AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
6. ఆదిమచెంచుల పొడుపుకథలు: సంస్కృతి
డా. కప్పెర కృష్ణ గోపాల్
తెలుగు అధ్యాపకులు
శ్రీ ఉమామహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొండనాగుల గ్రామం
బల్మూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ
సెల్: +91 9490899811, Email: kapperakrishnagopal@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 12.02.2025 ఎంపిక (D.O.A): 26.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
నల్లమల ప్రాంతములో నివసించే చెంచులు అమాయకులు, హీనస్థితిలో జీవిస్తున్నవారు, వీరు నిరక్షరాస్యులు. వీరిలోనే కొందరు అక్షరజ్ఞానం కలిగినవారు కూడా ఉన్నారు. వారు మాత్రమే కొంతవరకు అభివృద్ధి చెందారు. కొందరు చిరు ఉద్యోగులుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఎలాగంటే బియ్యంలోని మెరికె (పరిగె) మాదిరిగా... వీరు మెరుగుపడ్డారు. వీరి జీవితాలు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది అనే సామెతను తలపిస్తుంది. చెంచుల వారు పొడుపుకథలు, వేయడంలో, విప్పడంలో నిష్ణాతులు. పొడువుకథలు చెప్పడంలో, విప్పడంలో ఆది ఆంధ్రులుగా చెప్పవచ్చును. వీరి ఆలోచనా జ్ఞానం అమోఘం. వీరు మాట్లాడే తీరు వంకర (యాస) కావచ్చును, కాని వీరి ఆలోచనా జ్ఞానం ఎల్లలు చాటును ప్రకృతి నేర్పిన పాఠాలతోనే వారు జీవన గమనాన్ని అవలంభించారు. వీరు అడవి తల్లి ఒడిలో నివసిస్తున్న అనాగరిక సమాజ జీవజాతులలో ఒకరు. వారి యొక్క సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం తప్పక పాటిస్తారు. ప్రధానంగా వీరి జీవన విధానం పోడు వ్యవసాయం, వేటాడటం, అడవి దుంపల సేకరణ, అడవి ఫలాలు సేకరించి వర్తకం చేయడం వాటి ద్వారా వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించడం చేస్తారు. నేను చెంచుల దగ్గరికి వెళ్ళి మౌఖికంగా పొడువు కథలు సేకరించిన సమయంలో వారు మాట్లాడే తీరు వారి ఆలోచనా విధానం, వారి జ్ఞానం నన్ను అబ్బురపరిచాయి. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు పొడుపుకథల్లో గోచరిస్తాయి.
Keywords: నల్లమల, ఆదిమ చెంచులు, పొడుపుకథలు, సార్వజనీనమైనవి, జానపదం, గిరిజనసాహిత్యం.
1. పొడుపుకథలు:
సాధారణంగా పొడుపుకథలు అనేవి ఇంపుగా సొంపుగా వినబడే పద్య గద్య మిళితమైన ధ్వనులు. ఈ పొడుపుకథలు ఎవరు సృష్టించారు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కాబట్టి వీటిని జనసమూహంలోంచి పుట్టుకొచ్చిన ‘‘జనపదాలు’’గా అభివర్ణించుకోవచ్చు.
ప్రజల ఆలోచనల్లోంచి, అనుభూతుల్లోంచి, అనుభవాల్లోంచి, అభిరుచుల్లోంచి, అలవాటుల్లోంచి జనించి జన సన్నిహిత భాషలో అందర్నీ అలరిస్తుండే ఈ పొడుపుకథలు ఎంత సంక్షిప్తంగా ఉంటాయో, అంత నిక్షిప్తం చేసుకుని కూడా వుంటాయి. ఈ క్రమంలో పొడుపుకథల లక్షణాలని గమనిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలు అగుపిస్తాయి. అవి.
‘‘అపార్థభావన’’ పొడుపుకథల మొదటి లక్షణం, ఎలా అంటే... చెప్పిన కథలో ఇమిడివున్న అర్థం ఒకటి కాగా, స్ఫురించేవి మరొకటిగా వుంటుంది. విజ్ఞానాన్ని వినోదాన్ని సమపాళ్ళలో అందిస్తూ ఒక క్రీడగా సాగిపోయే ఈ కథలు, మెదళ్ళకు మంచి పదును పెడ్డాయి. అలంకారప్రాయంగా వెలువడుతూ సమాజంలోని అన్ని జాతుల వారిని విశేషంగా అలరిస్తుంటాయి. సుతారంగా సుకుమారంగా వుంటూ అన్ని వయసులవారి అభిమానాన్ని ఇట్టే చూరగొంటూ వుంటాయి. లౌకికతతో దాగుడుమూతలు ఆడుతూ ఉరకలెత్తే ఉత్సాహాన్ని అందిస్తుంటాయి. సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ... వింత పదకోశంతో తికమకపెడుతుంటాయి.
ఈ విధమైన ఈ పొడుపుకథలు ఒక్క సమాజంలోనే కాదు, సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానాన్ని కైవసం చేసుకున్నాయని చెప్పడంలో సందేహంలేదు. ఈ క్రమంలో పొడుపుకథల గురించిన సాహిత్య వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాల వంటి ప్రక్రియల్ని ప్రస్తుతిస్తే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారి సిద్ధాంత గ్రంథంలో పొడుపుకథల గురించి వివరణని ప్రత్యేకంగా ఉదాహరించుకోవచ్చు. తర్వాత వివిధ సమాజాల్లో వాగ్రూపంలో వున్న పొడుపు కథలు బాలమిత్ర, చందమామ వంటి బాలల పత్రికల్లో వెలువడే పొడుపు కథలు ‘రైడిల్స్ ఇన్ తెలుగు’ పేరుతో ఆంగ్లంలోకి అనువదింపబడిన పొడుపుకథలు వివిధ తరగతులకు పాఠ్యాంశాలుగా చేర్చబడినవి.
సాధారణంగా ఈ పొడుపుకథల్ని వ్యవహారికంగా ‘‘తట్టు’’ ‘‘తట్లు’’ అని సంబోధిస్తుంటారు. అసలు పిలుచుకునే పేరు ఏదైనప్పటికీ వీటిని ఆస్వాదించేవారికి కలిగే అనుభూతి మాత్రం ఒక్కటే ! ఈ నేపథ్యంలో కొందరు సాహిత్యంలో ఓ కొత్త ఒరవడి కోసం ప్రయత్నం చేస్తూ పొడుపుకథల్ని కొత్తగా సృష్టిస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిస్తే నాలుగు రకాల పొడుపుకథల్ని మనం గమనించుకోవచ్చు.
వాక్య నిర్మాణంలో పాత పొడువుకథల రీతిని అనుసరిస్తూ, అర్థంలో మాత్రమే ఆధునికతని ప్రదర్శించేవిగా కొన్ని వున్నాయి.
ఉదాహరణలు :
- వినిపిస్తుంది, కనిపిస్తుంది అన్నీ తెలియజెప్తుంది కాని నీతో నాతో ఎవ్వరితో మాట్లాడదు. - (కంప్యూటర్)
- తొంభైమైళ్ళ దూరంలో మా తమ్ముడున్నాడు. అతనితో ఇప్పటికిప్పుడు మాట్లాడిస్తుంది. - (ఫోను)
- ఎండాకాలంలో మా ఇంటి మిద్దె మండుతున్నది. మా ఇంట్లో మాత్రం మంచుకొండ కులుకుతున్నది. - (ఎయిర్ కండీషనర్)
- మెడకు వ్రేలాడుతోంది గాని ‘టై’ మాత్రం కాదు. నువ్వెవరనేది నాకు చెప్తోంది. - (ఐ.డి కార్డు)
- దిండు క్రింద ఆర్లీ మార్నింగ్ అరుస్తోంది. బ్యాటరీ పిట్ట. - (సెల్‌ఫోన్‌లో అలారం)
- చదవడానికి మెస్సేజ్‌కాదు, చూడ్డానికి ఇమేజ్‌కాదు, కాని చదవాల్సిందే, చూడాల్సిందే. - (ఔషధబిళ్ళ - ట్యాబ్‌లెట్) (ఎక్స్‌పైరీ డేట్)
వాక్యనిర్మాణంలో ఆధునికతని అనుసరిస్తూ అర్థంలో సాధారణతని తెలియజెప్పేవిగా ఇంకొన్ని ఉన్నాయి.
- టిక్కు టక్కుల నక్కు, ముక్కు మీదనొక్కు, రెండు చెవుల నెక్కు, జారితే పుటుక్కు. - (కళ్ళజోడు)
- తలలు మూడు, కాళ్ళుపది, తోకలు మూడు, కన్నులు ఆరు, కొమ్ములు నాలుగు, చేతులు రెండు. - (అరక) (రెండు ఎద్దులు, ఒక రైతు నాగలి)
- బ్రదర్ కుంటుకుంటూ మైలు నడిచేసరికి సిస్టర్ పరిగెత్తుకుంటూ పన్నెండు మైళ్ళు వెళ్తుంది. - (గడియారంలోని చిన్నముల్లు, పెద్దముల్లు)
ఇంకా కొన్ని పొడుపు కథల్ని గమనిస్తే వాక్య నిర్మాణంలోనూ అర్థంలోనూ పాత విధానాన్నే కనబరుస్తున్నాయి. కాని కథలో ఉద్దేశింపబడిన విషయాలు మాత్రం, ఆధునిక సమాజంలో చోటు చేసుకున్న మార్పుల్ని తెలియజెప్తున్నాయి.
