AUCHITHYAM | Volume-06 | Issue-07 | June 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. తరిగొండ నృసింహశతకం: నైతికబోధ - విభిన్నాంశాలు
ఆచార్య డా. ఎన్. ఈశ్వరరెడ్డి
ఆచార్యులు, తెలుగుశాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం,
వేమన పురం, వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8328296952, Email: eswaryvu@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 13.05.2025 ఎంపిక (D.O.A): 30.05.2025 ప్రచురణ (D.O.P): 01.06.2025
వ్యాససంగ్రహం:
శ్రీవేంకటేశ్వరస్వామిని కలియుగ వైకుంఠంగా భావించి రచనలు చేసిన గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ. తెలుగులో తొలివాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడుగా, సంకీర్తనాచార్యుడుగా కీర్తినందుకున్న తాళ్లపాక అన్నమయ్య తర్వాత వాసిలోను రాశిలోనూ వెంకటేశ్వరుని ఆరాధిస్తూ రాసిన గొప్ప కవయిత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి తరిగొండ వెంగమాంబ. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు, తాళ్లపాక సుభద్ర, తాళ్లపాక చిన్నన్న తదితరులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి భక్తి పూర్వక రచనలు చేశారు. అదే దారిలో వెంగమాంబ చవులూరించే కావ్య కుసుమాలను అందించడమే కాకుండా తిరుమలేశుని వైభవాన్ని మరింత ఉన్నతం చేశారు. తరిగొండ నృసింహ శతకముతో పాటు శ్రీ వెంకటేశ్వర కృష్ణ మంజరి (స్తుతి కావ్యం) శ్రీ వేంకటాచల మాహాత్మ్యం (కావ్యం) రమా పరిణయము (ద్విపద కావ్యం) బాలకృష్ణ నాటకం (యక్షగానం) చెంచు నాటకము (యక్షగానం) భక్తి గీత సుధాలహరి (108 గేయాల యక్షగాన సంకలనం) అష్టాంగ యోగ సారము (పద్య కావ్యం) మొదలైన రచనలు ఈమె కలం నుండి జాలువారాయి. ఈమె రాసిన వాటిలో శతకాలు, యక్షగానాలు, ద్విపదలు, తత్వ సంబంధ రచనలు ఉన్నాయి. శృతి లయల సమన్వయంతో రాసిన వేదాంత గీతాలు ఈమెలోని ప్రతిభకు, ప్రక్రియా వైవిధ్యానికి ఉదాహరణలు.
Keywords: శతకం, తరిగొండ, నరసింహశతకం, భక్తి, నీతి.
1. ప్రవేశిక
తెలుగు సాహిత్యంలో శతకానికి చిరస్థానం ఉంది. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సులువుగా చెప్పడానికి శతక ప్రక్రియ ఎంతో ఉపయోగపడింది. ఏ పద్యానికి ఆ పద్యం ముక్తకం లాగా ఉంటూ సంపూర్ణ భావాన్ని వెల్లడించడం ఒక విశేషమయితే, పఠితల హృదయాలలోకి సులభంగా చేరిపోయే సామర్థ్యం శతకానికుంది. పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకం నుండి గూటం స్వామి రాసిన స్వామి శతకం దాకా కాల ధర్మాలకు అతీతంగా శతకాలు వెలువడ్డాయి, ఇంకా వెలువడుతున్నాయి. భక్తి, నీతి, అధిక్షేపం, శృంగారం, లౌకిక అంశాలతో పాటు సమకాలీన స్థితిగతులకు అడ్డం పడుతూ శతకాలు వేల సంఖ్యలో వచ్చాయి. అయినా తెలుగులో వచ్చిన శతకాల్లో భక్తి శతకాలే అధికం.
శతకం అంటే వంద అని అర్థం. ఎక్కువ మంది రచయితలు వంద దాటి రాసిన సందర్భాలు కనిపిస్తాయి. వేమన శతకానికి వస్తే... ఐదు వేలను దాటేసిన పరిస్థితులు కనిపిస్తాయి. శతకంలో మకుట ప్రాధాన్యత ఉంటుంది. అన్ని పద్యాలకు ఆఖరి పాదం కానీ, ఆఖరి పదం కానీ ఒకే రకంగా ఉండడం. " బసవా బసవా వృషాధిపా ! అని పాల్కురికి రాస్తే,'విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. సుమతీ అనే పదాన్ని బద్దెన మకుటంగా చేసుకున్నాడు. దాశరథీ! కరుణాపయోనిధీ! అని కంచర్ల గోపన్న రాస్తే, 'తరిగొండ నృసింహ! దయాపయోనిధీ ! అంటూ తరిగొండ నృసింహ శతకానికి మకుటం ఇచ్చింది వెంగమాంబ.
