AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. సలీం కథలు: ముస్లిం మైనారిటీవాదం
వి. పద్మ
తెలుగు ఉపాధ్యాయురాలు,
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, వినుకొండ,
పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9866623380, Email: vodithepadma@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 03.02.2025 ఎంపిక (D.O.A): 26.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
కేంద్రసాహిత్య అకాడమీఅవార్డు గ్రహీత సయ్యద్ సలీం సుమారు మూడువందలకు పైగా కథలు రచించారు. సయ్యద్ సలీం రచించిన కథలలోని ఇతివృత్తాలను లోతుగా పరిశీలించినప్పుడు విభిన్నమైన కోణాలు కనిపిస్తాయి. ఈ కథల్లో మైనారిటీ వాదాన్ని బలపరిచే కథలు 17 వరకూ ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో మైనారిటీ వాద కథలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో సలీం రచించిన కథల్లో మైనారిటీవాదాని పరిశీలించాలని ఈ వ్యాసం ద్వారా భావిస్తున్నాను. అస్తిత్వవాద ఉద్యమాల్లో భాగంగా తెలుగు సాహిత్యంలో 1991 నుంచి మైనారిటీ వాదం బలంగా వినిపిస్తుంది. ఖాదర్ మెహిద్దిన్ రచించిన "పుట్టుమచ్చ" దీర్ఘ కవిత ద్వారా తెలుగు సాహిత్యంలో మైనారిటీ వాదం ప్రత్యేక సాహిత్య శాఖగా స్థిరపడింది. మైనారిటీ వాద సాహిత్య ప్రక్రియ ప్రారంభమైన తొలినాళ్లలో కవిత్వం రూపంలోనే ఉండేది. ఆ తర్వాత కథలు, నవలల ద్వారా మైనారిటీ వాదాన్ని కొందరు రచయితలు బలపరిచారు. తెలుగు సాహిత్యంలో నవలలు, కథలు రూపంలో మైనారిటీ వాదాన్ని బలపరిచిన రచయితలు తక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. సలీం రచించిన కథల్లో మైనారిటీల జీవన చిత్రాన్ని పరిశీలించినప్పుడు మైనారిటీ వాదాన్ని రచయిత ఏ మేరకు బలపరిచారు అనే కోణాన్ని చెప్పడమే వ్యాసరచన ముఖ్య ఉద్దేశం. నా పరిశోధన వ్యాసాన్ని 5 భాగాలుగా విభజించుకున్నాను అవి 1. ఉపోద్ఘాతం , 2. సలీం కథలు ముస్లింల జీవన చిత్రన , 3. సలీం కథల్లో మైనారిటీ వాదం, 3.1. లోహముద్ర : అణిచివేత , 3.2. ఆరోఅల్లుడు : పేదరికం , 3.3. తలాక్, పర్ధా: సంస్కరణాభిలాష, 3.4. మంద, హరామి : అవకాశవాద ధోరణి, 3.5. ఖులా, సంకెళ్లు: తిరుగుబాటు, 4. అనుసరించిన పరిశోధనా పద్ధతులు : సలీం రచించిన కథల్లో మైనారిటీ వాద కథలను ఎంపిక చేసుకోవడం, తెలుగు సాహిత్యంలో మైనారిటీ వాద పరిణామ వికాస క్రమాన్ని వివరించడం సలీం కథల్లోని ఇతివృత్తాలను, పాత్రలను, కథా సారాంశాన్ని మైనారిటీ వాదంతో పోల్చి చూడడం. తెలుగు సాహిత్యంలో మైనారిటీ వాదాన్ని బలపరిచే కథలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. మైనారిటీ వాదాన్ని ప్రధానంగా మూడు రకాలుగా చూడాలి. 1. మైనారిటీలుగా తమపై వివక్షను అణిచివేతను నిరసించడం. 2. ఇస్లాం పేరిట మత పెద్దలు, మైనారిటీ నాయకులు అనుసరిస్తున్న అవకాశవాద ధోరణి వ్యతిరేకించడం. 3. ఇస్లాంలో మహిళలను అవమానపరిచే ధోరణి తిరస్కరిస్తూ సంస్కరణను ఆశించడం. ప్రధానంగా ఈ మూడు కోణాలు మైనార్టీవాద కవిత్వంలో కనిపిస్తాయి. ఇవే కోణాలు కథలు, నవలల్లో కూడా చూడవచ్చు. సలీం రచించిన కథల్లో మైనారిటీ వాదాన్ని బలపరిచే కథలను లోతుగా పరిశీలించి మైనారిటీ వాదాన్ని ప్రకటించడం.