ఉదాహరణలు :
- ఆకాశంలో అరవై గదులు, గదికి ఒక్క సిపాయి, సిపాయికి ఒక్క తుపాకి. - (తేనెపట్టు)
- ఆకాశంలో కెగిరినా పక్షికాదు, తోక కలిగి వున్నా మేక కాదు, తాడు కలిగి వున్నా ఎద్దు కాదు. - (గాలిపటం)
- ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు. - (టెంకాయ)
(బి.భీమమ్మ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్ట నిమిత్తం సమర్పించిన సిద్ధాంత వ్యాస గ్రంథంలో నుండి పుట 263-264, మహబూబ్‌నగర్‌జిల్లా ఎరుకల సాహిత్యం సంస్కృతి)
ఈ విధంగా ప్రత్యేకంగా సృష్టింపబడుతున్న ఈ నవీన పొడుపు కథలు, మారిన ప్రపంచ స్థితిగతుల్ని స్పష్టంగా ఆవిష్కరింపజేస్తూ, పిల్లల్ని పెద్దల్ని బాగానే అలరిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే సందర్భంను బట్టి ఈ పొడుపు కథలను పాతకాలం నుండి మన పూర్వీకులు ఎంతగానో మాట్లాడుకుంటున్నారని మనం తెలుసుకోవచ్చు.
2. చెంచుల పొడుపుకథలు:
చెంచులవారి సమిష్టి జీవనం, శ్రమ సౌందర్యం, ఆయుర్వేద విజ్ఞానం, ప్రకృతితో మమేకం, మొదలగు వైవిధ్యభరిత జీవనశైలి లోంచి పుట్టుకొచ్చిన పొడుపుకథలు తమకంటూ ఒక ప్రామాణికతను స్వంతం చేసుకుని కనబడుతుంటాయి.
సాధారణంగా చెంచులవారిలో కనిపించే నమ్మకాలు, విశ్వాసాలు, వీటి ప్రాతిపదికన సాగే వీరి ప్రత్యేకమైన ఆలోచనా ధోరణులు, అమాయకత్వం తదితర అంశాలు సైతం వీరి పొడుపుకథల్లో కనిపించడం అనేది ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. అలాగే వీరి పేదరికం జీవన అవసరాలు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ కూడా వీరి పొడుపుకథల్లో అంతర్లీనంగా కనిపిస్తూనే వుంటాయి.
వీరు ఎక్కువగా పంటపొలాల్లో (పోడు వ్యవసాయం) చేసేటప్పుడు అలుపురాకుండా వుండేందుకుగానూ పాటలతోపాటుగా పొడుపుకథల్ని, సామెతలను కూడా చెప్పుకుంటుంటారు. ఇంకా పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు, పర్వదినాల వంటి సమయాల్లోనూ, బంధుగణాలతో కలిసి జట్లుగా ఏర్పడి, పొడుపు కథల్ని ఒక క్రీడగా కొనసాగిస్తుంటారు.
ముఖ్యంగా చెంచులవారు చెప్పుకునే పొడుపుకథలు అన్నింటిని ఒక చోట చేర్చి గమనిస్తే మూడు విధానాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.
మొదటిది : విషయాధారం
రెండవది : పరిమితి ఈ విధనంలో వెలువడే పొడుపుకథలు కేవలం చెంచులజాతికి మాత్రమే సంబంధించినవిగా తెలుస్తుంటాయి.
మూడవది : విస్తృతి ఈ విధానంలో వెలుపడే చాలా పొడుపుకథలు సార్వజనీనమైనవి. అయినప్పటికీ ఇలాంటి పొడుపుకథల్లోనూ వీరి జీవితపు ఆనవాళ్ళని వెదికిపట్టే ఆస్కారం కనిపిస్తుంది. ఈ విధంగా చెంచువారిని అలరిస్తున్న పొడపుకథ ‘‘విషయాధారం’’ ఆలంబనగా కొన్ని భాగాలుగా కూడా విభజించుకోవచ్చు.
విభజన, విశ్లేషణ, ఈ రెండు ప్రస్తుతం ప్రధానమైనవి. ఈ పద్ధతుల ద్వారా చెంచుల వారి జీవితాన్ని అతి దగ్గర్నుండి దర్శించుకోవచ్చు. అలాగే చెంచులవారి పొడుపుకథల్ని ఈ క్రింది విధంగా వర్గీకరించుకోవచ్చు.
- మానవ సంబంధ ఆధారమైన పొడుపుకథలు
- దైవాధారమైన పొడుపుకథలు
- విజ్ఞానాధారమైన పొడుపుకథలు
- కథాధారమైన పొడుపుకథలు
- వ్యవసాయాధారమైన పొడుపుకథలు
- వస్త్వాధారమైన పొడుపుకథలు
- శరీరాధారమైన పొడుపుకథలు
- కుటుంబ జీవనాధారమైన పొడుపుకథలు
- ప్రకృతి ఆధారమైన పొడుపుకథలు
2.1 మానవ సంబంధ ఆధారమైన పొడుపు కథలు:
పొడుపుకథ : 1) చిలకలు చిలకలు కూడంగా సిరంగి పట్నం కట్టంగా అరవైపుట్లు పండంగా చేటలకే గాని గంపలకు లేదు జవాబు : శిశువు
(చెంచు నిమ్మల శ్రీనివాసులు (సర్పంచ్), మన్ననూర్, రాష్ట్ర చెంచుల లోకం అధ్యక్షుడు, 13-1--2014)
వివరణ : ఆ పొడుపుకథ చెంచులవారి శాస్త్రీయ పరిజ్ఞానానికి అద్దం పడుతున్నది. మనిషి పుట్టుక, మానవీయ సంబంధాలు, ఇవన్నీ భౌతిక ప్రపంచాన్ని శాసిస్తున్న అంశాలు, మనిషి, ఉనికి భౌతిక వాదాన్ని ప్రేరేపించే, బలపరిచే ప్రధాన సృష్టి. మనిషే లేకపోతే ఈ భౌతిక వాదమే లేదు. శాస్త్రీయతకు భౌతికతకు విలక్షణ నిర్వచనాల్ని అందిస్తూ, వాటి ప్రయోజనాల్ని, పరమార్ధాల్ని ఎలుగెత్తి చాటుతున్న మనిషి జన్మ అనేది ఒక ఉత్కృష్టమైన అంశం. ఒక సృష్టి రహస్యం. ఇదే ఇక్కడ ఆవిష్కరింపబడుతున్న విషయం. సృష్టి చక్రంలో స్త్రీ, పురుషులు ఇరువురూ సమాన ప్రాధాన్యతని కలిగి వుండగా, సృష్టి విస్తరణలో భాగంగా రెండు చిలకలు కూడా భార్య, భర్తలుగా సంసార బాంధవ్యాలను కొనసాగించగా, పిండాల్ని మూటగట్టుకొన్న తల్లి నవమాసాలతో పండంటి శిశువుకు జన్మనిస్తుంది. దుక్కి దున్ని నారుపోసి పండిరచిన పంట ఇంటికొచ్చి అరవైపుట్టు అయిన దానిని చాటలతో తీసుకొని కనులారా చూసుకొని సంతోషపడతాము. అంతేకాని గంపలతో దానిని కొలవలేము.
పుట్టినటువంటి శిశువు పంటతో సమానం. ఆ పంటను చాటతో తీసుకొన్నట్లుగా, శిశువును తన తల్లి తన చేతులతో తీసుకొని ఉయ్యాల జంపాల ఓలలాడుతూ సంతోషిస్తుంది. ఇది సృష్టి ధర్మం.
ఏది ఏమైనా ఈ పొడుపు ఆధారంగా చెంచులవాళ్ళ విజ్ఞానాన్ని శిశువుపై వారికి ఉన్న అవగాహనని అంచనా వేయవచ్చు. అంతేకాదు, విద్య ఆధారంగా విజ్ఞానం పెరిగినా ఆ విజ్ఞానం ప్రకృతిలోంచి పునాదులు వేసుకుందని ఈ కథ నిరూపిస్తుంది.
పొడుపుకథ : 2) తోక లేదు రెక్కలేదు, గాలికన్నా వేగమైనది, ఎంతదూరమైనా ఇట్టే ఎగిరి పోతుంది. జవాబు : మనసు
వివరణ : ఈ పొడుపుకథలో చెంచులవారి విజ్ఞానం, మేధాశక్తి కనబడుతుంది. వీరు మాట్లాడే ధోరణి మోటుగా ఉన్నా వీరి ప్రవర్తన భిన్నంగా ఉన్నా పొడుపుకథల విషయానికి వచ్చేసరికి వారి యొక్క జ్ఞానం బయటపడుతుంది.
తోక లేదు రెక్కలేదు అది పక్షికాదు. గాలి వేగంగా వీస్తుంది. కాని ఆ గాలిని ఆపలేము. గాలి వేగం కంటే అతివేగంగా ప్రయాణం చేస్తుంది. ఎంతదూరమైనా పక్షివలె ఎగిరిపోతుంది. గాలిని కూడా ఓడిస్తుంది అదే మానవుని మనసు అని చాలా చక్కగా వర్ణించారు.
