AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. సుద్దాల అశోక్ తేజ గేయకవిత్వం: సామాజికదృక్పథం
డా. వేముల హర్షిత
తెలుగు అధ్యాపకురాలు,
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, జగద్గిరిగుట్ట,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9248393960, Email: vemulaharshitha04@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.04.2025 ఎంపిక (D.O.A): 30.04.2025 ప్రచురణ (D.O.P): 01.05.2025
వ్యాససంగ్రహం:
తెలంగాణలో పరిచయం అక్కరలేని సినీగీత కవి డా. సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినీవినీలాకాశంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుని, వెండితెరపై తన పేరును లిఖించుకున్న కవి అతడు. రెండు వేలకు పైగా సినిమా పాటలు రాసి చెరగని ముద్ర వేసుకున్న అతని కవిత్వం చాలా సామాజిక విషయాలను చర్చించింది. కేవలం సినిమాకోసం పాటలను రాయడమే కాకుండా సందర్భాన్ని వాడుకొని మరీ, సామాజిక సందేశాన్ని ఇచ్చే రచనలు చేసిన సమకాలీన సామాజిక కవి అశోక్ తేజ. సుద్దాల అశోక్ తేజ రాసిన నేలమ్మా నేలమ్మా గేయరూపకవిత్వం, శ్రమకావ్యం గ్రంథాలు, కొన్ని సినీగేయాల ఆధారంగా ఈ గేయకవిత్వ విభజన జరుగుతుంది. గోపగాని రవీందర్ చేసిన నేలమ్మా నేలమ్మా గేయరూపకవిత్వం పరిశీలన అనే గ్రంథం ఈ వ్యాసానికి ఆధారంగా స్వీకరించడం జరిగింది. ఆయన రచనల్లో ఉద్యమస్ఫూర్తి, వ్యక్తిత్వ వికాసం, స్త్రీవాద చైతన్యం, శ్రమైకజీవన సౌందర్యం మొదలైన సామాజికాంశాలు కన్పిస్తాయి. అటువంటి రచయిత కవిత్వాన్ని సామాజిక దృక్పథం నుండి పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించడమే ఈ పరిశోధన వ్యాస ముఖ్య ఉద్దేశ్యం. “నేను సైతం” పాటనై పరిమళిస్తా అంటూ పాటలో జాతీయ బహుమతి గెలిచిన మొదటి తెలంగాణ రచయిత డా॥ సుద్దాల అశోక్ తేజ. సినీ ప్రస్థానంలో 30 ఏళ్ళుగా పాటలు రాస్తూ ఇప్పటికి కొనసాగుతున్న వారి కృషిని, పాటల్లోని సాహిత్యాన్ని, సందేశాత్మకతను, ముచ్చటిస్తూ మే16 వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాస్తున్న రాసిన వ్యాసం ఇది.
Keywords: పరిచయం, కవిత్వ వర్గీకరణ, శ్రమైకజీవన సౌందర్యం,ఉద్యమ స్ఫూర్తి, స్త్రీవాదదృక్పథం.
1. ప్రవేశిక:
సుద్దాల అశోక్ తేజ 1954 మే 16వ తేదీన నల్గొండ
జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జన్మించారు. వీరి తండ్రిగారు “పల్లెటూరి పిల్లగాడా”
గేయకర్త, తెలంగాణ సాయుధపోరాట యోధులైన సుద్దాల హనుమంతు. అశోక్ తేజగారికి చిన్నప్పటి నుండే పాట మీద ప్రేమ
ఏర్పడిందట. వారి నాన్న ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండేదట. చిన్నప్పుడు ఆరవ తరగతిలో ఉండగానే “ఈ
నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో” అనే పాటను విని సినిమాలో పాటలు రాయాలని నిర్ణయించుకున్నారట.
అలాగే పాటపై మక్కువ ఆయన్ని విడిచి పెట్టలేదు.తెలుగు సినీచరిత్రలో ఉత్తమస్థానాన్ని నిలబెట్టుకొనేలా
చేసింది. ఆ చిన్ననాటి కోరిక ద్వారా “నమస్తే అన్న” చిత్రంలో 1994లో “గరం
గరం పోరీ” అనే పాట ద్వారా తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. తర్వాత “ఓసేయ్ రాములమ్మ”
సినిమా పాటలు వీరికి జీవితంలో చెప్పదగ్గ మలుపును ఇచ్చాయి. ఆ తర్వాత వందల కొలది పాటలు అగ్ర కథానాయకుల
సినిమాలకు వీరు రాశారు. సినిమాలలో 2600లకు పైగా రాయడమనేది చాలా గొప్ప విషయం. కాలంతో పాటుగా పాట తన
రూపురేఖలను మార్చుతూ వచ్చినప్పటికీ ఇప్పటికి ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టేలారాయడం వారిలోని నైపుణ్యం.