Keywords: సాహిత్యం, ప్రక్రియలు, ముస్లిం మైనారిటీలు, విశ్లేషణ, జీవనచిత్రణ
1. ఉపోద్ఘాతం :
సామాజిక ప్రయోజనాన్ని ఆశించడమే సాహిత్యం ప్రధాన ఉద్దేశం. సాహిత్యంలో వ్యక్తిగత ప్రయోజనం కొంతవరకు కనిపిస్తున్నప్పటికీ సమాజహితాన్ని కోరుకోవడమే సాహిత్యకారుల ముందున్న ప్రథమకర్తవ్యంగా గమనించవచ్చు. మధ్యయుగంలో ప్రారంభమైన భక్తిఉద్యమం, ఆ తరువాత ప్రజాకవి వేమన తన పద్యాల ద్వారా ఆశించిన సంఘసంస్కరణ మార్గం పునాదులుగా 20వ శతాబ్దం ప్రారంభం నుంచే తెలుగు సాహిత్యంలో ఎన్నో కోణాలు, దృక్పదాలు, ఉద్యమాలు, వాదాలు, ప్రతివాదాలు కనిపిస్తాయి. సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ రూపుదిద్దుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ కారణంగా సమాజంలో బడుగు బలహీనర్గాల ప్రజలు, కార్మికులు, కూలీల నుంచి శ్రమ దోపిడీ చేయటం ప్రారంభమైంది. ఏ సమాజంలోనైనా ఆర్ధిక, సామజిక, రాజకీయ, మతతత్వ తారతమ్యాలను గమనించినప్పుడు సాహిత్యకారులు కలం పట్టి సామాన్య ప్రజలవైపు నిలబడి సంఘసంస్కరణను కోరుకోవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే సంఘసంస్కరణ ఉద్యమాల్లో భాగంగా అభ్యుదయ సాహిత్యం ఆవిర్భవించింది. అభ్యుదయ సాహిత్యం కాలక్రమంలో కొత్తపుంతలు తొక్కి దళిత, స్త్రీ, మైనార్టీ ప్రాంతీయ అస్తిత్వవాద ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి.
"1970ల నుంచి విప్లవ రచయితలు ఎక్కువగా ఆర్థిక దోపిడీ, రాజ్యహింస గురించి మాత్రమే రాస్తూ వచ్చారు. జీవితంలో జెండర్, కులం, మతం, ప్రాంతం, వృత్తి వంటి ఇతరేతర అంశాలు ఎన్నో నిర్వహిస్తున్న పాత్రను విస్మరించారు. దీనిని ప్రశ్నించే క్రమం 1985ల నాటికి ఏర్పడింది. ఆ మేరకు విప్లవ సాహిత్యోద్యమం బలహీనపడింది. ఇతరులు ఎవరో తమ విముక్తి కోసం కలం పడతారన్న భావనల్ని విభిన్న అస్తిత్వాలకు చెందినవారు తిరస్కరించారు. తరవాత క్రమంలో ఎవరి అనుభవాల్ని వాళ్ళే బలంగా వినిపించగలరన్న భావనలకు బలం చేకూరింది. ఈ భావన తొలుత స్త్రీవాద కవిత్వ సృజనకు పునాది అయింది. స్త్రీవాదం తరవాత దళితవాదం ముందుకొచ్చింది. ఈ విధంగా అస్తిత్వవాద ఉద్యమాల్లో స్త్రీ, దళితవాదాలు అగ్రభాగాన నిలిచాయి. వీటి తరవాత మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వవాదాలు ఉనికిలోకి వచ్చాయి. తెలుగు కవిత్వంలో ఇవన్నీ వేర్వేరు పాయలు. వేటి అస్తిత్వం వాటిదే. కానీ వీటన్నిటి మధ్యన తమ అస్తిత్వం కోసం పోరాడటమనే సామ్యం ఉంది. అందువల్ల వీటిని అస్తిత్వవాద ధోరణులుగా పేర్కొంటున్నారు."1
పైన పేర్కొన్న విశ్లేషణ గమనించినప్పుడు అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా మైనారిటీ వాదం పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు.
అయితే ముస్లిం కవులు 20వ శతాబ్దం ప్రారంభం నుంచే రచనలు చేయడం గమనించవచ్చు. అయితే వీరి సాహిత్యం ప్రాచీన సాంప్రదాయ కవులను అనుసరిస్తూ ఆ మార్గంలోనే సాగింది. బ్రహ్మర్షి ఉమర్ అలీషా, షేక్ ఖాసిం, షేక్ బుడెన్ సాహెబ్, షేక్ దరియా హుస్సేన్ వంటి సాంప్రదాయ కవులు ఆధ్యాత్మిక, సాంప్రదాయ ఇతివృత్తాలను ఎంచుకొని పద్యకావ్యాలు, ఖండకావ్యాలు రాసారు. 1980 తర్వాత తెలుగు సాహిత్యంలో ప్రారంభమైన అస్తిత్వవాద ఉద్యమాల్లో భాగంగా 1991 ఫిబ్రవరిలో ఖాదర్ మెహియుద్దీన్ " పుట్టుమచ్చ "దీర్ఘకవితను ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో " పుట్టుమచ్చ " తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దీర్ఘకవిత ద్వారా ముస్లిం మైనారిటీలు ఎన్నో ప్రశ్నలను సంధించారు. ముస్లింల అస్తిత్వానికి సంబంధించిన తొలి ప్రకటనగా " పుట్టుమచ్చ " దీర్గకవితను విమర్శకులు భావిస్తారు. దేశంలో ద్వితీయ పౌరులుగా, మైనారిటీలుగా తమను తాము భావించుకుని తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం తామే రచనలు చేయాలని మైనారిటీ కవులు ఎందరో భావించి కలం పట్టారు.
