headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. మనుచరిత్ర: వివిధ శాస్త్రసంబంధ ప్రస్తావనలు

కె. పాతన్న

పరిశోధకులు, తెలుగు & అనువాద అధ్యయనశాఖ
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9494408896
Email: kptn896@gmail.com

ఆచార్య డా. యస్. చిన్న రెడ్డయ్య

ఆచార్యులు, తెలుగు & అనువాద అధ్యయన శాఖ
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9440611033
Email: s.chinnareddaiah@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 06.02.2025        ఎంపిక (D.O.A): 28.02.2025        ప్రచురణ (D.O.P): 01.03.2025


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో ప్రబంధయుగం స్వర్ణయుగంగా పేరొందినది. అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు, పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు పంచకావ్యాలలో ఉన్నతమైన కావ్యంగా కీర్తించబడింది. పెద్దన బహుముఖ శాస్త్రపాండిత్యం కలవాడు అనుటకు మనుచరిత్రలో నిదర్శనములున్నాయి. కవులు సందర్భానుసారంగా తమకున్న వివిధ విషయ జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. అదేవిధంగా అల్లసాని పెద్దన కూడా పలురకాల శాస్త్రవిషయాలును తెలిపాడు. ఆయా శాస్త్రాలను ఈ వ్యాసంలో చర్చించడమే ముఖ్యోద్దేశం. సాంస్కృతిక అధ్యయనపద్దతిలో మనుచరిత్రలోని శాస్త్రాలను విశ్లేషిస్తున్నాను. ఇందీవరాక్షుడు శాంబరీమహిమచే వైద్యశాస్త్రం (అష్టవిధ చికిత్సాబేధాలు) ను నేర్చుకొనుట, శరీరానికి గాయం ఏర్పడినప్పుడు అనుసరించాల్సిన పథ్యమును పెద్దన మనుచరిత్రలో చక్కగా చెప్పియున్నాడు. వీటిని ఆయుర్వేద శాస్త్రంగా విశ్లేషణ చేస్తున్నాను. వరూధిని వీణ వాయిస్తూ గీతములను ఆలపించుట, దేశాక్షి రాగం, నాటరాగం, హిందోళ రాగములను సంగీత శాస్త్రంలో చర్చిస్తున్నాను. అలాగే స్వరోచి జన్మించిన సమయాన్ని జ్యోతిష శాస్త్రంగా, స్వరోచి వేటకెళ్లిన సందర్భంలో శకున శాస్త్రంను జోడించి పరిచయం చేస్తున్నాను. రాజనీతి శాస్త్రం, గజ శాస్త్రం, అశ్వ శాస్త్రం, వ్యాయామ, సామరిక జ్ఞానములను కూడా ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్నాను. పరిశోధన మౌలికభావనల్లో ఒకటైన “విశ్లేషణ” అనే రీసెర్చ్ టూల్ ను ఉపయోగించి పెద్దన శాస్త్రపాండిత్యాన్ని సవివరంగా ఈ వ్యాసంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనుచరిత్రలో చిత్రించిన సమాజం, మనుచరిత్రలో సాహిత్య ప్రమేయాలు అని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి సిద్ధాంతగ్రంథాలు సమర్పించారు. మనుచరిత్ర - రసచర్చ ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి వెలువడింది. అల్లసాని పెద్దన ఉత్ప్రేక్షలు - ఒక పరిశీలన బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి వచ్చింది. ఇలా భిన్న కోణాల్లో మనుచరిత్రపై, అష్టదిగ్గజ కవుల ప్రబంధాలపై పరిశోధనలు వచ్చాయి. అయితే అష్టదిగ్గజ కవుల ప్రబంధాలను కళలు, శాస్త్రాల దృష్ట్యా చూడలేకపోయారని, పరిశోధనలుకూడా చేయలేదని గ్రహించి నేను ఈ అంశాన్ని ఎంచుకున్నాను. భారతీయసంస్కృతి సంప్రదాయాలలో ప్రముఖపాత్రవహించిన శాస్త్రములను మనుచరిత్రలో గుర్తించి నేటి మానవ జీవనానికి అన్వయిస్తూ వాటి ప్రాధాన్యతలు, పరిష్కారాలను ఈ వ్యాసంలో తెలుపుతున్నాను. తరువాతి తరాలకు మన శాస్త్ర సంప్రదాయాలను అందించాలనేది నా ఆశ.

Keywords: ఆయుర్వేద శాస్త్రం, సంగీత శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, శకున శాస్త్రం, గజ శాస్త్రం, అశ్వ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, వ్యాయామం.