కొన్ని పాటలు జీవితాంతం నిల్చిపోయేవిగా ఉంటాయి. సినిమాను మర్చిపోయిన పాటను మాత్రం మరువరు. అలాంటి పాటలు
స్ఫూర్తినిచ్చేవి, చైతన్యాన్ని కలిగించేవి, పల్లె ప్రజల శ్రమ జీవితాల్లో నుండి ఊపిరి పోసుకున్నటువంటి
వాటిని అశోక్ తేజ ఎక్కువగా రాశారని చెప్పవచ్చు.
2. కవితా వస్తువు
అశోక్ తేజ రచనల్లో విభిన్నవిషయాలు ప్రస్తావితమవుతాయి. వస్తువు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిచేలా ఉంటుంది. అతను రాసిన నేలమ్మా నేలమ్మా గేయరూపకవిత్వం కావచ్చు, శ్రమకావ్యం కావొచ్చు,సినీగీతాలు కావొచ్చు సామాజికచైతన్యాన్ని అందిస్తాయి. "శ్రామిక, కర్షక గేయాలను రాస్తున్న ఆయన జాతీయస్థాయిలో ఉత్తమగేయరచయితగా అవార్డును అందుకున్నారు. పోరాటాల్ని, సంఘర్షణల్ని గేయరూప కవితల్లో పదిలపరుస్తూ, మానవీయకోణం నుండిరాస్తున్న పాటలు ప్రజల గుండెల్లో చెరగనిముద్రలు వేస్తున్నాయి.స్త్రీల గూర్చి, దళితుల గూర్చి,రైతులగూర్చి, దేశభక్తిగూర్చి, పిల్లల గూర్చి రాయటంలో సిద్ధహస్తులు అయ్యారు. ఈ శతాబ్దపు తెలంగాణ గేయ దిక్సూచులుగా వున్న సుద్దాలహనుమంతు, దాశరథి, చెరబండరాజు, గద్దర్, సి.నారాయణరెడ్డిల వెలుగుల్లో గేయకవిత్వ సాహితీయానం చేస్తున్నారు ఈ కవి" (రవీందర్, గోపగాని. 2012. పుట. 58).
అతని పాటలను వస్తు పరంగా గమనిస్తే అందులో ఉద్యమ స్ఫూర్తి సంబంధమైనవి, వ్యక్తిత్వ వికాసం సంబంధమైనవి, శ్రామిక జీవన సంబంధమైనవి, పర్యావరణ సంధమైనవి సమాజంలో చైతన్యాన్ని నింపుతూ సందేశాన్ని ఇవ్వగలిగే సాహిత్యాన్ని సృజించిన కవిగా అశోక్తేజ కన్పిస్తాడు. అతడు ఎంచుకునే వస్తువు దాని అభివ్యక్తి మనసు మీద గాఢమైన ముద్రను వేస్తాయి. ఒక్కోసారి పాటను పదునైన ఆయుధంగా చేసుకొని ప్రశ్నిస్తాడు మరోసారి. సహజత్వంతో కూడిన సజీవత్వాన్ని చూపెడుతూ పదసౌందర్యాన్ని అర్థగాంభీర్యాన్ని ముడివేసి చక్కటి గేయసుమాలను కూర్చగలడు.
“వచనమునకు వచనాగేయమున
కిక్కడే వ్యత్యాసమున్నది. వచనములో విషయప్రకటనయే ముఖ్యలక్ష్యము. అందుకు వచన రచయిత వైశధ్యము కొరకు
మాత్రమే ప్రయత్నించును.వచనగేయములో వైశధ్యము ప్రధాన గుణము కాదు. పాఠకునిలో భావోద్వేగము కలిగించు అంతర్లయ
దీని ప్రధాన లక్షణము” (నారాయణ రెడ్డి, సి. 1999.
పుట.618) ఈ భావోద్వేగము అశోక్ తేజలో కనిపిస్తుంది.
