల్లో లక్షణలక్ష్య సమన్వయము చేసి శ్రీనాథుని కవితామార్గం వక్రోక్తిగా నిరూపించటం ఈపత్ర ఉద్దేశ్యం.

Keywords: కవిశైలి, కుంతకుని వక్రోక్తి, పదపరార్థవక్రతాభేదాలు, లక్షణలక్ష్య సమన్వయం.

1. ప్రవేశిక

‘నానృషిః కురుతే కావ్యం’ అన్న సూక్తిని బట్టి కూడా కవి ఋషితుల్యుడు. ఋషికి ఏకాగ్రత అనేది ముఖ్యం. ఋషికి ఉన్నట్టి తపశ్శక్తికి సదృశమైన శక్తి గలవాడే కవి అని అర్థం. కవి ఒక సృష్టికర్త. బ్రహ్మ జగత్తును సృష్టిస్తే, కవి కావ్య జగత్తును సృష్టించే సృష్టికర్త అని కూడా ప్రాచీన గ్రంథాల్లో కవి నిర్వచించారు. కవి అసామాన్యుడు కాదు. ప్రతిభావంతుడు. ఆనందమయమైన, రసవంతమైన కావ్యసృష్టి చేసే కవి ప్రకాశిస్తాడనేది సత్యం. “ధీశక్తి, వ్యుత్పన్నత మొదలగు గుణములు గలిగి భాషారూపమున వర్ణనాత్మక రచన చేయువాడు ‘కవి’యని గ్రహింపవచ్చును” (నరసింహం, అంతటి. 1979. పుట.1) అలాంటి కోవకు చెందినవాడే శ్రీనాథ మహాకవి అని చెప్పటం అతిశయోక్తి కాదు. తన కవిత్వంతో విశ్వదర్శనం చేసాడు.

1.1. శైలి

ప్రతి కవికి ఒక శైలి ఉంటుంది. కావ్య రచనలో వైవిధ్యం ఉంటుంది. ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. అయితే విలక్షణమైన ముద్రతో సహృదయులను గెల్చుకొని, తమ కావ్యాలు చిరకాలం ఉండేలా ఉత్కృష్టమైన రచనలు చేసే కవులు కొందరే ఉంటారు. అటువంటి ఉత్కృష్టమైన కవులలో ‘కవి సార్వభౌముడైన’ శ్రీనాథుడు ఒకడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

భావ వ్యక్తీకరణ విధానంలో మెరుగులు దిద్దే ఒకానొక రచానారీతిని ‘శైలి’ అనవచ్చు. శైలీ పరిశీలనం కేవలం భాషాశాస్త్రానికి సాహిత్య విమర్శకి చెందింది కాక కళాభినివేశ పాండిత్యాలలో కూడిన శాస్త్రీయ కృషి విశేషంగా భావించవచ్చు” (చేరెడ్డి, మస్తాన్ రెడ్డి.1989.పుట.1).

శ్రీనాథుడు శైలిని గూర్చి చెప్తూ తన కవిత్వం ఎలా ఉంటుందో? అసలు కవిత్వం అనేది ఎలా ఉండాలో కవితా మార్గాలను పూర్వ కవులనుండి అన్వేషించి, వాటిలో లోతుపాతులు తెలుసుకొని, తనదైన పాండితీ పటిమతో రచనలు చేసాడో తెల్పాడు. శ్రీనాథుడు చెప్పిన కవిత్వ గుణాలకు సరిగ్గా సరిపోయే కారిక కుంతకుని వక్రోక్తి జీవితంలో కన్పిస్తుంది. కుంతకుని కారికకు " హరచుడా హరిణాంక వక్రత” పద్యం అనుసరణం అని చెప్పవచ్చు.

2. కుంతకుని వక్రోక్తి

కుంతకుడు ‘వక్రోక్తి జీవితం’ అనే గ్రంథంలో ప్రధానంగా ఆరు రకాల వక్రతలను తెలిపాడు. మొదటి ఉన్మేషంలో కావ్యం అంటే ఏంటో తెలిపి, ఎలా ఉండాలని వివరిస్తూ ఆరు రకాల వక్రతల పేర్లు తెలిపాడు. రెండవ ఉన్మేషంలో వర్ణవిన్యాస వక్రత ప్రతిపాదనతో ప్రారంభమయి పద పూర్వార్థ, పద పరార్థ వక్రతలని తెలిపి వాటికి అనేక భేదాలను తెలిపాడు. మూడవ ఉన్మేషంలో వాక్య వక్రత, నాల్గవ ఉన్మేషంలో ప్రకరణ వక్రత, ప్రబంధ వక్రతలను తెలిపాడు.

