AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
11. తెలుగులో నేటి శాస్త్రపరిభాష: భాషాప్రణాళిక
డా. యం. ప్రసాద్ నాయక్
సహాయ ఆచార్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్
ద్రావిడ విశ్వవిద్యాలయం,
కుప్పం, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9494697904, Email: prasadnaik6@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 18.02.2025 ఎంపిక (D.O.A): 25.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
శాస్త్రవిజ్ఞానాభివృద్ధికి మేధాశక్తి ఎంతో అవసరం. విజ్ఞానాన్ని అంటిపెట్టుకొని పరిభాష ఉంటుంది. విజ్ఞానం - పరిభాష రెండు ఒకటిగానే పెరుగుతాయి. విజ్ఞానం పెరిగే కొద్దీ అదే మోతాదులో పరిభాష కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక శాస్త్ర భావనకు రూపకల్పన చేసిన శాస్త్రవేత్త పరిభాషను కూడా సమకూరుస్తాడు. అందుచేత పరిభాషను అధ్యయనం చేసేముందు శాస్త్ర అధ్యయనం కూడా అవసరమే. తెలుగు పరిభాష ప్రస్తుతపరిస్థితిని, అందులోని సమస్యలను వర్ణనాత్మకంగా చర్చించడం ఈ పరిశోధన ఉద్దేశం. తెలుగులో శాస్త్రపరిభాష ఆయా శాస్త్రభావనలను దృష్టిలో పెట్టుకుని చేసినవి., ఆయా శాస్త్ర ఇంగ్లీష్ పదాలకు సమానార్థకాలు సృజించిన సందర్భాలూ ఉన్నాయి. ఇంగ్లీషు పదభావనను సరిగ్గా వ్యక్తీకరించకపోయినప్పటికీ ఆ పదాన్ని మాత్రమే అనువాదం చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగులోనే భావన చేసి, తెలుగులోనే అవగాహన చేసుకుని, తెలుగులోనే వ్యక్తీకరించడం ప్రస్తుత శాస్త్రవిజ్ఞానాభివృద్ధికి అవసరం. మేధాశక్తి, ధారణ శక్తి, అవగాహన శక్తి, ఆకలింపు శక్తి, ఆలోచన శక్తి వంటివి ప్రజాభాష- పరిభాషల్లో జరుపగలిగితే తెలుగు రాష్ట్రలు జపాన్, చైనాలాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ ప్రచురించే పాఠ్యపుస్తకాలు, దానిలోని పరిభాష విజ్ఞానం, ఆవశ్యకతలను పరిశీలించడం ఈ వ్యాసపరిధి. రాధాకృష, బూదరాజు, బి.హెచ్. కృష్ణమూర్తి, చేకూరి రామారావు, పిఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్ స్వరాజ్యలక్ష్మి, మొదలైన వారు పారిభాషిక పదాలు - తెలుగు అనువాదం అంశంపై పూర్వం పరిశోధనలు చేశారు.
Keywords: పరిభాష, విజ్ఞానం, మేధాశక్తి, అభివృద్ధి, వర్ణనాత్మకం, భాష సామర్థ్యం, శాస్త్ర సాంకేతికత
1. ప్రవేశిక:
తెలుగు అకాడమీ 1968వ సంవత్సరం నుంచి పరిభాష పరికల్పనకు విశేషకృషి చేస్తూ ఉన్నది. ఈ భాగంలో తెలుగు పరిభాష ప్రస్తుత పరిస్థితిని, అందులోని సమస్యలను వర్ణనాత్మకంగా చర్చించే ప్రయత్నం జరిగింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించినంత వరకు భాషా ప్రయోగ క్షేత్రాన్ని ఆరు విధాలుగా విభజించారు. ఆధునిక తెలుగు పై వ్యవహార క్షేత్రాలకు అనుగుణంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ ఉన్నది. బెలుచిస్తాన్లో మాట్లాడే బ్రాహ్హుయి మొదలు శ్రీలంకలో మాట్లాడే తమిళంతో సహా మొత్తం 26 ద్రావిడ భాషలు దక్షిణాసియా అంతట వ్యాపించి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. క్రి. శ 1వ శతాబ్దం ప్రాంతంలో కూడా తెలుగు ఆనాటి తమిళ కన్నడ భాషలతో చాలా సన్నిహితంగా ఉండేది.