2. నృసింహశతక రచనాప్రయోజనం
తరిగొండ వెంగమాంబ రాసిన నరసింహ శతకానికి ఒక ప్రయోజనం ఉంది. అది పోతన భాగవత రచనా ప్రయోజనం లాంటిది. శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ అని పోతన అంటే -
"అతులితమైన మీ పదవి నంద దలంచి విశాల భక్తిచే
వితరణ గాను మీ రిపుడు వేడ్కను వాక్కుల నిచ్చినంతలో
శతకముగాను జెప్పెదను సద్గురు స్వామి కటాక్షమేర్పడన్
కుతుకము మీరగాను తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" (నృ. శ. 3)
అంటూ మోక్ష పదవి కోసం ఈ శతకం రాస్తున్నట్టు ఈ శతకాన్ని కూడా వెంకటేశ్వరుడు ప్రసాదించిన వాక్కులతోనే చెబుతున్నట్టు తన ఉద్దేశాన్ని వినయంగా చెప్పుకుంది.
"ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పక చేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ." (దాశరథీ శతకం కంచర్ల - గోపన్న పద్యం 16)
అంటున్న గోపన్న గుర్తుకొస్తాడు.
వెంగమాంబ 'స్వాతి కార్తెలో కురిసే వాన చినుకుల కోసం ముత్యపు చిప్పలు ఎదురుచూసినట్టు తన ఆత్మ ప్రభువైన వెంకటేశ్వరుడి కోసం ఎల్లప్పుడూ భక్తితో ఎదురు చూస్తాను (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 17) అని, 'నారద మునీంద్రుడు కొనియాడే చరణ ధ్వయం కలిగిన ఓ మహనీయా! నల్ల కలువలు చంద్రుణ్ణి ఆసక్తితో చూడాలనుకున్నట్టుగా, ఈ దేహంలో నిన్ను నిరంతరం దర్శించే భాగ్యం ఎప్పుడు లభిస్తుందా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నానయ్యా' (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 18) అని చెప్పుకోవడాన్ని చూడవచ్చు. ఆమె రాసిన రచనలన్నీ భక్తికి- ముక్తికి సంబంధించినవే.
3. నృసింహ శతకవైశిష్ట్యం
తరిగొండ నరసింహ శతకంలో ప్రధానంగా భక్తి, నీతి, వేదాంత, యోగవిశేషాలతో పాటు సామాజిక స్థితిగతులు కూడా కనిపిస్తాయి. దశావతారస్తుతి, వెంకటేశ్వరదర్శనభాగ్యం కోసం ఆరాటం, సంసారబంధవిముక్తి, అరిషడ్వర్గాలను జయించడం, ఇంద్రియ మొహాన్ని విడనాడడం, పరమాత్ముని చేరే మార్గంలో ప్రయాణించడం, అంత్య సమయంలో కాలుని నుండి రక్షణ పొందడం, శారీరక బ్రాంతిని వదిలించమనడం, సత్వ రజో తమో గుణాల ప్రాధాన్యం, వెంకటేశ్వర స్తుతి, నాయికా నాయక భావన, వృద్ధాప్యంలో ఎదురయ్యే అవమానాల నుండి రక్షణ, కలిమి బలిమి చేసే మోసం మొదలైన అనేక అంశాలకు తరిగొండ నరసింహ శతకం తావిచ్చింది.
4. జపతపాల తిరస్కరణ
వెన్నను చేతిలో పెట్టుకొని నెయ్యి కోసం వెతికినట్టుగా తన ఉచ్చ్వాస నిశ్వాసాలలో జపం చేస్తున్న జీవుణ్ణి గుర్తించలేక ఏవేవో చేస్తున్నారని చెప్తూ....