2.1 ప్రధానంగా ఆరు రకాల వక్రతలు

1) వర్ణ విన్యాస వక్రత, 2) పదపూర్వార్థ వక్రత, 3) పద పరార్థ వక్రత, 4) వాక్య వక్రత, 5) ప్రకరణ వక్రత, 6) ప్రబంధ వక్రత.

3. పదపరార్ధ వక్రత - భేదాలు

సుబంతముల పూర్వార్ధంలో ప్రాతిపదిక ఉంటుంది. తిఙంతపదాల పూర్వార్థాల్లో ధాతువు ఉంటుంది. సుబంతాలు నామవాచకాలను తెలిపితే, తిఙంతాలు క్రియలను తెలుపుతాయి. ఇలా పదాలు సుబంతాలు, తిఙంతాలుఅని రెండు రకాలుంటాయి. పదంలో ప్రకృతి–ప్రత్యయం అనే భాగాలుంటాయి. ప్రకృతి భాగాన్ని పదపూర్వార్ధమని, ప్రత్యయ భాగాన్ని పదపరార్ధం అని అంటారు. సుబంతానికి ప్రకృతి అయిన దాన్ని ‘ప్రాతిపదిక’ అంటారు. తిఙంతానికి ప్రకృతి అయిన దాన్ని ధాతువు అంటారు. కుంతకుడు పద పూర్వార్ధ వక్రతను తెలిపిన తర్వాత పదపరార్ధ వక్రతను అంటే పదప్రత్యయరూపమైన వక్రతను వివరించాడు.

పద ఉత్తరార్థాన్ని అనుసరించి వచ్చిన వైచిత్రీ విశేషణాన్ని ఆరు రకాలుగా చెప్పాడు.

1) కాలవైచిత్ర్య వక్రత, 2) కారక వక్రత, 3) సంఖ్యావక్రత, 4) పురుషవక్రత, 5) ఉపగ్రహవక్రత 6) ప్రత్యయ వక్రత.

3.1. కాలవైచిత్ర్య వక్రత

కాల వైచిత్ర్యాన్ని ఇలా వివరించాడు.

కా॥ ఔచిత్యాన్తరతమ్యేన సమయోరమణీయతామ్
యాతియత్రభవత్యేషా కాలవైచిత్ర్య వక్రతా (వక్రోక్తి జీవితం.2.26)

ఎక్కడైతే ప్రస్తుత వస్తువుకు రమణీయత చేకూర్చడానికి కాలానికి రమణీయతను చేకూర్చితే అది కాల వైచిత్ర్య వక్రత. ఇందుకు ఉదాహరణగా ఒక శ్లోకాన్ని ఉదాహరించాడు.

“యావత్కించిదపూర్వమార్ద్రమన సామావేదయన్తోనవాః
సౌభాగ్యాతిశయస్య కామపిదశాం గన్తుం వ్యవస్యన్త్యమీ
భావాస్తావదనన్య జస్య విధురః కో౽ప్యుద్యమో జృమ్భతే
పర్యాప్తే మధు విభ్రమే తు కిమయా కర్తేతి కమ్పామహే” (వక్రోక్తి జీవితం.పుట.239)

వసంత కాల వర్ణన ఇది. మన్మథుని మనోహర ఉద్యమం విజృంభిస్తున్నది. వసంత విభ్రమం పూర్తి అయిన తర్వాత మన్మథుడు ఏమి చేయుచున్నాడో అని వణుకుతున్నాము అని ఈ శ్లోకార్థం. ఇక్కడ ‘వ్యవస్యన్తి’ ఉద్యమించుచున్నది.‘జృమ్భతే’విజృంభించుచున్నాడు. ‘కర్త’ ఏమి చేయనున్నాడో అనే కాల సంబంధ విషయాల ద్వారా ప్రస్తుతానికి సౌందర్యం ఏర్పడింది కనుక కాలవైచిత్ర్యంగా చెప్పాడు. వర్తమాన, భవిష్యత్కాల సూచన ఉంది. ఇందులోని పదాంత ప్రత్యయాల వలన ప్రత్యేక కాల సూచనం ఉంది కాబట్టి ఇది పదపరార్థ వక్రతగా తెలిపాడు. 

