headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-05 | May 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. నిజాం యుగపు డిస్టోపియా: చిల్లర దేవుళ్ళు నవలలో బయోపాలిటిక్స్ సైద్ధాంతిక చిత్రణ

ఆచార్య వెంకట రామయ్య గంపా

తెలుగు ఆచార్యులు,
భారతీయ భాషలు & సాహిత్య అధ్యయన శాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - 110 007.
సెల్: +91 9958607789, Email: gvramaiah@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.04.2025        ఎంపిక (D.O.A): 30.04.2025        ప్రచురణ (D.O.P): 01.05.2025


వ్యాససంగ్రహం:

1930-40 దశకం- ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ఉద్యమాలు ఉధృతమైన కాలం. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామం సాగిన కాలం. మహాత్మా గాంధీ నాయకత్వంలో సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి చర్యల ద్వారా దేశం ఏకమైంది. అయితే, ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం భిన్నమైన సామాజిక-రాజకీయ వాస్తవాలను ఎదుర్కొంది. తెలంగాణ ఆ సమయంలో నిజాం రాచరిక పాలనలో భాగంగా ఉండేది. ఇక్కడ స్వాతంత్ర్య ఉద్యమం కంటే భూస్వామ్య వ్యవస్థ, స్థానిక పెత్తందార్ల అత్యాచారాలు ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపాయి. గ్రామీణ ప్రాంతాల్లో దొరల కారణంగా సామాన్య ప్రజలు అజ్ఞానం, ఆర్థిక పీడనలో మునిగిపోయారు. దాశరథి రంగాచార్యుల ‘చిల్లర దేవుళ్ళు’ నవల ఈ సామాజిక అసమానతలను, రాచరిక వ్యవస్థ యొక్క దారుణాలను స్పష్టంగా చిత్రించింది. నవలలోని పాత్రలు-పేదవారు, గిరిజనులు, స్త్రీలు- స్థానిక రెడ్డి, కరణం వంటి వారి హద్దులు లేని అధికారం వలన అన్యాయాలకు గురవుతూ, వారి జీవితాలు ఎలా ‘రాజ్యం గుప్పిట్లో’ ఇమిడిపోయాయో తెలుపుతుంది. సామాన్య ప్రజల జీవితంలోని సంఘర్షణ, నిరాశలు ఆ కాలపు సామాజిక వ్యవస్థలో ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఈ నవల నిజాం పాలనా కాలపు తెలంగాణ సమాజంలోని భూస్వామ్య వ్యవస్థ, కుల-లింగ-వర్గ అసమానతలు, అధికార దుర్వినియోగం వంటి సామాజిక రుగ్మతలను బహిర్గతం చేస్తుంది. ఈ వ్యాసం Michel Foucault యొక్క బయోపాలిటిక్స్ సిద్ధాంతం మరియు డిస్టోపియన్ సాహిత్య దృష్టికోణం ఆధారంగా నవలను విశ్లేషిస్తుంది. ఈ నవల చారిత్రక అన్యాయాలను మాత్రమే కాక, నాటి అణచివేతలను ప్రతిబింబిస్తుంది, మానవ హక్కులు, సామాజిక అసమానతలను విచ్ఛిన్నం చేయడానికి, మానవ గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఒక సాహిత్య ఆయుధంగా పనిచేస్తుంది. ఈ రచన ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం కోసం స్ఫూర్తినివ్వడంతో పాటు, అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకించే సందేశాన్ని అందిస్తుంది.

Keywords: బయోపాలిటిక్స్, డిస్టోపియా, అణచివేత, నిజాం పాలన, తెలంగాణ సమాజం

1. ప్రవేశిక:

తెలుగు పాఠకులకు పరిచయం అవసరం లేని పేరు దాశరథి రంగాచార్యులు. వారు రచించిన చిల్లర దేవుళ్ళు నవల గురించి ప్రత్యేకంగా తెలియజేయవలసిన అవసరం లేదు. విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథం గానూ ఉంది.  చిల్లర దేవుళ్ళు  నవల స్వాతంత్ర్యానికి పూర్వం పాతుకుపోయిన భూస్వామ్యవ్యవస్థ, అధికార దర్పం, తీవ్రమైన సామాజిక-ఆర్థిక అసమానతలతో కూడిన తెలంగాణ సమాజాన్ని లోతుగా, నిశితంగా చిత్రించింది. నిజాం పాలన నేపథ్యంలో సాగే ఈ నవలలో  కుల, వర్గ, లింగ సంక్లిష్ట పరస్పర చర్యలను, వ్యక్తిగత జీవితాలపై, సామాజిక నిర్మాణంపై వాటి ప్రభావాన్ని పరిశీలించడానికి ఒక మంచి చారిత్రక ఆకరంగా పేర్కొనవచ్చు.

పూర్వ పరిశోధన

దాశరథి రంగాచార్యుల నవలలపై ఇప్పటికే విశ్వవిద్యాలయాలలో పరిశోధన జరిగింది. ‘దాశరథి రంగాచార్య రచనలలో జీవిత దృక్పథం’ అనే అంశంపై వి. సావిత్రమ్మ పరిశోధన చేశారు. ‘రంగాచార్య నవలలు- ఉద్యమ నేపథ్యం’ అనే అంశంపై శ్రీదేవి పరిశోధన చేశారు.

దాశరథి రంగాచార్యులు రచించిన చిల్లర దేవుళ్ళు నవలలో కనిపించే అంశాలను మరోసారి నూతన సిద్ధాంతాల ఆధారంగా పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగులోను ‘డిస్టోపియన్’ నవలలు వెలువడ్డాయని తెలుసుకోవడానికి రంగాచార్యుల చిల్లర దేవుళ్ళు నవలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ వ్యాసంలో Michel Foucault  ప్రతిపాదించిన ‘Biopolitics’ సిద్ధాంతాన్ని ఉపయోగించి నవలలోని పాత్రల జీవితాలపై అధికార శక్తుల ప్రభావాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. అలాగే Dystopian  సిద్ధాంతంలో కనిపించే అంశాలు  నవలలో ఏ విధంగా ఉన్నాయి? అవి అప్పటి సమాజంలో నెలకొన్న భయాలు, ఆందోళనలను ఎలా ప్రతిబింబించాయో పరిశీలించడం జరిగింది.

వ్యాస ముఖ్య ఉద్దేశం

దాశరథి రంగాచార్యుల చిల్లర దేవుళ్ళు నవలను బయోపాలిటిక్స్ (Michel Foucault సిద్ధాంతం) మరియు డిస్టోపియన్ సాహిత్య దృష్టికోణాలతో విశ్లేషించడం ఈ వ్యాసం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నవల, నిజాం పాలనా కాలంలోని తెలంగాణ సమాజంలోని అణచివేత, భూస్వామ్య వ్యవస్థ, కుల-లింగ-వర్గ అసమానతలు మరియు రాజకీయ అధికారం యొక్క దుర్వినియోగాన్ని బహిర్గతం చేస్తుంది.

