headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. ‘మేఘాల మేలిముసుగు’ నవల: ప్రధానపాత్రల చిత్రణ

యండమూరి సంతోషి

పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్నం,
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9505669107, Email: yandamurisanthoshi65@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.01.2025        ఎంపిక (D.O.A): 25.02.2025        ప్రచురణ (D.O.P): 01.03.2025


వ్యాససంగ్రహం:

నవల ఒక దీర్ఘ సాహిత్య ప్రక్రియ. సుదీర్ఘకాలం పాటు కొనసాగినప్పటికి కథలోలీనమై కధాసారంశాన్ని, కథలోని వ్యక్తుల వ్యక్తిత్వాలను పాఠకులు తమజీవణశైలికి, తమ వ్యక్తిత్వాలను అన్వయించుకుని నవలాసాహిత్యంలో బ్రతుకాడుతుంటారు. మాలతిచందూర్ రచనల్లో ఎంతో పేరు గడించిన నవల "మేఘాలమేలిముసుగు". మన జీవితాలు చాలా విచిత్రమైనవి, ఎవరి జీవితం పెను తుఫానుకి లోనవుతుందో , ఎవరి జీవితం నందనవనంలో విహరిస్తుందో విందులు, వినోదాలు, గర్ల్ ఫ్రెండ్సు జీవితం అనుకున్న అరుణగిరికి, ఆత్మాభిమానం, విజ్ఞానతృష్ణ గల విశాల పరిచయమైంది వారిద్దరూ ఏకమై అందమైన మేఘాలమమేలిముసుగుని తొలగించడానికి చేసిన ప్రయత్నమే ఈ "మేఘాలమేలిముసుగు - పాత్రల చిత్రణ" అనే శీర్షికతో విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఈ నవలలో కీలకంగా ఉన్న ప్రధానపాత్రలను మాత్రమే స్వీకరించి విశ్లేషించడం జరిగినది. అరుణగిరి, విశాల, రాజమ్మాళ్, సావిత్రమ్మ పాత్రలను భాగాలుగా చేసి ఒక స్పష్టమైన దీర్ఘవ్యాసం రూపొందించాను . ఇంతకుముందు మాలతి చందూర్ నవలలపై ఎమ్. ప్రభావతి “మాలతి చందూర్ నవలలు - సామాజిక దృక్పథం" అనే సిద్ధాంత గ్రంధము, మాలతి చందూర్ మేఘాల మేలి ముసుగు రచనలు ఈ వ్యాసానికి ఆధారం. ఈ నవలలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ధనవంతుడి వలన దిగువ, మధ్యతరగతి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి, అరుణగిరి మనసుకి ఉన్న ముసుగుని విశాల ఏ విధంగా తొలగించింది అని తెలియజేయడం, ప్రస్తుతం బాధ్యతారాహిత్యంగా తప్పుదారిలో నడుస్తున్న యువతకు కుటుంబవిలువలు, ఆత్మపరిశీలన, నైతికవిలువలు, విద్య ప్రాముఖ్యత వంటివి ఈ నవలలో ప్రధానపాత్రల ద్వారా ఏ విధంగా తెలియజేసారో ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: మేఘాల మేలిముసుగు, మాలతీ చందూర్‌, అరుణగిరి, విశాల, రాజమ్మాళ్‌, సావిత్రమ్మ

1. ఉపోద్ఘాతం:

మేఘాల మేలిముసుగు నవల ద్వారా వివిధ వ్యక్తుల మనస్తత్వాలను తెలియచేస్తూ, వివిధ సందర్భాల్లో కుటుంబంలోని వ్యక్తులు, సమాజంలోని వ్యక్తులు, స్నేహితులు, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, వారు ఎలా ప్రవర్తిస్తారో తెలియచేశారు. కుటుంబంలోను, జీవితంలోనూ ఒడిదుడుకులు గురించి, మానవ సంబంధాలు, స్త్రీ విద్య ఆవశ్యకత గురించి దీనిలో తెలియచేశారు.

2. రచయిత పరిచయం : 

1950ల నుండి దాదాపు మూడు దశాబ్ధాల పాటు మాలతీ చందూర్‌ పేరు తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. 1928 డిసెంబర్‌ 26న కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు.ఈమె జన్మించింది కృష్ణాలో అయినా జీవించింది మాత్రం మద్రాసులో. 1947 చివర్లో ఆమె, చందూర్‌ గారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈమె మద్రాసు వెళ్ళిన తరువాతే ప్రైవేటుగా ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పూర్తి చేశారు. వారు ఇంతకుమించి పెద్ద చదువులేం చదవలేదు.

వారి రచనా వ్యాసంగం 1949లో ప్రారంభమైంది.1952 నుండి ఆడవారి కోసం ‘‘ప్రమదావనం” అనే ‘‘డియర్‌ అబ్బీ” వంటి శీర్షికను రెండు దశాబ్ధాలకు పైనే నడిపించింది. ఈ శీర్షికలో ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యడం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె రాసిన ‘వంటలు - పిండి వంటలు’ పుస్తకం అందరికి ఉపయోగకరంగా ఉండేది. ఈ పుస్తకంతో ఈమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులో సమీక్షలు చేసింది.