3.1.1. కాలవైచిత్ర్య వక్రత – సమన్వయం

ఉ॥ నేడు కృతార్థులైరి జననీజనకుల్ఫలియించెఁ బుణ్యముల్
నేడు పురాకృతంబులవనీరుహ మూల నివాసియైన కా
ట్రేడిలు వేల్పు నేడ యొనరించె మనోరథ సిద్ధి సంపదల్
నేడు గదా (సువారమిది నీ కృప) గంటి ధరాసురోత్తమా (శివ.తృతీ.ఆశ్వా.09  పద్యం)

శివరాత్రిమహాత్మ్యంలో మాలెత   సుకుమారునితో మాట్లాడే సందర్భంలోనిదీపద్యం. నేడు నా తల్లిదండ్రులు ధన్యులైరి, నేడు పూర్వజన్మ పుణ్యకార్యం ఫలించెను. నేడు గదా సుదినం అంటూ మాలెత ఆనందాతిశయాన్ని వ్యక్తం చేసిన ఘట్టం. ‘నేడు’ అనే పదం వర్తమాన కాలాన్ని సూచించింది. ప్రతీసారీ నేడు అనే కాలవాచక పదం వాడటం వలన ఎన్నో రోజుల తరబడి ఎదురుచూసిన సౌఖ్యం, కల నెరవేరిందని జీవత పరమార్థం లభించిందని చెప్పకనే ఆ పదం చెప్తుంది. ఇక్కడ కాల పదానికి ప్రాముఖ్యత ఇవ్వటం కూడా కాలవైచిత్ర్య వక్రతే.

3.2. కారకవక్రత

కా॥ యత్ర కారక సామాన్యం ప్రాధాన్యేన విబధ్యతే౹
తత్వాధ్యారోపణాన్ముఖ్యగుణభావాభిధానతః౹౹

కా॥ పరిపోపయితుం కాఞ్చిత్ భజ్గీభణితిరమ్యతామ్౹
కారకాణాం విపర్యాసః సోక్తా కారకవక్రతా౹౹ (వక్రోక్తి జీవితం 2-27,28)

కావ్య రమణీయతను సాధించడానికి సామాన్యమైన కారకానికి ప్రాధాన్యతను కూర్చడం, అలాగే ప్రధాన కారకానికి గౌణత్వం చెప్పటం, ఈ రకమైన కారక విపర్యాసమునే కారక వక్రత అంటారు. కర్తను ప్రధానంగా చెప్పాల్సినపుడు కరణంతో చెప్పటం. ముఖ్యమైన దాన్ని వదిలి అముఖ్యమైన దానికి ప్రాధాన్యం ఇలాంటివి కారక వక్రత కిందికి వస్తాయి. దీనికి కుంతకుడు ఒక శ్లోకాన్ని ఉదాహరించాడు. అందులో చివరి చరణం చూద్దాం.

“పాణిః సంప్రతి మేహఠాత్ కిమపరం స్ప్రష్టుం ధనుర్వాఋఞ్చతి”. (వక్రోక్తి జీవితం.పుట.241)

దీని అర్థం ఇక్కడ నా హస్తాలు హఠాత్తుగా ధనుస్సును స్పృశించడానికి పరుగెత్తుతున్నాయని చెప్పబడ్డది. నేనే ధనుస్సును తీసుకోవడానికి వెళ్తున్నాను అని కర్తకు ప్రాధాన్యం ఇవ్వకుండా కరణం అయిన హస్తాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన ఇది కారక వక్రత.