మానవుని యొక్క మనసు పరిపరివిధాలుగా, పలురకాలుగా ఎచటికైనా వెళ్తుంది. మనిషి స్థిరంగా ఉన్నా మనసు స్థిరంగా ఉండదు. కోరికలు గుఱ్ఱాలై పరిగెడుతుంది. మనసు మంచి కొరకు పరిగెడితే ఫర్వాలేదు. కాని చెడు కోసం పరిగెడితే మనిషి యొక్క మనుగడ నాశనం అవుతుంది.
మొత్తానికి చెంచులవారు ప్రకృతిలో మమేకమై ప్రకృతి ఒడిలో జీవిస్తారని చెప్పడానికి ఈ పొడుపు కథ ఒక నిలువెత్తు నిదర్శనం.
పొడుపుకథ: 3) ప్రాణమున్నంతవరకు పొంతనుంటాడు ఎదురొచ్చి ఎప్పుడూ నిలవలేడు. జవాబు : నీడ
(చెంచు నిమ్మల శ్రీనివాసులు (సర్పంచ్), మన్ననూర్, రాష్ట్ర చెంచుల లోకం అధ్యక్షుడు, 13-12-2014)
వివరణ : ఇది చెంచులవారి లౌకిక పరిజ్ఞానం స్పష్టం చేస్తున్నది. అలాగే వారిమనసు, ఉద్వేగాలు, ఆలోచనా జ్ఞానాన్ని తెలియజేస్తుంది.
ప్రాణం ఉన్నంతవరకు ఈ దేహం మట్టిలో కలిసేంతవరకు నా వెంట భార్యా, పిల్లలు, ఎవరు ఉన్నా లేకపోయినా, నా వెంట మాత్రం నన్ను అనుసరిస్తూ నా జతగా నాకు ఎదురు మాట్లాడక ఎదురు నిలబడని నా నీడ నా వెంట ఉంటుంది అని విషయపరిజ్ఞానంతో చెప్పడం బట్టి చూస్తే చెంచులవారిలో ఎంతో పరిణతి కలిగిన జ్ఞాన తృష్ణ కనబడుతుంది.
మరికొన్ని మానవ సంబంధ పొడుపు కథలు - ఉదాహరణలు :
- గుండ్రంగా ఉంటుంది - చంద్రుడు కాదు నల్లగా వుంటుంది - చీకటి కాదు ప్రతిబింబం కనిపిస్తుంది - అద్దం కాదు జవాబు : కనుగుడ్డు
- గుంటూరు గుట్ట, ఏలూరు మిట్ట, పదిమంది పట్ట ఒక్కడే కట్ట జవాబు : మంగళసూత్రం
- నల్లగా ఉంటుంది కాని నాగుపాము కాదు ఊగుతుంది కాని ఉయ్యాల కాదు జవాబు : వాలుజడ
- అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలువవు అన్నకు అందదు, తమ్మునికి అందుతుంది జవాబు : పెదవులు
- అటూ ఇటూ ముళ్ళ కంచెలు, మధ్యన రోడ్డు. జవాబు : పాపిడి
- అడవిలో మాను, ఎంతకోసినా యెదుగుతుంది. జవాబు : జుట్టు
- అందరికి కనిపిస్తుంది కాని నాకు కనిపించదు. జవాబు : వీపు
- అక్కాచెల్లెళ్ళు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు. జవాబు : కళ్ళు
- గాలి జీవనం, కళ్ళ మధ్య పావనం. జవాబు : ముక్కు
(ఉడుతల చెంచు లింగయ్య టీచర్, 50 సం॥లు - మన్ననూర్ - 13-12-2014)
2.2 దైవాధారమైన పొడుపు కథలు:
పొడుపుకథ : 1) నీ సింగారం బంగారం కాను, నీ కంత చంచల స్వభావం, ఏమిటే నెత్తినెక్కి తొక్కుతావు, మళ్ళీ కాళ్ళు పట్టుకుంటావు అన్నాడో పురుషుడు ఒకామెతో జవాబు : శివుడు, గంగ
(ఉడుతల చెంచు లింగయ్య టీచర్, 50 సం॥లు - మన్ననూర్ - 13-12-2014)
వివరణ : చెంచులు ముఖ్యంగా శివుణ్ణి తమ ఇలవేల్పుగా భావిస్తారు. వారు మాట్లాడే మాటల్లో శివదేవుని ప్రస్థావన ఎక్కువగా గోచరిస్తుంది. ఒక చెంచు పురుషుడు తన భార్యతో నీ సింగారం బంగారంగాను, నీకంత చంచల స్వభావం ఏమిటే మొగుణ్ణి నెత్తినెక్కి తొక్కుతావు, మళ్ళీ కాళ్ళు పట్టుకుంటావు అని ప్రశ్నించాడు.
ఆమెకు ఏమి అర్థంకాక నేను ఎప్పుడు నెత్తిన తన్నాను, ఎప్పుడు కాళ్ళు పట్టుకున్నానయ్యా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అప్పుడు అతడు ఇది ఒక పొడుపుకథనే. దీనికి సమాధానంచెప్పు అన్నాడు.
ఈ పొడుపుకథ సందర్భం :
నలమల్ల అడవి ప్రాంతంలో బొరాపురం చెఱువు కుంట ఉంటుంది. అచట ఒక శివాలయం ఉంది గర్భగుడిలో శివయ్య తల మీద గంగాదేవి తన నోటిలోకెళ్ళి గంగను విడిచే దృశ్యం కనబడుతుంది. గంగ ప్రవహిస్తూ శివుణ్ణి పాదాలపై పడుతూ వెళ్ళే విధానం కనిపిస్తుంది. ఆ గుడిలో పూజారి చెంచు గురువయ్య, బోరాపురం చెఱువు (పెంట) చెంచులోకం జాతర జరుగుతున్న రోజున శివాలయం గుడి ప్రాంగణంలో పెద్ద చెఱువు ఉన్నది. దేవుని అభిషేకం కొరకు నీరు తేవడానికి, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో భార్యభర్తలు ఇరువురు వెళ్ళారు. గంగా జలమును తీసుకొని వచ్చి శివునిపై పోస్తున్న సందర్భంలో వెలువడిన పొడుపుకథ ఇది.
మొత్తానికి వీరి యొక్క దైవభక్తి శివునిపై ఉన్న ఆరాధన, ప్రేమతత్వంతో మసలుకొనే దైవచింతన, భార్యభర్తల మధ్య ఉన్న అన్యోన్య సంబంధము మాట చతురత వారి యొక్క సంస్కృతికే అద్దం పడుతున్నాయి అని చెప్పవచ్చు.
పొడుపుకథ : 2) ఆలి పంచాయితీ, పాలి పంచాయితీ జవాబు : రామాయణం, భారతం
(చెంచు మాసయ్య, 28 సం॥, అప్పాపూర్ పెంట, లింగాల మండలం, నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015)
వివరణ: ఈ పొడుపుకథ భార్యభర్తలు ఇద్దరు గొడవపడి, తమ కులపెద్దల చెంతకు వచ్చినటువంటి సందర్భంలో వచ్చిన మాట పలుకు ఇది.
కులపెద్ద రచ్చబండ మీద కూర్చొని గొడవపడిన భార్యభర్తలతో ఆనాడు ఆలి పంచాయితీ, పాలి పంచాయితీ ఉన్నట్లుగా మీరు ఇరువురు ఏ పాలిభాగం కొరకు గొడవపడ్డారు.
ఆనాడు భార్యను వెతకడానికి శ్రీరామచంద్రుడు పడ్డటువంటి కష్టాలు, పాట్లు అంతా ఇంతా కాదు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని పోయినందువల్ల ఆలి పంచాయితీ మొదలయ్యింది.
మహాభారతంలో పాండవులు, కౌరవులు, రాజ్యాలకోసం, పాలిభాగం, భూమికోసం పంచాయితీ జరిగింది. మీ భార్యభర్తల పంచాయితీ ఏ పంచాయితీ అని కులపెద్ద ప్రశ్నించిన సందర్భం లోనిది ఈ పొడువుకథ.
చెంచువారికి, పురాణ, ఇతిహాసాలమీద పట్టు ఎక్కువ. దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అని అర్థమవుచున్నది. అనాగరికంగా ఉన్నా, మేధాశక్తి, జ్ఞానశక్తి, జ్ఞాపకశక్తి మెండుగా ఉన్నాయని తెలుస్తుంది.