ఈమె రాసిన నవలలు నవలా మంజరి పేరుతో భాగాలుగా ఉన్నాయి. అందులో భూమిపుత్రి, శతాబ్ది సూరీడు, హృదయనేత్రి, గౌతమీపుత్ర, బతుకునేర్చినజాణ, ఏమిటీజీవితాలు మొ॥నవి. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకున్నది. ఈమె. తన 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పని చేశారు. మాలతీచందూర్‌ కృష్ణాలో పుట్టి మద్రాసులో స్థిరపడ్డారు. 2013 ఆగష్టు 21న ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొన్ని రోజులు ఈవిడ క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తులయ్యారు. మెడికల్‌ కాలేజీకి శరీరదానం చేశారు.

3. మేఘాల మేలిముసుగు నవల - పాత్రలు:

3.1 అరుణగిరి పాత్ర - పరివర్తనశీలత:

అరుణగిరి పాత్ర ప్రధానంగా ఒక పరిణామాత్మక పాత్ర. విలాసవంతమైన జీవితం నుండి బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారే క్రమంలో జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. అతని జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన (రాజమ్మాళ్ మరణం), తర్వాత విశాల ప్రభావం అతనిలో మార్పును తెచ్చాయి. అందువల్ల ఈ పాత్రను ఒక్క మాటలో "పరివర్తనశీలి" అని చెప్పవచ్చు.

మేఘాలమేలి ముసుగులో ముఖ్యపాత్ర అరుణగిరి. విందులు, వినోదాలు, గర్ల్‌ఫ్రెండ్సే జీవితం అనుకుని విహరించేవాడు. వివాహం మీద నమ్మకంలేని వ్యక్తి, జీవితాన్ని విలాసవంతంగా అనుభవించడానికే ప్రయత్నం చేసేవాడు. రోజారాణి అనే అమ్మాయితో పరిచయం ఉండేది. అతనికి ఆమెతో ఉంటూ సినిమాకు వెళ్ళాలని, కబుర్లు చెప్పాలని అనిపిస్తూ ఉండేది. కాని ఒక రోజు ఆమెకు తెలియకుండా కొడైకెనాల్‌ ట్రిప్‌కి ప్లాన్‌ చేశాడు. కానీ దానికి ఆమె నిరాకరించడంతో తట్టుకోలేకపోయాడు ఎక్కడో అతని పురుషహంకారం దెబ్బతిన్నది .ఆమె అతన్ని వివాహం చేసుకోవాలనుకుంది కాని అరుణగిరికి వివాహం మీద అభిప్రాయం లేదు. ఎందుకంటే స్వేచ్ఛగా జీవితాన్ని సాగించాలనుకునే అతనికి వివాహం చేసుకుంటే భార్యాభర్తలందరూ ఒకరికొకరు బానిసత్వం చేయాలని అతని అభిప్రాయం కాని రోజారాణి అతనికి అర్థమయ్యే విధంగా చాలాసార్లు వివాహ బంధం గూర్చి చెప్పి చూసింది. కానీ అతని అభిప్రాయం మారలేదు.

ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరి ఆదర్శాలు వాళ్ళవి. మనం పెళ్ళి చేసుకుంటే కలిసి కొడై వెళ్ళడం సమంజసం అనుకుంటావు నువ్వు. నాకు పెళ్ళి అనేది నిమిత్తమాత్రంగా గుదిబండగా తోస్తుంది. పెళ్ళయితే మొగాణ్ణి కట్టేద్దామని అనుకునే స్త్రీలు, అందరూ1

అని అరుణగిరి తన అభిప్రాయాన్ని తెలిపాడు. పెళ్ళి కాకుండా ఓ యువతిని అలా తనతో రమ్మనటం అతనికి తప్పుగా తోచలేదు కానీ ఆమె తిరస్కరణలో మాత్రం తప్పుని చూసాడు అహం ఎక్కడో దెబ్బతిన్నది. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి,బుద్దిచెప్పడానికి ఇంకో అమ్మాయితో స్నేహం చేయాలనుకుంటాడు .నాటికి నేటికి చాలామంది తమ తప్పులు పక్కనపెట్టి ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎదుటి వాళ్ళ తప్పులని నిరూపించడానికి ఇంకో తప్పు చేస్తుంటారు అరుణగిరి చేసింది కూడా అదే అలా కోపంతో, ధన బలoతో కారునడుపుతూ యాక్సిడెంట్‌ చేసి ఒక స్త్రీ మరణానికి కారణమయ్యి ఆమె కుటుంబం రోడ్డున పడే స్థితికి అతని క్షణికావేశం తీసుకువ స్తుంది ఆమెపేరు రాజమ్మాళ్‌. ఈవిషయం తెలుసుకున్న ఈయన అక్కడే కుప్పకూలిపోయి ఆ తర్వాత ఈ విషయం తలుచుకుని అరుణగిరి చాలా బాధపడ్డాడు. తన వల్ల ఒక ప్రాణం పోయింది అనుకుని ఎలా అయినా ఆ కుటుంబాన్ని ఆమె లేని లోటు తీర్చడంతో పాటు ఆర్ధికంగా వాళ్ళని ఆదుకుందామనుకుని ఆ కుటుంబానికి దగ్గరవుతూ, ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం తన విలాసవంత జీవితమే అనుకుని చాలా బాధపడ్డాడు.