1. ఉపక్రమణిక :

స్వారోచిష మనువు జన్మ వృత్తాంతం మార్కండేయ పురాణంలోనిది. పద్నాలుగు మంది మనువులలో స్వారోచిష మనువు ఒకడు. ఈ మార్కండేయ పురాణాన్ని మారన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ కథను ఆధారంగా తీసుకొని పెద్దన ప్రబంధ రచన కావించి మనుచరిత్ర అనే ఆరు అశ్వాసముల ప్రబంధముగా తీర్చిదిద్దాడు. గ్రంథకర్త ఈ ప్రబంధానికి స్వారోచిష మనుసంభవం అనే పేరు పెట్టాడు. ఈ ప్రబంధంలో ప్రధానమైన సన్నివేశఘట్టాలు నాలుగు. వరూధిని ప్రవరుల వృత్తాంతం, వరూధిని మాయాప్రవరుల వృత్తాంతం, స్వరోచి మనోరమ ఆమె చెలికత్తెల వృత్తాంతం, స్వరోచి వనదేవతల వృత్తాంతం. మనుచరిత్ర చదివిన పాఠకులకు ఈ నాలుగు ఘట్టాలు ప్రధాన విభాగాలుగా స్పురిస్తాయి. దివ్య కవితా విలాసముచే మెప్పించిన ఈ ప్రబంధాన్ని కృష్ణరాయలకు అంకితం చేశాడు.

2. పెద్దన శాస్త్రపాండిత్యము :

‘’ప్రతిభావ్వుత్పత్తి మాంశ్చ కవిః కవిరిత్యుచ్యతే” (కావ్య.మీ., అధ్యా.5) అని రాజశేఖరుడు తెలిపాడు. కవులు ప్రతిభావ్యుత్పత్తి సంపన్నులయితేనే కవులవుతారని చెప్తూ కవులను మూడు విధములుగా విభజించాడు 1. శాస్త్రకవి, 2. కావ్యకవి, 3. ఉభయకవి. ఈ విభజనరిత్యా ఉభయకవి శాస్త్రవిద్యలోనూ, కావ్యనిర్మాణములోనూ రెండింటియందు ప్రవీణుడై శ్రేష్ఠుడై ఉంటాడని రాజశేఖరుడు చెప్తాడు. అపారకావ్యసంసారంలో ప్రతిభతోపాటు వ్యుత్పత్తిగల కవులకే గౌరవం, గుర్తింపు ఉంటుందంటాడు. దీనిని బట్టి కేవల ప్రతిభచే ఎవరూ కవి కాలేరని గమనార్హం. కవి శాస్త్రజ్ఞానముపై కావ్యనిర్మాణప్రౌఢి ఆధారపడి ఉంటుంది. దాదాపుగా పూర్వకవులలో శాస్త్రవిద్యను అభ్యసించి కావ్యాలను అల్లినవారే ఎక్కువ. ఆ కోవకు చెందిన వాడే పెద్దన కూడా. ఎందుకంటే తన సర్వతోముఖ, శాస్త్రపాండితిని మనుచరిత్ర కావ్యములో పొదిగి చూపాడు. పెద్దన పాండితీగరిమకు మనుచరిత్ర కావ్యమే ప్రత్యక్షనిదర్శనము.

2.1. ఆయుర్వేద శాస్త్రము :

కథలో ఇందీవరాక్షుడు బ్రహ్మమిత్రుడనే ఆచార్యుని వద్ద శాంబరిమహిమ వలన అదృశ్యుడై వుండి ఆయుర్వేద విద్యను అభ్యసిస్తాడు. ఆ వైద్యశాస్త్రములో ఏయే అంగాలున్నాయో పెద్దన క్రింది పద్యంలో తెలిపాడు.

“కాయ బాల గ్రహోర్ధ్వాంగకములు నాల్గు
శల్య దంష్ట్రా జరా వృష సంజ్ఞ నాల్గు
నైన యష్టాంగకము ఠావు లారఁ గల్గు
వైద్య మెనిమిది నెలల సర్వమును నేర్చి” (మ.చ. ఆరవ.ఆశ్వా. 15ప)

“ఇరుమూఁడు రుచుల దోష పు
విరసత మానన్ జ్వరాది వృష్యాంతం బై
పరఁగు చికిత్సయుఁ గని.......” (మ.చ. ఆరవ.ఆశ్వా. 16ప)

కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగక, శల్య, దంష్ట్ర, జరా, వృష అనే ఈ అష్టవిధ చికిత్సా భేదములను తెలిపాడు. పెద్దనకు వీటితో పరిచయం ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు.

“ఆరూఢస్థితి జంద్రికాధవళితాజాండంబులోఁ జంద్రుఁ డొ
ప్పారెం గాలభిషగ్వరుం డవిరతంబై కాముకశ్రేణికిన్
మారోత్సాహము నిల్వఁ బాదరసమున్ బంధించి గ్రాసార్థ మై
క్షీరస్థాలికఁ బెట్టినట్టి ఘుటికాసిద్ధౌషధంబో యనన్” (మ.చ. మూ.ఆశ్వా. 25ప)