"వెన్నయుఁ జేతఁ బట్టుకొని వేమఱు నేయని కూయనేటికో?
పన్నుగ బొందిలోన ఘన భక్తిని జీవి జపంబు సేయఁగా,
నెన్నుచు వ్రేళ్లు సారెకును నేర్పడఁ నెప్పుడు గాఢమంత్రముల్
కొన్ని భజింపనేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 102) అంటుంది.
'వెన్న చేత బట్టి వివరము తెలియక వ్రతము కోరునట్టి యతని భంగి, తాను దైవమయ్యు దైవంబు నెతకును'అన్న వేమన మాటలు గుర్తుకొస్తాయి. వెంగమాంబ కూడా తనలో ఉన్న దైవాన్ని చూడమంటుంది. ఉచ్ఛ్వాస ద్వారా " సః "(సో), నిశ్వాస ద్వారా "హం" నీ అక్షరాలను ఉచ్చరిస్తూ నిరంతరం జపం చేసుకోవచ్చని, జపం కోసం ప్రత్యేకంగా కూర్చుని అదే పనిగా చేతివేళ్లు కదిలిస్తూ తీవ్రమైన పునఃశ్చరణ చేయడం అవసరం లేదని ఈమె అభిప్రాయ పడింది. ఈ మధ్యకాలం యోగాలో భాగంగా చేస్తున్న సుదర్శన క్రియలో ఇవే శబ్దాలను ఉచ్చరింప చేస్తున్నారు. దీనిని హంస (సోహం) జపమని, ' అజప' అని పిలుస్తారని తెలుస్తోంది.
లోకంలోని మాయకు లోబడి పోయేవారు మనశ్శుద్ధి లేక నీళ్లలో మునిగి అర్ధ నేత్రాలతో చేతులు జోడించి , యాంత్రికంగా మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారని అలాంటి వారికి ముక్తి రాదని చెప్తుంది. అంటే బాహ్య ఆచారాల కన్నా మనశ్శుద్ధి ముఖ్యమని తెలియజేస్తుంది.
శరీరంలో నదులు ప్రవహిస్తుంటే తీర్థయాత్రల పేరుతో సమయం వృధా చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తూ...
"ఇట్టి శరీరమందు నదు లెప్పుడుఁ దీయక పాఱఁగా, మఱిన్
పుట్టిన భూమిలోపలఁ ద్రి మూర్తులు నుండఁగఁ గాననేరకన్,
పట్టుగఁ దీర్ఘయాత్రలకుఁ బామరులెల్లను బోయి ; యూరకే
గొట్టుపడంగనేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 102)
అంటూ ఈ శరీరంలో నదులు ప్రవహించడమే కాక, త్రిమూర్తులు కూడా కొలువయ్యారని, అది తెలియని పామరులు తీర్థయాత్రల పేరుతో శ్రమ పడుతూ ఉంటారంటుంది. ఇక్కడ వేమన దైవ సిద్ధాంతం కూడా కనిపిస్తుంది
'బ్రహ్మమనగ వేరె పరదేశమనలేదు/బ్రహ్మమనగ తానె బట్టబయలు/ తన్నుతానెరిగిన తానెపొ బ్రహ్మంబు', 'హృదయమందుండిన ఈసుని తెలియక/ శిలల కెల్ల మ్రొక్కు జీవులారా/ శిలలనేమి యుండు జీవులందే గాక / విశ్వదాభిరామ వినురవేమ' అన్న అంశాలు తరిగొండ వెంగమాంబలో దర్శనమిస్తాయి.
5. నైతికబోధ - విభిన్న అంశాలు
మనిషిని విపరీత ప్రవర్తనల నుండి దూరంగా పెట్టడానికి పుట్టిన సాహిత్యం ఆధ్యాత్మిక సాహిత్యం. ఇది అనేక రూపాల్లో నీతిని బోధిస్తుంది. కావ్య రూపంలో ఉన్నా, శతక రూపంలో ఉన్నా సామాజిక నీతి, వ్యక్తిగత ప్రవర్తన, కుటుంబ విలువలు మొదలైన అంశాలు ఆధ్యాత్మిక రచనల్లో కనిపిస్తాయి. తరిగొండ నృసింహ శతకంలోనూ అనేక నైతిక అంశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని-
1. తల్లిని, దైవాన్ని గౌరవించని వారిని గురించి చెబుతూ...