దైవాధారమైన మరికొన్ని పొడుపుకథలు :
- ఐదు అక్షరములు మహారాజుకి, మూడక్షరముల ముద్దుల యువరాజు, మూడక్షరములు ముద్దుల యువరాజుకి, రెండక్షరముల మురిపాల రాణి. జవాబు : దశరథుడు, రాముడు, సీత
- ఒకే దిక్కున వస్తాడు, ఒకే దిక్కున పోతాడు, తీక్షణంగా చూస్తాడు. జవాబు : సూర్యదేవుడు
- కోటగాని కోట, ఇంటికోకోట. జవాబు : తులసికోట
- చెట్టంతా చేదుమయం, అమ్మ తల్లి రోగాలకు దివ్యౌషధం, పుల్లచేయు దంతధావనం. జవాబు - వేపచెట్టు, (అమ్మతల్లి)
- శివదేవుని తలపండు, తొడిమలేని పండు, ఆకులేని పండు. జవాబు : విభూతిపండు
- నాకు అమ్మ, నీకు అమ్మ, అందరికీ అమ్మ. జవాబు : తులసమ్మ
- మాత గాని మాత. జవాబు : గోమాత
- మోకాలు లోతు నీళ్ళలో మొద్దు కాలుతుంది. జవాబు : ప్రమిద
- నలుగుపిండిలో పుట్టి, యజమాన్ని అడ్డగిస్తే, నలిగి, నలిగి ఏనుగంతై కూర్చున్నాడు. జవాబు : వినాయకుడు
(చెంచు మాసయ్య, 28 సం॥, అప్పాపూర్ పెంట, లింగాల మండలం, నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015)
2.3 విజ్ఞానాధారమైన పొడుపు కథలు
పొడుపుకథ : 1) కటకట మంచం, కటారు మంచం, ఎంత తొక్కినా ఇరగని మంచం. జవాబు : భూమి
(తోకల గురువయ్య చెంచు, 35 సం॥ అప్పాపూర్ పెంట, లింగాల (మం),నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015)
వివరణ : ప్రపంచ పరిజ్ఞానంలో గ్రహాల పరిజ్ఞానం అనేది వైజ్ఞానిక సంబంధమైన విషయం. సౌర కుటుంబంలో మొత్తం (9) నవగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం గుర్తింపబడుతున్న ఎనిమిది గ్రహాల్లో భూమి కూడా ఒకటిగా వుంది.
ఎనిమిది గ్రహాల్లో భూమి కూడా ఒకటిగా వుందని నిత్యం పరిభ్రమిస్తూ వుంటుందని, శాస్త్ర పరిజ్ఞానం తెలియజేస్తున్నది. ఈ విషయాన్ని వీరు తమ గృహోపకరమైన మంచంతో పొలుస్తూ పొడుపుకథను అల్లడం జరిగింది. కటకట అనే పదానికి అర్థం అవ్వ అని లేదా కష్టం అని అర్థం ఉన్నాయి. కటకట మంచడం అనగా - అవ్వ మంచం అని మరియు కటారు మంచం అంటే కత్తి లాంటి మంచం అని లేదా చువ్వలతో చేసిన గట్టి మంచం అని అర్థం. ఇలాంటి మంచం ఎంత తొక్కినా ఇరగని మంచం. మనం ఎంత తొక్కిన అరగనిది, తరగనిది, ఇరగనిది, ఓర్పుగలది భూమాత - భూమి అని అర్థంతో ఎంతో పరిజ్ఞానంతో ఈ పొడుపు వివరించడం జరిగింది.
ఇది వీరి సునిశిత తెలివితేటలకు అద్దం పడుతున్నదని చెప్పవచ్చు. చెంచువారు పూర్వకాలం చాలా సందర్భాల్లో మంచాన్ని ఉపయోగిస్తున్నారు అడవిలో ఉండటం ద్వారా వెదురు కర్రలతో మంచం తయారుచేస్తారు. ఆ మంచం ఎంత గట్టిగా ఉందంటే దానిని భూమితో పోల్చుతూ వివరణ గావించారు. అంటే చెంచువారి పరిజ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
పొడుపుకథ : 2) ఈ పాము అన్నిటినీ మింగివేయు, మింగినట్లే విడిచిపెట్టు. జవాబు : చంద్రగ్రహణం, సూర్యగ్రహణం
(తోకల గురువయ్య చెంచు, 35 సం॥ అప్పాపూర్ పెంట, లింగాల (మం),నాగర్ కర్నూర్ జిల్లా,18-12-2015)
వివరణ : ఈ పొడుపుకథలో దాగివున్న రహస్యం చెంచులవారి మనో ఆంతర్యమును వారి విలక్షణ ఆలోచనాశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేకాదు వారి యొక్క విజ్ఞానాధారిత పరిజ్ఞానం, మానవ జీవితపు విలువలు, పరిసరాల్లోకి తీసుకువచ్చి మర్మజ్ఞానంతో చెప్పడం అనేది ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. ఇంకొక విషయం పురాణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం. రాహు-కేతువులు- అనే రెండు పాములు ఉన్నాయి. అవి సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. వచ్చినట్టి ఆ సర్పాలు వెలుగునిచ్చే, సూర్యుణ్ణి లేదా చంద్రుణ్ణి మింగివేస్తాయి అని వారి నమ్మకం. అలా వచ్చినట్టి సర్పాలు చంద్రుణ్ణి లేదా సూర్యుణ్ణి మ్రింగటాన్ని ఆశుభంగా భావిస్తారు. ఏదో కీడుగా తలంచుతారు. ఏదో శనిగ్రహం పట్టినట్లుగా భావిస్తారు. అడవిలోకి వేటకుకాని, జీవనాధారం కొరకు ఆహారసేకరణకు వెళ్ళరు.
పెద్దపాము అడవిలో ఉన్న జంతువులను మింగివేసింది. తిరిగి విడిచిపెట్టినప్పుడు వెళ్ళాము అని వారు అనుకుంటారు. అనగా - వేటకు వెళ్ళినా అడవిలో ఏ జంతువు కనిపించదు. మనము వేటాడలేము అనేది వారి నమ్మకం. విడిచిపెట్టినప్పుడు అనగా గ్రహణము వదలిన తరువాత వేటకు వెళ్తే వేట జరుగుతుంది. శుభం కలుగుతుందని వారి నమ్మకం. దీనిని బట్టి వారి ఆలోచన మూఢనమ్మకానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు అని అర్థమవుతుంది.
ఇంకొక విషయం నిండు గర్భవతిగా ఉన్న స్త్రీలు నీళ్ళు తేవడానికి కాని ఇతర పనులు చేయటానికి వెళ్ళరు. గ్రహణం పట్టినటువంటి సమయంలో కడుపులోని బిడ్డకు అపాయం జరుగుతుంది. ముక్కు, చెవులు, కాళ్ళు వంకరగా అవుతాయి. శరీరము వికృతంగా మారుతుంది అనేది వారి నమ్మకం. పాము నిండుగా ఉన్న చంద్రుణ్ణి మింగింది. అలాగే నా పొట్టలో ఉన్న నిండు చంద్రుణ్ణి పాము మింగుతుంది. అనగా - తమ బిడ్డకు ఏదైనా కీడు జరుగవచ్చు అనేది వారి విశ్వాసము. కావునా, వారు ఇంటిలో నుండి బయటకు రాకుండగా మంచముపైన లేదా భూమిపైన చాపవేసుకొని కదలకుండా నిద్రిస్తారు. తిరిగి పాము గ్రహణమును విడిచిన తరువాత వారు వారి వారి పనులలోకి వెళ్ళిపోతారు.
ఈ విషయాన్ని చెంచులవారు గోప్యమనేది లేకుండా మంచిగా నేర్పరితనము పాటించి తమ జీవనశైలికి అన్వయించి చక్కగా వివరించారు.
2.4 కథాధారమైన పొడుపు కథలు
పొడుపుకథ: 1) అవని తల్లి అయ్యే నాకు అజుని తండ్రి మగడు నాకు అసుర వరుడు నన్ను నాడు శ్రీలంకలో నిల్పినాడు. జవాబు : సీత
(తోకల గురువయ్య చెంచు, 35 సం॥ అప్పాపూర్ పెంట, లింగాల (మం),నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015)
సందర్భం : ఈ పొడుపు కథ చెంచువారి ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనంగా నిలుస్తుంది. భగవంతుని పట్ల విశ్వాసం, నమ్మకం. భారత, రామాయణ పురాణల పట్ల, పట్టు ఉన్నదనేది అర్థమవుతుంది.
సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకలోని అశోకవనంలో ఉంచుతాడు. అచట ఉన్న సీత దుఃఖిస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యము అని చెంచు అప్పాపూర్ నిమ్మల గురువయ్యగారు తను దైవసన్నిధిలో ఉన్నప్పుడు తన భార్యతో పలికిన పొడుపుకథ ఇది.
వివరణ : సీతాదేవి దుఃఖిస్తూ... ఈ భూమాత నాకు తల్లి అయ్యింది. ఈ భూమిని పాలించే రాజు దశరథ మహారాజు కుమారుడు నాకు భర్త అయ్యాడు. అతడే శ్రీరామచంద్రుడు.
శ్రీరామచంద్రునికి భార్య అయిన సీతాదేవిని పరమ పతివ్రత అయిన, సాధ్వినైన నన్ను రాక్షసుల ప్రభువైన (భర్త) అయిన రావణాసురుడు నన్ను ఈనాడు ఈ లంకావనంలోకి తీసుకవచ్చాడు కదా ! అని సీతాదేవి చింతిస్తుంది.
మొత్తానికి ఈ పొడువుకథలో చెంచులవారికి దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన కథల మీద మక్కువ ఎక్కువగా ఉన్నదని అర్థమవుతుంది.