పెద్దనకు రసవిద్యా పరిచయము కూడా కలదని స్పష్టంగా ఈ పద్యం వల్ల తెలుస్తుంది. చంద్రున్ని కాముకులకు మారోత్సాహము నిల్పుటకై పెట్టిన రసగుళికగా పేర్కొన్నాడు. స్త్రీ పురుషుల విషయకోరిక స్థిరముగా నిలవడానికి రసౌషధమును ప్రయోప్రయోగిస్తారు. పాదరసములోకి మూలికల రసమును పోసి మర్దించి గుళికగా రససిద్ధిగల సిద్ధులు తయారుచేస్తారు. ఈ రసగుళికను పాలలో కలిపి సేవిస్తారు. కాబట్టి పెద్దన చంద్రున్ని, కాముక శ్రేణికి మారోత్సాహము నిల్పుటకై పాదరసము మూలికలువేసి చేసిన రసగుళికగా చెప్పి, చంద్రికాధవళితాజాండమనే పాలకుండలో వేసినట్లుగా కనపడుతున్నాడని రూపకారోపణ చేశాడు. మూలికాదుల రహస్యములను తెలిసినవాడు రస సిద్ధుడు లేక ఔషధసిద్ధుడు. సంస్కృత మార్కండేయపురాణములో ప్రవరునింటికి వచ్చినవాడు పండితుడైన బ్రాహ్మణుడని చెప్పబడ్డాడు. కానీ మారన అతనిని సిద్ధునిగా మార్చాడు. ఔషధ పరిజ్ఞానముగల పెద్దన అతన్ని ఔషదసిద్ధునిగా మార్చేశాడు. పాదలేపన రహస్యము తెలిసినవాడు కాబట్టి ఔషధసిద్ధునిగా పేర్కొనడం సరైనమాట.

“త్రిపురసంహార మొనరించునపుడు హరుడు
బండికల్లుగ నీమేను గండి చేసె
నదియు సెలవాఱి తెగటాఱవైతి చంద్ర!
యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి” (మ.చ. మూ.ఆశ్వా. 40ప)

వరూధిని చంద్రుణ్ణి దూషించే సందర్భలో పెద్దన ఈ మాటలు పలికిస్తాడు. శరీరములో గాయమేర్పడినపుడు పథ్యము చేయవల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంభోగము మంచిది కాదని వ్రణచికిత్సను పెద్దన పై పద్యంలో నిగూఢంగా తెలిపాడు.

“తమ మను కాలాహి ప్రపం
చము నెరగొని యోషధీశ సద్యః కృత దు
డమున మగుడంగఁ గ్రక్కెడు
క్రమమున నొయ్యొయ్య విచ్చి కడలకుఁ దొలఁగెన్” (మ.చ. ఐద.ఆశ్వా.36ప)

విషమును హరించగల ఓషధుల వలన పాముకాటుకు వైద్యులు చికిత్స చేయుట, పాములను పట్టేవారు కొన్ని ఓషధుల శక్తిచేత విష భయములేక వాటిని పట్టుకోవడం లోకంలో కలదు. పెద్దనకు గల విష విద్యా పరిచయము పై పద్యమువలన స్పష్టమవుతుంది.

“మౌనినాథ! కుటుంబ జంబాలపటల
మగ్నమాదృశ గృహమేధి మండలంబు
నుద్దరింపుగ నౌషధ మొండుగలదె...” (మ.చ. మొదటి ఆశ్వా. 64ప)

ప్రవరుడు ఔషధసిద్ధునితో మాట్లాడినప్పుడు ఇలా అడిగాడు. సంసారమనే బురదలో మునిగియున్న గృహస్థులనుద్ధరించగల ఔషధమేదైనా ఉందా అని ప్రవరుడిచేత పలికించి పెద్దన తనకు ఔషధములమీదనున్న అభిమానమును ప్రకటించినాడు.

2.2. సంగీత శాస్త్రము :

కర్ణాటక సామ్రాజ్యకాలమున దక్షిణ హిందూదేశములో సంగీతము బాగా అభివృద్ధి చెందింది. ఈ కాలములోనే దక్షిణ హిందూదేశ సంగీతానికి కర్ణాటక సంగీతమనే పేరు స్థిరపడింది. దేవదాసీలు నృత్యముతోపాటు సంగీతాన్ని చేపట్టుటేకాక, అంతఃపుర రాజకన్యలు సంగీతములో నిష్ణాతులయ్యారు. అంతేగాక సామాన్య ప్రజలకు సంగీతమీద అభిరుచిని కవిపండితులు సంగీతంను అభిమానించారు. పెద్దనకు సంగీతంలో విశేషాభిమానమున్నట్లు అతని కావ్యమువలన తెలుస్తుంది. అలాంటి విశేషాభిమానము కలవాడు కాబట్టే మార్కండేయపురాణములో లేని వరూధిని వీణావాదనను మనోహరంగా వర్ణించాడు. వరూధిని వీణ వాయిస్తూ గీతమును పాడుతున్నట్లు పెద్దన పేర్కొనుట వలన ఆనాడు వీణమీద గీతములను ఆలపించేవారని తెలుస్తుంది. ఏ వేళ ఏ రాగమును ఆలపించాలో, ఏ ఋతువులో ఏ రాగము ఆలపించబడునో ఆ సంగీత జ్ఞానమంతా పెద్దనకుందని తెలుస్తుంది.

