headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. మలేసియాలో తెలుగు సంస్కృతి

ఆచార్య పమ్మి పవన్ కుమార్

ఆచార్యులు, తెలుగుశాఖ,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
హైదరాబాద్-500046, తెలంగాణ.
సెల్: +91 9866486934
Email: pavankpammi@uohyd.ac.in

మద్ద నరేశ్

పరిశోధకులు, తెలుగుశాఖ,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
హైదరాబాద్-500046, తెలంగాణ.
సెల్: +91 9346642031
Email: 24htph11@uohyd.ac.in
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.02.2025        ఎంపిక (D.O.A): 28.02.2025        ప్రచురణ (D.O.P): 01.03.2025


వ్యాససంగ్రహం:

బతుకుదెరువుకోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్ళడం కొత్తకాదు. తరాలుగా ఇది జరుగుతున్నదే. ఇలా తెలుగుప్రాంతంనుంచి కొందరు కొన్ని తరాల క్రితం మలేసియా అనే దేశానికి వలస వెళ్ళారు. తెలుగువారి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకన్నా భిన్నమైన నిర్మాణంకలిగిన దేశం అది. పంటకూలీలుగా, కార్మికులుగా వెళ్ళిన తెలుగువారు మలేసియాలో కేవలం రెండు తరాలలో సాధించిన ప్రగతి మనల్ని అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం అక్కడ తెలుగు పాఠశాలలు, తెలుగు సంఘాలు నడుస్తున్నాయి. కొత్తతరానికి తెలుగుభాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని పరిచయం చేయడానికి వివిధసంఘాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. విధిలేని పరిస్థితులలో నివాసం ఏర్పరచుకొన్న తెలుగువారు ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకొన్నారు. తమ భాషను, సంస్కృతిని కాపాడుకొంటూ, ఆ దేశం ఇచ్చే ఉన్నత పౌర పురస్కారాలను సైతం పొందగలుగుతున్నారు. ఆగ్నేయాసియాలో ఒక ప్రధానదేశం మలేసియా. దీని రాజధాని కౌలాలంపూర్. థాయిలాండ్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియా, బ్రునై, ఫిలిప్పిన్స్... వంటి దేశాలతో సరిహద్దులను కలిగిఉన్న దేశం ఇది. ఆ రకంగా ఇది భిన్నమైన జాతుల, సంస్కృతుల సంగమదేశం. ఈ దేశ భౌగోళిక స్వరూపం, భాషలు, సంస్కృతి, తెలుగువారి వలసలు, తెలుగువారు ఏర్పరచుకొన్న సంఘాలు, తెలుగు భాష, సంస్కృతుల వికాసం... మొదలైన విషయాలును సంక్షిప్తంగా ఈ పత్రంలో పరిచయం చేయడం జరిగింది.

Keywords: తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతి, మాతృభాష, ఆగ్నేయాసియా, కళలు, రవాంగ్, బాగన్ డత్తో, దాటు భజన, వయాంగ్ కులిట్

1. ప్రవేశిక:

ఒకప్పుడు వలస కూలీలుగా, పంట కార్మికులుగా మలేసియా వెళ్ళిన తెలుగువారు ఆ దేశంలో ప్రాథమికదశలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. భాషపరంగా, సంస్కృతిపరంగా, సాంఘికంగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి తొలితరంవారంతా ఆ దేశంలో విశేషంగా శ్రమించారు. అక్కడి వ్యవహారభాషలను నేర్చుకొన్నారు. వారి సంస్కృతికి అనుగుణంగా తమను తాము మలచుకొన్నారు. కాని, తమ పూర్వికులు మాట్లాడిన తెలుగు భాషను తమ వ్యవహారంనుంచి దూరంచేసుకోలేదు. తెలుగు సంస్కృతిని, ఆచార-వ్యవహారాలను విడిచిపెట్టలేదు.