ఇలా తాను బాగా ధనవంతులు ఇంటికి వారసుడు కావడం వలన అతనికి మంచి, చెడూ, సంబంధ బాంధవ్యాలు గూర్చి అవగాహన లేకపోవడం చదువు గురించి, జీవనోపాధి గురించి,ఆర్థిక స్థిరత్వం గురించి అతనికి ఎలాంటి బాద్యతలు లేకపోవడం వలన తన జీవితం విలాసవంతంగా మార్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలాంటి వ్యక్తులు చాలామందిని నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటాము ఇలా విలాసాలతో జీవితాన్ని సాగిస్తున్న ఇతనికి తన కారణంగా మరణించిన రాజమ్మాళ్‌ కుమార్తె విశాలతో పరిచయం ఏర్పడి,ఆమె తన ప్రవర్తనతో, విజ్ఞాన తృష్ణతో జ్ఞానోదయం కలిగిస్తూ అతని మనసుకు ఉన్న ముసుగుని తొలగిస్తుంది. విందులు, వినోదాలతో కాలక్షేపం చేసి అదే జీవితంగా కొనసాగిన అరుణగిరి విశాల యొక్క ప్రవర్తన నచ్చి ఆమెను వివాహం చేసుకోవాలనుకుని, అరుణగిరి తన తల్లిని ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈనాటి సమాజంలో జరిగే సంఘటనలు మరియు ఉన్నత వ్యక్తిత్వం,ఆదర్శాలు గల వ్యక్తులకు కళ్లముందు కదలాడే వేదనాభరితమైన జీవితాలను చూసినపుడు వాటి ద్వారా మనిషిలో మార్పు ఏ విధంగా వస్తుందో ఆ మార్పు మనిషిని మంచిమార్గంలో బాధ్యతగా ఎలా ముందుకు నడిపిస్తుందో అరుణగిరి పాత్ర ద్వారా మాలతి చందూర్ తెలియచేశారు.

3.2 విశాల పాత్ర - సాధనాశీలత: 

విశాల పాత్ర స్వభావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే "సాధనాశీలి". చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోయడం, పేదరికంలో కూడా చదువుపై ఉన్న పట్టుదల, వివాహ విషయంలో ఎదురైన సవాళ్ళు, తల్లి మరణం - ఇన్ని ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగి, తన లక్ష్యాలను సాధించిన స్థైర్యవంతురాలు. తన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను సాధనగా మలచుకుని ముందుకు సాగిన పాత్ర.

ఈ మేఘాలమేలిముసుగుని తొలగించిన ముఖ్యమైనపాత్ర విశాల. ఈమె రాజమ్మాళ్‌ రెండవ కుమార్తె. ఈమె తన ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుని ఎలా అయినా ఇంటి పరిస్థితులను మార్చాలనుకుంటుంది. తమ కుటుంబాన్ని పోషిస్తుంది ఈమె తల్లి మాత్రమే, తండ్రి అవిటివాడు. కాబట్టి తల్లి పడే బాధని ఈమె అర్థం చేసుకుని సాయంత్రం అయినా ‘‘ఆకలి లేదమ్మా” (ఆకలి వేసినా లేదని చెప్పేది) అంటూ ఉండేది చాలాసార్లు ‘‘ఆకలి వేస్తుంది అని కాని- యీ రిబ్బను కావాలని కాని ఆ గాజులు కావాలి అని గాని - యీ సినిమా చూడాలని వుంది2 అని ఏనాడూ తల్లిని అడిగేది కాదు. అలాంటి కోరికలు తనకు ఉండకూడదు అని పదమూడో ఏట విశాల నిశ్చయించుకుంది. పదమూడేళ్ళ వయసంటే స్నేహితులతో బడికి వెళుతూ ఆడుతూ పాడుకోవల్సిన సమయంలోనే ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకున్న అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకుని తన కోరికలు వదులుకున్న వివేకం కలది విశాల ఈమె ఫిఫ్త్‌ ఫారమ్‌లో వున్నపుడు వాళ్ళ అమ్మ వాళ్ళ పరిస్థితుల రీత్యా ఆమెకు పెళ్ళి చేయడానికి సిద్ధమైంది కాని విశాలకు పెళ్ళి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. తాను బాగా చదువుకోవాలనుకుని తాను చదువుకుంటే తన ఇంటి పరిస్థితులు మార్చవచ్చు అని అనుకునేది. ‘‘ఈ ఒక్క ఏడూ వూరుకుంటే స్కూలు ఫైనలు అయిపోతుంది. ఆ తరువాత ట్రయినింగ్‌ చదువుకుని - నీ దగ్గరే వుంటాను”3 

విశాలకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తాను చదువుకోవాలనుకుంది అంటే ఆడపిల్ల చదువుకుంటే తన జీవితాన్ని ఎలా అయినా సరిదిద్దుకోగలుగుతుంది తన కాళ్ళ మీద తాను నిలబడగలదు అని మాలతి చందూర్ చదువు యొక్క ప్రాధాన్యతను తెలియచేశారు ఏమైనా సరే, పెళ్ళి చూసుకోవాలని లేదు. కాని గత్యంతరం లేదు. తన పరిస్థితి ‘‘ముందు నుయ్యి - వెనుక గొయ్యగా” ఉంది.(పెళ్లి చేసుకోకపోతే బావ బారి నుండి తప్పించుకోలేదు - పెళ్లి చేసుకుంటే చదువు ఆగిపోతుంది) ముగ్గురు పిల్లల తల్లి అయిన అక్కని బావ పాత చొక్కా మార్చినట్లు మార్చేద్దామనుకుంటున్నడని చాలా బాధ పడింది నేటికీ కూడా చాలా మంది అక్క భర్తలు మరదలి మీద మోజు పడడం చూస్తున్నాము .విశాలకి కొన్ని రోజులు తర్వాత వేరొకరితో పెళ్ళి జరిగింది. కాని విశాల అత్తవారు పెళ్ళిపీటల మీద తగవులాడి వెళ్ళిపోయారు. పెళ్ళికొడుకు వెర్రివాడు, అత్తగారు గయ్యాళి. పెళ్ళికొడుకు మతిస్థిమితం లేనివాడని కప్పిపుచ్చి పెళ్ళి చేశారని బయటపడింది కానీ విశాల కోపంతో, బాధతో, ఆవేశంతో మాట్లాడకుండా ఆలోచించి విశాలమైన దృక్పథం గల స్త్రీ గా ఆలోచించి బాధపడుతున్న తన తల్లిని ఓదార్చింది దీన్ని బట్టి ఆమె ఎంత ధైర్యవంతురాలో,సహనపరురాలో అర్థం అవుతుంది. కానీ తన జీవితంలో ఇటు చదువూ లేదు - అటు సంసారం లేదు. అని చాలా బాధపడుతూ ఉండేది యాక్సిడెంట్‌లో తన తల్లి మరణించిన తరువాత తన జీవితంలోనికి అరుణగిరి తన తల్లిని చంపిన నేరస్తునిగా తనకి పరిచయం అయ్యాడు. తల్లి మరణానికి కారణం అయ్యాడని అతన్ని ద్వేషిస్తూ ఉండేది ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉండేవి చివరికి తల్లి మరణంతో కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని ఎలా అయినా మెట్రిక్యులేషన్‌ పూర్తి చేయాలని అనుకుంది. అదే సమయంలో తన కుటుంబానికి ఆర్థికంగా ఆసరా చూపిస్తున్న అరుణగిరి మీద కొద్ది కాలానికి కోపం తగ్గి అతని చొరవతో మాట్లాడేది, మెట్రిక్యులేషన్‌ పూర్తి చేయమని అతను కూడా సలహా ఇచ్చాడు. విశాల ట్యుటోరియల్‌లో చేరి పట్టుదలగా తెలివీ, ఏకాగ్రతతో అతి శ్రద్ధగా ఇంట్లో క్షణం కూడా వృధా పరచకుండా చదివి ఈ చదువుకు అరుణగిరి సహాయం తీసుకుని పట్టుదలతో చదివి మద్రాసులో తన పరీక్షలను పూర్తి చేసింది.

‘‘దేవుడి దయ వల్ల ఈ పరీక్ష పాసయితే తమ కష్టాలు గట్టెక్కినట్లే4 పరీక్ష పాసయితే ఉద్యోగం వస్తుంది అని అనుకునేది విశాల. ఇలా జరుగుతున్న సమయంలో మనోధైర్యం, పట్టుదల, సానుభూతి, కష్టపడి కుటుంబాన్ని ముందుకు నడిపించే గుణము,విజ్ఞాన తృష్ణని చూసి అరుణగిరి విశాలని ప్రేమించాడు. కానీ ఆమె దానికి నిరాకరించింది. ఎందుకంటే సనాతన ధర్మాలకు కట్టుబడిన స్త్రీ కనుక తనకు ఇదివరకే పెళ్ళి జరిగింది కాబట్టి తను అరుణగిరి ప్రేమను అంగీకరించలేకపోయింది ఆనాటి కాలంలో సనాతనధర్మాలు కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు అంత త్వరగా రెండో పెళ్లికి స్త్రీ లు ఒప్పుకునేవారు కాదు అందువలనే విశాల అరుణగిరి అంటే తనకి ప్రత్యేక అభిమానం, ఇష్టం ఉన్నప్పటికీ పెళ్లికి నిరాకరించినది.తర్వాత తన అత్తింటి వారి దగ్గర నుంచి కాపురం చేయమని లాయర్‌ నోటీస్‌ వచ్చినా గయ్యాళి అత్త,పిచ్చివాడైన భర్త బారినుండి తనని తాను కాపాడుకోవడానికి కోర్టులో సమర్ధవంతంగా ఎదుర్కొని విడాకులు తీసుకుంది. అరుణగిరి విశాలని పెళ్ళి చేసుకోమని చాలాసార్లు అడుగుతూ ఉండేవాడు. అతనితో చెప్పేది మనం పెళ్ళి చేసుకోవడం అసంభవం. నాకు ఒకసారి పెళ్ళి అయింది మీరు తగిన పిల్లని - “మీ అమ్మగారికి నచ్చిన పిల్లని పెళ్ళి చేసుకోండి.5 ప్రేమకీ పెళ్ళికీ లంకె పెట్టకండి ఆమె దృష్టిలో ప్రేమ అంటే అభిమానం అని పెళ్లి అంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం,ఒకరికి ఒకరు తోడుగా నిలవడం అని చెప్పింది. ఈ మాటనే ఒకప్పుడు అరుణగిరి రోజారాణితో అన్నాడు. కాని అప్పుడు అవి చాలా సహజంగా అనిపించాయి. కాని అవే మాటలు విశాల నోటి నుంచి వచ్చేసరికి విపరీతమైన కోపం వచ్చింది. బహుశా అహం దెబ్బతిన్నది ఈ మాటల ద్వారా రచయిత్రి కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని రాశారాన్నట్లు మనకు తెలుస్తుంది మనం ఏదైనా తప్పు చేస్తే అది ఏదో ఒక రోజు మన జీవితం లో తిరిగి ఎదురౌతుంది అని,విశాల నిరాకరించడం తో అరుణగిరి కి కోపం రావడం ద్వారా మనకి అర్థం అవుతుంది.ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత అరుణగిరి తల్లి చొరవతో విశాల వివాహానికి ఒప్పుకుంటుంది. వివాహబంధంతో ఇద్దరూ ఒకటవుతారు.ఆడుకోవాల్సిన వయసులో ఇంటి భారాన్ని మోస్తూ తెలివితో, మనోధైర్యంతో, ఆత్మాభిమానంతో,పట్టుదలతో,చదువుపట్ల ఉన్న శ్రద్ధతో,చదువుకుంటే ఏమైనా సాధించవచ్చన్న నమ్మకంతో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి అనుకున్నది సాధించడానికి ఎన్నో అవమానాలను భరిస్తున్న విశాల లాంటి స్త్రీలు ఎంతమందినో మనం నేటి సమాజంలో చూస్తున్నాము .

