headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-07 | June 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. తెలుగు రామాయణాలలో కైకేయిపాత్ర: తులనాత్మకానుశీలనం

డా. జి. శ్రీనివాసరావు

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విభాగము,
తారా ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి),
సంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9848020646, Email: drsrinivasprofessor@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.04.2025        ఎంపిక (D.O.A): 28.05.2025        ప్రచురణ (D.O.P): 01.06.2025


వ్యాససంగ్రహం:

తెలుగులో రచింపబడిన కొన్ని రామాయణాలలో కైకేయి ని ప్రతినాయికగా, చెప్పుడు మాటలు వినేదానిగా, స్వార్థపరురాలుగా చిత్రీకరించారు. కాగా శ్రీమద్రామాయణ కల్పవృక్షములో రామావతార పరమార్థము తెలిసిన విజ్ఞురాలిగా కన్పిస్తుంది. రామాయణములో ప్రధానమైన శ్రీరామునికథకు కైకేయి పాత్ర ఎంత ఉపబలకంగా ఉందో తెలియజేయడమే ఈ వ్యాసము ప్రధానోద్దేశం. రంగనాథ రామాయణము మొదలుకొని నేటి వరకు గల రామాయణముల మీద వివిధ విశ్వవిద్యాలయములలో ఎన్నో పరిశోధనలు జరిగినవి. విమర్శ గ్రంథాలు అనేకం వచ్చినవి. కోలవెన్ను మలయ వాసిని గారి “ఆంధ్రవాఙ్మయము- రామాయణము”, వడలి మందేశ్వరరావు గారి “ఇది కల్పవృక్షం” వంటి పరిశోధన, విమర్శ గ్రంథాలు అసంఖ్యాకంగా వెలువడినవి. ఈ వ్యాసరచనకు తెలుగు రామాయణములనుండి, పరిశోధన, విమర్శగ్రంథాల నుండి విషయమును సేకరించితిని. ప్రధానమైన కొన్ని రామాయణములలో కేవలం కైకేయిపాత్రను చిత్రించిన తీరు విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా అనుశీలించడమే ఈ వ్యాసపరిధి. ఒక ప్రధానపాత్రను నడిపించడములో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇతరపాత్రలు ఎలా ఉపయోగపడతాయో పాఠకులు, విమర్శకులు గ్రహించగలుగుతారు.

Keywords: తెలుగు రామాయణములు , కైకేయి పాత్ర చిత్రణ , అవాల్మీకములు , విశ్వనాథ తీర్చిన కైకేయి, కథనానుకూలమగు మార్పులు

1. ప్రవేశిక

భారతీయు లెక్కువగా ఆదరించు గ్రంథములలో రామాయణమొకటి. రంగనాథ రామాయణము మొదలు నేటి వరకు వివిధ కాలములలో, వివిధ ప్రక్రియలలో అసంఖ్యాకములుగా రామాయణములు రచింపబడినవి. వివిధ రామాయణములలో విభిన్నంగా, వైవిధ్యంగా చిత్రంపబడిన పాత్ర కైకేయి. చాలా రామాయణాలలో కైకేయి రాముణ్ణి అడవికి పంపిన పినతల్లిగా, తన కొడుకు భరతుడిని పట్టాభిషిక్తుని చేయాలనే స్వార్థపరురాలిగా కనిపిస్తే, కొన్ని రామాయణాలలో మాత్రం రాముని ధర్మ నిర్వహణ కార్యములో తన వంతు పాత్ర నిర్వహించిన నిస్స్వార్థ పరురాలిగా కన్పిస్తుంది. ఏయే తెలుగు రామాయణాలలో కైకేయి వ్యక్తిత్వాన్ని ఎలా చూపించారో తులనాత్మకంగా అనుశీలించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