మలేసియాదేశంలో తెలుగువారి భాషావ్యవహారాన్ని అనేకపద్ధతులను అనుసరించి పరిశీలించవచ్చు. తెలుగురాష్ట్రాలలోని ప్రజల వాడుకలో ఉన్న తెలుగుకు, మలేసియాలో వ్యవహారంలో ఉన్న తెలుగుకుగల సామ్యభేదాలను, ప్రత్యేకతలను గుర్తించవచ్చు. తెలుగుభాషాభివృద్ధి కోసం మలేసియాలోని తెలుగువారు చేస్తున్న కృషిని, వారి సాహిత్యాన్ని అనుశీలించవచ్చు. తెలుగు సంస్కృతిని మలేసియాలో పరిరక్షించుకుంటున్న తీరుని బహుముఖీనంగా వెల్లడించవచ్చు. సమ్మిళిత సంస్కృతిని ప్రతిబింబించే దేశంలో, ప్రశాంతమైన సహజీవనం సాగించే సముదాయంగా తెలుగువారు మలేసియాలో మంచి పేరును సంపాదించుకొన్నారు. ఇందుకోసం బహుముఖీనంగా కృషిచేస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేసియా... వంటి సంస్థలు చేస్తున్న కృషిని కేవలం అభిరుచితో కాక, పరిశోధన దృక్పథంతో కూడా చూసే వీలు ఉంది.

2. మలేసియా - భౌగోళికస్వరూపం:

మలయాభూమి బంగారుద్వీపకల్పంగా పేరుగాంచింది. ఇది 13 రాష్ట్రాలు, మూడుసమాఖ్య భూభాగాలను కలిగిఉంది. దీని మొత్తం వైశ్యాల్యం 329.847 కిలో మీటర్లు. ఈ సమాఖ్య ప్రభుత్వానికి కేంద్ర స్థానం పుత్రజయ. మలేసియాగా మనం ప్రస్తుతం పిలుచుకొంటున్న దేశానికి మూలాలు మలయ్ రాజ్యాలలో దొరుకుతాయి. మలయ్ రాజ్యాలు 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారి అధీనంలోకి చేరాయి. అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. ఈ భూభాగాలను 1946లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. ఆ విధంగా ఈ దేశం 1957లో ఆగస్టు 31వ తేదీన స్వాతంత్ర్యం పొందింది.

మలేసియా

Source: https://www.researchgate.net/figure/Malaysia-map-World-Map-2017_fig1_325168593

మలేసియా సాంస్కృతికంగా సమ్మిశ్రితమైన దేశం. బహు భాషా సమాజాలు అనేకం మనకు ఈ దేశంలో కనిపిస్తాయి. అధికార మతం ఇస్లాం. ఇతర మతాలకు స్వేచ్ఛను ఉంది. ప్రభుత్వనిర్మాణం వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ వ్యవస్థను పోలి ఉంటుంది. ఎన్నికైన చక్రవర్తి దేశాధినేతగా ఉంటారు. ప్రభుత్వ అధిపతిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. సంప్రదాయ సహజ వనరుల ద్వారా వచ్చే వనరులు ఈ దేశానికి ఆర్థికంగా వెన్నెముక. వాణిజ్యం, పర్యాటకం, వైద్య రంగాలలో మలేసియా గడచిన రెండు దశాబ్దాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. సుమత్రా, మలేసియాల మధ్య ఉన్న మలక్కా జలసంధి, అంత్యంత ముఖ్యమైన ఆర్థిక మార్గాలలో ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో 40 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. మలేసియన్ కరెన్సీని రింగిట్(రింగిట్ మలేసియా-RM) అని పిలుస్తారు.

3. మలేసియా - ప్రధానంగా మాట్లాడే భాషలు:

మలేసియాలో ముస్లిం ప్రజల సంఖ్య ఎక్కువ. అధికారమతం సున్నీ శాఖకు చెందిన ఇస్లాం. అధికారభాష మలయ్. ఇది ఆస్ట్రోనేషియన్ భాషాకుటుంబానికి చెందిన భాష. జావనిస్, ఫిలిప్పినొ, సండనీస్, ఇండోనేషియన్, బతక్... మొదలైనవి ఈ భాషాకుటుంబంలోని ప్రధానమైన భాషలు. వర్తక-వాణిజ్యాలకు, పశ్చిమదేశాలతో సంబంధాలకు ఇంగ్లీషు భాషను వాడతారు. మలేసియాలో ఇబాన్, డుసునిక్, కడజాన్... వంటి వందకు పైగా దేశీయమైన భాషలున్నాయి. అలాగే ప్రధానంగా చైనీస్, తమిళం, ఇంగ్లీష్ భాషలు మాట్లాడేవారు ఎక్కువమంది తారసపడతారు. వీటితోపాటు, అరబిక్, బెంగాలీ, గుజరాతీ, ఇసాన్ కరెన్, కుర్కిష్, మలయాళం, ఉత్తర థాయ్, పర్షియన్, పంజాబీ, దక్షిణ థాయ్, తెలుగుభాషలు మాట్లాడే వ్యవహర్తలు దేశంలోని ప్రధానమైన ప్రాంతాలలో ఉన్నారు. విదేశీ భాషలుగా ఇంగ్లీషు, ఫిలిప్పిన్స్, ఇండోనేషియన్, జపనీస్, కొరియన్, వియత్నమీస్ భాషలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమికస్థాయిలో మూడు ప్రధానభాషలైన మలయ్, మాండరిన్ (చైనీస్), తమిళ భాషలలో పాఠశాల విద్యను అందిస్తోంది. కొద్దికాలం క్రితంవరకు ఈ జాబితాలో తెలుగు భాషకూడా ఉండేది.