3.3 సావిత్రమ్మ పాత్ర - పరిణామశీలత: 

సావిత్రమ్మ పాత్ర స్వభావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే "పరిణామశీలి". బాల్య వివాహం, సవతి పోరు, భర్త మరణం, గర్భవతిగా ఉండగా ఎదురైన సవాళ్లు - ఇలా జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఆమెను మలిచాయి. అమాయకురాలైన పదహారేళ్ల బాలిక నుండి తన కుమారుని కోసం ఇంగ్లీషు నేర్చుకునే స్థాయికి ఎదిగింది. కష్టాల్లో కూడా సానుభూతిని, నిధానాన్ని నేర్చుకున్న పాత్ర.

అరుణగిరి తల్లి సావిత్రమ్మ. సావిత్రమ్మ భర్త ఉమాపతి మొదలియార్‌. ఏడుగురి ఆడ పిల్లలకి, తండ్రి అయిన ఉమాపతికి పుత్ర సంతానం మీద కోరిక పోలేదు. బాగా ధనవంతుడు అవడం వల్ల పుత్ర సంతానం మీద కోరిక పుట్టి,తన ఆస్తిపాస్తులు తర్వాత తరాల వారికి చెందాలనే ఉద్ధేశంతో తప్ప తన వయసునిగాని, సమాజంలోని విలువలను విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకుని మొదటి స్త్రీ జీవితం నాశనం అవుతున్నది అని పశ్చాతాపం లేకుండా ఉన్న ఇతని లాంటి ధనవంతులను నేటి సమాజంలో చూస్తున్నాము.

అందంగా ఉన్న సావిత్రమ్మ రూపం ఉమాపతిని ఆకర్షించి,సావిత్రమ్మ పుట్టింటి వాళ్లు కూడా ధనవంతుల ఇంటికి కోడలిగా పంపించడం మాత్రమే చూసారు గానీ తన కూతురు అక్కడ సుఖపడుతుందా,సంతోషంగా ఉంటుందా అని ఆలోచించకుండా గొప్పింటి సంబంధం అని పెళ్లికి సిద్ధమయ్యారు ఈనాటి సమాజంలో కూడా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా, డబ్బు ఆస్తి ఉంటే చాలు ఆడపిల్ల ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లి చేస్తున్నారు చాలా మంది తల్లితండ్రులు.

పెళ్ళి చేసుకుని కాపురానికి వచ్చిన సావిత్రమ్మకి సవతి పోరు తప్పలేదు . అంతేకదా తనస్థానాన్ని ఇంకో స్త్రీ భర్తీ చేస్తుంటే ఎవరుమాత్రం చూస్తూ ఊరుకుంటారు. ప్రతీరోజు ఈ రెండు ఇళ్ళ మధ్య యుద్ధం జరుగుతుండేది. స్త్రీ సహజమైన అసూయ, నిస్సహాయత - తన భర్త తనకి కాకుండా పోయాడనే బాధ మొదటి భార్యని పిచ్చిదాన్ని చేశాయి. సావిత్రమ్మ కి సవతితోపాటు సవతి బంధువులు కూడా ఇబ్బంది పెట్టేవారు వీటన్నింటినీ భరిస్తూ కాలాన్ని ముందుకు వెళ్లనిచ్చేది .అయితే అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు(తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్లు) సావిత్రమ్మ ఐదో నెల గర్భవతిగా వున్నప్పుడు ఉమాపతి గుండె నొప్పితో మరణించారు.

అందరూ సావిత్రమ్మ వల్లే ఉమాపతి మరణించాడని అనేవారు సావిత్రి గర్భవతిగా ఉండగానే వీలునామా రాసేసి రిజిష్టరు చేశాడు.

‘‘భగవంతుని అనుగ్రహం వల్ల నా రెండవ భార్య సావిత్రికి మగపిల్లవాడు అయితే నా మొత్తం ఆస్తి నా కుమారునికి చెందుతుంది. నా పెద్ద భార్య, చిన్న భార్య నివసిస్తున్న గృహాలు అన్ని హక్కులతో వారికే చెందుతాయి. నా ఆస్తిని అభివృద్ధి చేసే అధికారం నా చిన్న భార్యకి ఉంది. నా కూతుర్లకు పెళ్ళి సమయంలో డబ్బుగాని, ఆస్థిగాని తన కుమారుడు ఇస్తాడు అని లేకపోతే ఆడపిల్ల పుడితే ఎనిమిది మందికి, భార్యలు ఇద్దరికీ ఈ ఆస్తి సమానంగా చెందుతుంది అని”6 ఈ వీలునామా రాశారు. (మగపిల్లవాడు అయితే ఆస్తి మొత్తం అతనిది ఆడపిల్ల అయితే అందరికీ సమానం)

కానీ సావిత్రమ్మ సవతి తన కడుపులోని బిడ్డని చంపడానికి ప్రయత్నం చేసేది ఇలాంటి సమయంలో కూతిరి మీద ప్రేమతో కాకుండా, డబ్బుమీద వ్యామోహంతో సావిత్రమ్మ తల్లితండ్రులు సావిత్రమ్మ దగ్గరకి వచ్చి స్థిరపడిపోయారు సావిత్రమ్మకి భర్త మీద కృతజ్ఞతాభావం, గౌరవం ఉండేది. ఆ వ్యక్తి ఆత్మకి శాంతి కలగడానికి, ఆయన చివరి కోరిక తీరడానికి కొడుకు పుడితే బాగుండుననుకుంది. ఈమెకి నెలలు నిండిన తర్వాత ఈమె చాలా క్లిష్టపరితులలో అరుణగిరికి జన్మనిచ్చి, అతనికి ఆరోగ్యం సహకరించకపోతే కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచుకుని పెంచినట్లు సావిత్రమ్మ కొడుకుని పెంచి పెద్దవాడిని చేసి,లోకజ్ఞానం తెలియని ఒక సాధారణ స్త్రీ గా ఉన్న సావిత్రమ్మని తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనని వ్యవహార జ్ఞానం తెలుసుకునేలా చేశాయి,అప్పటివరకు మాట్లాడడమే రాని ఈమెకు తన కొడుకు చదువు యొక్క ప్రగతిని తెలుసుకోవడం కోసం ఇంగ్లీష్ నేర్చుకునేటట్లు చేశాయి మానసికంగా చిన్నప్పుడే గాయపడడం వల్ల ఆమె ప్రవర్తనలో నిధానం, ఇతరుల పట్ల సానుభూతీ అలవాటు అయ్యాయి.

సావిత్రమ్మ గారిలాంటి వారు నేటి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. పదహారేళ్ల వయసులో ఎలాంటి ఆలోచన లేకుండా పెళ్లి చేసుకున్న సావిత్రమ్మకి తన చుట్టూ ఉన్న పరిస్థితులే ఆమె చదువుకోవడానికి, మానసికంగా ధైర్యంగా ఎదగడానికి తోడ్పడ్డాయి. నేటి సమాజంలో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మనలో మనోధైర్యం అనేది రావాలని ఈ పాత్ర ద్వారా రచయిత్రి మాలతీ చందూర్ తెలియచేశారు.

3.4 రాజమ్మాళ్‌ - త్యాగశీలత:

రాజమ్మాళ్ అనే స్త్రీ పాత్ర ఆధునిక సమాజంలో అనేక మంది స్త్రీల జీవితాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నలుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఈమె జీవితంలోకి భర్త అనంతయ్య పక్షవాతం రూపంలో దుఃఖం ప్రవేశించింది. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా ఎనిమిదో తరగతి చదువుతో టీచర్ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించింది. పెద్ద కూతురు కాంతం అనారోగ్యంతో భర్త వదిలివేయడం, రెండవ కూతురు విశాలను కాపాడదామని తొందరపాటు నిర్ణయంతో పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేయడం వంటి కష్టాలను ఎదుర్కొంది. చివరకు కూతురి మందుల కోసం వెళ్తూ ప్రమాదంలో మృతి చెందినా, ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. కుటుంబ భారాన్ని మోసిన త్యాగమూర్తిగా స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప పాత్ర రాజమ్మాళ్.

రాజమ్మగారి భర్త అనంతయ్య. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు.(కాంతం,విశాల,అమృత,రాజు) అప్పటివరకు అనంతయ్య సంపాదనతో గడుస్తున్న ఇంటికి పక్షవాతం రూపంలో ఈయన ఆరోగ్యం క్షీణించి కాళ్ళు చచ్చుపడిపోయాయి. జన్మలో ఇంక నడవలేని పరిస్థితి. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుటుంబ పెద్ద పరిస్ఠితి హఠాత్తుగా మారితే ఏ విధమైన కష్టాలను అనుభవిస్తారు అని,కుటుంబ భారం స్త్రీ పై పడితే ఎన్ని ఒడుదుడుకులకు గురిఅవుతారో రచయిత్రి ఈ పాత్రల ద్వారా తెలియచేశారు ముగ్గురు ఆడపిల్లలు- రెండేళ్ళ పసివాడు. ‘‘భగవంతుడా, యీ కుటుంబాన్ని ఎలా దరి చేరుస్తాను?”7 అని ఏడ్చింది రాజమ్మగారు.