పొడుపుకథ : 2) సీతమ్మవారు వడికిన నూలు శ్రీరాములు నేసిన నేత, అంచు మాయ కుండ అరవై యేండ్లు కట్టె. జవాబు : కొంగ
(చెంచు నిమ్మల నాగరాజు (నాగయ్య) 39 సం॥ అప్పాపూర్ పెంట, లింగాల (మం),నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015)
వివరణ: ఈ పొడువుకథ వల్ల చెంచువారిలో కథా వివరణలో ఎంతో అనుభవం ఉందని అర్థమవుతుంది. పురాణ ఇతిహాస కథను జోడిరచి ఆధునిక వైఖరిని ప్రతిబింబించడం ఈ పొడుపులో కనిపిస్తుంది. వైజ్ఞానికమైన ఆలోచనా జ్ఞానం చెంచులకు మెండుగా ఉందని అర్థమవుతుంది. చెంచులను చూస్తే ఆకృతిలో ఆకారంలో మొరటుగా ఉండవచ్చును కానీ జ్ఞానంలో తిన్నడును, ఏకలవ్యుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి మించిపోయారు అని చెప్పవచ్చును.
సీతమ్మవారు వడికిన నూలు తెల్లగా ఉండి అందంగా ఉంది. అటువంటి నూలుదారంతో సాక్షాత్ భగవత్ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు మగ్గముపై నేసిన నేత చీర అంచు మాయ కుండ. అంటే చీర (మురికి) అనేది అశుభ్రంగా ఉండకుండా శుభ్రంగా ఉన్నది.
అటువంటి చీరను సీతాదేవి అరవై సంవత్సరాలు కట్టింది. అంటే ఆ చీర ఎన్ని ఏండ్లు కట్టినా మాయలేదు అంటే శ్రీరాముడు చేతిలో నేసిన చీర ఎంత పవిత్రమైనదో ఎంత పుణ్యం చేసుకొన్నదో, ఎంత మోక్షం పొందిందో అర్థమవుతుంది. అంతటి అరవై ఏండ్లు కట్టే చీర అనగా - పవిత్రమైన అరవై ఏండ్లు జీవించిన దేహం తెల్లని వస్త్రంగా ఉన్న శరీరం మాయని తనువు కొంగ, అని నిగూఢార్థంతో జ్ఞానంతో, మేధాశక్తితో చెంచువారు వివరించడం జరిగింది.
2.5 వ్యవసాయాధారమైన పొడుపు కథలు
పొడుపుకథ : 1) పువ్వు పూస్తుంది, కాయ కాస్తుంది పిట్ట వాలేందుకు, కొమ్మ లేదు జవాబు : వరి మొక్క (చెంచు సలేశ్వరము, 26 సం॥, మద్దిమడుగు, 25-12-2015)
చెంచువారు నల్లమల ప్రాంతంలోని అడవిలో ఉండటం మూలాన వీరు పోడు వ్యవసాయం చేస్తున్నారు. కొందరు గ్రామాలలో నివసించే వారు వ్యవసాయం చేస్తున్నారు.
వివరణ : చెంచువారు తీసుకునే జీవనాధారమైన బలమైన ఆహారం వరి (అన్నం). వీరు స్వయంగా పండిస్తుంటారు. పంట ఎప్పుడు చేతికి వస్తుందో, డబ్బప్పుడే చేతికి వస్తుంది అనేది వీరి నమ్మకం.
పూవ్వు పూస్తుంది R మా యదలో చిగురు వేస్తుంది.
కాయకాస్తుంది R ఆ గింజల కోసం మా కన్నులు
కాయలు కాస్తున్నాయి - ఆ గింజలే మాకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. అటువంటి వరిమొక్క తేలికైనది కాని, జీవనం ఇచ్చే జీవితం అది. ఇతరులకు జీవితం ఇచ్చేందుకు పిట్టలు కూడా వాలకుండా దాని తనువులో ఉన్న శక్తిని గింజలకు ఇస్తుంది. ఆ గింజలను మనం ఆహారంగా స్వీకరిస్తున్నాము అని వేదాంత ధోరణిలో చెప్పడం జరిగింది. వరిమొక్క పూవ్వు పూస్తుంది. ఆ తరువాత గింజలు వస్తాయి. అటువంటి మొక్కపైన వాలడానికి కొమ్మలు కూడా ఉంచుకోకుండా ఇతర జీవుల నుండి ఆహారాన్ని రక్షిస్తుంది.
ఈ పొడుపుకథలో చెంచులవారి వ్యవసాయ జీవన గమనం, వేదాంతధోరణి స్పష్టంగా కనిస్తున్నది.
పొడుపుకథ : 2) రకరకాల కోక చుట్టి , రంజుగా కూర్చుంది కోక విప్పబోతే, కన్నీరు వస్తుంది. జవాబు : ఉల్లిపాయ
(చెంచు సలేశ్వరము, 26 సం॥, మద్దిమడుగు, 25-12-2015)
వివరణ : పదాల అల్లికతో ఎంతో పొందికగా కనిపించే పొడుపుకథలు కొన్ని సార్లు యాదృచ్ఛికంగా వాస్తవికతకు అద్దం పడుతుంటాయి.
రకరకాల కోక చుట్టి, రంగు రంగుల కోకలు చుట్టుకొని, చెంచుమల్లి అందంగా సింగారించుకొని కూర్చుంది. ఇంటికి వస్తానన్న పెనిమిటి ఇంకా రాలేదు అని ఎదురుచూస్తుంది. రాత్రి నమయం దాటింది వస్తానన్న వాడు రాలేదు. ఏమయ్యిందో అనే ఒక ఆందోళన, సమయానికి రాలేదు అనే ఒక నిరుత్సాహం రెండు రకాల ఆందోళనతో చివరికి ఇంట్లోకి వెళ్ళిన చెంచుమల్లి కోక విప్పబోతే కన్నీరు కరువయింది.
చెంచువారు వారి ఇంటి ముందరి వ్యవసాయ పొలంలో ఉల్లిపాయలను పండిస్తారు. వీరు కర్నూలు జిల్లా, దోర్నాల, ఆత్మకూర్, నల్లమల ప్రాంతంలోనివారు ఎక్కువగా పండిస్తారు. వీరి ఇంటి ముందు స్థలంలో కూడ ఉల్లిపాయను పండిస్తారు.
ఏదేమైనప్పటికి ఉల్లిపాయ చుట్టూ ఉన్న రకరకాల (ఆకుల వలయం) ఉల్లిపాయ పొర వలయం. చెంచువారి యొక్క అందమైన మనసుగా, ఆ మనసుకు గాయం ఐతే కన్నీరు మయంగా, రంజుగా కూర్చున్న ఉల్లిపాయను పొట్టుతీసినప్పుడు దానిలో ఉన్న ఘాటువాసనకు కన్నీరుకారుతుంది. అలాగే రంజుగా ఎన్నో కోరికలతో కూర్చున్న చెంచుమల్లి మనసుకు గాయం తగిలి దుఃఖిస్తున్నట్టుగా వర్ణించడం జరిగింది.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటే చెంచువారిలో ఉన్న ఉత్సాహం, నైపుణ్యం, ప్రతిభ, అమెగము అని తెలుస్తుంది. మొత్తానికి ఈ పొడుపుకథలో వ్యవసాయ జీవన గమనం స్పష్పంగా కనిపిస్తుంది.
2.6 వస్తువు ఆధారమైన పొడుపు కథలు:
పొడుపుకథ : 1) నుంచున్న బావయ్య నువ్విట్ల రావయ్య చెయ్యిపట్టి లాగందె నేనెట్లా వస్తాను. జవాబు : తలుపు
(చెంచు మల్లేష్, 25 సం॥, మద్దిమడుగు, అమ్రాబాద్ మండలం, ఫారెస్ట్ గార్డ్, 25-12-2015)
వివరణ : ఈ పొడుపుకథ వల్ల చెంచులవారిలో (కొంటెమాటలు) మంచి చతురత కలిగిన మాటలు, సరసపు మాటలు వారియొక్క మేధాశక్తికి నిదర్శనంగా గోచరమవుతుంది. ఏమి పనిచేయకుండా ఇంటి ముందు నిలబడ్డ (నుంచున్న) బావను, తన మరదలు పిలిచిన సందర్భంలోనిది.
ఓ బావగారు అచట నిలబడి ఏమి చేస్తున్నారు, ఇంట్లో పని ఉంది. ఇంట్లో పని ఉంచుకొని బయట నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్నావు. నీకు బరువు బాధ్యతలు లేవా ! అని తన మరదలు నువ్వు ఇట్లా రావయ్యా అని పిలిచింది. ఆ మాటకు బదులుగా బావగారు - ఓసి మరదలా ! ఇంట్లోకి నీవు చెయ్యిపట్టి లాగందె నేను ఎట్లావస్తానే అని బావగారు బదులిచ్చారు.
ఈ మాటల సంభాషణను బట్టి చెంచువారిలోని మడతపెట్టి చెప్పే రెండు ద్వంద్వ అర్థాల వాక్కులు కనిపిస్తున్నాయి.
గృహోపకరణలో భాగంగా ముందు ద్వారము తులపు ముఖ్యమైన వస్తువు. ఇంటికి రక్షక కవచము గోడలు ఐతే ఇంటి ప్రవేశమునకు ఇంటిద్వారమునకు రక్షక కవచము తలుపులు. నించున్న తలుపు నువ్వు ఇట్లారావయ్యా అని పిలుస్తే రాదు. ఆ తలుపును చేయిపట్టి లాగుతేనే వస్తుంది. ద్వారబంధనము తెరచుకొని మార్గ ప్రవేశము సుగమం అవుతుంది. ఇలా గృహబంధనము అయిన తలుపులను బావా, మరదళ్ళ సరసపు మాటలతో మడత పెట్టే మాటలతో ద్వంద్వార్థ పద్ధతిలో మాటలు మాట్లాడుకోవడాన్ని చూస్తే వీరిలో ఉన్న జ్ఞానశక్తి గొప్పదని అర్థమవుతుంది.