4. తెలుగువారి వలసలు:

మలేసియా ఒక్కప్పుడు బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండేది. వీరి వ్యాపారం ఎక్కువగా నౌకాయానంపై ఆధారపడి సాగేది. ఈ క్రమంలో బ్రిటీష్ వారికి ఎక్కువమొత్తంలో శ్రామికులు అవసరం అయ్యారు. అప్పుడు వీరికి అక్కరకు వచ్చిన వారు భారతీయులు. వీరిని శ్రామికులుగా వాడుకొని తమ దేశానికి, తాము పాలిస్తున్న ప్రాంతాలకు కార్మికులుగా పంపేవారు. ఇలా తెలుగు నేల నుంచికూడా వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కువగా సముద్రతీర ప్రాంత తెలుగు ప్రజలు దక్షిణ ఆఫ్రికా, మారిషస్, మలేసియా, శ్రీలంక, అండమాన్ లాంటి దేశాలకు వలస కార్మికులుగా పంపబడ్డారు.

ఈ విధంగా ఆంధ్రప్రాంతం నుంచి మలేసియాకు 19వ శతాబ్దంలోనే వలసలు ప్రారంభమయ్యాయి. ఇందులో వలసకూలీలుగా కొందరు, చిరువ్యాపారులుగా కొందరు ఎంతో మంది మలేసియాకు వెళ్లారు. విశాఖపట్టణం, మద్రాసు చుట్టు పక్క ప్రాంతాలనుండి మలేసియాకు సముద్రమార్గం ద్వారా వెళ్ళినవారి సంఖ్య ఎక్కువ. మలక్కా జలసంధి సమీపంలోని పెరాక్ రాష్ట్రంలోకి తెలుగువారి వలసలు ఈ విధంగా ప్రారంభమయ్యాయి. దిగువ పెరాక్ జిల్లాలోని బాగన్ డత్తో అనే ఊరికి చేరుకున్న తెలుగువారు అక్కడ రబ్బరు, కొబ్బరి, పామాయిల్, తేయాకు, తోటల్లో పనిచేయడానికి కుదురుకున్నారు. ఈ కాలంలోనే శ్రీలంక నుండి మలయాకు వచ్చి తోటల్లో గుమస్తాలుగా చేరినవారు చాలామంది ఉండేవారు. వీరికి ఆంగ్లభాషతో ఉన్న కొద్దిపాటి పరిచయం గుమస్తా ఉద్యోగాలకు పనికివచ్చేది. తెలుగు, తమిళ ప్రాంతాలనుండి వెళ్ళినవారు కూలీలుగా, మేస్త్రీలుగా పనిచేసేవారు.

భారతదేశం నుంచి మలేసియాకు చట్టబద్దమైనవలసలు 1907లో ప్రారంభమయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆ తరువాతి కాలంలో ఆంధ్రరాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి మలేసియాకు తెలుగువారి వలసలు పెరిగాయి. మలేసియాలో వ్యాపారం నిర్వహించే బ్రిటీష్ కంపెనీలు కాలక్రమంలో ఆర్థిక నష్టాలకు గురి అయ్యి తమ వ్యాపారాలను నిలిపివేశాయి. అప్పుడు కొన్ని తోటలను చైనా వారు కొనుగోలు చేయగా, మరి కొన్నిటిని తెలుగువారు తక్కువ ధరకు కొని వాటిని అభివృద్ధి చేసుకొన్నారు. కొంతమంది ప్రజలు ఇతర రంగాలకు వెళ్లిపోయారు. మిగతా వారు ఖాళీ భూములలో, పొరంబోకు భూములలో, నదుల పక్కన ఉన్న భూములలో వ్యవసాయం చేసుకొనేవారు. వ్యవసాయ రంగంలో స్థిరపడిన తెలుగువారు ఎక్కువగా వరి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించేవారు.

