AUCHITHYAM | Volume-06 | Issue-07 | June 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. తుల్లిమల్లి సుధాకర్ కవిత్వం: సామాజికచైతన్యం
పల్లిపట్టు నాగరాజు
పరిశోధకులు, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9989400881, Email: pallipattu6@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 01.05.2025 ఎంపిక (D.O.A): 25.05.2025 ప్రచురణ (D.O.P): 01.06.2025
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో దళితచైతన్యానికి బలమైన స్వరాన్ని అందించిన కవుల్లో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ముఖ్యులు. ఆయన కవిత్వంద్వారా ప్రతిబింబించే అస్తిత్వవాదదృక్పథం, దళితులపై అణచివేత, సామాజికవిమర్శలు, చైతన్య ధోరణులు వంటి అంశాలను విశ్లేషించడంతో పాటు కవిత్వంలో వారి భాషను, అభివ్యక్తిని పరిచయం చేయడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. ఈ పరిశోధన దళితసాహిత్య-చారిత్రకనేపథ్యం, సుదీర్ఘ సాంఘిక సంఘర్షణల నేపథ్యంలో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ రచనలు ఎలా రూపుదిద్దుకున్నాయో వివరించేందుకు, సాహిత్య విమర్శనాత్మక విశ్లేషణ (Textual Analysis) పద్ధతిని అనుసరించింది. కవిత్వగ్రంథాల అధ్యయనం ఆధారంగా విశ్లేషణ కొనసాగింది. విల్సన్ సుధాకర్ రచనలపై ఇప్పటివరకు పరిమితస్థాయిలో మాత్రమే పరిశోధన జరగడం గమనార్హం. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ కవిత్వంపై కొన్ని విమర్శావ్యాసాలు వెలువడినప్పటికీ, ఈ వ్యాసం ఎంపిక చేసిన కవితలను చర్చించి, సమగ్రతతో ఆయా రచనల ప్రాముఖ్యతను విశదీకరించేందుకు యత్నించింది. ప్రస్తుత పరిశోధన వ్యాసరచనకు సుధాకర్ రచనలైన దళితవ్యాకరణం, మాకూ ఒక భాష కావాలి, పోరాటపద్యం వంటి రచనలు ప్రాథమిక ఆధారాలు. సుధాకర్ రచనల సేకరణ, కవిత్వ-భాషావిశ్లేషణ, సామాజికస్థితిగతుల నేపథ్యంలో కవిత్వాన్వయం, సమకాలీన దళితకవులతో పోలిక, పరిశోధన ఫలితాల సమీకరణ వంటివి ఈ వ్యాసరచనా ప్రణాళిక. ఈ పరిశోధనలో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ కవిత్వం దళిత జీవిత అనుభవాలను ఘనంగా ప్రతిబింబించిందని నిరూపించబడింది. ఆయన రచనల్లో ప్రతిఘటనతో కూడిన ధిక్కార స్వరం, సమాజానికి ఎదురుగా నిలిచి మాట్లాడే ధైర్యం, అంబేడ్కర్ భావజాలం ప్రభావం స్పష్టంగా దర్శించబడ్డాయి. కవి రచనలు కేవలం విమర్శాత్మకంగా కాక, మార్పు కోసం స్పష్టమైన మార్గదర్శకాలను సూచించేవిగా ఉన్నాయని ఈ వ్యాసం తేటతెల్లం చేసింది. మొత్తంగా, ఈ వ్యాసం తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ దళిత కవిత్వంలో ప్రత్యేక స్థానాన్ని పొందినవాడని స్థిరీకరించడమే కాక, భవిష్యత్ పరిశోధనలకు కొత్త దిశను చూపిస్తుంది.
Keywords: విల్సన్ సుధాకర్, కవిత్వం, సామాజికచైతన్యం, తెలుగు, అస్తిత్వవాదం, దళితవాదం.