ఈ పొడుపుకథవల్ల చెంచువారిలో ఉన్న కుటుంబ బాధ్యతలు, భార్య, భర్త, అయినవారు కూడా, భార్యను మరదలు అని పిలవడం, భార్య, బావా అని సంబోధించడం జరుగుతుంది. దీనిని బట్టి వీరిలో ఉన్న అన్యోన్య దాంపత్యము, ఐక్యమత్యము, ప్రేమానురాగాలు గొప్పవని తెలియుచున్నది.
భర్తను బావా అని పిలవడం, భార్యను మరదలు అని పిలవడం వీరి ఆచార వ్యవహారంలో భాగము.
పొడుపుకథ : 2) కాటుక రంగు కమలము హంగు విప్పిన పొంగు ముడిచిన కుంగు జవాబు : గొడుగు
(చెంచు మల్లేష్, 25 సం॥, మద్దిమడుగు, అమ్రాబాద్ మండలం, ఫారెస్ట్ గార్డ్, 25-12-2015)
వివరణ : గొడుగు అనేది మనిషిని ప్రకృతి నుండి కాపాడే ఒక సమున్నతమైన వస్తువు. ముఖ్యంగా ఎండ నుండి, వాన నుండి మానవాళిని తనదైన పరిధిలో సంరక్షిస్తుండటం ఒక్కటే చాలామందికి ‘గొడుగు’ గురించి తెలిసిన పరిజ్ఞానం. కాని చెంచులవారు గొడుగు బట్టను గుడిసెలకు కప్పడానికి, గొడుగు బట్టను అక్కడక్కడ రంధ్రాలు చేసి అడవిలో ఉన్న సెయేరుల కుంటలలో చేపలు పట్టడానికి, వారి యొక్క ఇంటిదేవునికి పైకప్పుగా, నీడగా గొడుగు బట్టను ఉపయోగిస్తారు. గ్రామాలకు వెళ్ళి చిరు వ్యాపారం అనగా తేనెను, ఇతర ఔషద మొక్కలను అమ్మేవారు ఎండ నుండి తమను తాము రక్షించుకోవడానికి గొడుగును వాడుతున్నారు.
చెంచులవారు ఎక్కువగా నల్లని రూపుతో ఉంటారు. అందంగా ఉంటారు. నల్లని కాటుకను కళ్ళకు ధరించి ప్రకృతి అందాన్ని మొత్తం తమలో దాచుకున్న స్త్రీలు దేవతామూర్తుల వలె కనిపిస్తారు. నల్లని కాటుకరంగు కలిగిన కళ్ళు కలిగి, కమల పుష్పము వలె ఉన్న తనువుతో ఎంతో అందంగా కనిపిస్తారు.
అటువంటి వారి మనస్సును సంతోషపడే మాటలతో ఉత్సాహం రగిలిస్తే, పురివిప్పిన నెమలి వలె పొంగిపోతారు మా స్త్రీలు అని, ఏదైన తప్పు జరిగిన సందర్భంలో తిట్టినచో ముడిచిన గొడుగువలె, రోగం వచ్చినవారి వలె క్రుంగిపోతారు అని చెంచులవారి పెద్దమనిషి రాంపూర్, బయ్యన్నగారు వివరించిన పొడుపుకథి¸ది.
దీనిని బట్టి వీరికి పొడుపుకథలు అంటే ప్రీతి ఎక్కువ అనేది అర్థమవుతుంది.
వీరు స్త్రీలను ప్రకృతి దేవతలుగా కొలవడం. స్త్రీలు సంతోషంగా ఉన్నప్పుడు విప్పిన గొడుగు వలె కమల పుష్పమువలె కనిపించడం, స్త్రీలను తిట్టిన సమయంలో విచార వదనంలో ముడిచిన గొడుగువలె మారడం చెంచు స్త్రీలు మృదుస్వభావులు అనేది అర్థమవుతుంది.
2.7 శరీరాధారమైన పొడుపు కథలు:
పొడుపుకథ : 1) చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంతరాలినా చప్పుడు కావు జవాబు : కన్నీరు (చెంచు గురువయ్య - అప్పాపూర్ పెంట, 84 సం॥, గూడెం పెద్దమనిషి, మరణం-2016, 01-02-2013)
వివరణ: చెంచులవారి యొక్క జీవన ప్రమాణం కష్ట నమయంలో ఉన్నప్పుడు, బాధాతప్త హృదయాలతో ఉన్నప్పుడు ఉద్భవించిన పొడుపుకథగా అభివర్ణించవచ్చును.
చెంచులవారు కాలగమనం (మరణం) చేసినప్పుడు, వారి గూడెంను విడిచి బ్రతుకుబాటపట్టిన (వలస) సందర్భంలో వచ్చే పొడువుకథ.
చెంచులవారు పోడు వ్యవసాయం చేస్తారు ఆకాశపు కొమ్మ చిట్ట చివర నుండి చినుకులు రాలిపడతాయి. అటువంటి రాలిన చినుకులు చప్పుడు చేస్తాయి. ఆ చినుకులకు విత్తనాలు చల్లుతారు, పంట పండిరచుకుంటారు. సంతోషంగా ఉంటారు.
కాని కష్టాలలో, నష్టాలలో దుఃఖాలలో ఉన్న సమయంలో చిటపటచినుకులు, ఆకాశమంత ఎత్తులో ఉన్న రెండు కనుల కొనల నుండి చిటారి చినుకులు మౌనరోదనతో ఎన్నో రాలిపడతాయి. అలా రాలిన చినుకులకు చప్పుడు అనేది ఉండదు.
నిశీథి సమయంలో ప్రశాంతత ఎలా ఉంటుందో కన్నీటి యొక్క శబ్దం కూడా అంత ప్రశాంతంగా సడి చప్పుడు లేకుండా క్రిందికి రాలిపడతాయి.
ఈ విధంగా చెంచుల కష్టాల కన్నీటిని, ఆకాశపు చినుకులతో పోల్చడం బట్టి చెంచువారిలో ఎంతో జీవన ప్రమాణం కనిపిస్తుంది.
శరీర భాగాలకు అన్వయించుకొని ఈ పొడుపుకథ ద్వారా వీరిలోని సహజత్వంలోంచి జీవిత తత్త్వాన్ని ఊహించే సృజనని అర్థం చేసుకోవచ్చును.
పొడుపుకథ : 2) గాలి జీవనం, కళ్ల మధ్య పావనం జవాబు : ముక్కు
(చెంచు గురువయ్య - అప్పాపూర్ పెంట, 84 సం॥, గూడెం పెద్దమనిషి, మరణం-2016, 01-02-2013)
వివరణ : వేదాంతధోరణి కథాత్మకతని జోడిరచి చెప్పడంలో చెంచులవారు మంచి సిద్ధహస్తులుగా ఈ పొడుపు కథ ద్వారా కనిపిస్తున్నారు. వీళ్ళల్లో నిరక్షరాస్యులు సంఖ్య ఎక్కువ, అయినప్పటికీ తెలివితేటలకు మాత్రం లోటు లేదు అనేది నిర్వివాదాంశం.
ఇందుకు ఉదాహరణగా వాళ్ళల్లో కొనసాగుతున్న పలురకాల వృత్తి ప్రవృత్తులతో పాటుగా, వారు చెప్పుకునే పొడుపుకథలు, సామెతలు వంటి వాటిని కూడా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఈ పొడుపుకథలో గాలి జీవనం అనగా - మానవాళి మనుగడకు, బ్రతుకుకు మూలం, ఈ చరాచర సృష్టికి జీవనాధారం గాలి.
గాలి ఉన్నందువల్లనే మానవుని మనుగడ సాగుతుంది. అటువంటి గాలిని బంధించి మనకు ప్రాణాధారంగా జీవితాన్ని ప్రసాదించేది ముక్కు (నాసిక).
కళ్ళ మధ్య పావనమైనది, గొప్పనైనది ముక్కు అని చెబుతూ చెంచులవారు ఈ విధంగా తమ జీవన ప్రమాణమైన అంశాన్ని తమ శరీరభాగానికి అన్వయించుకునే ఈ పొడుపుకథ ద్వారా వీరిలోని సహజ జీవన విధానం, ఊహించే సృజనత గొప్పదని అర్థం చేసుకోవచ్చును.
2.8 కుటుంబ జీవనాధారమైన పొడుపు కథలు:
పొడుపుకథ : 1) మూడు పూటలూ మెక్కిగోడకు చేరబడుతుంది. జవాబు : కంచం, (గిన్నె)
తెలంగాణ మాండలికం - తల్లె
వివరణ : ఈ పొడుపుకథ ఒక కుటుంబ జీవన సాంప్రదాయమేకాదు యావత్ ప్రపంచం చేసే పనిని తెలియజేస్తుంది. చెంచుల జీవన సాంప్రదాయక వాతావరణాన్ని వ్యక్తపరుస్తున్నది. కుటుంబ విలువల్ని స్పష్టపరుస్తున్నది. భార్య, భర్త, అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు, మొ॥ వారి అనుబంధపు విశిష్టతని సాక్షాత్కరింపజేస్తున్నది.