3. శ్రమైకజీవన సౌందర్యం
"అభివ్యక్తీకరించే విధానమే ఒక సామాన్య విషయాన్ని కళగా మారుస్తుంది.ప్రతి లౌకిక వ్యవహారం కళ కాలేదు. లౌకిక విషయంలోంచి పైకి కన్పించని సామ్యాన్ని దేన్నో ఒకదాన్ని పిండుకుంటాడు. పిండుకున్నదాన్ని మాటల్లోఅభివ్యక్తీకరించడమే కళ” (వీరభద్రయ్య, ముదిగొండ. 2012. పుట. 273).
అశోక్ తేజ కవిత్వంలో ఆ కళ కనిపిస్తుంది. కష్టపడి చెమటోడ్చి పనిచేసేవాళ్లను శ్రమజీవులు అంటాం. వారి పనిలో కష్టాన్ని మర్చిపోతూ అలసట తీర్చుకుంటూ ఉండడానికి పాట పుట్టింది. పాటకు మూలం అది అని వ్యక్తం చేస్తాడు కవి. అందులో భాగంగా కార్మిక గేయాలను, కర్షక గేయాలను, వృత్తికులాల సంబంధించిన గేయాలను చాలా వాస్తవంగా చిత్రించాడు. శ్రమయే ఒక సౌందర్యంగా ఆరాధించిన కవి అశోక్ తేజ. ఆయన రచనల్లోని కొన్ని గేయాలను పరిశీలీద్దాము.
"టప టప టప చేమబొట్లు
తాళలై పడుతుంటే
కరిగికండరాల నరాలే
స్వరాలు కడుతుంటే
పాట
పనితో పాటే పుట్టింది
పని పాటతోటే జతకట్టింది
ఆకలి మంటల బాటలో
ఆకలి
తీరే వేటలో
అలమట చెందే ఊపిరి
అలసటయే మొదటిపాట " (నేలమ్మా నేలమ్మా.పుట - 6)
ఈ పాటలో సహజమైన చిత్రణ కనిపిస్తుంది.
శ్రామికుడి చెమట ఎలా చిందిస్తాడు అనేది కళ్ళకు కట్టినట్టుగా కవివ్యక్తం చేయడం, కండరాల నరాలు ఎంతో బాధకు
లోనైతే గాని ఫలితం ఉండదనే సత్యాలని కవివర్ణించి చెప్తాడు. తెలంగాణాలో ఉన్న దొరతనం కాలంనాటి వారి
అనుభవాలను, పేదల ఆకలి మంటలను చూసిన కవి ఆవేదన వ్యక్తం చేస్తూ, శ్రమ ఒక సౌందర్యంగా దర్శించాడు.
అలాగే ఒక కర్షకుని
గూర్చి తెలుపుతూ అతని గొప్పతనాన్ని ఇలా చాటాడు కవి.
ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చలేడా లెవ్వులే లెవ్వులే
మిన్నులున్న చందమామయ్య చేతిలో
మహిమ ఏమున్నది
మన్నుల
అన్నం తీసే
మహిమ
నీకున్నది
మింటి చుక్కలల్లో వాడు
చెమట చుక్కలల్లో నువ్వు" (నేలమ్మా నేలమ్మా,
పుట - 3)
రైతుని ఆకుపచ్చ చందమామతో పోల్చడం అద్భుతమైన పోలిక. ఆకాశంలో చందమామకు ఏమి మహిమ ఉంది? మట్టిలో నుండి అన్నాన్నీ సృష్టించే నువ్వే గొప్పవాడివని తెలుపుతూ వర్ణించడం వారి భావుకతను తెలుపుతుంది. శ్రమకు కవి ఇచ్చే విలువ సామాజికదృష్టి అవగతమవుతాయి.
"పనిముట్లు" అనే గేయంలో వృత్తికులాలను తెలుపుతూ ఇలా అంటాడు
ఆకులవలె
చిరిగిపోని
చర్మము వలె బిరుసులేని
సుకుమారపు బట్టను తన
జాతికి అందించాలని
మెదడునెంతో వడికి వడికి
మనసురాట్నమును దిప్పి
ఇంధనమ్ము అడగని పొగ
జిమ్మునట్టి ఒక ఇంజన్
ఇచ్చిన ప్రతిభాశాలికి
మెచ్చుతునకరా మగ్గం
కమిలీ
కాయలు కాచిన
చేతులలో సృష్టించిన
కొలిమినుంచి ఒకటొకటిగా
పుట్టిన పనిముట్లెన్నో
గొడ్డలి నాగలి కర్రు
గడ్డపార కొడవలి ఉలి" (నేలమ్మా నేలమ్మా. పుట.