తమది కాని దేశానికి వచ్చి తెలుగు ప్రజలు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. శ్రమదోపిడీకి, అణిచివేతలకు గురి అయ్యారు. కాని, విదేశంలో స్వదేశీ ఆచార, సంప్రదాయాలు పాటిస్తూ, తెలుగు అస్తిత్వాన్ని నిలబెడుతున్న మహానుభావులు ఎందరో మలేసియాలో ఇప్పటికి ఉన్నారు. వీరి కృషికి నిలువెత్తు నిదర్శనమే ప్రస్తుతం రవాంగ్ లో ఉన్న తెలుగు అకాడమీ భవనం. నేడు ఐదులక్షలకు మించి తెలుగు ప్రజలు మలేసియా నివసిస్తున్నారని మలేసియా తెలుగు సంఘంవారి అంచనా. నావికులుగా, ఉపాధ్యాయులుగా, సంగీత కళాకారులుగా, రాజకీయ సలహాదారులుగా, శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, పరిశోధకులుగా ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలలో తెలుగువారు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా సర్వశ్రీ బీశెట్టి నూకయ్య, డి. వి. శ్రీరాములు, వెంకటరత్నం, అప్పలనాయుడు, ఎల్లపు కృష్ణమూర్తి, డత్తో అచ్చయ్యకుమార్... వంటి వారు తెలుగుభాషాభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నారు.

5. తెలుగు అభివృద్ధి - మలేసియా తెలుగు సంఘం (TAM) పాత్ర:

మలేసియాలో మొట్టమొదట 17-08-1955వ తేదీన తొంభై తొమ్మిది మంది తెలుగు వారితో శ్రీ కె. సిద్ధయ్య అధ్యక్షతన ఆంధ్ర సంఘము ఏర్పడింది. ఇది 17-02-1956వ తేదీన ప్రభుత్వ గుర్తింపు పొందింది. తర్వాత, దేశవ్యాప్తంగా 17 శాఖలను ఏర్పాటుచేసుకోంది. 16-12-1963వ తేదీన మలయ ఆంధ్రసంఘాన్ని, మలేసియా ఆంధ్రసంఘంగా మార్చారు. ఇదే 1983లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేసియా(TAM)గా రూపాంతరం చెందింది. దీనినే మలేసియా తెలుగు సంఘంగా కూడా పిలుస్తున్నారు. అనేక మంది ప్రముఖులు తెలుగు సంఘం అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేశారు. తెలుగుబడులలో ఉపాధ్యాయులుగా చేరారు. ఒక తరం నుంచి మరోతరానికి తెలుగును అందజేస్తున్నారు. మలేసియాలో తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతుల కొనసాగింపుకు అహరహం శ్రమిస్తున్నారు.

మలేసియా తెలుగు సంఘం నిర్వహణలో ఇప్పటివరకు సుమారు 5000 మంది పిల్లలు తెలుగు భాషను రాయడం, చదవడం నేర్చుకొన్నారు. అలాగే ఈ సంఘం ఆధ్వర్యంలో తెలుగు పండుగలను, సాంస్కృతిక కార్యక్రమాలను, సాహితి సదస్సులను చాలా తరచుగా నిర్వహిస్తుంటారు. 2011వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంతో, మలేసియా తెలుగు సంఘం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొని ప్రవేశిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద కోర్సులను నిర్వహిస్తున్నది. వీటికి సంబంధించిన పాఠ్య ప్రణాళికలను, భోదనాంశాలను విశ్వవిద్యాలయం రూపొందిస్తుంది. 2024వ సంవత్సరంనుంచి ఈ సంస్థద్వారా తెలుగుభాష, సాహిత్యాలలో డిప్లొమా కోర్సునుకూడా బోధిస్తున్నారు. ఆచార్య వై. రెడ్డి శ్యామల ఈ కోర్సుల నిర్వహణను సమన్వయం చేస్తున్నారు.