1. ప్రవేశిక
తెలుగు సాహిత్యంలో సమాజిక చైతన్యం కోసం కృషి చేసిన ఉన్నతమైంది. అందునా వచన కవిత్వంలో వచ్చిన అనేక ఆధునికమైన పోకడలు, ధోరణులు, వాదాలు, అవి అందించిన ప్రేరణ ద్వారా ఆధునిక తెలుగు సమాజం ఎంతో చైతన్యాన్ని పొందింది అని చెప్పవచ్చు. అటువంటి అంశాలలో దళిత అస్తిత్వ వాద కవిత్వం ప్రత్యేకమైంది. ఆ సాహిత్యోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్న వారిలో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ఒకరు. తెలుగు సాహిత్యంలో ఈ కవి కవిత్వం విలక్షణమైంది. తెలుగునాట ఒక కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడిన దళిత అస్తిత్వవాద కవిత్వపు ప్రేరణతో, కారంచేడు చుండూరు వంటి పోరాటాలు అందించిన పోరాట చైతన్యంతో కవిత్వం రాస్తున్న సమకాలీన కవితా గొంతుక విల్సన్ సుధాకర్. వారి కవిత్వాన్ని చదువుకోవాల్సిన అవసరం వర్తమాన సమాజానికి ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిశోధన వ్యాసరచనకు సుధాకర్ రచనలైన దళితవ్యాకరణం, మాకూ ఒక భాష కావాలి, పోరాటపద్యం వంటి రచనలు ప్రాథమిక ఆధారాలు.
2. తెలుగు సాహిత్యం - అస్తిత్వవాద ఉద్యమాలు- దళితవాదం
సాహిత్యంలో నంగితనం ఉండకూడదు. సత్యాన్ని మాట్లాడటానికి, వాస్తవాలను చర్చించడానికి ముసుగులు అవసరం లేదు. అణచివేతకు గురవుతున్న ప్రజలు, హక్కులు కాలరాయబడుతున్న మనుషుల పక్షం గొంతు విప్పుతున్నపుడు నిర్భయంగా మాట్లాడటం అవసరం. నిక్కచ్చిగా మాట్లాడటం అవసరం. తెలుగు సాహిత్యంలో ఈ పునాదుల మీద వచ్చిందే అస్తిత్వవాద సాహిత్యం. అస్తిత్వ వాద చైతన్యంతో బలంగా మాట్లాడింది అస్తిత్వవాద కవిత్వం. దళితుల గురించే దళితులే మాట్లాడటం, రాయడం, పాడటం అనే సామాజిక చైతన్యంతో ముందుకు వచ్చిందే దళిత అస్తిత్వ వాద సాహిత్యం. జి. లక్ష్మీ నరసయ్య త్రిపురనేని శ్రీనివాసుల ఆధ్వర్యంలో పదునెక్కినపాట, చిక్కనవుతున్నపాట వంటి దళిత కవితాసంకలనాలు వెలువడ్డాయి. ఒకవైపు సామాజిక పోరాటాలు, మరోవైపు దళిత సాహిత్య ఉద్యమ చేతన వెల్లివిరిసిన కాలం అది. మద్దూరు నగేష్ బాబు, ఎండ్లూరి సుధాకర్, కలేకూరి ప్రసాద్, నాగప్ప సుందర్రాజు, కత్తి పద్మారావు, చల్లపల్లి స్వరూపారాణి, శిఖా మణి, సతీష్ చందర్ వంటి మరికొందరు కవులు విస్తృతంగా కవిత్వం రాస్తూ తమ సామాజిక వర్గ ప్రజల్ని చైతన్య పరిచారు. తరువాతి కాలంలో ఆ వేడి వాడి కొంత చల్లబడినా ఆ కొనసాగింపును అందుకుని కొనసాగుతున్న కొద్దిమంది కవుల్లో విల్సన్ సుధాకర్ ఒకరు.