2. వాల్మీకి రామాయణము – కైకేయి

వాల్మీకి రామాయణములో శ్రీరాముని యువరాజ పట్టాభిషేకము గురించి రాముని పెంచిన 'దాది 'ద్వారా తెలుసుకొని మంథర ఈ విషయాన్ని కైకేయికి చెప్తుంది. దానికి కైకేయి ఎంతో సంతోషిస్తుంది. కాని మంథర తన దుర్బోధచే కైకేయి మనసుమార్చుతుంది. దశరథుడు కైకకిచ్చిన వరములు గుర్తుచేసి మరీ భరతుని పట్టాభిషేకాన్ని, రాముడి వనవాసాన్ని కోరుకోమని సలహా ఇస్తుంది. మంథర పథకం ప్రకారమే కైక కోపగృహానికి వెళ్ళడం, తరువాత వచ్చిన దశరథుని దగ్గర ముందుగానే మాట తీసుకొని రెండు వరాలు కోరుకోవడం జరుగుతుంది. ఆ వరాలు విని ధశరథుడు నేలపై కుప్పకూలిపోతాడు. కైక ఆశీస్సుల కొరకు వచ్చిన రామునికి తన వరాల గురించి చెప్తుంది. శ్రీ రాముడు అది తెలుసుకొని మరుసటి రోజు ఉదయమే అరణ్యవాసానికి బయలుదేరి పోతాడు. మంథర దుర్బోధ వలననే కైకేయి రాముని వనవాసమునకు పంపుతుంది.

3. అధ్యాత్మ రామాయణము- కైకేయి

బ్రహ్మాండపురాణాంతర్గత అధ్యాత్మరామాయాణములో కైకేయిని చూపించిన తీరు వాల్మీకి రామాయణానికి భిన్నంగా ఉంది. శ్రీరాముడు అయోధ్యలో ఉండగా ఒకరోజు నారద మహర్షి వచ్చి రాక్షస సంహారమే రాముని అవతార ముఖ్యోద్దేశమని గుర్తుచేస్తాడు. అందుకు రాముడు తనకు గుర్తున్నదనీ, ఆ కార్యం నెరవేరుస్తాననీ చెప్తాడు. అదే సమయంలో దేవతలు సరస్వతి దేవికి మ్రొక్కి “దేవీ నీవు మంథరను, కైకేయిని ఆవహించి వారి ద్వారా శ్రీరామ పట్టాభిషేకానికి అంతరాయం కలిగించాలి” అని కోరారు. ఆ కారణంగా మంథర కైకేయికి దుర్బోధ చేయడం, దశరథుడిచ్చిన వరాలు గుర్తుచేసి, వాటిని కోరుకోమని చెప్పడం. ఆ రెండు వరాలు భరతుని పట్టాభిషేకం, శ్రీ రాముని వనవాసానికి పంపడం అని మంథరే కైకేయికి తెలియజేస్తుంది. రాముడిని వనవాసానికి వెళ్ళమని కైకేయి ఆదేశిస్తుంది. రాముడు వనవాసానికి వెళ్తాడు. దశరథుని మరణానంతరం, భరతుడు శ్రీరాముని పాదుకలను స్వీకరించిన తరువాత కైకేయి రామునితో “శ్రీరామా!ఏదోమాయ నన్ను ఆవహించింది. దాని వల్లనే రాజ్యాభిషేకానికి భంగం కలిగించాను. నన్ను క్షమించు. నీవు శ్రీ మహా విష్ణువే, మానవ రూపంలో జన్మించావు” అని అంటుంది. దీనిని బట్టి కైకేయి గొప్ప జ్ఞాని అని తెలుస్తుంది.

4. రంగనాథ రామాయణము – కైకేయి

గోనబుద్ధారెడ్డి రంగనాథరామాయణములో మంథర శ్రీరామునిపై పగ, ప్రతీకారమును పెంచుకోవడానికి ఒక కారణాన్ని కల్పించాడు.

"పనివడి రాముడు బాల్యంబునందు
దన కాలు విఱిచిన తప్పు సాధింప
ఇది నాకు తఱియని యిచ్ఛ చింతించి
యది వచ్చి కైకతో నంతయు జెప్ప" 
(రంగనాథ రామాయణము- పుట.77)

రాముడు బాలుడిగా ఉన్నపుడు తనకాలు విఱిచాడు కాబట్టి, మంథర రామునిపై పగ, ప్రతీకారాన్ని పెంచుక్నుదనీ చెప్పడం గోన బుద్ధారెడ్డి కథ రక్తి కట్టడానికి చేసిన కల్పన చక్కగా ఉంది.
శ్రీ రాముని పట్టాభిషేకాన్ని ఓర్వలేని మంథర కైకేయికి దుర్బోధ చేసి కైకేయి మనసు మార్చుతుంది.