వ్యాసంలో ప్రత్యేక అంశాలు

బయోపాలిటిక్స్ దృష్ట్యా: రాజ్యం శరీరాలు, జీవితాలను ఎలా నియంత్రిస్తుంది? (ఉదా: స్త్రీలు, దళితులు, పేదల శరీరాలు రాజకీయ సాధనాలుగా మార్చబడటం).

డిస్టోపియన్ లక్షణాలు

నిరంకుశ పాలన, భయపెట్టే విధానాలు, వ్యక్తిగత స్వేచ్ఛల అణచివేత సమాజంలో ఎలా ఉంది? అని తెలుసుకోవచ్చు (ఉదా: వనజ, వనజ తల్లి, పీరిగాడు, గిరిజన పాత్రలు మొదలైనవి..).

ఈ విశ్లేషణ ద్వారా, చిల్లర దేవుళ్ళు నవల చారిత్రక అన్యాయాలను మాత్రమే కాకుండా, ప్రస్తుతం కొన్ని సామాజిక-రాజకీయ సమస్యలకు కూడా అద్దం పట్టే శక్తిని కలిగి ఉందని తెలుస్తుంది. మానవ హక్కులు, స్వేచ్ఛ మరియు న్యాయం మొదలైన అంశాలను ప్రధానంగా చర్చించడం జరిగింది.

బయోపాలిటిక్స్, డిస్టోపియన్ సిద్ధాంతాల పరిచయం

20వ శతాబ్దం ప్రారంభంలో ‘బయోపాలిటిక్స్’ అనే భావన ప్రారంభమైంది. స్వీడిష్ రాజకీయ శాస్త్రవేత్త రుడోల్ఫ్ క్జెలెన్ (Rudolf Kjellén) దీనిని మొదటగా ఉపయోగించిన వ్యక్తుల్లో ఒకరని భావిస్తారు. ఆయన ‘స్టేట్’ అనే భావనను తన సిద్ధాంతంలో ముడిపెట్టారు. క్జెలెన్ అభిప్రాయం ప్రకారం, ‘నేషన్-స్టేట్’ అనేది ప్రజల ఆత్మతత్వాన్ని వ్యక్తీకరించే సహజ రూపం. ‘స్టేట్’ అనేది జీవన రూపంగా ప్రతిపాదించబడుతుంది, ఇది సమాజంలో తరగతి (Class), సమూహాల మధ్య పోరాటాల ద్వారా వ్యక్తమవుతోంది. Thomas Lemke అనే పరిశోధకుడు ‘Biopolitics An Advanced Introduction’ అనే పుస్తకంలో బయోపాలిటిక్స్ సిద్ధాంతాన్ని వివరంగా తెలిపారు. వారు తన రచనలో Rudolf Kjellén అభిప్రాయాన్ని కింది విధంగా వివరించారు “క్జెల్లెన్ బయోపాలిటిక్స్ భావనను ఈ విధంగా పరిచయం చేశాడు: ‘జీవిత స్వభావానికి సంబంధించిన ఈ ఉద్విగ్నతను గమనించినప్పుడు... ఈ శాస్త్రానికి జీవశాస్త్రం (బయోలజీ) పేరుతో బయోపాలిటిక్స్ అని నామకరణం చేయాలనే ఉద్దేశం నాలో మొలకెత్తింది;... సామాజిక సమూహాల మధ్య జరిగే యుద్ధంలో ఉనికి మరియు వృద్ధి కోసం జీవిత సంఘర్షణ యొక్క నిర్దయాత్మకత స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో, ఈ సమూహాల లోపల ఉనికి కోసం ఉద్దేశ్యాలతో శక్తివంతమైన సహకారం కూడా గమనించవచ్చు"  . (Thomas, Lemke. Biopolitics An Advanced Introduction. P-2) ఆయన మాటల్లో ‘బయోపాలిటిక్స్’ అనే అంశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే  ‘సమాజపు గుంపుల మధ్య పౌర యుద్ధం అనేది జీవన పోరాటం యొక్క క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అదే సమయంలో, సమూహాల్లో  సహకార శక్తిని గుర్తించవచ్చు, ఇది జీవన అవసరాల కోసం పనిచేస్తుంది’.  “బయోపాలిటిక్స్ అనే భావన జీవన ఉత్పత్తి మరియు రక్షణ అనేది  మరణం వ్యాప్తితో  ఎలా అనుసంధానించబడుతుందో విశ్లేషించడానికి ఒక వివరణాత్మక కీలక పద్ధతిగా పనిచేసింది. ఇది జీవన రక్షణ మరియు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చే విధానాలను, అలాగే మరణానికి కారణమయ్యే  యాంత్రికతల గురించి పరిశీలిస్తుంది.” “బయోపాలిటిక్స్ సిద్ధాంతం సమకాలీన సామాజిక శాస్త్రాల్లో ఇటీవల మరింత ప్రాధాన్యత పొందింది. ఆధునిక యూరోప్లో లైంగికత, నేరాలు, మానసిక రుగ్మతలపై నియంత్రణను గురించి Michel Foucault  చేసిన వంశవృక్ష పరిశోధన (genealogical research) ద్వారా ఇది ప్రారంభమై, ఇప్పటికి బయోపాలిటిక్స్ పరిశోధన విస్తృతమైన అంతర్ శాఖాగత దృక్పథంగా (inter-disciplinary orientation) అభివృద్ధి చెందింది. ఇది వివిధ ప్రాదేశిక మరియు తాత్కాలిక సందర్భాల్లో జీవులపై అధికారం (rationalities of power) ఎలా పనిచేస్తుందో  విశ్లేషిస్తుంది”  (The Routledge Handbook of Biopolitics. P -1). బయోపాలిటిక్స్ సిద్ధాంతం పై ఆంగ్లంలో విస్తృతమైన సమాచారం లభిస్తుంది.  వ్యాసానికి అవసరమైనంత మేరకు బయోపాలిటిక్స్ సిద్ధాంత సారాంశాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. బయోపాలిటిక్స్ సిద్ధాంతం యొక్క  ప్రధాన భావన వ్యక్తి జీవితంపై రాజ్యం అధికారాన్ని చెలాయించడం. ఇదే బయోపాలిటిక్స్ సిద్ధాంతం యొక్క మూలాధారం. రాజకీయ అధికారం మరియు పాలన వ్యక్తి జీవితాన్ని ఎలా నియంత్రిస్తుంది? రాజ్యం వ్యక్తితో ఎలా వ్యవహరిస్తుంది? అనేది ఈ సిద్ధాంతంలో కీలకం. బయోపాలిటిక్స్ సిద్ధాంతం భావనను రూపొందించడంలో Michel Foucault ముఖ్య పాత్ర పోషించాడు. ఆధునిక రాజ్యాలు,  జనాభా నిర్వహణ, నియంత్రణ (పుట్టుక, ఆరోగ్యం, మరణాలు వంటివి) ద్వారా ఎలా అధికారాన్ని నిర్వహిస్తాయి? అనేది అతని పరిశోధనలలో ప్రధానంగా కనిపించే అంశం. అధికారులు మానవ జీవితానికి సంబంధించిన జీవసంబంధ అంశాలను (జననం, ఆరోగ్యం, మరణం) ఎలా నియంత్రిస్తారు? అనేది Michel Foucault వివరంగా చర్చించారు. థామస్ లెమ్కే అనే రచయిత ప్రకారం, బయోపాలిటిక్స్ సిద్ధాంతం  రెండు రూపాల్లో పనిచేస్తుందని ‘Biopolitics: An Advanced Introduction’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అవి 1. శిక్ష ప్రధానమైన అధికారం 2.  ఉదార పాలన. శిక్ష ప్రధానమైన అధికారం కలిగిన రాజ్యంలో  వ్యక్తులపై నేరుగా నియంత్రణ ఉంటుంది. ఉదార సమాజాల్లో శాస్త్రీయ పరిపాలన విధానాలైన ‘స్వేచ్ఛ’, ‘హక్కులు’తో కూడిన  జీవితం ఉంటుంది. లెమ్కే ఇక్కడ ఒక వైరుధ్యాన్ని సూచిస్తాడు. శిక్ష ప్రధానమైన అధికారం గల రాజ్యంలో కొన్ని సమూహాలు  మరణించడానికి దారితీస్తాయి (ఉదా: యుద్ధాలు, జాతి శుద్ధి). ఇది నైతిక మరియు రాజకీయ ప్రశ్నలను లేవనెత్తుతుంది. Michel Foucault తర్వాత బయోపాలిటిక్స్ సిద్ధాంతాన్ని అగాంబెన్, నెగ్రి, ఎస్పోసిటో వంటి ఆలోచనాపరులు ఈ భావనను విస్తరించారు. ఇది ఇప్పుడు తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, ప్రయోగాత్మక పరిశోధనలతో అంతర్ సంబంధం కలిగి ఉంది. హాబ్స్  ‘రాజ్యం యొక్క కృత్రిమ వ్యక్తిత్వం’ అనే భావన ఆధునిక రాజకీయ సిద్ధాంతంతో బయోపాలిటిక్స్ సిద్ధాంతం సంబంధాన్ని చూపిస్తుంది. బయోపాలిటిక్స్ సిద్ధాంతం అధికారం వ్యక్తి యొక్క జీవిత స్థాయిలో ఎలా పనిచేస్తుంది? అనేదానిపై దృష్టి పెడుతుంది. ఇది కేవలం చట్టాలను మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడం, అనుభవించడంపై వివిధ సంస్థలు/వ్యవస్థలు,  విధానాలు చూపే ప్రభావాన్ని వివరిస్తుంది. బయోపాలిటిక్స్ సిద్ధాంతం వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక న్యాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలను వివరిస్తుంది. 