"తల్లికిఁ గాని బిడ్డలును, దైవము నెంచని మర్త్యకోటులున్,
చుల్లర బుద్ధితోడఁ బర సుందరిఁ గోరుచునుండు వారలున్
తల్లడమంది నాఁటికినిఁ దప్పక యా యమధర్మరాజుచేఁ
గొల్లకుఁ బోవువారు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 97) అంటుంది.
2. తల్లిని పట్టించుకోని పిల్లలు, దైవాన్ని ఎంచని మనుషులు, చిల్లర బుద్ధితో స్త్రీల వెంటపడేవారు యమధర్మరాజుచే తప్పక శిక్షించబడతారని వివరిస్తుంది. పాప భయంతోనైనా తల్లిని దైవాన్ని గౌరవిస్తారని భావించింది.
3. అగ్నిసాక్షిగా పెళ్లాడిన పతివ్రతను నిరంతరం తిడుతూ, కొడుతూ, ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా చూస్తూ, ఆమెను పక్కనపెట్టి, పర స్త్రీలను కూడి ఉండడం పాపహేతువుగా పేర్కొంటుంది.(95)
యవ్వనమందు నాథులకు నింతులు మేలుపచార మేర్పడన్
నివ్వటిలంగఁ జేతురు, త్రి ణేత్రుని వీడని భక్తి నుందు ; రా
యవ్వనమంతఁ బోవ, మఱి యింతులు నాథులలెక్కసేయకన్
క్రొవ్విన మాట లండ్రు; తరి గొండ నృసింహ! దయాపయోనిధీ! (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 65)
అంటూ మానవ మనస్తత్వాన్ని వివరిస్తుంది.
4. లోభి అయిన వాడు ఈ శరీరమే స్థిరమైనదని నమ్మి, తన కోసమే ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. ఎవరైనా ' భట్లు' వచ్చి నువ్వు భోజరాజు అంతటివాడు అని పొగిడే పరిస్థితి వస్తే, వారికి దానం చేయాల్సి వస్తుందని, మహాప్రళయం వచ్చినట్టుగా సందు గొందుల దూరి పారిపోయే పిసినిగొట్టును చూపిస్తుంది. అలాంటి వారి మనస్తత్వాన్ని విడమరచి చూపిస్తుంది. (92)
5. పెట్టినవారికి తిరిగి పెడతారని, దురాశపరులు వాచాలత్వంతో ఇతరుల సంపదలను చూసి సహించక నోరు పారేసుకుంటూ ఉంటారని అలాంటి వారి నోరు ఒక మురికి గుంట లాంటిదని ఎద్దేవా చేస్తుంది.(90).
6. అన్నం తినడం మానేసి ఆకులు వేయడం కూడా ఒక బూటకం అంటుంది, జీవనదికి కట్టలు వేసి ఎక్కువ కాలం ఆపలేనట్టే బూటక నటనలు పదేపదే జన్మలకు కారణభూతం అవుతుంది అంటుంది వెంగమాంబ.(88)
7. తమలోని కోపాన్ని అదుపు చేయలేని వారు దృష్టిని దేనిపై స్థిరంగా కేంద్రీకరించలేరని, కంటిపాపల మధ్యలో పరబ్రహ్మను చూడలేరని నిరంతరం చింతించడం మానలేరని చెప్తుంది. (82)
8. ఎంత కష్టపడి ఇంత సంపాదించినా, ఎన్ని సాధించినా వృద్ధులైన తల్లిదండ్రులు పిల్లలచే సరైన గౌరవం పొందలేకపోతున్నారనే కఠిన వాస్తవాన్ని చెప్తూ...
"ఎక్కడి రొక్కయోజనము?లెక్కడి భాగ్యము? లెక్క డింతులున్?
ఎక్కడి పాఁడి పంటలును?ఎక్కడి బాంధవు? లెల్ల నాఁటికిన్
తక్కక వృద్ధరూపమును దాల్చినఁ, బుత్రకు లింటి వాకిటన్
కుక్కలఁ దోలుమండ్రు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 63)
శరీరాన్ని వృద్ధాప్యం ఆవహించినప్పుడు ఎదురయ్యే కష్టాల కన్నా, పుత్రులు తండ్రిని ఇంటి బయటపెట్టి, కుక్కలను తోల మంటారని వాపోతుంది. అప్పుడు కేవలం ఇంటి బయట పెట్టే వారేమో గాని ఇప్పుడు అన్నీ లాగేసుకొని తల్లిదండ్రులను వీధిలో పడేస్తున్నారు.