2. తెలుగు భాష పరిభాష పరిణామం వికాసం:
క్రీ.శ 3వ శతాబ్దం మొదలుకొని దక్షిణ దేశ పాలకులు పల్లవ రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు దాదాపు 3, 4 శతాబ్దాలు వారే రాజ్యాభారం వహించారు. ఆ రోజుల్లో వారు మాట్లాడేది ప్రాకృతమే కానీ తెలుగు కాదు. వారు వింధ్య పర్వత పరిసరాల నుంచి వచ్చిన రాజులు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈ దేశం చాళుక్యుల వశమైంది. వీరి కాలంలో తెలుగు భాష అభివృద్ధి చెందింది. 6వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు శాసనం కడప జిల్లాలో దొరికింది అని చెప్పవచ్చు.
3. తెలుగు పరిభాష:
ప్రాచీన విజ్ఞాన ప్రగతికి తోడ్పడిన సంస్కృత భాష తొలుత అన్ని శాస్త్ర సాంకేతిక రంగాల పరిభాషకు ఉపయోగపడింది. స్థూలంగా 13-16 శతాబ్దాల మధ్యకాలాన్ని మధ్యయుగం అనవచ్చు .ఈ కాలంలో పరిపాలన రంగం, కళలు, సామాజిక శాస్త్రాలు, అనేక సైనిక విద్యలు వృత్తి విద్యలు, సాహిత్యం, న్యాయం, ఆర్థిక శాస్త్రం, వ్యాపార రంగం, మొదలైన వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.
ఉదా: త్రాసు - తరాజు
పన్నుల విధానంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. వారు వసూలు చేసిన పన్నుల వివరాలు వాటి పరిభాష ఈనాడు మనకు ఉపయోగపపడుతున్నాయి. అలాగే నాణేలు కొలతలు విషయంలో కూడా అనేక పదాలు వాడుకలోకి వచ్చాయి.
ఉదా: నాణేలు: కేసరి మాడ, కేసరిగద్వానం, నిష్కం, రూక, కేసరి అడ్డుగు, కేసరి వీసం, కేసరి చిన్నం, పారిక, కేసరి తూము.
ఇదే మధ్యయుగ కాలంలో అనేక హిందుస్తానీ పదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఉదా: ఈనాము - ఇన్ ఆమ్, పరగణా - పర్ గన, త్రాసు- తరాజ్
“క్రీ.శ. 1862లో ‘సుజనరంజని’ అనే తెలుగు పత్రికను ఇంగ్లీషు సాంకేతిక పదాలకు తెలుగు సమానార్థకాలు రూపొందించి ప్రచురించిన తొలి తెలుగు పత్రిక భావించవచ్చు.” దీనిలో ప్రచురించిన పారిభాషికపదాలను కందుకూరి వీరేశలింగం పంతులు కూడా స్వేచ్ఛగా ఉపయోగించుకున్నారట. తెలుగు బోధన మాధ్యమంగా పాఠశాల స్థాయిలో 1968 వరకు కొనసాగింది. ఉన్నతవిద్య ఇంగ్లీషు మాధ్యమంగా ఉండేది. 1966లో తెలుగు అధికారభాష అయింది. తెలుగుఅకాడమీ స్థాపన ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా మూడు అవి.
- ఉన్నత స్థాయిలో బోధన భాషగానూ పరిపాలనకు అనుకూలమైన భాషగాను తెలుగుకు నవ్యత చేకూర్చటం.
- తగిన పాఠ్యపుస్తకాలు, సంప్రదింపుగ్రంథాలు, కోశాలు మొదలైనవి సమకూర్చి విశ్వవిద్యాలయాలు తెలుగు బోధన భాషగా చేయడానికి ఉపకరించటం.
- పరిపాలనభాషగా తెలుగులో ఉపయోగించడంలో ప్రభుత్వానికి తోడ్పడటం.
తెలుగు అకాడమీ సంస్థ వచ్చిన తర్వాత సాంకేతికపదాల కూర్పునకు శాస్త్రనిపుణులతో పాటు భాషాశాస్త్రనిపుణులను కూడా భాగస్వామ్యం చేయడం ప్రారంభించింది. తెలుగుపారిభాషికచరిత్రలో ఇదొక అపూర్వమైన మలుపుగా గుర్తించవచ్చు.