ఈమె ఎనిమిదో క్లాసు వరకు చదువుకుని, భర్త ఇచ్చిన డబ్బుతో హయ్యర్‌ గ్రేడ్‌ ట్రయినింగు పాసయి కార్పొరేట్‌ స్కూళ్లో టీచరు ఉద్యోగం సంపాదించింది. జీతం నెలకి 90 రూపాయలు. తనకు ఉన్నంతలో బ్రతకడానికి ప్రయత్నిస్తుండేది. ఈమె ఉద్యోగం చేస్తున్నప్పటికీ గర్వంగా ఉండకుండా చుట్టుపక్కల అందరితో కలిసిపోయేది. ఆమె ఆహార్యం కూడా చాలా సాదాగా ఉండేది. (ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి)

తర్వాత ఈమె పెద్ద కూతురు కాంతానికి పెళ్ళి చేసింది. కొంతకాలానికి అవిటివాడయిన తన భర్త రాజమ్మగారిని సాధించడం మొదలుపెట్టాడు. కుటుంబ బాధ్యతని విస్మరించి తనకి తగిన సౌకర్యాలు - సేవలు జరగడం లేదని సాధిస్తున్నాడు. దీనికి తోడు పెళ్ళి చేసుకున్న కాంతం పురుడికి పుట్టింటికి వచ్చింది.భర్త సహాయం లేకుండా ఇంటిని, కూతురి పురుడికి అయ్యే ఖర్చుని సమకూర్చడానికి రాజమ్మగారు ఎంతో సతమతమయ్యి తిండి నిద్ర లేని ఎన్నోరాత్రులు గడిపి కుటుంబాన్ని పోషించేది. నేటికీ ఈమె లాంటి స్త్రీలు భర్త సహాయం లేకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారు.తర్వాత అమృతాకి పెళ్ళి చేసింది. కొంతకాలానికి ఈమె పెద్దకూతురు కాంతానికి జబ్బు చేసిందని ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు అల్లుడు.(రామారావు) అతను బాధ్యతారహితంగా తిరుగుదామని చూస్తున్నాడని రాజమ్మకి అర్థమయ్యింది జబ్బు చేసిన భార్యకి తోడుగా ఉండి ఓదార్పునిస్తు సేవలు చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అల్లుడు ఇలా పుట్టింట్లో వదిలేసి బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నాడు నేటి సమాజంలో ఎంతో మంది అల్లుడులు కూతురికి ఆరోగ్యం బాగోకపోతే పుట్టింటి వారిమీద భారాన్ని వేస్తున్నారు. రాజమ్మాల్ లాంటి ఎంతో మంది తల్లులు కూతుళ్ళ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు . దీనిలో భాగంగా బాగా ఆలోచించి రెండో కూతురిని ఒక నెల రోజులు కాంతం వాళ్ళ ఇంట్లో ఉండి సేవలు చేయమని చెప్పి పంపించింది సరేనని వెళ్లిన రెండో కూతురికి తన అక్క భర్త ప్రవర్తన ఒక వారం తర్వాత మారడం చూసి తనని తన బావ కోరుకుంటున్నాడని అర్థం చేసుకుని తన తల్లితో జరిగింది అంతా చెప్తే. రాజమ్మ కళ్ళ నుంచి నీరు ఆగలేదు. కూతురికి పుట్టెడు రోగం, అల్లుడు బాధ్యతారాహిత్యంగా యమునిలా ప్రవర్తిస్తూ మరదలిని కోరుకుంటున్నాడు సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఇంటి బాధ్యతలు మోయలేకుండా ఉంది రాజమ్మ దీనికితోడు అనంతయ్య సాధింపు, ఓదార్పు గా ఉండాల్సిన భర్త సంసారాన్ని ఈదడానికి మార్గం చూపిస్తూ సలహాలు,సూచనలు ఇవ్వాల్సిన వాడు తిరిగి తననే సాధిస్తూ కొడుకుని చెడకొడుతుంటే ఇవన్నీ పంటిబిగువన భరిస్తూ కామందుకుడైన అల్లుడి బారి నుంచి రెండో కూతురిని కాపాడడానికి ఆమెకి కూడా పెళ్ళి చేసేస్తే, తన బాధ్యత తీరుతుందని బావ బారి నుండి విశాల తప్పించుకుంటుందని తనకి ఇష్టం లేకుండా పెళ్ళి కూడా చేస్తుంది. కానీ ఇక్కడ రాజమ్మల్ ఆవేశంగా అల్లుడి నుంచి కూతుర్ని కాపాడలనుకుంది కానీ ఆలోచనగా పెళ్లి చేయబోయే కుటుoబం గూర్చి ఆలోచించలేకపోయి పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసి కూతురి జీవితం నాశనం చేసింది ‘‘నీ గొంతు కోసేశానే విశాలా”8 అంటూ రాజమ్మగారు ఏడ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు తర్వాత కాంతం భర్త కాంతం కింద పని చేయడానికి తన ఇంటికి రమ్మంటున్నాడని . మాకు రావడం కుదరదు బాబు మందులకి డబ్బు ఇస్తాను అని ఆ డబ్బులు తీసుకురావడానికి బ్యాంకుకి వెళ్ళే దారిలో రోడ్‌ యాక్సిడెంట్‌లో రాజమ్మాళ్‌ మరణించింది. ఒక పక్క భర్త అవిటితనం, పెద్ద కూతురికి జబ్బు, విశాల భర్త మతిస్థిమితం లేనివాడు. ఆమె సంపాదనతోనే ఇల్లు గడిచేది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇంటిని కుటుంబాన్ని పోషించేది . ఈమె ఈనాటి సమాజంలోని ఎందరో స్త్రీలకి ఆదర్శంగా నిలిచారు. ఎన్నో కష్టాలను, నష్టాలను ఓర్చి గుండె నిబ్బరంతో కుటుంబ భారాన్ని, పిల్లల చదువులను, ఇంటిని మోస్తున్న ఎంతోమంది స్త్రీలకి ఈమె పాత్ర ఆదర్శంగా నిలిచింది.

4. ఉపసంహారం:

  • మేఘాల మేలిముసుగు నవలలో రచయిత్రి స్త్రీల యొక్క గొప్పతనాన్ని, మనోధైర్యాన్ని తెలియచేశారు. 
  • మాలతీ చందూర్‌ గారి మేఘాల మేలిముసుగు నవలలో సావిత్రమ్మ గారి కుటుంబానికి చనిపోయిన రాజమ్మగారి కుటుంబానికి ఎక్కడా పోలికలు లేవు. సంఘంలో ఈ రెండిరటి అంతస్థులూ వేరు వేరు అవడం చేత వారి సమస్యలు కూడా వేరుగానే ఉన్నాయి. రాజమ్మగారి కుటుంబానికి ధనమొక్కటే పెద్ద సమస్య. కాని సావిత్రమ్మ గారి కుటుంబానికి ధనం సమస్య కాదు వాళ్ళ సమస్యలన్నీ మానసికమైనవే. 
  • రాజమ్మగారిది ఒక రకమైన తాపత్రయమయితే సావిత్రమ్మ గారిది ఒక రకమైన పోరాటం. మధ్య వయసులో ఉన్న ఈ స్త్రీలిద్దరూ తమ కుటుంబ క్షేమం కొరకు స్థాయిని బట్టి అంకితమయ్యారు. రాజమ్మగారు దైహికంగా కష్టపడి సంపాదిస్తే సావిత్రమ్మగారు హృదయం తూట్లు పడే సాధింపులని, బెదిరింపులని భరించి కొడుకు కోసం బ్రతికారు. 
  • అలాగే విందులు, వినోదాలు, గర్ల్‌ఫ్రెండ్సే జీవితం అనుకున్న అరుణగిరికి, ఆత్మాభిమానం, మనోధైర్యం విజ్ఞానతృష్ణ గల విశాల పరిచయంతో అతని మనసుకి ఉన్న ముసుగు ఏ విధంగా తొలగిపోయింది అని అరుణగిరి, విశాల పాత్రల ద్వారా రచయిత్రి చక్కగా వివరించారు. 
  • అలాగే ఈ నవలలో దిగువ మధ్య తరగతి కుటుంబంలోని సాధకబాధలను గూర్చి మరియు సంపన్న కుటుంబంలోని వారి మానసిక బాధలకు మధ్య వ్యత్యాసాలను పాత్రల ద్వారా తెలియచేయడం జరిగింది. 
  • నవలలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ధనవంతుడు చేసే తప్పులు వలన దిగువ మధ్య తరగతి కుటుంబంలోని వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయో తెలియచేస్తూ ప్రస్తుత సమాజంలోని బాధ్యతారాహిత్యంగా, తప్పుదారిలో నడుస్తున్న యువతకు కుటుంబ విలువలు, ఆత్మపరిశీలన, నైతిక విలువలు, విద్య యొక్క ప్రాముఖ్యతను ఈ నవలలో ప్రధాన పాత్రల ద్వారా చిత్రించడం జరిగింది.

5. సూచికలు:

  1. మేఘాల మేలి ముసుగు, పుట.7
  2. పైదే.పుట.26
  3. పైదే.పుట.29
  4. పైదే.పుట.80
  5. పైదే.పుట.118
  6. పైదే.పుట.39
  7. పైదే.పుట.22
  8. పైదే.పుట.30

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం. 12వ సంపుటం, ప్రజాశక్తి, విజయవాడ, 1991
  2. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటి, నవ్యపరిషోధక ప్రచురణలు, తిరుపతి,1995.
  3. ప్రతాపరెడ్డి, కాసుల. తెలంగాణ నవలా వికాసం. తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, 2017.
  4. ప్రభావతి, ఎమ్‌. మాలతీ చందూర్‌ నవలలు - సామాజిక దృక్పథం (సి.గ్రం). మద్రాసు విశ్వవిద్యాలయం,2008
  5. రమాపతిరావు, అక్కిరాజు. తెలుగు నవల. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌, 1975.
  6. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. నవాలాశిల్పం. నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్,2021
  7. వెంకటేశ్వర్లు, బూదాటి. తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు. హిమకర్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2014.
  8. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర. దళిత సాహిత్యపీఠం, విశాఖపట్నం, 2012.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]