తెలుగుఅకాడమీ భవనం ఐదు అంతస్థులలో అధునాతన సౌకర్యాలతో నిండి ఉంటుంది. విశాలమైన తరగతి గదులు, చర్చావేదికలు, వసతి, నీటి సౌకర్యం వంటి సదుపాయాలన్నీ దీనిలో ఉన్నాయి. మలేసియాలోని తెలుగు పిల్లలకు తెలుగు బోధించడమే కాకుండా ఈ సంస్థ మహోన్నతమైన తెలుగు సంస్కృతికి వారసులనుకూడా తయారు చేస్తున్నది. ఇక్కడ తెలుగు నేర్చుకొనే విద్యార్థులకు మలేసియా తెలుగు సంఘం ఉపకారవేతనాలను అందిస్తోంది.

తెలుగు అసోసియోషన్ ఆఫ్ మలేసియా (TAM) ప్రధాన భవనం(రవాంగ్)
Source: https://telugumalaysia.org/gallery-images/

మలేసియా తెలుగు సంఘం అభివృద్ధిలో డత్తో అచ్చయ్యకుమార్ పాత్ర చాలా ప్రశంసనీయం. వృత్తిపరంగా ఆయన వైద్యులు. కాని, తెలుగుభాష పట్ల ఆయనకు ఎనలేని అభిమానం. ఈ అభిమానంతోనే అక్కడి తెలుగు ప్రజలను ఒక తాటి పైకి తెచ్చారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేసియా అనే సంస్థను మిత్రులతో కలసి స్థాపించి, నేటి తరం పిల్లలకు తెలుగుభాషను, సాహిత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని అందించడానికి అలుపెరగని కృషిని చేస్తున్నారు. ఈ సంస్థకు ప్రస్తుత అధ్యక్షులు డా. వెంకటప్రతాప్. ఈయనకూడా వృత్తిరీత్యా వైద్యులే. యువకులు, ఉత్సాహవంతులు. డత్తో అచ్చయ్యకుమార్ తెలుగు వైభవ, వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ కృషిని కొనసాగిస్తున్నారు.

6. మలేసియా - తెలుగువారి సాంస్కృతిక కేంద్రాలు:

మలేసియాలోని కొన్ని ప్రాంతాల్లో అచ్చంగా తెలుగు వాతావరణం కనిపిస్తుంది. అక్కడ ఉన్న దేవాలయ ప్రాంగణాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మనకు తెలుగు నేలపైనే ఉన్నామన్న అనుభూతిని కలిగిస్తాయి. అక్కడి తెలుగు వారు నిర్మించుకున్న శ్రీరామ దేవాలయం, బాగన్ డత్తో ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం ఆగ్నేయాసియాలో అతిపెద్దదైన శ్రీరామ మందిరంగా ప్రసిద్ధి చెందింది. బాగన్ డత్తో తెలుగు శాఖ ఆధ్యర్యంలో సువిశాలమైన క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయం ఉంటుంది. నిత్య పూజలు, స్వామి వారి సేవా కార్యక్రమాలతో పాటు, తెలుగువారందరూ తమకు వచ్చిన కళలను ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో కూచిపూడి, భరతనాట్యం, దాటు భజన, సంకీర్తనల ఆలాపన, గొబ్బిళ్ళు, చిరుతల ప్రదర్శన.. వంటి కార్యక్రమాలతో ఈ ఆలయప్రాంగణం తెలుగుసంస్కృతీ నిలయంగా భాసిల్లుతుంటుంది.

మలేసియాలోని తెలుగువారి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం - శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
(బాగన్ డత్తో) Source: https://telugumalaysia.org/the-temple/

మలేసియా తెలుగువారి సంస్కృతిలో ముఖ్యంగా గుర్తించదగిన అంశం గ్రామ దేవతల ఆరాధన. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఆరాధించే గ్రామదేవత భూలోకమ్మ. ఈ దేవతకు ఆలయం బాగన్ డత్తో ప్రాంతంలో ఉంది. అంటే, విశాఖప్రాంతంనుంచి ఎన్నోయేళ్ళ క్రితం వలస వెళ్ళిన తెలుగువారు తమతో పాటు. తమ దేవతనుకూడా మలేసియాకు తీసుకొని వెళ్ళారన్నమాట. ఆ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించుకొని ఆరాధించుకొంటున్నారన్నమాట. అలాగే మోతలమ్మ లేదా ముత్యాలమ్మ ఆలయాలు మలేసియాలో ఎన్నో ఉన్నాయి. మలేసియాలోని తెలుగు వారు సంక్రాంతి, శ్రీరామనవమి, విజయదశమి, శివరాత్రి... లాంటి ప్రసిద్ధి చెందిన పండగలను బాగా జరుపుకుంటారు. పండగ సందర్భాలలో సాంస్కృతిక అంశాలలో పోటీలు, సాహిత్య కార్యక్రమాలు, భజనలు, సంగీత ప్రదర్శనలతోపాటు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు...వంటి ప్రజోపయోగమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