"1980ల మధ్యకాలంలోనే మత ఛాందసవాదం రూపుదిద్దుకొని ఆమేరకు విస్తరించింది. మైనారిటీ వ్యతిరేకభావాల్ని ప్రోది చేసింది. ఈ ఛాందసవాదం చివరకు బాబ్రీమసీదు విధ్వంసానికి దారితీసి, మైనారిటీల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. 1992 డిసెంబర్ 6 మైనారిటీలలో అప్పటి వరకు ఉన్న భయాందోళనల్ని తీవ్రతరం చేసింది. 1990ల ఆరంభం నాటికే మైనారిటీ స్పృహ ఏర్పడింది. స్థూలంగా చెప్పుకోవాలంటే ఖాదర్ 'పుట్టుమచ్చ' తో ఆరంభమైన మైనారిటీ కవిత్వ ప్రయాణం డిసెంబర్ 1992 తరవాత స్పష్టమైన నిర్దిష్టతను సంతరించుకుంది. మైనారిటీ చైతన్యంగా, వాదంగా రూపుదిద్దుకుంది."2
ఈ నేపథ్యంలో ముస్లింల చైతన్యాన్ని ప్రకటిస్తూ చేసిన రచనలు తెలుగు సాహిత్యంలో ముస్లిం మైనారిటీ వాదంగా ప్రత్యేక శాఖగా గుర్తింపు పొందాయి. 1990 తరవాత సమాజంలో నెలకొన్న రాజకీయ మతతత్వ పరిస్థితుల కారణంగా ముస్లిం సమాజంలో నెలకొన్న అభద్రతాభావాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని ఇతరుల నుంచి వారు అకారణంగా దుర్కొంటున్న వివక్షను కవిత్వ రూపంలో చెప్పారు.
"అఫ్సర్ అలి, స్కైబాబా, యాకూబ్, కరీముల్లా, స్మైల్ , అన్వర్, ఖాదర్ మొహియుద్దీన్ , షాజహానా, హనీఫ్, దిలావర్, జమీలానిషాత్, అనీస్ పర్వేస్ మొదలైన వాళ్ళెందరో కవిత్వం వ్రాస్తున్నారు. సలీం కథలే కాక వెండి మేఘం నవలను ముస్లిం జీవితాలను చిత్రిస్తూ రచించాడు. షాజహానా, అఫ్సర్, యాకూబ్, దాదాహయాత్, రహమతుల్లా, దిలావర్, ఖాదిర్ బాబు, కరీముల్లా, వేంపల్లె షరీఫ్, ఇనాయతుల్లా, ఖాజా, అలీ, స్కైబాబా, గౌస్ మొహియుద్దీన్, యాస్మిన్ బేగం, ఎంఎస్ బేగం, ఎస్బీ రహమతుల్లా, శశిశ్రీ మొదలైన వాళ్ళెందరో కథలు వ్రాస్తున్నారు."3
మైనారిటీ వాదాన్ని సమర్థించే కవిత్వం / కథలు / నవలల్లో భిన్నమైన కోణాలు గమనించవచ్చు. మైనారిటీ వాదం ప్రారంభమైన తొలినాల్లో ఆత్మన్యూనతా భావం కనిపిస్తుంది.తదనంతరం ప్రశ్నించే తత్వం ధిక్కార స్వరం వినిపిస్తుంది. మైనారిటీ వాద సాహిత్యాన్ని నిశితంగా పరిశీలించిన సాహిత్య విమర్శకులు మైనారిటీ వాద సాహిత్యంలో ఈ క్రింది మూడు అంశాలు గమనించవచ్చు అని చెబుతారు.
"1. మైనారిటీలుగా తమపై వివక్షను, అణచివేతను
నిరసించడం.
2. ఇస్లాం పేరిట మతపెద్దలు, మైనారిటీ నాయకులు
అనుసరిస్తున్న అవకాశవాద ధోరణిని వ్యతిరేకించడం.
3. ఇస్లాంలో
మహిళల్ని అవమానపరిచే ధోరణిని తిరస్కరిస్తూ సంస్కరణల్ని ఆశించడం."4
ప్రధానంగా ఈ మూడు కోణాలు ముస్లిం మైనారిటీ వాద కవిత్వం/ కథలు/ నవలల్లో
కనిపిస్తాయి.
2. సలీం రచించిన ముస్లిం మైనారిటీవాదకథలు:
"కాలుతున్న పూలతోట" నవలకు గాను 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సయ్యద్ సలీం 1981 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారు 300 పైగా కథలను సలీం రచించి ప్రచురించారు. సలీం కథల్లో వివిధ కోణాలలో పాటు సామాజిక స్పృహ ప్రధానాంశంగా ఉంటుంది. ఆయన రాసిన కథాంశాలను, ఇతివృత్తాలను పరిశీలించినప్పుడు 16 కథల్లో ముస్లిం మైనారిటీ వాద ధోరణి కనిపిస్తుంది. అవి-
1. మంద
(1999)
2.
మెహర్ (2000)
3. ఆరో అల్లుడు (2000)
4. తలాక్ (2003)
5.
ఖులా (2006)
6. పుట్ట (2009)
7. రెండో భార్య (2010)
8. ఆలియా బేగం
(2013)
9.
అంతర్గానం (2014)
10. నిఖా (2016)
11. లోహముద్ర (2017)
12. మువ్వల సవ్వడి
(2017)
13. పర్థా
(2020 )
14. హరామి
(2022)
15. ఎవరికి
తెలుసు(2022)
16.