3. విల్సన్ సుధాకర్ కవిత్వం - దళిత చైతన్యం
దళిత సమాజం ఎదుర్కొంటున్న వివక్ష అణచివేతను, యుగయుగాలుగా సాగిన, సాగుతున్న దోపిడిని ఎద్దేవా చేస్తూ నడిచిన దళిత కవిత్వం తనదైన ముద్రను ఏర్పరుచుకున్నది. భాషలోనూ, వ్యక్తీకరణలోనూ తనదైన నుడిని, అభివ్యక్తిని సొంతం చేసుకోవడంలో మిగిలిన అస్తిత్వవాదాల సాహిత్వం కంటే దళిత సాహిత్యం, అందులో ప్రధానమైన పాయగా సాగిన దళితకవిత్వం కొంత ప్రత్యేకతను నిలుపుకుంది. దళిత అస్తిత్వ ఉద్యమ చేతనతో బలం పుంజుకున్న దళిత సాహిత్యం తరువాత కాలంలో కొంత నెమ్మదించినా దళిత కవిత్వంగా మాత్రం చైతన్యవంతంగా కొనసాగుతూనే ఉంది. దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, దాష్టీకాలకు దళితకవులు, ఉద్యమకారులు తమదైన రీతిలో గొంతు వినిపిస్తున్నారు. అటువంటి బలమైన గొంతుకల్లో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ప్రతిభావంతమైన కవి మాత్రమే కాదు ప్రభావవంతమైన కవి కూడా. దళిత అస్తిత్వాన్ని, దళిత ఉద్యమ చైతన్యాన్ని శక్తివంతంగా కవిత్వంలో వినిపిస్తున్న కవి హృదయాన్ని అర్థం చేసుకుంటే, " 'మాకిప్పుడు కావలసింది నెత్తుటి రొఖ్కం కాదు; మాకేం కావాలో కోరుకునే నిర్భయపు గొంతుక; కొత్తరాజ్యంగం-కొత్తదేశం-కొత్తభూమి-కొత్త ఆకాశం' అని ఎండ్లూరి సుధాకర్ దళిత జాతి పక్షాన ముందువరుసలో నిలబడి పెత్తందారీ వ్యవస్థను నిలదీసి కూడా చాలా కాలమైంది. ఈ కార్య సాధనను వేగవంతం చేయాలంటే ఏం కావాలో గుర్తించిన కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్"1 అని ప్రసిద్ధ విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ తూనిక స్పష్టమవుతుంది.
దళిత కవిత్వంలో ఈ కవి పూలే, అంబేడ్కర్ ఆలోచనల తాత్వికనేపథ్యం నుంచి చర్చిస్తున్నాడు. ఆ అవగాహనలోంచి కవిత్వం రాస్తున్నాడు. దళిత జీవన నేపథ్యం దళిత క్రైస్తవ సాంస్కృతిక నేపథ్యపు పునాదులు మీద నిలబడి దళిత చైతన్యాన్ని కాంక్షిస్తున్నాడు. వాక్యం వాక్యం పదం పదం దళిత అభ్యుదయాన్ని దట్టించి, జాతి అభ్యున్నతిని కోరుకుంటున్న కవి స్పష్టతకి అద్దం పట్టే కవితలు వీరి రచనల్లో మనం గమనిస్తాం.
"నువ్వే లేకపోతే....
చెప్పులు కుట్టుకునే వాళ్ళు
పార్లమెంటు మెట్లు కూడా ఎక్కేవాళ్ళు కాదు
జందెమేసుకున్న విశ్వవిద్యాలయాలు
మాకింత చోటిస్తూ వణికిచచ్చేవి కావు
మలమూత్రాల బక్కెట్లు
మా తలమీద నుంచి ఎప్పటికీ దిగేవి కావు
ఒక నారాయణన్కు దేశ కిరీటమే దక్కేది కాదు
ఈ సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యానికి
ఎడంచేత్తో రాజ్యాంగ రాసి పారేసి
అవలీలగా దిశానిర్దేశం చేసిపారేశావు గానీ" అని 'నువ్వే లేకపోతే..'2
కవితలో భారత జాతిపిత, బహుజన సంక్షేమాన్ని కాంక్షించి జీవితాన్ని దారపోసిన వైతాళికుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషిని కీర్తిస్తాడు. ఇది మొత్తం భారతీయ సమాజంలోని అణచవేయబడిన, అణగారిన వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిన చరిత్ర. అందుకోవాల్సిన స్పూర్తి.
సామాజిక వాస్తవికతను, సమకాలీన ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే సుధాకర్ కవిత్వం కాస్త వ్యంగ్యం మేళవించి, సంఘటనలతో, చారిత్రకాంశాలను పరిచయం చేస్తూ శ్రద్ధతో చదివిస్తుంది. ఆ క్రమంలోనే కవి మాట్లాడుతున్న సమస్య తాలూకా, సందర్భం తాలూకా అవగాహన మనల్ని వెంటాడుతూ వుంటుంది. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఈ కవి సందర్శించిన వివిధ ప్రదేశాలు, అక్కడి ప్రజా జీవితం,సామాజిక పోరాటాలు వంటి ఎన్నో అంశాల్ని పరిచయం చేశాడు. ఆ రకంగా వీరి కవిత్వం సామాజిక వాస్తవికతను చూపెడుతుంది.
కవిగా విల్సన్ సుధాకర్ ఇప్పటిదాకా 'దళిత వ్యాకరణం', 'మాకూ ఒక భాష కావాలి', 'పోరాట పద్యం' అను మూడు కవితా సంపుటాలను వెలువరించారు.