తన్ను మాలిన యట్టి ధర్మంబుగలదె
కన్నుబోయెడినట్టి కాటుకగలదె" (రంగనాథ రామాయణము. పుట. 78)

మంథర వ్యూహమిది.

"కలదుపాయంబిది కార్యంబునకును
వన దుర్గముల రాము వసియింప బనుపు
పనివడి భరతుని పట్టంబుగట్టు" (రంగనాథ రామాయణము. పుట 78)

అని మంథర కైకేయికి ఉచిత సలహా ఇవ్వడం, కైకేయి పుత్ర వ్యామోహంతో అలాగే చేయడం జరుగుతుంది. కైకేయి కోపగృహమునకేగడం, దశరథుని రెండు వరాలడగడం. అవి విని దశరథుడు మూర్ఛిలి పడిపోవడం. కైక తన వరముల గురించి రామునికి చెప్పడం. దశరథుడు వరములీయకపోయినా, రాముడు కైకేయి కోరికననుసరించి అడవికి పోవడం ఈ రామాయణములో చూస్తాం. కైకేయి సహజంగా మంచిదే అయినా మంథర దుర్బోధ వలన తన మనసు మారిందని కవి ఉద్దేశం.

5. భాస్కర రామాయణము – కైకేయి

భాస్కర రామాయణములో కూడా రంగనాథ రామాయణములోవలెనే

"కైకేయి పరిచారికయగు మంథరయనునది యొక్క సౌధంబెక్కి చూచి యిది రామచంద్రుని పట్టాభిషేక మహాత్సవము గాబోలు దీనికి విఘ్నంబు గావింప వలయునని విచారించి తొల్లి కౌసల్యా తనయు చేతందనకు నైన చరణతాడన భంగంబు వైర కారణంబుగా గొని....." (భాస్కర రామాయణము. పుట. 78)

కైకేయికి దుర్భోధ చేస్తుంది. కైకేయికి రెండు వరాలు కోరుకోమని చెప్పింది కూడా మంథరయే.

6. మొల్ల రామాయణము-కైకేయి

మొల్ల రామాయణములో మంథర దుర్బోధ లేదు. కారణము ఇది సంక్షిప్త రామాయణము కావున చాలా కథాంశాలను మొల్ల విడిచి పెట్టి ఉండవచ్చు. లేక మొల్ల కూడా ఒక మహిళ కావున ఒక మహిళ మరొక మహిళకి విద్వేషాన్ని నింపడం సరియైనది కాదని భావించవచ్చు. మొల్ల రామాయణము ప్రకారం భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసము కైకేయి వ్యూహమే కాని అన్యులది కాదు.

"ఆ రాత్రి రాజశేఖరుని చిత్తంబు వచ్చునట్టుగా మెలంగి, యాతడు దన్ను మెచ్చుటెఱిoగి కైక యిట్లనియె" (మొల్ల రామాయణము. పుట. 79)

వసుమ తీశనాకు వరమిచ్చి తప్పుట
తగవు గాదు మీకు తలపులోన
మఱచినారదేమొ, మన్నించి తొల్లింటి
యీవు లీయ వలయు నీక్షణంబు" (మొల్ల రామాయణము. పుట. 79)

జననాథ నాకు మారుని
వినుడీ పట్టంబు గట్టి వేవేగను, రా
ముని మునిగా ననుపుడు మఱి
వనమున బదునాలుగేండ్లు వర్తింపంగన్ (మొల్ల రామాయణము. పుట79)

కైకేయి వ్యూహంలో భాగంగా ఆ రాత్రి దశరథునికి నచ్చినట్లుగా మెలగి, అతడు సంతోషంగా ఉండటం చూపి, అదే అదను అనుకొని వరాలు కోరుకున్నట్లుగా ఉంది. మొల్ల కైకేయి చతురత, సమయస్ఫూర్తి, తెలివికల దానిగా కన్పిస్తుంది.