సంకెళ్లు (2022)
3. సలీం కథల్లో ముస్లిం మైనారిటీ వాదం :
తొలినాటి మైనారిటీ వాద సాహిత్యంలో అభద్రత,
వివక్ష వంటి భావాలు కనిపిస్తాయి. తదనంతరం తమపై జరుగుతున్న సామజిక దాడులను నిరసించడం, ప్రశ్నించడం,
కొన్ని సందర్భాలలో ఎదురు తిరగడం వంటి ధోరణి కూడా గమనించవచ్చు. వీటితో పాటు మేధావులైన ముస్లిం రచయితలు తమ
సమాజంలో నెలకొన్న మూఢ విశ్వాసాలను నివసించారు. అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణగా మార్పు చెందాలని,
ప్రాచీన సాంప్రదాయాలు, పద్ధతులు, విశ్వాసాలు తగవని సాహిత్యం ద్వారా హితవు పలికారు. ముస్లిం సమాజంలో
నెలకొన్న నిరక్షరాస్యత వంటి కారణాల పర్యవసానాలు చెప్పారు. ఇటువంటి ధోరణులే సలీం రచించిన మైనారిటీ వాద
కథల్లో కనిపిస్తాయి.
3.1. లోహముద్ర : అణిచివేత, అభద్రతాభావం :
"ఈ దేశంలో ప్రశాంతంగా బ్రతకాలనుకునే పేద ముసల్మానుని సాబ్. నాకు ఏ మతసంస్థలతోనూ సంబంధాలు లేవు. పాకిస్తాన్ నా శత్రుదేశం. నేను ఈ దేశ పౌరుడిని. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను.."5
అంటూ అమాయకుడైనటువంటి వృద్ధ ముస్లిం మనోవేదనను "లోహముద్ర" కథలో రచయిత చెబుతారు. గతంలో జరిగిన కొన్ని ఉగ్రవాద కార్యకలాపాల తరువాత ఆ నెపంతో అమాయకులైన ముస్లింలను ఉగ్రవాదులుగా అనుమానించడం, వేధించడం, వారు ఎదుర్కొన్న పరిస్థితులను లోహముద్ర కథలో కనిపిస్తుంది.
ముస్లిం జనాభా అధికంగా ఉండే ఓ గ్రామంలో అబ్దుల్ సత్తార్ అనే ఓ వృద్ధ ముస్లిం, తన భార్య మనుమళ్లు, మనుమరాళ్ళు, కోడల్లతో కలసి ఉంటాడు. ఆ గ్రామంలో ఎక్కువ మంది యువకులు బ్రతుకుతెరువు కోసం దుబాయ్, సౌదీఅరేబియా, కువైట్ వంటి దేశాలకు వెళ్లి అక్కడ నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటే వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు. ఇదేవిధంగా అబ్దుల్ సత్తార్ ముగ్గురు కుమారులు సౌదీ అరేబియా, కువైట్ లో ఉంటారు. ముసలివాడైన అబ్దుల్ సత్తార్ మూడుపూటలా నమాజ్ కి వెళ్లడం, క్రమం తప్పకుండా ఖురాన్ చదువుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు.
ఇటువంటి గ్రామానికి ఓ పోలీసు ఇన్స్పెక్టర్
బదిలీపై వస్తాడు. ఓ రోజు పోలీస్ స్టేషన్ కు వెళుతుండగా అబ్దుల్ సత్తార్ ఇంటిపై ఓ పావురం కనిపిస్తుంది.
దాని కాలికి ఏదో చీటీ కట్టి ఉంటుంది. వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ మనసులో సవాలక్ష ప్రశ్నలు సుడులు
తిరుగుతాయి. ఈ పావురం గూఢాచారి పావురం కాదు కదా అనే అనుమానం వస్తుంది. ఇలా పావురాల ద్వారా మన దేశ
సమాచారం శత్రుదేశాలకు చేరవేస్తారని పోలీస్ ఇన్స్పెక్టర్ కు తెలుసు. అందులోనూ ఈ గ్రామంలో ఎక్కువ మంది
ముస్లిం యువకులు ఇతర ముస్లిం దేశాల్లో కూలీలుగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఏదో సమాచారం ఇతర
దేశాలకు వెళుతుందని అతనిలో బలమైన నమ్మకం కలుగుతుంది. వెంటనే ఆ పావురాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు
తీసుకువెళ్లి కాలికి ఉన్న చీటీ విప్పి చూడగా పిచ్చి గీతల్లా ఏదో కోడ్ భాషలో రాసి ఉంటుంది. తప్పకుండా ఇది
ఉగ్రవాద చర్యే అని పోలీస్ ఇన్స్పెక్టర్ భావిస్తాడు. ఆ పావురం వాలిన ఇంటి యజమాని అబ్దుల్ సత్తార్ ను
పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తాడు. ఆ పావురం ప్రతిరోజు తన ఇంటిపై వాలుతుందని, దానికి గింజలు కూడా
వేస్తానని అబ్దుల్ సత్తార్ అమాయకంగా చెబుతాడు. అయితే ఈ పావురం కాలికి ఉన్న చిట్టిలో ఉన్న సమాచారాన్ని
తనకు చెప్పమని అబ్దుల్ సత్తార్ ను పోలీసు ఇన్స్పెక్టర్ వేధిస్తాడు. తనకు ఏ పాపం తెలియదని అబ్దుల్
సత్తార్ మొత్తుకున్నా వినకుండా అబ్దుల్ సత్తార్ ను తీవ్రంగా కొడతాడు. ఇతను తప్పకుండా ఉగ్రవాది అయి
ఉంటాడని అక్కడి నుంచి అబ్దుల్ సత్తార్ ను రహస్య స్థావరానికి తరలిస్తాడు. అసలు విషయం ఏంటంటే అబ్దుల్
సత్తార్ మనువళ్ళు ఆడుకుంటూ ఏవో పిచ్చి గీతలు గీసి పావురానికి చీటీ కట్టారని రచయిత కథను
ముగిస్తాడు.