"దళిత వ్యాకరణం తెలుసుకోవాలంటే
లాల్ సలాం కూ జైభీం కూ
తేడా తెలుసుకోవాలి కదా"
అంటున్న ఈ కవి దృక్పథానికి అద్దంపట్టే వాక్యాల్లోకి ప్రవేశిస్తే..
"సరిహద్దుల్లో ఉచ్చపోస్తే
పొరుగు దేశమంతా కొట్టుకుపోతుందనే
బాలీవుడ్ సినిమా డైలాగుల దేశభక్తి లాగా"
అంటూ బోలో స్వతంత్ర భారత్ కీ జై3 కవితను చదువుకుంటాం.
"ఒక జాతికన్నా
మరొకజాతి గొప్పదనేవాళ్ళూ
ఒకళ్ళకన్నా ఇంకొకళ్ళకి ప్రతిభ ఉందనేవాళ్ళూ
చరిత్రలో మిగిలిపోయిన నాజీలు…"
అంటూ జాతిని విద్వేషాలలోకి నెడుతున్న కుట్రల్ని నగ్నంగా నిలదీస్తాడు 'విరిగిన అస్థిపంజరాలకు వెన్నెముకలు'4 కవితలో. నిజాన్ని మాట్లాడం, నిర్భయంగా మాట్లాడటం, నిక్కచ్చిగా మాట్లాడటం దళితకవిత్వపు స్వాభావికతగా మనం గ్రహిస్తే తుల్లిమల్లి కవిత్వంలో అది స్పష్టంగా మనం గుర్తిస్తాం. దళిత కవిత్వంలో ధిక్కారంతోపాటు సూటిదనం స్పష్టంగా మాట్లాడటం ఒక లక్షణంగా చెప్పవచ్చు. కనుకనే -
"మాకిప్పుడొక భాష కావాలి
అది మా హృదయ ఘోష కావాలి
కన్న బిడ్డల్నే అస్పృశ్యులంటూ
చేతులతో మలాన్నెత్తించిన భాష
సజీవ దహనం కావాలి....."5
అని పదునైన వాక్యాలతో దళిత గుండె ఘోషను ఆవిష్కరిస్తాడు. ఒక ప్రత్యామ్నాయ భాషా సాహిత్యాల ఆవశ్యకతను నొక్కి మరీ చెబుతాడు.
విల్సన్ సుధాకర్ కవి కేవలం దళిత సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే కాక సమకాలీన సామాజిక వాస్తవికతను మన ముందు నిలబెడతాడు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వంటి అత్యాధునిక పోకడలు అట్టడుగు ప్రజల్ని, శ్రామిక వర్గాల్ని ఏవిధంగా దోపిడీ చేస్తున్నాయో చెబుతాడు.
పెట్టుబడిదారీ శక్తులు, కార్పొరేట్ కుట్రలు, భాషాసంస్కృతులను నాశనంచేస్తూ క్రమంగా పరాయీకరణకు గురిచేస్తున్న వైఖరులని నిరసిస్తాడు. ఇవన్నీ సామాన్యప్రజల్ని ఏవిధంగా వ్యూహాత్మకంగా కబళిస్తున్నాయో చర్చిస్తాడు. వీటన్నింటి పట్ల చైతన్యంతో పోరాడాల్సిన ఆవశ్యకతను వివరిస్తాడు.
"భూమి నా భావావేశం...
భూమి నా అభిరుచి...
భూమే నా స్వాతంత్ర్యం...
భూమే నా మోక్షమని తెలిసీ
నా పచ్చగడ్డిని తగలబెట్టి
నా పచ్చిపులుసును నన్నే తిననివ్వనప్పుడు
నీ ముద్రారాక్షస విధానాలు నాకు సమస్య
నీ సంస్కృతీ నాగరికతలు నాకు సమస్య
నీ పాలన పీడన ఏకపక్షంగా నాకు సమస్య
నిద్రరాని గ్రామాల్లో నా ఉనికే నాకు సమస్య
నువ్వు చెప్పుకునే దేశభక్తి నాకో పెద్ద సమస్య”6
ఇది ఈ కవి దృష్టి. కవిత్వంలో దృక్పథం. అవగాహన. సమాజం పట్ల సమాజంలోని అట్టడుగు వర్గాల పట్ల, వర్గాలలోని హక్కుల హననానికి గురవుతున్న అమాయక ప్రజలపట్ల, శ్రమజీవుల పట్ల, రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, స్త్రీల పట్ల ఎంతో నిబద్ధతతో కవితా గొంతుకై కాపుగస్తున్న కవి విల్సన్ సుధాకర్.