3.2.1. కారకవక్రత – సమన్వయం

శా॥ నీలావణ్య పయోబ్ధియందు నలరున్ నేత్రాబ్జముల్, నీ మనో
జ్ఞాలా పంబులయందుఁ గర్ణములు, నీయాలింగన ప్రక్రియా
కేలిన్ మేనులు, నీ ముఖాస్వదన సక్తిన్నాలుకల్, మాకు, నో
బాలా, స్వప్న సమాగంబుల నిశా పర్యంత యామంబులన్ (శృ.నై.చతు.ఆశ్వా.45 పద్యం)

శృంగారనైషధంలో దివ్యులు దమయంతి లావణ్యాన్ని పొగుడుతున్న సందర్భం ఇది. నీ లావణ్య పయోబ్దిలో మా నేత్రాలు, నీ మనోజ్ఞాలాపంలో కర్ణాలు, నీ ఆలింగనంలో మేనులు సంతోషిస్తాయని భావం. ఇక్కడ ప్రధాన కారకాలు కర్తల గూర్చి చెప్పకుండా గౌణ కారకాలు అయిన నేత్రాలు, వీనులు, నాలుకలు, మేనులు ప్రధానంగా చెప్పడం వైచిత్ర్యం ప్రధాన కారకానికి గౌణత్వం ఏర్పడింది కనుక ఇది కారక వక్రత. రాజులు దమయంతిని కోరుకోవటం కాకుండా వారి అవయవాలు కోరుకున్నట్లు వర్ణించటం విశేషం.

3.3. సంఖ్యా వక్రత

కా॥ కుర్వన్తి కావ్యవైచిత్రయ వివక్షాపరతన్త్రితాః౹
యత్ర సంఖ్యావిపర్యాసం తాంసంఖ్యావక్రతావిదుః౹౹

కావ్యసౌందర్యం ఆపాదించడానికి సంఖ్యా విపర్యాసం చేయడం సంఖ్యా వక్రత. ఏక వచనం చెప్పవలసిన చోట బహువచనం చెప్పటం, భిన్న వచనాలు చెప్పాల్సి వచ్చినప్పుడు సామానాధికరణం చెప్పటం సంఖ్యా వక్రతగా వివరించాడు. దీనికి పలు ఉదాహరణలిచ్చాడు కుంతకుడు. అందులో ఒకటి పరిశీలిద్దాం.

“శాస్త్రాణి చక్షుర్నవమ్”
“శాస్త్రములు నూత్నమైన నేత్రము” (వక్రోక్తి జీవితం.పుట.245)

ఇక్కడ శాస్త్రము‘లు’ బహువచనం కాగా నేత్ర‘ము’ ఏక వచన ప్రత్యయం వాడటం సంఖ్యావక్రత.

3.3.1. సంఖ్యా వక్రత – సమన్వయం

తే॥ తోఁక చుక్కలఁ బోలు దృక్తోయజముల
వెలితి లేకుండ మీబోఁటి చెలులఁజూచుఁ;
గాంత వీక్షింప దరగంటఁగాని మమ్ము
నేము నేసిన యపరాధమేమి? సెపుమ (శృ.నై.అష్ట.ఆశ్వా.60 పద్యం)

శృంగారనైషధంలో నలుడు దమయంతీ చెలికత్తెతో మిమ్మల్ని చూసినట్లు కాంత నన్ను చూడటం లేదు. అరకంట చూస్తుంది కానీ నిండు కంట జూడటం లేదే. నేను చేసిన అపరాధమేమిటి? అని ప్రశ్నిస్తూ ‘నేను’ అనే ఏక వచనానికి బదలు ‘మేము’ చేసిన అపరాధం ఏమిటని అడుగుతాడు. నన్ను చూడటం లేదు అనడానికి బదులు ‘మమ్ము’ అని అంటాడు. ఈ బహువచనాలు ఆ రాజు గొప్పతనాన్ని, గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తెలుపుతూ మహారాజు వైభవాన్ని, మర్యాద పూర్వకంగా తెలుపుతున్నాయి.

3.4. పురుష వక్రత

ప్రత్యక్తా పరభావశ్చ విపర్యాసేన యోజ్యతే
యత్ర విచ్ఛిత్తయే సైషాజ్ఞేయా పురుషవక్రతా (వక్రోక్తి జీవితం.2-30)

ఎక్కడైతే స్వత్వము అంటే తనకు తాను అని చెప్పుకోక ఇతరుల గూర్చి చెప్పినట్లుగా భాషిస్తే అది పురుష వక్రత. ఉత్తమ, ప్రథమ, మధ్యమ పురుషలలో ఒకదానికి బదులుగా ఇంకొకటి వాడటమే పురుష వక్రత. ఉదాహరణగా ఒక శ్లోకానిచ్చాడు కుంతకుడు.