డిస్టోపియన్ నిర్వచనాలు

  • డిస్టోపియా అనే పదాన్ని నిఘంటువుల్లోనూ పుస్తకాలలోనూ వివిధ రకాలుగా నిర్వచించారు. వ్యాసం అవసరం మేరకు కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాను. “ప్రజలు అమానవీయ మరియు భయంతో కూడిన జీవితాలను గడిపే ఒక కల్పిత ప్రపంచం; యుటోపియాకు విరోధి. " (Merriam-Webster’s Collegiate Dictionary, 11th Edition (2003)
  • “బాధ, అణచివేత, లేదా భయం వంటి చెడ్డ పరిస్థితులతో కూడిన ఒక కల్పిత సమాజం లేదా రాజ్యం ” (American Heritage Dictionary, 5th Edition (2011))
  • “డిస్టోపియా అనేది సమాజ పతనం, సర్వాధికార పాలన, మరియు వ్యక్తిగత స్వేచ్ఛల నష్టం వంటి భయాలను ప్రతిబింబిస్తుంది. ఇది యుటోపియన్ ఆశయాలకు విరుద్ధంగా నిలిచిపోతుంది ” (Michael D. Gordin et al. (eds.), Utopia/Dystopia (2010) p. 7)
  • “డిస్టోపియా అనేది అవాంఛనీయమైన లేదా భయానకమైన సమాజాన్ని వివరించడానికి ఉపయోగించే పదం. ఇది సాధారణంగా అధికార ప్రభుత్వాలు లేదా పర్యావరణ విపత్తులతో ముడిపడి ఉంటుంది” (Gregory Claeys, Dystopia: A Natural History (2017) p. 1)

ఆంగ్లంలో డిస్టోపియా సాహిత్యానికి సంబంధించిన సమాచారం విస్తృతంగానే ఉంది. పైన పేర్కొన్న డిస్టోపియా (Dystopia) అనే పదానికి నిఘంటువుల్లో, పుస్తకాలు ఇచ్చిన నిర్వచనాలను విశ్లేషిస్తే, ఈ క్రింది ముఖ్యాంశాలు బయటపడతాయి:

