AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. చంద్రబోస్ గేయాలు: సందేశాత్మకత
కొప్పిశెట్టి కుశరాజు
పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9912806863, Email: rajukoppisetti22@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.01.2025 ఎంపిక (D.O.A): 25.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
పాటల రచయితగా చంద్రబోస్ సినీసాహిత్యలోకంలో తనకంటూ ఒకవిశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చంద్రబోస్ గేయాలలో స్ఫూర్తి, ప్రేరణ, మాతృప్రేమ, భాష, సంస్కృతి వంటి అంశాలను గురించి ఈ పరిశోధన పత్రం చర్చిస్తుంది. ఈయన రచించినటువంటి సందేశాత్మక గేయాలలో ప్రేమ, వాత్సల్యం, భక్తిభావన, కృషి, పట్టుదల, శ్రమ మొదలగు విషయాలు ప్రతిబింబిస్తాయి. ఆచారసంప్రదాయాలు, సంస్కృతి పట్ల ప్రజలకు ఉండవలసిన నిబద్ధతను, నిరాశ నిస్పృహలను ఛేదించి ఒత్తిళ్ళను అధికమించి, ఒంటరితనం, అపజయం, పిరికితనం వంటి వాటిని జయించి జీవితములో ఆనందముగా ముందుకు ఎలాసాగాలో బోస్ రాసిన సందేశాత్మక గేయాలలో తెలియజేసారు. చంద్రబోస్ పాటలపై మునిపల్లె కృష్ణారెడ్డి శ్రీ వెంటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘‘చంద్రబోస్ సినీసాహిత్యం - పరిశీలన” అనే అంశంపై ఎం.ఫిల్. చేసారు. నిర్మాణాత్మకపరిశోధనా పద్ధతిద్వారా ఈ పరిశోధనాపత్రం రూపుదిద్దుకుంది.
Keywords: చంద్రబోస్, సినిమా పాటలు, సందేశాత్మకత, స్ఫూర్తి, సాహిత్యం, ఆనందం, భాష.
1. ఉపోద్ఘాతం:
మాట ఆగిన చోట పాట పుడుతుంది. ఒక కుమ్మరి సారె మీద కుండ తయారు చేసినట్లు, ఒక శిల్పి శిల నుండి శిల్పాన్ని చెక్కుతున్నట్లు ఒక మూల వస్తువు నుండే పాట ఉద్భవిస్తుంది. పాటకి పల్లవి ప్రాణం అయితే పరిమళం చైతన్యం. చైతన్యాన్ని అందించని పాట పాటే కాదు. మనసంతా దిగులు మేఘాలు కమ్ముకొని గుబులు రేకెత్తిస్తున్నప్పుడు ఒక పాట మనసుకి సాంత్వన పరుస్తుంది. జీవితంలో ప్రతి ఘట్టానికి పాట చేదోడు వాదోడు, పాటే తోడు నీడా! మనిషికి ఉండే ప్రతి భావోద్వేగం (కోపం, ప్రేమ, కరుణ, ఆవేశం, స్నేహం మొ॥)లతో పాటు పుడుతుంది. మనిషి పుట్టుక నుండి చావు వరకు అన్ని ఆచారాలలో పాటలు ఉంటాయి. శ్రామిక జీవనంలో జానపద ఇతివృత్తాలలో, కులవృత్తులలో, మతాల ఆచరణలలో, పూజలలో, మానసిక ఉల్లాసంలో ప్రతిదానిలో పాట ఉంది. ప్రతి అంశం నుండి పాట ఉద్భవిస్తూనే ఉంది. మనసును స్పృశించి, మధించి, పరవశింపచేసేది పాట. నేడు సినిమా పాట జన జీవనంలో ఒక భాగం వినోదాల్లో, వేడుకల్లో సినిమా గీతాలు వినిపించడం సర్వసాధారణం. సినిమాపాట ఆపాత మధురం. సినిమా సాహిత్యం ఆలోచనామృతం. ఆబాలగోపాలాన్ని అలరిస్తూ సినిమా పాట తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. నిత్యజీవితంలో ప్రేమలో, పెళ్ళిలో, విరహంలో, విజయంలో, ఓటమిలో, ఓదార్పులో ఇలా అనేక సందర్భాలలో భావప్రకటనకు సినిమా పాట ఒక సాధనమైపోయింది. “మనసు మాటకందని నాడు మధురమైన పాట అవుతుంది”1. మాటల్లో చెప్పలేని భావానుభూతులను రాగయుక్తమైన పాట ద్వారా చెబితే మనసుకి హత్తుకుంటాయి.