“కౌశామ్బీం పరిభూయనః కృపణకైర్విద్వేషిభిః స్వీకృతాం
జానామ్యే(త్యే?) వ తథా ప్రమాదపరతాం పత్యుర్నయద్వేషిణః”
“స్త్రీణాం చ ప్రియ విప్రయోగ విధురం చేతః సదైవాత్ర మే
వక్తుం నోత్సహతే మనఃపరమతో జానాతు దేవీ! స్వయమ్” (వక్రోక్తి జీవితం.పుట.245)

ఇది కథ మధ్యలో భాగం గల శ్లోకం. నీచులైన శత్రువులు కౌశాంబీ నగరాన్ని ఆక్రమించారని తెలుసు, స్త్రీల మనసు ప్రియుని వియోగముచే బాధపడుతుందని తెలుసు. నాకు ఏమి చెప్పాలని లేదు అంతా దేవికే తెలుసు కదా అనుకున్నాను అని అర్థం. ఇక్కడ ఒక స్త్రీతో పురుషుడు మాట్లాడుతున్న సంభాషణ అంతా మీకే తెలుసు కదా అని యుష్మదర్థక వాక్యం పలుకకా ‘దేవీ’కే తెలుసునని ప్రథమ పురుష పదాన్ని వాడటం వలన  ఆమెకు అధికారం ఉంది కనుక ఏది హితమో కాదో తెలుసుకునే శక్తి సామార్థ్యాలు కలదనే విషయం చెప్పకనే చెప్పటం ఇక్కడ పురుష వక్రత వైచిత్ర్యం.

3.4.1. పురుష వక్రత – సమన్వయం

తే॥ వలతునే భక్తకోటికి వారిజాక్షి
లలన! యా భక్తకోటియు వలచు నాకు
“భక్తిగతి లింగపతి” యను ప్రాఁత మాట
నేఁడుగాఁ గల్గెనే యలినీలవేణి (హర.ద్వితీ.ఆశ్వా.13 పద్యం)

శివుడు పార్వతి సంభాషణ ఇది. దేహం చెమర్చుట గూర్చి విశదీకరిస్తూ నేను భక్తులను వలతును, నన్ను భక్తులు వలతురు అని అంటాడు. ఈశ్వరుడు భక్తులవాడే అనే మాట ఇప్పటిది కాదు అంటూ ‘భక్తిగతి లింగపతి’ అంటాడు. నేను అనే ఉత్తమ పురుష పదాన్ని వాడక అన్యున్ని చెప్పినట్లుగా ‘లింగపతి’ భక్తులవాడే అని ప్రథమ పురుషలో చెప్పటం కవి చేసిన వైచిత్ర్యం. లింగపతి అనటంలో కొంత సౌందర్యం ఉన్నది కనుక పురుష వక్రత.

గీ॥ (ప్రణవ శతరుద్ర్య) మును నధర్వంబు శిఖియుం
బవన గీతియుం ద్వరితంబు బౌరుషంబు
నీల రుద్ర్యంబుం బఠియుంచు నియతి నెవ్వం
డతని నాకూర్మి భక్తుంగా నాత్మందలంపు (శివ.పంచ.ఆశ్వా.46 పద్యం)

శివుడు యమునితో సంభాషిస్తూ నా భక్తుల వద్దకు నీవు పోవలదని వారిస్తాడు. ఆ చెప్పే సందర్భంలో ప్రణవ శతరుద్రమును, అథర్వమును, శిఖిని, పవనగీతిని, నీలరుద్ర్యంబును, పఠించే వానిని నా ప్రియ భక్తునిగా ఆత్మలో ఉంచుకో అంటాడు. ఇక్కడ రుద్రుడే నీలరుద్ర్యంబు, ప్రణవశతరుద్ర్యంబు చదివేవాడని ప్రథమ పురుషలో వేరే వారిని ఉద్దేశించి చెప్పినట్లు చెప్పటం విశేషం. ఉత్తమ పురుషకు బదులుగా ప్రథమ పురుష వాడటం ఇక్కడి వైచిత్ర్యం. దీని వలన శివుని ఔన్నత్యం దీప్తమవుతుంది. తనకు తానే రుద్రుడిగా పొగుడు కోవటం విశేషం.