11)
పద్మశాలి మగ్గం నేతలో కష్టాన్ని, కొలిమిలో
పనిచేసి చేతులకు గాయాలను ఏర్పర్చుకున్న కమ్మరివృత్తిని, వారి శ్రామిక జీవనాన్ని సమాజానికి అందించాలనే
తపనే ఈ గేయరూపం.
“పనికరాలు – పరికరాలు” అనే శ్రమకావ్యం లోని కవితలో ఇలా అంటాడు
"రాతిబండలు మోయలేక
బండను కొర్రుగా మలిచిన
రాతియుగ మానవునిశ్రమతో
రాతిగద వెలసింది
గొంతులోకొయ్యలు దిగబడి
గిలా గిలా
కొట్టుకునే
జంతువులు కనబడి
కొయ్యనీటేగా మలిచే కొత్త
తొవ్వ తోచింది" (శ్రమకావ్యం. పుట. 48)
ఇక్కడ ఆదిమ మానవుని రాతియుగం నుండి మనిషి
మార్పు చెంది పరికరాలు ఏవిధంగా తయారుచేసుకున్నాడో తెలుపుతూ, వృత్తులకు ఏ విధంగా ఆసరా అయ్యాయో
తెలిపాడు. నిశిత పరిశీలన చేసాడు కవి.
4.ఉద్యమస్ఫూర్తి
"నేలతారలారా" అనే గేయం హృదయాన్ని కదిలిస్తుంది.
నింగికెగసినారా -
నేలతారలారా
వేగు చుక్కలయ్యి - దారిదారిచూపుతారా
ఏ తల్లిబిడ్డలో - భూతల్లి నుదుటిపై
మీ గుండె నెత్తుటితో బొట్టుపెట్టి పోతిరా" (నేలమ్మా
నేలమ్మా. పుట. 53)
ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టున్న వీరులను ఉద్దేశించిన గేయం ఇది. దీన్ని కుబుసం సినిమాలో చూడవచ్చు.“భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టిపోతిరో” అని అంటారు కవి. ఈ పాట విన్న ప్రతి సహృదయుని మనసులో తెలియని బాధ కలిగి కన్ను చెమర్చని వారుండరు. అంతటి హృదయాన్ని కదిలించే పాట అది. చనిపోయిన వ్యక్తి కుటుంబ వర్ణన చేస్తూ ఈ పాటలో చేను బాధ పడింది, పాలు తాగే లేగదూడ బాధ అంటూ “మా కంటిపాప వెలుగు దివ్వేలవుతురా” అనే వాక్యంలో గొప్ప అర్థం ఉంది ఇంతకన్న సహజమైన గొప్ప సాహిత్యం ఎక్కడుంటుంది.
ఇలాంటి గొప్పనైన పాటలు ఎన్నో రాశారు. వాస్తవిక విషయాలకు దగ్గరగా తెలంగాణ ప్రాంత సంస్కృతులను తెలుపుతూ తెలంగాణ భాషా పదాలను కూడా కొన్ని పాటల్లో పరిచయం చేస్తూ వచ్చారు. “రాములమ్మ” అనే గేయంలో ఉద్యమానికి ఊపిరిపోస్తూ ఇలా అంటాడు కవి.
“గుండె నెత్తురు పోరుబాటలో
కంటనీరు నింపకమ్మా
వీరుల
కన్నీటి జల్లు - ఆకాశం చూడలేదు
వీరమాత కంటతడిని - పుడమి
తల్లిచూడలేదు
భగత్సింగునురిదీస్తే - తిరుగుబాటు ఆగిందా
సప్తర్ హష్మిని నరికితే - పాట మూగపోయిందా
ఆగదు మనరగల్ జెండా పోరాటం” (నేలమ్మా నేలమ్మా. పుట.
42)
ఉద్యమచైతన్యాన్ని నింపుతూ వెనకడుగు వేయొద్దని,
ఎదురీదాలి అని చెప్తున్న గేయం ఇది. ఎవరు చనిపోయిన రాజ్యం కూలిపోదు రణరంగానికి సిద్దపడాలి అంటూ
విప్లవ వాక్యాలను పలుకుతూ ముందుకు నడిపించే బలంలా తోస్తాడు కవి. అశోక్ తేజలో ఒక విప్లవకారుడు ఒక ఉద్యమ
నేత తొంగిచూస్తాడు. సమసమాజానికి కవి నడుంకట్టి, తన వంతు కృషిని ఈ కవిత్వం ద్వారా సమాజానికి
అందించాలనే సామాజికదృక్పథం ఇక్కడ కనిపిస్తుంది. ఒకప్పటి దొరతనం, పెత్తందారీతనం పై తిరుగుబాటుని
కోరుకున్న అభ్యుదయవాది అశోక్ తేజ.