7. మలేసియాలో తెలుగువారి కళాప్రదర్శన - దాటు భజన:

మలేసియాలోని తెలుగు వారు చేసే ప్రత్యేక జానపద నృత్యం దాటు భజన. దీనిలో కనీసం ఆరుగురు నుంచి పన్నెండుమంది వలయంగా ఏర్పడతారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, చేతిలో చిరుతలు మీటుతూ, అడుగుల కదళికలకు తగ్గట్టుగా నృత్యంచేస్తూ, పాటలు పాడతారు. మలేసియాలోని తెలుగువారు ఈ కళారూపాన్ని ఎంతో ఆరాధిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన శ్రమ అంతా మరచిపోయి, సేద తీరెందుకు పూర్వకాలంలో ఇది వారికి దోహదం చేసింది. వెన్నెల రాత్రులలో, శ్రీరాముడి సన్నిధిలో, స్వామివారిని కీర్తిస్తూ, తగ్గట్టుగా తాళాలను మ్రోగిస్తూ, పాటలు పాడుతూ దాటు భజన చేస్తుంటారు.

8. వయాంగ్ కులిట్:

తెలుగునాట ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం తోలుబొమ్మలాట. దీని ద్వారా రామాయణ, మహాభారత ఇతిహాసాలను ప్రదర్శిస్తుంటారు. తోలుతో చేసిన బొమ్మలను తెరవెనుక ఉంచి, వాటిని సందర్భానికి అనుగుణంగా కదిలిస్తూ ప్రేక్షకులకు ఒకవైపు సందేశాన్నిఅందిస్తుంటారు; మరోవైపు సంతోషాన్ని కలిగిస్తుంటారు. దీని సరిపోలే కళారూపం మలేసియాలోని వయాంగ్ కులిట్. దీనికి మాతృక ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిందని ఇక్కడి తెలుగువారు చెబుతుంటారు.

9. ఉపసంహారం:

  • మలేసియాలో నివశిస్తున్న తెలుగు వారి భాష, సాహిత్యం, సంస్కృతుల అధ్యయనం ద్వారా ఎన్నో కొత్తవిషయాలను వెలికితేవచ్చు.  ప్రధానమైన తెలుగు వ్యవహార ప్రాంతానికి అనేక సంవత్సరాలుగా వెలుపల జీవిస్తున్న వీరి ఆచార వ్యవహారాలలో, భాషా వ్యవహారంలో, సంస్కృతిలోని విశేషాలను గుర్తించడం, వస్తున్న మార్పులను గమనించి పరిశోధన దృక్పథంతో అధ్యయనం చేయడం అవసరం. 
  • తెలుగు రాష్ట్రాలు తెలుగుభాష మాట్లాడే ప్రధాన వ్యవహారప్రాంతాలు. ప్రపంచంలోని మొత్తం తెలుగు భాషావ్యవహార ప్రాంతంతో పోల్చినపుడు ఈ రాష్ట్రాల విస్తీర్ణం చిన్నది.  ప్రధాన వ్యవహారప్రాంతం-మొత్తం తెలుగు భాషావ్యవహార ప్రాంతం అన్నవాటిమధ్య ఉన్న తేడాను ఈ సందర్భంలో జాగ్రత్తగా గుర్తించాలి. 
  • ప్రధాన వ్యవహార ప్రాంతంలోని భాష వాడుకలో కనిపించే వైవిధ్యంకన్నా, మొత్తం తెలుగు భాషావ్యవహార ప్రాంతంలో కనిపించే వైవిధ్యం భిన్నంగా ఉంటుంది. భిన్నమైన ప్రాంతాలలో/దేశాలలో నివశించే తెలుగువారి భాషావ్యవహార రంగాలు ఒకేలా ఉండే అవకాశం తక్కువ. 
  • భిన్నమైన ప్రాంతాలలో/దేశాలలో నివశించే తెలుగువారు  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తెలుగును వాడుతున్నారా అన్నది ప్రత్యేకంగా పరిశీలనాంశం.  అందువల్ల వ్యవహర్తల మౌఖిక-లిఖిత  వ్యవహారాలలో భాషలో ఉన్న/వస్తున్న మార్పులను  ప్రత్యేకంగా గుర్తించవలసి ఉంటుంది. 
  • భాషలోని ధ్వని, వర్ణ, పదాంశ, వాక్య, అర్థవిశ్లేషణ స్థాయిల ఆధారంగా, సామాజిక భాషాశాస్త్ర నేపథ్యంతో, క్షేత్ర పర్యటనలద్వారా ఇటువంటి అధ్యయనాలు జరపటంవల్ల  తెలుగు భాష వాడుకకు సంబంధించిన వ్యవహార భేదాలను తెలియజేయవచ్చు;  చలన సూత్రాలను గమనించవచ్చు;  భాషా వికాశాన్ని నిరూపించవచ్చు.
  • సవాళ్ళతో కూడుకొన్నదైనప్పటికీ, ఇటువంటి అధ్యయనాలు చేయడానికి ఇది శాస్త్రపరంగానూ, సాంకేతికంగానూ కలిసివచ్చే కాలం.    