3.5. ఉపగ్రహ వక్రత

కా॥ పదయోరుభయోరేకమౌచిత్యాద్వినియుజ్యతే౹
శోభాయై యత్ర జల్పన్తి తాముపగ్రహ వక్రతామ్౹౹

ఔచిత్యం బట్టి, కావ్యశోభ కొరకు పరస్మైపది, ఆత్మనే పది పదాలను ఒకదాన్ని వాడినట్లయితే అది ఉపగ్రహ వక్రత. ఇక్కడ ఉపగ్రహ అంటే పరస్మైపది, ఆత్మనేపది అనే పదాలుగా భావించాలి. దీనికి ఉదాహరణగా రఘువంశంలోని శ్లోకాన్ని ఉదాహరించాడు కుంతకుడు.

తస్యాపరేష్వపి మృగేషు శరాన్ముముక్షోః
కర్ణాన్తమేత్య బిభిదే నిబిడో౽పి ముష్టిః
త్రాసాతి మాత్రచటులైః స్మరయత్సునేత్రైః
ప్రౌఢ ప్రియానయన విభ్రమ చేష్టితాని (వక్రోక్తి జీవితం.పుట.247)

భయంతో చంచల నేత్రాలు కలిగిన ప్రియురాలిలాగ ఉన్న మృగాలపై బాణాలు వెయ్యడానికి ప్రయత్నిస్తూ పిడికిలిని బిగించి చెవి వరకు వెళ్ళగానే ఆ పిడికిలి వదులైపోయెను అని ఈ శ్లోకార్థం. ఇక్కడ రాజు ప్రయత్నం ఆగిపోయి పిడికిలి స్వయంగా తనకు తానే వదులైపోయిందనటం ఆత్మనేపది. వదిలివేసాడు అనకుండా వదులైపోయింది అనటం ఇక్కడ ఉపగ్రహ వైచిత్ర్యం.

3.5.1. ఉపగ్రహ వక్రత - సమన్వయం

ఆ.వె. గ్రుచ్చి కౌఁగిలించుకొని యమ్మహీధర
సార్వభౌముదేవి చతుర భంగి
బుజ్జగించి కూర్మి పొంపిరి వోవంగ
హితమితోక్తిఁ బుత్రి కిట్టులనియె (హర.చతు.ఆశ్వా.5 పద్యం)

హరవిలాసంలో పార్వతి దేవిని హిమవంతుని భార్య అయిన మేనక దగ్గరకు తీసుకొని, కౌగలించుకొని, ప్రేమ అతిశయించే విధంగా, బుజ్జగించి, హితవు తెల్పుతుందని భావం. శివుడు దృష్టి పెట్టలేదని బాధపడుతుండగా కుమార్తెను ఒళ్ళోకి తీసుకొన్నది మేనక. గాఢంగా కౌగిలించుకొన్నదనే విషయాన్ని కవి చెప్తూ ‘గ్రుచ్చి కౌగిలించుకొని’ అంటాడు కవి. ‘కొని’ పదం ఆత్మనేపదిని సూచిస్తుంది. కౌగలించింది అని చెప్పవచ్చు కానీ ‘కౌగలించుకొని’ అని చెప్పటంలోనే తనది అనే భావన, ప్రేమానురాగం, లాలన అతిశయిస్తుంది కనుక ఉపగ్రహ వక్రత.

తే॥ అఖిల మోహినియైన యయ్యలరుఁ బోణి
శైశవము వీడుకొన్నది సందు గాఁగ
ననుదినంబును రాజనందనుల మీఁద
వేఁట లాడుచునున్నాఁడు విషమశరుఁడు (శృ.నై.తృతీ.ఆశ్వా.26 పద్యం)

శృంగారనైషధంలో దమయంతి యౌవనానికి వచ్చిందనే విషయాన్ని చెప్తూ శైశవం వీడిపోయిందని పరస్మైపదిగా చెప్పవచ్చు. ‘శైశవము వీడుకొన్నది’ తనకు తానుగా బాల్యాన్ని విడిచిపెట్టుకొన్నదని ఆత్మనేపద ప్రయోగం. కొంత వైచిత్ర్యాన్ని ఇచ్చింది. కనుక ఉపగ్రహ వక్రత. దమయంతే వీడుకొన్నదని చెప్పటం సౌందర్యహేతువైంది.

3.6. ప్రత్యయ వక్రత

కా॥ విహితః ప్రత్యయాదన్యః ప్రత్యయః కమనీయతామ్
యత్ర కామపి పుష్ణాతి సాన్యా ప్రత్యయ వక్రతా. (వక్రోక్తి జీవితం.2-32)

ఎక్కడైతే పద ఉత్తరార్థంలో వచ్చే ప్రత్యయం వల్ల సౌందర్యం చేకూరుతుందో అది ప్రత్యయ వక్రత. ఉదాహరణగా ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం.

లీనం వస్తుని యేన సూక్ష్మసుభగం తత్త్వం గిరాకృష్యతే
నిర్మాతుం ప్రభవేన్మనో రమమిదం వాచైవయోవాబహిః
వన్దేద్వావపి తావహం కవివరౌ వన్దేతరాం తం పున
ర్యోవిజ్ఞాతపరిశ్రమోయమనయోర్భారావతాక్షమః (వక్రోక్తి జీవితం.పుట.248)

ఏ కవి వస్తువులో లీనమైన, సుందరమైన తత్త్వాన్ని వాక్కుతో ఆకర్షిస్తాడో, ఏ కవి మనోహరంగా బాహ్యప్రపంచాన్ని ఆవిష్కరించ సమర్థుడో ఆ ఇద్దరు కవులను నమస్కరిస్తున్నాను. కానీ వీళ్ళ శ్రమ ఎరిగి భారాన్ని తగ్గించే వానికి ఎక్కువగా నమస్కరిస్తున్నాని అర్థం. ఇక్కడ మూడవపాదంలో ‘వన్దేతరాం’ అనే ప్రత్యయం రావటం ప్రత్యయ వక్రతగా చెప్పబడ్డది. కేవలం ‘తరామ్’ అనే చిన్న ప్రత్యయం వలన అధికతరమైన, గొప్పనైన అర్థాన్నిచ్చింది.

3.6.1. ప్రత్యయ వక్రత – సమన్వయం

తే॥ అట్లు పురుషోత్తముండైన యతని వలన
ముక్తి గాంచిన యాద్విజ ముఖ్యుఁడెలమి
డెందమునకును వాక్కునకందరాని
యధికతరమైన యానంద మనుభవించె (శృ.నై.ద్వితీ.ఆశ్వా.3 పద్యం)

శృంగారనైషధంలో పురుషోత్తముడైన నలమహారాజు వలన విముక్తి పొందిన హంస మాటలకందని ఆనందాన్ని పొందిందని భావం. ఇక్కడ ‘వాక్కున కందరాని యధికతరమైన’ ఆనందాన్ని పొందిందని కవి చెప్పాడు. ‘తరప్’ ప్రత్యయాన్ని పదం చివరన వాడటం వలన పద్యానికి సౌందర్యం చేకూరింది. ఈ ప్రత్యయ ప్రయోగం వలన ఉన్నతమైన, చెప్పరాని, అధికమైన, మిక్కిలి, అనిర్వచనీయమైన సంతోషాన్ని చెప్పినట్లయ్యింది. ఇది ప్రత్యయం వలన కలిగిన వైచిత్ర్యం. 

తే॥ అధికతరులైనఁగాని దిశాధిపతులు
కౌతుకము నాకు నీ వంశ కథల యందె
దప్పిగొన్నట్టి వారికాదప్పి దీఱ
సలిల పూరంబు హితవొ? యాజ్యంబు హితవొ? (శృ.నై.చతు.ఆశ్వా.52 పద్యం)

శృంగారనైషధంలో ఇంద్రాదులకు రాయబారిగా వచ్చి వారి గొప్పతనాన్ని నలుడు దమయంతికి చెప్తున్న సందర్భంలోనిది. దిశాధిపతులు గొప్పవాళ్ళైనా పర్వాలేదు. నెయ్యి గొప్పదని దాహానికి నీటికి బదులుగా తాగలేమని చెప్తుంది దమయంతి. ‘అధికతరులైన గాని దిశాధిపతులు’ అనే చోట ‘తరప్’ ప్రత్యయం వాడటం వలన రాజు కన్నా దిశాధిపతులు గొప్పవాళ్ళని వారి ఆధిక్యాన్ని చెప్పబడింది. కనుక ప్రత్యయ వక్రత.

4. ఉపసంహారం:

కుంతకుని పదపరార్థవక్రత అంతర్భేదాలను, వాటి లక్షణాలను తెలుపుతూ శ్రీనాథుని కవిత్వంతో సమన్వయము చేసి నిరూపించడమైనది. లక్షణలక్ష్యసమన్వయము ఆధారంగా శ్రీనాథుడు పాటించిన కవితారీతి, వక్రతావ్యాపారంలోనే అంతర్భవిస్తుందని చెప్పవచ్చు. ఈ వ్యాసం కొన్ని ముఖ్య విషయాలను విశదీకరించింది. అవి : 

  • శ్రీనాథుని కవిత్వంలోని వక్రతావ్యాపారాన్ని చర్చించింది. 
  • కుంతకుడు చెప్పిన ఆరు రకాల వక్రతలను స్థూలంగా తెలుపుతూ ఆరు రకాలభేదాలను వివరించింది.
  • పదపరార్థ వక్రత ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ కాల, కారక, సంఖ్యా, పురుష, ఉపగ్రహ  ప్రత్యయ పదాల ద్వారా ఎటువంటి వైచిత్య్రం కావ్యంలో ఏర్పడుతుందో తెలుపబడింది.
  • కుంతకుడు చెప్పిన వక్రతలను శ్రీనాథుని లభ్యకావ్యాల్లోని పద్యాల్లో సమన్వయముచేసి సోదాహరణంగా వివరించటం చేత, శ్రీనాథుని కవిత్వం వక్రోక్తి సిద్ధాంతాన్ని పాటించిందని నిరూపించబడింది.
  • కావ్య సౌందర్యానికి వక్రోక్తి తోడ్పడిందని తెలియజేయడమైంది.

శ్రీనాథుని కవితా మార్గoపైన స్పష్టత రావడానికి ఈ వ్యాసం ఉపకారి అవుతుంది. శ్రీనాథుని కవిత్వం మహాసముద్రం లాంటిది భావి తరాలు సంస్కృత కావ్యాలతోతులనాత్మక పరిశోధనలు చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జయకృష్ణబాపూజీ, జంధ్యాల.(1977). శ్రీనాథుని సాహిత్య ప్రస్థానం, వెల్‌కమ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్,గుంటూరు. 
  2. నరసింహం, అంతటి. (1979). ప్రబంధములలో ప్రకృతి వర్ణనలు, సమతాసాహితి, హైదరాబాదు.
  3. నరసింహారావు, యస్. ఎల్.(1981). ఆంధ్ర మహాభారతము అలంకార సమీక్ష, లేపాక్షి ఆర్ట్ ప్రింటర్స్,హిందూపురం.   
  4. నాగయ్య,జి.(1984). ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి, తిరుపతి,నవ్యపరిశోధక ప్రచురణ,హైదరాబాదు.
  5. పాపయ్యశాస్త్రి, చిలుకూరి. (1988). శ్రీనాథ కవితా సమీక్ష, రిపబ్లిక్ పవర్ ప్రెస్, కాకినాడ.
  6. బాలగంగాధరరావు, యార్లగడ్డ. (2015). శ్రీనాథకవి సార్వభౌముని హరవిలాసం(హైమవతీ వ్యాఖ్యాసహితము), నిర్మలా పబ్లికేషన్స్, విజయవాడ.
  7. మస్తాన్, చేరెడ్డి. (1989). భారత పద్యశైలి, ఆశాలత ప్రచురణ
  8. మృత్యుంజయరావు, జొన్నలగడ్డ. (1995). శివరాత్రిమహాత్మ్యం (చంద్రికావ్యాఖ్యానసహితం). తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్.
  9. శరభేశ్వరశర్మ, మల్లంపల్లి. (2012). శ్రీనాథ విరచిత కాశీఖండం (మణికర్ణికా వ్యాఖ్యాన సహితము). శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
  10. శ్రీరామచంద్రుడు, పుల్లెల. (2007). కుంతకుని వక్రోక్తి జీవితం (బాలానందిని వ్యాఖ్యతో).  సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]