5. స్త్రీవాదదృక్పథం
అశోక్ తేజ కవిత్వంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒకరకంగా ఆయనను స్త్రీవాద రచయితగా చెప్పవచ్చు. స్త్రీ ఆత్మను, ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న కవి. “తరతరాల అణచివేత నుండి స్త్రీకి విముక్తి కలిగించడం, శారీరక మానసిక అనుభూతులను వ్యక్తీకరించి వికాసాన్ని కలిగించడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తూ స్త్రీ చతన్యం లక్ష్యంగా సాగే కవిత్వాన్ని స్త్రీ చైతన్య కవిత్వంగా గుర్తించవచ్చ” (నరసింహారావు, కె .సి. వి.ఎస్.ఎల్. 2005. పుట.3). సమాజంలో స్త్రీ స్థానం ఆమె అనుభవిస్తున్న కష్టాన్ని తన కవిత్వంలో మనసుకు తాకేలా వర్ణిస్తాడు కవి. ఆడపిల్లలు వద్దని బృణ హత్యలు చేస్తూ కడుపులో చంపేసే కసాయిలను వర్ణిస్తూ "అమ్మా నీ కడుపులో ఆడపిల్లనే " అనే గేయంలో ఇలా అంటాడు.
“అమ్మా నీ కడుపులో ఆడపిల్లనే
ఓ నాన్నా నినుచూడాలని
ఆశవున్నదే
కసాయిలా మారకే కడుపులోనే చంపకే
నాకు కూడా భూమిపైన పుట్టాలని
ఉన్నదే
దోపిడీలపై పిడికిలి ఎత్తాలని ఉన్నదే”
(నేలమ్మా నేలమ్మా. పుట. 27)
ఇక్కడ నాకూ పిడికిలి ఎత్తాలని ఉన్నదే అనటంలో
ఆడపిల్లల్లో మార్పును కోరుకుంటున్నాడు కవి. చైతన్యాన్ని కాంక్షిస్తున్నాడు. తన రచనతో మేల్కొలుపుతూ
ఆడపిల్లకు బాసటగా నిలుస్తున్నాడు.
"ఆడిదాన్నిరో" అనే గేయంలో ఇలా అంటాడు.
“ఆడిపోరి
పుట్టిందని
పొత్తిళ్ళలో నన్నుచూసి
మొత్తుకున్నదట తల్లి
పైకమెక్కువియ్యరని
తిట్టిందట
మంత్రసాని" (నేలమ్మా నేలమ్మా. పుట. 32)
ఒక ఆడపిల్ల పుడితే సమాజంలో ఎంత చిన్నచూపు,
తల్లికూడా స్త్రీ అయి ఉండి ఎందుకు పుట్టిందని ఆలోచించటం జీర్ణించుకోలేని విషయం , పైగా మంత్రసాని
కూడా స్త్రీయే అయినా డబ్బు ఆశలో అవేమి కన్పించలేదు. మగాడు పుడితే డబ్బులు ఎక్కువ ఇస్తారని తిట్టుకోవటం
ఎంతటి దౌర్భాగ్యం. ఆ బాధను ప్రస్తుత మనుషుల తీరును నిరసిస్తూ స్త్రీ పక్షపాతిగా నిలిచిన కవి అశోక్ తేజ.
అశోక్ తేజగారి పాటల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన చాలా తేలిక పదాలను వాడుతూనే, సామాజికాంశాలపై దృష్టి
సారించేలా చేస్తారు. కేవలం పాట కోసం పాట రాయడం అన్నట్లుగా కాకుండా విలువలను కాపాడే దిశగా ప్రయత్నం
చేస్తారు. మొదట స్త్రీ హృదయాన్ని ఆవిష్కృతం చేసిన పాట“ఆలు నీకు దండమే” అనే పాటకు
“మద్రాసు కళాసాగర్” అవార్డు వచ్చింది. తర్వాత “కంటె కూతుర్నే కనాలి” అనే
సినిమాలో “ఆడ కూతురా నీకు అడుగడుగునా వందనం” అనే పాటకు నంది అవార్డు 1998లో రాష్ట్ర
ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.