చెంచులవారిలో కుటుంబపోషణలో పురుషులతోపాటు స్త్రీలు కూడా కష్టపడతారు. పురుషుల కష్టంలో సగభాగం స్త్రీల కృషి కూడా ఉంటుంది.
ఈ క్రమంలో చెంచులవారి కుటుంబాన్ని పరిశీలిస్తే కొన్ని అరుదైన విషయాలు కనబడతాయి. కుటుంబ పోషణార్థం అడవికి వెళ్ళిన భార్య, భర్తలు, కష్టపడి వనరులను సేకరించి (ఉదా : ఇప్ప పలుకు, కానుగ పలుకు, జిగురు)ను గిరిజన కో-ఆపరేటివ్ సంస్థలో అమ్మి డబ్బులు తీసుకొని ఇంటి అవసర నిమిత్తం బియ్యం, సరుకులు తీసుకొని వస్తారు. వాటిని చెంచుస్త్రీ వండి భర్తకు, పిల్లలకు భోజనం పెడుతుంది. భోజనం చేసిన తరువాత ఎవరు కంచం వారు తీసుకవెళ్తారు. భార్యనే తీసుక వెళ్ళి కడగాలి అనే నిబంధన అనేది లేదు. హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త భోంచేసిన కంచం భార్య తీస్తుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ కాని వీరి కుటుంబాలలో అగుపించదు. చదువుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డ కుటుంబాలలో మాత్రమే కనిపిస్తుంది. నిరక్షరాస్యుల కుటుంబాలలో ఈ సాంప్రదాయం కనిపించదు. మూడు పూటలు మెక్కి అనగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో భోంచేస్తారు. అట్టి కంచమును శుభ్రపరచి మూలకున్న గూటిలో బోర్లిస్తారు. భార్యనే భోజనం భర్తకు పెట్టాలి, భర్త భోంచేయాలి అనే నిబంధన కనిపించదు. ఎవరైనా సరే, ఆకలి అనిపించినప్పుడు వారే భోజనాన్ని కంచాలలో పెట్టుకొని భోంచేస్తారు. ఒక్కోమారు భార్య భోజనం పెడుతుంది. భర్త భోంచేస్తాడు. భార్య కంచం తీస్తుంది.
ఈ నవీనకాలంలో భార్య భర్తలు సమానము అని కష్టసుఖాలలో ఇద్దరు పాలుపంచుకొనే తత్వము వీరి కుటుంబాలలో కనిపిస్తుంది.
ఈ పొడుపుకథాంశం మాత్రం కుటుంబ జీవనానికి జీవన విలువలకి అద్దం పడుతున్నది అని చెప్పవచ్చును.
పొడుపుకథ: 2) సాచుకొని సావిట్లో పడుకొని ఉంటుంది ముడుచుకొని మూల కూర్చుంటుంది. జవాబు : చాప
(కలిమేని చెంచురాములు, 45 సం॥- ఫారెస్ట్ గార్డ్ - మన్ననూర్ - 26-08-2014)
వివరణ : ఈ పొడుపుకథ చెంచులవారి యొక్క జీవన ప్రమాణం కనిపిస్తుంది. వీరు స్వయంగా అడవిలో ఉన్న ఈత ఆకుతో చాపలను తయారుచేస్తారు. ఈ చాపలు చాలా బహుముచ్చటగా కనిపిస్తాయి. చాపల అల్లిక తీరు దీర్ఘచతురస్రాకారంలో పొడువు ఆరు అడుగులు, వెడల్పు నాలుగు అడుగుల పరిమాణంలో తయారుచేస్తారు. ఆ చాపపైన భార్యభర్తలు పిల్లలు హాయిగా నిద్రించవచ్చును. రాత్రి వేళల్లో చాపపైన కాళ్ళు చాపుకొని ఆరుబయట (సావిట్లో) హాయిగా పడుకొని తిరిగి ఉదయం చాపను ముడిచి ఇంట్లో మూల కూర్చోపెట్టవచ్చును.
పెళ్ళిళ్ళ సమయంలో ప్రత్యేకంగా అల్లిన చాపను కొత్త చాపను కులపెద్దలు అందరు కూర్చోని మాట్లాడటానికి ఉపయోగిస్తారు. అదే చాపను కొత్తగా పెళ్ళయిన వధూవరులకు కానుకగా ఇస్తారు. ఇది చెంచువారి సాంప్రదాయానికి చిహ్నంగా చెప్పవచ్చును.
ఈ పొడుపుకథ వల్ల చెంచువారిలో ఉన్న సంస్కృతి, ఆచారవ్యవహారసాంప్రదాయాలు కనిపిస్తాయి. కులపెద్దల పట్ల గౌరవభావము, వారి వృత్తి విధానము కనిపిస్తుంది.
పొడుపుకథ :3) ఇలా స్నానం చేస్తుంది అలా మసి పూసుకుంటుంది. జవాబు : వంటపాత్ర
(కలిమేని మాసయ్య, 75 సం॥, రైతు, మన్ననూర్ - 26-08-2014)
వివరణ : గృహజీవనంలో వంటపాత్రల ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వంట, వంటసామాగ్రి, ఇదంగా ఓ మమకారపు ఆనందం. ఓ ఆత్మీయ అనుబంధం ! ఇది నిజం! ఎందుకంటే... మనకు బాగా అలవాటైనా లేదా బాగా పరిచయం వున్నా మన ఇంటి వంట సామాగ్రితో మనకే తెలియని ఓ గొప్ప బంధం ముడిపడి ఉంటుంది.
ఈ పొడుపుకథలో కొత్తదనంతోపాటుగా చెంచులవారి గృహజీవన స్థితిగతులు కూడా ఆవిష్కృతమైతున్నాయని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే అప్పుడే కడిగిన లేదా తోమిన వంటపాత్రని ఉద్దేశిస్తూ ‘‘ఇలా స్నానం చేస్తుంది’’ అనే ప్రయోగాన్ని ఉపయోగించారు. తర్వాత అలా మసి పూసుకుంటుంది. అంటూ కడిగిన వంటపాత్రని పొయ్యి మీద పెట్టగానే మసి అలుముకోవడాన్ని ఉద్దేశిస్తున్నారు.
ఇక్కడ అలుముకునే మసిలోనే వీరి ఆర్థిక పరిస్థితి వుంది. ఎందుకంటే.... అధునాతన వంట విధానం వలన ప్రస్తుతం ఇళ్ళల్లో పొగచూరడం సమస్య దాదాపు కనుమరుగైపోయింది. అయినప్పటికీ చెంచుల సమాజంలో మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవారు అధికంగా ఉన్నారు. తక్కువ శాతము గ్యాస్ సిలిండర్ల మీద వంటచేసుకునేవారు ఉన్నారు. ఈ విధంగా ఈ పొడుపుకథాంశం నేటికినీ వాళ్ళ ఇళ్ళల్లో జరుగుతున్న కనబడుతున్న విషయమే. కాబట్టి ఇది వారి జీవన జీవన ప్రతిబింబంలో ఓ భాగంగా చెప్పవచ్చును.
2.9 ప్రకృతి ఆధారమైన పొడుపు కథలు:
పొడుపుకథ : 1) ఆకాశంలో ఆరవై గదులు, గదికి ఒక్క సిపాయి సిపాయికి ఒక్క తుపాకి జవాబు : తేనెపట్టు
(నిమ్మల గురవయ్య చెంచు, 82 సం॥, అప్పాపూర్ పెంట, లింగాల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, 18-12-2015)
వివరణ : చెంచుల జీవన విధానంలో ప్రధాన వృత్తి వ్యవసాయం తరువాత వేటాడటం వీరి యొక్క ప్రవృత్తిగా చెప్పవచ్చును. వీరు వేటకు వెళ్ళే సమయంఓ పంచభూతాలను ఎక్కువగా ఆరాధిస్తారు. ఆకాశం వైపు చూస్తూ సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తారు. వేటలో ప్రధానమైన వృత్తి తేనెపట్టును సేకరించడం.
ఈ పొడుపుకథ చెంచులవారి జీవనప్రమాణానికి వారి సాంప్రదాయానికి దగ్గర సంబంధం కనబడుతుంది. ఆకాశం అనే అడవిలో వీరు పెంటలలో అక్కడక్కడ ఏరేసినట్లుగా చుక్కలవలె ఇళ్ళు నిర్మించుకుంటారు. ఆ ఇంటికి యజమాని ఒక్కడే సిపాయిగా వ్యవహరిస్తాడు. ఆ వ్యక్తి కుటుంబ పెద్దగా రక్షకుడుగా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడతాడు. అడవిలో వీరి ఇళ్ళు ఉండటం మూలాన రాత్రివేళల్లో అడవి జంతువుల నుండి తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సిపాయివలె తమ చేతులల్లో (విల్లమ్ములు) బాణాలు చేతబూని రక్షకులుగా ఉంటారు. ఇలా ఈ పొడుపుకథకు వీరి జీవనానికి దగ్గర సంబంధం కనిపిస్తుంది. ఆకాశంవైపుగా ఉన్న కొమ్మకో రెమ్మకో తేనెటీగలు అనేకమైన గదులను ఏర్పరచుకుంటాయి. చెంచువారు కూడ అడవిలో అక్కడక్కడ పెంటలను ఏర్పాటుచేసుకొని ఇళ్ళు నిర్మించుకొని పది, ఇరవై కుటుంబాలు నివాసం ఉంటారు. తేనెపట్టు యొక్క గదులలో ఒక్కొక్క తేనె టీగ ఒక సిపాయిగా వ్యవహరించినట్లే చెంచువారి యొక్క ఇంటికి ఒక మగమనిషి సిపాయిగా వ్యవహరిస్తూ కుటుంబాన్ని కాపాడతాడు. తేనెపట్టును ఎవరైనా దొంగిలించడానికి వచ్చినప్పుడు తేనెటీగలు మూకుమ్మడిగా దాడిచేసి గాయపరుస్తాయో అలా చెంచువారు అడవిలో ఉండే కృరమృగాల నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో బాణాలు చేతబూని కృారమృగం వారి ఇళ్ళల్లోకి వచ్చిందంటే మూకుమ్మడిగా దాడిచేస్తారు.