“వాలారుం గొనగోళ్ల నీ వలసతన్ వాయించుచో నాటకున్
మేళంబైన విపంచి నిన్న మొదలున్ నీ వంటమింజేసి యా
యాలాపంబె యవేళఁ బల్కెడుఁ బ్రభా తాయాత వాతాహ తా
లోల త్తంత్రుల మేళవింపఁగదవే లోలాక్షి! దేశాక్షికిన్” (మ.చ. మూ.ఆశ్వా.57ప)

అనే పద్యమునుబట్టి ప్రభాతసమయానికి నాటరాగము పనికిరాదని, దేశాక్షి రాగం ఆ వేళలో పాడదగినదని తెలుస్తున్నది. అంతకుముందు రోజు వరూధిని ప్రవరుని చూసిన సమయములో వీణ వాయిస్తుండేది. అపుడు మధ్యాహ్నకాలము. ప్రవరుని చూడగానే క్రిందపెట్టిన వీణను మరల వరూధిని ముట్టుకోలేదు. అంటే ప్రవరుడు ప్రవేశించినప్పుడామె నాటరాగమను ఆలపిస్తుందన్నమాట. నాటరాగము సంగీతశాస్త్ర ప్రకారము పగటిపూట మూడవజాముకు పరమందు పాడదగిన రాగము. కావున ప్రవరుడు ప్రవేశించిన మధ్యాహ్నవేళకు తగిన రాగమును ఆమె ఆలపిస్తుండెను. ఆ రాగముకు మేళవించిన వీణ అట్లే ఉండిపోయిందని సఖులు వరూధిని మనస్సును వీణపైకి మరల్చి, ప్రవరునివలన కలిగిన విరహదుఃఖమును మరిపించే ప్రయత్నములో ఆమెను ప్రభాతవేళకు తగిన దేశాక్షికి వీణను మేళవించమని అడుగుతున్నారు.

“హిందోళంబునఁ బాడిరి
బృందారక సతులు విరహి బృందా ర్తిగఁ....” (మ.చ. ఆరవ ఆశ్వా. 28ప)

పై పద్యములో హిందోళరాగము వసంతకాల ప్రవేశములో పాడదగిన రాగమని చెప్పబడింది. “శిశిరస్య వసంతస్య సంధౌ హిందోళరాగకః” (మను.చ. వావిళ్ల టీక, పుట. 606) అని శ్లోకము కూడా కలదు.

సూర్యోదయములో పద్మములు వికసించాయి. రాత్రంతా పద్మములలో బందీలైవున్న తుమ్మెదలు ఝంకారము చేస్తూ బయటపడుతున్నాయి. తుమ్మెదల ఝంకారము సంగీతప్రియుడైన పెద్దనకు వీణాగానమై వినిపించింది.

“కరకరి గూఁటఁ గఱ్ఱ యిడఁగా మొఱవెట్టెడులీల బాలభా
స్కర కరకాండకందళ విఘట్టన నించుక వాయినిడ్డ తా
మర మొఱ వెట్టి వెట్టి పలుమాఱును వాకిలిదాఁటి యాఁగుచున్
మొరయ విపంచి మీటుగతి మ్రోసి యళుల్ వెడలెం గొలంకులన్” (మ.చ. మూ.ఆశ్వా.60ప)

“అరుణాగ్ర నిబిడ వాద్యములలోఁ గనుపట్టు
సమయశాంఖికుచేతి శంఖ మనగ....” (మ.చ. మూ.ఆశ్వా.54ప)

యాత్రకై వెడలిన సూర్యుని ముందుగల భేరీభాంకారాదుల వాద్యముల మధ్య కాలమనెడి శాంఖికుని చేతిలోని శంఖమువలె వేగుచుక్క, సంగీతప్రియుడైన పెద్దనకు కనబడుటలో ఆశ్చర్యము లేదు.

2.3. జ్యోతిష శాస్త్రము :

“తేజం బబ్జభవాండ గేహమునకున్ దీపాంకురచ్ఛాయ యై
రాజిల్లన్ గ్రహపంచకంబు రవిఁ జేరంబోని లగ్నంబునన్
రాజీవాక్షి కుమారుఁ గాంచె....” (మ.చ. నా.ఆశ్వా.5ప)

అనే పై పద్యములో గ్రహపంచక ముచ్చస్థానగతమైన శ్రేష్ఠమైన సమయము శుభఫలము పొందే విధంగా జోతిశ్శాస్త్రములో చెప్పిన విషయాన్ని అనుసరించి అలాంటి మహారాజయోగవేళ స్వరోచి జన్మించినట్లు పెద్దన చెప్పాడు. తన జ్యోతిష్య శాస్త్రపరిచితిని మనుచరిత్ర రచనలో చూపించాడు.

2.4.శకునశాస్త్రము : 

పూర్వము రాజులు వేటకుగాని, యుద్ధాలు మొదలైన వాటికి వెళ్ళేటప్పుడు తమవెంట శాకునికులను తీసుకొనిపోవడం ఆచారముగా ఉండేదని తెలుస్తుంది. మధ్యలో ఏదయినా వైపరిత్యం కలిగిన వాటి శుభాశుభ ఫలములు తెలుసుకోడానికి వెంట తీసుకెళ్లే వారు. ఆచారము తెలిసినవాడు కాబట్టే వేటకుపోయిన స్వరోచితోపాటుగా పెద్దన శాకునికుని ఒకరిని పంపినాడు. శకునశాస్త్రమందు నమ్మకము, ప్రవేశముకలవాఁడు కావునే మృగయావినోదాన్ని విరమించి విశ్రాంతి తీసుకుంటున్న స్వరోచికి కొన్ని శకునములు కనిపించినట్లుగా పెద్దన వర్ణించినాడు.