9. శరీరానికి బూడిద పూసుకోవడం, అనేక బూటకాలు చేయడం, శరీరాన్ని కష్టాలు పాలు చేయడం, నీడన ఉండడానికి ఇష్టపడకుండా తపస్సు పేరుతో తీవ్రమైన ఎండలో ఉండడం మొదలైన క్రియలు ముక్తిని ప్రసాదించ వంటుంది. బాహ్య వేషాలన్నీ మాని, విజ్ఞానాన్ని పొందినవాడు దైవానికి చేరువ కాగలరని తెలియజేస్తుంది.
10. మనిషి ఎన్ని నిష్టలను పాటించినా, ఎంత పెద్ద అరణ్యంలో ఉన్నా కుల మదం, రూప మదం, ధన మదం, యవ్వన మదం, విద్యా మదం, అధికార మదం, తపో మదం అనే అష్ట మదాలను అణచకుండా ఉత్కృష్టమైన భవాబ్దిని దాటలేడని చెప్తుంది.
6. వ్యామోహాన్ని త్యజించడం
శరీరంపై, సంసారంపై వ్యామోహాన్ని త్యజించకుంటే ముక్తిని సాధించలేరని ఆధ్యాత్మిక సాహిత్యం చెబుతోంది. ఈ కోవలోనే వెంగమాంబ కూడా ప్రయాణించింది.
"సతులను జూచి చూచి మది సంతసమందుచునుందు రెప్పుడున్,
గతులు గనంగలేరు, నినుఁ గానఁగ లేరు వివేక హీనులై,
సుతు లిఁక మోక్షమిత్తురని చూచి, ధనంబు నపేక్ష సేయుచున్
కుతుకము నొందినారు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 59)
పదే పదే భార్యను చూస్తూ సంతోషపడుతూ, వారి కోసమే సంపదను కూడేస్తూ వివేక హీనులై ముందు రాబోయే గతిని చూడలేక పోతారని చెప్తుంది. ఈ వ్యామోహం పనికిరాదంటుంది.
ఈ శరీరం మీద, 'తనకైన జనంబుల మీద' ఆశ వదులుకోకుంటే మాయలో పడి ముక్తిని సాధించలేముంటుంది. మోహ పాశాలను కోకపోతే ముక్తి లభించదని తెగేసి చెబుతుంది.
ఇలాంటి ఒక సందర్భంలో అన్నమయ్య ఇలా అంటాడు
"కొండ వంటిది యాస గోడవంటిది తగులు
బెండు వంటిది లోని పెద్ద తనము
పుండు వంటిది మేను పోలించినను మేడి
పండు వంటిది సరసభావ మింతయును..." (ఆధ్యాత్మ సంకీర్తనలు- తాళ్లపాక అన్నమాచార్యులు (1వ సంపుటం, 122 వ కీర్తన - పుట 77).
వీటిలో తగులుకుంటే మోక్షం సాధ్యం కాదని చెప్తాడు.
ఆశకు, మనసుకు, శరీరానికి పోలికలు చెప్తూ...
"ఎవ్వరు లేరు జీవునికి, నెవ్వరు శత్రువు? లెవ్వరాప్తులున్?
ఎవ్వరు నిందసేయుదురు? ఎవ్వరు మెచ్చుదు రెన్ని భంగులన్?
ఎవ్వరియందు సంతతము నేర్పడ జీవుఁడు నిండియుండుఁ; దాఁ
గ్రొవ్వును, భేదమేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ! (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 94)
ఇక్కడ 'ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై... అన్న పోతన గుర్తుకొస్తాడు. అన్నిటికీ నీవే దిక్కు అని పోతన అంటే, ఈ ప్రపంచంలో ఉన్నవేవీ నాకు పనికొచ్చేవి కావు అంటుంది వెంగమాంబ. నువ్వు-నేను, శత్రువులు- మిత్రులు, నిందలు- ప్రశంసలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవని, ఈ తత్వం తెలిసిన జ్ఞానులకు భగవత్ స్వరూపమే సర్వస్వమని తెలియచేస్తుంది. ఇంకోమాట, జాషువా చెప్పిన 'నీవు నేను అనుతారతమ్య మిహpమందే గాని భూగర్భ రత్నావాసంబున లేదు' అనే వాక్యం కూడా గుర్తుకొస్తుంది.