గడిచిన సమాజంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలు కొందరు భారతీయుల్లో
ఆగ్రహావేషాలు కలిగించాయి. ఈ సందర్భంలో కొందరు ముస్లింలలో అభద్రతా భావాన్ని కూడా పెంచాయి. లోహముద్ర కథలో
ఇవే అంశాలు కనిపిస్తాయి. ఈ కథలో ప్రధాన పాత్ర అయిన అబ్దుల్ సత్తార్, గతంలో కొందరు ముస్లిం మైనారిటీలు
అనుభవించిన అణిచివేత, అభద్రతా భావానికి నిదర్శనం. ఎవరో ఒకరు , ఎక్కడో ఎప్పుడో చేసిన తప్పు కారణంగా
అందరిని అదే దృష్టితో చూడడం సమంజసం కాదని రచయిత భావిస్తారు. అందుకే పేద అమాయక ముస్లిం అబ్ధుల్ సత్తార్
చేయని తప్పుకు ఉగ్రవాది నెపంతో ఎటువంటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్నాడో లోహముద్ర కథలో రచయిత
వివరిస్తారు. ఈ కథలో ముస్లిం మైనారిటీ వాదంలో ఉండే భయాందోళన, అభద్రతాభావం, వివక్ష వంటి భావనలు అబ్ధుల్
సత్తర్ పాత్ర ద్వారా కనిపిస్తాయి.
3.2. తలాక్, పర్ధా - సంస్కరణాభిలాష :
మారుతున్న కాలానికి అనుగుణంగా ముస్లింల ప్రాచీన సాంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో కొన్ని మార్పులు రావాలనిరచయిత ఆశిస్తారు. ఈ విధానం ముస్లిం మైనారిటీ వాదంలో అభ్యుదయ మార్గం. తలాక్, పర్ధా కథలను పరిశీలిస్తే ముస్లిం మైనారిటీ భావాలు అర్థమవుతాయి.
"తలాక్ అనే పదాన్ని మూడుసార్లు పలికి భార్యని వదిలించుకునే పద్ధతి సరియైంది కాదని - చాలామంది ముస్లిం యువకులు ఈ సాంప్రదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ - అమాయకమైన ముస్లిం ఆడపిల్లలు దీనికి బలైపోతున్నారనీ ఇబ్రహీం తనతో చాలాసార్లు చెప్పాడు. అందుకే కొంత మందికైనా కనువిప్పు కలగాలనే సదుద్దేశంతో తలాక్ ను కథా వస్తువుగా తీసుకుని నాటకం రాశాడు.."6
ఈ మాటలు " తలాక్ "కథలో ఓ పాత్ర ద్వారా రచయిత చెప్పిస్తారు. దీనిని బట్టి రచయితకు ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ పట్ల ఉన్న అభిప్రాయం అర్థం చేసుకోవచ్చు. తలాక్ అనే పదం మూడుసార్లు పలికి భార్యని వదిలించుకునే పద్ధతి ముస్లిం సంప్రదాయంలో ఉంది. ఈ ప్రాచీన సాంప్రదాయాన్ని నిరసిస్తూ రచయిత తలాక్ కథను రచించారని చెప్పవచ్చు. జమీలున్నీసా, ఇబ్రహీంలు భార్యాభర్తలు. ఇబ్రహీం నాటక రచయిత మరియు రంగస్థలం కళాకారుడు. ఆయన రచించిన నాటకం తలాక్. ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ విధానం సరికాదని ఈ నాటకం సారాంశం. ఇందులో పాత్రధారులుగా నిజ జీవితంలో భార్యాభర్తలైన జమీలున్నీసా, ఇబ్రహీంలు నటిస్తారు. స్టేజి పైన నటిస్తూ పాత్రను పోషిస్తూ పాత్రధారిగా ఉన్న ఇబ్రహీం, జమీలున్నీసాకు మూడుసార్లు తలక్ చెప్పేస్తాడు. ఎక్కడ ఏ సందర్భంలో తలాక్ చెప్పినప్పటికీ తలాక్ చెబితే విడాకులు తీసుకోవాల్సిందేనని జమీలున్నీసా, ఇబ్రాహీంలు విడాకుల తీసుకోవాలని ముస్లిం పెద్దలు పట్టుబడతారు. దీనిని ధైర్యంగా జమీలున్నీసా ఎదిరించి ముస్లిం సంప్రదాయానికి ఎదురు తిరుగుతుంది. ఇదే కథాంశం.