4. భారత దేశంలో శాస్త్ర సాంకేతిక పరిభాష ప్రగతి:
ఆధునిక భారతదేశంలో ప్రాంతీయభాషలలో ఉన్నత విద్యా బోధనను ప్రారంభించిన తర్వాత అనేక రాష్ట్రాలు తమతమ భాషలకు అనుగుణంగా పరిభాషను సమకూర్చుకోవటం ప్రారంభించినాయి. శాస్త్ర సాంకేతిక పరిభాష సమకూర్చుకోవడానికి CSTT (కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ) వారు కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారు చేసి, వారు పాటిస్తూ ఇతర అన్ని ప్రాంతీయ సంస్థల వారికి అందజేశారు. (తెలుగులో శాస్త్రపరిభాష - సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం పుట.31). 1950లో Central Advisory Board of Education వారు అంతర్జాతీయపదాలతో పాటు వాడుకపదాలు కూడా ఉండాలన్నారు. 1961లో ఆచార్య డి.ఎస్. కొఠారి అధ్యక్షులుగా CSTT ఏర్పడింది. కొన్ని ప్రాంతీయభాషాసంస్థలు ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి చెందిన సంస్థలు సంస్కృతాన్ని కాక తమిళభాషపదాలనే ఎక్కువ సంఖ్యలో వాడుతూ తమ భాషను పెంపొందించుకుంటున్నాయి.
ఇదేవిధంగా మిగతా భారతీయ భాషల్లో వారు తమ తమ ప్రభుత్వ భాషా సంస్థల ద్వారా అనేక పారిభాషిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
5. తెలుగు భాష సామర్థ్యం:
పరిభాష ఏ విధంగా ఉండాలి? అనే విషయంపై అనేక వాదాలు ఉన్నప్పటికీ పరిభాష నిర్మాణంలో తెలుగు భాష ప్రసారశక్తిని శంకించవలసిన అవసరం లేదు. తెలుగును ఆధునికపరచి సమగ్రంగా అభివృద్ధి చేయటం ద్వారా తెలుగును ఒక అంతర్జాతీయ శాస్త్ర భాషగా మలుచుకోవచ్చు. (పి. ఎస్. రావు 1988).
“భారతదేశపు అతి చైతన్యవంతమైన భాష; దేశ భాష కాదగిన భాష తెలుగు” అని J.B.S Haldy అన్నది అవాస్తవం కాదు. ఆయనే మరోచోట సాంకేతిక, పరిపాలన, యాంత్రిక, దౌత్య, వాణిజ్య వ్యవహారాలలో వాడే పదాలు ఏ భాష నుండి అయినా తనలో ఇముడ్చుకొనే వ్యక్తిత్వం ప్రస్ఫుటం చేయగల ప్రతిభ అన్ని భారతీయ భాషల కన్నా తెలుగులోనే ఉన్నది” అని తెలుగు భాష సామర్ధ్యాన్ని గుర్తు చేశారు. (27- 4-1958 హిందూ పత్రిక)
6. తెలుగులో నేటి శాస్త్ర పరిభాష:
తెలుగు అకాడమీ 1968 వ సంవత్సరం నుంచి పరిభాష పరికల్పనకు విశేష కృషి చేస్తూ ఉన్నది. ఈ భాగంలో తెలుగు పరిభాష ప్రస్తుత పరిస్థితిని, అందులోని సమస్యలను వర్ణనాత్మకంగా చర్చించే ప్రయత్నం జరిగింది. తెలుగులో శాస్త్ర పరిభాష ఆయా శాస్త్ర భావలను దృష్టిలో పెట్టుకుని చేసినవి ఉన్నాయి. అలాగే ఆయా శాస్త్ర ఇంగ్లీష్ పదాలకు సమానార్థకాలు ఇచ్చుకుంటూ పోయిన సందర్భాల్లో ఉన్నాయి.
పారిభాషిక సమస్యలను స్థూలంగా రెండు విధాలుగా విభజించవచ్చు.
- సాధారణ పరిభాషక సమస్య.