7. ముక్తికి చేరువయ్యానని చెప్పడం
నృసింహశతకం రాయడం పూర్తికావచ్చే తరుణంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చినట్టుగా చెప్పుకుంటూ....
"నిన్ననె కంటి నీ మహిమ నీరజలోచన! దివ్యతేజ! నీ
సన్నిధి దగ్గరాయెను, విచారము మానెను, ముక్తి కల్గి నౌ!
పన్నుగ నవ్విధంబునను భావములోపల నీదు మూర్తిఁ గన్
గొన్నదె భాగ్యమయ్య! తరి గొండ నృసింహ! దయాపయోనిధీ! (తరిగొండ నృసింహ శతకము, పద్య సంఖ్య: 102) అంటుంది.
ఈ రచన ద్వారా ఆమె కోరిక తీరిందని ఆ కోరిక దైవ సన్నిదేనని, దీని ద్వారా మోక్షం అందుబాటులోకి వచ్చిందని చెప్పుకుంది కవయిత్రి.
పామర బుద్ధులను మనస్సు అనే తాడుతో బిగ గట్టి, ఉత్తముడైన గురువును చేరి, బ్రహ్మపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుని, మంచి చిత్తంతో ప్రయత్నిస్తే ముక్తికాంతను పొందవచ్చు ' (58)అంటున్న ఆమె మాటలు ఆమెకే వర్తిస్తాయి. ముక్తి కోరేవారు మంచి గురువు ద్వారా ఉపదేశం పొంది, స్థిరమైన మనసుతో భగవంతుని ఆరాధించమని ప్రబోధిస్తుంది.
8. ఉపసంహారం
- భక్తి -నీతి- వేదాంత త్రయంతో నిండిన తరిగొండ నృసింహ శతకం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకునే మార్గాన్ని వింగడించింది.
- సాంఘిక దురాచారాలను ఎండగట్టింది.
- ఆమె రాసిన కవిత్వాన్ని "వికల్ప కవిత్వం"గా (అంటే కవిత్వం కాకపోయినా కవిత్వంలా అనిపించే రచన అని అభిప్రాయం) ఎద్దేవా చేసినప్పటికీ, ఆ కువిమర్శ పసలేని విమర్శ అనడానికి ఈ తరిగొండ నృసింహ శతకమే సాక్ష్యం చెప్పిందని, ఈ శతక పరిష్కర్త ఆచార్య కె.జె.కృష్ణమూర్తి చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
- ఈ శతకంలో సుమారు పది పద్యాలు (66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 76) అసంపూర్ణంగా ఉన్నాయి. బహుశా ఆ పద్యాలు రాయబడిన పత్రాలు చెదకు ఆహారమై పోయి ఉంటాయనుకుంటాను. ఈ అసంపూర్ణ పద్యాలను భావం చెడకుండా పండితుడిచే పూరింపజేస్తే ఈ శతకానికి మరింత నిండుతనం వస్తుంది.
9. ఉపయుక్తగ్రంథసూచి
- అన్నమాచార్యులు, తాళ్లపాక. (ద్వి.ము.1988) ఆధ్యాత్మ సంకీర్తనలు, 1వ సంపుటం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
- ఈశ్వర్ రెడ్డి, ఎన్. (2012). సాహిత్యం సామాజిక అవసరం. ప్రసారంగ, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం.
- గోపన్న, కంచర్ల. దాశరథీ శతకం. e-version. వైదికవిజ్ఞానం. https://vignanam.org/telugu/dasarathi-satakam.html
- పోతన, బమ్మెర. (తొమ్మిదో ముద్రణ. 2004). శ్రీ మహాభాగవతము. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- వెంగమాంబ, తరిగొండ (2007). తరిగొండ నృసింహ శతకము - తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
- వేమన పద్యములు; తాత్పర్య సహితం (1955): వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