పర్థా కథలో కథానాయకి ఆఫ్రిన్ ఉన్నత విద్యావంతురాలు. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఆధునిక జీవనశైలి ఇష్టం. ఉరుకుల పరుగుల జీవితంలో ముస్లిం మహిళలు సౌకర్యవంతంగా దుస్తులు ధరించడంలో తప్పేముందని ఆమె భావిస్తుంది. అందుకే ముస్లిం సాంప్రదాయంలో ఉన్న బురఖాను వ్యతిరేకిస్తుంది. బురఖా వేసుకోవడం అసౌకర్యమని దీనివల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తుంది. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా ఆమె వినదు. బురఖా వేసుకోవడానికి ఇష్టపడని కారణంగా ఆమెకి ఎన్నో పెళ్లి సంబంధాలు తప్పిపోతాయి. కానీ ఆమె నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది.
"నూటికి తొంభై మంది మతచాంధసాల్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వాళ్లకి ఆధునిక జీవనశైల్లో ఉన్న అన్ని సౌకర్యాలు కావాలి. కానీ భార్య విషయానికి వచ్చేటప్పటికి బూజు పట్టిన ఆలోచనలు మాత్రం వదులుకోరు. నేను వెతికేది ఆ ఒక్క శాతంలో ఉన్న ఆధునిక భావాలు గల ముస్లిం యువకుల గురించే.."7 అంటూ ఆఫ్రీన్ చెబుతుంది.
తలాక్, పర్థా కథల్లో ముస్లిం మైనారిటీ వాదం
కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా మహిళల ఆచార వ్యవహారాలు ఉండాలని రచయిత భావిస్తారు. ముస్లిం
సమాజంలోని మహిళలకు అన్యాయం చేస్తున్న తలాక్ ఆచారం రద్దవ్వాలని కోరుకుంటారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న
సాంకేతిక యుగంలో మహిళలు ముందుండాలి కానీ బురఖా వంటిసాంప్రదాయాలను వ్యతిరేకించినా పర్వాలేదని రచయిత
అభిప్రాయంగా అర్థమవుతుంది.
3.3. ఆరో అల్లుడు : పేదరికం :
ముస్లిం జనాభాలో ఉపాధి అవకాశాల కోసం ఎక్కువ శాతం మంది రోజువారీ పనులపైనే ఆధారపడతారు. దీనికి కారణం నిరక్షరాస్యత అని చెప్పవచ్చు. భారతీయ ముస్లిం జనాభాలో అక్షరాస్యతా శాతం తక్కువగానే ఉన్నట్లు జాతీయ మైనారిటీ కమిషన్ నివేదికలు వెల్లడిస్తాయి. ఈ కారణంగా ముస్లిం వర్గాలలో పేద ప్రజలు ఎక్కువగానే కనిపిస్తారు. పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని రకరకాల ప్రలోభాలకు లోను చేసి అభం శుభం తెలియని ముస్లిం యువతులను పెళ్లిళ్లు చేసుకొని తమ దేశం తీసుకువెళ్ళే అరబ్ షేక్ ల గురించి ఎన్నో సంఘటనలు జరువుతూనే ఉంటాయి. ఇటువంటి కథాంశాన్నితీసుకొని సలీం " ఆరో అల్లుడు " కథను రచించారు.
ఈ కథలో ఖాన్ ది నిరుపేద కుటుంబం. ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. ఇంత పెద్ద కుటుంబాన్ని అతను ఒక్కడే పోషించాలి. వాచ్ మెన్ గా పనిచేస్తూ అతనికి వచ్చే రెండువేల రూపాయలతో ఇంతమంది కడుపు నింపటం చాలా కష్టమైన పనే. ఇలాంటి పరిస్థితుల్లో ఖాన్ పెద్ద కుమార్తెకు మంచి సంబంధం వస్తుంది. పెద్దమ్మాయి పేరు యాస్మిన్. పదహారేళ్ళ వయసు ఉండే అందమైన అమాయకమైన అమ్మాయి. ఆమెకు మంచి సంబంధం వచ్చిందని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖాన్ వెంటనే పెళ్ళి చేస్తాడు. పెళ్లి కుమారుడు దుబాయ్ షేక్. పెళ్లి చేసుకోవడమే కాకుండా ఖాన్ కు మరికొంత డబ్బు కూడా ఇచ్చి అమ్మాయిని తీసుకుని దుబాయ్ వెళ్లిపోతాడు. తన కుమార్తె అయినా సుఖంగా బ్రతుకుతుందని ఖాన్ భావిస్తాడు. కానీ, కొంతకాలానికి ఖన్ కు తెలిసేవిషయం ఏంటంటే దుబాయ్ షేక్ కి యాస్మిన్ ఆరో భార్యని.
ఆరో అల్లుడు కథలోని సంఘటన నిజజీవితంలోనూ అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం అమాయకత్వం, పేదరికం, నిరక్షరాస్యత అని రచయిత భావిస్తారు. అమాయకమైన ముస్లిం మహిళలను వివిధ ప్రలోభాలకు లోను చేసి పెళ్లిళ్లు చేసుకుని దుబాయ్ తీసుకు వెళ్లిన తర్వాత అక్కడ జరిగే దుర్భరమైన పరిస్థితులను రచయిత ఈ కథలో పాత్రల ద్వారా ఇలా చెప్పిస్తారు..