“నిండెc గావిరి ది కట్తంబుల నింగిc గుండలి చండరు…..” (మ.చ. నా.ఆశ్వా. 61ప).

దిక్కులు ఆవిరిచే కప్పబడుట, సూర్యునిచుట్టు పరివేషమేర్పడుట, మాలకాకు లరచుట, నక్కలూళలు పెట్టడం, సుడిగాలులు రేగుటతో ధూళి క్రమ్మి బ్రహ్మాండమంతా బూడిదవర్ణముతో కూడియుండుట మొదలైన శకునములను గూర్చి పెద్దన తెలిపాడు. ఈ శకునాలన్నీ యుద్ధాన్ని సూచిస్తున్నాయని, యుద్ధములో స్వరోచికి విజయము సంభవించి శుభము చేకూరుతుందని, అతనికి కలిగిన అవయవ స్పందనములు సూచిస్తాయి. వీటన్నిటిని పెద్దన తెలిసినవాడు కావడంతో ప్రబంధములో ప్రవేశపెట్టాడు. ఆదేవిధముగా తిక్కన ఉత్తరగోగ్రహణ సమయములో ఇలాంటి ఉత్పాతములను గురించి తెలిపాడు.(వి.ప. నా.ఆశ్వా. 86-88ప). అక్కడ కూడా ఉత్పాతములు యుద్ధము ఏర్పడుతుందని సూచించినవే.

2.5. గజ శాస్త్రము :

పెద్దన గజ సంబంధవిషయపరిచితికి మనుచరిత్రలో నిదర్శనములున్నాయి.

“మండిగా లిడి దంత శుండాగ్ర హతిఁ జించి
జధరాంభముఁ గరుల్ చల్లులాడ…..” (మ.చ. ఐ.ఆశ్వా. 44ప)

ఏనుగులు ఒక కాలును కొద్దిగా ముడిచి మరొక కాలును పూర్తిగా ముడిచి నేలవైపు మ్రొగ్గి తలను మీదికెత్తి నిలిచి స్వభావసహజముగా నీటిని చల్లుకోవడం గురించి చక్కగా చెప్పబడింది.

“తొండముల్ సాఁచి యందుగుఁ జిగుళ్లకు నిక్కు
కరుల దంతచ్ఛాయ గడలుకొనఁగ……” (మ.చ. రెం.ఆశ్వా. 7ప)

ఏనుగులు చిమ్ములాడుకోవడమేకాక తొండములెత్తి అందుగు చెట్లచిగుళ్లను అందుకోవటాన్ని పెద్దన స్వయముగా చూచిన దృశ్యములు కాబట్టి ఇంత వాస్తవంగా అందుగు చెట్లు, ఏనుగుల విన్యాసాలు చెప్తున్నాడు. ఇంతేగాక ఏనుగులకు మదమెక్కినపుడు వాటికి చేయాల్సిన చికిత్సలు కూడా పెద్దనకు తెలుసు.

“ద్రా గ్విదాహ చ్ఛిదా వినిద్రాణ మదవ
దంజనాలాన మూల శయ్యా విధాన
వారుణాధోర ణాకల్పి తోరు శోణ
మృత్తికా రాశియో! యన మెఱసె సంధ్య” (మ.చ. మూ.ఆశ్వా. 17ప)

మదమెక్కిన ఏనుగులకు విదాహము(మిక్కిలి దాహం) పుట్టును, ఆ విదాహమును పోగొట్టడానికి ఏనుగుయొక్క కట్టుకంబపు మూలభూమిపై ఎర్రమట్టిని పరుస్తారు. ఆ ఎర్రమట్టిపై ఏనుగు పడుకొనినట్లైతే దాని తాపము శాంతించును. ఇలాంటివి శాస్త్ర పరిచయమున్న వారికే తెలుస్తాయి. గజములు భద్ర, మంద, మృగ, సంకీర్ణములని నాల్గు జాతులుగా విభజింపబడ్డాయి. ఈ నాల్గింటికి గంభీర వేదిత్వమనే గుణముండవచ్చని,చర్మము తెగిపోయినా, రక్తం కారుతున్నా, కండలూడిపడుతున్నా తనను తాను ఎరుగకుండుట గంభీరవేదితమంటారు. (సూర్యనారాయణ శాస్త్రి,వెంపరాల, మనుచరిత్రవ్యాఖ్య పుట. 683) అలాంటి గంభీర వేదితగుణముగల అనగా బాగా మదించిన భద్రజాతి ఏనుగులను మరియు వాటి అలంకారములను పెద్దన ఈ క్రింది పద్యములో వర్ణించాడు.

“పొగడపూవంటి కంపుల మదాంబువులును
మధువర్ణ దంతశంబములు మెఱయ……” (మ.చ. ఐ.ఆశ్వా. 98ప)

ఏనుగుయొక్క మదజలవాసనలు పొగడపూల వాసనలవలె ఉన్నాయని, తేనెరంగులో ప్రకాశించే దంతములు, అంగారక గ్రహమువలె ఎర్రనైన కన్నులు, భూమిమీద చుట్టే పొడవైన తొండము, అతిశయించే ముందలి దేహముచేత తగ్గియున్న పూర్వకాయము, బలిసి గుండ్రంగా వున్న చెక్కిళ్లు, పొడలుగల ముఖము, నడుముకు బంగారు పట్టా, అంకుశము, ఈటె, అమ్ములపొది, ధనస్సు, డాలు, వీపుమీద పరిచేబొంత మొదలైన అలంకారములుగా కలిగిన ఏనుగులు కృష్ణదేవరాయల చెంత దండిగా యుండియుండును. పెద్దన వాటి లక్షణాలను దగ్గరి నుండి చూసినవాడు కనుకనే ఇంత సహజంగా వర్ణించాడు.