- ప్రత్యేక శాస్త్రాల్లోనే పారిభాషిక సమస్యలు.
ఒక ఇంగ్లీషు పారిభాషక పదానికి ఒకే శాస్త్రంలో ఒకటి కన్న ఎక్కువ పదాలు దాదాపు ఒకే అర్థంలో వాడటం జరిగింది.
ఉదా:
Area - విస్తీర్ణం, ప్రదేశం, వైశాల్యం.
Average - సరాసరి, సగటు
Circulant - వలయ కారి, వర్తుల, వృత్తాకారం( భౌతిక శాస్త్రం)
Oil - చమురు, నూనె, తైలం
Class - తరగతి, వర్గము, విభాగం (సమాజశాస్త్రం)
పై ఉదాహరణలో ఒకే శాస్త్రంలో ఒకటి కన్నా ఎక్కువ తెలుగు పదాలు దాదాపు ఒకటే అర్థంలో వాడటం జరిగింది.
ఒకే అర్థంలో వాడిన రెండు మూడు పదాలలో సాధారణంగా ఒకటి వాడకపదం, రెండోది వాడుకులో లేనిపదం (సంస్కృతం) అవుతున్నది. అవసరం అనుకున్నప్పుడు ఇంగ్లీషు లిప్యంతీకరణ పదం కూడా తెలుగు పరిభాషగా ఇవ్వడంపై పై ఉదాహరణల్లో జరిగింది.
ఒక ఇంగ్షీషు పదానికి వేరు వేరు అర్థాలు ఒకే శాస్త్రంలో వాడిన కొన్ని ఉదాహరణలు ఈ కింద ఇవ్వడం జరిగింది.
ఉదా:
Direct- అనులోమా - అనులోమానుపాతం- Direct proportion
ప్రత్యక్ష - ప్రత్యక్ష కారకం - Direct agent
ఏకముఖ - ఏకముఖ ప్రవాహం Direct current
ఋజు - ఋజుగతి Direct motion
సరళ - సరళ ధ్వని Direct sound
సమీక్ష - సమీక్ష దర్శనం Direct vision
పదకోశల్లోని పారిభాషిక పదాల్లో ఎక్కువ భాగం సంస్కృత పదాలు, ఆ తరువాత ఇంగ్లీషు పదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తాయి, తెలుగు వాడక పదాలు, మిశ్రమ పదాలు, సంఖ్యాపరంగా ఆ తర్వాతనే వస్తాయి.
7. కృతకంగా ఉన్న తెలుగు పారిభాషిక పదాలు:
శాస్త్రపారిభాషిక పదాలు అందరికీ అర్థం కావు. అలా కావలసిన అవసరం కూడా లేదు. ఒక ప్రత్యేక శాస్త్రపరిభాష ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారికి బోధించే వారికి దానిలో పరిశోధన చేసే వారికి ఆ శాస్త్ర రచయితలకు మాత్రమే పూర్తిగా అర్థం కావాల్సి ఉంది.
ఉదా: Back potential - తిరేక్ విద్యుత్ శక్మం (రసా. శాసత్రం)
Brown - కపిల కృష్ణ వర్ణం (రసా. శాసత్రం)
Clay soil - జంబాల మృతిక (భూ.వి. శాసత్రం)
Cube - షట్ పార్శ్విక (భూ.వి. శాసత్రం)
(తెలుగులో శాస్త్రపరిభాష - సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం పుట. 59)
పైన ఉదాహరించిన పదాల్లో అర్థస్పష్టత ఉన్నప్పటికీ ఉచ్చారణలోగాని, పద ఎంపికలో గాని వాటికంటే సులభమైనపదాలు ఉన్నట్లయితే మరింత ప్రయోజనకరం అయి ఉండేవి. పదాలు వినియోగానికి తగినట్లుగా లేకుండా పదగాంభీర్యం చోటు చేసుకున్నట్లు కనిపిస్తుంది. పై పదాల స్థానంలో అనేక పర్యాయపదాలు వచ్చే అవకాశం ఉన్నది.