"ఇలా జరుగుతుందని తెలిసినా మనవాళ్ళు దుబాయ్ షేక్ లకు మన ఆడపిల్లల్ని ఎందుకు కట్టబెడ్తున్నారూ ? " అని అడిగాడు పదిహేనేళ్ళ సుభానీ
“ ఏం చేస్తారు చెప్పు - దారిద్య్రం. ఆకలి. శక్తికి మించిన సంతానం. డబ్బు ఖర్చుపెట్టి ఆడపిల్లల నిఖా చేయలేని దీనస్థితి షేక్ లు ఇస్తామనే డబ్బుకి ఆశపడి నిఖాలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వేరే దారిలేక ఆడపిల్లల్ని అమ్ముకొంటున్నారు” అన్నాడు లతీఫ్. ఆ స్త్రీల దయనీయ స్థితిని తల్చుకుని అనుకుంటాను అతని కంఠం రుద్ధమయింది. 8
.. అంటూ దూరపు కొండలు నునుపు అని భావించే
కన్నా ఇక్కడే కూలీ పని చేసుకుని సంతోషంగా బ్రతికితే మేలని రచయిత ఆరో అల్లుడు కథ ద్వారా సందేశాన్ని
ఇస్తారు.
3.4. ఖులా, సంకెళ్లు - ముస్లిం స్త్రీల చైతన్యం
:
ఖులా, సంకెళ్లు ఈ రెండు కథల్లోనూ పేద ముస్లిం
స్త్రీల జీవన చిత్రణ కనిపిస్తుంది. అన్ని మతాల్లోనూ, సమాజాలలోనూ ఉన్నటువంటి స్త్రీల కష్టాలే ఈ రెండు
కథల్లోనూ కనిపిస్తున్నప్పటికీ ముస్లిం సమాజంలో భర్తలు తప్పు చేసినప్పటికీ భార్యలు ఎదురు తిరగడం అనేది
అరుదుగా జరిగే విషయ. దీనికి కారణం " తలాక్ " అనే సాంప్రదాయం. ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడంతో పూర్తిగా
భర్తలపై ఆధారపడే కొందరు పేద ముస్లిం స్త్రీలు భర్త తలాక్ చెప్పి తమకు విడాకులు చేస్తాడనే భయంతో జీవిస్తూ
ఉండటాన్ని అక్కడక్కడా గమనించవచ్చు. కానీ, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, జీవితం బందీఖానాలో
ఉన్నదని భావించినప్పుడు ముస్లిం స్త్రీలు కూడా ధైర్యంగా తమ సంకెళ్ళను తెంచుకొని స్వేచ్ఛ జీవితాన్ని
పొందాలని ఖులా, సంకెళ్లుకథలు సందేశాన్ని ఇస్తాయి.
సంకెళ్లు కథలో కథానాయక పేరు ఫరీదా. అజహర్ తో ఆమె వివాహం జరుగుతుంది. ఆటో
నడిపి జీవనం సాగించే అజహర్ పరమ దుర్మార్గుడు. దానికి తోడు అనుమానం కలిగి నిత్యం ఫరీదాను వేదిస్తూ
ఉంటాడు. " ఆడది కావడం,ముస్లిం కుటుంబంలో పుట్టడం , అందంగా ఉండడం.. ఇవన్నీ తన పాలిట శాపాలైనాయి.."అంటూ
ఫరీదా నిత్యం రోదిస్తూ ఉంటుంది.
"బయటికి వెళ్ళకూడదు, వెళ్లాలనుకుంటే అజహర్ తోడుండాలి. నల్లటి బురఖాలో శరీరాన్ని కప్పుకునే బయటికి అడుగు పెట్టాలి. బంధువులతో స్నేహితులతో మాట్లాడకూడదు. వాళ్ళు ఎవరు ఇంటికి రాకూడదు. తను వాళ్ళిళ్ళకు వెళ్లకూడదు. పెళ్లిళ్లు శుభకార్యాలకు కూడా వెళ్లడానికి వీల్లేదు. ఎన్ని సంకెల్లో కంటికి కనిపించిన సంకెళ్లు..."8
ఇది క్లుప్తంగా రచయిత చెప్పిన ఫరీదా జీవితం.
ఎన్ని సమస్యలు ఎదురైనా తన ఒక్కగానొక్క కుమార్తె కోసం ఫరీదా భరిస్తూ జీవిస్తూ ఉంటుంది. కానీ తమ
కుమార్తెకు యాభై ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అజహర్ నిర్ణయించడంతో ఇక తట్టుకోలేక ఎదురుతిరిగి
భర్త అనేసంకెళ్ళను తెంచుకుని తన కుమార్తెతో కలసి స్వేచ్ఛ ప్రపంచంలోకిఅడుగుపెడుతుంది.
ఖులా కథలో ఫాతిమా జీవితం కూడా ఇటువంటిదే. భర్త తాగుబోతు, దుర్మార్గుడు.