ప్రాచీనకాలంలో నుంచి గ్రీకు సమాజం ఆదర్శ రాజ్యాన్ని చర్చించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్లేటో రచించిన ‘ది రిపబ్లిక్’ (The Republic)లో ఆదర్శ సమాజం ఎలా ఉండాలో వివరించబడింది. ఇది కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే కాకుండా, న్యాయం, విద్య, నైతికత మరియు మానవ అభ్యుదయం గురించిన సమగ్ర దృష్టిని కలిగి ఉంటుంది. తర్వాత కాలంలో ఇదే అంశంపై విస్తృతమైన చర్చ జరిగినట్లు కనిపిస్తుంది. ఈ ఆదర్శ రాజ్యం యుటోపియా ప్రపంచానికి దగ్గరగా ఉంటుంది. యుటోపియా అనేది ఆదర్శవంతమైన, శాంతియుతమైన సమాజాన్ని సూచిస్తే, డిస్టోపియా అనేది పూర్తిగా విరుద్ధమైన సమాజాన్ని సృష్టిస్తుంది. అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ డిస్టోపియాను ‘బాధ, అణచివేత లేదా భయం’ వంటి చెడ్డ పరిస్థితులతో కూడిన ప్రపంచంగా వర్ణిస్తుంది. ఇది మానవులకు భయానకమైన, అసహ్యకరమైన జీవిత పరిస్థితులను చిత్రిస్తుంది. గోర్డిన్ అభిప్రాయం ప్రకారం డిస్టోపియా అనేది  ఒక నియంతృత్వ ప్రపంచాన్ని సూచిస్తుంది, ఇక్కడ ప్రజలు రాజకీయ, సామాజిక లేదా పర్యావరణ కారణాల వల్ల అణచివేయబడతారు. గ్రెగరీ అభిప్రాయంలో  డిస్టోపియా సమాజంలో మానవీయత లేని పరిస్థితులు, నిరంకుశ పాలన మరియు ప్రజలు  హక్కులు కోల్పోవడం వంటి అంశాలు ఉంటాయి.  క్లుప్తంగా చెప్పాలంటే డిస్టోపియా అనేది ఒక భయంకరమైన, అస్తవ్యస్తమైన సమాజాన్ని వర్ణించే సాహిత్య లేదా సైద్ధాంతిక భావన. ఇది యుటోపియన్ ఆదర్శాలకు విరుద్ధంగా, మానవ హక్కులు, స్వేచ్ఛ కోల్పోయిన, అణచివేతతో కూడిన ఒక భయానక పరిపాలనలో ఉన్న వ్యవస్థను చిత్రిస్తుంది. ఈ సైద్ధాంతిక భావన సాహిత్యం, సినిమాలు మరియు రాజకీయ సిద్ధాంతాలను విమర్శనాత్మకంగా చర్చిస్తూ ఆంగ్లంలో పలు గ్రంథాలు లభిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను/లక్షణాలను తెలుగులో వెలువడిన నవలకు అన్వయం చేసే ప్రయత్నం ఈ వ్యాసంలో జరిగింది. ముఖ్యంగా దాశరథి  రంగాచార్యుల చిల్లర దేవుళ్ళు నవలలో పైన పేర్కొన్న లక్షణాలన్నీ కనిపిస్తాయి. డిస్టోపియన్ నవల గురించి ఆంగ్లంలో ఉన్న నిర్వచనం “డిస్టోపియన్ నవల  అనేది  గద్య కథనం యొక్క ఒక రూపం. 1920 మరియు 1960 మధ్య కాలంలో, దీని వ్యక్తీకరణలు అనేక నిర్దిష్ట లక్షణాలతో సూచించబడ్డాయి. ఇటువంటి రచనలు భౌతిక చారిత్రక పరిస్థితులు, బౌద్ధిక మరియు సాంస్కృతిక ప్రవాహాలు, మరియు నాటకీయ సామాజిక మార్పులతో కూడిన సంక్లిష్టమైన వలయంలో చిక్కుకుపోయి, నేరుగా వాటికి ప్రతిస్పందించాయి” (Stock, Adam. Mid-Twentieth-Century Dystopian Fiction and Political Thought. P-1).

2. చిల్లర దేవుళ్ళు నవల- బయోపాలిటిక్స్, డిస్టోపియన్ దృశ్యాలు:

దాశరథి రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళు నవల ఒక ప్రత్యేకమైన సామాజిక-చారిత్రక వాతావరణంలో బలంగా పాతుకుపోయిన బయోపాలిటిక్స్ మరియు డిస్టోపియన్ అంశాల సంక్లిష్ట చర్యలను పరిశీలించడానికి ఒక ప్రధానమైన  కథనాత్మక దృశ్య మాధ్యమంలాగా కనిపిస్తుంది. నవలలో చిత్రీకరించిన అట్టడుగు వర్గాల జీవిత వాస్తవికతను గుర్తించడం,  వాస్తవికతను కొనసాగించడానికి వివిధ యంత్రాంగాలు ఎలా దోహదం చేస్తాయో డిస్టోపియన్ సాహిత్యం అన్వేషిస్తుంది. డిస్టోపియన్ సాహిత్యం తరచుగా ఒక విమర్శనాత్మక అద్దంలా పనిచేస్తుంది, గతంలో జరిగిన ఆందోళనలను ప్రతిబింబిస్తుంది, చిల్లర దేవుళ్ళు నవలలో రచయిత  ఈ పద్ధతిని చాకచక్యంగా ఉపయోగించి, ప్రగతి మరియు అభివృద్ధి బదులుగా సామాజిక అనిశ్చితి, సాంస్కృతిక పరాయికరణ, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయిన వారిని గురించి నవలలో వివరిస్తాడు. చిల్లర దేవుళ్ళు నవల కథా నిర్మాణం, పాత్ర వికాసం మరియు ఇతివృత్త అంశాల అన్వేషణ బయోపాలిటిక్స్ శక్తులు, డిస్టోపియన్ భూభాగాన్ని ఎలా రూపొందిస్తాయో మరియు దానిలో నివసించే వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రధాన పాత్రల కథలు, కొన్ని సహాయ పాత్రల అణచివేత.. ఆత్మాశ్రయ అనుభవం, ఈ సందర్భంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొన్ని పాత్రలు  చవిచూసిన హృదయ విదారక ఘట్టాల ద్వారా రచయిత మానసిక అనుభవాల కథన వ్యక్తీకరణ అవగతమవుతుంది. దాశరథి రంగాచార్య రచన సామాజిక నియంత్రణ, బయోపాలిటిక్స్ యొక్క వివిధ కోణాలను, డిస్టోపియన్ పర్యవసానాలను పరిశీలించడానికి ఒక విలువైన ఆకరంగా మారుతుంది. ఈ నవల కొన్ని సందర్భాలలో చరిత్రను వివరించే ప్రత్యక్ష సాక్షి పాత్రను,  అంతర్దృష్టులను అందిస్తుంది.

నవలలో ఒక ప్రధాన పాత్ర అయినా వనజ గురించి రచయిత చిత్రించిన విధానం ఆనాటి సమాజంలో ఉన్న బయోపాలిటిక్స్ అధికారం, డిస్టోపియన్ సమాజానికి సంబంధించిన అమానవీయ సంఘటనలు గుర్తుకు వస్తాయి. “తాను పుట్టిందీ, పెరిగిందీ ఈ గడీ లోనే. ఇక్కడే చాకిరీ చేస్తూందీ, పశువులా, తిండి పెడ్తారు దొర. తిండి పెట్టి పశువులా చాకిరీ చేయించుకున్నా బాగుండేది. తాను వారికి విలాస వస్తువు. దొరలెవరైనా గడీకి వస్తే వారి గదుల్లోకి భోజనాలూ, ఫలహారాలూ మోసుకెళ్ళాలి. అని అక్కడ పెట్టి వస్తే సరిపోతుందా? వారి కోర్కెలకు తాను లొంగిపోవాలి, వారు పశువుల్లా ప్రవర్తిస్తూంటే తాము బొమ్మలా వుండాల్సిందే కానీ కిమ్మనడానికి వీల్లేదు. ఇదీ తన బ్రతుకు. ఈ కుళ్ళు నుంచి దూరం కావడానికి గడీ వదిలి పారిపోదామనుకుంది చాలాసార్లు కాని, తాను ఆడపాప ఎక్కడున్నా పట్టితెప్పిస్తాడు దొర, కాకున్నా ఎక్కడికి పారిపోతుంది? ఏం చేస్తుంది? ఆడబాపగా బ్రతికిందానికెవ్వడైనా అండ చూపుతాడా? వేశ్యగా జీవించాలి.” (రంగాచార్య, దాశరథి. చిల్లర దేవుళ్ళు. పుట- 16) రచయిత రచనలో పేర్కొన్న వివరాల ద్వారా గడీలో స్త్రీ బయోపాలిటిక్స్ (అధికార) నియంత్రణలో ఉందని, ఆమె శరీరాన్ని పాలకవర్గం వారి ప్రయోజనం కోసం ఒక విలాస వస్తువుగా మారిందని  తెలుస్తుంది. వనజతో పాటు ఆమె తల్లి, మరికొందరు మహిళలు కూడా అదే దుస్థితిని చవిచూడడం నవలలో కనిపిస్తుంది. ఈ అంశాలు డిస్టోపియన్ ఇతివృత్తాలను వివరిస్తాయి. అణచివేతతో కూడిన సమాజాన్ని చూపిస్తుంది. స్త్రీలు వస్తువు/పశువుల మాదిరిగా పరిగణించబడతారు, బయోపాలిటిక్స్, డిస్టోపియన్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయి. బయోపాలిటిక్స్, డిస్టోపియన్ సమాజంలో  స్త్రీలు  తీవ్రమైన అణచివేతకు గురవుతారు . ఆమెను మనిషి కంటే తక్కువగా చూస్తారు, బానిసత్వంలోకి బలవంతం చేస్తారు.  తప్పించుకునే అవకాశం లేకుండా సంపన్నుల లైంగిక దోపిడీకి గురవుతారు. రచయిత వనజ పాత్ర గురించి వివరిస్తూ-