చెంచువారు అడవిలో ఉన్న తేనెను సేకరించడం తెలుసు. వీరికి పుట్టుకతో వచ్చిన విద్యగా భావించవచ్చును. చెంచువారిలో చిన్న పిల్లలు అనగా 10-15 సం॥లు దాటిన పిల్లలు కూడా తేనెను సేకరించడానికి వేటకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క ప్రధానవృత్తులలో తేనెపట్టు సేకరణ రెండోవస్థానాన్ని ఆక్రమిస్తుంది. చెంచులవారు తేనె సేకరణకు వెళ్ళిన సందర్భంలో వచ్చిన పొడుపుకథ ఇది. ప్రకృతి ఆధారమైన పొడుపుకథగా అభివర్ణించవచ్చును.
పొడుపుకథ : 2) గోడమీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయేవారికి వడ్డించే బొమ్మ జవాబు : తేలు
(సిగర్ల బయ్యన్న, 56 సం॥, రాంపూర్ (పెద్దమనిషి), లింగాల మండలం, 28-12-2015)
వివరణ : ఈ పొడుపుకథ సాధారణంగా అన్ని గిరిజన తెగలవారు వాడుతుంటారు. కాకపోతే వీరు సందర్భోచితంగా వాడటం జరుగుతుంది.
చెంచువారు ఎక్కువగా అడవులలోని పెంటలలో (గూడెం)లో నివాసం వుంటుంటారు. వీరి యొక్క స్థల ప్రాంతాలలో ఎక్కువగా నల్లని తేలు ఆకు అలాలలో కనిపిస్తూ ఉంటాయి. కావునా, వీళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా వుంటారు.
చెంచులవారిలో తేలుకాటుకు మంత్రం వేసేవారు పెద్దలు ఉన్నారు. తేలుకాటుకు చెట్ల రసాలతో బాగుచేసేవారు ఉన్నారు. వీరు అడవిలో ఉండే చిల్లగింజతో తేలుకాటు గాయాన్ని నయం చేస్తారు. అంతే కాదు తేలుకాటుకు గురైనవారు తమ వద్దకు వచ్చే రోగులపాలిట పెద్దదిక్కులై ఎనలేని ప్రేమతో ఆదరణ చూపిస్తారు.
ముఖ్యంగా వీరి పరిసర ప్రాంతాలలో ఎక్కువగా ఇనుపతేళ్ళు (నల్లనివి) ఎర్రతేళ్ళు తక్కువగా అగుపిస్తాయి. ఇవి రెండూ ప్రమాదకాలే, కాబట్టి తమ ఇళ్ళల్లోకి (గుడిసె) తేళ్ళు రాకుండా మంత్రించిన ఇసుకను ఇంటిచుట్టూ చల్లుతారు. ఇతరులు అడిగినా ఇవ్వడానికి సంకోచించరు.
ముఖ్యంగా తేళ్ళ ఉనికి ఎక్కువగా ఇంటి గుడిసె గోడల మీద పాకడం ఒకటి. ప్రస్తుతం ఈ విషయాన్ని ఆధారం చేసుకొని వివరిస్తూ... తేళ్ళకు వుండే (కట్లు) గొలుసుగా వర్ణించారు.
అలాగే చడిచప్పుడు చేయకుండా తేలు కాటేయడాన్ని ‘‘వడ్డింపు’’గా చేస్తున్నారు. ఏది ఏమైనా విషజంతువుల్ని ఎదుర్కోవడంలో చెంచులవాళ్ళు ప్రదర్శించే విద్యలు నిజంగా ప్రశంసనీయమైనవి.
3. ముగింపు :
చెంచులవారికి సంబంధించిన పూర్తి చరిత్ర ఈ చరిత్రలో వున్న వివిధ కథలు గాథలు, ఇవన్నీ కూడా పుస్తకాల రూపంలో మనకు ఎక్కడా లభించడం లేదు. వీరు తెలుగు భాషలో మాట్లాడతారు. కాని యాసగా, వంకరగా మాట్లాడతారు. వీరు జనజీవనానికి దూరంగా ఆటవికంగా అడవిలో ఉండటం కారణంగా ఈ దుస్థితి ఏర్పడిరది అని చెప్పుకోవచ్చు. వివిధ కథల ద్వారా మౌఖిక ప్రచారాల ద్వారా వీరి జీవన విశేషాలను కొంతవరకు తెలుసుకోగలుగుతున్నాయని చెప్పవచ్చు. అలాగే వీరి జీవన విధానంలోని కొన్ని ప్రత్యేకతలను, విశేషాలను సంస్కృతి సంప్రదాయాలను, ఇతర రచయితలు, చరిత్రకారులు, పరిశోధకులు ఆయా సందర్భాల్లో వ్రాసి వుండటాన్ని కూడా మరి కొంత తెలుసుకోగలుగుతున్నామని చెప్పవచ్చు. వీరి పూర్వీకుల నుండి సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్న వీరి వృద్ధులు, వీరి గురించి వీరి జీవన విధానం గురించి అనేక విషయాలు తెలుసుకొని వ్రాయాలకునే అమూల్యమైన గ్రంథాలు అని కూడా చెప్పవచ్చు.
చెంచువారు చెప్పేటటువంటి పొడుపుకథలు, వారి జీవనవిధానము, కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలు వారియొక్క సంస్కృతిని తెలియజేస్తున్నాయి. చెంచులవారి పొడుపుకథలు ఒక ప్రత్యేకతని సంతరించుకుని వుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే... చరిత్ర గ్రంధాలుగా లేని వీరి జీవన విశేషాలు, ఈ విశేషాలల్లో అనేక అంశాలు, పొడుపుకథల్లో పొందుపరచబడి కనిపిస్తాయి. వీరు చెప్పుకునే పొడుపు కథల్లోని అంశాల్ని ఆధారం చేసుకుని ప్రస్తుతం (9) తొమ్మిది భాగాలుగా విభజించుకుని చర్చించడం జరిగింది. ఈ క్రమంలో వెలుగుచూసే అనేక విషయాలు చెంచులవారి చరిత్రకు ఒక ప్రత్యేకతను సంతరించుకోవడంలో సందేహంలేదు.
4. ఉపయుక్త గ్రంథ సూచి :
- ఉడుతల చెంచు లింగయ్య టీచర్, 50 సం॥లు - మన్ననూర్ - 13-12-2014
- కలిమేని చెంచురాములు, 45 సం॥ - ఫారెస్ట్ గార్డ్ - మన్ననూర్ - 26-08-2014
- కలిమేని మాసయ్య, 75 సం॥, రైతు, మన్ననూర్ - 26-08-2014
- చెంచు గురువయ్య - అప్పాపూర్ పెంట, 84 సం॥, గూడెం పెద్దమనిషి, మరణం-2016, 01-02-2013
- చెంచు నిమ్మల నాగరాజు (నాగయ్య) 39 సం॥ అప్పాపూర్ పెంట, లింగాల (మం), నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015
- చెంచు నిమ్మల శ్రీనివాసులు (సర్పంచ్), మన్ననూర్, రాష్ట్ర చెంచుల లోకం అధ్యక్షుడు, 13-12-2014.
- చెంచు మల్లేష్, 25 సం॥, మద్దిమడుగు, అమ్రాబాద్ మండలం, ఫారెస్ట్ గార్డ్, 25-12-2015
- చెంచు మాసయ్య, 28 సం॥, అప్పాపూర్ పెంట, లింగాల మండలం, నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015
- చెంచు సలేశ్వరము, 26 సం॥, మద్దిమడుగు, 25-12-2015
- తోకల గురువయ్య చెంచు, 35 సం॥ అప్పాపూర్ పెంట, లింగాల (మం),నాగర్ కర్నూర్ జిల్లా, 18-12-2015
- నిమ్మల గురవయ్య చెంచు, 82 సం॥, అప్పాపూర్ పెంట, లింగాల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, 18-12-2015
- భీమమ్మ, బి. మహబూబ్‌నగర్‌జిల్లా ఎరుకల సాహిత్యం సంస్కృతి. సిద్ధాంత గ్రంథం. పుట 263-264
- సిగర్ల బయ్యన్న, 56 సం॥, రాంపూర్ (పెద్దమనిషి), లింగాల మండలం, 28-12-2015
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