7. రామాభ్యుదయము – కైకేయి

రామాభ్యుదయములో అయ్యలరాజు రామభద్రకవి కైకేయి వరములు కోరి, రాముని అడవులకు పంపిన విషయము అత్యంత సంక్షిప్తముగా నున్నది.

“రాముంబట్టము గట్టగా దొడరు వార్తల్ నుబ్బినం గైకయీ
నామస్త్రీ పతి పూర్వదత్త వర విఘ్నంబాచరింపన్ సతీ
సౌమిత్రుల్ దను గొల్వగానలకు గౌసల్యాదశస్యంద నా
జ్ఞా మాత్రంబు ధరించి యామి హిర వంశస్వామి యేగెన్ ధృతిన్ (రామాభ్యుదయము. పుట. 74)

8. శ్రీ మద్రామాయణ కల్పవృక్షము – కైకేయి

శ్రీ మద్రామాయణ కల్పవృక్షములోని విశ్వనాథ కైకేయి దూరదృష్టి కలదై, రాక్షస సంహారము కొరకే రామావతారమని తెలిసిన వ్యక్తిగా కన్పిస్తుంది. బాలకాండము నుండి యుద్ధకాండ వరకు కైకేయి శ్రీరాముని ధర్మకార్య నిర్వహణమున వెనుక నుండి నడిపించే వ్యక్తిగా కన్పిస్తుంది. వాల్మీకి రామాయణమున చూపించిన దానికి భిన్నముగా, ఉదాత్తముగా కైకేయి పాత్ర దర్శనమిస్తుంది.

బాల రామునికి తన పినతల్లి అయిన కైకేయి అంటే అపరిమితమైన ఇష్టం. కైకేయికి కూడా భరతుని మీద కన్న రాముని పైననే మక్కువ ఎక్కువ.

“ఎవ్వరు పిల్చినన్ ప్రభువె యేగడు కైకయి వద్ద నుండినన్” (శ్రీ మద్రామాయణ కల్పవృక్షము, బాల- అవతార - పుట. 82 ) రాముడు కైక దగ్గర నుండి ఎవ్వరు పిల్చినా వెళ్ళడు. కైక అంటే అంత ఇష్టం.

“కాళ్ళు వచ్చిన దాదిగ కైక కొఱకు
పరువు లెత్తును శ్రీరామ భద్రమూర్తి
నిద్రమేల్కొన్నదిగ రామ భద్రు కొఱకు
నంగ లార్చుచు జను గేకయాత్మ జాత” (శ్రీ మద్రామాయణ కల్పవృక్షము. బాల. అవతార. పుట. 82)

నిద్ర మేల్కొన్నప్పటి నుండి రాముని కొఱకు ఎదురు చూసేంత ప్రేమ కైకేయిది. అంతేకాదు రాముడు కన్పడకపోతే ఒక్కక్షణము కూడా భరించలేని దానిగా విశ్వనాథగారు కైకేయిని చిత్రించారు.

దాగుడు మూత లాడుదురు తానునుకైకయు రామచంద్రు లె
చ్చో గనిపింపకుండ జనుచో వెనువెంటనె పోవు లక్ష్మణు౦
డాగగరాని వేగమున నందెల సవ్వడి మందగించుచున్
బోగల రాముకన్పడమి మూర్తము నోర్వని తల్లి కుందగన్ (శ్రీ.రా.క. బాల- అవతార. పుట. 82)

రోజంతా పినతల్లి కొడుకులు ఆడుకుంటూ ఉంటారు. ఒక్క ముహూర్త కాలము కూడా రాముని విడిచి కైకేయి బ్రతుక లేదు. వారి మధ్య గాఢానుబంధము అటువంటిదని కవి భావం.