వీరికి ఒక్కగానొక్క కుమార్తె నాజియా ఉంటుంది. ఆరేళ్ల వయసున్న నాజియా ఆడుకోవడానికి బయటకు వెళ్తే ఓ
యువకుడు ఆ చిన్నారిని పాడు చేసి చంపేస్తాడు. ఇంతకాలం కుమార్తె కోసమే బ్రతుకుతున్న ఫాతిమా ఈ సంఘటనతో
తల్లడిల్లిపోతుంది. ఇంత ఘోరం చేసిన యువకుడికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటుంది. కానీ ముస్లిం పెద్దలు
ఈ విషయాన్ని రాజీ చేయాలని ప్రయత్నిస్తారు. ఫాతిమా భర్తకు డబ్బు ఆశ చూపిస్తారు. ఫాతిమా దీన్ని
వ్యతిరేకిస్తుంది. చివరకు తన కుమార్తెకు న్యాయం జరగడం కోసం ముస్లిం పెద్దలను ఎదిరించడమే కాకుండా తన
భర్తను కూడా వదిలేయడానికి సిద్ధపడుతుంది.
ఈ రెండు కథల్లోనూ ప్రధాన
పాత్రలు నిరక్ష్యరాస్యులు, ఆర్ధిక స్వాతంత్ర్యం లేని పేదలు అయినప్పటికీ వారిలో చైతన్యం కనిపిస్తుంది.
ముస్లిం పెద్దలు, కట్టుబాట్లను వ్యతిరేకించడం సాహసంతో కూడుకున్న పని అయినా ఈ కథల్లోని ఫాతిమా, ఫరీదాలు
ఎదురు తిరిగి నిలబడతారు. అన్యాయం జరిగినప్పుడు తలవంచుకుని కూర్చోకుండా ధైర్యంగా పోరాడాలని రచయిత
భావిస్తారు. అదే సందేశాన్ని ఖులా, సంకెళ్లు కథల ద్వారా అందిస్తారు. ఈ రెండు కథలు కొందరు పేద ముస్లిం
స్త్రీల జీవితానికి అద్దం పడుతుంది.
4. ముగింపు :
- సలీం రచించిన 16 కథలను విశ్లేషించినప్పుడు ముస్లిం మైనారిటీ వాదాన్ని అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీ వాద సాహిత్యోద్యమంలో కనిపించే అన్ని కోణాలు ఈ కథాంశాల్లో ఇమిడి ఉన్నాయి.
- ఉగ్రవాద నెపంతో అమాయకమైన వృద్ధ ముస్లిం ఎటువంటి హింసకు గురయ్యాడో " లోహముద్ర " కథ చెబుతుంది.
- పేదరికం కారణంగా ముస్లిం సమాజంలోని కొందరి దుర్భరమైన పరిస్థితులను "ఆరు అల్లుడు" కథలో చూడవచ్చు.
- ప్రాచీన సాంప్రదాయాలు, పద్ధతులను నిరసించే కథాంశాలు " తలాక్ " , " పర్ధా " కథలు. పేద ముస్లిం స్త్రీల పరిస్థితులు వారిలోని చైతన్యాన్ని " సంకెళ్లు ", " ఖులా "కథల్లో రచయిత వివరించారు.
- మిగిలిన కథల్లోనూ ఇవే కోణాలు కనిపిస్తాయి. కాబట్టి సలీం రచించిన 16 కథలను ముస్లిం మైనారిటీ వాద కథలుగా పేర్కొనవచ్చు.
5. సూచికలు :
- తెలుగులో కవిత్యోద్యమాలు, ఆచార్య కె.
యాదగిరి ( సంపాదకులు ) , పుట 238
- తెలుగులో కవిత్యోద్యమాలు, ఆచార్య కె.
యాదగిరి ( సంపాదకులు ) ,పుట 239
- మన తెలుగు సాహిత్య చరిత్ర, డాక్టర్
ముదిగంటి సుజాతారెడ్డి , పుట 345
- తెలుగులో కవిత్యోద్యమాలు , ఆచార్య కె.
యాదగిరి ( సంపాదకులు ) , పుట 241
- మాయాజలతారు, సలీం, పుట 78
- రూపాయి చెట్టు, సలీం, పుట 77
- నీడ , సలీం, పుట 101
- ఎవరికి తెలుసు, సలీం, పుట 12
6. ఉపయుక్తగ్రంథసూచి:
- మాలిక్ ఎస్.యం. సాహిత్యం వాదవివాదాలు,
హైదరాబాద్
- యాదగిరి, కె. సంపాదకులు , తెలుగులో
కవిత్యోద్యమాలు, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2003
- శాస్త్రి, ద్వా.నా., తెలుగు సాహిత్య
చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదారాబాద్, 2001
- శ్రీదేవి, కె. కథానుశీలన, ద్రావిడ
విశ్వవిద్యాలయం, 2012
- సత్యనారాయణ, ఎస్వీ. దళితవాద వివాదాలు,
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ , 2000
- సామాన్య, ఎ. , తెలుగు ముస్లిం రచయితలు -
సమాజం - సంస్కృతి (హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సమర్పించిన పీహెచ్.డి సిద్ధాంత గ్రంథం),
2010
- సాయిబు (ఇస్లాం వాద దీర్ఘ కవిత),
కరిముల్లా షేక్, మదర్ షంషున్ ప్రచురణ, వినుకొండ, 2004
- సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర
,దళిత సాహిత్య పీఠం, విశాఖపట్నం, 2011
- సుజాతారెడ్డి, ముదిగంటి. మన తెలుగు
సాహిత్య చరిత్ర, తెలుగు అకాడమీ హైదరాబాద్, 2018
- హజీబ్ మీరా, షేక్. సలీం రచనలు - పరిశీలన (ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం), 2019
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