4. విల్సన్ సుధాకర్ కవిత్వం - భాష
దళితవాదసాహిత్య ప్రేరణతో సమకాలీన దళిత సమాజపు గుండె చప్పున్ని వినిపిస్తున్న సుధాకర్ కవిత్వపు భాష విషయంలో సాంప్రదాయ, శిష్ట వ్యవహారాలను వదిలిపెట్టలేదు. దళిత వాద కవులు ప్రకటించుకున్న దళిత భాష వీరి కవిత్వంలో దళిత కుటుంబాలకు కొంత దూరంలో ఉండిపోయింది. అట్టడుగు కుటుంబాల సామాన్య జనం పక్షం మాట్లాడినా సంపన్న కుటుంబాల, విద్యావంతుల భాషలో కవిత్వం ఉంది. ఇది కవి వృత్తి రీత్యా జీవిస్తున్న వాతావరణం ప్రభావం కావచ్చు. అయితే అభివ్యక్తిలో వ్యంగ్యం ఆసక్తిగా చదివిస్తుంది. ఆలోచింపజేస్తుంది.
ఉదాహరణకు "ఉటోపియాలో షరియట్ చట్టాలు, ప్రయిజ్ ది లార్డ్, గుడ్ సమరిటన్, అపార్తైడ్, లా ఆఫ్ డిమాండ్,” వంటి అనేక మాటలు అలవోకగా కవిత్వంలో చేరిపోతాయి. వీరి ప్రాపంచిక అవగాహనను పట్టి చూపుతాయి. కవిత్వంలో తన వృత్తి రీత్యా సందర్శించిన ప్రదేశాలు, కుటుంబ నేపథ్యపు క్రైస్తవ సాంప్రదాయ జీవితం, పరిభాష అలవోకగా చేరిపోవడం వలన పాఠకులు వాటిని అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయినా వస్తువు ఎంపికలో దృక్పథంతో నిలబడటంలో కవి ఖచ్చితత్వం మాత్రం మెచ్చుకోదగింది.
5. ఉపసంహారం
- తనదైన దృక్పథంతో, అవగాహనతో కవిత్వం రాస్తూ తమ జాతి చైతన్యం కోసం కృషి చేస్తున్న కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ కవిత్వం గురించి వర్తమాన సమాజం తెలిసుకోవాల్సిన ఆవశ్యకతను చర్చించడమైనది.
- రకరకాల రాజకీయప్రలోభాలు పెరిగి జాతి ఐక్యత విచ్చినమవుతున్న ఈ సందర్భంలో అట్టడుగు వర్గాల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పడమైనది.
- వర్తమాన సమాజాన్ని చైతన్యం వైపు నడిపిస్తున్న కవి విల్సన్ సుధాకర్ కవిత్వం గురించి, భాష గురించి చర్చించుకోవడం, మాట్లాడుకోవడమైనది.
6. సూచికలు
- మాకూ ఒక భాష కావాలి, పుట. 20
- దళిత వ్యాకరణం, పుట. 1
- దళిత వ్యాకరణం, పుట. 120
- దళిత వ్యాకరణం, పుట. 112
- మాకూ ఒక భాష కావాలి, పుటలు. 152,153
- పోరాట పద్యం, పుట. 34
7. ఉపయుక్తగ్రంథసూచి
- ప్రసాదమూర్తి. ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం. బహుజన కెరటాలు ప్రచురణ, 2016
- ప్రసాద్, కలేకూరి. పిడికెడు ఆత్మగౌరవం కోసం. బహుజన కెరటాలు ప్రచురణలు, 2012
- లక్ష్మీనరసయ్య, జి., చిక్కనవుతున్న పాట. కవిత్వం ప్రచురణలు, 1995
- విల్సన్ సుధాకర్, తుల్లిమల్లి, దళిత వ్యాకరణం. విజయభారతి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2007
- పైదే, పోరాటపద్యం. శ్రీశ్రీప్రింటర్స్, విజయవాడ, 2025
- పైదే, మాకూ ఒక భాష కావాలి. విజయ భారతి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2013
- సత్యనారాయణ, ఎస్వీ, దళితవాద వివాదాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2000
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