శ్రీరామావతారము రాక్షస సంహారానికేనని తెలిసిన జ్ఞానిగా మనకు కైకేయి కల్పవృక్షములో కన్పిస్తుంది. అందుకే బాలరామునికి కైకేయి దగ్గరుండి మరీ యుద్ధ విద్యలు నేర్పిస్తుంది. ధనుర్విద్యలోని మెళకులన్నీ నూరి పోస్తుంది.

పటు బాహాపటు మూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సే
యుటయున్ గైకయివచ్చి చూచుటయు నోహోతండ్రి! యాబాణ మి
ట్టటు నట్టిట్లని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప జె
ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికిన్ (శ్రీ.రా.క. బాల. అవ. పుట. 170)

బాల రామునికి యుద్ధ విద్యలు నేర్పిస్తుందంటే భవిష్యత్తులో రాముని అడవికి పంపించి, రాక్షస సంహారం చేయించాలనే.

మంథరకు రామునిపై పగ ఏర్పడుటకు కారణమేమిటో బాలకాండలోనే చెప్పబడింది. మంథరను ఆటపట్టించడానికి బాలరాముడు మంథరపై బాణాలు ప్రయోగించేవాడు. అవి మంథరకు దగ్గరవరకు వచ్చి వైదొలగి పోయేవి. కాని మంథర చాలా భయపడేది. అదే భవిష్యత్తులో రామునిపై పగ పెంచుకోవ డానికి కారణమైనది.

శ్రీరామునికి తెల్లవారితే యౌవ రాజ్య పట్టాభిషేకము. ఆ రాత్రి దేవతలు కన్పడి రాముని పిల్చినట్లు అనిపించింది.

దేవతలై రమా మదవతీ వ్రతతీ మధుకృత్కుమారకా
దైవతలోక కార్యచరిత వ్రత! నిత్య దశావతార ధా
రావిదితాఖి లోత్తమ పురాణ కథా కమనీయమూర్తి ! దే
వావలి కంటకాపనయనా! యని పిల్చినయట్లుతోచినన్. (శ్రీ.రా.క. అయో. పట్టాభిషేక. పుట.9)

అంతేకాదు తాను విష్ణువు అవతారమన్న విషయము స్ఫురించినది. రాక్షస సంహారానికే దేవతల కోరిక మేరకు భువిపై రాముడిగా అవతరించాడని అర్థమయింది. “.... రేపు మొదలుగ బద్ధవారీగజేంద్రమట్లు కదలగ వీలు లేదను కొనెదను” పట్టాభిషేకమైతే బంధింపబడిన ఏనుగు వలె కదలడానికి వీలు లేకుండా అవుతుందని భావించెను. ఆవిషయాన్ని రాముడు కైకకు విన్నవించాడు.

"నేను రాజ్యమ్ము సేయుట నిక్కువముగ
లేదు వేల్పుల కిష్టమ్ము లేదనంగ
రామ చంద్రుని తీక్షణ నేత్రములు చూచి
తాను గైకేయి సౌధములోనికేగె” (శ్రీ.రా.క. అయోధ్య. అభిషేక. పుట. 10)

మంథర రాముని పట్టాభిషేక సంబరాలను చూచి, రామునిపై పెంచుకొన్న పగ కారణంగా ఎలాగైనా పట్టాభిషేకాన్ని ఆపాలని, కైకేయికి దుర్బోధ చేసింది. కైకేయికి తెలుసు రాముడు అరణ్య వాసము చేస్తేనే రామావతార ఉద్దేశం నెరవేరుతుందనీ, రావణాది రాక్షస సంహారం జరుతుందని, పట్టాభిషేకమే జరిగితే అందరి రాజులలాగానే రాముడు కూడా ఒక మంచిరాజులాగానే మిగిలిపోతాడు. కావున మంథర దుర్బోధను, తనకిచ్చిన రెండు వరాలను మిషగా చూపించి రాముడు అడవికి పోయేలాగా చేసింది. తరువాత భరతుడు మేనమామ ఇంటినుండి వచ్చిన తరువాత తాను అరణ్యవాసము చేస్తాననీ రాముణ్ణి తిరిగి రాజ్యాభిషిక్తుని చేయుటకు అంగీకరించమని కైకేయిని కోరితే అప్పుడు కైకేయి నీవు అరణ్యమునకు వెళ్ళి ఏంచేస్తావని అంటుంది. దీనిని బట్టి కైకేయి జ్ఞాని అని రామావతార పరమార్థమును ఎఱిగినదని తెలుస్తుంది.
ఖరదూషణాది రాక్షసులతో యుద్ధం చేయునపుడు, కుంభకర్ణునితల రావణ సౌధ గోపురం మీద పడేటట్లు బాణం సంధించడంలోనూ, రావణుడు ప్రయోగించిన సౌరాస్త్ర విఘటనంలోనూ ఇంకా చాలా సందర్భాలలో పినతల్లి కైక తనకు నేర్పిన విలువిద్యా పాటవాన్ని రాముడు గుర్తు చేసుకుంటాడు.