8. అర్థ సందిగ్ధత:
కొన్ని పదాలు పారిభాషిక పదాలుగా ఉపయోగిస్తున్నప్పుడు అవి ఇతరత్రా అర్థాలు తెలపకుండా ఉండేలా ఉండాలి. దాంతోపాటు వాటి ఉచ్చారణ సామ్యం వల్ల పెడార్ధం వచ్చే అవకాశం లేకుండా కూడా చూసుకోవాల్సి ఉంది.
Un- aspirate - అల్పప్రాణి (భాషా)
Dissimilation - విషమీ కరణం (భాషా)
Divergent- అపశృత (భాషా)
పై ఉదాహరణలు కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే ఇచ్చిన పారిభాషిక పదాలకు కొన్ని వేరే అర్థాలు, మరికొన్నింటి ఉచ్చారణ సామ్యతా వల్ల అనుకోని వేరే అర్థాలు కలుగుతున్నాయి.
9. ప్రత్యేక శాస్త్రాల్లోనే పారిభాషిక సమస్యలు:
Red ink interest - ఎర్ర సిరా వడ్డీ
Red tapism- ఎర్ర పట్టి విధానం (వాణిజ్య శాస్త్రం)
ఈ పైన ఇచ్చిన పారిభాషిక పదజాలం సరి అయిన భావననని అందేవ్వలేకపోతున్నది. మక్కికి మక్కి అనువాదం చేసినట్లు ఉన్నది. కానీ ఏమాత్రం దాన్నే ఉపయోగించే వీలు లేకున్నది.
వేల - (Rate)
వ్యాయం- (Expenditure)
ఖరీదు- (Rate)
ఖర్చు - (Expenditure)
మూల్యం- (Rate)
ఇలా ఎన్ని పేర్లు ఎందుకు ఇచ్చినట్లు 'వెల', 'వ్యాయం', 'మూల్యం'- సంస్కృత పదాలు. ఖరీదు- ఖర్చు ఉర్దూ పదాలు.
Cost -Rate
-Expenditure
పై పదానికి రెండు అర్థాలు ఉన్నట్లు ‘Cost’ అనే పదానికి ఇచ్చిన తెలుగు పదాలను బట్టి తెలుస్తున్నది. అటువంటప్పుడు రెండే మాటలు ఇవ్వకుండా సంస్కృతంలో నుంచి మూడు మాటలు రెండు అర్థాలతో, ఉర్దూ నుంచి రెండు మాటలు రెండు అర్థాలతో ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో తెలియదు. (తెలుగులో శాస్త్రపరిభాష-సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం, పుట. 66).
పదాలు అర్థాలు ఒకదానికొకటి కార్బన్ మూలకాలంగా అంటుకొని ఉండడంవల్ల శాస్త్ర పదాలు ఎంపిక చేయడం అంతా తేలికైన పని కాదు. శాస్త్ర పదాలు సహజ సమాజ భాష నుంచి అర్థ సందిగ్ధత లేకుండా చూసి పరిభాషగా మలుచుకోవడం సులభమైన విషయం కాదని అంగీకరించవలసి ఉంటుంది సామాజిక శాస్త్రాలలోనే అనేక పదాలు అర్థాచాయలు కలిగి ఉన్నాయి. (తెలుగులో శాస్త్రపరిభాష - సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం, పుట. 78)
10. పరిభాష ప్రస్తుత పరిస్థితి:
తెలుగులోనే భావనను ఆలోచించి, తెలుగులోనే అవగాహన చేసుకునే తెలుగులోనే వ్యక్తి కరణ చేయడం శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి అవసరం. ఉదా: తెలుగు అకాడమీ ప్రచురించే పాఠ్యపుస్తకాలు దానిలోని పరిభాష ప్రధానంగా అధ్యాపకుడిని రచయితనే దృష్టిలో పెట్టుకొని రాసినట్లు అగుపిస్తుంది.
పరిభాష గాజు ముక్కలాగా శాస్త్రభావనను ప్రతిబింబించాలి. పదం కంటే పదార్థం ముఖ్యం కావచ్చు. అయినా పదం ద్వారానే పద అర్థాన్ని భావనను విద్యార్థి చూడగలగవలసి ఉంది. పరిభాష ఎంత స్వచ్ఛంగా, దర్పణంలా ఉంటే భావనలు అంత సులభంగా అర్థమయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం తెలుగులో శాస్త్ర పరిభాష ఆ స్థాయికి ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది అని చెప్పవచ్చు. తెలుగులో గణిత పరిభాష గురించి ప్రముఖ నిఘంటుకర్త శ్రీ పి శంకరనారాయణ ఇలా అంటారు. “తెలుగు శబ్దాలు బహ్వక్షరికాలు కాబట్టే సంక్షిప్తంగా లేకపోవటమే కాక విభక్తి ప్రత్యయాలు గణిత భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఆటంకంగా ఉన్నాయి.”