“ఆవిడకు మొదటి రాత్రి గుర్తుకు వచ్చింది. ఆరోజు ఇంద్రారెడ్డి వచ్చాడు-ఇందిరమ్మ దొరసానికి తమ్ముడు. ... తలంటి పోసింది తల్లి తనకు, పాలపిట్ట చీర కట్టించింది దొరసాని, కడుపునిండా తిండి పెట్టింది దొరసాని, తన దగ్గర కూర్చొని, ఆ రాత్రి ఎంత తాగారో గానీ  దొరలు ఒకళ్ళమీద ఒకళ్ళ పడ్డారు. తనకు పలహారాల పల్లెం యిచ్చి పంపించింది దొరసాని. తనకళ్ళు చెమ్మగిల్లడం గమనించింది. తాను గుండెలో గుబులు నిండింది. అడుగు ముందుకు పడలేదు. దొరసాని గద్దించింది. తనకు కన్నీళ్ళు దుమికాయి. అడుగు ముందుకు పడింది. ఇప్పుడు పాణి ఉన్న గదిలోనే ఇంద్రారెడ్డి దిగింది. ఫలహారాల పళ్ళెంతో గదిలో ప్రవేశించింది తాను. ఎందుకో గుండె వేగంగా కొట్టుకుంది. తనను చూడగానే లేచి ‘రావే వయ్యారి’ అని చేయిపట్టి లాగాడు. పళ్ళెం జారవిడిచి, కేకవేసి పరుగెత్తింది తాను. తల్లిమీదపడి పెద్దగా ఏడ్చింది. తల్లికూడ కన్నీరు కార్చింది. ఆమె మాత్రం ఏం చేస్తుంది? దొరసాని గద్దించింది. మరొక దాసి  తనను పట్టుకొనిపోయి గదిలో వేసి తలుపేసింది. ఆ దృశ్యం తల్చుకుంటే, ఆమె కళ్ళు జల్లుమంది. వాటినుంచి గడికి వచ్చిన దొరల్లో చాలామంది తనను కోరుకున్నారు. వచ్చిన ప్రతివాడూ తననే చూసేవాడు; కళ్ళు చీల్చుకొని అలా చూచినప్పుడల్లా పిడుగు పడేది తనమీద. అయినా, యంత్రవతుగా వ్యవహరించాలి తాను.” (పైదే)

డిస్టోపియన్ సిద్ధాంతంలో వ్యక్తులు అణచివేతకు గురికావడం, స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు ఆటవిక సమాజాన్ని వివరిస్తుంది. స్త్రీని అమానవీయంగా, ఆమె అక్కడ నుంచి తప్పించుకోలేకపోవడం లేదా ప్రతిఘటించలేకపోవడం ఒక నియంతృత్వ వ్యవస్థను చిత్రిస్తుంది. ఇది డిస్టోపియన్ కథనాలలో సాధారణం, ఇక్కడ అధికారం సంపూర్ణమైనది, ప్రతిఘటనకు  అవకాశం ఉండదు. గడీ అనేది ఒక అధికార పీఠం. ఇక్కడ తీవ్రమైన అణచివేతకు గురికావడం, పశువుల్లా చూడడం, రామిరెడ్డి, ఇంద్రారెడ్డి  పురుషులతోపాటు దొరసాని, దాసి స్త్రీలు కూడా  పెత్తనం చేయడం,  తోటి స్త్రీలను బానిసత్వం, లైంగిక దోపిడీకి  సహకారాన్ని అందించడం అనేది డిస్టోపియన్ సమాజంలో ఒక సాధారణ అంశంగా కనిపిస్తుంది. రామిరెడ్డి తన ధన, అధికార బలంతో ఎందరో స్త్రీలను ఇబ్బందులకు గురిచేశాడు. “తాను పొలం నుంచి వస్తున్నాడా సాయంకాలం. నీళ్ళ బిందెలు నెత్తిన పెట్టుకొని ఇండ్లకు వెళ్తున్న ఆడవారు "దొరవారు. దొరవారు" అని తప్పుకున్నారు. కాని కుమ్మరి మల్లి కుండ నెత్తిన పెట్టుకొని తన ముందు నుంచి వయ్యారంగా సాగిపోతూంది. ముందునుంచి వస్తున్న వాడెవడో "దొర, దొర' అనేసరికి బెదిరి పక్కకు తప్పుకుంది. వెనక ఇంటి చూరులోంచి పొడుచుకొని వచ్చిన వాసం గుచ్చుకొని కుండ పగిలిపోయింది. ఒంటినిండా స్నానం చేసినట్లు నీళ్ళు పడ్డాయి. తడి బట్టల్లోంచి పొంగిన అవయవాలు స్పష్టంగా కనిపించాయి. తానలాగే నుంచుండిపోయాడు. క్షణం సిగ్గుతో కుంచించుకుపోయి, చేతులు కప్పుకొని తల వంచుకొంది మల్లి. దగ్గు దగ్గి సాగివచ్చాడు తాను. ఆ దగ్గులోని అంతర్యం తెలుసు మాదార్సాబ్కు. రాత్రి మల్లి వచ్చింది గడీకి - కుమ్మరి మల్లి.”  (పైదే. పుట-109)