2.6. అశ్వశాస్త్రము :

శ్రీకృష్ణదేవరాయల గజాశ్వ సైన్యము చాల గొప్పదని, దానిని పెద్దన ఈ క్రింది విధంగా వర్ణించాడు.

“ఘీంకార హేషా ఘోషోద్భటధాటికా గజఘటాశ్వక్షుణ్ణ
విశ్వంభరా మోఘీభూత భుజంగభోగభర...” (మ.చ. నా.ఆశ్వా. 120ప)

యుద్ధయాత్రలో ఘీంకార హేషాధ్వనుల ఏనుగుల గుంపుచేత, గుఱ్ఱముల గుంపుచేత నలిగిపోయిన భూధూళి ఎగిరిపోయి భూభారము తగ్గిపోవుటచే భూమిని మోసే ఆదిశేషుని పడగల బరువుని వ్యర్థము చేయు చున్నావాడ' అని కృష్ణదేవరాయలను గూర్చిన సంబోధన ఈ అతిశయోక్తి అంకారముద్వారా రాయల గజాశ్వసైన్యం ఎంతటి గొప్పదో తెలుస్తుంది. “జితకద నాగత మదనాగ సంగమానూప గృహా భోగా! భోగ పురందర!....” (మ.చ. ఐ.ఆశ్వా106ప), అలాగే యుద్ధంలో గెలిచితెచ్చిన ఏనుగుల మదధారలచే రాయలవారి గృహ ప్రాంగణము ఊటనేలగా మారుతున్నదని వర్ణించారు. రాయల గజాశ్వసంపదను గూర్చిన వర్ణన ఆముక్తమాల్యద (ఆ.మా.3ఆశ్వా.48ప) లో కూడా మనం చూడవచ్చు.. పెద్దన యుద్ధ సమయాలలో రాయల వెంటే ఉండేవాడని కృష్ణరాయ విజయములో చెప్పబడింది.

"అహిమాంశు హయహేష లాలించి చెవివంచి
కెరలి వాజులు బయల్ గొరిజఁద్రవ్వ..." (మ.చ. ఐ.ఆశ్వా. 44ప)

అని గుఱ్ఱములు ఏ విధంగా శత్రురాజుల అశ్వఘోషలను విని రేగి గొరిజలతో భూమిని త్రవ్వునో పెద్దన ప్రత్యక్షంగా పరిశీలించి వున్నవాడు కావున పై పద్యములో సహజం గా వర్ణించాడు. స్వరోచి అశ్వారూఢుడై రాక్షసునితో చేసిన యుద్ధము చాలా సహజంగా వర్ణించాడు. స్వరోచి గుఱ్ఱమును వెనుకకు ముందుకు పరుగెత్తించుట, అలసిపోయిన గుఱ్ఱమును లాలించుట, గుఱ్ఱమును రాక్షసుని దగ్గరకు పరుగెత్తించి అతన్ని గాయపరచిన మొదలయిన అనేక అశ్వ గతులను పెద్దన కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. గుఱ్ఱమెక్కిన స్వరోచిని గరుడునితో, రాక్షసుని కొండచిలువతోనూ పోల్చి చెప్పాడు.

"పచ్చని హురుముంజి పనివాగె పక్కెర
పారసిపల్లంబు పట్టమయము
రాణనొప్పారు పైఠాణంబు సింగిణి
తళుకు లకోరీల తరకసంబు
మిహిపసిండి పరుంజు మొహదా కెలంకున
ఠావు గుజ్జురి సేఁత కేవడంబు
డాకెలంకున సిరాజీ కరాచురకత్తి
కుఱఁగటఁ గ్రొవ్వాడి గొరకల పొది
పీలికుంచె తలాటంబుఁ బేరొజంబు
మణుల మొగముట్టు వన్ని సాహిణి యొకండు
కర్త యెదుటికిఁ గొనివచ్చె గంధవాహ
బాంధవంబైన యొక మహా సైంధవంబు" (మ.చ. నా.ఆశ్వా.28ప)