ఉదా. ఇంగ్లీష్: Multiply 8 by 5
తెలుగు: 8 ని 5 తో గుణించండి
పై ఉదాహరణలో స్పష్టత ఎక్కడ లోపించింది? మరో విభక్తి ప్రత్యాయం ‘తో’ ఎక్కువగా వచ్చింది ఇంగ్లీషులో ‘by’ అనే దానికి తెలుగులో ని - తో అనే ప్రత్యాయాలతో చెప్పవలసి వచ్చింది.
శాస్త్ర పరిభాష సాధారణ భాష లాగా అందరికీ అర్థమవ్వటం ఎలా సాధ్యమవుతుంది. మామూలు పదాలే సరిగ్గా అర్థం కాక ఒకదానికి మరొకటి అనుకున్న సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. (తెలుగులో శాస్త్రపరిభాష - సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం, పుట. 95)
ప్రస్తుత తెలుగు పరిభాష శాస్త్రీయంగా పూర్తిగా, అన్ని భావనలకు సరిపడా ఉన్నదని చెప్పలేం. పరి భాషలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించవలసింది ఉంది. ఏ ప్రత్యేక శాస్త్ర రంగంలో కృషి చేస్తున్నారో వారికి ఆ పరిభాష అర్థం కావాలి. వ్యవసాయక పనులు చేసే వారికి వ్యవసాయ పదాలు, నేలల రకాలు, తెగుళ్లు, పశువులు, క్రిమి కీటకాదులు, పనిముట్లు, మందులు, కొలతలు ఇవన్నీ సాధారణంగా వారికి అర్థమయ్యే రీతిలో ఉండాలి.
తెలుగు శాస్త్ర పరిభాష అంతా సమస్యల మాయమనే అభిప్రాయానికి రావలసిన అవసరం లేదు. తెలుగు అకాడమీ శాస్త్ర నిపుణులు, భాషావేత్తల సహాయంతో పరిభాషకు ఒక కొత్త మలుపు ఇవ్వగలిగిన సంస్థ.
11. భాషా ప్రణాళిక - స్వరుపస్వభావాలు:
భాషాప్రణాళిక భాషను పటిష్టం చేయడానికి అవసరమైన కృషి చేస్తుంది. ప్రస్ఫుటమైన ప్రకటన చేసే సామర్థ్యం భాషకు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. భాషా ప్రణాళిక అన్ని దేశాలకు, అన్ని భాషలకు ఒకే విధంగా ఉండదు. ప్రతి దేశం తన దేశ పరిస్థితులను బట్టి అక్కడి భాషలను బట్టి ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు కృత్రిమంగా భాషా శాస్త్ర మౌలిక సూత్రాల అనుసరించి ఉమ్మడి భాష నిర్మించుకోవాల్సి వస్తుంది. (తెలుగులో శాస్త్రపరిభాష - సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం పుట. 355)
భాషా ప్రణాళిక అనేది ఒక ప్రయోగాత్మక శాస్త్రం. భాష విలువలకు సంబంధించిన శాస్త్రం ఒక లక్ష్యం మేరకు భాషను పెంపొందించే నియమాలను భాషా శాస్త్ర ప్రణాళిక సిద్ధం చేస్తుంది. భాషా ప్రణాళిక మిగతా అన్ని భాషల కంటే పారిభాషిక పదజాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుని మూల సూత్రాలను నిర్వర్తిస్తుంది. పదజాలం పరిధి చాలా విశాలమైంది. భాషా ప్రణాళికలో పదజాలం పారిభాషిక పదావళి ఒక ముఖ్యమైన ప్రత్యేక శాఖ.