ప్రపంచ వాఙ్మయ చరిత్ర మనం గమనించినట్లయితే పద్యాల కంటే పాటలే ముందు పుట్టినట్లు మనం గ్రహించవచ్చు. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు అన్నట్లు ‘‘ఏ వాఙ్మయంలోనైనా పాటలే ముందు పద్యాలు తరువాత”2 దీనిబట్టి చూస్తే పాటలు ప్రాచీనత మనకు అర్థం అవుతుంది. పాటకు జనాకర్షణను, సాహిత్య సంపదను వ్యాప్తి కల్గించేశక్తి కలదు. ‘‘వంద ఉపన్యాసాలకు లేని శక్తి ఒక పాటకు కలదు” ఉద్యమాలలో కూడా పాట చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపగలదు. “పాటలు లేని సినిమా అంటే ఉప్పు లేని భోజనం”3 అని శ్రీశ్రీ గారు అనడంలో సినిమాలో పాట యొక్క ప్రాముఖ్యతను మనం అర్ధం చేసుకోవచ్చు.రాతియుగం నుండి నేటి అణుయుగం వరకు ఎందరో మహాకవులు, రచయితలు పాటకు అందాన్ని అద్ది శోభను కలిగించారు.
2. రచయిత పరిచయం :
తెలుగు సినీ మధూదయం దశలో ఓ ప్రభంజనంలా దూసుకు వచ్చిన యువకెరటం చంద్రబోస్. ‘‘మంచుకొండల్లో చంద్రమా” అనే ఆయన మొదటి పాటతోనే సినీ సాహిత్యంలో తన మార్క్‌ను చూపించారు. నాటు నాటు సాహిత్యాన్ని రాసి దానిని అత్యంత ఆకర్షణీయంగా మరియు చెవులకు లయబద్దంగా మలచడం ద్వారా చంద్రబోస్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. RRR (2022) చిత్రంలో నాటు నాటు పాటకు చంద్రబోస్ ఆస్కార్ అవార్డును గెలుపొందారు. తెలుగు సినీ గీత రచయితలలో ఈ అవార్డు పొందిన ఏకైక కవి, ఒకే ఒక్కడు చంద్రబోస్ కావడం చాలా ప్రత్యేకమైన విషయం. చలన చిత్రరంగంలో గీత రచయితగా అనేక బిరుదులు (సినిగేయ విశారద, సాహిత్య చిచ్చరపిడుగు మొ॥) సత్కారాలు, పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఈయన పూర్తి పేరు కునుకుంట్లు సుభాష్ చంద్రబోస్ జయశంకర్ (ఉమ్మడి వరంగల్) జిల్లా చల్లగరిగ గ్రామంలో 10.05.1972లో తల్లి మదనమ్మ, తండ్రి నరసయ్యలకు జన్మించడం జరిగింది. ఈయన చదివింది ఇంజినీరింగ్ అయిన సాహిత్యంపై మక్కువతో బాల సాహిత్యం, పత్రికలు, వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి పదసంపదను వృద్ధి చేసుకొని సినీ రంగంలో పాటల రచయితగా స్థిరపడ్డారు.
3. చంద్రబోస్ సందేశాత్మక గేయాలు :
3.1 స్ఫూర్తి ప్రేరణ గేయాలు : నేనున్నాను (2004) సినిమాలో చంద్రబోస్ గారు రచించిన పాటలో సాహిత్యాన్ని మనం గమనిస్తే...
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..
ఓటమితో గెలుపే చెప్పెను
నేనున్నానని
తగిలే రాళ్ళని పునాది
చేసి ఎదగాలనీ
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను/చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ (చంద్రబోస్
పాటలు https://www.lyricstape.com)
ప్రేమలో మోసపోయి కుటుంబానికి దూరమయ్యి ఏమి
తోచని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అమ్మాయికి నాయకుడు ఏ విధంగా ధైర్యం చెప్పి చేయిపట్టి ముందుకు
నడిపిస్తాడో తెలిపే సందర్భంలో వచ్చినటువంటి గేయమిది. నిరాశతో జీవితం సాగుతున్న వేళ ఆశలతో జీవితాన్ని
చిగురింప చేసి, ఆత్మ విశ్వాసమే ఊపిరిగా పోసి రేపు అన్న రోజు నీకోసం ఎదురు చూస్తుందని, నీకు నేనున్నానని
చెప్పడంలో కొండంత ధైర్యం అందుతుంది. నిన్నటి చీకటిని పారద్రోలె వెలుగు నేనని, ఇప్పుడున్న కష్టాలన్ని
తొలగిపోయి మంచిరోజులు వస్తాయని పలుపదాలుగా వర్ణన చేసి వేయ్యేళ్ళ అనుభవం కలిగిన గొప్ప తాత్వికుడిగా,
సమాజంలో చితికిన బ్రతుకులకు ఊరట కలిగించి జీవం పోసిన మానసిక నిపుణుడిగా బోస్ గారు దర్శనమిస్తారు.
‘‘ఓటమితో గెలుపె చెప్పెను” అనడంలో కష్టం వెనుక సుఖం, ఓటమి వెనుక విజయం తప్పగా
ఉంటుందని నేడు ఉన్న ఈ దుస్థితి శాశ్వతం కాదని ఆశాభావంతో ముందుకు సాగాలనే సందేశం తెలియజేయడం జరిగింది.
మొదటి చరణం గమనిస్తే
సమాజంలో మనం ముందుకు వెళ్తుంటే అభినందించే వాళ్ళ కంటే వెనక్కి నెట్టేవాళ్ళు, ఎదుగుతుంటే అసూయ,
స్వార్ధంతో నిత్యం మన పనికి అడ్డంకులు కలిగిస్తూ పైశాచికమైన ఆనందం పొందేవారే అధికంగా ఉంటారు. అటువంటి
వారి మాటలను, వారు కలిగించే అడ్డంకులను మన విజయానికి బాటలుగా వేసుకోవాలని, ప్రతికూల పరిస్థితులను కూడా
అనుకూలాలుగా మార్చుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు.
కళ్ళనుండి విడిచే కన్నీటిని మన కలల పంట (సాగు)కై మనం ఉపయోగించుకోవాలే తప్ప, ఏడుస్తూ మన శక్తి సామర్ధ్యాలను నిర్వీర్యం చేసుకోరాదని, కాలుస్తున్న నిప్పును కూడా దీపంగా మార్చి అందరి జీవితాలలో మనం వెలుగులు పంచాలనే ప్రబోధం చేసారు. సమాజంలో దోపిడికి, మోసానికి, గురయిన ప్రతి ఒక్కరికి ఈ పాట దీపదారిగా ఉంటుంది. ఒంటరితనంతో బ్రతుకుతున్న వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది.
అలాగే నా ఆటోగ్రాఫ్ సినిమాలో సాహిత్యం గమనించినట్లయితే...
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
(చంద్రబోస్ గీతాలు, 2004:62)
ఈ పాట నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతోమంది జీవితాల్లో నూతన ఉత్సాహం నింపేలా చేసిన గొప్ప స్ఫూర్తిదాయక గీతం. ఈ పాటలో చెప్పిన మాటలు అన్ని మన నిజ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. మన జీవితంలో మనం ఏ పని చేసిన నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవాలని విజయం సాధించిన తరువాత ఆ విజయమే పెద్ద ఢంకై మోగుతుందని, ఏ విధంగా మొక్క మౌనంగా, నిటారుగా ఎదుగుతుందో అలా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఎదుగుదల పూర్తి అయిన తరువాత మొక్క నిలుచున్న నేల వైపు ఒదిగి చూస్తుందని అట్లానే మనిషి కూడా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, మన విజయానికి కారణమయ్యి మన విజయంలో చేయూతనిచ్చి, మన ఎదుగుదలకు నీరు పోసిన వారికి చెట్టులా నీడనివ్వాలని తెలియజేయడం జరిగింది. ఎక్కడైతే నీవు అవమానించబడతావో అక్కడే నీకు సన్మానం జరుగుతుందనే భావనను ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందని వాక్యాలలో అద్భుతంగా వర్ణించడం జరిగింది.
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిని వారికి సొంతమవుతుంది
(చంద్రబోస్ గీతాలు, 2004:62)
అనే చరణాన్ని గమనిస్తే మన ప్రయత్న సాధనలో ఎన్ని అవరోధాలు ఎదురయినా సరే వాటిని ఎదుర్కొనే ఒక దారి తప్పకుండా ఉంటుందని, ఆ దారులను వెతికి ధైర్యంగా, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళినప్పుడే విజయము అనే అమృతం, ఆనందమనే నిధి మనకు అందుతాయని అవరోధాల ముందు మోకరిల్లడం, పిరికితనంతో పారిపోవడం తప్పని రచయిత తెలియజేసారు.
చెమట నీరు చిందగా నుదుటి రాత
మార్చుకో/మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో
పిడికిలి బిగించగా
చేతి గీత మార్చుకో /మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మేరాస్తాడు / నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
(చంద్రబోస్ గీతాలు , 2004:63)
పై చరణం గమనిస్తే... నా తలరాత ఇంతే అని వేదన చెందకుండా ఉన్న చోట నుండి లేచి కష్టించి చెమట చిందిస్తేనే విధి రాతను సైతం చెమట నీరుతో చెరిపి నీ తలరాతను నీకు నచ్చినట్టు రాసుకోగలవనే సందేశం కనిపిస్తుంది. జీవితంలో విసిగిపోవడం, మనుగడ సాగించలేక తనువు చాలించడం ఇప్పుడు నిత్యం ఏదో మాధ్యమాల్లో చూస్తున్నాం. మన చేతుల్లో రూపుదిద్దుకోవలసిన జీవితం మనకి శత్రువేమిటి? కొన్ని విషయాలు విధి లిఖితమే కావచ్చు కానీ చాలా విషయాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అన్న విషయం గుర్తించాలి. ‘‘మన అదృష్టానికి మనమే కర్తలం” అని వివేకానందుడన్నట్లు, ‘‘మనిషి నమ్మాల్సింది తన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కాని విధిని కాదు అని అంబేద్కర్ అన్నట్లుగా మనిషి తన విజయానికి, అపజయానికి తానే కర్త. తల్లి గర్భంలో మనం పిడికిలి బింగించి ఉండటం వల్ల చేతి గీతలు ఏర్పడతాయి ఆ పిడికిలి మరొక్కసారి బిగించి సంకల్పంతో నువ్వు పని చేస్తే చేతిని చూసి చెప్పె జోతిష్య గీతలలో రాతలు కూడా మారిపోతాయి. శ్రమిస్తే (కష్టే ఫలి)నే ఫలితం అందుతుందని, శ్రమలోనే జీవనం సౌందర్యం ఉందని కవి ఈ పాట ద్వారా తెలియజేశారు.
3.2 మాతృప్రేమ :
నాని (2004) సినిమాలో బోస్ గారు అమ్మ ప్రేమ గురించి రాసిన పాట....
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
(చంద్రబోస్ పాటలు. https://www.lyricstape.com)
ఈ పాటలో అక్షరాలను అమ్మ ప్రేమకి దగ్గర చేసి, చక్కటి పదాల అల్లికతో అమ్మ ప్రేమను ఎంతో అద్భుతంగా వర్ణించారు బోస్ గారు. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరాలలో అద్భుతమైనది అమ్మ ప్రేమ. ఈ అవనిలో అవధులు లేని ప్రేమ ఎవరిదైనా ఉన్నది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ అపూర్వమైనది, అనిర్వచనమైనది. ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదని, అమ్మ ప్రేమ అమృత తుల్యమైనదని పలుపదాలు హృదయ మధురంగా వర్ణించడం జరిగింది. పెదవులు పలికే అనేకనేకమైన శబ్దాలలో తియ్యని పదం లేదా మాట ఏదైనా ఉంది అంటే అది అమ్మ అనే పదం మాత్రమే అని, అమ్మ అనే రెండు అక్షరాలను అద్భుతంగా వర్ణించారు.
మనం కొలిచే దేవుళ్లను, దేవతలను మనం చూడలేదు. కాని మన కంటికి నిత్యం కనిపించి, మనతో ఉంటూ అనురాగం పంచే అమ్మే మనకి కనిపించే దేవత అని, మనలో అజ్ఞానాన్ని తొలగించి ప్రపంచాన్ని పరిచయం చేసే కంటి వెలుగు అమ్మ అని, తనలో మమకారాన్ని ముద్దగా చేసి పెడుతుందని, ఆపాత మధురమైన తన జోలపాట, లాలిపాటలతో మనల్ని నిద్రపుచ్చుతుందని అమ్మ ప్రేమను పల్లవిలో చాలా చక్కగా తెలియజేసారు.
మనలోని ప్రాణం అమ్మ /మనదైన రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ /నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ /వరమిచ్చే తీపి శాపం అమ్మ (చంద్రబోస్
పాటలు. https://www.lyricstape.com)
పై చరణంలో మనకి రూపం ఇచ్చి, ప్రాణం పోసి ఈ లోకంలోకి తీసుకొచ్చింది అమ్మే అని, మనం తెలిసి, తెలియక చేసిన తప్పుల్ని మన్నించి కడుపున దాచుకొనే జాలి వర్షం అమ్మ ప్రేమ అని, మనం వేసే తప్పటడుగుల్ని సరిచేసి నడవడానికి కావలసిన దారులను వెలుగై చూపించి మనల్ని ముందుకు నడిపించే దీపదారి అమ్మ. తన జీవితం మనకోసం త్యాగం చేసి మన ఆశయాలు, కోరికలను తీర్చే వరాలను ఇచ్చే దేవత అమ్మ అని అమ్మ ప్రేమను ఎంతో మధురంగా వర్ణించారు బోస్.
బోస్ అమ్మకు, మాతృ సమాజానికి, స్త్రీల
సంస్కృతిని సంస్కరించే తీరేంటంటే ‘‘నా ఆలి అమ్మగ అవుతుండగా జోలాలి పాడనా కమ్మగా
కమ్మగా” అంటాడు. అంటే భార్య కూడా మన గృహస్థ వ్యవస్థలో అమ్మలాంటిదే అని సూచించారు.
3.3 మాతృభాష :
‘‘నీకు నేను నాకు నువ్వు” చిత్రంలో మాతృభాష గొప్పతనం గురించి చంద్రబోస్ చక్కటి పాట-
తెలుగు భాష తియ్యదనం /తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్న వాళ్ళకి /తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే /వాళ్ళని నువు మరిచినట్టురా
ఇది మరువబోకురా (చంద్రబోస్ సినీ.)
పై పల్లవిలో సాహిత్యం పరిశీలించినట్లయితే... ఈ గేయంలో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని, విశిష్టతని, మాధుర్యాన్ని తెలియజేసారు. తెలుగు భాష, సాహిత్యం యొక్క ప్రాచీన చరిత్రను, తెలుగువారు (జాతి) సాధించిన విజయాలను గురించి తెలుగు వాళ్ళమైన మనమంత తెలుసుకోవాలని, అది అందరి బాధ్యత అని, అలా తెలుసుకోగలిగితే అవే మన జీవితాలకు పునాదని, మనం సాధించబోయే విజయాలకు, ఫలితాలకు అది మూలధనం అని మొదటి పల్లవిలో తెలియజేసారు. తల్లిదండ్రుల ఒడి నుండి నేర్చుకునే మాతృభాషను మనం మరిచినట్లయితే కన్నతల్లిదండ్రులనే మరచిన అపరాధం మనం చేసినట్లే అని సున్నితమైన హెచ్చరిక చేసారు.
అమ్మ అన్న పిలుపులోన /అనురాగం ధ్వనిస్తుంది
నాన్న అన్న పదములోన /అభిమానం జనిస్తుంది
(చంద్రబోస్ గీతాలు, 2003:07)
అనే చరణంలో అమ్మ నాన్న, అత్త మామ అని పిలవడంలో నిజమైన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు దాగి ఉన్నాయని మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ అని పిలవడంలో ఒట్టి పిలుపు మాత్రమే ఉంది తప్ప మమకారాలు, ఆదరణ కొరవడ్డాయని అవి కేవలం తెలుగు భాషలో మాత్రమే కలవని భాష గొప్పతనాన్ని బంధాల పిలుపులో ఎంతో చక్కగా తెలియజేసిన గొప్ప కవి చంద్రబోస్.
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
కొమ్మల్లోన పక్షులన్నీ/ తమ కూతను మార్చుకోవు
భూమిపైన
ప్రాణులన్నీ/తమ భాషను మరువలేవు
మనుషులమై మన భాషకు /ముసుగును
తగిలిస్తున్నాము (చంద్రబోస్ గీతాలు, 2003:08)
నేటి సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన భాషలను కేవలం లోక వ్యవహారం కోసమే నేర్చుకోవాలి తప్ప ఆ భాషలోనే బ్రతుకు ఉందనే భ్రమలో వాటి మోజులో పడవద్దని, ఆ భాషా జ్ఞానాన్ని మాత్రమే సంపాదించమని, తల్లి భాషలో సంభాషించమని సందేశాన్నిచ్చారు కవి. భూమిపై పుట్టిన ప్రతి జీవి తన పుట్టక మొదలు చావు వరకు మాతృభాషలో మాట్లాడుకుంటాయని, తమ భాషను ప్రాణం పోయే వరకు మరిచిపోవని, మనుషులు మాత్రమే తమ భాష పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పరాయి భాషలో మాట్లాడటం గొప్పగా భావిస్తారని, తల్లిభాష పట్ల చులకన భావం సరైనది కాదని, తోటి ప్రాణులను చూసి మనిషి నేర్చుకోవాలనే ప్రబోధం చేసారు.
ప్రపంచాన మేధావులు /మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడా/తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు /అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు /అది భాషా ఆచారాలను
మింగెయ్యొద్దు (చంద్రబోస్ గీతాలు, 2003:08)
శ్రీకృష్ణదేవరాయలు ‘‘దేశభాషలందు తెలుగు లెస్స” అని ప్రశంసించడం, ఎందరో విదేశీయులు, ఇరుగు పొరుగు రాష్ట్ర కవులు, రచయితలు, పండితులు సైతం తెలుగు గొప్పతనాన్ని కీర్తించడం మనం గమనించవచ్చు. కానీ ఆంధ్రులైన మనం మన అమ్మ భాష భాష పట్ల చూపే నిర్లక్ష్యానికి కవి ఎంతో ఆవేదన చెంది రాసిన పదాలివి. మన భాష, సంస్కృతి, ఆచారాలను పాటిస్తూ పొందే అభివృద్ధే నిజమైన ప్రగతి అని అలా కాకుండా వాటిని విస్మరించి, పొందే అభివృద్ధి అసలు అభివృద్ధే కాదనే ప్రబోధం చేసారు. తల్లి ఒడిలో ఉగ్గుపాలు తాగుతూ నేర్చుకున్న భాషను పలకడానికి ఎవరూ సిగ్గుపడరాదని, ఎలాంటి సందర్భంలోనైనా, ఎక్కడైనా అమ్మ భాషను మాట్లడడానికి వెనుకడుగెయ్యెాద్దని అది మన జన్మహక్కుగా, బాధ్యతగా సాగిపోవాలని, మమ్మీ డాడీ అనే పరాయి పదాలను విడిచిపెట్టి అమ్మ నాన్న అంటూ తెలుగు భాషలోనే ప్రేమగా పిలుచుకుందామని చెప్పడంలో మాతృభాషను రక్షించే రక్షకుడిగా బోస్ కనిపించారు. ఆయన రాసిన ప్రతిపదంలోను తెలుగు భాష పట్ల ప్రేమ, ఆరాధన భావన, మమకారం మనకి తెలుస్తుంది. అలానే అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషాచారాలను మింగేయొద్దు” అన్న వాక్యంలో అంత్యప్రాసతో కూడిన అంతర్లయ ఈ పాటలో భావస్పష్టతకు మూలమైందని చెప్పవచ్చు.
3.4 సంస్కృతి :
పల్లకిలో పెళ్ళికూతురు సినిమాలో చీరలో గొప్పతనం పాట భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటి చెప్పినది.
చీరలోని గొప్పతనం తెలుసుకో /ఈ చీరకట్టి ఆడతనం
పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర /ఆనందమనే రంగులనే
అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర
(చంద్రబోస్ గీతాలు, 2004:153)
పై పాటలో స్త్రీలు ధరించే చీరల ఔన్నత్యం గురించి తెలపడం జరిగింది. పల్లవిలోనే చీరలోని గొప్పతనం తెలుసుకో, నువ్వు చీరకట్టి ఆడతనం పెంచుకో అంటూ మన తెలుగు జాతి కట్టు, బొట్టు సంస్కృతిని నిలపాలంటూ ప్రబోధం చేసారు. చీర స్త్రీకి ఎంత అందాన్ని, నిండుతనాన్ని, రక్షణను ఇస్తుందో తెలియజేస్తూ... ఈ చీర నిర్మాణం కేవలం దారాలతో చేయబడిరది కాదని సింగారమనే దారంతో అలంకరణ జరిగిందని, ఆనందమనే రంగులను అద్ది, ఎంతో మమకారంతో మగ్గంపై నేసిందని ఈ చీర అల్లికలో ఇంత చక్కటి నైపుణ్యం, విశిష్టత దాగి ఉందని అది స్త్రీలు ధరించి నిండుతనం పొందాలని తెలియజేసారు. ఈ పాట ద్వారా రచయిత మన సంప్రదాయమైన చీరలాంటి దుస్తులు ధరించకపోవడం వల్ల స్త్రీలు ఆడతనాన్ని, మాతృగౌరవాన్ని, విలువలను కోల్పోతున్నదని, గుర్తు చేస్తూ జాగ్రత్త చెప్పారు.
మడికట్టుతో నువ్వు పూజ చేస్తే /గుడి వదిలి దిగి
వచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే
/సిరిలక్ష్మిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరిచే
/గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువు
నడిచెళుతుంటే /దండాలే పెడతారు అందరు... (చంద్రబోస్ గీతాలు, 2004:153)
నువ్వు చీరతో మడికట్టి పూజలు చేస్తే గుడిలో దైవం కూడా లేచి నీ వద్దకే వచ్చి దీవెనలు వరాలు ఇస్తాడని, తపస్సులు, పూజలు, నోములు, ఉపవాసాలకే కాదు స్త్రీ చీరకట్టుకు కూడా దేవుడు పరవశించిపోతాడనీ కవి చీర గొప్పతనాన్ని చమత్కారంగా తెలియజేసారు. జారుకట్టుతో మొగుని ముందట నిల్చుంటే సరసాలు పండుతాయని, చీర స్త్రీకి నిండుతనాన్ని ఆపాదిస్తుందని అది కట్టుకుని నడిచి వెళ్తుంటే సహజంగానే అందరి మనసులో గౌరవ భావం కలిగి నమస్కారాలు చేస్తారని తెలియజేయడం జరిగింది.
పసిపాపలా నిదుర పోయినప్పుడు /అమ్మ చీరె మారెను
ఊయలగా
గాలి ఆడక ఉక్క పోసినప్పుడు /ఆ పైటేగా నీ పాలిట వింజామర
(చంద్రబోస్ గీతాలు, 2004:154)
మనం చిన్నతనంలో అమ్మ. చీరనే ఊయలగా మార్చి జోలపాటలు పాడటం, గాలి ఆడక శరీరం ఉక్కపోతగా ఉన్నప్పుడు ఆ చీర చెంగే మనకి వింజామరగా మార్చి చల్లని గాలి విసురుతుంటే తనువు పులకరిస్తుంది. ఎండలో వానలో ఉన్నప్పుడు ఆ పైట కొంగే మనకి గొడుగులా, చెట్టు నీడలా తోస్తుందని చక్కటి పోలికతో వర్ణించాడు బోస్.
విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది (చంద్రబోస్ గీతాలు,
2004:154)
ఈనాటికి స్త్రీలకు సారె పెట్టెటప్పుడు చీరను
ఖచ్చితంగా పంపిస్తాము అది మన సంస్కృతి. విదేశాలలో వనితలకు చీర రూపంలో సారెను పంపించి, భారతీయ సంస్కృతిని
ఆ దేశాలలో చీర రూపంలో చాటి చెప్పడం జరుగుతుందని తెలియజేసారు. భారతీయ సంస్కృతికి చీరను చిహ్నంగా
పోలుస్తూ, మనం తలెత్తుకొని గర్వంగా చూసే జాతీయ జెండాకు చీర సమానమైనదిగా పోల్చడం గొప్ప విషయం.
ఇంతటి ఘన కీర్తిని,
గొప్పతనాన్ని కలిగిన చీరను స్త్రీ మూర్తులందరూ తప్పనిసరిగా ధరించాలనే హితబోధ చేసారు కవి.
4. ముగింపు:
- ఆచార సంప్రదాయాలను, సంస్కృతి పట్ల ప్రజలకి ఉండవలసిన నిబద్ధతను, దేశం, భాష, తల్లిదండ్రుల పట్ల పౌరులకి ఉండాల్సిన భక్తి భావాన్ని, నిరాశ నిస్పృహలను జయించి, జీవితంలో ఆనందంగా ముందుకు ఎలా సాగాలో బోస్ గారు తన గేయాల ద్వారా తెలియజేసారు.
- కాలానుగుణంగా రచయితలు తమ రచనా విధానాన్ని మార్చుకోవడమే గాక, మారుతున్న సాహితీ విలువలలోని చీకటి కోణాలను తొలగించి వెలుగు నింపడానికి ప్రయత్నించాలి.
- ఒక పాట చిరకాలం నిలవాలంటే ఆ పాటలో సాహిత్య ప్రయోజనాలైన ఉపదేశం, ఆనందం రెండు ఉండాలి. అప్పుడే ఆ గేయం చిరస్మరణీయంగా వెలుగొందుతుంది.
- సాహిత్య చర్చలో, విమర్శలో సినిమా పాటల్లోని కవిత్వం గురించి చాలా తక్కువగా చర్చ జరుగుతుంది. ఉన్నతమైన సాహిత్యపు విలువలు గల కవిత్వం సినిమా పాటలోను ఉంది. దానిని వెతకాలి. పరిశీలించాలి. కాలానుగుణంగా పాటలో వచ్చిన మార్పులేమిటో పరిశోధించాలి.
5. సూచికలు:
- తెలుగు సినిమా పాట, పుట. 17
- భువనచంద్ర సినీగేయ సాహిత్యం -పరిశీలన, పుట. 02
- తెలుగు సినిమా పాట, పుట. 18
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆనందచారి కె + శరత్ చంద్ర తిరునగరి (సం.) 2022.సినీగీతావరణం. హైదరాబాద్ :ప్రగతి ప్రింటర్స్.
- చంద్రబోస్ కనుకుంట్ల, సినీగీతాల పుస్తకం నుండి సేకరణ (అముద్రితం)
- చక్రవర్తి జయంతి, 2017.వేటూరి పాట. విజయవాడ :రోహిత్ ప్రింటర్స్.
- చంద్రశేఖర్ బూర్ల, 2018.తెలుగు సినిమా పాట ప్రభోదాత్మకత. హైదరాబాద్ :కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్.
- చంద్రబోస్. సినిమా పాటలు సేకరణ, https://www.lyricstape.com
- పైడిపాల, 1992.తెలుగుసినిమా పాట. చెన్నై :స్నేహ ప్రచురణలు.
- రామలక్ష్మీ కె, 2017.భువనచంద్ర సినీగేయ సాహిత్యం పరిశీలన (అ.సి. గ్రం). చెన్నై :మద్రాసు విశ్వవిద్యాలయం.
- రాధాకృష్ణారెడ్డి దేవిరెడ్డి, 2010.తెలుగు సినిమా పాటలు -సామాజిక స్పృహ (అ. సి. గ్రం ).తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
- రామకృష్ణ కె, 1995.శ్రీశ్రీ సినీగీతాలు ఒక పరిశీలన (అ.సి.గ్రం).అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.
- రుక్మిణి మాదాల, 2010.తెలుగు సినీగీతాలు ఒక పరిశీలన (అ.సి.గ్రం). తిరుపతి : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