అలాగే కరణం, ఇతర అధికారులు చేసిన దురాగతాలు నవలలో చాలా  కనిపిస్తాయి. నవలలో ఒక చోట రచయిత పేర్కొన్న అంశాలు బయోపాలిటిక్స్ మరియు డిస్టోపియన్ దృశ్యాలను స్పష్టంగా తెలియజేస్తాయి. కరణంగారు చుట్ట కాలుస్తూ బయటికి వచ్చి అన్నాడు “ఓహో దొరవారా? దారితప్పి వచ్చిన్రే! అయినా, దొరలు ఊరికెందుకు వస్తరుగని రాండ్రి కూచోండ్రి." (పైదే. పుట -108)

‘రెడ్డిగారు కరణంను ఒక హత్య విషయాన్ని పోలీసులకు చెప్పకుండా ఉండమని కోరారు. బదులుగా, కరణం ఏదైనా అడిగితే ఇస్తానని హామీ ఇచ్చారు. కరణం "నిజంగానా?" అని అడగ్గా, రెడ్డిగారు "నిజంగా" అని ధృడంగా చెప్పారు. అలాగే కరణం గిరిజనులను చంపిన విషయం రెడ్డి ఇతరులకు చెప్పకుండా ఉండేలా వారి మధ్య రహస్య ఒప్పందం జరుగుతుంది.’ (సుదీర్ఘమైన సంభాషణల సారాంశం ఇది)  నవలలో సంభాషణల రూపంలో ఉన్న విషయాన్ని విశ్లేషించినట్లయితే- బయోపాలిటిక్స్, డిస్టోపియన్ సమాజాలలో కనిపించే  ఇతివృత్తాలను సూచిస్తుంది. ‘ఇగ చూడు ప్రభుత్వం అంటే నువ్వు, నేను. ఇద్దరం ఆపస్లో అడ్డం తగలొద్దు’ అనే ఈ వాక్యం ప్రభుత్వ అధికారానికి, శరీరానికి  ఉనికికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. అధికారం కేవలం వ్యక్తులకు నియమాలను రూపొందించడం మాత్రమే కాకుండా, జీవితాన్ని నియంత్రించడం ద్వారానే ఉపయోగించబడుతుందనే Michel Foucault అభిప్రాయానికి దగ్గరగా ఉంది. పై సంఘటనను కింది విధంగా వివరించవచ్చు.

వ్యక్తిగత శరీరం →

హింసాత్మక చర్యలు/మరణం→

 రాజ్యం /పోలీస్ అధికారులు →

బయోపాలిటిక్స్/ డిస్టోపియన్ సమాజం

  • వ్యక్తిగత శరీరం → హింస/మరణం చర్యలు: బయో పాలిటిక్స్ చట్రంలో, మనిషి జీవితం/శరీరం వ్యక్తిగతం కాదు (ప్రైవేట్ కాదు). శరీరాన్ని రాజకీయ అధికారం నియంత్రిస్తూ ఉంటుంది. హింస లేదా మరణ చర్యలు వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, ఒక క్రమబద్ధమైన అనుమతించిన మార్గంలో వ్యక్తుల జీవితాన్ని నిర్ణయించడం జరుగుతుంది. భయం, బెదిరింపుల ద్వారా వ్యక్తులను  నియంత్రించడానికి అధికారం ఒక సాధనం కావచ్చు.
  • హింసాత్మక చర్యలు/మరణం→ రాజ్యం /పోలీస్ అధికారులు : ఈ విషయం హింస మరియు రాజ్యం లేదా రాజ్యం ఏజెంట్ల (పోలీసులు వంటివారు) అధికారం మధ్య కీలకమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. బయోపాలిటిక్స్ తరచుగా చట్టబద్ధమైన హింసపై రాజ్యం గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ప్రభుత్వ ఆజ్ఞలు, చర్యలు, కొన్నిసార్లు హింసతో కూడినవిగా ఉంటాయి. సిద్ధాంత పరంగా విస్తృత జనాభా యొక్క భద్రత, శ్రేయస్సుకు అవసరమైనవిగా రూపొందించబడినప్పటికీ, కొన్నిసార్లు  అవి వ్యక్తులకు హాని కలిగించేలా ఉంటాయి.
  • రాజ్యం /పోలీస్ అధికారులు → బయోపాలిటిక్స్/ డిస్టోపియన్ సమాజం : బయోపాలిటిక్స్ యొక్క సారాంశం ఇక్కడే ఉంది. హింసాత్మక చర్యల ద్వారా అమలు చేయబడే ప్రభుత్వ ఆజ్ఞలు అంతిమంగా బయోపాలిటిక్స్ నియంత్రణ, పాలన యొక్క ఉద్దేశ్యానికి ఉపయోగపడతాయి. ఇది రాజ్యం లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల జీవితాలను, ప్రవర్తనలను రూపొందిస్తుంది. ఈ విధానాల ద్వారా, కొన్నిసార్లు వ్యక్తి జీవితం/శరీరం రాజ్యం కోసం బాధ్యతలను నిర్వహించవలసిన వస్తువుగా/ ఒక సాధనంగా మారుతుంది.

డిస్టోపియన్ సమాజం – వ్యక్తి స్వాతంత్ర్య నియంత్రణ

డిస్టోపియన్ సాహిత్యం, ఆలోచన తరచుగా నియంత్రణ లేని అధికారం మరియు నియంత్రణ యొక్క ప్రతికూల పరిణామాలను అన్వేషిస్తాయి.

వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం, ప్రభుత్వం - హింస, అమానవీయత:

పైన పేర్కొన్నట్లు రాజ్యం నుండి వ్యక్తికి అధికార ప్రవాహాన్ని సూచిస్తుంది. క్రమంగా ఇది కింది స్థాయి వ్యక్తుల జీవితాన్ని అణచివేస్తుంది. అనేక డిస్టోపియాలలో, రాజ్యం విపరీతమైన నియంత్రణను కలిగి ఉంటుంది. వ్యక్తులకు వారి స్వంత శరీరాలు మరియు జీవితాలపై తక్కువ స్వయంప్రతిపత్తి ఉంటుంది.

డిస్టోపియన్ కథలు/కథనాలు తరచుగా నియంత్రణను కొనసాగించడానికి హింస మరియు అణచివేతను ఉపయోగించే రాజ్యాలను వర్ణిస్తాయి. ఈ హింస తరచుగా సమాజం యొక్క స్థిరత్వం లేదా మెరుగుదలకు అవసరమైనదిగా హేతుబద్ధీకరించబడుతుంది.

వ్యక్తిగత శరీరాలు కేవలం రాజ్యాధికార సాధనాలుగా లేదా లక్ష్యాలుగా మారినప్పుడు, అమానవీయంగా మారే ప్రమాదం ఉంది. వ్యక్తులను స్వతహాగా విలువ కలిగిన స్వయంప్రతిపత్తి గల జీవులుగా గుర్తించడం కంటే నియంత్రించడానికి ఉపయోగపడే వస్తువులుగా కుదించవచ్చు.