10. ఉపయుక్త గ్రంథ/ఆకరసూచి:

  1. ఆంజనేయులు, పగిడిపాల. 2022. అలలెత్తిన కలల ప్రపంచం. హైదరాబాద్: మలేసియా తెలుగు సంఘం ప్రచురణ.
  2. కృష్ణమూర్తి, భద్రిరాజు. 2023. భాష – సమాజం - సంస్కృతి. హైదరాబాద్: నీల్ కమల్ పబ్లికేషన్స్.
  3. నిత్యానందరావు, వెలుదండ. 2013. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన. హైదరాబాద్: స్వీయ ప్రచురణలు.
  4. నూకయ్య, బీసెట్టి., కామేశ్వరశర్మ వేమూరి. (సంపా.) 1981. రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు. హైదరాబాదు: అంతర్జాతీయ తెలుగు సంస్థ.

English:

  1. Hudson, R. A. 1996. Sociolinguistics. 2nd edn. Cambridge: Cambridge University Press.
  2. Malini, Ramanan. 2023. Malaysian Telugus. Malaysia: Areca books. 
  3. Trudgill, P. 2000. Sociolinguistics: An Introduction to Language and Society. 4th edn. England: Penguin Books.

పరిశోధన గ్రంథాలు:

  1. కొండయ్య, మద్దిని, 1996. అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగు సాహిత్య సంస్కృతుల అధ్యయనం. ఎం. ఫిల్. పట్టం కోసం తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధన వ్యాసం. పర్యవేక్షకులు: డా. పరిమి రామనరసింహం.
  2. చంద్రయ్య, ఎస్. 2017. తిమ్మాజిపేట మండల మౌఖిక భాష: వర్ణనాత్మక వ్యాకరణం. పిహెచ్. డి. పట్టం కోసం తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధన గ్రంథం. పర్యవేక్షకులు డా. పమ్మి పవన్ కుమార్.
  3. మల్లేష్, మంత్రి. 2019. తెలంగాణ మాండలికనవలలు: భాషాపరిశీలన. పిహెచ్. డి. పట్టం కోసం తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధన గ్రంథం. పర్యవేక్షకులు డా. పమ్మి పవన్ కుమార్.

పరిశోధన పత్రాలు:

  1. పవన్ కుమార్, పమ్మి. మార్చి, 2024. తెలుగు మౌఖికవ్యవహారభాష: పరిశోధనావశ్యకత. హైదరాబాద్: మూసీ మాసపత్రిక. సంపుటి-27: సంచిక-5.
  2. పవన్ కుమార్, పమ్మి & నవీన్ కుమార్, బొమ్మగాని. ఫిబ్రవరి, 2025. సామాజిక భాషాశాస్త్ర అధ్యయనం: ప్రయోజనాలు. హైదరాబాద్: నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక. సంపుటి-15: సంచిక-2.

URLs:

  1. https://en.wikipedia.org/wiki/Malaysia
  2. https://telugumalaysia.org/

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]