పై పద్యంలో పెద్దన గుర్రాలను ఏ విధంగా అలంకరించేవారో తెలిపాడు. హురుముంజి అనగా పారసీకదేశంలో ఆర్మజ్ అనే ప్రాంతములో తయారయ్యే ప్రసిద్ధికెక్కిన రత్నాలు తాపటపు పనిగల కళ్లెము మరియు పక్కెర (జీను క్రిందపరచు కవచము) వేయబడ్డాయి. పట్టుతో నిర్మించిన పారసీక దేశపు జీనును వేసిరి. గుఱ్ఱమునకు ఒక ప్రక్కన పైఠాన్ ప్రదేశమందు చేసిన శృంగ ధనుస్సును, పదను పెట్టగా మెరిసే బాణములున్న అమ్ములపొదిని, బంగారుపిడి ఉన్న అడ్డకత్తిని, దాని ప్రక్కన గుజరాతీ దేశపు పనితనముగల కత్తిని పెట్టారు. మరొకవైపు అనగా ఎడమప్రక్క సిరాజీదేశపు ఖడ్గము, దాని ప్రక్కన అమ్ముల పొదిని తగిలించారు. ఇక గుఱ్ఱము తలపై పికిలిపిట్టల ఎర్రటి ఈకలతో చేసిన తురాయిని పెట్టారు. గరుడపచ్చలు తాపిన ముఖపట్టమును కట్టారు. ఆయుధ విశేషములను పెద్దన క్రమంగా చెప్పడాన్ని చూస్తే అతనికున్న అశ్వసంబంధ పరిజ్ఞానానికి తార్కాణము, ఈ వర్ణనను కృష్ణదేవరాయల అశ్వం అలంకరణ దృష్టిలో పెట్టుకొని పెద్దన చెప్పాడు.

ఉత్తమ అశ్వముల రంగు, నడకలగురించి తెలిసిన పెద్దన వాటిని క్రింది విధంగా వర్ణించినాడు.

"ఉర్వీజానికి మామ యిచ్చె శిఖిపింఛోద్భాసి వర్ణంబుచే
నర్వాచీనఘనాళి రోహిత సహస్రాకీర్ణగా మింటఁ బూ
షార్వస్తోమముఁ జిత్రయానముల నూటాడించు గాంధర్వ గం
ధర్వవ్యూహము దీప్తిచండ మణికాండ స్వర్ణసన్నాహమున్" (మ.చ. ఐ.ఆశ్వా. 99ప)

నెమలిపింఛోద్భాసి అంటే ఆకుపచ్చ, నీలవర్ణముల మేలుకలయిక వర్ణము కలవి. మరియు అవి ఇంద్రధనస్సుతో కూడిన తొలకరి మబ్బువలె ప్రకాశిస్తున్నాయని వర్ణించాడు. వాటి నడకలు సూర్యాశ్వముల వింతనడకలనే తిరస్కరించేవిగా ఉత్తమాశ్వములకు చెప్పబడిన లక్షణాలను పెద్దన వాటికి చెప్పినాడు.

2.7. రాజనీతిశాస్త్రము :

పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆప్తవర్గములోనివాడు. రాయలకు సన్నిహితుడై మెలిగినవాడు. కాబట్టి పెద్దనకు రాజనీతిశాస్త్రముతో పరిచయం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనుచరిత్రలో పెద్దనకు తెలిసిన రాజనీతినంతటిని ప్రదర్శించే అవకాశము లేకపోయినా “వికసిల్లం బ్రజ చక్రపాలనము..” (మ.చ. ఐ. ఆశ్వా.82) అంటూ ఈ పద్యములో శ్లేషరూపముగా రాజు యొక్క చరిత్రను తెలిపాడు.

2.8. వ్యాయామం :

మనుచరిత్ర కృతిపతి అయిన కృష్ణదేవరాయలు వ్యాయామప్రియుడు. రాయలను గూర్చి పెద్దన “వ్యాయామ స్థిరసంధిబంధ…” (మ.చ. ఆర.ఆశ్వా. 124ప) అనే పద్యంలో స్తుతించాడు. అనగా వ్యాయామముచేత గట్టిపడిన కీళ్ల యొక్క కూర్పు కలవాడని అర్థము. ఈ విషయము చారిత్రక సత్యమైనది. కృష్ణదేవరాయలు ప్రతిరోజూ ప్రొద్దు పుట్టకముందే పడకనుండి లేచి నువ్వుల నూనె తాగి, దానితో దేహాన్నంతా పూసుకుని, అతడు మొలకు ఒక చిన్నబట్ట కట్టుకొని బరువుగల లోడీలను తిప్పేవారని తెలిపాడు. త్రాగిన నూనె అంతా స్వేద రూపంలో బయటకు వచ్చేవరకు కత్తిసాము చేసి, తర్వాత మల్లశ్రేష్ఠునితో మల్లయుద్ధము చేసేవారని తెలిపాడు. వ్యాయామపరిచితి కలవాడు కాబట్టి పెద్దన స్వరోచి అభ్యసించిన విద్యలను గూర్చి “గ్రుద్ధున్ గోత్రాచలంబుల్ గులగులలయి...” (మ.చ. నా. ఆశ్వా. 8ప) ఈ పద్యంలో తెలిపాడు. పెద్దన పై పద్యములో వివిధ మల్లసాధనా విధానాలను పేర్కొన్నాడు. గరడిశాలలో మల్ల యుద్ధం చేసే వారికి దెబ్బ తగలకుండా ఉండడానికి కింద ఎర్ర మట్టిని పరిచేవారని, ఎర్రమట్టియే ఎందుకంటే అది ప్రతాపసూచకము అని, సంగడమనేది సాధన విశేషముగా తెలిపి యున్నాడు. తిరుగటి రాతివలె గుండ్రముగావుండి మధ్యలో రంధ్రము కలిగి దాన్ని పట్టుకోవడానికి అనువుగా ఇనుపవూచ బిగించబడి రాయిసంగడమని పిలిచే వారు. గరడిశాలలో మల్లురు ఈ సంగడములను ఒక భుజమునుండి మరొక భుజముకు తిప్పుతూ నిత్యం సాధన చేసేవారని తెలుస్తుంది.