5. ఉపసంహారం
అశోక్ తేజ సామాన్యమైన మనిషిలా కనిపించే అసామాన్య కవి. కమర్షియల్ రంగంలో ఉన్నప్పటికీ ఆ సందర్భాలను సమాజంకోసం ఎక్కువగా వాడుకున్న కవి. తన భావజాలాన్ని నిగూఢంగా దాచుకుంటూ పదిలపరుస్తూ సమాజానికి తనవంతు కృషిని అందించిన వ్యక్తి. సామాజిక అభ్యుదయాన్ని కోరుకునే ఆతని రచనల్లో పరిస్థితులు వస్తువులు, భావాలు శిల్పాలు, పరిష్కారాలు సందేశాలు. ఈ వ్యాసంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చితమయ్యాయి అవి:
- కవి గేయాల్లోని శ్రామికజీవన విధానం చర్చింపబడింది.
- కవిలోని ఉద్యమ స్ఫూర్తి విశదమైంది.
- కవి రచనల్లో స్త్రీవాదం చర్చితమైంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని అశోక్ తేజ సామజిక దృక్పథం గల కవిగా నిరూపించబడ్డాడు. ఇంకా వీరి రచనలపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జనజీవన చిత్రణ, భాషాంశాల దృష్ట్యా పరిశోధనలు జరిగితే బాగుంటుందని నా భావన.
- అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సమాజ శ్రేయస్సుని కోరే కవిగా అశోక్ తేజ దర్శనమిస్తాడు. అలాంటి కవులే సమాజానికి కావాలి. అశోక్ తేజ ప్రజలకవి. వారి కలం నుండి ఇంకా ఎన్నో ఉన్నతమైన రచనలు రావాలని ఆశిద్దాం.
6. పాదసూచికలు
- నేలమ్మా గేయరూపకవిత్వం పరిశీలన, రవీందర్, గోపగాని. పుట. 58.
- ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు, నారాయణ రెడ్డి, సి. పుట. 618.
- విమర్శ, కళాతత్త్వ శాస్త్రాలు, వీరభద్రయ్య, ముదిగొండ, పుట. 273.
- నేలమ్మా నేలమ్మా గేయరూపకవిత్వం,అశోక్ తేజ, సుద్దాల, పుటలు. 3,6,11,53.
- శ్రమకావ్యం, అశోక్ తేజ, సుద్దాల, పుట. 273.
- సమకాలీన తెలుగు కవిత్వంలో వస్తువు - అభివ్యక్తి, నరసింహారావు, కె .సి. వి.ఎస్.ఎల్, పుట.3.
7. ఉపయుక్తగ్రంథసూచి
- అశోక్ తేజ, సుద్దాల. (2013). నేలమ్మా
నేలమ్మా గేయరూపకవిత్వం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ , హైదరాబాద్.
- అశోక్ తేజ, సుద్దాల.(2006). శ్రమకావ్యం,
నవచేతన పబ్లిషింగ్ హౌజ్,హైదరాబాద్.
- నరసింహారావు, కె .సి. వి.ఎస్.ఎల్.
(2005). సమకాలీన తెలుగు కవిత్వంలో వస్తువు - అభివ్యక్తి, మైత్రి బుక్స్ , హైదరాబాద్.
- నాగయ్య,జి. 2019, తెలుగు సాహిత్య సమీక్ష
(1,2 సంపుటాలు). నవ్యపరిశోధక ప్రచురణలు.హైదరాబాద్
- నారాయణరావు,వెల్చేరు.( 1987). తెలుగులో
కవితా విప్లవాల స్వరూపం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్.
- నారాయణ రెడ్డి,సి. (1999). ఆధునికాంధ్ర
కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- రవీందర్, గోపగాని.(2012). నేలమ్మా
నేలమ్మా గేయరూపకవిత్వం పరిశీలన, పాలపిట్టబుక్స్, హైదరాబాద్.
- రాములు, బి.ఎస్. (2011). పాటపుట్టుక
పాటలఅలంకార శాస్త్రం, విశాల సాహిత్య అకాడెమీ, హైదరాబాద్.
- వీరభద్రయ్య, ముదిగొండ.(2012). విమర్శ,
కళాతత్త్వశాస్త్రాలు, తెలుగు అకాడమి,హైదరాబాద్.
- శాస్త్రి, ద్వానా. (2001). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