"లగ్గమై నెన్క పెన్మిటిలోని అత్తారింటికి పోతాంది మా అవ్వ గీ ఊరునుంచి. దొరోరు గడీ ముంగల కూకొమంటే ఆడోల్లు ముంగల్నుంచి పోగూడదు. మా అమ్మ పెన్మిటి కెరికెలేక దొర ముంగల్నుంచే ఎల్లి పోయిండు. మా అవ్వ ఆడనే నిలబడ్డది. దొర చూసిండు. మాదార్సాబు నడిగిండు ఎవరని? తెమ్మంటరా అంటడిగిండు మాదార్సాబ్.  దొర లేచి గడీల కొచ్చిండు. పెళ్ళం వస్తలేదని పెన్మిటి చూసిండు. మా అవ్వకాడికి పోయిండు. ఇద్దరు కల్పి ఊరిబైటికెల్లిన్రు. మాదార్సాబ్ ఉరికిండు. పిలిచిండు. దొర పిలుస్తాండు అన్నడు. పెళ్ళం నుండమంటని పెన్మిటి బైలెల్లిండు. 'దొర దాన్నీ పిలుస్తాండు' అన్నడు మాదార్సాబ్. 'ఆడమనిషితో నేం పనంది. నేనొస్తగద' అన్నడు పెన్మిటి. మాదార్సాబ్ నవ్విండు. మొగాల్లతో వేంపనిర దొరకు. ఆడోల్లతోటే పని' అన్నడు. మా అవ్వ చెప్పబట్కే ఎరికైంది. దాని పానాలు పైపైన పోయినట్లయిందంటిది. పెన్మిటి మాదార్సాబ్ కాళ్ళమీద పడ్డడు. 'రచ్చించురి, కొత్త పెళ్లం' అంటని బతిమలాడిండు. 'ఏట్ల పోనిస్తునా? దొరకంట్ల పడ్డనక పోతాది ఆడది' అని నడ్వమంటిని ఉరిమిండు మాదార్సాబ్. అవ్వ ఉరుకు పుచ్చుకున్నది. మాదార్సాబ్ ఉరికిండు, పట్టుకున్నడు. గుంజుకొచ్చిండు. పెన్మిటికూడ వచ్చిండు. దొర కాళ్ళమీద పడ్డామని. 'ఈడెందుకొచ్చిండురా. గుంజి పారేయండి' అన్నాడు దొర. పాటక్లో" నిలబడి ఏడ్చి ఏడ్చి పోయిండు పెన్మిటి. అవ్వను గుంజ్కపోయిన్రు ... మా అవ్వ గడీల్నే ఆడబాపయ్యింది.” (79-80)

స్త్రీ పురుషుడి ముందు నుంచి పోవడం అనేది నేరంగా ఉన్న సమాజంలో స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి ఆశించడం అత్యాశే అవుతుంది – ‘ఆడోల్లు ముంగల్నుంచి పోగూడదు’ అనే నియమం ద్వారా స్త్రీల శరీరాలను, వారి  గమనాగమనాలను అధికారం, పురుషాహంకార సమాజానికి ప్రతీక. ఇది రాజ్యాధికారం జనాభాను శిక్ష, భయం ద్వారా నిర్వహించడాన్ని సూచిస్తుంది.  భర్త కానీ వ్యక్తి, అసలు తనకు సంబంధం లేని  మరొక స్త్రీని బలవంతం చేయడం, మాదార్సాబ్ స్త్రీని (అవ్వను గుంజుకొచ్చిండు) అనే చర్యను పరిశీలిస్తే  స్త్రీ తన శరీరంపై తనకు హక్కు లేకపోవడం కనిపిస్తుంది. స్త్రీ అధికారులకు ఉపయోగపడే వస్తువుగా కనిపిస్తుంది. ఇది Biopower యొక్క ప్రధాన లక్షణం.  ఈ Biopower లో ప్రజలను భయపెట్టే విధానాలు ఉంటాయి తప్ప మానవీయత కనిపించదు. భర్త ముందే భార్యను ఇబ్బంది పెట్టడం అనేది సమాజంలో మానవీయత లోపించడాన్ని సూచిస్తుంది. భర్త అన్నీ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత అనేది  డిస్టోపియన్ సమాజంలో కనిపించే లక్షణాలు.

నిఘా మరియు నియంత్రణ: డిస్టోపియన్ సమాజంలో ప్రత్యక్షంగా/ పరోక్షంగా నిఘా మరియు నియంత్రణ యొక్క యంత్రాంగాలు పనిచేస్తాయి.  ఈ యంత్రాంగాలు రాజ్యం యొక్క బయో పొలిటికల్ ఎజెండాకు అనుగుణంగా వ్యక్తిగత ప్రవర్తనను పర్యవేక్షించడం మరియు నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

“దొరా! పీరిగాణ్ని పట్టుకొచ్చినం. బిచ్చమెత్తుకు తిరుగుతాండు ఊరూరు" అని కేకవేశాడు మాదార్సాబ్.

"బెత్తం పట్టుకొని ఆకలిగొన్న సింహంలా లంఘించారు రెడ్డిగారు. పట్టుకొనివచ్చినవాళ్ళు పీరిగాణ్ని వదిలి దూరం జరిగారు. "లంజకొడక, చింతకాయలెత్తుక పోతవులె" అని వీపుమీద కర్రతో లాగికొట్టారు. రెడ్డిగారు.

"చస్తి దొరా! బుద్ధి గడ్డితిన్నది, పిల్లలుగలోణ్ని, చంపకున్రి, నీ కాల్మొక్త బాంచను" అని కాళ్ళమీద పడ్డాడు పీరిగాడు. వాడు వంగడంతో కర్ర వీపుమీద కాక నేలమీదపడింది. "గాడిద కొడక, కాళ్ళమీద పడ్తవులే" అని కర్రతో లాగి బాదారు వీపుమీద.

"అమ్మో, చస్తిని" అని వీపు తుడుచుకుంటూ లేచి ఉరుకు పుచ్చుకొన్నాడు పీరిగాడు గేటుదాటి.

"నిలబడి చూస్తాన్రేమిరా! గుంజ్కారాండి గాడ్డికొడుకును... ఇయ్యాళ్ళ తోళ్ళోలుస్త, దొరంటే ఏమనుకున్నడో, చింతకాయ లెత్కపోతాడు, చింతకాయలు" అని అరిచారు రామారెడ్డి దొరవారు.

మాదార్సాబ్, మరొకడు పరిగెత్తి లాక్కొచ్చారు వాణ్ని.” పైదే పుట-106) చింతకాయలు కోసుకున్న కారణంగా రెడ్డి పీరిగాడు అనే వ్యక్తిని దొంగగా ముద్ర వేసి శిక్షించే ప్రయత్నం చేశారు. రెడ్డి కొడతాడనే కారణంతో పీరిగాడు అనే వ్యక్తి ఊరు వదిలిపోయి ఎక్కడో బిక్షం ఎత్తుకుంటూ బ్రతుకుతున్నాడు  కానీ రెడ్డి మెప్పు కోసం మాదార్సాబ్ మరికొందరు వెతికి పీరిగాడిని తీసుకొచ్చి రెడ్డి ముందు ఉంచారు. రెడ్డి తన అధికార దర్పాన్ని చూపించడం కోసం బిచ్చగాడిగా మారిన  పీరిగాడిని కొట్టడం, ఆ దెబ్బలు తాళలేక చనిపోవడం జరిగిపోయింది . పీరిగాడిని మాదార్సాబ్ మరికొంతమంది రెడ్డి దగ్గరికి తీసుకురాకపోతే పీరిగాడికి మరణం ఉండేది కాదు. కానీ రెడ్డి స్వభావం తెలిసి పీరిగాడిని రెడ్డి దగ్గరికి తీసుకురావడం, మాదార్సాబ్ వంటి వ్యక్తులు చేసిన తప్పు. అధికారానికి అందరూ దగ్గరగా ఉండాలని, వ్యక్తులపై నిఘా ఉంచడం ఆ క్రమంలో వ్యక్తుల స్వాతంత్ర్యానికి,  జీవితానికి హాని కలిగించేలా చేయడం డిస్టోపియన్ సమాజంలో కనిపించే ప్రధాన లక్షణం

3. ఉపసంహారం:

దాశరథి రంగాచార్యుల చిల్లర దేవుళ్ళు నవల బయోపాలిటిక్స్ మరియు డిస్టోపియన్ సిద్ధాంతాల దృష్ట్యా సమాజంలోని అణచివేత, అసమానతలు మరియు అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ నవల నిజాం పాలనా కాలంలోని తెలంగాణ సమాజాన్ని చిత్రిస్తూ, భూస్వామ్య వ్యవస్థ, కుల-వర్గ-లింగ అసమతుల్యతలు మరియు ప్రజలపై రాజ్యాధికారం యొక్క క్రూరమైన ప్రభావాన్ని బయటకు తెస్తుంది. Michel Foucault యొక్క బయోపాలిటిక్స్ సిద్ధాంతం ప్రకారం, రాజ్యం శరీరాలు మరియు జీవితాలను ఎలా నియంత్రిస్తుందో ఈ నవలలో స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలు, దళితులు, గిరిజనులు, పేదవారు ఏవిధంగా అణచివేయబడ్డారు, వారి శరీరాలు ఎలా రాజకీయ సాధనాలుగా మార్చబడ్డాయో నవల వివరిస్తుంది. 

డిస్టోపియన్ సమాజం యొక్క లక్షణాలైన నిరంకుశ పాలన, భయం, నిఘా మరియు వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం ఈ నవలలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. వనజ, పీరిగాడు, పెన్మిటి మరికొన్ని స్త్రీ, దళిత, గిరిజన, పేద పాత్రల ద్వారా రచయిత సామాజిక అన్యాయాలను బలంగా విమర్శిస్తాడు. ఈ నవల కేవలం చారిత్రక రచన మాత్రమే కాదు, ఇది నేటి సమాజంలోని అణచివేతలకు, అధికార దుర్వినియోగానికి ఒక నిలువుటద్దం. బయోపాలిటిక్స్ మరియు డిస్టోపియన్ సిద్ధాంతాల ద్వారా ఈ నవలను విశ్లేషించడం, సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల గురించి ఆలోచించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నవల చివరికి, మానవీయత, స్వేచ్ఛ కోసం పోరాటం ఎల్లప్పుడూ అవసరమనే సందేశాన్ని ఇస్తుంది.

4. సూచికలు:

  1. Kjellén introduces the concept of biopolitics: “In view of this tension typical of life itself . . . the inclination arose in me to baptize this discipline after the special science of biology as biopolitics; . . . in the civil war between social groups one recognizes all too clearly the ruthlessness of the life struggle for existence and growth, while at the same time one can detect within the groups a powerful cooperation for the purposes of existence” p . 2 Biopolitics: An Advanced Introduction by Thomas Lemke
  2. the concept of biopolitics has often served as an interpretive key to analyze how the production and protection of life is articulated with the proliferation of death (Biopolitics: An Advanced Introduction by Thomas Lemke. page xi.)
  3. The problematic of biopolitics has become increasingly important in the social sciences. Inaugurated by Michel Foucault's genealogical research on the governance of sexuality, crime and mental illness in modern Europe, the research on biopolitics has developed into a broader inter-disciplinary orientation, addressing the rationalities of power over living beings in diverse spatial and temporal context
  4. An imaginary place where people lead dehumanized and often fearful lives; anti-utopia
  5. An imaginary place or state in which the condition of life is extremely bad, as from deprivation, oppression, or terror.
  6. Dystopia represents the fearful imagination of societal collapse, totalitarian regimes, and loss of individual freedoms, standing in direct contrast to utopian aspirations.
  7. Definition: "Dystopia is a term used to describe a community or society that is undesirable or frightening, often related to authoritarian governments or environmental disaster."
  8. “Dystopian fiction is a mode of narrative prose. Between 1920 and 1960, its expressions were characterised in a number of specific ways. Such texts were entangled in, and responded directly to, a complex and intricate web of material historical conditions, intellectual and cultural currents and dramatic social change”

5. ఉపయుక్తగ్రంథసూచి:

ప్రాథమిక ఆధారం:

  1. రంగాచార్య, దాశరథి. (1987) చిల్లర దేవుళ్లు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.

ద్వితీయ ఆధారాలు:

ఆంగ్ల పుస్తకాలు

  1. Claeys, Gregory. (2017). Dystopia: A Natural History, Oxford University Press, Oxford.
  2. Foucault, Michel. (1978). The History of Sexuality, Volume 1: An Introduction, Pantheon Books, New York.
  3. (2003). Society Must Be Defended: Lectures at the Collège de France, 1975–76, Picador, New York.
  4. Gordin, Michael D., Tilley, Helen, & Prakash, Gyan (Eds.). (2010). Utopia/Dystopia: Conditions of Historical Possibility, Princeton University Press, Princeton.
  5. Lemke, Thomas. (2011). Biopolitics: An Advanced Introduction, New York University Press, New York.
  6. Prozorov, Sergei, & Rentea, Simona (Eds.). (2017). The Routledge Handbook of Biopolitics, Routledge, London.
  7. Stock, Allison. (2019). Mid-Twentieth-Century Dystopian Fiction and Political Thought, Routledge, London.

Dictionaries:

  1. American Heritage Dictionary of the English Language (5th ed.). (2011). Houghton Mifflin Harcourt, Boston.
  2. Merriam-Webster’s Collegiate Dictionary (11th ed.). (2003). Merriam-Webster, Springfield.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]