12. పరిభాష - ప్రణాళిక:
వైజ్ఞానిక సాంకేతిక సామాజిక వృత్తివిద్య శాస్త్రాలను ఏ భాష మాధ్యమంలో బోధించాలన్న అధ్యాయనం చేయాలన్న ఆ భాష అందుకో తగినట్లుగా నవీకరణ చెంది ఉండాలి. తెలుగులో బోధన మద్యమంగా ప్రవేశపెట్టిన తరువాత అనేక శాస్త్రాలలోని పారిభాషిక పదాలను తెలుగులోనే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పవచ్చు.
13. ఉపసంహారం:
తెలుగులో శాస్త్ర పరిభాషాభివృద్దిని ఒక నమూనా ప్రకారం మనం కనుక చూసినట్లయితే-
- ఒక్కో ప్రత్యేక శాస్త్రంలోని భావనలను వేరుచేసి విడిగా పట్టికలో రాసుకోవడం.
- తెలుగులో శాస్త్రసాంకేతికవృత్తి / రంగాలకు చెందినటువంటి ఇతర రచనల్లో పరిశోధనపత్రికల్లో, సమాచారపత్రికల్లో ఉన్న శాస్త్రపరిభాషను వేరుచేసి రాసుకోవడం.
- పారిభాషిక పదాల ఉచ్చారణ వైవిధ్యాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించాలి.
- పారిభాషిక పధ తయారీలో ప్రధానంగా పాటకున్ని దృష్టిలో పెట్టుకోవాలి పరిభాష బోధించడానికి ఎంత సులభంగా ఉండాలో అభ్యసించడానికి కూడా అంతే తేలిగ్గా ఉండాలి.
- భావనకు సరిపడా పరిభాష ప్రజల సొంత భాషలో కావాలి.
- ఉన్నత స్థాయిలో బోధన భాషగానూ పరిపాలనకు అనుకూలమైన భాషగాను తెలుగుకు నవ్యత చేకూర్చటం.
14. సూచికలు:
- రాధాకృష్ణ,బుదరాజు 1990. ఈనాడు వ్యవహార కోశం పే 83, 160.
- తెలుగు అకాడమీ ప్రచురణ 1994 వృక్షశాస్త్ర నిఘంటువు పే 87
- గిరిజారాజు శంకరమోహనరావు. తెలుగులో శాస్త్రపరిభాష-సామాజికభాషాశాస్త్ర అధ్యాయనం.1998
- మాండలిక వృత్తి పదకోశం. ఆచార్య జి. నాగయ్య .తెలుగు విశ్వవిద్యాలయం. 1991
15. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణమూర్తి, భద్రిరాజు. (సం.పా) 1962. “మాండలిక వృత్తి పదకోశం” ప్రధమ సంపుటం. వ్యవసాయ పదాలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు.
- శంకరమోహనరావు, గిరిజారాజు. 1998. తెలుగులో శాస్త్రపరిభాష - సామాజికభాషాశాస్త్ర అధ్యయనం. (అముద్రిత సిద్దాంత గ్రంథం) పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- చెన్నకేశవరెడ్డి, జి. 1985. “వాణిజ్య పదకోశం” సంపా. రాధాకృష్ణ, బూదరాజు. తెలుగు అకాడమీ, హైదరాబాదు.
- దోణప్ప, తూమాటి, 1987, “భాష చారిత్రక వ్యాసావళి” అభినందన సమితి, హైదరాబాదు.
- రాజారావు, జె. 1976. ‘ప్రయోజనాత్మక భాషగా తెలుగు’
- రాధాకృష్ణ, బూదరాజు. 1975. ‘పారిభాషిక పదాలు తెలుగు అనువాదాలు’.
- రాధాకృష్ణ, బూదరాజు. 1982. పాఠ్య గ్రంధాలు పరిభాష సమస్య.
- రామారావు, చేకూరి. 1995. ‘భాషాశాస్త్రం సాంకేతికపద నిర్మాణము’, భాషాంతరంగం. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు. 2000.
- రామారెడ్డి, ముకురాల. 1982. “పారిభాషిక పదాలు భాషాశైలి”
- రెడ్డి, జిఎన్. 1991. “తెలుగు పర్యాయపద నిఘంటువు” సత్య శ్రీ ప్రచూరణలు, తిరుపతి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