యుద్ధకాండ, ఉపసంహరణ ఖండములో "రావణసంహారంలో తక్కిన వారిదేమున్నది? పంపిన కైకదీ, చంపించిన తనదీ కదా ప్రాముఖ్యం?" అంటుంది సీత. దీనిని బట్టి రాక్షస సంహారానికి రాముని పంపించడంలో కైక పాత్ర ఎంతో విశ్వనాథ సత్యనారాయణ గారు తన శ్రీమద్రామాయణ కల్పవృక్షములో తెలియజేశారు.

9. ఉపసంహారం

  • "నానృషిః కురుతే కావ్యమ్" అన్నట్లు మహా కావ్య నిర్మాణమొక తపస్సు. ఋషి అయిన వాడికే అది సాధ్యం. ఒక మహా కవి మహాకావ్య నిర్మాణము చేయునపుడు దృష్టియందుంచు కొనునవి ఒకటి కావ్య ప్రయోజనము, రెండు కావ్య వస్తువు, మూడు కావ్య ప్రక్రియ. 
  • కావ్య ప్రయోజనము నెరవేరవలెనన్న తదనుగుణంగా కావ్యవస్తువు(కథ)ఉండవలెను. కథ సహృదయునికి హృదయంగమం కావలెను. విశ్వనాథ "నాసకలోహ వైభవ సనాథము నాథ కథన్ రచించెదన్” అని చెప్పి మరీ ఈ కల్పవృక్షాన్ని సృజించాడు. 
  • విశ్వనాథుని పరమరమణీయములగు ఊహలు మనకు దర్శనమిస్తాయి. ఈ కవి కథను మరింత విస్తారముగా, అనల్పశిల్ప చాతురీ విభవ మేర్పడగా రచించారు. 
  • ఇంతకు ముందు ఏ తెలుగు కవీ రచించని రీతిలో విశ్వనాథ సత్యనారాయణ గారు. కైకేయి పాత్ర తీర్చిదిద్దినారనటం అతిశయోక్తి కాదు. 
  • ప్రధానమైన రామకథకు ఉపబలకంగా కైకేయి పాత్రను తీర్చిదిద్దిన విధానము భవిషత్తరాల కవులకు మార్గ దర్శకము.

10. ఉపయుక్తగ్రంథసూచి

  1. బుద్ధభూపతి, గోన, 1989. రంగనాథ రామాయణము. హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయము
  2. భాస్కరుడు, హుళక్కి, భాస్కర రామాయణము
  3. మొల్ల, ఆతుకూరి. 2013. మొల్ల రామాయణము. విజయవాడ: ఎమెస్కో బుక్స్
  4. రామభద్రుడు, అయ్యలరాజు, 1917. రామాభ్యుదయము. చెన్నపురి: వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్
  5. వాల్మీకి, 2022. శ్రీమద్రామాయాణము (వచనము). గోరఖ్ పూర్, గీతాప్రెస్
  6. సత్యనారాయణ, విశ్వనాథ. 2006. శ్రీమద్రామాయణ కల్పవృక్షము.(అయోధ్య కాండము) విజయవాడ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
  7. సత్యనారాయణ, విశ్వనాథ.2011, శ్రీమద్రామాయణకల్పవృక్షము. (బాలకాండము). విజయవాడ : శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]