వరూథిని తనను ప్రవరునికి పరిచయము చేసుకునే సందర్భంలో “పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు సాముగరడీలు మాకు గోత్రామరేంద్ర!” (మ.చ. రెం.ఆశ్వా.43ప) ఇలా తెలిపింది.

బ్రహ్మ, విష్ణు సభలను సాముగరిడీశాలలుగా పేర్కొనడంలో వ్యాయామం మీద పెద్దనకు ప్రీతి కలదని తెలుస్తుంది.

3. ముగింపు :

  • తెలుగు సాహిత్యంలో ప్రబంధ లక్షణాలతో(అష్టాదశ వర్ణనలు) కూడిన మొదటి ప్రబంధం మనుచరిత్ర అని ఎక్కువమంది అభిప్రాయం.
  • విమర్శాసిద్ధాంతాల దృష్ట్యా విశ్లేషించుకున్నప్పుడు మాత్రమే మనుచరిత్ర ప్రబంధంలోని కవి యొక్క కంఠస్వరం అర్థం అవుతుంది.
  • వేదచతుష్టయంలో ఆయుర్వేద శాస్త్ర జ్ఞానం ( అష్ట చికిత్స బేధములు) కు చోటు కలదు.
  • శృంగారశాకుంతలంలోని వేటను పెద్దన అనుసరించి మనుచరిత్ర నాల్గవ అశ్వాసంలో స్వరోచి వేటను ఎక్కువగా పెంచి రచన చేశాడు. 
  • ఈ ప్రబంధంలో శైలి, భాష, శాస్త్ర పాండిత్యం ప్రత్యేకమైనవేగాక కవి యొక్క లోకజ్ఞానానికి గీటురాయి వంటివి.
  • మనకు అనేక విధాలుగా అవసరమవుతున్న, ఉపయోగపడుతున్న గజమల, అశ్వముల గూర్చి భారతీయులు ప్రత్యేకంగా వాటి శాస్త్ర రచనలు చేశారు.
  • అశ్వశాస్త్ర ప్రవర్తకులలో ముఖ్యుడుగా శాలిహోత్రుడిని భారతీయ పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి.
    పెద్దన మధమెక్కిన ఏనుగులకు విరుగుడు కూడా తెలిపాడు. జంతుశాలల్లో మధమెక్కిన ఏనుగులను ఎర్రనేలపై పడుకునేలా చేయడం, వాటికి పెట్టే ఆహారంలో పసుపుముద్దను కలిపి పెట్టడం వంటి విరుగుడు పద్ధతులను ఈనాటికి కూడా ఉపయోగిస్తున్నారు.

4. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గోపాలకృష్ణ, రెంటాల. (2013). మనుచరిత్ర వచన రచన,జయంతి పబ్లికేషన్,విజయవాడ.
  2. చిన్న సత్యనారాయణ, నూకల. (2000). సంగీతశాస్త్రసుధార్ణవము, శ్రీదత్తసాయి గ్రాఫిక్స్, హైదరాబాదు.
  3. జగన్నాథరావు, మంచాళ. (1975). ఆంధ్రుల సంగీతకళ,నాట్యకళ ప్రెస్,హైదరాబాదు.
  4. దుర్గయ్య, పల్లా. (2012). ప్రబంధవాజ్మయవికాసము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
  5. నాగయ్య, జి. (2021). తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటం,నవ్య పరిశోధక ప్రచురణలు, హైదరాబాదు.
  6. బ్రహ్మయ్యశాస్త్రి, కాశీభట్ల. (1995). మను వసు ప్రకాశిక, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
  7. రామస్వామి శాస్త్రులు, వావిళ్ల. (1951).మనుచరిత్రము టీక,వావిళ్ల ప్రెస్, మద్రాసు.
  8. వెంకటరామనరసింహం, కాకర్ల. (1965).ఆంధ్ర ప్రబంధం అవతరణ వికాసములు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం.
  9. వేంకట రమణ, బాలాంత్రపు. (2019).మనుచరిత్రము పరిచయం,జె వి పబ్లికేషన్స్, హైదరాబాదు.
  10. వేంకట సింగరాచార్య, బొమ్మకంటి, నళినీ కాంతరావు, బాలాంత్రపు. (2009). మనుచరిత్రము, ఎమెస్కో బుక్స్, విజయవాడ.
  11. వేంకటరంగయ్య, మామిడిపూడి. (1958). సంగ్రహఆంధ్ర విజ్ఞానకోశము, సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితి, హైదరాబాదు.
  12. వేంకటరాయశాస్త్రి, వేదము. (2012).ఆముక్త మాల్యద సంజీవినీ వ్యాఖ్య,ఎమెస్కో బుక్స్,విజయవాడ.
  13. హనుమంతరావు, మల్లాది. (2010).మనుచరిత్రలో మణిపూసలు,సిపి బ్రౌను అకాడమీ, హైదరాబాదు.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal